*🌹 సిద్దేశ్వరయానం - 40 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 5వ శతాబ్దం నుండి 🏵*
*ఆలయంలోకి వెన్నెల ప్రసరిస్తుంది. పున్నమివేళ హిరణ్మయీ హరసిద్ధులు దీక్షాధారణ చేసి భైరవ తంత్రప్రక్రియ ప్రారంభించారు.ఎన్నిరోజులు - ఎన్నిరాత్రులు - ఎన్ని పగళ్ళు - లెక్కలేదు. పారవశ్యంలో మహాభావస్థితి వస్తున్నది. పశుభావం - వీరభావం - దివ్యభావం క్రమక్రమంగా మహోన్నతస్థితికి నిచ్చెనలు వేస్తున్నవి.*
*కృష్ణచతుర్దశి - మాసశివరాత్రి వచ్చింది. ఎందుకో హిరణ్మయి కండ్లు మూతలు పడుతున్నవి. ఇంతలో ఎవరో ఆమెలోకి ప్రవేశించినటులైంది. కనులు తెరచిన ఆమెలో నుండి మెరుపులు వస్తున్నవి. కండ్లు మిలమిలా మెరుస్తున్నవి. అతడాశ్చర్యంతో చూచాడు. చేతి భైరవ వజ్రాంగుళీయకాన్ని కన్నుల కద్దుకొన్నాడు. "హిరణ్యా! ఏమిటీ వింత " అన్నాడు. “నేను డాకినిని” అని ఆమె గళం పలికింది. అతడాశ్చర్యంతో ఆగి “ఇదేమిటి? నా భార్యలోకి ఎలా ప్రవేశించావు ? ఎందుకు? తప్పుకదా!" అన్నాడు. ఆమె హిరణ్మయిలో నుండి బయటకు వచ్చి తన దివ్యరూపంతో నిలుచున్నది. హిరణ్మయి సుప్తస్థితిలోకి వెళ్ళింది.*
*“సిద్ధభైరవా ! భైరవాజ్ఞ వల్ల నేనీమెలోకి ప్రవేశించాను. నేను వజ్రవైరోచని యుద్ధసఖిని. కైలాస పర్వతమార్గం దగ్గర ఉన్న శ్మశానానికి నేను అధికారిణిని. నీవు పూర్వజన్మలో నా భూమిలో తపస్సు చేశావు. అప్పుడు నీవు కోరిన వరములిచ్చాను. నేను క్రోధభైరవిని. అడుగో భైరవస్వామి వచ్చాడు. ప్రత్యక్షముగా నిలుచున్నాడు. నిన్ను అనుగ్రహిస్తున్నాడు అని భైరవుని ప్రక్కన నిలుచున్నది.*
*భైరవుడు “వీరుడా! మీ సాధన పూర్తి అయింది. డాకిని పలికినట్లు ఇప్పటి నుండి నీవు సిద్ధభైరవుడవు. నా అనుచరుడవు. నీలో నేనుండి రాబోయే యుద్ధంలో నిన్ను గెలిపిస్తాను. దానికి కావలసిన అస్త్రశస్త్రములను, ప్రయోగోప సంహారాలను రేవు అమావాస్య నాడు ఈ డాకిని నీకుపదేశిస్తుంది” అంటుండగానే హిరణ్మయి మెలకువ వచ్చి లేచి నమస్కరించి భర్త పక్కననిలుచున్నది. "అమ్మా! నీవు యోగినివి. నాగజాతికి విజయశ్రీని తెచ్చి పెట్టటానికి ఎంపిక చేయబడినదానివి. ఈ విజయానంతరం కొన్నాళ్ళు సుఖంగా ఉంటారు. కవిగా ఇతడు శాశ్వతంగా కావ్యాలు సృష్టిస్తాడు. "అని పలికి భైరవుడు ఎదురుగా ఉన్న విగ్రహంలోకి లీనమైనాడు. డాకిని మరునాడు భైరవాజ్ఞను నెరవేర్చింది.*
*(డాకిని గూర్చి గణపతిముని చేసిన వర్ణన -*
*శ్లో॥ చండచండి ! తవయుద్ధ వయస్యా యోగి వేద్య నిజవీర్య రహస్యా చేతసశ్చభుజయోశ్చ సమగ్రం దాకినీ దిశతుమేబలముగ్రం*
*హిమాలయాలలో డాకినులు కనిపించకుండా సంగీతం వినిపిస్తుంటారు. పాశ్చాత్యులెందరో పరిశోధనకు వచ్చి ఈ గానం విన్నామని తమ గ్రంథాలలో వ్రాశారు. వీరిని అద్భుత సౌందర్యంతో విరాజిల్లే వీరవనితులుగా యోగులు వర్ణించారు. ఈమె తోటి సఖివర్ణిని విద్యాదేవతగా ఛిన్నమస్తా తంత్రంలో చెప్పబడింది.*
*చం|| హిమగిరిలో త్రివిష్టపము హేరుక నాథుడు నాట్యమాడుచున్ డమరుక నాదముల్ సలుపు డాకినులద్భుత గానమోహినుల్*
*భ్రమలను ముంచు చుందురట పాంథులవారి నుతించి కొల్చితిన్ కొమరుగ వజ్రభైరవుని కోరి భజించితి క్రోధకాళికన్*
*హిమాలయములు ఋషులకే కాదు. అనేక రహస్య విద్యలకు నిలయము. శాంబర విద్యాకేంద్రములెన్నో అక్కడ ఉన్నవి. సర్పవృశ్చిక సింహ వ్యాఘ్ర వరాహాది వశీకరణములు, వివిధ జంతురూప ధారణములు మొదలైన విద్యలు నేర్చిన వారెందరో ఉన్నారు.)*
*“సిద్ధభైరవా! మహాప్రభువు ఆజ్ఞననుసరించి మీ దంపతులను సపరివారంగా ప్రాగ్జ్యోతిషం చేరుస్తాను. నేనింతటితో నిన్ను విడిచి పెట్టను. నీవింకా నేర్వవలసిన సిద్ధవిద్యలు చాలా ఉన్నవి.ప్రస్తుత కర్తవ్యం పూర్తి అయిన తరువాత నీ దగ్గరకు వస్తాను” అని డాకిని చెప్పి వారిని తన దివ్యశక్తితో కామాఖ్య కాళి ఆలయం దగ్గరకు చేర్చి అదృశ్యమైంది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 41 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 5వ శతాబ్దం నుండి 🏵*
*హరసిద్ధుడు భార్యను తీసుకొని తల్లిదండ్రుల యింటికి వెళ్ళాడు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. భైరవుని గూర్చి తపస్సు చేసి వరములు పొందిన అంశము వరకు మర్యాదా యుతంగా చెప్పాడు. వార్త అందుకొని రాజపరివారం - మంత్రి పురోహితులు వచ్చారు. ఇప్పుడిక దాపరికం లేదు. వైభవోపేతంగా రాజధానికి తీసుకు వెళ్ళారు. పెద్ద ఊరేగింపు. రాజలాంఛనాలు. స్వాగత సత్కారాలు. ఈ విషయమంతా వార్తాహరుల ద్వారా రాక్షసరాజుకు తెలిసింది. నాగరాజు తమ కుమార్తెను ఎవరో బ్రాహ్మణునకు ఇచ్చి పెండ్లి చేశాడన్న వార్త వాళ్ళు భరించలేకపోయినారు. తీవ్రమైన అవమానంగా భావించి, సైన్యమును సిద్ధంచేసి నాగభూమి మీదకు దండయాత్ర చేశారు. ఈ విషయం ముందే ఊహించిన ఐరావతుడు సరిహద్దులలో తమ సైన్యములను మోహరించి ఉంచాడు.*
*యుద్ధభేరి మ్రోగింది. రాక్షస సైన్యాలకు, నాగసైన్యాలకు మధ్య తీవ్ర సంగ్రామం మొదలైంది. పగలంతా సరిసమానంగా రణం మారణం జరిగినవి. అయితే ఆ రోజు రాత్రి రాక్షసులు నిశాచరులని నిరూపించుకొన్నారు. మాయా యుద్ధం చేశారు. నాగసైన్యాలమీద పాషాణవర్షం కురిసింది. పిడుగులు పడినవి. మాంసం ముద్దలు, రక్తవర్షం, నిప్పులు రణరంగం బీభత్స భయానక దృశ్యాలతో నిండిపోయింది. నాగసైన్యానికి చాలా నష్టం జరిగింది. అల్లుని దగ్గరకు ఐరావతుడు బయలుదేరాడు. మంత్రి సేనాపతులు వెంట వచ్చారు. సిద్ధభైరవుడు విషయం విని వీరవేషంతో సిద్ధంగా ఉన్నాడు. హిరణ్మయి వచ్చి వీరతిలకం దిద్దింది.*
*రతిరాజసుందరా ! రణరంగధీర కమల బాంధవతేజ ! కరుణాలవాల సూర్యుని సమముగా శోభిల్లగలవు కృష్ణుని సమముగా కీర్తి పెంపొందు కామాఖ్య కాళిక - కాలభైరవుడు వరముల నీయగా వర్ధిల్లగలవు.*
*జయవీరనాగేంద్ర శౌర్యకాసార ! జయవైరి దుస్తంత్ర చయచూరకార! జయసిద్ధఖైరవా ! జయమహావీర! జయనాగకులరక్ష! జయధర్మదీక్ష!*
*ప్రధాన సైన్యంతో ఐరావత చక్రవర్తి కూడా స్వయంగా బయలుదేరాడు. వాయువేగంతో యుద్ధభూమికి చేరుకొన్నారు. సార్వభౌముని రాకతో సైన్యం ఉత్సాహంతో ముందుకు దూకింది. నాగసేన అగ్రభాగానికి సిద్ధభైరవుడు చేరుకొన్నాడు. అతని కోసం సిద్ధమైయున్న రథంలో విల్లంబులు వందల కొద్ది కత్తులు, శూలములు వాటిని అందించే భటులు - రథమెక్కి ఉన్న సిద్ధభైరవుని చేతి నుండి శూలములు కత్తులు మహావేగంతో వెళ్ళి రాక్షసభటులను సంహరిస్తున్నవి. అంతటితో ఆగక రథం నుండి క్రిందకు దూకి ఖడ్గంతో శత్రువధ చేస్తున్నాడు. అతని ఖడ్గచాలన నైపుణ్యం ముందు ఎవరూ నిలువలేక పోతున్నారు. వేలమంది రాక్షసులు హతులైనారు. ఆ ఉద్ధతికి దైత్యులు భయపడి వెనక్కు తగ్గారు.*
*యుద్ధరంగం వెనుక ఒక యజ్ఞశాల ఉంది. అక్కడ రాక్షస మాంత్రికులు రక్తమాంసములతో హోమం చేస్తున్నారు. వారు ప్రయోగించిన మాయాశక్తి వల్ల రణరంగమంతా చీకట్లు కమ్ముకున్నది. పిశాచములు బయలుదేరి నాగసైనికులను కొరికి తింటున్నవి. సిద్ధవీరుడు వెంటనే ఒక మండే కాగడా తీసుకొని అగ్నిమంత్రంతో అభిమంత్రించి చీకటిలో విసిరాడు. మహాగ్ని బయలుదేరి చీకట్లను చీల్చి రాక్షస సైన్యాన్ని తగులబెట్టటం మొదలుపెట్టింది. మాంత్రికులు శాంబరీమంత్రంతో వర్షం కురిపించి తమ సైన్యాన్ని రక్షించుకొన్నారు. ఇలా అస్త్ర ప్రత్యస్త్రములతో పోరు జరిగింది. ఈ బ్రాహ్మణ్ణి ఏమీ చేయలేమని తెలుసుకొన్నారు. తమ స్తంభన విద్యలు పని చేయటం లేదు. ప్రయోగాలు శక్తిహీనములైనవి. చివరకు అందరూ కలిసి అగ్నికుండములో మహాకృత్యను ఆవాహనం చేశారు.*
*ఖట్ఫట్ జహి మహాకృత్యే ! విధూమాగ్ని సమప్రభే హన శత్రూన్ త్రిశూలేన క్రుద్ధాస్యే పిఐశోణితం*
*ఉగ్రకృత్య మాంత్రిక ప్రేరణతో సిద్ధ భైరవుని మీదకు వస్తున్నది. డాకిని యిచ్చిన ప్రత్యంగిరావిద్య స్ఫురించినది.*
*యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రహ్మాణాపనిర్ణుద్మః ప్రత్యక్కర్తారమృచ్ఛతు*
*అని చేతికలంకరింపబడిన సింహకంకణం తీసి కృత్య మీదకు విసిరాడు అది సింహముఖంతో వెళ్ళి కృత్యను మింగివేసి ప్రయోగించిన ప్రధాన మాంత్రికుని శిరస్సును కొరికివేసింది. మిగతా మాంత్రికులు భయభ్రాంతులైనారు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 42 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామిజీ విరచిత 💐*
*🏵 5వ శతాబ్దం నుండి 🏵*
*రాక్షసరాజు స్వయంగా అక్కడకు వచ్చి చివరికి కాళీ ప్రయోగం చేయవలసినదిగా ఆజ్ఞాపించాడు. దూరంగా గుడారంలో ఉన్న ఒక బలిష్ఠ కన్యను తీసుకు వచ్చారు. ఆమెలోకి మహాకాళిని ఆవాహనం చేశారు. అలవాటైన ప్రవేశం. నరబలుల చేత రక్తమాంస నివేదనల చేత వరములిచ్చి రక్షిస్తున్న ఆ భయంకర దేవత ఆ కన్యలోకి ప్రవేశించింది. ఒక పెద్ద దున్నపోతును తెచ్చి ఆమె ముందు బలి యిచ్చారు. మహాకాళీ! శత్రుసంహారిణీ! నీ అప్రతిహతశక్తితో నాగసైన్యాధిపతి హరసిద్ధుని సంహరించు. మాకు విజయాన్ని ప్రసాదించు - అని మాంత్రికులు, అసుర చక్రవర్తి ప్రార్ధించారు. ఆమె ప్రక్కన రాక్షసగణము యిస్తున్న అరుణవర్ణ మద్యాన్ని తాగింది. ఎర్రని కన్నులతో భీషణంగా అట్టహాసం చేస్తూ ముందుకు దూకింది.*
*ఆ కాళీదేవి నోటి నుండి మంటలు వస్తున్నవి. విరబోసిన జుట్టు నుండి పొగలు లేస్తున్నవి. ఆమె చేతులలో నుండి ఖడ్గములు, శూలములు, ఛురికలు, గదలు, పరిఘలు బయలుదేరి ఆకాశమార్గములో వచ్చి నాగసైనికులను నాశనం చేస్తున్నవి. ఆ భయంకర స్వరూపాన్ని చూచి అందరూ నిశ్చేష్టులైనారు. ఆ దేవి దిగంబర. హతమానవుల హస్తములు ఆమె నడుముచుట్టూ ఒడ్డాణముగా వేలాడుతున్నవి. శరీరమంతా చితాభస్మము. కాలుతున్న శవముల వాసన వాయుమండలమంతటా వ్యాపిస్తున్నది. కదలుతున్న కాంతిమండలం వలె ఆ రాక్షస కన్య ముందుకు వచ్చింది. అందరూ ప్రక్కకు తప్పుకున్నారు. కాళీకన్య క్రోధ భీషణంగా చూస్తూ హరసిద్ధుని మీదకు విసరటానికి శూలమెత్తింది. ఎదురు చూస్తున్న సంఘటనే కనుక అతడు చలించలేదు. అతని దగ్గర సిద్ధం చేసుకొన్న ప్రత్యేకాయుధం ఉన్నది. దాచి ఉంచిన ఒక పెద్ద పుష్పమాల తీశాడు. భోజార్ నాధుని మెడలో మాల అది. ఆ పూలు సంవత్సరం పాటు వాడవు. కంచిలోని కామాక్షీదేవికి అటువంటి పుష్పమాల వేస్తారు.*
*“ఏదేవి తురుముపై ఏడుకాలము దాక కసు గందకుండు చెంగలువదండ" - శ్రీనాథుడు.*
*ఆ మాల ఎత్తి రెండు చేతులతో పట్టుకొన్నాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. అతడు పట్టుకొన్న మాలను, అతని చేతి వ్రేలికున్న భైరవ వజ్రాంగుళీయకాన్ని కాళీకన్య చూచింది. ఆ వజ్రకాంతులు ఆమె కన్నులకు మిరుమిట్లు కొలిపినవి. హరసిద్ధుడు భైరవ మంత్రాన్ని స్మరించి మాల విసిరేశాడు. అది గాలిలో ప్రయాణం చేసి సరాసరి ఆమె మెడలో పడింది. ఆ మాల తగలగానే ఆ వజ్రకాంతి కనులలో ప్రవేశించగానే ఆమె చేతిలోని శూలం క్రింద పడిపోయింది. వీక్షణములలోని తీవ్రత అదృశ్యమైంది.*
*స్వామీ! భైరవప్రభూ! మీరా ! మీరు వచ్చారా! అంటూ నమస్కరించి క్రింద పడిపోయింది. స్పృహ కోల్పోయింది. ఆమెను అవతలకు మోసుకెళ్ళారు. రాక్షసరాజు, మాంత్రికులు దిగ్భ్రాంతులైనారు. ఈ బ్రాహ్మణుడు ఇంత భైరవానుగ్రహం ఎలా సాధించాడు? దేని మీద ఆశ పెట్టుకొన్నారో ఆ కాళీ ప్రయోగం వ్యర్థమయింది. నరబలులు రక్తహోమాలు కాళి యిచ్చిన శక్తులు అన్నీ విఫలమైనవి. రాజాజ్ఞ మీద రాక్షససైన్యం వెనక్కి తగ్గింది. హరసిద్ధుడు కూడా యుద్ధం ఆపమన్నాడు.*
*దానవేశ్వరుని ఆజ్ఞతో రాక్షస ప్రముఖులు తెల్ల జెండాలు పట్టుకొని, వేద పండితులు, శ్రుతి విభాగాలను ఉచ్ఛైస్వరంతో పఠిస్తుండగా రాయబారం వచ్చారు. ఐరావత చక్రవర్తి రణరంగంలోనే కొలువుదీరాడు. ఆయన సింహాసనం ప్రక్కనే హరసిద్ధునకు ఉన్నతాసనము వేయబడింది. రాక్షస మంత్రి వచ్చి మహారాజుకు నమస్కరించి తమ పరాజయాన్ని అంగీకరిస్తూ సంధి ప్రతిపాదన చేశాడు. రెండు జాతుల మధ్య సామరస్యం ఏర్పడటం మంచిదన్న హరసిద్ధుని సూచనను కాదనలేక నాగసార్వభౌముడు అంగీకరించాడు. నాగులకు ఎక్కువ అనుకూలమైన షరతులతోనే సంధి జరిగింది.*
*( సశేషం )*
*🌹 సిద్దేశ్వరయానం - 43 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 5వ శతాబ్దం నుండి 🏵*
*హిరణ్మయీ సిద్ధభైరవుల సంసారం సుఖంగా సాగుతున్నది. కొన్నాళ్ళకు రాజపుత్రిక గర్భవతి అయింది. తొమ్మిది నెలల కాలంలో ఆమె కోరికల నన్నింటినీ తీరుస్తూ ఆమె సంతోషంగా ఉండేలా చేశాడు హరసిద్ధుడు. నెలలు నిండిన పిదప హిరణ్మయి మగపిల్లవాణ్ణి కన్నది. కన్నతండ్రి పేరు వచ్చే విధంగా ఆ శిశువునకు శివదేవుడని పేరుపెట్టాడు హరదత్తుడు. సార్వభౌమునకు మగబిడ్డలు లేకపోవటం వల్ల దౌహిత్రుడే భవిష్యచ్చక్రవర్తి కాగలడని ప్రకటించారు. పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు.*
*ఒకరోజు దక్షిణాపథం నుండి నాగప్రముఖులు కొందరు వచ్చి చక్రవర్తి దర్శనం చేసుకొన్నారు. “ప్రభూ! దక్షిణ భారతంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో మనజాతి బాగా వ్యాపించి ఉన్నది. అయితే అక్కడి ఆంధ్రులతో మనకు ఎక్కువ సంఘర్షణలు జరుగుతున్నవి. మన జాతి ఆధిపత్యం పెంపొందటానికి గాను, ధన, సైన్య సహాయం అర్ధించటానికి వచ్చాము" అని వేడుకొన్నారు. “ఆలోచించి ఏం చేయాలో చేస్తాము తగిన విధంగా తోడ్పడతాము" అని మంత్రి వారిని విడిదికి పంపి "మహారాజా! ఇది మనకు సున్నితమైన సమస్య. తమ అల్లుడుగారు ఆంధ్రుడు. మనం ఆంధ్రులతో యుద్ధం చేయటానికి సహాయంగా సైన్యాలను పంపటం ఉచితంగాదు. అలా అని మన వాళ్ళను తిరస్కరించటమూ న్యాయం కాదు. హరసిద్ధుల వారిని అక్కడకు పంపితే వారీ సమస్యను పరిష్కరించగలరని నా నమ్మకం" అన్నాడు.*
*మహారాజు అంగీకరించి హరసిద్ధుని మరొకసారి జాతివైరాన్ని రూపుమాపి శాంతిని నెలకొల్పవలసిందిగా కోరాడు. హరసిద్ధుడు సంతోషంగా ఒప్పుకొన్నాడు. ఆ రోజు భార్యతో "హిరణ్మయీ! మీ నాయనగారు నన్ను దక్షిణ భారతానికి ఆంధ్ర నాగ ఘర్షణలు ఆపటానికి పంపిస్తున్న సంగతి వినే వుంటావు. మానవీయ ధర్మపరిరక్షణకు ఇటువంటివి తప్పవు. అటువైపు వెళ్ళిన తర్వాత తిరిగి రావటానికి ఎంత కాలంపడుతుందో చూడాలి. శివదేవుని జాగ్రత్తగా చూచుకుంటూ ఉండు. భైరవ మంత్రం జపిస్తూ రోజూ స్వామిని పూజిస్తూ ఉండు అన్నీ సక్రమంగా జరగగలవని విశ్వసిస్తున్నాను” అని బాధపడుతున్న ఆమెను ఓదార్చాడు. "ప్రభూ! ఈ యుద్ధాలు, రాజకీయాలు మనకెందుకు? ప్రశాంతంగా వీటన్నింటికీ దూరంగా ఉందాము. నేను మిమ్ము విడిచి పెట్టి ఉండలేను. ఎక్కడికైనా దివ్యక్షేత్రానికి వెళ్ళిపోదాము" అన్నది హిరణ్మయి. ఆమె కంటి కన్నీరు తుడిచి "దేవీ! నీవు కోరిందే నాకు ఇష్టము. మనం అలానే ఉండే రోజులు త్వరలోనే వస్తవని అనిపిస్తున్నది. కాని ప్రస్తుతం మీ నాయనగారి కోరిక కాదనకూడదు. అంతేకాదు. అధర్మం ధర్మంతో యుద్ధం చేయలేక అలసిపోతున్నప్పుడు శక్తిగలవాడు ఉపేక్షించరాదు. వ్యాసులవారు భారతంలో ఇలా చెప్పారు.*
*ఉ || సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులె వ్వారలుపేక్ష చేసి రది వారల చేటగు గాని ధర్మని స్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండెడిన్*
*మహాభైరవుడు నా కొకశక్తి నిచ్చాడు. దానితో దేవకార్యం చేయటము నా బాధ్యత. ధర్మరక్షణ, శాంతి, అహింస, సమాన ధ్యేయాలు. తప్పక పోతే కృష్ణభగవానుడు చెప్పిన, చూపిన మార్గం. ధర్మస్థాపన కోసం యుద్ధం. నా వరకు నాకు ఇంక కత్తి పట్టుకుందామని లేదు. కానీ ఈశ్వరేచ్ఛ ఎలా ఉందో! ఆ విషయమునటుంచి మనసులోని మాట మరొకటి చెప్పాలి. భైరవుడు అనుగ్రహించాడు. శక్తి శౌర్యాలిచ్చాడు. ప్రేమ, యుద్ధం సంసారం, సంతానం. అన్నింటిలోను విజయం లభించింది. కానీ నేనెవరు ? ఎక్కడ నుండి వచ్చాను? ఎక్కడకు వెళుతున్నాను ? నీ వెవరు ? మన అనుబంధం ఎప్పటిది? భవిష్యత్తు ఏమిటి? - ఆ దివ్యజ్ఞానం పూర్ణంగా లభించలేదు. సిద్ధగురువులు కొంత కొంత చెపుతున్నారు. నాకు అసంతృప్తిగా ఉంది. ఏమి చేయాలి? ఎలా?” హిరణ్మయి “ప్రభూ! మీ ఆవేదన నాకు అర్థమవుతున్నది. తల్లిదండ్రులు - భర్త - బిడ్డ అన్న మమకారంలో ఉన్న ప్రేమజీవిని నేను. మీరు కారణజన్ములు. కోరింది తప్పక సాధిస్తారు. ప్రస్తుత కర్తవ్యం నిర్వర్తించండి.! క్షేమంగా వెళ్ళి లాభంగా రండి” అన్నది.*
*హరసిద్ధుడు బయలుదేరాడు. అనుకొన్న ప్రణాళిక ప్రకారం మహామంత్రి దక్షిణభారతం నుండి వచ్చిన నాగరాయబారులకు "మేము మా మహాసేనాని హరసిద్ధుడు కొద్ది పరివారంతో వచ్చి అక్కడి అవసరాలను అంచనా వేస్తాము. పరిస్థితిని బట్టి ఎంత సైన్యమైనా వస్తుంది. మీరు భయపడవలసిన పనిలేదు. మీరు ముందు వెళ్ళి ఉండండి" అని చెప్పి కావలసినంత ధనమిచ్చి పంపివేశారు. వాళ్ళు వెళ్ళి తమ ప్రభువుతో తాము సేకరించిన సమాచారాన్ని - ఆంధ్ర బ్రాహ్మణుడైన హరసిద్ధుడు నాగచక్రవర్తి అల్లుడైన సంగతి అతని అద్భుత పరాక్రమము, మహిమలు వర్ణించి చెప్పారు. నాగప్రభువు చక్రవర్తి పంపే వారి కోసం ఎదురు చూస్తున్నాడు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 44 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 5వ శతాబ్దం నుండి 🏵*
*హరసిద్ధుడు ఒక పూట ముందు బయలుదేరి ఇంటికి వెళ్ళి పెంపుడు తల్లిదండ్రులతో గడిపి రాత్రి కామాఖ్య కాళీమందిరంలో రాజవసతి స్థలంలో ఉన్నాడు. మొదటి జాము గడచి అర్ధరాత్రి అవుతున్న సమయంలో గదిలో ఏకాంతంగా ఉన్న ప్రశాంతవేళ మధురగానం దూరం నుంచి వినిపిస్తున్నది. నెమ్మదిగా దగ్గరవుతున్నది. ఎవరో తనను పిలుస్తున్నారు.ఆ నాదం మూసిన తలుపులలో నుండి కాంతి తరంగాల రూపంలో లోపలికి వచ్చింది. చూస్తుండగా సుందరమైన ఆకృతి ధరించింది. తనకు అస్త్రవిద్యలు నేర్పిన డాకిని, "మహాయోగినీ! దివ్యవిద్యాధరీ! స్వాగతం" అని లేచి హరసిద్ధుడు ఆహ్వానించాడు. ఆమె “హరా! నిన్ను చూచి సంతోషంగా ఉంది. కార్యార్థివై ఆంధ్రభూమికి వెళుతున్నావు. విజయం సాధించటానికి ప్రయత్నించు" అన్నది. అతడు "దేవీ! నీవు గాన గాంధర్వివి. నా యందు దయ, ప్రేమ కలదానివి. నేను దక్షిణ భారతానికి వెళ్ళి మరొక యుద్ధం, మారణకాండ జరగకుండా శాంతి నెలకొల్పాలని కోరుతున్నాను. నాకు యుద్ధవిద్యలలో ఉన్న నైపుణ్యం మంత్ర విద్యలలో లేదు. నీవు దివ్యాంగనవు. నా కోసం ఈ పని చేసి పెట్టు. నేను పుట్టిన తెలుగు నేలకు ఋణం తీర్చుకొంటాను” అన్నాడు.*
*డాకిని "వీరాగ్రణీ! నీకు తప్పక చేస్తాను సహాయం. నాకు కూడా నీ వల్ల మేలు జరిగింది. నీకు అస్త్రవిద్యలలో నైపుణ్యం కలిగించినందుకు సంతోషించి భైరవస్వామి నాకు గంధర్వత్వం ప్రసాదించాడు. నేనిప్పుడు భూత భూమికలు దాటి గాంధర్విగా ప్రకాశిస్తున్నాను. నీకు దివ్యశక్తులు వచ్చేలా చేస్తాను. ప్రస్తుతం నీకు స్వప్నమోహినీ విద్యనుపదేశిస్తాను. దానిని ఆంధ్ర నాగనాయకుల మీద ప్రయోగించు. వారి యిష్టదేవతల రూపంలో ఈ స్వప్న దేవత కనపడి యుద్ధం వద్దని శాంతిసంధి చేసుకోమని ఆదేశిస్తుంది. ప్రస్తుతానికి నీ కోరిక నెరవేరుతుంది. మీ మామగారి మనుషులతో అక్కడికి వెళ్ళి ఈ పని సానుకూలమైన తర్వాత వాళ్ళను వెనక్కు పంపించు. అప్పుడు నేను వచ్చి అనంతర కర్తవ్యం చెపుతాను ” అన్నది.*
*అనుకొన్న విధంగా ఆంధ్రసీమలో శాంతి నెలకొన్నది. గాంధర్వి వచ్చి హరసిద్ధుని కుర్తాళం తీసుకువెళ్ళింది. కుర్తాళనాథేశ్వరుని దర్శనం చేసుకొన్న తర్వాత పొదిగైజలపాతాల దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఆమె ఒక సంఘటన తెలియజేసింది. “నీకు వజ్రయాన సాధనలు నేర్పిన బోయాంగ్ కొద్ది కాలం క్రింద ఇద్దరు శిష్యులను, ఒక శునకాన్ని తీసుకొని వచ్చి గురుస్థానమైన కుర్తాళం వచ్చాడు. పొదిగై కొండల మీద దిగి వారితో మృత్యువును జయించగలిగిన ఓషధిఘుటికలను నేను తయారు చేశాను. వాటిని మీకు ఇస్తాను. నేనూ వేసుకొంటాను. నాకెంతో సేవ చేసిన మీకు ఈ మేలు చేస్తున్నాను. అని ఒక మాత్ర కుక్కనోట్లో వేసి, తానొకటి మింగి ఇద్దరు శిష్యులకూ చెరొక మాత్ర యిచ్చాడు. ఒక శిష్యుడు మింగాడు. రెండోవాడు ఇంకా మింగలేదు. ఈ లోపు కుక్క స్పృహతప్పి పడిపోయింది. బోయాంగ్, మొదటి శిష్యుడు కూడా పడిపోయినారు. ఎవరిలోను ప్రాణమున్న లక్షణాలు లేవు. అయ్యో! ఎంత పని జరిగింది! గురువుగారు ఓషధి తయారు చేయటంలో ఏదో పొరపాటు పడినారు. అందరూ మరణించారు. నేను దీనిని మింగను అని ఆ మాత్రను పొదలలోకి విసిరివేసి ఏడుస్తూ క్రిందికి వెళ్ళి ఊళ్ళో వాళ్ళను తీసుకొని మరణించిన వాళ్ళకు అంత్యక్రియలు చేయటం కోసం తిరిగి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు. ఒక పెద్ద శిల మీద కొన్ని అక్షరాలు వ్రాయబడి ఉన్నవి. "నీవు మాత్ర వేసుకోలేదు. దురదృష్టవంతుడవు. మాకు విద్యున్మయమైన దివ్యదేహాలు వచ్చినవి. ఆకాశమార్గంలో వెళుతున్నాము" అని. రెండవ శిష్యుడు గ్రామస్థులు ఆ మాత్ర కోసం వెదికారు. దొరకలేదు. బాధపడుతూ వెళ్ళారు.*
*ఆ మాత్ర నీకు దొరుకుతుంది. అది ఇంకా చెడిపోలేదు. పద". ఆమె దివ్యజ్ఞానం వల్ల అది దొరికింది. ఆ మాత్రను అతని చేత మింగించింది. చూస్తూ ఉండగా అతని శరీరంలో అద్భుతమైన పరిణామం వచ్చింది. దాదాపు స్పృహ పోయింది. కాని గంధర్వ డాకిని ప్రక్కన ఉండి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వేగంగానే అతనికి విద్యున్మయమైన శరీరం వచ్చింది. ఆకాశ గమనశక్తి వచ్చింది. "గాంధర్వీ! నీ ఋణం ఎలా తీర్చుకో గలను ? నన్ను సామాన్య మానవుని దివ్యునిగా మార్చావు" అన్నాడతడు. ఆమె "నీ కోసం నేను ఏమైనా చేస్తాను. ఇంకా చేయవలసింది ఉంది. మనం హిమాలయాలలో త్రివిష్టప భూములలోని వజ్రభైరవ గుహదగ్గరకు వెళ్ళాలి. అక్కడ నీవు మరికొన్ని సాధనలు చేయవలసి ఉంది. ఇంతకు ముందు నీవు చూచిన గుహయే అది” అన్నది. అక్కడకు చేరుకొన్న పిదప బహువిధములైన సాధనలు అతనిచేత చేయించింది. అతనికిప్పుడు ఎన్నో దివ్యశక్తులు వచ్చినవి.*
*"హరసిద్ధా! నీవిప్పుడు పరిపూర్ణ సిద్ధభైరవుడవు. నేను గంధర్వ లోకానికి వెళుతున్నాను. నీవు స్మరించినప్పుడు వస్తాను. నాయంతట నేను కూడా అప్పుడప్పుడు వస్తాను. భవిష్యత్తులో సాధకు లెందరికో నీవు సహాయపడవలసి ఉంది. కలియుగప్రభావం వల్ల మంత్రసిద్ధి ఎంత కష్టపడినారాదు. యోగ్యులను అనుగ్రహించు. భవిష్యత్తులో నేను కూడా మానవ జన్మ తీసుకోవలసి రావచ్చు. అప్పుడు నీవు నాకు సహాయ పడవలసి వస్తుంది. ప్రస్తుతం నీవు నాగభూమి కొకసారి వెళ్ళు. హిరణ్మయి నీ కోసం ఎదురు చూస్తున్నది.*
*ప్రతిజీవికి ప్రేమకేంద్రములు మారుతుంటవి. చిన్నప్పుడు తల్లిప్రేమకేంద్రం. శిశువు అమ్మను విడచి ఉండలేదు. పెరుగుతుంటే స్నేహితులు ప్రేమ కేంద్రాలు. తరువాత ప్రియుడు లేక ప్రియురాలు. అనంతరం సంతానం. ఇప్పుడు నీ భార్యకు కుమారుడు ప్రేమ కేంద్రం. అయినా ఆమె నీయందు అనన్యప్రేమ సమన్విత. అప్పుడప్పుడు అక్కడ కొన్నాళ్ళు ఉంటూ దేశసంచారం చేస్తూ దైవ సామ్రాజ్యాన్ని నిర్మించటానికి నిరంతరం కృషి చేస్తూ ఉండు. మరొక్క మాట. కొంతకాలం తర్వాత అమితాభ బుద్ధుని అంశతో పద్మసంభవుడనే యోగిపుట్టి వజ్రవైరోచనిని ఉపాసిస్తాడు. ఆమె సఖిని నేను. అతనిలో కొంతకాలం ఉండు. నీ ప్రవేశం వల్ల అతడు అద్భుతశక్తులు ప్రదర్శిస్తాడు. అది పరిమితసమయం మాత్రం. నీవు నీ మార్గంలో ప్రపంచాన్ని ప్రభావితం చెయ్యి, సిద్ధాశ్రమ యోగులతో మైత్రి నీకు మేలు చేస్తుంది. అక్కడ మహనీయులు నీకు మార్గదర్శకులుగా ఉంటారు. భారతదేశంలోనే కాక వివిధ ద్వీపాలలో సిద్ధాశ్రమ కేంద్రాలున్నవి. అక్కడకు వెళ్ళి సిద్ధ సమావేశాలలో పాల్గొనవలసిన అవసరమున్నది. ముఖ్యంగా క్రౌంచద్వీపం భవిష్యత్తులో పెద్ద శక్తికేంద్రం కాబోతున్నది. అక్కడి సిద్ధ కేంద్రాలమీద ప్రత్యేక దృష్టి ఉంచు. నేను ఆత్మీయురాలిగా ఏదో చెపుతున్నాను. అన్నీ నీవింక స్వతంత్రంగా నిర్ణయించగలవు. నిర్వహించగలవు. విజయోస్తు!"*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 45 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శ్రీశైలము: 1257 సం||– 🏵*
*మల్లికార్జున స్వామికి ఒక భక్తుడు ఇలా విన్నవించుకొంటున్నాడు ఏదో ప్రార్థిస్తున్నాడు... కొన్ని నిమిషాలు మామూలు మాటలు - తరువాత అతనిలో నుండి కవిత ప్రవహించటం మొదలు పెట్టింది.*
*ఓ శ్రీపర్వతమల్లికార్జున శివా! యోగీంద్ర చింతామణీ! నీ శ్రుత్యగ్రనటత్ పదాబ్జములు ధ్యానింతున్ మహాదేవ! ఈ నా శ్రుత్యగ్రము లందు దివ్యకవితానాదంబులన్ దగ్ధకం తు శ్రీలన్ వినిపింపు నీకు నొనరింతున్ లేఖకోద్యోగమున్*
*స్వామీ! శ్రీ గిరిమల్లన్నా! శరణుశరణు! దేవా! నీ పాదములను ధ్యానిస్తున్నాను. దివ్యమైన కవితను నాకు వినిపించు నేను వ్రాయసగాడినై దానిని వ్రాసుకొంటాను.*
*చితులు సమాధులున్ శిథిల చిత్రములైన విచిత్రసీమలో కుతుకముతోడ పాడెదవు గొంతుక యెత్తి మహాభయంకరా కృతులు కృతుల్ జగన్మరణ గీతికలద్భుత మృత్యుదేవతా యతనములోని పిల్పులుశివా! యిది యెక్కడి నీకునైజమో!*
*మహేశ్వరా ! యిది యేమి ప్రభూ! నీ కంఠంలో నుండి భీషణమైన మృత్యు గీతాలు వినిపిస్తున్నవి. ఏదో ప్రమాద సూచన వలె ఉంది. ఏమి కాబోతున్నదో అర్థం కావటం లేదు.*
*కారు మొయిళ్ళ చీకటులు గ్రమ్మిన వేళల అర్థరాత్రులం దారని మంటలంతరము నందు జ్వలింప గుహాత్రికోణ కుం దారుణ వహ్ని మధ్యను భయంకర హోమము చేయు యోగులన్ వీరతపస్వులన్ దలతు భీషణ భైరవ మార్గగాములన్ !*
*నాకంటి ముందు కారుమబ్బులు కమ్ముకొంటున్నవి. ఈ పర్వతములోని ఒక రహస్య గుహలో భైరవ యోగులు భీషణ హోమాలు చేస్తున్నారు. ఆ పొగలు అగ్నికుండంలో లేచి సుడులు తిరుగుతూ ఆకాశమంతా వినీలమేఘావృతమై నటులున్నది. ఉరుములు దారుణ ధ్వనులు చేస్తున్నవి. ఆ ఘోర శబ్దాలకు ధ్యాన భంగమైంది. తీరా చూస్తే ప్రకృతి కూడా అలానే ఉంది. అంధకారమలముకొని పెనుగాలులువీస్తున్నవి. ప్రజలంతా ఇండ్లకు పరుగెత్తుతున్నారు. సమయం అయిపోవటంతో ఆలయం మూసివేశారు. ఈ యువకుడు తనతో వచ్చిన మిత్రులకోసం చూచాడు, ఎవరూ కనపడలేదు. ఈ హడావిడిలో ఎవరిదోవ వారిదే అయింది. తాము దిగిన వసతి కొంచెందూరం. నడుస్తున్నాడు. కొంత నడిచే సరికి తుఫానుగాలి- మహా భయంకర వర్షం దోవ కనపడటం లేదు. చీకటిలో ఎటుపోతున్నాడో తెలియడం లేదు. ఆ మహా వేగానికి గాలి విసురుకు పడిపోయినాడు. ఎటో తేలిపోతున్నట్లున్నది. నీళ్ళలో తేలిపోతున్నాడు. కాసేపటికి స్పృహ పోయింది.*
*కనులు తెరిచేసరికి ఎక్కడ తానున్నాడో తెలియటం లేదు. లేవలేకపోతున్నాడు. అది ఒక కొండ గుహవలె ఉంది. పగటి వెలుతురు కొంచెం తెలుస్తున్నది. ఇంతలో ఎవరో మధ్యవయస్కుడు పక్కన కూర్చుని తన శిరస్సుమీద చేయివేసి నిమురుతున్నాడు. ఏదోశక్తి ప్రసరిస్తున్నట్లున్నది.*
*ప్రశ్న: "అయ్యా! ఎవరు మీరు? నే నెక్కడ ఉన్నాను?”*
*జవాబు: “ఇది కొండ గుహ. ఇక్కడ పడిఉన్నావు.”*
*ప్రశ్న: “ఇక్కడకు ఎలావచ్చాను?"*
*జవాబు: "వరదలో కొట్టుకు పోయి వచ్చి ఇక్కడ పడ్డావు.”*
*ప్రశ్న: ఎంతసేపయింది?*
*జవాబు: చాలా రోజులయింది.*
*ప్రశ్న: అయితే నేను ఎలా బతికి ఉన్నాను?*
*జవాబు: ఈ గుహలోకి మృత్యువురాదు. ఆయువున్నది గనుక ఇక్కడకు కొట్టుకు వచ్చావు. వచ్చావు గనుక జీవించి ఉన్నావు.*
*ప్రశ్న: నాకేమీ అర్థం కావటం లేదు. మీరెవరు?*
*జ: నేనొక యోగిని. హిమాలయాలలో ఉంటాను. అప్పుడప్పుడు వచ్చి ఈ గుహలో ఉంటాను. భ్రమరాంబా మల్లికార్జునులను దర్శించుకొని కొంతకాలం ఇక్కడ తపస్సు చేసుకొంటూ గడుపుతాను. ఇది భైరవ గుహ. ఇక్కడ జపధ్యానములను చేసే వారిని వజ్ర భైరవుడు కాపాడి వారికి మంత్ర సిద్ధిని వేగంగా ప్రసాదిస్తుంటాడు.*
*యువకుడు: నాకు లేచి కదిలే శక్తిని అనుగ్రహించండి. ఊళ్ళోకి వెళ్ళి మా మిత్రులను వెదికి వారితో కలిసి మా గ్రామానికి వెళ్తాను.*
*యోగి: ఈ తుఫానులో కొన్ని వందలమంది మరణించారు. వారిలో మీ స్నేహితులుకూడా. దగ్గరలో ఉన్న మీ గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. ఎవరూ మిగల లేదు. అక్కడకు వెళ్ళి నీవు చేయగలిగిందేమీ లేదు.*
*యువకుడు: భయము, దుఃఖము తన్నుకు వస్తున్నవి. ఇవన్నీ నిజమా?*
*యోగి: కన్నులు మూసుకో. నీకే కనిపిస్తుంది.*
*యువకుడు కన్నులు మూసుకున్నాడు. యోగి చెప్పినట్లే తుఫానులో తమ ఊరు కొట్టుకు పోయింది. ఎవరూ బతికి బయటపడలేదు.*
*యువకుడు: (దుఃఖంతో) - ఇప్పుడు నాకెవ్వరూ లేరు. నే నెక్కడికి పోవాలి? ఏం చేయాలి? అంతా అయోమయంగా ఉంది.*
*యోగి: నీకు నేనున్నాను. బ్రహ్మపుత్రానది దగ్గర కామాఖ్యలో ఉన్న నేను ఈ విషయం తెలుసుకొని నీ కోసం వచ్చాను.*
*యువ: మీరెవ్వరు? నాకు మీకు ఏమిటి సంబంధం?*
*యోగి: మనమిద్దరం కొన్ని వందల యేండ్ల క్రింద మిత్రులము. సిద్ధ గురువుల సంకల్పం వల్ల ధర్మ చైతన్యాన్ని లోకంలో ప్రసరింప జేయటం కోసం నీవు శరీరాన్ని విడిచి జన్మ యెత్తవలసి వచ్చింది. ఎప్పటికప్పుడు నీకు గుర్తుచేసి నీ దివ్యశక్తులు నీకు వచ్చేలా చేయటం నా కర్తవ్యం. అందుకే వచ్చాను.*
*యువకుడు: ఇప్పుడు నన్నేమి చేయమంటారు?*
*యోగి: నేను నీకొక మంత్రం చెపుతాను. దానిని 40 రోజులు జపం చెయ్యి. ఈ గుహకు ఎదురుగా సరస్సున్నది, ఒడ్డున పండ్లచెట్లున్నవి. ఆకలియైనప్పుడు ఆ పండ్లుతిను. కొలనులో నీళ్ళుతాగు. గుహలోధ్యానం చెయ్యి. మండల దీక్ష పూర్తి అయినప్పుడు ఒక దేవత కనిపిస్తుంది. ఆ దేవత చెప్పినట్లు చెయ్యి.*
*యువకుడు: మీరిక్కడే ఉంటారు గదా!*
*యోగి: నేనిక్కడ ఉండను. మళ్ళీ అవసరమైనప్పుడు వస్తాను. ఏ ఆటంకాలు లేకుండా తపస్సిద్ధి కలిగేలా నేను చూస్తాను. సాధనకు కావలసిన శక్తి నీకు వస్తుంది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 46 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శ్రీశైలము: 1257 సం||– 🏵*
*యోగి కదిలి వెళ్ళాడు. యువకుడు బయటకు వచ్చాడు. సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు - అభిజిల్లగ్నం.*
*ఆ యువకుడు సరస్సు దగ్గరకు వెళ్ళి స్నానం చేసి గుహలోకి వచ్చాడు. జపం మొదలుపెడుతున్నాడు గనుక ఆహారం తీసుకోకుండా గురుస్మరణ చేసి నమస్కరించి ప్రారంభిస్తున్నాడు. ఇంతకు తనకు మంత్రమిచ్చిన గురునామమేమిటి? ఆయన చెప్పలేదు. సిధ్ధగురు దేవాయనమః అని కండ్లుమూసుకొన్నాడు. మనస్సులో నీలాచల యోగి అని పేరు స్ఫురిస్తున్నది. ఇదివరకు లేని స్ఫురణ బయలుదేరింది. మంత్రం ఉచ్చరిస్తున్నాడు. ఎవరూ ఇతర మానవులు లేరు గనుక పైకి పలుకుతున్నాడు. కొంత సేపటికి అలసట వచ్చింది. పెదవులు మాత్రం కదిలిస్తూ మంత్రం అంటున్నాడు. కాసేపటికి అదికూడా ఆగిపోయింది. మనసులో మంత్రం తిరుగుతున్నది. వాచికము, ఉపాంశువు దాటి మానసిక జపం జరుగుతున్నది. సంధ్యా సమయం దాకా ఇలా సాధన చేసి బయటకు వచ్చి చెట్టుపండ్లు కోసుకొని ఆకలి తీర్చుకొన్నాడు. రాత్రి నిద్రవచ్చినదాక జపం, తరువాత పడుకోటం, మధ్యలో మెలకువ వచ్చినప్పుడు మళ్ళీ కూచోటం జపంచేయటం, మళ్ళీ నిద్ర వస్తే శయనం, ప్రొద్దుననే స్నానపానాదులు, పునః జపం.*
*ఆహారం, నిద్ర జపం. ఇవి తప్ప వేరే ఏమీ కార్యక్రమం లేదు. అటువైపు ఎవరూ మనుష్యులు రాలేదు. క్రూరజంతువులు కూడా రాలేదు. బహుశా యోగి శక్తివల్ల ఇక్కడకు ఏ జంతువూ రాలేదేమో? ఏదైతేనేం? తనకెందుకు? తన తపస్సుకు ఏ విఘ్నము లేదు. తపస్సు అనుకుంటున్నాడు గాని తనది తపస్సా? తానేమి ఉపవాసాలు చేస్తున్నాడా? పంచాగ్ని మధ్యంలోనో, కంఠ దఘ్న జలంలోనో, నిల్చున్నాడా? తనను బతికించిన యోగి అవేమీ చెప్పలేదు. జపం మాత్రం చేయమన్నాడు. తను జపం చేసినంత మాత్రాన దేవత వస్తుందా? ఆ యోగి వస్తుందన్నాడు. గనుక వస్తుంది. ఆయన మాటవల్ల వచ్చేప్పుడు తాను జపం చేయటం దేనికి? కాని ఆ ఋషి జపం చేయమన్నాడు. కనుక తనకు తెలియని ప్రయోజనమేదో ఉన్నది. చెప్పినది చేయటం తన కర్తవ్యం.*
*ఇలా ఆలోచిస్తూనే జపం చేస్తున్నాడు. స్నానపానాలకు ఆహారానికి లేవాలికదా? సమయం ఎలా తెలుస్తుంది? జపమాల ఉంటే కండ్లు మధ్యమధ్యలో తెరుస్తూ ఎన్ని మాలలైనవో చూసుకొంటూ చేస్తే తెలుస్తుంది. ఆ గుహలో వెదికితే జపమాల ఉన్నది. తనకోసమే యోగి అక్కడ ఉంచాడేమో? మొత్తం మీద రోజులు గడుస్తున్నవి. ఇరవై రోజులు గడిచిన తరువాత కంటిముందు ఏవో వెలుగులు కనబడుతున్నవి. ఇంకా గడుస్తున్న కొద్దీ ఎవరో తనముందు కదలుతున్నట్లు అనిపించింది. లీలగా ఎవరో స్త్రీ దగ్గరకు వస్తున్నట్లు భాసించింది. మంత్రం చైతన్యవంతమై ఏదో మార్పు వస్తున్నది.*
*ఇలా రకరకాల అనుభవాలతో 40 రోజులు గడిచినవి. నలభై ఒకటవరోజు ఉదయం స్నానం చేసి మళ్ళీ కొంతసేవు జపం చేశాడు. దేవత వచ్చినట్లు మధ్యమధ్యలో అనిపించటం తప్ప పూర్ణ సాక్షాత్కారం కాలేదు. అంటే మంత్రం సిద్ధించలేదా? సిద్ధి తన సాధన మీద ఆధారపడి ఉన్నదా? తానెప్పుడూ అలా అనుకోలేదు. సిద్ధగురువు చేయమంటే చేశాడు. ఆయన కృప - ఆయన సంకల్పం. తాను దీనిని గురించి అలోచించవలసిన పనిలేదు. ఆలోచించి చేసేదికూడా ఏమీ లేదు. మధ్యాహ్నం ఆహారం తీసుకున్నానని అనిపించాడు. విశ్రాంతి. గాఢంగా నిద్రపట్టింది. సంధ్యాసమయం అయింది. లేచి ముఖ ప్రక్షాళనాదులు చేసుకొని గురుని దేవతను స్మరిస్తున్నాడు. ఇంతలో ఏదో అలికిడి అయింది. ఎవరో స్త్రీ నడిచి వస్తున్నది. మధ్యవయస్కురాలు, కళగలముఖం. ఎవరైతేనేమి? తానున్న చోటికి వచ్చింది గనుక అతిథి. ఆహ్వానించి ఆసీనురాలు కావలసిందన్నాడు. అక్కడ కూచోటానికి కుర్చీలున్నవా? ఒక పెద్ద బండరాయి చూపిస్తే ఆమె కూచున్నది. ఇతడింకో రాతిమీద కూర్చున్నాడు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 47 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శ్రీశైలము: 1257 సం||– 🏵*
*యువకుడు: మీరెవరు? ఎక్కడనుండి వస్తున్నారు?*
*యువతి: నీవెవరి కోసం ఎదురు చూస్తున్నావో ఆ వ్యక్తిని నేను.*
*యువ: నేను వ్యక్తుల కోసం ఎదురు చూడడం లేదు.*
*యువతి : తెలుసు. దేవత కోసం ఎదురు చూస్తున్నావు. ఆ దేవతను నేనే.*
*యువ: ఆశ్చర్యంగా ఉంది. దేవత అయితే ఆకాశం నుండి దిగి రావాలి. తేజో మండలం మధ్య ఉండాలి.*
*యువతి : నేను పై నుండే దిగి వచ్చాను. నీ కోసం నాలుగడుగులు భూమి మీద నడిచాను. నా చుట్టూ ఉన్న తేజస్సు చూచే శక్తి ఇంకా నీలో జాగృతం కాలేదు.*
*యువ: కొంత నమ్ముతున్నాను. కాని పూర్తి నమ్మకం కుదరటం లేదు.*
*యువతి : సహజమే. కొద్దిసేపటిలో కలుగుతుంది.*
*యువ: సరి! దూరం నుంచి వచ్చారు. పండ్లు, మంచినీళ్ళు ఇస్తాను. స్వీకరించండి!*
*ఆమె తల ఊపింది. అతడు లేచి ఒక పెద్ద ఆకు తీసుకొని దొన్నెవలె చేసి కొలనులోని నీరు తెచ్చి యివ్వబోయినాడు. ఆమెను సమీపించ లేకపోతున్నాడు. ఏదో అడ్డం వస్తున్నట్లు అనిపించింది. ఆశ్చర్యపడినాడు.*
*యువతి : నా అనుమతిలేక నా దగ్గరకు ఎవరూ రాలేరు. నీచేతిలోని దొన్నె దానంతట అదే నా చేతిలోకి వస్తుంది. చూడు ! అలాగే జరిగింది. అతనికి దిగ్భ్రాంతి కలిగింది.*
*యువ: మీరెవరు ? సామాన్య స్త్రీ కాదు.*
*యువతి : నేనెవరో ముందే చెప్పాను.*
*యువ: అయితే మీరు దేవత అన్నమాట. నన్ను రక్షించిన గురుదేవులు మీరేమి చెప్పితే అది చేయమన్నారు. ఆజ్ఞాపించండి. అని ఆమె పాదములకు నమస్కరించాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. యువకుడా! ఎదురుగా ఉన్న కొలనులో నీవిప్పుడు స్నానం చేయాలి. నేను కూడా వస్తున్నాను. పద!*
*ఇద్దరూ సరస్సులో ప్రవేశించారు. నీటిలో గొంతు లోతు దిగిన ఆమె శరీరంలో నుండి సెగలు పొగలు వస్తున్నవి. చుట్టూ నీరు తుక తుక ఉడుకుతున్నది. అతనికి తెలిసింది. తనకు తెలియనిదేదో జరుగుతున్నది. జరుగబోతున్నది. ఆమె దగ్గరకు వచ్చి అతని చెయ్యి పట్టుకొన్నది. ఆ హస్తము యొక్క ఉష్ణోగ్రత అతడు భరించ లేకపోయినాడు. భయం లేదు అంటూ ఉండగానే ఆమె చేతిలోనుండి అతని శరీరంలోకి అతి తీవ్రమైన విద్యుచ్ఛక్తి ప్రసరించటం మొదలైంది. కొంతసేపు గడిచిన తరువాత నీటిలో నుండి బయటకు దారితీసింది. ఇవతలకు వచ్చిన తరువాత శరీరాలలోని వేడికి గుడ్డలు వాటంతట అవే ఆరిపోయినవి.*
*యువ : జరిగినదంతా చాలా చిత్రంగా ఉంది. ఈ ఉష్ణతాపమేమిటి?. ఈ విద్యుత్తేమిటి? మీరెవరు ?*
*యువతి: సిద్ధేశ్వరా ! నేను హిమాలయ సిద్ధాశ్రమం నుండి వచ్చిన కుంగామోను. నీలాచలయోగి నీ దగ్గరకు రావలసిన సమయాన్ని గుర్తు చేశాడు.*
*యువ: నా పేరదా? నీ పేరేమిటి చిత్రంగా ఉంది?*
*యువతి : మూడువేల యేండ్ల నుండి ఈ పేరుతోనే ఏడవ శతాబ్దంలో నిన్ను పిలిపించుకొని నీకు సిద్ధశక్తులిచ్చాను. ఇప్పుడూ అందుకే వచ్చాను.*
*యువ: ఇది యేదో ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న రచనవలె ఉంది. కొంత కొంత అర్థమవుతున్నది.*
*యువతి : నీవు మా వర్గానికి చెందిన సిద్ధుడవు. మహా గురువుల ఆజ్జ వల్ల నీవు జన్మలెత్తి లౌకిక ప్రపంచంలో నెరవేర్చవలసిన కొన్ని ధర్మాచరణలున్నవి. ఎప్పటికప్పుడు నీకు గుర్తు చేసి సిద్ధశక్తులిచ్చి కర్తవ్య విజయానికి తయారు చేయటం మా విధి, ఇప్పుడు నీవు చేయబోయేది మామూలు సాధన కాదు. మంత్రయాన పద్ధతి. నీకు వజ్రవైరోచనీ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. ఆ చెట్టు క్రింద రాలిన ఆకులే ఆసనంగా కూర్చుండి జపం మొదలు పెట్టు. కండ్లు వాటంతట అవి మూత బడుతవి. వాటిని తెరవలేవు. ఎంత సమయం గడుస్తున్నదో నీకు తెలియదు. పరవశమైన స్థితిలో ఉంటావు. మంత్రసిద్ధి కాగానే నీకు తెలుస్తుంది. కండ్లు తెరచుకుంటవి. అప్పుడు అసలు కార్యం ఇదిగో! మంత్రం, నేను పైకి ఉచ్చరించటం లేదు. నీకు వినిపిస్తుంది. పద...*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 48 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శ్రీశైలము: 1257 సం||– 🏵*
*సిద్ధేశ్వరుడు కుంగామో చెప్పినటులే చేస్తున్నాడు. ఎంతసేపు గడిచిందో! భావసమాధి దశ. కన్నుల ముందు మహత్తర కాంతి పుంజం. ఆ వెలుగులో వజ్రేశ్వరి. ఆమె ముఖం కుంగామోముఖం ఒకటే. లోచనములు తెరచుకున్నవి. ఎదురుగా విప్పారిన కన్నులతో కుంగామో తనను చూస్తున్నది. అతడు నిలుచున్నాడు. ఆమె చేయి చాచింది. చేతిలోకి ఒక గ్లాసు వచ్చింది.*
*ఇదిగో! ఈ పాత్రలో ఒక ఓషధీ రసమున్నది. నీకు దప్పికగా ఉన్నది. దీనిని త్రాగు అని ఇచ్చింది. ఆమె చెప్పినది చేయటమే. ఏమిటి? ఎందుకు? అనే ప్రశ్నలేదు. ఆ పాత్ర తీసుకొని ఆ రసం తాగాడు. శరీరంలోకి మహాబలం ప్రవేశించినటులైంది. తానొక టేనుగు అనిపిస్తున్నది.*
*యువతి : సిద్ధేశ్వరా ! ఈ రోజు పున్నమి. కృష్ణాతీర శ్రీకాకుళంలో ఉత్సవం జరుగుతుంది. నీ చేత జపం చేయించి నీలోకి భైరవుని ఆకర్షించాను. నీవిప్పుడు భైరవుడవు.*
*పూజాసామ్రగి పుష్పములు - ధూపదీపములు నైవేద్యము అన్నీ సిద్ధంగా ఉన్నవి. ముందు పూజ చేయి. తెల్లవారు జాము కల్లా నీకు సిద్ధత్వం వస్తుంది. పూర్వస్ఫురణ అంతా వస్తుంది. తెల్లవారకముందే ఇద్దరమూ ఆకాశమార్గాన హిమాలయాలకు వెళ్ళాలి. అక్కడ సిద్ధాశ్రమ గురువుల సమక్షంలో తదనంతరం కార్యక్రమం నిర్ణయించ బడుతుంది!*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 49 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 16వ శతాబ్దం 🏵*
*ఆ తరువాత మళ్ళీ భారతదేశంలో భానుదేవుడన్న పేరుతో రాజవంశంలో పుట్టి ఒక చిన్న రాజ్యానికి ప్రభువై మధ్యవయస్సులో శత్రువుల చేతిలో ఓడిపోయి రాజ్యభ్రష్టుడైనాడు. ఏ విధంగానైనా రాజ్యం పొందాలన్న కోరికతో మత్స్యేంద్రనాధుని శిష్యుడైన గోరఖ్నాధుని ఆశ్రయించాడు. ఆ మహాయోగి దివ్యదృష్టితో చూచి “భానుదేవా ! ఈ చిన్న రాజ్యానికిమళ్ళీ ప్రభుత్వం సంపాదించటం కోసం నన్నాశ్రయించావు. నీ పూర్వసంస్కారాన్ని అనుసరించి నీవీ చిన్నపరిధికి పరిమితం కావలసిన వాడవు కావు. వెనుక ఒక జన్మలో కాళీభక్తుడవు. ఆదేవి అనుగ్రహం నీమీద ఉంది. నీకు కాళీ మంత్రాన్ని ఉపదేశిస్తాను. తీవ్రసాధన చెయ్యి. కాళీదేవి అనుగ్రహించి తీరుతుంది. అప్పుడామెను ఏమికోరుతావన్నది నీఇష్టం” అని మంత్రోపదేశం చేశాడు.*
*ఆ సిద్ధుడు చెప్పిన విధంగా సాధన మొదలు పెట్టి పట్టుదలతో చేశాడు భానుదేవుడు. కఠోరదీక్షలతో కొన్ని సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది. చివరకు కాళీదేవి సాక్షాత్కరించి "నాయనా నీకు ఏమి కావాలో కోరుకో' అన్నది. ఇన్ని సంవత్సరాల కఠోర శ్రమలో అతనికి లౌకిక సుఖభోగవాంఛనశించింది. మళ్ళీ రాజ్యం పొందాలన్న కోరిక తొలగిపోయింది. “అమ్మా ! సమ్రాట్టును కావాలని సాధన మొదలుపెట్టాను. ఇప్పు డా వాంఛలేదు. కానీ నాకు పూర్తి వైరాగ్యమూ కలుగలేదు.అందువల్ల సిద్ధశక్తులతో లోకకల్యాణం చేస్తూ నీ సేవకునిగా ఉండాలని ఉన్నది. ఒక వేళ నేను మళ్ళీ జన్మలెత్త వలసి వచ్చినా ఎప్పుడూ నీ భక్తుడనై ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించు" పరమేశ్వరి దయార్ద్రమైన చూపులతో చిరునవ్వు వెన్నెలను కురిపిస్తూ అతడు కోరిన వరమిచ్చి అదృశ్యమయింది.*
*ఆ శరీరంలో కొంత దీర్ఘకాలం జీవించి మళ్ళీ హిమాలయాలలోని డెహ్రాడూను ప్రాంతంలో ఒక కాళీ భక్తుల ఇంట్లో పుట్టటం జరిగింది. తమవంశంలో ఉన్న కాళీపూజ, మంత్రసాధన సహజంగానే అబ్బినవి. ఆ ప్రాంతంలో ఒక దేవి ఆలయం ఉన్నది. ఆ ఆలయం లోని దేవీమూర్తి అంటే అతనికి ఆకర్షణ ఏర్పడింది. ఆ దేవతను చూచినప్పుడల్లా మాతృభావన కాక మధుర ప్రేమభావన కలిగేది. పరమేశ్వరి విషయంలో ఈ భావన తప్పుకదా ! అనిపించేది. కానీ ఆ భావం నిల్చేది కాదు. పాశం వేసి లాగుతున్నట్లుగా అతని హృదయం ఆ దేవత వైపు బలంగా ప్రేమభావనతో మోహితమైంది. అతడు మంత్రశాస్త్ర గ్రంథాలను క్షుణ్ణంగా పరిశీలించాడు. భాగవతాన్ని చాలా సార్లు చదివాడు. కృష్ణోపాసనలో గోపికాభావానికి ఉన్న ప్రాధాన్యాన్ని జాగ్రత్తగా అనుశీలనం చేశాడు.*
*బృందావనంలో గోపకుల భార్యలు కృష్ణుని తమ ప్రియునిగా భావించి ఉపాసించి తరించారు. తల్లిగా, తండ్రిగా, అన్నగా, బంధువుగా, స్నేహితునిగా, ప్రియునిగా ఏ విధంగానైనా పరమేశ్వరుని భావించవచ్చు. చివరకు శత్రువుగా కూడా భావించవచ్చు. భావములో తీవ్రత, ఉద్దామధ్యాననిష్ఠ ప్రధానమని నారదుడు ధర్మరాజుతో చెప్పిన శ్లోకాలను పదేపదే మననం చేశాడు. పరమేశ్వర చైతన్యం గుణ, లింగ, నామరహితమైనది. పురుషరూపాన్ని కాని, స్త్రీరూపాన్ని కాని ఏది కావాలనుకుంటే అదిధరించకలదు. పరమేశ్వరుని పురుషునిగా తన ప్రియునిగా భావించిగోపికలు తరించినట్లు ఆ అనంత చైతన్యము స్త్రీగా భావించి ప్రియురాలిగా ఎందుకు ఉపాసించరాదు ? తాంత్రిక గ్రంథములలో “వీరమార్గము” అన్న పేరుతో ఈ పద్ధతి కన్పించింది.*
*దానితో ఒక నిర్ణయానికి వచ్చి ఆ గుడిలో కూర్చొని ప్రేమభావంతో శ్యామకాళీమంత్రసాధన చేశాడు. కొద్దికాలం చేయగానే ఆ గుడిలోని దేవత సాక్షాత్కరించింది. “సాధకుడా ! నీ తపస్సుకు నేను సంతృప్తిని చెందాను. నీలో కలిగిన ప్రేమభావము తప్పు కాదు. దానికి కారణం నేనే. దేవాలయాలలో ఒక రహస్యమున్నది. ప్రతి దేవాలయంలోను ఎప్పుడూ ఆ దేవత ఉండదు. ఆ దేవత పరివారంలోని వారు ఆమె ఆజ్ఞవల్ల అక్కడ ఉంటూ భక్తుల కోరికలను వారి యోగ్యతను బట్టి ప్రసాదిస్తుంటారు. నేను భువనేశ్వరి పరవారంలోని అనూరాధ అనే దేవతను. పూర్ణ మానవశరీరంతో నీతో కొంతకాలం కాపరంచేస్తాను" అని వరమిచ్చింది. ఆ ప్రకారంగానే కొన్ని సంవత్సరాలు అతనితో ఆమె సంసారం చేసింది. ఆ దాంపత్య ఫలితంగా వారికొక కుమారుడు పుట్టాడు. వాడికి అయిదుఏండ్ల వయస్సు వచ్చిన తరువాత ఆ దేవత "మన దాంపత్య సమయం పూర్తయిపోయింది నేను వెడుతున్నాను. నీ జీవితంలో మళ్ళీ ఇక నేను కనపడే అవకాశం లేదు. కుమారుని జాగ్రత్తగా పెంచి పెద్దవాడిని చెయ్యి" అని వీడ్కోలు చెప్పి అదృశ్యమయింది.*
*ఇన్ని సంవత్సరాలు ఆమెతో సంసారం లో మునిగి కాళీసాధన సరిగా చేయలేదు. తన తపః ఫలమో లేక పూర్వపుణ్యమో పూర్తి అయిపోయింది. ఈ జన్మలో తనకింక సుఖం లేదు. పోనీ మళ్ళీ వెళ్ళి తపస్సుకు కూర్చుందాము అంటే ముద్దులొలికే చిన్నవాడిని విడిచిపెట్టి పోలేదు. తనకీ జన్మ కింతే అని మనసు కుదుట పరచుకొని ప్రేమస్వరూపిణి అయిన తన భార్య చెప్పిన విధంగా బిడ్డను పెంచి పెద్దచేశాడు. వానిని సంసారంలో స్థిరపరచేసరికి తనకు ముసలితనం వచ్చి ఆయువు తీరిపోయింది. సామాన్య సాధనయే తప్ప కఠిన తపస్సు చేయటానికి శరీరం సహకరించని స్థితిలో పడినాడు. మరణం సమీపించినప్పుడు కాళీమాతను ప్రార్ధించాడు. "తల్లీ ! ఏ జన్మలో ఏమి సుకృతము చేశానో ఈ జన్మలో నీ భక్తుడనయ్యే అదృష్టం కలిగింది. కానీ, ఇంద్రియములకు లొంగిపోయి ఒక దేవతనే భార్యగా చేయమని నిన్ను ప్రార్ధించాను. నీవనుగ్రహించి ప్రసాదించావు. కానీ, ఆ భోగంలో పడి తపస్సు విస్మరించాను. వచ్చే జన్మలో నయినా తపస్సు చేసి నీ పరిపూర్ణమయిన అనుగ్రహ సిద్ధిని పొందేలాగా కరుణించు" అని కాళీదేవిని మనస్సులో నిల్పుకొని ఆ దేవి మంత్రాన్ని జపిస్తూ తుదిశ్వాస వదిలాడు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 50 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 16వ శతాబ్దం 🏵*
*తరువాత జన్మలో మళ్ళీ కాళీ సాధకుడయ్యారు.స్వప్నంలో కాళీదేవి స్వయంగా తన మంత్రాన్ని ఉపదేశించింది. ఈ జన్మలో సంసారం లేదు. చిన్న వయస్సులోనే దేవతా సాక్షాత్కారం పొందాలన్న తపన బయలుదేరింది. ఇంట్లో తల్లితండ్రుల బాధ్యత వహించవలసినది తనకంతగా లేదు. తన అన్నలున్నారు. విద్య యందు కాని లౌకిక విషయాల యందు కాని తనకు ఆసక్తి లేదు. ఎప్పుడూ గుళ్ళూ గోపురాలు పట్టుకొని తిరిగేవాడు. పెద్దలు ఎంత చెప్పి చూచినా అతను మారలేదు. కొంతకాలం తరువాత వీడు నలుగురి వంటివాడు కాదని నిశ్చయించుకొని ఇంట్లోవాళ్లు పట్టించుకోవటం మానివేశారు. అతడికి కావలసినదీ అదే.*
*ఎప్పుడూ అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కళ్ళు మూసుకొని కూర్చుండేవాడు. అప్పుడప్పుడు వారి ఇంటికి హరిద్వారంలో ఒక ఆశ్రమాధిపతిగా ఉంటున్న ఒక వృద్ధయోగి వచ్చేవాడు. ఒక పర్యాయం వచ్చినప్పుడు ఇతడు ఆయనను హరిద్వారానికి తీసుకొని వెళ్ళమని ప్రార్థించాడు. ఆయన ఆశ్రమంలో వేదపాఠశాల ఉన్నది. అక్కడికి వెడితే అక్కడి పిల్లల సహవాసంతోటైనా చదువులో పడవచ్చునేమో అని ఆయనతో వెళ్ళటానికి తల్లిదండ్రులు అనుమతించారు. అది అతనికి పెద్దవరమయింది.*
*ఆ వృద్ధయోగితో హరిద్వారం చేరుకొన్న తరువాత కొన్నాళ్ళు ఆశ్రమంలో ఉండి ఆయనతో తనకు తపస్సునందు ఉన్న ఆసక్తిని విన్నవించి తాను ఏకాంతంగా తపస్సు చేసుకోవటానికి అనుమతివ్వమని అర్థించాడు. ఇతని లక్షణాన్ని నిశ్చలమయిన పట్టుదలను సాధనలోని ఏకాగ్రతను గమనించి ఆ వృద్ధుడు దానికి సంతోషంగా అనుమతించి సాధనలో తీసుకోవలసిన జాగ్రత్తలు తనకు తోచినవి చెప్పాడు. అక్కడ నుండి హిమాలయ పర్వతాలలో కొంతదూరం వెళ్ళి ఆ కొండలలో ఒక చిన్నగుహను ఎన్నుకొని అక్కడ తపస్సు ప్రారంభించాడు.*
*క్రూరమృగాలు లేని చోటు జనావాసాలకు మరీ దూరంకాని చోటది. గంగాజలం సమృద్ధిగా ప్రవహించే స్థలం. పండ్లు, పండ్లచెట్లు చాలా ఉన్నవి శరీరాన్ని నిలపటానికివి చాలు. ఆహార విహారాది కఠోర నియమాలతో ఒక వైపు శరీరాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ కాళీమంత్ర జపసాధన చేయటం మొదలు పెట్టాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నవి. ఋతుగమనంలో మార్పులు వచ్చినట్లే అతని శరీరంలోనూ మార్పులు వస్తున్నాయి. ఆ ప్రాంతంలోని పొదలలోని కొన్ని చెట్ల పండ్లు చిన్నవి తింటే బాగా బలంగా ఉన్నట్లు అనిపించటాన్ని గమనించాడు. కొన్నిఫలాలు ఆకులు. తింటే రోజుల తరబడి ఆహారం యొక్క అవసరం లేకపోవటం గుర్తించాడు. ఈ విధంగా ఆయా వస్తువులనుపయోగించుకొంటూ ప్రాణరక్షణ చేసుకొంటూ మంత్రసాధన చేస్తున్నాడు.*
*కూర్చుండిన స్థలములోనె కూలిన కూలుదునుగాక! ఎముకలగూడు వలె మారి ఎండిన ఎండుదునుగాక!*
*నా మాంసము నా చర్మము నా దేహము శిధిలమైన నిను వీడను నిను వీడను నిను చూడక నే వదలను*
*ఈ కూర్చొన్న ఆసనంలో నాశరీరము శుష్కించిన శుష్కించును గాక! నా శరీరములోని మాంసము, చర్మము, ఎముకలు నశించిపోయిన పోవును గాక! నేను కోరిన దివ్యానుగ్రహాన్ని పొందకుండా ఇక్కడ నుండి కదలను.*
*తల్లీ! నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నవి. కాలాన్ని గణించే శక్తి కూడా నశించింది. ఎప్పటికైనా నిన్ను చూచి తీరాలి అన్న సంకల్పం ఒక్కటే మిగిలి ఉన్నది. ఎన్నో జన్మల నుండి నిన్నుకొలుస్తున్నాని క్షణక్షణము అనిపిస్తుంది. నీ దర్శనం కోసం తపించి తపించి ఎండిన మోడువలె అయిపోతున్నాను. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి. ఆర్తుడను దీనుడను అయిన నన్ను కాపాడు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 51 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 16వ శతాబ్దం 🏵*
*భక్తి భరితమైన వేదనకు, అతని చిరకాల కఠోర తపస్సుకు కాళీ దేవి కనికరించి, దయామయి అయిన ఆజగజ్జనని అతనిముందు సాక్షాత్కరించింది. "బిడ్డా! నీ కఠోరమైన తపస్సుకు నేను కదలివచ్చాను. పూర్వజన్మలలోనూ నీవు నా భక్తుడవు. ఎప్పుడూ నిన్ను అనుగ్రహిస్తునే ఉన్నాను. రెండు జన్మల క్రింద నీవు మహాసిద్ధుడవు. నీవు సుఖ భోగములను త్యజించి క్రూర తపస్సు చేసిన సాధనలు కి ఆనాడు నా అనుగ్రహాన్ని సాధించావు. అప్పుడు నీవు తపస్సు చేసిన చోటు కూడా ఇదే. నాటి నీ భౌతిక శరీరం నీ ఆజ్ఞ వల్ల నీ శిష్యులు ఈ గుహలో ఖననం చేశారు.*
*నా సంకల్పం వల్ల నీ జీవు డిక్కడికి ఆకర్షించబడ్డాడు. మధ్యలో వచ్చిన జన్మలు నీ అంత రాంతరాలలో ఉన్న సుఖ భోగ కాంక్షలు తీరటానికి సరిపోయింది. ఈ జన్మలో మళ్ళీ ఇక్కడకు వచ్చి ఆనాటి నీ సమాధి మీదనే నీవు కూర్చోని జపం చేశావు. కాలవశాన వచ్చిన మార్పుల వల్ల ఆ చిహ్నము లేవీ పైకి కన్పించక పోవడం వల్ల నీకు తెలియలేదు. నేనే, నీకు స్వప్నంలో మంత్రాన్ని ఇచ్చాను. నేనే, నిన్ను ఇక్కడకు రప్పించాను. నీ చేత తపస్సు చేయించాను. నీకు దివ్య శక్తులను ప్రసాదిస్తున్నాను. ఈ శరీరంలో నీవు మూడు వందల సంవత్సరాలు జీవిస్తావు నీకు తోడుగా నేను ఎప్పుడు ఉంటాను.” అని కాళీదేవి పలికింది.*
*ఆ యోగి "అమ్మా! నీ అనుగ్రహం వల్ల నేను ధన్యుడనయినాను. ఎప్పుడూ నీ ఉపకరణంగా ఉంటూ నీవు సంకల్పించిన పనులను చేసే సేవకునిగా నన్ను నియమించు నీవు నాతో ఎప్పుడూ ఉంటానన్నావు. భౌతికంగా కూడా అది జరిగేలా చెయ్యి అన్నాడు.*
*కాళీదేవి నవ్వి "ఓయీ! చిత్రమైన కోరిక కోరావు. ఇది కలియుగం. నేను నీ వెంట దివ్యాకృతితో ఉండడం ఉచితంకాదు. కానీ నీ వంటి భక్తుని కోరికను కాదనలేను. చిన్న విగ్రహ రూపంలో నీతో ఉంటా. ఆ విగ్రహంలో నీకు కన్పిస్తాను, మాట్లాడుతాను. నీ బుద్ధిని ప్రచోదిస్తూ ఉంటాను. అయితే ఈ విగ్రహం అన్ని విగ్రహాల వంటిది కాదు. పసిబిడ్డ పెరిగి పెద్దదయినట్లే ఇది కూడా పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఇది జీవత్ విగ్రహం అనడానికి నిరూపణగా దీనికి ఉఛ్వాస నిశ్వాసలుంటాయి. నాడీ స్పందన ఉంటుంది.*
*ఇక్కడ నుండి నా విగ్రహంతో నీవు బయలుదేరి దేశ సంచారం చెయ్యి ఎందరో యోగులు, సిద్ధులు నీకు తటస్థిస్తుంటారు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రజలను మలుస్తూ యోగసాధనలలో తపస్సాధనలలో మరింత ముందుకు పోయేలా చేస్తూ నీవు పురోగమించు. ఈ విగ్రహం పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఇప్పటి మనుష్య ప్రమాణం వచ్చిన తరువాత దానినొకచోట స్థాపించి ఆలయాన్ని నిర్మిద్దువుగాని. ఎప్పుడు ఏమి చేయ వలసినదీ నేను నిర్దేశిస్తుంటాను” అతని ముందు తేజస్వంతమైన ఒక చిన్న విగ్రహం అవతరించింది.*
*ఆ విగ్రహంతో హిమాలయాల నుండి బయలుదేరి యావద్భారత దేశము సంచరించాడు కాళీయోగి. ఉత్తరాపథంలో బృందావనంలో కొంత ఎక్కువకాలం ఉండవలసి వచ్చింది. అక్కడి రాధాకృష్ణ భక్తులైన రూపగోస్వామి, సనాతనగోస్వామి, మొదలైన ప్రేమయోగులతో అనుబంధం పెరిగింది. ఆధామంతో తనకున్న పూర్వజన్మ బంధాలు గుర్తుకువచ్చినవి. ఒకసారి హితహరివంశమహరాజ్ అనే రాధాభక్తుడు తన ఆశ్రమానికి ఆహ్వానించి తాను రచించిన రాధాసుధానిధి అనే గ్రంధం వినిపించాడు. తనను రాధాసఖిగా భావించుకొని అతడు చేసిన ఆ రచన తననెంతో ఆకర్షించింది. సంస్కృతంలో అంతటి రసవంతమైన రచన భక్తి ప్రేమామృతాన్ని వర్ణించే రచన మరొక్కటి లేదని అనిపించింది. అతడు కాళీయోగిని కాళీ రూపంగానే భావించేవాడు. కాళి కూడా రాధాసఖులలో ఒకరని వాదించేవాడు. ఆ రసిక భక్తునితో గడిపిన కాలం మరచిపోలేనిది.*
*ఇక రూపగోస్వామితో మైత్రి చాలా గాఢమైనది. కాళీతంత్రంలో నుండి ఇతడుదాహరించిన ఒక సూత్రం అతనికి బాగా నచ్చింది. ఉచ్ఛ్వాస నిశ్వాసముల గమనాగమనములను కండ్లుమూసుకొని ఏకాగ్రతగా చూడటమే కాలమును జయించే కాళీసాధన అని ఆ వాక్యం. గోస్వామి కృష్ణభక్తికి సంబంధించిన ఒక గ్రంధం రచిస్తూ రాత్రులు కొంతకాలం ఈ సాధన చేశాడు. ఆ సాధన ఫలితంగా ఒక కాళీసిద్ధుడతనికి సాక్షాత్కరించాడు. గోస్వామి యందు ఆదరం చూపించి కాళీ కృష్ణులు ఒక్కటే అని చెప్పి దివ్యానుభూతులను, కొన్ని శక్తులను ప్రసాదించాడు. ఆకాశ సంచార శక్తిగల ఆ సిద్ధుడే తర్వాత రామకృష్ణపరమహంసగా జన్మించాడు. ఆ కాళీ సిద్ధుడు ఇతని విగ్రహంలోని కాళీదేవిని పూజించడమే గాక జన్మ మారిన తర్వాత రామకృష్ణునిగా కూడా ఇతని చివరి రోజులలో వచ్చి దర్శించి అమ్మను అర్చించి వెళ్ళాడు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 52 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 16వ శతాబ్దం 🏵*
*కొంత కాలం కాళీయోగి కాశీలో ఉన్నాడు. అక్కడ త్రైలింగస్వామి అనే యతి కాళీ సాధన చేసి ఇతనివలె మూడు వందల యేండ్లు జీవించే వరం పొందాడు. అతడూ ఈ కాళీ దేవతామూర్తిని అర్చించాడు. అక్కడి నుండి యోగి కొన్నాళ్ళు దక్షిణాపధంలో తిరిగాడు. చిత్రానదీ తీరంలోని కుర్తాళం అతనిని ఆకర్షించింది. ఆ పవిత్రస్థలంలో కొన్ని నెలలు ధ్యానం చేసుకుంటూ అక్కడి ఆర్తుల కష్టాలు తీరుస్తూ గడిపాడు. తిరిగి ఉత్తర భారతానికి బయలుదేరగా దోవలో ఆంధ్ర ప్రాంతంలో శ్రీనాధుడనే కవివర్యునితో పరిచయం కలిగింది. చింతామణి మంత్రసిద్ధుడై రాజ పూజితుడైన ఆ విద్వాంసుని కవిత్వ పాండిత్య ప్రాభవానికి అతడు ముగ్ధుడైనాడు. ఆ కవి-అతిథిగా తన భవనంలో కొంతకాలమైనా ఉండవలసినదిగా ప్రార్థించాడు. ఆతని ఆత్మీయ భావానికి సంతోషించి కొన్నాళ్ళున్నాడు. విపరీతంగా స్త్రీలోలుడు అయిన ఆ కవి చిత్తవృత్తి చాలా చిత్రమనిపించింది. ఆనన్యమైన అతని శివభక్తి, తనకెంతో నచ్చింది. కాళీయోగి అక్కడినుండి బయలుదేరే రోజు ఆ కవిరాజు తన భవిష్యత్తును గూర్చి చెప్పమని ప్రార్ధించాడు.*
*ధ్యానంలో చూచి ఇలా చెప్పాడు. “మహాకవీ!” మీది చాలా గొప్ప జన్మ. ఆ విషయం నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక సిద్ధగురువు నీకు దివ్యమంత్రాన్ని ఉపదేశించాడు. ఆ సమయంలో అతడు నీకు కొన్ని నియమాలు పెట్టాడు. ఆ మహామహుని దయ వల్ల నీకు వాక్సిద్ధి లభించింది. నీ రంగంలో నీ ముందు నిలువగల వారుండరు. దిగ్విజయం చేసి సమ్రాట్టులచే కనకాభిషేకాలు పొందుతావు. ఎంతటి రాజులయినా నీ వశులవుతారు. మహాభోగాలు అనుభవిస్తావు. కానీ నీ స్త్రీలోలత నిన్ను దెబ్బతీస్తుంది. నీ పతనానికి దారి తీస్తుంది. ఇప్పుడే కాదు ఇంకా చాలా సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నీ ప్రభజగజ్జేగీయ మానంగా వెలుగుతోంది. ఏనాడు నీ సిద్ధగురువు పెట్టిన నియమాన్ని ఉల్లంఘిస్తావో ఆనాడు నీ శకం ముగుస్తుంది.*
*మరపు వల్ల, కామం వల్ల, నీవు దోషం చేస్తావని, తదనంతరం నీవు హత్య చేయబడి ప్రేతమై కొన్ని వందల సంవత్సరాలు గాలిలో తిరుగుతుంటావని తోస్తున్నది. నీ పురుషకారం వల్ల, దైవభక్తి వల్ల నీ భవిష్యత్తు నేమైనా మార్చుకోగలవేమో ఆలోచించుకో” శ్రీనాధుడు “యోగిశేఖరా! కాళీదేవి అనుగ్రహపాత్రులైన మీరు ఎన్నో విశేషాలు తెలియజేశారు. మీరు చెప్పిన ప్రయత్నం చేస్తాను. కానీ ఎంత కృతకృత్యుడనవుతానో! ముక్కుకుత్రాడు వేసి గంగిరెద్దును దానిని ఆడించువాడు లాక్కువెళ్ళి ఆడించే విధంగా విధినాతో అడుకుంటున్నది. నాకు మనశ్శాంతి లేదు. చిన్నప్పుడే నా తల్లి దండ్రులు మరణించారు. నా స్వగ్రామం క్రాల పట్టణం ఉప్పెన వచ్చి సముద్రంలో కొట్టుకుపోయింది. నా మేనమామ సనత్కుమారభట్టు నన్ను పెంచి పెద్ద చేశాడు. ఆయన కూతురును నాకు పెండ్లి చేయాలని ఆశించాడు. ఆ అమ్మాయి చాలా వికారంగా ఉంటుంది.*
*నా జీవలక్షణం సౌందర్యోపాసన. ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోనని తిరస్కరించాను. కృతఘ్నుడవని నన్ను దూషించాడు. నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు. ఆయన పెద్ద అధికారపదవిలో ఉండడం వల్ల నా కెవ్వరూ ఆశ్రయమివ్వలేదు. ఆగమ్మకాకినై ఊళ్ళు పట్టుకు తిరిగాను. ఒక సిద్ధుడైన మహానుభావుడు కరుణించి మంత్రోపదేశం చేశాడు. అది సిద్ధించింది. దాని వల్ల వాగ్దేవి అనుగ్రహించింది. మహా కవియైన మా తాతగారు కమలనా భామాత్యుని వారసత్వంగా కవిత్వం వచ్చింది. సరస్వతీ చింతామణీదేవి ఇచ్చిన శక్తి వల్ల సాహిత్యరంగంలో అప్రతిహత పరాక్రమంతో ప్రకాశిస్తున్నాను. దాని వల్ల సిరిసంపదలు లభించినవి. మీ వంటి మహానుభావులకు ఆతిధ్యమిచ్చి పూజించుకోగల అవకాశం లభించింది. అయితే మీరు నా భవిష్యత్తును గూర్చి చెప్పిన విషయాలు విన్నప్పుడు దిగులు కలుగుతున్నది. నా సాధనశక్తి చాలా పరిమితమైనది. దానివల్ల విధిని మార్చగలనని నాకు నమ్మకం లేదు. నన్ను మీరే రక్షించాలి. బ్రతుకు బాటలో ముండ్ల మీద ఉండవలసి వచ్చింది. ఎన్నో మలుపులు వచ్చినవి. వాటిని మీ ముందు ఏకరువుపెట్టను. ఆ పరిస్థితులలో స్త్రీలోలుడనైనాను. అయితే యే పతివ్రత జోలికి పోలేదు. నా మంత్ర గురువులు మీకు తటస్థించవచ్చు. నేను ఎప్పుడైనా తప్పుచేస్తే నన్ను దయతో క్షమించమని వారికి చెప్పండి. వారిని మళ్ళీ చూచే అవకాశం ఉన్నదో, లేదో వా రెక్కడ ఉన్నారో ? ఏదైనా నన్ను మీరు కాపాడాలి అని ప్రార్ధించాడు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 53 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 16వ శతాబ్దం 🏵*
*మనసు కరిగిన కాళీ యోగి మరోసారి నిమీలితనేత్రుడై ధ్యానించి "శ్రీనాధకవీ! చాలకాలం తర్వాత నీ యాత్రలో ఒక మంత్రవేత్త నీకు పరిచయమవుతాడు. అతడు నీకు పరకాయప్రవేశవిద్యను నేర్పుతాడు. అతని పేరు శివరాయప్ప - కన్నడిగుడు. సిద్ధవిద్య నేర్చుకోవాలన్న మోజులో అక్కడి మతంగ పర్వతం మీద 40 రోజులు సాధన చేస్తావు. ఆ విద్య సిద్ధిస్తుంది. దానిని పరీక్షచేసి చూడాలన్న కోరికతో ఒక యువకుని మృత శరీరంలో ప్రవేశిస్తావు. ఆ సమయంలో నీ శత్రువుల అనుచరుడొకడు నీ అసలు శరీరంలో ప్రవేశించి తానే శ్రీనాధునిగా నటిస్తూ ఆంధ్ర దేశానికి వెళ్ళిపోతాడు. నీవు మూడురోజుల తర్వాత చూస్తే నీ శరీరం దొరకదు. ఆ యువకుని శరీరంలోనే ఉండిపోవలసివస్తుంది. నిస్సహాయ స్థితిలో ఉన్న నీ మాటలను ఎవరూ నమ్మరు. ఆ ప్రాంతంలో అంతకు ముందు నిన్ను ఆదరించిన రాజుతో చెప్పుకొన్నా అతడు విశ్వసించడు. ఆంధ్రదేశానికి వెళ్ళి నిరూపించుకొందామని నీవు చేసే ప్రయత్నం విఫలమవుతుంది.*
*విషప్రయోగంతో నీవు హత్య చేయబడతావు. ఇప్పటికి తెలుస్తున్న విషయాలివి. నీవు రక్షించమని ప్రార్ధిస్తున్నావు. కాని అప్పటికి నేనెక్కడ ఉంటానో బహుశా నీ హత్యా సమయానికి నేనీ శరీరంతో ఉండక పోవచ్చు. అయితే ఎక్కడ ఉన్నా నీ విషయంలో శ్రద్ధ వహిస్తాను. జగన్మాతకు నివేదించి నిన్ను రక్షించడానికి ప్రయత్నిస్తాను. శుభం భవతు "అని వీడ్కోలు పల్కి కాళీయోగి కళింగ సీమలో ప్రవేశించాడు.*
*కాళీ విగ్రహం పెరిగి పెద్దదయింది. ఒరిస్సాలోని భువనేశ్వరు దగ్గర ఉన్న ఒక అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకొని భక్తుల సహకారంతో కాళీదేవికి ఆలయం నిర్మించాడు. కాళి అనుగ్రహం వల్ల ముసలితనం ఎక్కువ ఇబ్బంది పెట్టకపోయినా శరీర పతనం తప్పలేదు. దానికి కొద్ది కాలం ముందే భైరవీబ్రాహ్మణి ఒకరు శిష్యురాలుగా చేరింది. ఆమె తాంత్రికసాధనలో ప్రవీణురాలు. ఎందరి చేతనో ఆ సాధనలు చేయించి కొన్ని సిద్ధశక్తులు వచ్చేలా చేయగలిగింది. ఆమె వద్ద ఆ సాధనలలో కృషి చేసిన వారిలో రామకృష్ణపరమహంస ఒకరు. ఆ భైరవి కాళీపూజ శ్రద్ధాభక్తులతో చేస్తున్నది. మరికొందరు శిష్యులు కూడా ఉన్నారు. వారికి ఆలయాన్ని అప్పగించి కాళీయోగి ప్రాణములు వదిలాడు.*
*ఆ తరువాత కొంత కాలానికి దక్షిణ దేశంలో కంచి క్షేత్రంలో జన్మించడం జరిగింది. దేవతల సిద్ధుల కరుణ వల్ల సాధన చిన్న వయస్సులోనే ప్రారంభమైంది. ఒక కొండ మీది దేవీఆలయంలో తీవ్రసాధన సాగింది. దేవతానుగ్రహం వల్ల పూర్వస్ఫురణ లభించింది. కళింగవనంలోని కాళి దగ్గరకు వెళ్ళి ఆ దేవి అనుగ్రహం కోసం మళ్ళీ తపస్సు చేశాడు.*
*ఈ సారి కొందరు తాంత్రికులు కలవటం వల్ల సాధనలు చేసి కాళి కృపను వేగంగా పొందటం జరిగింది. ఆనాటి తోటి సాధకులలో ఒకరు లీలానంద ఠాకూర్ అనే ఔత్తరాహుడు. అతడు కళింగా శ్రమంనుండి తనస్వస్థలం వెళ్ళి అక్కడ నుండి బృందావనం చేరి రాధాకృష్ణ భక్తుడై జీవితాన్ని చరితార్ధం చేసుకొన్నాడు. అక్కడ అతనిని ఇబ్బంది పెట్టిన దుష్టులనుండి కాళీదేవి రక్షించింది. అతని కోర్కె ప్రకారం అతడు మరణించిన తర్వాత అతని సమాధి మీద కాళీ విగ్రహాన్ని స్థాపించా రతని శిష్యులు, ఈనాడు బృందావనంలో పాగల్ బాబా మందిరం సుప్రసిద్ధమైనది. తోటి సాధకులలో మరొక వ్యక్తి తరువాతి జన్మలో అద్దంకి కృష్ణమూర్తి అన్న పేరుతో విఖ్యాతుడైన మాంత్రికుడు. అప్పుడొక యాత్రలో మౌనస్వామి కలిసి కుర్తాళానికి ఆహ్వానించాడు. ఆనా డది సమకూడలేదు దాని ఫలితంగా తర్వాత జన్మలో మౌనస్వామిపీఠానికి ఆధిపత్యం స్వీకరించ వలసి వచ్చింది.*
*ఈ విధంగా ఆటుపోటులతో సుఖదుఃఖాలతో ఆ జీవితం సుమారు ఒక శతాబ్దం కొనసాగి మృత్యుకుహరంలోకి వెళ్ళి పొయింది. అనంతరం వచ్చిన ఇప్పటి జన్మ ఆంధ్రదేశంలో సంభవించింది. అనంత కాలంలోకి చొచ్చుకొనిపోయే దేవతల దృష్టి అపారమైనది. ఖండకాలానికి పరిమితం కాని వారి ప్రణాళికలు అందరికీ అర్ధంకావు. అర్ధమైన సిద్ధయోగులు దాదాపు పదిమంది తెలుగు దేశంలో పుట్టారు. కొందరు కాస్త ముందు - వెనకా కొందరు సమకాలికులు. సింధువులో బిందువులు - మహాగ్ని కుండంలోని విస్ఫూలింగాలు - పరమేశ్వరుడనే సూర్యబింబం నుండి బయలుదేరిన ఒక్కొక్క కిరణం వంటివారు. ఎవరి నిర్దిష్ట కార్యక్రమాన్ని వారు చేస్తూ - మధ్య మధ్యలో కలుస్తూ విడిపోతూ ఉంటారు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 54 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*
*తూర్పు బెంగాలులోని జస్వర్ ప్రాంతానికి పరిపాలకునిగా ఉన్న ఒక జమీందారు దగ్గర కులగురువులుగా ఉన్న ఒక బ్రాహ్మణ కుటుంబం వారు వేదాధ్యయన పరులుగా మంత్రోపాసకులుగా, ఆధ్యాత్మిక విద్యావేత్తలుగా పేరుగాంచారు. 19వ శతాబ్దం ప్రారంభం నాటికి బ్రిటీష్ ప్రభుత్వం అప్పుడే, బలాన్ని పెంపొందించు కొంటున్నది. బెంగాలులో ఎక్కువ భాగం నవాబుల పరిపాలనలో ఉన్నది. ముస్లిం మతవిజృంభణం అరికట్టటం కష్టసాధ్యంగా ఉన్నకాలమది. హిందువులంతా మహమ్మదీయుల పాలనలో బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్నారు.*
*ఆరాధన మార్గాల దృష్టిలో వంగదేశంలో హిందూ సంప్రదాయాలు రెండు రకాలుగా వ్యాపించి యున్నవి. తాంత్రిక మార్గాలలో కాళీసాధన తీవ్రంగా ప్రచారంలో ఉండగా మరొక వైపు కృష్ణచైతన్య మహాప్రభువు ప్రభావం వల్ల కృష్ణభక్తి కూడా సామాన్య ప్రజల హృదయాలను ఆక్రమించుకొని ఉన్నది. మామూలు ప్రజలంతా ఉభయచరులు. అటు కాళీ ఉత్సవాలకు వెళతారు. ఇటు కృష్ణభజనలకు వెళతారు. చైతన్య మహాప్రభువు యొక్క ముఖ్య శిష్యులు, రూపగోస్వామి, సనాతన గోస్వామి అక్కడివారే. ఆ రెండు సంప్రదాయాల ప్రభావము ఈ రాజ గురువుల కుటుంబం మీద కూడా ఉన్నది. కలకత్తాలోని శక్తి పీఠమయిన కాళీదేవిని తరచుగా వారు దర్శించుటకు వెళ్తూనే ఉంటారు. అదే విధంగా కొన్ని కుటుంబాల వారు కలసి యాత్రికుల గుంపుగా బయలుదేరి భజనలు చేసుకొంటూ మధుర బృందావనాలకు వెళ్ళిరావటం కూడా తరచుగా జరుగుతున్న అంశమే.*
*ఈ రాజగురువుల కుటుంబంలో 19వ శతాబ్దం మొట్టమొదట ఒక ఆడపిల్ల పుట్టింది. చాలాకాలం సంతానం కలగక చిరకాలం కులదేవత అయిన కాళిని ఉపాసించటం వల్ల లేకలేక కలిగిన ఆ బిడ్డకు ముద్దుగా 'యోగేశ్వరి' అని పేరు పెట్టుకున్నారు. చిన్నతనం నుండే గృహవాతావరణంలో దైవభక్తి ఆధ్యాత్మిక చైతన్యం ఉండటం వల్ల ఆ లక్షణాలు ఈ బాలికలోనూ నెలకొన్నవి. చిరుతప్రాయంలోనే యోగేశ్వరి భజనలలో పాల్గొనేది. పూజలు చేయటానికి ఉత్సాహం చూపేది. యోగేశ్వరికి షుమారు పదిసంవత్సరాలు వచ్చిన సమయంలో ఆమె తల్లిదండ్రులకు మరొక ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయికి అయిదు ఏండ్ల వయస్సు వచ్చేసరికి, ఆయువు తీరి తండ్రి మరణించాడు. వీరి వంశంలో మగపిల్లవాడు లేకపోవటం వల్ల రాజగురువు పదవి వారి సోదరుల కుటుంబాలలో మరొకరికి వెళ్ళిపోయింది. పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉండటం వలన జరుగుబాటుకు లోటు లేదు.*
*ఇలా గడుస్తుండగా వారి గ్రామంలో ఊరి పెద్దలు ఒక పండితుని పిలిపించి భాగవత ప్రవచనం చేయించారు. ఆ పౌరాణికుడు మంచి సమర్థుడు కావటం వల్ల ఎంతో ఆకర్షణీయంగా కమ్మని కంఠంతో భాగవత కథలు వినిపిస్తున్నాడు. అందరితో పాటు యోగేశ్వరి, వాళ్ళ అమ్మ కూడా వెళ్ళేవారు. దశమస్కంధం చెప్పేటప్పుడు ఆ విద్వాంసుడు భాగవతానికి బ్రహ్మ వైవర్త పురాణాన్ని కూడ జోడించి చెప్పటంతో భాగవతంలో లేని కొత్త విశేషాలు ఎన్నో తెలిసినవి. ముఖ్యంగా రాధాదేవిని గురించి చాలా అద్భుతమైన విశేషాలు విన్నారు. తమ ప్రాంతం వారయిన రూపగోస్వామి, సనాతన గోస్వామి మొదలైనవారు చైతన్య మహాప్రభువు శిష్యులై, వైష్ణవులై, కృష్ణభక్తులై మహాప్రభువు ఆజ్ఞవల్ల బృందావనం వెళ్ళి అక్కడ రాధాభక్తులుగా మారిన విషయాలను ఆ పౌరాణికుడు విశదీకరిస్తూంటే బృందావన దర్శనాభిలాష ప్రబలంగా కలిగింది.*
*యమునా తీరానికి వెళ్ళాలని కృష్ణుడు లీలలు ప్రదర్శించిన ప్రదేశాలన్నింటినీ చూడాలని రాధాకృష్ణుల విహార భూమిలో సంచరించి జీవితాలను చరితార్థం చేసుకోవాలని బలమైన ఆకాంక్ష కలిగింది. ఆ ఊళ్ళో ఉన్న చాలామందికి కూడా అటువంటి కోరిక కలగటం వల్ల అంతా ఒక బృందంగా ఏర్పడ్డారు. ఆ పౌరాణికుడు కూడా సకుటుంబంగా వీరితో బయలుదేరాడు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 55 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*
*శ్లో॥ ఆరాధ్యో భగవాన్ ప్రజేశతనయః తద్దామబృందావనం రమ్యా కాచి దుపాసనా ప్రజవధూవర్గేణ యాకల్పితా*
*శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమాపుమర్థోమహాన్ శ్రీ చైతన్య మహాప్రభోర్మత మిదం తత్రాదరో నః పరః*
*దేవతలందరిలో ఆరాధించతగినవాడు పరమేశ్వరుడైన కృష్ణుడు ఒక్కడే. ఆయన స్వస్థలం బృందావనము. ఆ జగన్నాధుని ఉపాసించే మార్గాలలో వ్రజకాంతలు అనుసరించిన మధురభక్తి మార్గం శ్రేష్ఠమయినది. మానవుడు సాధించవలసిన పురుషార్థములలో నాలుగు పురుషార్ధములయిన ధర్మార్థ కామమోక్షములను మించిన అయిదవ పురుషార్ధము ప్రేమ అది బృందావనములో మాత్రమే సాధ్యము. ఈ ప్రేమ సిద్ధాంతమునకు శ్రీ మద్భాగవతములో దశమస్కంధము ప్రమాణం.*
*ఇది చైతన్య మహాప్రభువు మతము. దీని యందు మాత్రమే మాకు ఆదరము. ఈ విధంగా ఆ పౌరాణికుడు బృందావనయాత్ర అంతా కృష్ణగాథలు చెప్పి ప్రయాణశ్రమ అంతగా లేకుండా చేశాడు. యోగేశ్వరి, వాళ్ళ అమ్మ, చెల్లెలు బృందావనం చేరుకొన్న తరువాత అక్కడి విశేషాలన్నీ దర్శించారు. యాత్రికులందరూ కలసి స్థానికంగా ఉన్న రాధాకృష్ణ లీలాఘట్టాలన్నింటినీ చూచారు. హరిదాస్మహారాజ్ కోసం అవతరించిన బాంకే బిహారీ ఆలయం, అలానే రూపగోస్వామి సమాధి దగ్గర ఉన్న రాధామోదర మందిరం. సనాతనగోస్వామి పూజించిన మదనమోహనుని ఆలయం ఇటువంటివన్నీ వారు దర్శించారు. కృష్ణుని మునిమనుమడైన వజ్రుడు కృష్ణుని బాల్యదశను, యౌవనాన్ని, చివరి పరిణత దశను సూచించే విగ్రహాలతో నిర్మించిన మూడుదేవాలయాలను చూచినప్పుడు ఆనందకరమైన అనుభూతి కలిగింది.*
*రాధాసుధానిధి గ్రంథకర్త హితహరివంశ మహారాజ్ సశరీరంగా గాలిలో కలిసిపోయి రాధాసఖిగా మారిన ప్రదేశం చూచినప్పుడు అందరికీ ఒళ్ళు పులకించింది. యమునకు రెండవ వైపు రాధాకృష్ణుల వివాహం జరిగిన భాండీరవనం, వేణుకూపం, లక్ష్మీదేవి తపస్సు చేసిన బిల్వవనం, అన్నిటికంటె 5000 ఏండ్లనాటి శ్రీకృష్ణుని వేణునాదాన్ని రాధాదేవి పాదనూపురశింజితాలను వినిపించే వటవృక్షం దిగ్భ్రాంతిని పరవశత్వాన్ని కలిగించింది. ఆ మర్రిచెట్టు బోదెకు చెవి ఆనిస్తే దివ్యనాదం వినిపించడం మహాద్భుతమైన సన్నివేశం.*
*అదే విధంగా బృందావనానికి 50, 60 కిలోమీటర్ల పరిధిలో కృష్ణుడు యశోదకు విశ్వరూపాన్ని చూపిన బ్రహ్మాండఘాట్, స్నేహితులతో కలిసి ఆడుకున్న 'రమణరేతి' రాధాకృష్ణులు సృష్టించిన రాధాశ్యామకుండాలు, రాధాదేవి అవతరించిన రావల్ గ్రామంలోని పవిత్రస్థలం, పెరిగిన బర్సానా కొండమీది ఆలయం ఇవన్నీ భక్తులను ద్వాపర యుగాంతానికి తీసుకు వెళ్ళినాయి. అందరికీ ఆశ్చర్యం కలిగిన అంశం ఏమిటంటే బలరామ కృష్ణులు, గోపకులు మొదట ఉన్న గోకులానికి తరువాత చేరిన బృందావనానికి, కృష్ణుడు లీలలు చూపిన మిగతా స్థలాలకు మధ్యలో చాలా దూరాలున్నాయి. ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కృష్ణుడు నిద్రలేచి యమునలో స్నానం చేయటానికి ఒక 30 కి.మీ. మిత్రులతో కలసి చద్దన్నం తినటానికి మరొక వైపు 40కి.మీ. ఆవులను మేపటానికి ఇంకో 50 కి.మీ. రోజు మొత్తం మీద షుమారు 150 కి.మీ. నడచినట్లు కన్పిస్తుంది. కృష్ణుడు మన్నుతింటున్నాడని గోపకులు ఒక 40 కి.మీ. వెళ్ళి ఇంట్లో ఉన్న యశోదకు చెపితే ఆమె రెండు నిమిషాలలో అక్కడకు నడిచివచ్చి కృష్ణుని మందలించి అతడు చూపిన విశ్వరూపానికి దిగ్రమచెంది మరల కృష్ణుని మాయలోపడిపోయి మామూలు మనిషిలాగా ఇంటికి వెళ్ళింది. అంటే సర్వశక్తి సంపన్నుడయిన కృష్ణుడేగాక పిల్లలు, వృద్ధులు కూడా ప్రతిరోజూ ఒక 100 కి.మీ. నడవటం సహజంగా ఉండేదన్నమాట. దీనిని బట్టి వాళ్ళ శరీర ప్రమాణాలు బలదార్థ్యాలు ఊహించవచ్చు.*
*ప్రసిద్ధయోగిని ఆనందమాయి మహనీయుడైన దేవరహాబాబా అనుగ్రహం వల్ల తానుద్వాపరయుగ జీవులను చూచానని వారు 18 నుండి 20 అడుగుల ఎత్తులో ఉన్నారని చెప్పింది. ఇటీవల ఇంటర్నెట్లో జి.సుబ్రహ్మణ్యం అన్నపరిశోధకుడు "Bhima's son Gadotkach - Like Skeliton found" అన్న శీర్షిక క్రింద లిఖించిన విషయాన్ని బొమ్మలను చూస్తే దానిలో భారత సైన్యము చేత రక్షితమైన ఒక ఎడారిలో బ్రహ్మాండమైన మానవుని అస్థిపంజరము బయటపడిందని దాని పొడవు షుమారు 30-40 అడుగులుందని, ప్రపంచంలో ఇంతటి పెద్ద మానవ అస్థిపంజరం ఇంతవరకూ దొరకలేదని చెప్పబడింది. భీముని పుత్రుడైన ఘటోత్కచునిది అయి ఉండవచ్చునని ఆయన ఊహ. ఇటువంటి సాక్ష్యాలను బట్టి అప్పటి మానవులు మన ఊహకందని దీర్ఘశరీరాలు కలిగి ఉండేవారని భావించవచ్చు. బృందావన ధామంలో ఇప్పటికి సుమారు 500 సంవత్సరాల క్రితం జీవించిన రూపగోస్వామి సనాతనగోస్వామి మొదలైన మహనీయుల సమాధులు అత్యంత స్ఫూర్తిదాయకములు. వాటి సన్నిధిలో ధ్యానము చేస్తే ఎవరికైనా దివ్యానుభవాలు కలగటం సహజం.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 56 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*
*యోగేశ్వరి నెమ్మది నెమ్మదిగా బృందావనం వైపు ఎక్కువ ఆకర్షించబడింది. బంగారు రంగుతో లోకోత్తర సౌందర్యవతిగా రూపుదిద్దుకొన్న ఆ బాలిక బృందావన ధామంలోని ఆకర్షణతో రాధాకృష్ణ రస ప్రపంచంలో మునిగిపోయింది. యాత్రకు వచ్చిన వారి సహకుటుంబీకులు ఆప్తులు అందరూ తిరిగి వెళ్ళటానికి ఉద్యుక్తులవుతున్న దశలో వీరు మాత్రం మరి కొంతకాలం బృందావనంలో ఉందామని నిశ్చయించు కొన్నారు. బెంగాలు నుంచి అప్పుడప్పుడు యాత్రికుల బృందాలురావటం అలవాటు గనుక వెళ్ళాలని అనిపిస్తే అటువైపు వెళ్ళే మరో బృందంతో వెళ్ళవచ్చునని అనుకొన్నారు. పెళ్ళీడుకు వచ్చింది. అమ్మాయికి పెళ్ళి చేయాలన్న ఆలోచన తల్లికి ఉన్నా యోగేశ్వరి ఎంత మాత్రం అంగీకరించటం లేదు. తాను సన్యాసిని అవుతానని తనకు విషయ సుఖములయందు ఆసక్తి లేదని తల్లితో ఎప్పుడూ అంటూండేది.*
*కాలం ఇలాగడుస్తూండగా ఒకనాడు రూపగోస్వామి సమాధిమందిరం దగ్గర ఒక మహనీయ వ్యక్తిని యోగేశ్వరి దర్శించింది. మధ్యవయస్కుడుగా ఉన్న ఆవ్యక్తికి అక్కడి పిన్నలు, పెద్దలు అందరూ సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. ఎవరీయన అని తెలిసిన ఒకవృద్దుని అడిగితే ఆయన ఇలా అన్నాడు “అమ్మా! ఆయన ఎవరో ఎక్కడివారో ఎవరికీ తెలియదు. నా చిన్నప్పుడు సుమారు 80 సంవత్సరాల క్రింద మొదటిసారి ఆయనను చూచాను. అప్పుడూ ఇలానే ఉన్నాడు. మహా పురుషుడైన రూపగోస్వామికి స్నేహితుడని అందరూ చెప్పుకోనేవారు. అంటే ఇప్పుడు ఆయన వయస్సు 300 సంవత్సరాలు పై బడి ఉంటుంది. బృందావన ధామంలో ఎప్పుడోగాని ఇటువంటి మహాత్ములురారు. అందరూ ఆయనను 'కాళీయోగి' అంటారు. కాళీదేవి అనుగ్రహం వల్ల దీర్ఘాయువును అద్భుతశక్తులను సాధించాడని చెపుతారు” అందరితో పాటు యోగీశ్వరి కూడా వెళ్ళి ఆయన పాదములకు మ్రొక్కింది.*
*ఆయన తలెత్తి చూచి చిరునవ్వుతో యోగేశ్వరీ ! బాగున్నావా ? అని తెలిసినవానివలె పలకరించాడు. తన పేరాయనకు ఎలా తెలుసు ?ఈ అమ్మాయికి ఆశ్చర్యం కలిగింది. ఆయన చూపులో మాటలో చిరకాలంగా తెలిసినవాడు పలకరించిన తీరు కనిపించింది. జనం చాలా మంది ఉండటం వల్ల అప్పుడు ఆయనతో మాట్లాడే అవకాశం కలుగలేదు. ఆ రోజు రాత్రి ఎంత సేపయినా సరే ఉండి ఆయనతో మాట్లాడాలని వేచి ఉన్నది. అందరూ కదిలి వెళ్ళేసరికి చాలా ఆలస్యమైంది. అయినాసరే పట్టుదలతో దృఢసంకల్పంతో ఉన్నది. చివరికాయన లేచి తన వసతిగదిలోకి వెడుతూ ఈ అమ్మాయివైపు ఒక్కసారి చూచి మాట్లాడకుండా లోపలకు వెడుతున్నాడు. ఆయన పొమ్మనలేదు, అన్న ధైర్యంతో ఆయన వెంట లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఆయన ఒక ఆసనం మీద కూర్చున్నాడు. ఆయన పాదములకు నమస్కరించి చేతులు కట్టుకుని ఎదురుగా నిల్చున్నది. అప్పుడాయన ఇలా అన్నాడు.*
*కాళీయోగి : యోగేశ్వరీ ! నీకేం కావాలి ? చాలాసేపటి నుండి వేచి ఉన్నావు.*
*యోగేశ్వరి : స్వామీ! నాకేం కావాలో నాకు తెలియదు. మీరు కాళీదేవి అనుగ్రహం వల్ల సిద్ధశక్తులు సాధించారని కొన్ని వందల ఏండ్ల నుండి జీవిస్తున్నారని విని, మీతో మాట్లాడాలని అనిపించింది. కొత్తగా వచ్చిన నన్ను పేరుతో పలకరించారు. నే నెవరో మాములుగా మీకు తెలిసే అవకాశం లేదు. చిన్నపిల్లను గనుక నన్ను ఎవరూ పరిచయమూ చేయలేదు.*
*కాళీయోగి : నేను ఎవరి గురించి తెలుసు కోవాలనుకుంటే వారి గురించి తెలుస్తుంది. నిన్ను చూడగానే చాలాకాలం నుండి, అంటే కొన్ని వందల ఏండ్ల నుండి నిన్నెరుగుడు సన్న స్మృతి వచ్చింది.*
*యోగేశ్వరి : స్వామీ ! నన్నంతగా ఎరిగిన మీరెవరు ? నేనెవరు ?*
*యోగి : తెలియవలసిన సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తున్నది. ఈపూటకు ఇంటికి వెళ్ళు. తరువాత కలువవచ్చు.
యోగేశ్వరి : నాకు మళ్ళీ దర్శనమెప్పుడు అనుగ్రహిస్తారు ?*
*యోగి : రేపు రూపగోస్వామి ఆరాధన. అతడు నా చిరకాల మిత్రుడు. చాలా కాలం తరువాత అతనిని చూడాలని సమాధిలో ఉన్న అతనిని పలుకరించాలని వచ్చాను. అందువల్ల రేపు పగలంతా అక్కడ కార్యక్రమంలో మునిగి ఉంటాను. రేపు కూడా ఇదే సమయానికి రా. ఆమె నమస్కరించి వెళ్ళిపోయింది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 57 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*
*యోగేశ్వరి మర్నాడు సాయంకాలం తాను వెళ్ళేసరికి సమావేశం జరుగుతున్నది. అందులో కాళీయోగి ప్రధానస్థానంలో ఆసీనుడై ఉన్నాడు. గౌడీయమఠ సన్యాసులు రూపగోస్వామిని గూర్చి, ఆయన గ్రంథాలను గురించి ప్రసంగాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమం ఇంకా చాలా సేపు పట్టేట్లుంది. జనసమ్మర్ధం వల్ల కాళీయోగి దగ్గరకు కూడా పోవటానికి వీలులేకపోయింది. ఈ సమావేశం గురించి ఆయనకు ముందుగా తెలియదా? అలా అయితే తనను ఎందుకు రమ్మన్నట్లు ?*
*ఏమీ తోచక నిరాశతో సభలో చిట్టచివర ఒక స్తంభాన్ని అనుకొని కూర్చుంది. ఇంతలో కాళీయోగి తన వైపే చూస్తున్నట్లు అనిపించింది. నిజమే ! ఆయన తనవైపు నిశ్చలంగా నిర్నిమేషంగా దయతో చూస్తున్నాడు. తన కన్నులు మూతలు పడ్డవి. నిద్రవంటి స్థితి వచ్చింది. ఏ ఉపన్యాసమూ వినిపించటం లేదు. ఎవరూ కనిపించటం లేదు. నిశ్శబ్ద, నిరామయ ప్రకృతి ఆ చీకట్లను చీల్చుకొంటూ నెమ్మదిగా కాంతిరేఖలు వస్తున్నవి. అవి పెరిగి పెద్దవయి ఒక వెలుగు ముద్దవలె మారింది.*
*ఆ మధ్యలో ఉన్నట్లుండి 8 అడుగుల ఎత్తున్న కాళీవిగ్రహం కన్పిస్తున్నది. ఎర్రని నాలుకతో నెత్తురు కారుతున్న మనుష్యుల తలల మాలలతో ఖడ్గధారియైన కాళీమూర్తి దర్శనమిచ్చింది. ముందు కాసేపు శిలారూపంవలె కన్పించినా చూస్తుంటే ప్రాణమున్న మనిషివలె కన్పిస్తున్నది. ఆమె ముందు నిలబడి కాళీయోగి స్తోత్రం చేస్తున్నాడు.*
*దిగంబరాం దివ్యకళాభిరామాం దృజ్మండలాచ్ఛాదిత దీప్తి భీమాం శ్యామాం శ్మశాన స్థలభోగధామాం కాళీం మహాకాళసఖీం భజామి.*
*దేదీప్యమానోజ్జ్వల శక్తి చండాం ధృతసిశూలో గ్రకపాలకుందాం. త్రినేత్ర ఫాలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి.*
*స్వయంభూకాళీ దృగ్దరహసిత సౌందర్యనిధయే నమస్తే శ్రీరాధా మధుర మధురానంద నిధయే బహూనాం జన్మాంతే స్ఫురణ మివవిస్తారమతయే మహిమ్నః పారంతే జనని ! నవిజానామి సదయే !*
*కాళి ! కరాళి ! కపాలిని ! భైరవి ! కాత్యాయని ! కలికుండ నివాసిని యోగేశ్వరి ! వరభోగదాయినీ ! రక్ష రక్ష ! కరుణామయి! కాళీ !*
*స్తుతి కాగానే కర్పూరహారతి ఇచ్చి ఆమె కన్నులవైపే చూస్తున్నాడు. ఇంతలో ఆమె ఆకృతి భీషణమైన మూర్తి నుండి పరమసుందరమైన ప్రేమరూపిణిగా మారింది. ఆమె అతనితో 'అదిగో అమ్మాయి యోగేశ్వరి వచ్చింది' అన్నది తాను ముందుకు వెళ్ళి జగన్మాతకు, కాళీయోగికి పాదనమస్కారం చేసి నిల్చున్నది. కాళీయోగి చిరునవ్వుతో "చాలాకాలం తరువాత జగజ్జనని దయవల్ల మళ్ళీ నా దగ్గరకు రాగలిగావు. దేవి కరుణవల్ల నీ భవిష్య జీవితం కొత్త మలుపు తిరగబోతున్నది" అన్నాడు. ఇంతలో ఆ దృశ్యం మొత్తం మాయమయింది.*
*మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి చూస్తే కాళీయోగి తన వైపే చూస్తున్నట్లుగా అనిపిస్తూనే ఉన్నది. ఎదురుగా ఉన్న ప్రేక్షకులకు ఆయన ఎవరిని చూస్తున్నదీ తెలియటం లేదు. నిర్దిష్ట లక్ష్యం ఉన్నట్లు గోచరించటం లేదు. యోగశాస్త్రంలో అంతర్లక్ష్యము, బహిర్డృష్టి ఉన్న శాంభవీముద్ర ఇదే అన్నట్లుగా ఉన్నది. ఆమె కిప్పుడు కొంత అర్థమయింది. తనకు ఈ కాళీదేవితో ఏదో జన్మాంతర బంధమున్నది. బృందావనముతో రాధాకృష్ణులతో ఏదో అనుబంధమున్నట్లు ఇదివరకు అనిపించేది. ఇప్పుడూ ఆ భావన నిలిచే ఉన్నది. కానీ కాళీదేవితో మరింత దృఢమైన బంధమున్నట్లున్నది. సిద్ధుడైన కాళీయోగి ఇంతమంది జనం మధ్యలో ఉన్నా, తనకొక ప్రత్యేకమైన అనుభవాన్ని ప్రసాదించాడు. ఈ పూటకు ఇంక ఇంటికి వెళతాను. ఈ సమావేశం ఇంకా చాలాసేపు పడుతుంది. రేపు వచ్చి మళ్ళీ స్వామి దర్శనం చేసుకొంటాను. స్వామికి దూరం ఉండే నమస్కరించి ఆమె ఆ పూటకు ఇంటి వెళ్ళింది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 58 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*
*యోగేశ్వరి మరునాడు సాయంకాలం మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళేసరికి కాళీయోగి బయటకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్లు కన్పించింది. వారితో పాటు వారి పరివారము కొద్దిమంది బయలుదేరుతున్నారు. ఎక్కడికి వెడుతున్నారని నెమ్మదిగా పరివారంలో ఒకరిని అడిగింది. సనాతనగోస్వామి సమాధిదగ్గరకు, హితహరివంశ మహరాజ్ అదృశ్యమైన స్థలానికి వెడుతున్నట్లు చెప్పబడింది. వారితో పాటు తానుకూడా అక్కడికి వస్తానని అభ్యర్థించగా యోగి సరేనన్నాడు. ఆ రెండు చోట్లకూడా, పూర్వమహానీయులతో వారు మాట్లాడుతూనే ఉన్నట్లున్నది. అక్కడ నుండి మళ్ళీ రూపగోస్వామి సమాధిమందిరానికి వచ్చిన తరువాత శిష్యులంతా నమస్కరించి వెళ్ళిపోయినారు. యోగేశ్వరి ఒక్కతే మిగిలి ఉన్నది. యోగి విశ్రాంతిగా కూర్చున్న తరువాత, ఆమె నిన్న తాను పొందిన దర్శనాన్ని గూర్చి అడుగుదామని అనుకొంటూ ఉండగా యోగి ఇలా అన్నారు.*
*యోగి : అమ్మా ! నిన్న నీవు పొందిన అనుభవాన్ని గూర్చి అడగాలని అనుకొంటున్నావు. రాధాభక్తురాలివయిన నీకు కాళీదేవితో జన్మాంతర బంధం ఉండటం వల్ల నీకా అనుభూతి ఇవ్వబడింది. నీవు దర్శించిన కాళీదేవి విగ్రహం ఇక్కడకు కొన్ని వందల మైళ్ళ దూరంలో ఒక మహారణ్యంలోని నా ఆశ్రమంలో ఉన్నది. బృందావనంతోను ఇంతకముందు ఇక్కడ జీవించిన గోస్వాములతోను, భక్తులతోను ఉన్న అనుబంధం వల్ల వారు భౌతికశరీరాలతో ఉన్నప్పుడు ఏర్పడిన మైత్రిని పురస్కరించుకొని, వారు పాంచభౌతిక శరీరాలు విడచిపెట్టినా రాధాదేవి పరివారంలో మంజరులుగా మారిపోయినారు. నాకు దీర్ఘాయువు ఉండటం వల్ల ఇక్కడకు వచ్చి వారిని పలకరిస్తుంటాను. కాళీదేవి అనుగ్రహంవల్ల ఇప్పటికి కొన్ని వందల సంవత్సరాల నుండి జీవించియున్నాను. ఇక్కడి పెద్దల వల్ల నీవూ కొంతవిన్నావు. నీకు నిన్న ఇవ్వబడిన అనుభూతి కాళీదేవి యొక్క అనుగ్రహము నీలో పునర్వికసిత మవుతున్నదనటానికి గుర్తు. నిన్ను ఎన్నో జన్మలనుండి ఎరుగుదును. నీ వెవరో నీకు సంబంధించిన వివరాలు నీవే తెలుసుకొంటే నీకు సంతృప్తి కరంగా ఉంటుంది. ఆ స్థితి రావటానికి నీవు తీవ్రతపస్సు చేయాలి. వేగంగా రావాలంటే తాంత్రిక సాధనలు చేయాలి. అదినీ సంకల్పం మీద, భగవతి మహాకాళి కృపమీద ఆధారపడి ఉన్నది. నేనింక రెండు రోజులలో ఇక్కడ నుంచి బయలుదేరి వెడుతున్నాను. నీ మార్గం నిశ్చయించుకోవలసినదానిని నీవే.*
*యోగేశ్వరి : మీ మాటలు వింటూంటే నాలో ఏదో కొత్తమార్పు వస్తున్నది. నేను ఆలోచించుకొని రేపు మీ దర్శనానికి వస్తాను. మీ కరుణాకటాక్షములు నామీద ప్రసరించాలని ప్రార్థిస్తున్నాను.*
*యోగి : తథాస్తు.*
*యోగీశ్వరి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా ఎడతెగని ఆలోచనలు. "ఇప్పుడు నేనేమి చేయాలి ? కాళీయోగి ఇచ్చిన అనుభూతివల్ల ఆయన మాటల వల్ల తెలియని దివ్యలోకాల తలుపులు తెరుచుకొంటున్నవి. మొదటి నుండి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతస్థానం సాధించాలన్న తపన లోలోపల అగ్నిజ్వాలవలె రగులుతున్నది. దానిని సాధించాలంటే కఠోర తపస్సాధన చేయాలి. వయస్సు వచ్చింది కనుక పెళ్ళికి ఇప్పటికే ఆలస్యమయిందని అమ్మ గొడవ చేస్తున్నది. ఇంట్లో ఉంటే ఎక్కువకాలం పెళ్లిని ఆపటం సాధ్యం కాదు. కనుక గార్హస్థ్యబంధంలో ఇరుక్కోకుండా తాను సిద్ధయోగినిగా మారాలి.*
*బృందావన ధామంలో అనన్యమైన రాధాకృష్ణభక్తి మార్గాన్ని తప్ప మరొకదానిని గూర్చి ఇక్కడి భక్తులు ఆలోచించరు. మంత్రశక్తుల యందు దీర్ఘాయువు నందు తాంత్రికసాధనల యందు ఇక్కడ ఆశ్రమాధిపతులకు గాని వారి శిష్యులకు గాని ఆసక్తి లేదు. నాకు రాధాకృష్ణుల యందు భక్తి ఉన్నది. కానీ దానితో పాటు సిద్ధులయందు కూడా మోజు ఉన్నది. ఆ కాళీయోగి ఎప్పటివాడో ? 300 ఏండ్లు దాటుతున్నా ముసలితనం రాలేదు. నేను కూడా ఆ విధంగా దీర్ఘాయురారోగ్యములు సాధించగలనా ?*
*జరాభారంపైన పడకుండా ఆపగలనా? ఇవన్నీ సాధించాలంటే సిద్ధుడైన గురువు యొక్క సహాయం లేకుండా సాధ్యంకాదు. కన్పిస్తున్నంతలో ఒక్క కాళీయోగి మాత్రమే చేయగలిగిన పని ఇది. కనుక నా జీవిత లక్ష్యం నెరవేరాలంటే ఆయనతో వెళ్ళాలి. వారి ఆశ్రమంలో వారి నీడలో ఉండి, ఆయన అనుగ్రహంతోనే ననుకొన్నది సాదించాలి. ఒకసారి ఆయనతో వెళ్ళిపోతే తిరిగి ఎప్పటి రాగలనో, చెప్పకుండా వెడితే ఏమయినానో ! అని అమ్మ దిగులు పడుతుంది. చెప్పితే పోనీయరు” ఇలా పరిపరివిధాల ఆలోచించి ఆమె ఒక నిశ్చయానికి వచ్చింది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 59 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*
*యోగేశ్వరి మరునాడు ప్రొద్దునే లేచి యమునలోస్నానం చేసి వచ్చింది. బృందావనంలోని రాధాకృష్ణ మందిరాలకు వెళ్ళి నమస్కరించింది. మహనీయులైన యోగుల సమాధుల దగ్గరకు వెళ్ళింది. యమునాతీరాన సతీదేవి యొక్క కేశములు పడినచోట కేశకాళీమందిరము ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆ దేవతను చూచి "అమ్మా ! నీ దయకోసం బయలుదేరుతున్నాను. నాకు విజయాన్ని ప్రసాదించు" అని వేడుకొన్నది. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని, సాయంకాలం రాధాదామోదర మందిరానికి వెళ్ళి కాళీయోగి అక్కడి నుండి ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో విచారణ చేసింది. ఆ రాత్రి తెల్లవారుజామునే వెడతారని అక్కడి ఆశ్రమ నిర్వాహకులు చెప్పారు.*
*కాళీయోగి దర్శనానికి వెడదామని నాలుగడుగులు ముందుకు వేసి మళ్లీ ఆగింది. పునరాలోచన ఇప్పుడు వారి దగ్గరకు వెళ్ళి నన్ను మీతో తీసుకు వెళ్ళండి అంటే వారు అంగీకరిస్తారో అంగీకరించరో ! ఇంటి పెద్దల అనుమతి లేకుండా - వారితో ప్రయాణానికి ఒప్పుకోక పోతే ఇక తన జీవితమింతే. కనుక ఇప్పుడాయన దగ్గరకు వెళ్ళకుండా తెల్లవారు జామున ఆయననుసరించి ఊరుదాటి కొంతదూరం వెళ్ళిన తరువాత ఆయనను కలసి కాళ్ళమీదపడి ప్రార్థించాలి, అని నిశ్చయించుకొన్నది.*
*గుడిలో ఒక్క తాటాకు గంటము తీసుకొని నేను తపస్సు చేసుకోవటానికి వెడుతున్నాను. నా కోసం వెతకవద్దు దిగులు పడవద్దు. వీలైనంత త్వరలో నేనే తిరిగి వస్తానని వ్రాసి ఘంటము తిరిగి ఇచ్చి వేసి ఆ తాటాకును వస్త్రములో దాచుకొని ఇంటికి వెళ్ళింది. రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత రాత్రి మూడవ జాము సగపడగానే లేచి పూజామందిరంలో రాధాకృష్ణుల ముందు ఆ తాటాకు పెట్టి దానిపై చిన్న బరువు పెట్టి నెమ్మదిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. కట్టుకొన్న బట్టలు దప్ప ఏ వస్తువూ ఆమె దగ్గర లేదు. రాధాదామోదర మందిరానికి ఆమె చేరుకొని లోపలకు వెళ్ళకుండా దూరంగా ఒక అరుగు మీద కూర్చున్నది. బ్రాహ్మీ ముహూర్తంలో కాళీయోగి బయటకు వచ్చారు.*
*ఆశ్రమం పెద్దలు ఆయనకు వీడ్కోలు చెప్పి నాలుగడుగులు వేసిన తరువాత వారి నాగిపొమ్మని ఆయన ఒక్కడే బయలుదేరాడు. చిత్రం ఆయన చేతిలోనూ ఏ సామానులేదు. ఆయన కొంత దూరం వెళ్ళిన తరువాత, జాగ్రత్తగా ఆయనను అనుసరిస్తూ యోగేశ్వరి నడవటం మొదలు పెట్టింది. బృందావనధామం దాటారు. తెలతెలవారుతున్నది. త్రోవలో ఒక కదంబవృక్షం దగ్గర ఆయన ఆగాడు. వందగజాల దూరంలో ఉన్న యోగేశ్వరికి అమ్మా ! నీవు దగ్గరకురావచ్చు అన్న కాళీయోగి మాట విన్పించింది. ఆయన గొంతు తనకు తెలిసినదే. వెనుకకు తిరుగకుండా వెడుతున్న ఆయోగి తనరాకను గుర్తించాడన్న మాట. గబగబా నడుచుకుంటూ ఆయన దగ్గరకు వెళ్ళి కాళ్ళ మీదపడింది.*
*"లే! యోగేశ్వరి ! చాలా దూరం శ్రమపడినడచి వచ్చావు. ఇంట్లో చెప్పకుండా బయలుదేరి సాహసం చేశావు. నాతో చెపితే వద్దంటానేమోనని వెంటవచ్చావు. సమస్త బంధాలు పరిత్యజించి భగవంతుని అన్వేషిస్తూ ఏకాంతంగా కదిలిపోయే భక్తుని వలె నన్ను నమ్మి నావెంట వచ్చావు. నీ నమ్మకం వ్యర్ధంకాదు. ఇక్కడికి మన ఆశ్రమం కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నది. స్నానం చేసి దేవతార్చన చేయవలసిన సమయం సమీపించింది. మామూలుగా నడచి వెళ్ళటం, అశ్వవృషభాదివాహనాల మీద వెళ్ళటం ఈ అడవులలో కుదరదు. చేయి పట్టుకొని కండ్లు మూసుకో అన్నాడు కాళీయోగి. ఆమె ఇలా అన్నది "స్వామీ! నే నిప్పుడు మార్జాలకిశోర స్థితిలో ఉన్నాను. నేను మీ చేయిపట్టుకొంటే మర్కట కిశోర న్యాయమవుతుంది. మీరే నాచేయిపట్టుకుంటే నాకు ధైర్యం ఎందుకంటే మీరు చెప్పిన దాన్నిబట్టి ఏగాలిలోనో తేలుతూపోతే నేను గట్టిగా మిమ్ముపట్టుకోలేక పోతే నేనే అఖాతంలోనో పడి పోతాను. దిక్కులేని దానిని, మీరే దిక్కని నమ్మి వచ్చాను".*
*కాళీయోగి కొంచెం ఆశ్చర్యంగా ఆమె వైపు చూచి, చిరునవ్వు నవ్వి 'అలాగే' అంటూ ఆమె చెయ్యిపట్టుకొని "యోగేశ్వరీ! మనందరికీ దిక్కు కాళీదేవియే. నీకే ఆపదా రాదు”. అన్నాడు. ఆమె "స్వామి! మీ రనుగ్రహిస్తే ఒక అభ్యర్ధన, కండ్లు మూసుకోమని అన్నారు కండ్లు తెరచి మీ వేగాతి వేగగమనాన్ని చూడాలని కోరికగా ఉన్నది. మీరు నా చేయి పట్టుకున్నారు కనుక నాకే ప్రమాదం రాదని ధైర్యంగా ఉన్నది అన్నది. యోగి ఇలా అన్నారు "అమ్మా చిన్నతనంలో తల్లి చెయ్యిపట్టుకొని బిడ్డకు నడక నేర్పుతుంది. తరువాత తండ్రి చెయ్యి పట్టుకొని పాఠశాలకు తీసుకువెళ్తాడు. ఆపైన భర్త చెయ్యిపట్టుకొని జీవితంలో నడిపిస్తాడు. నీ విప్పుడు రెండవ దశలో ఉన్నావు పద".*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 60 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*
*కాళీ యోగి, యోగేశ్వరి గగన వీధులలో భూమికి కొంచెంపైన వాళ్ళు వెడుతూంటే కింద అడవులు కొండలు గుట్టలు, నదులు, సరస్సులు, గ్రామాలు, పట్టణాలు ఎన్నో వెనుకకు వెళ్ళుతున్నవి. వారు వెడుతున్న ఆ మహావేగం ఆశ్చర్యకరంగా ఉన్నది. అస్త్రమంత్రాలతో అభిమంత్రించిన బాణాలు వెళ్తున్నట్లుగా వాళ్ళిద్దరూ వెళుతూంటే మబ్బులు విచ్చుకొని త్రోవ ఇస్తున్నట్లుగా ఉన్నది. ఆకాశంలో ఉన్న పక్షులు వీరి గమనాన్ని తెలుసుకో గలిగినట్లు లేదు. బహుశా అదృశ్యంగా ఉన్నారేమో. సూర్యోదయం అవుతూ ఉండగా ఒక అరణ్య ప్రదేశంలో భూమిమీద దిగారు. అడవిబాటగుండా ఆయన నడుస్తూ ముందుకు వెళుతున్నాడు.*
*ఇంతలో ఒక పెద్దపులి గాండ్రిస్తూ వచ్చింది. దాని ముందుగానే ఏమీ మాట్లాడకుండా ఆయన నడుస్తూ వెళ్ళాడు. ఆయన వెంట యోగేశ్వరి - ఆ పులి నిశ్శబ్దంగా నిల్చున్నది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తరువాత ఎటు చూచినా పెద్ద పెద్ద పాముపుట్టలు. కొన్ని మహాసర్పాలు పడగ విప్పి చూస్తున్నవి. నెమ్మదిగా నడిచి ఆశ్రమంలోకి ప్రవేశించారు. అక్కడ ఏమనుష్యుల అలికిడీ లేదు ఒక కుటీరము ఒక దేవతా మందిరము కొండరాళ్ళతో గుహవలె కనిపిస్తున్న ఆ మందిరంలోకి ప్రవేశించగానే లోపల ఎనిమిదడుగుల ఎత్తైన కాళీదేవి యొక్క భీషణ విగ్రహం ప్రకాశిస్తున్నది. దాని ముందొక హోమకుండం వెలుగుతున్నది.*
*కాళీదేవికి ఆయనతో పాటు తాను కూడా నమస్కరించింది. ఆయన మౌనంగా కొద్ది దూరంలో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్ళి స్నానం చేశాడు. ఆమె కూడా స్నానం చేసింది. కుటీరానికి తిరిగి వచ్చిన తరువాత ఆయన “అమ్మవారికి అలంకరించిన చీరలు లోపల ఉన్నవి. వాటిని నీవు ధరించవచ్చును” అన్నాడు ఆమె లోపలకు వెళ్ళి తడిబట్టలు విప్పి చీరను మార్చుకు వచ్చింది.
ఆమె సిద్ధమై వచ్చేసరికి ఆయన పూజకు సిద్ధంగా ఉన్నాడు. ఎవరో అమర్చినట్లు పూజావస్తువులన్నీ అక్కడ ఉన్నవి. కాళీదేవికి శాస్త్రోక్త విధానంగా పూజచేసి ఎదురుగా ఉన్న హోమ కుండంలో కొన్ని ప్రత్యేకద్రవ్యాలతో ఆయన ఆహుతులు వేశాడు. పూజ, హోమము ఇంచుమించు రెండు గంటలు పట్టింది.*
*మరికొంతసేపు గంభీర కంఠంతో ఆయన, కాళీ స్త్రోత్రాలను పారాయణ చేశాడు. కొద్దిసేపు ధ్యానం చేసి "యోగీశ్వరీ! ఈపూటకు, అమ్మవారికి నైవేద్యం పెట్టిన పండ్లు తేనె, మనకు ఆహారం. రేపటి నుండి వంటకు ఏర్పాట్లు జరుగుతవి. ఇక్కడకు చుట్టూ ఉన్న క్రూరజంతువులు, సర్పములు, నిన్నేమీ చేయవు. నిర్భయంగా విశ్రాంతి తీసుకోవచ్చు” అన్నాడు. "స్వామీ! మీరుండగా నాకు భయమన్నది లేదు, మహాపురుషులైన మీపాద సన్నిధిలో నాజీవితం చరితార్థమౌతుంది" అన్నది.*
* ప్రసాదస్వీకారానంతరం కొంత విశ్రాంతి తీసుకొన్న తరువాత సాయంకాలం కలకలం మొదలైంది. కొంత మంది గ్రామీణులు అమ్మవారి దర్శనం స్వామి వారిదర్శనం కోసం వచ్చారు. వస్తూ వస్తూ వంటసామగ్రి, ఆహారపదార్ధాలు కాయగూరలు, పాలు రకరకాల వస్తువులూ తీసుకువచ్చారు. స్వామికి నమస్కరించి ఆయన సంజ్ఞతో ఆ సామాగ్రి అంతా ఆమెకు అప్పగించి కాళీదేవి దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. కాళీయోగి యోగేశ్వరితో "కావలిసిన సామాగ్రి వచ్చింది. ఇకమీద వంట చేసుకొని మామూలు భోజనం చేయవచ్చు రేపటి నుండి నీ సాధన ప్రారంభం అవుతుంది".*
*యోగేశ్వరి: స్వామీ! కావలసిని సామగ్రివచ్చింది. వంట చేస్తాను కానీ ఇక్కడ ఇంతకుముందు పొయ్యి రాజేసిన జాడ కనపడటం లేదు. ఇన్నాళ్ళుగా మీరు ఏమి ఆహారం తీసుకొంటున్నారో అర్ధంగావటం లేదు.*
*యోగి: ఓ అమాయక బాలికా! నాకు ఆహారంతో కాని నిద్రతో కాని పనిలేదు. ఏమయినా తినగలను, ఎంతయినా తినగలను, ఏమీ తినకుండా ఎంత కాలమయినా ఉండగలను. సామాన్య మానవ శరీరాలకు ఉండే ఏ
అవసరమూ నన్ను బాధించదు.*
*యోగేశ్వరి: మహాత్మా! నాకాస్థితి ఎప్పటికీ వస్తుంది?*
*యోగి: వచ్చిన దాకా ఈ ఆహార విహారాదులు అవసరమే కదా!*
*యోగేశ్వరి: నేను వంట చేస్తాను కానీ మీరు భోజనం చేస్తేనే నేను చేసేది.*
*యోగి: అలానే నాకు తీసుకున్నా ఒకటే, తీసుకోక పోయినా ఒకటే. అయినా నీ కోసం తీసుకొంటాను.*
*యోగేశ్వరి: తమ అనుగ్రహము.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 61 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*
*కాళీయోగి: సాధనలో ఒక్క రోజుకూడా వ్యర్థం కారాదు. ప్రతిరోజూ సాధకులకు విలువైనదే. ఈ రోజురాత్రి మొదటి ఝూము గడచిన తరువాత నీకు కాళీ మంత్రాన్ని ఉపదేశించటం జరుగుతుంది. అయితే కాళీసాధన మూడు పద్ధతులు 1. దక్షిణాచారము 2. వామాచారము 3. కౌళము. ఆ మార్గాల గురించి నీవు కొంత విని ఉండవచ్చు. వైదిక ఆచార పద్ధతిలో చేసేది దక్షిణ మార్గము. పంచ మకారాలతో చేసేది వామ మార్గము. పగలు దక్షిణా చారము, రాత్రి వామాచారము చేస్తే కౌళము. ఇవి కాక సమయాచార సిద్దాంత మార్గములు మొదలైనవి ఉన్నవి. నీ అభిరుచిని అనుసరించి సాధన పద్ధతులు అవలంబించవచ్చును.*
*యోగేశ్వరి: అయ్యా! నాకు ఇన్నిమార్గములు ఆచారములు తెలుసుకొన వలసిన కోరికలేదు. నాకున్నదొకటే మార్గము. అది గురుమార్గము. గురువైన మీరే నాకు సర్వస్వం. నన్ను నేను మనసా, వాచా, కర్మణా సర్వార్పణం చేసుకొంటున్నాను. నన్ను ఎలా తీర్చిదిద్దుతారో మీ ఇష్టం. మీ చేతుల లోని బంకమట్టి బొమ్మను నేను. అని ఆయన పాదములపై వ్రాలింది.*
*అనంతరం అయిదు సంవత్సరాల పాటు అవిచ్చిన్నంగా అమె చేత బహు విధములైన సాధనలు చేయించాడు కాళీయోగి, సాధన సమయంలో అప్పుడప్పుడు గ్రామీణులు వచ్చి ఆహారాది పదార్థాలు ఇచ్చివెళ్ళేవారు. అయితే తనకు ఆశ్చర్యము కలిగించిన కొన్ని సంఘటనలున్నవి. అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేక పర్వదినాలలో అద్భుత సౌందర్యవతులైన స్త్రీలు కొందరు వచ్చి రెండు మూడు రోజులుండి వెళ్ళేవారు. అంటే తనవంటి శిష్యురాండ్రు మరికొందరు కూడా కాళీ యోగికి ఉన్నారన్నమాట. వారు కూడా తీవ్రసాధనలు చేసిన వారేనా? ఏమో తెలియదు. వారిని గురించి తాను స్వామివారిని అడుగలేదు. వారు చెప్పలేదు. బయటి ప్రపంచం తో సంబంధం లేకుండా వర్షపంచకము గడిచింది.*
*ఒకనాడు కాళీయోగి ఆమెను పిలిచి కాళీ సన్నిధిలో ఆమెను కూర్చోమని ఇలా అన్నాడు. "యోగేశ్వరీ! ప్రధానమైన సాధనలన్నీ నీ చేత చేయించాను. అపురూపమైన కొన్ని శక్తులు నీకు లభించాయి. వాని వల్ల ప్రపంచానికి ఉపకారం చేయగల కొంతశక్తి నీకు వచ్చింది. నేనీ శరీరాన్ని విడిచి పెట్టవలసిన సమయమాసన్నమైంది. కాళీదేవి ఈ శరీరానికి ఇచ్చిన ఆయువు పూర్తయింది. అయితే, నేను మోక్షానికి వెళ్ళటంలేదు. పరమేశ్వరి ఆజ్ఞను అనుసరించి ఎక్కడ ఎప్పుడు, ఎంతకాలం ఉండవలసివస్తే అంతకాలం ఉంటాను. నీ కర్తవ్యం విను. ఇక్కడ ఏకాకిగా నీ వుండలేవు" అని అంటుండగా యోగేశ్వరి ఆయన వియోగాన్ని ఊహించలేక దుఃఖంతో కంటివెంట అశ్రువులు జాలువారుతుండగా కాళ్ళుపట్టుకొని "స్వామీ! మీరు వెళ్ళవద్దు. మీరులేక నేను జీవించలేను. నేను కూడా ఆత్మహత్య చేసుకొని మరణిస్తాను" అని పెద్దగా ఏడవటం మొదలు పెట్టింది.*
*కాళీయోగి ఆమెను ఓదార్చి “యోగినీ! దేవీ భక్తులకు కన్నీళ్ళు తగవు. శోకాన్ని ఆపుకో. చెప్పేది జాగ్రత్తగా విను. చావుపుట్టుకలు సర్వప్రాణి సహజములు.* *పరమేశ్వరి చేతిలో అందరము ఉపకరణాలము, నీవలన లోకానికి కొంత మేలు చేకూరవలసి యున్నది కనుకనే జగన్మాత నిన్ను నాదగ్గరకు తీసుకు వచ్చింది.*
*అయితే నీలో పరిపూర్ణసిద్ధి వికసించటానికి అయిదుసంవత్సరాలు చాలలేదు. నాకా, ప్రస్తుతం సమయం పూర్తయింది. నేను కొద్దిసేపటిలో కాళీదేవి ముందున్న హోమకుండంలో కూర్చుండి ఇచ్ఛా పూర్వకముగా దహన మవుతాను. నా శరీర చితాభస్మాన్ని నీవుధరించు. ఎప్పుడూ నీకు నేను అండగా ఉంటాను. నా భస్మాన్ని ధరించిన క్షణం నుండి నీవు 'భైరవి' వి. బ్రాహ్మణకాంతవు గనుక 'భైరవీ-బ్రాహ్మణి' అనవచ్చు. ఆపేరే భవిష్యత్లో నిలిచిపోతుంది. నేను దహనమయిన కాసేపటికి ఒక వృద్ధబ్రాహ్మణుడు పొట్టిగా బంగారు రంగుతో ఉన్నవాడు వస్తాడు. ఆయనతో పాటు సన్నగా, పొడవుగా, నల్లగా ఉండే ఆయన కుమారుడు కూడా వస్తాడు. వాళ్ళకు ఆతిధ్య మర్యాదలు ఇచ్చి సత్కారములు చెయ్యి. ఒక నెలరోజులపాటు ఇక్కడ ఉండి ఈ కాళీమందిర బాధ్యతను ఆ పెద్దాయనకు అప్పగించు. ఆ తరువాత నీవు తిరిగి బృందావనం వెళ్ళు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 62 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*
*కాళీ యోగి : కాళీమందిర బాధ్యతను ఆ పెద్దాయనకు అప్పగించిన తరువాత నీవు తిరిగి బృందావనం వెళ్ళు. అక్కడ మీఅమ్మ ఇంకా జీవించి ఉన్నది. వృద్ధాప్యంలో ఉన్న ఆమె బ్రతికున్నంత కాలమూ సేవచేయి. ఆ పవిత్ర ధామంలో రాధాకృష్ణులను నిరంతరం సేవించు. అక్కడకు వెళ్ళిన తరువాత రాధామంత్రాన్ని నీవు జపించవలసి ఉంటుంది. నీవు నేను మరికొందరు గోలోకానికి చెందినవారము. రసదేవత అయిన రాధాదేవి సంకల్పమువల్లనే మన జన్మపరంపర కొనసాగుత్నుది. ఆమె యొక్క మరొక రూపమే కాళీ. అక్కడ నీ చెల్లెలు పెరిగి పెద్దదయి ఇప్పటికే కృష్ణ భక్తిని హృదయంలో నింపుకొన్నది. మధురభక్తి మార్గంలో ఆమె జీవితం తరిస్తుంది. కృష్ణుడు తనను విడిచిపోతాడేమో అన్న భయంతో తాను పూజించే కృష్ణవిగ్రహాన్ని ఎప్పుడూ కొంగుకు ముడివేసుకు ఉంచుకుంది. కృష్ణుడు తప్ప మరొక ప్రపంచం ఆ అమ్మాయికి ఉండదు.*
*నీ కాళీభక్తిక సాధనలు ఆ అమ్మాయికి నచ్చవు. ఈ ప్రపంచంలో ఎవరిమార్గం వారిది. అయిదేండ్ల తరువాత నీ వక్కడికి వెళ్ళినా నిన్ను ఎవరూ ఏమీ అనరు. మీ తల్లికి సేవచేసి మాతృఋణం తీర్చుకొన్న తరువాత కాశీకి వెళ్ళు. అక్కడ త్రైలింగస్వామిని దర్శనం చేసుకో. ఆ మహానుభావుడు నాకు పరమాప్తుడు. ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేయి. క్షేత్రపాలకుడయిన కాలభైరవుడు కాళీసహితుడై అక్కడ ఉన్నాడు. వారి అనుగ్రహం నీకు లభిస్తుంది. అనంతరం కొంతకాలము తీర్ధయాత్రలు చేయి. కొందరు సాధకులకు నీవలన ఉపకారము జరుగవలసి ఉన్నది. కాళీదేవి అనుగ్రహం కోసం సాధన చేస్తున్నటువంటి యువకులు కొందరికి నీ మార్గదర్శనము, సహాయము అవసరమవుతుంది. వారెవరన్నది దివ్వ చక్షువు వికసించటంవల్ల నీవు తెలుసుకోగలుగుతావు. వారిలో చివరివాడు కలకత్తాలోని దక్షిణేశ్వర మందిర పూజారి 'గదాధరుడు' అన్న యువకుడు. అతని చేత తాంత్రిక సాధనలు చేయించు. ఆ తరువాత నన్ను మళ్ళీ కలుసుకో గలుగుతావు. ఇప్పుడు నీ వయస్సు 21వ సంవత్సరము నడుస్తున్నది. దాదాపు 45 సంవత్సరముల తరువాత నన్ను మళ్ళీ చూడగలుగుతావు”.*
*యోగేశ్వరి: స్వామీ! నా కప్పటికి షుమారు 70సం॥ సమీపిస్తుంటవి. వృద్ధత్వంలో ఉండే నేను మిమ్ము గుర్తుపట్టటం ఎలా? మీరు దివ్యశరీరంతో ఉంటారా లేక మానవ శరీరంలో ఉంటారా?.*
*యోగి: ఈ శరీరాన్ని వదలిన తరువాత పది సంవత్సరాలు ఊర్ధ్వ భూమికలలో ఉంటాను. కాళీదేవి పరివారంలో ఉండి మళ్ళీ ఆమె ఆజ్ఞవల్ల దక్షిణ దేశంలో పుట్టి ఒక ఆంధ్ర కుటుంబంలో పెరిగి పెద్దవాడనయిన తరువాత దక్షిణా పధమంతా సంచరించి మళ్ళీ ఈ కాళీ దేవి దగ్గరకు వస్తాను. అప్పటికి ఇక్కడ ఇంతకుముందు చెప్పిన వృద్ధుడు, యువకుడు కాళీదేవిని సేవిస్తూ ఉంటారు. ఆ వృద్ధుడు కూడా సామాన్యుడు కాడు. కేవల భక్తిచేత తీవ్రసాధనలు లేకుండానే దీర్ఘాయువు సాధించిన వాడు. అతని కుమారుడు మాత్రం తీవ్రసాధనలు చేస్తాడు. ఆ వివరాలు ప్రస్తుతం నీకు అక్కరలేదు. నీవు మాత్రం ఎప్పుడు బుద్ధిపుడితే అప్పుడు ఇక్కడకు వచ్చి ఎన్నాళ్ళుండాలనిపిస్తే అన్నాళ్ళు ఉండవచ్చు.*
*నీవు చేసిన తాంత్రిక సాధనలవల్ల ఆకాశగమన శక్తిరాలేదుకాని, అలసట లేకుండా ఎంతదూరమైన వేగంగా నడచి పోగలశక్తి వచ్చింది. అలానే ముసలితనం గురించి ప్రస్తావించావు. నిన్ను వృద్ధురాలిగా చూడటం నాకు ఇష్టములేదు ఈ శరీరములో నీవున్నంతకాలం ఇప్పుడున్నట్లుగానే ఉంటావు. ముసలి తనం నిన్ను సమీపించదు. ఇది నేను ప్రత్యేకంగా నీకిస్తున్న వరం. ఇక నా అగ్నిప్రవేశ సమయమాసన్నమయింది.*
*యోగేశ్వరి: మహాత్మా! బృందావనంలో నన్ను రాధామంత్రం చేయమన్నారు. నేను మిమ్ము తప్ప మరెవరినీ గురువుగా స్వీకరించలేను. దయతో నాకు రాదామంత్రాన్ని ఉపదేశించండి.*
*యోగి: ఇప్పుడు సమయం చాలదు. నీవు బృందావనం వెళ్ళిన తరువాత భాద్రపద శుద్ధ అష్టమినాడు రాధాజయంతి వస్తుంది. ఆ రాత్రి నన్ను స్మరించు, నిద్రించు. నేను స్వయంగా వచ్చి నీకు మంత్రోపదేశం చేస్తాను. నీకు శుభమగునుగాక!.*
*యోగేశ్వరి: గురుదేవా! మీ శిష్యురాలిని, దాసురాలిని, మీ రెప్పుడూ నన్ను కనిపెట్టి ఉండండి. భవిష్యత్లో నేను మిమ్ము గుర్తించ లేకపోవచ్చు. యోగీశ్వరులైన మీరే నన్నుగుర్తించి దగ్గరకు తీసుకోవాలి. నా అభ్యర్ధనను అనుగ్రహించండి.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 63 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*
*యోగేశ్వరిని కాళీయోగి చిరునవ్వుతో చెయ్యెత్తి ఆశీర్వదించి గంభీరమైన కాళీ విగ్రహం వైపు చూస్తూ హోమకుండంలోకి ప్రవేశించి పద్మాసనంలో ధ్యానముద్రలో కూర్చొన్నాడు. అగ్నిస్తంభన సిద్ధుడైన ఆ మహనీయుని దహించే శక్తి అగ్నికి లేదు. ఆయన ఇచ్ఛాశక్తి వల్ల శరీరంలో నుండే అగ్ని ఉదయించి దహించటం మొదలు పెట్టింది. ప్రజ్వలిస్తున్న ఆ జ్వాలలో ఆ సిద్ధశరీరం దహనమవుతుంటే వాతావరణమంతా దివ్యపరిమళం వ్యాపించింది, ఒకవైపు అశ్రువులు కంటివెంట జాలువారుతుంటే, ఎంత ఆపుకున్నా ఆగని దుఃఖం మనసును ఆక్రమిస్తుంటే నిలుచో లేక ఒక స్తంభాన్ని పట్టుకొని అలా కూర్చుండి పోయింది యోగేశ్వరి. స్పృహ ఉన్నదో లేదో.*
*తరువాత కార్యక్రమం అంతా కాళీయోగి చెప్పినట్లే జరిగింది. కాళీ మందిరాన్ని యోగి సూచించిన ప్రకారం అక్కడికి వచ్చిన వృద్ధభక్తునకు అప్పగించింది. ఆయన కుమారుడు కూడా తీవ్రసాధకుని వలె కన్పించాడు. కొద్దిరోజులు అక్కడ ఉండి అక్కడ నుండి బయలుదేరి బృందావనం వెళ్ళింది. వృద్ధురాలైన తల్లి తనరాకకు ఎంతో సంతోషించింది. ఆమె అడిగితే తనసాధన గూర్చి గడచిన సంవత్సరాలలో చేసిన వాటి గురించి కొద్ది విశేషాలు చెప్పింది. వాటిని తన చెల్లెలు కూడా విన్నది. ఆమెకు వీటి మీద సదభిప్రాయం కలుగలేదు.*
*యోగేశ్వరి కూడా నచ్చజెప్పటం కోసం ప్రయత్నంచేయలేదు. ఎవరి మార్గం వారిది. తనకు స్ఫురిస్తున్నదాన్నిబట్టి తన చెల్లెలు ఒక గోపికవలే కృష్ణుని విరహంతో తపించి తపించి కృతార్ధురాలవుతుంది. ఆ తరువాత కొద్దికాలానికే వృద్ధురాలైన తల్లి మరణించింది. తమ స్వస్థలానికి వెళ్ళి అక్కడి ఆస్తి పాస్తుల వ్యవహారాలన్నీ సరిదిద్ది అన్నింటిని అమ్మివేసి ఆ ధనాన్ని తీసుకువచ్చి చెల్లెలికి అప్పగించింది. తనకు ఏవిధమైన పూర్వుల ఆర్జితము అక్కరలేదని ఇంతకు మునుపువలెనే, దేశదిమ్మరిగా తిరుగుతుంటానని చెప్పి చెల్లెలిని ఒప్పించి అక్కడినుండి కాశీ వెడుతున్నాని చెప్పింది. తల్లి మరణించిన ఇంట్లో తా నొక్కతే ఉండలేను గనుక, ఇప్పుడు ఉన్న ఇల్లు స్వగృహం కాదు కనుక తాను కూడా కాశీ వచ్చి కొన్నాళ్ళుంటానని చెల్లెలుకోరింది.*
*ఇద్దరూ కలిసి వారణాసికి చేరి కేదారేశ్వరుని దగ్గర ఒక ధర్మశాలలో ఉన్నారు. రోజూ విశ్వనాధుని దర్శనం, అన్నపూర్ణ, విశాలాక్షి మొదలైన దేవతలను పూజించటం జరిగేవి. కొన్నాళ్ళుకు అక్కడికి దగ్గరలో ఒక చిన్నభవనం అమ్మకానికి ఉన్నదని విని యోగేశ్వరి చెల్లెలు దానిని కొనాలని, కొంత కాలం కాశీవాసానికి ఉపయోగిస్తుందని భావించింది. యోగేశ్వరి కూడా మంచిఆలోచనే అనటం వల్ల ఆ ఇల్లు తీసుకొన్నారు. అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసిన తరువాత యోగేశ్వరి చెల్లెలిని విడిచి మళ్ళీ కొంతకాలానికి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. బయలుదేరిన యోగేశ్వరికి భాద్రపద శుద్ధ అష్టమి సమీపిస్తున్న సంగతి గుర్తుకు వచ్చింది. గురువుగారు చెప్పిన మాట స్మృతిలో మెదిలింది.*
*బయలుదేరిన త్రోవమార్చి బృందావనానికి చేరుకొని, రాధాష్టమినాడు ఉపవసించి ఆ రోజు రాత్రి ధ్యానంలో కూర్చున్నది. అర్ధనిశా సమయానికి కాళీయోగి ధ్యాన భూమికలోకి వచ్చి రాధామంత్రాన్ని ఉపదేశించి ఆశీర్వదించి అదృశ్యమయినాడు. ఆయనతో ఎన్నో విషయాలు మాట్లాడాలని ఏవేవో చెప్పాలని ఆశించింది. కాని ఆయన దానికి అవకాశము ఇవ్వలేదు ‘ప్రాప్తమింతే' అనుకొని 40 రోజులు ఆ పవిత్ర ధామంలో జపధ్యాన సాధన చేసింది. రాసేశ్వరి యొక్క కరుణా కటాక్షాలు తనయందు ప్రసరిస్తున్న అనుభూతి కలిగింది. సంతోషము కలిగినట్లు అనిపిస్తున్నది. హ్లాదినీ శక్తి తరంగాలు తనను ముంచెత్తడం ఆమె గమనించగలిగింది.*
*కర్తవ్య ప్రేరణ వల్ల వంగదేశంలోని కొన్ని నిర్దిష్ట ప్రదేశాలకు వెళ్ళి చాలామంది సాధకులకు మంత్ర సాధనలవల్ల దివ్యానుభూతులు కలగటానికి తోడ్పడింది. కాళీయోగి శరీరాన్ని విడిచి పెట్టిన తరువాత మామూలు వస్త్రములు కాక కాషాయ వస్త్రధారిణయై విభూతి, కుంకుమ రెండూ ముఖమున ధరించి కంఠమున రుద్రాక్షమాలతో ఆమె నడచి వస్తూంటే తేజస్విని యైన ఒక మహాయోగిని కదలివస్తున్నట్లుగా ఉండేది. చూడటానికి 25సం|| మాత్రమే ఆమె శరీరంపై కనబడేది. అక్కడి నుండి, భారతదేశములోని ఎన్నో దివ్యక్షేత్రములు దర్శించింది. ప్రధానంగా కాళీక్షేత్రములయిన ఉజ్జయినిలో, కామాఖ్యలో ఎక్కువ కాలం గడిపింది. అన్నిటికంటే కామాఖ్య అమెను ఎక్కువ ఆకర్షించటంవల్ల చాలాసంవత్సరాలు అక్కడే గడిపింది. హిమాలయాలకు వెళ్ళి తన గురువుగారు తపస్సు చేసిన గుహలో చాలాకాలం కాళీసాధన చేసింది. ధ్యానంలో కాళీదేవి, ఆమె సన్నిధిలో గురుదేవులు కనిపించేవారు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment