12-01-గీతా మకరందము
భక్తియోగము
🕉🌞🌏🌙🌟🚩
శ్రీ భగవద్గీత
అథ ద్వాదశోఽధ్యాయః
పండ్రెండవ అధ్యాయము
భక్తియోగః
భక్తియోగము
అర్జున ఉవాచ :-
ఏవం సతతాయుక్తా యే
భక్తాస్త్వాం పర్యుపాసతే |
యే చాప్యక్షరమవ్యక్తం
తేషాం కే యోగవిత్తమాః ||
తా:- అర్జునుడు చెప్పెను - ఈ ప్రకారముగ ఎల్లప్పుడు మీయందే మనస్సును నెలకొల్పినవారై ఏ భక్తులు మిమ్ముపాసించుచున్నారో, మఱియు ఎవరు ఇంద్రియగోచరముగాని అక్షరపరబ్రహ్మను ధ్యానించుచున్నారో, ఆ యిరుతెగలవారిలో యోగమును బాగుగ నెఱిగిన వారెవరు?
వ్యాఖ్య:- ‘ఏవమ్’ అను పదము క్రిందటి అధ్యాయముయొక్క 55వ శ్లోకమగు ‘మత్కర్మకృత్’ అను శ్లోకముయొక్క భావమును సూచించుచున్నది.
భగవానుని విశ్వరూపమునుగాని, లేక దైవసంబంధమైన వేఱొకమూర్తినిగాని, సాకారస్వరూపమునుగాని, అనవరత భక్తితో, ఉపాసించువారు (సగుణోపాసకులు) గొప్పా? లేక ఇంద్రియములకు గోచరముకాని, నిరాకరమైన, సర్వవ్యాపకమైన,
అక్షరపరమాత్మను ధ్యానించువారు (నిర్గుణోపాసకులు) గొప్పా? అని అర్జునుని ప్రశ్న. ఇదివఱలో అనేకమార్లు భగవానుడు (2వ అధ్యాయము 8వ అధ్యాయము మున్నగుచోట్ల) నిర్గుణపరమాత్మయొక్క తత్త్వమునుగూర్చి, ధ్యానమునుగూర్చి తెలిపియుండిరి. ఇపుడు విశ్వరూపమునుజూపి, సగుణోపాసనను బలపఱచిరి. కావున రెండిటిలో ఏదిశ్రేష్ఠమను భావము అర్జునునకు కలుగుట సహజమే అయియున్నది.
🕉🌞🌏🌙🌟🚩
12-03,04-గీతా మకరందము
భక్తియోగము
🕉🌞🌏🌙🌟🚩
12-02-గీతా మకరందము
భక్తియోగము
🕉🌞🌎🌙🌟🚩
అ|| అర్జునుని యా సంశయమును భగవానుడు తీర్చివైచుచున్నారు -
శ్రీ భగవానువాచ :-
మయ్యావేశ్య మనో యే మాం
నిత్యయుక్తా ఉపాసతే |
శ్రద్ధయా పరయోపేతాః
తే మే యుక్తతమా మతాః ||
తా:- శ్రీ భగవానుడు చెప్పెను - నాయందు మనస్సును నిలిపి నిరంతర దైవచింతనాపరులై (తదేకనిష్ఠులై) మిక్కిలి శ్రద్ధతో గూడుకొనినవారై యెవరు నన్నుపాసించుచున్నారో వారే ఉత్తమయోగులని నా యభిప్రాయము.
వ్యాఖ్య:- అర్జునుని ప్రశ్నకు భగవానుడు చక్కటి సమాధాన మొసంగిరి. సగుణోపాసకులు శ్రేష్ఠులా? నిర్గుణోపాసకులు శ్రేష్ఠులా? యను ప్రశ్నకు ఎవరైనను సరియే మిక్కిలి శ్రద్ధతో గూడుకొని నిరంతరము దైవాయత్తచిత్తులైయుందురో వారే శ్రేష్ఠులని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరమొసంగిరి. ఇచట మూడుసాధనలు చెప్పబడెను.
(1) మనస్సును పరమాత్మయందు నిలుపుట.
(2) నిరంతరము దైవచింతనాపరులై యుండుట.
(3) మిక్కిలి శ్రద్ధతో గూడుకొనియుండుట.
ఈ మూడింటిని అనుష్ఠించువాడెవడో అతడు సర్వేశ్రేష్ఠుడగు యోగిగాని, సగుణోపాసకుడా, నిర్గుణోపాసకుడా, సన్న్యాసియా, గృహస్థుడా, ద్విజుడా, ద్విజేతరుడా - అను ప్రశ్నయే ఇచట లేదు. ఆహా! భగవాను డెట్టి విశాలభావమును ప్రకటించిరి! భక్తికి, శ్రద్ధకు, ఏకాగ్రతకు, ప్రాధాన్యమొసంగిరే కాని ఒకానొక మార్గమునకు, సంప్రదాయమునకు గాదు.
🕉🌞🌎🌙🌟🚩
అ|| నిర్గుణోపాసకులను గుఱించి ఒకింత చెప్పుచున్నారు -
యే త్వక్షరమనిర్దేశ్యం
అవ్యక్తం పర్యుపాసతే |
సర్వత్రగమచిన్త్యం చ
కూటస్థమచలం ధ్రువమ్ ||
సంనియమ్యేన్ద్రియగ్రామం
సర్వత్ర సమబుద్ధయః |
తే ప్రాప్నువన్తి మమేవ
సర్వభూతహితే రతాః ||
తా:- ఎవరు ఇంద్రియములన్నిటిని బాగుగ నిగ్రహించి (స్వాధీనపఱచుకొని) ఎల్లెడల సమభావముగలవారై, సమస్తప్రాణులకును హితమొనర్చుటయం దాసక్తిగలవారై, ఇట్టిదని నిర్దేశింప శక్యముకానిదనియు, ఇంద్రియములకు గోచరముకానిదనియు, చింతింపనలవికానిదనియు, నిర్వికారమైనదనియు, చలించనిదియు, నిత్యమైనదనియు, అంతటను వ్యాపించియున్నదనియు నగు అక్షరపరబ్రహ్మమును ధ్యానించుచున్నారో, వారు నన్ను పొందుచున్నారు.
వ్యాఖ్య:- ఒకే పరమాత్మ సాకారముగను, నిరాకారముగను ఉండుటవలన, సగుణధ్యానమునకుగాని, నిర్గుణధ్యానమునకుగాని లక్ష్యము ఒకటియే అయియున్నది. శ్రద్ధతోను, నిర్మలభక్తితోను ఏ ప్రకారము ధ్యానించుచు జనులు పరమాత్మనే చేరుదురు. ఈ రెండు శ్లోకములందును నిర్గుణపరబ్రహ్మమును ధ్యానించువారిని గుఱించి చెప్పబడినది.
ఇందు మొదటి శ్లోకమున బ్రహ్మమును గూర్చిన విశేషణములున్ను, రెండవ శ్లోకమున బ్రహ్మప్రాప్తికి వలసిన శీలసంపత్తియు తెలుపబడినది. సాధకుడు సాధ్యవస్తువగు పరమాత్మను ధ్యానించుచున్నప్పటికిని, హృదయశుద్ధిలేనిచో, ఇంద్రియనిగ్రహము గల్గియుండనిచో, ప్రాణికోట్ల యెడల దయలేనిచో ఆ ధ్యానము చక్కని ఫలితము నొసంగజాలదు. అట్టి వానికి బ్రహ్మానుభూతి కలుగుట దుస్తరము. ఆతని ఉపాసన కళాయిలేని పాత్రలోవండిన పప్పుపులుసువలె నుండును.
వస్తువులన్నియు మంచివి అయినను పాత్ర శుద్ధముగా లేనిచో ఆ పులుసెట్లు చిలుమెక్కిపోయి నిరుపయోగమగునో, అట్లే హృదయశుద్ధి, ఇంద్రియనిగ్రహము, భూతదయ మున్నగు పవిత్రగుణములులేక భగవంతుని నిరాకారముగగాని, సాకారముగగాని యెట్లు ఉపాసించినను పూర్ణఫలితము కలుగదు. కనుకనే గీతాచార్యులు ధ్యానశీలురను హెచ్చరించుటకు కాబోలు, ధ్యాతకు వలసిన మూడు గొప్ప సుగుణములను ఇచట నిర్గుణబ్రహ్మోపాసనాఘట్టమున పేర్కొనిరి. అవి ఏవియనిన -
(1) ఇంద్రియ సమూహమును లెస్సగ అరికట్టుట (సంనియమ్యేన్ద్రియగ్రామం)
(2) ఎల్లెడల సమభావము గలిగియుండుట (సర్వత్రసమబుద్ధయః)
(3) సమస్తప్రాణులకు హితమునాచరించుట (సర్వభూతహితేరతాః)
కాబట్టి ముముక్షువులు ధ్యానాదులను సల్పుచు ఈ సుగుణత్రయమును బాగుగ అలవఱచుకొనవలెను. ఇచట ‘నియమ్య’ అని చెప్పక ‘సంనియమ్య’ అని చెప్పుటవలన ఇంద్రియములను ఒకింత నిగ్రహించిన చాలదనియు, లెస్సగ నిగ్రహించవలెననియు, ‘సర్వత్ర’ అని పేర్కొనుటవలన సమస్తప్రాణులందును, లేక ఎల్లకాలమందును సమభావము గలిగియుండవలెననియు, ‘సర్వభూతహితేరతాః’ అని చెప్పుటచే ఏ ఒకానొక ప్రాణియెడల దయగలిగియుండుట చాలదనియు, సమస్త ప్రాణికోట్లయెడ, ప్రేమ, దయ, ఉపకారబుద్ధి గలిగియుండవలెననియు స్పష్టమగుచున్నది. ఈ ప్రకారములగు సుగుణములుగల్గి పరమాత్మను ధ్యానించుచో వారు తప్పక ఆ పరమాత్మను జేరగలరని ‘తే ప్రాప్నువన్తి’ అను వాక్యముచే భగవానుడు నిశ్చయపూర్వకముగ తెలుపుచు సర్వులకును అభయమొసంగుచున్నారు.
కావున భగవద్ధ్యానపరుడు పైమూడు సుగుణములను తనయందున్నవా, లేవా యని పరీక్షించుకొనవలయును.
🕉🌞🌏🌙🌟🚩
12-05-గీతా మకరందము
భక్తియోగము
🕉🌞🌎🌙🌟🚩
అ| సగుణనిర్గుణోపాసనల రెండిటిలో, నిర్గుణోపాసన (సామాన్యులకు) కష్టతరమనియు, దేహభావనగలవారి కయ్యది బహు ప్రయాసగ నుండుననియు వచించుచున్నారు.
క్లేశో౽ధికతర స్తేషాం
అవ్యకాసక్తచేతసామ్
అవ్యక్తా హి గతిరుఃఖం దేహవద్భిరవాప్యతే.
తా:- అవ్యక్త (నిర్గుణ) పరబ్రహ్మమునం దాసక్తిగల మనస్సుగలవారికి (బ్రహ్మమందు నిష్టను బొందుటలో సగుణోపాసకులకంటె) ప్రయాస చాల అధికముగ సుండును. ఏలయనిస, నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానముగలవారిచేత అతికష్టముగా పొందబడుచున్నది.
వ్యాఖ్య:- నిర్గుణోపాసనామార్గము దేహాభిమానముగలవారికి చాల ప్రయాసగ నుండునని యిచట తెలుపబడినది. అదిలేనివారికి చాల సులభముగనుండును.
అనగా దేహాహంభావములేక, ఇంద్రియనిగ్రహము గలిగి, నిష్కామకర్మాచరణచేతను, ఈశ్వరోపాసనచేతను చిత్తశుద్ధిని బడసినవారికి నిర్గుణోపాసనయందేమియు కష్టము యుండదు.
ఈ శ్లోకము యొక్క మొదటిపాదమునందు నిర్గుణోపాసన అధికతర క్లేశవంతమై యుండునని చెప్పట దేహాభిమానముగలవారికే యునియు, ఇంద్రియనిగ్రహములేనివారికే యునియు, సగుణోపాసనచే చిత్తశుద్ధిని బడయనివారికే యనియు గ్రహించవలెను.
దేహాభిమానములేనివారికి, ఇంద్రియనిగ్రహముకలవారికి నిర్గుణమార్గము అతిసులభముగనున్నదై జీవుని పరమాత్మసాన్నిధ్యమునకు తప్పక చేర్చగలదని వెనుకటి శ్లోకములందు భగవానుడు చెప్సియేయుండిరను విషయమును ఈ సందర్భమున జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను.
కాబట్టి సాధకులు మొట్టమొదటనే అవ్యక్త (నిరాకార, నిర్గుణ} మార్గమునకై పరువిడక, దేహాభిమానమను దోషమును భగవదుపాసన, నిష్కామకర్మాచరణాదుల వలన తొలగించుకొని, ఇంద్రియనిగ్రహమును అభ్యసించి క్రమముగ నిర్గుణపరబ్రహ్మమందు చిత్తమును ప్రవేశింపజేసినచో అత్తరి ప్రయాసలేకయే దైవప్రాప్తిరూపలక్ష్యము సిద్ధించగలదు.
పరమార్ధరంగమున ప్రవేశించి సాధకులనేకులు బ్రహ్మమునుగూర్చి ఉపాసనాదుల సలుపుచున్నను ఉత్తమ ఫలితములను బొందజాలకపోవుటకు కారణము ఈ శ్లోకమున చక్కగ తెలుపబడినది. క్షేత్రమును శుద్ధపరచక విత్తనము వేసినచో ఏమి లాభము? పునాది గట్టిగలేక మేడ కట్టినచో నిలుచునా? అట్లే హృదయమందలి దేహాభిమానము మున్నగునవి తొలగనిచో బ్రహ్మమందు మనస్సు నిలవదు.
సాధకులు ఈ విషయమును బాగుగ జ్ఞప్తియందుంచుకొనవలెను, వాస్తవముగ ధ్యానముగాని, ఉపాసనగాని ఎంతయో ఆనందకరమైన పరిస్థితి. అది సచ్చిదానందసాగరమును గూర్చిన విషయము కదా! అందు కష్టమెందులకుండును? అది ప్రయాసను పోగొట్టునదేకాని, కలుగజేయునదికాదు.
కాని జనులు దానిని ఆచరించుపద్ధతిని తెలుసుకొనజాలక దేహాభిమానవశమున కష్టమనుభవించుచున్నారు. కావున సగుణోపాసనమున కొంతకాలము మెలిగి, దేహాభిమానమును పోగొట్టుకొని తదుపరి నిర్గుణోపాసన నవలంబించుట ఉత్తమోత్తమము.
🕉🌞🌎🌙🌟🚩
12-06,07-గీతా మకరందము
భక్తియోగము
🕉🌞🌎🌙🌟🚩
అII అనన్యభావముతో తననుగూర్చి ధ్యానించువారిని సంసారసాగరమునుండి ఉద్ధరించెదనని రెండు శ్లోకములద్వారా భగవానుడు చెప్పచున్నారు -
యే తు సర్వాణి కర్మాణి
మయి సన్న్యస్య మత్పరాః
అనన్యేనైవ యోగేన
మాం ధ్యాయస్త ఉపాసతే.
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్
భవామి న చిరాత్పార్థ
మయ్యావేశితచేతసామ్.
తా:- ఓ అర్జునా! ఎవరు సమస్తకర్మములను నాయందు సమర్పించి, నన్నేపరమగతిగ తలంచినవారై అనన్యచిత్తముతో నన్నేధ్యానించుచు ఉపాసించుదురో, నాయందు చిత్తమునుజేర్చిన అట్టివారిని మృత్యురూపమగు ఈ సంసారసముద్రమునుండి నేను శీఘ్రముగ బాగుగ లేవదీయుచున్నాను.
వ్యాఖ్య - ఇందు మొదటి శ్లోకమున సాధకుడు అనుసరించవలసిన పద్ధతిని, రెండవ శ్లోకమున దానియొక్క అఖండఫలితమును భగవానుడు తెలియజేసిరి, ఆ పద్ధతి యేది యనిన
(1) సమస్తకర్మములను భగవంతునకు సమర్పించుట
(2) వారినే పరమగతిగ నెన్నుకొనుట, లేక వారియందే చిత్తమును నెలకొల్చుట
(3) అనన్యభావముతో (ఏకాంతభక్తితో) అట్టి పరమాత్మను ధ్యానించుట - ఈ ప్రకారము భక్తితో తనను ఉపాసించువారలను సర్వేశ్వరుడు జననమరణ రూపమగు ఈ సంసారసాగరమునుండి లెస్సగ ఉద్ధరించెదరని పలుకుచున్నారు.
ఓహో! ఎట్టి మహత్తర ఫలితము భగవదుపాసకులకు లభించుచున్నది! భయంకరమై, మరణరూపమైనట్టి ఈ సంసారసముద్రమున మునిగితేలుచు, నానాయాతనలను బొందుచున్న ఈ జనానీకమున కిట్టి వాక్యము లెంతటి ఆశ్వాసమును గలుగజేయగలవు! అనాదికాలమునుండి సంసారరూపమగు ఈ ఘోరవిపత్తునందు తగుల్కొని బద్ధుడై "పునరపి జననం, పునరపి మరణం" అనునట్లు కాలచక్రమున పరిభ్రమించుచు అల్లాడిపోవుచున్న జీవునకు భగవవత్ప్రోక్తములగు ఈ వాక్యములు సంజీవి వంటివేయగును. మునుగుచున్నవానికి నావయెట్టిదో సంసారదుఃఖబాధితునకు భగవంతుడట్టివారు.
ఎంత గొప్పసముద్రమైనను ఒక చిన్ననావచే దాటబడునట్లు భక్తియను తెప్పచే సంసారసముద్రమును దాటవచ్చును. మిమ్ములను ' తప్పక లేవనెత్తెదను' (సముద్ధర్తా) అని భగవానుడు కరుణతో పలుకుచున్నాడు, అయితే ఎవరు హస్తమునుపైకి జాచి వారి అనుగ్రహమును వాంఛించుదురో అట్టివారినే లేవనెత్తుదురుగాని తక్కినవారిని కాదు. ఎవరు దేవునిగూర్చి చింతింపరో, ధ్యానింపరో, అట్టి వారి యుద్ధరణమునుగూర్చి భగవానుడు పట్టించుకొనరు. వారీదుఃఖసాగరమున ఇంకెంతయో కాలము తిరుగాడవలసివచ్చును. జీవుడు తాను చేయవలసినదానిని చేసినచో భగవంతుడు తాను గావించవలసిన సముద్ధరణమును తాను గావించును. కాబట్టి విజ్ఞడగువాడు తాను అనుభవించుచున్న సంసారసాగరనిమజ్జనరూప ఘోరవిపత్తును గుర్తెరిగి మరణాది బాధలను సంపూర్ణముగ తొలగించుకొనుటకై భగవానుని వెంటనే భక్తిపూర్వకముగ సేవించవలెను. భవరోగవినాశనమున కిదియే సముచిత భేషజము,
యే తు - అని చెప్పినందువలన ఎవరైనను సరియే (జాతి మత కుల భేదములేక) భగవంతు నాశ్రయించి తరింపవచ్చునని స్పష్టమగుచున్నది. "సర్వాణి కర్మాణి" అనుటచే ఏవియో కొన్ని కర్మలను సమర్పించుట కాదనియు, తానుజేయు సమస్తకర్మలను ఈశ్వరార్పణము గావింపవలయుననియు భావము.
అనన్యేనైవ యోగేన. - ఇంతవరకు కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము మున్నగు అనేక యోగములను చెప్పి చెప్పి ఇప్పుడొక క్రొత్తయోగమును భగవానుడు లేవదీసెను. అదియే అనన్యయోగము. ఇది ప్రత్యేకమగు ఒక యోగము కాకున్నను అన్ని యోగములతో ఇది చేరిననే అవి రాణించును. ఏ యోగమైనను అనన్యచిత్తముతో నాచరించినచో మాత్రమే ఫలవంతమగును. ఇతరములగు ప్రాపంచిక చింతనలు, దృశ్యసంకల్పములు మనస్సునకు రానీయక కేవలము పరమాత్మవస్తువొక్కదానినే చింతించుచుండవలెనని దాని భావము.
"మాం ధ్యాయంత ఉపాసతే - "మాముపాసతే అని చెప్పక "ధ్యాయంత' అని కూడ దానికి చేర్చుట వలన సామాన్యమగు ఉపాసనకంటె అర్థభావనతో గావింపబడు ఉపాసనయే శ్రేష్టతమమని, అదియే అవలంబనీయమని బోధించినటైనది, మంత్రజపము చేయునపుడు మంత్రోచ్చారణతోబాటు మంత్రార్థమునుగూడ నెట్లు భావింపవలెనో, అట్లే భగవంతుని ఉపాసించునపుడును వారి స్వరూపస్వభావాదులను బాగుగ చింతన జేయవలెను. "తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్" - అను పతంజలి యోగసూత్ర మీ భావమునే తెలుపుచున్నది.
"సముద్ధర్తా - "ఉద్ధర్తా' అని గాక సముద్ధర్తా అని పేర్కొనుటవలన అట్టి భగవదుపాసకులను తాను లెస్సగ సముద్ధరించెదనని భగవానుడు తెలిపినట్లు అయినది.
'మృత్యు సంసారసాగరాత్- సంసారమును సముద్రమునకు పోల్చిచెప్పిరి. సముద్రమువలె భయంకరమై, కామాది దుష్ట జలజంతువులలోగూడి అపారమైయుండుటవలన ఆప్రకారము అది సాగరమునకు పోల్చి చెప్పబడినది. అయితే అనేకులు సంసారసుఖములు మహా ఆనందకరములని, కావున సంసారస్థితి అభిలషణీయమని పలుకుచుందురు. అజ్ఞానము వలననే వారట్లు చెప్పచుందురు. సంసారస్థితియొక్క వాస్తవస్వరూపము వారి కింకను తెలియలేదని యర్ధము. దాని యథార్థరూపమును భగవానుడిచట బయటపెట్టిరి - అది "మృత్యు"సంసారమని వారు వర్ణించిరి. అనగా మరణరూపమైనదని, పుట్టుక చావులతో గూడినది యని భావము. కాబట్టి ఈ మృత్యుసంసారమధ్యమున తగుల్కొనిన జీవుడు అమరత్వసిద్ధికై అమృతస్వరూపుడగు భగవానుని, సచ్చిదానందప్రభువును తప్పక ఆశ్రయించవలసియున్నాడు.
*న చిరాత్' అని చెప్పటవలన భగవదాశ్రయముచే జీవుడు శీఘ్రముగ విముక్తి నొందగలడని తెలియుచున్నది, (దృష్టాంతము - గజేంద్రుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, ద్రౌపది).
ప్ర:- ఈ సంసారస్థితి యెట్టిది?
ఉ:- అది {1} సముద్రమువలె భయంకరమైనది, అపారమైనది.
(2) మృత్యురూపమైనది {జననమరణములలో గూడినది}.
ప్ర:- దానినుండి తప్పించుకొనుట యెట్లు?
ఉ:- భగవంతుని ఆశ్రయించినచో ఆతడే ఆ సంసారసాగరమునుండి జీవుని సముద్ధరించును.
ప్ర:-భగవానుని ఏ ప్రకార మాశ్రయించవలెను?
ఉ:-(1) సమస్తకర్మలను భగవానునకర్పించి
(2) ఆతనినే పరమగతిగా భావించి
(3) చిత్తమునాతనియందే నెలకొల్పి
(4) ఆతనినే చింతింపజేయుచు (ధ్యానించుచు) ఉపాసించవలెను.
🕉🌞🌎🌙🌟🚩
12-08-గీతా మకరందము
భక్తియోగము
🕉🌞🌏🌙🌟🚩
అ:- ధ్యానించువారికి కొన్ని సాధనాక్రమములను నాలుగు శ్లోకములద్వారా తెలియజేయబోవుచు మొట్టమొదట మనస్సును తనయందు నిలుపవలసినదిగా శ్రీకృష్ణమూర్తి బోధించుచున్నారు-
మయ్యేవ మన ఆధత్స్వ
మయి బుద్ధిం నివేశయ
నివసిష్యసి మయ్యేవ
అత ఊర్ధ్వం న సంశయః.
తా:- నాయందే మనస్సును స్థిరముగా నిలుపుము. నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము. పిమ్మట నాయందే నివసింతువు. సందేహములేదు.
వ్యాఖ్య:- విద్యార్థికి ఉపాధ్యాయు డెట్లు పాఠములను బోధించునో, ఆప్రకారముగ భగవానుడు అర్జునున కిపుడు ఒకటి తరువాత మరొకటిగ పెక్కు సాధనలను తెలియజేయబోవుచున్నాడు. ప్రప్రథమమున మనస్సును, బుద్ధిని పరమాత్మయందు స్థిరముగ నిలుపులాగున ఆనతిచ్చిరి.
ఇది మొదటి పాఠము, మనస్సును మాత్రము నిలిపిన చాలదా, బుద్ధినికూడ ఏల జోడించవలెను? అని ప్రశ్నించినచో, బుద్ధి నిశ్చయము చేయునది కావున, అదిలేనిచో మనస్సు సంకల్పవికల్పములతో గూడియున్నదై చంచలముగ నుండును.
మనస్సు సంకల్పించును, బుద్ధి నిశ్చయించును. కాబట్టి భగవద్విషయమై దృఢమగు నిశ్చయమును గలుగజేయునది బుద్ధియే, కావున దానినిగూడ మనస్సుతో చేర్చిచెప్పిరి. అట్లు మనోబుద్ధుల రెండిటిని ఇతరమైన దృశ్యవస్తువుల వేనియందును ప్రవేశింపనీయక ఒక్క భగవంతునియందే సంలగ్నమైయుండులాగున ప్రయత్నించవలెను. అట్లుచేసినచో నిక మనుజుడు ధ్యేయవస్తువుగు ఆ పరమాత్మయందే సదా నివసింపగలడు. ఆహా! ఎంతటి గొప్పస్థానమం దతడు నివాసము బడయును! ఉప్పుకల్లు సముద్రమునందు లయించునట్లు మనస్సు నిరంతరము దేనినిగూర్చి ధ్యానించునో, దేనియందు సంలగ్నమైయుండునో, దానియందే లయించి తదాకారాకారితమై యొప్పును.
కావున అనవరతము భగవంతునియందు స్థిరముగనుండునట్టి మనస్సు క్రమముగ ఆ దైవాకారమునే పొందిపోవును. అదియే మోక్షము. దేవునియందు నివసించుట యనగా ఇదియే. ఇవ్విషయమున ఏ మాత్రము సందేహములేదనియు, ఇది పరమసత్యమనియు భగవానుడు తెలియజేసిరి. కాబట్టి సాధకులు తమ మనస్సును అన్యత్రపోనీయక ధ్యానాదుల ద్వారా ప్రయత్నపూర్వకముగ భగవంతునియందు నిలిపినచో ఇక తమ మోక్షవిషయమై ఏలాటి సంశయమున్ను పెట్టుకొన నక్కరలేదని స్పష్టమగుచున్నది.
*న సంశయః - 'ఈ విషయమున సంశయములేదు" అని సాక్షాత్ భగవానుడే చెప్పినందువలన ఇక సాధకుల కీ వాక్యములపై ఎంతటి విశ్వాసముండవలెనో ఊహించుకొనుడు.
మయి ఏవ - (నా యందే అని "ఏవ" పదప్రయోగముచేయుటవలన, దైవముపైతప్ప ఇతరమగు దేనిపైనను దృష్టిని పోనీయరాదని (మనస్సును నిలుపరాదని) భావము.
ప్ర:- మనస్సును, బుద్ధిని ఎచటనుంచవలెను?
ఉ:- భగవంతునియందు.
ప్ర:- అట్లుంచుటవలన ప్రయోజనమేమి?
ఉ:- అత్తరి భగవంతునియందే యాతడు నివసింపగలడు (ఇట ఏలాటి సంశయములేదు).
🕉🌞🌏🌙🌟🚩
12-09-గీతా మకరందము
భక్తియోగము
🕉🌞🌎🌙🌟🚩
అII ఒకవేళ మనస్సు దైవమందు స్థిరముగ నిలవనిచో అప్పుడేమిచేయవలెనో చెప్పచున్నారు-
అథ చిత్తం సమాధాతుం
న శక్నోషి మయి స్థిరమ్ అభ్యాసయోగేన తతో
మామిచ్ఛాప్తుం ధనంజయ.
తా:- అర్జునా! ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నాయందు స్థిరముగ నిలుపుటకు నీకు శక్తిలేనిచో అత్తరి అభ్యాసయోగముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము. (అభ్యాసముచే స్థితిని యెట్లయినను సాధింపుమని భావము).
వ్యాఖ్య- మొదట తెల్చిన సాధన చేయలేనివారికి భగవానుడు మరికొన్ని ప్రత్యామ్నాయపద్ధతులను సూచించుచున్నారు.
ఆహా భక్తులపై, సాధకులపై సర్వేశ్వరునకు ఎంతటి కరుణ! మనస్సుచేతనే బంధము, మనస్సుచేతనే మోక్షము జీవునకు కలుగుచున్నవి*.
కాబట్టి మోక్షము పొందుటకు ఆ మనస్సు ఏదోవిధముగ అధిష్ఠానమగు పరమాత్మయందు (దైవమందు) లయించియే తీరవలెను. ఇక్కారణముననే గీతాచార్యులు మనస్సు దైవమందు నిలుకడను బొందనిచో అభ్యాసముచే యెట్లయినను దానిని నిలుకడబొందులాగున చేయవలయునని, (అది తప్ప మోక్షమునకు వేరుదారి లేదని) తెలియజేయుచున్నారు.
ప్రతివారును ఏదియోవిధముగ తమ మనస్సును బహిర్ముఖముగ పోనీయక, దృశ్యవిషయములపై వ్రాలనీయక, ఆత్మయందు (దైవమునందు) స్థాపన చేయవలెను. ఒకవేళ ప్రారంభస్థితిలో అట్లు మనస్సు ధ్యేయమందు నిలుకడను బొందనిచో అభ్యాసముచే మెల్లమెల్లగా ఆ స్థితిని ఎట్టెనను సాధించియే తీరవలెను. మనస్సు ఆత్మయందు లయించి, ఆత్మరూపమున శేషించుటయే మోక్షము. కావున ఆ స్థితిని ప్రయత్నపూర్వకముగ అభ్యాసము ద్వారా ప్రతివారును సాధించవలెను. "యతో యతో నిశ్చరతి .....(6-26)” అని 6వ అధ్యాయమున భగవానుడు తెలియజేసినరీతి చపలమనస్సును నెమ్మదిగా వశమొనర్చుకొని ఆత్మయందు (దైవమందు) స్థాపించవలెను. ఇట్టి అభ్యాసమునుగూర్చియే ఈ శ్లోకమందు తెలియజేయబడినది,
అభ్యాసయోగేన - ఈ అభ్యాసమనుయోగము కర్మయోగ, భక్తియోగ, ధ్యానయోగ, జ్ఞానయోగాదులన్నిటితోను కూడియుండవలెను. అన్ని యోగములకును 6వ శ్లోకమున తెలుపబడిన అనన్యయోగము, ఈ శ్లోకమందు తెలుపబడిన ఈ అభ్యాసయోగము ఆవశ్యకమైయున్నది. దీనితో చేరినపుడే తక్కిన యోగములన్నియు అభివృద్ధిని, వికాసమును బొందగలవు.
కొందరు సాధకులు గురువుల యొద్దకు వెళ్ళి" అయ్యా! ధ్యానకాలమున నా మనస్సు దైవమందు స్థిరముగ నిలుచుటలేదే? ఏమి చేయవలెను?" అని యడుగుచుందురు. అందులకు ప్రత్యుత్తరముగ వారు భగవానుడీశ్లోకమున తెలిపినదానినే చెప్పదురు.
"నాయనలారా! మనస్సు నిలువనిచో, అభ్యాసము చేసి యెట్లయినను నిలుచులాగున చేసికొనుడు, వేఱుదారిలేదు" అని వారు బోధించుదురు. మనోనిగ్రహమును గూర్చి 6 వ అధ్యాయమున "అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే" అను వాక్యము ద్వారా భగవానుడీ అభ్యాసమునే నొక్కిచెప్పిరి. కాబట్టి ప్రతివారును తమ మనస్సు ధ్యానకాలమున నిలుకడను బొందనిచో నిరుత్సాహపడక భగవాను డిచట బోధించిన రీతిగ అభ్యాసముచే దానిని ఎట్లయినను నిలుకడబొందునట్లు చేయవలెను. మోక్షమునకు వేరుమార్గములేదు.
ప్ర:- మనస్సును దైవమందు స్థిరముగ నిలుపుడని చెప్పిరే, అట్లు మనస్సు నిలవనిచో ఏమి చేయవలెను?
ఉ:- అభ్యాసముచే ఆ స్థితిని యెట్లయినను సాధించవలెను?
--------------
* మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః
{ అమృతబిందూపనిషత్తు - 10)
🕉🌞🌎🌙🌟🚩
No comments:
Post a Comment