Sunday, 1 January 2017

గంగోత్రి విశేషాలు !!!***

గంగోత్రి విశేషాలు !!!
చార్ ధామ్ యాత్రలో సులభతరంగా చేరగలిగిన ప్రదేశం గంగోత్రి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీ ఎత్తున హిమాలయాల పర్వత శ్రేణులలో భగీరథీ నది ఒడ్డున ఉన్నది. ఢిల్లీ నుండి బస్సులో ఋషికేశ్ కి చేరుకోవాలి. అక్కడ నుండి దేవప్రయాగ, ధరసుల మీదుగా భాగీరథీ తీరం వెంట సుమారు 125 కి.మీ., దూరం ప్రయాణించి ఉత్తరకాశిని చేరుకోవాలి.

ఉత్తరకాశీ నుండి బస్సులో గంగోత్రిని చేరుకోవాలి. నదులన్నింటిలో గంగానది పరమ పవిత్రమైన నది. ఈ నది స్వచ్చతకు నిదర్శనం. మనం చేసిన పాపాలను ఈ నది ప్రక్షాళనం చేస్తుంది. ఈ నది విష్ణు భగవానుని పాదముల నుండి ఉద్భవించింది. భగీరథుడి తీవ్ర తపశ్శక్తి ద్వారా ఉద్భవించిన గంగ 18 కి.మీ., దూరం ప్రయాణించి గోముఖం అనేచోట నేల మీదకు దూకుతుంది.


గంగోత్రి దగ్గర గంగానది సుమారు 50 లేక 60 అడుగుల వెడల్పు ఉంటుంది. నిజానికి గంగ మొట్టమొదట నేలమీదకు దిగింది ఈ గంగోత్రి దగ్గరే. కానీ, కలియుగంలో మానవుల పాపం పెరిగిపోయిన కొద్దీ, గంగ కొద్దికొద్దిగా వెనుకకు జరుగుతూ పోతుంటుందని, అలా ఇప్పటికి గోముఖ్ అని పిలవబడే స్థలం వరకూ వెనుకకు వెళ్ళినదని, కలియుగం పూర్తయ్యేటప్పటికి పూర్తిగా కనిపించకుండా పోతుందని పండితుల మాట.

గోముఖం నుంచి, ఈ గంగోత్రి వరకూ ప్రవహిస్తూ వచ్చిన ఈ గంగానది ప్రవాహం, తల్లి గర్భంలో నుంచి అప్పుడే భూమి మీద పడిన శిశువు వంటిది. అంటే గోముఖం నుంచి ఈ గంగోత్రి చేరే వరకూ ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందివల్ల రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామికి చేసే నిత్యాభిషేకం, ఈ గంగోత్రి నుంచి తీసుకువెళ్ళిన నీటితోనే చేస్తారు. స్నానఘట్టాలకు పైన, అంటే నది ఒడ్డున ఉన్న ప్రధాన వీధికి చివరగా, గంగామాత పవిత్ర ఆలయం ఉన్నది. ఇక్కడ ఈ ఆలయాన్ని మొదట అమర్ సింగ్ థాపా అనే నేపాలీ సైనికాధికారి నిర్మించాడు.

ఆ తరువాత అది కొంత శిధిలమవ్వగా తిరిగి జైపూర్ కు చెందిన రాణా వంశస్థులు ప్రస్తుతం ఉన్న ఆలయం నిర్మింపజేశారు. వెన్నలాంటి తెల్ల చలువరాయితో ఈ ఆలయం నిర్మించబడింది. విశాలమైన ప్రాంగణంలో, పడమర వైపు ఈ ఆలయం ఉన్నది. ఆలయం లోపల, ముందు భాగంలో, ఒక మండపం, లోపల మూడు గర్భాలయాలు, మధ్య ఆలయంలో ప్రధానమైన గంగామాత విగ్రహమూర్తి, ప్రక్కనే ఉన్న మందిరాలలో యమున, సరస్వతి, లక్ష్మీ, పార్వతి, అన్నపూర్ణల విగ్రహమూర్తులు ఉన్నాయి.

ఆలయానికి ప్రక్కగా, కటకటాలతో మూసి ఉన్న గది లాంటి దానిలో ఒక చిన్న రాతి వేదేక ఉంది. దీనిని ‘భగీరథ శిల’ అంటారు. ఈ శిల మీద కూర్చునే భగీరథుడు, గంగను గూర్చి తపస్సు చేసాడని స్థలపురాణం తెలియజేస్తుంది. ఆలయ ప్రాంగణంలోనే శివుడు, వినాయకుడు, ఆంజనేయుడు, మొదలగు దేవతామూర్తులకు చిన్న చిన్న మందిరాలు కూడా ఉన్నాయి.

ఈ ఆలయంలో ప్రతీరోజూ ఉదయం ఆరు గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సాయంత్రం 7 గంటలకు గంగామాత హారతి ఇస్తారు. ఈ ఆలయం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకూ మాత్రమే మూసి ఉంటుంది. మిగతా సమయాలలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. యమునోత్రిలోలాగానే ఈ ఆలయాన్ని కూడా దీపావళి మర్నాడు మూసి, తిరిగి అక్షయతృతీయ (వైశాఖ శుద్ధ తదియ) నాడు తెరుస్తారు. గంగామాత దర్శనం పాపహరణం అని భక్తులు తలుస్తారు.




No comments:

Post a Comment