Wednesday 15 May 2019

ప్రాంజలి ప్రభ -తెలుగు అంతర్జాల వార పత్రిక ( మే- 4 వ వారం- )


ప్రాంజలి ప్రభ - శార్దూలము
రచయత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

బీజేపీ గెలుపే అనంత వెలుగే 
ప్రోత్సాహ ప్రాబల్యమే
వైసీ పీ గెలుపే తెలుంగు ప్రతిభే 
ఉత్సాహ ప్రాబల్యమే
కాంగ్రెస్సూ ప్రతి పక్ష హంగు గెలుపే  
తత్కాల ప్రాబల్యమే
విస్వాసం తెలిపే కధ హంగు గెలుపే

ఉధ్భోధ ప్రారంభమే

ప్రాంజలి ప్రభ 
సేకరణ:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 4

శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు

ఒక్క నిమిషం .... ఈ మహా మహిమాన్విత స్తోత్రం చదవండి .... ఈ స్తోత్ర మహాత్యం తెలుసుకున్నాక మీకు ఇష్టమైతే రోజూ భక్తితో పటించండి ......... 

శ్రీ నృసింహ స్వామి వారి ద్వాదశ నామ స్తోత్రం మహా మహిమాన్వితం శక్తివంతం, ఈస్తోత్రాన్ని భక్తిగా పఠిస్తే స్వామివారు మనకు రక్షా కవచంలా ఉండి కాపాడతారు. అతి భయంకర వ్యాధులు రుగ్మతులు నశిస్తాయి,భయంతొలగుతుంది,మీ ఇంట్లో ఉండే వారి కోసం కుడా ఈ స్తోత్రాన్ని పఠిన్చి స్వామి వారి అనుగ్రహం పొందండి ... 

శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం...

ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ ।
తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ॥
పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః ।
సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ॥
నవమం ప్రహ్లాద వరదో దశమోऽనంత హస్తకః ।
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తదా ॥
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః ।
మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ॥
క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం ।
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥
గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు ।
రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ॥
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ ।
ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ ॥

ఓం శ్రీ లక్ష్మి నృసింహాయ నమః

--((**))--

18-32-గీతా మకరందము.
        మోక్షసన్న్యాస యోగము

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అ-తామసబుద్ధినిగూర్చి వచించుచున్నారు –

అధర్మం ధర్మమితి యా 
మన్యతే తమసా౽౽వృతా
సర్వార్థాన్విపరీతాంశ్చ 
బుద్ధిస్సా పార్థ తామసీ.

తా:- ఓ అర్జునా! ఏ బుద్ధి అవివేకముచేత కప్పబడినదై అధర్మమును ధర్మమని ఎంచునో, మరియు సమస్తపదార్థములను విరుద్ధములుగా తలంచునో, అట్టి బుద్ధి తామస బుద్ధియైయున్నది.

వ్యాఖ్య:- తామసబుద్ధి గలవానికి అంతయు తలక్రిందుగనే కనుపించును.
 వికారమైన అద్దములో ముఖము వికృతముగ గనుపించునట్లును, నీటిలో ప్రతిబింబము తలక్రిందులుగ భాసించునట్లును, తామసబుద్దియుతున కంతయు విపరీతముగ తోచును. 'సర్వార్థాన్' అని చెప్పినందువలన ఒకవిషయము కాదనియు, నిత్యజీవితములో ప్రతివిషయమున్ను అతనికి విరుద్ధముగ గన్పడుననియు తెలియుచున్నది. దీనికంతటికిని కారణమేమి? - " తమసా౽౽వృతా" - అవిద్యచే, అజ్ఞానముచే, అవివేకముచే గప్పబడుటయే కారణము. కల్లు త్రాగినవానికి లోకము తిరుగుచున్నట్లు గోచరించు విధమున, మాయామోహమదిరాపానముచే మత్తుడైయున్న అజ్ఞాని కీ జగత్తంతయు వాస్తవముగ గోచరించును. దృష్టాంతమునకు -

(1) లేని దేహము, జగత్తు వారికి ఉన్నటు చూపట్టును. ఉన్న ఆత్మ(దైవము) లేనట్లు కన్పించును.

(2) దుఃఖ భూయిష్టములైన విషయభోగములు వారికి సుఖకరములుగ తోచును.
పరమానందదాయక మగు ఆత్మ (దైవము) వారికి రుచింపకయే యుండును.

(3) రక్తమాంస మయమగు క్షణికదేహమందు వారు సౌందర్యబుద్ధి గలిగి యుందురు.
సచ్చిదానందఘన మగు శాశ్వత పరమాత్మయందు హేయబుద్దిని జూపుదురు.
వెయ్యేల, ధర్మమును అధర్మముగ జూచుదురు, అధర్మమును ధర్మముగా భావించుచుందురు. దీనికంతటికిని కారణము అవివేకమేయని ఇదివరలో తెలుప బడియున్నది.

 కావున ఏ బుద్ధియందు అట్టివిద్య, తమస్సు, కాపురముండునో ఆ బుద్ధి మహా నికృష్టమైనదియే యగును - ఆతడెంతటి భౌతిక బలయుతుడైనను, విజ్ఞాన సంపన్నుడైనను సరియే. కాబట్టి వివేకము నాశ్రయించి ప్రయత్నపూర్వకముగ అట్టి తమస్సును బుద్ధినుండి పారద్రోలి, సత్యమును సత్యముగను గ్రహించు శక్తిని సంపాదించి కృతార్థుడు కావలయును.

ప్ర:- తామసబుద్ధి ఎట్టిది?

ఉ: - అవివేకముచే గప్పబడినదై అధర్మమును ధర్మముగను , ధర్మమును అధర్మముగా పదార్థములను విరుద్ధములుగను గ్రహించునట్టి బుద్ధియై యున్నది.

--((**))--


                ముసలితండ్రి ఆవేదన
                        ➖➖➖✍



Pranjali prabha .com
శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉన్నతమైన యోగస్థితిని ఎలా పొందగలమో వివరించాడు. అభ్యాసం, వైరాగ్యం అనే రెండు మాటలతో మనసును స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన మార్గం చూపించాడు. దీన్నే అభ్యాస యోగం, సాధన యోగం అంటారు.
మనసు స్వాధీనానికి తప్పనిసరిగా ‘యమ’ (అహింస, సత్యవ్రతం, దొంగతనం చేయకుండా ఉండటం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం), ‘నియమ’ (శారీరక, మానసిక, పరిశుభ్రత, సంతృప్తి, శాస్త్రాధ్యయనం, దైవారాధన) అనే అభ్యాసాలు సాధన చేయాలని యోగశాస్త్రాలు చెబుతున్నాయి.
మనసు అల్లకల్లోలమైనప్పుడు మనం ఊపిరి వేగంగా తీసుకుంటాం. క్రమబద్ధతా ఉండదు. మనసును శాంతపరచడానికి శ్వాసను క్రమబద్ధం చేయడం ఒక పద్ధతి. నిండుగా గాలిని పీల్చి వదలడాన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే నిశ్చలమైన మానసిక స్థితిని పొందవచ్చు. ప్రాణశక్తి మీద పట్టు సాధించడం కోసం ఊపిరిని నియంత్రించడమే ప్రాణాయామం.
యోగి ఎవరన్నదానికి గీతలో కృష్ణుడు సమాధానమిచ్చాడు. ఈ ప్రాపంచిక కోరికలు, వాంఛల నుంచి మనసును అధిగమించి స్వతంత్రంగా, వ్యక్తిగా ఉండగలిగేవారే యోగి.
మనసును అధిగమించడమంటే దాన్ని నొక్కిపెట్టి ఉంచడం, నియంత్రించడం కాదు. మనసనేది ఆలోచనల ప్రవాహం. కోరికలు, వాంఛలూ ఆలోచనలతో సంక్రమించేవే. అంతవరకూ అనుభవంలోకి రాని దాన్ని అనుభవించాలను కోవడం కోరిక. అదే అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనుకోవడం వాంఛ.
ఆలోచనతో గుర్తింపు అంటే- ‘నేను కోపంగా ఉన్నాను’ అనుకోవడం కాకుండా ‘నా మనసు తెరమీద కోపం కనిపిస్తోంది’ అనుకోవాలి. ఆ కోపాన్ని చూడగలిగినప్పుడు ఆలోచనను వేరుచేయడం కుదురుతుంది. ఆ ఉద్వేగాన్ని తన నుంచి దూరంగా ఉంచినప్పుడు అది బలహీనపడుతుంది. ఆలోచనలను ఒక సాక్షిగా చూడ గలిగినప్పుడు వ్యక్తికి, అతడి ఆలోచనకు ఖాళీ ఏర్పడుతుంది. యోగి కావడానికి కోరిక అడ్డుకాదు. ఆ కోరిక కోసం పాకులాడటం, దానికి అతుక్కుపోవడం చేయ కూడదు. అందుకే మనసును అధిగమించాలి.
ఒకే గమ్యం చేరుకోవడానికి నాలుగు యోగమార్గాలను సూచించారు. నిత్య జీవితంలో ఇంటాబయటా ఎటువంటి అహం లేకుండా పనిచేసుకుపోతూ, కొంత దైవ చింతనతో ఇతరులకు సహాయాన్ని అందించడం కర్మయోగ.
సాధకుడు ప్రార్థన, దైవారాధన, నిర్నినిబంధంగా ఇతరులను ప్రేమించడం భక్తియోగలో భాగం.
మానసిక విజ్ఞానం తెలుసుకుని చేసే ఒక ప్రయాణం లాంటిది రాజయోగ. జీవశక్తి (ప్రాణం) గురించి అవగాహన, ధ్యానంతో మనసును ప్రభావితం చేయాలి అనుకునేవారికి రాజయోగ చక్కని మార్గం.
బుద్ధిజీవులకు తోడ్పడేది జ్ఞానయోగ. వేదాంతాన్ని ఒక వాహనంగా తీసుకుని మనశ్శక్తితో ముందుకెళ్ళడం. వ్యక్తిగత స్వభావాల గురించి తెలిసుండాలి. ఇతర మార్గాల్లోని పాఠాలను గ్రహించినవారు ఈ మార్గంలో ఆత్మజ్ఞానం పొంది ఆధ్యాత్మిక బాటలో పయనిస్తారు.
‘యోగ అన్నది విజ్ఞానశాస్త్రం. సాధకులకు మనసును అధిగమించడమెలాగో నేర్పుతుంది’ అని పతంజలి యోగ సూత్రాలు చెబుతున్నాయి. స్థితప్రజ్ఞత గురించి ప్రస్తావిస్తూ, ఏ చర్య చేపట్టాలన్నా యోగికి ఉండే కౌశలాన్ని సంపాదించా లంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు.
యోగ సాధన వల్ల మనసులో సద్భావనలు చోటుచేసుకుంటాయి. చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
‘వెయ్యిమందిని వెయ్యిసార్లు యుద్ధంలో ఓడించినవాడికన్నా తన మనసును జయించినవాడే పరాక్రమవంతుడు’ అంటాడు గౌతమ బుద్ధుడు.
--((**))--
అన్నం ఎలా పుడుతుందనే విషయాన్ని వేదం వివరించింది. పరబ్రహ్మతత్త్వమునుండియే ఆకాశము ఉద్భవించింది. ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఔషధులు (మొక్కలు) ఓషధులనుండి అన్నము, అన్నమునుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు. అనగా పరబ్రహ్మతత్త్వము. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి. అన్నపూర్ణాదేవి.

దీనులకు అన్నము పెట్టడం, ఉదకము ఇవ్వడం  చేయుటం ధర్మము. దాన్ని ఆచరిస్తే, శ్రేయస్సు ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని పేర్కొన్నది మహాభారతము.ప్రకృతి స్వరూపం- ఋతువులు. శక్తిస్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన పుష్టివంతులగా నొనర్చు కరుణామయి, విశేషంగా అర్చించబడు, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి.

‘‘బిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి.

‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’’

 కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీకూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా, ప్రపంచమంతా నీ నుండే వచ్చినా, ఇంకా ఆ శక్తి ‘పూర్ణమే’. ఆ పూర్ణశక్తియే ‘అన్నపూర్ణ’.

  ‘కాశీ’ అంటే వెలుగు. అందుకే వారణాసికి కాశీ అని పేరు వచ్చింది.అనంతమైన విశ్వశక్తిని ఆకళింపు చేసుకొని, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని చెప్తోంది, అఖిల భువనసాక్షి- అన్నపూర్ణాదేవి.

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ |
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 ||

నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ |
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2 ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3 ||

కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ 
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ |
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 ||

దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ 
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విఙ్ఞాన-దీపాంకురీ |
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 5 ||

ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ 
వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ |
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 6 ||

ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ 
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ |
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 7 ||

దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ 
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 8 ||

చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ 
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ| 
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 9 ||

క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ 
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 10 ||

అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే |
ఙ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ || 11 ||

మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః |
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || 12 ||

సర్వ-మంగళ-మాంగళ్యే శివే సర్వార్థ-సాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమో‌உస్తు తే || 13 ||

--((**))--


❤   ప్రేమకు    రంగులున్నాయా...?? ❤
*********
మలిసంధ్య గోరంత చీకటి
ఒళ్ళుకు రాసుకొని
చామనఛాయా చిత్రంలా
దర్శనమిస్తుంటాను

పులిసిపోయిన పిండి
సర్రున పెనంపై లేచి కూర్చుంటే
గుటకలు మింగుతూ
వాసన భోంచేస్తుంటాను

చుక్కలచొక్కా బొక్కల మధ్య 
గాలి యధేచ్ఛగా దూరెళ్ళుతుంటే
గాల్లో తేలుతూ సాగుతుంటాను

ఊహల్లో మేడలెక్కేస్తూ
స్వప్నాల్లో సంపదకు
రాజునవుతుంటాను

అలంకారం లేని చీకటిని 
వెంటేసుకొని
దేహాన్ని దాచి
నిర్భయంగా వెళుతుంటాను

తలపై మొలచిన 
ఎండుగడ్డిని సవరిస్తూనే
దుమ్ములో ధూలినై అలా అలా
విహరిస్తుంటాను

నాకాడ చిల్లిగవ్వ లేదు
చిల్లులుపడ్డ బనియన్ తప్ప
నన్ను ప్రేమిస్తారా...??
ఛీదరిస్తారా.....??

బ్రమలో బంధాల్ని అల్లుకొని
లోకాన్ని స్వాదీనపరుచుకొని
మొహమాటంగా
సమాజాన్ని తడుముతూనే
ఉన్నఫలంగా హస్తమిస్తుంటాను

అంతర సౌందర్యాన్ని
అనుక్షణం చూసుకుంటూ
బాహ్యప్రపంచపు అంచుల్లో
మెరుస్తుంటాను

అద్దంలో నా ప్రతిబింబాన్ని
చూర్ణం చేసి
అమావాస్య ముఖంపై 
ముచ్చటగా అద్దుతుంటాను

నేను అందంగా లేను
మందం అసలే లేను
నన్ను ప్రేమిస్తారా.....??
ఛీదరిస్తారా......??

ప్రేమకు రంగులున్నాయా 
మరీ....
హంగు రంగు లేని నన్ను 
ప్రేమ అంగీకరిస్తుందా
      ••••••••••○••••••••••

  రచన: నరెద్దుల రాజారెడ్డి
   ఫోన్ :  9666016636


ప్రాంజలి  ప్రభ 

రచయత : సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ 

పూజకు సిద్ధమై పోయారా? మరి పూజకు పూలు తెచ్చారా,తేలేదా? మరైతే పదండి మీ తోటకి పూలు తెద్దాం. అన్నట్టు భగవంతునికి ఇష్టమైన పూలేంటో తెలుసా!

ఇవిగో.....

అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహః 

సర్వ భూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః 
జ్ఞాన పుష్పం తప: పుష్పం శాంతి పుష్పం తథైవ చ 
సత్యం అష్ట విధం పుష్పో: విష్ణో హో ప్రీతి కరం భవేత్ !!

1.అహింసా పుష్పం:


ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించ కుండా ఉండటమే దేవునికి సమర్పించే ప్రధమ పుష్పం.


2.ఇంద్రియ నిగ్రహం:


చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం.


3.దయ:


కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.


4.క్షమ:


ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ.ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.


5.ధ్యానం:


ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం.ఇది దేవుని అందించే ఐదో పుష్పం.


6.తపస్సు:


మానసిక ( మనస్సు),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.


7.జ్ఞానం:


పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం.ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.


8.సత్యం:


ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.


అవి చాలా అరుదైన పుష్పాలు, అవి మా తోటలో అన్ని లేవే అంటున్నారా! మరేం ఫరవాలేదు ఇవాళే మొక్కలు నాటండి. త్వరలోనే మిగతా పూలు పూయించండి.


--((**))--


*ప్రాంజలి ప్రభ 
నేటి కవితానందం 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

కత్తి వేటు - దుర్మార్గునకు చేటు
కలం తో పోటు -  రాజకీయునకు చేటు
పలకపై గీటు - విద్యకే చేటు
ముఖం పై గాటు - అనుమానానికి గీటు

రోడ్డు దాటు  - గ్రహించలేక చేటు
పప్పు రేటు  - తినేవారికి లోటు
పోపు ఘాటు - అజాగార్తకు చేటు
వార్తల ఘాటు - జాగార్తలకు చేటు

వీపు  పై వేటు - తొందర పాటుకు చేటు
పిప్పి పన్ను పోటు - క్రిములకు చోటు
పుస్తకముపై గీటు - చదవాల్సిన రూటు
చార్జీల రేటు  - ప్రభుత్వానికి రూటు

ఏలోటు లేకుండా సాగాలంటే - కర్తవ్య దీక్షపరులకే ఓటు
--((*))--



1కృష్ణ భక్తి -
================================ 
కృష్ణుని గురించి ఎంతమంది చెప్పినా తనివి తీరదు. అది సంపూర్ణం కాదు. పోతన మొదలు నేటి కవుల వరకు చాల మంది తెలుగుభాషలో స్వామి రూపగుణ వైభవాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అందులో వేటూరి సుందర రామమూర్తిగారు కూడా ఉన్నారు. "మోహనాల వేణువూదే మోహనాంగుడితడే.." అని ఒక పంక్తిలో పొగిడితే ఇంకొక పంక్తిలో "నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే" అని సాగర సంగమం చిత్రంలోని వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడే ముద్దు గోవిందుడే అన్న గీతంలో వేటూరి వారు అన్నారు. ఆ సమ్మోహననుని వేణువు వింటే గోకులం అంతా "నేను" అన్న భావన మరచి ఆ పరమాత్మతో అను సంధానమై తన్మయత్వంలో మునిగేవారుట. ఆతని రూపము వర్ణించనలవి కానిది. 

"కస్తూరీతిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేచ ముక్తావళీం గోప స్త్రీ పరివేష్టితోం విజయతే గోపాల చూడామణిం" అని బిల్వమంగళుడు ఆ ముకుంది మోహన రూపాన్ని శ్రీకృష్ణకర్ణామృతంలో వర్ణించే యత్నం చేశాడు. విశాలమైన నుదుటన కస్తూరి తిలకం, వక్షస్థలమున కౌస్తుభ మణి, ముక్కు చివరన కొత్త ముత్యం, చేతిలో వేణువు, చేతులకు కంకణాలు, తనువంతా శ్రీచందనం, కంఠములో ముత్యాలహారం, చుట్టూ గోపికలతో ప్రకాశిస్తున్నాడు ఆ గోపాల చూడమణి. 

మరి ఆ కృష్ణుడు ఆకాశం రంగుతో నిఖిలమైనాడు. అంతటా ఆయనే ఉన్నాడు. సృష్టికి పరిణామాలకు లీలావినోదంతో చూస్తూ సాక్షీ భూతుడైనాడు. అందుకే వేటూరి వారు ఆయనను కాలమై నిలిచాడు అన్నాడు. ఇంకొక అడుగు ముందుకు వేసి "గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే" అన్నారు. కర్మ చేయటం వరకే నీ వంతు, ఫలాన్ని నాకు వదులు అని చెప్పి మన విదిని మార్చుకునే మార్గం చెప్పాడు ఆ పరమాత్మ. కృష్ణావతారానికి ఒక విశేషమైన, విలక్షణమైన లక్షణముంది. ఆయన అంతటా ఉన్నట్లు అనిపించినా, ఎవ్వరికీ దేనికీ చెందని వాడు. కన్న తల్లికే చెందలేదు, ప్రేమించిన రాధకూ చెందలేదు, పూజించిన బావకూ చెందలేదు. ధర్మం వైపు నిలిచాడు. భక్తికి తలవంచాడు. అందుకే ఆ వేటూరి గారే మళ్లీ ఆయనను ఔరా అమ్మక చెల్లా అనే గీతంలో "బాలుడా! గోపాలుడా! లోకాల పాలుడా! తెలిసేది ఎలా ఎలా ఛాంగు భళా" అన్నారు. "అయినవాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికీ" అని కృష్ణుని తత్వాన్ని వీలైనంత సులభంగా తెలియజేసే ప్రయత్నం చేశారు. 

కృష్ణభక్తికి మూలం ఇదే. మనలను మనం సంపూర్ణంగా స్వామికి సమర్పించుకోవటం. అన్నీ భావనలూ ఆయనవే అని "నేను", "నాది" అన్న భావనలకు దూరమై జీవాత్మను పరమాత్మను ఏకం చేయటం. ఎప్పుడైనా శరణాగతితో ఉన్న కృష్ణభక్తులను చూస్తే ఈ విషయం అవగతమవుతుంది - బాహ్యప్రపంచం పట్టదు, స్వామిని దర్శిస్తూ అనేకునితో ఏకమై రమిస్తూ ఉంటారు..

--((**))--


ప్రాంజలి ప్రభ 
నేటి కవితానందం 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
  
నీ ఆలోచనలు మారక పోతె 
నిత్యం రైలు ప్రయాణాలే 
నీ ఆలోచనలు గొలుసులైతె
నిత్యం ఆహ్వాన పత్రికలే 

నీ ఆలోచనలు ఆచరణ అయితె
నిత్యం సుఖ సంతోషాలే 
నీ ఆలోచలు ఏడుపులుగా మారితె 
నిత్యం దు:ఖ శాపనార్దాలే        

నీ ఆలోచనలు గెలుపు లయితె 
నిత్యం ఆరోగ్య సంపదలే   
నీ ఆలోచనలు మృగాలుగా మారితె 
నిత్యం తోడు నీడ కరువులే 

నీ ఆలోచనలు విద్యా బుద్ధులైతె
నిత్యం దేశసంపద పెరిగినటులే
నీ ఆలోచనలు దాన ధర్మాలైతె
నిత్యం మన:శాంతి మాటలే
  
--((**))--
      

తెలివి చిన్న కధ (1)
ప్రాంజలి ప్రభ - మల్లాప్రగడ రామకృష్ణ 

ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు.

అది ప్రపంచంలోనే అతి పె ద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ  ఉండదు.
 "ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ?" అడిగాడు బాస్.

 "చెయ్యలేదు"

"సరే ! రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా! ".

తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది తనకి. చివరకి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు. 

"ఈ రోజు ఎంత మంది కష్టమర్స్ కి  సేల్స్ చేశావు?".

 "సర్ ! కేవలం ఒకరు" అని బదులిచ్చాడు తను.

 "ఒకటేనా ! నువ్వు ఇక్కడ గమనించావా, అందరూ 40 నుండి 50 సేల్స్ చేస్తారు. సరే, ఎంత ఖరీదైన సేల్ నువ్వు చేశావో చెప్పు?"

 "8,009,770 పౌండ్స్" చెప్పాడు మన సేల్స్ మాన్. 

"వాట్ !!" అదిరిపడ్డాడు  బాస్. 

"అంత పెద్ద సేల్ ఏమి చేశావు?"  అడిగాడు. 

"వినండి. ఒక పెద్దాయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను."

"గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే? "  అన్నాడు బాస్.         

"పూర్తిగా వినండి, తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు. దాని కన్నా ఒక బోట్  లో వెళుతూ నది మధ్య చేపలు పడితే  బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక షూనర్ బోట్  డబల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్దమనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ ఈ బోట్ ని తీసుకు పోలేదు అన్నారు. అప్పుడు ఆటొమోబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త 4 * 4 డీలెక్స్ బ్లాజర్ కొనిపించాను.తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి కాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఒచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ కాంప్ టెంట్ దానిలో ఉండటానికి కావల్సిన భోజన సామగ్రి పాక్ చేయించాను.” 

బాస్ ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు. "ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా !!!"

 "లేదు సార్ !" బదులు ఇచ్చాడు సేల్స్ మాన్.

"మరి ? "  అన్నాడు బాస్. 

 " ఆయన నిజానికి ఒక తల నొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే  హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను." 

బాస్: " అరే యార్ …!! ఇంతకీ  నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి?"

అప్పుడు ఆ సేల్స్ మాన్ చెప్పాడు "
హనుమాన్ విద్యామందిర్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి సార్."టీచర్ కి, సేల్స్ కు,ఏంటి రిలేషన్?? అడిగాడు బాస్ 
ఏబిసిడి లు నేర్పమని వస్తే ,పదేళ్ల తర్వాత వచ్చే భగవద్ గీత,  ఐఐటి -నీట్-సివిల్స్ ,రాంక్  పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం... అని ఆన్సర్ ఇచ్చాడు

ఇదండీ మన విద్యా విధానం అందుకే వెనుకబడి ఉన్నది, మన తెలివి మనం ఉన్నచోట పనికి రాలేదు, వేరోచోటికి పొయ్యాక తేలివి బయట పడింది.  ఎక్కడైనా దోచుకోవటమే ఇది చదువులు నెపంతో తల్లి తండ్రుల బలహీనతను సొమ్ము చేసు కోవాలను కోవటమే, అక్కడది వ్యాపారము ఏది ఏమైనా తెలుగోడి తెలివి అమోఘం. అందుకే అన్నారు పెద్దలు వినయం ఉన్న చోట "గర్వం, దర్పం, స్వాతిశయం దరి చేరవు, ప్రేమతో కూడిన సద్గుణం ఏర్పడి సంపద వచ్చి చేరుతుంది. ఫలితం అసించ కుండా పనిచేస్తే   మన:శాంతి ఏర్పడుతుంది.                 

--((**))--



ప్రాంజలి  ప్రభ - చైతన్య గీతం
రచయత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

హరె మామ హరెమామ
ఎండెక్కువ వుంది ఏంచ్చేద్దువు మామ
ఏ.సి ఉందిగదా తొంగుంటే సరే

హరెమామా హరెమామ
ఎ.సి పడదు, ఆయాసం వస్తుంది మామ
అయితే జమ్ముకాశ్మీర్ పోతె సరే

హరె మామ హరెమామ
అక్కడ తీవ్ర వాదుల భయముంది మామ
అయితే చట్టాల్ దగ్గర్కు పోతె సరే

హరె మామ హరె మామ 
చుట్టాలను రాబందులన్నావు కదా మామ
అయితే తిరుమలకు వెలితె సరే

హరె మామ హరెమామ
తిరుమలలో గుండుతో చూడలేను మామ
అసలు నీవే దంటె అదె సరే

హరె మామ హరెమామ
అట్లాఅనకు నీమాటె వింటామామ
అయితే పుట్టింటికి పోతే సరే

హరెమామ హరె మామ
నీవు కూడానాతో వస్తే బవుంటుంది మామ
కలసి పోదాం లే సరే

హరెమామ హరెమామ
అమ్మానాన్నకు బట్టలు తీసికెల్దామ మామ
అంతెనా ఇంకే మైన సరే

హరెమామ హరెమామ
సంరోజు నీమాటలతో చల్లబడ్డాను మామ
ఇంకేమి అడగను సరే

హరె మామ హరె మామ
సంతసించి పోదాంలే సరే
సంతసించి పోదాంలే సరే

--((*))--


సాహితీమిత్రులారా! 
శా. ప్రారంభించి చకోరపోతము మహీయజ్జ్యోత్స్నయం దుత్సవ 
శ్రీరంజిల్లుచు సోలుచుండు గతి నా చిత్తంబు నీ దివ్యశృం 
గార ధ్యానమునం దహర్నిశము జొక్కంజేయవే దేవ శ్రీ 
గౌరీలోచననర్తకీనటనరంగస్థాన సర్వేశ్వరా! 

కార్తీకపు చిరుచలిలో పున్నమి రాతిరి ఆరుబయటో డాబాపైనో పడుకొని, పిండారబోసినట్టు ఆకాశమంతా పరుచుకున్న తెలివెన్నెలని కనులతో, తనువుతో, మనసుతో జుఱ్ఱుకోవడం ఒక అందమైన అనుభూతి. అప్పుడు మనం అచ్చంగా ఒక చకోరపక్షి అయిపోతాం. శివభక్తులయితే బహుశా, కైలాసంలో సాక్షాత్తూ ఆ సర్వేశ్వరుని దర్శించినట్టే అనుభూతి పొందినా ఆశ్చర్యం లేదు. నెలతాలుపుకీ వెన్నెలకీ ఏదో అనాది అనుబంధం! అలాటి అనుబంధమే యీ పద్యం వ్రాయడానికీ కవిని పురికొల్పిందేమో! 

ఇది అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకంలోని పద్యం. ఈ అన్నమయ్య తాళ్ళపాక అన్నమయ్య కాదు, యథావాక్కుల అన్నమయ్య. ఇతను పదమూడవ శతాబ్దానికి చెందిన శైవకవి. తెలుగు సాహిత్యంలో శతకాలకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శతకసాహిత్యానికి చాలా విస్తృతి ఉంది. మనకు శతకాలు వేలాదిగా కనిపిస్తాయి. తెలుగులో శతకాలకు మూలం శివకవులే. మొదటగా లభించిన శతకం మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారమని సాహిత్యకారులు భావిస్తున్నారు. ఆ తర్వాత మరొక శతాబ్దానికి వెలసినవి యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వరశతకమూ, పాల్కురికి సోమన వృషాధిపశతకమూను. అన్నమయ్య సోమనలలో ఎవరు ముందు ఎవరు వెనుక అన్న విషయం గురించి వాదోపవాదాలున్నాయి. అన్నమయ్య తన గురువు పేరు ‘ఆరాధ్య సోమేశ్వరు’డని చెప్పుకున్నాడు. అతను పాల్కురికి సోమనాథుడే అని నిడదవోలు వెంకటరావుగారు అభిప్రాయపడ్డారు. కాని యితను వేరనీ, పాల్కురికి సోమన అన్నమయ్యకు తరువాత వాడనీ శతకవాఙ్మయసర్వస్వము వ్రాసిన విద్వాన్ వేదము వేంకటకృష్ణశర్మగారు అన్నారు. ఆ గ్రంథానికి పీఠిక వ్రాసిన మల్లంపల్లివారు కూడా దానితో ఏకీభవించారు. 

ముందువెనుకల మాట ఎలా ఉన్నా, తెలుగు సాహిత్యాన్ని శతకాలతో సుసంపన్నం చేసిన ఘనత మాత్రం శివకవులదే! శతకాలను చాటుప్రబంధాలుగా పూర్వ లాక్షణికులు పేర్కొన్నారు. వీటినే ముక్తకాలని కూడా అంటారు. చాటువులలో కథా పాత్రల ప్రమేయం లేకుండా కవి నేరుగా తన సొంత అభిప్రాయాలనూ, భావాలనూ, అనుభూతులనూ వ్యక్తీకరిస్తాడు. శతకాలలో అధికశాతం భక్తిశతకాలే. భక్తులు భగవంతునిపై తమకున్న అమితభక్తిని రకరకాలుగా చాటుకునే పద్యాలతో నిండి ఉంటాయి. ఇందులో ఎక్కువగా భగవత్‌స్తుతి, ఆత్మార్పణా కనిపిస్తాయి. మతపరమైన ఆచారాలు, తత్త్వము, భక్తుల కథలూ భక్తిశతకాలలో భాగమే. ముఖ్యంగా శివకవుల శతకాలలో వీరశైవ మతాన్ని గురించి చాలా సమాచారం దొరుకుతుంది. వారు సాహిత్యాన్ని మతప్రచారానికి సాధనంగా వాడుకున్నట్టు తెలుస్తోంది. అయితే శివకవుల యితర శతకాలతో పోలిస్తే యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వరశతకంలో వీరశైవం తీవ్రరూపంలో కనిపించదు. ఇతను లింగధారణ చేసిన జంగముడు కాదని తన గురించి అతను చెప్పుకున్న వివరాలబట్టి అనుకోవచ్చు. ఈ శతకంలో తన గురించీ, కృతిరచనా కాలాన్ని గురించీ కవి కచ్చితమైన వివరాలని ఇవ్వడం ఒక విశేషం. తనని యజుశ్శాఖకి చెందిన ఆరాధ్యబ్రాహ్మణునిగా చెప్పుకోవడాన్ని బట్టి, యితను వేద ప్రామాణ్యాన్ని అంగీకరించిన శైవుడు అనిపిస్తుంది. ఇతను అద్వైతాన్ని కూడా ఆమోదించినట్టుగా వేదం వేంకటకృష్ణశర్మగారు భావించారు. కాని నాకు అది పూర్తిగా నిజం కాదని అనిపించింది. ఎందుకంటే, ఒక పద్యంలో “సోహం” “సోహం” అనేవాడు “మోహధ్వాంతములో మునింగిన మహామూఢు”డనీ, “అతిభ్రష్టు”డనీ, అతను శివునికి చాలా దూరంగా ఉండిపోతాడనీ, ఎవడయితే అహంకారాన్ని వీడి సద్భక్తితో నీకు “దాసోహం” అంటాడో, అతనే నీవై ఉంటాడనీ వర్ణిస్తాడు. ఇక్కడ “సోహం” అనే అద్వైతమతాన్ని చాలా స్పష్టంగా ఖండించడం గమనించవచ్చు. భక్తునికి భగవంతుని స్థానాన్ని యివ్వడం శైవవైష్ణవ మతాల రెంటిలోనూ కనిపిస్తుంది. కాని అది అద్వైతభావన కాదు. అన్నమయ్య యీ శతకంలో జ్ఞానమార్గాన్ని ఖండించి, కర్మ భక్తి మార్గాలను బోధించినట్టుగా నాకనిపింది. 

ఈ శతకంలోని మరొక విశేషం ఏమిటంటే, ఇతర శివకవుల శతకాలతో పోలిస్తే, యిందులో కవిత్వం పాలు ఒకింత ఎక్కువగా గుబాళించింది. పాల్కురికి సోమన వృషాధిపశతకంలో భక్తి, మతవిషయాలతో పాటు మనలని ఆకర్షించేది అందులోని భాషాగరిమ. అందులో పద్యాలు శబ్దాలంకారశోభితాలు. రకరకాల భాషలలో, మణిప్రవాళశైలిలో ఉన్న పద్యాలు కూడా అందులో కనిపిస్తాయి. ఈ సర్వేశ్వరశతకంలో, సమాసబందురమైన చిక్కని ధారతో పాటుగా, చక్కని పోలికలూ దృష్టాంతాలూ అర్థాంతరన్యాసాలంకారాలు మన మనసులని మురిపిస్తాయి. అలా నా మనసుని ఆకట్టుకొన్న ఒక పద్యమే యీ నెల వెన్నెల పద్యం. 

పోతము అంటే పక్షిపిల్ల. చకోరపోతము అంటే ఒక పిల్ల చకోరం అన్న మాట. పిట్ట గొంతే కొంచెం, అందులో పిట్టపిల్లది ఇంకెంత చిన్న గొంతుకుంటుంది! కాని పిల్లలకు సహజంగా ఆత్రం ఎక్కువ. ఇష్టమైనది తాగేటప్పుడో తినేటప్పుడో వారు పడే ఆత్రం భలే ముచ్చటగా ఉంటుంది. తనని తాను అలాంటి చకోరపు పిల్లగా అభివర్ణించుకుంటున్నాడు కవి. అందుకే ఆరంభంలోనే “ప్రారంభించి” అన్నాడు. అంటే ప్రయత్నంతో కూడి అని అర్థం. వెన్నెలేమో “మహీయజ్జ్యోత్స్న.” అంటే దిగ్దిగంతాల దాకా వ్యాపించిన గొప్ప వెన్నెల. అంత వెన్నెలనీ తాగేయాలని యీ చకోరపోతానికి ఉత్సాహం. ఆ ఉత్సాహంలో అది నిరంతరంగా సొక్కిసోలుతూ ఉంటుంది. సరిగ్గా అలాగే, శివుని దివ్యమైన శృంగార ధ్యానములో తన చిత్తం నిమగ్నమైపోయేలాగా అనుగ్రహించమని కోరుకుంటున్నాడు కవి. ఇక్కడ దివ్యశృంగారము అంటే దివ్యమైన సౌందర్యం. నింగీనేలా అంతటా పరచుకున్న వెన్నెలంత దివ్యసౌందర్యం శివునిది. ఒక్కసారి ఆలోచించి చూస్తే, వెన్నెలకీ శివునికీ ఎంత దగ్గరి పోలికో మనకి అవగతం అవుతుంది! వెన్నెల ఎప్పుడూ రాత్రే ప్రకాశిస్తుంది. అంచేత అది నలుపు తెలుపుల చిత్రమైన సమ్మేళనం. శివుడూ అంతే! ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, అతను ఎంతటి జ్ఞానమూర్తియో, అంతటి తామసికశక్తి. మనం చిత్రించుకున్న భౌతిక రూపాన్ని ఊహలోకి తెచ్చుకున్నా, అతను నలుపు తెలుపుల చిత్ర సంగమమే! శివుడు స్వయంగా తెల్లని తెలుపు, పక్కనే వామభాగంలో అమ్మవారు శ్యామలాస్వరూపంలో వెలుగుతూ ఉంటారు. తలపైన గంగమ్మ, నెలపూవు, ధవళకాంతులీనుతూ ఉంటారు. మెడలోని నాగన్నా, గొంతుకలోని గరళమూ, కట్టిన గజచర్మమూ నల్లగా నిగారిస్తూ ఉంటాయి. ఆ శివస్వరూపమే కార్తీకపు వెన్నెల. వెన్నెలనయితే కనులతో చూడవచ్చు, మనసుతో ఆస్వాదించవచ్చు. మరి శివుని దివ్యశృంగారమో? అది కనులకి కడుతుందా? మన కళ్ళకి అది సాధ్యంకాదు. అందుకే ఆ దివ్యసౌందర్యాన్ని ధ్యానిస్తానని అంటున్నాడు కవి. అయితే, అంతటి మహాదేవుని శృంగారమూ, ఒకే ఒక కంటిజతకి కనిపిస్తుంది. మామూలుగా కనిపించడం కాదు, నిరంతరం ఆ చూపులకి గమ్యస్థానమే ఆ సౌందర్యం! ఆ నేత్రాలు ఎవరివో, పద్యం చివరిపాదంలో ఒక అద్భుతమైన విశేషణంతో చెప్పాడు కవి. “శ్రీగౌరీలోచననర్తకీనటనరంగస్థాన” – పద్యానికంతటికీ మకుటాయమానమైన ప్రయోగం ఇది! శ్రీగౌరి – పార్వతీదేవి, లోచన – కనులనే, నర్తకీ – నర్తకి, నటన – నాట్యానికి, రంగస్థాన – రంగస్థానమైన ఓ సర్వేశ్వరా. పార్వతీదేవి కన్ను అనే నర్తకి (కనులు రెండయినే చూపు ఒకటే కాబట్టి) నిరంతరం నాట్యం చేసే రంగస్థలం అట శివుడు! ఎంత గొప్ప ఊహ చూడండీ యిది! అమ్మవారి చూపులు ఎప్పుడూ అయ్యవారిపైనే కదులుతూ ఉంటాయన్న విషయాన్ని ఎంత అందంగా చెప్పాడు అన్నమయ్య! “గౌరీలోచన నర్తకీ నటన రంగస్థాన సర్వేశ్వరా!” 

చాటుసాహిత్యంలో తరచూ కనిపించే లక్షణం – పద్యాల గురించీ, కవుల గురించీ జనవ్యవహారంలో వ్యాప్తమైయ్యే కథలు. ఈ శతకం గురించి కూడా అలాంటి ఐతిహ్యం ఒకటి ఉంది. అన్నమయ్య యీ శతకాన్ని రచించడం మొదలుపెట్టినప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాడట. ప్రతి పద్యాన్నీ ఒక తాటాకు మీద వ్రాసి కృష్ణానదిలో వదిలిపెడతాననీ, అది తిరిగి వస్తే స్వామి ఆ పద్యాన్ని స్వీకరించినట్టు భావించి శతకరచన కొనసాగిస్తాననీ, ఎప్పుడైనా ఒక పద్యం తిరిగి రాకపోతే, అక్కడితో ఆపేసి గండకత్తెర వేసుకొని ప్రాణత్యాగం చేస్తాననీ ఆ ప్రతిజ్ఞ. అలా సాగుతున్న రచనలో ఒక పద్యం దగ్గరకి వచ్చేటప్పటికి అది తిరిగి రాలేదట. అప్పుడు తన శపథం ప్రకారం మెడ కత్తిరించుకొనేందుకు సిద్ధపడితే ఒక పసులకాపరి ఒక తాటాకుని తెచ్చి యిచ్చాడట. దాని మీద తన పద్యం కాకుండా అదే మకుటంతో మరొక పద్యం ఉన్నదట. దానిని, శతకరచన కొనసాగించమన్న శివుని ఆజ్ఞగా భావించి, ఆ పద్యాన్ని కూడా స్వీకరించి శతకాన్ని పూర్తి చేశాడని కథ. శతకంలో తిరిగిరాని పద్యమూ, తిరిగి వచ్చిన కొత్త పద్యమూ రెండూ ఉన్నాయి! నా దృష్టిలో కవిత్వపరంగా చూస్తే, ఆ రెంటిలోనూ, తిరిగిరాని అన్నమయ్య పద్యం ఉత్తమమైనది. తాత్త్వికదృష్టితో ఆలోచిస్తే, తిరిగివచ్చిన రెండో పద్యం ఉన్నతమైనది! సరే ఇంత చెప్పుకున్నాక ఆ రెండు పద్యాలనూ కూడా చదివి ఆస్వాదించండి మరి. 

తిరిగిరాని అన్నమయ్య పద్యం: 

తరులం బువ్వులు పిందెలై యొదవి, తత్తజ్జాతితో బండ్లగున్ 
హర! మీ పాదపయోజ పూజితములై యత్యద్భుతం బవ్విరుల్ 
కరులౌ, నశ్వములౌ, ననర్ఘమణులౌ, గర్పూరమౌ, హారమౌ 
దరుణీరత్నములౌ, బటీరతరులౌ, దథ్యంబు సర్వేశ్వరా! 

తిరిగివచ్చిన పద్యం: 

ఒక పుష్పంబు భవత్ పదద్వయముపై నొప్పంగ సద్భక్తి రం 
జకుడై పెట్టిన పుణ్యమూర్తికి బునర్జన్మంబు లేదన్న, బా 
యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచుం బెద్ద నై 
ష్ఠికుడై యుండెడివాడు నీవగుట దా జిత్రంబె సర్వేశ్వరా! 
---------------------------------------------------------- 
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, ఈమాట సౌజన్యంతో 
--------------------------------------------------------- 
స్వచ్ఛంద సేకరణ ప్రాంజలి ప్రభ 
-((**))--


 ఇది మట్టి కధ 
ఇది మనిషి కధ 
మనుషుల ఆకలి తీసే ఆయుధాలను తయారుచేసే అన్నదాత కధ 

ఆశలు విరిగిన నిరాశ కధ
నీళ్ళు నోచని బీళ్ళ కధ 
నలిగిపోయిన నాగళ్ళ కధ 
కరువుకు వేలాడే బరువు కధ
సిటిసందులో సలాం చేయుటకు తరులిపోతున్న బ్రతుకుతెరువు కధ

ఇది ఎండినపోయిన సాళ్ళ కధ
పచ్చదనముచే కసిరేయబడిన కన్నీటి కధ
పురుగుమందుల ప్రగతి కధ 
పెరిగిపోయే అరువు రాశుల ఆత్మకధ 
అన్నమును చేసి ఆ అన్నం చిక్కక అస్తమించే అన్నదాత కధ 
మాయాబజార్లో గిట్టుబాటు ధరల దగాపడే 
మట్టిమనిషి కధ

రాతలు మారక 
కూతలు మారక 
వెతలే తీరక 
ఆరడుగుల సామ్రాజ్యానికి వలసవెళుతున్న 
వెన్నముక విరిగిన రైతు కధ

సానుభూతి వలలో చిక్కి 
ఆన్లైన్ అంగట్లో ప్రొఫైల్ పిశ్చర్గా మారిన 
కర్షకుడి కలత కధ 

ఇంతేనా రైతంటేనే ఇంతేనా
మన జాలి చూపులు ఆ మట్టి మనిషి నింపేనా 

                                 అభిరామ్

శ్లో||పితురప్యధికా మాతా గర్భధారణపోషణాత్|
అతోహి త్రిషు లోకేషు నాస్తి మాతృ సమోగురుః|| 

భావము: తండ్రి పోషణ కారకుడే అయినా తండ్రి కన్నా తల్లే అధికురాలు కారణం తొమ్మిది నెలలు తన గర్భలో మనకు చోటు ఇచ్చీ గుప్తంగా పోషించినందులకు.
అందువలన ముల్లోకాలలో తల్లితో సమానమైన గురుదైవము లేరు

శ్లో||నాస్తి గంగా సమో తీర్థమ్|
     నాస్తి విష్ణు సమో ప్రభుః|
     నాస్తి శంభుసమః పూజ్యో|
     నాస్తి మాతృ సమో గురుః||

భావము:- గంగా కన్నా పవిత్ర సమానమైన తీర్థము లేదు.విష్ణు దేవుని మించిన ప్రభువు లేరు. ఈశ్వరుని మించిన పూజ్యులు లేరు.తల్లిని మించిన గురు దైవము లేదు

శ్లో||నాస్తి భార్యా సమం మిత్రమ్|
     నాస్తి పితృ సమః ప్రియః|
     నాస్తి భగినీ సమా మాన్యా|
     నాస్తి మాతృ సమో గురుః||

భావము:- భార్యను మించిన స్నేహితురాలు లేరు.తండ్రిని మించిన ప్రియులు లేరు.అక్కాచెల్లెలను మించి మనలను గౌరవించే వారు లేరు. తల్లిని మించిన గురు దైవము లేదు
--((**))--
అమ్మ పాట 
   *******
ప॥ అమ్మ పలుకు తీయదనం
       అమ్మ చూపు చల్లదనం
       అమ్మ పిలుపులో లొలుకు   
       తేనెల మమకారం
       అమ్మ లాలిలోనె చూపు
     మమతల అనురాగం   ।అ।

చ॥ చేయిపట్టి నడుపుతూనే
       నడవడికలు దిద్దింది
       మాటలు నేర్పిస్తూనే
       మంచినూరి పోసింది
       జన్మనిచ్చె అమ్మకన్న
       దైవం ఏమున్నది
       ఆ పాదాలకు ప్రణమిల్లే
       భాగ్యం మనకున్నది
       వందనమో కన్నతల్లి 
              వందనమమ్మా
       నీ పాదాలకు సాష్టాంగ 
       దండమె అమ్మా      ।అ।

చ॥ నవమాసాలు మోసి కని
      ఆయువునిచ్చింది తల్లి 
      కమ్మని మురిపాలు పోసి
      ప్రేమగ పెంచింది తల్లి 
      గోరుముద్ద తినిపిస్తూ
      గారాబము చేసినాది
      చందమామ చూపిస్తూ 
      ఆటలు ఆడించినాది
      మముగన్న తల్లి నీకు
      వందనమమ్మా 
      పుడమికన్న సహనంగల
      దైవం నీవమ్మా            ।అ।
            ••••○••••
     ఫోన్ : 9666016636



వద్దు మానవా వద్దు..!! 
••••••••••••••••••••••••••
రక్కసితనం 
రాకాసి గుణం 
కర్కశత్వపు సంబరం 
విపత్కాల వరం 
నీ వెంటే 
వెనువెంటే 
అకర్షకుడు కావద్దు 
ఆ గర్షణలో పడవద్దు 

అత్యాసలకు
అసత్యాలకు 
నిత్యకృత్యమైన పైత్యాలకు 
సఖ్యతలేని స్నేహాలకు 
సమైక్యత లేని బాటకు 
మమైక్యం కాని ప్రేమకు 
బానిస కావద్దు 
బాసట నిలవద్దు 
దాసోహం అసలే వద్దు 
ఆ దాహమే నీకొద్దు 

చుక్కలు చూపే చిత్రాలొద్దు 
మక్కువ పెంచే మంత్రాలొద్దు 
పక్కుమనే ఎకశక్యాలొద్దు 
మెక్కుతూ పోయో ఎత్తులొద్దు 
బేధం భావం 
మదం మచ్ఛరం 
ఇచ్ఛలేనిదే 
మెచ్చక వచ్చే ఏదైనా 
ఇంచుకైనా తాకవద్దు 

నికృష్టపు ఛాయలు 
కక్కుర్తి కోరలు 
జలగలు 
జిలుగులు 
కలుగుల్లో నుండి 
తొంగి చూస్తుంటాయి 
అటువైపు వెళ్ళవద్దు 

ఆకాశానికి నిచ్చెన 
తల వంచితే వంచన 
కళ్ళు పలకరింపులు 
ఒళ్ళు పలవరింపులు 
వెనక మెరుపులు 
తియ్యటి మురిపాలు 
ఆదమరిస్తే మట్టిపాలు 
వద్దు అసలే వద్దు 
ఆ వైపు మసలనే వద్దు 
ఆ అలుసు వద్దే వద్దు 

తలచి చూడు 
వంచించే మనసును తెంచు 
చెడును రచించే చేతల్ని తుంచు 
హోరు గాలివై 
పోరు పవనమై 
అవసరమైతే 
కెరటమై ఎగసిపడు 
అలవై తీరాన్ని ముంచు 
ఏ అంచుల్లోను 
వంచన తారస పడనంతగా 
విజృంభించు 
మాయాజాల వలని 
సమాజాన్ని తాకనీయవద్దు 
ఇంధ్రజాల మాయని 
మనుషుల్లో మసలనీయద్దు 
వద్దు 
ఏ దుస్థితి రానీయవద్దు 
ఆ స్థితిలోకి సమాజాన్ని పోనీయద్దు  
         ••••••••¤••••••••
    ఫోన్  :  9666016636

--((**))--

జనరిక్ మందులు - బ్రాండెడ్ మందులు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

ఒక కొత్త మందును  కనుగొనడానికి ఫార్మా  కంపెనీలు అనేక పరిశోధనలు చేసి మందును మా‌ర్కెట్ లోకి తీసుకొస్తాయి. అందుకు ప్రతిఫలంగా ఆ మందు తయారీ పై ఆ కంపెనీకి కొంత కాలం పాటు (20 సం.లు) పేటెంట్ హక్కులు ఉంటాయి.. అలా తయారు చేసిన మందులను బ్రాండెడ్ డ్రగ్స్ లేదా స్టాండర్డ్ డ్రగ్స్ అంటారు.

ఆ మందు యొక్క ఫార్ములా తెలిసినా సరే, దానిని పేటెంట్ ఉన్న కాలంలో వేరే ఎవరూ తయారు చేయకూడదు.. అలా పేటెంట్ లో ఉన్న మందులను ఇతరులు ఎవరైనా తయారు చేసి అమ్మితే వారు శిక్షార్హులౌతారు. అంటే ఆ మందుపై, మొట్ట మొదట తయారు చేసిన కంపెనీకే  20 సంవత్సరాల పాటు (పేటెంట్ హక్కులు లభించిన కంపెనీకి) గుత్తాది పత్యం ఉంటుంది..

నిజానికి ఆ మందును తయారు చేయడానికి అయ్యే ఖర్చుకూ, ఆ మందుపై కంపెనీ వసూలు చేసే అమ్మకపు ధరకు ఏ మాత్రం పొంతన ఉండదు. తయారీ ఖర్చు కంటే మందు యొక్క అమ్మకపు ధర అనేక రెట్లు అధికంగా ఉంటుంది..

ఎందుకంటే 'ఆ మందు తయారీ కోసం "పరిశోధనలు మరియూ క్షేత్ర స్థాయి పరీక్షల (Clinical Trials)" నిమిత్తం మాకు చాలా డబ్బు ఖర్చైందని' సదరు కంపెనీ వాదిస్తుంది.. కాబట్టి ఓ 20 సంవత్సరాల పాటు ఆ మందుపై (ఆ కంపెనీకి) పేటెంట్ హక్కులు కల్పించి, పెట్టుబడి సొమ్మును రాబట్టుకోడానికి, ఆ మందును మొట్టమొదట తయారు చేసిన కంపెనీకి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం

మందు పై మొట్టమొదటి తయారు చేసిన  కంపెనీ యొక్క పేటెంట్ కాలం ముగిసిన తర్వాత, అవే కెమికల్స్ ను ఉపయోగించి, అదే ఫార్ములాతో, అదే మందును ఏ కంపనీ అయినా తయారు చేసి, మార్కెట్ లోకి విడుదల చేయొచ్చు.. అలా తయారు చేసిన మందులను "జనరిక్ డ్రగ్స్" అంటారు.

జనరిక్ డ్రగ్స్ తయారు చేయటానికి ఫార్మా కంపనీలు ఎటువంటి పరిశోధనలు కాని క్లినికల్ ట్రయల్స్ గాని జరపవలసిన అవసరం లేదు. అందువలన జనరిక్ డ్రగ్స్ ధరలు , బ్రాండెడ్ డ్రగ్స్ ధరలతో పోలిస్తే 30 నుండి 80 శాతం తక్కువ ధరలలో లభిస్తాయి. వీటిపై ముద్రించబడే యం ఆర్ పీ కంటే చాలా తక్కువ రేటుకే వాటిని మనకు అమ్ముతారు..

తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి నకిలి మందులు అని, సరిగా పని చేస్తాయో చేయవో  అని భయపడవలసిన అవసరం లేదు. బ్రాండెడ్ మందుల తయారీలో పాటించాల్సిన ప్రమాణాలన్నీ జనరిక్ మందుల తయారీలోను పాటిస్తారు. బ్రాండెడ్ మందులెలా పనిచేస్తాయో, జనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలానే పనిచేస్తాయి..

కాని ప్రజలు జనరిక్ మందులకు అలవాటు పడితే ఫార్మాస్యూటికల్స్ కంపెనీలకూ, ఫార్మా ఎజెన్సీలకూ, మందుల షాపులకూ, ( కొన్ని సందర్భాలలో డాక్టర్లకు కూడా) అందరికీ నష్టమే కదా. అందుకనే జనరిక్ మందులపై, "అవి బ్రాంబెడ్ మందుల్లా పనిచేయవన్న పుకార్లు లేవదీస్తున్నారు.. అది నిజం కాదు జనరిక్ మందులు బ్రాండెడ్ మందులతో సమానంగా పని చేస్తాయి. 

బ్రాండెడ్ మందులు తయారు చేసే ఫార్మా కంపెనీలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా డాక్టర్లకు తమ బ్రాండెడ్ ఔషధాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వాటిని సూచించమని కోరుతుంటాయి. డాక్టర్ ఎంతమేర రాస్తే.. అంతమేర ప్రతిఫలాలను ముట్టజెబుతాయి. ఈ ఫలాలు ఉచిత విదేశీ పర్యటనలు, చెక్, బహుమతులు ఇలా పలు రూపాలుగా ఉంటాయి. అందుకే బ్రాండెడ్ ఔషధాలు చాలా ఖరీదుగా ఉంటాయి.

కొంత మంది వైద్యులు జనరిక్ మందులను సూచిస్తుంటారు. అవి వారి ఆస్పత్రి ప్రాంగణంలోనే లభిస్తాయి. వాటి ధర వాస్తవానికి చాలా తక్కువగా ఉన్నప్పటికీ వాటి మీద మీద ముద్రించబడిన ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కస్టమర్ అడిగితే ఒక 10 శాతం తగ్గిస్తారు. దాంతో కస్టమర్ సంతోషిస్తాడు. కాని ముద్రిత ధర కంటే 50 నుంచి 80 శాతం వరకు తక్కువ ధర ఉంటుంది. 

ఉదాహరణనకు జ్వరానికి సాధారణంగా డాక్టర్ వద్దకు వెల్లకుండానే చాలా మంది వాడే మందు "డోలో 650" (పారసెటమాల్ 650 మి గ్రా.) దీని ధర 15 టాబ్లెట్లకు 29 /- రూపాయలు. ఇదే టాబ్లెట్ ను సిప్లా కంపని "పారాసిప్ 650" పేరుతో తయారు చేసి అమ్ముతుంది , దాని ధర 10 టాబ్లెట్ లకు 18/- రూపాయలు. నిజానికి జనరిక్ మెడికల్ షాపులలో పారసెటమాల్ 650 మి గ్రా. 4.50 /- లకు పది టాబ్లెట్ లభిస్తాయి.

నొప్పి నివారణకు వాడే డైక్లో ఫెనాక్ సోడియం ఎస్ఆర్ బ్రాండెడ్ (వోవిరాన్)10 మందుల ధర 51.91. కానీ ఇదే ఔషధం 10 మందుల జనరిక్ ధర జనఔషధి స్టోర్ లో 3.35రూపాయలు మాత్రమే. 100 ఎంఎల్ కాఫ్ సిరప్ బ్రాండెడ్ వి అయితే 33 రూపాయలు పైనే. జనరిక్ దగ్గు మందు జనఔషధి స్టోర్ లో 13 రూపాయలకే లభిస్తుంది. జ్వరం తగ్గడానికి వాడే ప్యారాసిటమాల్ 500 మి గ్రా. 10 మాత్రల ధర బ్రాండెడ్ అయితే 13 రూపాయలు. జనరిక్ అయితే 2.45రూపాయలే.

సూక్ష్మంగా చెప్పాలంటే బేసిక్ ఫార్ములా  ప్రకారం తయారైన మందును జనరిక్ మందు అంటారు. ఇదే సూత్రంతో కార్పొరేట్ కంపెనీలు పేరు మార్చి మందులు ఉత్పత్తి చేస్తున్నాయి. ధరలో తేడా తప్పితే మందు పనిచేయడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. మందు పరిమాణం, రసాయనిక నామం, నాణ్యత ఒక్కటే గానీ.. లేబుల్, దానిపై బ్రాండ్ పేరు మారుతుంది.

జనరిక్ మందుల పట్ల సామాన్య ప్రజలకు చాలా అపోహలు అనుమానాలున్నాయి. వాటిని గూర్చి వివరించి ఉపయోగించేలా చేసే వ్యవస్థలు లేవు. ఇటీవల కాలంలో వీటిపట్ల ప్రజలకు కొంత అవగాహన పెరిగింది. కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు కేరళలో ప్రభుత్వాలు జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేసాయి.  వీటి ఏర్పాటు పై అన్ని రాష్ట్రాలు  దృష్టి సారిస్తే పేదలకు మందుల ఖర్చు మిగులుతుంది.
--((**))--






Powered by Vocaroo
 అమ్మను గురించి ప్రతి ఒక్కరు వినండి  
https://vocaroo.com/i/s0wmrkPc245X

No comments:

Post a Comment