పున్నాగ వన మిత్ర బృందమునకు స్థిర వాసర శుభాకాంక్షలు
#అన్నమాచార్యకీర్తన
*మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా* *సన్నల నీ యోగనిద్ర చాలు మేలుకోవయ్యా॥*
ఆవులు పేయలకుగానరచీ పితుకవలె గోవిందుడ యింకమేలుకొనవయ్యా ఆవలీవలి పడుచులాటలు మరిగివచ్చి త్రోవకాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా
వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడ కూడియున్నారిదే మేలుకోవయ్యా తోడనే యశోద గిన్నెతో పెరుగు వంటకము యీడకు తెచ్చిపెట్టెనిక మేలుకోవయ్యా
పిలిచి నందగోపుడు పేరుకొని యదె కన్ను కొలుకులు విచ్చి ఇక మేలుకొనవయ్యా అలరిన శ్రీవేంకటాద్రిమీది బాలకృష్ణ యిల మా మాటలు వింటివింక మేలుకోవయ్యా మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా... |
|
|
|
*శివుడు నవ్వుతున్నాడు*
గౌరీ రొట్టెలు చేస్తూ చేస్తూ ‘ఓం నమశివాయ’ అని జపం చేస్తున్నది. విడిగా పూజ కోసం సమయం వెచ్చించటం కుదరదు పాపం ఆమెకు. అందువల్ల పని చేస్తూ చేస్తూ నామం చేసుకునేది. ఇంతలో ఒక్కసారిగా ధమ్మని గట్టిగా శబ్దం వచ్చి పెద్దగా బాధాకరమైన అరుపు వినిపించింది. ఆమె ఇంటి ప్రాంగణం వైపు పరుగుపెట్టి చూసేసరికి గుండె ఆగిపోయినంత పనైంది.. ఎనిమిదేళ్ళ బాబు రక్తంతో తడిసి పడి ఉన్నాడు. గట్టిగా అరిచి ఏడవాలి అనిపించింది. కానీ ఇంట్లో ఆమె తప్ప ఎవరు లేరు. ఏడ్చి మాత్రం ఎవరిని పిలవ గలదు? ఇటు బాబును కూడా చూసుకోవాలి కదా. పరుగుతో కిందకు వెళ్ళి చూసింది. బాబు సగం స్పృహలో “అమ్మ అమ్మ” అని కలవరిస్తున్నాడు.
ఆమె లోపల మమత్వం కళ్ళలో నుండి జాలువారి తన అస్తిత్వాన్ని తెలియచెప్పింది.
పదిరోజుల క్రితం చేయించుకున్న అపెండిక్స్ ఆపరేషన్ ను కూడా పట్టించుకోకుండా, ఎక్కడినుంచి అంత శక్తి వచ్చిందో మరి, బాబును భుజాన వేసుకుని, ఆ వీథిలోనే ఉన్న వైద్యాలయానికి పరుగు పెట్టింది. దారిలో అంతా మనసారా భగవంతుని తిట్టుకో సాగింది.
“ఓ భగవంతుడా! నీకు ఏమి అన్యాయం చేశాను? నా పిల్లవాడికి ఇంత గతి పట్టిస్తావా?” అని ఉక్రోషంతో ధుమధుమలాడింది.
సరే, అక్కడ డాక్టర్ కలిశాడు, వేళకు చికిత్స అందింది. బాబు పూర్తిగా నయమైపోయాడు. దెబ్బలు ఎక్కువ లోతుగా తగలలేదు. అందువల్ల ఎక్కువ ఇబ్బంది కలగలేదు..
రాత్రికి ఇంటిదగ్గర అందరూ టీవీ చూస్తున్నారు. అప్పుడు గౌరీ మనస్సు ఉద్విగ్నంగా ఉంది. భగవంతుడంటే విరక్తి కలగసాగింది. ఒక తల్లి మమత భగవంతుని ఉనికిని ఎదిరిస్తోంది. ఆమె బుర్రలో ఆరోజు జరిగిన ఘటనాక్రమం అంతా చక్రంలాగా తిరగింది. బాబు ఇంటిముందు ఎట్లా కిందపడ్డాడో- తలుచుకుంటే అంతరాత్మ కంపించింది.
నిన్ననే పాత మోటరు పైపు ప్రాంగణం నుండి తీయించివేశారు. సరిగ్గా అదే స్థలంలో బాబు కిందపడ్డాడు. ఒకవేళ నిన్న మేస్త్రీ రాకపోయి ఉంటే? ఆమె చేయి ఒక్కసారి తన పొట్ట దగ్గరకు వెళ్ళింది. ఇంకా ఆ చోట కుట్లు పచ్చిగానే ఉన్నాయి. ఆశ్చర్యం వేసింది. ఆమె 20-22 కిలోల బాబును ఎట్లా అరకిలోమీటరు దూరం వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది.. బాబు పువ్వు లాగా తేలికగా అనిపించాడప్పుడు. ఆమె బట్టల బొక్కెనను పట్టుకుని మిద్దెదాకా తీసుకొని వెళ్ళలేక పోతుందే మామూలుగా అయితే.!.
మళ్ళీ ఆమెకు గుర్తుకు వచ్చింది- డాక్టర్ గారు రోజూ రెండు గంటల వరకే ఉంటాడు. ఆమె అక్కడకు వెళ్ళినప్పుడు మూడు గంటలు అయింది. ఆమె వెళ్ళంగానే చికిత్స జరిగింది. ఎవరో ఆయనను ఆపి పెట్టినట్టుగా ఆయన ఉన్నాడక్కడ.. అప్పుడు భగవంతుని చరణాలపై ఆమె తల శ్రద్ధగా వాలింది.
ఇప్పుడామెకు మొత్తం ఆట అంతా అర్థమయింది. మనస్సులోనే పరమాత్ముని తన తప్పుడు మాటలకు క్షమాపణ కోరింది.
టీవీలో ప్రవచనం వస్తున్నది- భగవంతుడు ఇట్లా అంటాడు-
“నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను. కానీ నీకు దానిని సులువుగా దాటటానికి శక్తిని ఇవ్వగలను. నీ దారిని సరళంగా చేయగలను. కేవలం ధర్మ మార్గంలో సాగుతూ ఉండు. అంతే”
గౌరీ ఇంట్లో దేవ మందిరం వైపు చూసింది- శివుడు నవ్వుతున్నాడు.
*ఝాన్సీలక్ష్మీ* |
|
|
|
వేటూరి వైభవం (కొడుకుల శ్రీనివాస్ ) తెలుగు పాటల ఝరి తెలుగు పద "పాట"వం పాటకి సాహితీ తేజాన్నీ ఉత్తేజాన్ని అద్దిన భావశిఖరి సప్తపది చిత్రంలో రాసిన మరో మణిగీతం నెమలకి నేర్పిన నడకలివి... సినిమాలో సబిత నృత్యం నేర్చుకొని తన తొలి ప్రదర్శన వేళ వచ్చే పాట ఇది. నిజ జీవితంలో అందరు నృత్య కారిణిలు ఈ పాటకి అభినయించిన వాళ్ళే. అంత ప్రాచుర్యం పొందింది. మహదేవన్ స్వరకల్పన..జానకమ్మ గాత్రం వేటూరి సాహిత్యం వెరశి ఓ అద్భుత నృత్యగీతం గా నిలిచి పోయింది. పాట లోకి వెళితే... నాట్యకత్తె తన గొప్పతనాన్ని వర్ణించుకుంటూ నర్తించే సందర్భం. పల్లవి నెమలికి నేర్పిన నడకలివి అని మెదలెట్టారు. నాట్యానికే ఆదిగురువు లాంటి ఆ మయూరానికే నడకలు నేర్పిన దానిని నేనని. మురళికి అందని పలుకులివి అంటే నృత్యం చేస్తున్నప్పుడు వేణువు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆమే చేసే నృత్య వేగానికి మురళీ వాయించడానికి పదాలు స్వరాలు వెతుక్కోవాలిట ఇక్కడ పలుకులంటే మురళీ పలికే పదాలని నృత్య భంగిమలనీ కూడా అర్ధం. శృంగార సంగీతాల సమ్మెళనంతో అభినయించే నా నృత్యం కళ్ళున్న వారందరూ చూసి తీరాలిసిందే అని.శృంగార అంటే అందమైన సౌందర్యమైన అనే అర్ధం కూడా వస్తుంది. మొదటి చరణంలో కలహంస లకిచ్చిన పదగతులు అన్నారు. నిజానికి హంస అనే పక్షి కలియుగంలోనే లేదట. దేవ లోకానికి చెందిన సరస్వతి వాహనం. ధూమ వర్ణ నాసిక శ్వేత వర్ణ దేహిక శారదాంబ వాహిక దేవలోక వీచిక అని సరస్వతీ స్తుతిలో శ్రీనాధుడు వర్ణిస్తాడు. అలాంటి హంసకిచ్చిన పదగతులు నావి. ఇల కోయిల మెచ్చిన స్వరజతులు అంటే ఇల భులోకంలో పాటల రాణి కోయిలమ్మే నా స్వర జతులుని మెచ్చుకుంది తెలుసా అనడం.గతులు నృత్యానికి జతులు సంగీతానికి చెందినవి. ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు అంటె వన్నె కొత్తకొత్త విద్యల నేర్పరి తనం తో కూడిన వెన్నెల కాంతులు ... ఏవేవో కన్నుల కిన్నెరలు అన్నారు. కిన్నెర అంటే దేవ దానవ కిన్నెర కింపురుషులలో కిన్నెర జాతీయులని ఓ అర్ధం. నదీమాత కిన్నెరసాని అనుకుంటే కిన్నెరకి మరో పేరు ప్రకృతి కన్యక అని,.పచ్చని అభయారణ్యాల మధ్యన పక్షుల కిలకిలరావాల సందడితో కొండ కోనలల్లో వంపులు తిరుగుతూ వయ్యారంగా నెమ్మదిగా వడిగా జడిగా ప్రవహించే అందమైన నది. అలాంటి కిన్నెర సాని నా కన్నులలో కొత్త అందాల వెన్నెలతో... కలసి..మెలిసి కళలు విరిసి మెరిసిపోయిన కాళీదాస్ మహాకవి రాసినకావ్యం అభిజ్ఞాన శాకుంతలం లో కావ్య నాయిక శకుంతలను నేను.కల్పనా అనల్ప అంటె కల్పితమైన పాత్ర అయిన అనల్పం కాకుండా కావ్యాలనె శిల్పానికి మణిమేఖలను అన్నారు. మణి అంటే తెలిసిన దే మేఖల అంటే వడ్డాణం. ఆమే ధరించిన వడ్డాణంలో మిలమిల మెరిసి పోయే మణిలాంటిదానినని మరో అర్ధం. చారిత్రాత్మికంగా పరిశీలిస్తె మణిమేఖల తమిళ భాషలో రాసిన పంచ కావ్యాలలో రెండవది.చేరై దేశ రాజు ఆస్ధాన కవి శీతలై శాత్తానార్ అనే తమిళ మహా కవి సంఘ సంస్కరణలు ఆచార వ్యవహారాలు తదితర అంశాలపై రాసిన కావ్యం.కాకతాళీయం ఏమో గాని సినిమా కులాంతర వివాహం కట్టుబాట్లుపైన కాళిదాస్ కల్పన అంటూ తమిళ కవి కావ్యం మణిమేఖలతో పోల్చడం ఒక్క వేటూరికి తప్పా ఇంకెవరికైనా కలలో కూడా అసాధ్యం. రెండో చరణంలో... చిరునవ్వులు అభినవ మల్లికలు సిరిమువ్వలు అభినయ దీపికలు పెద్దగా వివరించనక్కర్లెదు,తెల్లని మల్లెలలాంటి నవ్వు..కాంతులు వెదజల్లె దీపాలలాంటి కాలి గజ్జెల మువ్వల ధ్వనులు.
నీలాల కన్నులలో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు తారాడే వదలకుండా పట్టుకొనే చూపుల్లో వెన్నెల రంగులు కురులు విరిసి అంటె తలనీలాల నల్లగా ఉండే ఆకాశంలో మరులు అంటే ప్రేమ మోహం కోరిక అని ప్రముఖ చిత్రకారుడు రవివర్మ గీసిన చిత్రంలా వాటిసరసన సరి తూగగల సౌందర్యం కల్గిన ఆ చిత్ర లేఖ శశిరేఖను నేనే కదా అని.ఇక్కడ వేటూరి కల్పనా చాతుర్యం చూడండి చిత్రం గీయడానికి కాన్వాస్ బోర్డ్ కావాలి కదా అది ఆకాశం ట...రంగులు కురులలో నలుపు..వెన్నెలలో తెలుపు. ఈ రెండు రంగులలొంచే అన్నీ రంగులు పుట్టించవచ్చు. అలా సప్త వర్ణ శోభిత నవరస భరిత గీతాన్ని మనకందించిన మహానుభావుని కి తెలుగు అక్షరం రుణపడిపోలేదూ.... |
|
|
|
జంధ్యాల పికిల్స్ వారి పద్యపోటీలలో ద్వితీయ బహుమతి పొందిన శ్రీమతి sailaja vijay venkata గారి పద్యాలు. వారికి అభినందనలు శా : స్వాతంత్ర్యోద్యమమందు నాంధ్రధరణిన్ భాసించినారెందరో నేతల్ పేర్కొనలేము వారి ఘనులన్ నీరాజనాల్వారికిన్ చేతాకొప్పగ దుగ్గిరాల నడిపెన్ జీరాలపేరాలలో జాతీయప్రభుతన్ ప్రజల్ తమ నివాసంబుల్ విసర్జించగన్
తే : ప్రజల బీడించి పన్నుల రాసులు గొన దుష్టబుద్ధితో నింగ్లీషు దొరతనమ్ము కలిపె జీరాల పేరాల గ్రామములను నగరపాలికలుగ జేయ నొగి దలంచి
తే : తెల్లదొరల నిర్ణయమును దెల్గువారు పూర్తిగ వ్యతిరేకించిరి పోరు సలుప నిర్ణయించిరి వారికి నేత యయ్యె దుగ్గిరాల గోపాలుడు పగ్గె మీర
తే : పన్నుల బరువు నోపని ప్రజలు తెల్ల దొరల నెదిరించి నిలిచిరి దుగ్గిరాల నాయకత్వాన మరి పన్నులీయ నట్టి ప్రజల యాస్తుల నమ్మిరి ప్రభువు లంత
తే : గాంధి సూచనలను విన్న గ్రామజనులు దూర మేగిరి యూరికి మేర దాటి రామనగరు పేర వెలసె గ్రామ మొకటి యిసుక తిన్నెలపై బుట్టె గృహము లచట |
|
|
|
ప్రాంజలి ప్రభను ఆదరించే వారికి ఒక విన్నపం
google ఫేస్ బుక్ 7 నెలల నుండి అనుమతి కోరిన " ప్రాంజలి ప్రభ" అనుమతి ఇవ్వలేదు
" Warning: This Message Contains Blocked Content
Your message couldn't be sent because it includes content that other people on Facebook have reported as abusive. "
2 0 1 2 నుండి telugu సాహిత్యం మీద వ్రాస్తున్న 11 బ్లాగుల్లో అనేక రచనలు వ్రాసినా తెలుగును గౌరవించే విధముగా గూగల్ వారు అనుమతివ్వటములేదు. కనుక నా కవితలు రేపటి నుండి పొందు పరచ లేను క్షమించ గలరు, గ్రూపులు లేని ఒక రచయతను ఇట్లు మల్లా ప్రగడ రామకృష్ణ, మరొక్కసారి భారత దేశ telugu ప్రజలందరికి ధన్యవాదములు తెలియపరుస్తున్నను.
No comments:
Post a Comment