Thursday, 24 September 2020

ఆఱు ఇంద్ర గణములతో వృత్తము ఇంద్రమాల 
==
ఆఱు ఇంద్ర గణములలో రెండు చతుర్మాత్రలు (UII, IIII), నాలుగు పంచమాత్రలు (UIU, UUI, IIIU, IIUI). వీటితో భిన్నమైన గణములతో 6! = 720 వృత్తములు సాధ్యము. అందులో గుర్వంతమైనవి 240. రెండు చతుర్మాత్రలు, నాలుగు పంచ మాత్రలతో వృత్తములు గలవా? 20 సంవత్సరాలకు ముందు ఈ ప్రశ్నకు నాకు జవాబు దొఱకినది. సుమారు వేయి సంవత్సరాలకుపైన చంపకోత్పలమాలలు కన్నడ తెలుగు సాహిత్యములలో కవులచే ఖ్యాత వృత్తములుగా వాడబడుచున్నవి. కాని వీటికి 4,5,5 - 4,5,5 మాత్రలు గలవన్న సంగతి ఎవ్వరును ప్రస్తావించలేదు. ఇలా ఈ మాలికా వృత్తముల మాత్రా గణ స్వరూపమును, దానివలన ఈ వృత్తముల తాళబద్ధతను మొట్ట మొదటి సారి నిరూపించబడినది. ఇట్టి జాతి పద్యమును సంపఁగి అని పిలిచినాను (చంపకము = సంపఁగి). 
==
మాలికా వృత్తములను ఇలా వ్రాయ వీలగును:
U(II)II UIU IIIU - IIU IIUI UIU
ఇందులో నాలుగు విధములైన ఇంద్ర గణములు గలవు, అవి: U(II)II, UIU, IIIU, IIUI. ర-గణము రెండు మారులు వచ్చినవి. స-గణము ఇంద్ర గణము కాదు. దీనిని ఈ విధముగా వ్రాద్దామా? 
UII UUI IIIU - IIII IIUI UIU 
ఇప్పుడు ఇందులో ఆఱు భిన్నమైన ఇంద్ర గణములు ఉన్నాయి. ఇందులో ఎక్కువ మార్పు చేయబడిన గణము UIU => UUI. IIU => IIII మార్పు లయను మార్చదు. దీనికి ఇంద్రమాల అని పేరు నుంచినాను. 
==
ఇంద్రమాల - భ/త/న/భ/న/జ/ర UII UUI IIIU IIII IIUI UIU
21 ప్రకృతి 720359
==
దివ్వెల వెల్గించ గృహములో - దివమున శశికాంతి నిండెఁగా 
నవ్వులు రాజిల్ల మొగములో - నగమున హిమరాశి నిండెఁగా 
పువ్వులు పూయంగ లతలలోఁ - బొలుపులు వనమందు నిండెఁగా 
మువ్వలు మ్రోగంగ నటనలో - ముదములు మనమందు నిండెఁగా 
==
ఏమని పాడంగ నగును ని-న్నిపుడిట వరవీణ మ్రోఁగఁగా 
గోమల రాగాల స్వరములం - గొమరుగఁ గడు తృప్తి నీయఁగా 
నామది యందుండు ప్రతిమగా - నటనపు గతులందు నుండఁగా 
శ్యామల వర్ణుండ గొనఁగ రా - సముచితముగ నింద్ర మాలలన్ 
==
జీవన గమ్యమ్ము తెలియదే - చెలిమికిఁ గల యర్థ మేమియో 
భావికి ద్వారమ్ము తెలియదే - పలుకఁగ నొక మంత్ర మున్నదో 
తావులు స్వర్గమ్మొ నరకమో - తలఁపుల తలుపందుఁ దాళమా  
నావకు రంధ్రమ్ము లిట హరీ - నడుపుట బహు కష్ట మయ్యెనే 
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
0
ర/భ/త/భ/న/న/భ/భ/లల 
UIU UII - UUI UI - IIII IIIU - IIUI III
26 ఉత్కృతి 64748851 
==
తరువోజ - ఇం/ఇం - ఇం/సూ - ఇం/ఇం - ఇం/సూ
==
జీవితంబన్నది - జీవించగాను - చెలువపు సిరి సదా - సెలవోలె నరుగు  
భావముల్ పుట్టఁగ - భవ్యమ్ముగాను - భవమను విరి సదా - పరిఫుల్ల మగును 
నావికుండెవ్వరు - నానావ దాను - నడపునొ స్వయముగా - నడిసంద్రమునను 
దైవమే తోడుగ - ధాత్రిన్ వసింతుఁ - దరుణము నరయుచో - దరిఁజేర్చు నతఁడు 
=        

No comments:

Post a Comment