Wednesday, 10 June 2026

 



అంత కోపం ఎందుకయ్యా. అప్పుడు నా వయసు ఐదయ్యా !

.......................................

అంత కోపం ఎందుకయ్యా అప్పుడు నా వయసు ఐదయ్యా ! అనే పాట ఇల్లు ఇల్లాలు చిత్రంలోనిది.


మన తాత్త్విక శాస్త్రాల ప్రకారం కోపం (క్రోధం) మానవుని అంతఃశత్రువులలో ఒకటి. అరిషడ్వర్గాలలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ప్రధానమైనవి. వీటిలో క్రోధమనేది వ్యక్తి వివేకాన్ని కప్పివేసి వ్యక్తిగత జీవితాన్నే కాక సామాజిక సంబంధాలను కూడా దెబ్బతీసే శక్తిని కలిగి ఉంటుంది. అందువల్ల ధర్మశాస్త్రాలు ఆయుర్వేదం యోగశాస్త్రం నాట్యశాస్త్రం వంటి భారతీయ జ్ఞాన సంప్రదాయాలు కోపాన్ని వివిధ కోణాలలో విశ్లేషించాయి.


ధర్మశాస్త్రాల ప్రకారం కోపాన్ని దాని మూలకారణాల ఆధారంగా ఆరు రకాలుగా వర్గీకరించారు. 

(1) ధర్మరక్షణ సమాజహితం కోసం ఉద్భవించే కోపాన్ని సాత్త్విక లేదా ధార్మిక కోపంగా భావించారు. అన్యాయాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించేందుకు ఉపయోగపడే ఈ కోపానికి శ్రీకృష్ణుడు కంసునిపై ప్రదర్శించిన ఆగ్రహం ఉదాహరణగా చెప్పబడుతుంది. (2) వ్యక్తిగత కోరికలు ఆశలు నెరవేరనప్పుడు కలిగే కోపాన్ని స్వార్థకోపంగా పేర్కొన్నారు. 

(3) గర్వం అధికార దర్పం లేదా అహంకారానికి భంగం కలిగినప్పుడు పుట్టే కోపాన్ని మదకోపం అంటారు. దక్షుడు శివునిపై ప్రదర్శించిన ఆగ్రహం దీనికి ఉదాహరణగా చెప్పబడుతుంది. (4) ఇతరుల అభివృద్ధిని చూసి కలిగే ఈర్ష్యా కోపం, (5) సంపద లేదా అధికారాన్ని కోల్పోతామనే భయంతో కలిగే లోభకోపం కూడా ఈ వర్గీకరణలో భాగమే. (6) చివరగా సరైన కారణం లేకుండానే అలవాటుగా వ్యక్తమయ్యే మూఢకోపాన్ని తామసిక కోపంగా పేర్కొన్నారు.


ఈ ఆరు రకాల కోపాలు అరిషడ్వర్గాలతో కూడా సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయి. కామం నెరవేరనప్పుడు స్వార్థకోపం మదం వల్ల మదకోపం మాత్సర్యం వల్ల ఈర్ష్యా కోపం లోభం వల్ల లోభకోపం ఉద్భవిస్తాయి. అందువల్ల క్రోధం మిగిలిన అంతఃశత్రువులతో పరస్పర సంబంధం కలిగి ఉంటుందని భారతీయ తత్వశాస్త్రం వివరిస్తుంది.


ఆయుర్వేదం యోగశాస్త్రం కోపాన్ని త్రిగుణాలైన సత్త్వ రజస్ తమస్ ఆధారంగా మూడు రకాలుగా వివరిస్తాయి. 


అన్యాయం జరిగినప్పుడు ఉద్భవించి నియంత్రణలో ఉండి త్వరగా శాంతించే కోపం సాత్త్విక క్రోధం. 


అహంకారం దెబ్బతిన్నప్పుడు ఉద్భవించి ప్రతీకార భావనను పెంచేది రాజస క్రోధం. 


కారణం లేకుండానే మనసులో దీర్ఘకాలం నిలిచి వ్యక్తిని లోపల నుంచి దహించివేసేది తామస క్రోధం. 

ఈ మూడింటిలో తామసిక కోపమే అత్యంత హానికరమైనదిగా భావించబడింది.


ఆయుర్వేద దృష్టిలో క్రోధం పిత్తదోషాన్ని పెంచి అనేక శారీరక మానసిక వ్యాధులకు కారణమవుతుంది. యోగశాస్త్రం దీనిని చిత్తవృత్తులను కలుషితం చేసే క్లేశాలలో ఒకటిగా పరిగణిస్తుంది. భగవద్గీతలో కూడా క్రోధం మోహం బుద్ధినాశానికి దారితీస్తుందని వివరించబడింది.

భరతముని నాట్యశాస్త్రంలో కోపానికి ప్రత్యేక ఉపవిభాగాలు లేకపోయినా దానిని స్థాయీభావంగా గుర్తించారు. ఈ క్రోధభావం కళాత్మక వ్యక్తీకరణలో ఉత్సాహంతో కలిసినప్పుడు రౌద్రరసంగా పరిణమిస్తుంది. అసూయ అహంకారం ఉగ్రత క్రూరత్వం వంటి భావాలు రౌద్రరసానికి మూలకారణాలుగా చెప్పబడ్డాయి.


కోపం కేవలం మానసిక స్థితి మాత్రమే కాదు.అది శరీరంలోనూ గణనీయమైన మార్పులను కలిగిస్తుంది.కోపం వచ్చినప్పుడు మెదడు వెంటనే స్పందించి అడ్రినలిన్ కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది.ఫలితంగా గుండె వేగం పెరుగుతుంది. రక్తపోటు అధికమవుతుంది. శ్వాస వేగంగా సాగుతుంది. ముఖం ఎర్రబడటం చెమటలు పట్టడం దవడలు మరియు కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ తగ్గిపోవడంతో అసిడిటీ అజీర్తి వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.


కోపం ప్రభావం వ్యక్తి ఆరోగ్యానికే పరిమితం కాదు. తరచూ కోపానికి లోనయ్యే వ్యక్తుల పట్ల సమాజంలో నమ్మకం తగ్గుతుంది. స్నేహితులు బంధువులు సహచరులు లాంటి వారితో మెలగడానికి సంకోచిస్తారు. ఎంతటి విద్యావంతుడైనా ధనవంతుడైనా కోపాన్ని నియంత్రించలేకపోతే గౌరవం కోల్పోతాడు. ఒక్క క్షణం ఆవేశంలో పలికిన మాటలు జీవితకాల బంధాలను విచ్ఛిన్నం చేయగలవు.


అందువల్ల భారతీయ జీవన విధానం కోపాన్ని పూర్తిగా నిర్మూలించమని కాకుండా దానిని సాత్త్వికదిశగా మలచుకోవాలని ఉపదేశిస్తుంది. ధర్మరక్షణకు న్యాయస్థాపనకు ఉపయోగపడే కోపం సమంజసమైనదే అయినప్పటికీ స్వార్థం అహంకారం ఈర్ష్య లోభం నుండి పుట్టే కోపం వ్యక్తిని నాశనం చేస్తుంది. ఉపనిషత్తులు గీత ధర్మగ్రంథాలు క్రోధాన్ని జయించడం ద్వారా మాత్రమే ఆత్మోన్నతి సాధ్యమని బోధిస్తాయి.


ఈ సత్యాన్నే సుమతీ శతకకారుడు ఎంతో సరళంగా హృద్యంగా ఇలా చెప్పాడు


తనకోపమె తనశత్రువు

తనశాంతమే తనకురక్ష దయ చుట్టంబౌ

తనసంతోషమె స్వర్గము

తనదుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!


//సేకరణ//

.................జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

షితాబ్ ఖాన్ అనబడే సీతారామరాజు.

.............................................


1323లో కాకతీయ సామ్రాజ్యం పతనంతో తెలుగునేల రాజకీయంగా విచ్ఛిన్నమైంది. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల వల్ల సామాజిక సాంస్కృతిక ధార్మిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఈ సంక్షోభ సమయంలో ముసునూరి ప్రోలయనాయకుడు ఆయన మేనల్లుడు కాపయనాయకుడు  సుమారు డెబ్బై ఐదుమంది తెలుగు సామంతులను ఏకతాటిపైకి తెచ్చి విదేశీపాలనకు వ్యతిరేకంగాఉద్యమించి ఓరుగల్లును తిరిగి స్వాధీనం చేసుకొని తెలుగు ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించారు. వారి అనంతరం తెలంగాణ ప్రాంతంలో తెలుగు రాజకీయ సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగించేందుకు కృషి చేసిన ప్రముఖ పాలకులలో చితాబ్ ఖాన్ లేదా సీతాపతిరాజు ఒకరు.


చితాబ్ ఖాన్ అసలు పేరు సీతాపతిరాజు. శాసనాలలో ఆయనను సీతారామరాజని కూడా పేర్కొన్నారు. సాధారణ సైనికుడిగా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన బహమనీ సుల్తాన్ హుమాయూన్ షా సేవలో చేరి తన అసాధారణ యుద్ధనైపుణ్యం పరిపాలనా దక్షత రాజకీయ చతురతతో ఉన్నత స్థానాలకు ఎదిగాడు.ఆయన ప్రతిభను గుర్తించిన సుల్తాన్ “చితాబ్ ఖాన్” అనే గౌరవ బిరుదును ప్రదానం చేశాడు.ఆ కాలంలో ఖాన్ అనే పదం తప్పనిసరిగా మతపరమైనది కాదు వీరత్వం విశ్వాసపాత్రత అధికార ప్రతిష్ఠలకు సూచకంగా కూడా ఖాన్ ఉపయోగించబడేది. క్రమంగా ఈ బిరుదే ఆయన పేరుగా ప్రసిద్ధి చెందింది.


కాలక్రమంలో కొందరు చరిత్రకారులు చితాబ్ ఖాన్ ఇస్లాం మతాన్ని స్వీకరించాడని పేర్కొన్నప్పటికీ,

 అందుబాటులో ఉన్న శాసనాధారాలు ఆ అభిప్రాయాన్ని సమర్థించవు. వరంగల్లు ప్రాంతంలో లభించిన శాసనాలలో ఆయన తనను సీతారామరాజుగా పేర్కొనడమే కాక ధ్వంసమైన హిందూ దేవాలయాలను పునరుద్ధరించిన విషయాన్ని కూడా నమోదు చేశాడు. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు ఆదిరాజు వీరభద్రరావు తన “షితాబ్ ఖాన్ అనబడే సీతారామరాజు” అనే గ్రంథంలో శాసనాలు వంశావళులు, సమకాలీన ఆధారాలను విశ్లేషించి సీతాపతిరాజు హిందూ సంప్రదాయాలను విడిచిపెట్టలేదని నిర్ధారించారు గిట్టని వారు అతను మతం మారాడని ప్రచారం చేశారని పేర్కొనాడు.


1503 ACE లో సీతాపతిరాజు వరంగల్లు రాచకొండ ఖమ్మం వంటి వ్యూహాత్మక కోటల పాలకుడిగా ఎదిగాడు.తురుష్క దండయాత్రల వల్ల శిథిలమైన అనేక దేవాలయాలను పునరుద్ధరించడం చెరువులు కట్టలు కాలువలను బాగుచేయడం వ్యవసాయాభివృద్ధికి చర్యలు తీసుకోవడం వంటి పనులను సీతారామరాజు చేపట్టాడు. ముఖ్యంగా కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పాకాల చెరువు మరమ్మతులకు ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి. దీనివల్ల వ్యవసాయం & గ్రామీణ ఆర్థికవ్యవస్థకు ఊతం లభించింది.


ఓరుగల్లులో ఆయన నిర్మించిన ఖుష్ మహల్ నేటికీ ఆయన కాలపు నిర్మాణ వైభవానికి నిదర్శనంగా నిలిచివుంది.ఈ భవనం కాకతీయ, బహమనీ శైలుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. పరిపాలనా కార్యకలాపాలకు ఉపయోగించిన ఈ నిర్మాణం తెలంగాణ మధ్యయుగ చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించింది. 


చితాబ్ ఖాన్ పరిపాలనలో తెలుగు సాహిత్యానికి కూడా ప్రోత్సాహం లభించింది.ఆయన మంత్రి ఎనుములపల్లి పెద్దన్న సాహిత్యాభిమాని. ఆయన ఆదరణలో చరిగొండ ధర్మన్న చిత్రభారతమనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు.ఇది తెలుగు చిత్రకవిత్వ సంప్రదాయానికి ఆద్యగ్రంథాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.


సీతాపతిరాజు జీవితంలో రాజకీయ సవాళ్లు కూడా తక్కువేమికాదు.. గోల్కొండలో కుతుబ్షాహీ శక్తి పెరుగుతున్న సమయంలో తెలంగాణపై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటాలలో ఆయన కీలకపాత్ర పోషించాడు.1512 ACE లో కుతుబ్షాహీ సేనలు రాచకొండపై దాడి చేసినప్పుడు ఆయన వీరోచితంగా ప్రతిఘటించినప్పటికీ పరిస్థితులు అనుకూలించక కోటను కోల్పోయాడు. అనంతరం కళింగాధిపతి ప్రతాపరుద్ర గజపతి ఆశ్రయాన్ని పొందాడు. తరువాత విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కళింగంపై దండయాత్ర చేసినప్పుడు గజపతి పక్షాన యుద్ధంలో పాల్గొన్నట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అయితే విజయనగర సైనిక శక్తి ముందు ఆయన ప్రభావం క్రమంగా తగ్గిపోయింది.


చితాబ్ ఖాన్ పాలనను పరిశీలిస్తే ఆయన కేవలం యోధుడే కాక పరిపాలకుడు నిర్మాణకర్త ధర్మరక్షకుడు కళాసాహిత్య పోషకుడని స్పష్టమవుతుంది. కాకతీయుల పతనం తరువాత తెలంగాణలో తెలుగు సంప్రదాయాలను నిలబెట్టేందుకు కృషి చేసిన పాలకులలో ఆయన ఒక ముఖ్యమైన కడియంగా నిలిచాడు.విదేశీ ప్రభావాలు పెరుగుతున్న కాలంలో స్థానిక సంస్కృతి దేవాలయాలు సాగునీటి వనరులు సాహిత్య సంప్రదాయాలను కాపాడేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు విశేషమైనవి.


తెలుగుచరిత్రలో ముసునూరి నాయకుల తరువాత తెలంగాణ ప్రాంతంలో స్థానిక రాజకీయ స్వాతంత్ర్య భావనను కొనసాగించిన నాయకులలో చితాబ్ ఖాన్ ఒక ప్రముఖవ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఆయన జీవితం తెలుగువారి ఆత్మగౌరవం ధైర్యసాహసాలు పరిపాలనా ప్రతిభ ధర్మనిష్ఠలకు ప్రతీకగా నిలిచింది. నేడు వరంగల్లు ప్రాంతంలోని ఖుష్ మహల్ శాసనాధారాలు సాహిత్య కృతులు ఆయన వారసత్వాన్ని సజీవంగా నిలుపుతున్నాయి. చితాబ్ ఖాన్ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయదలచిన వారికి ఆదిరాజు వీరభద్రరావు రచించిన “షితాబ్ ఖాన్ అనబడే సీతారామరాజు” గ్రంథం విలువైన ప్రామాణిక ఆధారంగా నిలుస్తుంది..


//సేకరణ//

................జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

ఎంతమందికి గుర్తుంది !

........................................

ఇది కేవలం ఒక పాత ఫోటో మాత్రమే కాదు బాల్యస్మృతులను గ్రామీణజీవనాన్ని మన కళ్ళెదుట సాక్షాత్కరింప చేస్తోంది. ఇది1908 నాటి చిత్రం.గ్రామీణ ప్రాంతాల్లో వినోద సాధనాలు చాలా తక్కువగా ఉండే ఆ రోజుల్లో ఎలుగుబంట్లతో వచ్చే సంచార కళాకారులు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు.వారు డోలు లేదా డోలక్ ను మోగిస్తూ చిలకపింజలు అంటే నాలుగైతు ఇనుప రింగులు ఎడమ చేతికి తొడుక్కోని ఆ రింగులపై లయబద్ధంగా ఇనుప కర్రతో కొడుతూ వీధులలోకి వచ్చేవారు. ఎలుగుబంటి రాగానే పిల్లలందరు వారి వెంట పరుగులు తీసేవారు. ఎలుగును చూచి కుక్కలు  బాగా మోరిగేవి. గ్రామంలోని రావిచెట్టు కిందనో లేదా రచ్చబండ దగ్గరో ప్రదర్శన మొదలయ్యేది. ఎలుగుబంటి రెండు కాళ్లపై నిలబడి నృత్యం చేయడం డోలు (డోలక్)  వాయిద్యానికి రింగుల శబ్దానికి తలఊపడం, కర్ర మీద నిలబడటం వంటి విన్యాసాలు చేస్తుంటే అశ్ఛర్యంగా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండేవాళ్లం.ప్రదర్శన ముగిశాక పెద్దలు కొందరు పైసలు మరికొందరు బియ్యం జొన్నలు రాగులు ఇచ్చి వారిని ఆదరించేవారు. కోతులాట పాములాటతో పాటు ఈ ఎలుంగ్గొడ్డు ప్రదర్శన నాటి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేవి.పిల్లలలో భయం పోగొడుతుందని చెప్పి ప్రదర్శకులు ఎలుగుబంటి బొచ్చులో ఒక వెంట్రుకను పీకి ఇచ్చి 2,3,5 పైసలు వసూలు చేసుకొనేవారు.ఆ వెంట్రుకను పిల్లల మొలతాడుకు కట్టేవారు.


అప్పట్లో కేవలం ఈ ఆట వినోదం మాత్రమే.ఆ ఎలుగుబంటికి ఎలా శిక్షణ ఇస్తారు దాని వెనుక ఎంతటి క్రూరత్వం బాధ దాగి ఉన్నాయనే విషయం గురించి ఎవరూ ఆలోచించేవారు కాదు. భారతదేశంలో  ఎలుగుబంట్లను పట్టుకుని నాట్యం నేర్పే సంప్రదాయం శతాబ్దాల నాటిది.ఇది బ్రిటిష్ పాలనలో మరింత వృద్ధి చెందింది.1908 నాటి ఈ జైపూర్ ఛాయాచిత్రం అటువంటి సంస్కృతి దృశ్యానికి రేఖామాత్రమే.అప్పట్లో సంచార తెగలు అడవుల నుంచి ఎలుగుబంటి పిల్లలను తెచ్చి వాటి మూతిని కుట్టి చిన్నప్పటి నుంచే కొరడా దెబ్బలతో కొట్టి ఆకలి బాధతో హింసించి వీధి నృత్యాలకు క్రూరంగా శిక్షణ ఇచ్చేవారు.

నేడు ఈ ఫోటోను చూస్తుంటే ఒకవైపు ఆ మన అమాయక బాల్యం గుర్తొస్తుంది.మరోవైపు జంతువుల పట్ల సమాజంలో వచ్చిన సానుకూల మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.1972 నాటి భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఎలుగుబంట్లను ప్రదర్శనలకు ఉపయోగించడాన్ని ప్రభుత్వం పూర్తిగా నేరంగా మార్చింది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో వైల్డ్‌లైఫ్ ఎస్‌ఓఎస్ (Wildlife SOS) వంటి అనేక స్వచ్ఛంద సంస్థలు వేలాది నృత్యం చేసే ఎలుగుబంట్లను రక్షించి వాటిని అభయారణ్యాలలో పునరావాసం కల్పించాయి.నేటికీ తెలంగాణా ఆగ్రా మధ్యప్రదేశ్ కర్ణాటకలలో ఎలుగుబంట్ల ప్రత్యేక అభయారణ్యాలు ఉన్నాయి.ఆ విధంగా ఒకప్పుడు సాధారణ దృశ్యంగా ఉన్న ఈ ప్రదర్శనలు ఇప్పుడు పూర్తిగా చరిత్రలో భాగమయ్యాయి. ఈ ఛాయాచిత్రంలోని జనసమూహం ముఖాల్లో కనిపించే ఆశ్చర్యం ఆసక్తి మన తరపు చిన్నతనాన్ని తలపిస్తాయి.కాలం మారింది.మనుషుల ఆలోచనలూ మారాయి. నాటి వినోదం వెనుక ఉన్న బాధను నేడు సమాజం గుర్తించి ఆ మూగజీవులకు విముక్తి కల్పించడం నిజంగా ఒక గొప్ప సానుకూల పరిణామం.

1998లో నేను చివరి సారిగా మా గోరంట్ల గ్రామంలో ఎలుగుబంటి ప్రదర్శన చూశాను. K జగన్ మోహన్ అనే కుర్రాడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ ఎలుగుబంటిని అటవీశాఖవారు స్వాధీనం చేసుకొన్నారు.


//సేకరణ//

....................జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

హమారా బజాజ్ - సువేగా - చల్ మేరీ లూనా

.........................................


భారతదేశ రవాణా రంగ చరిత్రనేది ఎన్నో మైలురాళ్ళతో ఆసక్తికరమైన మలుపులతో వున్న ఒక  గాథ.కార్లప్రవేశం బ్రిటీష్ పాలనలోనే మొదలైంది. 1897లో క్రాంప్టన్ గ్రీవ్స్ కంపెనీ యజమాని ఫాస్టర్ అనేవాడు. భారతదేశానికి మొదటికారును తీసుకువచ్చాడు.ఆ వెంటనే 1898లో జెంషెడ్‌జీ టాటా ముంబాయికి మొదటికారును తెచ్చిన స్వదేశీయుడిగా ఘనత వహించాడు.దేశీయ వాహనచరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని టాటా ప్రారంభించారు.అదే సంవత్సరంలో మరికొన్ని కార్లు కూడా ముంబాయి తీరానికి చేరుకోవడంతో మనదేశంలో వాహన సంస్కృతికి పునాది పడింది.  


మలిదశలో కార్ల దిగుమతి & అసెంబ్లింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 1928 డిసెంబరులో జనరల్ మోటార్స్ హిందూస్థాన్ లిమిటెడ్ వారు యూరప్ నుండి విడిభాగాలను దిగుమతి చేసుకొని ముంబాయిలో అసెంబ్లింగ్ చేసి భారత రహదారులపైకి కారును తీసుకువచ్చారు. అయితేసంపూర్ణంగా భారతదేశంలో తయారైన మొదటి కారు అంబాసిడర్. కోల్‌కతాలో 1948లో  మోరిస్ ఆక్స్‌ఫర్డ్ వారు ఈ కార్లను ఉత్పత్తి చేసి ఆ తరువాత హిందూస్థాన్ మోటార్స్ పేరుతో కార్ల ఉత్పత్తి చేశారు.

ఈ అంబాసిడర్ సుమారు 4 దశాబ్దాల పాటు భారతీయ రోడ్లను ఏలింది.హిందుస్థాన్ కంపెనీ వారు ప్రవేశపెట్టిన అంబాసిడర్ కారు కొత్త సాంకేతికతతో ఆధునిక సౌకర్యాలతో నవీన రూపంలో  మరలా మార్కెట్టులోనికి వచ్చే అవకాశముంది.


కార్ల సాంకేతికతలో మరింత అభివృద్ధి చెందిన తర్వాత 1984లో మధ్యతరగతి ప్రజల కలల వాహనంగా మారుతి–800 విడుదలైంది.ఇదే భారతదేశంలో మొదటి ఎయిర్ కండీషన్డ్ (AC) కారుగా వాహనరంగంలో ఒక కొత్తయుగానికి నాంది పలికింది.  


కార్లచరిత్రలో ఒక విచిత్రమైన సంఘటన 1920లో చోటుచేసుకుంది. అల్వార్ మహారాజా జై సింగ్ ఇంగ్లాండ్‌లో రోల్స్ రాయిస్ షోరూమ్‌కి సాధారణ దుస్తుల్లో వెళ్ళగా సేల్స్ ప్రతినిధులు ఆయనను సామాన్యుడిగా భావించి అవమానించారు. ప్రతికారంగా ఆ రాజాగారు ఒకేసారి ఏడు రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసి భారతదేశానికి తెచ్చి వాటిని మునిసిపాలిటీకి అప్పగించి చెత్త సేకరణకు ఉపయోగించారు. ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కార్లు చెత్తబండ్లుగా వాడటంతో ఆ కార్ల బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతింది.చివరికి రోల్స్ రాయిస్ యాజమాన్యం రాజుగారికి క్షమాపణలు చెప్పి కొత్తకార్లను ఉచితంగా అందించింది.  


ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే 1950లో భారతదేశంలో మొదటగా ప్రవేశించిన స్కూటర్ లాంబ్రెట్టా.ఆ తర్వాత 1972లో బజాజ్ స్కూటర్ హమారా బజాజ్ అంటూ మనఇంటిలో భాగమై 2009 వరకు కొనసాగింది.బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడిన చిన్నవాహనమైన సువేగా మోపెడ్. మంచి వేగంతో నడిచే మోపెడ్ అనే అర్థం వచ్చేలా భారతీయ మార్కెట్లో ప్రవేశించింది. కోయంబత్తూరుకు చెందిన కెఎల్ వి ఫౌండర్స్ సంస్థ 1962లో తిరుపతిలో ఈ సువేగా కర్మాగారాన్ని స్థాపించి 1988 వరకు విజయవంతంగా ఉత్పత్తి చేసింది.  


ఇక 1972లో మార్కెట్లోకి వచ్చిన లూనా మోపెడ్ కూడా ఇరవైఏళ్ళ క్రితంవరకు మధ్యతరగతి ప్రజల ప్రియమైన వాహనంగా నిలిచింది. చల్ మేరీ లూనా అనే ప్రకటన గురించి ఇప్పటికీ పాతతరం వారికి గుర్తుండే వుంటుంది.  


మరోవైపు పటిష్టమైన ప్రయాణానికి మారుపేరైన జీపు (Jeep) అనే పదం General Purpose నుండి పుట్టింది.రెండవ ప్రపంచ యుద్ధసమయంలో 1941లో ఐరోపా సైనికుల అత్యవసర ప్రయాణాల కోసం వీటిని రూపొందించారు. భారతదేశంలో 1954లో మహీంద్రా అండ్ మహీంద్రా వారు మొదటిసారిగా జీపును నిర్మించారు. అంతవరకు అమెరికన్ విల్లీస్ (Willys) జీపు మనదేశంలో వుండగా మహీంద్రా జీపుల రాకతో భారతీయ రహదారులపై కొత్తశకం ప్రారంభమైంది.  


ఈ విధంగా భారతీయ వాహనరంగం బ్రిటీష్ కాలం నుండి స్వాతంత్ర్యం తర్వాతి దశవరకు ఎన్నో మలుపులు తిరిగి ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతూ నేటి ఆధునిక ఆటోమొబైల్ పరిశ్రమకు పునాది వేసింది.  


//సేకరణ//

..................జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

అవినీతి నిరోధక శాఖ - అక్రమార్జనలు.

..........................................

అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించినప్పుడు పట్టుబడే అక్రమాస్తుల జప్తు అపై వాటి వేలం ప్రక్రియ అంతా ఒక క్రమపద్ధతిలో చట్ట ప్రకారం జరుగుతుంది.ఈ మొత్తం వ్యవహారం ప్రధానంగా అవినీతి నిరోధక చట్టం - 1988 (Prevention of Corruption Act) తో పాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) -1973 లోని నిబంధనల ప్రకారం సాగుతుంది.

మొదటి దశలో 

అవినీతి నిరోధక శాఖాధికారులు దాడులు చేసినప్పుడు లభించే నగదు బంగారం ఆస్తి పత్రాలు బ్యాంక్ ఖాతాలను తదితరాలను ప్రాథమికంగా స్వాధీనం చేసుకుని జప్తు (సీజ్ ) చేస్తారు.అనంతరం సదరు ప్రభుత్వఅధికారికి నోటీసు ఇచ్చి ఆ ఆస్తులకు గల చట్టబద్ధమైన ఆదాయ వనరులను నిరూపించుకోవాలని కోరతారు. నిందితుడు అందించే వివరణ సంతృప్తికరంగా లేనప్పుడు అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల (Disproportionate Assets) కేసును పి.సి చట్టం సెక్షన్ 13(1)(e) కింద నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేస్తారు.అయితే ఈ దశలోనే నిందితుడు తన ఆస్తులను ఇతరులకు బదిలీ చేయకుండా లేదా అమ్ముకోకుండా అడ్డుకోవడానికి క్రిమినల్ లా అమెండ్‌మెంట్ ఆర్డినెన్స్ 1944 (Criminal Law Amendment Ordinance) కింద కోర్టు ద్వారా ఆస్తుల తాత్కాలిక అటాచ్‌మెంట్ (Ad-interim Attachment) ఉత్తర్వులను కూడా 

అవినీతి నిరోధక శాఖ పొందుతుంది.

కేసు విచారణ పూర్తై కోర్టులో నేరం నిరూపితమైన తర్వాత అసలు ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడ న్యాయస్థానం ఆస్తుల స్వభావాన్ని బట్టి రెండు రకాలుగా ఆదేశాలు ఇస్తుంది.లంచంగా తీసుకున్న ప్రత్యక్ష సొమ్ము లేదా లంచం డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులను నేరార్జిత ఆస్తులు (Proceeds of Crime) గా పరిగణించి Prevention  of Corruption చట్టం సెక్షన్ 13(2) ప్రకారం నేరుగా ప్రభుత్వానికి అప్పగించాలని గౌ॥కోర్టు స్పష్టం చేస్తుంది.ఇక మిగిలిన అక్రమాస్తుల (Disproportionate Assets) విషయంలో నిందితుడికి జైలు శిక్ష జరిమానాతో పాటు ఆ ఆస్తులన్నింటినీ శాశ్వతంగా జప్తు (Confiscation) చేసి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తుంది.


ఇలా కోర్టు ఆదేశాల ద్వారా ప్రభుత్వ పరమైన ఆస్తులను చట్టప్రకారం ద్రవ్యంగా మారుస్తారు.ఇళ్లు స్థలాలు ఫ్లాట్ల వంటి స్థిరాస్తులను ప్రభుత్వయంత్రాంగం ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వ ఆస్తుల రిజిస్టర్‌లో నమోదు చేస్తుంది. ఆ తర్వాత వాటిని పారదర్శకంగా బహిరంగ వేలం (Public Auction) వేసి వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు (Consolidated Fund) జమ చేస్తారు. చరాస్తుల విషయానికి వస్తే లభించిన నగదును నేరుగా ఖజానాకు పంపుతారు.బంగారం వాహనాలను ప్రభుత్వగుర్తింపు పొందిన ధరలనిర్ణాయాధికారులు ( వాల్యూయర్స్). ద్వారా విలువ కట్టించి వేలం వేస్తారు. షేర్లు మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను కోర్టు ఉత్తర్వుల ప్రతిని సమర్పించి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల ద్వారా క్లోజ్ చేయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయిస్తారు.ఒకవేళ ఆ అక్రమాస్తులు భూ కబ్జాలు లేదా చెరువులు ప్రభుత్వ భూములైతే ప్రత్యేక చట్టం ద్వారా ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుని తిరిగి  ప్రభుత్వ శాఖలకు అప్పగించే వీలుంటుంది.

అయితే ఈ జప్తు విక్రయ ప్రక్రియ అంతా తుది తీర్పునకు లోబడి ఉంటుంది.విచారణ గౌరవకోర్టు (Special ACB Court) శిక్ష విధించినప్పటికీ నిందితుడు పైకోర్టులలో (గౌ॥హైకోర్టు లేదా గౌ॥ సుప్రీంకోర్టు) అప్పీల్ చేసుకునే హక్కు కలిగి ఉంటాడు. అప్పీల్ పెండింగ్‌లో ఉన్నంత కాలం లేదా పైకోర్టు స్టే విధించినప్పుడు సదరు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనంలో ఉంచుకుంటుందే తప్ప తక్షణమే వేలం వేయదు. అప్పీళ్లన్నీ పూర్తిగా ముగిసి విచారణ కోర్టు ఇచ్చిన జప్తు ఆదేశాలను పైకోర్టులు కూడా సమర్థించిన తర్వాతే తుది వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ సుదీర్ఘ వ్యవహారమంతా చట్టపరమైన పర్యవేక్షణలోనే సాగుతుంది.


(సమాచారం అందించిన డి.చక్రపాణికి కృతజ్ఞతలు)


//సేకరణ//

................ 

150 మందిని అటునుండి నరక్కురా !

............................................

అటునుండి నరక్కురా అనే పలుకుబడి ఒకటి. నిత్యజీవితంలో ఏదైనా పనిని ఒక చివర నుండి కాకుండా మరో చివరనుండి మొదలుపెట్టమని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడుతుంటాం. అయితే ఈ మాట వెనుక 150 మంది చెంచుల ప్రాణాలు బలిగొన్న ఒక ఘోర కలియుగ వృత్తాంతం అమరావతిని పాలించిన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి జీవితవిశేషాలతో ముడిపడి ఉన్నాయి.వాసిరెడ్డి వంశానికి మూలపురుషుడు వాసిరెడ్డి వీరప్పనాయుడు (కొందరి కథనం ప్రకారం పద్మనాభ నాయుడు). గోల్కొండ నవాబులు మొఘలుల కాలంలో నందిగామ పరగణాకు జమీందారుగా సేవలందించిన వీరప్పనాయుడికి రామన్న జగ్గన్న, వెంకటాద్రి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు.ఆయన తన మరణానికి ముందే సంస్థానాన్ని ముగ్గురు కొడుకులకు పంచి ఇవ్వగా అందులో చింతపల్లి సంస్థానం జగ్గన్న (జగ్గభూపతి) వశమైంది. జగ్గభూపతి పరాక్రమవంతుడైన పాలకుడు. ఆయనకు 1761 ఏప్రిల్ 17న వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు జన్మించాడు.ఆ తర్వాత జరిగిన ఒక యుద్ధంలో జగ్గభూపతి మరణించగా ఆయన భార్య  సతీసహగమనం చేసింది.కోస్తా తీర ప్రాంతంలో జరిగిన చివరి సతీసహగమనం ఇదేనని చరిత్రకారులు చెబుతారు.

తల్లిదండ్రులు లేని రెండేళ్ల వెంకటాద్రిని సంతానంలేని పెదనాన్న రామన్న చేరదీసి పెంచాడు. నాయుడికి 17 ఏళ్ల వయసున్నప్పుడు రామన్న మరణించడంతో నందిగామ చింతపల్లి సంస్థానాలు రెండూ వెంకటాద్రినాయుడి చేతికి వచ్చాయి. ఆయన ప్రజాసంక్షేమం కోరే పాలకుడే కాక సాహితీప్రియుడు కూడా. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వలె తన ఆస్థానంలో తొమ్మిది మంది కవులైన నవనందులు పోషించాడు. వారిలో ప్రముఖ పండితుడైన ములుగు పాపయారాధ్యులు. ఈయనకు ప్రధానమంత్రిగా కాడా వ్యవహరించారు.

వెంకటాద్రినాయుడు ఎంతటి ప్రజాపాలకుడో అంతటి రోషగాడు కొన్నిసార్లు దుందుడుకు స్వభావం కలవాడు. సర్కారుజిల్లాల పాలన బ్రిటిష్ వారి వశమయ్యాక జమీందారు ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఆంగ్లేయులు చింతపల్లికోటలో తమ సైన్యాన్ని ఉంచారు.ఈ అవమానాన్ని భరించలేక తన రాజధానిని చింతపల్లి నుండి కృష్ణానదీ తీరాన గల అమరావతికి మార్చాడు.అయితే దీనికి మరోకారణం కూడా ప్రచారంలో ఉంది. ఆయన ఏకైక కుమార్తె రాజ్యలక్ష్మి చింతపల్లి కోట గోడపై నుండి కాలుజారి పడి మరణించడం ఆ తర్వాత భార్య వెర్రాంబ కూడా కన్నుమూయడంతో ఆ చేదుజ్ఞాపకాలను భరించలేక ఆయన అమరావతికి తరలివచ్చాడని అంటారు. అమరావతికి వచ్చిన తర్వాత కూడా ఆయన పిండారీదళాల దోపిడీలను దాడులను తిప్పికొట్టి ప్రజలను రక్షించాడు.


అమరావతి పరిసర అటవీ ప్రాంతాలలో నివసించే చెంచులు ఆ రోజుల్లో దారిదోపిడీ దొంగలుగా మారి నిరంతరం గ్రామాలపై పడుతూ ప్రజలను హతమారుస్తూ ఉండేవారు. అడవుల్లో తిరిగే వారిని కత్తితో గానీ సంప్రదింపులతో గానీ లొంగదీసుకోవడం సాధ్యం కాదని గ్రహించిన వెంకటాద్రినాయుడు ఒక కపటోపాయం ఆలోచించాడు. వారితో సంధి చేసుకుంటానని నమ్మించి దాదాపు 150 మంది చెంచు నాయకులను దొంగలను అమరావతి కోటకు విందుకు ఆహ్వానించాడు.

మృష్టాన్న భోజనాల అనంతరం వారంతా ప్రమత్తంగా వున్న సమయంలో నాయుడి సైనికులు చెంచులందరినీ బంధించి వరసగా నిలబెట్టారు. వారందరి తలలు నరకాల్సిందిగా వెంకటాద్రినాయుడు తలారులను ఆజ్ఞాపించాడు. చావుఖాయమని తెలిసిన ఆ చెంచులుప్రాణభయంతో గింజుకున్నారు. తలారులు ఒక చివర నుండి నరకడం ప్రారంభించగా ఆ వరుసలో నిలబడిన వారు భయంతో "అటునుండి నరక్కురా... ఇటునుండి నరక్కురా..." అని ప్రాధేయపడటం మొదలుపెట్టారు. ఒకవేళ అటునుండి నరుక్కుంటూ వస్తే, ఈలోపు జమీందారు మనసు కరిగి శిక్ష ఆపుతాడేమో కనీసం కొందరైనా బతుకుతామనేది వారి ఆశ.కానీ నాయుడి ఆజ్ఞ కఠినమైనది కావడం వల్ల ఆ 150 మంది తలలు తెగిపడ్డాయి. ఆ రోజు చెంచులు ప్రాణభయంతో అరచిన ఆ ఆర్తనాదమే కాలక్రమేణా తెలుగునాట "అటునుండి నరక్కురా" అనే జాతీయంగా స్థిరపడిపోయింది.

 

ఆనాడు 150 మంది చెంచుల తలలు నరికిన ఘోర కలియుగ ప్రదేశమే తర్వాతి కాలంలో నరకుళ్ళపాడుగా మారింది. ఇది ప్రస్తుత గుంటూరు జిల్లాలో వుంది. ఈ సామూహిక నరమేధం తర్వాత వెంకటాద్రినాయుడికి తీవ్రమైన పాపభీతి, పశ్చాత్తాపం పట్టుకున్నాయి. ఆయనకు రాత్రి పూట నిద్ర కరువైంది. అన్నం తినబోతే ముద్దలన్నీ పురుగులుగా కనిపించేవని స్థానిక కథనాలు చెబుతాయి.ఈ నరహత్యా పాతకాల నుండి విముక్తి పొందడానికి పండితుల సలహా మేరకు ఆయన అనేక భూదానాలు, గోదానాలు సువర్ణదానాలు చేశాడు. అమరావతి చేబ్రోలు మంగళగిరి పొన్నూరు వంటి అనేక పుణ్యక్షేత్రాలలో ఎత్తైన గాలిగోపురాలు ఆలయాలు నిర్మించాడు. చివరకు కాశీయాత్ర కూడా చేసి పాపపరిహారం కోరుకున్నాడు.తన జీవిత చరమాంకంలో దైవచింతనలోనే గడిపిన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు 1817 ఆగస్టు 17న అమరావతిలోని అమరేశ్వరుని పాదాల చెంత శివైక్యం చెందాడు.


//సేకరణ//

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాల పునఃపరిశీలన (Re-verification) మరియు ఓటర్ల వివరాల ధృవీకరణకు సంబంధించి ఇటీవల సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్‌లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న సందేశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం, ఎన్నికల సంఘం విధానాలు మరియు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియలను పరిశీలించినప్పుడు, ఆ సందేశాల్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ కొన్ని అంశాలు అపార్థాలకు దారితీసే విధంగా ప్రచారం అవుతున్నట్లు కనిపిస్తోంది.


ప్రచారంలో ఉన్న సందేశాలలో "SIR" అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే భారత ఎన్నికల సంఘం అధికారికంగా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సాధారణంగా "SSR" (Summary Revision of Electoral Rolls) అని పిలుస్తారు. "SIR" అనే పదం కొన్ని ప్రాంతాలలో అంతర్గత డేటా ధృవీకరణ లేదా డిజిటల్ రికార్డు సమన్వయ ప్రక్రియలకు సంబంధించి ఉపయోగించబడవచ్చు గానీ, ఓటర్ల నమోదు లేదా తొలగింపుకు సంబంధించిన అధికారిక ఎన్నికల సంఘం పరిభాష కాదు. అందువల్ల సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రతి పదాన్ని అధికారిక ప్రక్రియగా భావించడం సరైంది కాదు.


ఓటర్ల వివరాల పరిశీలనలో పాత ఓటర్ల జాబితాలకు, ముఖ్యంగా 2002 కాలం నాటి రికార్డులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం కొంతవరకు వాస్తవమే. కుటుంబ సంబంధాలు, స్థానిక నివాస చరిత్ర, వారసత్వ ఆధారిత గుర్తింపులు, అలాగే ఒకే వ్యక్తి పేరు రెండు వేర్వేరు ప్రాంతాలలో నమోదై ఉందేమో గుర్తించడానికి పాత రికార్డులు సహాయకరంగా ఉంటాయి. బూత్ లెవెల్ అధికారులు (BLOలు) ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ డేటాతో పాటు పాత ఓటర్ల జాబితాలను కూడా సరిపోల్చి పరిశీలించే అవకాశం ఉంటుంది. అయితే 2002 జాబితాలో పేరు లేకపోతే ఓటు హక్కు రద్దవుతుందనే ప్రచారం పూర్తిగా నిరాధారమైనది. భారత రాజ్యాంగం ప్రకారం అర్హత కలిగిన ప్రతి పౌరుడు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఓటరుగా నమోదు కావడానికి హక్కు కలిగి ఉంటాడు.


పెళ్లయిన మహిళల విషయంలో కూడా కొన్ని అపోహలు వ్యాపిస్తున్నాయి. వివాహం అనంతరం కొత్త నివాస ప్రాంతానికి మారిన మహిళలు తమ పుట్టింటి ప్రాంతంలోని పాత ఓటర్ల జాబితా వివరాలు లేదా తల్లిదండ్రుల ఓటరు వివరాలను అందించడం ద్వారా కుటుంబ అనుసంధానం (Family Linkage) సులభం కావచ్చు. అయితే అలాంటి వివరాలు సమర్పించడం మాత్రమే సరిపోదు. ఓటును ఒక నియోజకవర్గం లేదా గ్రామం నుండి మరొక ప్రాంతానికి మార్చుకోవాలంటే ఎన్నికల సంఘం నిర్దేశించిన అధికారిక ప్రక్రియను అనుసరించాల్సిందే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫారమ్-8 ద్వారా చిరునామా మార్పు, వివరాల సవరణ లేదా నియోజకవర్గ మార్పు వంటి అంశాలను అధికారికంగా నమోదు చేయాలి. కేవలం కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వడం ద్వారా ఓటు బదిలీ స్వయంచాలకంగా జరిగిపోదు.


సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్న Self Mapping, Add Progeny, Self Progeny వంటి పదాలు కూడా సాధారణంగా ఓటర్లకు సంబంధించిన అధికారిక చట్టపరమైన వర్గీకరణలు కావు. ఇవి క్షేత్రస్థాయిలో డేటా సమన్వయం, కుటుంబ అనుసంధానం మరియు పాత-కొత్త రికార్డుల సరిపోలిక కోసం ఉపయోగించే సాంకేతిక లేదా సాఫ్ట్‌వేర్ ఆధారిత వర్గీకరణలుగా భావించవచ్చు. ఒకే వ్యక్తి పాత మరియు ప్రస్తుత రికార్డులను అనుసంధానించడం, 2002 తరువాత ఓటు హక్కు పొందిన కుటుంబ సభ్యులను నమోదు చేయడం, లేదా కుటుంబ ఆధారిత ధృవీకరణ నిర్వహించడం వంటి పనుల కోసం ఈ తరహా విభజనలు ఉపయోగపడవచ్చు. అయితే ఇవి ఓటరుకు ప్రత్యేక హక్కులు కల్పించే లేదా ఓటు హక్కును నిరాకరించే వర్గాలు కావు.


ప్రస్తుతం జరుగుతున్న ధృవీకరణ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం బోగస్ నమోదులను గుర్తించడం, మరణించిన వ్యక్తుల పేర్లను తొలగించడం, ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదై ఉంటే వాటిని సరిచేయడం, కొత్త అర్హులైన ఓటర్లను చేర్చడం మరియు ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా తయారుచేయడం. ఇది ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను పెంచేందుకు చేపట్టే సాధారణ పరిపాలనా ప్రక్రియగా చూడాలి.


అందువల్ల ఓటర్లు సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను మాత్రమే నమ్మకుండా, తమ పేరు ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉందో లేదో అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవడం ఉత్తమం. పేరు నమోదు, సవరణ, చిరునామా మార్పు లేదా ఇతర సమస్యల విషయంలో నేరుగా బూత్ లెవెల్ అధికారిని (BLO) సంప్రదించడం, లేదా ఎన్నికల సంఘం అధికారిక సేవలను వినియోగించడం అత్యంత విశ్వసనీయమైన మార్గం. ఓటు హక్కుకు సంబంధించిన విషయాల్లో పుకార్ల కంటే అధికారిక సమాచారం మరియు నిర్దేశిత ప్రక్రియలకే ప్రాధాన్యత ఇవ్వడం ప్రతి ఓటరి బాధ్యత.


ప్రాచీన నలంద వైభవం: చైనీస్ చిత్రంలో సంస్కృత సంభాషణ

ప్రాచీన భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించిందో చెప్పడానికి నలందా విశ్వవిద్యాలయం ఒక సజీవ సాక్ష్యం. 


ఆ కాలంలో ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని సముపార్జించేవారు. ఆధునిక కాలంలో అమెరికా వంటి దేశాల్లో ఉన్నత చదువుల కోసం 'TOEFL' లేదా 'IELTS' వంటి ఆంగ్ల భాషా పరీక్షలు రాయడం ఎంత అవసరమో, ఆ కాలంలో నలంద వంటి భారతీయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందడానికి విదేశీ విద్యార్థులు (ముఖ్యంగా చైనా బౌద్ధ విద్యార్థులు) సంస్కృతం నేర్చుకోవడం అంతకంటే అత్యవసరంగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో నలందలో బోధనా మాధ్యమం సంస్కృతమే.


ఒక చైనీస్ చిత్రంలోని సన్నివేశం ఆధారంగా, హుయాన్ త్సాంగ్ నలందా విశ్వవిద్యాలయానికి చేరుకున్నప్పుడు అక్కడ జరిగిన సంభాషణ  ఇక్కడ చూద్దాం:


ఆచార్య శీలభద్ర మరియు హుయాన్ త్సాంగ్ సంభాషణ

ఆచార్యుడు: వత్స! కుతః ఆయా తః?

(నాయనా! నువ్వు ఎక్కడి నుండి వచ్చావు?)


హుయాన్ త్సాంగ్: ఆచార్య చరణేభ్యో నమః... హుయాన్ త్సాంగ్ అహం. మహా చీన దేశతః ఆగతో అహం.

(ఆచార్యుల పాదాలకు నమస్కారం... నా పేరు హుయాన్ త్సాంగ్. నేను మహా చైనా దేశం నుండి వచ్చాను.)


ఆచార్యుడు: అత్ర ఆగమనం కిమర్థం? కథయ...

(ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు...)


హుయాన్ త్సాంగ్: ఆచార్య భవతః చరణ నలందాయాం... ఉపవిశ్య యోగశాస్త్రం పఠితుం ఆగతో అహం.

(ఆచార్యా! మీ పర్యవేక్షణలో ఈ నలందా విశ్వవిద్యాలయంలో ఉంటూ యోగశాస్త్రాన్ని అభ్యసించడానికి నేను వచ్చాను.)


ఆచార్యుడు: సాధు! ఉత్తమ కల్ప!

(చాలా మంచిది! ఉత్తమమైన ఆలోచన!)


ఆచార్యుని స్వప్న వృత్తాంతం

ఆ తర్వాత ఆచార్య శీలభద్రుడు అక్కడ ఉన్న మిగిలిన బౌద్ధ భిక్షువులను ఉద్దేశించి హుయాన్ త్సాంగ్ రాక గురించి ఒక అద్భుతమైన విషయాన్ని సంస్కృతంలో వివరిస్తారు:


"వర్ష త్రయ పూర్వం... అత్ర భవంతః అవలోకితేశ్వర బోధిసత్వ, మైత్రేయ బోధిసత్వ, తథా చ మంజుశ్రీ బోధిసత్వ... ఏతే సర్వే మమ స్వప్నమ్ ఆగత్య కథితవంతః..."


(మూడేళ్ల క్రితం... బోధిసత్వులైన అవలోకితేశ్వరుడు, మైత్రేయుడు మరియు మంజుశ్రీ నా కలలోకి వచ్చి ఒక మాట చెప్పారు...)


"యత్... మహా చీన దేశతః ఏకః బౌద్ధ భిక్షుః ధర్మశాస్త్రం పఠితుం తవ సమీపమ్ ఆగమిష్యతి ఇతి!"


( మహా చీనా దేశం నుండి ఒక బౌద్ధ భిక్షువు ధర్మశాస్త్రాన్ని, బౌద్ధ ధర్మాన్ని అధ్యయనం చేయడానికి నీ వద్దకు వస్తాడు అని!)


ఈ మాటలు విన్న తర్వాత హుయాన్ త్సాంగ్ అమితానందంతో ఆచార్యునికి కృతజ్ఞతలు తెలుపుతూ "అమితాభ... అమితాభ..." అంటూ బుద్ధుడిని స్మరిస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తాడు.


ఈ సన్నివేశం ప్రాచీన భారతదేశపు విద్యా వైభవాన్ని, సంస్కృత భాషకు అంతర్జాతీయంగా ఉన్న ఆదరణను స్పష్టం చేస్తుంది. 


చైనా లాంటి సుదూర దేశం నుండి కేవలం జ్ఞానార్జన కోసం, నలందలో చదువుకోవడం కోసం హుయాన్ త్సాంగ్ వంటి యాత్రికులు ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి సంస్కృతాన్ని నేర్చుకుని భారతదేశానికి వచ్చేవారనే నిజం మన సంస్కృతి పట్ల గర్వపడేలా చేస్తుంది..


గర్వపడండి..ఆత్మవిస్మృతి కి లోనూ కాకండి..

ప్రపంచంలోనే అత్యుత్తమ జాతి మనది..


.................జిబి విశ్వనాథ

9441245857 అనంతపురం.

No comments:

Post a Comment