Friday, 17 June 2022


(తరువాత భాగంలో -  వాస్తు - శకునాలు)

.....

 శ్లోకం 08:-


చేతః ఖల్వస్య బన్దాయ ముక్తయే చాత్మనో మతమ్ |

గుణేషు సక్తం బస్ధాయ రతం వా పుంసి ముక్తయే || 8

టీకా:-

 చేతః = మనస్సు; ఖలు = నిజానికి; అస్య = ఒకనియొక్క; బంధాయ = బంధమునకు; ముక్తయే చ = ముక్తికిని; ఆత్మనః మతమ్ = నేను అంగీకరించుచున్నాను; గుణేషు సక్తం = గుణముల యొక్క సాంగత్యము; బంధాయ = బంధకారణము; రతం వా = రమించు; పుంసి = పురుషునిలో; ముక్తయే  = ముక్తికి కారణము.

భావం:-

నిజానికి జీవుని మనస్సే బంధమునకు, మోక్షమునకు కారణమని నేను అంగీకరిస్తున్నాను. ప్రకృతి గుణముల సాంగత్యములో ఉన్న మనస్సు బంధ కారణం. భగవంతుని యందే లగ్నమైయున్న మనస్సు మోక్షకారణం.

వివరణ:-

ఈ సత్యం మన శాస్త్రాలలో అనేక పర్యాయములు చెప్పబడింది. ఉపనిషత్తు ఈ విధంగా చెబుతున్నది. - "మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః” (అమృతబిందూపనిత్తు). భగవద్గీత (6.5)లో ఈ విధంగా చెప్పబడింది. - "ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః” “ఎవరికైనను మిత్రుడైన, శత్రువైన మనస్సే”.

మన బంధనం శారీరకమైనది కాదు మానసికమైనదే. విషయ వస్తువులలో ఆనందమున్నదనే అసత్యాభిప్రాయంతో మన మనస్సు మమకారాలను, కోరికలను, భ్రాంతులను కల్పించుకొన్నది. అలాంటప్పుడు మన దుఃఖాలకు ఎవర్ని దూషిస్తాం? మన వ్యాకులతలకు, సంఘర్షణలకు, దుఃఖాలకు మనమే బాధ్యులం. మనమెప్పుడు దేని గురించీ ఫిర్యాదు చేయకూడదు. ఎప్పుడూ, ఎక్కడా, దేనినీ లేక ఏ పరిస్థితులనూ నిందించకూడదు. మేఘాలకు కారణమైన గాలియే, మేఘాలను తొలగించుటకు కూడా కారణమై వెనుక నున్న ప్రకాశవంతమైన సూర్యుని ప్రకటింపచేస్తున్నట్లుగా, మన మనస్సే బంధమోక్షములకు కారణము. ఈ సత్యాన్ని మనం మన అనుభవంలో తెలుసుకోవచ్చును.


సత్త్వ, రజః, తమస్సు అనే ప్రకృతి గుణాలతో యీ ప్రపంచమంతా నిర్మితమైయున్నది. ఈ గుణాలు వ్యక్తిలో కర్మేంద్రియాల ద్వారా (శ.మ.బు) జ్ఞానేంద్రియాల ద్వారా (శబ్ద,స్పర్శ, రూప, రస, గంధాలు) వ్యక్తమవుతున్నాయి.


 భగవద్గీత ఇట్లు చెబుతున్నది - (3.28) - “గుణాగుణేషు వర్తంతే గుణాలు గుణాలలో వర్తిస్తున్నాయి”. వాటిలో సహజ సంబంధమున్నట్లుగా గుణాలు గుణాలలో వర్తిస్తున్నాయి. “నేను”, “నాది” అనే భావంతో విషయ వస్తువులను గుర్తించినప్పుడు వాటితో నేను తాదాత్మ్యము చెందుతున్నాను.


 తరువాత వాటి బాధ, అవమానము, నా దుఃఖం, అవమానం అవుతున్నది. ఈ గుణాల తోడి తాదాత్మ్యమును వదలి, భగవంతునిలో రమించ నారంభించినప్పుడు ద్వంద్వాతీతుడను అవుతాను. క్రిందిస్థాయిలోనే వున్నట్లయితే ప్రపంచంలో బంధించబడతాను. క్రిందికి ప్రవహించేనీరు తొక్కబడుతుంది. పైకి ఎగిసే అగ్ని పూజింపబడుతున్నది.


ఎవరైనా భగవంతునిలో ఎలా రమించగలరు? భగవానుడు జవాబిస్తున్నాడు.

.....


" ఘనశ్యామవపుర్దేవం , ఘనసప్తాచలప్రభమ్..

ఘనవేదనుతం , వందే , ఘనసంకటహారిణమ్ !!! "

"


🌴. 12. శ్రవణం ద్వారా దైవంతో అనుబంధం - 1 🌴


25. సతాం ప్రసఙ్గాన్మమ వీర్యసంవిదో భవన్తి హృత్కర్ణ రసాయనాః కథాః

తజ్జోషణాదాశ్వపవర్గవర్త్మని శ్రద్ధా రతిర్భక్తిరనుక్రమిష్యతి


భక్తులు చెప్పే నా కథలు మీ ప్రయత్నం చేయకుండానే మీ కర్ణ రంధ్రం నుండి లోపలకి వెళ్ళి అక్కడ ఉన్న దోషాన్ని పోగొడతాయి. ఇలా వారు చెప్పే కథలను వినడం వలన మోక్ష మార్గం తెలుసుకోవాలని శ్రద్ధ కలుగుతుంది. వారి యందు ప్రీతి కలుగుతుంది, నా యందు (పరమాత్మ యందు) భక్తి కలుగుతుంది. శ్రద్ధ కథల మీద, రతి చెప్పేవారి మీద, భక్తి పరమాత్మ మీద కలుగుతుంది.


సశేషం..


 . శ్రీ శివ మహా పురాణము - 581 / Sri Siva Maha Purana - 581 🌹 


🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 02 🌴

 కుమారస్వామి జననము  - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-


యోగమునందు, జ్ఞానమునందు విశారదుడగు మహాదేవుడు ఆ రోదనమును విని విహారమును ముగించగోరియూ, పార్వతి వలని భయముచే ముగించలేదు (1). భక్తవత్సలుడగు శివశంకరుడు రాక్షసునిచే పీడితులైన దేవతలను చూచుటకు గృహ ద్వారము వద్దకు వచ్చెను (2). అపుడునేను, విష్ణువు, దేవతలందరు భక్తవత్సలుడగు శివుని చూచి మిక్కిలి ఆనందమును పొందితిమి (3). ఓ మునీ! నేను, హరి, మరియు సమస్త దేవతలు మహానందముతో శంకరునకు సాష్టాంగ ప్రణామమాచరించి స్తుతించితిమి (4).


దేవతలిట్లు పలికిరి -- ఓ మహా ప్రభూ! దయచేసి తారకాది రాక్షసులను సంహరించుము. హే విభూ! దేవకార్యమును చేయుము. మహేశ్వరా! దేవతలను రక్షించుము (5). ఓ దేవ దేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! శంకరా! సర్వుల అంతర్యామిని అగు నీకు సర్వము విదితమే (6).శివభగవానుడు దేవతల ఆమాటను విని దుఃఖితమైన మనస్సు గలవాడై ఇట్లు బదులిడెను (7).శివుడిట్లు పలికెను--


ఓవిష్ణూ| బ్రహ్మా! దేవతలారా! మీకు అందరికీ మీ మనస్సులే శరణము. జరుగబోయేది జరిగి తీరును. దానిని ఆపగలవారు ఎవ్వరూ లేరు (8). జరిగిన దేదో జరిగినది. దేవతలారా! ప్రకృతమును గురించి వినుడు. ఇపుడు నా తేజస్సును గ్రహించగల వారెవ్వరు? (9) గ్రహించగల సమర్థుడు గ్రహించుగాక! యని శివుడు చెప్పెను. దేవతలందరిచే ప్రేరితుడైన అగ్ని కపోతరూపమును ధరించి (10), ఆ శివతేజస్సును ముక్కుతో గ్రహించెను. ఓ మునీ! ఇంతలో పార్వతి అచటికి వచ్చెను (11).


సశేషం....

....

 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 65 / Agni Maha Purana - 65 🌹

శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.

. కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -3‌


జానెడు పొడవు గల సమిధల నుంచి ఆ అగ్నిని ప్రజ్వలింపచేసి పూర్వాదిదిక్కులందు దర్భలు మూడు విధములుగా (చుట్టూ) పరచి, వాటిపై పాత్రను, ఇధ్మమును వహ్నిని సమీపమున నుండు నట్లు చేసి స్రుక్కున, స్రువమును భూమిపై ఉంచవలెను.

ఆజ్యాస్థాలిని, చరుస్థాలిని, కుశాజ్యమును ప్రణీతచే ప్రోక్షించి, ప్రోక్షిణిని గ్రహించి దానిని నీటితో నింపి, ఆ నీటిని పవిత్రముచే కప్పబడిన హస్తమునందు జారవిడిచి, ప్రోక్షణీపాత్రమును తూర్పుగా తీసికొని వెళ్ళి, దానిని అగ్నికీ ఎదురుకుగా ఉంచి, దానిని ఉదకముచే మూడు సార్లు ప్రోక్షించి, ఎదుట నుంచి, ఉత్తరమున పుష్పలముతో కూడిన ప్రణీతపై విష్ణువును ధ్యానించి, ఆజ్యసాత్రను ఆజ్యముతో నింపి ఎదుట ఉంచి, తెగని చిగుళ్ళు గల, గర్భము లేని జానెడు పొడవైన రెండు కుశములను వెల్లగితల చేయబడిన హస్తములచే బొటనవ్రేలితోను అనామికతోను పట్టుకొని, వాటిని నేతలో ఇటు నటు త్రిప్పినేతిని సంస్కరించవలెను.


వాటి ఆజ్యమును సంగ్రహించి, రెండు పర్యాయములు తీసి, మూడు పర్యాయములు క్రిందికి చిమ్మవలెను. వాటితో స్రుక్స్రువములను గ్రహించి, నీటిచే తడిపి, వెచ్చచేసి, దర్భలచేత తుడిచి, మరల కడిగి, వెచ్చచేసి, ఓంకారము నుచ్చరించుచు క్రింద ఉంచి, సాధకుడు, పిమ్మట ఓంకారము మొదట ఉచ్చరించుచు, చివర 'నమః' అని లనుచు పిమ్మట హౌమము చేయవలెను.


గర్భాధానాది కర్మలను ఆ యా అంశములను వ్యవస్థ చక్కగా పాటించుచు, అంగముల ననుసరించి, నామాంతముగా గాని, సమావర్తాంతము గాని, అధికారాంతము గాని చేయవలెను. సశేషం....


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀  83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।

రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀


 380. 'బిందుమండలవాసినీ' - 2🌻 


సృష్టికర్త కూర్చుండియున్న పద్మము సృష్టి కర్తకన్న ముందే యేర్పడినది. ఆ పద్మము నాళము అంతకన్న ముందున్నది. ఆ నాళము పుట్టు స్థానము తెలియుట అసాధ్యము. అవ్యక్తమగు పరమాత్మ తత్త్వము నాళము ద్వారా ప్రసరించి పద్మము నేర్పరచి సృష్టికర్తను పుట్టించెను. జీవుని కూడ అట్లే ప్రతి ఉదయము మేల్కాంచును. మేల్కాంచుటకు ముందు జీవు డెటనుండి వచ్చుచున్నాడో తెలియుటకు ప్రయత్నించుట నాళమున చేరి వెదకుటగా తెలియదగును. సృష్టికి కర్త చతుర్ముఖ బ్రహ్మ. మన జీవన సృష్టికి కర్త మనమే.

బ్రహ్మవలె మనము కూడ సృష్టి జరుపుదుము. బ్రహ్మ సృష్టి బ్రహ్మము ఆజ్ఞానుసారము జరుగుట వలన బ్రహ్మదేవుడు సృష్టి కధిపతియై యున్నాడు. అతడు దైవేచ్ఛ నెఱిగి సృష్టి కర్తృత్వము నిర్వహించు చున్నాడు. అతని కర్తృత్వము నిరహంకార పూరితము. జీవుడు కూడ దైవేచ్ఛకు సమర్పణము చెంది దివ్యసంకల్పమునే నిర్వర్తించు చుండినచో బ్రహ్మానందమున ఉండవచ్చును. ఇట్టి బ్రహ్మానందము పొందుటకే సర్వసాధనలును. నవవిధ భక్తుల ద్వారా దైవసాన్నిధ్యము సిద్దించిన వారు కేవలము దైవేచ్ఛయే తమ ఇచ్ఛగా జీవింతురు. దివ్య ప్రణాళిక నిర్వర్తించుచు శాశ్వతులై సృష్టి యందుందురు. ఇట్టి బ్రహ్మానంద స్థితి తమ లోపలి బ్రహ్మనాళమును (బ్రహ్మ రంధ్రము) చేరినచో కలుగును. దానికి చేయు ప్రయత్నమే తపస్సు.


13235: శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏

నామపారాయణప్రీతా యను 20,736 నామములు భాస్కరరాయలు వారు ఇచ్చిన క్రమంలో కూర్చుట నా అదృష్టము.

ఆ పరమేశ్వరి తనను కీర్తించడానికి, తద్వారా భక్తులు తరించడానికి తన సహస్రనామములను వ్రాయమని వశిన్యాది వాగ్దేవతలను (వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అను వారిని) ఆదేశించినది. వశిన్యాదులు ఆ పరమేశ్వరి అంశనుండి ప్రాదుర్భవించినవారు. వశిన్యాదులు వ్రాసినవి వేయినామములు. మరి నేను కూర్చిన నామములు 20, 736. వశిన్యాదులంటే అత్యంత జ్ఞానసంపన్నులు. ఏమీ కాని నేను ఎంతో అదృష్టవంతుడిని అని చెప్పుకోవచ్చా?  ఎందరో పండితులు, జ్ఞానసంపన్నులు ఉన్నారు. నేను వారి పాదరజమునకు కూడా సరితూగను.  


ఆ పరమేశ్వరి వశిన్యాదులచే సహస్రనామములు వ్రాయించుకొన్నది. ఆ సహస్ర నామములకు భాష్యము భాస్కరరాయలువారిచే వ్రాయించుకొన్నది. భాస్కరరాయలు వారు 20,736 నామాలు ఎలా కూర్చవలెనో చెప్పారు. అంతేగాని ఆయనకూడా కూర్చలేదు. ఎందరో అత్యంత జ్ఞానసంపన్నులు ఉన్నారు. వారు కూర్చాలంటే ఇలాంటివి కోట్లాది సహస్రనామాలు కూర్చగలరు. 20,736 నామములు కూర్చగలిగే మహద్భాగ్యాన్ని నాకు ఆ పరమేశ్వరి అనుగ్రహించినదా అనినట్లు మహానభావులు అందరూ నాకోసం వదలివేశారా అని అని నేను భావించవచ్చా?

మాతృకా వర్ణములు 51. అందులో ల, ళ లు ఒకే అక్షరంగా భావించుతారు. ఆ విధంగా 50 అక్షరములకు 50 మంది దేవతలు ఉన్నారు. వారు విశుద్ధిచక్రము నందు 16 మంది, అనాహతచక్రము నందు 12 మంది, మణిపూరచక్రమునందు 10 మంది, స్వాధిష్ఠాన చక్రమునందు ఆరుగురు, మూలాధారమునందు నలుగురు, ఆజ్ఞాచక్రమునందు ఇరువురు ఉన్నారు. 

షట్చక్రములందు  వివిధ సంఖ్యల (16+12+10+6+4+2) దళములు గల పద్మములయొక్క కర్ణికలయందు అమ్మవారు వజ్రేశ్వరి, వామదేవి, వయోఽవస్థావివర్జితా, సిద్ధేశ్వరి, సిద్ధవిద్యా, సిద్ధమాతా యను దేవతా స్వరూపములలో  విలసిల్లుచున్నది. సహస్రారము నందు యశస్వినీ రూపిణియై విరాజిల్లుచున్నది.


శ్రీలలితాంబిక అకారాది క్షకారాంతమైన ఏబై ఒక్క అక్షరముల మాతృకావర్ణరూపిణి. అలాగే అసలు శక్తిపీఠములు కూడా ఏబది ఒకటి. 

అమ్మవారు మాతృకావర్ణరూపిణి గనుకనే మాతృకా వర్ణములనుండి 20,736 నామములు సమీకరించవచ్చని సౌభాగ్యభాస్కరం అను గ్రంథము వ్రాసిన భాస్కరరాయలువారు చెప్పారు. ఈ 20,736 నామముల పారాయణకూడా శ్రీలలితా సహస్రనామ స్తోత్రమునకు అనుబంధము గలిగినదే. యౌగికార్థముచే ఇవి కూడా నామములే అయిఉన్నవి. వీటి పారాయణకు ఏవిధమైన ఉపదేశము అవసరములేదు. బీజాక్షరయుతమైన ఈ నామములు, శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణవలె పారాయణము చేయదగినవే. నామపారాయణము అనగా ఈ నామములు పారాయణచేయుట అని కూడా భాస్కరరాయలు వారు చెప్పారు.

నామపారాయణప్రీతా యను ఈ గ్రంథమును భక్తులగోత్రనామములతో ఎందుకు పూజించుచున్నాము? అను ప్రశ్న ఉద్భవించవచ్చు.  బీజాక్షరస్వరూప నామములు గలిగిన ఈ గ్రంథము ఒక పవిత్రగ్రంథము. శ్రీచక్రముతో సమానమైనది. శ్రీమద్భగవద్గీత, శ్రీమద్భాగవతము, శ్రీమద్దేవీభాగవతము, శ్రీమద్రామాయణము వంటి గ్రంథములతో సమానమైనది. అమ్మవారి 20,736 నామములలో, ఒకనామమునకు 5 బీజాక్షరముల చొప్పున 20736 x 5 = 1,03,680 రూపాలలో మా గృహము నుండి మీగృహమునకు వచ్చుచున్నది. ఈ సంఖ్య నవదుర్గాస్వరూపము. అది ఎలాగ అంటే 1,03,680 = 1 + 0 + 3 + 6 + 8 + 0 = 18 = 1 + 8 = 9 (నవదుర్గలు). అందుకే హోమము, కుంకుమపూజ, శ్రీలలితా సహస్రనామ స్తోత్రపారాయణతో ఆ మహాతల్లిని సంతృప్తి పరచుచున్నాము. మీ గృహములో ఉంటేనే చాలు ఆ నామములు పారాయణచేసినంత ఫలము. 

ఈ నామములు అత్యంత మహిమాన్వితమైనవి. భక్తులకు కర్మఫలవిముక్తిని కలిగించు కైవల్యదాయకమైనవి. వీటిని విశేషమైన ప్రచారంలోకి తీసుకురావాలని ఆశిస్తూ ఈ గ్రంథమును గురుంచి అత్యంతవిశేషముగా అందరికీ విన్నవించుకుంటున్నాను. 

నేను నిత్యము శ్రీలలితా సహస్రనామముల వ్యాఖ్యానము, వేదవ్యాసుల వారి భాగత శ్లోకములు తాత్పర్యములతోను, నిత్యపంచాంగము వాట్సాప్ మరియు TELEGRAM సమూహముల ద్వారా అందజేయుచూ చిరపరిచితుడనై యున్నాను.

ఈ గ్రంథములు కావలసినవారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు - 7702090319, 9505813235 (వాట్సాప్ మాత్రమే).

🧘‍♂️389) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️ 


స్థితి ప్రకరణము  

రెండవ అధ్యాయము

దామ వ్యాళ కటోపాఖ్యానము

యస్యాసదిద మిత్యాస్థా నివృత్తా సర్వవస్తుషు క్రోడీకరోతి సర్వజ్ఞం నావిద్యా తమవాస్తవీ. 

“ఈ దృశ్యజగత్తు అసత్తైనది” అని యెఱుఁగుటచే ఎవనికి సమస్త దృశ్యపదార్థముల నుండియు ఆసక్తి తొలగిపోయినదో, అట్టి సర్వజ్ఞుని మిథ్యయగు అవిద్య తన వశమొనర్చుకొనజాలదు.

యదా తే నేన్ద్రియార్థశ్రీః స్వదతే హృది రాఘవ 

తదా విజ్ఞాతవిజ్ఞానః సముత్తీర్ణభవార్ణవః. 


ఓ రామచంద్రా! ఎపుడు ఇంద్రియార్థములగు శబ్దస్పర్శాదులు నీకు స్వతః హృదయమందు రుచింపకుండునో, అపుడు విజ్ఞానరూపమగు ఆత్మ నెఱింగిన వాడనియు, సంసార సముద్రమును దాటినవాడనియు తెలిసికొనుము. 

.....

2-120

అస్వాదితేన్ద్రియార్థస్య సతనోరతనోరపి అనిచ్ఛతోఽపి సంపన్నా ముక్తిరర్థవశాత్తవ. 

ఇహలోక, పరలోక ఇంద్రియార్థములగు శబ్దస్పర్శాదు లెపుడు నీకు రుచింపకుండునో, అపుడు వ్యవహరించుచున్నప్పటికిని, లేక సమాధియందున్నప్పటికిని ముక్తి నీవు కోరకుండగనే అనాయాసముగ నీకు ప్రాప్తించినట్లగును.


: తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల వారి సంకీర్తన


రేకు: 7-6

సంపుటము: 15-43


రాగము: సాళంగనాట

||పల్లవి||

జపియించరె సర్వజనులు యీ నామము 

తమరపమునో పుణ్యాలకు రామనామము!!

||చరణం||

శాంతికరము రామచంద్ర నామము

భ్రాంతు లణఁచు రామభద్ర నామము

వింతసుఖ మిచ్చు రఘువీర నామమూ, 

భూమిచింత దీర్చునదివో శ్రీరామనామము!!

||చరణం||

కలిదోషహరము రాఘవనామము 

సర్వఫలదము సీతాపతి నామము

కులక శోభనము కాకుత్థ్సనామము 

అనిరలమైన దిదివో రామనామము!!

||చరణం||

గుమిత మైనది రఘుకులనామము 

అతిసుముఖము దశరథసుత నామము

అమితమై శ్రీవేంకటాద్రి నాయకుఁడై

రమియించె యీతని రామనామము!!


....




ఒకరి కోసము ఒకరౌట ఓపికయగు 

వలపు కోసము మనసౌను వరుస గాను  

మమత కోసము మను ఔను మాయ గాను  

మరులు గొల్పే వయసౌను మనసు గాను 


మచ్చి కగుట కోసము బుద్ది మలుపు గాను 

సిద్ధు లగుట కోసము దీక్ష స్థిరముగాను 

ముద్దు మురిపాల కోసము ముడుపు గాను 

బాస లన్ని కోసము ప్రేమ బంధ మౌను  


మేఘ మెరుపు కోసము సుఖ మేను మౌను 

మెరుపు కోస పిడుగె శబ్ద మేలు ఔను   

పిలుపు కోసము తనువుగా ప్రేమ నిచ్చు 

ఇంతి పిలుపులు కథయేది ఇష్టమౌను 


🧘‍♂️99) అష్టావక్ర గీత🧘‍♀️

అధ్యాయం - 9

నిర్లిప్తత - ఉదాసీనత (నిర్వేదము)  

శ్లోకం 07:-


పశ్య భూతవికారాంస్త్వం భూతమాత్రాన్ యథార్థతః ।

తత్క్షణాద్ బంధనిర్ముక్తః స్వరూపస్థో భవిష్యసి ॥ 9-7 ॥


టీకా 

భూతవికారాన్ = భూతవికారములైన దేహేంద్రియాదులను, యదార్థతః = వాస్తవముగా, భూతమాత్రన్ = భూతమాత్రములనుగా, త్వం = నీవు, పశ్య = చూతువు గాక, తత్ క్షణాత్ = అట్లు చూచినవెంటనే, బంధనిర్ముక్తః = బంధము నుండి విడివడిన వాడవై, స్వరూపస్థః = స్వరూపస్థితియందున్న వాడవుగా, భవిష్యసి = కాగలవు.

వివరణ:-

పంచమహాభూతాలు పరిణామం చెంది వస్తువులుగా మారినా, వాటి నుండి నిజానికి వేరుగా లేవు. ఇది తెలుకుంటే వాటి బంధంనుండి విడివడినట్టే. ఈ విధంగా బంధరహితుడవై స్వరూపంలో ముక్తుడవై నిలచిపో.

తాత్పర్యం:-

మనచుట్టూ ఉన్న ప్రపంచమంతా పదార్థంతో నిర్మింపబడింది. ఆ పదార్థపు మూలాన్ని నిశితంగా పరిశీలిస్తే పంచభూతాలు పంచీకరణం చెంది పదార్థంగా రూపొందడమే కనిపిస్తుంది.

 ఏ వస్తువును పరీక్షించినా పంచభూతాలయిన పృథివి, ఏ జలము,అగ్ని, వాయువు ఆకాశము కానిదేదీ ఎక్కడా ఎందులోనూ గోచరించదు.

 బంగారంతో తయారు కాబడిన ఏ ఆభరణాన్ని చూసినా బంగారం తప్ప వేరేదేదీ కనిపించదు. నామరూపాలు మాత్రమే వేరుగా ఉంటాయి. ఇదేవిధంగా కనబడే ప్రపంచమంతా రాగద్వేషాలు అర్థరహితమనిపించి అదృశ్యమయిపోతాయి.

ఇంతవరకూ వస్తువులన్నీ నిజంగా ఉన్నాయనుకుంటూ, వాటి ప్రత్యేకతలను గుర్తించి, రాగద్వేషాలతో వానిని సంపాదించాలని కానీ వదిలించుకోవాలని కానీ నిత్యమూ శ్రమిస్తున్నాము.

పదార్థపు యదార్థ స్వరూపం తెలుసుకున్నాక దేని మీదనైనా ప్రత్యేక దృష్టి ఎలా ఉండగలదు? అజ్ఞానం వల్ల కలిగిన రాగద్వేషాలు ఈ యదార్థ జ్ఞానంతో అంతరిస్తాయి. రాగద్వేషాలవల్ల ప్రేరేపింపబడి చేసే పనులూ, ప్రయత్నాలూ,శ్రమా అన్నీ వ్యర్థంగా కనిపించి త్యజించబడతాయి. ఆ స్థానే మనస్సులో అనంతశాంతి చోటు చేసుకుంటుంది.

 అశాంతి స్థానంలో అనంత శాంతి ఉదయించగానే ఆ ప్రకాశంలో, ఆలోచనల ఉరవడి తగ్గిన నిశ్చలత్వంలో శుద్ధమైన చైతన్యం స్వయంగా కేవలంగా భాసిస్తుంది. అహంకారం---అహం సర్వభూతాత్మ అని గ్రహించి ఆనందంగా మిగిలిపోతుంది.

🧘‍♂️19) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘‍♀️

19) శ్లోకం:-

బుద్ధ్వా సమస్తమపి దృశ్య మచిత్స్వరూపం   ప్రత్యక్చితిం చ నిజరూప తయా విదిత్వా |

దేహేంద్రియా ద్యఖిల సాక్ష్యహ మిత్యజస్రం సంచింతయ వ్యపగతాఖిల సంశయ స్సనే II 19

టీకాసమస్తం అపి = ఈ యావత్తు కూడా, దృశ్యం అచిత్స్వ రూపం బుద్ధ్వా = దృశ్యమనీ, జడమని ఎరిగి, చ = మరియు, ప్రత్యక్ చితిం = లోనున్న చితిని, నిజ రూపతయా = తన నిజరూపమని, విదిత్వా = గుర్తెరిగి, వ్యపగత = పోయిన, అఖిల సంశయః సన్ = అన్ని సంశయాలు కలవాడవై, దేహ ఇంద్రియ ఆది = దేహము, ఇంద్రియాలు మొదలైన వాటికి, అహం సాక్షి ఇతి = నేను సాక్షినని, అజస్రం = ఎప్పుడూ, సంచింతయ = బాగా చింతన చెయ్యి.

భావం:- ఈ యావత్తు దృశ్యమనీ, జడమని తెలుసుకొని, లోన ఉన్న చితియే నీ నిజరూపమని ఎరిగి, అన్ని సంశయాలను వదిలి, దేహేంద్రియాదులకు నేను సాక్షినని నిరంతరం చింతన చెయ్యి.

వివరణ:-దేహేంద్రియ ప్రాణాంతఃకరణలు అన్నీ దృశ్యమని ముందు శ్లోకంలో రుజువు చేయబడినది. దృశ్యమైనది యావత్తు జడమే.

అయితే దీనిని తెలుసుకునే నేను ఎవరు? అనే ప్రశ్నకి సమాధానం లోపల ఎక్కడో ఉన్న చితియే. అదే నేను అని వస్తుంది.

ఇలా తెలుసుకోవడం బుద్ధి నిర్ణయం. ఇలా అనుభవంగా మారలేదు. అందుచేత బుద్ధిలో “నేను చితిని” అనే విశ్వాసం కలిగాక, దేహాదులు ప్రపంచంలో చేసే వ్యవహారాలలో చిక్కుకోకుండా ఉండటానికిగాను ఆ వ్యవహారాలన్నించటికీ నేను సాక్షినని నిరంతరం భావన చెయ్యాలి.

క్షణం పాటు. యేమరినా ఈ పరికరాలు, వాటి వ్యవహారాలు మనల్ని పట్టుకొని ప్రపంచంలోకి ఈడ్చివేస్తాయి.

ఇది నిదిధ్యాసనలో భాగం.

ఓం నమః శివాయ:

🧘‍♂️9- శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచితము - సిద్ధాశ్రమయోగులు🧘‍♀️

🧘‍♂️9-సిద్ధభూమిక🧘‍♀️:-

శ్రీమాలి గారు చెప్పిన దానిని బట్టి సిద్ధాశ్రమం మానస సరోవరానికి ఈశాన్య దిశలో వందల కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. పైనుండి విమానంలో కనిపించేది కాదు. ఫోటోలకు అందేదికాదు. అక్కడ కొన్ని చోట్ల వేదఘోష, కొన్ని చోట్ల నిశ్శబ్ద తపస్సు, కొన్ని చోట్ల సాధనలను గూర్చిన ప్రవచనాలు, బ్రహ్మర్షుల అనుగ్రహభాషణలు జరుగుతుంటవి.

 ఎవరికి బాధలు, ఆందోళనలు, రోగములు, ముసలితనపు కష్టాలు ఉండవు. అప్సరసలు -మహర్షుల అనుగ్రహ కోసం ఆడుతూ పాడుతుంటారు. నిరంతర సమాధిలో ఎన్నో సంవత్సరాలుండే మౌనుల నక్కడ దర్శించవచ్చును.

సిద్ధాశ్రమం ఒక ఊహాప్రదేశం కాదు. నిజంగానే భౌతికంగా ఉన్నదని నిరూపించటానికి శ్రీమాలీగారు దేశవిదేశ ప్రముఖులను కొందరిని తీసుకువెళ్ళి కొన్ని గంటలపాటు ఆ ప్రదేశాలను చూపించి అక్కడి మహాత్ములను దర్శింపజేశారు. వారిలో ప్రఖ్యాత అమెరికన్ అణుశాస్త్రవేత్త జెఫ్, బ్రెజిల్ డాక్టర్లు -పూలింగ్, యూలే, హాలీవుడ్ సుందరి బీలే, శాస్త్రవేత్త ఎమర్సన్, ఖగోళ శాస్త్రవేత్త పహరిచ్, లండన్ శాస్త్రజ్ఞుడు బ్రూజీ, చంద్రగ్రహచోదన నిపుణుడు సిరాంగ్, కంప్యూటర్ విజ్ఞానాద్యుడు హోరీ ప్రభృతులున్నారు. వీరంతా ఏకకంఠంతో ఈ దివ్య ప్రదేశం యొక్క మహత్వాన్ని కొనియాడారు.

సాయికాకా అనే యోగి తాను చాలాసార్లు జ్ఞాన గంజకు సిద్ధమహాత్ముల సహాయం వల్ల వెళ్ళివచ్చానని అన్నాడు. అది శంబళ గ్రామ ప్రాంతంలో రహస్యంగా ఉంటుందని అటువంటి కేంద్రాలు హిమాలయాలలోనే గాకnభూమిమీద మరికొన్ని ప్రదేశాలలో కూడా ఉన్నవని ఆయన తెలియజేశారు.

జేమ్సు హిల్టన్ నవల లాస్ట్ హొరైజాన్ నవలలోని షాంగ్రిలా - ఈ శంబళ ప్రాంతంలోని ఒక భాగంగా పరిగణించబడుతున్నది. ఈ నవల సినిమాగా వచ్చి ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్ దీని చేత ప్రభావితుడై తన నివాస భవనానికి షాంగ్రిలా అని పేరు పెట్టుకొన్నాడు.

కుర్తాళయోగి మహావతార్ బాబా బదరీప్రాంతం కేంద్రంగా పెట్టుకొన్న జ్ఞాన్ గంజ్ తో సన్నిహిత సంబంధం కలిగిన మహాత్ముడు. సిద్ధభూమి

జ్ఞానగంజ్ అని గోపీనాధ కవిరాజ్ రచించిన గ్రంథంలో ఇటువంటి ఎన్నో విశేషాలు వివరంగా చెప్పబడినవి. (ఈయన 1976 లో మరణించాడు).

ఈ ప్రదేశాలలో పరమసుందరమైన జలపాతాలెన్నో ఉన్నవి. వాటి నీరు ఒక చోట సరస్సుగా రూపొందింది. దానికి సిద్ధయోగ సరస్సని పేరు.శ్రీ పాద శ్రీవల్లభుల వారు స్నానం చేసిన స్ఫటికసరస్సదే కావచ్చు. దీని ఒడ్డుననే అమరత్వాన్ని, సర్వకామ్యములను ప్రసాదించే కల్పవృక్షం ఉన్నది. దీని ఫలాలు శ్రీ చక్ర మేరు ప్రస్తారంవలె ఉంటాయి. సిద్ధాశ్రమం దాటి బయట ప్రపంచంలోకి ఈ ఫలాలను తీసుకువెళ్ళటానికి అనుమతి లేదు. అయితే ఇటీవల ఒక యోగి అచటి మహాత్ముల అనుమతితో 2001 లో ప్రయాగలో జరిగిన కుంభమేళాకు ఒక పండును తీసుకు వచ్చాడు. దానిని చూడటానికి

కొద్దిమందికి అనుమతి ఇవ్వబడింది.

నారాయణ దత్త శ్రీమాలి చెప్పిన పట్టికలోని వారే గాక మరికొందరు దాక్షిణాత్య యోగులు కూడా అక్కడ ఉన్నారని మరి కొందరు మహాత్ములు చెపుతున్నారు. ఆంధ్రుడైన త్రైలింగస్వామి, ద్రావిడ దేశ ప్రసిద్ధులు భోగనాధుడు, సుందరనాధుడు, కరువూరర్, పాంబట్టి, కొంగనార్, సత్తముని, రామదేవర్, మాచముని, వాస్మోగర్ మొదలైన పేర్లెన్నో వినిపిస్తున్నవి. పురాణాలలో చిరంజీవులుగా చెప్పబడిన అశ్వత్థామ, వ్యాసుడు, హనుమంతుడు, కృపుడు, పరశురాముడు మొదలైనవారు హిమాలయ సిద్ధభూములలో వుండి సాధకులను అనుగ్రహిస్తూనే ఉన్నారు.

 సువిశాల, సువిస్తరమైన సిద్ధాశ్రమ భూమికలలో బౌద్ధ, జైన, శైవ, శాక్తేయాది విభాగాలెన్నో ఉన్నవి. హైందవేతర మతస్థులలోని సిద్ధులు కూడా ఇక్కడ ఉన్నారు. తపస్సు - దైవనిష్ఠ మతములకు సంప్రదాయములకు, ఆచారములకు అతీతమైనవి. మహావతార్ బాబా శిష్యులలో అన్యమతస్థులున్నట్లు వారి చరిత్రలో ఉన్నది.

 చైనాలోని షామాన్ మాంత్రికులు కొందరు అక్కడ ఉన్నారని బోన్సా మతస్థుల విశ్వాసం. ప్రసిద్ధయోగిని ఆనందమాయి మరణించిన తర్వాత సిద్ధాశ్రమంలో ఉన్నదని శ్రీమాలి చెప్పటం వల్ల మంచుకొండలతో ఆమె అనుబంధం స్మరించదగినది. మహాత్ముడు వేల

సంవత్సరాలు జీవించిన బృందావన యోగి దేవరహాబాబా దయవల్ల హిమాలయాలలో 20, 25 అడుగుల ఎత్తున్న ద్వాపరయుగ మానవులను తాను చూడగలిగానని ఆమె చెప్పిన విషయం ఆశ్చర్యకరమైనది.

అలానే దలైలామా కార్యదర్శిగా, చైనా పోలీసులచే హింసించబడి మరణదశలో సిద్ధలామాల సంకల్పం వల్ల లండన్లోని బ్రిటిష్ డాక్టర్ శరీరంలో ప్రవేశించి థర్డ్ ఐ మొదలైన అద్భుత గ్రంథాలు రచించిన ట్యూ' లోబ్యాంగ్ రాంపా “పురాతన గుహలు" అనే గ్రంథంలో పూర్వయుగాల మహనీయుల శాస్త్ర విజ్ఞాన రహస్యాలు హిమాలయ కందరాలలో ఎలా నిక్షిప్తమై ఉన్నవో వివరించాడు. ఆనాటి సిద్ధుల వివరాలు కొన్ని అతడు తెలియజేశాడు కూడా.

ఇంత ఆధునిక విజ్ఞానం పెరిగిన తర్వాత కూడా హిమాలయాలు ఎన్నో రహస్యాలకు స్థానమై ఉండి, మానవులు లౌకిక జ్ఞానంతో తెలుసుకోలేని విశేషాలెన్నో కలిగి ఉన్నవి. వాటి యెరుక లభించాలంటే తపస్సు చేయాలి. అక్కడ సిద్ధుల అనుగ్రహాన్ని పొందాలి. ఆ సిద్ధులు కొందరి చరిత్రలు సేకరించి ఒక గ్రంథంగా ప్రచురించటం జరుగుతున్నది. ఇటీవలి నా అమెరికా యాత్రలో బౌద్ధ యోగి పద్మసంభవుని చరిత్ర చదివినప్పుడు కలిగిన దివ్యానుభావాలు - ఈ రచనకు ప్రేరణ. ఈ గ్రంథంలో చెప్పబడిన వారు కాక ఇంకా ఎందరో సిద్ధాశ్రమ యోగులున్నారు. ప్రస్తుతానికి దీనిని సహృదయులు స్వీకరింతురుగాక!

***

ఉండబట్టలేక నాకు తోచిన రెండుముక్కలు ఆశక్తి ఉన్నవారికోసం.

నిన్న ఒక మిత్రుడు పురుషసూక్తం నేర్చుకున్నా విని అభిప్రాయం చెప్పండి అని ఒక ఆడియో పంపాడు. పూర్తిగా వినలేక ఆపేసి ఫోన్ చేసి ఎవరివద్ద నేర్చుకున్నావు అని అడిగితే యూట్యూబ్ అన్నాడు. ఇది మొదటి అనుభవం కాదు, చాలా మంది దగ్గర నుండి వింటున్నదే ఈ మధ్యన.

ప్రస్తుత కాలం లో వేద మంత్రాలు నేర్చుకోవాలనుకోవడం మంచి విషయమే కానీ ఇలా యూట్యూబ్ ల ద్వారానో, ఏదో మాధ్యమాల ద్వారానో, పుస్తకాల ద్వారా నేర్చుకోవాలనుకోవడం తోనే ఇబ్బంది.

వేదాధ్యయనానికి, పఠనానికి మన ఋషులు కొన్ని పద్దతులు నిర్దేశించారు.

గీతీ శీఘ్రీ శిరఃకంపీ తధా లిఖితపాఠకః

అనర్ధజ్ఞః అల్ప కంఠశ్చ షడేతే పాఠకాధమాః

గీతీ – అంటే పాట పాడినట్లు పఠనం చెయ్యడం, ఇది సరి అయినది కాదు. సామ వేదం సంగీతం లా ధ్వనించినా దానిని కూర్చిన పద్దతి లోనే గానం చెయ్యాలి. దానికి విరుద్దం గా పలకడం సంగీత పరంగా అయినా సరి అయినది కాదు. అంతే కాదు హాని కూడా చేస్తుంది. నిర్ణీత మయిన పద్దతి లోనే పఠనం చెయ్యాలి.

శీఘ్రీ – వేదం లో అక్షరాలు మాత్రా కాలాలతో నిర్ణయించబడి ఉంటాయి. ఆ మాత్రల కాలం ప్రకారమే ఆ అక్షరాన్ని పలికి తీరాలి. అప్పుడే సరైన ఫలితం వస్తుంది. అనువల్ల తొందర తొందరగా పలకకూడదు.

శిరః కంపీ – పఠనం చేసేటప్పుడు తల ఊపడం లాంటివి చెయ్యకుండా సరిగా కూర్చుని ఏకాగ్రత తో ధ్యాన నిష్ఠ గా వేదాన్ని పఠనం చెయ్యాలి. అవసరం లేకుడా తల ఊపడం వలన వైదిక ధ్వని తరంగాలకి అవరోధం కలిగిస్తుంది.

లిఖిత పాఠకః – పుస్తకం చూసి చెప్పే వాడు లిఖిత పాఠకుడు. వేదం గురువు తో పాటు వల్లె వేసి చెబుతుండగా గుర్తు పెట్టుకుని పఠిన్చాలి. వినికిడి జ్ఞాపక శక్తుల మీద ఆధారపడి ఉండేదే వేదపఠనము.

అనర్ధజ్ఞః – అర్ధం తెలుసుకోకుండా పఠనం చేసేవాడు. ఫలితానికి అర్ధం కూడా ఖచ్చితం గా తెలుసుకోవాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.

అల్ప కంఠహ – తక్కువ గొంతు తో గొణిగి నట్టు చదివేవాడు.పూర్తి గొంతుతో గట్టిగా చదివినప్పుడే వేదనాదాల ధ్వని చుట్టు పక్కల ప్రతిధ్వనించి సత్ఫలితాలని ఇస్తుంది.

వ్యాఘ్రీ యధా హరేత్ పుత్రాన్  దంష్ట్రాభ్యాం చ న పీడయేత్

భీత పతనాదేతాభ్యాం తద్వత్ వర్ణాన్ ప్రయోజయేత్

1. వేదం లోని అక్షరాలు సునాయాసం గా పలకాలి

2. అక్షరాలు అస్పష్టం గా ఉండకూడదు

3. ధ్వని జారిపోవడం కాని తేలిపోవడం కాని జరగకూడదు అలా అని అరిచినట్టు గా కూడా ఉండకూడదు.

4. పెదవుల చివరనుంచి పదాలని పలకకూడదు

వేద పఠనానికి ఉండాల్సింది మూడు లక్షణాలు. అవి ఏమిటంటే అక్షర శుద్ధి, మాత్రా శుద్ధి, స్వర శుద్ధి. వేదాన్ని జాగ్రత్త గా పఠనం చెయ్యకపోతే అర్ధం మారిపోయే అవకాశం ఉంది. వేద పఠనం లో దైవ ప్రీతి కలిగించడమంతా వాటి స్వరం లో ఉంటుంది. ఉచ్ఛ మంద్ర స్థాయి లో పలికే స్వరాలని ఆ స్థానం గమనించి అలాగే పలకాలి. వేదం లో స్వరితము, అనుదాత్తము , దీర్ఘ స్వరితము, ఉదాత్తము అనే ముఖ్య స్వరాలు ఉంటాయి. వాటిని గురుముఖతా నేర్చుకుని వల్లె వేయాలి. వేద విద్యకి గురు అనుగ్రహం పూర్తిగా ఉండాలి. సంకల్పం ఉంటే మార్గము, గురువు దొరకడం కష్టం కాదు. అనుష్ఠానాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఆ వేదమాతని ప్రార్ధిస్తే నేర్చుకోవాలన్న తపన తోడయితే తప్పక మార్గం సుగమం అవుతుంది.

నేర్చుకునే ఒక్క పాఠం అయినా పద్దతిగా నేర్చుకుని సాధన చేస్తేనే ప్రయోజనం.

శంకరులు మనకు ఎన్నో స్తోత్రాలు అనుగ్రహించారు. తప్పులు లేకుండా అవి నేర్చుకుని చెప్పుకున్నా వేద మంత్రాలకి సమానమైన ఫలితం ఉంటుంది.

పై విషయాలపై సందేహాలు ఉంటే పెద్దవారి వద్ద నివృత్తి చేసుకోవచ్చు, కానీ చర్చకు వితండానికి తావు లేదు.

*** 

🧘‍♂️శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘‍♀️

 27వ శ్లోకం:-

శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యంకే న ప్రాపు ర్వాంచితం పాపినోపి హా న:! పూర్వం వాక్ప్రవృత్తా న తస్మిన్ తేన ప్రాప్తం గర్భ వాసాది దు:ఖం!! 

భావం:-

పాపాత్ములైనను శ్రీమన్నారాయణ అను నామమును ఉచ్చరించి తమ కోర్కెలను తీర్చుకొనిరి కదా! అయ్యో నా వాక్కు ఆ నామమును ముందు ఉచ్చరించినది కాదు. అందులకే నాకీ జన్మము. ఈ గర్భవాసము మున్నగు దుఃఖములు సంభవించివి.

పరిస్థితులను ఎదుర్కొని పోరాడి ముందుకు సాగినప్పుడే, పురోగమించడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడే ఆత్మ అతులిత శక్తిసంభరితమై వెలువడుతుంది.

జాగృతి

స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు

అనుభవం పెరిగే కొద్దీ 'పురుష ప్రయత్నం' లోనే సర్వం ఇమిడి ఉన్నట్లు అనిపిస్తుంది. దే నా నూతన సందేశం.

....

🧘‍♂️విస్తరణ🧘‍♀️ 

జాతి మతాలు ఏవయినా వ్యక్తులందరిలోనూ ఈశ్వరుణ్ణి చూడడం నేర్చుకోవాలి. ప్రతి మానవుడిలోనూ మీ ఏకత్వాన్ని అనుభూతం కావించుకున్నప్పుడు--- అంతకు ముందుకాదు ---- దివ్య ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది మీకు.

శ్రీ పరమహంస యోగానంద / సఫలతా నియమం

ॐ卐సుభాషితమ్ॐ卐 

శ్లో𝕝𝕝 ఆలస్యం హి మనుష్యాణాం శరీరస్థో మహాన్ రిపుః|

నాస్త్యుద్యమ సమో బంధుః కుర్వాణో నావసీదతి||

తా𝕝𝕝 ఆలస్యం చేయడం అనేది మానవుల శరీరంలో ఉన్న గొప్ప శత్రువు. ప్రయత్నించడం అనే గుణానికి సమానమైన బంధువు లేనే లేదు...ప్రయత్నశీలి ఏనాడు నశించడు. ప్రయత్నం చేసే వ్యక్తి ఏ పనిలోను విఫలం కాడు. 

...


🧘‍♂️97) అష్టావక్ర గీత🧘‍♀️

అధ్యాయం - 9

నిర్లిప్తత - ఉదాసీనత (నిర్వేదము)  

శ్లోకం 05:-

నానా మతం మహర్షీణాం సాధూనాం యోగినాం తథా ।

దృష్ట్వా నిర్వేదమాపన్నః కో న శామ్యతి మానవః ॥ 9-5 ॥

టీకా మహర్షిణాం = మహర్షుల యొక్కయు, సాధూనాం = సాధుపురుషుల యొక్కయు, తథా = అదేవిధముగ, యోగినాం = యోగుల యొక్కయు, నానామతం = భిన్నభిన్నములగు మతములను, దృష్ట్వా = చూచి, నిర్వేదం = వైరాగ్యమును, ఆపన్నః = పొందినవాడై, కః మానవః = ఏ మానవుడు, న శామ్యతి = శాంతిని పొందడు?

వివరణ:-

ఎందరో మహానుభావులు-మహర్షులు, సాధువులు, యోగీశ్వరులు, వీరి ప్రవచనాలు అనేకవిధాలుగా కనిపించినా ఉన్న సత్యం ఒకటే అని తెలుసుకుని జ్ఞాని నిర్వేదంతో శాంతుడవుతాడు.

తాత్పర్యం:- ఎందరో మహానుభావులు తమ అనుభవాలను తెలియజెచ్పే ప్రయత్నం చేసేరు, మరెందరో మేధావులు వారి ప్రవచనాలను వ్యాఖ్యానించేరు. వీటితో తత్త్వశాస్త్రం శాఖోపశాఖలుగా బహుళంగా విస్తరించింది.

 వీటన్నిటినీ చూసిన సాధారణ సాధకుడు సందేహంలోపడి సంశయాత్ముడై సాధననే విస్మరించవచ్చు అందుకే ఆచార్యశంకరులు తమ "వివేకచూడామణి" లో ఇలా అన్నారు. 

శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణమ్ 

అతః ప్రయత్నాజ్ఞాతవ్యం తత్త్వజ్ఞస్తత్త్వమాత్మనః (వివేకచూడామణి - 60)

శాఖోపశాఖలయిన ఈ తత్త్వశాస్త్రం తర్క వ్యాఖ్యలతో మహారణ్యంవలె దుర్గమమైనది. ఇందులో నుండి బయటపడడం మహాకష్టం. ఇందులోపడి మతి పోగొట్టుకోకుండా తెలివైన సాధకులు చైతన్యస్వరూపమైన ఆత్మను కనుగొని నిష్ఠను సంపాదిచుకోవాలి.

తెలివైన సాధకుడు అన్ని రకాల అభిప్రాయాలను వివేకవిచక్షణలతో సమీక్షించి బుద్ధికి పరిమితమైన జ్ఞానంతో, బుద్ధికతీతమూ ఆధారమూ అయిన చైతన్యం తెలియబడదనీ,సత్యాన్ని సూచించడమే బుద్ధికి పరమావధి అనీ గ్రహిస్తాడు. 

కాబట్టి నిజమైన సాధకుడు వాదప్రతివాదనలను తర్కాన్నీ విడిచి పెట్టి, విభిన్న అభిప్రాయాల మీద విమర్శనాత్మకమైన నిర్లిప్తత కలిగి ఉంటాడు. వాదం అజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది. విచారణ విజ్ఞానాన్ని అన్వేషిస్తుంది. 

చిత్తశుద్ధి కల్గిన సాధకులు గురువుల ద్వారా సత్యంగురించి శ్రవణం చేసి, విన్నదానిని మననం చేసి, పాండితీ ప్రకర్ష మీద ప్రలోభం వీడి, వాద ప్రతివాదాల జోలికిపోక శాంతమూ, శుద్ధమూ చైతన్యస్వరూపమూ అయిన ఆత్మానుభవాన్ని సాధిస్తారు.

ఎందరో మహానుభావులు సత్యాన్ని ఎన్నో విధాలుగా వర్ణిస్తున్నప్పుడు ఎవరిని మార్గదర్శిగా ఎన్నుకోవాలి అనే సందేహం సహజంగా వస్తుంది. రాబోయే శ్లోకంలో దీనికి సమాధానమిస్తున్నారు మునివర్యులు. 

**17) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘‍♀️

17) శ్లోకం:- ప్రత్యక్చితి ర్వపురిదం న భవే జడాత్మా  కుడ్యాదివ జ్జడతయా ప్యసవో న చిత్స్యుః | నా పీంద్రియాణి కరణం కుత ఏవ చిత్స్యాత్ కుద్దాలకాదివ దితి ప్రవిచారయ త్వమ్ ॥ 17

టీకా ఇదం వపుః = ఈ శరీరం, కుడ్య ఆదివత్ = గోడమొదలైన వాటివలె, జడ ఆత్మా = జడస్వభావం కలది, ప్రత్యక్ చితిః న భావేత్ = అంతశ్చైతన్యం కాదు, అస్వః అపి = ప్రాణాలు కూడాను, జడతయా = జడత్వకారణం చేత, చిత్ న స్యుః = చిత్తు కావు, ఇంద్రియాణి అపి న = ఇంద్రియాలు కూడా కావు, కుద్దాలక ఆదివత్ = గొడ్డలి మొదలైన వాటివంటి, కరణం ఏవ = పరికరం మాత్రమే, చిత్ కుతః స్యాత్ చిత్తు ఎలా అవుతుంది? ఇతి = ఇలా, త్వం = ప్రవిచారయ = నీవు గాఢంగా విచారణ చెయ్యి.

భావం:- 'ఈ శరీరం, గోడ మొదలైన వాటివలె జడ స్వభావం కలిగినది. చితి కాదు. పంచప్రాణాలు కూడా జడత్వ కారణం చేత చితి కాదు. ఇంద్రియాలు కూడా కావు. గొడ్డలి మొదలైన పనిముట్లు వంటివి. చితి ఎలా అవుతాయి?' ఇలా నీవు గాఢంగా చింతించు.

వివరణ

ఈ శ్లోకం నుండి విచారణా మార్గం ఉపదేశింపబడుతుంది. వడ్లగింజ నుండి బియ్యపు గింజని వేరు చేసినట్లుగా జడాన్ని చితిని విడదీయడం సాధ్యం కాదు. జడము, చితి రెండూ జీవునిలో భాగాలు. బుద్ధిలోని సునిశితమైన విచక్షణ ద్వారా విడదీసి తెలుసుకోవడం ఒక్కటే పద్ధతి.

శరీరం గోడలతో కట్టిన ఇల్లు వంటిది. అందులో జీవుడు నివసిస్తున్నాడు. బాహ్య వాయువు ముక్కు ద్వారా లోనికి వెళ్ళి శక్తినిస్తే పంచప్రాణాలు శరీరాన్ని నిలబెట్టుతాయి. అవి కూడా జడమైనవే. ఇంద్రియాలు కేవలం పరికరాలు. వాడుకునే వాడికి చితి వుంది కాని వాడుకోబడే పరికరాలు జడమైనవే.

ఇవేవి చితి కాదు. ఇలా బుద్ధిని సవితర్క మార్గంలో నడిపించడమే ఆత్మ విచారణ.

** - శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఆరవశతకం)

678) శ్లోకము :-

పాపాని మే హరతు కాచన కృత్తశీర్షా మాతా పదాంబుజ భుజిష్య వితీర్ణహర్షా!

యా భక్తలోక వరదాన విధౌ వినిద్రా వాసం కమండలు  ధునీ పులినే కరోతి!!  678

భావము:-

తల్లీ ! ఓ ఉమాదేవి! భక్తలోకమునకు వరములిచ్చుటకై నిద్రమాని జాగరూకతో ఉండునట్టిది,

తను ప్రతిష్ఠ అయిన క్షేత్రమున ప్రవహించు  పావన  కమండలు అను నది యొక్క 

ఇసుకదిబ్బలపై నివసించునది, తన పాద పద్మముల దాసులగు భక్తులకు 

ఆనందము ప్రసాదించునది, కంఠము నరుకుకొని చ్ఛిన్నమస్తక అయిన రేణుకా దేవి

నాపాపములను తొలగించు కాక 

...

***679) శ్లోకము :-

షష్ఠావతార జననావని రేకవీరా భీమా ధునోతు దురితాని గణాధిపస్య!

యా భక్త రక్షణ విధావతి జాగరూకా పుణ్యే కమండలు ధునీ పులినే చకాస్తి!!  679

భావము:-

తల్లీ ! ఓ ఉమాదేవి! పవిత్రమగు కమండులు నదీ తీర 

ఇసుక మైదానమున నివసించునది,

తన భక్తుల రక్షణ అందు జాగరూకత కలది,

సాటి లేని పరాక్రమముచే 

ఏకవీర అని ప్రసిద్ధి చెందినది, 

చండిక, భీమ అని నామముల కూడ పిలువబడు, 

విష్ణువు ఆరవ అవతారమైన 

పరశురాముని తల్లి 

రేణుకా దేవి 

కుమారుడుగణపతి  

పాపముల హరించు కాక.

**శ్రీమన్నారాయణీయము                     దశమ స్కంధము 72వ దశకము - అక్రూరుని ఆగమనము - 72 - 9 & 10 - శ్లోకములు

72-9

సాయంతనాప్లవవిశేషవివిక్తగాత్రౌ

ద్వౌ పీత నీలరుచిరాంబర లోభనీయౌ।

నాతిప్రపంచధృతభూషణచారువేషా

మందస్మితార్ర్ధవదనౌ స యువాం దదర్శ॥

9వ భావము :-

ప్రభూ! నీవూ - నీ సోదరుడు బలరాముడు -సాయంకాల సమయమగుటచే, స్నానమాచరించిరి; ఆకర్షణీయమగు పసుపు నీలివర్ణపు దుస్తులను,

అతి ఆడంబరముకాని ఆ భరణములను ధరించిరి; మందస్మిత ప్రసన్న వదనములతో వచ్చిరి. అట్టి మిమ్ములను - ఆ అక్రూరుడు చూచెను.

**72–10

దూరాద్రథాత్ సమవరుహ్య నమంతమేనం

ఉత్థాప్య భక్తకులమౌళిమథోపగూహన్।

హర్షాన్మితాక్షరగిరా కుశలానుయోగీ

పాణిం ప్రగృహ్య సబలో౾థ గృహం నినేథ॥

10వ భావము :-

ప్రభూ! అక్రూరుడు మిమ్ము చూడగనే వేగిరమే రథము దిగి మీకు నమస్కరించెను; ప్రభూ! నీ పాదములపై వాలెను. నీవప్పడు ఆ భక్తాగ్రేసురుని లేవనెత్తి అతనికి సంతోషము కలిగించుచూ కౌగలించుకొంటివి;

 మర్యాద పూర్వకముగా సంభాషించితివి; కుశలమడిగితివి. అతని హస్తములను మీరు చెరియొకవైపున పట్టుకొని గృహాంతర్భాగమునకు తోడ్కొని వెళ్ళిరి.

***


No comments:

Post a Comment