చతుర్విధ కందములు-- చిత్ర కవిత్వము-1
ఇది యొక విచిత్రమైన కందపద్యం. చతుర్విధ కందమని దీని పేరు. ఉండే దొక్కటే కందపద్యం. దాని రెండవపాదం రెండవ మాటతోమొదలుపెట్టి , మరోపద్యం . మరలాదాని రెండవపాదం రెండవ పదంతో మరోపద్యం. అలాగే మరోమారు ఆవృత్తిని పొందుతుంది. ఆమాటలనే ఆపదాలనే తిప్పితిప్పి సరికొత్తపద్యాలవుతుంటాయి. గణాలుగానీ ,యతిప్రాసలు గానీ , యెక్కడా తప్పవు. పద్యానికి అర్ధమూ భావమూకూడా మారదు. ఈవిధంగా కూర్చిన కందపద్యానికి చతుర్విధ కందమనిపేరు.
ప్రస్తుతం ఇలాంటి ఒకకందాన్ని పరిశీలిద్దాం!
1 కం : " సుర రాజ విభవ, లక్షణ
భరితా, వనజాస్త్రరూప, వరక కవి వినుతా,
: హరిభక్తి యుక్త విలసత్
కరుణా ,దినకర సుతేజ గద్వాలనృపా!"
ఇదీ మొదటి పద్యం! దీనికి అర్ధం తెలిసికొందాం.
హేగద్వాలనృపా- ఓగద్వాల నేలే ప్రభూ! సురరాజ విభవ- దేవేంద్ర వైభవముగలవాడా! ; లక్షణ భరితా- శుభలక్షణసమన్వితా ; వనజాస్త్ర రూప- మన్మధరూపా ; వర కవి వినుతా- సత్కవులచే పొగడబడువాడా ; హరిభక్తితోను కరుణతోను కూడినవాడా ; దినకర సుతేజ- సూర్యతేజమువంటి చక్కని పరాక్రమము గలవాడా ;
భావము: దేవేంద్ర వైభవముగలవాడా ! శుభ లక్షణ సమన్వితా! మన్మధరూపా! సత్కవులచే కీర్తిప బడువాడా! హరిభక్తితోను దయతోను నిండిన మనస్సుగలవాడా! సూర్య సమాన తేజా! మమ్మాదరింపుము.
ఇపుడీ పద్యమే మరో మూడు కందపద్యాలుగా మారబోతోంది. చూడండి!
2 కం: వనజాస్త్రరూప, వరకవి
వినుతా , హరిభక్తి యుక్త విలసత్కరుణా ,
దినకర సుతేజ , గద్వా
ల నృపా ,సురాజ విభవ లక్షణ భరితా!
3 కం: హరిభక్తియుక్త ,విలసత్
కరుణా , దికర సుతేజ , గద్వాల నృపా !
సుర రాజవిభవ, లక్షణ
భరితా , వనజాస్త్రరూప , వర కవి వినుతా!
పద్యా 4 కం: దినకర సుతేజ, గద్వా
లనృపా , సురాజ విభవ ,లక్షణ భరితా ,
వనజాస్త్ర రూప , వరకవి
వినుతా , హరిభక్తియుక్త , విలసత్కరుణా!
ఇలా ఒకే పద్యం అర్ధంగానీ ,గణాలుగానీ ,యతిప్రాసలు గానీ, మారకుండా చెప్పటం ఆశ్చర్యంగా లేదూ!
బద్వేటి వెంకట కృష్ణయ్య గారు అనే కవి , గద్వాలప్రభువైన శ్రీ సీతారామ భూపాలుని గూర్చి చెప్పన చతుర్విధ కందమిది.. సారస్వతంలో యిలాంటి విచిత్రాలు యెన్నో ఉన్నాయి. తెలిసికోవాలనే ఆశక్తి ఉంటే నాతో పయనం చేస్తూ ఉండండి.
స్వస్తి! |
|
|
|
No comments:
Post a Comment