Friday, 22 May 2020




||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము / 13వ దశకము - వరాహావతార వర్ణనము13-6-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩

తతశ్శూలం కాల ప్రతిమరుషి దైత్యే విసృజతి
త్వయి చ్ఛిందత్యేతత్ కరకలితచక్రప్రహరణాత్
సమారుష్టో ముష్ట్యా స ఖలు వితుదంస్త్వాం సమతనోత్
గళన్మాయే మాయాస్త్వయి కిల జగన్మోహనకరీః||

భావము:-

అనంతరము హిరణ్యాక్షుడు - రుద్రునివలె నీపై ప్రయోగించిన త్రిశూలమును, నీవు చక్రాయుధముతో ఛిద్రముచేసితివి. అసహనముతో అసుర డప్పుడు నిన్ను సమీపించి పిడికిలితో నిన్ను పొడిచెను. ఆపై, తన మాయాబలముతో - లోకము మోహమునకు వశమగునట్టి మాయలను ప్రయోగించెను.

🕉🌞🌎🌙🌟🚩

||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము / 13వ దశకము - వరాహావతార వర్ణనము13-7-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩

భవచ్చక్రజ్యోతిష్కణలవనిపాతేన విధుతే
తతో మాయా చక్రే వితతఘనరోషాంధమనసమ్।
గరిష్ఠాభిర్ముష్టిప్రహృతిభిరభిఘ్నంతమసురం
స్వపాదాంగుష్ఠేన శ్రవణ పద మూలే నిరవధీః||

భావము:-

హిరణ్యాక్షుడు ప్రయోగించిన మాయాచక్రము - అగ్నికణములను వెదజల్లునది మరియు మిక్కిలి ప్రకాశవంతమైనది అయిన నీ చక్రాయుధపు స్వల్ప తాకిడికే చిన్నాభిన్నమయినది. అప్పు డసురుడు -రోషముతో తన మనసు రగులుచుండగా, అంధునివలె తన చేతులతో నిన్ను కొట్టుచు హింసించుటకు ప్రయత్నించెను. అంతట -నీ పాదములతో హిరణ్యాక్షుని కర్ణమూలమును గాయపరిచితివి.

వ్యాఖ్య:-

లీలా నాటక సూత్రధారి, జగదానందకారకుడైన శ్రీ మహావిష్ణువు ధర్మసంరక్షణార్థము, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థము అనేక అవతారాలు ధరించాడు. సనకసనందనాదుల శాపానికి గురి అయిన జయ విజయులు మూడు జన్మలలో శ్రీ మహావిష్ణువు శత్రువులుగాజన్మించి, అతని చేతిలోనే మరణించి శీఘ్రంగా వైకుంఠప్రాప్తిని పొందాలని కోరగా శ్రీ మహావిష్ణువు వారిని తథాస్తు అని అనుగ్రహిస్తాడు.


అలా శాప కారణంగా హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంత వక్త్రులుగా జన్మించిన తన సద్భక్తులను అనుగ్రహించడానికి వచ్చిన అవతారాలు వరాహావతారం, నరసింహావతారం, శ్రీరామావతారం, శ్రీకృష్ణావతారాలు. హిరణ్యాక్ష వధ, హిరణ్యకశ్యపుని వధ కొరకే అవతరించినవి వరాహావతారం, నరసింహావతారాలు.


శిశుపాల దంత వక్త్రుల వధానంతరం కూడా సుదీర్ఘ కాలం పృథ్వి పైన జీవించి సద్గురువుగా గీతోపదేశం చేసిన అవతారం శ్రీకృష్ణావతారం. విచిత్రం ఏమిటంటే శ్రీకృష్ణావతారంలో జననం నుంచీ మరణం వరకూ తాను మానవరూపం ధరించిన భగవంతుడిని అన్న విషయాన్ని ఎక్కడా దాచకుండా భగవత్ స్వరూపముగానే ప్రవర్తించి అవతార పరిసమాప్తి చేశాడు శ్రీకృష్ణుడు.

🕉🌞🌎🌙🌟🚩

Radha Krishna in a Secret Rendezvous on a Rainy Night - Reprints of Miniature Paintings (Reprint on Paper - Unframed)

No comments:

Post a Comment