అభిషేకప్రియ గోవిందా ఆపన్నివారణ గోవిందా రత్నకిరీటా గోవిందా రామానుజనుత గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ఓం శ్రీ గురుభ్యోనమః🏻 ఆగష్టు 4, 2018 శనివారం (స్థిరవాసరే) శ్రీ విళంబి నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మఋతువు ఆషాఢమాసం బహుళపక్షం తిధి :సప్తమి ఉ7.22 తదుపరి అష్టమి నక్షత్రం :అశ్విని ఉ11.31 తదుపరి భరణి యోగం :శూలం ఉ11.41 తదుపరి గండం కరణం :బవ ఉ7.22 తదుపరి బాలువ సా6.56 ఆ తదుపరి కౌలువ సూర్యరాశి :కర్కాటకం చంద్రరాశి : మీనం సూర్యోదయం : 5.42 సూర్యాస్తమయం : 6.39 రాహుకాలం:ఉ9.00 -10.30 యమగండం:మ1.30 -3.00 వర్జ్యం : ఉ7.28 - 9.06 & రా9.02 - 10.37 దుర్ముహూర్తం:ఉ5.42 -7.24 అమృతకాలం:ఉ5.51వరకు శుభమస్తు🏻
నివురు గప్పిన పరువు(కథ)
సాహితీమిత్రులారా!
‘చపాక రపాక చపాక రపాక’
సాయంకాలపు నీరెండలో… నారింజ చెట్ల నీడన వాలుకుర్చీలో కూర్చుని వున్నారు గాదెల్రాజుగారు.
ఆయన ఓ అరచేతిలో… మచ్చుకి తెచ్చిన వడ్లు బంగారపు గింజల్లా మెరుస్తున్నాయి. ఇంకో అరచేయి ఆ గింజలని బిగబట్టి బాగా నలుపుతోంది.గాదెల్రాజుగారు ఇప్పటి వరకూ అలా ఎన్ని బస్తాల వడ్లని నలిపి నాణ్యత చూసారో లెక్కాపత్రం లేదు కానీ… ఖచ్చితంగా చూసే ఉంటారనడానికి కదును గట్టి నలుపెక్కిన ఆయన అరచేతులు సాక్ష్యం చెబుతాయి..
వడ్ల గింజలని నలుపుతున్న ఆయన రెండు అరచేతుల మధ్యా అగ్గిరాజుకుంటున్నట్టు వేడి మొదలయ్యింది.
‘ చపాక రపాక చపాక రపాక ‘ మంటూనలిగిన వడ్లగింజల పొట్టురాలి ముత్యాల్లాంటి బియ్యం బయటపడుతున్నాయి. ఆయన కుర్చీ పక్కనే వున్న పొడవాటి బల్ల మీద కాగితంతో కట్టిన వడ్లగింజల పొట్లాలు చిన్నకుప్పలా పోసి వున్నాయి. ఆ పొట్లాల మీద పెన్సిల్ తో వాటిని పండించిన రైతుల పేర్లు రత్నాల్లా రాసి వున్నాయి.
వెనక నుంచి ఎవరో ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నట్టు… ఆయన కుర్చీముందున్న వాకిట్లో నీడలు కదులుతున్నాయి. కదిలి వస్తున్న నీడలు కుర్చీ వెనకే ఆగి పోవడం గాదెలరాజుగారు గమనించారు. కానీ చేసేపనిని ఆపి వచ్చిందెవరా? అని మాత్రం చూడలేదు. నీడలని బట్టి ఆ వచ్చిన వాళ్ళలో అబద్దం వున్నాడని ఆయన పోల్చుకున్నారు. తనకి అంత దగ్గరకంటా వచ్చే చొరవా దమ్మూ ధైర్యం ఊరిలో ఆ ఒక్కడికే వుంది. వాడు ఆయనకి నమ్మినబంటే కాదు కంచుకవచం కూడా.
” ధరమరాజు గొప్పోడా? దురుయోదనుడు గొప్పోడ్రా?” తల తిప్పకుండానే అడిగారు గాదెల్రాజుగారు వెనకే నిలబడున్న అబద్దాన్ని.
అబద్దం పక్కనే వాడి కూతురు వీరమణి వాళ్ళ నాన్న చేతిని గట్టిగా పట్టుకొని ఉంది. అబద్దం ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా ముందుకు నడిచివచ్చి గాదెల్రాజుగారు చేస్తున్న పనిని కన్నార్పకుండా చూడ్డం మొదలుపెట్టాడు అలవాటుగా. వాడినే అనుసరించింది వీరమణి.
గాదెల్రాజుగారు పెద్దాపురం జరీ అంచుపంచె కట్టి, దానిమీద ఖద్దరుతో కుట్టిన జబ్బల బనీను తొడుక్కున్నారు. ఆయన ఎదురుగా నిలబడ్డ అబద్దం గోచీ పెట్టుకుని అది కనపడకుండా పొడవాటి మల్లు బనీన్ తొడుక్కున్నాడు. ఆ ఇద్దరికీ ఒకే వయస్సుంటుంది. గాదెల్రాజుగారు తను నలుపుతున్న వడ్లగింజల మీదనుంచి చూపు మరల్చి, తనవైపు చూడ్డంతో… అబద్దం తలకి చుట్టిన తలపాగాని విప్పి, గోచీ కనపడకుండా నడుంకి చుట్టుకున్నాడు. చూడ్డానికి ఆ ఇద్దరి బనీన్లూ ఒకే మిషన్ మీద కుట్టినట్టు కనబడుతున్నాయి. గుడ్డ రకంలోనే తేడావుంది. కానీ అది నాణ్యత చూసే వాళ్ళకి తప్ప మామూలోళ్ళకి తెలిసే అవకాశం లేదు.
గాదెల్రాజుగారు ఒకటోరకం దుర్మార్గుడు అంటారు ఆయన గురించి తెలిసినవాళ్ళూ తెలియనివాళ్ళూ కూడా. ఆయనతో ఎవరైనా గొడవ పడితే ఆయన చేతిలో నలిగే వడ్లగింజలకీ వాళ్ళకీ పెద్ద తేడావుండదు. ఒకటే నలుపుడు నలిపేస్తారన్న అపప్రదని ఆయన చిన్నప్పట్నుంచే మూటగట్టుకుని మోసుకు తిరుగుతున్నారు. ఆయన చేసే ప్రతి పనీ బయట ప్రపంచానికి వెంట వెంటనే తెలిసిపోవడానికి అసలు కారణం అబద్దంగాడి అత్యుత్సాహం, దుష్ప్రచారమే. ఆ విషయం ఆనోటా ఈనోటా గాదెల్రాజుగారి చెవిన పడ్డా ఆయన దానిని అంతగా పట్టించుకున్నట్టు కనిపించదు.
మశూచితో గుంటలుపడ్డ గాదెలరాజుగారిమొహంలో… చెదలుకొట్టేసినట్టు దవడలు అసహ్యంగా కనపడుతున్నాయి. ఆయన మొహంలో కాఠిన్యం తప్ప లాలిత్యం ఏ కోశానా కనపడ్డంలేదు. ఒత్తైన కనుబొమ్మలు, చివర మెలితిరిగిన కోరమీసాలు ఆయన మనస్తత్వానికి ప్రతీకల్లాగా వున్నాయి.
ఆయన వడ్లగింజలని నలుపుతుంటే పట్టుపట్టుకీ దవడకండరాలు బిగుస్తూ… వదులవుతూ… వదులవుతూ… బిగుస్తున్నాయి.
అరచేతుల్లో మిలమిల్లాడుతున్న బియ్యాన్ని, ఆయన ఒక చేతిలోంచి మరో చేతిలోకి మార్చి మార్చి పోస్తూ… వస్తున్న పొల్లుని ఉప్ అని ఊదేసి, వాటి నాణ్యతని పరిశీలించి చిన్నపొట్లాంలాగా కట్టారు. పొట్ట చీరితే అక్షరం ముక్కలేని గాదెల్రాజుగారు, ఆ పొట్లం మీద గుర్తుకోసం పెన్సిల్ తో ఏవో రెండు బరుకులు బరికారు. కాగితంలో నలపకుండా మిగిలిన వడ్లని ” దాద్దా… బొబ్బో…” మని పిలుస్తూ కోళ్లకి మేతగా విసిరేసారు.
దండులా వచ్చిన కోళ్ళు వడ్లగింజలని పోటీలుపడి మెక్కుతున్నాయి. అందులో పెట్టలూ పుంజులూ పిల్లలూ నానారకాల వయస్సువీ ఉన్నాయి. ఒకదాని కాళ్ల కింద నుంచి మరొకటి దూరి అవి వడ్లగింజలని దక్కించుకుంటున్నాయి. మేత దొరకని ఒక పెద్ద పుంజు పెడీమని పొడిచి ఓ తన్ను తన్నడంతో… దానికి అడ్దుగా వున్న ఓ నల్ల పెట్ట ‘ కేర్ ‘ మని దూరంగా పారిపోయింది. వెంటనే ఆ సంగతి మరిచిపోయి మళ్ళీ తిరిగొచ్చి గింజల వేటలో పడింది అది. గింజలు కనపడని ఒక ఎర్రపెట్ట అడ్దుగా ఉన్న ఓ పుంజు పిల్లని పుటుకూ మని ముక్కుతో పొడవడంతో అది’ పియ్యాం’ అని అరచి పక్కకి తప్పుకొంది.
ఆ పోట్లాటలనీ కాట్లాటలనీ వినోదంలాగా చూస్తూన్న గాదెల్రాజుగారు చేతుల్లోకి ఇంకో వడ్లగింజల పొట్లాం తీసుకున్నారు.
ధాన్యం వ్యాపారం చేసే గాదెలరాజుగారు రైతులకి కావాల్సిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అరువు మీద ఇచ్చి బదులుగా పంట చేతికి వచ్చాకా… ధాన్యాన్ని కొలిపించుకుంటూ వుంటారు. ఏడాదికి సరిపడా తిండిగింజలుంచుకున్న రైతులు మిగిలిన ధాన్యాన్ని కూడా గాదెల్రాజుగారి గాదుల్లోనే పోసేసి రొక్కం పుచ్చుకుని పోతుంటారు. దానికి ఆయన చెప్పిందే రేటు. ఇచ్చిందే ధర. ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల పదూళ్ళలో ఎవరికి ఎంతడబ్బు అవసరం వచ్చినా గాదెల్రాజుగారి దగ్గర చేతులు కట్టుకు నిలబడాల్సిందే. తీసుకున్న అప్పు వడ్డీ పాయిదాలతో తిరిగి ఇవ్వకపోతే వాళ్ళ ఇంటినో… పొలాన్నో… ఆయన తన పేరిట దఖలు పరిచేసుకొంటారు. దీంతో గాదెల్రాజుగారికి ఆస్తులతోపాటు అంతస్తూ పెరిగింది. ఆయన స్వాధీనం చేసుకున్న ఇల్లన్నీ… ధాన్యం గాదెలుగా మారిపోతే, పొలాలు మాత్రం అమ్మకంతో చేతులు మారిపోతుంటాయి. ‘పొలం ఎప్పుడూ సాగుచేసే వాళ్ల చేతుల్లోనే వుండాలన్నది ఆయన సిధ్ధాంతం. అందుకే ఇల్లు, మేడల మాట ఎలా వున్నా పొలాలని వెంటనే అమ్మేసి చేతులు మార్చేస్తుంటారు. బాకీపడ్డ వాళ్ల దగ్గరనుంచి పొలాలు లాక్కున్నప్పుడు గాదెలరాజుగారు కించిత్తు కూడా చలించరు. నేలని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడని, నేలని నిర్లక్ష్యం చేసినవాడే నాశనమైపోతాడన్నది అయన ప్రగాఢ విశ్వాసం. అధిక దిగుబడినిచ్చే విత్తనాలని అమ్మడంతోపాటూ నూతన వ్యసాయపధ్ధతులనీ గాదెలరాజుగారు రైతులకి నూరిపోస్తుంటారు. వింటే ఒక దణ్ణం. వినకపోతే రెండు దణ్ణాలు. పంట చేతికి వచ్చాకా ధాన్యం తెచ్చి గాదెల్లో పోసారా? లేదా అన్నదే ఆయనకి ముఖ్యం.
గాదెల్రాజుగారు కష్టపడి పైకొచ్చారంటారు కొందరు. జనాన్ని కష్టాల పాల్జేసి బాగుపడ్డాడంటారు ఇంకొందరు. గాదెల్రాజుగారి చిన్నప్పుడే ఆయన తండ్రి చినజగ్గరాజు గారు ఆవు పొడిచి చనిపోయారు. అప్పుడు ఆ ఆవుని… ఓ ఆంబోతు తరుముతోంది. చినజగ్గరాజు గారికీ ఆ ఆంబోతుకీ ఆట్టే పెద్ద తేడాలేదు. ఆడవాసన తగిలితే వావివరసలూ ఉచ్చనీచాలు మరిచిపోయేరకం. అసలు చినజగ్గరాజుగారు ఆవుపొడిచి చావలేదు… అబద్దంగాడి బాబు ఆదిగాడు కత్తితో పొడిచి చంపేస్తే… ఆనేరాన్ని ఆవు మీదకి తోసేసారన్న వాదన కూడా వుంది. అది ఉట్టిదో నిజమో చెప్పడానికి ఆరోజు నుంచి ఈరోజుదాకా ఆదిగాడు ఎవరికీ కనబడలేదు. చిన జగ్గరాజుగారు ఎంత దుర్మార్గుడైనా ఊరిలో మోతుబరి కావడంతో… ముందు ముందు తమకి ఆదిగాడి లాంటి వాళ్ళ వల్ల ఎలాంటి ధిక్కారం ఎదురవకుండా వుండాలని మిగతా మోతుబరులంతా రాజుగారి చావుని… ఆవుకి అంటగట్టి, ఆదిగాడిని అంతమొందించేసారన్న పుకారూ షికారు చేసింది అప్పట్లో. ఆడవాళ్ళని సామ దాన భేధ దండోపాయాలతో తన దారికి తెచ్చుకునే చినజగ్గరాజుగారు ఎన్నో కాపరాలు కూల్చేసారంటారు. ఈ క్రమంలో తాతలనుంచి సంక్రమించిన ఆస్తులన్నిటినీ తగలేసారంటారు.
తండ్రి పోయేక మిగిలిన అరెకరం మడిచెక్కని నమ్ముకోలేక, దాన్ని అమ్ముకొని ఊరొదిలిపోలేక గాదెల్రాజుగారు అనూహ్యంగా ధాన్యం వ్యాపారంలోకి దిగారు. అప్పట్నుంచీ ఆయన అసలుపేరు గణపతిరాజన్న విషయం అంతా మరిచిపోయారు. కలిసొచ్చిన వ్యాపారం కరిగిపోయిన అయన ధనరాశినీ… ఎంతకీ తరగని ధాన్యరాశినీ తిరిగి పోగేసింది. ‘ గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? వాళ్ళబాబు అదో రకం దుర్మార్గుడైతే… ఈ గాదెల్రాజు ఇంకోలాంటి దుర్మార్గుడు. ఇంక ఆయన కొడుకు జగ్గప్పరాజు గురించి చెప్పనే అక్కర్లేదు. పెద్దోళ్ళిద్దరికీ ఏం తీసిపోడు’ అంటూ జనం చెవులు కొరుక్కుంటూ ఉంటారు.
” ఏరా… మొద్దులా అలాగే నిలబడ్డావ్. యా మాట కానడిపోయిందా? నీకూతురేట్రిది? ఎప్పుడూ కంపల్లేదే? ” వడ్లగింజలు చేతిలోకి తీసుకుంటూ ఓ సారి వీరమణినీ, అబద్దాన్నీ మార్చి మార్చి చూసి తిరిగి తమ పనిలో పడ్డారు గాదెల్రాజుగారు .
గాదెల్రాజుగారి అదోలాంటి చూపుకి వీరమణి గుండె ఘొళ్ళు మంది. ఆ గుండెకి గొంగళిపురుగు పాకినప్పటి జలదరింపు కలిగింది.
“అడిగిందానికి జవాబు చెప్పేడవేరా ఎదవా? దురుయోదనుడు గొప్పోడా? ధరమరాజు గొప్పోడ్రా?” తలెత్తకుండానే అసహనంగా గద్దించారు ఆయన.
‘ పచాపచా కరాకరా ‘ వడ్లు నలుగుతున్న శబ్దం.
” బారు మరి చెప్పాలంటేండి, దుర్రోధనుడంతోడు… దుర్రోధనుడైతే, ధరంరాజంతోడు ధరంరాజండే… నా మట్టుకైతే ధరంరాజే గొప్పోడనుకుంట్నానండే…” అన్నాడు అబద్దం.
ఆయన నలపడం ఆపి, నలిగిన వడ్ల మధ్య వున్న పొల్లుని ‘ ఉప్ ‘ అని ఊదేసి …. ” మరి నువ్వేమంటావే పిల్లా? ” అని అడిగారు తలెత్తకుండానే.
వడ్లగింజలని నలుపుతుంటే… బిగుస్తూ విడుతూ ఉన్న గాదెలరాజుగారి దవడకండరాలని చోద్యంలా చూస్తున్న వీరమణి ఉలిక్కి పడింది ఆయన ప్రశ్నకి.
” యాటండే…” అంది నన్నేనా? అన్న అనుమానంతో వాళ్ల నాన్న చేతిమీద చేతిని బిగిస్తూ.
” యే… నువ్వీ లోకంలో లేవేంటీ? మీబాబు ధరమరాజు గొప్పోడంట్నాడు. నువ్వేం అంటావోమరి ”
ఏం జెప్పాలో తెలీక అబద్దం మొహంలోకి చూసింది వీరమణి. ఆ పిల్ల కళ్ళు వడ్డునపడ్డ చేప పిల్లల్లా… గిలగిల్లాడుతున్నాయి.
కాసేపు ఆలోచించి ” నాకు రామాయణం రాదండే…” అనేసింది గబుక్కున.
” హహ్హహ్హ ” తోడేలు నవ్వినట్టు పెద్ద నవ్వు నవ్వేసారు గాదెల్రాజుగారు.
” హిహిహ్హి ” అని ఏడవలేక నవ్వినట్టు నవ్వాడు అబద్దం కూడా.
వాళ్ళలా ఎందుకు నవ్వుతున్నారో… తెలీక ఇద్దరి వైపూ అయోమయంగా చూసింది వీరమణి.
గాదెల్రాజుగారు చేతుల్లోని బియ్యాన్ని పొట్లాం కట్టేసి… మిగిలిన వడ్లని మళ్ళీ కోళ్ళ మీదకి విసిరేసారు. తర్వాత రెండు చేతులనీ వెనక్కి చాపి కుర్చీ అంచున తలకింద పెట్టుకొని సావకాశంగా తండ్రీ కూతుళ్ళ వైపు చూడసాగారు. కాళ్ళని అటూ ఇటూ ఆడిస్తూ.
‘ కొక్కొక్కో’ అంటూ కోళ్ళు పోటీ పడి వడ్లని దక్కించుకుంటున్నాయి. ఓ సారి కోళ్ళ వైపు చూసిన గాదెల్రాజుగారు ” రోయ్ ఆ నల్లపెట్టని పట్టుకోరా ” ఆజ్ఞాపించినట్టు చెప్పారు.
మేత మేస్తున్న నల్లపెట్ట కాళ్ళని వెనక నుంచి పిల్లిలా నక్కి నక్కి వెళ్ళి చాక చక్యంగా పట్టేసాడు అబద్దం. ‘కేర్ కేర్ ‘ మంటోంది అది వాడి చేతుల మధ్య. దాని ‘కేర్ కేర్ ‘ లని పట్టించు కోకుండా మిగతా కోళ్ళు వడ్లగింజలని పోటీపడి తింటున్నాయి.
నల్లపెట్టని తలమీదా మెడమీదా పాముతూ అది అరవకుండా అనునయిస్తున్నాడు అబద్దం.
అబద్దం దృష్టి కోడి మీద వుంటే… గాదెల్రాజుగారి దృష్టి వీరమణి మీద నిలిచింది.
కౌమార్యం కుబుసంవిడిచిన వీరమణి దేహం… యవ్వనపు మిసమిసలని సంతరించుకొంది. దాని వంటి నునుపులో అది తొణికిసలాడుతోంది. గాలికి నారింజ కొమ్మ కదులుతున్నప్పుడల్లా దాని మెడకింద నారింజకాయల నీడలు దోబూచులాడుతున్నాయి.
క్రౌర్యం నిండిన కళ్ళతో గాదెల్రాజుగారు తనని గుచ్చి గుచ్చి చూడడం గమనించిన వీరమణి రెండుభుజాలనీ పైకెత్తి… ఊపిరిని లోపలకి లాక్కొంది.
” ఇన్నాళ్ళెక్కడుంద్రిది … ” అన్నారు గాదెల్రాజుగారు వీరమణి మొహంలోంచి చూపు తిప్పకుండానే.
” రాంపురంలో ఆళ్ళ బాప్ప దగ్గరండె బారు… నర్సమ్మ అవుతానని సర్దా పడతందండే… నా చేతుల్లో ఏముందండి బారు… ”
” అబ్బోస్ అప్పుడే అంత సదుం సదివేసింద్రా? ” ఆశ్చర్యంగా అన్న గాదెల్రాజుగారు ” నర్సమ్మేం కర్మరా ఏకంగా డాట్రమ్మని చేసెయ్యి… ఏవే పిల్లా సదుంతావా? ” అని ప్రశ్నించారు.
ఆయన మాటల్లో అది ప్రోత్సాహమో? లేక ఎకసెక్కమో? అర్థం కాని వీరమణి కళ్ళెత్తి చూడకుండా బొటన వ్రేలితో భూమ్మీద రాస్తూ మౌనంగా ఉండిపోయింది.
” మన సంగతేంటేటండి? ఏదీ కానేళ మా తీరుబడిగా దైచేసారు దొరగారు? ” వెటకారం చేస్తూ అడిగారు అబద్దాన్ని.
అబద్దం రెండు చేతుల మధ్య వున్న కోడిపెట్టని ఒక చేతిలోకి మార్చుకుంటుంటే… అది కువకువలాడింది.
” బారు మరేండి… మా ఇంటిది చేనుగట్టు మీంచి జారి పడిపోయిందికదండే. సున్నం బెల్లం పట్టేసినా రెండ్రోజుల్నుంచి వాపు తియ్యటలేదండే. కాలు కాని ఇరిగిందేవోనని అనుమానంగుందండే. ఆస్పటాల్ కి ఎల్దారంటే చేతిపట్టున ఓ రెండొందలన్నా ఉండాలి కదండి మరి ” నసుగుతూ అన్నాడు.
” రోయ్ నీ తొక్కలో మడి చెక్కమీద ఇప్పుడికి ఎన్నొందలట్టుకు పోయేవో అసలు గుర్తుంద్రా నీకు? నువ్ దాన్ని వందసార్లమ్మినా బాకీ తీరదు తెల్సా ”
” అదేకదండి బారు మరి మన మజ్జిల రొనానుబొందం. రెండొందలిప్పించండి. ఆస్పటాల్ కెల్లొచ్చాకా చూసుకుందారి. కాలిరగడం అబొద్దం అంకుంటారనే దీన్ని సాచ్చికం అట్టుకొచ్చాను. చెప్పవే… బారుకి నువ్వు” అన్నాడు వీరమణి కేసి చూస్తూ.
వీరమణి కళ్ళు భూమిలో పాతేసి… వాళ్ళిద్దరి మాటలూ మౌనంగా వింటోంది తప్ప అవునండని సాక్ష్యం చెప్పలేదు.
” ఏంట్రిది… దీనందవేదో కొరుక్కు తినేత్తనట్టు? మొకం దాచేసుకుంటోంది”
” దానిదంతా ఆళ్ళ మామ్మ పోలికండి బారు . పోలికి మాయెమ్మదైనా ముక్కుచూడండి. ముక్కు… నా ముక్కేనండీ… అచ్చం రాచముక్కు నాగా అంపట్లేదేటండి …” అంటూ వీరమణి మొహాన్ని బలవంతంగా పైకెత్తి చూపించాడు.
” రోయ్ అన్నట్టు… ముసల్ది ఈ మజ్జన కబల్లేదు ఎలా వుంద్రా అది? ఓసార్రమ్మను…” ఆరాగా అడిగారు గాదెల్రాజుగారు అబద్దం వాళ్ళ అమ్మ వీరమ్మ గురించి.
” దానికేవండే… బెమ్మాన్నం. ఈ పెట్టనేం చైమంటారూ? కోసేసి దూసైమంటారా?”
” లండీ కొడకా… ఇంట బుట్టిన దాన్ని కొయ్యమండం నువ్వెప్పుడన్నా విన్నావ్రా? పట్టుకెళ్ళి ముసల్దానికి కోసెట్టు” అన్నారు మీసం మీద వేలితో రాసుకుంటూ.
” మరి నన్నేం చైమంటారు?”
” గోదాట్లో దూకు. ధరమరాజు గొప్పోడనడానికి నీకెన్ని గుండెల్రా? దుర్రోధనుడు గొప్పోడంటే అప్పుడాలోచిందును ” కటువుగా అన్నారు కుర్చీ వెనక నుంచి చేతులు తీసి వళ్ళో పెట్టుకుంటూ.
” బారు మీరే అల్లగంటె నాను ఏవైపోల… అబద్దం ఆడనేక అల్లా చెప్పేసేను కానండి. మీరొవలు గొప్పంటే ఆల్లే గొప్పండి నాకీని. నాపేరే అబద్దం కదండె… నాను చెప్పింది ఎలా నిజవనేసుకున్నారండి బారు… మీరు హిహిహి ” అన్నాడు అబద్దం.
ఇంతలో ఓగుర్రబ్బండి వచ్చి ఇంటి ముందు ఆగింది. బండిలోంచి దిగిన అమ్ములు అక్కడున్న వాళ్ళ వైపు తలన్నా తిప్పి చూడకుండా లోపలకి విసవిసా వెళ్లిపోయింది. అమె నడుస్తుంటే కాలికి ఉన్న బంగారు పట్టీలు ఘళ్ళు ఘళ్ళు మని చప్పుడు చేస్తున్నాయి.
అమ్ములు గాదెల్రాజుగారి ఒక్కగానొక్క కూతురు. ఆమె అసలుపేరు రమాదేవి. రామచంద్రపురంలో బియస్సీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అమ్ములని డాక్టర్ చెయ్యాలని గాదెలరాజుగారికి మహా సరదా. తన కోరిక తీరుతుందో లేదోనన్న దిగులు ఆయనకి ఈ మధ్యనే పట్టుకొంది. రోజూ గుర్రబ్బండిమీద కోలంక దాకా వెళ్లి… అక్కడనుంచి బస్సెక్కి కాలేజీకి వెళ్ళి వస్తూ వుంటుంది అమ్ములు.
” రోయ్… అమ్ముల్ని చూత్తే గుర్తొచ్చింది కానీ. నువ్వు లేపోతే ఎల్రా? రేపు కాకినాడ నుంచి పీడర్లు, డాట్టర్లు, బోల్డంతమంది పెద్ద పెద్దోల్లు బోజనాలకొత్తన్నారు?”
” మరేంజెయ్యమంటారండి బారు ”
” ఆరోగ్గం కన్న ముఖ్యంవేటి? కానీ… నేను పురమాయించుకుంటాను లే. నువ్వెళ్ళి… మందులు కొట్టుకాడ జగ్గప్పకి కనపడు. దీన్ని రేపు మన దేవిడీ కాడకి పంపించు …” చెప్పారు గాదెల్రాజుగారు. వీరమణిని పైనుంచి కిందకి చూస్తూ.
గాదెల్రాజుగారి మాటలు విన్న వీరమణి బాణం దెబ్బ తగిలిన పిట్టలా వణికి పోయింది. దానికి కాళ్ళకింద భూమి అమాంతం దిగిపోతున్నట్టనిపించింది. నీటితెర కమ్మిన కళ్ళతో తలెత్తి అబద్దం మొహంలోకి చూసింది. వాడి మొహంలో ఎలాంటి మార్పూ లేదు. అప్పు దొరికిందన్న ఆనందం తప్ప.
” ఆ పొగరుబోతు భూషణంగాడు ఊబిలో దిగబడి చచ్చాడని చెప్పుకుంటన్నారంట ఊరంతా. మన బాకీ తీర్చలేదని నువ్వే కదరా ఆడ్ని గోదాట్లో ముంచి చంపేసావ్? మనం చేసిన పని మనం చెప్పుకుంటే పాపం పోద్దికదా! ఎల్లుండినుంచా పనిలో వుండు ” చెప్పారు గాదెల్రాజుగారు.
ఓ సారి గాదెల్రాజుగారి కళ్ళల్లోకి చూసిన అబద్దం ” ఆ భూషణంగాడినే కాదండి మనబాకీ ఎగేత్తానంటే… ఎవన్నైనా ఏటుకేసెయ్యనా? మరి దిగడతానండైతే… ” అని చెప్పి ఓ చంకలో కోడిపెట్టని, ఇంకో చేత్తో వీరమణి చేతినీ పట్టుకొన్నాడు అబద్దం.
ఇల్లు దగ్గర పడ్డాకా వీరమణి చేతిని విడిచి పెట్టిన అబద్దం, కోడిపెట్టని పట్టుకుని దూరంగా వున్న తాటి కట్టవలోకి పోయాడు. దాన్ని కోసి దూసెయ్యడానికి. ఒక్క ఉదుటున ఇంట్లోకి పోయి నులకమంచం మీద బొర్లాపడిన వీరమణి… గాదెల్రాజుగారు తనని దేవిడీ దగ్గరకి రమ్మన్న సంగతి తలుచుకుని వెక్కెక్కి ఏడవడం మొదలెట్టింది.
* * *
దేవిడీ అరుగుమీద ఉయ్యాల కుర్చీలో కూర్చున్నారు గాదెల్రాజుగారు. ఎదురుగా వున్న వాలు కుర్చీలో కూర్చుని రుసరుసలాడుతున్నాడు జగ్గప్ప. దాదాపు శిధిల స్థితిలో ఉన్న ఆ దేవిడీ అంటే గాదెల్రాజుగారికి చాలా యిష్టం. తాత ముత్తాతలకి చెందిన ఆ దేవిడీలోనే ఆయన పుట్టారు. పెరిగారు. తండ్రి అమ్మేయడంతో చేతులు మారిన ఆ దేవిడీని తన స్వంత సంపాదనతో తిరిగి మళ్ళీ చేజిక్కించుకున్నారు. ఏ ముఖ్య నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన అక్కడే తీసుకుంటారు. అలా చేస్తే కలసివస్తుందని అదో నమ్మకం. వాకిట్లో కూర్చున్న అబద్దం తడపలతో త్రాడు పేనుతున్నాడు.
” రోజురోజుకీ మన పరువు చంకనాకిపోతోంది” బుసలుకొట్టాడు జగ్గప్ప.
” మరేం చేద్దామయితే ”
” అదింక ఇల్లు కదలడానికి వీల్లేదు”
” ఆ పరిచ్చలేయో అయి పోనీ ”
” అద్దమవదా మీకు? మన కళ్ళుగప్పి రేపో ఎల్లుండో ఆడితో లేచిపోతే… ఉరేసుకొని చావాలి అందరం” అరిచాడు జగ్గప్ప.
” ఆళ్లింట్లో వాళ్ళకి తెలుసో తెలదో… కుర్రోడు చేత్తన్న నిర్వాకం, చెప్పి చూల్లేపోయేవా? ”
” ఏంటి బాజ్జీ… మీచాదస్థం. ఊరందరికీ తెలిస్తేకానీ ఈభాగోతం మనకి తెల్లేదు కదా?” కయ్ మన్నాడు జగ్గప్ప.
గాదెల్రాజుగారు ఆలోచనలో పడ్డారు. ఆయన ఏం చెబుతారా అని జగ్గప్ప, అబద్దం ఇద్దరూ ఎదురుచూస్తున్నారు.
పచ్చగా పసుపుకొమ్ములా వుండే అమ్ములుని గాదెల్రాజుగారి కూతురంటే… ఎవరూ నమ్మలేరు. తనని తాను అమితంగా ప్రేమించుకునే గాదెల్రాజుగారికి తన కంటే కూడా అమ్ములంటేనే ఎక్కువిష్టం. రాచకొంపల్లోని ఆడపిల్లలంతా ఊరి బడి అయిపోగానే పెళ్ళిపీటలు ఎక్కేస్తుంటే… పట్టుబట్టి మరీ అమ్ములుని పట్నంపంపి చదివిస్తున్నారు గాదెలరాజుగారు. అమ్ములుని ఆయన డాక్టర్ ని చెయ్యాలనుకుంటుంటే… పురుషోత్తాన్ని పెళ్ళాడి అతనితో కాపురం చెయ్యాలనుకుంటోంది అమ్ములు. పురుషోత్తం ఆ ఊరి శివాలయం పూజారి శంకరం గారబ్బాయి.
గాదెల్రాజుగారి దుర్మార్గం గురించి తెలిసికూడా పురుషోత్తం అమ్ములుని ధైర్యంగా ప్రేమిస్తున్నాడంటే అర్ధం చేసుకోవచ్చు అమ్ములంటే అతనికి ఎంత అభిమానమో.
” చంపేద్దాం అయితే ” అన్నారు గాదెల్రాజుగారు ఆలోచనల్లోంచి బయటపడి.
” అవును చం…పే..ద్దాం. ” స్థిరంగా పలికింది ఆయన గొంతు.
ఆయన మాటలకి అబద్దం కళ్ళు ఉన్మాదంతో మెరిసాయి. జగ్గప్ప ఏమీ మాట్లాడలేదు. అయితే చంపేది ఒక్కరినేనా? లేక ఇద్దరినీనా అన్న సందేహం మాత్రం అతనికి వచ్చింది.
* * *
” రాములోరు గొప్పోరా? రావణాబెమ్మ గొప్పోడ్రా? ” అడిగారు వాలు కుర్చీలో కూర్చున్న గాదెల రాజుగారు.
ఆయన ఎదురుగా అప్పుకోసం వచ్చి అరుగుమీద చాపపై కూర్చున్న రుద్రరాజు సుబ్బరాజూ, కలిదిండి సూరపరాజూ ముఖముఖాలు చూసుకున్నారు. ఇద్దరిలో ఎవరిని ఆ ప్రశ్న అడిగారో? ఎవరు ఏం చెబితే … ఏం తంటా వస్తుందో అన్న సందిగ్ధం వాళ్ళిద్దరి మొహాల్లోనూ కనిపిస్తోంది.
‘ చపాక రపాక చపాక రపాక ‘
గాదెల్రాజుగారి చేతుల మధ్య మచ్చుకి తెచ్చిన వడ్లగింజలు నలుగుతున్నాయి.
వాళ్ళని రక్షించడానికా అన్నట్టు పూజారి శంకరం గారు అక్కడకి అడుగు పెట్టారు. ఆయన రాకని గమనించిన గాదెలరాజుగారు కుర్చీలోంచి మర్యాదగా లేచినిలబడ్డారు. ఆయనతోపాటూ చాపమీది ఇద్దరూ కూడా లేచారు.
“అయ్యగారు ఏదో పనిమీద వచ్చినట్టున్నారు. మాట్లాడి పంపించండి అయితే. మేం సాయంకాలం వస్తాం ” అంటూ అరుగు దిగాడు సుబ్బరాజు. పదరా అన్నట్టు సూరపరాజు భుజం మీద చెయ్యేసి.
పూజారి శకరంగారికి కుర్చీ చూపించి, తరవాత తన వాలు కుర్చీలో కూర్చున్నారు గాదెలరాజుగారు.
ఆయన చేతుల్లో నలుగుతున్న వడ్లగింజలని అభావంగా చూస్తున్నారు శంకరంగారు.
అబద్దం వాకిట్లో అటూ ఇటూ పచార్లు చేస్తూ… చేతిలో ఉన్న చేపాటి కర్రని గాల్లో పల్టీలు కొట్టిస్తూ… కర్ర స్వాము సాధన చేస్తున్నాడు.
” బాబుగారు కనిపించమన్నారంటేను… ” గొంతు సవరించుకొన్నారు శంకరంగారు.
” అయ్యా! ఇయ్యి మీధాంజమేనండి… ” చెప్పారు గాదెల్రాజుగారు చేతిలోని పొల్లుని ఊదుతూ.
బియ్యం గింజలన్నిటినీ ఒకే చేతిలో పోసుకొని… అందులోంచి కొన్ని గింజలని వేరు చేసి తీసారు ఆయన. ” కేళీ ఎక్కువుంది పూజారిగారూ మీ సరుకులో. అందుకే నేను అందరికీ చెబుతుంటాను. చేలో కలుపు మందు కొడితే సరిపోదురా! పొలవంతా కలదిరిగి రెండో రకం దుబ్బులని లాగి పారేయండ్రా అని. ఇంటారా? ఇనరు. ఇనాపోతే ఎలాగుంటదో చూడండి ” అని తను ఏరిన రెండురకాల గింజలనీ శంకరం గారి చేతుల్లో పోసారు.
శంకరంగారు ఆ గింజలని పరీక్షగా చూసారు. గాదెలరాజుగారు చెప్పింది నిజమే. ఓ చేతిలో గింజలు పొట్టిగానూ… రెండో చేతిలో గింజలు పొడుగ్గానూ వున్నాయి.
“ ఏర్రా ఆళ్ళిద్దరూనూ ” అటూ ఇటూ చూస్తూ అన్నారు గాదెలరాజుగారు.
” ఎల్లిపోరండే… ” చెప్పాడు అబద్దం.
” ప్రశ్నకి సమాధానం చెప్పకుండా పోయారేంట్రా పనికిమాలినెధవలు? పోతే పోన్లే… మన పూజారిగారిని అడుగుదాం. ఆయనకి తెలని ధరమం ఏం వుంటది గనక ”
అనుమానంగా చూసారు శంకరంగారు గాదెల్రాజుగారి వైపు.
” అయ్యిలా ఇయ్యండింక ” అని ఆ బియ్యాన్ని పొట్లాం గట్టిన గాదెలరాజుగారు “మీకు తెలంది ఏం వుంది పూజారిగారూ. నాకు ధరమ సందేహాలెక్కువ కదా? రాములోరు గొప్పోరా… రావణాబెమ్మ గొప్పోడా? అని అనుమానమొచ్చి… మన కుర్ర సన్నాసుల్ని అడిగితే చెప్పకుండానే పారి పోయేరు. మీరన్నా చెప్పండి రాములోరు గొప్పోరా? రావణాబెమ్మ గొప్పోడా?”
శంకరంగారు ఆలోచనలో పడ్డారు. గాదెలరాజుగారి సంగతి ఆయనకి తెలియందికాదు. తనని ఎందుకు పిలిపించారో తెలీనంత అమాయకులూ కాదు ఆయన.
అబద్దం చేతిలో చేపాటి కర్ర… మొదలు లావుగానూ చివర సన్నగానూ వుంది. ” బారు చూడండి… సరింగా ఈ మొదలు బొడ్లో లటక్కున దూరిపోయేలా వట్రం చేసేను. బొడ్లో ఎట్టి అలా తిప్పుతుంటే కడుపులో పేగులు లుంగచుట్టుకు పోయి రక్తం కక్కుకుని చావాల్సిందే ఎంత బలమంతులైనా? సరిపోద్దంటారా ఇంకొంచెం వట్రం చైమంటారా? ” అంటూ కర్ర తెచ్చి గాదెల్రాజుగారి కుర్చీ దగ్గర పెట్టాడు.
” ఎదవా ఎప్పుడూ చంపడం సరదాయే నీకు. ఏటోనండి, ఈడికి చంపమని చెబితే అది కోడా? మనిషా? అని కూడా చూడ్డండి బండెదవ. దానికేం లెండి. నేను అడిగిందానికి జవాబు చెప్పేరు కారు”
” మనిషి మనిషే. రాక్షసుడు రాక్షసుడే. వారిద్దరిలో మానవజాతి ఒకరిది. దానవజాతి ఇంకొకరిది. జాతులని బట్టి వారు అనుసరించే రీతులు వుంటాయి. రీతులని బట్టి వాళ్ళు ఆచరించే ధర్మాలు ఏర్పడతాయి. భిన్న జాతులకి చెందిన వారిద్దరిలో ఎవరు ఉత్తములు అని ప్రశ్నించుకోవడం అవివేకం. సాహసించి చెప్పబూనడం దుస్సాహసం. మీకొచ్చింది ధర్మసందేహమే అయితే… అందులో మీకు నచ్చినవారు ఏ ధర్మాన్ని పాటించారో మీరూ అదే ధర్మాన్ని పాటించడం ఉత్తమం ” చెప్పారు శంకరంగారు ధృడంగా.
మౌనంగా విన్న గాదెల్రాజుగారు గాల్లోకి చూస్తూ తల పంకించారు. ఆయన ఎవరినైనా ప్రశ్నిస్తే… ఏదో సమాధానం చెప్పి ఎలాగోలా తప్పించుకునే వారే కానీ, ఇలా తర్కించి మెప్పించి ఒప్పించాలని చూసిన వాళ్ళు ఇప్పటి వరకూ కనపడ లేదు.
” రోయ్ ”
” బారు ” అన్నాడు దూరంనుంచే అబద్దం.
” పూజారిగారిని రోడ్డుదాకా దిగబెట్టి రారా ”
” సెలవిప్పించండి మరి ” చెప్పి లేచారు శంకరం గారు.
తూర్పుగాలి తిరిగింది.
గోదావరికి వరద తగులుతున్న సూచనగా నీరు ఎర్రగా కలకబారింది.
గోధూళివేళ కొత్తగోదావరిని చూడ్డానికి ఏటిగట్టుకి వెళ్ళింది అమ్ములు.
ఆ వెళ్ళడం వెళ్ళడం … మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు.
రోజు
రెండురోజులు గడిచాయి.
ఏటిగట్టుకి సమాంతరంగా ఉప్పొంగిన గోదావరి మూడో రోజుకి ఉధృతి తగ్గింది. నాలుగోరోజుకి మొత్తం నీరు లాగేసి బురద మాత్రమే మిగిలింది.
కట్రాటలకి కట్టేసిన పశువులని విప్పారు పాలేర్లు. ఏటిగట్టుకి కింద రెల్లుదుబ్బుల్లో మట్టికొట్టుకుపోయిన అమ్ములు ఓణీ పీలికలై కనిపించింది. ఒండ్రుమట్టిలో కూరుకుపోయి తళుక్కుమంటూ బంగారుపట్టీ కనిపించింది. అంతకు మించి ఏ ఆనవాళ్ళూ దొరకలేదు.
గాదెల్రాజుగారికి పరామర్శలు వెల్లువెత్తాయి.
ఆయన మొహంలో ఎలాంటి విచారం లేదు. కంటి నుంచి చుక్క నీరు రాలిన పాపాన పోలేదు.
నారింజ చెట్లనీడలో… వాలు కుర్చీలో కూర్చుని ఉంటున్న ఆయన, వరదకి ముందు కురిసిన వర్షానికి అక్కడక్కడా పడి మొలకలెత్తిన వడ్ల గింజలని చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.ఆ పచ్చటి మొలకలకి పైన వ్రేల్లాడుతున్న ధాన్యపు పొల్లు కిరీటాల్లాగా కనిపిస్తున్నాయి.
రెండుమూడురోజుల తరవాత పోలీసులకి ఓ ఆకాశరామన్న ఉత్తరం అందింది.
గాదెల్రాజుగారి అమ్మాయి రమాదేవి ప్రమాద వశాత్తు వరదలో కొట్టుకుపోలేదు. పూజారిగారబ్బాయి పురుషోత్తంతో లేచిపోతుంటే… అబద్దమూ , జగ్గప్పా కలిసి ఇద్దరినీ బొడ్లో కర్రపెట్టి తిప్పి చంపేసారని.
పోలీసులు వచ్చారు. వాళ్ల దగ్గర పవరుంటే… గాదెల్రాజుగారి దగ్గర డబ్బుంది. పోలీసులకి ఏం చెప్పారో? మరి ఏం ఇచ్చారో? తెలీదుకానీ వాళ్ళు ఎవరినీ ప్రశ్నించకుండానే వెళ్ళిపోయారు. పురుషోత్తం కనపడ్డం లేదని… పోలీసులు వెళ్లి… ఫిర్యాధు ఇమ్మని చెప్పినా , వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ స్పందించలేదు.
అబద్దం చేతిలో ఉన్న చేపాటికర్రని చూస్తుంటే జనం వణికి పోతున్నారు. వాడు యమభటుడిలా కనిపిస్తుంటే… వాడి కర్ర యమపాశంలా కనిపిస్తోంది అందరికీ. వాడిచేతిలో కర్ర ఊగుతుంటే… పేగులు లుంగచుట్టుకుపోతూ ప్రాణభయంతో విలవిల్లాడుతూ ఆర్తనాదాలు చేస్తోన్న అమ్ములూ పురుషోత్తంలే కళ్ళ ముందు కదలాడుతున్నారు జనానికి.
*
రోజులు నెలల్లోకీ …
నెలలు సంవత్సరాల్లోకీ మారిపోతున్నాయి.
జనం అమ్ములూ పురుషోత్తంల ప్రేమకధని క్రమంగా మర్చిపోయినా… గాదెలరాజుగారి దుర్మార్గాన్ని మాత్రం మర్చిపోవడంలేదు. వెదవ పరువుకోసం, బంగారంలాంటి కూతుర్ని చంపించేసాడు దుర్మార్గుడు. ఇంతకి ఇంతా అనుభవించి చస్తాడు అని శపిస్తూనే ఉన్నారు. వాళ్ల శాపాలు ఫలించిన పాపాన పోవడం లేదు. ప్రతి ఏటా గాదెలరాజుగారి కుటుంబం రెండునెలలు ఉత్తరదేశ యాత్రలకి వెళ్లి వస్తూ… జనం శాపాలకి విమోచనం చేసుకుంటోంది. పుత్రుడి జాడ తెలీక పుట్టెడు దు:ఖంలో వున్న పూజారిగారి కుటుంబాన్ని కూడా గాదెల్రాజుగారు తమ కూడా తీసుకెళ్లి తీర్ధయాత్రలు చేయిస్తూ బ్రహ్మహత్యాపాతకాన్ని కడిగేసుకుంటున్నారు.
‘ తీసుకెళ్లేవాడికి బుద్ది లేకపోతే, తోకూపుకుంటూ కూడా వెళ్ళేవాళ్ల కయినా బుద్ది ఉండక్కర్లేదా ?’ అని జనం బుగ్గలు నొక్కుకుంటున్నారు.
ఏళ్లకి ఏళ్లు… ఏడేళ్లు గడిచిపోయాయి.
అబద్దం కూతురు వీరమణి డాక్టర్ వీరమణిగా ఊరికి తిరిగొచ్చింది. దేవిడీని ఆసుపత్రిగా మార్చేసి వీరమణికి అప్పగించారు గాదెల్రాజుగారు. రమాదేవిని డాక్టర్ గా చూడాలనుకున్న గాదెలరాజుగారు వీరమణిని డాక్టర్ గా చూడగలిగారు.
కళ్ళెదురుగా డాక్టర్ కనిపిస్తూండడంతో చిత్రంగా రోజుకో రోగం పుట్టుకురావడం మొదలయ్యింది ఆయనకి.
” అప్పివ్వడానికి మా గాదెలబారున్నారు… వైద్యం చేయడానికి మా వీరమనొచ్చేసింది. ఇంతకంటే ఊరికేం కావాల” కనిపించిన ప్రతివాళ్ళనీ ప్రశ్నిస్తూ తిరుగుతున్నాడు అబద్దం.
” ఇగో డాట్రమ్మ, కృష్ణుడు గొప్పోడా… కర్ణుడు గొప్పోడా? ” అడిగారు గాదెల్రాజుగారు నాడి చూస్తున్న డాక్టర్ వీరమణిని.
” వాళ్ళ మాటేమో కానీ… నాకు తెలిసి గాదెలరాజుగారంతటి గొప్పోరు లేరండి ఈలోకంలో ” అంది డాక్టర్ వీరమణి. అలా అంటుంటే… ఆమె గొంతు పూడుకుపోయింది. చూపుకి నీటిపొర అడ్డుపడింది. ” పరువుని హత్య చేసుకొని… ” గొంతు సర్ధుకొని వీరమణి ఏదో చెప్పబోతుంటే… అడ్డుకున్న గాదెల్రాజుగారు ” అన్నట్టు నీకు రామాయణం రాదు కదా… నిన్నీ పెశ్న అడగడం నాదే పొరపాటు డాట్రూ…” అన్నారు.
డాక్టర్ వీరమణికి ఒకప్పటి సంగతి గుర్తుకు వచ్చి మొహాన చిరునవ్వు అలుముకుంది. అబద్దం మాత్రం ’హహ్హహ్హా ‘ అంటూ పెద్దగా నవ్వడం మొదలెట్టాడు.
-----------------------------------------------------------
రచన - చిరంజీవివర్మ అనే వత్సవాయి చిట్టి వెంకటపతిరాజు, వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో
-----------------------------------------------------------
sekarana - ఏ.వి.రమణరాజు
|
No comments:
Post a Comment