Saturday, 22 May 2021

ప్రాంజలి ప్రభ పాత కధలు (71- 80)


71..రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చిలుక కథ
----------------------------------
పిల్లలని చదివిస్తున్న ప్రతి తల్లీతండ్రీ చదవాల్సిన కథ ..

ఒక చిలుక ఉండేది.చక్కగా పాడేది. స్వేచ్ఛగా ఎగిరేది. కానీ చదవలేకపోయేది.అది రాజు గారి తోటలోని చిలుక. ఒకరోజు అది రాజు గారి కంట్లో పడింది. వెంటనే మంత్రిని పిలిచి 'ఎడ్యుకేట్ ఇట్' అని ఆదేశించాడు. దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను రాజు గారి మేనల్లుడి మీద ఉంచాడు మంత్రి.
ఎలా ఆ చిలుకను ఎడ్యుకేట్ చేయటం? విద్యావేత్త లు కూర్చుని తీవ్రంగా ఆలోచించారు. చిలక్కి చదువు చెప్పాలంటే... మొదట అది కుదురుగా ఉండాలి. అంటే.... అది ఎగురకూడదు.వెంటనే ఒక మంచి పంజరం చేయించారు. చిలుకను అందులో కూర్చోబెట్టారు. కోచింగ్ ఇవ్వటానికి ఒక పండితుడు వచ్చాడు. చిలుకను చూశాడు. ' ఈ చిలక్కి ఒక పుస్తకం సరిపోదు' అన్నాడు.గుట్టల కొద్దీ పుస్తకాలు వచ్చేశాయి గంటల కొద్దీ చదువు మొదలైంది.
పంజరం చూడ్డానికి వచ్చిన వాళ్లేవరూ ' అబ్బా... భలే చిలుక' అనటం లేదు. ' అబ్బా... ఏం పంజరం!' అంటున్నారు. లేదంటే ' అబ్బా ... ఎంత చదువు!' అంటున్నారు. రాజు గారిని మెచ్చుకుంటున్నారు.మంత్రిగారిని ప్రశంసిస్తున్నారు.రాజుగారి మేనల్లుడిని, పంజరం తయారుచేసిన కంసాలిని, చదువు చెప్పటానికి వచ్చిన పండితుడిని ' ఆహా... ఓహో ' అని కీర్తిస్తున్నారు.
రాజు గారు మంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పారు... ఎన్ని లక్షల వరహాలు ఖర్చైన పర్వాలేదు. చిలక్కి బాగా చదువు రావాలని. మంచి మేనర్స్ కూడా రావాలని.
' అలాగే ' అని లక్షల వరహాలు దఫా దఫాలుగా కోశాగారం నుంచి తెప్పించారు మంత్రిగారు. సెమిస్టర్లు గడుస్తున్నాయి.
ఓ రోజు రాజుగారికి చిలకెలా చదువుతుందో చూడాలనిపించింది. వెంటనే ఏర్పాట్లు జరిగాయి. 'చిలుకను చూడడానికి రాజుగారు వస్తున్నారహో ' అని తప్పెట్లు, తాళాలు ,పెద్ద పెద్ద శబ్దాలు చేసే బూరలతో ఒకటే హోరు. రాజు పరివారం అంతా రాజు కన్నా ముందే చిలుక దగ్గరికి చేరిపోయింది. అయితే పంజరం లోని చిలుకను ఎవరు పట్టించుకోవటం లేదు. ఎవరూ దాని వైపు చూడటం లేదు.పండితుడు ఒక్కడే చూస్తున్నాడు. ఆయనైనా చిలుక సరిగా చదువుతుందా లేదా అని చూస్తున్నాడు తప్ప , చిలకెలా ఉందో చూడటం లేదు. చిలుక బాగా నీరసించి పోయింది. మానసికంగా బాగా నలిగిపోయి ఉంది. ఆ రోజైతే .... రాజుగారి సందర్శన ధ్వనులకు చిలక సగం చచ్చిపోయింది. తర్వాత కొద్దిరోజులకే పూర్తి ప్రాణం విడిచింది ! ఆ సంగతి ఎవరికీ తెలీదు. తెలిసిన వాళ్ళు ఎవరికి చెప్పలేదు. ముఖ్యంగా రాజుగారికి చెప్పలేదు.
రాజుగారు మళ్ళీ మేనల్లుడిని పిలిచి, ' చిలుక ఎలా చదువుతోంది? ' అని అడిగాడు.
' చిలుక స్టడీస్ కంప్లీట్ అయ్యాయి' అన్నాడు మేనల్లుడు.
రాజుగారు సంతోషించారు. తన కృషి ఫలించిందన్నమాట.
' ఇప్పటికి అల్లరి చిల్లర గానే ఎగురుతోందా?'
' ఎగరరదు'
' ఏ పాట పడితే ఆ పాట పాడుతోందా? '
'పాడదు'
' సరే, చిలుకను ఒకసారి నా దగ్గరికి తీసుకురా'
తీసుకొచ్చాడు మేనల్లుడు. చిలుక నోరు తెరవడం లేదు.ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.చిలుక కడుపు ఉబ్బెత్తుగా ఉంది. చిలుక అసలు కదలనే కదలటం లేదు.
" ఆ కడుపులోనిది ఏమిటి!" అని అడిగారు రాజు గారు.
' జ్ఞానం మామయ్య ' అని చెప్పాడు మేనల్లుడు.
' చిలుక చనిపోయినట్లు ఉంది కదా ' అన్నారు రాజుగారు.
చిలుక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత. చచ్చిందా బతికిందా అని కాదు అన్నట్లు చూశాడు రాజుగారి మేనల్లుడు.
.....................
నూరేళ్ళ క్రితం విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ రాసిన చిలుక కథ ఇది.ఇప్పటి కార్పోరేట్ విద్యాసంస్థలకు సరిగా సరిపోతుంది.

--(())--

72...  "" ప్రాంజలి ప్రభ " చిన్న కధ "


*చారు*  అంటే ఏమిటో  చదవండి 

*చారుకి చారని పేరెందుకంటే నవ్వుతారేంటో...*నవ్వకండి, ఇది చిత్తగించండి...

చింతపండు
ఇంగువ
పోపు దినుసులు
ఉప్పు

ఈ నాలుగు(చార్) కీలక పదార్థాలు నీటిలో వేస్తే తయారౌతుందని దానిని చారన్నారో మరేమో....
చారు చాలా సులభంగా ఏ కష్టమూ లేకుండా తయారౌతుంది....

పప్పేస్తే పప్పు చారు
టమాటాలతో టమాటా చారు
మునగేస్తే మునగచారు
మిరియం వేస్తే మిరియాల చారూ

ఏక్ దో తీన్ చార్ అని నాలుగు నిమిషాలలో.......

ఇలా పాపం దేనిని తగిలిస్తే దానితో కలగలిసిపోయి తన రుచిని దానికిచ్చేసి దాని పసని తనలో కలిపేసుకుని వేడి వేడిగా తాగినవాడిలో కొత్త ఉత్తేజాన్ని నింపేస్తుంది.

పళ్ళు రాని పాపడి నుంచి పళ్ళూడిన తాత దాకా మరి మెచ్చేదే చారూ బువ్వ....
అన్న ప్రాసన తర్వాత రుచులు అలవాటయ్యేది చారుతోటే.
మారాం చేసే బుజ్జి గాడికి గోరుముద్దలు తినిపించేది చారుగుజ్జు తోనే...
మీకు ఉప్మా నచ్చదా...ఐతే ఓ రెండు చెంచాల చారు కలుపుకొండి...అమృతమే....
జొరమొస్తే లంఖణం తర్వాత తినిపించేది చారే...

*ఇంట్లో శ్రీమతికి కోపం వచ్చిందంటే(వస్తేనూ) కంచంలో తగిలేవి చారునీళ్ళే...* *అంతే కాదండోయ్ ప్రేమగా పెడితే చారంత రుచికరమైన వంటకం మరోటి ఉంటుందా....నిజం ఒప్పుకోండి....*
ఇంట్లో పెద్దాళ్ళకి జలుబు పట్టిందంటే...మరింక ఆ రోజు అందరికీ చారు భోజనమే...
*ప్రియే....చారు శీలే ... అన్నారు గుర్తుందండీ జయదేవులవారు...*
**చారు అంటే అందమైనది అద్భుతమైనది అని..* *అలాగే చారు బాగా కాచగలిగిన ఇల్లాలిని చారుశీల అనీ, చారు లేందే ముద్ద దిగని భర్తను చారుదత్తుడు అని అంటే తప్పా... చెప్పండి...*
మరి చారు తాగే జయదేవులు అష్టపదులు చెప్పుంటారు లెండి మరి...ఒడిషా మరి తెలుగు దేశానికి దగ్గరే కదా....
మరి వేడి చారు తాగడానికి సమయం సందర్భం అవసరం లేదని నా అభిప్రాయం....
వేడి వేడి చారు పొగలు గ్రక్కుతూ ఇంగువ ఘాటుతో కరివేపాకు ఘుమఘుమలు ముక్కుకు తగుల్తూ ఉంటే దాని ముందు అన్ని పేరొందిన ద్రవపదార్థాలు దిగదుడుపే... మరి కొత్తిమీర త్రుంచివేసి, కాచిన చారైతే మరింత రుచి... అద్భుతః, అమోఘః......
కాఫీకి ముందు మన పూర్వీకులు చారే కాచుకు తాగేవారని నా గట్టి ప్రగాఢ నమ్మకం...
డికాషన్ చూడండి మరి చారు రంగు కాదూ...
మా అమ్మమ్మ పెట్టేది కుంపటి పై కాచిన సత్తుగిన్నెలో చారు....ఆ పోపుకొచ్చిన ఘాటు నాకు ఇప్పటికీ జ్ఞాపకం....ఆ రుచి....ఇప్పటికి మళ్ళీ చూడలేదు....
మరి చారు రుచి ప్రాంతాన్ని బట్టి మారుతుంది.... గుంటూరు ఘాటు మిర్చితో పెట్టిన చారుదొక తీరు... ఉత్తరాంధ్రలో బెల్లంతో పెట్టిన చారే వేరు....
ఇలా చెప్పుకుంటూ పోతే..
అహో ఏమి చెప్పను చారు...
వేడి వేడిగా గొంతులో జారు.. చెవులనుండి వచ్చు హోరు..
జలుబు దగ్గులు ఓ గుటకతో తీరు......
ఇంకే ద్రవమేనా చారుముందు బేజారు
చార్ మినిట్ మే బనే చారు
ఆ ఘాటుకు మాత్రం నా జోహారు
*మాతృహీన శిశుజీవనం వృధా, కాంతహీన నవయవ్వనం వృధా,*
*శాన్తిహీనతపసః ఫలం వృధా, తింత్రిణీరస విహీన భోజనం వృథా, వృథా!!*
తల్లిలేని పిల్లవాని బ్రతుకు, భార్యలేనివాని యవ్వనం, శాంతం లేని ఋషి తపస్సు ఇవన్నీ ‘చారు’ లేని భోజనంలా నిష్ఫలం అని పై శ్లోకానికి అర్ధం.

--((***))--
73... Message Copied from a Face book posting.


పిల్లలపై అత్యంత ప్రభావం చూపేది కుటుంబం, కుటుంబ వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన, వారి పెంపకం. కానీ ఈ వాస్తవాన్ని అంగీకరించేందుకు, ఆ బాధ్యతను అంగీకరించేందుకు మనం సిద్ధంగా లేము. ఎందుకంటే... మన పిల్లలు తప్పుదారి పట్టడానికి మనమే కారణమని అంగీకరించలేము. తల్లిదండ్రులందరూ తప్పు చేశారనను, చేస్తున్నారనను. పెళ్లయ్యాక పిల్లలు పుట్టడం సహజంగా జరిగే చర్య. కానీ పిల్లల పెంపకం అంత సులువుగా, సహజంగా జరిగే చర్య కాదు. అదో సైన్స్, ఆర్ట్. ఏ వయసులో పిల్లలు ఎలా పెరుగుతారో, ఎలా ఆలోచిస్తారో, ఎలా స్పందిస్తారో తెలియకుండానే, తెలుసుకోకుండానే పిల్లల్ని పెంచేస్తున్నాం. ఫలితమే ఇలాంటి సమస్యలు.

#మరి_ఈ_తప్పులెవరివి?
❓ఉదయం లేచింది మొదలు మొబైల్ లేదా ల్యాప్ టాప్ పై గడిపే తండ్రి తన కూతురు మొబైల్ ఫోన్ కు అడిక్ట్ అయ్యొందంటూ కౌన్సెలింగ్ కు తీసుకువచ్చారు. ఆ మొబైల్ కొనిచ్చిందెవరు? ఎవర్ని చూసి ఆమె మొబైల్ వాడకం నేర్చుకుంది? నువ్వు చేస్తుంది ఏంటి డాడీ అని ఆ అమ్మాయి అడిగితే ఆ తండ్రి ఏం సమాధానం చెప్తాడు?
❓చదువుకోసం, బంగారు భవిష్యత్తు అందించేందుకు కొడుకుని చిన్నప్పటినుంచీ ఇంటికి దూరంగా రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో చదివించిన తల్లిదండ్రులు ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన కొడుకు తమను పట్టించుకోవడంలేదని బాధపడుతూ కౌన్సెలింగ్ కు వచ్చారు. బంధాలు, అనుబంధాలకు దూరంగా మార్కులు, ర్యాంకులకు దగ్గరగా పెంచి, ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం?
❓కెనడాలో స్థిరపడిన ఓ భారతీయ కుటుంబం తమ కూతురు ఆల్కహాల్ కు అడిక్ట్ అయ్యిందంటూ సంప్రదించారు. కానీ తాగడం తమ దగ్గరినుంచే నేర్చుకుందనే విషయం దాచిపెడతారు. ఎవర్ని మోసం చేసేందుకు?
❓విజయవాడకు చెందిన ఓ వ్యాపారకుటుంబం తమ కూతురికి రోజుకు మూడు వేలు... ఎస్, రోజుకు మూడువేలు పాకెట్ మనీ ఇచ్చారు. అంత పాకెట్ మనీ ఇవ్వడం గర్వంగా ఫీలయ్యారు. ఇప్పుడదే సమస్యగా మారింది. కౌన్సెలింగ్ కు వచ్చారు. కూతురుకి రోజుకు మూడువేలిచ్చిన తండ్రి నా ఫీజు మాత్రం వెయ్యి తగ్గించి ఇచ్చాడు. దేనికి డబ్బు ఖర్చు పెట్టాలో, ఎక్కడ పొదుపుగా ఉండాలో తల్లిదండ్రులకే తెలియకపోతే ఆ పిల్లకెలా తెలుస్తుంది?
❓సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఒంటరితనంతో బాధపడుతున్నానంటూ సంప్రదించాడు. తన కుటుంబ సభ్యులు తన సంపాదన కోసమే చూస్తున్నారు తప్ప తనను పట్టించుకోవడంలేదని ఏడ్చేశాడు.
❓తిరుపతి చెందిన ఓ తండ్రి అమెరికాలో చదువుతున్న కొడుక్కి కారు కొనిపెట్టాడో తండ్రి. అతను దారితప్పి ఇండియాకు వచ్చేశాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కౌన్సెలింగ్ కు తీసుకొచ్చారు. చదువుకునే కొడుక్కి కారు ఎందుకనే ప్రశ్న తండ్రికి రాలేదు. అవసరానికి (నీడ్) ఆడంబరానికి (వాంట్) మధ్య తేడా తెలీకుండా పెంచి ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం? కొడుక్కి కారు కొనిచ్చిన తండ్రి కౌన్సెలింగ్ ఫీజు దగ్గర మాత్రం కూరగాయల బేరాలాడటం కొసమెరుపు.

#ఏం_నేర్పిస్తున్నాం?
⁉ కొడుకు ప్రాజెక్టు వర్క్ కోసం ఆపీసు నుంచి ప్రింట్లు తీసుకొచ్చే తండ్రి పరోక్షంగా అతనికి ఏం నేర్పిస్తున్నాడు?
⁉ నచ్చిన చీర కొనుక్కుని ఆ విషయం భర్తకు చెప్పొద్దని చెప్పే తల్లి ఆ కూతురుకి ఏం నేర్పిస్తుంది?
⁉ పిల్లల ఎదురుగా భర్త లేదా భార్యతో గొడవపడటం ద్వారా మీరేం నేర్పిస్తున్నారు?
⁉ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నవ్వుతూ ఆహ్వానించి, వారు వెళ్లిపోగానే విమర్శించే మీనుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారో తెలుసా?
⁉ లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిని తల్లిపై బిడ్డలకు ఏం గౌరవం ఉంటుంది?
⁉ పిల్లలు చదువుతుండగా మీరు టీవీ చూస్తుంటే వారిపట్ల మీకేం శ్రద్ధ ఉన్నట్లు?
⁉ పిల్లల్ని కూర్చోబెట్టుకుని జబర్దస్త్ లాంటి షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే విలువలు ఎక్కడినుంచి వస్తాయి?
⁉ మార్కులు, ర్యాంకుల గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీరెప్పుడైనా మాట్లాడారా? వారి ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకున్నారా? అసలు వారికిష్టమైన కోర్సు చదవనిచ్చారా?
⁉ చదువుల పేరుతో లక్షలకు లక్షలు ఖర్చుచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన తీరులో ఆలోచించడం నేర్పిస్తున్నారా? దానికోసం రూపాయైనా ఖర్చు చేస్తున్నారా?
⁉ అసలు పిల్లల్ని ఎలా పెంచాలో మీకు తెలుసా? అందుకోసం కనీసం ఒక్క పుస్తకమైనా కొని చదివారా? ఒక్క వీడియో అయినా చూశారా? ఒక్క క్లాసయినా విన్నారా?
⁉ అవసరానికి, ఆడంబరానికి మధ్య ఉన్న తేడా మీ పిల్లలకు తెలిసేలా చేశారా?
⁉ సరదాకు, విచ్చలవిడితనానికి తేడా ఏమిటో వివరించారా?
⁉ వారి జీవితానికి వారే బాధ్యులని ఎన్నడైనా చెప్పారా?
⁉ మీ పిల్లలు చెడిపోవడానికి మీడియా, సోషల్ మీడియా, టెక్నాలజీనే కారణమని తిడుతూ మీరు మీ బాధ్యతనుంచి తప్పించుకుంటున్నారని ఎన్నడైనా గుర్తించారా?
మీ పిల్లలు మిమ్మల్ని నిరంతరం గమనిస్తుంటారని, మిమ్మల్నే అనుసరిస్తారని, వారిపై అన్నింటికంటే మీ ప్రభావమే ఎక్కువని తెలుసుకోండి.
అన్నిటికీ సమాజాన్ని తిట్టడం మానేసి మార్పు మీనుంచి, మీ ఇంటినుంచి మొదలుపెట్టండి.

+-(())----

74... నడిమింటి మంగళేశ్వర శాస్త్రులు ---మొదటిభాగం
-----------------------------------------
వీరు180 ఏళ్ళ క్రిందటి వరకు జీవించి యుండినారు.విశాఖ జిల్లాలోని నాగూర అను అగ్రహారమున జన్మించినారు.విశాఖ మండల మందే గాక సర్వాంధ్ర దేశమందు ఈ పండిత ప్రకాండుని పేరు ప్రఖ్యాత మైనది.
వ్యాకరణ శాస్త్ర మందీయన మహా పండితుడు.సుకవి. సంస్కృత భాషా పరిచయము గోరు విద్యార్థుల కోసము
"సమాసకుసుమావళి"యను ఈయన రచించిన లఘు గ్రంథప్రశస్తమైనది.సంస్కృతము చదువు ప్రతి విద్యార్థి,విద్యార్థినులు ఈ గ్రంథ ప్రతిని చదువుకుంటారు.బొబ్బిలి సంస్థానమునకు వీరి యగ్రహారము దగ్గరలోనే వున్నది.బొబ్బిలి రాజుగారు ఎప్పుడూ మీకు ఒక వూరు యిస్తాను లెండి అనేవారట కానీ ఎప్పుడూ యివ్వలేదట.ఆ సంస్థానం లో పనిచేయు ఒక ఉద్యోగి బొబ్బిలి రాజా వారు మీకు వూరిస్తామని చెప్పినారండీ
అన్నాడట.వెంటనే శాస్త్రిగారు అవునవును మీ రాజావారు ఎప్పుడూ ఊరిస్తూనే వుంటారు లెండి.అని వ్యంగ్యముగా అన్నారట.
ఒకసారి బొబ్బిలి సంస్థానములో నివసించు ఒకతని యింట దొంగలు పడి కొంత సొమ్ము తీసుకొని పోయినారట.అందుకా గృహస్తు రాజుగారికి ఫిర్యాదు చేయగా యింటికి కన్నము వేసి దొంగ ప్రవేశించలేదు గనుక విచారించుటకు వీలు పడదని చెప్పి దండోరా వేయించినారట.దానికి శాస్త్రులు గారు వ్యంగ్యముగా ఈ శ్లోకమును చెప్పినారట,
చోరస్సద్మో ర్థ్వ భేదాదర రవిఘటనా త్తత్ప్రఘాణా ప్రఖానా
దేడూకచ్చేదనాద్వా విశతి యది గృహాంత త్రనో నో విచారః
కిం త్వస్మాకం సురంగా కలనయితి పురే ఘోషయా మాసయస్మా
త్తస్మా దేత త్సురంగాధిప యితి బిరుదం ప్రోచురేత త్సురస్థాః
అర్తము:--దొంగ యింటి పైభాగం పగులగొట్టి యింటిలో ప్రవేశించినా,తలుపు బద్దలు కొట్టి ప్రవేశించినా
మేము విచారించము సురంగం(కన్నము) చేసి లోనికి ప్రవేశించి దొంగతనం చేస్తేనే మేము దొంగను పట్టు
కుంటాము అని దండోరా వేయించడం వలన ప్రజలందరూ ఈ రాజుకు "సురంగాధిప"అనే బిరుదు యిచ్చినారు.
శాస్త్రిగారు ప్రాచీన శ్లోకములను సందర్భానుసారంగా వేరు అర్థము వచ్చునటుల చెప్పెడి వారట.
విజయనగర సంస్థానమున అనంతరావు అనే దుబాసి (అనువాదకుడు)వుండే వాడట.అతనికి శాస్త్రి గారిచే పొగడించుకోవాలని కోరిక ఉండేదట.ఒకసారి శాస్త్రిగారు పనిమీద అతని దగ్గరికి వెళ్లారట.అప్పుడు అనంతరావు ఏదైనా రెండర్థములు వచ్చు వింత శ్లోకమును చెప్పుమని అడిగె నట.అప్పుడు శాస్త్రిగారి
వెంట వచ్చిన శిష్యు డొకడు కుమారసంభవము గ్రంథము చేతిలోబట్టుకొని ఆయన వెనక వచ్చు చుండి నాడట.వాడి చేతిలోని పుస్తకము తీసి అందులోని శ్లోకం యిలాగ చదివారట శాస్త్రిగారు.
అనంతరత్న ప్రభవస్య యస్యః
హిమన్న సౌభాగ్య విలోపి జాతం
ఏకోహిదోషో గుణ సన్నిపాతే
నిమజ్జతీందో: కిరణేష్వి వాంకః
అర్థము:-రత్నమువంటి అనంతరాయా!హి=ఎందువలన, జాతం=(నీ యొక్క ) పుట్టుక, మన్న సౌభాగ్య విలోపి=నా యిబ్బందిని తీర్చునది యైనదో, అందువలన అయస్య =శుభకర్మమునకు,ప్రభవసి=తగి వున్నావు. ((నా పని చేయుటకు తగివున్నావు) కానీ ఏకః =ఒక్కటే, ఆహిదోషః=సర్ప దోషము, కలదు సర్పమునకు రెండు నాల్కలుండును.
అట్లే నీవు దుబాసివి రెండు భాషలు మాట్లాడు వాడివి.యిది చంద్రుని లోని కళంకము వలె నీ గుణ సమూహమునకు అడ్డుతగులుతుందేమో నని నా భయము. అంటే నా పని జరుగుతుందో లేదో నని నా
భయము.(చేస్తానని చెప్పి చేయవేమో యని)
"కుమారసంభవము" లోని అర్థము
అర్ధం:అనంత రత్నప్రభవస్య-అంతులేనిరత్నములను ప్రభవింపదేసిన;యస్య;యెవనికి;(ఏహిమవంతునకు) హిమం-మంచు; సౌభాగ్యవిలోపిొ-సౌభాగ్యలోపముగా; నజాతం-కాలేదు;
యధా-ఏప్రకారముగా;ఇందోఃకిరణేషు-చంద్రుని కిరణాలలో ;అంకఃఇవ-మచ్చవలె; గుణసన్నిపాతే-గుణసముదాయాతిశయమువలన ;ఏకఃదోషోపి- ఒకదోషమేదైననున్నను, నిమజ్దతి- అణగిపోవును (మునిగిపోవును)
భావం: కిరణప్రసారాతిరేకమువలన చంద్రునిలోనిమచ్చదోషముగా పరిగణింప బడనిరీతి, అంతులేని రత్నసంపదచే హిమవంతునిలోని మంచుకూడ దోషముగా పరిగణింపబడక గుణముగానే పరిగణింపబడుచున్నది. గుణాధిక్యతచే అల్పదోషములు లెక్కలోకి రావు.
నరసరాజు అను నాతడు యీయనకేమో ద్రోహము చేసినాడని ఆయనమీద చెప్పిన శ్లోకము.
యాగక్రియార్థం ఖలు వృక్ష రాజో
వర్ణ క్రియార్థం ఖలు భ్రుంగ రాజః
తులా క్రియార్థం ఖలు విత్త రాజో
న కించి దర్థం భువి నరసరాజో
అర్థము:--రావి మొదలగు చెట్లు యాగానికి సమిధలుగా పనికి వస్తాయి, భ్రుంగ రాజము (ఒక ఓషధి)అదిరంగులను తయారు చేయడానికి పనికి వస్తుంది,దాన్ని విత్తరాజు =వ్యాపారం చేసేవాడు
తరాజు (తక్కెడ)గా చేసుకొని ఉపయోగిస్తాడు.కానీ ఈ నరసరాజు మాత్రం లోకం లో ఎపనికీ వుపయోగపడడు.అంటే పనికి మాలినవాడు అని అర్థము.
--------------------------------------------------------------
--------------------శుభసాయంత్రం-------------------------
75...------------నడిమింటి మంగళేశ్వరశాస్త్రి-2 వ భాగం -------------
శాస్త్రిగారికి కొంచెము కోపమెక్కువ. ఏదైనా సూటిగా,ఘాటుగా సమాధానమిచ్చుట అలవాటు.
బొబ్బిలి సంస్థానము వీరి అగ్రహామునకు చేరువలోనున్నది. ఆ కారణమున బొబ్బిలి ప్రభువుతో ఈయనకు తరచూ సమాగమము కల్గుచుండెడిది. ఒకసారి విద్వత్ సభకు
ప్రభువుగారు పిలిపించారట. ఆ సభలో మనమెక్కడికైనా పోవుచున్నప్పుడు నక్క కుడివైపునుంచి ఎడమ వైపునకు పోయిన మంచిదా ?లేక ఎడవైపునుండి కుడివైపుకు పోయిన మంచిదా? అని అడిగారట. విద్వత్సభలో ఇలాంటి ప్రశ్నలా అడిగేది? అని ఒళ్ళుమండిన శాస్త్రిగారు "అది మీదపడి కరవకుండా ఎటువైపుకు పోయినా మంచిదే యని బదులిచ్చారట.
శాస్త్రిగారి అన్నగారు రుక్మేశ్వరశాస్త్రి గారు గొప్పవిద్వామ్సులట.వీరిరువురు రాజాకార్యవశమున నొకప్పుడువిశాఖపట్టణమునకు వచ్చి శిష్యులతో స్వయంపాకము
చేసుకొనుచుండిరట. ఒకనాడు అన్నగారైన రుక్మేశ్వరశాస్త్రిగారు తమ్మునితో యిట్లన్నారట. అబ్బీ!కూరగాయలకు బజారుకు వెళ్లుచున్నాను. ఏకూర తెచ్చిననూ ఆక్షేపించు చుందువు.నేడేమి తెమ్మందువో చెప్పుము అని అడిగారట.(శాస్త్రిగారికి ఎప్పుడూ ముక్కుమీదనే కోపముండేదిట) మంగళేశ్వర శాస్త్రులు కోపముతో నేను తెమ్మన్నది తెచ్చెదరేని మాణిక్యం తెండు అన్నారట.అప్పుడు రుక్మేశ్వరశాస్త్రులుగారు
చెప్పిన శ్లోకం.
మాణిక్య క్రయణం లోకే మంగళాయ భవేత్కిల
మంగళే సహజేస్మాకం మాణిక్యా త్కిమ్ ప్రయోజాజనం
 

లోకంలో మాణిక్యం కొంటే మంగళమంటారు. అయితే మాకు సహజంగానే మంగళం వుండగాయింకా మాణిక్యం ఎందుకు? మాకు మంగళుడే తమ్ముడై వుండగా మాణిక్యాలెందుకు?అని యింకొక అర్థం.మంగళుడంటే అంగారకుడు (అగ్నివంటివాడు)
తమ్ముడికి అగ్ని అంతకోపమని వ్యంగ్యముగా పలికినారట.
ఒకమారు శాస్త్రిగారు జగన్నాథుని సేవింపగోరి జగన్నాథక్షేత్రమునకు వెళ్లారట. ఆయన
పాండిత్యమును ఎరిగిన కొంతమంది ఒరియా పండితులు వీరిని దర్శించుటకు వచ్చినారట.అప్పుడీయన అక్కడి మర్రిచెట్టు ఆకులను తెంపి విస్తళ్లుకుట్టు చుండిరట.
జగన్నాథ క్షేత్రమునకు వచ్చిన వారెవరూ మర్రియాకు విస్తళ్లలో భుజింపరు.అక్కడి బ్రాహ్మణులు ఎవరూ కూడా మర్రి విస్తరాకుల్లో భోజనం చెయ్యరు.
. అది అక్కడనిషిద్ధము. ఆ ఒరియా పండితులు మీరు మర్రియాకు విస్తళ్లలో
భుజింతురా?.అని ఆక్షేపించారట.అయ్యా! మర్రియాకు విస్తళ్లలో భుజించుట నిషిద్ధము
కదా! మరియు జగన్నాథ క్షేత్రమున యది మరింత నిషిద్ధము. మీరు పండితులు యిటుల చేయతగునా?అనిరట. దానికి శాస్త్రిగారు మర్రియాకు విస్తళ్లలో యేల భుజింపరాదు? కారణమేమి అని అడుగగా ఆ పండితులు స్వామి వటపత్రశాయి. స్వామి
కి శయ్యయగుటచే అందులో భుజించుట నిషిద్ధము.ఇది ఆయన అవతార క్షేత్రము కదా! అనిరట. అప్పుడు శాస్త్రిగారు ఒక్క వెడ నవ్వు నవ్వి యిట్లనిరి." యిట్టి అవతారక్షేత్రమున
శ్రీ స్వామివారి యవతారలనే వేయించుకొని తింటారుకదా! మీ కాయన శయ్య యైన
వటపత్రములో భుజించుట నిషిద్ధమైనదా?సెబాసు. అని వ్యంగ్యముగా పలికిరట.
ఒరియా బ్రాహ్మణులు మత్స్య భుక్కులు.(చేపలుతినేవారు.అవి జలపుష్పాలని, అందుకని శాకాహారమనీ వారి యభిప్రాయము.) ఆ పండితులు ఆ సమాధానము విని
యింకేమియు అనలేక ముఖము మాడ్చుకొని వెళ్లిపోయారట.

ఒక సారి సంస్థానంలోని ఒక అధికారి అధికార గర్వముతో శాస్త్రిగారికి చెయ్యెత్తుకుండా నమస్కారమండీ అన్నాడట. శాస్త్రిగారికి కోపం వచ్చి "దీర్ఘమాయురస్తు" అని రెండర్థములు వచ్చునటుల పలికిరట. దీర్ఘం -ఆయు:-మాయు:-అస్తు అంటే నీకు గొప్ప పైత్యము కలుగుగాక అని కూడా అర్థము. శాస్త్రిగారి శబ్దోచ్చారణలో రెండవదే ద్వనించిందట.
ఒకసారి విజయనగర ప్రభువైన నారాయణగజపతి ఒక మాధ్వపండితుని సన్మానిస్తున్నారట.మంగళేశ్వర శాస్త్రులు ప్రచ్ఛన్నముగా ఆ సభకు వెళ్లి కూర్చున్నారట.
 

ఆ మధ్వ పండితుడు యద్వైత విశిష్టాద్వైతములను ఖండించుచూ అద్వైతము శాబ్దప్రమాణ బాధితమని చెప్పుచూ "భిదాసత్యం భిదాసత్యం భిదాసత్యం " అని శ్రుతివాక్యమున్నట్లు వైదిక స్వరమున పలికేనట. వెంటనే మంగళేశ్వర శాస్త్రిగారు
"భిదాసత్య మితి యో వదతి స చండాలో భవతి స చండాలోభవతి స చండాలో భవతి"
అంతకంటే రంజకముగా ఉచ్చస్వరముతో శృతిరీతిని పఠించిరట. అందరూ అబ్బురపడి
 

ఆయనకేసి చూచినారట. రాజుగారు ఎక్కడిదీ శ్రుతివాక్యమని అడిగినారట. దానికి శాస్త్రిగారు ప్రభూ! మన మధ్వాచార్యులుగారు సెలవిచ్చిన శ్రుతివాక్యము పూర్వపక్ష వాక్యము. ఇది సిద్ధాంత వాక్యము. రెండునూ ఒక అనువాకమందలివే.తొమ్మిదవ యట్టమునందున్నవి. వారు పూర్వపక్షం వరకే చదువుకున్నారు కాబోలు అందుకని నీ గ్రంథము నుదహరించ లేకపోయిరి. నేను తొమ్మిదవయట్టమును పూర్ణముగా ఏకరువు పెట్టగలుగుదును.అన్నారు. దానితో మధ్వాచార్యులవారి ముఖము మక మక లాడెను.
ఆయన ప్రఖ్యాతి వినడమే గానీ నారాయణగజపతి ఆయనను ఎప్పుడూ .చూచివుండలేదు. ఆయనను చూసి సంతోషించిశాస్త్రిగారిని గౌరవించి సత్కరించెను.
అప్పుడు మంగళేశ్వర శాస్త్రులు గారు ఈ శ్లోకంతో రాజును ఆశీర్వదించెను.

పూషవాడా న్వయాబ్దీందో!స్వస్తి నారాయణ ప్రభో!
నేత్రే గాత్రే తదా శ్రోత్రే వక్త్రే పుష్పేషు శోభతే
 

పూసపాడు వంశమనే సముద్రానికి చంద్రుడా! మన్మథుని వంటి శోభాకలవాడా!
నారాయణ ప్రభో నీవు నాయకుడవు,గాయకుడవు,అనగా గానసమయమందు మంచి శ్రోతవు. వక్తవు.గానమనే పుష్పములచే శోభిల్లుతున్న నీకు స్వస్తి యగుగాక!

ఈ శ్లోక చాతుర్యానికి మెచ్చి రాజు (రాజుగారి ఇంటిపేరు పూసపాడు)శాస్త్రులుగారూ!
మీ పాండిత్యమునకూ,చాతుర్యమునకు తగినట్టుగా లేదండీ మీ ఇంటిపేరు.
నడిమింటి వారు.మొదటింటివారు గాక నడిమింటివారయితిరి గదా! అన్నారట.
దానికి శాస్త్రిగారు ప్రభూ! ఏ యిల్లయిననూ పూసపాటి చేయదా? అంటే మీతో సమానమని అర్థం ధ్వనించేలాగున అన్నారట. రాజు ఆయన సమయస్ఫూర్తిని మెచ్చుకొన్నారట


--(())--

76.. యముడి కొడుకు యమహా

ఓసారి యముడు భూలోకానికి వచ్చినప్పుడు ఓ అందాల సుందరిని చూశాడు ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అతడికి అనిపించింది వెంటనే మనిషి రూపం ధరించి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు, ఆమె అందమైనదే కానీ ఒట్టి గయ్యాళి పెళ్లయిన మర్నాటి నుంచే చీటికీ మాటికీ అతడిని సాధించేది, ఆమె మీద ఉండే ప్రేమతో యముడు అదంతా భరించేవాడు కొన్నాళ్లకు వారికో ఓ కొడుకు పుట్టాడు.

కొడుకు యువకుడయ్యేసరికి యముడికి భార్యంటే మొహం మొత్తింది ఆమె గొంతు వింటేనే కంపరం పుట్టుకొచ్చేది ఇక ఎంత మాత్రం ఆమెను భరించలేనని నిర్ణయించుకున్న యముడు తన కొడుకును దగ్గరకు పిలిచి జరిగిందంతా చెప్పి, ఇక నాకు ఈ జీవితంపై విరక్తి కలిగింది నా కొడుకుగా నీకొక గొప్ప రహస్యం చెబుతా, నువ్వు వైద్య వృత్తిని ప్రారంభించు నువ్వు ఏ రోగిని చూసినా అతడికి నయం అయ్యేటట్టు వరమిస్తున్నా అయితే ఏ రోగి తల దగ్గరైనా నేను కనిపిస్తే మాత్రం వైద్యం చేయకు ఎందుకంటే వాళ్ల చావు తప్పదన్నమాట అంటూ అదృశ్యమైపోయాడు తండ్రి చెప్పినట్టే ఆ యువకుడు వైద్యవృత్తిని చేపట్టి గొప్ప హస్తవాశి కలవాడుగా పేరుపొందాడు ఓసారి ఆ దేశపు రాకుమారికి తీవ్రమైన అనారోగ్యం ఏర్పడింది పెద్ద పెద్ద వైద్యులు కూడా నయం చేయలేకపోయారు రాజు వెంటనే రాజ్యమంతటా చాటింపు వేయించి రాకుమారి జబ్బు తగ్గించినవారికి ఆమెనిచ్చి పెళ్లి చేయడంతో పాటు రాజ్యాన్ని కూడా అప్పగిస్తానంటూ ప్రకటించాడు.

ఆ ప్రకటన విన్న యువకుడు ఉత్సాహంగా రాజధాని బయల్దేరి రాకుమారిని చూశాడు ఆమెను పరీక్షిస్తూ చుట్టూ చూసేసరికి తలదగ్గర తండ్రి కనిపించాడు ఆమె చనిపోక తప్పదని అతడికి అర్థం అయింది రాకుమారిని రక్షిస్తే జీవితాంతం సుఖంగా బతకవచ్చనుకున్న యువకుడికి ఏం చేయాలో తోచలేదు కాసేపు ఆలోచించిన అతడికి ఓ ఉపాయం తోచింది వెంటనే గది గుమ్మం వరకూ పరిగెత్తి బయటకి చూస్తూ, అమ్మా.... త్వరగా రా.. నాన్నగారు ఇక్కడే ఉన్నారు అంటూ అరిచాడు.

కొడుకు కేక వినగానే యముడికి చెమటలు పట్టాయి గయ్యాళి భార్యను చూడవలసి వస్తుందనే భయంతో చటుక్కున అదృశ్యమైపోయాడు దాంతో ఆ యువకుడి వైద్యం ఫలించింది రాకుమారిని పెళ్లాడి, రాజవ్వాలన్న అతడి ఆశ కూడా నెరవేరింది.

77.  నేటి కథ 

సోము-తాబేలు


అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో నివసించే దంపతులు ఇద్దరికి చాలా కాలంపాటు సంతానం కలగలేదు ఎన్నో నోములు, వ్రతాలు చేసిన తర్వాత వాళ్లకొక కొడుకు పుట్టాడు.దంపతులు వాడికి సోము అని పేరు పెట్టి, ఎంతో ప్రేమగా పెంచుకున్నారు సోము ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆ బడిపిల్లలందరూ కలిసి విహారయాత్రకని గంగానదిని చూడటానికి వెళ్లారు సోముకు అక్కడి వాతావరణం ప్రశాంతత చాలా నచ్చాయి.

అతను అక్కడ కూర్చొని నదిలోకి చూస్తుండగా, దూరంగా కొందరు పిల్లలు గుమికూడి ఏదో అల్లరి చేయటం మొదలెట్టారు. వెంటనే సోము అక్కడికి వెళ్లి చూశాడు ఆ పిల్లలంతా ఒడ్డుకు వచ్చిన ఒక తాబేలును అటూ ఇటూ పీకుతూ దాంతో ఆడుకుంటున్నారు అది చూసిన సోముకు చాలా బాధ కలిగింది వాడు పిల్లలతో వాదించి, వాళ్లందరినీ అక్కడినుండి పంపించేశాడు.

ఆపైన గాయాలతో ఉన్న తాబేలును చేతనెత్తి, నదిలోకి తీసుకెళ్లి వదిలేశాడు ఆశ్చర్యం నీళ్లలో పడగానే ఆ తాబేలు మాట్లాడింది. ఓ మంచి అబ్బాయీ నీ మేలు మరువలేనిది ప్రమాదంలోపడ్డ నాకు, నువ్వు చేసిన మేలు చాలా గొప్పది ఇందుకు ప్రత్యుపకారంగా నేను నీకు ఏమైనా చేసిపెట్టాలని అనుకుంటున్నాను. అడుగు, నీకేం కావాలో అన్నది సోము తనకేం అక్కర్లేదనీ, కావాలంటే అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి, ముందుకు సాగాడు.

ఈ సంఘటన జరిగిన తర్వాత చాలాకాలానికి, సోము యుక్తవయస్సులోకి వచ్చాడు చాలా విద్యలు నేర్చుకొని, అతను వీరుడుగా పేరుగాంచాడు ఇదిలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురు, తన స్నేహితురాళ్లతో కలిసి స్నానానికని గంగా నదికి వెళ్లింది నదిలో స్నానమాడుతూండగా ఆమెకిష్టమైన రత్నాల హారం జారి నదిలో పడిపోయింది. చాలా మహిమగల ఆ హారం అంటే ఆమెకు చాలా ఇష్టం అది పోయిందన్న బెంగతో రాకుమారి సరిగ్గా భోజనం కూడా చేయటంలేదు.

ఎవరెంత చెప్పి చూసినా ఆమె బెంగమాత్రం తీరలేదు ఆహారం లేక ఆమె రోజు రోజుకూ కృశించిపోవటం మొదలెట్టింది ఆమెకు సంతోషం కలిగించటానికి పూనుకున్నారు రాజుగారు గజ ఈతగాళ్ళు అనేక మందిని అమితవేగంతో ప్రవహించే ఆ గంగా నదిలోకి పంపారు. కానీ ఆ నదీవేగానికి వాళ్లందరూ కాగితపు పడవల్లా కొట్టుకపోయారు. కొందరైతే నదిలోని ముసళ్లకు ఆహారమయిపోయారు పాపం.

ఇక చేసేదేమీలేక తెలివిగలవారూ సాహసవంతులైన యువకులెవరైనా ఆ రత్నాలహారాన్ని తేగలిగితే వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లిచేయటమేకాక, అర్థ రాజ్యాన్నికూడా ఇస్తామని రాజావారు చాటింపించారు చాటింపును విన్న సోము ఆలోచించాడు

ఇంతమంది గజఈతగాళ్లకు దొరకకుండా ఆ హారం ఎటుపోతుంది అని అది నదిలోని ఏ రాళ్ళ అడుగునో ఇరుక్కుని ఉండాలి దాన్ని తీయటం సాధారణ మానవులకు సాధ్యం కాకపోవచ్చు అయినా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమౌతుందని, అతను నదిలోకి దూకి, రాళ్ళ అడుగున వెతకటం మొదలుపెట్టాడు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది.

ఒక పెద్ద బండరాతి అడుగున మెరుస్తూ ఏదో ఆతని కంటపడింది అయితే దాన్ని చేరుకునే ప్రయత్నంలో అతను నదిలోని ఒక సుడిగుండంలో చిక్కుకుపోయాడు ఇక తన ప్రాణాలు పోవటం తప్పదనుకున్న ఆ క్షణంలోనే సోము నీటి పైకి తేలాడు ఎలాగని చూస్తే, అతని సాయంపొందిన తాబేలు సోము కోరికను అడిగి తెలుసుకున్న తాబేలు నదిలోని బండరాళ్లను ఎత్తి మరీ ఆ రత్నాల హారాన్ని తెచ్చి సోముకు ఇచ్చింది.
హారాన్ని పొందిన సోము అక్కడి నుండి నేరుగా రాజ భవనానికి చేరుకొని, ఆ రత్నాల హారాన్ని రాకుమారికిచ్చాడు సంతోషించిన రాజు సోముకు తన కూతురుని ఇవ్వడమే కాక, అర్థరాజ్యమిచ్చి గౌరవించాడు కూడా ఆపైన సోము రాజ్యాన్ని చక్కగా పాలించి దయ గల రాజు అని పేరు తెచ్చుకున్నాడు.


--(())--
78.....12000 మరణాలను చూసిన వ్యక్తి    చెబుతున్న జీవిత సత్యాలు 


కాశీ లో మరణిస్తే “మోక్షం” ప్రాప్తిస్తుంది అని హిందువులలో ఒక విశ్వాసం . అందుకోసం జీవిత అంత్యకాలం కాశీలో గడపడానికి వెడుతూ ఉంటారు . అటువంటి వారికి వసతిని కల్పించే ముఖ్యమైన మూడింటిలో కాశీలాభ్ ముక్తిభవన్ ఒకటి . మిగతా రెండూ ముముక్షుభవన్ , గంగాలాభ్ భవన్ . 1908 లో కాశీలాభ్ ముక్తిభవన్ స్థాపించబడింది . 
.
44 సంవత్సరాల పాటు కాశీలాభ్ ముక్తిభవన్ మేనేజరుగా పనిచేసిన భైరవనాథ్ శుక్లా ఆ భవనం ఎదుట ఎర్రని గోడలముందు చెక్క కుర్చీలో కూర్చుని చెప్పిన విషయాలు ఇపుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను . 

1. Resolve all conflicts before you go
.
అంత్య కాలానికి ముందే క్రోధాన్ని విడనాడు :

శ్రీ రాం సాగర్ అనే ఒక సంస్కృత పండితుడు ఆరుగురు అన్నదమ్ములలో పెద్దవాడు . చిన్న తమ్ముడు అంటే ఇష్టం . కానీ కాలక్రమంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ఇంట్లో అడ్డుగా గోడ కట్టించే వరకూ వెళ్ళింది . 

ఆయన తన అంత్యకాలం లో కాశీలాభ్ ముక్తిభవన్ లో మూడవ నెంబరు రూమ్ బుక్ చేసుకున్నారు . తాను ఇంకొక పదహారు రోజులలో చనిపోతాను అని ఆయనకు ముందే తెలుసు . 13 రోజులు గడిచిపోయాయి . 14 వ రోజున ఆయన తన విడిపోయిన తమ్ముడికి కబురు పెట్టాడు . “40 ఏళ్ల క్రితం నా తమ్ముడితో గొడవపడిన విషయం నన్ను కలిచివేస్తోంది . నేను సుఖంగా మరణించలేను . నాలో ఉన్న క్రోధం పోవాలి” అన్నాడు . 
.
తమ్ముడు 16 వ రోజు నాటికి వచ్చాడు . తమ్ముడిని చూడగానే అన్న కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి . తమ్ముడి చెయ్యి తన చేతిలోకి తీసుకుని తమ్ముడి తల నిమురుతూ “ఆ గోడ పడగొట్టేయ్యి” అన్నాడు . అన్నదమ్ములిద్దరూ భోరున విలపించారు . తమ్ముడి చేతిలో ప్రశాంతంగా ప్రాణాలు వదిలాడు అన్న . 
.
భైరవనాథ్ శుక్లా ఇలా అంటున్నారు .
“ఇటువంటి కథలు నేను ఎన్నో చూశాను . ఇక్కడకి వచ్చే వాళ్ళు బోల్డంత లగేజీతో వస్తారు . అందులో ఏదీ తీసుకువెళ్ళలేరు . జీవితంలో ఘర్షణలు లేకుండా ఎవరూ ఉండరు . కానీ వాటిని ఎంత తొందరగా పరిష్కరించుకుంటే అంత మంచిది . అంత సంతోషం పొందుతారు”
.
2. Simplicity is the truth of life
.
సాధారణం గా జీవించడం 
.
చనిపోతాము అని తెలిసిన దగ్గరనుండి చెత్త తిండి తినడం మానేస్తారు చాలామంది . అప్పటికి కానీ చాలామందికి తాము సింపుల్ జీవితం గడిపి ఉండవలసింది అని అనిపించదు . “సింపుల్ జీవితం అంటే తక్కువ ఖర్చుపెట్టడం . ఎక్కువ ఖర్చు పెట్టడం కోసం ఎక్కువ సంపాదించాలి అనుకోవడం . ఎక్కువ తాపత్రయపడటం కన్నా తక్కువ లో సంతృప్తి పొందడం నేర్చుకుంటే ఆనందంగా జీవించవచ్చు” అంటారు భైరవనాథ్ శుక్లా 
.
3. Filter out people’s bad traits
.
ప్రజలలో ఉన్న చెడు లక్షణాలను మాత్రమే చూడకు 
.
భైరవ నాథ్ శుక్లా ఇలా అంటారు “ ప్రతీ మనిషిలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి . మనం ఎదుటివ్యక్తిలోని చెడును మాత్రమే చూసి మంచిని పట్టించుకోము . ఒక వేళ మనం ఎదుటి వారిలోని చెడును గురించి కంటే వారిలోని మంచిని గుర్తిస్తే మనం వారితో స్నేహం మాత్రమే కాదు, వారిని అర్థం చేసుకోవడమే కాదు .... వారిని ప్రేమించడం కూడా నేర్చుకోగలం” 
.
4 . Be willing to seek help from others
.
ఇతరుల సహాయం పొందడం కూడా నేర్చుకో 
.
మనం శక్తివంతులుగా తయారు కావడం మంచిదే కావచ్చు . కానీ మనమే అన్నీ చేసుకోగలం అనే గర్వమూ , అహంభావమూ మంచివి కావు . ఎంత శక్తిమంతుడైనా అన్నీ తానే చేసుకోలేడు. ఆ విషయంలో తాను ఇతరులకు సహాయపడడం తో పాటు ఇతరుల సహాయం అర్థించే ధైర్యం కూడా ఉండాలి . 
.
ఈ ప్రపంచం లో ప్రతీ వ్యక్తీ ఏదో ఒక విషయం లో మనకంటే ఎక్కువ విషయ పరిజ్ఞానం కలిగినవాడై ఉంటాడు . మనం అర్థిస్తే అది మనకూ లభిస్తుంది . 
.
భైరవనాథ్ శుక్లా 80 లలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుంటున్నారు . ఒక రోజు వర్షం కురుస్తూ ఉంటే కొందరు యువకులు ఒక ముసలామెను తీసుకుని వచ్చారు . వాళ్ళు వచ్చి ఆమెను జాయిన్ చెయ్యడానికి కావలసిన దరఖాస్తు నింపకుండా వెళ్ళిపోయారు . కొన్ని గంటలు గడిచాయి . పోలీస్ లు వచ్చారు . వాళ్ళ గురించి అడిగారు . నేను తెలియదు అన్నాను . ఆమెను తీసుకుని వచ్చిన వారు నక్సలైట్లు అని చెప్పారు పోలీసులు . మర్నాడు వాళ్ళు వచ్చినపుడు నేను అడిగాను “మీరు ఒకే సారి 5 నుండి 8 మందిని షూట్ చేసి చంపగలిగినపుడు ఆ ముసలామెను కూడా అలా చెయ్యొచ్చు కదా !మేరె ఆమెను సమాధి చెయ్యొచ్చు కదా ! నేను అబద్ధం చెప్పే పరిస్థితి ఎందుకు కలిగించారు ?” 
.
అందులో ఉన్న ఆమె మనుమడు మోకాళ్ళ పై కూలబడి అన్నాడు . “మాలో ఎవరమూ ఆమె మోక్షం పొందే విధంగా ఆమెకు సహాయపడలేము . ఇక్కడ ఉంటే ఆమె తప్పక మోక్షం పొందుతుంది, అందుకే ఇక్కడకు తీసుకువచ్చాము . మమ్మల్ని క్షమించండి” 


5 Find beauty in simple things
.
చిన్న చిన్న విషయాలలో అందం ఉంది 

మా ముక్తిభవన్ లో ప్రతీ రోజూ మూడు సమయాల్లోనూ భజనలు జరుగుతూ ఉంటాయి. కొందరు ఆ భజనలలో ఎంతో ఆనందంతో కీర్తనలు పాడతారు . దారిన పోయే వారు కూడా ఆ ఆనందం పంచుకోవడం కోసం కొంత సేపు అక్కడ చేరుతారు . కానీ కొందరు అది తమ ఏకాంతకు ఆటంకం కలిగిస్తోంది అనో , తమకు ఉన్న పానాలకు ఆటకం కలిగిస్తోంది అనో అనుకొంటారు .

6 Acceptance is liberation
.
సమస్యలనుండి పారిపోకు 

కొందరు తాము ఉన్నస్థితిని అంగీకరించలేరు . ఇలా అంగీకరించలేక పోవడం వారిలో నిరాశ నిస్పృహలను కలిగించి ఒత్తిడి పెంచుతుంది . నీవు ఉన్న స్థితిని నీవు అంగీకరిస్తే నీ సమస్యలనుండి నీవు బయట పడడం నేర్చుకోగలవు . లేదంటే నీవు చీకటిలోనే ఉంటావు . 
.
సమస్యను నీవు గుర్తిస్తే పరిష్కారం కోసం అన్వేషించగలవు .
.
సమస్య పట్ల నిర్లక్ష్యం , పట్టించుకోకపోవడం , దూరంగా పోవాలి అనుకోవడం నీలో ఆదుర్దాను పెంచుతాయి . సమస్యను అంగీకరిస్తే నీవు దానినుండి బయటపడే ప్రయత్నం చెయ్యగలవు . దానిని ఎదుర్కోగలవు . అపుడు నీవు శక్తి మంతుడవు అవుతావు 
.
7.Accepting everyone as the same makes service easier
.
అందరి పట్ల సమభావంతో ఉండు 
ముక్తిభవన్ లో చేరిన ప్రతీ ఒక్కరినీ ఒకే విధంగా కాకుండా వారి కులమూ , మతమూ , డబ్బూ , సాంఘిక , ఆర్థికస్థితిగతులను బట్టి నేను చూడడం మొదలు పెడితే వారికీ నాకూ కూడా శాంతి ఉండేది కాదు . 
.
ఎదుటి వ్యక్తులను సమభావంతో నీవు చూసిన నాడు నీకు ప్రశాంతత ఉంటుంది . నీ పని నీవు చక్కగా చెయ్యగలుగుతావు . 
,
. 8. If/When you find your purpose, do something about it
.
నీ లక్ష్యాన్ని నువ్వు గుర్తించు . సాధించే ప్రయత్నం చెయ్యి .
.
నీ జీవిత లక్ష్యం ఏమిటి అనేది గుర్తించడం చాలా గొప్ప విషయం, కానీ దానిని నువ్వు సాధించే ప్రయంతం చెయ్యని నాడు అది నిష్పలం . 
.
చాలా మంది ఏమి చెయ్యాలో తెల్సు కానీ ఏమీ ప్రయత్నం చెయ్యకుండానే జరిగిపోవాలి అనుకుంటారు . ఏమీ చెయ్యకుండా కూర్చోవడం కన్నా అసలు లక్ష్యమే లేకపోవడం ఉత్తమం . లక్ష్యం అంటూ ఉంటే నీకున్న సమయమూ , నువ్వు చెయ్యవలసినదీ ఒక ప్రణాళిక ఏర్పరచుకుంటావు . నీ ఆలోచన దాని మీదనే ఉంటే నీవు తప్పించుకోలేవు . 
9. Habits become values
నీ మంచి అలవాట్లు విలువలుగా మారతాయి 
.
మంచి అలవాట్లను చేసుకో ! అది నీకు మంచి విలువలను నేర్పుతుంది . 
మంచి అలవాట్లను అభ్యాసం చేతనే నేర్చుకోవాలి . అదేమీ సులువైన విషయం కాదు . ప్రతీసారీ నువ్వు ప్రయత్నపూర్వకంగానే సాధించాలి . సత్యమూ , దయా , సానుభూతీ ,నిజాయతీ ఇవేవీ నీ 
ప్రయత్నం లేకుండా వాటంతట అవి రావు . 
.
10. Choose what you want to learn
నీవేమి నేర్చుకోవాలో నీవే నిర్ణయించుకో !
ఈ ప్రపంచం లో ఎంతో విజ్ఞానం ఉంది . అందులో నీవు ఏది కావాలి అనుకుంటున్నావో దాన్ని ఎంచుకో . ప్రతీ ఒక్కరూ వారి అభిరుచులను, సిద్ధాంతాలనూ , అనేక విషయాలనూ నీ మీద రుద్దుతారు . అయితే నీకు ఏది ఇష్టమో అది ఎంచుకో ! వారి సూచనలు పరిగణనలోకి తీసుకో . నీ మనసు హృదయం చెప్పినట్టు నువ్వు ఎంచుకో ! 
.
ఇక్కడకి వచ్చిన వారు ఆఖరు దశలో ఉంటారు . నడవలేరు .... మాట్లాడలేరు ..... అపుడు వారిలోకి వారు వెళ్ళడం మొదలు పెడతారు . వారి అనుభవాలలోనే వారు కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు . నేర్చుకున్నదానిని నెమరు వేసుకుంటూ ఉంటారు . 
.
11. You don’t break ties with people; you break ties with the thought they produce
నీవు ప్రజలతో సంబంధాలు తెంచుకోకపోతే ; వారు రగిలించిన ఆలోచనలతో సంబంధం తెంచుకో 
.
నీవు ప్రేమించిన వ్యక్తులు , నీకు ఆప్తులు అయిన వ్యక్తులు నీతో అన్నివిషయాలలోనూ ఏకీభవించకపోవచ్చు . వారి భావాలు నీ భావాలకు వ్యతిరేకం కావడం వలన వారి భావాలతో విభేదించలేక వారికీ దూరం జరుగుతున్నావు తప్ప వారికి నీవు దూరం కావు . మీ మధ్య భేదాభిప్రాయం ఆలోచనలలోనే తప్ప వ్యక్తులతో కాదు . నీవు నేర్చుకోవలసినది వారిపై ప్రతీకారభావం కాదు . వారి పట్ల కఠిన హృదయం కాదు . 
.
12. 10 percent of what you earn should be kept aside for dharma
నీ సంపాదనలో పది శాతం దానం కోసం కేటాయించుకో !
.
ధర్మం అంటే మతసంబధం కాదు . మంచిని చెయ్యడం . ఒక పది శాతం సంపాదన ఇందుకు కేటాయించుకో ! 
.
చాలామంది జీవిత అంత్య కాలంలో దానధర్మాలు చేస్తూ ఉంటారు . వృద్ధాప్యం వలన వారికి కలుగుతున్న అసౌకర్యాలు ఇతరులకూ కలుగుతున్నాయని తెలుసుకుని అవి తొలగాలని కొంత సహాయ పడుతూ ఉంటారు . ఎవరైతే ఆప్యాయతను పొందుతూ ఉంటారో , అపరిచితుల ప్రేమను పొందుతారో , వారు ప్రశాంతంగా ప్రాణం విడువగలుగుతారు . నీవు సంపాదించినదంతా నీవే అనుభవించాలి అనుకోకు . కొంత ఇతరులకు మిగుల్చు . 
. By

ఇది ప్రతీ ఒక్కరూ చదవవవలసిన పోస్ట్

79....భారతీయ వారసత్వానికి ప్రతీక రాణి పద్మిని !

అనగా అనగా.....
మన చరిత్రలో జరిగిన నిజ సంఘటనలు!

13వ శతాబ్ధంలో మరొక మహ్మదీయుడు అల్లా ఉద్దీన్ ఖీల్జీ భారతదేశంలోని, రాజ పుత్ర రాజ్యం చిత్తోడ్ ఘడ్ మీదకి దండయాత్ర చేశాడు. అప్పటికి చిత్తోడ్ ఘడ్ రాజు రాణా రత్నసింహుడు. ఆయన భార్య రాణి పద్మిని. ఆమె అద్భుత సౌందర్యవతిగానూ, విదుషీమణిగానూ, పేరుగాంచింది. ఆమెను కాంక్షించి అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ ఘడ్ పై అనేక సార్లు దండయాత్ర చేశాడు. కానీ గెలవలేకపోయాడు.

చివరికి ఒక రాయబారి ద్వారా రాణా రత్నసింహుడికి ఒక వర్తమానం పంపించాడు. “రాణి పద్మిని సౌందర్యం గురించి నేను చాలా విని ఉన్నాను. ఆ ప్రఖ్యాతి లోని నిజం తెలుసుకోవాలని, ఒక్కసారి ఆమెను చూడాలని కోరుకున్నాను. ఒక్కసారి ఆమెని చూడగలిగితే, నేను యుద్ధం విరమించి వెనక్కి వెళ్ళిపోతాను” అన్నది ఆ వర్తమాన సారాంశం.

రాజు రాణా రత్నసింహుడు, మంత్రులూ ఆలోచించారు. రాణి పద్మినితో చర్చించారు. చివరికి వారంతా “అల్లా ఉద్ధీన్ ఖిల్జీని మన రాజ్యానికి ఒక స్నేహితుడిగా భావించి విందుకు ఆహ్వానిద్దాం. మన సౌహార్ర్ధాన్ని, స్నేహాన్ని మనం చూపిద్దాం. ఏవిధంగా చూసినా యుద్ధం కంటే శాంతి గొప్పది కదా! రాణి పట్ల అతని దృష్టి నీచమైనది కాదని అతడి వర్తమానం చెబుతోంది. ప్రఖ్యాతి గాంచిన విషయం పట్ల గల కుతుహలమే నంటున్నాడు కాబట్టి రాణి ప్రతిబింబాన్ని అతడికి అద్దంలో చూపుదాం. మన రాణి గారికి సోదర తుల్యుడుగా అతణ్ణి గౌరవిద్దాం” అని తీర్మానించారు.

ఆ విధంగానే అతడికి కబురుపంపారు. అతడీ ఆహ్వానాన్ని అందుకుంటూ తనను తాను రాణీ పద్మినికి సోదర తుల్యుడిగానూ, రాజూకూ, చిత్తోడిఘడ్ ప్రజలకూ మిత్రుడిగానూ ప్రకటించుకున్నాడు. విందు రోజున రాజు రాణారత్నసింహుడు, మంత్రులూ, చిత్తోడ్ ఘడ్ ప్రజలూ అల్లా ఉద్దీన్ ఖీల్జీని విశిష్ట అతిధిగా గౌరవించారు. విందు తర్వాత రాణీ పద్మిని ప్రతిబింబాన్ని అద్దంలో అతిధికి చూపారు. ఆ సౌందర్యం చూచి అతడు అబ్బురపడ్డాడు. తన నైచ్యాన్ని పైకి ప్రదర్శించలేదు. తన అతిధి నటనను కొనసాగిస్తూ రాణా రత్నసింహుని ప్రతి విందుకు ఆహ్వానించాడు. రాజు ఇది అంగీకరించాడు.

తదుపరి రత్నసింహుడు కొద్దిపాటి పరివారంతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ విడిదికి విందుకు వెళ్ళాడు. అతిధి మర్యాదని ఊహించారే గానీ కుట్ర అనుకోలేదు. ఎందుకంటే నమ్మకద్రోహం అంతగా భారతీయులకి తెలీదు. అతిధి మర్యాదులకు బదులుగా రత్నసింహుడు దగాని అందుకున్నాడు. రాజును బంధించిన అల్లా ఉద్దీన్ ఖిల్జీ రాణి పద్మినికి తనకు లొంగిపోవలసిందిగా కబురు పంపించాడు.

అల్లా ఉద్దీన్ ఖిల్జీ రత్నసింహుణ్ణి ’అతిధి’ అంటూ ఆహ్వానించాడు. మానవీయ విలువల్ని నమ్మి, రాణా రత్నసింహుడు పరిమిత పరివారంతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ విడిదికి వచ్చాడు. కాబట్టే అతడు రత్నసింహుని బంధించగలిగాడు. ఇది కుట్రే కదా! ఇదే పని అల్లా ఉద్దీన్ ఖిల్జీ అతిధిగా చిత్తోడ్ ఘడ్ కు వచ్చినప్పుడు [అప్పుడతనిదీ పరిమిత పరివారమే] రత్నసింహుడు చేసి ఉంటే? అతిధిని ఆదరించాలి, నమ్మించి మోసగించ కూడదు లాంటి నీతుల్ని తలచకుండా అల్లా ఉద్దీన్ ఖిల్జీని బంధించిన, చంపేసినా ఏం చేయగలిగి ఉండేవాడు? కేవలం మానవతా విలువల్నీ, సత్యం పలకడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం లాంటి నీతి, ధర్మం పాటించారు గనుక భారతీయ రాజులు అలాంటి కుట్రలు చేయలేదు. నేటికీ పాకిస్తాన్ మన పట్ల అదే విధమైన మోసాలు చేస్తూనే ఉంది.

ఆ విధంగా అల్లా ఉద్దీన్ ఖిల్జీ చేతిలో మోసానికి గురయ్యాక, రాణి పద్మిని, మంత్రులు కలిసి బాగా ఆలోచించి అల్లాఉద్దీన్ ఖిల్జీకి మరునాడు రాణి పద్మిని అతడికి లొంగిపోగలదని కబురు పంపారు.

మరునాడు పల్లకీల ’కాన్వాయ్’ అల్లాఉద్దీన్ ’కాంపైన్’ చేరింది. అల్లాఉద్దీన్ ఖిల్జీ ఆనందానికి అంతులేదు. ప్రఖ్యాతి గాంచిన అపురూప సౌందర్యవతి తన సొత్తు కాబోతోంది. తానామెను అందుకోబోతున్నాడు. ఆ పరవశంతో అతడు రాణీ గారి పల్లకీకి ఎదురు వెళ్ళి స్వాగతించాడు. అయితే అతడు స్వాగతించింది పరిచారికుల వేషంలో ఉన్న సైనికులకి.

రాణి పద్మిని పల్లకీలో సైతం స్త్రీ వేషంలో ఉన్న యోధుడున్నాడు. ’మోసం’ అంటూ గావు కేకలు పెట్టిన అల్లాఉద్దీన్ ఖిల్జీ అనివార్యమైన యుద్దాన్ని ఎదుర్కొన్నాడు. వీరోచితంగా పోరాడిన రాజ పుత్ర వీరులు రాణా రత్నసింహుని విడిపించుకొని పోయారు. దీనితో అల్లా ఉద్దీన్ ఖిల్జీ క్రుద్ద్రుడయ్యాడు. సహజమే కదా! తాను ఎదుటి వాళ్ళను మోసగించగలిగినప్పుడు అది తన తెలివీ లేదా సామర్ధ్యం అనుకొని సంతోషాన్ని గర్వాన్ని పొందినప్పుడు, తాను ఇతరుల చేతిలో మోసపోతే అసహనానికి క్రోధానికి గురవుతారు కదా!

తర్వాతి ప్రయత్నంలో అల్లా ఉద్దీన్ ఖీల్జీ మరింత సైన్య సమీకరణ చేసుకొని మరీ, చిత్తోడ్ ఘడ్ మీదికి దండయాత్ర చేశాడు. కోటని వశపరుచు కొన్నాడు. రాణా రత్నసింహుణ్ణి, ఇతర యోధుల్ని చంపేసాడు. కానీ ఎంతో కాంక్షతో అంతఃపురాల్లోకి ప్రవేశించిన అల్లా ఉద్దీన్ ఖిల్జీకి కనబడింది అందాల రాశులు కాదు, బూడిద రాశులు. రాణి పద్మినితో సహా రాణివాసపు స్త్రీలందరూ శతృరాజుల అత్యాచారాన్ని తమ శరీరాల మీదా, మనుస్సుల మీదా కూడా నిరోధించటానికి, వారి రాకకు ముందే అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకొన్నారు. ఆవిధంగా నైతికత కాపాడు కోవటానికీ తమ జీవితాల్ని తృణప్రాయంగా, [ గరిక పోచల్ని వదిలినంత తేలికగా] వదిలివేశారు.

అంతేగాని ఆధునిక ప్రగతి సూత్రం “When the rape is unavoidable, enjoy it” అనుకోలేదు. అత్యాచారాల్లాంటి నైచ్యాన్ని భరించటం కంటే మరణం మేలన్నది వారి వివేచన. అలాంటి నైచ్యాన్ని నివారించటానికి వారు ఇతరుల్ని హత్య చేయాటానికైనా వెనుదీయరు, ఆత్మహత్య చేసుకోవాటానికైనా వెనుదీయరు. భారతీయ రక్తంలోనే అంతటి పౌరుషం నైతికత, సత్యం విషయంలో ఉంది.

శతృరాజుల అత్యాచారాన్ని తమ శరీరాల మీదా, మనుస్సుల మీదా కూడా నిరోధించటానికి, వారి రాకకు ముందే అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకొన్నారు. ఆవిధంగా నైతికత కాపాడు కోవటానికీ తమ జీవితాల్ని తృణప్రాయంగా, [ గరిక పోచల్ని వదిలినంత తేలికగా] వదిలివేశారు.

అంతేగాని ఆధునిక ప్రగతి సూత్రం “When the rape is unavoidable, enjoy it” అనుకోలేదు. అత్యాచారాల్లాంటి నైచ్యాన్ని భరించటం కంటే మరణం మేలన్నది వారి వివేచన. అలాంటి నైచ్యాన్ని నివారించటానికి వారు ఇతరుల్ని హత్య చేయాటానికైనా వెనుదీయరు, ఆత్మహత్య చేసుకోవాటానికైనా వెనుదీయరు. భారతీయ రక్తంలోనే అంతటి పౌరుషం నైతికత, సత్యం విషయంలో ఉంది.

ఇది నిజంగా జరిగిన సంఘటన. మన చరిత్ర.

(కంపరాయల భార్య గంగాదేవి. ఆమె ఈ దుర్మార్గాలను ఒక సంస్కృత కావ్యంగా గ్రంథస్థం చేసింది- రచయిత)

మతం మార్చుకొన్నవారిని ప్రాణాలతో వదిలారు. లేనివారి ఇండ్లనూ తగలబెట్టారు. కాశీ కాశిం అయినాడు. సీతారామయ్య సత్తార్‌మియ్యా అయినాడు. బ్రహ్మం ఇబ్రహీం అయినాడు. పాలక్ మాలిక్ అయినాడు. ఓమ్ అమీన్ అయింది. మేదిని మదీనా అయింది. శివరాత్రి షబ్బేబరాత్ అయింది. పురోహితులకు గడ్డాలు పెంచి సున్తీ చేశారు.
--(())--


80.....దాంపత్య జీవితంలో అధికమైన ఆనందించేది స్త్రీయా ! పురుషుడా !
.
నేను స్త్రీగా ఉండడములో ఆనంద పడుతున్నాను కనుక ఇలాగే ఉండి పోతాను ...
.
పూర్వము భంగాస్వనుడు అనే రాజుకు సంతానము కలుగ లేదు. సాధారణంగా యజ్ఞము ఇంద్రుడి అనుమతి తీసుకుని చేయాలి. కాని భంగాస్వనుడు ఇంద్రుడి అనుమతి లేకుండా యజ్ఞము చేసి నూరుగురు కుమారులను పొందాడు. ఆ రాజు సంతోషంగా ఉన్నాడు కాని ఇంద్రుడు తన అనుమతి లేకుండా యజ్ఞము చేసినందుకు అతడి మీద కక్షకట్టాడు.
.
ఒకరోజు భగాస్వనుడు వేటకు పోయాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారితప్పేలా చేసాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటోతీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహము వేసి గుర్రము దిగి సమీపంలోని కొలనులో దిగి ఆనీటిని సేవించాడు. వెంటనే ఆ రాజు ఆశ్చర్యపోయేలా అతడికి స్త్రీత్వము ప్రాప్తించింది. అయాచితంగా ప్రాప్తించిన స్త్రీత్వానికి ఆ రాజు చాలా చింతించి " ఈ వేషముతో రాజధానికి వెళ్ళి నేను నా భార్యా పిల్లకు , పురజునులకు ఎలా ముఖము చూపగలను " అని విచారించి " అయినా ఇలా అడవిలో ఉండలేను కదా ! " అనుకుని చివరకు రాజధానికి వెళ్ళి మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కుమారుడిని రాజ్యాభిషిక్తుడిని చేసి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ మునిపుంగవులతో నివసించ సాగాడు.
.
అక్కడ ఉన్న ఒక ముని స్త్రీలాగా మారిన రాజును చూసి మోహించి వివాహమాడారు. భగాస్వనుడు మునివలన స్త్రీగా అత్యంత బల సంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు. ఆ తరువాత అతడు నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో " కుమారులారా ! నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందాను కనుక వీరు మీ అన్నదమ్ములు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి " అన్నాడు. తండ్రిమాట పాలించి వారు రాజ్యాన్ని పంచుకుని పాలించసాగారు.
.
ఇది చూసిన ఇంద్రుడు " నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతడికి మేలు అయ్యింది. ఎలాగైనా వీరి మధ్య బేధము కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి భగాస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి " రాజకుమారులారా ! ఏమిటీ వెర్రి ఎవరో తీసుకు వచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా ! అసలు వీరి తండ్రి ఎవరు ? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు " అని వారిలో కలతలు రేపాడు. అలాగే భగాస్వనుడు స్త్రీగా ఉన్నపూడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేని పోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు. అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. చని పోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భగస్వనుడు గుండెలు బాదుకుని రోదించసాగాడు.
.
ఇది చాటుగా చూస్తున్న ఇంద్రుడు " అమ్మా నీవు ఎవరు ? ఎందుకిలా రోదిస్తున్నావు ? " అని ఏమీ ఎరుగని వాడిలా అడిగాడు. అప్పుడు ఆమె తాను యజ్ఞ ము చెయ్యడము కుమారులను కనడము అడవిలో దారి తప్పి కొలనునీరు త్రాగి స్త్రీగా మారడము మునిద్వారా కుమారులను కనడము పూసగ్రుచ్చినట్లు చెప్పాడు. అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై " రాజా ! నేను ఇంద్రుడను నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను " అని చెప్పాడు. భస్వానుడు " దేవా ! అజ్ఞానంతో తెలియక పొరపాటు చేసాను. అయినా దేవతలకు అధిపతి వైన నీవు పగ తీర్చుకోడానికి నేను తగిన వాడినా ! కనుక నన్ను దయతో రక్షించు " అని వేడుకున్నాడు. ఇంద్రుడు " రాజా ! నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను ఎవరు కావాలో నీవే ఎంచుకో " అన్నాడు.
.
రాజు సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకున్నాడు. ఇంద్రుడు " అదేమిటి రాజా ! మిగిలిన వారు నీ కుమారులు కాదా ! " అని అడిగాడు. భగస్వానుడు " వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా ! " అని చెప్పాడు. ఇంద్రుడు " రాజా ! నీ సత్యనిష్టకు సంతోషించాను. నీకుమారులు అందరినీ బ్రతికిస్తాను " అని

" రాజా ! నీకు ఇంకొక వరము ఇస్తాను నీవు పోప్గొట్టుకున్న పురుషత్వము ఇస్తాను " అన్నాడు.
భగస్వానుడు " మహేంద్రా ! నా కుమారులను బ్రతికించావు అదే చాలు. నేనిలా స్త్రీగానే ఉంటాను " అన్నాడు. ఇంద్రుడు " అదేమిటి రాజా ! పురుషుడవైన నీవు స్త్రీగా ఉండి పోతాననడానికి కారణం ఏమిటి ? " అని అడిగాడు. స్త్రీగా ఉన్న భగస్వానుడు సిగ్గు పడి "
.
మహేంద్రా ! నేను స్త్రీగా ఉండడములో ఆనంద పడుతున్నాను కనుక ఇలాగే ఉండి పోతాను "
.
అన్నాడు.
.
దేవేంద్రుడు నవ్వి అలాగే అగుగాక అని చెప్పి వెళ్ళాడు "


--((***))--


మనవి 

గౌరవనీయులైన తెలుగు రాష్ట్రాల ప్రజలు, భారతదేశం మరియు ప్రపంచము తెలుగు భాష ను అదఃరించే ప్రతిఒక్కరిని పేరుపేరునా కృతజ్ఞతలు, నమస్కారములు, ఎందరో మహానుభావులు అందరికి వందనములు నేను అనగా "మల్లాప్రగడ రామకృష్ణ" విశ్రాంతి యకౌంట్స్ ఆఫీసర్ గా (స్కూల్ ఎడ్యు కేషన్ డిపార్ట్మెంట్)  పనిచేసి 30 -06 -2019  పదవి విరమణచేసితిని, ముఖ్యముగా నాభార్య శ్రీదేవి సహకారంతో " ప్రాంజలి ప్రభ " ఆన్లైన్ ల్లో 12  బ్యాగుల సహాయంతో, 2012 నవంబర్ ౦౩ నుండి తెలుగును బతికించాలని ఉద్దేశ్యంతో సొంతగా వ్రాయాలని ప్రారంభించాను  అప్పటి నుండి ఇప్పటివరకు 50 జి పి గూగుల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా సేకరించటం,(ఆయా సంస్తలలో పనిచేయు వారికీ శుభాకాంక్షలు)  మరియు నా సొంత రచనలు ఎప్పటికప్పుడు అందరికి అందిస్తూ వచ్చాను, ఇది ఎవరిని ఉద్దేశించి వ్రాసిన కధలు కావు, నాకు నచ్చి సేకరించిన కధలు ఎవరు వ్రాసారో నాకు తెలియదు  వారందరికి  నా నమస్కారములు                      

2012 వ్రాసినవి నాకు నచ్చినవి ఒక క్రమంలో ఉంచుతున్నను. (మాతాతగారు నిజాం ఆస్థానంలో పండితుడు జోశ్యులుగా ఉన్నారు మానాన్న, పెదనాన్నలు అందరూ పండితులే) వారి జ్ఞాపకార్ధం నేను తెలుగులో  వ్రాస్తున్నాను) తప్పులుంటే క్షమించగలరు.

ఐ విధేయుడు ... ప్రాంజలి ప్రభ ... మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ , ౯౮౪౯౧౬౪౨౫0

       


No comments:

Post a Comment