Friday 22 May 2020

. శ్రీ శివ మహా పురాణము




🌹 . శ్రీ శివ మహా పురాణము - 146 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
35. అధ్యాయము - 10

🌻.  పరమ శివతత్త్వము - 2 🌻

తేషాం త్రింశద్దినైర్మాసో ద్వాదశైసైవత్సరః | శతవర్ష ప్రమాణన బ్రహ్మాయుః పరికీర్తితమ్‌ || 17

బ్రహ్మణో వర్ష మాత్రేణ దినం వైష్ణవముచ్యతే | సోపి వర్షశతం యావదాత్మమానేన జీవతి || 18

వైష్ణవేణ తు వర్షేణ దినం రౌద్రం భవేద్ద్రువమ్‌ | హరో వర్షశతే యాతే నరరూపేణ సంస్థితః || 19

యావదుచ్ఛ్వ సితం వక్త్రే సదా శివసముద్భవమ్‌ | పశ్చాచ్ఛక్తిం సమాభ్యేతి యావన్నిశ్శ్వసితం భవేత్‌ || 20

అట్టి ముప్పది రోజులు ఒక నెల. పన్నెండు నెలలు ఒక సంవత్సరము. బ్రహ్మ యొక్క ఆయుర్దాయము ఇట్టి వంద సంవత్సరములని చెప్బబడెను (17). 

బ్రహ్మ యొక్క ఒక సంవత్సరము విష్ణువునకు ఒక దినము అగును. ఈ లెక్కలో ఆయనకు వంద సంవత్సరముల ఆయుర్దాయము ఉండును (18). 

విష్ణువు యొక్క ఒక సంవత్సరము రుద్రునకు ఒక దినము. రుద్రుడు వంద సంవత్సరములు నరరూపములో నుండును (19). 

ఆ కాలము సదాశివుని ఒక ఉచ్ఛ్వాసతో సమానమగును. అటు పిమ్మట రుద్రుడు సదాశివుని నిశ్శ్వాసకాలము వరకు శక్తిలో లీనుడై ఉండును (20).

నిశ్శ్వాసోచ్ఛ్వ సితానాం చ సర్వేషామేవ దేవహినా మ్‌. బ్రహ్మ విష్ణు హరాణాం చ గంధర్వోరగ రక్షసామ్‌ || 21

ఏకవింశ సహస్రాణి శతైష్షడ్భి శ్శతాని చ | అహో రాత్రాణి చోక్తాని ప్రమాణం సురసత్తమౌ || 22

షడ్భి రుచ్ఛ్వాస నిశ్శ్వాసైః పలమేకం ప్రవర్తితమ్‌ | ఘటీ షష్టిపలాః ప్రోక్తాస్సా షష్ట్యా చ దినం నిశా || 23

నిశ్శ్వా సోచ్ఛ్వసితానాం చ పరి సంఖ్యా న విద్యతే | సదాశివసముత్థానా మేతస్మాత్సోsక్షయః స్మృతః || 24

ఇత్థం రూపం త్వయా తావద్రక్షణీయం మమాజ్ఞయా | తావత్సృష్టేశ్చ కార్యం వై కర్తవ్యం వివిధైర్గుణౖః || 25

ఓ దేవశ్రేష్ఠులారా! సర్వప్రాణులకు, బ్రహ్మవిష్ణు రుద్రులకు, గంధర్వులకు, పాతాళవాసులకు, రాక్షకులకు (21), 

21,600 ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు ఒక రోజు అగునని తెలియవలెను (22). 

ఆరు ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు ఒక పలము అగును. అరవై పలములు ఒక ఘటి . అరవై ఘటులు ఒక రోజు అగును. (23). 

సదాశివుని నిశ్శ్వాసో చ్ఛ్వాసలకు పరిగణనము లేదు. కావుననే, ఆయన అక్షయుడని చెప్పబడినాడు (24). 

ఈ జగద్రూపమును నీవు నా ఆజ్ఞచే రక్షింపుము. మీరిద్దరు వివిధ గుణముల నాశ్రయించి సృష్టికార్యమములను చేయుడు (25).

బ్రహ్మో వాచ |

ఇత్యాకర్ణ్య వచశ్శంభోర్మయా చ భగవాన్హరిః | ప్రణిపత్య చ విశ్వేశం ప్రాహ మందతరం వశీ || 26

బ్రహ్మ ఇట్లు పలికెను -

శంభుని ఈ మాటలను విని నేను, విష్ణు భగవానుడు జగత్పతియగు ఆయనకు నమస్కరించితిమి. సర్వసమర్థుడగు విష్ణువు మెల్లగా శివునితో నిట్లనెను (26).

విష్ణురువాచ |

శంకర శ్రూయతామేతత్కృపాసింధో జగత్పతే | సర్వమేతత్కరిష్యామి భవదాజ్ఞావశానుగః || 27

మమ ధ్యేయస్సదా త్వం చ భవిష్యసి న చాన్యథా |భవత స్సర్వ సామర్థ్యం లబ్దం చైవ పురా మయా || 28

క్షణ మాత్రమపి స్వామింస్తవ ధ్యానం పరం మమ | చేతసో దూరతో నైవ నిర్గచ్ఛతు కదాచన || 29

మమ భక్తశ్చ మత్స్వమింస్తవ నిందాం కరిష్యతి | తస్య వై నిరయే వాసం ప్రయచ్ఛ నియతం ధ్రువమ్‌ || 30

విష్ణువు ఇట్లనెను -

శంకరా! నీవు కృపాసముద్రడవు. జగత్పతివి. ఈ మాటను వినుము. నీ యాజ్ఞకు వశవర్తినై ఈ పనులనన్నిటినీ చేసెదను (27). 

నేను సర్వదా నిన్ను ధ్యానించెదను. సందేహము లేదు. నేను పూర్వము నుండియే సామర్ధ్యములనన్నిటినీ పొందియుంటిని (28). 

ఓ స్వామీ! నీశ్రేష్ఠమగుధ్యానము నామనస్సు నుండి క్షణమాత్రమైననూ ఏనాడైననూ తొలగి పోకుండు గాక! (29). 

ఓ స్వామీ! నా భక్తుడెవ్వరైననూ నిన్ను నిందించిన చో నిశ్చయముగా వానికి నరకవాసము నిమ్ము (30).

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 . శ్రీ శివ మహా పురాణము - 147 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
35. అధ్యాయము - 10

🌻.  పరమ శివతత్త్వము - 3 🌻

త్వద్భక్తో యో భవేత్స్వామిన్మమ ప్రియతరో హి సః | ఏవం వై యో విజానాతి తస్య ముక్తిర్న దుర్లభా || 31

మహిమా చ మదీయోsద్య వర్థితో భవతా ధ్రువమ్‌ | కాదచిదగుణశ్చైవ జాయతే క్షమ్యతామితి || 32

ఓ స్వామీ! నీ భక్తుడగు మానవుడు నాకు మిక్కిలి ప్రీతి పాత్రుడగును. ఈ సత్యము నెరింగిన వానికి ముక్తి దుర్లభము కాదు (31). 

ఈనాడు నీచే నా మహిమ నిశ్చయముగా వృద్ధి పొందింపబడినది. నేను ఏనాడైననూ తప్పు చేసినచో క్షమించవలెను (32).

బ్రహ్మోవాచ |

తదా శంభుస్తదీయం హి శ్రుత్వా వచనముత్తమమ్‌ | ఉవాచ విష్ణుం సుప్రీత్యా క్షమ్యా తేsగుణతా మయా || 33

ఏవముక్త్వా హరిం నౌ స కరాభ్యాం పరమేశ్వరః | పస్పర్శ సకలాంగేషు కృపయా తు కృపానిధిః || 34

ఆదిశ్య వివిధాన్ధర్మాన్సర్వదుఃఖహరో హరః | దదౌ వరాననేకాంశ్చావయోర్హితచికీర్షయా || 35

తతస్స భగవాన్‌ శంభుః కృపయా భక్తవత్సలః | దృష్ట్యా సంపశ్యతోశ్శీఘ్రం తత్రైవాంతరధీయత|| 36

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు శంభుడు విష్ణువు యొక్క పలుకులను విని ప్రీతితో అతనితో 'నీ తప్పు నాచే క్షమింపదగినదే' అని పలికెను (33).

కృపానిధియగు ఆ పరమేశ్వరుడు విష్ణువుతో నిట్లు పలికి మా ఇద్దరిని అవయవములన్నిటియందు చేతులతో స్పృశించెను (34).

దుఃఖములనన్నింటినీ పోగొట్టే శివుడు మాకు ఇద్దరికి వివిధ ధర్మముల నాదేశించి, మాకు ప్రీతిని కలిగించుటకై అనేక వరముల నిచ్చెను (35). 

అపుడు భక్తవత్సలుడగు ఆ శంభుడు కృపాదృష్టితో చూచి, మేము చూచు చుండగా వెంటనే అంతర్హితుడాయెను (36).

తదా ప్రభృతి లోకేsస్మిన్‌ లింగపూజా విధిః స్మృతః |లింగే ప్రతిష్ఠితశ్శంభుర్భుక్తి ముక్తి ప్రదాయకః || 37

లింగవేదిర్మహాదేవీ లింగం సాక్షాన్మహేశ్వరః | లయనాల్లింగమిత్యుక్తం తత్రైవ నిఖిలం జగత్‌ || 38

యస్తు లైంగం పఠేన్నిత్యం అఖ్యానం లింగసన్నిధౌ | షణ్మా సాన్‌ శివరూపో హి నాత్ర కార్యా విచారణా || 39

యస్తు లింగసమీపే తు కార్యం కించిత్కరోతిచ | తస్య పుణ్యఫలం వక్తుం న శక్నోమి మహామునే || 40

ఇ తి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయం ప్రథమ ఖండే సృష్ట్యుపాఖ్యానే పరమ శివ తత్త్వ వర్ణనం నామ దశమోsధ్యాయః (10).

అప్పటి నుండియు ఈ లోకములో లింగపూజా విధి ప్రవర్తిల్లినది. భక్తిని, ముక్తిని ఇచ్చే శంభుడు లింగములో ప్రతిష్ఠితుడై యున్నాడు (37). 

లింగము యొక్క వేది మహాదేవి యగు ఉమ. లింగము సాక్షాత్తుగా మహేశ్వరుడు. దాని యందు జగత్తంతయు లయమగుటచే లింగమని పేరు వచ్చినది (38). 

లింగసన్నిధిలో ఆరు మాసములు నిత్యము లింగావిర్భావగాథను పఠించు వ్యక్తి శివస్వరూపుడనుటలో సందేహమక్కరలేదు (39). 

ఓ మహర్షీ! లింగసన్నిధిలో ఏదేని ధర్మ కార్యమును ఆచరించు మానవుని పుణ్యఫలమును నేను వర్ణించలేను (40).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహిత యందు సృష్ట్యుపాఖ్యాన మనే మొదటి ఖండములో పరమశివతత్త్వ వర్ణన మనే పదియవ అధ్యాయము ముగిసినది (10).

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment