Wednesday, 3 November 2021

ఈ వారం (7) కధలు (36--42)

 

(36) విడిచిపెట్టటానికీ వీలులేనిది - పట్టుకొనటానికీ వీలులేనిది ఆత్మ*. మనకన్న వేరుగా నున్న వస్తువుని మనం పట్టుకుంటాం - అవసరం లేదనుకుంటే విడిచిపెడతాం. ఆత్మ మనకన్న వేరైన వస్తువు కాదు. వేరైన భావమూ కాదు. అది నేనే అయినప్పుడు ఎలా విడిచిపెట్టటం? ఆత్మనైన నేను నా శరీరాన్ని విడిచిపెడతాను; ఆలోచనలను విడిచిపెడతాను, మంచిభావాలను - చెడ్డభావాలను విడిచిపెడతాను - చుట్టూ ఉన్న వస్తువులను, వ్యక్తులను, వారి తోటి గల బాంధవ్యాన్నీ విడిచిపెడతాను. నాలో ఉన్న వాసనలు, కర్మఫలాలను కూడా విడిచిపెడతాను జ్ఞానం పొంది; కాని నన్ను నేను ఎలా విడిచిపెట్టగలను. కనుక ఆత్మ విడిచిపెట్ట వీలులేనిది, 'అహేయం'.

అలాగే నాకన్న వేరుగా నున్న వస్తువులను - పుస్తకాన్ని, పెన్నుని, కుర్చీని, బల్లని, మనిషిని, దొంగను - దేన్నైనా పట్టుకోవచ్చు. అలాగే ఆత్మనైన నేను ఈ దేహాన్ని పట్టుకున్నాను. ఈ మనోబుద్ధులను పట్టుకున్నాను. వాసనలను పట్టుకున్నాను. కాని ఆత్మను (నన్ను) పట్టుకోవటం ఎలా? నన్ను నేనే పట్టుకోవటం ఎలా? నా దగ్గర లేని దాన్ని నేను పట్టుకోవచ్చు. నాకు దూరంగా - నాకన్న వేరుగా నున్నదాన్నీ పట్టుకోవచ్చు. అసలు నేనే అయినదాన్ని ఎలా పట్టుకోవటం? కనుక ఆత్మను విడిచిపెట్టే వీలులేదు. పట్టుకొనే వీలులేదు. నేను శరీరాన్ని అనుకుంటే ఆత్మ నాకన్న వేరుగా ఉన్నట్లే గనుక పట్టుకోనూవచ్చు - విడిచిపెట్టనూ వచ్చు. నేను శరీరాన్ని కాదే. అలా అనుకోవటం అజ్ఞానమే. కనుక 'అనుపాదేయం' పట్టుకొనే వీలులేనిది -

*(2) మనోవాచాం అగోచరం* :- మనస్సుకు వాక్కుకు అందనిది. ఆలోచనల ద్వారా అందుకోలేనిది. ఏదైనా ఒక వస్తువో - ఒక వ్యక్తియో - ఒక విషయమో - ఒక భావమో ఉంటే దానిని గురించి మనస్సు ఆలోచనలు చేస్తుంది. మరి ఆత్మ వస్తువూ కాదు - వ్యక్తీ కాదు - విషయమూ కాదు - భావనా కాదు. పైగా ఒక తెలిసిన విషయాన్ని గురించి - మనస్సు ఆలోచించగలుగుతుంది. మరి ఆత్మ తెలిసిన విషయం కాదే - అసలు విషయమే కాదుగదా. అలాగే తెలియని విషయాన్ని గురించైనా ఆలోచించి తెలియలేదు అనైనా అనుకుంటాం. మరి ఆత్మ తెలియని విషయమా? కాదే. అది తెలిసిన దానికి - తెలియని దానికి వేరైనది గదా - కనుకనే మనస్సుకు అందదు. అగోచరం.

మనస్సుకు అందిన వాటినే మాటల్లో చెబుతాం. భాష నుపయోగించి శబ్దశక్తితో చెబుతాం. మనస్సుకు అందని దానిని వాక్కుతో ఎలా చెప్పటం? కనుక వాక్కుకు అగోచరం. అసలు ఇంద్రియాలకన్నింటికి అగోచరమే.

ఇదే విషయాన్ని కేనోపనిషత్తులో చెప్పటం జరిగింది. "నతత్ర చక్షుర్ గచ్ఛతి, నావాగ్గచ్ఛతి, నమనః ------" అని. కళ్ళు - వాక్కు - మనస్సు అక్కడకు పోలేవు అని. - ఆత్మయే అన్ని ఇంద్రియాలకు ఆధారంగా ఉండి ఆ ఇంద్రియాలు పనిచేయటానికి శక్తి నిస్తున్నది. అట్టి ఆధారమైన ఆత్మను ఇంద్రియాలు ఎలా తెలుసుకుంటాయి? మనం మంచె మీద కూర్చొని పొలాన్ని కాపలా కాస్తుంటాం. పొలం అంతా మనకు కనిపిస్తుంది. అయితే మనం కూర్చున్న మంచెకు ఆధారంగా ఉన్న కొయ్యబాదుల్ని చూడగలమా? - చూడలేం. కనుకనే 'మనోవాచాం అగోచరం' అనటం.

*(3) అప్రమేయం* :- సాటిలేనిది. మరొక దానితో పోల్చటానికి - కొలవటానికి అసలు రెండవ వస్తువు లేదు. సత్యవస్తువు ఆత్మ ఒక్కటే. సత్య వస్తువును అసత్య వస్తువుతో కొలవలేము.

ఇక్కడ ఒక బస్తా బియ్యం కుమ్మరించి మిమ్మల్ని కొలవమన్నాను. దేనితో? మానికలతో. అలా కొలిచి ఎన్ని మానికలో చెప్పాలి. ఓ! ఇంతేగదా! అని అందరూ పైట బిగించారు. అయితే ఒక షరతు చెప్పాను. మీరు కొలవవలసింది రాత్రి కలలో కనిపించిన మానికలతోనని - అంతే ఆగిపోయారు. మీరేమైనా తెలివి తక్కువ వారా? రాత్రి నాకు మానిక కలలోకి రాలేదండి. ఇప్పటివరకూ ఎప్పుడూ రాలేదు అన్నారు. సరే. అయితే ఇదిగో ఈ మానికతో కొలవండి అని ఒక పేపరు మీద మానిక బొమ్మను గీచి చూపించాను.  మరి కొలవగలరా? సత్యవస్తువును అసత్య వస్తువుతో కొలవలేం.  కనుక ఆత్మను దేనితోనూ కొలవలేం. అన్నీ అసత్యవస్తువులే గనుక.

*(4) ఆద్యంత రహితం* :- పుట్టుక చావులు లేని నిత్యసత్యం ఆత్మ - అనంతం. దానికి ఆది అంతం అనేవి ఉండవు.

*(5) మహ* :- తేజో రూపం. రూపం లేదు. తేజస్సే దాని రూపం. అదీ కనిపించని తేజస్సు. ఈ కన్నులు చూచి తట్టుకోలేవు. కనుకనే అది కన్నులకు కనిపించదు.

*(6) అహం పూర్ణం బ్రహ్మ* :- అట్టి పరిపూర్ణ బ్రహ్మమును - పరమాత్మను - శుద్ధ చైతన్యాన్ని నేనే - నాలో ఉన్న ఆత్మ అనటం తప్పు. నేనే ఆత్మను. నాలో ఇంకేమీ లేదు. కాకపోతే నేను దీనిలో ఉన్నట్లుగా భావన - అంతే.

--(()/--

37.కథ: పనికి వచ్చే ముచ్చట.!!

ఒక ఊర్లో పదో తరగతి మిత్రులు, ఓ 80 మంది కలిసి చదువుకున్నారు. కొందరు పై చదువులకని, కొందరు బతుకు బాటను వెతుక్కుంటూ బయటి దేశానికి వలసకనీ , కొందరు ఊళ్ళోనే తోచిన పని చేసుకుంటూ ,  కొందరు పక్కనున్న పట్టణంలో చిన్నదో, పెద్దదో వ్యాపారం చేసుకుంటూ గడపసాగారు. గడప దాటారు.  ఓ పది సంవత్సరాలు గడిచిపోయాయి.
ఇంతలో 'WHAT's App" లేదా మరో   యాప్ వచ్చింది. ఒక మిత్రుడు అందరం రోజూ పలకరించుకుందాం, సాధకా బాధకాలు చెబుకుందాం అనే ఉద్దేశ్యంతో.. ఓ గ్రూపు Creat చేసాడు. కొద్దిరోజుల్లోనే... 80 మందిలో.. 60 మంది నెంబర్ లు దొరకబట్టి... గ్రూపులో add చేశారు.

చిన్ననాటి మిత్రులే గాని, ఇప్పుడే కొత్తగా పరిచయం అయిన వ్యక్తుల వలె.. ఎంతో ఉత్సాహంతో పలుకరించుకునే వాళ్ళు. ఎవరెవరు.. ఏమేం పనులు చేస్తున్నారో.... ఎక్కడెక్కడ ఉన్నారో.. పెళ్లి.. పిల్లల విషయం... ఒకటేమిటి... సర్వం సంభాషించుకునే వాళ్ళు.
మళ్ళీ పాత రోజులు గురుతు చేసుకుంటూ... మంచి మంచి సూక్తులు.. శాత్రాలు, పంచులు, జోకులు వేసుకుంటూ ఎంతో సంబర పడిపోయేవారు. అందరూ అడ్మిన్ లే!😊

ఇలా ఎంతో జోష్ గా గ్రూప్ నడుస్తుంది. ఒక రోజు open చేయక పోతే.. వందల సంఖ్యలో Unread మెసేజ్ లు ఉండేవి.  గ్రూపు పుణ్యానా... ఒకనాడు అందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనం (Get Together/ Reunion) కూడా ఏర్పాటు చేసుకున్నారు.

రోజులు గడవసాగాయి.
ఒకనాడు, గ్రూపులో ఓ మిత్రుడు... "Good Morning" మెస్సేజ్ పెట్టాడు.

ఇంకో మిత్రుడు కలుగజేసుకొని "ఎందుకురా ఈ పనికి రాని మెస్సేజ్? ఏదైనా పనికి వచ్చే మెసేజ్ పెట్టండి. Good Morning , Good Night లతో ఒరిగేది ఏం లేదు" అని అన్నాడు.

ఇక అయోమయంలో, ఏమెసేజ్ పెట్టాలో తెలియక... ఆ Good Morng చెప్పిన మిత్రుడు... మళ్ళీ ఏనాడూ మెస్సేజ్ చేయలేదు.😢

ఒకనాడు... ఆ ఊళ్ళో జరిగిన ఓ దొంగతనం గురించి... తీవ్రంగా చర్చ నడుస్తున్న సమయంలో... ఒక మిత్రుడు... తాను చూసే సినిమా టాకీస్ తో పాటు, పోస్టర్ తో దిగిన ఫోటో ఒకటి , ఈ గ్రూపులో షేర్ చేసాడు.

"అరేయ్.. మేము ఇంత తీవ్రంగా చర్చ నడిపిస్తే... మధ్యలో నీ సోది ఏంది రా?? ఏదైనా పనికి వచ్చే పోస్ట్ పెట్టు" అని అనగానే....

ఏ పోస్ట్ , ఎప్పుడు పెట్టాలో అర్థం కాకపోవడంతో.... మరొక్కమారు అతను... గ్రూపులో ఏ పోస్ట్ పెట్టలేదు.

'ఒకతనను... మంచి మసాలా వేసి వండిన.... 'సాంబారు' తో పోస్ట్ చేసాడు.

'ఎప్పుడూ.. తిండి విషయలేనా?? ఏదైనా పనికి వచ్చే పోస్ట్ చేయమన్నారు' ఇంకొకరు.

ఆ సాంబార్ పోస్ట్ వ్యక్తి వెంటనే గ్రూపు నుండి Left అయ్యాడు.😢.

ఓసారి దేశ, రాష్ట్ర రాజకీయాలు మీద వాదోపవాదాలు నడుస్తున్నాయి.
"మా పార్టీ ఇది చేసింది, అది చేసింది"  అని తీవ్రంగా వాదించుకుంటున్నారు.
ఎదురుగా ఉంటే.. కొట్టుకునే వాళ్లే!!😢.
ఇంతలో మధ్యలో.. ఒక మిత్రుడు...  ఓ "అమ్మాయి ఫోటోలో.. 'ఫోన్ నెంబర్ కావాలా??" అని రాసి ఉన్న ఫొటో పెట్టాడు.

ఆ ఇద్దరు "రాజకీయ మేధావులకు".. ఎక్కడో కాలింది.  ఇద్దరు కలిసి.. ఈ మిత్రున్ని తిట్టారు. ఏదైనా.. పనికి వచ్చే..  పోస్ట్ పెట్టమన్నారు.

అంతే.. మరోమారు.. ఈ మిత్రుడు ఏ పోస్ట్ పెట్టలేదు.
(ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. అవి చెబితే... ఇది కూడా పనికి రాని పోస్ట్ అవుద్దని చెప్పడం లేదు. మిత్రులు మన్నించాలి😊🙏💖)

ఇలా... ఏ పోస్ట్ పనికి వచ్చేదో..  ఈ గ్రూపులో ..  దెంతో లాభసాటిగా ఉంటుందో అర్థం కాక..  ఒక్కొక్కరు... పోస్టులు చేయడం మానేశారు.

చివరికి... గ్రూపులో ఓ నిశ్శబ్బ వాతావరణం నెలకొంది.

ఒకప్పుడు ఫోన్ లో TOP లో కనబడిన గ్రూపు కాస్త.. ఎక్కడో అడుగుకి పడిపోయింది. Search లో వెతికితే గాని దొరకడం లేదు.😢.
అప్పుడప్పుడు... ఊళ్ళో ఒకరినొకరు... ఎదురెదురుగా కనబడినా... మారు మాట్లాడుకునే వాళ్ళుకాదు.

అందుకే... మిత్రుల మధ్యన అడ్డుగోడలు ఏం పెట్టుకోకండి.

బడి గోడ మీద కూర్చున్నప్పుడు... ఏం మాట్లాడుకుంటాం??

కాలేజి కాంటీన్ లో, టీ తాగుతూ..  ఏం డిస్కషన్ చేస్తాం??

వాడకట్టు మిత్రులు , ఊరి మిత్రులు ఓ బస్టాండ్ దగ్గరి చెట్టు కింద కూర్చొని ఏం మాట్లాడుకుంటాం??

వీటిలో.. ఏ ఒక్క ముచ్చటకు హద్దు ఉండదు. !
ఓ హాద్డే ఉంటే.. ఆ ముచ్చట ఎంతో సేపు.. ఎంతోకాలం నడవదు.

మనం ఏదైనా... జాబ్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొంటున్నమా??
ఏదైనా ఓ సంఘటన మీద డిస్కస్ చేయడానికి?? లేదు కదా.

మిత్రుల మధ్యన.... ఎప్పుడూ.. పనికి వచ్చే ముచ్చటనే ఉండక్కర్లేదు. Good Morning, Good Night ల వల్ల... ఆ మిత్రుడు మనతో కలిసి ఉన్నాడని , ఆనందంగా ఉన్నాడని అనుకోండి. 😊

ఏ పోస్ట్.. ఎప్పుడైనా.. ఏ సమయంలోనైనా పంపనివ్వండి. ఎందుకంటే.. అతని.. ప్రతి  విషయాన్ని.. మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాడు.

తుమ్మినా.. దగ్గినా కూడా మెసేజ్ లు పెట్టే వాళ్ళను చూసి తిట్టకండి. ఎందుకంటే.. ఎందుకంటే.. ప్రతి క్షణాన్ని, మీతో కలిసి ఓ మధుర స్మృతిగా మలుచుకుందాం అని అనుకుంటున్నారు.

చివరగా ఓ సందేశం...
మిత్రుల మధ్యన ఎప్పుడైతే... హద్దుల అడ్డుగోడలు ఏర్పడతాయో...మెల్లమెల్లగా..
ఆ స్నేహబంధం బీటలువారి బద్దలైపోతుంది.

ఇది మన గ్రూప్ కి కూడా వర్తిస్తుంది అంకుంటే, ఒక లైక్ 👍🏻 వేసుకోండి. ఈ లైక్ కూడా ఎందుకంటే, మీరు ఈ మెసేజ్ అయిన మొత్తం చదివారా లేదా అని తలుసుకోవడానికి. 😃
(()))

38..చందమామలో కుందేలు ఎలా ఉంటోంది*

పౌర్ణమి నాటి రాత్రి మనం పూర్ణచంద్రుడి కేసి చూసినట్లయితే చంద్రబింబం తెల్లగా ఉంటుంది. కానీ దాని మధ్య కుందేలు ఆకారంలో మచ్చ ఉంటుంది. చందమామలో ఈ కుందేలు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు, అంటే చాలా వేల ఏళ్ల క్రితం, చందమామ తెల్లగా, వెండిపళ్లెంలాగా ఉండేవాడు. ఆ కాలంలో

 భూమిమీద ఒక అరణ్యంలో ఒక కుందేలూ, ఒక కోతీ, ఒక నక్కా, ఒక మానుపిల్లీ సఖ్యంగా ఉంటూ ఉండేవి. కుందేలు తన ముగ్గురు మిత్రులకూ ఉత్తమ మానవధర్మాలు చెబుతూ, పశుత్వంనుంచి బయటపడమని హితబోధ చేస్తూ ఉండేది.

మిగిలిన జంతువులు తమ స్నేహితుడైన కుందేలును చూసి గౌరవించేవేగాని కుందేలు చెప్పే ధర్మాలను ఆచరించలేకపోయేవి. ఎందుచేతనంటే కోతి చపలచిత్తం గలది. నక్క జిత్తుల మారిది, మానుపిల్లి దొంగబుద్ధి కలది. కుందేలు ఎంత హితబోధ చేసినా వాటికి పుట్టుకతో వచ్చిన ఈ బుద్ధులు మారాయి కావు.

ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆరోజు ఉదయం కుందేలు తన స్నేహితులతో "అన్నలారా! ఇవాళ కార్తీక పౌర్ణమి, ఉపవాస దినం. పగలల్లా ఉపవాసం ఉండి, పొద్దూకగానే అతిథులకు ఆహారం పెట్టి, అనంతరం చంద్రదర్శనం చేసుకుని మనం భోజనం చేసినట్లయితే మనకు ముక్తి లభిస్తుంది. నేను అలాగే చేయబోతున్నాను. మీరు కూడా అదేవిధంగా చేయవలసిందని నా కోరిక" అన్నది.

కోతీ, నక్కా, మానుపిల్లీ తలలు ఊపి, తాము కూడా పగలల్లా ఉపవాసం ఉండి చంద్రోదయం కాగానే భోజనం చేస్తామని కుందేలుకు మాట ఇచ్చి తలా ఒకదారినా బయలు దేరాయి. ఉపవాసం ఉందామని నిశ్చయించుకున్న మరుక్షణం నుంచి కోతికి ఎక్కడ లేని ఆకలి వేస్తున్నట్లు తోచసాగింది. "అమ్మయ్యో, రాత్రి చీకటి పడేదాకా ఈ ఆకలికి తట్టుకోగలనా? బతికుంటే వచ్చే కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండొచ్చు" అని నిశ్చయించి కోతి పళ్లచెట్లకోసం వెతకనారంభించింది. నక్క ఉపవాసం చేయటానికి పులులు తిరిగే ప్రాంతానికి వెళ్లింది. కడుపు ఎంత మాడుతున్నా సరే ఆహారం మాత్రం ముట్టరాదనుకున్నది. కానీ కొంత దూరం వెళ్లాక ఒక పొదలో సగం తిన్న జింక శరీరం కనిపించింది. ఏ పులో దానిని చంపి కొంత తిని అక్కడ దాచివుంటుంది. తాను ఉపవాసం కారణంగా దానిని పోనిచ్చినట్లయితే చీకటి పడ్డాక తనకు ఆహారం దొరుకుతుందో, దొరకదో! అందుచేత నక్క ఉపవాసం ఆలోచన కట్టి పెట్టి వెంటనే భోజనానికి ఉపక్రమించింది.

మానుపిల్లి సాయంకాలం దాకా పడుకుని నిద్రపోదామనే ఉద్దేశంతో ఒక చెట్టు ఎక్కింది. ఆ చెట్టు కొమ్మలలో దానికొక పక్షిగూడూ, పిల్లలూ కనిపించాయి. మానుపిల్లి ఉపవాసం సంగతే మరచిపోయి పక్షిపిల్లలను కాస్తా భక్షించింది. నలుగురు మిత్రులలో కుందేలు మాత్రమే సాయంకాలం దాకా కటిక ఉపవాసం చేసింది. సూర్యాస్తమయమూ, చంద్రోదయమూ కూడా కాబోతున్నాయి. కుందేలుకు ఒక విచారం పట్టుకున్నది. అతిథి అభ్యాగతులెవరూ కనిపించలేదు. ఒంటరిగా భోజనం చేసేదాని కన్న, అతిథులకు పెట్టి తినడం ఎక్కువ పుణ్యం. అందుచేత కుందేలు అతిథులకోసం ఇంటిముందు నిలబడి ఎదురుచూడసాగింది.

కుందేలు నిష్టను కనిపెడుతున్న చందమామ మానవరూపం ధరించి ఆసమయంలో కుందేలును పరీక్షించటానికి వచ్చాడు. "పొద్దుటినుండి ఉపవాసం వున్నాను. అరణ్యంలో ఇంత భోజనం పెట్టేవారే లేరు. కాస్త నాకు భోజనం పెట్టి పుణ్యం కట్టుకుంటావా?" అని చందమామ కుందేలును అడిగాడు. "అయ్యా, నాకు కావలసిన ఆకు అలములు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి కాని, నీకు తగిన భోజనం ఎక్కడ దొరుకుతుంది? అందుచేత నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకుని నాకు ముక్తి ప్రసాదించు" అన్నది కుందేలు.

"కార్తీక పౌర్ణమి పుణ్యదినం నాడు జీవహింస చేయతగునా? నేను నిన్ను ఎట్లా చంపను?" అని అడిగాడు చందమామ "అయ్యా, దానికి విచారించవద్దు. మీరు ఎండు పుల్లలు తెచ్చి అగ్ని చెయ్యండి. నేను అందులో ఆహుతి అవుతాను. ఆ తరువాత మీరు నన్ను హాయిగా భుజించండి." అన్నది కుందేలు. మనిషి వేషంలో ఉన్న చందమామ అక్కడే పుల్లలు పేర్చి పెద్ద మంట చేశాడు. కుందేలు ఒక్కసారి భగవంతుణ్ణి స్మరించి ఆ మంటలోకి దూకింది. కాని, చిత్రం! ఆ మంటలు కుందేలును సోకనేలేదు."అయ్యా, నన్నీమంటలు దహించకుండా ఉన్నాయి. నేనేం చేసేది. మీ ఆకలి ఎట్లా తీర్చేది?" అని కుందేలు శోకించింది. మరుక్షణమే మంటలు మాయమయాయి. చందమామ దేదీప్యమానమైన తన నిజస్వరూపంలో ప్రత్యక్షమై కుందేలును ఎత్తుకుని "నీ జన్మ ధన్యమైనది. నిన్నునాతో శాశ్వతంగా ఉంచుకుంటాను. రా, పోదాం." అన్నాడు. ఆనాటినుంచి కుందేలు చందమామ వెంటనే వుంటోంది.

--((**))--


39..కోతుల కధ

క వూళ్ళో చాలా కోతులుండేవి.ఒక రోజు ఒక వ్యాపారి ఆ వూరికొచ్చాడు.అతను కోతులను ఒక్కక్కటి 

వంద రూపాలకు కొంటానని ప్రకటించాడు.కొంతమంది ఆ మాటలు నమ్మలేదు.కొంతమంది మాత్రం వస్తే వంద లేకుంటే పోయేదేమీ లేదు కదా అని ఆశతో తిరిగి తిరిగి కోతులను పట్టి ఆయనకు యిచ్చి డబ్బు పుచ్చుకునేవారు.కొన్నాళ్ళకి మిగతావాళ్ళు కూడా కోతుల వేటలో పడ్డారు.కొన్నాళ్ళయిన తర్వాత ఆ 

వ్యాపారి కోతికి రెండు వందలు యిస్తానని ప్రకటించాడు.అందరూ అటూ యిటూ పరిగెత్తి కోతుల్ని పట్టి అమ్మారు.

వూళ్ళో కోతులన్నీ దాదాపు అయిపోవచ్చాయి.అప్పుడు వ్యాపారి కోతి 500 లిస్తానని ప్రకటించాడు.అంతే వూరివాళ్ళు నిద్రాహారాలు మర్చిపోయి కోతులకోసం గాలించడం మొదులు పెట్టారు..యింక వూళ్ళో గానీ బయటగానీ కోతులేలేవు.

ఆ సమయం లో వ్యాపారి ఒక్కో కోతికి 1000 రూపాయలిస్తానని ప్రకటించాడు.కానీ తనబదులుఒకగుమాస్తాను నియమించి తను వేరే వూరికి వెళ్ళిపోయాడు.యింక వూరివాళ్ళు మంచి నీళ్ళు 

త్రాగటం కూడా మర్చిపోయారు.అసలు ఊర్లో కోతులే లేవు. ఒక్కో కోతికి వెయ్యి రూపాయలంటే మాటలా 

మంచి అవకాశము చేయిజారిపోతుందేమో బెంగ పట్టుకుంది.అది పసిగట్టిన గుమాస్తా యిక్కడున్నకోతుల్ని 700 ఒకటి చొప్పున యిస్తాను.మా షావుకారికి వెయ్యి చొప్పున అమ్మేయండి.మీకు ఒక్కో కోతికి 300 లాభము వస్తుంది అని లోపాయకారీ ఉపాయం చెప్పాడు.

ఆ వార్తా ఊరంతా పొక్కింది.ఇంకేముంది గుమాస్తా దగ్గర క్యూ కట్టారు.డబ్బున్న వాళ్ళు కోతుల మందల్ని కొనేశారుఅలా గుమాస్తా తనదగ్గరవున్న కోతులన్నింటినీ అమ్మేశాడు.ఆ వ్యాపారి ఎప్పుడొస్తాడో తెలీదు.కొన్ని రోజులకి వస్తానన్న వాడు నెలరోజులైనా రాలేదు.ఏడు వందలు పెట్టి కొన్న కోతుల్ని వదల్లేక వాటిని కాపలా కాయలేక వాటిని మేపలేక సతమత మవుతూ బ్రతికేస్తున్నారు.ఇదే వ్యాపార మంటే.

దీన్నే యిప్పుడు ష్టాక్ మార్కెట్ అంటున్నాం.ఈ వ్యాపారం ఎంతమందినో అప్పుల పాలు చేసింది.కొద్దిమందిని మాత్రమె కోటీశ్వరులను చేసింది.

--(())--
40...మౌన మంత్రం 
-{మౌనం’ అంటే మనతో మనం సంభాషించుకోవడం !}-

_ప్రపంచం ఇప్పుడు స్వీయ నిర్బంధంలో ఉంది. ఇల్లే ఒక లోకంగా మారిపోయింది.* ఇలాంటి సమయంలో మానసికమైన ఆసరా కోసం వెతకడం సర్వసాధారణం. అలాంటి ఆసరా ఆధ్యాత్మిక చింతన ద్వారా సాధ్యమవుతుంది. దైవం అండగా ఉన్నాడనే భావన ఎనలేని శక్తిని ఇస్తుంది. వ్యతిరేక భావాల్లోకి జారిపోకుండా చేయూతనందిస్తుంది. ఆ చేతిని అందుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకొనే మార్గాలు ఎన్నో ! వాటిలో ఎంతో శక్తిమంతమైనది మౌనం._*  

మౌనం ఒక శక్తిమంతమైన ఆయుధం. మనలోని వ్యతిరేక భావనలను తొలగించే శక్తి దానికి ఉంది.  ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దాన్ని ఆశ్రయిస్తే అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.

మౌనం’ అంటే మనతో మనం సంభాషించుకోవడం ! ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావడానికో, మానసికంగా తగిలిన గాయాలను మాన్పుకోవడానికో మౌనాన్ని మనం ఆశ్రయిస్తూనే ఉంటాం.

మౌనం ఒక శక్తిమంతమైన ఆయుధం. మనలోని వ్యతిరేక భావనలను తొలగించే శక్తి దానికి ఉంది. అంతేకాదు, అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మౌనంలో లభిస్తాయి. అందుకే ఋషులు మౌనాన్ని ఆశ్రయించారు. వారిని ‘మౌని’ లేదా ‘ముని’ అని పిలవడానికీ అదే కారణం. మౌన వ్రతాన్ని దాదాపు అన్ని మతాలూ సూచించాయి. భాద్రపద మాసంలో మౌనవ్రతాన్ని పాటించే సంప్రదాయం ఉంది. ఆ సమయంలో శివ నామస్మరణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం ఉంది. 

_ఇంటి నుంచి బయటకు వెళితే మనం ఏం చేస్తాం ? స్నేహితులతోనో, పరిచయస్థులతోనో మాట్లాడతాం. అయితే ఇప్పుడు మాటే చేటు తెస్తోంది. అందుకే ఇంటికే పరిమితం కావలసిన ప్రస్తుత కాలంలో మౌనాన్ని సాధన చేద్దాం._

మహాభారత లేఖనంలో...

మౌనం ఎంత గొప్పదో మహాభారత రచనకు సంబంధించిన ఒక కథ మనకు చెబుతుంది. 

వ్యాస భగవానుడు చెబుతూ ఉంటే భారతాన్ని వినాయకుడు వ్రాశాడు. రచన పూర్తయిన తరువాత వ్యాసుడు ‘‘వినాయకా! ఆ భగవంతుడే మహాభారతాన్ని సృష్టించాడు. అది నా నోటి నుంచి వచ్చింది. నువ్వు రాశావు. ఇది నా అదృష్టం. కానీ నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించినది నీ మౌనం ! నేను భారతాన్ని చెబుతున్నప్పుడు దాదాపు రెండు లక్షల పదాలు నా నోటి నుంచి వచ్చాయి. ఇదంతా రాసే సమయంలో నువ్వు ఒక్క మాట మాట్లాడగా నేను వినలేదు. ఎందుకని ?’’ అని అడిగాడు.

దానికి గణపతి సమాధానమిస్తూ, ‘‘కొన్ని దీపాలలో నూనె ఎక్కువగా ఉంటుంది. మరి కొన్నిటిలో చాలా కొంచెం ఉంటుంది. అయితే ఏ దీపానికీ నిరంతరంగా నూనె అందడం జరగదు. అలాగే, మానవులకూ, రాక్షసులకూ, ఆఖరికి దేవతలకు కూడా పరిమితమైన జీవిత కాలం ఉంటుంది. ఎవరికైతే స్వీయ నియంత్రణ ఉంటుందో, తమ శక్తులను సహనంతో, అవగాహనతో ఉపయోగించుకుంటారో వాళ్ళే జీవితం నుంచి పూర్తి ప్రయోజనం పొందగలుగుతారు. స్వీయ నియంత్రణకు మొదటి మెట్టు - మాటను నియంత్రించుకోవడం ! మాట మీద నియంత్రణ లేని వాళ్ళు అనవసరంగా ఎంతో శక్తిని కోల్పోతారు. మాటను నియంత్రించుకోవడం ద్వారా అలాంటి నష్టాన్ని నివారించుకోగలరు. అందుకే మౌనానికి ఉన్న శక్తిని నేనెప్పుడూ నమ్ముతాను’’ అని చెప్పాడు !

((())))

 41...(బంధ౦) 
మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

*అందనంత వేగంగా పరిగెడుతున్న మన జీవితం. మానవీయ బాంధవ్యాలతో సాగితే దానికో అర్ధం 

అక్కడ-ఇక్కడ వెతికితే దొరికేది కాదు ఈ పదం 

అది నువ్వు తోటివారితో కలుపుకునే ఒకే ఒక సంబంధం. తన మనసుని ఎంత గాయపరిచినా విసుగుపరిచినా, కసురుకోక పనులు చేసిపెట్టే అమ్మతో నాకా సంబంధం ఉంది.

నాలోని కళని కలలుగా మిగిలిపోకుండా కంటి ముందు గెలుపుగా వెలిగించిన నాన్నతో నాకా సంబంధం ఉంది. 

మార్గం తప్పినప్పుడల్లా ఓ కంట పనిపెడుతూ నీ దారి ఇది అని బోధించే నా .గురువుతో నాకా సంబంధం ఉంది. 

బాధల్లో నన్ను భారంగా కాకుండా తనలో ఓ భాగంగా భావించే నా నేస్తాలతో నాకా సంభంధం ఉంది.

ఇలాంటి బంధాలకు దూరంగా ఉండేందుకు సాహసించలేను వారి ప్రేరణ లేనిదే నేనేది సాధించలేను ....అందుకే ,అందరితో బంధాలను కలుపుకుందాం ఉన్న విలువైన బంధాలను కాపాడుకుందాం .

వనే జాతా వనే త్యక్తా, వనే తిష్ఠతి నిత్యశ:
పుణ్యస్త్రీ నతుసా వేశ్యా యోజానాతి స పండితః

భావము:--వనం అనే పదానికి అడవి,నీరు అనే అర్థాలున్నాయి.  అడవిలో పుడుతుంది, నీటిలో విడువ బడుతుంది, డబ్బులిచ్చి కొనుక్కునే స్త్రీ, వేశ్య కాదు. ఎవరు? ఇది తెలుసుకున్నవాడు పండితుడు.

సమాధానంగా 'నౌక' అని సమాధానం. ఎలాగంటే వనం అంటే అడవి అందులో పుడుతుంది ఏమిటది?. వెదురు. నౌకను పూర్వము పూర్తిగా వెదురు తో తయారు చేసేవారు.'వనే త్యక్తా' నీటిలో వదలబడింది. 'వనే తిష్ఠతి నిత్యశ:' ఎప్పుడూ నీటిలోనే వుంటుంది. 'నౌకా' అనే పదం సంస్కృతం లో స్త్రీలింగం. డబ్బు యిచ్చి కొనుక్కునే స్త్రీ. పడవలో ప్రయాణించాలంటే డబ్బు చెల్లించాలి. కనుక అది సరిపోయింది.

అడవిలో పుట్టిన వెదురు తో తయారుచేయ బడిన నౌక నీటిలో వదిలివేయ బడుతుంది,

ఎల్లప్పుడూ నీటిలోనే వుంటుంది, అందులో ప్రయాణించాలంటే డబ్బు చెల్లించాలి.సరిపోయింది. అది కూడా సరిపోయింది. (చమత్కారశతం పుస్తకము నుండి )

--((**))--


42..ప్రాంజలి ప్రభ కధలు (1) (పులకించు ) 

మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ 


గనాంగనాలింగనోత్సాహి అయి జగమెల్ల పులకించె సుమ వృక్షమై మమతలు అల్లిన పెళ్లిపందిరై మనసులు మీటిన ప్రేమగంధమై పలికినదీ పిలిచినది పరవశమై
నవ మోహనరాగం

శుభోదయం మిత్రాస్! ఇలాంటి మోహనరాగాలు ఆలపించుకుంటూ సుమ వృక్షాల సుగంధాలతో నిండిన ఉదయపు ఆహ్లాదాన్ని తీసుకుని మమతలు పంచే మిత్రులందరి కోసం వచ్చేసాను.

నిజంగా పాటలుపాడే కోయిలవంటి స్వరగాత్రులను చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో!
పూవుకి తావి అబ్బినట్లు, స్వరానికి సంగీతమొస్తే ఇంక చెప్పక్కరలేదు. అటువంటి పాడే కోయిలలు ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో!

మా చిన్నప్పటినుండి మా అమ్మ మా మేనత్త లే మా పుట్టింటి గానసరస్వతులు. మా అమ్మకు వయొలెన్, వీణ హార్మోనియం వచ్చు ఇప్పుడు కీబోర్డ్ మీద కూడా ఆవిడ రచించి స్వరపర్చిన భక్తి గీతాలే కాకుండా,త్యాగరాయకీర్తనలు సినిమాపాటలు కూడా చక్కగా వినిపిస్తుంది.

విన్నవాళ్లందరూ ఆవిడని మమ్మల్ని ( మా అక్కచెల్లెళ్లని) మార్చి మార్చి చూస్తారు. ఆవిడ కొచ్చినదాంట్లో అణువయినా ఒచ్చా వీళ్లకి! అని రెండు మూడు దశాబ్దాల తరబడి. చేస్తున్బ లలితాపారాయణాలు, పూజాకార్యక్రమాల పుణ్యమా అని హారతి పాటలు అలవాటయ్యాయి.

బృందగానాలే ఎక్కువ!సోలో లు తక్కువే! అంత్యాక్షరిలో పాతా కొత్తా కలగలిపి బాగానే విజృంభిస్తాము. అంటే కాస్త కళాపోషణ ఎక్కువై , మేము చూసిన సినిమాపాటలు ,రేడియో పాటలు విని విని అవి బాగానే గుర్తుంటాయిలెండి.

ఈ జ్ఞాపకశక్తి ఏ చదువులోనో పెడితే బాగుండేది, కాని,కాలేజి మెట్లెక్కని కాపురాలలో చేసిన పీజీలు మావి.పట్టాలు లేని సంసార పట్టభద్రులమన్నమాట

మా పెద్ద మేనగోడలు శ్రీలక్ష్మి మాత్రం వాళ్ల బామ్మ నుండి (మా అమ్మ) వారసత్వంగా ఆవిడ మేనిఛ్చాయ పెద్ద జడతో పాటు, తీయని గొంతు కూడా తెచ్చుకుంది.సాఫ్ట్ గా స్వఛ్చంగా ఉన్న దానిపాట విన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చాలా ఈజీగా మొగుడయి పోయాడు.

"పెళ్లి చూపులుకి పాడేసాను మంచివరుణ్ణి పట్టేసానుగా! అన్నట్లు వాళ్ల పిల్లల జోలపాటల అధ్యాయం అయిపోయాక ,సంగీతానికి గుంట కట్టి గంట వాయించేసింది.

ఇంక మా చెల్లి ఆడపడుచు రాజేశ్వరి కూడా డిటోనే ఇటీవల రచయిత్రి ఆత్మీయురాలు మా మిత్ర గానకోకిల మన నండూరి సుందరీనాగమణి తో రాజమండ్రి ట్రిప్ లో రాజేశ్వరి ఇంటికెడితే అతిధిమర్యాద తో పాటు చక్కని పాటల విందు చేసింది. కొన్నిపాటలు వాళ్లిద్దరూ కలసి పాడుతుంటే , భగవంతుడిచ్చిన ఈ అదృష్టం ఎంతమందికుంటుంది అనిపించింది.

ఆ రాత్రి వంటి గంటవరకు నిద్రపోకుండా మాకోసం శ్రోతలు కోరినపాటలు ప్రోగ్రామ్ లాగా నాకు మా అత్తకు మా చెల్లి పద్మావతికి, ఉమా కల్వకోటకు వీనులవిందు చేసారు. ఆరోజు ఎన్నటికీ మరువలేము.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఎందరో గానకోవిదులు ప్రతీ ఇంటా ఉంటారు. భగవదనుగ్రహం ఉంటే తప్ప ఏ కళా ఒంటపట్టదు. పాడగల్గినవారు స్వరార్చన చేస్తూనే ఉండాలి. సాధన చేస్తూనే ఉండాలి. అంతో ఇంతో ఇంట్లో వారి ప్రోత్సాహం కూడా ఉండాలి.

"ఈటీవీ పాడుతా తీయగా! వలన, ప్రముఖ గాయకుడు రామాచారి శిష్యరికంలో ఎందరు గాయనీ గాయకలు వెలుగులోకి వచ్చారో అందరికీ తెలుసు.

చిన్నచిన్న పిల్లలు ఎంతో కష్టమైనపాటలు కూడ ఇష్టంగా నేర్చుకుని పాడేస్తున్నారు.
ఏ జన్మలోనో అమ్మవారికి తేనెతో అభిషేకం చేసారేమో! అందుకే తీయని కంఠస్వరాలు తో మనందరినీ అలరిస్తున్నారు. మనం జాడీడు తేనెత్రాగినా స్వరంలో శ్రావ్యత రాదు కాని మరేవో వస్తాయి. అక్కడే కూర్చోపెడతాయి.

మొన్న మా ప్రమదాక్షరి మీట్ లో చదువు ఉద్యోగాలు రచనలు సంగీతం తో అలరారుతున్న మా భానక్క ఇందిరా సుజలాగంటి, జొన్నలగడ్డ సుందరీనాగమణి D కామేశ్వరి గారు తదితరులు పాడిన లలితగీతాలు వింటుంటే, సరస్వతీ కటాక్షం సంపూర్ణంగా లభించిన అదృష్టవంతులు అనిపించింది.

రాసేవాళ్లకు వాళ్ల రాతలు మెచ్చుకుంటే ఎంత ఆనందమో పాడేవారికి కూడా అంతే కదా అందుకే ఎవరు పాడినా మీ కరతాళధ్వనులే వారికి సంతోషాలనిచ్చే పట్టు శాలువాలు. ఎవరు ఏపాట పాడినా అభినందిస్తే మన కళామతల్లిని గౌరవించినట్లే! అని మన కాఫీకబుర్లలో తెలియచేస్తూన్నాను.

--((**))--

2 comments: