Sunday 12 June 2022


06. :*ఓం లోభ నాశిన్యై నమః*

స్వపరభేదములు, దురాశ, పిసినారితనము మొదలైన అసురభావములను రేకెత్తించు లోభగుణము తన భక్తులకు లేకుండా నశింపజేసి, త్యాగ గుణవర్తనులుగా జేయు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *లోభనాశినీ* యను ఐదక్షరముల నామ మంత్రమును *ఓం లోభనాశిన్యై నమః*  అని ఉచ్చరించుచు, అత్యంత భక్తిశ్రద్ధలతో జగన్మాతను అర్చించు భక్తులకు లోభగుణము లేకుండా, త్యాగగుణసంపన్నతను ప్రసాదించి తరింపజేయును.

అరిషడ్వర్గములలో ఒకటైన లోభగుణము మనిషిలోని మంచిగుణములను అన్నింటినీ నాశనంచేస్తుంది. ఆశారహితుడు, సంశయము లేనివాడు, సందేహములను పోగొట్టువాడు అని తంత్ర తంత్రరాజములో గురువుయొక్క లక్షణము చెప్పబడినది.

ఇంతకు ముందు 171వ నామ మంత్రములో  జగన్మాతను *నిర్లోభా* అని అన్నాము. అనగా లోభత్వం అనేది అరిషడ్వర్గములో ఒకటి. ఇది కేవలం మనసుకు సంబంధించినది. ఆత్మకు సంబంధించదు. జగన్మాత పరమాత్మ స్వరూపిణి. ఆ తల్లి తన భక్తులకు కోరిన కోరికలకు అనుగుణంగా, అత్యంత ఉదారతతో,  వారి ధర్మబద్ధమైన  కోరికలు తీరుస్తుంది. గనుకనే ఆ తల్లి *నిర్లోభా* యను నామ మంత్రముతో ఆరాధింప బడుచున్నది. తను ఏవిధంగా  *నిర్లోభా* యని అనబడినదో, తన భక్తులు కూడా లోభత్వం లేకుండా, వారు త్యాగబుద్ధితో తమకున్న కలిమిని తాము అనుభవిస్తూ, తమ వారిని సంతసింపజేస్తూ, త్యాగనిరతితో ఒరులకు కూడా సహాయపడేలాజేసి సద్గతులను అనుగ్రహిస్తుంది.

పుట్టినపుడు మనం తెచ్చేది ఏదీ ఉండదు. అలాగే గిట్టునపుడు తీసుకుపోయేది అసలే ఉండదు.  ఉన్నంత కాలం సంపాదించు కోవడం, తినడం, ఒరులకు ఇంత ఇవ్వడం. పూర్వ జన్మ సుకృతం వలన ఇబ్బడి ముబ్బడిగా సంపాదించే అవకాశం రావచ్చు. కాని ఆ సంపాదన ధర్మబద్ధమై ఉండాలి. అలాంటి సంపాదనలో తన భవిష్యత్తుకి, తనవారికి జాగ్రత్తచేసుకుంటూ ధర్మకార్యములకు కూడా వినియోగించడం త్యాగ లక్షణం. తనకున్నది తాను అనుభవించక, కనీసం సరైన తిండైనా తినక, మంచి బట్టకూడా కట్టక, తనవారిని కూడా అలాగే కట్టడి చేస్తూ,  ఒరులకు కూడా పెట్టక, భగవంతుని సేవకు కూడా అసలే వినియోగించక ఒక మహా లోభిగా ప్రవర్తించే వాడు ఆ పరమాత్మచే క్షమింపబడడు. పైగా పదిమందిలో అటువంటి లోభికి గౌరవంకూడా ఉండదు. ఇటువంటి లోభత్వాన్ని తన భక్తులకు నశింపజేసి, ధర్మగుణవర్తనులై నిలుపుతుంది. గనుకనే జగన్మాత *లోభనాశినీ* యని స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం లోభనాశిన్యై నమః* అని అనవలెను.

***

07.*ఓం గుహ్యరూపిణ్యై నమః*

పరమ రహస్యమైన అనగా స్థూలదృష్టికి కాకుండా జ్ఞాననేత్రాలకు మాత్రమే గోచరమయ్యే సూక్ష్మరూపిణి అయిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *గుహ్యరూపిణీ*  యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం గుహ్యరూపిణ్యై నమః* యని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు భౌతికపరమైన సుఖసంతోషములతోబాటు, ఆధ్యాత్మిక జ్ఞానసంపదలు కూడా సంప్రాప్తించి తరించును.

సూతసంహితలో ఈ విధంగా చెప్పబడినది:

*గురుమూర్తిధరాం గుహ్యాం గుహ్యవిజ్ఞాన రూపిణీం|*

*గుహ్యభక్తజనప్రీతాం గుహాయాం నిహితం నమః॥*

"గురురూపమును ధరించినది, గుహ్యము, గుహ్యజ్ఞానమే రూపముగా గలది. గుహ్యమందు భక్తిగల జనులను ప్రేమించునది గుహయందున్నది. అనగా హృదయమందు దహరాకాశంలో ఉన్నదని భావము. అటువంటి దేవిని ధ్యానించుచున్నాను" అని సూతసంహితలో చెప్పిన శ్లోకమునకు భావము. జగద్బ్రహ్మలనగా జీవేశ్వరులు. పారమార్థిక దశలో అద్వైతమే సత్యము. అంటే అద్వైతము పారమార్థిక సత్యము. జగన్మాత ఇట్టి పారమార్థిక సత్యమును బోధించుచున్నది.

*సర్వోపనిషదాం దేవి గుహ్యోపనిష దుద్యసే* (సౌభాగ్యభాస్కరం, 822వ పుట)

అనగా అన్ని ఉపనిషత్తులందు శ్రీమాత గుహ్యోపనిషత్తు. ఆ తల్లి హృదయమందుండే దహరాకాశరూపంలో ఉంటుంది గనుక *గుహ్యరూపిణీ* యని స్తుతింపదగినది.

జగన్మాతను దర్శించాలంటే జ్ఞానదృష్టి కావలెను. స్థూలదృష్టితో చూడలేము. జ్ఞానసంబంధమైన వేదవేదాంగములలోను, శాస్త్రాలలోను, బ్రహ్మసూత్రములందు ఆ పరమేశ్వరి సూక్ష్మముగా ప్రతిపాదింపబడినది గనుక ఆ తల్లిని *గుహ్యరూపిణీ* యని స్తుతిస్తున్నాము.

అమ్మను ఏరూపంలోవెదకినా కనుపిస్తుంది. శక్తి పీఠములందు, నవదుర్గలందు, ఊరూరా వెలసిన గ్రామదేవతా స్వరూపములందు ... బెజవాడ కనక దుర్గ, అనకాపల్లి నూకాలమ్మ, పెద్దాపురం మరిడమ్మ, విజయనగరం పైడితల్లి, శంబర పోలమాంబ, మజ్జి గౌరమ్మ, ఒక ఊర్లో పోలేరమ్మా, ఇంకో ఉర్లో అసిరమ్మ, మరోచోట సుంకులాంబ, జొన్నవాడ కామాక్షి, మధుర మీనాక్షి ....ఇలా చెప్పుకుంటూ పోతే ఆ తల్లి రూపములు చతుష్షష్ఠికోటి యోగినులైనా కావచ్చు లేదా శోధకునికి శోధకుని రూపంలో మనోనేత్రములందు కూడా గోచరించునది కావచ్చు. 

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం గుహ్యరూపిణ్యై నమః* అని అనవలెను.



No comments:

Post a Comment