Tuesday, 21 March 2023

ప్రాంజలి ప్రభ...22/03

 




ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రే నమ: 
  • *శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-1*002 

*హనుమ స్వరూపము*
*వేదవేద్యే పరే పుంసి జాతే దశరాత్మజే*
*వేద: ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా*

వేదములచే తెలియబడు పరమపురుషుడు దశరధునికి కుమారుడైనట్లుగా,వేదము,వాల్మీకి వలన , రామాయణ రూపముతో ఉండినది..

శ్రీమన్నారాయణుడు ఈ భూమిపై మరల నసించిపోవు చున్న ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీరాముడు గా అవతరించాడని  మన భారతీయుల ప్రగాఢ విశ్వాసము. శ్రీరాముని మీద మనకు లభించినన్ని పరిశోధనా గ్రంథాలు వేటి యందు లభించవు. శ్రీరాముడు మానవునిగా జన్మించి తన శిష్య ప్రజ్ఞచే సకల శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అకుంఠిత దీక్షతో ఆయా యోగ రహస్యాలను అభ్యాసం చేసి, తన సత్య సంధతతో భగవంతునిగా రూపాంతరము చెందినవాడు. తనను గూర్చి *"ఆత్మానాం మానుషం మన్యే"* (నేను మానవ మాత్రుడను) అని పేర్కొన్న శ్రీరాముడు *"సత్యేన లోకాన్ జయతి"*  అను ప్రమాణము ననుసరించి సత్యనిష్టాగరిష్ఠుడు అయినందున శ్రీరాముడు అన్ని లోకములను జయించ గలిగిన వాడై భగవంతునిగా ఈ లోకుల దృష్టిలో ఉండిపోయాడు. దుర్లభమైన మానవ జీవితమును వ్యర్థము చేసుకొనకుండా బాహ్యమున ధర్మాచరణమును, అంతరమున జ్ఞానము కలిగి ఉండవలెనని మనకు శ్రీరాముని ద్వారా తెలియు చున్నది.
రామలక్ష్మణులు సీతను అన్వేషించుతూ పంపా తీరమునకు వచ్చినప్పుడు, సుగ్రీవుని భయము పోగొట్టుటకై హనుమ సుగ్రీవునితో ఇది ఋశ్యమూకం గాన ఇక్కడికి వాలి, వాలి సంబంధీకులు రాలేరు అని చెపుతాడు. ఆ విధంగా రామాయణంలో హనుమ పాత్ర పరిచయము అయింది. రామసౌందర్యమును చూడగానే హనుమ ఆకర్షితుడయ్యెను. హనుమను చూచి, అతని సంభాషణ విని నంతనే రాముడు అతనిలోని గుణగణములను తెలుసుకొనెను. రాముడు లక్ష్మణుతో హనుమను గురించి చెపుతూ ..

వాక్యకుశలః,(వాక్యకుశలుడు),  ఋగ్వేదమునందు బాగుగా శిక్షణ పొందినాడు, యజుర్వేదమును ధారణ చేసినాడు,  సామవేదమును చక్కగా ఎరిగిన వాడు, వ్యాకరణమును అనేక మార్లు వినినాడు, మాట్లాడినప్పుడు సందిగ్ధము లేకుండా, తొందరగా గాని, మెల్లగా గాని గాకుండా ముఖము నందు ఎట్టి వికార భావములు లేకుండా, మధుర స్వరముతో, సంస్కారముగా, మంగళకరమైన మధుర స్వరముతో మాట్లాడినాడు అనెను. ఇట్టివాడు దూతగా ఉన్నచో కార్యము తప్పక సిద్ధించునని దూతగా హనుమ యొక్క విశిష్టతను  చెప్పినాడు.  హనుమ యొక్క ఉత్పత్తి ప్రకారమును పరిశీలించిన శబ్దమునకు హనుమతో గల సామ్యము గోచరించును. మనలోని ఒక భావమును ఆవిష్కరించ వలెనన్న కోరిక గలిగినచో శరీరములోని వాయువులలో కదలిక గల్గును. ఆ వాయువుచే అభిహతమై మూలాధార స్థానము నుండి శబ్దము బయలుదేరి నాభిని, హృదయమును, కంఠమును దాటి తిన్నగా శిరస్థానమును చేరును. అచట నుండి పైకి పోవ వీలు లేక కంఠము నుండి ముఖము గుండా వెలికి వచ్చును. అట్లు వచ్చునప్పుడు నోటిలోని ఆయా స్థానములలో వాయువు యొక్క తాకిడిచే శబ్దముగా వెలికి వచ్చును. ఇందు హనుమకు, శబ్ధమునకు సాపత్యమును చూద్దాము.

1 హనుమ వాయువు వలన జన్మించాడు. శబ్దము కూడా వాయువు వలననే జనియించింది.
2 పుట్టగానే హనుమ సూర్య మండలము వైపు (సమాధి అవస్థ) కు పోయెను. శబ్దము కూడా ముందుగా శిరస్సు వైపు సాగును. అటు పోవ వీలుగాక నోటి నుండి వెలుపలికి వచ్చును. నోటిలోని ఆయా వర్ణముల అభివ్యక్త స్థానములే అంజన, కనుక అంజనాసుతుడు అయ్యెను.
3 సూర్యుని నుండి క్రిందకు పడిపోటచే దౌడలు సొట్ట  బోయి   హనుమ గా పేరు వచ్చినది. శబ్దము గూడ శిరఃస్థానము నుండి నోటిలోని దౌడల కదలికచే వర్ణ రూపమున వెలుపలికి వచ్చును గాన శబ్దము గూడ "హనుమ" అగును.
4 శబ్ద సామర్థ్యము వలన అవసరమైన కార్యములు నెరవేర్చుటలో మంత్రి వలే పని చేయును. స్వాధ్యాయన ప్రవచన శీలి యగు సుగ్రీవునకు హనుమ సచివుడు.
ఇట్టి హనుమయే రాముని సీతమ్మతో  కలుపును.
*శ్రీరామ జయరామ జయజయ రామ*
సీతారామ మనోభిరామ కళ్యాణ రామ 
సమస్త జనరక్షక పాలన రామ .. ఓం శ్రీరాం 
/మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
--(())--

No comments:

Post a Comment