*భైరవవాక -1*
🔱
అర్ధరాత్రి!
చుట్టూ కటిక చీకటి.
శీతాకాలపు చలి మనిషిని నిలువునా ఒణికించేస్తోంది. నిర్మానుష్యమైన ఆ అర్ధరాత్రి రోడ్లన్నీ వచ్చే పోయే వాహనాలతో అప్పుడప్పుడూ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తున్నాయి.
మనిషిని నిలువునా చీల్చేయడానికి కూడా వెనుకాడని కిరాయి హంతకులు........ తమ అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి అల్లకల్లోలం సృష్టించగల నాయకులు.... వీధి రౌడీల దగ్గర నుంచి అంతర్జాతీయ స్థాయిలో నేరాలు ఘోరాలు చేసి దర్జాగా తిరిగే ఎందరో నేర ప్రవృత్తి గల నరరూప రాక్షసుల స్థావరం ఆ మహానగరం.
అలాంటి ... ముంబాయ్ మహానగరంలో
అంధేరీ ప్రాంతం అది. కింగ్ సర్కిల్ సెంటర్ కి ఆమడ దూరంలో ఉన్న పదంతస్థుల అపార్ట్ మెంట్ చివరి ప్లాటులో ఆరుగురు ఆగంతకులు ఆశీనులై ఉన్నారు. ఆ ప్లాటులో అదే పెద్ద హాలు. హాలు ప్రక్కనే ఆగ్నేయంలో వంటగది, నైరుతిలోనూ, వాయవ్యంలోనూ రెండు బెడ్ రూమ్ లు ఉన్నాయి. ఉత్తరాన ముఖద్వారం ఉంది. హాలుకు ఆనుకొని ఉన్న తలుపులు అన్ని మూసి ఉన్నాయి.
అరక్షణం వారి మధ్య మౌనం రాజ్యమేలింది.
మద్యం గ్లాసులు ముందున్నా మదిలో చెక్కు చెదరని దీర్ఘాలోచనలతో అందరూ శిలల్లా కూర్చున్నారు. ఏదో కోరికతో తపస్సులో కూర్చున్న మునుల్లా ఉన్నారు.
అందరి ముందూ ఠీవిగా కూర్చున్న వ్యక్తి ముందుగా గొంతుసవరించుకున్నాడు.
"ఆరు నెలల లోపల మనం ఈ పని పూర్తి చేయాలి. మనకి తోడుగా మనకెవరికీ పరిచయం లేని .... మన గురించెవరికీ ఆచూకి చెప్పలేని.... కిరాయి గూండాలని ఆ సమయం లో తోడుగా తీసుకు వెళ్దాం. ఏమంటారు?!" అన్నాడు.
ఎవరూ మాట్లాడలేదు. అందుకు సమాధానంగా తలలూపారు. ఆ ఆరుగురిలో ఒకే ఒక్క స్త్రీ ఉంది. ఆమె లేచి నిలబడింది. ఆమెని ఎన్నో సంశయాలు.. సందేహాలు.. వెంటాడుతుండగా "నేనిప్పుడేం చేయాలి?" స్థిర నిర్ణయంతో అంది. తనడిగిన ప్రశ్న తనకే ప్రశ్నార్ధకంగా అనిపించినా
.... తనలో రేగే ఎన్నో అనుమానాలకు సమాధానం వెతుక్కుంటూ అంది.
"నువ్వీక్షణం నుంచే కార్యరంగంలో దిగాలి. నువ్వక్కడ మారువేషంలో ఈ ఆర్నెళ్లూ గడపాలి. నీతోపాటే మన మనిషి మరొకరు అక్కడే ఉంటారు. మీరిద్దరూ మన పని నిర్విఘ్నంగా సాగడానికి పధకరచన చేయాలి.” చెప్పాడతను.
"అంటే...?" కుతూహలంగా అంది ఆమె.
"మనమందరం ఎప్పుడు? ఎక్కడ? ఎలా కలవాలి? మన పని పూర్తయ్యాక ఎలా తప్పించుకోవాలి అన్న ప్రధాన పధకం సిద్ధం చేయాల్సింది మీరిద్దరే. మనలో ఏ ఒక్కరికి ఎలాంటి ప్రమాదం ఎదురు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి." ఆ ఆరుగురిలో నాయకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి అన్నాడు.
ఆమె మౌనంగా వింది.
"ఈ ప్రయత్నంలో మీ దారికెవరు అడొచ్చినా ఆలోచించకండి. వెంటనే మట్టుపెట్టండి. మన పధకం నెరవేరాలి. మనం తప్పక విజయం సాధించాలి" వేరొకవ్యక్తి లేచి నిలబడి చెప్పాడు.
"మీతో కలవాలన్నా .. మాట్లాడాలన్నా ఎలా?" మళ్ళా ఆమె లీడర్ అంది.
" మీరు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడానికి... మీకు అక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ నేనే దగ్గరుండి చూస్తాను. మనం ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం మీరిద్దరూ బయలుదేరండి. ఏ ఒక్కరికీ ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించండి. ఈ ఆర్నెల్లలో మిమ్మల్నప్పు డప్పుడూ నేను కలుస్తూనే ఉంటాను. అవసరం అయితేనే సెల్ ఫోన్లు ఉపయోగించండిసరేనా?" మాట్లాడుతూనే అతను ఒక్కసారి గతుక్కుమన్నాడు.
ఎవరో తమని గమనిస్తున్నారు. ఆ అపార్ట్మెంట్ లో..హాలుకు ఆగ్నేయంలో ఉన్న వంటగది తలుపు పక్కన ఎవరో నిలబడి ఉన్నారు.
"ఎవరై ఉంటారు . . .?"
తమ పధకం ప్రకారం 'ఆంధ్రా' లో పని పూర్తి కాగానే అందరూ ఇక్కడ... ఈ ముంబాయిలో కలసుకోవడం కోసం తీసుకున్న ఆపార్ట్మెంట్ ఇది. ఏ ఒక్కరికీ అనుమానం రాకుండా ఉండడానికి ఈ అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి కాపురం ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసాడు. అతనికి తమ పథకం తెలియకూడదని అరగంట ముందే పని పురమాయించి బైటకు పంపేసాడు తను.
అతనూ ఓ మోస్తరు నేరస్తుడే. పొట్ట కూటికి చిన్నా చితక దొంగతనాలు చేసుకు బ్రతికే మనిషి, ఎవరూ లేని ఏకాకి. కొంపదీసి అతను కాదు కదా!?! తామంతా ఎందుకు ఇక్కడ ఇలా కలిసామో ఆరా తీస్తున్నాడా?!
అర్ధగంట నుంచీ తాము మాట్లాడుకుంటున్న మాటలన్నీ పొంచి వింటున్నాడా? అతను అంతర్జాతీయ స్థాయిలో తాము చేపట్టబోతున్న నేరాన్ని పసిగట్టేసాడా?!'
ఆ ఆలోచన కలగడంతోనే అతనికి ఒక్కసారిగా ముచ్చెమటలు పోసాయి.
'కోట్ల రూపాయల విలువచేసే తమ బృహత్తర పధకాన్ని తెలుసుకున్నాడా?!' ఆ వూహ అతని మదిలో మెదిలేసరికి కోపం తారాస్థాయిని అందుకుంది.
ఆ గదికేసి తిరిగి" ఎవరది?! ఇలా రండి!" బిగ్గరగా... కర్కశంగా అరిచాడు.
అతని గొంతు తీవ్రతకి అక్కడున్న వారితోపాటు గదికి ఆవల తలుపు ప్రక్కన నిలబడ్డ వ్యక్తి గజగజవణికి పోయింది, తనని గమనించి తనకేసి అతి భయంకరంగా చూస్తూ రమ్మని పిలుస్తున్నట్టు గ్రహించి భయంతో వణికి పోయిందామె.
తననే పిలుస్తున్నాడని గ్రహించి గబాల్న వారి ముందుకొచ్చి నిలబడింది.
ఆమె చేతిలో పళ్లు, ఫలహారాలతో నిండివున్న 'ట్రే' ఉంది. తనూహించుకున్నట్టు జరగలేదు. అతను కాదు.' తన పిచ్చిగాని బయటకు వెళ్ళిన వ్యక్తి ఇక్కడ ఎలా ఉంటాడు?
అయితే, ఈమె ఎవరు?!
తామంతా అరగంటయి ఈ అపార్ట్మెంట్ లో ఉండగా ఈమెని చూడలేదు.
అతను పనిమీద బైటకు వెళ్తూ సోడాలు, నీళ్లు, డ్రింకులు, మందు సర్వే చేసి వెళ్ళాడేగాని 'ఈమె' తనతో పాటు ఇక్కడే ఉన్న విషయం మాట మాత్రం చెప్పలేదు.
"ఎవర్నువ్వు?" అతను ఇంకా ఏదో అడిగేలో గానే పళ్ళూ, ఫలహారాల 'ట్రే' బల్లమీద ఉంచేసి ఛటుక్కున వంటగది పక్కనే ఉన్న వరండాలోకి పరుగున వెళ్ళిపోయిందామె.
అక్కడున్న అందరికీ నోటమాట రాలేదు. బైటకు వెళ్ళిన వ్యక్తి వచ్చేలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి? అనుమానం లేదు. ఈమె తమ గురించి సర్వం తెలుసుకుంది. అందుకే భయపడి పారిపోయింది.
ఇప్పుడెలా?! ఈమెనిలా వదిలేస్తే విషయం విషమౌతుంది. ఈమె నుంచి అతనికి చేరుతుంది అలా ... అలా ... ?! నో! నెవ్వర్!
ఆ ఆరుగురిలోనూ అదే ఆలోచన.... అదే ఆందోళన ...!
🔱
*సశేషం*
****
*భైరవవాక - 2*
🔱
ఆ ఆరుగురిలోనూ అదే ఆలోచన.... అదే ఆందోళన ...!
టీమ్ లీడర్ స్థిర చిత్తంతో లేచి నిలబడ్డాడు. అందరిలోకీ ముందుగా తేరుకున్న వ్యక్తి అతనే. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళాడు.
వరండాలో నిలబడి ఎత్తైన పదంతస్థుల భవనం లో నుంచి నగరం అందచందాలు తిలకిస్తూ నిలబడిందామె.
దేదీప్యమైన కాంతులతో ముంబాయ్ మహానగరం కళకళలాడుతోంది. రోడ్ల మీద తూనీగల్లా తిరుగుతున్న వాహనాల హెడ్ లైట్ వెలుగులు పోటీ పడి పరిగెడుతున్న ట్టున్నాయి. ఎత్తైన భవనాలు భీకర పోరాటానికి సిద్ధంగా ఉన్న ఆంబోతుల్లా ఉన్నాయి. నగరమంతా వెలిగిన వెలుగు మిలమిల మెరుస్తూ ఆరబోసిన నక్షత్రాల సముదాయంలా ఉంది.
అడుగుల సవ్వడి కాకుండా నెమ్మదిగా వెళ్ళి ఆమె వెనుకే నిలబడ్డాడతను. ఆమె భుజం మీద చెయ్యివేసాడు. ఉలిక్కిపడి వెనుదిరిగిందామె.
ఆమె కళ్ళల్లో బెదురు భయం స్పష్టంగా గోచరించాయతనికి. చిన్నగా ... పరిచయంగా నవ్వాడు.
ఆమె మనసు కొంచెం కుదుట పడ్డట్టయింది. రాని నవ్వు పెదవుల పైకి తెచ్చుకుంటూ కనీ కనిపించకుండా నవ్వింది.
అంతలోనే కర్తవ్యం అతన్ని రాక్షసుణ్ణి చేసింది.
పద్దెనిమిదేళ్ళు కూడా నిండా నిండని ఆమెని అమాంతం రెండు చేతులతో గండెలకు హత్తుకున్నట్టే ఎత్తుకొని ఎత్తైన భవనం పైనుంచి క్రిందకు పడేసాడు.
ఆ క్షణం అతను నరరూప రాక్షసుడే అయ్యాడు. క్షణంలో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ఆమెని ఏం చేస్తాడో తెలీక ఉత్సుకతతో అతని వెంటే వరండా దగ్గరకు చేరుకొని కొంచెం దూరంగా నిలబడి గమనిస్తున్న మిగతా వారంతా ఆ సంఘటన చూసి అవాక్కయ్యారు. అంతులేని ఆందోళనతో అదిరిపడ్డారు.
ఇప్పుడా వ్యక్తి బైట నుంచి వస్తే ఏం చెప్పాలి? అందరి వదనాల్లోనూ అదే ఆలోచన. అదే ఆందోళన.
అంతలోనే కాలింగ్ బెల్ మ్రోగింది.
అందరూ ఒకరి మొహాలోకరు చూసుకున్నారు. అందరికీ ఆందోళనగానే ఉంది. అంతుచిక్కని ఆలోచన చిత్రవధ చేస్తూనే ఉంది.
ఏం జరగబోతోందో ఎవరికీ అంతు చిక్కటం లేదు. నాయకుడే ముందుగా తేరుకొని తలుపులు తీసాడు.
అవతలి వ్యక్తి గదిలోకి అడుగుపెట్టాడు. అతని చేతిలో పీటర్ స్కాట్ ఫుల్ బాటిల్స్ ఉన్నాయి.
అందరూ ఆందోళనగా వరండాలో నిలబడి ఉండడం గమనించాడతను. బాటిల్స్ హాల్లో టేబుల్ మీదుంచి ఆత్రుతగా వారి దగ్గరకు చేరుకున్నాడు.
"ఏమైంది?!" ప్రశ్నించాడతను. ఏదో జరగరానిది జరిగిందని గ్రహించాడు.
"నీ ఇంట్లో ఉంటున్నామె పై నుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకుంది. వెనుక నుంచి తలుపులు బిడాయించి వస్తూ ఆ గ్రూపు లీడర్ చెప్పాడు.
"అబద్ధం” అప్రయత్నంగా అన్నాడతను.
"నేనే ఆమెని పైనుంచి తోసేసాను. ఇది నమ్ముతావా?" నిష్కర్షగా చెప్పాడు లీడర్.
ఆఁ !"అతనికి నోటమాట రాలేదు. భయం నెమ్మది నెమ్మదిగా అతని శరీరాన్ని ఆవహిస్తోంది.
'అతనికి తెలుసు ఈ ఆరుగురూ ప్రాణాలు తీయడానికైనా వెనుకాడని నరరూప రాక్షసులని. వీళ్ళందరికీ నాయకుడైన ఇతను తన కార్యం నెరవేరడం కోసం దేనికైనా తెగిస్తాడని తెలుసు. అయితే భుక్తి కరువై అతను కోరిన ప్రకారం తానీ అపార్ట్ మెంట్ లో కాపురం ఉండడానికి అంగీక రించాడు. దానికి ప్రతిఫలంగా పుష్కలంగా డబ్బు కూడా ఇచ్చాడు. అందుకే ఆనందంగా అంగీకరించాడు. అయితే, అన్నెం పున్నెం ఎరుగని అమాయకురాల్ని ఎందుకు చంపారు?!' ఆలోచనలతో అచేతనంగా నిలబడ్డాడతను. ఏం మాట్లాడితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో నని అతనికీ భయంగానే ఉంది. 'తప్పుగా ప్రవర్తిస్తే తన తల తీసేసినా తీసేస్తారీ దుండగలు'.
"ఏం? మా మాటలు నమ్మటం లేదా?" వారితో ఉన్న ఆమె అంది.
"మా మాటలు ... మా పధకం విన్న ఎవరైనా బ్రతికుండరని నీకు తెలుసు అవునా?" లీడరే నిలదీసాడు.
"అవునవును... కానీ...?" అతనికి ఏం చెప్పాలో పాలు పోలేదు.
"ఏఁవిటీ? పోలీసు భయమా?! అదేం జరక్కుండా నేను చూస్తాను. ప్రమాద వశాత్తు పడిపోయినట్టు అందర్నీ నమ్మిద్దాం. నీ పైన ఎలాంటి అనుమానం రాకుండా నేను చూస్తాను. సరేనా.... ?!" సముదాయిస్తున్నట్టే అన్నా 'హుకుం జారీ చేస్తున్నట్టే ఉంది నాయకుడి గొంతు.
"ని..జ..మే..! మీరుండగా నాకలాంటి భయమెందుకు? ఎవరూ లేని అనాధ పిల్లని నాకు తోడుగా ఉంటూ వంట పని... ఇంటిపని చేస్తుందని ఉండమన్నాను. అయితే, ఆ పిల్లకి మన మాటలు సరిగ్గా వినపడవు. గట్టిగా కేకేసి చెప్తేగాని ఏం అర్ధంకాదు. సరికదా, ఏం మాట్లాడలేదు కూడా" అతను బాధగా అన్నాడు.
"అర్ధంకాలేదు.” నిశ్చలంగా ... నిర్వికారంగా అన్నాడు గ్యాంగ్ లీడర్.
"ఆ అమ్మాయి మూగపిల్ల. చెవులు కూడా సరిగ్గా పనిచెయ్యవు". ఒకింత నిష్ఠూరం గానే అన్నాడతను. మీరందరూ కలిసి ఆ అమాయకురాల్ని పొట్టనబెట్టుకున్నారనే అర్థం ధ్వనించేలా ఉందతని గొంతు.
అతను చెప్పింది వినేసరికి ఆ ఆరుగురూ ఒక్క క్షణం అచేతనంగా నిలబడి పోయారు.
📖
చీకటి తెరలు ఆకాశాన్ని ముసురుకుంటు న్నాయి. చంద్రుని కిరణాలు దట్టంగా అలముకుంటున్న మబ్బుల్ని చీల్చడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. మంచు వెండి జరీలా అల్లుకుంటోంది. పిల్లగాలి నెమ్మదిగా
... హాయిగా శరీరాన్ని తాకుతోంది.
పాత్రో మనసుకు ఆనందంగా ఉంది.
ఎన్నాళ్ళయిందో కదా ఆంధ్రాలో అడుగు పెట్టి. ఎప్పటి మాట? ఎన్నేళ్ల జ్ఞాపకం! ఆంధ్రాలో ఆరు నెలలు కాపురం ఉన్నాడు. ఆ ఆర్నెల్లలో తేట తెలుగు తియ్యదనాన్ని.. కమ్మదనాన్ని ఆస్వాదించగలిగాడు. మధురమైన తెలుగు నుడికారాన్ని అంతో ఇంతో అర్థంచేసుకోగలిగాడేగాని నేర్చుకో లేకపోయాడు.
ఆ రోజుల్లో...
ఉద్యోగరీత్యా శ్రీకాకుళం ప్రాంతాల్లో గడిపినా అప్పుడప్పుడూ విహార యాత్రలా విశాఖపట్నంలో సుందర సముద్ర తీరం... అమోఘమైన పారిశ్రామిక వాడే కాకుండా అందమైన వైజాగ్ జిగిజాగ్ లని నలుమూలలా తిరిగి తిలకించాడు.
విజయనగరం భూపతుల కోటంతా మూల... మూల పరికించి ... పరిశీలించి చూడగలిగాడు. కైలాసగిరి, ఉడా పార్క్, తొట్ల కొండలోని బౌద్ధరామం ఇలా ఎన్నో చూసాడు.
విశాఖ ఉక్కు కర్మాగారం పనులు ఎలా సాగుతున్నాయో చూడ్డానికి పంపబడ్డ ప్రతినిధిలా రెండు రోజులు అటు అగనం పూడి నుంచి ఇటు భీమిలి ప్రాంతమంతా తిరిగి... తిరిగి...
అబ్బ ! ఆ అనుభవాలు... అనుభూతులు గుర్తొస్తేనే మధురంగా ఉన్నాయి. ఆ క్షణం గుర్తొచ్చేసరికి పాత్రో మనసు పులకించిపోయింది.
రాయపూర్ ఎక్స్ ప్రెస్ గున్న ఏనుగులా ఆయాసంతో రొప్పుతూ... అరుస్తూ... పరుగులెడుతోంది. కొండచిలువలా భారంగా మెలికలు తిరుగుతూ ముందుకు సాగుతోంది.
పాత్రో ఆలోచనలు ఆవిరిలా పైకెగసి పోయాయి.
ఏదో గుర్తొచ్చి కిందా మీదా జేబులన్నీ ఆత్రుతగా... ఆందోళనగా వెతుక్కున్నాడు.
వెనుక జేబులో భద్రంగా దాచుకున్న కాగితం బైటకు తీసాడు. అది అతని మిత్రుడు రాసిన ఉత్తరం. ఇప్పటి సెల్ ఫోన్ ల మూకుమ్మడి దాడిలో గుర్తుగా మిగిలిన తియ్యటి జ్ఞాపకం ఆ ఉత్తరం. ఆనందాన్ని పంచుకోవాలన్న... అనుభవాల్ని నెమరు వేసుకోవాలన్న... క్షణాలను అణాలతో గుణించే సెల్ ఫోన్ కి వీలవుతుందా? లేదుగాక లేదు!. ఉత్తరానికి ఉన్న ఉదాత్త గుణం దేనికీ లేదు.. రాదు. మనసు పులకించిన ప్రతిక్షణం ఎన్నిసార్లు చదివి చదివి చేతుల్లో నలిగి నలిగి, నీరసించినా ఉత్తరం నిత్యం సత్యమే. చదివిన ప్రతి క్షణం నవరస భరితంగా భావోద్విగ్నతలు పంచుతూనే ఉంటుంది. ఈ ఒక్క ఉత్తరం ఎన్ని ఏళ్ళయినా... ఎన్ని సార్లయినా... జ్ఞాపకం వచ్చిన ప్రతిక్షణం... చదివిన ప్రతి ఘడియ ... ఘడియకూ.... అందాన్ని... ఆనందాన్ని... అనుభూతుల్ని అందిస్తూనే ఉంటుంది. బ్రతుకు పుస్తకంలో చెరగని చిరునవ్వుల మిగిలివుంటుంది.
అందుకే అప్పటికి... ఇప్పటికి... ఎప్పటికి మా మధ్య ఉత్తరాలే ఊసుల్ని మోసుకొస్తుంటాయి.
మేమెళ్తున్న దివ్య క్షేత్రం హిల్ ప్రాంతం కావటం వలన సెల్ సిగ్నల్స్ నిల్. ఏదో ఒకటి రెండు సెల్ కంపెనీ వాళ్ళ సెల్స్ పనిచేస్తే చెయ్యొచ్చు అని ముందే చెప్పాడు విశ్వం.
'విశ్వం' పేరులాగే విశాల హృదయుడు విశ్వం.
విశ్వం ఎప్పుడు గుర్తొచ్చినా పాత్రో మనసు ఆనంద తాండవం చేస్తుంది. అప్పటికే నలిగి నీరసించి మంచాన పడి రోగిలా, ముడతలు పడి చిరగడానికి సిద్దంగా ఉన్న ఉత్తరాన్ని జాగ్రత్తగా విప్పాడు పాత్రో.
🔱
*సశేషం*
*భైరవవాక - 3*
🔱
ముడతలు పడి చిరగడానికి సిద్దంగా ఉన్న ఉత్తరాన్ని జాగ్రత్తగా విప్పాడు పాత్రో.
"డియర్ పాత్రో!
నువ్వు మళ్ళా ఆంధ్రాలో అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉంది. నీకు స్వాగతం పలకడానికి నేను ప్రస్థుతం ఆంధ్రాలో లేను. బీహార్ బోర్డర్ లో ఉంటున్నాను. నువ్వు అభిమానంతో రాసిన లేఖ ఇంట్లో వాళ్ళు శ్రీకాకుళం నుంచి నాకు భద్రంగా పంపారు.
నీతో పాటు తోడుగా రావటానికి మా ఇంట్లో ఆ మాత్రం పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరున్నారు చెప్పు?
అందుకే ఇందులో విపులంగా ఎలా వెళ్ళాల్సిందీ రాస్తున్నాను. జాగ్రత్త సుమీ!.
వాల్తేరు స్టేషన్ లో ఆగే ముందు మీకు ఓ చిన్న స్టేషన్ తగుల్తుంది. అక్కడ రాయపూర్ రైలు ఆపుతారు. ఏ ఎక్స్ ప్రెస్ అన్నా ఆపుతారు గాని, రెండు.... మూడు నిమిషాలకంటే ఎక్కువసేపు ఏ ట్రైను అక్కడ ఆగదు.
మీరు ఆ వ్యవధిలో ఆ స్టేషన్ లో దిగిపొండి.
అది చందన పురి రైల్వేస్టేషన్. కానీ, ఆ వూరు పేరు మాత్రం గోపాలపురం. అక్కడ నుండి మీరు చందన పురి వెళ్ళడానికి ప్రతి అయిదు నిమిషాలకి ఓ బస్సు ఉంటుంది.
చందన పురిలో దిగాక మీరు బైట ఎక్కడా ఉండకండి. దేవస్థానం సత్రాలు చాలా ఉంటాయి. ఓ గది అద్దెకు తీసుకోండి. అక్కడ్నుంచీ మీకు సహాయకారిగా ఉండడానికి నా ప్రాణ స్నేహితుడి అడ్రస్ క్రింద రాస్తున్నాను. అతడిని ఎలాగైనా కలుసుకో! ఇప్పుడు అతని సెల్ నెంబరు మారిపోయింది. ఈ మధ్య కాంటాక్ట్ లేడు.
అతను అదే ఊరులో బ్యాంక్ ఆఫీసర్ గా చాలాకాలం నుండి పనిచేస్తున్నాడు. నీ ప్రయాణం పూర్తయి ఇల్లు చేరాక నాకో చిన్న లేఖ రాయి. ఉంటాను.
నీ ప్రియమైన విశ్వం...
క్రింద అడ్రస్ విపులంగా రాసి ఉంది. పర్సు తీసి ఉత్తరాన్ని అందులో భద్రంగా దాచాడు ప్రాతో.
ఆ ఉత్తరం అంతా ఇంగ్లీషులోనే రాసిఉంది. వారిద్దరి మధ్య ఆంగ్లమే అనుబంధవారధి.
పాత్రోకి తెలుగు చదవటం ... రాయటం రాదు. అయితే, ఎవరైనా ఎలా మాట్లాడినా అర్ధం చేసుకోగలడు. కాని జవాబు చెప్పలేడు. శ్రీకాకుళంలో తను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో 'విశ్వం' తో పరిచయం అయింది. ఆ పరిచయం స్నేహమై తనకి ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల రుచి చూపించింది. విశ్వం గాని తనని విశాఖ... విజయనగరం ప్రాంతాలు తీసుకువెళ్ళి చూపించకపోతే అసలు తనకి ఆంధ్రా ప్రాంతంతో పరిచయమే ఉండేది కాదు.
కీకారణ్యం లాంటి శ్రీకాకుళం అడవి ప్రాంతాల్లో ఓ అడవిమృగంలా తనూ ఆ ఆర్నెళ్ళూ పడి ఉండాల్సి వచ్చేది.
విశ్వం పుణ్యమా అని తెలుగును కొంతైనా అర్ధం చేసుకోగలుగుతున్నాడు. ఇప్పుడు కూడా ఈ పుణ్యక్షేత్రం సందర్శించడానికి విశ్వం తోడుగా వచ్చివుంటే ఎంత బావుణ్ణు?
శ్రీకాకుళం వదిలేసి ఆరేళ్ళు అవుతోంది. ఈ ఆరేళ్లలో ఎన్ని మార్పులు... ఎన్ని చేర్పులు... ఎన్ని కూర్పులు.
అప్పుడు వంటరివాడు. ఇప్పుడు ఓ ఇంటి వాడయ్యాడు. పిల్లలు తోడయ్యారు. ఉమ్మడిగా సాగిన అన్నదమ్ములు ఎవరికి వారయ్యారు. చిన్నప్పటినుండి ఎంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా మెలిగిన అన్నదమ్ములు ఎవరికీ ఏమీ కానట్టు ఎవరికి వారు దూరం దూరంగా వెళ్ళిపోయారు.
విధి విచిత్రం. అంతేనేమో!
ఈ ఆరేళ్ళలోనూ మళ్ళా ఆంధ్రాలో అడుగు పెట్టే అవకాశంగాని.... అదృష్టంగాని కలుగలేదు.
విశ్వం మాత్రం ఓసారి రాయగడ మజ్జి గైరమ్మ గుడికి వచ్చి అలా మా ఊరు వచ్చాడు. ఒరిస్సా రాష్ట్రంలో వున్న ఓ మారుమూల పల్లె మా వూరు. అక్కడికి
దగ్గరలోనే ఉద్యోగం వెలగబెడుతున్నాడు తను. రాయగడలో అమ్మవారి దర్శనం కాగానే అక్కడ నుంచి వచ్చీరాని ఒరియా మాట్లాడుతూ ఎంతో ప్రయాసతో మా వూరు చేరాడు విశ్వం. తనే దగ్గరుండి నాల్రోజులు విశ్వంకి ఒరిస్సా అంతా చుట్టబెట్టి చూపించాడు. భువనేశ్వర్, కుర్దారోడ్, పూరీ, కోణార్క్ దేవాలయాలు సందర్శించాడు విశ్వం.
ప్రస్తుతం ఇద్దరం సంసారులం అయ్యాం, బాధ్యతలూ పెరిగాయి. పిల్లల చదువులు
... సమస్యలు మీదపడ్డాయి. తనిప్పుడు పెళ్ళయి ఇద్దరు పిల్లల తండ్రయ్యాడు.
📖
రైలు కుదుపులకు ఉలిక్కిపడి తేరుకున్నాడు పాత్రో!
కొత్తవలస రైల్వేస్టేషన్ లో ఆగింది రాయపూర్ ఎక్స్ప్రెప్రెన్. ఎంతసేపు ఆగిందో గాని ఆగి ఆగనట్టు ఆగి మళ్ళా స్పీడందుకుంది రైలు.
ఏదో ఆనకట్ట దాటుతోంది. రైలు కూతలో మార్పు స్పష్టమైంది కిటికీలో నుంచి బైటకు చూసాడు పాత్రో దూరంగా ...కనుచూపు మేరలో...
ఎత్తైన కొండల నడుమ ఏదో గుడి విద్యుద్దీప కాంతులతో తళతళ మెరుస్తోంది.
రైల్లో ఎదురుగా కూర్చున్నతని మాటలను బట్టి అదే తాము చేరాల్సిన గమ్యస్థానం అని పాత్రో గ్రహించాడు. చందన పురి శిఖరం అదేనని తెలిసి భక్తి పారవశ్యంతో కిటికీ ఊచలు పట్టుకొని పరీక్షగా బైటికి చూసాడు.
రైలు తన మానాన తాను పరిగెడుతోంది.
తమ గమ్యం చేరువవుతున్న కొద్ది రైలు గమనం మందగిస్తునట్లనిపిస్తోంది పాత్రోకి.
రెండు కొండల నడుమ కాలిబాట. పచ్చని చెట్ల మధ్యపరచిన తెల్లటి తీవాచీలా కనుచూపు మేరలో గోచరిస్తోంది గోపురం. చుట్టూ కటిక చీకటి వలన కాలిబాటకి ఇరు వైపుల ఉన్న దీపపుకాంతి పాలనురుగు ప్రవహిస్తున్నట్టూ ఉంది. కొండ చివర శంఖు చక్ర నామాలు రంగు రంగుల బల్బులతో చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఎత్తైన కొండకు దిగువున మధ్యలో చిన్న గోపురం కనిపిస్తోంది.
బంగారు రంగులో మెరుస్తున్న ఆంజనేయ స్వామి గోపురం బోర్లించిన శఠగోపంలా ఉంది.
పాత్రో ఆ దృశ్యం చూసాడు. కానీ, అతనికి అఁవేమిటో అర్ధంకాలేదు.
అందమైన ఆ దృశ్యం చందనపురి క్షేత్రానికి కాలిబాటన పోయేందుకు మెట్ల మార్గమని ఎదర సీట్లో కూర్చున్న ప్రయాణీకుల ద్వారా తెలుసుకున్న పాత్రో మనస్సు ఎంతో పులకించిపోయింది. అప్పటికే రైలు గోపాలపురం చేరుకుంది.
చందన పురి రైల్వే స్టేషన్ లో ఆగింది రైలు.
పోర్టర్ కేకలకి ... జనాల సందడికి ఇహాని కొచ్చాడు పాత్రో. అప్పటికే ఆత్రంగా ఎదురు చూస్తున్నారు పాత్రో కుటుంబ సభ్యులు. వాళ్ళకు ఎక్కడ దిగాలో ఏఁవిటో ఏఁవీ అర్ధంకావటం లేదు.
ఓ అర్ధగంట ముందు. 'మనం తరువాత వచ్చే స్టేషన్ లోనే దిగాలని' పాత్రో చెప్పాడందరికీ. ఆ స్టేషన్ ఇదేనా అన్న ఆతృత వాళ్ళందరి మొహాల్లోను ద్యోతకమవుతోంది.
గబగబా సామాన్లన్నీ లెక్కపెట్టాడు పాత్రో.
అందర్నీ ముందు దిగమని తను లోపలి నుంచి సామాన్లన్నీ అందించాడు. అప్పటికే గార్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.
ట్రైన్ నెమ్మది ... నెమ్మదిగా పట్టాల పైన స్పీడందుకుంటోంది. పాత్రో ఒక్క ఉదుటన రైలు పెట్టేలో నుంచి క్రిందకు గెంతాడు.
క్రింద పడాల్సిన పాత్రోని ఎవరో అమాంతం పట్టుకొని పడకుండా నిలబెట్టారు.
అందరూ ఒక దగ్గర నిలబడ్డారు. తన వాళ్ళందర్నీ పరికించి చూసాడు పాత్రో.
తండ్రి!
ముదుసలి సరిగ్గా నడువలేడు... ఏడీ?! లేడే!! ఏమయ్యాడు. ట్రైన్ లోనే ఉండిపోయాడా?! ఆ ఆలోచన మనసులో మెదిలేసరికి ఉలిక్కిపడ్డాడు పాత్రో, తండ్రి కోసం పరికించి చూసాడు.
ఓ మూల సిమ్మెంటు కుర్చీలో కాళ్ళు తేలేసి కూర్చున్నాడు పాత్రో తండ్రి.
తల్లి
తల్లి వంక చూసాడు. తల పండినా జవసత్వాలింకా వడలిపోలేదన్నట్లే నిటారుగా నిలబడి ఉంది. ఆమె మొహం లో ముసలితనం కనిపించినా ముసుగు మూలాన ఎవరూ ఆమెకి తనంతటి కొడుకు ఉన్నట్టు గ్రహించలేరు. సన్నగా, రివటలా చూపరులకు నాజూకుగా కనిపిస్తుంది.
భార్య!
ఓమూల నక్కి నిలబడింది. నున్నగా దువ్విన పాపిడి మధ్య సింధూరం, నుదుటన బొట్టు. ఆమె కూడా తలమీదు గా ముసుగు కప్పుకుని ఓరకంట చూస్తూ నిలబడింది. ఆమెలో ఒరియా వాళ్ళ సాంప్రదాయాలు కొట్టొచ్చినట్టూ కనిపిస్తున్నాయి.
పిల్లలిద్దర్నీ పనిపిల్ల ఆడిస్తోంది.
పనిపిల్ల!
ఆమె వైపు రెప్పవేయకుండా చూసాడు పాత్రో.
"బప్పా బప్పా!" పాత్రోని పట్టి కుదిపేస్తూ పిలిచాడు పాత్రో కొడుకు.
నాలుగేళ్ల కొడుకు ఎదో కొనమని మారాం చేసేసరికి పాత్రోకి పట్టరాని కోపం వచ్చింది.
"ఏమాత్రం పరిచయం లేని ఈ ప్రాంతంలో ఎలా నెట్టుకురావాలా' అని ఆలోచిస్తున్న పాత్రోకి చిరాగ్గానే కాదు బెరుకుగానూ ఉంది.
ఫ్లాట్ఫాం మీద జంగిడితో తినుబండారాలు అమ్ముకుంటూ తిరుగుతున్నాడో కుర్రాడు. ఆ జంగిడిలోని జిలేబి ఒకటి కొని కొడుక్కి, కూతురికి పంచి ఇచ్చాడు పాత్రో.
పాత్రో తల్లి సిమ్మెంటు కుర్చీ మీద కూలబడి ప్లాస్టిక్ సజ్జలో నుంచి కిళ్ళీ సరంజామా తీసి బైటపెట్టింది. గబగబా అయిదు జర్దా కిళ్ళీలు కట్టి భర్తకి, కొడుక్కి, కోడలికి అందించింది. పనిపిల్ల తన కిళ్ళీ తనే అడిగి తీసుకుంది.
పిల్లలిద్దరూ తమకీ కిళ్ళీలు కావాలని మారాం చేసారు. వాళ్ళకీ ఆకుల్లో వక్క మాత్రం వేసి కిళ్ళీల్లా చుట్టి అందించింది పాత్రో తల్లి.
అరగంటకి అరగంటకీ కిళ్లి నోట్లో పడందే వాళ్ళకి ఏపనీ తోచదు. ఇంటిల్లపాదీ కిళ్ళీలేందే ఉండలేరు. కాలు కదపలేరు.
సామన్లన్నీ సర్దుకొని బయల్దేరబోతున్న తరుణంలో హడావిడిగా ఓ ఆసామి వాళ్ళ దగ్గరకు వచ్చాడు.
"నమస్కారం సాబ్" ఒరియాలోనే పలకరించాడతను.
"నమస్తే!"
పాత్రో నమ్రతగానే అన్నా అతనెవరో అర్ధం గాక అయోమయంగా ఆ ఆసామి వైపు చూస్తుండిపోయాడు.
"తమరు యాత్రకే కదా సార్ వచ్చింది" అతనన్నాడు.
"ఆఁ !" పాత్రో సమాధానం వింటూనే పాత్రో తండ్రి వాళ్ళ దగ్గరకు చేరుకున్నాడు.
"నేను యాత్రకు వచ్చేవాళ్ళకు గైడ్ గా వ్యవహరిస్తుంటాను. ఇప్పటి నుంచి ఆఖరున మీరు ఇక్కడ రైలు ఎక్కిన వరకూ మీతోనే ఉంటాను. రోజంతా నా ఖర్చు కూడా మీరే భరించి చివరన మీకు తోచినంత పైకం ఇవ్వండి చాలు" అన్నాడు గైడ్.
ఒరియాలోనే అనర్గళంగా చెప్పాడతను.
పాత్రోకి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
తండ్రికేసి ప్రశ్నార్ధకంగా చూసాడు.
"నేను మీకు బరువుగా అన్పిస్తాననుకో కండి. మీతో పాటే... మీ కుటుంబసభ్యుడి గా కలిసిపోతాను. మీరేం తింటే నాకూ అదే పెట్టండి." చెప్పాడు గైడ్-
"అందుకోసం కాదు.!" నీళ్ళు నములుతూ అన్నాడు పాత్రో. పాత్రో తండ్రి మాత్రం వాళ్ళ సంభాషణ అంతా వింటున్నా సారాంశం అర్థం చేసుకోలేక పోతున్నాడు.
"నా వలన ఉపయోగం ఏఁవిటని ఆలోచిస్తున్నారా?!" మళ్ళా గైడే అన్నాడు.
"...." పాత్రో సమాధానం మౌనమే అయింది.
"మీరు ఇక్కడ్నుంచి నిశ్చింతగా ఉండొచ్చు. మిమ్మల్ని ఇక్కడ నుంచి క్షేత్రానికి తీసుకు వెళ్ళే భారం నాది. భాష మీకు సమస్య కాదు. ఎందుకంటే నాలా ఇలా ఒరియా అనర్గళంగా ఇక్కడున్న 'గైడ్' లెవరూ మాట్లాడలేరు. నేనూ ఒరియా దేశం నుండే ఇక్కడకు వలస వచ్చేసాను. మీకు ఏం కావాలన్నా ... మీరు ఏo కొనాలన్నా నేను వాళ్ళతో తెలుగులో మాట్లాడి ఆ సారాంశం మీకు ఒరియాలో వివరిస్తాను." అతను ఇంకా ఏదో చెప్పాలనే అనుకున్నాడు.
పాత్రోకి అప్పటికి గాని గైడ్ విలువ అర్ధం కాలేదు. విషయం అర్ధమయ్యాక మధ్య లోనే సంభాషణ ముగిస్తూ పాత్రో "పదండి మళ్ళా మనకి 'చందనపురికి' వెళ్ళడానికి బస్సులుంటాయో!! ఉండవో?!" మాట మారుస్తూ. అతన్ని తమ యాత్రకు మార్గ దర్శకుడిగా నిర్ణయం వ్యక్తపరుస్తూ అన్నాడు పాత్రో.
క్రింద ఉన్న ఓ సూట్ కేస్ గబాలున అందుకుంటూ గైడ్ మళ్ళా అన్నాడు ముందుకు దారి తీస్తూ.
"నా పేరు పాండే. మీరు సింపుల్ గా ఎలా పిలిచినా పలుకుతాను. 'గైడ్ గారూ' అన్నా పలుకుతాను. ఏమంటారు?!" చిన్నగా మందహాసం చేస్తూ అన్నాడు గైడ్.
"అలాగే! మీరీ బ్యాగ్ పట్టుకోండి. ఆ సూట్ కేస్ నాకు ఇచ్చేయండి" అని గైడ్ చేతిలో ఉన్న సూట్ కేస్ లాక్కుంటూ అతనికి తన బుజాన తగిలించిన బ్యాగ్ అందించాడు పాత్రో.
పాత్రో ఉద్దేశ్యం గ్రహించి పాండే మనసు లోనే నవ్వుకున్నాడు.
బహుశా అదే ఆ సూట్ కేస్ వాళ్ళ ప్రాణం అని అనుకున్నాడు గైడ్.
🔱
*సశేషం*
꧁☆
*భైరవవాక - 4*
🔱
బహుశా అదే ఆ సూట్ కేస్ వాళ్ళ ప్రాణం అని అనుకున్నాడు గైడ్.
పాత్రో తండ్రికి మాత్రం గైడ్ తమతో అనుసరించడం సుతరామూ ఇష్టంలేదు.
ముక్కు, మొహం తెలియని వ్యక్తి తమకి సహాయకారిగా తమతోనే రోజంతా ఉంటాడా? ప్రతి పూటా తామేం తింటే అది తిని తమకి చూపించాల్సిన ప్రదేశాలు చూపించి ఆఖరున రైలు ఎక్కించినంత వరకూ తమతోనే గడిపి 'కూలీ'గా మీకు తోచినంత ఇమ్మంటాడేఁవిటీ?!
ఇంత కావాలని ఖచ్చితంగా చెప్తే బావుంటుంది కదా? ఆ తర్వాత ఎక్కువ వసూలు చేస్తాడేమో! అతను అడిగినంత ఇవ్వకపోతే అల్లరి చేస్తాడేమో!?!
పాత్రో తండ్రి ఆలోచనలు పరిపరి విధాలా సాగుతున్నాయి.
మనిషి చూస్తే కుర్రాడిలా ఉన్నాడు. వూరు కాని వూరు దేశం కాని దేశం, భాష రాని క్షేత్రం. వయస్సులో ఉన్న అమ్మాయిలు ఇద్దరున్నారు. ఈ కుర్ర వెధవ ఏ అర్ధరాత్రో ఆపరాత్రో వీళ్లను అల్లరిపెడితే?! వాళ్లతోనే వచ్చాడు వాళ్లవాడేకదా, వాళ్లేదో గొడవ పడుతున్నారులే, అని ఎవరూ తమని పట్టించుకోరు. పోనీ కేకలేసి ఎవరికన్నా తమ గొడవ... గోడు వినిపించుకుందా మనుకున్నా తమ భాష ఇక్కడ ఎవరికి అర్ధమవుతుంది?.
అయినా, ఎందుకొచ్చిన తంటా. ఏరి... కోరి కొరివితో తల గోక్కుంటామా?
పాత్రో తల్లి భయంతో గుండె చేత పట్టుకుంది. 'వద్దని వారిస్తే వింటాడా కొడుకు' మనుసులోనే అనుకుంది.
పాత్రో మాత్రం గైడ్ పాండేతో మాట్లాడుతూ ముందుకి నడుచుకుంటూ వెళుతున్నాడు. చేసేదిలేక వాళ్ళిద్దర్నీ అనుసరిస్తున్నారు మిగిలినవాళ్లు.
పాత్రో భార్యకు మాత్రం గైడ్ పాండే వాలకం చూస్తుంటే ఎందుకో కీడు శంకిస్తోంది మనసు. అతను... అతని వాలకం, అతని మాటల గారడీ నడక జోరు ... అతని కళ్ళ ఎర్రదనం అతను చూసే వెకిలి చూపులు
ఆమెకి ముచ్చెమటలు పోస్తున్నాయి.
అసలే భర్త అమాయకుడు. ఎవరు ఏదడిగినా లేదనకుండా దానం చేసే అపర దాన కర్ణుడు. ఏవి పాలో ...? ఏవి నీళ్ళో? అర్ధం చేసుకోలేడు.
చూసి... చూసి ఈ ఆగంతకుడి వల్లో పడ్డారీయన.
వాడి కోర మీసాలు... వాడి వోర చూపులు
... వాడి వడి వడి నడక ... నడత ఎంత భయంకరంగా ఉన్నాయి? ఎంత చురుగ్గా చూస్తున్నాడు? ఎంత చిరాగ్గా చూస్తున్నాడు?
వచ్చీ రావడంతోనే దర్జాగా సూట్ కేస్ అందుకున్నాడు. అయినా, ఎలా గ్రహించాడు? అందులోనే తాము తెచ్చుకున్న డబ్బంతా ఉంది. ఆ డబ్బుతో ఉడాయించాలనుకున్నాడేమో!? ఇంకా నయం. ఆయన ఏ కళనున్నారో? కొంచెం తెలివిగానే ప్రవర్తించారు. ఆమె పిల్లలిద్దర్నీ నడిపిస్తూ పరిపరివిధాలా ఆలోచిస్తోంది.
పనిపిల్ల కళ్లు మాత్రం సంతోషంతో మెరుస్తున్నాయి. మెరుస్తున్న కళ్లల్లో కుర్ర గైడ్ వెలుగుతున్నాడు. ఎర్రగా, బుర్రగా బొద్దు మీసాలతో ముద్దోస్తున్నాడనుకుంది.
ఎంత బావున్నాడు? ఎలా నవ్వుతున్నాడో! ఎంతచక్కగా మాట్లాడుతున్నాడు.
పనిపిల్ల నడుస్తూనే పాత్రోతో పాటే నడుస్తున్న పాండేనే పరిశీలిస్తోంది.
ఆ పనిపిల్ల పసిడి మనసులో తొలివలపు మొలకలెత్తుతోంది.
గైడ్ పాండే ఆలోచనలు మాత్రం వీళ్ళందరికీ అతీతంగా సాగుతున్నాయి
📖
పేరుకు కుగ్రామమైనా వచ్చేపోయే వాహనాలతో రద్దీగా ఉంది గోపాలపురం
రోడ్డు. అస్తవ్యస్తంగా... ఎవరికీ ఎవరూ తెలియని... గమ్యం లేని మర బొమ్మల్లా జనాలు పరుగులెడుతున్నారు.
కార్లూ... స్కూటర్లూ... బస్సులు... ఒకటేమిటి? వాహనాలన్నీ అటూ-ఇటూ క్రిందా మీదా కానకుండా రేసు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి.
సమయం రాత్రి తొమ్మిది గంటలు కావస్తోంది.
బీట్ కానిస్టేబుల్ జనాల్ని కంట్రోల్ చేయలేక పోతున్నాడు. చిన్న కాలిబాట లాంటి ఆ తార్రోడ్డు మీద బళ్ళు రాకెట్లలా కళ్ళకు కనిపించనంత వేగంగా దూసుకు పోతున్నాయి.
ఆ రోజు శుక్రవారం.
ఆ వూరు యాత్రాస్థలానికి పక్కనే ఉన్న రైల్వేస్టేషన్ కావటం మూలాన ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. అదే యాత్రల సీజన్ అయితే చెప్పనక్కరలేదు.
చందనస్వామి కళ్యాణం, చందన స్వామి నిజరూప దర్శనం, డోలా యాత్ర, గిరి ప్రదక్షిణ దగ్గర పడడంతో భక్తుల రద్దీ మిక్కుటమౌతోంది రోజు రోజుకి.
శనివారం స్వామి వారికి మేలిమి రోజు.
ఆ రోజు మిగతా ఆర్రోజుల కంటే రెట్టింపు భక్తుల రద్దీ ఉంటుంది. ఒరిస్సా, శ్రీకాకుళం ప్రాంతాల భక్తులేకాక దూరప్రాంతాల నుంచి వచ్చే యాత్రీకులు శుక్రవారం రాత్రే చందన పురికి వచ్చి చేరుకుంటారు.
అలా చేరిన వారే పాత్రో కుటుంబం.
బస్సుస్టాండులో నిలుచున్నారంతా. పని పిల్లని ఒరుసుకుంటూ నిలబడ్డాడు పాండే.
ఒరియా భాష తొణక్కుండా తోట్రు పడకుండా అనర్గళంగా మాట్లాడుతున్నా డు పాండే.
"ఈ ఊరి పేరు గోపాలపురం. ఇక్కడి నుంచి చందన పురి చేరుకోవటానికి చాలా బస్సులున్నాయి. బస్సుకి మనిషికి రెండు రూపాయలు పుచ్చుకుంటారు. నడిచి వెళ్తే అర్ధగంట పడుతుంది. శ్రీకాకుళం, ఒరిస్సా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నడిచే వెళ్ళి పోతారు.“ గైడ్ పాండే ఇంకా ఏదో చెప్పబోతున్న సమయంలో సిటీ బస్సు దూసుకు వచ్చి వారిముందు ఆగింది.
అంత వరకూ బస్సు కోసం మనిషో దగ్గర పడిగాపులు కాసిన జనం ఒక్కసారి చైతన్యం వచ్చిన వరదలా బస్సు మీద విరుచుకుపడ్డారు. పులివిస్తళ్ళ కోసం పోట్లాటకు దిగే బక్క చిక్కిన బీద జీవాల్లా బస్సు మీదకు ఎగబ్రాకారు.
గైడ్ ముందుగా జనాల్ని తోసుకుంటూ బస్సెక్కి పాత్రో వాళ్ల కోసం సీట్లుంచాడు.
బస్సు అర నిమిషంలో నిండిపోయింది. జనాలతో కిక్కిరిసిపోయింది. పాత్రో ముసలి తల్లిదండ్రులకు సీటు ఇచ్చి తను మర్యాదగా నిలబడ్డాడు పాండే.
అడుగు తీసి అడుగు వెయ్యడానికి కూడా ఖాళీ లేదు. ఒకరి మీద ఒకరు ఒరిగిపోతూ నిలబడ్డారు. పాత్రో భార్య ముందు నిలబడ్డ పనిపిల్ల నానా అవస్థలూ పడుతూ ఒంటికాలి మీద నాట్యం చేస్తున్నట్టు నిలబడింది.
పాత్రో భార్య వెనుకే పాండే నిలబడ్డాడు. అతను ఎంత జాగ్రత్తగా... నిఠారుగా నిలబడదామనుకున్నా నిలబడలేక ఆమె మీద ఒరిగిపోతున్నాడు.
అందరూ ఆడా మగా తేడా లేకుండా ఇంకా మీద మీదకు వచ్చేస్తున్నారు. అందరూ ఒరుసుకుంటూ, రాసుకుంటూ నిలబడుతున్నారు.
'వెధవ బస్సు ఇలా ఉంది! ఏం చేయడం?' మనసులోనే సణుక్కుంది. అష్టకష్టాలు పడి బస్సెక్కి నరకం లాంటి ఆ కూపంలో కూరుకుపోయి ఒంటి కాలిమీదే నిలదొక్కుకు నిలబడింది.
పాత్రో కోసం బస్సంతా పరికించి చూసాడు పాండే. అతని చూపుల్ని బట్టి భర్త బస్సు ఎక్కలేదని గ్రహించింది పాత్రో భార్య. ముసలి వాళ్ళు మాత్రం తమ మానాన తాము మాట్లాడుకుంటున్నారు.
భర్త బస్సులో ఎక్కడా కనిపించకపోయే సరికి ఆమెకి ముచ్చెమటలు పోసాయి. ఆమె గుండెల్లో ఏదో భయం... దిగులు తారట్లాడుతున్నాయి.
ఈ దుర్మార్గుడు చూస్తే ఇలా ఉన్నాడు? ఇదే అదునని మరీ మీద ... మీద కొస్తున్నాడీ వెధవ. ఏం చెయ్యడం?!
'సామాన్లేవీ!?" నెమ్మదిగా గొంతు పెగుల్చుకొని గైడ్ ని అడిగింది.
'నా దగ్గర ఈ బ్యాగ్ ... ఈ సూట్ కేస్ తప్పా వేరే ఏవీలేవు." అని తన చేతిలో సూట్ కేస్ చూపించాడు పాండే.
సూట్ కేస్ గైడ్ చేతిలో చూసేసరికి ఆమెకి నోటమాట రాలేదు. 'వీడి చేతికి ఇదెలా వచ్చింది. ఆయన కదా పట్టుకున్నారు?
"ఆయనేరి?!" తడబడుతూ అంది.
"ఉంటార్లెండి!" నిర్లక్ష్యంగా అన్నాడు పాండే.
గైడ్ నిర్లక్ష్యమైన సమాధానం గొంతులో కరకుదనం వినేసరికి ఆమెకి మరింత భయం పట్టుకుంది.
ఆమె భర్త కోసం పడుతున్న ఆందోళన చూసి పాండేకి నవ్వు పుట్టింది.
"శోశీ!"
ఉన్నట్టుండి ఎవరిదో పెద్ద గావుకేక. ఆ పిలుపు బస్సు ... బస్సంతా ప్రతి ధ్వనించింది. ఆ కేకకి బస్సులోని జనమంతా ఒక్కసారి షాకయ్యారు.
ముందుకు నెమ్మది... నెమ్మదిగా వేగం పుంజుకుంటున్న బస్సు కూడా ఆ కేకకి ఉలిక్కిపడ్డట్టూ ఒక్క జర్క్ తో టక్కున ఆగిపోయింది.
'ఎవరో పడిపోయారు!... ఎవరో బస్సులో నుండి పడిపోయారు....! ఎవరో?! ఎవరో పాపం బస్సు ఎక్కలేక... ఫుట్ బోర్డు మీద నిలబడలేక ... నిలబడ్డం అలవాటు లేక... చెయ్యి పట్టు తప్పి క్రింద పడిపోయారు.!'
బస్సులో ఉన్న జనమంతా ఒకటే గుసుగుసలు. బస్సంతా ఆ సమాచారం 'గుసగుసల' రూపంలో పొగలా ప్రాకిపోయింది.
'శోశీ' అన్న గావుకేక వినడంతోనే పాత్రో భార్య అదిరిపడింది. అది తన భర్త గొంతు. ఎప్పుడైతే తన భర్త 'శోశీ' అని గావుకేక వేసాడో ... అప్పుడే ఏదో జరగరాని ఘోరం జరిగిపోయిందనుకుంది పాత్రో భార్య.
ఆమెని భయం దెయ్యంలా పట్టి పీకుతోంది.
“ఆయనకి... ఆయనకి ఏఁవైంది?" ఆతృతగా ఆయోమయంగా... ఆవేదనగా పాండేతో అంది పాత్రో భార్య.
"ఏం పర్లేదు.” అని పక్కవాళ్ళ ద్వారా అసలు విషయం గ్రహించి ఒరియాలో ఆమెకి విపులంగా వివరించాడు.
"సరిగ్గా ఫుట్ బోర్డు మీద నిలబడలేక బస్సు కదిలేసరికి క్రిందపడిపోయాడట. ఏం దెబ్బలు తగల్లేదట. అదిగో! డ్రైవర్ గారి వైపు నుంచి ఎక్కిస్తున్నారు చూడండి" చెప్తూ చూపించాడు గైడ్.
ఎదరున్న లేడీస్ గేటులో నుంచి కండక్టరే దగ్గరుండి పాత్రోని బస్సు ఎక్కించాడు.
భార్యని చూసి ఆనందంగా చెయ్యూపాడు పాత్రో. ఆమె కూడా నవ్వుతూ చూసింది.
ఆమె మనసుని దొలుస్తున్న అనుమానం ఆపుకోలేక పెద్దగా అరుస్తూ భర్తని అడిగింది.
"ఏఁవైనా గాయాలయ్యాయా?!'' అని
"లేదు” ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు పాత్రో.
భార్య భర్తల ఒరియా అరుపుల సంభాషణ విన్న జనం వింతగా నవ్వుకున్నారు.
గైడ్ పాండే మీద పాత్రో భార్యకు ఇప్పుడు సదభిప్రాయం కుదిరింది. ఈయన లాంటి వ్యక్తి తమకు తోడుగా ఉండటం మంచిదే అనుకుంది మనసులోనే.
"మీకు పెళ్ళయిందా?!" పెదవులపై నవ్వు ప్రదర్శిస్తూ ఇంకా ఆయన్ని 'దొంగ' లా అనుమానించి దూరంగా ఉంచితే బాఁవుండదని అడిగింది పాత్రో భార్య శౌశి అనబడే శశికళ.
"లేదు" అన్నాడు పాండే.
📖
బస్సు నెమ్మదిగా నిండు చూలాల్లా వూగుతూ జోగుతూ ముందుకు సాగుతోంది.
ఒక చేత్తో పై కమ్మి పట్టుకొని... మరో చేత్తో క్రింద కూర్చునే సీటు కమ్మీ పట్టుకొని నిలబడింది శశికళ.
బస్సు కుదుపుకి తమ మాటల మైకంలో తేలుతున్న ముసలి దంపతులు ఇహానికొచ్చారు.
కోడలు నిలబడలేక పడుతున్న అవస్థలు చూసి లేచి నిలబడ్డాడు ముసలి మాఁవగారు. తను కూర్చున్న సీట్లో కోడల్ని కూర్చోమని చెప్పారు. అత్తగారు కూడా బలవంతం చేసేసరికి మాఁవగార్ని కష్టబెట్టటం ఇష్టం లేకపోయినా వారి మాట కాదనలేకపోయిందామె.
శశికళ అత్తగారి ప్రక్కనే కూర్చుంది. ఆమెనే మ్రింగేసాలా ఓరకంట చూస్తూ నిలబడ్డాడు పాండే.
ఏదో ఆలోచిస్తూ కూర్చున్న శశికళ ఉలిక్కిపడింది.
"పిల్లలు.. మా పిల్లలు ఏరి?" గాబరాగా పాండే మోహంలోకి చూస్తూ అంది శశికళ.
“లేరా?" నిర్లిప్తంగా అడిగాడు పాండే.
"లేరు?!" భయంగా అంది. దాదాపు ఏడుస్తున్నట్టే అంది ఆమె.
పిల్లలు కనిపించలేదన్న ఆందోళన భరించలేక ప్రక్కనున్న అత్తమామలకు చెప్పింది శశికళ.
"అదేఁవిటి? నువ్వేకదా! ముందు మీరెక్కండి. నేను పిల్లల్ని ఎలాగోలా ఎక్కిస్తానన్నావ్?!'' పాత్రో తండ్రి గైడ్ మీద కళ్ళెర్రజేసాడు.
శశికళ మాత్రం దుఖం ఆపుకోలేకపోతోంది.
“వాళ్ల నాన్నగారు ఎక్కిస్తారని నేను ముందుగా బస్సెక్కి మీకు సీట్లుంచాను కదా! నాకేం తెలుసు?" గైడ్ అన్నాడు.
"సామాన్లో?!" పాత్రో తల్లి అంది, కళ్ళు పెద్దవి చేసి.
"ఇవిగో! ఇవి మాత్రం మీ అబ్బాయి నాకిచ్చాడు. మిగతావి అక్కడే... ఆ బస్సు స్టాండ్ లోనే వదలి నేను బస్సెక్కాను. అప్పుడు ఆ సామాన్ల దగ్గర మీ అబ్బాయి... మీ మనుమలు ఉన్నారు." చెప్పాడు పాండే.
"అయితే - మా వాడి దగ్గర సామాన్లు, పిల్లలూ ఉన్నారంటావ్!” ధీర్ఘంగా అన్నాడు పాత్రో తండ్రి.
"బస్టాప్ లో నిలబడ్డప్పుడు చూసాను. బస్సు 'చందనపురి' చేరనివ్వండి. మీ అబ్బాయి గారిని కనుక్కుందాం?!" పాండే ధైర్యం చెప్తూ అన్నాడు.
అయిదు నిమిషాల్లోనే బస్సు చందనపురి చేరుకుంది.
🔱
*సశేషం*
*భైరవవాక -5*
🔱
రచన: ఇందూ రమణ
అయిదు నిమిషాల్లోనే బస్సు చందనపురి చేరుకుంది. బస్సు స్టాండ్ నిండా జనం!
ఎటు చూసినా.... ఎక్కడ చూసినా జనం జనం.
చీమల పుట్టల్లా ... గుంపులు... గుంపులుగా ఆ ప్రదేశమంతా కిక్కిరిసిన జనం. రకరకాల వ్యక్తులు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మనుషులు. అందరూ రకరకాల వేషాల్లో ఉన్నారు.
వరద బాధితుల్లా ఉన్న యాత్రీకుల్ని రెక్కలు పుచ్చుకు లాక్కుపోతున్నారు కొందరు. ఆ తతంగమంతా గమనించిన పాత్రోకి ఏఁవీ అర్ధం కాలేదు. పాత్రో ముందుగా బస్సు దిగి ఈ వ్యవహార మంతా గమనిస్తూ నిలబడ్డాడు.
ఆఖర్న పాత్రో కుటుంబ సభ్యులు దిగారు. వారి వెనుకే గైడ్ దిగాడు.
పాత్రో పిల్లల కోసం వెదికాడు. ఏరీ?! ఉంటేనా?! ఆశ్యర్యం... ఆందోళన అతని కళ్ళ నిండా కమ్ముకుంది.
అప్పటికే పాత్రో తల్లిదండ్రులు పిల్లల కోసం గాలిస్తున్నారు.
"శాశీ! పిల్లలేరీ?! బప్పా ! పిల్లలేరీ! ... మా పిల్లలేరీ?! "పాత్రో కంఠం ద్భుంతో పేరుకు పోయింది.
"మీ దగ్గర లేరా?!" ఆతృతగా అంది శశికళ.
దాదాపు ఏడుపు గొంతుతోనే అంది ఆమె కూడా.
"నా దగ్గరా!" అయోమయంగా చూసాడు పాత్రో, ఇంతలో ఒకామె వారి దగ్గరకొచ్చింది.
"రండి బాబు ! రండి. మీరు పడుకోవడానికి చాప ఇస్తాను. వంటకి కావలసిన పాత్రలు
... కర్రలు సమకూరుస్తాను రండి. రండి బాబూ!" ఎవరో ముప్పై యేళ్ళ ఆమె పాత్రో చెయ్యి పట్టుకు లాగుతూ అంది.
"ఏయ్! ఎవర్నువ్వు ! పోఁ ! పోఁ !" కోపంతో ఊగిపోతు ఒక్క గసురు గసిరాడు పాత్రో.
కోపంలో అతను 'ఒరియా' లో ఏఁవన్నాడో ఆమెకి అర్ధం కాకపోయినా 'కసురుకోవడం' మాత్రం గ్రహించి సహించలేకపోయింది.
"ఏట్రోరే! నువ్వు వస్తేరా! రాకపోతే పో ! నన్ను కసరడానికి నీకెన్ని గుండెలుండాల్రా! వెధవ సచ్చినోడా? మర్యాదగా రాబాబూ! రా! అంటే నీకు నేను చులకనైపోయాన్రా?” చీర చెంగు చిలకట్టులా నడుముకు దోపుతూ అరిచింది ఆమె. అరుస్తూ వెళ్ళిపోయింది.
ఆమె కోపంతో పేట్రేగిపోయేసరికి పాత్రోకి నోటమాటరాలేదు. భయంతో బిక్క చచ్చిపోయాడు.
పాత్రో తల్లి దండ్రులకు ఆమె ఎందుకలా పిచ్చి పిచ్చిగా అరుస్తోందో అర్ధంకాలేదు.
పాత్రోకి మాత్రం పరిస్థితి అర్థం అయ్యింది. అతని మొహం వివర్ణమైంది. బాధగా తలపట్టుకున్నాడు.
భర్త పరిస్థితిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది శశికళ. పనిపిల్ల అచేతనంగా శశికళ పక్కనే నిలబడింది.
గైడ్ పాండే మాత్రం ముసి... ముసిగా నవ్వుకుంటూ ఎటో చూస్తూ నిలబడ్డాడు.
📖
పాత్రో కుటుంబమంతా అయోమయంలో కొట్టుకులాడుతుంది. ఏం చేయాలో తోచక అలాగే అచేతనంగా నిలబడి పోయారందరూ.
సామాన్లుతో పిల్లలు ...గోపాలపురం బస్సు స్టాండ్లోనే ఉండిపోయారు. అక్కడే ... అలాగే ఉండి ఉంటారు.
తిరిగి వెళ్తే అక్కడే ఉంటారు...
అదీ ఆ కుటుంబ సభ్యులందరి యోచన... ఆలోచన. గైడ్ పాండే మాత్రం ఎవరి కోసమో ఎదురు చూస్తూ నిలబడ్డాడు.
ఇంతలో ఇంకో సిటీ బస్సు వచ్చి వాళ్ళ ముందు ఆగింది. ఆ బస్సులో పిల్లలు కనిపించేసరికి అవాక్కయిపోయారందరూ ఒక్క గైడ్ పాండే తప్పా.
బస్సు ఖాళీ అయిన తర్వాత సామాన్లు కూడా దగ్గరుండి కండక్టర్ దింపించాడు.
పాండే వెళ్ళి కండక్టర్ కి కృతజ్ఞతలు తెలిపి పిల్లల్ని, సామాన్లని వాళ్ళ దగ్గరకు చేర్చాడు.
పాత్రోకి అంతులేని ఆనందం కలిగింది.
'ఎవరో పుణ్యాత్ములు తన పిల్లల్ని ... సామాన్లని బస్సెక్కించి పుణ్యం కట్టుకున్నారు.' అనుకున్నాడు మనసులోనే.
పిల్లల్నిద్దర్నీ దగ్గరకు తీసుకొని అక్కున చేర్చుకుంది శశికళ.
"మీరెవరూ ఏఁవీ అనుకోనంటే చిన్న విషయం" నెమ్మదిగా నవ్వుతూ చిన్నగా అన్నాడు పాండే.
“ఏఁవిటీ?" పాత్రో అన్నాడు.
మిగతా వాళ్ళందరు కూడా పాండే ఏం చెప్పబోతున్నాడో తెలుసుకుందామని ఆత్రంగా చెవులు రిక్కించారు.
"నేనే పిల్లల్ని సామాన్లని అక్కడ సామన్లు మోసే నాకు తెలిసిన 'కలాసీ' కి అప్పగించి తరువాత బస్సులో ఎక్కించమన్నాను. మనం ఎక్కిన బస్సులో పిల్లలు ఎక్కితే నలిగిపోతారని అలా చెప్పాను. ఆ విషయం దాచి మిమ్మల్ని ఇలా క్షోభ పెట్టినందుకు క్షమించండి."
గైడ్ పాండే చేసిన నిర్వాకానికి నవ్వాలో ... ఏడ్వాలో అర్ధం కాలేదెవరికీ!
కానీ, తమ పిల్లలు ... సామాన్లు తమకి చేరాయి. అంతే చాలు. 'పోనీలే! వెధవ డబ్బు ఎంతఖర్చయినా మంచి వ్యక్తి అండ దొరికింది.' అనుకున్నారందరూ.
అప్పటికి గాని గైడ్ పాండే విలువ వాళ్ళెవరూ గ్రహించలేకపోయారు.
"బాబూ! నువ్వే ఎలాగో మా మొక్కులు తీరిన వరకూ మాతోనే ఉండి తిరిగి మేం మా వూరు రైలెక్కేవరకూ తోడుగా ఉండి పుణ్యం కట్టుకో నాయన.” అంటూ పాత్రో తల్లిదండ్రులిద్దరూ పాండే చేతులు పట్టుకున్నారు.
"అలాగే నండి. అది నా బాధ్యత కూడా!" నవ్వుతూ అన్నాడు పాండే. నవ్వుతూ అనుకోకుండా పనిపిల్ల వైపు చూసాడు.
పనిపిల్ల గైడ్ పాండేనే తదేకంగా చూస్తోంది. అతను కూడా తనని చూస్తున్నాడని గ్రహించగానే చిన్నగా నవ్వి కళ్ళతోనే ప్రసంశించింది.
పాండే కి మనసు పులకరించింది.
'ఇంత అందగత్తెని ఇంతవరకూ తను పట్టించుకోలేదే. ఎప్పటి నుంచి తనని ఇలా గమనిస్తోందోకదా! పని పిల్లల్లో ఇంత మంచి సొగసు గత్తెలుంటారని గ్రహించ లేదు.' అనుకుంటూనే పాత్రో భార్య శశికళ వైపు ఓరగా చూసాడు.
ఆమె పిల్లలిద్దర్ని అక్కున చేర్చుకుంటోంది. తల్లి ప్రేమ. ఎంతైనా ఆడది. అమ్మ మనసు కదా!
📖
పిల్లలు, సామాన్లు దిగిన బస్సులో అంతా గిరిజన యాత్రికులే ఉన్నారు. కోయ భాషలో కండక్టర్ చుట్టూ మూగి గోల చేస్తున్నారు. వారి పక్కనే పాత్రో నిలబడి అంతా గమనిస్తున్నాడు. అప్పటికే రాత్రి పది కావస్తోంది.
ఈ లోగా పాండే, పాత్రో దగ్గరకొచ్చి నిలబడ్డాడు.
"అదేవిటి?! మన దగ్గర రెండు రూపాయలు పుచ్చుకొని వాళ్ళ దగ్గర మూడేసి రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నాడు." పాత్రో పాండేని ప్రశ్నించాడు.
దాదాపు పాతిక, ముపై మంది గిరిజనుల దగ్గర కండక్టర్ వాళ్ళతో ఉన్న గైడ్ కలసి వచ్చీ రాని కోయ భాషలో మాట్లాడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు
"వాళ్ళు ఎక్కడ ఎక్కారో?" పాండే సంశయంగా అన్నాడు.
"మాతోనే రైల్లో వచ్చారు. వాళ్లూ గోపాలపురం లో మనమెక్కిన బస్సు ఎక్కలేక ఉండిపోయింటారు." పాత్రో అన్నాడు.
"అయితే అది మామూలే! భాషరాని కొత్త వ్యక్తుల దగ్గర ఇలా ఎక్కువ వసూలు చేసుకోవటం అందరికీ పరిపాటే. యాత్రకని ఎంతోమంది... ఎన్నో రకాల వ్యక్తులు ... ఎక్కడెక్కడి నుండో వస్తారు. వాళ్లకి బస్సు చార్జీ ఎంతో తెలీదు కదా! అందువలన ఇలా దోపిడీ చేస్తుంటారు." అన్నాడు పాండే.
"ఎంత దగా!" పాండే చెప్పిందంతా విన్న పాత్రో కుటుంబ సభ్యులంతా ఒక్కసారే అన్నారు.
'అంతేనా?! ఇంకా ముందు ముందు మీకే తెలుస్తుంది.' అని మనసులోనే అనుకొని నవ్వుకున్నాడు పాండే.
ఇందాక కసిరేసి వెళ్లిన ఆమె పాత్రో దగ్గర కొచ్చి మళ్లా అంది వచ్చీ రాని ఒరియాలో.
"మీరు పడుకోవటానికి తుంగ చాప.. వంట కి పాత్రలు నేనే దగ్గరుండి సమకూరుస్తాను రండి" అంటూ పిలిచింది.
పాత్రోకి ఆమె ఏమందో అర్ధమయింది గానీ, ఎందుకలా తమని ప్రత్యేకంగా పిలుస్తోందో అర్ధం కాలేదు.
పాత్రో ఆలోచన అర్ధం చేసుకున్న గైడ్ భావగర్భితంగా నవ్వి ఊరుకున్నాడు. ఈ వర్తకుల విషయంలో తను తల దూరిస్తే ఇంకేమైన ఉందా? తానీ వూర్లో ఉండగలడా?
ఆమె తమని ఎందుకు పిలుస్తోందో తల్లికి తండ్రికి చెప్పాడు పాత్రో. అప్పటికే ఆమె మాటలను బట్టి వారు కూడా అర్ధం చేసుకున్నారు.
వంట పేరెత్తేసరికి అంతవరకూ ఏమూలను దాక్కుందో గాని 'ఆకలి' ఆవురావురు మంటూ వాళ్లనందర్నీ ఆరగించడం ప్రారంభించిది.
"అయితే, పదండి. మరి, దేనికి ఆలస్యం! వేగంగా పోయి వంట కానిచ్చేసి నాలుగు మెతుకులు తిని పడుకుందాం! ఉదయాన్నే లేచి భైరవ స్వామిని దర్శించి ఆ తర్వాత చందన స్వామి సన్నిధికి వెళదాం" పాత్రో తండ్రి అన్నాడు.
"భైరవ స్వామి మొక్కుందా మీకు !? " గైడ్ అడిగాడు.
" ఆఁ ! అదే ముఖ్యమైంది!" పాత్రో చెప్పాడు.
"రండి!" ఆమె మళ్లా వెనక్కొచ్చి పిలిచి పాత్రో చెయ్యి పట్టుకుని ఈడ్చుకు వెళుతుందేమోనన్నట్టుగా ముందుకు నడిచింది. ఎవరూ అడ్డు చెప్పలేదు.
ఆమెతో పాటు అందరూ వెళ్ళారు.
📖
పాత్రో భార్య ఆమెనే గమనిస్తోంది. ఆమె వర్తకురాలిలాలేదు. నాజూగ్గా నవనవ లాడుతోంది. మనిషంత మనిషిని సిగ్గూ ఎగ్గూ లేకుండా చెయ్యి పట్టుకు లాక్కెళ్లడం చూసి శశికళకి ఒళ్లు మండుతోంది.
ఏంచేయగలదు ?! పరాయి ప్రాంతం. పరాయి వ్యక్తులందరూ. యాత్రా స్థలం. దేన్నీ తప్పుగా అర్ధం చేసుకోకూడదని తనకు తానే సరిపెట్టుకుంది శశికళ.
పరాయి స్త్రీ అంత చనువుగా... అంత దగ్గరగా రాసుకుంటూ నడుస్తుంటే పాత్రో మనస్సు పరిపరి విధాలా పోతోంది. ఒక పక్క సిగ్గూగా... అనిపించినా ఆ స్థితి ఇష్టంగానే ఉంది. మరో పక్క వెనుక నడుస్తున్న తల్లి దండ్రులు, భార్య, పాండే, పనిపిల్ల తనని గమనిస్తున్నారేమోననే భావం... బిడియం పాత్రోని పీకుతూనే ఉన్నాయి.
ఆమె ప్రవర్తన ... భర్త నడక గమనిస్తూనే ఉంది పాత్రో భార్య శశికళ.
ఆమె వాళ్ళని పాత బస్సు స్టాండ్ కి తీసుకువెళ్ళింది. అది ఇప్పుడు చందన స్వామి దర్శనానికి వెళ్ళేందుకు కొండ బస్సు స్టాండ్ గా వినియోగిస్తున్నారు.
అక్కడ-
ఆ విశాలమైన బస్సు స్టాండ్ ఆవరణ అంతా వందలమంది యాత్రీకులతో కిటకిటలాడుతోంది. కేకలతో అరుపులతో గందరగోళంగా ఉంది. విశాలమైన ఆవరణ మధ్య మదపుటేనుగులా చిత్రాటోపీ, ఒకే ఒక గది ఉన్న ఆ చిత్రాటోపీ పోలీసు బీట్ లా ఉంది. ఆ బిల్డింగ్ లో చందన స్వామి దర్శనానికి వెళ్ళడానికి బస్సు టిక్కెట్లు అమ్ముతుంటారు.
ఏమూల చూసిన పదేసిమంది ఒక గుంపు గా కూర్చొని వంట చేసుకుంటున్నారు. కొందరు అప్పుడే వడ్డించేసుకొని భోజనాలు కూడా కానిచ్చేస్తున్నారు. ఓ మూల కట్టెలు అమ్ముకుంటున్నవాళ్ళు... ఇంకో మూల మట్టి కుండలు, మరో మూల వరస వరసంతా కొబ్బరి కాయలు దుఖాణాలు
ఉన్నాయి.
ఆ బస్సు స్టాండ్ చుట్టూ ఎత్తైన ప్రహారీ. ప్రహారీ గోడనానుకొని కొబ్బరి కాయలు కుప్పలు... కుప్పలుగా పోసున్నాయి.
అంతా కోలాహలంగా ఉంది. వ్యాపారస్థు లంతా హడావిడిగా తిరుగుతున్నారు.
యాత్రికులంతా ఎవరి పనుల్లోవారున్నారు.
కఛేరి గంటలు ఠంగు... ఠంగు మని వరుసగా పది మ్రోగాయి. పాండే అప్రయత్నంగా వాచీ చూసుకున్నాడు. పావుగంట ఎక్కువే అయింది. కఛేరి జవాను నిద్ర పోయింటాడనుకున్నాడు గైడ్ పాండే.
“ఆ గంటలేఁవిటీ!" పాత్రో సంశయంగా అడిగాడు.
"అవి దేవస్థానం కఛేరి గంటలు. పూర్వాచారం ప్రకారం అక్కడ ఉండే జవాను గంట గంటకి లేచి వూరంతా విన్పించేలా... సమయాన్ని తెలియజేస్తూ గంటలు కొట్టాలి. దేవాలయం సిబ్బందికి ... పనిలో ఉండే క్రింద ఉద్యోగులకి ఊర్లో ఉన్న ఇళ్ళలో వారికి టైమ్ తెలియడం కోసం రాజుల కాలం నుంచి ఇలా గంటలు కొట్టడం అలవాటు.” చెప్పాడు పాండే.
ఇంతలో ఓ మూల విశాలంగా ఉన్న దగ్గర పాత్రో కుటుంబం కోసం రెండు తుంగ చాపలు పరిచి వెళ్ళిపోయిందామె. సామాన్లన్నీ క్రింద పెట్టి అందరూ అలసట గా ఒక్కసారే ఆ చాపల మీద కూలబడ్డారు.
అప్పుడు -
అప్పుడు గుర్తొచ్చింది పాత్రోకి. ఆ వూర్లో తన మిత్రుడికి తెలిసిన వ్యక్తి ఒకడున్నాడని. ఛటుక్కున నిలబడి పర్సుకోసం జేబులు వెతుక్కున్నాడు.
పర్సు కనిపించలేదు...
🔱
*సశేషం*
No comments:
Post a Comment