Saturday, 17 July 2021

హాస్యప్రభ


 



శ్రీ శివ మహాపురాణం - 251 వ అధ్యాయం

అవధూతేశ్వరావతారము

నందీశ్వరుడు ఇట్లు పలికెను -


బ్రహ్మపుత్రుడవగు ఓ సనత్కుమారా ! నీవు ఇపుడు పరమేశ్వరుని అవధూతేశ్వరుడు అను పేరుతో ప్రసిద్ధిని గాంచిన అవతారమును గురించి వినుము. ఈ అవతారములో శివుడు ఇంద్రుని గర్వమును అణచినాడు. ఓ మహర్షీ! పూర్వము ఇంద్రుడు సకలదేవతలతో మరియు బృహస్పతితో గూడి శివుని దర్శనము కొరకై కైలాసమునకు వెళ్లెను. అపుడు అనేకలీలలను చేసే శంకరుడు, ఆ ఇంద్రబృహస్పతులు ఇద్దరు తన దర్శనమునందు ప్రీతితో నిండిన మనస్సులు గలవారై బయలు దేరినారని తెలిసి వారి భక్తిని పరీక్షించుట కొరకై అవధూతరూపమును దాల్చెను. దిగంబరుడగు ఆ అవధూత జ్వలించే అగ్ని వలె ప్రకాశిస్తూ గొప్ప భయమును గొల్పుచుండెను. సత్పురుషులకు శరణు అగు శంభుడు ఆ అవధూత రూపములో ప్రకాశించువాడై మార్గమునకు అడ్డుగా నిలిచెను. ఆయన భుజమునుండి ఉత్తరీయము వ్రేలాడుచుండెను. అపుడు శివుని సన్నిధికి వెళ్లుచున్న ఆ ఇంద్రబృహస్పతులు మార్గమధ్యములో ఆశ్చర్యమును కలిగించే ఆకారముతో భయమును గొల్పుచున్న ఒక పురుషుని చూచిరి. అపుడు తన అధికారముచే గర్వించియున్న ఇంద్రుడు తన దారికి అడ్డుగా నిలబడియున్న పురుషుడు శంకరుడేనని తెలియక, ఆయనను ఇట్లు ప్రశ్నించెను.


శుక్రుడు ఇట్లు పలికెను -


దిగంబరాకారుకడవగు ఓయీ అవధూతా! నీవెవరివి? ఎక్కడనుండి వచ్చితివి? నీప్రసిద్ధమైన పేరు ఏది? నాకు వెంటనే ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము. శంభుడు తన స్థానములోనున్నాడా? లేక ఇప్పుడు ఎక్కడికైన వెళ్లినాడా? నేను దేవతలతో మరియు బృహస్పతితో గూడి ఆయన దర్శనము కొరకై వెళ్లుచున్నాను.


నందీశ్వరుడు ఇట్లు పలికెను -


లీలా కొరకై ఆ అవధూతవేషమును దాల్చియున్న ఆ శంకరప్రభుడు ఇంద్రుని గర్వమును అణచవలెనని తలచెను. ఇంద్రుడు ఈ విధముగా ప్రశ్నించగా, ఆయన బదులు చెప్పలేదు. ఎవ్వరి చేతనైననూ తెలియబడని స్వరూపము గలవాడు, గొప్ప ఉత్కంఠను రేకెత్తించే లీలలను ప్రదర్శించువాడు నగు శంభుడు దిగంబరాకారములోనున్నవాడై, ఇంద్రుడు మరల ప్రశ్నంచిననూ సమాధానము చెప్పలేదు. ముల్లోకములకు అధిపతి, స్వర్గలోకాధ్యక్షుడు అగు ఇంద్రుడు మరల ప్రశ్నించెను. కాని గొప్ప లీలలను ప్రదర్శించే ఆ మహాయోగి మిన్నకుండెను. ఈవిధముగా ఇంద్రుడు ఆ దిగంబరుని పలు మార్లు ప్రశ్నించిననూ, ఇంద్రుని గర్వమును అణచవలెనని తలపోసిన భగవానుడు ఏమియు సమాధానమును చెప్పలేదు. అపుడు తన ఐశ్వర్యమును చూచి గర్వించియున్న, ముల్లోకములకు అదిపతియగు ఇంద్రుడు కోపించి జటాధారియగు ఆ అవధూతను భయపెడుతూ ఇట్లు పలికెను.


ఇంద్రుడు ఇట్లు పలికెను -


ఓ మూర్ఖా! దుర్బుద్ధీ! నేను అడుగుచున్ననూ నీవు సమాధానము చెప్పకుంటివి. కావున, నేను నిన్ను వజ్రముతో సంహరించెదను. నిన్ను రక్షించువాడు ఎవడు గలడు?  వజ్రధారియగు ఇంద్రుడు ఇట్లు పలికి, ఆ దిగంబరుని కోపముతో చూచి వజ్రమును సన్నద్ధము చేసెను. నిత్వమంగళస్వరూపుడగు శంకరుడు వజ్రమును చేతబట్టియున్న ఆఇంద్రుని చూచి వెంటనే ఆ వజ్రపు దెబ్బ తనపై పడని విధముగా స్తంభింప జేసెను. అపుడు భయంకరమగు ఆకారము గల ఆ పురుషుడు క్రోధముతో వికటముగా నున్న కన్నులు గలవాడై, తన తేజస్సుతో వెనువెంటనే తగులబెట్టనున్నాడా యన్నట్లు మండిపడెను. చేయి స్తంభించుటచే కలిగిన కోపము గల శచీపతియగు ఇంద్రుడు మంత్రముతో అడ్డుకొనబడిన పరాక్రమము గల పాము వలె లోలోపల మండి పడెను. బృహస్పతి మాత్రము, తన తేజస్సుతో గొప్పగా ప్రకాశించుచున్న ఆ పురుషుని చూచి వెంటనే ఆయన శివుడేనని గుర్తు పట్టి నమస్కరించెను. అపుడు గొప్ప బుద్ధిమంతుడగు బృహస్పతి చేతులను జోడించి ఆ ప్రభునకు సాష్టాంగనమస్కారమును చేసి, భక్తితో స్తుతించెను.


బృహస్పతి ఇట్లు పలికెను -


ఓ దేవదేవా! మహాదేవా! శరణు పొందినవారియందు వాత్సల్యము గలవాడా! ఓ గౌరీపతీ! సర్వేశ్వరా! నీకు నమస్కారము. ప్రసన్నుడవు కమ్ము. బ్రహ్మ, విష్ణువు మొదలగు వారు అందరు కూడా నీ మాయచే మోహమును పొందుచుందురు. నీ స్వరూపమును వారు యథార్థముగా తెలియకున్నారు. ఒక వేళ తెలిసిననూ, అది నీ అనుగ్రహాము మాత్రమే.


నందీశ్వరుడిట్లు పలికెను -


అపుడా బృహస్పతి శంకరప్రభుని ఈ విధముగా స్తుతించి, ఇంద్రుడు ఆ ఈశ్వరుని కాళ్లపై పడునట్లు చేసెను. ఓయీ కుమారా! తరువాత గొప్ప బుద్ధిమంతుడు, దేవతలకు ఆచార్యుడు, జ్ఞాని అగు బృహస్పతి చేతులను జోడించి వినయముతో వంగి ఇట్లు పలికెను.


బృహస్పతి ఇట్లు పలికెను -


ఓ దీనప్రభూ! మహాదేవా! నీ పాదములను నమస్కరించే నన్ను ఉద్ధరించుము. కావున, నీవు కోపమును చేయకుము. ప్రేమను చూపుము. ఓ మహాదేవా! తుష్టుడవు కమ్ము. శరణు పొందిన ఇంద్రుని రక్షింపుము. ఇదిగో! నీ లలాటమునందలి నేత్రమునుండి అగ్ని పుట్టి మా వైపు వచ్చుచున్నది.


నందీశ్వరుడిట్లు పలికెను -


కరుణాసముద్రుడగు శంకరప్రభుడు మంచి లీలలను చేయుచుండును. అవధూతరూపములో నున్న ఆయన బృహస్పతియొక్క ఈ మాటను విని నవ్వుతూ ఇట్లు పలికెను.


అవదూత ఇట్లు పలికెను -


కోపము వలన నా కంటినుండి బయటకు వచ్చియున్న తేజస్సును మరల ముందుకు రాకుండా నిలబెట్టుట ఎట్లు సంభవమగును? పాము విడిచిపెట్టిన కుబుసమును మరల ఎట్లు ధరించగల్గును?


నందీశ్వరుడిట్లు పలికెను -


బృహస్పతి ఆ శంకరుని ఆ మాటను విని, భయముతో ఆందోళనను చెందియున్న మసస్సు గలవాడై, మరల చేతులను జోడించి, ఇట్లు పలికెను.


బృహస్పతి ఇట్లు పలికెను -


ఓ దేవా! భగవన్‌! నీవు ఎల్లవేళలా భక్తులపై దయను చూపదగును గదా ! ఓ శంకరా ! నీకు భక్తవత్సలుడను పేరు గలదు. దానిని నీవు సార్థకము చేయుము. ఓ దేవదేవా! మిక్కిలి భయంకరమగు నీ తేజస్సును మరియొక చోట పారవేయుము. భక్తులందరినీ ఉద్ధరించే నీవు ఇంద్రుని ఉద్ధరించుము.


నందీశ్వరుడిట్లు పలికెను -


బృహస్పతి ఇట్లు పలుకగా, భక్తవత్సలుడు అని ప్రసిద్ధిని గాంచినవాడు, నమస్కరించువారి కష్టములను పారద్రోలువాడు అగు రుద్రుడు దేవగురువుతో నిట్లనెను.


రుద్రుడు ఇట్లు పలికెను -


ఓ దేవగురూ! నీపై నాకు ప్రీతి కలిగినది. నీకు ఉత్తమమగు వరమునిచ్చెదను. నీవు ఇంద్రుని జీవితమును కాపాడితివి. కావున, నీకు జీవుడు అను పేరు ప్రసిద్ధిని పొందగలదు. నా లలాటనేత్రమునుండి పుట్టిన ఈ అగ్నిని దేవతలు సహించలేరు. ఇది ఇంద్రుని ఏ మాత్రము పీడించని విధముగా, దీనిని నేను దూరముగా విడిచి పెట్టెదను.


నందీశ్వరుడిట్లు పలికెను -


ఆ శంకరుడు ఇట్లు పలికి, లలాటమునందలి నేత్రమునుండి పుట్టిన తన తేజోరూపమగు అగ్నిని చేతితో పట్టుకొని ఉప్పుసముద్రమునందు పారవైచెను. శివుని లలాటమునందలి నేత్రమునుండి పుట్టి ఉప్పు సముద్రములో పారవేయబడిన ఆ శివుని తేజస్సు వెంటనే పిల్లవాడుగా మారెను. రాక్షసనాయకుడగు ఆ సముద్రపుత్రునకు జలంధరుడు అను పేరు ప్రసిద్ధిని గాంచెను. దేవతలు పార్థించగా మహేశ్వరప్రభుడు ఆతనిని సంహరించెను. లోకములకు మంగళములను కలిగించే శంకరుడు ఈ విధముగా అవధూతరూపమును దాల్చి చక్కని లీలను ప్రకటించి, తరువాత అంతర్ధానమయ్యెను. దేవతలు అందరు పూర్తిగా భయమును విడనాడి సుఖమును పొందిరి. ఇంద్రబృహస్పతులు భయమునుండి విముక్తిని పొందినవారై, ఉత్తమమగు సుఖమును అనుభువించిరి. ఆ ఇంద్రబృహస్పతులు ఏ ఈశ్వరుని దర్శనము కొరకు బయలు దేరిరో, అట్టి ఈశ్వరుని దర్శించుకొని కృతార్థులై ఆనందముతో తమ స్థానములకు వెడలిరి. పరమానందస్వరూపుడగు పరమేశ్వరుడు దుష్టులను శిక్షించును. ఆయనయొక్క అవధూతేశ్వరావతారమును నేను నీకు చెప్పితిని. పవిత్రమైనది, కీర్తిని స్వర్గమును భుక్తిని మరియు ముక్తిని ఇచ్చునది, కోరికలనన్నిటిని ఈడేర్చునది అగు ఈ దివ్యమగు గాథను ఎవడైతే నిత్యము వినునో, లేదా ఏకాగ్రమగు మనస్సుతో వినిపించునో, అట్టివాడు ఇహలోకములో సకలసుఖములను అనుభవించి, మరణించిన పిదప శివుని సాయుజ్యమును పొందును.




శ్రీ శివమహాపురాణములోని శతరుద్రసంహితయందు అవధూతేశ్వరావతారమును వర్ణించే ముప్పదియవ అధ్యాయము ముగిసినది.

పండితుని తెలివి

                 ➖➖➖✍️



వెయ్యిన్ని ఎనిమిది రకాలు కూరలు ఉన్నాయా?అసలు మామూలు దినమైనా తినడానికి అన్ని రకాలు దొరుకుతాయా? 

ఒక వేళ ఉన్నా ఎవరైనా అన్ని కూరలు వంటలో వాడుతారా? వడ్డిస్తారా?ఒక వేళ వడ్డించినా అన్ని ఎవరు తినగలరు?.

ఒకసారి తమ పితరుల శ్రాద్ధము తిథి భోజనానికి భోక్తగా రమ్మని వశిష్ఠులు విశ్వామిత్రులను పిలిచినారు .

దానికి విశ్వామిత్రులు దానికేమి వస్తాను కాని నాదొక నిబంధన మీరు ఒకవెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి నాకు వడ్డించవలెను అన్నారు.

మీరు అడిగిన వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెబుతాను అన్నారు.శ్రాద్ధ దినము రానే వచ్చింది విశ్వామిత్రులు రానే వచ్చినారు. 

వారికి అరటి ఆకు పరచి కాకర కాయకూర పనస పండు మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి ఇంకా కొన్ని కూరలు మాత్రము వాడి చేసిన వంటను అరుంధతి వడ్డించింది. 

వెయ్యిన్ని ఎనిమిది కూరలు అయితే లేవు.దానికి విశ్వామిత్రులు కోపించి ఇదేమిది? ఈ ఆకులో వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఎక్కడున్నాయి ? అన్నారు.

దానికి వశిష్ఠులు నేను తమ కోరికను అరుంధతి వద్ద ముందే చెప్పి ఉంచినాను.మీ కోరిక ప్రకారమే చేస్తాను అని చెప్పింది కూడా అడుగుతాను ఉండండి అన్నారు.

వీరి మాటలు వింటున్న అరుంధతి తానే ముందుకు వచ్చి ఈ శ్లోకాన్ని విశ్వామిత్రులకు చెపుతుంది

 కారవల్లీ శతం చైవ వజ్రవల్లీ శత త్రయం పనసమ్ షట్ శతశ్చైవ శ్రాద్ధకాలే విధీయతే 

దాని అర్థము శ్రాద్ధ సమయములో వడ్డించిన ఒక కాకరకాయ నూరు కూరగాయలకు సమానము. మరియు వజ్రవళ్ళి [ నల్లేరు ]  పచ్చడి మూడు వందల కూరలకు సమానము.పనసపండు ఆరు వందల కూరలకు సమానము.

ఇవి మూడూ కలిపితే మొత్తం వెయ్యి కూరలు.ఇవికాక ఇంకొక ఎనిమిది రకాల కూరలు వండి వడ్డించినాను అంది నమస్కరించి వినయముతో.

అది విని విశ్వామిత్రులు తబ్బిబ్బై నోటమాట రాక భోజనము చేసి  వెళ్లారుట.


__(())__


గ్రేట్ ఫిలాసఫీ.

చచ్చిపోయేమనుకో.! అప్పుడు ఏమవుతుందంటావ్.?'

'ఆ చావులో నన్నెందుకూ కలపడం? నాకింకా బతకాలనే ఉంది.'

'సరే పోనీ. నేనేచచ్చిపోయేననుకో. అప్పుడు ఏమవుతుందంటావు?'

'ఏమీ అవ్వదు.. నిన్ను ఇష్టపడేవాళ్ళు ఓ రెండ్రోజులేడుస్తారు.. స్విగ్గీ వాడూ, డొమినోస్ వాడూ 'అయ్యో.!. మంచి బేరం పోయిందే.!. సారు మంచిగా టిప్పులిచ్చేవాడు' అని బాధపడతారు.'

'అలాక్కాదు.. అంటే.. పుణ్యం గట్రా బాగానే చేసాను కదా.!. స్వర్గానికి పోతానంటావా.?'

'స్వర్గం అంటే ఏమిటో.?'

'అదే.. ఇంద్రుడు, మునులూ కూచునుంటే రంభా, ఊర్వశి, మేనకా డాన్సాడుతూంటారూ.!.'

'నీకసలే డాన్సులంటే బోరు కదా.. మరి నువ్వెళ్ళి ఏం చేస్తావు.?'

'పుణ్యం చేస్తే అక్కడ మనకోసం రంభా, ఊర్వశి, మేనకా వెయిటింగన్నారు.?'

రంభా, ఊర్వశి, మేనకా ఏవైనా కామపిశాచులేవిటీ.? పైకొచ్చే మగ వెధవలందరి కోసం కాసుక్కూచోడానికి.? అయినా నువ్వు పుణ్యం చెయ్యడానికి కారణం, ఎవరో తెలీని ఆడదానితో సరసాలాడటానికా.?'

'మరి పుణ్యం చేసి ప్రయోజనమేంటీ అని.?'

'సరే.. మీ ఆవిడ పుణ్యం చేసిందనుకో.. ఆవిడ కోసం ఇంద్రుడూ, వరుణ దేవుడూ కాసుక్కూచునుంటారా.? '

'ఛఛ... మా ఆవిడ పతివ్రత.!.'

'అంటే.. నువ్వు వెధవ్వన్నమాట.?'

'సర్లే.. నువ్వు మరీ పచ్చిగా మాటాడేస్తున్నావు.. స్వర్గం సంగతి పక్కనెడదాం.. పోనీ పాపం చేసి పోయేననుకో.. యమధర్మరాజు నన్ను నూన్లో వేయిస్తాడా.?'

'నువ్వేమైనా పకోడీవా బజ్జీవా నూన్లో వేయించడానికి.? పోనీ.. వేయించేడే అనుకో.. వేయించి ఏం చేస్తాడూ.? ఇదిగో తినండర్రా అంటూ నిన్ను తలో పీసూ కింకరులకివ్వడానికి నువ్వేమీ మేక మటనూ కాదు.. కోడి చికినూ కాదు కదా..'

'అంటే వేయించడంటావా.?'

'ఆ యముడు గారేమైనా వంటల మేస్టరా.? చచ్చి ఒచ్చినాళ్ళందరినీ వేయించడానికి.? అయినా పాపులందర్నీ వేయించడానికి సరిపడా నూనె సప్లై చెయ్యడానికి.. పైనేమైనా నూనె సముద్రముందా.?'

'అంటే.. స్వర్గం,

 నరకం లేవంటావు.?'

'ఎందుకు లేవూ.?. స్వర్గం, నరకం చస్తే ఉండవు. బతికుండగానే ఉంటాయి.

ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా, నీ పని నువ్వు చేసుకున్నావనుకో.. ఆ రాత్రి హాయిగా నిద్దరడుతుంది.. అది స్వర్గం.. 

అలాక్కాకుండా ఎవర్నో ఏదో ఇబ్బందెట్టాలనే ఎదవాలోచన చేసేవనుకో.!. అదే ఆలోచన నిన్ను నిద్దర్లో కూడా తినేస్తుంది.. అది నరకం.

--(())__   


No comments:

Post a Comment