Wednesday, 22 March 2023

pranjali prabha 24.03

 



శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-3
హనుమ సాగరయానము

తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః
ఇయేష పదమ్ అన్వేష్టుం చారణా చరితే పథి 5.1.1
 
అంగదాది వానరుల అభ్యర్థనను అనుసరించియు, జాంబవంతుని ప్రోత్సాహముతో హనుమ సముద్రమును లంఘించుటకు మహేంద్ర పర్వతమును అధిరోహించి సీతాన్వేషణకు చారణాది దివ్య జాతుల వారు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఇచట ఆకాశమున వెళ్ళుట యనగా బ్రహ్మనిష్ఠ కలిగి యుండుట. ఆకాశమనగా పరబ్రహ్మము (అంతటా పూర్ణముగా ప్రకాశించువాడు). దాని యందు విహరించువాడే సంసార సముద్రమును తాను దాటి జీవులను తరింప చేయగలడు.
 
ముమోచ చ శిలాః శైలో విశాలాః సమన శ్శిలాః
మధ్యమేనా౭ర్చిషా జుష్టో ధూమ రాజీ రివా౭నలః 5.1.16
 
ఆ మహాబలుడి చే అదుమబడిన మహేంద్రగిరి తన పగుళ్లనుంచి బంగారు, వెండి, కాటుక ధారలను వెలిగ్రక్కును. ఏలనన అగ్ని యొక్క సప్తార్చులలో [1]"మాధ్యమార్చి" అనునది సులోహిత. దాని జ్వాలల నుండి పొగలు వెలువడుచున్నట్లు హనుమచే అదుమబడిన ఆ మహేంద్రగిరి నుండి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడ సాగెను. హనుమ పైకి ఎగుర సన్నద్ధుడై అంగదాది వానరులతో ఇట్లనెను.
 
వానరాన్ వానర శ్రేష్ఠ ఇదం వచనమ్ అబ్రవీత్
యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః     5.1.39
 
గచ్ఛేత్ త ద్వద్గమిష్యామి ల౦కా౦ రావణ పాలితామ్
న హి ద్రక్ష్యామి యది తాం లఙ్కాయాం జనకా౭౭త్మజామ్  5.1.40
 
అనేనైవ హి వేగేన గమిష్యామి సురా౭౭లయమ్
యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యా౭మ్యకృత శ్రమః        5.1.41
 
బద్ధ్వా రాక్షస రాజానమ్ ఆనయిష్యామి రావణమ్
సర్వథా కృత కార్యో౭హమ్ ఏష్యామి సహ సీతయా       5.1.42
 
ఆనయిష్యామి వా లఙ్కాం సముత్పాట్య సరావణామ్
ఏవమ్ ఉక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః         5.1.43
 
ఉత్పపాతా౭థ వేగేన వేగవాన్ అవిచారయన్
సుపర్ణ మివ చా౭౭త్మానం మేనే స కపికుంజరః 5.1.44
 
రామబాణము వలె మిక్కిలి వాయువేగముచే రావణ పాలిత లంకకు ఎగెదను. అక్కడ సీతమ్మ కనబడనిచో, అదే వేగమున సురలోకమునకు పోయెదను. అక్కడ గూడ సీతాదేవి కనబడనిచో రావణుని బంధించి తీసుకొని వచ్చెదను. ఏదిఏమైనా కృతకృత్యుడనై వచ్చెదను. లేనిచో రావణనునితో సహా లంకను పెకిలించుకొని తీసుకొని రాగలను. అని చెప్పి మిక్కిలి వేగముతో గరుడుని వలె అంతరిక్షమునకు ఎగిరెను. ఆత్మీయులను వీడ్కోలినప్పుడు వారిని కొంతదూరము అనుసరించి, వాటి ఎడబాటునకు తట్టుకొనలేక దుఃఖాశ్రువులను రాల్చి శోక తప్తులగుదురు. అదేవిధముగా అచ్చటి మహావృక్షములు ఆయన వేగమునకు కొంతదూరము అనుసరించి పుష్పములను రాల్చుతూ సముద్రముపై పడిపోయెను.
 
దశ యోజన విస్తీర్ణా త్రింశ ద్యోజనమ్ ఆయతా            
ఛాయా వానర సింహస్య జలే చారుతరా౭భవత్ 5.1.76
 
సంధ్యా సమయము కావడం మూలాన మారుతి యొక్క శరీరచ్చాయ పొడవు పది యోజనములు, వెడల్పు ముప్పది యోజనములుగా కనబడెను. త్రోవలో సాగరుని యొక్క ప్రోద్బలముచే మైనాకుడు (సముద్రములో నున్న పర్వతము) హనుమను  కొంచెము తడవు విశ్రాంతి తీసుకొనమని ప్రార్ధించగా, అందుకు సున్నితముగా తిరస్కరించి హనుమ తన ప్రయాణమును కొనసాగించెను.

శ్రీరామ జయరామ జయజయ రామ
జానకి రామ, పట్టాభి రామ, కారుణ్య రామ,
ఆరోగ్య రామ, గుణాభి రామ, సార్వ భౌమ,
ఓం శ్రీ రామ, మాత్రేనమః 

No comments:

Post a Comment