Thursday, 12 February 2026

 [03/02, 12:50] Mallapragada Ramakrishna: *శతపత్ర -1*

రచన:

లండన్! ఒకప్పుడు సూర్యుడస్తమించని బ్రిటీష్ మహా సామ్రాజ్యానికి రాజధానీ నగరం. యూరప్ లోని పురాతన నగరాల్లో లండన్ ఒకటి. ప్రస్తుతం వలస రాజ్యపాలన అంతమయ్యాక బ్రిటన్ కి మాత్రమే రాజధానిగా పరిమితమైపోయిందీ నగరం. రెండుసార్లు తగలబడిపోగా పునర్నిర్మించ బడిన నగరం లండన్. యూరప్ లో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు లండన్ లో వేలాది మంది ఆ మహమ్మారిబారిన పడి చనిపోయారు.

చరిత్ర ప్రసిద్ధమైన ఎందరో వీరుల్ని, ఎన్నో యుద్ధాల్ని, మరెన్నో ఘోరాల్ని చూసిన నగరం. ఎన్నో ఖండాలు, ఎన్నో దేశాల చరిత్రల్ని, సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని, ప్రపంచ అద్భుతాల్ని, వింతల్ని గుప్పిటపట్టి దాచిన నగరం.

వలస రాజ్యాల నుంచి అంతులేని సంపదే కాదు. అమూల్యమైన, అలభ్యమైన గ్రంథాలు కూడా బ్రిటన్ కి తరలించబడ్డాయి. అందుకే ప్రపంచంలో అనేక భాషలకు చెందిన సాహిత్య, చారిత్రక గ్రంధాలు కూడా ఇప్పటికీ లండన్ లైబ్రరీలో కన్పిస్తాయి. మనలో చాలామంది మన నమ్మకాల్ని మూఢనమ్మకాలనుకుంటారు. పాశ్చాత్యులు అవి అధునాతన భావాలని, వారిలో మూఢ నమ్మకాలుగాని, భయాలుగాని అస్సలు కనిపించవని అనుకుంటారు. నిజానికి మనకన్నా పాశ్చాత్యులకే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయని చాలామందికి తెలియదు.

దయ్యాలు, భూతాలు, భయాలు మనదేశం లో కన్నా అమెరికా, ఆఫ్రికా, యూరప్ దేశాలవారికే ఎక్కువ.

దయ్యాలు, భూతాలు వణికించే వింత జీవుల కథలతో హాలీవుడ్ నిర్మాతలు నిర్మించినన్ని దయ్యాల సినిమాలు మరే దేశంలోనూ నిర్మించబడలేదు.

📖

మనం బయటికి వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురైతే అశుభంగా భావిస్తాం. కొన్ని దేశాల్లో పిల్లి ఎదురైతే శుభశకునంగా భావిస్తారు. పదమూడు సంఖ్య గురించి మనకి ఎలాంటి సెంటిమెంట్లూ లేవు. పదమూడు కాని ఆ సంఖ్యను చూస్తేనే వణికిపోయేవారున్నారు అక్కడ. వాళ్ళు పదమూడు సైతాన్ సంఖ్యగా భావిస్తారు. ఎంత భయమంటే హోటల్లో ఆ సంఖ్యతో గది ఉండదు. పదమూడు వదిలేసి పధ్నాలుగుతో కంటిన్యూ చేస్తారు.

అలాగే ఇంటి నెంబరు కూడా 13 ఉంచరు. ఆ సంఖ్యని అరిష్టంగా భావిస్తారు.

అయితే ఇదే పదమూడు సంఖ్యను మయన్ నాగరికతకు చెందినవారు చాలా పవిత్రంగా భావిస్తారు. భూమి నుంచి స్వర్గానికి మధ్య పదమూడు లోకాలున్నాయని, ఆ సంఖ్య దేవతల సంఖ్య అని భావించేవారు. మనకి కూడా ఏడు ఏడు పధ్నాలుగు లోకాలున్నా యంటారు. పైన స్వర్గానికి, భూమికి మధ్యన గాంధర్వ, కిన్నెర, కింపురుష, విద్యాధర, యక్ష మొదలైన దైవలోకాలున్నాయని, కింద అతల, వితల, సుతల, పాతాళ, తలాతల మొదలైన ఏడు లోకాలున్నాయని, అవి రాక్షస లోకాలని అంటారు. వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన పురాణ గాధ మనకు తెలిసిందే.

నమ్మకాలు, మూఢనమ్మకాలు, భ్రమలు, నిజాలు ఆయా దేశ కాల పరిస్థితులనుబట్టి వేరువేరుగా ఉంటాయి. ఒకచోట మంచి అనుకునే విషయం మరోచోట చెడుకావచ్చు. అయితే దయ్యాలు, భూతాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అనేక గాధలు ప్రచారంలో ఉన్నాయి.

అమెరికాలోని మెక్సికో ప్రాంతపు అడవుల్లో ను, ఆఫ్రికా అడవుల్లోను, మనదేశంలో కేరళ, అస్సాం ప్రాంతాల్లోనూ ఇప్పటికీ గొప్ప గొప్ప మంత్రగాళ్ళున్నారు.

లండన్ నగరం వరకే చూస్తే- అక్కడి హీత్రూ విమానాశ్రయంలో దయ్యాల గురించి అనేక కథలు ప్రచారంలో వున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా షేక్ ష్పియర్ నాటకాల్ని ప్రదర్శిస్తున్న గొప్ప ధియేటర్ ఒకటి లండన్ లో ఉంది. ఆ ధియేటర్ లో ఇప్పటికీ దయ్యాలున్నాయని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

అసలు ఈ దయ్యాలు, భూతాలు ఏమిటి? ఆత్మ ఏమిటి? మనిషి మరణించిన తర్వాత ఆత్మ దయ్యమవుతుందా? మరణానంతరం కూడా ఆత్మకు జీవితం ఉందా? ఉంటే అది ఎలాంటి జీవితం?

ఆత్మ చావు లేనిది. అగ్నితో కాల్చబడదు. కత్తితో చీల్చబడదు. చావు శరీరానికేగాని, ఆత్మకు లేదు అని గీతాచార్యుడు బోధించాడు.

శరీరాన్ని పోగొట్టుకున్న ఆత్మ మరో శరీరం ధరించాలి. అంటే ఆత్మ మరణానంతరం మనిషి కావచ్చు. కుక్క కావచ్చు, నక్క కావచ్చు. మరో జీవి గర్భాన్ని వెదుక్కుని పోవాలి. ఆత్మ గర్భస్థశిశువుగా మారి పునర్జన్మించాలి కాని మధ్యలో మరో జన్మకు పోకుండా దయ్యాలు, భూతాలుగా మారటం ఏమిటి? అసలు మరణానంతరం ఆత్మ ఏమవుతోంది?

📖

ఈ ఆత్మశోధన ఈనాటిది కాదు. ఏనాటికీ మనిషి మేథస్సుకు అంతుచిక్కని దైవరహస్యమిది.

మనిషి అంతరిక్షంలో ఎన్నో అద్భుతాల్ని ఆవిష్కరించగలుగుతున్నాడు. శోధించి ఎన్నో కొత్త కొత్త విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. కాని మన భూమిపైనే అంతు చిక్కని, విచిత్రమైన ఎన్నో మిస్టరీలు దాగి వున్నాయి. వాటిని మాత్రం అస్సలు ఛేదించలేకపోతున్నాడు.

మంగోలియా మహావీరుడు చెంఘిజ్ ఖాన్ చనిపోయి శతాబ్దాలు గడిచాయి. అయినా ఇంతవరకు అతని సమాధిని కనిపెట్టలేక పోయారు. ఆ సమాధిని కనిపెట్టి అందులో దాచిన బంగారాన్ని, వజ్రవైఢూర్యాల్ని కొల్లగొట్టాలని ఇప్పటికీ అన్వేషణ సాగిస్తూనే వున్నారు.

ప్రస్తుతం చెంఘిజ్ ఖాన్ సమాధిగా చెప్పబడుతున్న చోట ఆ నిధి లేదు. ఇక్కడో విచిత్రం ఉంది. ఆ సమాధి ముందు ఒక శిలా అశ్వం వుంది.

చెంఘిజ్ ఖాన్ పునర్జన్మించినప్పుడు గుర్తుగా ఆ అశ్వం ముందు కాళ్ళు లేపి బిగ్గరగా సకిలిస్తుందట.

"ఈ సూచన ఇంతవరకూ జరగలేదు. కాబట్టి చెంఘిజ్ ఖాన్ ఇంకా పుట్టలేదనే అనుకోవాలి.

ఇలాంటిదే వీరబ్రహ్మేంద్రస్వామి- యాగంటి లో బసవడు లేచి రంకె వేస్తాడని కాలజ్ఞానంలో రాయటం.

శ్రీకృష్ణుడి ద్వారకానగరం నీటమునిగిన గాథ లాంటిదే, ఒకప్పుడు అట్లాంటిక్ సముద్రంలో అట్లాంటిస్ అనే నగరం కూడా నీట మునిగిపోయింది. ఆ నగరాన్ని కనిపెట్టి బంగారం తీయాలని చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు.

బెర్ముడా ట్రయాంగిల్ అనే సముద్రదీవి వైపు వెళ్ళిన ఏ నౌకా వెనక్కి తిరిగిరాలేదు. దీవి మీదుగా ఎగిరిన ఏ విమానం కూడా తిరిగి ల్యాండ్ కాలేదు. దీని మిస్టరీ ఏమిటో ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఫ్లయింగ్ సాసర్స్ ఇంకా అంతుచిక్కని మిస్టరీగానే వుంది.

లోకంలో ఘనకార్యలు చేయటంకోసమే కొందరు పుడతారు. అనుభవంలోకి వస్తేగాని తనలో ఉండే ప్రత్యేకత ఏమిటో కొందరికి అర్థంకాదు.

ఏదో సాహసం చేయాలి, ఏదో సాధించాలని పట్టుదలైతే ఉందిగాని, ఏం సాధించాలో తెలీని స్థితిలో ఒక యువతి అన్వేషణ సాగిస్తోంది.

ప్రపంచంలోని మిస్టరీలను స్టడీ చేస్తూ ప్రస్తుతం లండన్లోనే వుంది. ఆ యువతి పేరు శతపత్ర.

📖

అదేపనిగా కాలింగ్ బెల్ మోగుతుంటే బిరబిరా వచ్చి తలుపుతీసింది విశ్వదా.

ఎదురుగా శతపత్ర. లేతాకుపచ్చ చక్కటి డిజైన్ లోని చుడీదార్ లో చిరునవ్వులు చిందిస్తూ అరవిరిసిన ముద్ద మందారంలా నిలబడి వుంది.

నడుమ్మీద చేతులుంచుకుని కించిత్తు కోపంగా చూసింది విశ్వదా.

“అనుకున్నాను. వీకెండ్ వస్తేగాని ముఖం చూపించవనుకున్నాను. ఇవాళ లైబ్రరీ సెలవుగాబట్టి నేను గుర్తొచ్చాను. అంతేగా?” అనడిగింది సీరియస్ గా విశ్వదా.

“అంతేగా అంటే... అంతే మరి. నేనేం చెప్పినా నువ్వు నమ్మవుగా...” అంది శతపత్ర.

"నన్ను నమ్మించాలని చూడకు. నీమీద నాకు ఎంత కోపంగా వుందో తెలుసా?" అంది విశ్వదా.

"అది తెలిసే నీకోపం పోగొట్టాలని వచ్చాను. అయినా ఏమిటే ఇది. డోర్ లో నిలబెట్టే మాట్లాడతావా? లోపలికి రానీయవా?” అంది నవ్వుతూ శతపత్ర.

తల ఊపి చిన్నగా నిట్టూర్చింది విశ్వదా. “రా తల్లీ. లోపలికి రా” అంటూ పక్కకు తప్పుకుంది.

"అంత మర్యాద అక్కర్లేదులే” అంటూ లోపలికి వచ్చింది శతపత్ర. తలుపుమూసి వెనుతిరిగింది విశ్వదా.

"నాకొస్తున్న కోపానికి నిన్నేం చేయాలో తెలీటంలేదే. పదిరోజులైంది నిన్ను చూసి. ప్లాట్ కొస్తేనేమో ఉండవు. ఎప్పుడు చూసినా లైబ్రరీ... లైబ్రరీ. పోనీ లైబ్రరీ కొద్దామంటే అక్కడంతా సైలెన్స్. మాట్లాడుకోడం అసలు కుదరదు. ఈమధ్య మరీ పుస్తకాల పురుగు వైపోతున్నావ్. కూచో, కాఫీ తెస్తాను" అంటూ లోపలికి వెళ్ళింది విశ్వదా.

శతపత్ర వయసు పాతికేళ్ళు. అయిదున్నర అడుగుల ఎత్తు. ఆ ఎత్తుకు తగిన అంగసౌష్ఠవం. అందానికి నిర్వచనం ఈ అమ్మాయేనా అన్పిస్తుంది ఆమెనిచూడగానే. అంతటి సౌందర్యవతి. అందం ఒక్కటే కాదు. ఒక విధమైన ఠీవి, దర్పం ఆమెలో కొట్టొచ్చినట్టు కన్పిస్తాయి. ఆచితూచి మాట్లాడటం, ఏ పని చేసినా హుందాగా చేయటం శతపత్ర ప్రత్యేకత.

పద్మదళాయతాక్షి. అంటే తామరపూవు రేకువంటి కనులు కలిగినది అనర్ధం.

ఆకర్ణాయతనేత్రి. అంటే చెవులవరకు వ్యాపించిన కనులు కలది అని అర్ధం. ఈ రెండు పోలికలు స్త్రీయొక్క విశాలనేత్రాలని తెలియజేస్తాయి.

అటువంటి విశాల నేత్రాలు, విశాలమైన ఫాలభాగం, కోటేరులా తీర్చిదిద్దినట్టుండే చక్కటి ముక్కు పగడాల వంటి పెదవులు, శంఖంలాంటి మెడ, స్వచ్ఛమైన బంగారంలా మెరిసే మేనిఛాయ... ఇవన్నీ అరుదుగా రాజవంశ స్త్రీలలో మాత్రమే కన్పించే సోయగం లక్షణాలు. శతపత్రను చూస్తే ఆమె ఏ రాజవంశానికో చెందిన యువతి అని అపోహపడతారు. అంతగా విలక్షణమైన, అందమైన యువతి శతపత్ర.

ఆమె లండన్ వచ్చి ఆరేళ్ళయింది. చదువు అయిపోయింది. అయినా ఇక్కడే ఉంది. ఇండియా తిరిగివెళ్ళలేదు. ఎప్పుడు వెళ్తుందో కూడా తెలీదు. స్నేహితురాలైన విశ్వదాకి కూడా ఆ వివరాలు తెలీదు.

విశ్వదా వయసు కూడా పాతికేళ్ళు. ఆమె అయిదేళ్ళుగా లండన్ లో ఉంటోంది. ఆమె చదువు ఇంకా పూర్తికాలేదు. చదువుతో పాటు పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తోంది. గొప్ప అందం అని చెప్పలేం. తన అందాన్ని ఇనుమడింపచేసుకోడానికి మిడ్డీస్, స్కర్టు- ఇలా అక్కడి యువతుల్లాగే డ్రస్ చేసుకుంటుంది. తన అందాల ప్రదర్శనకి ప్రాధాన్యత నిస్తుంది. అలాగని చెడ్డది కాదు. బాయ్ ఫ్రెండ్స్ లేరు.

డ్రెస్ విషయం విశ్వదాకి పూర్తి వ్యతిరేకి శతపత్ర. ఆమెకు మన సాంప్రదాయ దుస్తులంటేనే ఇష్టం. చీర జాకెట్ ధరించటం మరీ ఇష్టం. సందర్భాన్నిబట్టి చుడీదార్లు, జీన్స్ ప్యాంట్స్ షర్టులు ధరిస్తుంది. ఒళ్ళు కనబడే దుస్తులు ఆమెకు దూరంగా వుండాల్సిందే.

ఇద్దరూ హైదరాబాదీ యువతులే కావటంతో వారి స్నేహం మరింత గట్టిపడింది. అయితే యిద్దరూ ఎవరి ఫ్లాట్ లో వాళ్ళుంటున్నారు.

శతపత్ర ఉంటున్న ఫ్లాట్ అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో వుంది. తన బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటోంది. విశ్వదా మాత్రం ఒంటరిగానే ఉంటోంది తన ప్లాట్ లో.

🍁

*సశేషం*

[03/02, 19:21] Mallapragada Ramakrishna: *శతపత్ర -2*

🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు

కిచెన్ లో నుండి రెండు కాఫీ కలిపి తెచ్చి ఒకటి శతపత్రకి ఇస్తూ- "వంద ఆకుల ఒయ్యారీ... తీసుకోవమ్మా కాఫీ” అంది కొంటెగా!

"ఇదిగో... అలా తెలుగులో పిలిస్తే కోపం వస్తుంది. తెలుసుగదా” కాఫీ అందుకుంటూ ఉడుక్కుంది శతపత్ర. 

“ఎందుకే కోపం. శతపత్ర అంటే వంద ఆకులనేగా అర్ధం. నీ మూడ్స్ కూడా వంద రకాలుగా ఉంటాయి. అందుకే నేను అలా అన్నాను" అని అంది ఆమె ఎదురుగా కూచుంటూ విశ్వదా.

“సర్లే... అయినా వచ్చీరాగానే నామీద విరుచుకుపడుతున్నావ్! ఏమైంది నీకు?” కాఫీ సిప్ చేస్తూ మధ్యలో అడిగింది.

“నాకేమీ కాలేదు. నీకే ఏదో అయింది. మరీ పుస్తకాల పురుగువైపోతున్నావ్. ఆ లైబ్రరీ తప్ప మరే లోకం అస్సలు కనిపించటం లేదు నీకు” అంది.

“నువ్వు కన్పించావ్ చాలదా? ఈ రోజంతా నీతోనే. భోజనం కూడా ఇక్కడే."

"సంతోషం. ఆ మధ్య ఇండియా నుంచి అమ్మ పంపిన ఆవకాయపచ్చడి ఉంది. ముద్దపప్పు, నెయ్యి, గడ్డ పెరుగు, అప్పడాలు. ఇవి చాలా? నాన్ వెజ్ ఏమన్నా చెయ్యాలా, గుడ్లు ఉన్నాయి. ఆమ్లెట్స్ వేసుకోవచ్చు...”

"ఇవి చాలుగాని... ఏమిటే... వంట అయిపోయినట్టు మాట్లాడుతున్నావ్" అంది శతపత్ర.

"అయిపోయినట్టు కాదు. అయిపోయింది. మనిద్దరికీ వండి స్నానానికి వెళ్ళొచ్చాను. నువ్వొచ్చావు.”

"అంటే నేనొస్తానని ముందే తెలుసా?”

"తెలుసు.. నీ ఫ్లాట్ కి ఫోన్ చేస్తే నో రెస్పాన్స్. నీ పక్క ఫ్లాట్ లో అనంతయ్యగారి కూతురుందిగా సుబ్బలక్ష్మి. ఫోన్ చేసి నీ గురించి అడిగితే చెప్పింది. నా వద్దకే నువ్వు బయలుదేరి వస్తున్నావని.”

"సో... నీ కోసం నేను వస్తున్నానని తెలిసి కూడా.... నామీద కోపమన్నమాట.”

"కోపం ఉండదా?” అంటూ ఖాళీ కప్పులతో కిచెన్లోకి వెళ్ళి మూడు నిముషాల తర్వాత తిరిగివచ్చింది విశ్వదా.

"ఇంతకీ నువ్వు ఇండియా ఎప్పుడు వెళ్తున్నావ్?” పక్కన కూచుంటూ అడిగింది.

“తెలీదు” అంది శతపత్ర.

"నేను మాత్రం వచ్చే జూన్ లో ఇండియా వెళ్ళిపోవాలి. అప్పటికి ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. నీలాగే కొద్దిరోజులు ఉందామనుకున్నాను. బట్ డాడీ ఆర్డర్. తప్పదు.”

"ఎందుకింత తొందర?”

"నాకు పెళ్ళి చేయాలని ఇంట్లోవాళ్ళు తొందరపడుతున్నారు.”

"నీకా... అప్పుడే పెళ్ళా?"

"హలో... అల్రెడీ పాతికేళ్లు వచ్చేశాయమ్మా. ఇంకెప్పుడు పెళ్ళి? వయసైపోయాకా? నువ్వు కూడా లైన్లోనే ఉన్నావు. ఆ సంగతి మర్చిపోకు.”

“మర్చిపోలేదుగాని, వయసొచ్చింది గాబట్టి పెళ్ళిచేసుకోవాలి. అంతేనా? ఇంకేమీ లేదా?”

“ఇంకేముంటుంది?”

"అబ్బాయి నచ్చాలి. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలవాలి. అన్నిటికీ మించి ప్రేమగా చూసుకోవాలి...." అంది శతపత్ర.

“నువ్వు చెప్పే విషయాలు లవ్ మేరేజస్ కి వర్తిస్తాయి తప్ప, అరేంజ్డ్ మేరేజస్ కి వర్తించవు.”

“ఎందుకు వర్తించవు? మైనారిటీతీరిన యువతి తనకు నచ్చినవాడ్ని పెళ్ళి చేసుకోవచ్చని చట్టం వుంది...”

"హలో మేడమ్... కొన్ని విషయాల్ని చట్టాలతో ముడిపెట్టి ఆలోచించలేం. నా వరకే తీసుకో. నా ఉడ్బి అమెరికాలో ఇంజనీర్. మొదటిసారి నేను మా వూరు - వెళ్లినప్పుడు అనుకోకుండా మా పెళ్ళి చూపులు జరిగిపోయాయి. మా డాడీ ఒక్కటే చెప్పారు. నీకు కుర్రాడు నచ్చితేనే సంబంధం ఓకే చేస్తాను. ఛాయిస్ నీది అన్నారు. అతని పేరు మోహన్. నాకు నచ్చాడు. నేనూ తనకు నచ్చాను. ఇద్దరం మాట్లాడుకున్నాం. మా అభిప్రాయాలతో మనసులు కలిశాయి. ఓకే చెప్పేశాను. పూర్వంలా కాదు, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకే స్వేచ్ఛనిస్తున్నారు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తేనే ప్రమాదం” అంది

విశ్వదా.

“సో... యూ ఆర్ లక్కీ.. విష్ యు బెస్టాఫ్ లక్. పెళ్ళి తర్వాత అమెరికా, ఇక ఆపైన నేను గుర్తుండను.”

“గుర్తుండవా? నీలా అనుకున్నావా నేను. మా పెళ్ళి అయిన తర్వాత అమెరికా వెళ్ళేప్పుడు లండన్ లో నీకోసం ఆగుతాం. నా ఉడ్బి ని నీకు చూపిస్తాను. నీ ప్లాట్లోనే రెండురోజులు స్టే చేస్తాం. అయినా ఏం చెప్పగలం. ఈలోపలే నాకన్నా నువ్వే ముందు ఇండియా వెళ్ళిపోతావేమో...” అంది.

"లేదు. లేదు. ఇంకొంతకాలం ఇక్కడే వుండాలి”

“ఎందుకు? నాకసలు తెలీక అడుగుతాను. అంత చదువుకోవాలంటే మనదేశంలో లైబ్రరీలు లేవా?”

ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఒక్క నిముషం మౌనంగా ఉండిపోయింది శతపత్ర

ఆమె మౌనాన్ని మరోలా అర్ధంచేసుకుంది విశ్వదా. చిన్నగా నవ్వింది. "సో... నీ ప్రాబ్లం నాకు తెలిసిపోయింది. ఇప్పట్లో పెళ్ళి చేసుకోవటం నీకిష్టంలేదు. హైదరాబాద్ వెళ్తే మీ వాళ్ళు నీకు పెళ్ళి చేసేస్తారని భయపడు తున్నావ్. అందుకే ఆగిపోయావ్” అంది.

“నో... నో... అలాంటిదేమీ లేదు. నువ్వనుకున్న కారణమైతే నేను లైబ్రరీలో గంటలకొద్దీ సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఏముంది?”

“మరెందుకు లైబ్రరీకి వెళ్తున్నావ్?”

“అన్వేషణ”

"వాట్? దేనికోసం అన్వేషణ?”

"చూడు విశ్వదా? ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నేటికీ అంతుచిక్కని ఎన్నో మిస్టరీలున్నాయి. విచిత్రమైనవి, భయానక మైనవి, దారుణమైనవి ఎన్నో... అలాంటి మిస్టరీలకు సంబంధించిన సమాచారం కోసం అన్వేషిస్తున్నాను.”

“ఓ షిట్...” అంటూ నుదురు రుద్దుకుంది విశ్వదా.

"అసలు ఇలాంటి ఆలోచన నీకెందుకొచ్చిందే. తెల్సుకుని ఏంచేస్తావ్. ఆ మిస్టరీలను ఛేదించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఆశపడు తున్నావా?”

“లేదు” అంది నవ్వుతూ శతపత్ర.

"మరెందుకు? అలాంటి వింతమిస్టరీల గురించి తెలుసుకుని ఏం చేస్తావ్. పూర్తిగా కాకున్నా నాకూ కొన్నిటి గురించి తెలుసు. బెర్ముడా ట్రయాంగిల్... అదో అంతు చిక్కని మిస్టరీ. దాని రహస్యం ఇప్పటికీ మహా మహులకే అంతు చిక్కలేదు. నీవల్ల అవుతుందా?

అట్లాంటిక్ సముద్రం లోతుల్లో గొప్ప బిలం వుంది. అది ఎక్కడికి పోతుందో, అది అసలు ఎలా ఏర్పడిందో నేటీకీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.

ఫ్లయింగ్ సాసర్స్ గురించి అనేక కథనాలు ఉన్నాయి. వాటి సంగతి కూడా మిస్టరీగానే ఉండిపోయింది. అంతదేనికి? మనదేశం లోనే ఉత్తర భారతంలో ఓ గ్రామం వద్ద ఏటా ఒక మాసంలో పక్షులు సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. అవి అలా ఎందుకు మరణిస్తున్నాయన్న ప్రశ్నకు నేటికీ బదులు దొరకలేదు."

"విశ్వదా! ప్లీజ్. చాలు ఇక ఆపవే. ఇవన్నీ నాకు తెలుసు" అంది శతపత్ర.

"తెలిసినవాటి కోసం అన్వేషణ దేనికే?"

"తెలియని వాటికోసం.”

"అర్థం కాలేదు..."

"క్వీన్ విక్టోరియా లైబ్రరీలో ఉన్నంత సాహిత్య సంపద ప్రపంచంలో మరే లైబ్రరీలోనూ లేదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలు, అనేక దేశాలకు చెందిన గ్రంథాలు అక్కడ ఉన్నాయి. మన దేశానికి చెందిన ఎంతో విలువైన ప్రాచీన తాళపత్ర గ్రంథాలూ ఉన్నాయి.

నాకో మిస్టరీ గురించి తెలుసు. అది ఎక్కడ వుందో తెలీదు. దాని జాడ ఖచ్చితంగా ఈ లైబ్రరీలో తెలుస్తుందని నా నమ్మకం. అందుకే మహాసముద్రంలాంటి ఆ గ్రంథాల మధ్య నా అన్వేషణ సాగిస్తున్నాను. ఏదో రోజు నాక్కావలసిన సమాచారం అక్కడ ఖచ్చితంగా దొరుకుతుందని నా నమ్మకం."

"ఓకే... ఐ అగ్రీ విత్ యు... బట్... నీకు తెలిసిన మిస్టరీ ఏమిటి?" అడిగింది విశ్వదా.

శతపత్ర కాస్సేపు మౌనంగా వుండిపోయింది. బహుశా విశ్వదాకు తన అనుభవాన్ని చెప్పాలా వద్దాని ఆలోచనలో పడినట్టుంది. ఏం చెప్పేదోగాని, ఇంతలోనే ఒక సంఘటన జరిగింది... 

బయటనుంచి ఏవో వస్తువులు కిందపడి భళ్ళున పగిలిన అలికిడి, ఆ వెనకే ఏవో అరుపులు, కేకలు, పెద్దగా ఒక్కసారిగా వినవచ్చాయి. ఇద్దరూ ఉలిక్కిపడి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ గొడవ అంతకంతకూ పెరుగుతోందేగాని తరగటం లేదు.

"ఏమిటే ఆ గోల, పద చూద్దాం” అంది లేచి నిలబడుతూ శతపత్ర.

"ఆ గోల మనకెందుకులేవే. కూచో” అంది విశ్వదా.

"అరె. అంత గొడవ జరుగుతుంటే మనకెందుకులే అంటావేమిటి?” అంది శతపత్ర.

“నీకు కొత్త కావచ్చు. అప్పుడప్పుడూ ఇలా జరగడం మాకు మామూలే. దయ్యంగోల.”

"మైగాడ్. దయ్యమా!" అంటూ ఆశ్చర్యంగా విచిత్రంగా చూసింది శతపత్ర.

"అవును. చివరి ప్లాట్ లో వున్న సుఖదేవ్ సింగ్ భార్య అంజలి ఒంటిమీదికి ఇలా అప్పుడప్పుడు దయ్యం వచ్చి గోల చేస్తూంటుంది” చెప్పింది విశ్వదా.

“ఎవరా దయ్యం?" అడిగింది శతపత్ర.

"సుఖదేవ్ సింగ్  మొదటి భార్య పూర్ణిమ.” ఆలోచనల్లో కూరుకుపోయింది శతపత్ర.

“నిజం కాదనుకుంటున్నావా? చూస్తే నీకే తెలుస్తుంది. ఒకసారి చూశాను. కళ్ళు పెద్దవి చేసి చక్రాల్లా తిప్పుతూ ఉగ్రంగా చూసింది. ఆ చూపులు చాలా భయం గొల్పుతాయి. పూర్ణిమ దెయ్యం ఒంటిమీద ఉన్నప్పుడు అంజలిని పట్టుకోవడం చాలా కష్టం. బలమైన మనుషులు నలుగురు పట్టుకున్నా ఆ సమయంలో తోసిపారేస్తుంది. ఆ అరుపుల బీభత్సం మనకు దడ పుట్టిస్తుంది.

"ఏం జరిగిందసలు. ఆ పూర్ణిమ ఎలా చనిపోయింది?” కుతూహలంగా అడిగింది శతపత్ర.

🍁

*సశేషం*

[03/02, 19:24] Mallapragada Ramakrishna: *శతపత్ర -3*

🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు

విశ్వదా చెప్పసాగింది..

"సుఖదేవ్ సింగ్ వాళ్ళది చాలాకాలంగా బ్రిటన్ లోనే సెటిలైన కుటుంబం.

అతడి తండ్రి హయాంలో పంజాబ్ నుంచి ఇక్కడికి వలస వచ్చేశారు. వ్యాపారాల్లో బాగా సంపాదించారు. పూర్ణిమా వాళ్ళదీ అలాంటి కుటుంబమే. పైగా దగ్గర బంధుత్వం కూడా వుంది. నాలుగేళ్ళ క్రితం మాట. నేనప్పుడే ఈ ప్లాట్లోకి కొత్తగా వచ్చాను.

సుఖదేవ్ సింగ్, పూర్ణిమలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దల ఆశీస్సులతో పెళ్ళి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వారి పెళ్ళయిన రెండో సంవత్సరంలో ఇక్కడికి సమీపంలోనే జరిగిన రోడ్ ప్రమాదంలో పూర్ణిమ చనిపోయింది. ఆ విషాదం నుంచి బైటపడిన తర్వాత పంజాబ్ లోని తమ బంధువుల అమ్మాయి అంజలిని పెళ్ళి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ ఫ్లాట్లో సుఖదేవ్, అంజలితోపాటు అతని తల్లి కళాంజలి ఉంటుంది.

పెళ్ళి చేసుకుని ఇక్కడికి వచ్చిన వారం రోజుల తర్వాత మొదటిసారిగా పూర్ణిమ ప్రేతాత్మ అంజలిని ఆవహించి నానా బీభత్సం చేసింది. తను చనిపోయిందన్న బాధలేకుండా అతడు మళ్ళీ పెళ్ళి చేసుకుని సుఖంగా ఉంటున్నందుకు తిట్టిపోసింది. తనకులేని సుఖం అతడికి దక్కకూడదంటూ అంజలిని చంపాలని చూసింది.

అప్పటినుండి అప్పుడప్పుడు అంజలిని ఆవహించి ఇలా నానా యాగీ చేస్తూంటుంది పూర్ణిమ ఆత్మ. అది ఆత్మ కావచ్చు, దయ్యం కావచ్చు, భూతం కావచ్చు. అంజలి ఒంటి మీదికి వచ్చినప్పుడే దాని ఉనికి తెలుస్తుంది. ఇప్పుడా ఫ్లాట్లో జరుగుతున్న గోల ఇదే. పూర్ణిమ దెయ్యం అంజలి ఒంటిమీదికి వచ్చినట్టుంది" వివరించింది విశ్వదా.

నమ్మలేనట్టు. చాలా ఆసక్తిగా ఆ మాటలు వింది శతపత్ర. తనకెప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. అదేమిటో స్వయంగా చూడాలనిపించింది. అంజలి అనే ఆ యువతి దయ్యం పట్టినట్టు కావాలనే గొడవచేస్తోందేమోనని డౌటు కూడా ఏర్పడింది.

"విశ్వదా... నిజంగా దయ్యాలున్నాయని నువ్వు నమ్ముతున్నావా?” అనడిగింది. 

"వై నాట్? నేను నమ్ముతున్నాను. అనుభవం లోకి వస్తే నువ్వూ నమ్ముతావ్?" అంది నమ్మకంగా విశ్వదా.

"ఎందరో వైద్యులు, మానసిక శాస్త్రవేత్తలు కేవలం భ్రమ మాత్రమే. దయ్యాలు, భూతాలు లేవని చెప్తున్నారు. దయ్యం పట్టినట్టు నటించటం కూడా పిచ్చిలో ఒక భాగం అంటున్నారు" వాదించింది. శతపత్ర.

“అంటున్నారని ఏదీ ఆగిపోవడం లేదుగా? జనం నమ్ముతున్నారు. నీకు ఉదాహరణకి రెండు సంఘటనలు చెప్తాను. ఇక్కడ ఇంగ్లాండ్ లోనే మాంచెస్టర్ లో ఒకాయనకు పాతబంగళా ఒకటుంది. అది ఫస్ట్ ఫ్లోర్ లో రెండు మూడుచోట్ల గోడలు పగుళ్లు వచ్చాయి. దాన్ని బాగు చేయించి అమ్మేయాలనుకున్నాడాయన.

తను జర్మనీ వెళ్తూ కాస్త ఆ పని చూడమని తన ఫ్రెండ్ కి ఆ పని అప్పగించాడు.

మన ఇండియాలో అయితే పగుళ్ళు తీసిన చోట సిమెంట్ పూయించి రంగులు వేసేస్తారు. కానీ ఇక్కడ ఏ పనిచేసినా సిస్టమేటిక్ గా ఉంటుంది. పగుళ్ళని రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీసి, వాటిని అధ్యయనం చేసి అవసరమైనంత మేర గోడకూల్చి తిరిగి రీబిల్ట్ చేస్తారు.

అదే ప్రకారం ఆ ఫ్రెండ్ తనకు తెలిసిన ఒక కాంట్రాక్టర్ని పిలిపించాడు. ఫోటోగ్రాఫర్ తో సహా వచ్చాడాయన. ఎక్కడెక్కడ గోడలకు పగుళ్ళు ఉన్నాయో అవన్నీ ఫోటోలు తీసుకున్నారు. ప్రింట్లు వచ్చిన తర్వాత చూసి అక్కడ అందరూ షాక్ తిన్నారు.

వాళ్ళు ఫోటోలు తీసినప్పుడు తాము ముగ్గురూ తప్ప ఆ ఇంట్లో ఎవరూ లేరు. కాని ఫోటోల్లో ఒక వృద్ధురాలు కన్పించింది. ఒక ఫోటోలో గోడ పక్కన వాలుకుర్చీలో పడుకుని వుంటే, మరో ఫోటోలో నిలబడి, ఇంకో ఫోటోలో మెట్లెక్కుతూ. అది చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు వాళ్ళు:

తెల్లటి గౌనులో స్పష్టతలేని విధంగా గాజు బొమ్మలా ఉందామె ఫోటోల్లో. ఆ ఫ్రెండు, కాంట్రాక్టరు భయపడిపోయి ఇక రిపేరు ఆరంభించలేదు. జర్మనీ వెళ్ళిన ఇంటి ఓనరు తిరిగొచ్చాక ఆ ఫోటోలు చూసి కన్నీరు పెట్టుకున్నాట్ట. ఫోటోల్లో వున్న వృద్ధురాలు అతడి నాయనమ్మ. ఆ ఇంట్లోనే పదేళ్ళక్రితం మరణించింది.

ఆమె పోయినా, ఆమె ఆత్మ అక్కడే ఇంకా తిరుగుతోందని అర్ధంగావటంతో ఆ ఇంటిని రిపేరు చేయించకుండా అలాగే ఉంచేశాడా యన. కొంతకాలం కిందట ఫోటోలతో సహా ఈ వ్యవహారం అనేక పత్రికల్లో ప్రచురితమైంది.

న్యూయార్క్ సిటీలో పీటర్ అనే వ్యక్తి చాలా ధనవంతుడు. అతను వ్యాపార లావాదేవీ లన్నీ చూసుకుని రాత్రి పన్నెండు గంటలకి గాని నిద్రపోయేవాడు కాదు.

ఒకరాత్రి తమ ఆవరణలో మొక్కల మధ్య ఎవరో తిరుగుతున్నట్టు గుర్తించాడు. కిటికీ పక్కకొచ్చి చూస్తే ఒక పొడుగాటి మనిషి స్పోటకం మచ్చలతో కూడిన వికారమైన ముఖంతో నిశ్శబ్దంగా తిరగటం కన్పించింది.

ఎవడో దొంగ అనుకుని రివాల్వర్ తో బయటి కొచ్చి 'ఎవరది?' అనరిచాడు. ఆ వ్యక్తి మౌనంగా వెళ్ళిపోనారంభించాడు. అతన్ని పట్టుకోవాలని ఎంత వేగంగా వెళ్ళినా సాధ్యం కాలేదు. అతడు గేటుదాటి రోడ్డు మీదకుపోయాడు. అతన్ని ఆపాలని తనూ రోడ్ ఎక్కబోతూ అనుమానంతో ఆగిపోయాడు పీటర్. ఆ ఆగంతకుడు రోడ్ ఎక్కడం చూశాడుగాని, తర్వాత అతను కన్పించలేదు.

పీటర్ వెనుతిరిగి లోనికొస్తుండగా రోడ్డుమీద పెద్ద శబ్దం... తిరిగి చూస్తే దారుణ దృశ్యం...

రోడ్డుపై వస్తున్న ట్రక్కు ఒకటి అదుపుతప్పి పక్కన చెట్టును గుద్దుకుంది. డ్రయివర్, క్లీనరు స్పాట్ డెడ్.

పీటర్ కి వణుకు పుట్టింది. పొరపాటున తను రోడ్డు మీదకు వెళ్ళుంటే యాక్సిడెంట్ స్పాట్ లో తనుండేవాడని అర్థమైంది. ఆ తర్వాత కూడా తమ ఆవరణలో ఎవరో తిరుగుతున్నట్టు గమనించినా ఎప్పుడూ తలుపులు తెరిచి బయటికి రాలేదు. ఎవరినీ రానిచ్చేవాడుకాదు.

వారంరోజులు గడిచాయి. ఓ రోజు షాపింగ్ కాంప్లెక్సికి వెళ్ళాడు పీటర్. పధ్నాలుగు అంతస్తుల భవనం అది. లిఫ్ట్ లో పైకి వెళ్ళాలి. లిఫ్ట్ లో పదిమంది ఎక్కారు. చివరిగా పీటర్ వస్తూ లిఫ్ట్ బాయ్ ని చూసి అదిరిపడ్డాడు. అదే ముఖం... స్పోటకం మచ్చలతో కూడిన వికారమైన ముఖం. తమ ఆవరణలో తిరుగుతున్న వ్యక్తిముఖం. అనుమానం వచ్చి లిఫ్ట్ ఎక్కకుండా బయటే ఆగిపోయాడు.

లిఫ్ట్ బాయ్ అతడ్నే చూస్తున్నాడు.

లిఫ్ట్ బయలుదేరింది. పీటర్ కి గుండెలు దడదడలాడాయి. ఏదో జరగబోతోందని భయం. మూడు నిముషాల తర్వాత అతడి భయం నిజమైంది. పదో అంతస్తు నుంచి రోప్ తెగి లిఫ్ట్ వేగంగా వచ్చి కిందపడింది. లిఫ్ట్ లో ఉన్నవాళ్ళలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదు.

విచిత్రం ఏమిటంటే- మరణించినవాళ్ళలో లిఫ్ట్ బాయ్ లేడు. యధార్ధంగా జరిగిన పీటర్ అనుభవాలు కూడా న్యూస్ పేపర్స్ లో వచ్చాయి. ఇలాంటివి చాలా వున్నాయి.” శతపత్రకు వివరంగా చెప్పింది విశ్వదా.

కాని ఆమె విశ్వదా మాటల్ని కొట్టిపారేసింది. "నాకైతే అస్సలు నమ్మకం లేదు. ఎనీవే. కమాన్. నువ్వు చెప్తూన్న సిక్కు ఫ్యామిలీ లోని దయ్యం సంగతేమిటో చూద్దాం.” అంటూ ఆతృతగా బయలుదేరింది శతపత్ర. తన ప్లాట్ కి తాళంపెట్టి శతపత్రను తీసుకుని కారిడార్ చివర వున్న సిక్కు ఫ్యామిలీ ప్లాట్ వైపుకి దారితీసింది విశ్వదా.

🍁

*సశేషం*

*శతపత్ర - 4*

🍁

తన ప్లాట్ కి తాళంపెట్టి శతపత్రను తీసుకుని కారిడార్ చివర వున్న సిక్కు ఫ్యామిలీ ప్లాట్ వైపుకి దారితీసింది విశ్వదా.

📖

"బతికున్నంతకాలం ఎంతో మంచిగా పేరు తెచ్చుకున్నావు.  మరి ఎందుకు ఇప్పుడు చచ్చి సాధిస్తున్నావ్? నీకేం లోటు చేశామని? నీకిది న్యాయంగా ఉందా పూర్ణిమా?" కన్నీళ్ళతో అడుగుతోంది అత్త కళాంజలి.

ఆ మాటలకి కళ్ళు ఎర్రజేసి- మరింత క్రూరంగా చూసింది అంజలిని ఆవహించిన పూర్ణిమ దయ్యం.

"ఏయ్ అత్తా... నీ కొడుక్కి ఇంకో పెళ్ళి చేశావ్. నీకు న్యాయంగా ఉందా?" అంటూ పెద్ద స్వరంతో ఎదురు ప్రశ్నించింది. 

“నాకు న్యాయమేనే... నువ్వు చచ్చావని సన్నాసుల్లో కలిసిపోతాడా? వాడికి తోడు కావాలని పెళ్ళి చేశాం. చచ్చిన నీకు ఆత్మశాంతి కోసం కర్మకాండలు చేసినట్టే నా కొడుకు బతికున్నాడు గాబట్టి మళ్ళీ పెళ్ళి చేశాను. తప్పా?” అంది కళాంజలి.

“తప్పే... ముమ్మాటికీ తప్పే. నాకు కోపం రాదా? ఊరుకుంటానా? నా స్థానం ఎప్పటికీ నాదే. ఇంకొకర్తిని రానివ్వను..." భయంకరం గా అరుస్తోంది దయ్యం. పూనకంతో ఊగిపోతోంది. కళ్ళు పెద్దవిచేసి అరుస్తోంది. ఎర్రటి కుంకుమబొట్టు, జుట్టు విరబోసుకుని ఆమెచూసే చూపులు, చేసే ఆగడాలు వెన్నులో దడ పుట్టిస్తున్నాయి.

నలుగురు బలమైన స్త్రీలు ధైర్యంగా నిలబడి అంజలిని ఒడిసి పట్టుకున్నారు. ఐనా ఆగటంలేదామె. విదిలించేస్తోంది. ఎగిరి దూకుతోంది. అవసరమయితే ఆపటానికి సిద్ధంగా నలుగురు మగాళ్ళు కూడా రెడీగా వున్నారు. వాళ్ళలో ఆమె భర్త సుఖదేవ్ సింగ్ కూడా ఉన్నాడు. తప్పించుకుందంటే కిటికీలోంచి బయటకు దూకి అంజలిని చంపేస్తుందని భయపడుతున్నారంతా. ఎందుకైనా మంచిదని కిటికీ తలుపులు మూసేసి వుంచారు.

ఆ ఫ్లాట్ ముందు చాలామంది గుమిగూడి పోయారు. కింద, పైన, పక్క ఫ్లాట్లో ఉండే చాలామంది బయటే నిలబడి లోపలి తంతును భయం భయంగా చూస్తున్నారు. వాళ్ళలో ఇండియన్స్ మాత్రమే కాదు. జర్మనీ, ఫ్రెంచ్ ఫ్యామిలీసి కి చెందినవాళ్ళు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు జడుసు కుంటారని వెనక్కి లాక్కుపోతున్నారు కొందరు.

"ఒసే పూర్ణిమా! నువ్వు చచ్చావని నా కొడుకు ఇక జీవితాంతం ఎటువంటి సుఖం లేకుండా ఒంటరిగా బతకాలా? ఎందుకే ఇలా మమ్మల్ని పీడిస్తున్నావ్?" విసుగ్గా అరిచింది అత్త కళాంజలి.

"బతకాలి...” అంటూ పళ్ళు పటపట కొరుకుతూ రక్తవర్ణం దాల్చిన కళ్ళతో మొగుడు సుఖదేవ్ వంక చూసింది పూర్ణిమ దయ్యం. ఎగిరెగిరి తుళ్ళుతూ తప్పించు కోడానికి గింజుకుంటోంది.

ఆమె ఉగ్రరూపం చూస్తున్నవాళ్ళకి గుండెలు పీచుపీచుమంటున్నాయి. కాళ్ళలో వణుకు పుడుతోంది. ఎక్కడ వచ్చి మీద పడుతుందో నని భయంగా చూస్తున్నారు.

ఆ దృశ్యం భయానకం... బీభత్సం... గింజుకుంటూనే అరిచింది దయ్యం. "ఏయ్ అత్తా... అడగవే నీ కొడుకు నడగవే... నాతో ప్రేమగా ఉన్నాడా లేదా అడుగు. నువ్వే నా లోకం అన్నాడు. చావులోనూ, బతుకు లోనూ కలిసుందాం అన్నాడు. మరి నాతో వాడు ఎందుకు చావలేదు? పైగా నన్ను  మర్చిపోయి ఇంకోదాన్ని పెళ్ళి చేసుకుని సుఖంగా ఉంటాడా.... ఉండనివ్వనే... మీ అందర్నీ నాశనం చేస్తా...” భయానకంగా నవ్వుతోంది.

సరిగ్గా శతపత్ర, విశ్వదాలు ఆ ఫ్లాట్ ముందుకు వస్తుండగా లోపల జరుగుతున్న సంఘటన అది.

"ఏమిటే విశ్వదా... బయటే ఉండి అంతా చోద్యం చూస్తున్నారు" ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది శతపత్ర.

"చూడక... లోనికి పోతారనుకున్నావా? అలా వెళ్ళాలంటే ధైర్యం ఉండాలమ్మా. అదిగో విను... ఆ దయ్యం అరుపులు ఎలా ఉన్నాయో, మనకెందుగ్గాని రావే వెనక్కి వెళ్ళిపోదాం" అంది ఒకింత గాభరాపడుతూ విశ్వదా.

"ఏయ్... ఏమిటే అంత భయం. లోనికి పోతే చంపుతుందా? రా చూద్దాం" అంది శతపత్ర.

"చంపుతుంటే చూద్దామా...”

“విశ్వదా... అది ఇంతవరకు ఎవరినైనా చంపిందా?”

“లేదు”

"మరి భయమెందుకు? ఇప్పుడు కూడా చంపదు. కమాన్” అంటూ విశ్వదాని పిలిచింది శతపత్ర.

"ఏమిటే... నీకు భయం వేయదా?"

“రాచబిడ్డనే... భయమంటే ఏమిటో నాకు తెలీదు”

మాట్లాడుకుంటూనే ఇద్దరూ గుంపును చేరుకున్నారు. గుంపును దాటి గుమ్మంలోకి పోబోతూంటే ఉన్నట్టుండి లోపలి పూర్ణిమ దెయ్యంగా పెద్దగా అరిచింది.

"వద్దు... రావద్దు... దాన్ని రావద్దని చెప్పండి.... నా ఒళ్ళు భగ్గు మంటోంది. దాన్ని ఆపండి" అంటూ, ఆ అరుపులు విని లోపలివాళ్ళే కాదు, బయటివాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎవరిని ఉద్దేశించి అలా అరుస్తోందో అర్థంకాలేదు. ఈలోపల డోర్ సమీపంలోకి వచ్చేశారిద్దరూ.

"వద్దు... రావద్దు... ఒసే శతపత్రా ఆగిపోవే” ఒక్కసారిగా తన పేరు పెట్టి దయ్యం పిలవటంతో శతపత్ర షాకయింది. విశ్వదా ఆశ్చర్యానికి అంతులేదు. లోపలి పరిస్థితి చాలా బీభత్సంగా వుంది.

అటో ఇద్దరు, ఇటో ఇద్దరు మహిళలు అంజలిని బలంగా ఒడిసి పట్టుకుని ఆపుతున్నారు.

విరబోసిన జుట్టులోంచి, ఎర్రబడ్డ కళ్ళతో క్రూరంగా చూస్తోంది. అంజలిని ఆవహించిన పూర్ణిమా దయ్యం.

ఆమె ఉగ్రరూపాన్ని చూళ్ళేకపోయింది విశ్వదా. భయంతో శతపత్ర వెనక ఒదిగి నిలబడింది.

"ఆ దెయ్యం నిన్ను రావద్దంటోంది. ఏం చేస్తుందో ఏమిటో... మనకెందుకొచ్చిందిగాని వెళ్ళిపోదాంరావే..." అంది విశ్వదా భయంతో.

“నా పేరు తనకెలా తెలుసు?" ఆశ్చర్యం నుంచి తేరుకోలేక అడిగింది శతపత్ర.

"అదేకదా... దయ్యాలకు అన్నీ తెలిసిపోతాయ్. వెనక్కి వెళ్ళిపోదాం రావే..." అంది విశ్వదా.

“ఇక్కడ ఇంతమంది ఉండగా దెయ్యం నన్ను మాత్రమే ఎందుకు రావద్దంటోంది? తెలియాలి" అంటూ ముందుకు ధైర్యంగా అడుగులేసింది శతపత్ర.

విశ్వదా ఫ్లాట్ కి తను వచ్చి పోతూ వుంటుంది. అంజలిని రెండు మూడుసార్లు తను చూసింది. ఆమె కూడా తనను చూసింది కాని, తన పేరు తెలిసే అవకాశం లేదు.... ఏమో తెలుసుకుందేమో.

ఒకవేళ తన పేరు తెలుసుకుంది అనుకున్నా కూడా గదిలో ఉన్న అంజలికి కారిడార్లో తను వస్తున్నట్టు ఎలా తెలిసింది? ఒకవేళ నిజంగా అది పూర్ణిమా దయ్యమేనా... ఇదేదో తెలుసుకోవాలి.

📖

గడప దాటబోయింది శతపత్ర.

"రావద్దని చెప్పాగా... లోనికి రావద్దు” క్రూరంగా చూస్తూ మరోమారు హెచ్చరించింది దయ్యం.

"వస్తే ఏమవుతుంది?" చేతులు కట్టుకుని గుమ్మం ముందే నిలబడి లోపలికి చూస్తూ అడిగింది శతపత్ర.

"నేను భరించలేను... తట్టుకోలేను. వెళ్ళిపోవే..." ఇల్లెగిరిపోయేలా అరుస్తూ గింజుకుంటోంది దయ్యం.

"నేనేం చేశానని? ఎందుకు తట్టుకోలేవ్? ఇదిగో అంజలీ.. నీ భర్త బాధపడుతున్నాడు. నీ అత్త ఏడుస్తోంది. ఇంక నువ్వు ఆడుతున్న నాటకం చాలు. ఇంతటితో ఆపేసెయ్" ధైర్యంగా చెప్పింది శతపత్ర.

“నాది నాటకమా! నన్నెవరనుకుంటున్నావే.. నేను అంజలినికాదు... పూర్ణిమను" హుంకరించింది ఆత్మ.

"ఓ.కె. నువ్వు పూర్ణిమవని ఒప్పుకుంటున్నా ను. నువ్వు ఎవ్వరినైనా కాని, మీ మధ్య అంజలి నలిగిపోతోంది. ఆమెను పీడించకు. తక్షణం వదిలి వెళ్ళిపో."

"వెళ్ళను... దీన్ని వదలను.”

"అయితే నేను లోపలికి వస్తున్నా.”

“వద్దు. నువ్వు రానేవద్దు.”

“అయితే వెళ్ళిపో.”

“వెళ్ళను..." దయ్యంతోపాటు తనూ పెద్దగా అరుస్తోంది శతపత్ర. ఈ సరికొత్త మలుపేమిటో అర్ధంగాక అంతా చేష్టలుడిగి చూస్తున్నారు.

శతపత్ర గడప దాటింది. నెమ్మదిగా అయిదడుగులు ముందుకేసింది. విశ్వదా మాత్రం వణికిపోతూ బయటే ఆగిపోయింది. శతపత్ర తనను సమీపించటం చూసి గగ్గోలుగా అరవటం ఆరంభించింది పూర్ణిమ దయ్యం. అరుపుల మధ్య తిట్టిపోస్తోంది–

"రావద్దని చెప్పాగదా! ఎందుకొచ్చావే... నా ఒళ్ళు కాలిపోతున్నట్టుంది. వేడి మంటలు... అమ్మో... భరించలేను" అంటూ పెద్దగా గింజుకుంటోంది.

అంతలోనే అంజలి శరీరాన్ని వదిలి బయటికొస్తోంది. తిరిగి శరీరాన్ని ఆవహిస్తోంది.

దయ్యం వదలగానే పట్టుకున్నవాళ్ళ చేతుల్లో తోటకూర కాడలా వేలాడబడి పోతోంది అంజలి. తిరిగి ఆవహించగానే తుపానుగాలి ఒక్కపెట్టున వీచినట్టు చివ్వున లేచి కేకలు వేస్తూ గంతులేస్తోంది.

భీతావహంగా మారిపోయింది పరిస్థితి. అంజలి శరీరాన్ని వదలగానే ఏదో రివ్వు రివ్వున గదిలో పైన తిరుగుతున్న శబ్దాన్ని స్పష్టంగా వింటున్నారంతా. బంతిలా గోడల్ని తాకి వెనక్కి వస్తుంటే ఖరీదైన వస్తువులు భళ్ళున పగిలి కిందపడుతున్నాయి.

"నావల్ల కావటంలేదే... నీకు దండం పెడతాను. వెళ్ళిపోవే శతపత్రా...” తిరిగి అంజలిని ఆవహించి బాధాపూరితంగా అరుస్తోంది పూర్ణిమ దయ్యం.

అంత బీభత్సంలో కూడా కించిత్తు కూడా భయపడకుండా ఎదురుగా నిలబడివుంది శతపత్ర. గుమ్మం వద్ద గుమిగూడిన వాళ్ళలో చాలామంది భయంతో దూరంగా పారిపోయారు. లోపలున్న వాళ్ళకి చెమటలు పట్టేస్తు న్నాయి. 

"నువ్వు నీజంగా దయ్యానివైతే నా గురించి ఎందుకు భయపడుతున్నావ్?" చాలా స్థిరంగా అడిగింది శతపత్ర. 

"నన్ను కాల్చి బూడిద చేద్దామనా... నీ గురించి నీకే తెలీదు.” అంది దయ్యం.

“అయితే నువ్వీ అమ్మాయిని వదిలివెళ్ళిపో" అంది శతపత్ర.

“వెళ్ళనంటున్నాగా...”

"అయితే నేనే నిన్ను పట్టుకుంటా”

అంజలిని పట్టుకోవాలని అడుగు ముందుకేసింది శతపత్ర.

భయంతో పెద్దగా అరుస్తూ తనని పట్టుకున్న వాళ్ళని విదిలిస్తూ నాలుగడుగులు వెనక్కి దూకింది దయ్యం. "వద్దు. నన్ను తాకొద్దూ" అనరిచింది.

"ఏమవుతుందో తాకిచూస్తాను.”

"వద్దు వద్దు. నువ్వు చెప్పినట్టు వింటాను. నన్నేమీ చేయకు.” 

"అయితే అంజలిని వదిలి వెళ్ళిపోతావా?" అని అడిగింది శతపత్ర.

“పోతాను”

“మళ్ళీ రాకూడదు.”

"రాను"

"రానని నమ్మకం ఏమిటి?”

"రాను... రాను... నా మొగుడిచేత్తో పసుపు నీరు తాగించమని చెప్పు. వెళ్ళిపోతాను" అంది దయ్యం.

"నువ్వు వెళ్ళిపోతున్నట్టు రుజువు చూపించాలి" అంది శతపత్ర. 

“చూపిస్తాను. అదిగో... ఆ కిటికీ అద్దం పగలగొట్టుకుని వెళ్ళిపోతాను" 

ఆ సంభాషణంతా మొత్తం ఆశ్చర్యంగా వింటున్నారంతా. శతపత్ర ప్రత్యేకించి చెప్పక్కర్లేకుండానే సుఖదేవ్ సింగ్ గ్లాసు మంచినీటిలో చిటికెడు పసుపు కలిపి తెచ్చాడు.

అంజలిని ఆవహించిన పూర్ణిమ దయ్యం మొగుడ్ని ప్రేమగా చూస్తూ పసుపునీరు తాగింది. తాగుతూ హృదయవిదారకంగా ఏడుస్తోంది. 

"నాకు చాల్లేదు... బిందెడు కావాలి" అంది తక్షణం బిందెడు పసుపు నీళ్ళు తెచ్చాడు సుఖదేవ్ సింగ్.

అందర్నీ ఆశ్చర్యపరుస్తూ బిందెలో సగం నీరు తాగేసింది" మిగిలిన నీటిని తలమీద పోసుకుంది. అంతే- అంజలి శరీరం నుంచి దయ్యం తప్పుకుంది. గదిలో రివ్వురివ్వున ఏదో అదృశ్యశక్తి తిరుగుతున్న శబ్దం విన్పించింది.

పది సెకన్ల తర్వాత అంత ఎత్తులో ఉన్న కిటికీ అద్దం విచిత్రంగా భళ్ళున పగిలింది. అంతే- గదిలో నిశ్శబ్దం అలముకుంది.

📖

స్పృహలేని అంజలిని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టారు. ఆమెను స్పృహలోకి తెచ్చే ప్రయత్నాలు ఆరంభించారు.

అంజలి అత్తగారు కళాంజలి అయితే ఆనందంతో శతపత్ర రెండు చేతులూ పట్టుకుని వదల్లేదు-

"పెద్దపెద్ద మంత్రగాళ్ళని తీసుకొచ్చాం. ఎవరూ పూర్ణిమ దయ్యాన్ని వదిలించలేక పోయారు. ఆ మొండి దయ్యాన్ని వదిలించి, నా కోడల్ని, మా కుటుంబాన్ని కాపాడావ్. కాళ్ళకు మొక్కాలని వుంది తల్లీ. వయసులో చిన్నదానివి అని ఆ పనిచేయలేక పోతున్నాను” అంది కన్నీటితో.

"మాకెంతో ఉపకారం చేసిన నిన్ను ఉత్త చేతులతో పంపించలేము. మేమిచ్చే కానుకలు తీసుకెళ్ళాలి" అంటూ ఆనందంతో అర్థించాడు సుఖదేవ్ సింగ్.

సున్నితంగా వారిని తిరస్కరించింది శతపత్ర "మీరు నాకేవో శక్తులున్నాయని పొరపాటు పడుతున్నట్టున్నారు. అలాంటిదేమీ లేదు. అందరిలాగే నేను కూడా ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాను. కారణం తెలీదుగాని పూర్ణిమ నన్ను చూసి భయపడింది. దాన్ని అడ్డం పెట్టుకుని వెళ్ళిపొమ్మని చెప్పాను. అంతే... నాకు ఈ కానుకలు అవసరం లేదు. మీ అభిమానం చాలు" అంటూ అంజలిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి విశ్వదాతో కలిసి ఆమె ప్లాట్ కి వచ్చేసింది శతపత్ర.

🍁

*సశేషం*

No comments:

Post a Comment