*సండే స్టోరీ*
*పొట్టభద్రుడు!*
రచన: యాసీన్
మా రాంబాబు పరమ రెటమతస్తుడని తెలుసు. అయితే... వాడిలోని పిడివాది మరీ ఇంత ఉద్ధృతంగా ఉంటాడన్న విషయం, వాడికి ఓ సలహా ఇచ్చేదాకా నాకూ తెలియదు.
"ఒరే రాంబాబూ... పొట్ట కాస్త ముందుకొస్తు న్నట్టుంది. కాస్త ఏ వాకింగో, ఎక్సర్సైజో చెయ్యి బాబూ" అన్నా. అంతే... వాడు నన్ను క్యాంటిన్ కి తీసుకెళ్లి, అక్కడ చూపించాడు తన విశ్వరూపం.
"అన్నానికి, దేహానికి జరిగిన ఓ సమరంలో/ అరగడానికీ పెరగడానికీ మధ్యన సంగ్రామం లో/బెల్టు కట్టుకీ కట్టుబడనిదీ పొట్ట/బస్కీలకూ మెల్టుకానిదీ పొట్ట/ఇది ఆ దైవమే ఇచ్చిన పొట్టా... అది పెరిగితే తప్పా... తప్పా... తప్పా... నో... నెవర్ " అంటూ సాక్షాత్తూ గ్యాస్ట్రిక్ చౌదరి అవతారం
ఎత్తేశాడు.
"ఒరే... ఒరే... ఏదో తెలీక సలహా ఇచ్చా. వదిలెయ్" అని ప్రాధేయపడితే ఉగ్రావతారం విరమించినా శాంతావతారంలోకి వచ్చే ముందు మరికాసేపు ఆవేశపడ్డాడు. ఆ టైమ్ లో పొట్ట గురించి వాడి అభిప్రాయాలు వింటే నాకు మతిపోయింది.
"ఒరేయ్... పొట్ట కాస్త పెరగ్గానే ప్రతివాడూ సలహాలిచ్చేవాడే. అసలు పొట్టా... దాని మహత్యమేమితో తెల్సా" అంటూ ఆవేశంగా అడిగాడు.
"తెలియదురా... తర్వాత చెబుదువుగానీ" అంటూ కాస్త తప్పించుకోడానికి చూశాగానీ.. నా అంతట నేనే తెచ్చుకున్న తంటా కాబట్టి వీలుకాలేదు.
"పొట్ట కొస్తే అక్షరం ముక్క రాదు అనే వాడుక మాట ఎప్పుడైనా విన్నావా? పోనీ వాడికి డొక్కశుద్ధి ఉందండీ అనే నానుడి? దీన్ని బట్టి తెలిసేదేమిటి? మన పూర్వపు రోజుల్లో పొట్ట అనేది మన విజ్ఞానానికి చిహ్నంగా ఉండేదని తెలియడం లేదూ! క్రమంగా అక్షరాలూ, విజ్ఞానం మెదడులో ఉంటాయని ఆధునిక విజ్ఞానశాస్త్రం తేల్చింది కాబట్టి క్రమంగా జ్ఞానానికి పొట్టే కేంద్రమన్న పాత సిద్ధాంతం కొట్టుకుపోయి బ్రెయిన్ సెంట్రిక్ సిద్ధాంతం వచ్చింది. అయినా సరే... ఇప్పటికీ భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లలా నేనూ ఇప్పటికీ పొట్టే జ్ఞానానికి కేంద్రమనీ, దాన్ని ఎప్పుడూ నింపుకోవడం వల్లనే జ్ఞానం వృద్ధి అవుతుందని నమ్ముతున్నా. పెరిగిన పొట్ట వాడిలో పెరిగిన జ్ఞానానికీ ఒక ప్రతీకరా” అన్నాడు.
“సరే సరే... ఇకపై నేనూ నమ్మడానికి ప్రయత్నిస్తాన్లే" అంటూ వాడి ఆవేశాన్ని శాంతపరచడానికి మళ్లీ ఒకసారి విఫలయత్నం చేశా.
“పెరిగిన పొట్ట ఒక విజ్ఞానభాండాగారమే కాదు... అది ఒక కళారూపం”
"పొట్ట కళారూపం ఏమిట్రా? నీకు మతిగానీ పోయిందా?" అంటూ అడిగా.
“పొట్ట పెరిగిన వాణ్ణి ఎప్పుడైనా చూశావా? అంతకుముందు వాడెప్పుడూ తన పొట్టను తానే గమనించడు. కానీ పొట్టంటూ పెరిగాక వాడిలోని ఘటవాద్యకారుడు బయటికి వచ్చేస్తాడు. వేళ్లతో, చేతులతో దానిపై దరువేస్తూ అప్పటివరకూ తనలో నిశ్శబ్దంగా నిబిడీకృతమై ఉన్న అంతర్గత కళాకారుణ్ణి అంటే ఓ ఘటవాద్యకారుణ్ణి బయటకు తీస్తాడు. అలాంటి పొట్ట మీద అనవసరంగా కామెంట్లు చేసి కళాకారుడు పుట్టకముందే వాడిలోని ప్రతిభను దయచేసి మీరు తొక్కేయకండ్రా. ప్లీజ్" అన్నాడు.
"పొట్టకూ ఘటవాద్యానికీ ఏమైనా సంబంధం ఉందట్రా. నీ పొట్టలాగే నీకు మరీ జ్ఞానం కూడా పెరిగి అది వెర్రితలలు వేస్తోంది" అంటూ కాస్త కేకలేయబోయా.
"డొక్క చించి డోలు కట్టడం అన్న వాడుక ఎప్పుడైనా విన్నావా, లేదా? అంటే ఏమిటీ? డొక్కలో ఘటవాద్యం, డోలూ ఇవన్నీ ఉన్నాయన్నమాట. డొక్కకూ, డోలుకూ సంబంధం ఉంది కాబట్టే ఆ సామెతపుట్టింది. ఇన్ని తార్కాణాలూ, దృష్టాంతాలూ ఉన్నా నీలాంటి అజ్ఞానులు ఒక పట్టాన నమ్మర్రా. అంతెందుకు ఎవడైనా బాగుపడటానికి కారణం వాడి పొట్టే"
"బాగుపడటానికీ పొట్టకూ సంబంధం ఏమిట్రా రాంబాబూ?"
“ఎవడైనా బాగుపడాలనుకుంటే వాడు పొట్టచేతపట్టుకుని పోయి, పొట్ట తిప్పలు పడి పొట్టపోసుకుంటాడు. ఎవడైనా పొట్ట పోసుకుంటూ ఉంటే మీలాంటి ఓర్వలేని వాళ్లు కళ్లలో నిప్పులు పోసుకుంటారు. ఇలా కష్టపడి పొట్టపోసుకునేవాడేరా జీవితంలో పైకొస్తాడు. బాగుపడేవాళ్లను మీరు పొట్ట పేరు చెప్పి వాళ్ల పొట్ట కొట్టకండ్రా ప్లీజ్" అన్నాడు మళ్లీ ఆవేశం పెంచుకుంటూ.
“ఒరే నువ్వొక్కడివే పొట్టను ఇలా వెనకేసు కొస్తున్నావ్. ఆరోగ్యానికి పొట్ట అంత మంచిది కాదు తెల్సా?”
"నాకు చెప్పకు. పొట్ట ఉంటే టక్కు బాగా కుదుర్తుందని చిరుపొట్టకోసం చాలామంది యూత్ ఏవేవో ప్రయాసలు పడతారు. నువ్వెప్పుడైనా పొట్టగలవాడు మోటార్ సైకిల్ నడుపుతుంటే చూశావా? బండి పెట్రోల్ ట్యాంకు మీద ఓ కుండను జాగ్రత్తగా పెట్టుకుని, కాళ్లూ చేతుల మధ్య దాన్ని దొర్లిపోకుండా ఉంచుకున్నట్లుగా వెళ్తుంటారా పొట్టగలవాళ్లూ! బండినడుపుతున్నవాడు ఒక్క పొట్టనే ఇంత అపురూపంగా ఎందుకు చూసుకుంటాడంటావ్. వాడికి నీపాటి జ్ఞానం లేకనా? అదే అపురూపమైందని వాడికి తెలుసు గాబట్టి. అంతెందుకు వయసు పెరుగున్నకొద్దీ ఏ చదువూ, ఏ డిగ్రీలూ లేకుండానే లోకమనే ఈ విశ్వవిద్యాలయం లో ఒక పరిణతి చెందిన డిగ్రీ ఇచ్చి ఒకణ్ణి పొట్టభద్రుణ్ణి చేస్తుందిరా ఈ జీవితం. కాబట్టి దాన్ని కించపరచకు. వాకింగులంటూ, వ్యాయామాలంటూ సలహాలిచ్చి ఎవ్వడి పొట్టనూ పొట్టనబెట్టుకోకు” అంటూ వార్నింగిచ్చాడు మా రాంబాబుగాడు.
రాంబాబు ధోరణేమిటి ఇలా పెడసరంగా ఉంది చెప్మా అంటూ కాస్త వాకబు చేశాక విషయం తెలిసింది. పాపం అన్ని రకాల ప్రయత్నాలు చేసినా పొట్ట తగ్గలేదట వాడికి. అందుకే ఇలా సమర్థింపుల్లో దిగాడట. కొంతమంది అంతే.. ఏదైనా వదిలించుకో వడం కుదరకపోతే అదే ఎస్సెట్టంటూ ఎనకేసుకొస్తూ ఎదురుదాడికి దిగుతారు. బట్టతల తప్పదని తెలిశాక దాన్ని సమర్థిస్తూ మాట్లాడినట్టు. వాడూ ఇదే బాపతు. ఏం చేస్తాం. ఎంతైనా మా ఫ్రెండు కదా. వాడి గురించి ఎవడికైనా చెబుదామని కాస్త అనిపించినా... కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని సైలెంటయిపోయా.
*వ్యక్తిత్వ వికాస పాఠాలు!*
రచన: యాసీన్
ఈమధ్య మా రాంబాబుగాడు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చాలా ఎక్కువగా చదువుతున్నాడు. 'విజయానికి ఆరు మెట్లు' అనే పుస్తకాన్ని వాడు చదివాడట. అయితే ఆ పుస్తకంలో పేర్కొన్న మెట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందనీ, ఇంకా మరింత షార్ట్ కట్ లో ఎవరైనా విజయానికి దారులు సూచిస్తే బాగుండేదని వెతుకుతున్నాడు. 'విజయానికి రెండు మెట్లు' అనో లేదా 'విజయానికి మెట్లు లేవ్!'... డైరెక్టుగా జంప్ చేసి విక్టరీని అందుకోవడమే అంటూ ఇంకెవరైనా రాశారేమో అని లైబ్రరీలు వెతికి కనుక్కుంటున్నాడు కానీ... ఇప్పటివరకు ఉన్న మెట్ల సంఖ్యలో ఇప్పటికి అదే లీస్టు అని తెలిశాక బాగా నిరాశ-నిస్పృహలకు లోనయ్యాడు మనవాడు.
"ఓరేయ్... పుస్తకాలు చదివితే వ్యక్తిత్వం వికసించదు. అదే జరిగితే ఒక లక్షమంది ఒకే పుస్తకాన్ని చదివి, తమ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకుంటే... అందరి తత్వం ఒకేలా మారిపోయేది కదా. కానీ అసలు అలా కుదురుతుందా? ఆలోచించు. ఎంత చదివినా, ఏం చేసినా ఎవడి వ్యక్తిత్వం వాడిదే. సొంత ఆలోచనతో ఆయా సందర్భాల్లో ఏది మంచిదో నీ కామన్ సెన్స్ తో నీకు నువ్వే నిర్ణయించుకోవాల్సిందే తప్ప... నీకు జీవితంలో ఎదురు కాబోయే సంఘటలను ఎవరో ఊహించి ముందుగానే రాయలేరు. సో... వికాసాన్ని చదువుతో సాధించడం కాబట్టి విచక్షణతో మసలుకో. వివేచనతో బతుకుపో" అని చెప్పి చూశా. కానీ మొదట్లో మా 'రాంబాబు అస్సలు ఒప్పుకోలేదు. అనుభవమైతే గానీ తత్వం బోధపడదన్న గురజాడ వారి సూక్తిని అనుసరించి ప్రస్తుతానికి వాడి పైత్యానికి వాణ్ణే వదిలేశా.
వ్యక్తిత్వ వికాస పాఠాలు తలకెక్కిన నేపథ్యంలో ఓ రాత్రి మా రాంబాబుగాడికి ఒక కల వచ్చిందట. కలలో విషయాల్ని నాతో షేర్ చేసుకున్నాడు వాడు.
అనగనగా ఓ సింహం వ్యక్తిత్వ వికాస పుస్తకాలను బాగా ఒంటబట్టించుకుందట. అది తన జూలును క్లీన్ గా షేవ్ చేయించు కునీ తన గోళ్లను నీట్ గా ట్రిమ్ చేయించుకు నీ 'తరతరాలుగా, యుగయుగాలుగా నేను నీ కుంభస్థలాన్ని బద్దలుకొట్టడమే చేస్తున్నా. ఇకపై అలాంటి దుర్మార్గాలు చేయనబో' నంటూ ఓ ఏనుగును స్నేహపూర్వకంగా పలకరిస్తూ దాని తల పెకైక్కి... "మన స్నేహానికి గుర్తుగా నీకు పంజా మసాజ్' చేస్తానందట. ఒళ్లు మండిన ఏనుగు ఆ సింహాన్ని పట్టి, తొండంతో చుట్టి... దూరంగా విసిరిపారేసిందట. దాంతో కుయ్యోమంటూ ఆ సింహం "స్టీఫెన్ పాలకోవా రచించిన 'ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ యానిమల్స్' లాంటి పుస్తకాలు నేనొక్కదాన్నే చదివితే కుదరదు. సదరు వ్యక్తిత్వ వికాస పాఠాలను ఏనుగు కూడా చదివినప్పుడే వాటికి సార్థకత" అని విచారిస్తూ కుయ్యో మంటూ నిట్టూర్చిందట.
సింహం గర్జించాలి, పులి గాండ్రించాలి. అప్పుడే వాటి వ్యక్తిత్వం వాటిది లాగే ఉంటుంది. అంతేగానీ... గర్జించాల్సిన, గాండ్రించాల్సిన జంతువులు కుయ్యో మొర్రో మంటూ మూల్గితే అడవిలో ఆర్డర్ తప్పుతుందని వివరించా. 'అలా అడవిలో అరాచకం ఏర్పడితే ఇటు మానవుల మనుగడకూ ముప్పు' అని చెప్పా. దాంతో వాడిపై నా మాటల ప్రభావం కొద్దిగా పడినట్టే అనిపించింది.
📖
ఓరోజు మా రాంబాబు గాడింట్లో దొంగ దూరాడు. అర్ధరాత్రి ఆ టైముకు వ్యక్తిత్వ వికాస పుస్తకం చదువుకుంటున్న మనవాడు దొంగను సాదరంగా ఆహ్వానించాడు. దొంగతనం ఎంత తప్పో మన రాంబాబు సోదాహరణంగా వివరించబోయాడు కానీ... అందంతా సోదిలా అనిపించడంతో సదరు దొంగ మన రాంబాబు బుర్రపై రామకీర్తనలతో సహా అనేక పాటలను ఏకకాలంలో పలికించి చేతికందిన వస్తువుల్ని చక్కా పట్టుకు పారి పోయాడు. "దొంగను చూడగానే పోలీసులకు ఫోన్ చేయాలి, లేదా అరుస్తూ, ఇరుగు పొరిగింటిని పిలుస్తూ హడావుడి చేసి వాణ్ణి పట్టుకునే మార్గం చూడాలిగానీ... ఎవడైనా దొంగకు వ్యక్తిత్వవికాస పాఠాలుచెబుతారా?” అని నేను కోప్పడబోతే... సదరు దొంగ సరిగా ప్రవర్తించకపోవడానికి కారణం వాడు వ్యక్తిత్వ వికాస పాఠాలు చదవకపోవడమే ననీ, అదేగానీ వాడు పర్సనాలిటీ డెవలప్ మెంట్ గురించి చదివి ఉంటే తప్పక తన మాటలూ, ఉపదేశాలూ విని బాగుపడే వాడని బాధపడ్డాడు మా రాంబాబు.
📖
ఓరోజున మా రాంబాబు 'హౌ టు విన్ ఫ్రెండ్స్, అండ్ ఇన్ఫ్లుయెన్స్ 'పీపుల్' అనే డేల్ కార్నెగీ అనే మహానుభావుడి పుస్తకాన్ని తదేకదీక్షతో చదువుతూ ఉండగా నేను వాడింటికి వెళ్లా. వాడి వ్యక్తిత్వ వికాసం ఎలా ఉన్నా... వాడు చేసుకుంటున్న టైం వేస్ట్ గురించి బెంగ ఎక్కువై ఒక రెండు మాటలు చెప్పా.
“ఒరేయ్ రాంబాబూ! ఫ్రెండ్ ని గెలవడం ఏమిట్రా? స్నేహితుడంటే వాడేమైనా నీ ప్రత్యర్థా, పగవాడా, పొరుగింటి తగాదా కోరా? వాడికీ, నీకూ ఏముంటుంది గట్టు తగాదా? నీ ఫ్రెండ్ అంటే నీలోని బలహీనత లనూ, బలాలనూ సమానంగా స్వీకరించి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా అన్నింటినీ స్వీకరించేవాడు. నీకు మానసికమైన తోడు. అలాంటి నీ స్నేహితులను ఓడించాల్సిన లేదా గెలవాల్సిన అవసరం ఎందుకొస్తుంది. కాస్త ఆలోచించు" అంటూ వాడికి కౌన్సెలింగ్ చేశా. అలాగే పతంజలి రాసిన "గెలుపుసరే బతకడం ఎలా?" పుస్తకాన్నీ, మరికొన్ని రావిశాస్త్రిగారి పుస్తకాల్నీ ఇచ్చా. అంతే... అవి చదివాక వ్యక్తిత్వ వికాసం అంటే లోకజ్ఞానం కలిగి ఉండటమనీ, అసలు లోకజ్ఞానం ఏమిటో తెలిసి ఇప్పుడు తన సొంత వ్యక్తిగత వ్యక్తిత్వంతో బతికేస్తున్నాడు వాడు.
కనీసం ఈ విషయంలోనైనా రాంబాబుగాడి రెట'మత మార్పిడి' కొద్దిగానైనా సాధ్యమై నందుకు నేను ఇతోధికంగా ఆనందించా. శతాధికంగా వాణ్ణి అభినందించా.
*సమాప్తం*
*సండే స్టోరీ*
*మెడికల్ రిపోర్ట్స్*
📝
రచన: నండూరి సుబ్బారావు
అదే అమ్మడూ. ఇక నీ మాంగల్యాన్ని ఎలా కాపాడుకుంటావో. పైన భగవంతుడున్నాడు. క్రింద నీవున్నావు. మధ్య బావున్నాడు" అని హైడ్రోజన్ బాంబు లాంటిది చెల్లెలు నళిని చెవిలో వేసి లేచి నిలబడ్డాడు వీర వెంకట వరప్రసాదు... వెళ్తూ వెళ్తూ ఒక క్వార్టరు బాటిల్ జేబులో పెట్టుకుని రెండు క్వార్టర్సు చేతి సంచిలో వేసుకుని తూలుతూ తూలుతూ తన ఊరు వెళ్ళిపోయాడు.
వార్త విన్న నళిని కరెంటు షాకు తిన్నట్టు నవనాడులూ బిగదీసుకుపోయి ఎలాగోలా లోపలికి పోయి గంగానమ్మకు చద్ది నైవేద్యం పెడతానని మొక్కుకుంది. నిగనిగలాడు తున్న తన కురులలో నుంచి రెండు వెంట్రుకలు కత్తిరించి తీసి వెంకటేశ్వరస్వామి కి ఎడ్వాన్సుగా యిచ్చి భర్త ఆరోగ్యం సరిగా ఉంటే మిగతా జుట్టు కొండకొచ్చి సమర్పించు కుంటానని ప్రామిస్ చేసింది.
ఈ రోజు తన భర్త సుబ్బారావు బర్త్ డే కూడాను. "హాపీ బర్త్ డే టు యూ" అని స్వాగతం చెపుతుందని పాపం కలలుగన్న సుబ్బారావుకు నిరాశే ఎదురయింది. 'ఏమోలే పిండివంటలు చేయటంలో మరచి పోయి ఉంటుం'దని సరిపుచ్చుకున్నాడు సుబ్బారావు. ఆఫీసు పని ఎక్కువయి మధ్యాహ్నం ఒంటిగంట దాటి నీరసంగా అడుగులో అడుగువేసుకుంటూ, చెమటలు కక్కుకుంటూ యింటికి వచ్చాడు. బర్త్ డే స్పెషల్సు - పిండి వంటలను తలచుకుంటూ లోలోపల గుటకలు మింగుతున్నాడు, నళిని వంట ఇంట్లోనే ఉంది.
“ఏమోయి ఇవాళ శాకపాకాలేమిటి?" అంటూ కూనిరాగంలా, ఉత్సాహంగా అడిగాడు, ఏమేం పిండివంటలు చేసిందో తెలుసుకునేందుకు. నళిని పమిట చెంగుతో ముక్కుతుడుచుకుని “గోధుమఅన్నం-కాకర కాయ కూర” అని చెబుతూ "ముందు ఇది తాగండి" అంటూ గిన్నెలో ఉన్నవి ముందుకు పెట్టింది.
“ఏమిటివి? కొబ్బరి నీళ్లా”?
"కాదు. మెంతుల కషాయం" అని చెప్తూనే ముఖం చాటు చేసుకుంది. సుబ్బారావు నవ్వుకుని “ఏమిటిది పుట్టినరోజు సరసమా?" అన్నాడు.
"ఇక నా బతుక్కి సరసాలే మిగిలాయి. భగవంతుడు దయ తలచి మీ ఆరోగ్యం కుదుటపడితే ముందు ముందు మీక్కావల సినవన్నీ చేసిపెడతా, అంతవరకూ మీకు గోధుమ అన్నం కాకరకాయ కూడా తప్పదు" అంది విచార వదనంతో.
"అదేమిటే ఇవాళ ఇలా తలపెట్టావూ? నాకు కాకరకాయ అసలు సహించదని నీకు తెలుసు. దానికి తోడు మెంతి కషాయం అనుపానమా? గోధుమ అన్నం ఏమిటి రోగిష్టి వాడికి పెట్టినట్లు? ఎంచక్కా బంగాళ దుంపల వేపుడు, గడ్డపెరుగు, ఆవకాయ, మామిడి పండు వేసి అన్నం పెడతావని నేనొస్తే" అన్నాడు అర్ధోక్తిగా.
"ఇక ఆ పప్పులేం ఉడకవు. నా మంగళ సూత్రం బాగుండాలంటే ఇక నుంచీ నేను పెట్టినట్లే తినాలి. మామిడి పళ్లూ, అరటి పళ్లూ, స్వీట్లూ అసలు ముట్టుకోకూడదు. గడ్డపెరుగులూ, మీగడలు కలలో కూడా తలపెట్టకూడదుట".
"ఎందుకని? ఎవరు చెప్పారు నీకు"? డీలా ముఖంతో అడిగాడు సుబ్బారావు.
“ఎవరు చెపితే ఏం? డాక్టరుగారే చెప్పారు. సరేనా. మధుమేహం - అంటే షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఇవేవీ దగ్గరకు రానీకూడదట. షుగర్ ఎక్కువయి గుండె ఆగిపోతుందిట. పక్షవాతం వస్తుందట. అవునూ, మీ ఆఫీసు లో ఎవరికో షుగర్ ఎక్కువై కాళ్లు మోకాళ్ల వరకూ కత్తిరించేశారట నిజమేనా?" భయం భయంగా అడిగింది.
సుబ్బారావు కుప్పకూలిపోయాడు. పెళ్లాం పనులు మొదట 'సరసం' అనుకున్నాడు కాని ఇప్పుడు ఇదంతా 'విరస' మే అని నిర్ధారణ చేసుకున్నాడు.
"ఎవడు చెప్పాడే ఈ సపోటా కబుర్లు, అంతా అబద్ధం, నాకేమిటి షుగర్ వ్యాధి ఏమిటి? పిడిరాయిలా నేనుంటే... చాలు చాలు గాని పుట్టిన రోజునాడు ఏడిపించక అన్నీ వడ్డించు" అని ఆజ్ఞలు జారీ చేశాడు.
నళినికి మళ్లీ అన్నగారి మాటలు జ్ఞాపకం వచ్చాయి.
"అతను ఎంత గింజుకుని పెట్టమన్నా పెట్టకు. మంగళ సూత్రం జాగ్రత్త" అన్న మాటలు.
ఒక్కసారి మంగళ సూత్రాలు కళ్ళకద్దుకుని "మీరు నన్ను చంపినా సరే నేను పెట్టను గాక పెట్టను. అంతేకాదు ఇకపై దుంపకూరలు, వంకాయకూర, బెండకాయ, చిక్కుడుకాయ, గుమ్మడికాయ, పనసకాయ లాంటివి కూడా ఏమీ ఇంటికి తీసుకురావద్దు” అని గట్టిగా చెప్పింది.
ఈ చెప్పిన వన్నీ సుబ్బారావుకు చాలా ఇష్టమయినవే. పులుసులో చిలగడదుంప ముక్కలంటే ప్రాణం లేచొస్తుంది. అన్నిటికీ బ్యాన్ పెడితే ఇక తను తిని చచ్చేదేముంది. సుబ్బారావు హతాశుడైపోయాడు.
"అవునూ. నెయ్యి, పెరుగు మీగడ నాకిష్టమని నీకు తెలుసు కదా” ఇంకా వాక్యం పూర్తి కాలేదు. నళిని అడ్డుపడి "అవన్నీ వద్దని చెప్పానా? అవి కొలస్ట్రాల్ పెంచుతాయట. ఆవకాయ, మాగాయ, ఉప్పుకారం బి.పి. పెంచుతాయట. ఇవేమీ వద్దుట. కావాలంటే తోటకూర ఉడకపెట్టి ఉప్పు వేయకుండా పెట్టమన్నారు. పెడతాను తినండి" అని చెప్పేసింది మంగళసూత్రాన్ని మనసులో పెట్టుకుని.
సుబ్బారావుకు ఒళ్లు మండిపోయింది. "అయితే - ఒక పని చెయ్యి. చిటికెడు విషం ఉంటే అందులో వెయ్యి. నా పీడా నీ పీడా వదిలిపోతుంది" అంటూ బొబ్బలుపెట్టాడు. ఏమయినా సరే నళిని మెట్టు కూడా దిగకుండా, ఇంకో మెట్టు కూడా పైకెక్కి ఆర్డర్లు జారీ చేసింది" ఇవేవీ ఇంకతను పెట్ట"నని.
📖
వారం రోజులు గడిచాయి. దబ్బపండులా ఉండే సుబ్బారావు పాపం నిమ్మపిందె లాగా అయిపోయాడు. ఎంత బతిమిలాడినా నళిని వినడం లేదు. రోజూ భోజనం దగ్గర రామరావణ యుద్ధమయిపోతోంది. “పోనీ ఆ చిక్కుడు కాయ గింజలు లేకుండా పై తొక్కలన్నా వెయ్యవే" అని బతిమిలాడుకున్నాడు.
"అమ్మో! వాతం చేస్తుంది. నా వల్ల కాదు. అయినా అన్నిటికీ అంత జిహ్వచాపల్యం ఏమిటి?.. లేకితనం చూస్తే నలుగురూ నవ్వుతారు. ఏదో తిన్నన్ని రోజులు తిన్నారు. ఇక ఈ జన్మలో వాటికి నీళ్లొదులుకోండి. ఏదోలా బ్రతకడం అలవాటు చేసుకోండి" అని వేదాంత ధోరణిలో మందలించింది.
సుబ్బారావుకి ఒకపక్క కోపం ఎక్కువయింది "బతికినన్నాళ్లు బ్రతికాగా ఇక ఇప్పుడు చంపెయ్యరాదూ ... ఈ దిక్కుమాలిన బ్రతుకు బతక్కపోతే ఎవడేడిచాడు. ఛస్తేనే మంచిది” అని విసుక్కున్నాడు నిరాశతో.
మరి నాలుగు రోజులు గడిచాయి. సుబ్బారావు కాకరకూరను కళ్లు మూసుకుని నోట్లో వేసుకుని చెంబెడు నీళ్లు గుటుక్కున తాగుతున్నాడు. నడిచే ఓపిక లేక కర్ర చేతికి వచ్చింది. ఏమయితేనేం తన మంగళ సూత్రం బాగుంటోందని నళిని సంతోషపడి పోతోంది. అనకూడదు గాని పిల్లికి చెలగాటం - ఎలక్కి ప్రాణసంకటంలా ఉంది పాపం సుబ్బారావు పరిస్థితి.
మరో వారం గడిచింది. ఒక రోజున సుబ్బారావు పడక కుర్చీలో కళ్లుమూసుకుని పడుకుంటే మెట్ల దగ్గర ఏదో పెద్ద మూలుగు వినిపించింది. క్రమంగా మూలుగు తనకు దగ్గరవుతోంది. ఏ పందికొక్కో, లేచి కొడదామనుకుంటే అతనికి 'లేచే ఓపిక లేదు. ఆ మూలుగు క్రమంగా దగ్గిరయి దగ్గిరయి హాల్లోకి చేరుకుంది. తీరా చూస్తే తన మామగారు పరంధామయ్య గారు జంపకానా పరుపు చుట్ట భుజాన వేసుకుని, చంకలో సంచీతో (సిమెంటు సంచీలో బట్టలు కుక్కి) మరో చంకలో గొడుగుతో మూలుగుతూ ప్రత్యక్షమయ్యారు. సుబ్బారావు ఓపిక తెచ్చుకుని కుర్చీలోంచి లేచి మామగారి చేతిలో లగేజీ అందుకుని "ఏమేవ్ ఎవరొచ్చారో చూడు"అని దొడ్లో ఉన్న భార్య నుద్దేశించి నీరసంగా కేకేశాడు.
నళిని అతిధి మర్యాదలన్నీ చేసి " నీవంట్లో ఎలా ఉంది నాన్నా? అంతా బాగున్నారా" అని కుశల ప్రశ్నలు వేసింది.
పరంధామయ్య తాత్కాలికంగా మూలుగు ఆపి "ఏం కులాసా తల్లీ. నా ఆరోగ్యమే ఏమీ బాగుండటం లేదు. ఇక్కడ డాక్టరుకు చూపిద్దామని వచ్చా ... బలానికి డాక్టరు పళ్లూ పాలూ, తినమంటే రోజూ చక్రకేళీలూ, పంచదార బాగా వేసి బాగా పాలూ, ఆరగా ఆరగా తింటూనే ఉన్నా. ఏమీ తగ్గి చావటం లేదు. అది సరే గాని అమ్మా! నీ ఆరోగ్యం బాగుంటోందా. 'నీకున్న షుగర్ వ్యాధి కంట్రోల్లోకి వచ్చిందా?" అని అడిగాడు.
నళిని తెల్లబోయి "అదేమిటి నాన్నా? నాకు షుగర్ వ్యాదేమిటి? ఆ షుగర్ మీ అల్లుడు గారికి” అని చెప్పింది.
దాంతో పరంధామయ్య చివ్వున లేచి "నీ బొందా నా బొందాను. అల్లుడి గారికి కాదు, నీకే! డాక్టరు రిపోర్టు తారుమారు చేయకు" అన్నాడు బల్ల గుద్ది మరీ చెపుతూ.
కుర్చీలో కూర్చున సుబ్బారావుకు ఎక్కడ లేని ఓపికా వచ్చి చివాల్న లేచి “చూశారా చూశారా తనకి షుగర్ వ్యాధి పెట్టుకుని నా ప్రాణం తీసి, నన్ను నిలువునా కాల్చుకు తింటోంది" అని ఎగిరిపడ్డాడు.
“లేదు నాయనా. ఇన్నేళ్లొచ్చి నీతో ఇలా అబద్దమాడతానా. షుగర్ వ్యాధి దానికే ఉందనీ, గోధుమ అన్నం, కాకరకాయ కూరా బాగా తినమనీ దానికే, నీరసానికి పళ్లూ పాలూ బాగా వాడమనీ నాకు డాక్టర్ స్వయంగా చెప్తేనే' అని గట్టిగా అనేసరికి సుబ్బారావు సంతోషం పట్టలేక కెవ్వున అరిచాడు. నళిని అరిచింది కెవ్వున, కానీ సంతోషంతో కాదు భయంతో విచారంలో.
ఆరోజు నుంచీ పరిస్థితులు మారిపోయాయి. గోధుమ అన్నం, కాకరకాయ కూర నళినికి ట్రాన్స్ ఫర్ అయ్యాయి. సుబ్బారావు మాత్రం అన్నీ తింటున్నాడు. ఆ తర్వాత వారం రోజులయ్యేసరికి సుబ్బారావు బాగా కోలుకున్నాడు గాని, నళిని మాత్రం మంచం దిగలేకపోతోంది. బాగా నీరసించిపోయింది. మామగారికి పూట వారీ పళ్లూ, పాలూ, జీడిపప్పు, కిస్మిస్, బలానికి మందులూ తేలేక సుబ్బారావు అవస్థపడిపోతున్నాడు.
📖
ఇలా కొద్ది రోజులు గడిచాయి. రాను రాను సుబ్బారావుకు ఈ ఇల్లు నరకప్రాయమైంది. ఇంట్లో హమేశా రెండు మంచాలు విడవ కుండా నట్టింట వున్నాయి. ఒక మంచం మీద కాళ్లూ, చేతులూ లేపే శక్తి లేక వెల్లికిలా, శవాకారంలా పడివున్న నళిని, రెండో మంచం మీద అంపశయ్య మీద పడుకున్న భీష్ముల వారిలా మామగారూ. వీళ్లకు వండి పెట్టలేక, మందులు తీసుకు రాలేక తన చావు దగ్గరకొస్తోంది. ఇంతకంటే గోధుమ అన్నం, కాకరకూరే నయమేమో అనుకున్నాడు సుబ్బారావు.
"ఏవండీ. ఒక్కసారి నన్ను బాత్రూమ్ కి
తీసుకెళ్తారూ?" అని నళిని.
"అల్లుడూ, నన్ను కొంచెం వత్తికించి పడుకోబెట్టు. పడుకొని పడుకుని పక్కలు పీక్కుపోతున్నాయి" అని మామగారు. ఇలా ఇద్దరూ వంతుల వారీగా పిలిచి ప్రాణాలు కొరుక్కుతింటున్నారు సుబ్బారావుని.
"ఈ ముసిలాడు ఇక్కడికెందుకొచ్చినట్టు నా ప్రాణం తీయడానికి కాకపోతే. డబ్బుకు డబ్బు బోలెడయిపోతోంది. నా ప్రాణానికి సుఖం లేకుండాపోతోంది. చాకిరీ చెయ్యలేక" అంటూ సుబ్బారావు గుడ్ల నీళ్లు గుడ్డను కుక్కుకుంటున్నాడు.
శనివారం. దుర్ముహూర్తం. నళిని, పరంధామయ్య ఇద్దరూ పంతం పట్టినట్లు ఒకళ్లు విడచి ఒకళ్లు ఆర్తనాదాలు మొదలు పెట్టారు.
నళిని మంచానికి అతుక్కుపోయింది. పరంధామయ్య గుడ్లు తేలవేస్తున్నాడు. సుబ్బారావుకి భయమేసింది. మాసిపోయిన పాంటు షర్టు అని ఆలోచించకుండా ఫామిలీ డాక్టర్ దగ్గరకి పరిగెట్టాడు. పాపం డాక్టరు గారు ఏకళనున్నాడో, జపం కూడా చేసుకో కుండా గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తిలా పరిగెత్తుకొచ్చాడు. తీరా వచ్చి చూస్తే ఏముంది?! ప్రాణాలు పోయినంత పనయి తండ్రీ కూతుళ్లు చెరో మంచం మీదా పడున్నారు.
డాక్టరుగారికి తను ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ జ్ఞాపకం వచ్చినాయి. ఎందుకాయినా మంచిదని ఆ రిపోర్టులు మళ్ళీ ఒకసారి ఇవ్వమన్నారు. పరంధామయ్య తన సిమెంటు సంచీ లోంచి వాటిని బయటికి తీసి ఇచ్చాడు. వాటిని చూచి డాక్టర్ ఒక్కగావు కేక పెట్టి "ఆవిడకు షుగర్ వ్యాధనీ, మిమ్మల్ని పళ్లూ, పంచదారా తినమని ఎవరు చెప్పారు?" అని అరిచాడు.
"మా అబ్బాయి వీర వెంకట వరప్రసాదు" అని పరంధామయ్య చెప్పాడు.
"చంపారు పొండి. చక్కెర వ్యాధి ఆవిడకు కాదు మహానుభావా, ఈ పరంధామయ్య గారికి, అందుకని గోధుమ అన్నం, కాకర కాయ ఈయన తినాలి. మిస్టర్ సుబ్బారావ్! నళినికి ఇప్పుడు నాలుగో మాసం. మీరు తండ్రి కాబోతున్నారు. అందుకని పళ్లూ పాలూ వంటి బలకరమైన ఆహారం తినమని చెప్తే, ఈయన పళ్లూ పాలూ మెక్కి, ఆవిడకు గోధుమ అన్నం, కాకరకాయ కూర పెట్టి ఆవిడ ప్రాణం తీయబోయాడు. మెడికల్ రిపోర్ట్స్ తారుమారయ్యాయి. ఇలా ఇంకో రోజుంటే ఇద్దరి ప్రాణాలు దక్కేవి కావు. ఏమైతేనేం. అదృష్టవంతులు' అన్నాడు.
“మరి మావాడు అలా చెప్పి చచ్చాడే!" అన్నాడు పరంధామయ్య.
"తాగుబోతు వెధవ. వాడి మాటలకు విలువేమిటి? అది సరే ఇప్పుడేం చేద్దాం" అన్నాడు సుబ్బారావు.
“ఏముందీ? ముందావిడకి పళ్లూ పాలూ ఇవ్వండి. ఇంతవరకూ పళ్లూ, పాలూ ఆరగించిన మీ మామగారిని ఒక లాగుడు బండి మీద వేసి హాస్పిటల్ కి పంపండి. తిన్నవన్నీ ముందు కక్కించాలి" అన్నారు డాక్టర్ గారు.
సుబ్బారావుకు ఆలోచన వచ్చింది. 'పోనీ మావగారిని శీర్షాసనం వేయించి వీపు మీద బాదితే.. తిన్నవన్నీ బయటకి వస్తాయేమో కదా' అనుకున్నాడు వచ్చే కోపాన్ని బలవంతాన అణగదొక్కుతూ. కాని పాపం పైకి మాత్రం అనలేకపోయాడు.
No comments:
Post a Comment