Tuesday, 29 May 2018

ప్రాంజలి ప్రభ (1-06-2018)



వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము 

7. ఆత్మదర్శనము 
ఆధ్యాత్మిక శాస్త్రమును విచార పూర్వకముగ గ్రహించి ఆత్మతత్వమును సాక్షాత్కరింప జేసుకొనిన, మానస వ్యాధులు దహింపబడగలవు. జ్ఞాని ప్రశ్నించువాని అర్హతను బట్టి బోధించవలెను. అలానే ప్రశ్నించువాడు తగిన జ్ఞానినే ప్రశ్నించవలెను. మొదట చంచలమగు ఈ మనస్సును శుద్ధమొనర్చుకొనవలెను. అందులకు నిరంతరము సాధువుల సంగమ మొనర్చవలెను. 1) శమము 2) విచారము 3) సంతోషము 4) సాధుసంగమము. ఈ నాలుగు మోక్ష ద్వారమునకు ద్వారపాలకులు వాటిలో ఏ ఒక్కటైననూ వశపర్చుకొనిన, మిగిలినవి కూడ క్రమముగ లోబడును. శాస్త్రము, జ్ఞానము, తపస్సు, శ్రుతి వలననే యోగ్యత లభించును. మనస్సును రజస్తమోగుణ రహితమొనర్చి సత్వ గుణము సంపాదించుకొనవలెను. సంసార సాగరమును తప్పించుకొననిచో, నరకములో అనేక క్లేశముల ననుభవించవలసి వచ్చును. కత్తితో నరకబడుట, కొండ నుండి త్రోయబడుట, రాళ్ళతో మోదబడుట,నిప్పుచే కాల్చబడుట, అవయవములు కత్తిరించబడుట, ముళ్ళలో త్రోయబడుట, తల నరుకబడుట మొదలగు అనేక కష్టముల ననుభవించవలెను. అందువలన శాస్త్రవిచారము ద్వారా, జ్ఞానము ద్వారా నరకము నుండి తప్పించుకొనవలెను. అట్టివారు శోకింపరు. దేనిని కోరరు. శుభాశుభముల నర్ధింపరు. శాస్త్ర సమ్మతమైనవే కాని, శాస్త్ర విరుద్ధ కర్మలనొనర్చరు. పవిత్రతతో వసించి సన్మార్గ వర్తనులై జీవించెదరు. సుఖములననుభవింతురు. వీరు మాయను జయించినవారు. ఆత్మదర్శనమే వీరికి అట్టి స్థితిని కల్పించినది. అభ్యాసము వలన అనుభవము పొంది, శాస్త్రానుశీలముగా, దానిని ఉపాసించుచు జ్ఞానమును పొందిన వాడే, ఆత్మదర్శనము పొందగలడు. సంసార బంధములు తెగాలంటే గురువు, శాస్త్రము అను ప్రమాణముల ద్వారా ఆత్మ స్వరూపము నెఱగి, మహర్షులవలె జీవన్ముక్తులు కాగలరు. అనంతరము క్లేశహీనమగు మోక్షమును పొందుట కొరకే వివేకి ప్రయత్నింప వలెను. ముల్లోకములందు మోక్షము కంటే సుఖము వేరొకటి లేదు, ఇంద్రియ సుఖములు, స్వర్గసుఖములు వీనికి సరిపోవు. అందుకు ధనము బంధుమిత్రులు, తీర్ధయాత్రలు, 
ఉపవాసములు, ఏ మాత్రము తోడ్పడజాలవు. శాంతి సంతోషము ద్వారా, మనోజయము ద్వారా ఆనందమును పొందవలెను. ముక్తినందిన వాని మనస్సు నిర్మలము, యత్నశూన్యము వాంఛాశూన్యము అయిన; వాడు ఎద్దానిని కోరడు, పరిత్యజించడు, కర్మల యొక్క ఫలమును పొందడు. 
శమము ద్వారా శత్రువులు కూడ మిత్రులగుదురు. శమము వలన లభించు సుఖము, ఇంద్ర పదవియందు కాని, విష్ణు పదవియందు కాని లభించదు. శ్రమశాలియగు పురుషుని పిశాచములు, రాక్షసులు, దెయ్యాలు, విరోధులు, పాములు, పులులు గూడ ద్వేషింపవు. అలాగే విచారము వలన సంసారమను భూతము, మనోమోహము వలన కల్పింపబడినదని, దుఃఖమును కల్గించునవని తెలియుచున్నది. ఆత్మదర్శనము పొందిన యోగులు, జీవన్ముక్తులై సంచరించుచూ చాలా కాలము జీవించి పిదప ఉపాధి లేశమును కూడ పరిత్యజించి విదేహ ముక్తిని పొందుదురు. విచారము నుండి తత్వజ్ఞానమును, అందుండి ఆత్మ విశ్రాంతియు, తద్వారా మనశ్యాంతి లభించి దుఃఖము నశించును. మిగిలినది సంతోషమే. సంతోషము వలన మనోవ్యాధులు, శారీరక వ్యాధులు కలుగవు. ఇట్టి వారు నిరుపేదయైనను సామ్రాజ్య సుఖమనుభవించును. 
సాధుసంగమము కూడ నరులకు సంసార సాగరమును దాటుటకు తోడ్పడును. సాధు సంగమము వలన బుద్ధి వర్ధిల్లును. అజ్ఞానమను చెట్టు ఛేధించబడును. మనో వ్యాధులు నశించును. ఈ విధముగా సంతోషము, సాధుసంగమము, విచారము, శమము, ఇవియే నరులకు సంసార సముద్రమును దాటుటకు ఉపాయములు. ఈ నాల్గింటిలో ఏ ఒక్కటైన అభ్యసించిన మిగిలినవన్నియు లభించినట్లే భావించాలి. ప్రతి వ్యక్తికి వివేక అభ్యాస మొక్కటియే అవసరము. అభ్యాస రహితమైన ఏ విద్యయు ఫలము నొసంగజాలదు. 
శాస్త్రము పఠించిన వాని మనస్సు బుద్ధి రత్న దీపశిఖవలె ప్రకాశించి, మోహమును, అజ్ఞానమును బాపి బ్రాహ్మ పదార్ధమును తదితరమును చక్కగ తోపింపజేయును. కవచ ధారిని బాణములు కొట్టజాలనట్లు, దైన్య దారిద్య్ర దోషములలో నిండిన సంసార సృష్టి, ఈ శాస్త్రవేత్తను ఛేదింపజాలవు. జన్మ ముందా? కర్మ ముందా? దైవం ముందా? లేక పురుషాకారము ముందా? విత్తు ముందా? చెట్టు ముందా? మొదలగు సంశయములు పగటి యందు రాత్రివలె, తత్వజ్ఞుని ముందు దూరమగును. ఈ గ్రంథమును విని మనన పూర్వకముగ అర్ధము గ్రహించగల్గిన, మోక్ష విషయమున ధ్యాన జపాదులు వుపయోగబడవు. సంసారతాప శాంతి నొసగు జ్ఞానమును, పొందగోరు వారు, ఈ శాస్త్రముతో పాటు, సుఖాసనము, లభ్యభోగము, సదాచారములు సత్సంగము, ఇతర శాస్త్రములైన ఉపనిష్పత్తులు, మోక్ష ధర్మము మొదలగునవి పఠించుట వలన, గొప్ప జ్ఞానము లభించి పునర్జన్మ తొలగును. మరల యోని యంత్రమునబడ నక్కరలేదు. కాంచిన విషయము సాదృశ్యము వలన, కాంచనట్టి విషయమును గ్రహించి తోడ్పడును. ఒక్క పరబ్రహ్మమునకుతప్ప, తక్కిన ఉపమానోపమేయ పదార్ధములన్నింటి యందు కార్యాకారణ భావమున్నది. అలాగే బ్రహ్మ బోదనిమిత్తముగ్రహింపబడుఉపమానములన్నియు, స్వప్నమున గాంచు వస్తువులవలెమిథ్యయగు జగత్తునకు చెందినవే అని గ్రహింపనగును. 
సువర్ణము వలన వివిధ ఆకారములు ఏర్పడినట్లు, బ్రహ్మము వివిధ వికారములు పొందదు. సువర్ణము వస్తువులుగా మారునపుడు రాగి టంకము మొదలగు వికృతులు చేరును. గాని బ్రహ్మములో ఎట్టి మార్పు సంభవించదు. కేవలము కాంతి వలననే వస్తువులు గాంచవీలైనట్లు, బ్రహ్మము వలననే వస్తువులు ఏర్పడును. జీవ బ్రహ్మముల గ్రహింప నుపయోగపడు దృష్టాంతము నెఱగిన, అఖండాకార చిత్తవృత్తి ఉదయించును. అలానే మహా వాక్యార్ధ బోధ వలన, ఆత్మతత్వము స్ఫురించును. ఈ స్ఫురణ వలన అజ్ఞానము, దాని కార్యము నశించిపోవును. అదియే నిర్వాణము. 
ఆత్మ విశ్రాంతి లభించు వరకు శాస్త్రోపదేశము, సౌజన్య ప్రభావము, సాధు సంగమముల నాశ్రయించి, ధర్మార్ధములను, పురుషార్ధములను సంపాదించవలెను. తదుపరి శాస్త్రార్ధమును గ్రహించి, విచార పరాయణుడవవలెను. అపుడే తురీయపదమైన శాంతి లభించును. మనస్సు శూన్యమైనపుడు, జ్ఞానేంద్రియములు తమ పనులు నెరవేర్చుచున్నను కర్మఫలమంటదు. నెరవేర్చకపోయినను ఫరవాలేదు. మనస్సు లేని కార్యములకు సంస్కారముండదు. యంత్రములు నడపనిచో నడవనట్లు మనస్సు యత్నము శూన్యమైనపుడు, శాంతించిన కర్మేంద్రియములు కర్మల నొనరింపజాలవు. విషయ వాసనలు లేనిచో మనస్సు శాంతించును. అపుడు కర్మలతో పని లేదు. ఉపాసకుడు, ఇంద్రియములను జయించి శూరుడని పేర్గాంచి, దైవమును దూరముగ పరిత్యజింప, పౌరుష ప్రభావమున, నిజహృదయముననే బ్రహ్మసాక్షాత్కారమునొందును. స్వీయబుద్ధి బలము వలన అనంత బ్రహ్మమును సాక్షాత్కరింప జేసుకొను వరకు ఆచార్యుల ప్రమాణ సిద్ధ సత్యమతము ననుసరించవలెను. తత్వ విచారము నొనర్పవలెను.


---------------------------------శుభోదయం --------------------------------------------
"Truth,Purity,unselfishness:-- Where ever these are present there is no power bellow or above the sun - to crush the possession there.Equipped with these one individual face the whole universe in opposition. SWAMY VIVEKANANDA.
సత్యము, పవిత్రత,నిస్వార్థము-- ఈ సుగుణాలున్న వాడిని అణగద్రోక్క గల సామర్థ్యం ముల్లోకాలలో ఎవరికీ లేదు. అలాంటి సుగుణ సంపన్నుడు విశ్వమంతా ఏకమైనా ఒంటరిగా ఎదిరించ గలుగుతాడు.
స్వామి వివేకానంద

అతనికి వార్ధి కుల్య యగు నగ్ని జలంబగు మేరు శైల మం
చిత శిలలీల నుండు మద సింహము జింక తెరంగు దాల్చు గో
పిత ఫణి పూలదండ యగు భీష్మ విషంబు సుధారసం బగున్
క్షితి జన సమ్మతం బగు సుశీల మదెవ్వని యందు శోభిలున్ (భర్తృహరి సుభాషితము)
తా:-- భూమిలోనున్న సుజనులు అందరూ ఒప్పుకునే సుగుణాలు ఎవ్వరి యందు ఉంటాయో ,అతనికి
సముద్రము పిల్లకాలువతో సమానమవుతుంది,అగ్ని నీటి తో సమానమవుతుంది,మేరు పర్వతము చిన్న రాయి లాగ కనబడుతుంది,మద సింహము జింక లాగా ప్రవర్తిస్తుంది,కోపముతోనుండు పాము గూడ పూలదండ అయిపోతుంది,భయంకరమైన విషము అమృతము లా తయారవుతుంది,



No comments:

Post a Comment