శ్రీ గంధవరపు ప్రభాకర రావు గారి ✒
బమ్మెర పోతనామాత్యుని భాగవత గ్రంథంలోని మధుర ఘట్టాలు - 127.
పలికెడిది భాగవతమఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?
అష్టమ స్కంధము
సభలో తననుచూసి, కలకలం రేగుతుండగా, బ్రహ్మచారి రూపంలో, శ్రీమహావిష్ణువు, బలిచక్రవర్తి సభామంటపం దరిచేరాడు.
సీ. చవులుగాఁ జెవులకు సామగానంబులు;
చదువు నుద్గాతల చదువు వినుచు
మంత్ర తంత్రార్థ సంబంధభావములు పే;
ర్కొనెడి హోతలతోడఁ గూడికొనుచు
హోమకుండంబులం దున్న త్రేతాగ్నుల;
వెలిఁగించు యాజక వితతిఁ గనుచు
దక్షులై బహువిధాధ్వర విధానంబులు;
చెప్పెడు సభ్యులఁ జేరఁ జనుచుఁ
తే.
బెట్టుగోరెడు వేడుక పట్టుపఱుచు
నదితి పుట్టువు లచ్చికి నాటపట్టు
కోరి చరియించె సభలోనఁ గొంతఁదడవు
పుట్టు వెన్నఁడు నెఱుగని పొట్టివడుఁగు.
వామనుడు, చెవులకు ఇంపుగా సామవేదం గానాలు విన్నాడు. మంత్రతంత్రాలను వివరిస్తూ హోమం చేసే హోతలను కలుసుకున్నాడు. హోమకుండంలో అహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే మూడగ్నులను వెలిగించే ఋత్విజులను చూసాడు. యాగవిధులను నేర్పరితనంతో పేర్కొంటున్న సభాపతులను సమీపించాడు. ఆ సభను బాగా ఆకర్షించాలని అనుకొని, కొంతసేపు ఆ సభలో తిరుగాడాడు
అంతేకాక
కం. వెఱచుచు వంగుచు వ్రాలుచు
నఱిముఱిఁ గబురులకుఁ జనుచు హరిహరి యనుచున్
మఱుఁగుచు నులుకుచు దిఱదిఱఁ
గుఱుమట్టపుఁ బడుచు వడుగుఁ గొంత నటించెన్.
ఆ పొట్టి బ్రహ్మచారి వెరపు చూపుతూ, ఒయ్యారంగా వంగుతూ, జనంలోకి దూరుతూ, “హరి హరి” అంటూ చాటుకు వెడుతూ, ఉలికిపడుతూ, కొంతసేపు చుట్టూతిరుగుతూ కొంతసేపు నటించాడు. ఆ సభలో వామనుడు కొందరితో చర్చలు చేసాడు. కొందరితో కలిసి వేదాన్ని చదివాడు. కొందరితో చక్కగా సల్లాపాలు సాగించాడు. కొందరితో వాదించాడు. కొందరితో చక్కగా మాట్లాడాడు.
అంతేకాకుండా అందరితోనూ అనేకవిధాలుగా వ్యవహరిస్తూ ...
కం. వెడవెడ నడకలు నడచుచు
నెడనెడ నడు గిడక నడరి యిల దిగఁబడగా
బుడిబుడి నొడువులు నొడువుచుఁ
జిడిముడి తడఁబడగ వడుగు చేరెన్ రాజున్.
వామనుడు మెల్లమెల్లగా అడుగులువేస్తూ నడిచాడు. అక్కడక్కడ నేల దిగబడుతుంటే అడుగులు తడబడుతు నడిచాడు. మధ్యలో కొద్దిగా మాట్లాడుతూ, తడబడుతూ, కలవరబడుతూ, బలిచక్రవర్తిని సమీపించాడు.
( పద్యం చదువుతూ, వామనుని నడకను ఆస్వాదించండి )
అలా మాయాభిక్షుక రూపంలో ఉన్న వామనుడు, ఆ దానవచక్రవర్తి అయిన బలిని చూసి ఇలా అన్నాడు.
' ఇతడేనా రాక్షసచక్రవర్తి ! ఇతడేనా దేవేంద్రుడు, అగ్ని, యముడూ మొదలైన దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన మొనగాడు ! ఇతడేనా అత్యాశలేని నిండైన హృదయం కలవాడు ! ఇతడేనా పెక్కు యజ్ఞాల పుణ్యకార్యాలలో ప్రీతితో దానమిచ్చేవాడు ! ఇతడేనా దేవతాస్త్రీల మనస్సులను కలవరపెట్టే వెన్నెలవంటి కీర్తికలవాడు ! ఇతడేనా సత్యంతో ధర్మంతో ప్రకాశించే స్వరూపం కలవాడు ! '
అని అంటూ, పవిత్రమైన దర్భలూ అక్షతలూ పట్టుకున్న తన కుడిచెయ్యి సాచి వామనుడు ...
ఉ. స్వస్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి
ధ్వస్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ
న్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్.
' ముల్లోకాలనూ శాశించే అధికారం కలవాడా నీకు స్వస్తి ! అవలీలగా దేవేంద్రుడంత వానిని వెలవెల పోయేలా చేసినవాడా ! ఉన్నత పదవిలో మెలిగేవాడా ! మునీంద్రుల పొగడ్తలందుకున్న శుభకరమైన యాగకార్యాలతో విహరించేవాడా ! దేవతాస్త్రీల మాంగల్యాలకు ముప్పు కలిగించిన వాడా ! సమస్త రాక్షసలోక సార్వభౌముడా ! నీకు శుభ మగుగాక. '
అలా బలిని దీవించిన వామనుడు, కరచరణాలతో మానవాకారం ధరించిన వేదరాశివలె అతని ముందు నిలబడ్డాడు. జడలుకట్టిన జుట్టు, దండమూ, గొడుగు, కమండలం ధరించి ఉన్నాడు. అతని చంకలో భిక్షాపాత్ర వ్రేలాడుతున్నది. అతని ముఖం చంద్రబింబంవలె అందంగా వుంది. మాయా వాదనల చతురోక్తులు పలుకుటలో అతడు నేర్పరి.
సూర్యుని కిరణాలతో కప్పబడి వెలవెల పోయిన ఇతర గ్రహాలమాదిరిగా ఆ బ్రహ్మచారి ముందు భృగువంశపు బ్రాహ్మణులు మరుగుపడిపోయారు. వారు కూర్చున్న చోటు నుండి లేచి నిలబడి, వామనుని క్షేమాన్ని అడిగి, తియ్యనిమాటలతో అతణ్ని గౌరవించారు.
బలిచక్రవర్తి అతనికి మ్రొక్కి ఆసనంపై కూర్చోపెట్టాడు. అతని అడుగులను తుడిచాడు. తన ఇల్లాలు బంగారు కలశంతో నీళ్ళు పోయగా, రాక్షస చక్రవర్తి, ఆ వడుగు అడుగులు కడిగి తడి తుడిచాడు. వామనుని కాళ్లు కడిగిన నీళ్ళను, బలిచక్రవర్తి మేలుకలిగించేవిగా తలచి, తలపై చల్లుకున్నాడు. అతిథిగా వచ్చిన ఆ వామనునితో ఇలా అన్నాడు.
మ. వడుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? సంవాసస్థలంబెయ్య? ది
య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మముం;
గడు ధన్యాత్ముఁడనైతి; నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్
గడతేఱెన్; సుహుతంబులయ్యె శిఖులుం; గల్యాణ మిక్కాలమున్.
' ఓ బ్రహ్మచారీ ! నీపేరేమిటి ? ఎవరి పిల్లవాడవు ? నీవు నివసించే చోటేది ? ఇక్కడికి నీవు రావడంవలన, నావంశమూ నా జన్మ సఫలము అయ్యాయి. నేను చాలా పుణ్యాత్ముడను అయ్యాను. ఈ యజ్ఞం పవిత్రం అయింది. నా కోరికలు నెరవేరాయి. అగ్నులు బాగా వెలుగుతున్నాయి. ఈ సమయం చాలా శుభదాయకం అయింది.
మ. వరచేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా! "
ఓ బ్రాహ్మణోత్తముడా ! నీకేం కావాలో కోరుకో. మేలైన వస్త్రములా, డబ్బులా, పండ్లా, అడవి సంపదలా, గోవులా, గుఱ్ఱములా, రత్నాలా, రథాలా, మంచి ఆహారాలా, కన్యలా, ఏనుగులా, బంగారమా, భవనాలా, గ్రామాలా, పొలాలా, భూభాగాలా ? లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా కోరుకుంటున్నావా ?
ఇలా ధర్మబద్ధంగా బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించిన, భగవంతుడైన వామనుడు ఇలా అన్నాడు.
సీ. "ఇది నాకు నెలవని యేరీతిఁ బలుకుదు? ;
నొక చోటనక యెందు నుండ నేర్తు;
నెవ్వనివాఁడ నం చేమని నుడువుదు? ;
నా యంతవాఁడనై నడవనేర్తు;
నీ నడవడి యని యెట్లు వక్కాణింతుఁ? ;
బూని ముప్పోకల బోవ నేర్తు;
నదినేర్తు నిదినేర్తు నని యేలఁ జెప్పంగ? ;
నేరుపు లన్నియు నేన నేర్తు;
తే.
నొరులుఁ గారు నాకు నొరులకు నే నౌదు
నొంటివాఁడఁ జుట్ట మొకఁడు లేఁడు
సిరియుఁ దొల్లి గలదు చెప్పెద నా టెంకి
సుజనులందుఁ దఱచు చొచ్చియుందు.
' ఓ రాజేంద్రా ! ఇది నా చోటు అని ఎలా చెప్పగలను ? ఒక చోటనకుండా అన్ని చోట్లా ఉంటాను. ఎవరికి చెందినవాడనని చెప్పగలను ? నేను నాఅంతవాడనై స్వేచ్ఛగా నడుచుకుంటాను. నానడవడి ఇది అని ఎలా చెప్పగలను ? పూనికతో మూడుపోకడలూ పొగలను. అది ఇది నేర్చుకున్నానని చెప్పడము ఎందుకు గానీ, అన్ని విద్యలూ నేర్చుకున్నాను. వేరే వారు ఎవ్వరూ నన్ను చేరదీయరు. నేనే వారిని చేరదీస్తాను. నేను ఒంటరివాణ్ణి. చుట్టాలు ఎవరూ లేరు. ఇంతకుముందు నాకు సిరికూడా ఉండేది. ఎక్కువగా నేను మంచివారితో కలిసి మసలుతుంటాను. అదే నా నివాసము.
ఆ సంగతి అట్లుండనీ, ఇప్పుడు నాతో నీవు అన్నమాట యదార్థం. మంచి కీర్తిని ఇచ్చేది నీ వంశానికి తగినది, ధర్మంతో కూడినది మీ వంశం. మీకులంలో కనికరం కలవారూ ఆత్మబలంకలవారూ తప్ప వేరేవారు పుట్టలేదు. మీతో యుద్ధం చెయ్యడానికి గానీ, దానం ఇవ్వడానికి గానీ భయపడేవారు ఎవరూ లేరు. దరిచేరిన ప్రత్యర్ధులకు పరాక్రమంతోనూ, దేహి అనే అర్ధులకు దానంతోనూ తృప్తి కలిగిస్తారు.
మీ తాతలు అందరూ గొప్ప మేటివీరులు. ఆకాశంలో వెలిగే చంద్రునిలా మీ వంశంలో ప్రహ్లాదుడు మేలైన కాంతివంతమైన కీర్తితో ప్రకాశిస్తాడు. మీవంశం సమృద్ధమైన కీర్తితో సముద్రంవలె పెంపారుతుంది. మీ మూడవ తరం తాత అయిన హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి గదా దండాన్ని ధరించి భూలోకం అంతా తిరిగాడు. ఎక్కడా పగవాడు కనిపించలేదు. చివరకు అతనిని విష్ణువు వరాహరూపంలో పరిమార్చాడు.
ఆ సంగతిని హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు విన్నాడు. విష్ణువు పరాక్రమానికి ఆశ్చర్యపడ్డాడు. విష్ణువు విజయాన్ని బలాన్ని తూలనాడాడు. వెంటనే అసురమర్దనుడు విష్ణువు యొక్క పట్టణమైన వైకుంఠంపై దండెత్తాడు. అప్పుడు శూలాన్ని ధరించి ప్రళయకాలయమునివలె వస్తున్న హిరణ్యకశిపుణ్ణి చూసి, సమయాసమయములు గుర్తించగల మాయలమారి కనుక, విష్ణువు తన మనస్సులో ఇలా ఆలోచించాడు :
' ఈ హిరణ్యకశిపుడిని యుద్ధంలో ఎదిరించి జయించడానికి వీలుకాదు. అలాకాకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇక లోకంలోని ప్రాణులపైకి మృత్యువు మాదిరిగా దండెత్తి భయపెట్టి పారద్రోలుతాడు ' అనుకొని విష్ణువు ఉపాయాన్ని ఆలోచించాడు. సూక్ష్మరూపంతో ముక్కురంధ్రం గుండా హిరణ్యకశిపుని హృదయంలో ప్రవేశించాడు.
ఆ తరువాత ఆ రాక్షసేంద్రుడు హిరణ్యకశిపుడు, వైకుంఠం ప్రవేశించి, విష్ణువు కోసం వెదకాడు. కానీ పగవాడు కనిపించ లేదు. కోపంతో ఆ రాక్షసుడు విష్ణువు కోసం ఆకాశాన్ని, భూలోకాన్ని, స్వర్గలోకాన్ని గాలించాడు. సకల దిక్కులనూ, భూగర్భాలనూ, సముద్రాలనూ, పట్టణాలనూ, అడవులనూ అంతటా వెదకాడు. లోకంలో విష్ణువుజాడ ఎక్కడా చిక్కలేదు.
కడకు వెతుకుట ఆపి ' నా శత్రువు మరణించి ఉండవచ్చు. మరణించకుండా ఉండి ఉంటే నన్ను ఎదుర్కొనేవాడే కదా ! మరణించిన పగవారిపై పగబూనడం తగదు. '
అనుకొని దండయాత్ర ఆపేసాడు. అలాంటి మీ ముత్తాత హిరణ్యకశిపుడు గుణాలు లెక్కలేనన్ని ఉన్నాయి అనుకో. వాటిని అలా ఉండనీ.
ఇక మీ తండ్రి వైరోచనుడు మాత్రం సామాన్యుడా ! ఇంద్రాదులు బ్రహ్మణులవలె బాధ నటిస్తూ అడుగుకొనగా, ' సరే తీనుకోండి ' అంటూ మీ తండ్రి వారికి తన ఆయుస్సును దానమిచ్చేసాడు. నీవు కూడా వారికి ఏమాత్రం తీసిపోవు.
కం. ఏలితివి మూఁడు జగములుఁ;
దోలితి వింద్రాది సురలఁ; దొల్లిటివారిం
బోలితివి దానగుణముల;
సోలితివి పిశాచరాక్షసుల రక్షింపన్.
నీవు ముల్లోకాలనూ పాలించావు. ఇంద్రాది దేవతలను ఓడించావు. దానమివ్వడంలోనూ సుగుణాలలోనూ మీపెద్దలకు సమానమైనవాడవు అయ్యావు. రాక్షసులను రక్షించడంలో సమర్థుడవు అయ్యావు.
అంతే కాకుండా.రాజ్యాధికారం కలిగినప్పుడు గౌరవింపదగినవారికీ, బ్రాహ్మణులకూ బిచ్చగాళ్ళకూ ధనాన్ని పంచిపెడుతూ బ్రతకాలి. అలా చేయనివాడి బ్రతుకూ, ధనమూ, మేడలు నిరర్థకాలు. అవి పరిత్యజింప తగినవి.
దాతలను లెక్కించేటప్పుడు ముల్లోకాలలోనూ గొప్పవాడుగా మొట్టమొదట నిన్నే ఎన్నిక చేస్తారు. ఇంతవాడవు అయినా, ఇంతవరకూ నిన్ను ఇమ్మంటూ ఏనాడూ నేను పీడించలేదు.
ఆ. ఒంటివాఁడ నాకు నొకటి రెం డడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల;
గోర్కిఁదీర బ్రహ్మకూకటి ముట్టెద
దానకుతుకసాంద్ర! దానవేంద్ర! "
ఓ దానవరాజా ! దానం చేయలనే చిక్కని కుతూహలం కలవాడా ! నేను ఒంటరివాడిని. నాకు సొమ్ములూ భూములూ అక్కరలేదు. మూడడుగుల నేల మాత్రము ఇమ్ము. దానితో తృప్తిపడి బ్రహ్మానందం పొందుతాను. ' అన్నాడు.
ఇలా మూడు అడుగుల నేల అడిగిన ఉత్కృష్ట భిక్షుకుడైన వామనుడితో, బహు దొడ్డ దాత అయిన బలిచక్రవర్తి ఇలా అన్నాడు.
ఆ. "ఉన్నమాటలెల్ల నొప్పును విప్రుండ!
సత్య గతులు వృద్ధ సమ్మతంబు;
లడుగఁ దలఁచి కొంచె మడిగితివో చెల్ల;
దాత పెంపు సొంపుఁ దలఁపవలదె. "
' ఓ బ్రాహ్మణుడా ! నీ మాటలన్నీ ఉన్నమాటలే. వాటిని ఒప్పుకోవలసిందే. ముమ్మాటికీ సత్యములే. అందుకు పెద్దలు కూడా కాదనరు. కానీ దానం తీసుకునే ఉద్దేశ్యం ఉండీ, గి ఇంత కొంచెమే అడిగావు. చాలా బాగుంది. కానీ అడిగే టప్పుడు, దాత గొప్పదనాన్నీ అతని గొప్ప గుణాన్ని తలచాలి కదా ! '
అని అంటూ, బలిచక్రవర్తి, ఇంకా ఏదైనా, పెద్దకోరిక కోరుకొమ్మని, వామనునికి చెబుతున్నాడు.
స్వస్తి.
పోతనానుగ్రహంతో, మరికొంత రేపు.
ప్రేమతో
om
ReplyDelete