*అమృతస్య పుత్రా:*
*1-శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు*
మనసులోని చెడు సంస్కారాలను రూపుమాపేదెలా?
ఏదైనా ఒక కర్మను మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఏర్పడిన మనఃప్రవృత్తినే, 'సంస్కారం' అంటారు.
చాలాకాలం గారాబం చేయడం వల్ల మనపై ఆసక్తిని పెంచుకొని, మనల్ని అంటిపెట్టుకొనుండే పెంపుడు కుక్కల లాంటివే ఈ సంస్కారాలు. ఉన్నట్లుండి అకస్మాత్తుగా ఒక నాడు వీటిని పారద్రోలాలంటే సాధ్యం కాదు. వీటి నుంచి మనం తప్పించుకొంటూ ఉండాలి. ఇవి మనల్ని సమీపిం చిననాడు వాటిపై దాడి చేసి దూరంగా తరిమి వేయాలి.
కాబట్టి ముందుగా చేయవలసిందే మంటే, మన చెడు సంస్కారాల గురించి ఎరుక కలిగి ఉండడం! వాటిని పురికొల్పే సందర్భాల నుంచి తప్పించుకోవడం! ఇది ఒక సుడిగుండాన్ని ఎదుర్కోవడం లాంటిదే. తెలిసో తెలియకో ఒకసారి దానిలో చిక్కుకుంటే మనం నిస్సహాయిలమే సుమా.
కానీ మన ముందున్న ఆ సుడి గుండం గురించి మనకు తెలిసి ఉన్నప్పడు, దాని నుంచి తప్పించు కోవాలన్న కోరిక దృఢంగా ఉన్నప్పడు దాని దరిదాపులకు కూడా పోకూడదు, అయితే కేవలం కళ్ళు మూసుకుంటే సరిపోదు. భయంతో తలను ఇసుకలో దూర్చడం ద్వారా ఉష్ణపక్షి ప్రమాదాలకు తావిస్తుంది. మన అంతరాళం నుంచే ఈ చెడు సంస్కారాలను ఎదుర్కోవడమనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం.
యోగసూత్రాల సృష్టికర్త అయిన పతంజలి మహర్షి చెప్పినట్లు ఈ చెడు సంస్కారాలను మరింత లోతైన స్థాయిలో పరిష్కరించేందుకు వాటికి వ్యతిరేకమైన మంచి సంస్కారాలపై మనసును ఏకాగ్రపరచడమే మార్గం.
మంచి సంస్కారాలకు నిదర్శనాలైన వ్యక్తుల పైన లేదా విషయాల పైన మనస్సును లగ్నం చేయవచ్చు. కానీ భగవంతునిపై దృఢవిశ్వాసమున్న వ్యక్తి విషయంలోనైతే ప్రార్థన, ధ్యానం లాంటివి సాధన చేస్తూ దేవునితో మమేకమవడం ఉత్తమం.
పాపప్రవృత్తి నుంచి బయటపడేందుకు భగవద్గీత ఇలా మార్గం చూపుతోంది:
"ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి - ఇవే పాపప్రవృత్తికి నిలయాలు. ఇవి జ్ఞానాన్ని ఆవరించి, జీవుణ్ణి వంచిస్తాయి. అందువల్ల ఇంద్రియాలను ఆదిలోనే నియంత్రించడం ద్వారా పాపనివృత్తి కావించవచ్చు.
భోగ విషయాల కన్నా ఇంద్రియాలు; ఇంద్రియాల కన్నా మనస్సు; మనస్సు కన్నా బుద్ధి; బుద్ధి కన్నా ఆత్మ శ్రేష్టమైనవి. ఆత్మ ఆధారంగా మనస్సును వశపరచుకోండి. విషయలాలస రూపంలో దాగిన శత్రువును నాశనం చేయండి".
మన మనస్సులోని ప్రతిచర్యలపై దృష్టి పెడుతూ, కేవలం సాక్షిగా వాటిని గమనించడం ద్వారా వాటి ప్రభావం నుంచి బయట పడగలుగుతాం.
కాబట్టి మన ఇంద్రియాలు ఒక భోగవస్తువు మాయలో పడకుండా వాటిని బయట నుంచి పరిశీలించ గలిగినప్పడు లేదా మన బుద్ధి మనస్సులోని ఒక ముద్రను పరిశీలిసూ దానితో తనను తాదాత్మ్య పరచు కోకుండా వివేకం చూపగలిగినప్పడు మనలోని భావాన్ని లేదా సంస్కారాన్ని జయించగలుగుతాం.
మనలోని సంస్కారాలపై పట్టు సాధించాలంటే కేవలం సాక్షీభూతంగా నిలవడమే మార్గం. బుద్ధి శ్రేష్టమని చెప్పడం ద్వారా భగవద్గీత చెబుతున్నది ఇదే! సూక్ష్మంలోనే శ్రేష్టత్వం, తద్వారా సూల విషయాలను సాక్షిగా పరిశీలించే సుగుణం దాగి ఉన్నాయి.
సాక్షిగా చూడడమంటే దేనితోనూ తాదాత్మ్యం చెందకపోవడం, తద్వారా సూలంలోని మాలిన్యాల నుంచి తప్పించుకోవడం.
కానీ ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కన్నా ఉన్నతమైనదీ, జీవులందరిలోనూ వెలుగుతున్న దివ్య కాంతిపుంజమూ ఆ భగవంతుడే. ఆయన చలవ వల్లే ఈ జగత్తంతా నడుస్తున్నది.
అందువల్ల మనం ఇంద్రియాలు, మనస్సు,
బుద్ధి ద్వారా హృదయ పూర్వక ప్రార్థన, ధ్యానాలతో దేవుని వైపు మరలాలి. చివరకు చెడు సంస్కారాల నుంచి మనకు విముక్తిని ప్రసాదించేది ఆయనే!.
🕉️🌞🌏🌙🌟🚩
*అమృతస్య పుత్రా:*
*2-శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు*
పగలు, రేయి ఎన్నడూ కలిసి ఉండవు. అలాగే భగవదాకాంక్ష - ప్రాపంచిక ఆకాంక్ష అనేవి రెండూ సహజీవనం చేయవు.
అందుకే, భగవంతుణ్ణి పోందగోరే వారిని కామనారహితులుగా ఉండాల్సిందిగా శాస్రాలు ఉపదేశిస్తున్నాయి. కైవల్యోపనిషత్తు ఇలా వచిస్తోంది:
"కర్మ చేత, సంతతి చేత, లేక ఐశ్వర్యం చేత అమరత్వం సిద్ధించదు, పరిత్యాగం చేత మాత్రమే అమరత్వాన్ని పొందగలం."
శ్రీరామకృష్ణులు కోర్కెలను ఎలా వదిలించుకోవాలో తమ శిష్యులకు ఇలా బోధించారు.
"ధర్మమార్గం ఎంతో సూక్ష్మమైనది. జాడమాత్రమైన కోర్కె ఉన్నాసరే, భగవత్సాక్షాత్కారం పొందలేం.
ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి ఎక్కించలేం ఇదీ అంతే.
"కామినీ కాంచనాలను త్యజించకుండా ఆధ్యాత్మిక పురోగతి అసాధ్యం."
"నేతి పాత్రను పూర్తిగా ఖాళీ చేసినప్పటికీ పాత్ర అంచుల్లో నెయ్యి అంటుకొని ఉన్నట్లుగా కోరికలు దాగి ఉంటాయి.
ఒక వ్యక్తి వద్ద ఖాళీ నేతి పాత్ర ఉంది. పొరుగునున్న వ్యక్తి కొంచెం నెయ్యి ఇవ్వమని అడిగాడు. నెయ్యి లేదని ఇతడన్నాడు. అప్పుడు పొరుగు వ్యక్తి, ఎండలో పాత్రను కాసేపు ఉంచి చూడకూడదా? అని చెప్పాడు. కొద్దిసేపట్లోనే నెయ్యి కరిగి వచ్చింది.
ఆ విధంగా కోర్కెలు మనస్సులో ఘనీభవించిన స్థితిలో ఉంటూనే ఉంటాయి. వాటికి సూర్యరశ్మి తగిలినప్పుడు, అంటే ఇంద్రియ సుఖాలను ఇచ్చే వస్తువులతో సంసర్గం ఏర్పడినప్పడు అవి అభివ్యక్తమవుతాయి. కాబట్టి సంయమం పాటించి జ్ఞానాగ్నిని పెంపొందించుకొటే, సమస్తమైన కోరికలూ బూడిదలా దగ్ధమైపోతాయి."
ధ్యానం చేసేటప్పడు, ప్రథమావస్థలో ఇంద్రియ విషయాలన్నీ మనస్సులో మెదలుతాయి. కానీ ధ్యానం ప్రగాఢమవగానే అవి సాధకుణ్ణి ఇక ఇబ్బందికి గురి చెయ్యవు. మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మన మనస్సులలో చెడు ఆలోచనలు సహజంగానే తలెత్తుతాయి. రామకృష్ణుల మనస్సులో కూడా
అవి మెదలకపోలేదు. ఆయన ఇలా జ్ఞాపకం చేసుకున్నారు:
"ధ్యానం చేస్తున్నప్పడు ఎన్నో రకాల వస్తువులు నాకు కనిపించేవి. ధనరాశి, శాలువా, ఒక పళ్ళెం నిండా తీపి తినుబండారాలు, ముక్కున నత్తులు ధరించిన ఇద్దరు స్త్రీలు - ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. నా మనస్సును ఇలా ప్రశ్నించాను:
'నీకు ఏం కావాలి? వీటిలో దేనినైనా అనుభవించాలను కొంటే చెప్ప, అందుకు నా మనస్సు, నాకు ఏదీ వద్దు. భగవంతుడి పాదపద్మాలు తప్ప అన్యమైనది ఏదీ నాకు అక్కర్లేదు' అని జవాబిచ్చింది."
ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక కోరిక - బద్ధ శత్రువు. ఈ శత్రువును తుదముట్టించడానికి శాస్రాలు ఎన్నో మార్గాలను వివరించి చెప్పాయి. వాటిలో కొన్ని - త్యాగాగ్ని జ్ఞానాగ్ని యుక్తాయుక్త విచక్షణ, నిష్కామకర్మ భగవంతుని పట్ల భక్తిశ్రద్ధలు.
రామకృష్ణులు తమ భక్తులను ఇలా హెచ్చరించారు:
"ధ్యానం చేస్తున్నప్పడు నీ మనస్సులో ఏదైనా ప్రాపంచిక కోరిక మొదలడం గమనిస్తే, ధ్యానం నిలిపివెయ్యి హృదయ పూర్వకంగా భగవంతుణ్ణి, 'ఓ ప్రభూ! ప్రాపంచిక కోరికలు నా మనస్సులోనికి రానీయకుండా చూడు" అని ప్రార్థించు." ప్రార్థనలో నిజాయతీ ఉంటే భగవంతుడు తప్పక మన ప్రార్థనలను వింటూడు.
🕉🌞🌏🌙🌟🚩
అమృతస్య పుత్రా:*
*3-శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు*
భక్తుడు:- మనస్సులో వ్యధనొందుతూ సంసారాన్ని త్యజించడమా? లేక సంసారంలోనే ఉంటూ భగవచ్చింతన చేయడమా? ఏది సరైనది?
శ్రీరామకృష్ణులు:- మనస్సులో వ్యధనొందుతూ సంసారాన్ని త్యజించేవారు హీనశ్రేణికి చెందినవారు. సంసారంలో ఉంటూనే నిష్కామంగా కర్మలు చేయాలి.
భక్తుడు:- నా మనస్సు ఒక్కోసారి ఉన్నత స్థితిలో ఉంటుంది. మళ్ళీ అంతలోనే అది దిగజారి పోతుందెందుకని ??
శ్రీ రామకృష్ణులు:- సంసారంలో ఉన్నప్పుడు అలాగే అవుతుంది. గృహస్తుని మనస్సు ఒక్కోసారి ఉన్నత స్థితిలో. మళ్ళీ నిమ్నస్థాయికి దిగిపోప్రస్తుంది.
అతడు ఒక్కోసారి అత్యంత భక్తిని కలిగి ఉంటాడు. మరోసారి, ఆ భక్తి తగ్గుముఖం పడుతుంది. అతడు కామినీ కాంచనాల నడుమ నివసించవలసి ఉంటుంది కదా! అందుకే అలా అవుతుంది.
గృహస్తు ఒక్కోసారి భగవచ్చింతన చేస్తాడు. భగవన్నామాన్ని ఉచ్చరిస్తాడు. మళ్ళీ ఒక్కోసారి మనస్సును కామినీ కాంచనాలపై లగ్నం చేస్తాడు. ఈగ లాగ అన్నమాట. ఈగ ఒక్కసారి మిఠాయి మీద వాలుతుంది. మరోసారి క్రుళ్ళిన పండు మీద వాలుతుంది.
నిజమైన త్యాగికి భగవంతుడు తప్ప అన్యమైనదేదీ భగవత్రసంగాలు మాత్రమే వింటాడు. తేనెటీగలు కేవలం పువ్వుల మీదనే వాలుతాయి. మకరందాన్ని గ్రోలుతాయి.
లౌకిక ప్రసంగాలను వదిలిపెట్టు. భగవత్రసంగాలు తప్ప అన్యవిషయాలు ఏవి మాట్లాడవద్దు. భగవంతుడొక్కడే సత్యం. తక్కినదంతా మూన్నాళ్ళ ముచ్చటే!
ఈ సంసార జంజాటాల మధ్య ఉంటే భగవచ్చింతన వీలుపడదు కొంతకాలం ఏకాంతవాసం అవసరం.
🕉🌞🌏🌙🌟🚩
*అమృతస్య పుత్రా:*
*4-శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు*
భక్తుడు :- స్వామీ! బ్రహ్మజ్ఞానం పొందాక విచక్షణ, విచారణలు మిగిలి ఉంటాయా?
శ్రీరామకృష్ణులు : భగవత్సాక్షాత్కారానంతరం, భగవత్ సంసర్గం పొందాక విచక్షణ, విచారణలు నశిస్తాయి.
ఎంతకాలం మనిషి విచక్షణ, విచారణలు చేయగలడు? "నేను, నువ్వు' అనే భావన ఉన్నంతవరకు విచక్షణ, విచారణలు ఉంటాయి. ఏకత్వాన్ని యథార్థంగా గ్రహించిన వ్యక్తి అంతర్ముఖుడై, మౌనం పాటిస్తాడు. అందుకు ఉదాహరణ త్రైలింగస్వామి.
బ్రహ్మజ్ఞానం పొందగానే కామకాంచనాల పట్ల వ్యామోహము తొలగిపోతుంది. కొయ్యదుంగ మండే టప్పుడు చిటపటమనే శబ్దం వస్తుంది. మండటం పూర్తయిన తరువాత ఎలాంటి శబ్దమూ రాదు. అనురక్తి నశించగానే ఆరాటమూ అదృశ్యమవుతుంది.
గంగానదిని సమీపించేకొద్దీ చల్లదనాన్ని పొందినట్లు, భగవంతుడి సమీపానికి పోయేకొద్దీ శాంతిని పొందుతావు.
బ్రహ్మజ్ఞానం పొందాక కూడా కొందరు 'విద్యా నేను'ను, 'భక్తి నేను'ను కలిగి, మనస్సును దిగువ స్థితిలో నిలిపి ఉంచుతారు. నారదాది మహర్షుల విషయం ఇటువంటిదే.
వారు 'భక్తి నేను'ను లోకోపదేశార్థం నిలుపుకొని ఉన్నారు. అదే ప్రయోజనానికై శంకరాచార్యులు విద్యా నేను'ను ఆశ్రయించి ఉన్నారు.
భగవల్లాభం పొందిన వారి కామక్రోధాలు నామ మాత్రాలే. అవి కాలిపోయిన తాడులాంటివి. అది ఆకృతిలో తాడులా కనిపించినా, ఉఫ్ అని ఊదగానే చెల్లాచెదరైపోతుంది.
దారానికి అతిచిన్న పోగు అంటిపెట్టుకొని ఉన్నా ఆ దారాన్ని సూది బెజ్జంలోకి ఎక్కించలేము. అలాగే, విషయాను రక్తి జాడమాత్రంగా ఉన్నా భగవత్సాక్షాత్కారం పొందలేము. మనస్సు విషయానురక్తి నుండి విముక్తం కాగానే భగవత్సాక్షాత్కారం కలుగుతుంది.
🕉🌞🌏🌙🌟🚩
*అమృతస్య పుత్రా:*
*5-శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు*
భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస బోధనలన్నీ అటు ఆధ్యాత్మికోన్నతికే కాక, నిత్యజీవన వికాసానికి కూడా దీపాలై వెలుగు చూపిస్తాయనడంలో సందేహంలేదు.
రామకృష్ణులు ఎంతటి సంక్లిష్ట భావజాలాన్నైనా, సరళంగా నీతికథల రూపంలో వివరించి, విశ్లేషించేవారు.
అలా మనస్సు చేసే మాయాజాలంతో మనిషి ఎలా తన పతనాన్ని తనే కొనితెచ్చు కుంటాడో ఒక మారు సోదాహరణంగా వివరించారు ఆ అవతార పురుషులు.
మనస్సు కోరే గొంతెమ్మ కోరికలకు మనిషి లొంగిపోతే, విపరీత పరిణామాలకు దారితీస్తుంది. మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా ఉండాల్సిన మనస్సుకు సరైన శిక్షణనివ్వకపోతే అదే మనకు పరమశత్రువై నాశనం చేస్తుంది.
నిజానికి మన జీవితానికి సంబంధించిన విజయ వైఫల్యాలన్నీ మనస్సుకు ఏ విధంగా శిక్షణనిచ్చామన్న విషయం పైనే ఆధారపడి ఉంటాయి.
ఈ పరమ సత్యాన్ని పరమహంస కథగా చెప్పి, మనల్ని సున్నితంగా హెచ్చరించారు.
గంటల తరబడి ప్రయాణించి, ప్రయాణించి అలసిపోయిన ఓ బాటసారి నిలువనీడ లేక విలవిల్లాడిపోతున్నాడు.
నడి నెత్తిన సూరీడు. దాహంతో నోరు ఎండిపోతోంది. ఎడారి లాంటి మైదానంలో చివరకు ఓ చెట్టు కనిపించి, బ్రతుకు జీవుడా అనుకుంటూ దాని నీడన చతికిలపడ్డాడు.
“అబ్బా! ఎంత అలసిపోయాను. ఇప్పుడు మంచి భోజనం లభిస్తే, ఎంత బాగుంటుంది” అనుకున్నాడు. అనుకున్నట్లే పంచభక్ష్య పరమాన్నాలతో కూడిన భోజనం అతని ముందు ప్రత్యక్షమైంది.
'ఇప్పుడు ఒక చక్కని పరుపు, మంచం ఉంటే ఎంత బాగుండు! ఎంచక్కా నిద్ర పోయేవాణ్ణి'అనుకున్నాడు. ఆశ్చర్యంగా వెంటనే చక్కని మంచం ప్రత్యక్షమైంది. ఆ బాటసారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఇక మనస్సు పరిపరివిధాల పరుగెత్తడం ప్రారంభించింది. ఎంచక్కా మంచంపై పడుకున్న బాటసారి మనస్సు ఆశలు తొడగడం ప్రారంభించింది.
'భలే! భలే! ఇదే వేళ అందమైన యువతి వచ్చి నాకు సపర్యలు చేస్తే ఎంత బావుంటుంది' అనుకున్నాడు. అద్భుతం! వెంటనే పదహారేళ్ళ అందమైన అమ్మాయి, ఆ బాటసారి పాదాల దగ్గర ప్రత్యక్షమై కాళ్ళు పట్టి సపర్యలు చేయడం ఆరంభించింది.
ఆ బాటసారి ఆనందానికి అంతే లేదిక! ఇంకేముంది, తాను ఏమనుకుంటే అవి తీరిపోతున్నాయని ఉబ్బితబ్బిబ్బైపోయాడు ఆ అమాయక జీవి.
అనూహ్యంగా సంభవిస్తున్న ఈ వింతలను చూసి, ఆ బాటసారి మనస్సులో మరో సందేహం కలిగింది.
'అవును! ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఈ నిర్జన ప్రదేశంలోఅకస్మాత్తుగా ఓ పులి వస్తే నా పరిస్థితి ఏం కాను?”అని అనుకున్నాడు.
అంతే! ఎక్కడి నుంచి వచ్చిందో, ఓ పులి రానే
వచ్చింది. ఆ అభాగ్యుడిపై పంజా విసరడం, రక్తం తాగడం క్షణాల్లో జరిగిపోయింది. ఇలా మనస్సును యథేచ్ఛగా స్వైరవిహారం చేయిస్తే పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో ఈ బాటసారి కథలో శ్రీరామకృష్ణ పరమహంస సుందరంగా ఉదాహరించారు.
మనస్సును సరైన దిశలో పయనింపజేస్తే అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. కానీ దానికి దిశానిర్దేశం చేయడంలో మన వివేకం, విజ్ఞతను ఉపయోగించకపోతే, కళ్ళాలు లేక అదుపుతప్పిన అశ్వంలా పరుగెడుతుంది.
ఆధునిక మానసిక విశ్లేషకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు తరచూ ఉటంకించే Mind management, Mind maping అంశాలపై ఆనాడే శ్రీరామకృష్ణులు, దివ్యజనని శారదామాత అద్భుతమైన సూచన లిచ్చారు.
మనస్సు పైనే సమస్తమూ ఆధారపడి ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రాథమికంగా మనస్సుకు సకారాత్మకమైన, ఆరోగ్యకరమైన రీతిలో శిక్షణనిస్తే అది నిరంతరం మన అదుపులోనే ఉంటూ, మన పురోగమనానికి సహకరిస్తుంది.
🌞🌏🌙🌟🚩
*అమృతస్య పుత్రా:*
*6-శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు*
భక్తిలాభ కొరతే హోలె నిర్జన్ హోవాచాఇ నిర్జనే ఈశ్వరచింతా కొరలె భక్తిలాభ హోయ్.
భగవద్ధక్తిని పొందడానికి నిర్జనవాసం చేయాలి. ఏకాంతంలో భగవంతుణ్ణి ధ్యానిస్తే మనస్సులో భక్తి జనిస్తుంది.
శ్రీరామకృష్ణ ఉవాచ:-
వెన్న పొందాలంటే పాలను ఏకాంత ప్రదేశంలో తోడెయ్యాలి. పాత్రను కదిపినా, పాలను కెలికినా పాలు తోడుకోవు. పెరుగు సిద్దమైన పిదప చిలకాలి. అప్పుడే వెన్నపైకి తేలుతుంది.
సంసారం నీరు, మనస్సు పాల వంటివి. నీటిలో పాలు కలిపితే, రెండూ కలసిపోయి, ఏది నీరో, ఏవి పాలో తెలియదు. పాలను తోడువేసి, పెరుగు చిలికితే వెన్నపైకి తేలుతుంది.
ఆ విధంగానే, నిర్జన ప్రదేశంలో సాధనల ద్వారా జ్ఞానం, భక్తి అనే వెన్న ఏర్పడుతుంది. ఆ వెన్నను సంసారమనే నీటిలో వేసినా అది తేలుతునే ఉంటుంది.
అడపాదడపా కుటుంబం నుండి దూరంగా వెళ్ళి, నిర్జన ప్రదేశంలో భగవచ్చింతన చేస్తే భక్తి జనించును. ఎంతకాలం దూరంగా ఉండాలి అని అడుగుతారా?
ఒక్కదిన మైనా మంచిదే, మూడు దినాలైతే మరీ మంచిది, వారం, ఒక నెల, మూణెల్లు, ఒక సంవత్సరం - ఎవరి వీలును బట్టి వారు.
వ్యాఖ్య:-
భక్తిని పొందడానికి ముఖ్య ఉపాయం, నిర్జనవాసం. ఏకాంతంలో కొన్ని నిమిషాలు గడపినా చాలు, మన మనస్సు అట్టడుగున ఉన్న భావాలు పైకి వస్తాయి. ఫలితంగా, జీవితంలో చేసిన తప్పులు, పొరపాట్లు గుర్తుకు వస్తాయి, వాటిని సరిదిద్దుకొనే అవకాశం దొరకుతుంది.
ఏకాంతంలోనే భగవంతునికి ఆత్మసమర్పణం చేసికొని, భగవచ్చింతన చేయగలం. ఈ విధంగా ఆయన పట్ల అనురాగం జనిస్తుంది. ఆయన అపార కరుణ పదేపదే గుర్తుకు వస్తుంది. జీవితంలో ఎన్ని తప్పులు, ఎంత అనౌచిత్యం చేశామో కదా. కానీ, భగవంతుడు వాటిని క్షమించి, తన చేయి అందించి తన వైపు లాగుకొన్నది గుర్తుకు వస్తుంది.
ఈ ఆలోచన కలుగగానే భక్తి జనిస్తుంది. భగవంతుణ్ణి ప్రేమించాలనే కాంక్ష కలుగుతుంది. ప్రాపంచిక వస్తువులతో కలిగే సుఖం క్షణికమనీ, భగవద్దర్శనంతో కలిగే ఆనందం చిరస్థాయి అనీ తెలిసివస్తుంది.
"ప్రథమే స్త్రీర్ జేమన్ స్వామితే నిషా, శేషరూప్ నిషా జది ఈశ్వరేతే హోయ్ తబెఇ భక్తి హోయ్".
భార్య మొదట్లో తన భర్త పట్ల ఎటువంటి శ్రద్ద చూపుతుందో, అదే విధమైన నిష్ఠ భగవంతుని పట్ల కలిగితే, అప్పుడే భక్తి కలుగును.
వ్యాఖ్య:-
పనిలో ఎన్ని ఆటంకాలు, కష్టాలు వచ్చినా, వాటిని లెక్క చేయక నిర్దిష్ట సమయంలో దానిని పూర్తి చేయడమే నిష్ఠ అదే విధంగా, ఏదైనా వస్తువు లేదా వ్యక్తి పట్ల కలిగే ఆకర్షణ కూడా నిష్ఠనే శ్రీరామకృష్ణులు ఒక చక్కని ఉదాహరణతో దీనిని వివరించారు.
నూతన వధువు తన ప్రేమను పూర్తిగా తన భర్త పట్ల చూపుతుంది. ఆయనపైన పూర్తి నమ్మకం ఉంచుతుంది. ఆయన పట్ల ఏ సేవాతత్పరత, ఆకర్షణ కలిగి ఉంటుందో, అది ఎంతో గాఢమైనది. ఆయన ఆమెకు అత్యంత ప్రీతి పాత్రుడు, సాక్షాత్తు దైవంగా భావిస్తుంది. పూర్తిగా ఆత్మ సమర్పణం చేసికొని, నిశ్చింతగా ఉంటుంది.
ఆయన అవసరాలను జాగ్రత్తగా గమనిస్తూ ఏది కావాలో అది వెంటనే అందించి, ఆయనను ఎల్లప్పుడు సంతుష్టి పరచాలని కోరుకుంటుంది. ఆయన భోజనం చేయనిదే ఆమె తినదు, ఆయన నిద్రించని పూర్వం ఆమె నిద్రకు ఉపక్రమించదు. ఈ విధంగా తన సుఖాన్ని లెక్క చేయక, భర్తకు సకాలంలో అన్ని సేవలు చేస్తుంది. దీనినే నిష్ఠ అంటారు.
సాధకునికి భగవంతుని పట్ల ఈ విధమైన ఆత్మీయత, సేవాతత్పరత ఉంటే, దానినే భక్తి అంటారు. 'భగవద్విషయాలు తప్పించి మరే మాటలూ వినడానికి ఇచ్చగించరు. ఆయన సేవే చేయ తలుస్తారు' అని శ్రీరామకృష్ణ నిష్ఠను గురించి చెప్పారు.
🕉🌞🌏🌙🌟🚩
*అమృతస్య పుత్రా:*
*7-శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు*
ప్రాచీన కాలం నుండీ ప్రాచుర్యం పొందిన కర్మ, భక్తి, జ్ఞాన, రాజ, యోగాలలో అందరికీ పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా, ఆధునిక కాలంలో హాస్యయోగంతో మాత్రం పరిచయముంది. ఒకప్పుడు 'నవ్వు నాలుగు విధాల చేటు' అని హెచ్చరించేవారు పెద్దలు.
కానీ ఇప్పుడు 'నవ్వు ఎన్నో విధాల మేలు' అని ప్రోత్స హిస్తున్నారు వైద్యులు. నవ్వడం వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలై మనిషి ఆరోగ్యంగా ఉండడానికి దోహద పడతాయని వైద్యులు చెబుతున్నారు.
అంతే కాదు “నవ్వడం - యోగం' నవ్వకపోవడం - రోగం' అని నవీన మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు.
అందుకే పూర్వ ఋషులు పేర్కొన్న నాలుగు యోగాలను అభ్యసించడానికి సంఘాలున్నా లేకపోయినా, ఆధునిక వైద్యులు సూచించిన హాస్యయోగాన్ని అభ్యసించడానికి ఎన్నో హాస్య సంఘాలు వెలిసాయి. అయితే 'సహజమైన నవ్వు మేలు చేస్తుంది. కృత్రిమమైన నవ్వు కీడు కలిగిస్తుంది' అని మరువరాదు.
నిజానికి చింతలు లేని చిత్తమే సహజ నవ్వుల పూదోట అవుతుంది. 'హాస్యయోగం' రోగాలను దూరం చేస్తుందని నేటి వైద్యులు చెబితే, సుమారు 130 ఏళ్ళ క్రితమే తమ తమ హాస్య అలి గుళికలతో భక్తుల భవరోగాలను పారద్రోలిన భవరోగ వైద్యుడు - శ్రీరామకృష్ణ పరమహంస.
రామకృష్ణులు దక్షిణేశ్వరంలో తమ గదిలో చేరిన భక్తులకు ఆధ్యాత్మిక బోధనలనుహాస్యరసామృతంలో ముంచి పంచేవారు. ఆ అమృతాన్ని ఆస్వాదించిన భక్తులు కడుపుబ్బేలా నవ్వేవారు మనసారా ఆనందించేవారు.
రామకృష్ణుల గదే ఓ నవ్వుల పూదోటగా మారిపోయేది. అక్కడ విరబూసిన పారమార్థిక పారిజాతాలను భక్తులు తమ మనస్సుల్లో పదిలపరచిన వెంటనే వారి చింతలన్నీ తొలగిపోయేవి. అలా శ్రీరామకృష్ణులు తమ గదినే 'హాస్యయోగాలయం' గా మార్చి, భక్తుల హృదయాలను 'దేవాలయం'గా తీర్చిదిద్దారు.
అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి ఎలాంటి భయం, బాధ కలగ కుండా నవ్వుతూ, నవ్విస్తూ మంచిమాటలు చెబుతూ ఇంజక్షన్ ఇచ్చే మంచి వైద్యునిలా శ్రీరామకృష్ణులు సంసార తాపంతో సతమతమవు తున్న భక్తులకు మంచి కథల ద్వారా, చక్కని దృష్టాంతాలు, ఉపమానాల ద్వారా సరళమైన భాషలో శాస్త్రసారాన్ని హాస్యరసంతో కలిపి బోధించేవారు. ఆ విధంగా తప్త హృదయాలపై ఆధ్యాత్మిక అమృత బిందువులను చిలకరించి, వారికి ప్రశాంతతను ప్రసాదించేవారు. అందుకే రామకృష్ణులు ఉత్తమ భవరోగ వైద్యునిగా స్తుతులందుకుంటున్నారు.
ఒకసారి మనం 'శ్రీరామకృష్ణ కథామృతం' అనే నవ్వుల పూదోటలో విహరిస్తూ, పారమార్థిక పారిజాత పరిమళాలను ఆఘ్రాణిస్తే 'భవబంధాలను పారద్రోలే పరమదైవం శ్రీరామకృష్ణులు' అని అర్థమవుతుంది. శ్రీరామకృష్ణులు ఆధ్యాత్మిక సందేశాన్ని దృష్టాంతాల ద్వారా ఎంత హృద్యంగా వివరించేవారో తెలుసు కోవడానికి మచ్చుకు కొన్ని పరిమళాలను ఆఘ్రాణిద్దాం.
సమారాధనలో కోలాహలం.. సంసారంలో కర్మలు:
మనస్సు ఓ కోరికల పుట్ట. ఆ కోరికలను తీర్చుకోవడానికి ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. “మనం కర్మలు చేస్తున్నంత వరకూ మనస్సులో చింతలు తగ్గవు. చిత్తాన్ని భగవంతుని వైపు మరలిస్తున్నకొద్దీ చింతలు దూరమవుతాయి”
అనే ఈ పారమార్థిక పారిజాతాన్ని శ్రీరామకృష్ణులు తన నవ్వుల పూదోటలో ఎలా పూయించారంటే....
“సమారాధనలో పాల్గొన్న బ్రాహ్మణులు విస్తళ్ళు వేసేవరకు మాట్లాడుతూ ఉంటారు.
ఆ సమయంలో అక్కడ ఎంతో కోలాహలంగా ఉంటుంది. పంక్తిలో కూర్చోగానే మాటల శబ్దం కొంత వరకు తగ్గుతుంది; విస్తళ్ళలో భోజనం వడ్డించగానే శబ్దం ఇంకొంత తగ్గిపోతుంది. ఇక భోజనం చేయడం ప్రారంభించగానే చాలా వరకు శబ్ధం తగ్గిపోతుంది. చివరగా పెరుగు వడ్డించగానే కేవలం జుర్రు జుర్రు' అనే శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఆ తరువాత అంతటా నిశ్శబ్దం ఆవరిస్తుంది. అంటే అందరూ నిద్రలోకి జారుకుంటారు” -
ఈ ఉపమానం విన్న భక్తులంతా నవ్వారు. ఈ హాస్య గుళిక భావార్థాన్ని విశ్లేషిస్తే జీవిత పరమార్థం బోధపడుతుంది.
సమారాధనలో పాల్గొన్నవారి కోలాహలం - సంసారంలో కర్మలు చేస్తున్నవారి కష్టాలు;
పంక్తిలో కూర్చోవడం - భక్తుల సాంగత్యం;
భోజనం చేయడం - భగవత్ కథా శ్రవణం;
పెరుగు తింటున్నప్పుడు కేవలం 'జుర్రు' అనే శబ్దం - భగవన్నామస్మరణను ఆస్వాదించడం;
నిద్రపోవడం - భక్తిపారవశ్యంలో ఓలలాడడం;
సంసారంలో కర్మలు నిర్వర్తిస్తున్నంత వరకు మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది. సాంసారిక చింతల నుండి శాంతిని పొందాలంటే మొదట సత్సాంగత్యం చేయాలి. దాని ద్వారా భగవత్ కథా శ్రవణం పట్ల ఆసక్తి ఏర్పడుతుంది.
ఆ తరువాత భగవన్నామంపై అభిరుచి కలుగుతుంది. భగవన్నామ స్మరణలో నిమగ్నమైన మనస్సు భక్తిపారవశ్యంలో ఓల లాడుతుంది. అలా సంసారం నుండి మనస్సును భగవంతుని వైపు మరలించిన కొద్దీ చింతలు తగ్గుతూ వస్తాయి. చివరికి సంపూర్ణ చిత్తశాంతి చేకూరుతుంది.
యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః || ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే II (గీత-3.17)
ఎవడైతే ఆత్మయందే ప్రీతి కలిగి, ఆత్మయందే సంతృప్తి చెందుతూ, ఆత్మయందే ఆనందాన్ని పొందుతాడో అలాంటి వానికి చేయాల్సిన కార్యం ఏదీ ఉండదు.
🕉🌞🌏🌙🌟🚩
[25/07, 21:14] +91 92915 82862: *అమృతస్య పుత్రా:*
*8-శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
ఆత్మానందాన్ని అనుభవించే వారికి చేయాల్సిన కర్మలు ఏవీ ఉండవంటూ శ్రీకృష్ణుడు బోధించిన ఈ పారమార్థిక పారిజాతాన్ని, హాస్యరసంతో కూడిన ఉపమానంతో పామరులు సైతం అర్ధం చేసుకొనేలా శ్రీరామకృష్ణులు అందించారు.
నల్లమందు... భగవన్నామ మధువు :
“ఒక్కసారి భగవన్నామ మధువును గ్రోలినవాడు ఆ మత్తును మరలా మరలా పొందాలని కోరుకుంటాడు” అనే పారమార్థిక పారిజాతం శ్రీరామకృష్ణుల నవ్వుల పూదోటలో ఇలా వికసించింది.
శ్రీరామకృష్ణ కథామృత రచయిత అయిన మహేంద్రనాథ్ గుప్తా కొత్తగా శ్రీరామకృష్ణుల దగ్గరకు రావడం ప్రారంభించాడు. ఒకరోజు శ్రీరామకృష్ణులు తమ గదిలో నరేంద్రుడు, భవనాథ్ మొదలైన యువ భక్తులతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో మహేంద్రనాథ్ గదిలోకి ప్రవేశించాడు. అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు బిగ్గరగా నవ్వుతూ, 'అదిగో! మళ్ళీ వచ్చాడు' అన్నారు.
అతడి రాకను ఓ దృష్టాంతంతో పోలుస్తూ... “ఒకసారి ఓ వ్యక్తి ఒక నెమలికి సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు నల్లమందు గుళికను ఇచ్చాడు. ఆ నల్లమందు మత్తుకు అలవాటు పడ్డ ఆ నెమలి మరుసటి రోజు సరిగ్గా అదే సమయానికి అక్కడకు వచ్చింది” అని అనగానే అందరూ మౌల్లున నవ్వారు.
అలా అందరూ నవ్వుతుండగా 'ఎవరైతే ఒక్కసారి భగవన్నామ రుచిని ఆస్వాదిస్తారో అలాంటివారు ఎలాంటి ప్రలోభాలకూ, ఆకర్షణలకూలోనుకారు'అని హనుమంతుని కథను వినిపించారు.
“ఒకసారి హనుమంతుడు, రావణాసురుని భవనంలో ప్రవేశించి, అక్కడ స్ఫటిక స్తంభంలో దాచిపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని తీసుకొని పారిపోతున్నాడు. అప్పుడు మండోదరి హనుమంతునికి పళ్ళను ఇస్తే, బ్రహ్మాస్త్రాన్ని వదిలేస్తాడనుకొని అతడికి రకరకాల పళ్ళను ఇచ్చి ప్రలోభపెడుతుంది. కానీ హనుమంతుడు ఆ ప్రలోభాలకు ప్రభావితుడు కాలేదు”.
యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః | యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ||(గీత-6.22)
'పరమాత్మ ప్రాప్తిని పొందిన భక్తుడు ఇతరమైనవేవీ ఉన్నతమైనవిగా భావించడు, ఎలాంటి దుఃఖాలకూ చలించడు.”
శ్రీకృష్ణుడు బోధించిన ఈ పారమార్థిక సందేశాన్ని 'భగవన్నామమనే బ్రహ్మాస్త్రం మన వద్ద (యోగస్థితిలో) ఉంటే, ప్రాపంచిక ఆకర్షణలనే ఫలాలు మనల్ని ప్రలోభపరచలేవు' అని శ్రీరామకృష్ణులు తనదైన శైలిలో సరళంగా బోధించారు.
ఆరంభ శూరత్వం... అప్రమత్తత :
మనం అధికోత్సాహంతో సాధన ప్రారంభిస్తాం.
కానీ కొంత కాలానికి సాధన పట్ల ఆసక్తిని కోల్పోతాం. జపతపాలను అభ్యసించడం మానివేస్తాం. అందువల్ల సాధకులు ఆరంభశూరులు కాకూడదు అంటూ నవ్విస్తూనే హెచ్చరిస్తున్నారు శ్రీరామకృష్ణులు.
“ఒకసారి శ్రీరామకృష్ణులు, నరేంద్రుడితో 'చూడూ! నువ్వు కొత్త పెళ్ళికొడుకులా కాకుండా తరచూ ఇక్కడకు వస్తూ ఉండు' ( అని అనగానే నరేంద్రుడు, మహేంద్రుడు పగలబడి నవ్వారు”. - సాధకులు ఆరంభశూరులు కావద్దనీ, నిష్ఠతో సాధనలు చేయాలనీ శ్రీరామకృష్ణుల హితోపదేశం.
సాధకుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంలో సూచిస్తూ, “రైతు ఎద్దును కొనడానికి సంతకు వెళతాడు. అయితే ఎద్దు చురుకైనదా! కాదా! అని తెలుసుకోవడానికి దాని తోకను పట్టుకొని పరీక్షిస్తాడు. తోక పట్టుకోగానే ఎలాంటి చలనం లేకుండా చల్లగా నేల మీదకు ఒరిగితే అలాంటి ఎద్దును రైతు కొనడు. కానీ ఏ ఎద్దు అయితే తోక పట్టుకోగానే ఎగిరి గంతు వేస్తుందో అది చాలా చురుకైనదని గుర్తించి దాన్ని మాత్రమే రైతు కొంటాడు”.
ఆధ్యాత్మిక జీవితంలో ఆదమరిచి ఉంటే అరిషడ్వర్గాలు మనల్ని అధోగతిపాలు చేస్తాయి. మనం భగవంతుని అనుగ్రహం పొందాలంటే సాధన పథంలో సదా అప్రమత్తంగా వ్యవహరించాలి.
అందుకే ఆది శంకరాచార్యులు ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్యః కదాచన... (వివేక చూడామణి - 322) - బ్రహ్మ విచార విషయం (సాధన విషయం)లో అజాగరూకత పనికిరాదు' అని హెచ్చరించారు.
సత్సాంగత్యం, భగవన్నామ కీర్తన, జపధ్యానాలను అభ్యసించడం ద్వారా మనస్సు భగవంతుని వైపు మరలుతుందనీ; అప్పుడు సంసార చింతలన్నీ తగ్గి, చిత్తశాంతి లభిస్తుందనీ; ఆత్మానందాన్ని అనుభవించి నప్పుడు ప్రాపంచిక ఆకర్షణలు ప్రలోభ పెట్టలేవనీ; ఇంద్రియాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉంటే భగవంతుడు ప్రసన్న మవుతాడనీ -ఇలా ఎన్నో పారమార్ధిక పారిజాతాల్ని 'కథామృతం' అనే నవ్వుల పూదోటలో శ్రీరామకృష్ణులు వికసింపజేశారు.
ఆ పారమార్ధిక పారిజాతాలను ఆఘ్రాణిద్దాం. ఆధ్యాత్మిక పథంలో పురోగమించి ఆత్మానందాన్ని పొందుదాం.
🕉🌞🌏🌙🌟🚩
*అమృతస్య పుత్రా:*
*9-శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
భక్తుడు: ఏ రూపాన్ని దృష్టిలో ఉంచుకొని ధ్యానం చెయ్యాలి?
శ్రీ రామకృష్ణులు: ఏ రూపం చేత ఎక్కువగా ఆకర్షితుడవవుతావో, ఆ రూపాన్ని మనస్సులో పూర్తిగా నిలుపుకో. అన్ని రూపాలూ పరబ్రహ్మమే అని గ్రహించినవాడు కృతార్థుడవుతాడు. మానవ రూపంలో ఉన్న అవతారాలన్నీ ఆయన నీడలు మాత్రమే అని గ్రహించాలి.
భక్తుడు: భగవంతుణ్ణి మనం కళ్ళతో చూడగలమా?
శ్రీ రామకృష్ణులు: దైవకృప కలిగినప్పుడు దేవుడు దివ్యనేత్రాలు ప్రసాదిస్తాడు. ఈ భౌతికమైన కళ్ళతో చూడలేం. అర్జునునికి కూడా దివ్య చక్షువులు ప్రసాదించి, పిమ్మట తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు కృష్ణుడు. రాగభక్తి కలవాడికి దైవకృప తప్పకుండా సిద్ధిస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించడం వీరి స్వభావం.
భక్తుడు: మేమంతా సామాన్యులం. ఎన్నో పాపాలు చేస్తుంటాం మా గతి ఏమవుతుంది?
శ్రీ రామకృష్ణులు: చెట్లను ఆశ్రయించిన పక్షులు రెండు చేతులతో చప్పట్లు కొట్టగానే ఎలా ఎగిరిపోతాయో భగవన్నామం ఉచ్చరించడం వల్ల మానవులు చేసే పాపకర్మలు అలాగే వదలి పోతాయి. భగవన్నామమే చప్పట్లు. పాపాలే పక్షులు. శరీరం చెట్టు లాంటిది. సూర్యరశ్మి వల్ల చెరువులోని నీరు ఆవిరి అయి నట్లు, భగవన్నామ సంకీర్తనం వల్ల పాపాలు ఆవిరి అయిపోతాయి.
భక్తుడు: దేవుడు మమ్మల్ని ఈ సంసారంలో ఎందుకు దింపాడు?
శ్రీ రామకృష్ణులు: సంసారం కర్మక్షేత్రం. కర్మల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించవచ్చు. చేయదగిన కర్మల, చేయరాని కర్మల గురించి గురువు ఉపదేశిస్తాడు. అంతేగాక నిష్కామకర్మ చేయాల్సిందిగా గురువు శిష్యులకు బోధిస్తాడు. కర్మ చేసేకొద్దీ మనోమాలిన్యం నశిస్తుంది. సమర్ధుడైన వైద్యుడి సలహా మేరకు ఔషధం పుచ్చుకొని రోగాన్ని నయం చేసుకోవడం లాంటిది ఇది.
భక్తుడు: భగవంతుడు మమ్మల్ని సంసారం నుండి ఎందుకు విముక్తుల్ని చేయకున్నాడు?
శ్రీ రామకృష్ణులు: ఈ కామినీ కాంచనాల్ని అనుభవించాలన్న కోరిక వదలిపోయినప్పుడు మనల్ని ఆయన సంసారం నుండి విముక్తుణ్ణి చేస్తాడు. ఒకసారి ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకొ న్నాక సదరు వ్యక్తి అక్కడ నుండి ఎక్కడికీ వెళ్ళలేడు. రోగం నయం కానిదే అతడు వెళ్ళడానికి వైద్యుడు అనుమతి ఇవ్వడు.
🕉🌞🌏🌙🌟🚩
*అమృతస్య పుత్రా:*
*10-శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు*
🕉🌞🌏🌙🌟🚩
4....
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
ఏ కాస్తయినా కోరిక అనేది ఉన్నట్లయితే భగవంతుణ్ణి పొందలేము.
ఏ కాస్తయినా కోరిక అనేది ఉన్నట్లయితే భగవంతుణ్ణి పొందలేము. సూదిలోనికి దారు ఎక్కించేటప్పుడు దారంలోని ఒక నూలు పోగు విడివడి ఉన్నా సరే దానిని ( దారాన్ని ) సూది (బెజ్జం ) లోనికి ఎక్కించలేము.
కొందరు | 30 ఏళ్లపాటు జపం చేస్తుంటారు. అయినప్పటికీ ఏం ప్రయోజనం ? కుళ్లిపోతున్న పుండు మామూలు మందులతో మానదు. దానికి పిడకలు కాల్చి వాతలు పెట్టాల్సి ఉంటుంది. కోరికలున్నట్లైతే సాధనలెన్ని చేసినా యోగం సిద్ధించదు.
కాని ఒక్క విషయం మాత్రం నిజం. భగవత్ కృప గలిగినట్లైతే, ఆయన అనుగ్రహించి నట్లైతే ఒక్క క్షణంలోనే యోగం సిద్ధిస్తుంది. వెయ్యేళ్లుగా చీకటితో నిండిన గదిలోనికి ఎవరైనా దీపాన్ని తెస్తే ఆ గది ఒక్క క్షణంలో ప్రకాశవంత మవుతుంది గదా అలాంటిదే ఇదీను.
నిరుపేద బాలుడొకడు ఒక పెద్ద ధనవంతుని దృష్టిలో పడ్డాడు. ఆయన ( ధనవంతుడు ) వానికి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేశాడు. వెంటనే ఆ నిరుపేద బాలునికి ఇల్లూ వాకిలీ, పొలం పుట్టా, బండ్లు వాహనాలు అన్నీ చేకూరాయి. భగవత్ కృప అట్టిదే.
భక్తుడు - మహాశయా! భగవత్ కృప ఎలా లభిస్తుంది ?
శ్రీ రామకృష్ణులు : భగవంతుడిది బాలక స్వభావం. పిల్లవాడొకడు జేబులో రత్నాలు పెట్టికొని ఇంటి గడప మీద కూర్చొని ఉన్నాడనుకుందాం. దారిలో ఎంతోమంది వస్తూపోతూంటారు.
వారిలోచాలామంది ఆ బాలుణ్ణి రత్నాలివ్వమని అడుగుతారు. కాని ఆ పిల్లవాడు ముఖం ప్రక్కకు తిప్పుకొని ఊహూ, నేనివ్వనంటే ఇవ్వను అంటాడు. అయితే కాసేపటి తరువాత ఒక వ్యక్తి ఆ దారిన వెళ్లుతున్నాడు.
అతడు పిల్లవానిని రత్నాలు కావాలి అని కూడా అడుగడు. అయినా సరే ఆ బాలుడు పరుగు పరుగున అతని వద్ద కెళ్లి రత్నాలన్నిటిని ఆ వ్యక్తి చేతిలో పెడుతాడు. త్యాగం లేకుండా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోలేం.
🕉🌞🌏🌙🌟🚩
నిత్య సత్య ప్రాంజలి ప్రభలు....4
*శ్రీ ఆదిశంకరాచార్య విరతం శ్రీ భవానీ అష్టకం*
🔥ఓంశ్రీమాత్రే నమః..ఓం శ్రీ రామ
*1) న తాతో న మాతా న బన్ధుర్న దాతా న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా ।*
*న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥*
*ఓ భవానీ! తల్లీ! నాకు తల్లిగాని, తండ్రిగాని, కొడుకుగాని, కూతురుగాని, యజమానిగాని, సేవకుడుగాని, భార్యగాని, బంధువుగాని, విద్యగాని, వృత్తిగాని ఏదియూ లేదు. కేవలము నీవొక్కతవే నాకు దిక్కు, నాకు దిక్కు.*
*2) భవాబ్ధావపారే మహాదుఃఖభీరు పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః ।*
*కుసంసార పాశ ప్రబద్ధః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥*
*అమ్మా! భవానీ! కామాంధుడనై, లుబ్ధుడనై, మత్తుడనై, జన్మపాశబద్ధుడనై, తట్టుకొనలేని దుఃఖముతో మిక్కిలి భయగ్రస్తుడనై, అవ్వలియొడ్డులేని సంసారసాగరమున పడిపోయితిని. తల్లీ నీవేతప్ప నాకెవరుదిక్కు లేరు. నీవొక్కతివేదిక్కు.*
*3) న జానామి దానం న చ ధ్యానయోగం న జానామి తన్త్రం న చ స్తోత్రమన్త్రమ్ ।*
*న జానామి పూజాం న చ న్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥*
*ఓ భవానీమాత! దానము – ధ్యానము- మంత్రము – యంత్రము – పూజ – పునస్కారము – న్యాసము – యోగము – ఏదియునూ తెలియదు. నీవేతప్ప నాకు వేరే దిక్కు లేదు. నీవేదిక్కు.*
*4) న జానామి పుణ్యం న జానామి తీర్థం న జానామి ముక్తిం లయం వా కదాచిత్ ।*
*న జానామి భక్తిం వ్రతం వాపి మాతః గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥*
*అమ్మా! భవానీ! పుణ్యకార్యము లేదు, తీర్థసేవ లేదు, మోక్షోపాయము తెలియదు, జన్మరాహిత్యము తెలియదు, భక్తి మార్గము తెలియదు, ఏ వ్రతములూ నోములూ తెలియవు, తల్లీ నీవే దిక్కు నీవేదిక్కు.*
*5) కుకర్మీ కుసఙ్గీ కుబుద్ధిః కుదాసః కులాచారహీనః కదాచారలీనః ।*
*కుదృష్టిః కువాక్యప్రబన్ధః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥*
*తల్లీ నేనెట్టివాడననుకొనుచుంటివి. దుష్కర్మాచరణము – దుస్సాంగత్యము – దుర్బుద్ధులు – దుష్టసేవకజనము – కులాచారహీనత్వము – దురాచార తత్పరత – దురాలోచనలు – దుర్వాక్యములు ఇవి నా లక్షణములు. అందుచేత నన్నుద్ధరించుటకు నీవు తప్ప వేరే దిక్కు లేదు, లేదు.*
*6) ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిశీథేశ్వరం వా కదాచిత్ ।*
*న జానామి చాన్యత్ సదాహం శరణ్యే గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥*
*ఓ సర్వశరణ్యా! బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు – ఇంకెందరెందరో దేవతలు ఉన్నారు. ఒక్కర్ని గురించి కూడ నేను ఎఱుగను. నాకు తెలియదు. నీవే దిక్కు తల్లీ, నీవే దిక్కు.*
*7) వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతే శత్రుమధ్యే ।*
*అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥*
*ఓ మాత! ఏదైన వివాదమున గాని – విషాదమునగాని – ప్రమాదమునగాని – ప్రవాసమునగాని – నీటిలోగాని – నిప్పులోగాని – కొండలమీదగాని – అడవులలోగాని – శత్రువులమధ్యగాని – ఎక్కడైనాసరే నన్ను నీవే రక్షింపవలయునమ్మా! నాకు నీవే దిక్కు అమ్మా. నీవే దిక్కు.*
*8) అనాథో దరిద్రో జరారోగయుక్తో మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః ।*
*విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥*
*ఓయమ్మా! నేను దరిద్రుడను. ముసలితనము – రోగములు – జాడ్యములు – నన్నాక్రమించి యున్నవి. మహావిపత్సముద్రమున మునిగి యున్నాను. సర్వవిధముల కష్ట, నష్టములపాలై వున్నాను. కావున నీవే నన్ను ఉద్ధరింప వలయును. నాకు నీవే దిక్కు . నీవే దిక్కు.*
*॥ ఇతి శ్రీఆది శంకరాచార్య కృతం భవాన్యష్టకం సంపూర్ణమ్ ॥*
🕉🌞🌎🌙🌟🚩