ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక ,, (ఆనందం ... ఆరోగ్యం ... ఆధ్యాత్మికం )
సేకరణ /రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
* ఆనందసూక్తము
స్పర్శ వలన ఆనందమున్నది. ఉద్రేకము వలనా సుకుమార సున్నిత భావావేశముల వల్లనూ ఆనందం కలుగుతుంది. అవగాహన వల్ల కూడ ఆనందోదయమవుతుంది. జ్ఞాన-వివేచన వల్ల కూడ ఆనందం కలుగుతుంది.
ఆనందములోనికి ప్రవేశించుటవల్లనూ ఆనందం, అట్లే ఆనందములో స్థిరపడుట వల్లనూ ఆనందముంది. ఎప్పటికైనా ఎవరైనా కోరవలసినదికూడా ఆనందమే కదా!
అయితే స్పర్శ వల్ల ఆనందము కూడా ఆనందమే! అది ఎవరూ కాదనలేరు. శీతాకాలంలో బయట చలిగా ఉంటుంది. అదే మీ కారులో కూర్చున్నామనుకోండి. లోపల వెచ్చగా ఉంటుంది. నాకు ఆనందంగానూ ఉంటుంది. అయితే ఒక విషయం.
మనం దక్షిణ భారతదేశానికి వెళ్ళినప్పుడు గాని లేదా భూమధ్యరేఖా ప్రాంతానికి గాని వెళ్ళినట్లయితే, అదీ మండువేసవిలో అయితే, చల్లని హిమగృహంలో (ఏ.సి. రూములో) కూర్చుంటే మనందరికీ ఆనందంగా ఉంటుంది. దీనినే స్పర్శ వల్ల కలిగే ఆనందమంటారు.
కృష్ణభగవానుడు ఇట్లా అన్నాడు "చలికాలంలో వెచ్చదనం ఆనందమైతే, వేసవిలో చల్లదనం ఆనందమనుకుంటే ఆ ఆనందానికి ప్రామాణికత ఏమిటి? చల్లగా ఉన్నప్పుడు నాకు హాయి అని నేనంటే, అది తప్పనిసరిగా వేసవే అయుండాలి. నేను డెన్మార్కు వెళ్ళేవరకు ఆగి, అక్కడ చలికాలమయితే, ఆనందమంటే ఏమిటో నన్ను అడగండి, వెచ్చదనమే ఆనందమంటారు.
అందువల్ల స్పర్శాసుఖము అని మనం పిలిచే ఆ సుఖంలో ఏదో కొద్ది సత్యము తప్ప పూర్తి నిజం కాదు.
ఆనందము యొక్క పై అంచునుండి క్రమక్రమంగా పై స్థాయిలోని ఆనందానికి వెళ్ళాలనుకొంటున్నారు ప్రజలు. అయితే చివరి మెట్టు చేరేవరకు, ప్రతి ఘట్టములోనూ కలిగే ఆనందం శాశ్వతమైనది కాదు...
--(())--
🌻. ఆనందసూక్తము - 2 🌻
మనము ఆనందమనుకొనేది కేవలము ఆనందమును గూర్చిన భావనయేకాని, నిజమైన ఆనందము కాదు. మనలో ప్రతివారు ఆనందమును గూర్చిన తమ స్వీయభావనలో మితిమీరి వర్తించుటలో తృప్తిని బడయుదురు. దానితో పొరలు క్రమ్మి, దానినే ఆనందమని పిలుస్తాము.
కావున మనం ఆనందమనుకొన్న దానిలో ఎంతో సమయాన్ని వ్యయపరచి, ఆనందంగా ఉన్నామని నమ్ముట ద్వారా మనల్ని మనం మోసం చేసుకోవటం, పైగా కాలాన్ని వృథా చేయటమని పరమగురువులు, ఆచార్యులు భావిస్తారు.
ఆనంద భావన నుండి, పరిపూర్ణానందంలోనికి ప్రవేశించడానికి యత్నం చేద్దాము. అయితే దీనికి పరీక్ష ఏమిటి? నాకేది ఆనందాన్నిస్తుందో అది నీకు ఆనందము కాదు, కాకపోవచ్చును.
రెండు గడియారాలు ఒకే సమయాన్ని సూచించవన్నట్లుగా, ఆనందాన్ని గూర్చిన ఏ రెండు భావనలూ ఒకే రీతిగా ఉండవు. ఆనందమనేది వ్యక్తగత భావనగా అభిప్రాయంగా ఉన్నంతకాలం అది ఆనందమనటానికి వీలు లేదు.
నేను ఫలానాది ఆనందమని భావిస్తే, నీవు మరొకటి ఆనందమని నమ్ముతావు. అంటే అర్థం, ఊహాలోకంలో ఆనందాన్ని గూర్చి భావనలో ఇద్దరం జీవిస్తున్నామన్నమాట. అంతేకాదు దానినే ఆనందమని మనం ఆనందంతో అంటూ ఉంటాము.
శరీరమనే వాహికలో ఎన్నో పరికరాలున్నాయి. అది అత్యంత అధునాతనమైన కొన్ని వందల పొరలున్న వాహిక. ఆ పొరల కట్టనే మనం 'మనస్సు' అని అంటున్నాము.
🌹 🌹 🌹 🌹 🌹
🌻. ఆనందసూక్తము - 3 🌻
మనస్సు తనను పరిపోషించే స్వీయ యాంత్రిక వ్యవస్థను, అవగాహనలను, భావనలను కలిగి ఉంటుంది. ఇంద్రియములు-వాని అవయవములు-మనస్సు, ఇచ్ఛ ఉన్నవి. ఇన్నీ దేహంలో చక్కగా అమర్చబడి ఉన్నాయి. వానితో మనము పుట్టినాము.
కాని ప్రతి పరికరమునకు వ్యక్తిగత విషయము అనే శూన్యదోషము (Zero Error) ఉంటూనే ఉంటుంది. అనగా సత్యము కేవలము వ్యక్తిగత అభిప్రాయమే అవుతుంది.
అటువంటి సందర్భాలలో సత్యమనే గాజు పాత్ర మేధావులచే ముక్కలయినదని ఒక ప్రాచీన సంస్కృత కవి వచనము.
లోకంలో స్వంత సిద్ధాంతమను పేర సత్యము యొక్క ఒక పగిలిన ముక్కను ఒక్కొక్కడు మోసుకుపోతూ ఉంటాడు. తన దగ్గర సత్యము యొక్క పగిలిన ముక్క ఉన్నదన్న సంగతి ఏ ఒక్కరూ కాదనలేరు.
కాని ఏ ఒక్క ముక్కకూ పాత్ర యొక్క ప్రయోజనము నెరవేర్చే సామర్థ్యము లేదు. ఇంతకూ చెప్పవచ్చినదేమంటే, ప్రతివాని దగ్గర సత్యము యొక్క పగిలిన ముక్క మాత్రమే ఉన్నది.
లోకపు తీరు ఎట్లాంటిదంటే, పలు సిద్ధాంతాలను ఒకదానితో ఒకటి సరిపోల్చుకుంటూ ఏది సరియైనది ఏది కాదు అని అవగాహన చేసుకోవటానికి ప్రయత్నిస్తూ, ఆలోచిస్తూ మరణించే వరకూ అట్లా తర్కంలోనే ఉంటాడు. తన భావన వ్యక్తిగతమైన కారణం. దానికి శూన్యదోషము అంటక మానదు. ఎప్పటికీ ఒక నిర్ణయానికి రాలేని అశక్తుడవవుతాడు.
అందుచేత భావనాపరిధిని అధిగమించి ఆనందస్థితి చేరువరకు, ఆనందాన్ని గూర్చిన భావన అపవాదము కాదు. ఆనందమును గూర్చిన మన భావన వసుధైక కుటుంబ భావనను చేరేదాకా, విశ్వజనీనమగువరకు మనము దానిని ఆనందమని చెప్పజాలము.
అనగా నీ చెంతనున్న ఎవడైనా ఆనందంగా ఉండటం, మరో విధంగా లేకపోవడం, నీతో ఎవరైనా మాట్లాడినపుడు జ్ఞానముతోడి ఆనందము పొందుట- అప్పటి వరకూ నీవు దానిని ఆనందమని అనలేవు. ఇదే భగవద్గీత, మరెన్నో పవిత్ర గ్రంథాలు చెబుతున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌻. ఆనందసూక్తము - 4 🌻
అయితే ఆనందాన్ని చేరుకొనే త్రోవ ఏమిటి? ఆ మార్గము సేవ, త్యాగములలో ఉన్నవి. ఆనందానికి సేవ, త్యాగములే ప్రోత్సాహకాలు. అవి అర్థం చేసుకోవటానికి ఎన్ని జన్మలు, పునర్జన్మలో కాలాన్ని హరించటానికి.
ఆనందాన్ని డబ్బుతో కొనుక్కోవచ్చని భావిస్తాము. అందుకై పడరాని పాట్లు. అవసరమైనవి, ఆవశ్యకమైనవి కొనుక్కొనుటకు మాత్రమే ధనము అవసరమన్న సంగతి మరచిపోతాము.
మనకు అవసరాలు, కోరికలు ఎన్నో!! కోరికల కొరకు వస్తువులు కొనటం మొదలుపెడతాము, కోరిక అనేది అడుగు భాగం లేని పాత్ర అని గ్రహించం. పైగా దానిని డబ్బుతో నింపాలని యత్నించి, డబ్బు సంపాదిస్తూ పోతుంటాము. దానికై కార్యకలాపాలు పెంచుకొంటాము. ఇదంతా ఎందుకంటే అనందంగా ఉండాలని ఉంది కనుక.
"ఆనందంగా జీవించాలనే దురదృష్టవంతునికి ఆనందంగా ఉండటానికి సమయమే చిక్కటం లేదు." అని పవిత్రగ్రంధాలు చెబుతున్నాయి.
ఆనందంగా ఉండటానికి ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నప్పుడల్లా మనకు వైఫల్యమే మిగులుతున్నది. ఎందుచేతనంటే ఆనందమునకు, ఆనందాన్ని కొనగలిగిన మరో వస్తువు లోకంలో లేదు. నిజంగా కొనగలిగితే, అది ఆనందం కంటే విలువయినదయి ఉండాలి. దానిని అంగీకరిస్తే పిచ్చితర్కమని జాలిపడాలి. అంటే దారి తప్పనట్టు లెక్క.
ఇళ్ళతోకాని, అతి విలువగల వస్తువులని భావించేవానితో మనం ఆనందాన్ని కొనుక్కోటానికి యత్నిస్తుంటాము. అది టి.వి. కావచ్చు, సోఫాలు కుర్చీలు కావచ్చు. విద్యుత్ పరికరాలు కావచ్చు. అవి మనకు చెంది ఉంటాయి. కాని అవి మనము కాము.
ఆనందం ఒకనికి చెందిన వస్తువు కాదు. అది ఒక విప్పారటం- తెరుచుకోవటం. అది నువ్వే అని మరచిపోకు. పువ్వుకు, రేకకు ఉన్న సంబంధము, నీకూ ఆనందానికి ఉన్న సంబంధము ఒక్కటే. అంటే పువ్వు యొక్క రేకలు ఆ పువ్వుకు చెందినవి కావు. అవి పుష్పంలోని భాగాలే. అవి పుష్పము యొక్క ఏకత్వములోను, సమన్వయములోనూ ఉన్నవి.
--(())--
🌻. ఆనందసూక్తము - 5 🌻
పరిణామక్రమము చుట్టలు చుట్టుకొని ఉన్నట్లు ప్రకృతి కనుగొనినది. అది మళ్ళీ మళ్ళీ సరికొత్త మృదువైన దేహన్ని (జన్మల పేరిట) ఇస్తున్నది. దాన్ని మనము ఇష్టమైనట్లు వినియోగించుకొంటున్నాము.
అందువల్ల అది పాడైపోతున్నది. బాహ్య వాతావరణానికి గురియైన మనస్సును అనేక పర్యాయములు వాడితే ఆ సున్నితత్వము పోయిన కెమెరావలె అవుతుంది.
అందుచేత వృద్ధాప్యము వచ్చేసరికి ఆహారపానీయాదులందు, నిద్ర, విశ్రాంతి, కామముల విషయములో విచ్చలవిడిగా వాడిన నిస్సత్తువగల దేహముతో మిగులుతున్నాము. అయితే ప్రకృతి మరో దేహాన్ని ఇవ్వటానికి ముచ్చటపడుతున్నది. దానికొరకే మృత్యువు. అది యీ దేహాన్ని తొలగిస్తుంది.
కాలాంతరములో సుకుమారమైన నునులేత శరీరాన్ని ప్రసాదించి 'బాగా తెలివితో వ్యవహరించు. ఆనందాన్ని కనుగొనేవరకు దానిని మరింత మెరుగైన రీతిలో వినియోగించు' అని వానిని ఆశీర్వదిస్తున్నది ప్రకృతి.
అలా అయినా మళ్ళీ మళ్ళీ శరీరాన్ని పాడుచేసే ప్రయోగాలు చేస్తూ కొన్ని వేల జన్మలు ఎత్తుతునే ఉన్నాము. అయితే ప్రకృతి ఎప్పుడూ నిరాశ చెందదు- విసిగి వేసారదు.
రవీంద్రనాధ్ టాగూర్ అంటాడు. "మొగ్గ లోకానికి తన పరిమళాన్ని ప్రదర్శించటం నేర్చుకొన్నప్పుడు, అది ప్రపంచానికి ప్రదర్శించాలి! ఏదో ఒకటి చూపించాలి! అనే అభిరుచిని కోల్పోతుంది.
ఇక అది విచ్చుకోవడం, వికసించటం ద్వారా అందంగా చూడముచ్చటగా మారేటప్పటికి, అది తనకు చెందినవాటిపై, అనగా తన రేకలపై, తనపై పట్టును కలిగియుండుటలో ఉన్న ఆకర్షణను కోల్పోవును.
జాగ్రత్తగా గమనిస్తే పట్టువదిలితే గాని, పువ్వు విరియలేదు. రంగులను ప్రదర్శించలేదు. ఆ పువ్వు తన ఆడంబరాన్ని, అందంగా కనిపించే స్వభావాన్ని విడనాడితే గాని తన పరిమళాన్ని బహిర్గతం చేయలేకపోయింది".
ఈ మహాకవి చెప్పినదాని వెనుక ఒక మహత్తర సందేశమున్నది. ఆనందంగా ఉండాలంటే పిడికిలి బిగించే స్వభావాన్ని త్యాగం చేయాలి! నీ మనస్సులోని పట్టు వదలయ్యేవరకు నీ చేతిని వదులు వేయడానికి వీలులేదు.
కాగా త్యాగంలోనే ఆనందం! అందువల్లనే ఉపనిషత్ కారులు 'ఆనందోబ్రహ్మేతి విజానాత్' అనుట. బ్రహ్మమే ఆనందం! అంతకంటే పొందదగినది ఇంకేముంటుంది కనక.......
🌹 🌹 🌹 🌹 🌹
--(())--
No comments:
Post a Comment