పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో సమర్పించు కుంటూ ఉంటాడు. చాలా ఓపికతో ప్రతి రోజు పూజలు చేస్తాడు ఎవరి కోసం మన:శాంతి కొరకు మాత్రమే. సంసారం బంధం ఆశలతో ఆశయాలతో కదులుతున్న రైలు ప్రయాణముల జరుగుతూ ఉంటుంది. రైలు లాగా ఆగినచోటల్లా జనాన్ని ఎక్కించుకున్నట్లు, దిగిపోయినట్లు జీవితంలో ప్రతిరోజూ కొన్ని సుఖపు సంఘర్షణలు కొన్ని దుఃఖపు సంఘర్షణలు ఉండుట సహజం.
సీస పద్యము ... తప్పు అవును .. 44
చూసిన దానికి .. చూపులకును చిక్కి
చురకలు వేసిన ... తప్పు అవును
ఆకాశమంతున్న ... అవకాశ మొచ్చిన
చేయిజార్చుటయును ... తప్పె అవును
అలకలు ఎన్నున్న .... ఆకలి తీర్చిన
ఆశయాన్ననుట ..... తప్పె అగును
ఆరాట పోరాట .... అలసత్వ భావము
అణిగిమనిగిఉన్న ... తప్పె అగును
ఆటవెలది
ఏది తప్పు ఏది ఒప్పో నువు తెలుపు
కల మెప్పు డున్న కదులు తుండు
మంచి రోజు లొచ్చు శుభములు జరుగును
ఓర్పు తోను వేచి ఉండు ఒప్పు
--(())--
అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది. నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు. వస్తువులు అంతకన్నా కావు. ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరతాడు. భక్తితో స్మరిస్తే చాలునంటాడు.
కానీ మనిషి మనసు చంచలం. చపలం. స్థిరంగా ఒకచోట ఉండదు. లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు.
ఒక భక్తుడు శివుని గూర్చి ఈవిధంగా పలుకుతాడు
సీస పద్యము .. ఈశ్వరా
రచయిత.. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 44
డమరక నాదము ఢమఢమ తాండవ
మాడేటి ఈశ్వరా .... మోన మోద్దు
దాంపత్య సుఖమును ...ధర్మమ్ము తెలిపేను
మాయందు ఈశ్వరా ..మోన మోద్దు
అర్ధభాగము నంత ..అర్ధాంగి కిచ్చావు
వృషభము పైఉన్న ... ఉగ్ర నేత్ర
రక్తివహించిన ... రమ్యత చూపిన
ముక్కంటి మాపైన మోన మోద్దు
తేట గీతి
భీషణధ్వని గలవాడ దుర్మతులకు
భయము కలిగించు' అమృతము వంటి పలుకు
నందికేశ్వరుని శరీర చ్ఛాయ కలిగి
గౌరీపతి పరమేశ్వరుడుగా మోన మోద్దు
***(())***
వేరొకతను అంతా దేవుడే ఉన్నాడంటారు ఎక్కడా అని అడిగితె చెప్పలేరు. కొందరు నీలో ఉన్నాడు ఆదేవుడ్ని గమనించు అంటారు అది ఎంత వరకు నిజం అనే వారున్నారు.
ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమోగానీ, అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా?
ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు.
భగవంతుడిదే ఆ యావత్‌సృష్టి. అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే.
కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు.
అందుకే....... శంకరభగవత్పాదులు-
'ఓ పరమేశ్వరా! నా మనసు ఒక కోతి వంటిది. అది ఎప్పుడూ సంసారవాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది. భార్యాపుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది.
క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది.
అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను. దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో' అని ప్రార్థిస్తారు. సామాన్య భక్తులను తరింప జేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది.
'ఓ పరమేశ్వరా! బంగారుకొండ మేరుపర్వతమే నీ చేతిలో ఉంది. అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదదాసుడై ఉన్నాడు. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి.
షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు. సమస్త మంగళాలనూ కలిగించే జగన్మాత సర్వమంగళయై నీ పక్కనే ఉంది. కనుక నీకు నేనేమీ ఇవ్వలేను. నా దగ్గర ఉన్నది ఒక్క మనసే. అది నీకు సమర్పిస్తున్నాను!' అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు.అచంచల విశ్వాసం, అకుంఠిత భక్తి, అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు.భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందు కుంటాడు.అట్టహాసాలు, ఆర్భాటాలు నిజమైన పూజలు కావు.
సీస పద్యము
తనమీద రాళ్లను .. తప్పని వేసిన
ఎదుగుదలకు నాంది ... ఎప్పుడున్ను
ధైర్యము ఆయుధం ... ధర్మబుద్ధియునుగా
ఎలుగు ఎప్పుడునూ ఏతమవ్వు
పేదవారికి పేరు .... పెనము మీదను అట్టు
పేరుకన్నను ప్రేమ ---- ముఖ్య మవ్వు
భయమువెంటను ఆస్తి ... భోగమువెంటను
భగభగలుగ నుండు .... భాగ్య పిచ్చి
ఆటవెలది
నువ్వు ఒక్క సారి అలసట చెందితే
నిన్ను చేత కాని వాడి అవును
లోక రీతి ఆశ చుట్టు తిరుగు చుండు
ఓపికున్న ఆశ వద్దు మనకు
--(())--
"హృదయార్పణమే" పూజ. నిశ్చల ధ్యానమే భక్తి
అంతేకానీ లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కావు. ఈ సత్యాన్ని ప్రతిఒక్కరు గ్రహిస్తే మేలు!
ఆచమనం
పూజలు, వ్రతాల్లో ''ఆచమనం'' అనే మాట చాలా సార్లు వింటాం.
"ఆచమనం" అనే ఆచారం అపరిమితమైనది.
ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు, భోజనానికి ముందు, తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు.
ఆచమనం చేసే వ్యక్తి శుచిగా, శుభ్రంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి.
*ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్'' అని వర్ణించారు. *
*అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని (ఒక మినపగింజ మునిగేంత పరిమాణంలో నీళ్ళు) పోసి, వాటిని తాగాలి. *
చేతిలో పోసేనీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి.
ఆచమనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు అని చెప్తున్నారు..
*బాగానే ఉంది. *
1.అసలు ఆచమనం ఎందుకు చేయాలి?
*2.నీటిని అరచేతిలో పోసుకుని తాగడం వల్ల ప్రయోజనం ఏమిటి? *
3.అలా ఎందుకు తాగాలి?
4.ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకుని ఎందుకు తాగకూడదు?
5.మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి?
6. నీరు కొంత ఎక్కువో తక్కువో అయితే ఏమవుతుంది?
*7. “కేశవాయ స్వాహా,నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా...” అని మాత్రమే ఎందుకు చెప్పాలి? *
ఇలాంటి సందేహాలు కలగడం సహజం. అందుకే ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకుందాం.
మన గొంతు ముందు భాగం లోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీని చుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంత వరకూ రక్షణ లభిస్తుంది.
అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్నదెబ్బ తగిలినా ప్రమాదం. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు.
స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి.
ఇవి ఇంగ్లీషు అక్షరం 'V' ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి.
ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.
ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావవ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు,నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక,గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం.
ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అనిచెప్పుకున్నాం కదా! గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది. ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు.
శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఇలా కొన్నినీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, అంతే జాగ్రత్తగా మెల్లగాతాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ,జాగ్రత్త అలవడుతుంది.
రోజులో ఆచమనం పేరుతో అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది.
“కేశవాయ స్వాహా" అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది.
నారాయణాయ స్వాహా" అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది.
చివరిగా "మాధవాయ స్వాహా" అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది.
ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈమంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది.
పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్లమేలు జరుగుతుంది.
ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, మన చేతుల్లో కొంతవిద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసిశరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.
ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆకొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, ప్రేగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి.
ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై,లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి.
ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయత ఉంది.
అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.. సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము...
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...
అష్టాంగాలు అంటే...
"ఉరసా" అంటే ఛాతిభాగం,
"శిరసా" అంటే తల,
"దృష్ట్యా" అనగా కళ్ళు,
"మనసా" అనగా మనస్సు,(హృదయం)
"వచసా" అనగా నోరు,(వాక్)
"పద్భ్యాం" అనగా పాదములు,
"కరాభ్యాం" అనగా చేతులు,
"కర్ణాభ్యాం" అంటే చెవులు.
ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.
మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..
--(())--
ఇది కధ కాదు సన్మార్గమునకు కధ ... 104 .
సేకరణ /రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
దారం తెగిన గాలిపటం
తండ్రీ కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు.
గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు వెళ్లాక, దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి.
కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పాంగి పోయింది. కొంతసేపు దారాన్ని చేత్తో పట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు.
నాన్నా దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకి ఎగిరిందే! దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంది కదా అన్నాడు.
తండ్రి నవ్వాడు. "దారాన్ని తెంపేద్దామా మరి?" అని అడిగాడు.
"తెంపేద్దాం నాన్నా" అన్నాడు కొడుకు ఎంతో ఉత్సాహంగా.
ఇద్దరూ కలిసి దారాన్ని తెంపేసారు.
"టప్' మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది.
అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది! చివరికి ఎవరి మేడ మీదనో కూలిపోయింది.
"ఇలా జరిగింది ఏంటి నాన్నా" అన్నాడు కొడుకు విచారంగా. దారం తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుందనుకుంటే, కిందికొచ్చి పడిపోవడం ఆపిల్లాడికి నిరుత్సాహం కలిగించింది. తండ్రివైపు బిక్కమొహం వేసుకుని చూశాడు.
కొడుకును దగ్గరికి తీసుకున్నాడు తండ్రి. గాలిపటానికి దారం ఉండేది. దానిని ఎగిరిపోనీయకుండా పట్టి ఉంచేందుకు కాదు. గాలి ఎక్కువైనా తక్కువైనా గాలిపటం తట్టుకుని నిలబడి, ఇంకా ఇంకా పైపైకి ఎగిరేలా చేసేందుకే అని చెప్పాడు.
మరో గాలిపటానికి దారం కట్టి ఎగరేసి
కొడుకు చేతికి దారం అందించాడు.
జీవితంలో కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. ‘కుటుంబం అనే బంధం లేకపోయి ఉంటే మనం ఇంకా ఏదో సాధించి ఉండేవాళ్లం అని!’
నిజానికి కుటుంబం అందించిన ప్రేమ,
సేవ, సౌకర్యాల వల్లనే మనం ఈ మాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి.
గాలిపటానికి దారం ఆధారం
ఆ దారం తెగిన గాలిపటం ఏ దారిన వెళ్లాలో తెలియక, సక్రమంగా గాలి లో నిలబడలేక కుప్పకూలిపోతుంది.
అలాగే తెరచాపలు తెగిన నావ ఎటు వెళ్ళాలో దిక్కు తెలియక
నడి సముద్రంలో కొట్టుమిట్టాడుతూ మునిగిపోయే ప్రమాదం ఉంది.
అలాగే మనలో చాలామంది చాలాసార్లు ఈ కుటుంబంతో ఉన్న భవబంధాలు బంధి
వల్ల నేను జీవితంలో నేను
పైకి ఎదగ లేకుండా ఉన్నాను. వీటిని తెంపుకుంటే నేను స్వేచ్ఛా, హాయిగా వ్యవహరించవచ్చు అనే భ్రమలో ఉంటారు.
మొరటోడికి మొగలిరేకులు ఇస్తే మడిచి మరెక్కడో పెట్టుకున్నాడటా! అలాగే విలువ తెలియని మూర్ఖుడికి వజ్రాన్ని ఇస్తే విసరి సముద్రంలో పారవేశాడు అటా! ఆ వజ్రం విలువ తెలిసేసరికి అది అందనంత,అందుకోలేనంత లోతులో పడిపోయిందిని తెలుస్తుంది. మనం కూడా అంతే భగవంతుడు చక్కని బంధాలను ఇస్తే వాటిని బందిఖానా గా భావించి దూరం చేసుకుంటే వాటి విలువ తెలిసిన తర్వాత మనం వారిని కలుసుకోవాలి అనుకునేసరికి మనకు కనిపించనంత,మవ మాట వినిపించనంత దూరంగా వారు వెళ్ళిపోయి ఉంటారు.అప్పుడు మనం వారి విలువ తెలుసుకున్నాను ఏం ప్రయోజనం లేదు.
కుటుంబ బంధాలు అనేవి మన అలాన, పాలన చూస్తూ,
బాంధవ్యాల మాధుర్యాన్ని మనకు అందించి మనలను బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతూ గొప్ప గొప్ప విజయాలు సాధించడానికి ప్రేరణ కల్పిస్తూ మహోన్నతమైన వ్యక్తిగా మనం మారుతువుంటే,మనం సాధించిన విజయాలు చూసి ఉప్పొంగిపోతూ ఉంటారు.
పొరపాటుగా వాటిని తెంచుకుంటే జీవితంలో అశాంతి మొదలై ఎటు వెళ్ళాలో తెలియక మానసిక చికాకులతో, సమస్యల సుడిగుండము లో చిక్కుకుని,
దారం తెగిన గాలిపటం వలె తెరచాపలు లేని నావ వలే
మన జీవితం కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దు కుందాం.
--(())--
ఇది కధ కాదు సన్మార్గమునకు కధ ... 105 .
సేకరణ /రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌞 ఆత్మయందు అనాత్మలక్షణాలు ఎలా వచ్చినవి ?
ఆత్మలో ఏ భేదాలు లేవు. అది ఒక్కటే. దేహం కదలటానికి కారణమైనది ఆత్మయే. ఇంద్రియాలు వాటి వాటి ధర్మాలు నిర్వర్తించటానికి కారణమైనది ఆత్మయే. మనస్సు అనుభవాలు పొందటానికి కారణమైనది ఆత్మయే. బుద్ధిలో ఆలోచనలు కదలటానికి ఆధారమైనది ఆత్మయే. ఆత్మవల్లనే మనం అన్నింటిని తెలుసుకోగలుగుతున్నాం. అన్నింటికీ ఆధారమైన ఆత్మ ఏకం-అద్వయం-ఎట్టి గుణాలు, విశేషణాలు లేనిది.
సీస పద్యము ... ఆత్మ
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
తెలుసుకో గలిగేటి....తెలుపేసమాధాన
దేహ కారణములు...దేహ ఆత్మ
ఇంద్రియ ధర్మము... ఇంతే అని తెలప
బుధ్ధిలో ఆత్మయే... శుధ్ధ ఆత్మ
గుణ విశేషణములు .. గురుతులు లేనిది
ఆధార మైనది .... ఆత్మ శక్తి
ఆత్మ అన్నింటికి ... ఆత్మసాక్షిగనుయు
దేహలక్షణములు... దేహ ఆత్మ
తేటగీతి
లింగ బేధము జాతిభేదమ్ముగాని
ఆత్మ సచ్చిదానంద లక్ష్య మునగాను
పాప పుణ్యఆత్మలు అనునవియు లేవు
ఆశ్రమ కుల భేదములు లేని అంతరాత్మ
--(())--
లైటు వెలగటానికి, ఫ్యాన్ తిరగరటానికి, ఫ్రిజ్, టీవీ, హీటర్, రేడియో, ఏ.సి. అన్నింటికీ కారణం కరెంటే. ఆ కరెంటులో ఏ భేదములు లేవు. అదొక్కటే రకం. కరెంటుకు వెలిగే గుణం, తిరిగే గుణం, వేడినిచ్చే గుణం, చల్లదనాన్నిచ్చే గుణం ఇవేవీ లేవు. అది అన్నింటిలోనికి వెళ్ళినప్పుడు దాని శక్తి వల్ల అన్నీ వాటి ధర్మాలు అవి నిర్వర్తిస్తున్నాయి. అట్లాగే ఆత్మ అందరిలో భాసిస్తుంది. అదే జాగ్రదావస్ధలో జరిగే సమస్తాన్ని తెలుసుకుంటున్నది. స్వప్నావస్ధలోని సమస్తాన్ని తెలుసుకుంటున్నది. సుషుప్తిలో ఏమీ తెలియకపోవటాన్ని కూడా తెలుసుకుంటున్నది. శరీరాల్లో భేదమే గాని ఆత్మలో భేదంలేదు.
హిందూ ఆత్మ, ముసల్మాన్ ఆత్మ, క్రిస్టియన్ ఆత్మ, భారత ఆత్మ, ఆస్ట్రేలియా ఆత్మ , వైశ్య ఆత్మ, బ్రాహ్మణ ఆత్మ, శూద్ర ఆత్మ, పేద ఆత్మ, ధనికి ఆత్మ, తెలివిగల ఆత్మ, పిచ్చి ఆత్మ, అమాయక ఆత్మ, ముసలి ఆత్మ,కుర్ర ఆత్మ, మగ ఆత్మ, ఆడ ఆత్మ, కుక్క ఆత్మ, నక్క ఆత్మ అని..... వేరువేరుగా ఆత్మలు లేవు. ఉన్నది ఒక్కటే ఆత్మ. బయట ఉపాధులను బట్టి ఆత్మలు అనేకం అనుకొనేవాడు ఆధ్యాత్మిక రంగంలో పరమ మూర్ఖుడు. జాతి, వర్ణ, వర్గ, లింగ, భేదాలన్నీ ఆత్మకు చెందినవి కావు. అవి ఉపాధులకు చెందినవి; దేహాలకు చెందినవి. అలాగే పుణ్యం, పాపం కూడా ఉపాధులకు (మనస్సుకు) చెందినవే కనుక పుణ్యాత్మ, పాపాత్మ అంటూ లేవు. ఆత్మ అన్నింటికి కేవల సాక్షిగా ఉంటుంది. అంతే.
స్వచ్చమైన నీటికి రంగులేదు, రుచిలేదు, వాసనలేదు. స్వచ్చమైన వర్షపు నీరు భూమి మీదకు పడేటప్పుడు స్పటికంలాగా రంగు ఉండదు. రుచి ఉండదు. వాసన ఉండదు. కాని భూమి మీద పడటంతో అది భూసారంతో కలిసి రంగు రుచి ఏర్పడుతుంది. అందుకే వాన వెలిసిన తర్వాత చూస్తే ఆ నీరు ఒకచోట నల్లగాను, ఒకచోట ఎర్రగాను, ఒకచోట పచ్చగాను ఉంటుంది. అలాగే నీరు తీయగా ఉంటుంది. కొన్ని చోట్ల ఉప్పగా ఉంటుంది. కొన్ని చోట్ల చవ్వగా ఉంటుంది. ఇదంతా భూమిలోని లవణాల యొక్క కలయిక చేతనే.
అలాగే ఆత్మ అంతటా - అందరిలో ఒక్కటే. దానికి ఏ గుణాలు లేవు, ఏ భేదాలు లేవు. అయితే దేహమనే ఉపాధితో తాదాత్మ్యం వల్ల దేహలక్షణాలు ఆత్మపై ఆరోపించబడుతున్నాయి. దేహం భారత దేశంలో పుట్టింది గనుక భారతీయుడని, బ్రాహ్మణకులంలో జన్మిస్తే బ్రాహ్మణుడని, వైశ్య కులంతో జన్మిస్తే వైశ్యుడనని, ఈ దేహం బాల్యంలో ఉంటే బాలుడని, వివాహం చేసుకొని ఉంటే గృహస్తుడని, గృహాన్ని వదలివెళితే వానప్రస్ధుడని, సర్వసంగ పరిత్యాగంచేస్తే సన్యాసియని - ఇలాగ వేరువేరు విధాలుగా పిలవబడుతున్నాడు. అంతేతప్ప ఆత్మకు జాతి భేదంగాని, లింగభేదంగాని, వయో భేదంగాని, కులభేదంగాని, ఆశ్రమభేదంగాని ఏవీ లేవు. ఆత్మజ్ఞానం లేకపోవటంవల్ల ఉపాధులకు పరిమితులమై ఉపాధి లక్షణాలను ఆత్మపై ఆరోపించుకుంటున్నాము. దు:ఖాలు పొందుతున్నాం. ఆత్మ యొక్క సచ్చిదానంద లక్షణం అనుభవరీత్యా బోధపడితే ఇక మనం ఏ భేదాలు లేని ఆత్మగా కేవలంగా ఉండిపోతాం.
--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక (07-10-2020)
ఇది కధ కాదు సన్మార్గమునకు కధ ... 107 .
సేకరణ /రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మీకు హిపోక్రాట్స్ తెలుసా? ఆయన ఇప్పటి వాడు కాదు. క్రీస్తు పూర్వం 460వ సంవత్సరానికి చెందిన వాడు. అప్పట్లోనే వైద్య రంగ నిపుణుడిగా పేరుగాంచాడు. అందుకే ఆయన్ను "ఫాదర్ ఆఫ్ మెడిసిన్" అని పిలుస్తారు. ఇంతకీ అసలు విషయం ఏంటో తెలుసా..? ఏమీ లేదండీ.. సదరు హిపోక్రాట్స్ అనే ఆయన వాకింగ్ గురించి ఓ కొటేషన్ చెప్పారు. అదేమిటంటే.. వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్.. అని ఆయన అన్నారు. అవును, మీరు విన్నది నిజమే.
ప్రకృతి వాతావరణం అనుకరించి ఆరోగ్య మెరుగుదలకు ప్రతిఒక్కరికి ఉపయోగం ఉంటుందని ఆశయంతో ఈ క్రమంలోనే ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే దాంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయన చెప్పారు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. వాకింగ్ రెగ్యులర్‌గా చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనబడే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వయస్సు మీద పడడం కారణంగా వచ్చే దెమెంతియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
2. నిత్యం వాకింగ్ చేయడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కంటికి సంబంధించిన పలు నాడులు కాళ్లలో ఉంటాయి. అందుకనే కాళ్లతో వాకింగ్ చేయడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందట. నిత్యం వాకింగ్ చేస్తే కళ్లపై అధిక ఒత్తిడి తగ్గడంతోపాటు గ్లకోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట.
3. నిత్యం రన్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయడం వల్ల కూడా కలుగుతాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. నిత్యం వాకింగ్ చేస్తే గుండె సమస్యలు, హార్ట్ ఎటాక్‌లు రావట. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయట. దీంతోపాటు శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుందట.
4. వాకింగ్ చేయడం వల్ల శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో అదే ఆక్సిజన్ రక్తంలో చేరి అది ఊపిరితిత్తులకు అందుతుంది. ఈ క్రమంలో సదరు ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే ఇతర ఊపిరితిత్తుల సమస్యలు దూరమవుతాయి.
5. డయాబెటిస్ ఉన్నవారు నిత్యం రన్నింగ్ కన్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్రయోజనం కలుగుతుందట. 6 నెలల పాటు వాకింగ్, రన్నింగ్ చేసిన కొందరు డయాబెటిస్ పేషెంట్లను సైంటిస్టులు పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది. వాకింగ్ చేసిన వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వచ్చాయని సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల రోజూ వాకింగ్ చేస్తే డయాబెటిస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వారు చెబుతున్నారు.
6. నిత్యం కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం పోతుంది. విరేచనం రోజూ సాఫీగా అవుతుంది.
7. నిత్యం 10వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బరువు త్వరగా తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతోపాటు కండరాలు దృఢంగా మారుతాయట.
8. నిత్యం వాకింగ్ చేయడం వల్ల కీళ్లు బాగా పనిచేస్తాయి. అవి అంత త్వరగా అరిగిపోవు. అలాగే ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చర్లు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇందుకు రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి.
9. బ్యాక్ పెయిన్‌తో సతమతమయ్యేవారికి వాకింగ్ చక్కని ఔషధం అనే చెప్పవచ్చు. లో ఇంపాక్ట్ వ్యాయామం కిందకు వాకింగ్ వస్తుంది. కనుక నడుంపై పెద్దగా ఒత్తిడి పడదు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. రక్త సరఫరా పెరిగి నొప్పి తగ్గుతుంది. కనుక వెన్ను నొప్పి ఉన్నవారు నిత్యం వాకింగ్ చేయడం మంచిది.
10. నిత్యం వాకింగ్ చేయడం వల్ల ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వస్తారట. వారు హ్యాపీగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి,
11. వాకింగ్ చేయటువల్ల ఊపిరితిత్తులు, గుండె శబ్దము క్రమఆపద్ధతిగా ఉంటుంది. ముఖ్యంగా శ్వాసకోశవ్యాధులు తగ్గుతాయి. ప్రకృతిలో చెట్లగాలి అనేక ఔషదాలతో సమానము ఆగాలి ఆరోగ్యానికి చాలా మంచిది. కనుక నిత్యం వాకింగ్ చేయడం మంచిది.
--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక (07-10-2020)
ఇది కధ కాదు సన్మార్గమునకు కధ ... 107 .
సేకరణ /రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కూతురు అమెరికాలో..అమ్మ అంబాజీపేటలో..కొడుకు ఇంగ్లండ్ లో తండ్రి ఇరుకు సందులో..
నువ్వు ఇన్ఫోసిస్ నాన్నకేమో క్రైసిస్ .. నువ్వు వీసాపై ఎక్కడో అమ్మ అంపశయ్యపై నీ ఊళ్ళో
నువ్వు రావు..రాలేనంటావు..నిజానికి రావాలని అనుకోవు..
టికెట్ దొరకదంటావు..సెలవు లేదంటావు..వస్తే తిరిగి రావడం కష్టమంటావు..నువ్వు వచ్చేదాక
అమ్మ ప్రాణం పోనంటుంది..నీ రాక కోసం ఆ కళ్ళు
గుమ్మం వైపే..రావని తెలిసినా నాన్న అమ్మకు ఆ కబురు చెప్పలేక..కక్కలేక..మింగలేక.మంచం చుట్టూ అటూ ఇటూ అవతల ఆ తల్లి
ఇంకాసేపట్లో అటో ఇటో..
వయసు వచ్చినప్పటి నుంచి డాలర్ డ్రీమ్సే..
పొద్దున లేస్తే ఆ ఊసే..నీ కలల వెనకే తల్లిదండ్రుల పరుగు.వారి ఆశలన్నీ నీ అమెరికా పయనంతోనే కరుగు..
బ్రతుకుతెరువంటూ నువ్వక్కడ..
గుండె బరువుతో వారిక్కడ..
మొదట్లో రోజూ ఓ వాట్సప్ కాలు రెండ్రోజులకో వీడియో ఫోను పోను పోను కొంత విరామం
ఏంట్రా అంటే వర్కులోడు అప్పటికే నిద్ర లేచి ఉంటాడు
నీలో ఓ మాయలోడు...అక్కడ కొనుక్కున్న కొత్త కారుతో నీ ఫొటో పోజు
ఇక్కడ డొక్కు స్కూటర్ తో తంటాలే నాన్నకి ప్రతిరోజు..
ఈలోగా అన్నీ బాగుంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి..
లేదంటే అక్కడే ఓ మేరీతో మేరేజ్..
ఆలికి కడుపో కాలో వస్తే ఆయాగా అమ్మకి వీసా
నాన్నకి నేను డబ్బులు పంపుతాలే అని భరోసా..!
ఎంత అమ్మయినా నీ పిల్లలకు నాన్నమ్మయినా ఆమె నాన్నకు భార్య అక్కడ పెద్దాయన
రోజూ చెయ్యి కాల్చుకుంటున్నాడేమోనని ఒకటే బెంగ..
ఆ దంపతులను అలా వేరుగా ఉంచి మీ జంట మాత్రం టింగురంగ..
మొత్తానికి అలా అమ్మ అవసరం కొంత తీరాక అప్పుడిక ఆమె ఉంటే బరువు ఈలోగా ముగుస్తుంది
ఆమె వీసా గడువు..ఆమె చేతిలో టికెట్ నాన్నకిమ్మంటూ
ఓ గిఫ్టు పేకెట్..
ఇటు నిన్ను వదలి వెళ్ళలేక అటు భర్తని విడిచి ఉండలేక చెమ్మగిల్లిన కళ్ళతో విమానం ఎక్కిన అమ్మకి తెలియదు అదే చివరి చూపనిఊరెళ్ళాక కమ్మేసిన జబ్బు నీళ్లలా ఖర్చయ్యే డబ్బు..
నువ్వు పంపుతావేమో..
కాని ఆ వయసులో నాన్నకు శ్రమ..
నువ్వు వస్తావని అమ్మకి భ్రమ..
వచ్చే ప్రాణం..పోయే ప్రాణం చివరకు అనివార్యమయ్యే మరణం
వాడు వస్తున్నాడా.. ఏమంటున్నాడు..
ఊపిరి వదిలే వరకు అదే ప్రశ్నతో అమ్మ..
నిర్జీవమైన ఆ కళ్ళలో నీ బొమ్మ..
కొరివి పెట్టాల్సిన నువ్వు సీమలో...
నాన్న కర్మ చేస్తుంటే ఖర్మ కాలి చూసేస్తావు లైవ్ లో..
అస్తికల నిమజ్జనం అంటూ నాన్న కాశీకి పయనం అంత శ్రమ ఎందుకు..
పక్కనే ఉంది కదా గోదారని నీ అనునయం..
ఇప్పుడిక నాన్న కథ..
ఉన్న ఊరు..కట్టుకున్న ఇల్లు ముఖ్యంగా ఆ ఇంట్లో అమ్మ జ్ఞాపకాలు వదిలి రాలేక.. ఒంటరి బ్రతుకు ఈడ్వలేక..కష్టాలకు ఓర్వలేక.. ఓ రోజున ఆయన కధా కంచికి ఈసారి వస్తావు..
కొరివి పెట్టి ఊళ్ళో ఇల్లు అమ్మేసి ఉన్న ఊరు..కన్న తల్లి..
అన్నిటితో రుణం తెంచుకుని నేను ఎన్నారై..
మిగిలినవన్నీ జాన్తా నై.అంటూ పుట్టిన గడ్డను వదిలి పెట్టిన గడ్డకు శాశ్వతంగా వలస
ఇదే కదా చాలామంది వరస..!
(అన్ని కథలూ ఇలాగే ఉంటున్నాయని కాదు..కానీ చాలా ఇళ్ళలో ఇదే బాగోతం.!
సంపాదనపై మోజుతో విదేశాలకు వెళ్ళడం..ఇక్కడి కన్నా అక్కడ జీవితం చాలా గొప్పగా
ఉంటుందంటూ సన్నాయి నొక్కులు మారిపోయే దృక్కులు. అక్కడి నుంచి మేజిక్కులు.. జిమ్మిక్కులు. ఎక్కడ ఉన్నా తల్లిదండ్రులను నెత్తిన పెట్టుకుని చూసే పిల్లలూ..
ఈ దేశంలో ఉండి కూడా పట్టించుకోని పిల్లలూ లేకపోలేదు.అయితే పూర్తిగా అలాగే ఉంటున్న సంతానం గురించే ఈ ఆవేదన..
కాస్తయినా మారండని నివేదన)
జీవితాలు ఎటు మారుతాయో ఎవరూ చెప్పలేరు కాని మన ఆశలు మనల్ని మార్చేస్తున్నాయి. కొడుకు, కూతురు చదివితే బాగుపడతారని ఆశిస్తున్నారు. కానీ కేవలము కెహెదువుతో పాటు వృతి విద్య కూడా నేర్పితే బతుకు బండి దగ్గరుండి నాల్గవచ్చు అని నా ఆలోచన.
ఇతరదేశాల కు పోయి బతుకును ధారపోయటమే కదా అదే మానదేశ అభివృద్ధికొరకు నీప్రయత్నం చేస్తే అందరూ సహకరిస్తారు. నేటియువకులు ... రేపటి వృద్ధులు అవుతారని తెలుసుకొని ధర్మమార్గాన్ని పయనించండి. తల్లి తండ్రుల క్షోభ ఎవరికీ మంచిది కాదు.
సర్వేజనా సుఖినోభవంతు ... ఓం శాంతి .. ఓంశాంతి ... ఓం శాంతి
--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక (08-10-2020)
ఇది కధ కాదు సన్మార్గమునకు కధ ... 108 .
చిరిగిన పంచి చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీలపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు - మీ కోసం ఏమి తీసుకురావాలి?
ఆ వ్యక్తి ఇలా అన్నాడు- " జిల్లాలో పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, నగరంలోని అతిపెద్ద హోటల్‌లో #దోశ తినిపిస్తాను, అని మా అమ్మాయికి వాగ్దానం చేశాను."
మా అమ్మాయి వాగ్దానాన్ని నెరవేర్చింది. దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి. "వెయిటర్ అడిగాడు-" మీ కోసం ఏమి తీసుకురావాలి? "అతను అన్నాడు-" నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బే ఉంది. నాకు వొద్దు ..."మొత్తం విషయం విన్న తర్వాత వెయిటర్ యజమాని వద్దకు వెళ్లి మొత్తం కథ చెప్పాడు- "నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను . ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసివేయవచ్చు." అప్పుడు యజమాని అన్నాడు- "ఈ రోజు మనం హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వాళ్లకి పార్టీ ఇద్దాం అన్నాడు ... ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు 😊
హోటల్ వాళ్ళు ఒక టేబుల్‌ను చక్కగా అలంకరించారు... ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు...అ యజమాని వాళ్లకి మూడు దోశలు తో పాటు పొరుగువారికి స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేశాడు... చాలా గౌరవం ఇచ్చిన అతను,అతని కుమార్తె కళ్ళలో ఆనందంతో కన్నీళ్లతో తన ఇంటికి వెళ్ళారు...
సమయం గడిచిపోయింది ...
ఒక రోజు ఆ అమ్మాయే I.A.S. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే కలెక్టర్‌గా వచ్చింది.ఆమె ముందు ఒక అటెండర్ ని అదే హోటల్‌కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పారని తెలియజేయమంది ... హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్‌ను బాగా అలంకరించాడు.ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది...
అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమె గౌరవార్థం నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించి ఆర్డర్ కోసం అభ్యర్థించారు. ముందుకు వెళుతున్నప్పుడు, ఆమె ఇలా చెప్పింది- "మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు. , ఎవరి తండ్రికి మరొక దోశ తినటానికి డబ్బు లేదో నేను ఆ అమ్మాయినే. అప్పుడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు🙏, నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగువారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేశారు..
ఈ రోజు నేను మీ ఇద్దరి మంచితనం తో కలెక్టర్ అయ్యాను...మీ ఇద్దరినీ నేను ఎప్పుడూ అనుకూలంగా గుర్తుంచుకుంటాను... ఈ రోజు ఈ పార్టీ నా తరపున ... ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను.... అలా అని అందరి ముందు వాళ్ళని సత్కరించింది తను..👏👏
నీతి -
ఏదైనా పేదల పేదరికాన్ని ఎగతాళి చేయకుండా, వాళ్ళలో ఉన్న ప్రతిభను గౌరవించండి...
ఇదే నిజమైన సన్మానం సహాయం చేసిన వారిని మరువకుండా గుర్తుపెట్టుకొని చేసేదే నిజమైన
ప్రేమ
--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక (09-10-2020)
ఇది కధ కాదు సన్మార్గమునకు కధ ... 109 .
తాడు దొరికిందని ఏనుగును కొనుక్కోవడం అంటే ఇదేనేమో !
పులుపు...
++++++
ఏమండీ వచ్చేటపుడు పెరుగు తీసుకొస్తారా.. ఇంట్లోని పెరుగు మూడు రోజుల క్రితం నాటిది.. బాగా పుల్లగా అయింది.
అవునా... అలాగైతే దాన్నేం చేస్తావు ?
ఏం చేయాలి ? బయట పారబోస్తానంతే...
అమ్మ చెబుతుండేది.. పెరుగును బయట పారబోయరాదని. ఏదో ఒకటి చేయి...
ఏం చేయాలి.. మజ్జిగ చేస్తే పులుపే పులుపు. నోట్లో పెట్టుకోలేమే...
ఒక పని చేయి. మజ్జిగ పులుసు చేయి. తినడానికీ రుచిగస ఉంటుంది...
గుడ్ ఐడియా .. ఎలాగూ బయటకు పోతున్నారుగా.. కొన్ని సామాన్లు చెబుతాను , వ్రాసుకోండి.
సరే చెప్పు...
ఊ.. కొత్తిమీర, కరివేపాకు, అల్లం.. ఆ.. ఒక టెంకాయ , జీలకర్ర..
సరే .. వ్రాసుకున్నాను.. బయల్దేరనా ...
ఉండండి.. ఇంకా ఉన్నాయి.. ఒక బూడిద గుమ్మడికాయ...
బూడిద గుమ్మడికాయనా ? అదెందుకు ?
మరి మజ్జిగ పులుసు బెండకాయతో చేయడానికొస్తుందా ? తెచ్చేదేదో పెద్దదే తెండి. కోసిపెట్టినది , కుళ్ళిపోయినది కాకుండా చూసి తీసుకురండి.
సరే... బయల్దేరనా ?
అయ్యో .. కాస్త ఆగండి.. ఒకటే గుమ్మడికాయ తేకూడదంట, అమ్మమ్మ చెబుతుండేవారు. ఎలాగూ తెస్తున్నారు రెండు తెండి. అవి కూడా పెద్దవి. ఇంకో పని చేయండి.పెద్ద గుమ్మడి కాయ తెస్తున్నారెలాగూ, ఒక కేజి చక్కెర, ఒక కేజి నెయ్యి , ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఏలకులు ...
ఇవన్నీ మజ్జిగ పులుసుకు వేస్తారేమే ?
ఛీ, పులుసుకు కాదండి.. హల్వా చేయడానికి. గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలివేయరాదు. అపశకునం..
ఇక చాలా ?
కాస్త ఆగండి.. ఓ నాలుగైదు నిమ్మ కాయలు, నల్ల మిరియాలు, ఎస్ ఎస్ పి ఇంగువ తీసుకురండి. ఘమఘమల వాసనలొస్తాయి.
హల్వాకు ఇంగువ వేస్తారా ?
థూ .. హల్వాకు ఎవరైనా ఇంగువ వేస్తారాండి.. ఇవి గుమ్మడికాయ వడియాలకు.. గుమ్మడికాయ తెస్తున్నపుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి ?
ఇకనైనా వెళ్ళనా ?
ఏదో జ్ఞాపకానికొస్తోంది ఉండండి. ఆ.. జ్ఞాపకమొచ్చింది. ఒక పొట్లకాయ తెండి. మజ్జిగ పులుసుకోసం గుమ్మడికాయతో బాటు మంచి కాంబినేషన్ . దాంతో బాటు ఒక అర్ధ కేజి మొత్తని శనగపిండి తీసుకురండి. ఎలాగూ పొట్లకాయ తెస్తున్నారు కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి ? అలాగే వంటసోడా, రిఫైన్డ్ ఆయిలూ తీసుకురండి, వేరుశనగనూనె కాదు సన్ ఫ్లవర్ ఆయిల్...
సరే.. బయల్దేరుతున్నాను.
అదేమిటి వెనుక తలుపు వైపు. అక్కడెక్కడికి వెళ్తున్నారు.
నేను బయటకు పోవడం లేదు, వంటింట్లోకి వెళ్తున్నాను.
ఎందుకు ? మార్కెట్ కు పోరా ?
నీ మార్కెట్ నాశనం కాను. గ్లాసుడు మజ్జిగపులుసు కోసం వేయి రూపాయలు ఖర్చు చేయాలా ? పాపమొస్తే రానీ.. నేనే ఆ పులిసిన పెరుగును బయట పారబోస్తాను..
ఏమిటండీ, మీరే చెప్పారుగా ...
చెప్పాను.. బుద్ధిలేక.. పులుపు నాకు సరిపోదు.. అసిడిటీ... ,
😑
సేకరణ....
--(())--
ప్రాంజలి ప్రభ ....అంతర్జాల పత్రిక (10-10-2020)
ఇది కధ కాదు సన్మార్గమునకు కధ ... 110 .
🍁ప్రకృతి సత్యం🍁
ఎవరినీ మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని, పాడవ్వమని కాని తిట్టకండి.
బుద్ది బాగుపడాలి బావుండాలి అని కోరుకోండి.
ఒకడు బాగుపడితే వాడి వలన పదిమందికి ఉపయోగం కలుగుతుంది.
అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది.
ఎందుకంటే
ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం.
ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది.
చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది.
సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా ..
కనుక ఈరోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి.
1.సంకల్పంతో సత్యాన్ని సాధించడమే నిజమైన మతం
2.అంతరంగం అందంగా ఉంటే, ఆచరణ అర్ధవంతంగా ఉంటుంది.
౩. సంపద మూర్ఖులకు యజమాని, వివేకవంతులకు బానిసలాంటిది.
4. మన ప్రవర్తనే మనకు శత్రువుల్ని, మిత్రుల్ని సమకూరుస్తుంది.
5. మాటకు మాట ప్రతీకారం కాదు. మౌనమే దానికి సమాధానం
6.పరిస్థితులు మనిషిని సృష్టించడం లేదు. మనిషే పరిస్థితులను సృష్టిస్తాడు.
7.ముందు చూపు లోపించినపుడే ముప్పు సంభవిస్తుంది.
8.అణుకువలేక పోతే అందం కూడా వికారం కలిగిస్తుంది.
9..మనిషిని చులకన చేసేది తన గొప్పతాను చెప్పుకోవడమే.
10.అసమర్ధుని ఆఖరి అస్త్రమే హింస.
11.మంచి పనికి మించిన పూజలేదు.
12.వందవ్యర్ధ మాటల కంటే శాంతి చేకూర్చే ఒక్కమాట చాలు.
అందుకే కదా
భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రావణుడు మృతుడయ్యాడు.
యుధిష్ఠిరుడు కూడా మహామహా పాపాత్ములని క్షమించాడు. చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను అయిదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలుదువ్వాడు. చివరికి చచ్చాడు.
మేలు కోరుకోవడం మనవంతు.వినకపోతే అనుభవించడంవాళ్ళ
వంతు. 🍃🌸🙏
🍃🌸🏵🌼🍃🌸*🔺
ఒక కొడుకు తన తండ్రి దగ్గరకు వచ్చి, ఒక జాబితా ఇచ్చి " నాన్నా, ఈ జాబితాలో ఉన్న యాభై మంది నా స్నేహితులు. వీరిని నా పెళ్ళికి పిలుద్దామని అనుకుంటున్నాను" అని చెప్పాడు.
అప్పుడు తండ్రి "సరే, ఆ జాబితాలో ఉన్న వాళ్ళందరికీ నేను పిలుస్తాను. నువ్వు మిగిలిన పనులు చూసుకో" అని చెప్పాడు.
పెళ్లి ముహూర్తం సమీపించింది. పెళ్లి మండపంలో చూస్తే తన స్నేహితులు పదిమంది మాత్రమే కనిపించారు. వెంటనే కొడుకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి " నాన్నా నేను నీకు యాభై మంది జాబితా ఇచ్చాను కదా, మరి పదిమంది మాత్రమే ఉన్నారు, మిగిలిన వారిని మీరు పిలవలేదా" అని అడిగాడు.
అప్పుడు తండ్రి "నేను నువ్వు ఇచ్చిన జాబితాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాను. కాని నీ పెళ్ళి అని చెప్పలేదు. నా కొడుకు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు, దయచేసి మీరు ఎవరైనా అతనికి సహాయం చెయ్యదలచుకుంటే, ఈ సమయానికి ఇక్కడికి వచ్చి సహాయం చెయ్యండి అని చెప్పాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నీ నిజమైన స్నేహితులు. మిగిలిన వారు స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్తులు. పరిచయం ఉన్న ప్రతి ఒక్కరినీ స్నేహితులుగా భావించకు" అని చెప్పాడు.
#నీతి : మనం ఆనందంలో ఉన్నప్పుడు మన పక్కన లేకపోయినా పరవాలేదు, కాని మనం బాధలో ఉన్నప్పుడు మాత్రం నేనున్నాను అని భరోసా కలిగించిన వాడే నిజమైన స్నేహితుడు.
--(())--
ప్రాంజలి ప్రభ ....అంతర్జాల పత్రిక (11-10-2020)
ఇది కధ కాదు సన్మార్గమునకు కధ ... 111 .
పిల్లలూ ఈరోజు లక్ష్మి దేవి గురించి తెలిసినది మీ కందఱకు తెలియాపరుస్తాను అన్నాడు మాధవ్
పిల్లలందరూ ఉత్త్సా హంగా వింటున్నారు
🌹శ్రీమహాలక్ష్మి ఈ ఐదింటా వుంటుంది🌹
క్షీరసాగర మథనం జరుగుతుండగా అకస్మాత్తు గా లక్ష్మీ దేవి ఆవిర్భవించింది. ఆవిర్భవిస్తున్న స్థితి ని ఎంతో అద్భుతం గా వర్ణిస్తారు పోతన గారు. ఆ తల్లి ఈ లోకములన్నీ కూడా అనుగ్రహించడం కొసం పైకి వస్తుంటే .. శిరస్సు నించి పాదాల వరకు ఆ రూప వైభవాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణిస్తారు. .
తొలకరి ప్రారంభమయ్యే సమయములో ఆకాశంలో వచ్చేటువంటి మెరుపు ని సౌదామిని అంటాం. అది కంటిని ఆకర్షిస్తుంది. థళుక్కు థళుక్కు మనే మెరుపు కి అందరూ ఆ దిశ గా చూస్తారు. లక్ష్మీ దేవీ మెరుపు కూడా అలాటిదే. లక్ష్మీ దేవి వైభవాన్ని ఎక్కడ ఎవరు వర్ణించినా, స్తుతించినా, శ్లాఘించినా - మెరుపు తీగ తో పోల్చి చెబుతారు. ఎందుకంటే, అందరి కంటినీ అమితం గా ఆకర్షించే శక్తి మెరుపుకి వుంటుంది. విద్యుల్లతలా ఆమె కరుణా కటాక్షాలు కూడా లోకం పట్ల కాంతులు వెదజల్లుతూ వుంటుంది.
ఆమె ఒక్క సారి కన్ను తెరిచి, క్రీగంట చూస్తే చాలు. లోకములన్నీ బ్రతుకుతాయి.
చైతన్యాన్ని విప్పుకుంటాయి.
ఆమె శరీరం అంతా కూడా మిల మిలా , ధగ ధగా మెరిసిపోతూ వుంటుంది. ఆమె ఒక కాంతి పుజం. ఆ కరుణా వీక్షణాలు ప్రసరించిన ఉత్తరక్షణానే, ఇక అలా ఇలా కాని, ఆ ఐశ్వర్య వైభవం మాటలకందని రీతిలో వుంటుంది. ఆ ఉత్సాహం కానీ, ఉల్లాసం కానీ, ఐశ్వర్యం కానీ, పూనిక కానీ, సంపద కానీ, అన్నీ కూడా అంత పుష్కలత్వాన్ని పొందుతాయి.
ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని అందరూ గ్రహించాల్సి వుంటుంది.
ఐశ్వర్యమూ అంటే - కేవలం ధన సంబంధిత సంపద మాత్రమే అని అనుకోకూడదు. అది కాదు.
లక్ష్మి అంటే ఎవరు అని అభిప్రాయపడుతున్నారు? :
మనల్ని విశేషముగా సత్కరించాలి అనుకుంటే ఆ తల్లి ఆడపిల్ల గా ఇంటికొస్తుంది.
ఆడపిల్లా అంటే శ్రీ మహాలక్ష్మి అని అర్ధం.
ఆడపిల్ల పెళ్లయి, అత్తవారింటికి వెళ్ళి తన సత్ప్రవర్తనతో, సత్శీలతతో ఇరు వంశీకులని తరింపచేస్తుంది. మగపిల్లాడికి ఆ అవకాశం లేదు.
అసలు ఆడపిల్ల వచ్చిందీ అంటే నే లక్ష్మీ దేవి వచ్చిందని.
ఆడపిల్ల - అటు వెనక పదితరాలు, ఇటు ముందు పది తరాలను, తండ్రితో కలిపి 21 తరాల వారిని తరియింపచేస్తుంది. ఆడపిల్ల ఇంటికొచ్చిందంటే, లక్ష్మి దేవి వచ్చినట్టే.
మగపిల్లాడికి పెళ్లయ్యాక ఆ ఐశ్వర్యం ఎవరిదీ అంటే అతనిది కాదు. ఆ ఇంటి ఇల్లాలిది.
ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీ దేవిని స్తుతించినప్పుడు స్వయంగా తానే చెబుతుంది.
తాను ఎక్కడెక్కడు నివాసమై వుండేది! .
వైకుంఠం లో లక్ష్మీ దేవి గా కైలాసం లో పార్వతీ దేవిగా బ్రహ్మ లోకం లో సరస్వతిగా ఉంటుంది. అంటే శక్తి దేవతలు అందరూ కలసిన మహాశక్తి మూలస్వరూపిణీ శ్రీమహాలక్ష్మి.
ఇంకా మహా రాజు దగ్గర రాజ్య లక్ష్మి గా ప్రతి ఇంటి ఇల్లాలి లో - గృహలక్ష్మి గా వుంటానని చెబుతుంది.
'గృహము' అని ఎప్పుడంటారంటే ఆ ఇంట్లో ఇల్లాలు వున్నప్పుడు మాత్రమే!
ఇంటి యజమాని ఎంత అలసిపోనీండి ఇల్లాలి నవ్వుతో, మాటలతో, సేవలతో సేద తీరుతాడు. ఎంత ఐశ్వర్యం వుండనీండీ, ఎన్ని కోట్లు వుండనీండీ. ఆమె వెళ్ళిపోయాక ఆ ఇల్లు ఆయనకు మనశ్శాంతి ఇవ్వలేదు. గృహము అంటే మేడ కాదు. భార్యయే గృహము. అందుకే గృహలక్ష్మీ గృహే గృహే అని అంటారు.
లక్ష్మీ దేవి ని దర్శించడం ఎంత సులువైనదీ అంటే, నీ భార్య లో, సాటి వారి ఇల్లాలిలో, సోదరి లో చూడవచ్చు. ఈ భావన చాలు. లక్ష్మీ కటాక్షం పొందేందుకు ఈ ఒక్క భావన హేతువు గా నిలుస్తుంది.
దేశానికి అరిష్టం ఎక్కడ పట్టుకుందీ అంటే కనపడిన ప్రతి ఇల్లాలి వంకా చూడకూడని చూపు చూడటం వల్ల, అది దోష భూయిష్టమౌతోంది. అలా కాకుండా, ప్రతి ఇల్లాలిని గనక లక్ష్మీ స్వరూపం గా అటువంటి పవిత్రమైన దృక్కులు కలిగి వుంటే, దేశమంతా కూడా లక్ష్మీ కటాక్షం తో విలసిల్లుతుంది. వర్ధిల్లుతుంది.
అందుకే లక్ష్మీ ఎక్కడెక్కడ నెలవై వుంటుందీ అంటే 5 స్థానాలు అని చెప్పింది శాస్త్రం
అవేమిటంటే
*********
1. గోవు యొక్క వెనకతట్టు.
(రోజుకొక్క సారైనా గోవు వెనక తట్టు చూసిన వారు, ప్రదిక్షణ చేసిన వారూ లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంటిముందుకు వచ్చి నిలబడిన గో మాతకు చేతులారా పండూ, ఫలమూ, పరక ని తినిపించిన వాడు సాక్షాత్తు లక్ష్మీ దేవికి పాయసం తినిపించినంత ఫలాన్ని పొందుతాడు.)
2. పద్మం. - పద్మము లక్ష్మీ స్థానం.
3. ఏనుగు యొక్క కుంభస్థలం.
4. సువాసినీ యొక్క పాపిట ప్రారంభ స్థానం.
5. మారేడు దళం.
ఈ ఐదూ లక్ష్మీ నెలవుండే స్థానాలు.
లక్ష్మీ లోకాన్నంతటినీ చూస్తుంది. లోకమంతా ఆమెని చూస్తుంది. ఆమె ఒక మెరుపు. ఆ తల్లి ఎక్కడ వుంటే అక్కడ సంతోషం వుంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే అర్ధం - సంతోషం గా వుంటమే. అన్నీ వున్నవాని విషాదం కన్నా, ఏమీ లేకపోయినా సంతోషంగా వున్న వాడి దే అసలైన లక్ష్మీకటాక్షం.
--(())--
No comments:
Post a Comment