Sunday, 19 June 2022

 

*🧘‍♂️శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘‍♀️*

 *27వ శ్లోకం:-*

*మదన పరిహర స్థితిం మదీయే మనసి ముకుందపదారవిందధామ్ని! 

హరనయన కృశానునా కృశోసి స్మరసి న చక్రపరాక్రమం మురారే:!!*

*భావం:-*

*ఓ మదనా! నా మనసులో ముకుంద చరణారవిందములు పాదుకొనిఉన్నవి. నీవు అచటకు చేరుకొన ప్రయత్నింపకుము. పురారి నేత్రాగ్ని చేతనే కృశించితివి. ఇంకా మురారి చక్ర పరాక్రమము గూర్చి తెలుసుకొని మసలుకొనుము.*

🕉🌞🌎🌙🌟🚩

*నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడటమే నాయకత్వ లక్షణం. కానీ మనం మాత్రం అవసరమైన త్యాగం చేయకుండానే నాయకులమవ్వాలని అనుకుంటాం. దాని ఫలితం శూన్యం - చివరికి ఎవరూ మనల్ని లక్ష్యపెట్టరు.*

*ప్రకృతి మీకు పాదాక్రాంతమవ్వాలి. మీరు దాన్ని మట్టికరిపించి అతీతులవ్వాలి. ముక్తులై స్వేచ్ఛను సాధించాలి.*

*నా చైతన్య విమానంలో పైన, క్రింద, కుడి, ఎడమ, లోపల , బయట అంతటా విహరించి , నా అంతరిక్ష గృహంలో, మూలమూలనా ఎల్లప్పుడూ, నా పరమపిత పవిత్ర సన్నిధిలోనే ఉన్నానని కనుగొన్నాను.*


*శ్లో𝕝𝕝 భిత్వా పాషాణ పిఠరం*  *ఛిత్వా ప్రాభఞ్జనీ యథా।*

*పీత్వా పాతాళ పానీయం* *కుటజశ్చుమ్బతే నభః॥*

*తా𝕝𝕝 కొండమల్లె మొక్కతన ఎదుగుదలలో అడ్డుపడే బండరాళ్లను సైతం లెక్కచేయక పెనుగాలులను తట్టుకొని పాతాళముయందున్న నీటి అవశేషాలను తన వ్రేళ్లతో గ్రహించి ఆకాశాన్ని తాకాలనే ధ్యేయంతో మొలకెత్తుతుంది. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా ఎదురొడ్డి ఉన్నతస్థానం పొందాలనుకునే వారికి ఇది ఒక స్ఫూర్తినిచ్చేది.*

***

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 582 / Sri Siva Maha Purana - 582 🌹* 

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 02 🌴*

*🌻. కుమారస్వామి జననము  - 2 🌻*

శివుని రాక ఆలస్యమగుటచే అచటకు వచ్చిన పార్వతి దేవశ్రేష్టులనందరినీ చూచి, ఆ వృత్తాంతము నంతనూ తెలుసుకొని మహాక్రోధమును పొంది (12), అపుడు విష్ణువు మొదలగు దేవతలందరినీ ఉద్దేశించి ఇట్లనెను (13).

దేవ్యువాచ|

రేరే సురగణాస్సర్వే యూయం దుష్టా విశేషతః | 

స్వార్థసంసాధకా నిత్యం తదర్థం పరదుఃఖదాః  14

స్వార్థహేతోర్మహేశానమారాధ్య పరమం ప్రభుమ్‌ |

 నష్టం చక్రుర్మద్విహారం వంధ్యాeôభవమహం సురాః  15

మాం విరోధ్య సుఖం నైవ కేషాంచిదపి నిర్జరాః | 

తస్మాద్దుఃఖం భ##వేద్వో హి దుష్టానాం త్రిదివౌకసామ్‌ || 16

దేవి ఇట్లు పలికెను--

ఓరీ! దేవతా గణములారా! మీరందరు పరమ దుర్మార్గులు. మీరు నిత్యము స్వార్థసాధనాపరులు. స్వార్థము కొరకై ఇతరులకు దుఃఖమును కలిగించెదరు (14). మీ స్వార్థము కొరకై పరమప్రభుడగు మహేశ్వరుని ఆరాధించి నా విహారమును భంగపరిచిరి. ఓ దేవతలారా! నేను వంధ్యను అయితిని (15). ఓ దేవతలారా! నాతో విరోధించిన వారికి ఎవరికైననూ సుఖము లభించదు. కావున దుష్టులగు దేవతలకు (మీకు) దుఃఖము కలుగు గాక! (16)

బ్రహ్మ ఇట్లు పలికెను-

శివుని పత్నియగు ఆ పార్వతి ఇట్లు పలికి కోపముతో మండిపడుతూ విష్ణువు మొదలగు దేవతలనందరినీ శపించెను (17).

పార్వతి ఇట్లు పలికెను--

ఈ నాటి నుండియూ దేవతల భార్యలు వంధ్యలు అగుదురు గాక! నన్ను విరోధించిన దేవతలందరు దుఃఖితులగుదురు గాక! (18)

బ్రహ్మ ఇట్లు పలికెను--

సకలేశ్వరి యగు పార్వతి విష్ణువు మొదలగు దేవలనందరినీ ఇట్లు శపించి శివతేజస్సును గ్రహించిన అగ్నితో కోపముగా నిట్లనెను (19).

పార్వతి ఇట్లు పలికెను--

ఓయీ అగ్నీ! నీవు నిత్యదుఃఖితమగు హృదయము గలవాడవై సర్వభక్షకుడవు కమ్ము. నీవు శివతత్త్వము నెరుంగని మూర్ఖుడవు గనుక దేవకార్యమును చేసినావు (20). ఓరీ మోసగాడా! నీవు మహా దుష్టుడవు. దుష్టుల దుష్ట బోధనలను విని శివవీర్యమును గ్రహించితివి. నీవు ఉచితమగు కార్యమును చేయలేదు (21).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

*మూల మంత్రము :*

*🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।*

*రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*

*🌻 380. 'బిందుమండలవాసినీ' - 3🌻* 

*జీవితము యజ్ఞార్థము కానిచో తపస్సు వలను పడదు. అంతరాంత రాళమున జీవప్రజ్ఞ చేరవలె నన్నచో ఇతరములు గోచరింపక సమస్తము శ్రీమాత దివ్యరూపముగనే దర్శించుట ప్రధానము. అపుడు శ్రీమాత భావన నిత్యమగును. అనన్యమగును. బిందు మండల మనగా తెల్లని కాంతితో కూడిన మండలము. ఆ కాంతికి కేంద్రమే బిందువు. ఈ బిందువు గాని, దాని కాంతి గాని, పదార్థమును ఆవరించి యుండును గాని ఆశ్రయించి యుండదు. బిందువు రూపము పూర్ణమగుట వలన దీనిని పూర్ణ మనిరి. తేజోవంత మగుట వలన చీకటికి ఆవలి వెలుగు అనిరి. దీనిని స్మరించుటకే భ్రూమధ్యమున స్త్రీలు, పురుషులు తిలక ధారణము గాని భస్మ ధారణము గాని చేయుట.*

*మాధవు డుండు స్థానము అయి వుండుటచే ఈ భ్రూమధ్య స్థానమును బిందు మాధవు డని, బిందు మాధవి అని పలుకుదురు. భ్రూమధ్యము నుండి బ్రహ్మనాళమున చరించుట బ్రహ్మానంద దాయకము. హృదయ మందు విశాలమై పరమ పవిత్రమైన ప్రజ్ఞగ ప్రవహించు చుండును గనుక బిందు హ్రదము (సరస్సు) అని కూడ పలుకుదురు. బిందు స్థానమున చేరిన వారిని బిందు శర్మ అని పిలుతురు. నాళమున ఈ బిందువు అన్ని లోకముల యందు పయనించు త్రోవను బిందురేఖ అనిరి. బిందు జ్ఞానమే సర్వజ్ఞానము, సర్వానందమయము.*

*సశేషం...*

 *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*714వ నామ మంత్రము* 20.6.2022

*ఓం కులోత్తీర్ణాయై నమః*

కులము (ఇంద్రియాల గుంపు), మనస్సులచే ఎరుగబడనిదైన (అతీంద్రియ స్వరూపిణియైన) జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కులోత్తీర్ణా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం కులోత్తీర్ణాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకుడు   ఆ తల్లి కరుణచే తన ఇంద్రియాలను  సన్మార్గంలోనికి నడిపించుకొని నిరంతరం భగవద్ధ్యానంలో జన్మతరింపజేసికొనును.

జగన్మాత ఇంద్రిసముదాయమునకు గోచరించనిది. అనగా *సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణభూషితా* అని లలితాసహస్రనామస్తోత్రంలో  చెప్పినట్లు  ఆతల్లి ధరించిన వస్త్రములు, సుమమాలలు మొదలైనవి వన్నిటితోనూ, దోషరహితమైన అవయవ సొంపుతో ఉండి సర్వాభరణ భూషితయైన ఆ తల్లిని ఈ చర్మ చక్షువులతో చూడలేము, *నిజసల్లాపమాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ* యను నామ మంత్రములో చెప్పినట్లు ఈ శరీరంలో ఉన్న  చెవులతో  సరస్వతీ దేవియొక్క కచ్ఛపీ వీణానాదమునకన్నా మధురమైన ఆ తల్లి పలుకులను వినలేము, *చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచా*  యను నామమంత్రములో చెప్పినట్లు సంపంగి, అశోక, పున్నాగ పుష్పసౌగంధములలరిన ఆతల్లి శిరోజముల సౌగంధము గాలిలో తేలియాడుతూ మన శరీరంలోని ఘ్రాణేంద్రియమైన నాసికా రంధ్రములను తాకదు, ఒకవేళ తాకినా గ్రహించలేము, అలాగే *సుధాసారాభివర్షిణీ* అను నామమంత్రంలో చెప్ఫినట్లు సహస్రారంలోని చంద్రమండలమందు స్రవించు అమృతధారలు, నానా రకాల భౌతికప్రపంచ పదార్థముల షడ్రుచుల మేళవింపుల రుచిమరిగిన జిహ్వను చేరనేలేవు, ఆ అమృతధారలలోని మధురిమలు ఈ నాలుకతో రుచి కూడాచూడలేము. ఇంకనూ *పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా* అను నామ మంత్రములో చెప్పినట్లు పద్మములను కూడా తిరస్కరించే మృదుత్వ, సౌకుమార్యాది లక్షణములతో భాసిల్లు పదద్వయంపై ఈ శిరస్సును తాకించినను ఆ పాదస్పర్శలోని దివ్యత్వాన్ని తెలియలేము.  ఎందుకంటే నేను అనే భ్రాంతిని విడచి, పరమాత్మలోనైక్యమునంది జీవన్ముక్తుడైతేనే తెలియగలముగాని లేకుంటే కులము (భౌతిక శరీరమందలి ఇంద్రియాల గుంపు) వలన గాని, ఈ శరీరముపై మమకార పూరితమైన మనసుతోగాని ఆ తల్లిని తెలియలేనంత అతీంద్రియ స్వరూపిణి అయినది జగన్మాత. 

కులము అంటే అజ్ఞానము. అజ్ఞానానికి గురువురూపంలో జ్ఞానోపదేశంచేసి, సాధకుణ్ణి కడతేర్చేది పరమేశ్వరి. అందుచే *కులోత్తీర్ణా* యను నామముతో ఆ తల్లి స్తుతింపబడుచున్నది.

ఆ  తల్లికి నమస్కరించునపుడు *ఓం కులోత్తీర్ణాయై నమః* అని అనవలెను.

: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*178వ నామ మంత్రము* 20.6.2022

*ఓం నిర్భేదాయై నమః*

స్వజాతీయము, విజాతీయము, స్వగతము అను మూడు భేదములు లేక విలసిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్భేదా* యను మూడక్షరముల నామ మంత్రమును  *ఓం నిర్భేదాయై నమః* అని ఉచ్చరించుచు, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ శ్రీమాత పాదసన్నిధిలో ధ్యాన నిమగ్నుడైన భక్తులకు భేదరహితమైన జీవనమును కొనసాగించుచు, భౌతిక సుఖసంతోషములు, ఆత్మానందమమును అనుభవించి తరించును.

సకల జగత్తునందు, జీవులన్నిటిలోను విలసిల్లుతూ, మానవులు, పశుపక్ష్యాదులు, అడవిజంతువులు, వృక్షసంతతి యందును ఏవిధమైన భేదదృష్టి ప్రసరింపజేయక, జీవకోటి యంతయు తనదిగా భావించి, ఏ జీవసమూహమనకు ఏమికావలెనో, ఎలాకావలెనో సమకూర్చుచున్నది.  కాబట్టి ఆ తల్లి *నిర్భేదా* యని అనబడుచున్నది. సహస్రనామములలో *శ్రీమాతా* యని అన్నాము. అనగా జగత్తుకంతటికీ మాతృమూర్తి. తల్లి తన బిడ్డలను భేద భావముతో చూడక  అన్నపానీయములు, విద్యా బుద్ధులు వయసుననుసరించి సమకూర్చును. చంటిబిడ్డకు పాలు పడితే, ఎడ బిడ్డకు గోరుముద్దలు, ఎదిగిన బిడ్డకు అన్నము పెడుతుంది. భేదభావము ఉండకూడదని బిడ్డలందరికీ పాలు మాత్రమే పట్టదు. లేదా అందరికీ ఆవకాయతో అన్నమే పెట్టదు. అలాగే జీవులకు ఆహారపు అలవాట్లు, జీవనము కొనసాగించు సరళిని బట్టి కావలసినవి సమకూర్చుతుంది జగన్మాత. ఒకరిపై అతిప్రేమ, మరొకరిపై ఏహ్యభావము చూపదు గనుకనే *నిర్భేదా* యను నామ మంత్రము సార్థకమైనది. జీవుల కర్మవాసనలు కూడా పరిగణిస్తూ ప్రాప్తి ఎంత ఉంటుందో అంతవరకూ  జీవుల అవసరాలను సమకూర్చుతుంది. 

సాధారణంగా భేదము అనునది జాతిపరమైనది కావచ్చు, లేదా సజాతిలోనే వర్గభేదం కావచ్చు, తన శరీరంలో పాదము, శిరస్సు అను అవయవ భేదము కావచ్చు ... ఈ విధమైన సజాతి, విజాతి, స్వగతము అను భేదత్రయము లేనిది. 

ఆదిశంకరాచార్యులవారు. పరమాత్మకూ, జీవాత్మకూ భేదం లేదు. ఈ రెండూ ఒకటే. పరమాత్మ నిర్గుణం అని బోధిస్తుంది. అద్వైతం 

*ఏకమేవా ద్వితీయం బ్రహ్మ*,

పరమేశ్వరుడు ఒక్కడే. రెండవవాడు లేడు.

 *ఏకం సద్విప్రా బహుధా వదంతి*

సత్యం ఒక్కటే' దానిని జ్ఞానులు బహువిధాలుగా చెపుతారు.

*సర్వం ఖల్విదం బ్రహ్మ* 

ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే. వేరేమీ లేదు.

*జీవో బ్రహ్మైవ నాపరః*

జీవుడు బ్రహ్మము తప్ప అన్యము కాదు

 *తత్త్వమసి* 

చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, అది నీవే.  

వంటి వాక్యాలన్నీ అద్వైతసిద్ధిని చెపుతాయి. జీవాత్మ పరమాత్మరూపమే. అయితే యాసంబంధముచేత జీవాత్మ ఈ సత్యాన్ని గ్రహించడంలేదు. జ్ఞానంద్వారా ఈ సత్యాన్ని గ్రహించగల్గుతుంది. ఈ జ్ఞానంపొందిన జీవాత్మ మోక్షం పొందగలుగుతుంది. అంటే పరమాత్మయై ఊరుకుంటుంది. జగన్మాత పరబ్రహ్మ స్వరూపిణి.  గనుక *నిర్భేదా* యని అన్నాము.

కూర్మపురాణంలో ఇలా చెప్పబడినది:

*శ్లో. త్వం హి సా పరమా శక్తిః అనంతా పరమేష్ఠినీ సర్వభేదవినిర్ముక్తా సర్వభేదవినాశినీ॥* (సౌభాగ్య భాస్కరం, 387వ పుట)

నీవే మహాశక్తివి. అనంతపు పరమేష్ఠిస్వరూపురాలవు. సకల భేదములు లేనిదానవు. సకల భేదములు నశింపజేయుదానవు.

శివశక్తులు ఇరువురు ఒకరు లేక మరొకరు లేరు. ఇద్దరూ ఒకటే. పరమాత్మకు లింగభేదం లేదు. కనుక జగన్మాత *నిర్భేదా* అని నామ మంత్రముతో స్తుతింప బడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిర్భేదాయై నమః* అని అనవలెను.

. కపిల గీత - 26 / Kapila Gita - 26🌹*

*🌴. 12. శ్రవణం ద్వారా దైవంతో అనుబంధం - 2 🌴*

*26. భక్త్యా పుమాన్జాతవిరాగ ఐన్ద్రియాద్దృష్ట శ్రుతాన్మద్రచ నానుచిన్తయా*

*చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే ఋజుభిర్యోగమార్గైః*

*నా యందు కలిగిన భక్తితో జీవుడు వైరాగ్యాన్ని పొందుతాడు. ఇంద్రియములకు సంబంధించిన విషయాల యందు, చూచినా విన్నా ఆసక్తి కలుగదు. వాడి మనసు ఎప్పుడూ నా కథలను గూర్చి చింతిస్తూ ఉంటాడు. నిరంతరం నా కథలనే చెబుతూ వింటూ ఉండే వాడు సాంసారిక భోగముల యందు విరక్తి కలిగి ఉంటాడు. అతను యోగములో ఉండి మనస్సును స్వాధీనములో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది జరిగితే వారికి చక్కటి దారి దొరుకుతుంది. దానితో నన్ను సాక్షాత్కరింప చేసుకోవడానికీ, మనసుని నిగ్రహించు కోవడానికి ప్రయత్నిస్తాడు.*

*సశేషం..*


No comments:

Post a Comment