Tuesday, 11 November 2025

 *భగవాన్ స్మృతులు -1*

రచన: గుడిపాటి వెంకట చలం

మధుర దగ్గిర వున్న తిరుచులి గ్రామంలో 1879 డిశంబరు 30 తేదీన 'వెంకట్రామన్ పుట్టారు. ఆయనే తరవాత భగవాన్ రమణ మహర్షి అనే పేరుతో విశ్వ విఖ్యాతి పొందారు. ఆ రోజే ఆర్ధదర్శనం పుణ్యదినం.

వెంకట్రామన్ మధురలో మిషన్ హైస్కూల్ లో చదువుకుంటూ వుండగా, తన పదహారో ఏట, ఓసారి ఎవరో అరుణాచలం నించి వస్తున్నానని చెపుతూ వుండగా విన్నారు.. ఆ పేరు ఆ అబ్బాయిని ఏవో స్మృతులలో కలవరపెట్టింది.

పదిహేడో ఏట కొద్ది నిమిషాలలో అతనికి ఆత్మసాక్షాత్కారం జరిగింది, ఒకరోజు అతను ఒంటరిగా మేడమీద కూచుని వుండగా, మృత్యువు సంగతి గట్టిగా మనసులోకి వచ్చింది, చావు అంటే ఏమిటి? అని ప్రశ్నించుకుని, 'ఇదే కదా చావు' అని, చచ్చిపోయినట్టు పడుకుని శ్వాస నాపేశాడు.

"సరే, ఈ దేహం చచ్చిపోయింది. దీన్ని కాల్చి బూడిద చేస్తారు. దాంతో నేను అంతమేనా? ''నేను'' ఇంకా తెలుస్తోనే వుంది. కనక నేను ఈ దేహం కాదు. నాకు మృత్యువు లేదు" అనుకునేప్పటికి అతని జ్ఞానోదయమయింది. ''నేను" అనేది మనసు ఆలోచనగాక, అది అనుభవమై పోయింది.

త్వరలోనే ఆయన ఎవరితోనూ చెప్పకండా అరుణాచలానికి బైలుదేరి, సరాసరి ఆలయంలో గర్భగుడిలోకి వెళ్ళి తన తండ్రి అరుణాచలేశ్వరుడి దర్శించుకున్నారు. ఆ నాటి నించి ఆమరణాంతమూ ఆయన అరుణాచలం వదలలేదు. మొదట ఆలయం లోనూ, తరువాత వివిధ ఏకాంత స్తలాల లోనూ, ఆయన సమాధిలో గడిపారు కొన్నేళ్లు. త్వరలోనే ఆయన తల్లికి తెలిసివచ్చి ఇంటికి రమ్మని ఎంత ఏడ్చినా ఆయన కదల్లేదు. ఊళ్ళో ఆయన సంగతి తెలిసి, ఆయన ఉపదేశానికై మనుషులు వస్తున్నారు.

📖

1908 లో మహాకవి, పండితులు గణపతి శాస్త్రిగారు స్వామిని సందర్శించి, ఆయన సాక్షాత్తూ సర్వేశ్వరుడని తెలుసుకొని, ఆయననించి ఉపదేశాన్ని అడిగిపొందారు. ఆయనే వెంకట్రామన్ కి 'భగవాన్ రమణ మహర్షి ' అని పేరుపెట్టి ప్రకటించింది. ఆయన మూలంగానే భగవాన్ కీర్తి దేశమంతా వ్యాపించింది.

1916 లో భగవాన్ తల్లీ, తమ్ముడూ అరుణాచలం వచ్చి ఆయనతో పాటుగా స్తిరపడ్డారు. 1920 లో భగవాన్ తల్లి చనిపోయింది, ఆమె దేహాన్ని కొండమీద నించి తీసుకువచ్చి పాలితీర్థం దగ్గిర సమాధి చేశారు. త్వరలో భగవాన్, ఆయన తమ్ముడు చిన్నస్వామి, శిష్యులూ కొండ దిగి వచ్చి ఆ సమాధి దగ్గిరే స్తిరపడ్డారు. అప్పటి నించి లోకంలో అన్ని దేశాలలోనూ ప్రసిద్ధి కెక్కిన శ్రీ రమణా శ్రమం ప్రారంభమయింది.

ధనం కురిసింది, కీర్తి వ్యాపించింది. తీర్థ ప్రజలవలె దేశ దేశ ప్రజలు ఆయన్ని ప్రతి దినమూ దర్శించుకున్నారు. ఆయన రచించిన పుస్తకాలు ఎన్నో భాషల్లోకి తర్జుమాలైనాయి.

1950 ఏప్రిల్ 14 న రెండు సంవత్సరాలు గా ఆయన్ని బాధిస్తున్న సార్కోమా వల్ల ఆయన నిర్వాణం చెందారు.

📖

*ప్రస్తావన*

ఆత్మసాక్షాత్కారం పొందిన మహాత్ముల స్థితి ఎట్లా ఉంటుందో, తక్కినవారు గ్రహించలేరు. వారి జీవితపు నడక పద్ధతి కూడా భేదంగా వుంటుంది. అంతేకాదు, ఆ జ్ఞానులలోనే, ఒకరి జీవిత పద్ధతీ, వారు బోధించే సాధనా పద్ధతీ ఒకరినుంచి ఇంకొకరికి వేరుగా ఉంటాయి. వారిలో కొందరు మనుష్యుల మధ్య వుండిపోయి, ఆశ్రమాలలో నివసించి, శిష్యుల్ని తయారు చేస్తారు. కొందరు నిలకడలేకుండా తిరుగు తూ వుంటారు. కొందరు పాడతారు, కొందరు వాదిస్తారు, కొందరు బోధిస్తారు. కొందరు మానులు, కొందరసలు కంటికి కనపడరు, కొందరు రొష్టుపడి ప్రజల ఆగ్రహం వల్ల కంటకబడతారు. కాని, వారికి కంటకం అంటదు. ఒకే మాట మాట్లాడి, ఒకేచర్య చూసినవారే కొందరు పూజనీయు లై, చివరివరకు మన్ననలందుకుంటారు. కొందరు నిందపడతారు.

విచక్షణతో చూస్తే ఈ విభేదమంతా వారు వారు కల్పించుకున్నది కాదనీ, వారి మాటల, చేతల, ప్రోద్బలమంతా ఈశ్వర చోదితమని తెలుస్తుంది. వారి చుట్టూ ఏం జరిగినా, వారికేం జరిగినా వారికి అంటదు. వారు మనుషులకి అర్థంకారు. ఎందుకంటే, మనుషులు మనసులతో ఆలోచించి చేస్తారు. అందువల్ల ఒకరికొకరు కొంతవర కన్నా అర్థమవుతారు, కాని ఈ జ్ఞానులకు మనోనాశనమవుతుంది. అందువల్ల వారి నడకలే వేఱు. వారి జీవిత సందర్భాలలో, సంబంధాలలో పరస్పర విరుద్ధాలెన్నో కనపడతాయి. వారి పనులలో కొన్నింటికి కారణాలు వున్నట్లు కనపడతాయి. కొన్నింటికి కనపడవు. పిచ్చివాడి పనుల లాగో, పొగరెక్కి నిరంకుశుడైన నియంత పనులలాగో తోస్తాయి. వారి పనుల Consequences వారి నంటవు. నక్కలంక యోగి, తనని సమీపించినవారి గుండెల్లో దభేలని తన్నేవారు. తిరిగి ఎవరూ ఆయనని తన్నరు. తిట్టరు. తన్నులు తిన్నవాడికి బాధా అవమానమూ కాని ఆ యోగిని తంతే, తనని తన్నినట్టు కూడా తెలీదు అతనికి.

అట్లానే భగవాన్ జీవితంలో ఎన్నో విషయాలు అర్ధంకావు - ఆయన ఈ ద్వంద్వాలు దాటిన మహర్షి అనీ, సర్వేశ్వరుడే అని నమ్మనివారికి, ఆయన ఏమాత్రమూ అర్థంకారు, ఆయన మానవా తీతుడు గనక. ఆయనలో కనపడే వైరుధ్యాలకి మానవుల్లో వెతికినట్లు కారణాలు వెతకటం దాని, విమర్శించడం గాని అజ్ఞానం, ఏ మనిషికి, ఏ పరిస్థితికి అవసరమైనట్టు ఆ విధంగా మాట్లాడేవారు ఆచరించేవారు ఆయన.

తన చుట్టూ ఆశ్రమంలో జరిగే వాటిలో ఆయనకి ఎంతవరకూ సంబంధం వుందో చెప్పలేము. సంబంధం వుండనూ వుంది; ఉండనూ లేదు. లోకంలో జరిగే అనేక అత్యాచారాలకీ, ఈశ్వరుడికీ సంబంధం వున్నట్టా, లేనట్టా? ఆశ్రమాధికారులూ, ఆశ్రమవాసులూ తరచు ఆయనని అడక్కుండానే ఎన్నో చేసేవారు, భగవాన్ కి ఇష్టంకాదని తెలిసి కూడా, ఆ పనులు భగవాన్ కంటనో, చెవినో పడితేనేగాని, భగవాన్ వాటిని నోటీసు చేసేవారు కాదు. గమనించినప్పుడు ఒక్కొక్కసారి పిలిచి చీవాట్లు వేసేవారు. ఒక్కొక్కసారి ఏమీ అనేవారు కారు. చీవాట్లేకాక ఆశ్రమాధికారి వీపుమీద మూడు కర్రలు విరిగాయని భగవాన్ అన్నట్లుగా చెప్పుకునేవారు. ఆశ్రమాధికారి మాత్రం భగవాన్ కంట పడకుండా, నిరంతరం నేరస్థుడి వలె ఇటూ అటూ తప్పుకు తిరిగేవాడు.


భగవాన్ని దర్శించవచ్చినవారు ఆశ్రమంలో జరిగే అనేక ఘోరాలు, అన్యాయాలు, పక్షపాతాలు, డబ్బు గుంజడాలు… ఇవి భగవాన్ తో చెప్పితే, "మీరు ఎందుకు వచ్చారు? ఈ ఆశ్రమంలో జరిగే లోపాల్ని యెంచి సంస్కరించేందుకా అంతదూరం నుంచి వచ్చారు? మీ దేశంలో ఏమీ లేదా సంస్కరించేందుకు? మీరు వచ్చిన పని ఏదో అది చూసుకొని వెళ్ళరాదా?” అనేవారట.

ఆశ్రమ ధనం దుర్వినియోగమవుతోందనీ, ధనార్జనే ముఖ్యంగా వుందనీ భగవాన్ తో అంటే, “వాళ్లు ధనం కోసం చేరారు. నీకూ ఆ ఆశ ఉంటే వాళ్ళలో చేరి చూడు, భాగం పెడతారేమో!” అన్నారట.

తన పేర నెల నెలా వసూలవుతున్న ధనం యెట్లా వినియోగమౌతోందో భగవాన్ పట్టించుకోలేదు. తన పేర యాచించడం భగవాన్ కి యెన్నడూ ఇష్టంలేదు. లక్షలు ఖర్చుపెట్టి కట్టించిన ఆశ్రమాలయానికై యాచించపోతే, గట్టిగా నిషేధించారు భగవాన్. కాని, విన్నదెవరు?

అయినా, తన ఆజ్ఞను మీరి చందాలు పోగు చేసి కట్టిస్తున్న ఆలయాన్ని, అర్ధరాత్రులు భగవాన్ టార్చి వేసుకొని రాళ్ళన్నీ పరీక్షించేవారట. అంతాతయారైన తరువాత ఓరాత్రి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించిన శ్రీచక్రంపైన చెయ్యి వుంచి పదినిమిషాలు నుంచున్నారట. కుంభాభిషేకం మొదలైన పూజలన్నింటికి అభ్యర్థనపై మౌనాధ్యక్షత వహించారు.

పూజలూ, ఊరేగింపులూ, ఉత్సవాలు - ఏవీ లక్ష్యం లేవు భగవాన్ కి, ముఖ్యంగా తనమీద పువ్వులు వెయ్యడం, తన ముందు కొబ్బరికాయలు కొట్టడం, హారతు లివ్వడం మొదలైనవి ఇష్టంలేదు. పుట్టిన జయంతి చేసినా, చేస్తున్నారు గనుక చూస్తూ కూచునేవారు, కుచోమంటే. ఆయనా దేవతా విగ్రహాల కిచ్చిన హారతి తెచ్చి ఇస్తే అందరికి మల్లేనే కళ్ళ కద్దుకుని, విభూతి పెట్టుకునేవారు.

ఆయన జబ్బుగా వున్నప్పుడు ఆయన ఆయుస్సు కోసం గ్రహశాంతి, హోమాలు చేశారు. దాంట్లో వుండే Anomaly ఏమీ తోచలేదు, ఆయన ఆయుస్సు కోరేవారికి. ఆ హోమాల, హారతులు తీర్థం తీసుకున్నా రాయన.

తనకు జబ్బు చేస్తే, మందు అవసరం లేదంటారు భగవాన్. కాని, భక్తులు దిగాలు పడ్డా, మందు తీసుకోమని బతిమాలినా, "సరే, తెండి" అని, ఏ మందిచ్చినా అట్లా మింగుతూనే వుండేవారు.

వచ్చిన ప్రజలు సాష్టాంగపడి నమస్కరించే వారు. కాని, భగవాన్ తల తిప్పి కూడా చూసేవారు కారు. కాని, ఎందుకో ఎప్పుడో ఎక్కడో శూన్యంలోకి చూస్తున్న వారు కాస్తా, చప్పున తనకి నమస్కరించే వారి వంక చూసేవారు. ఒక్కొక్కరిని పలకరించే వారు కూడా. నవ్వేవారు. ఎన్నో కుశల ప్రశ్నలు వేసేవారు, దూరదేశాల నించి వచ్చిన వారిని, పసి పిల్లలని, నడవలేని వృద్ధుల్ని ప్రత్యేకంగా చూసేవారు.

🪷

సశేషం

*భగవాన్ స్మృతులు - 2*

🪷

రచన: గుడిపాటి వెంకట చలం

అధికారులు, బిచ్చగాళ్ళు, ధనవంతులు, సన్యాసులు, భక్తులు, రూపవంతులైన స్త్రీలు ఎవ్వరూ ఆయన దృష్టిని తీసుకోలేక పోయేవారు. కొందరు ఎన్నో ప్రశ్నలతో వచ్చి, అడగడం ప్రారంభిస్తే ఎంతకీ పలికే వారు కారు, ఒకర్ని పిలిచి పలకరించి, ఎన్నో విషయాలు చెప్పేవారు. కొందరిని ఏ కారణం లేకుండా, తనని పలకరించగానే కసిరి కొట్టేవారు. కొందర్ని గట్టిగా తిట్టేవారు హాస్యం పట్టించి, వెక్కిరించి, అందరూ నవ్వేటట్లు చేసేవారు.

కొందరు భక్తులు ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిన తరువాత భగవాన్ కలల్లో కనపడి రమ్మంటారు. లేదా, ఆ  భక్తుడికే యెంతో నిలువ లేని ఆతృత కలుగుతుంది, భగవాన్ని యెప్పుడు చూస్తానా అని, దూరాల నుంచి, ఇబ్బందుల్లో నుంచి ఏదీ లక్ష్యం చేయక యెప్పుడు యెప్పుడు అంటూ వస్తాడు ఆశ్రమానికి. అతను వచ్చేప్పటికి భగవాన్ తల రెండో వైపు తిరిగి ఉంటుంది, అటు చూడరు, పలకరించరు. చిరునవ్వు నవ్వరు కొన్ని రోజులు. ఈలోపల యెందర్ని పలుకరిస్తారో ప్రేమగా పిలచి, మాట్లాడి, కుశల ప్రశ్నలు వేస్తారో!

కొందరు వుండేవారు. వారికి అందరి ముందూ భగవాన్ తో మాట్లాడడం గొప్ప. అందరి వంకా చూస్తూ, ఏవో కాయితాలో పుస్తకమో పట్టుకుని, ఏదో సందేహాన్ని కల్పించుకుని వెళ్ళి భగవాన్ని పలకరించి మాట్లాడతారు- మధ్య మధ్య చుట్టూ వున్న వారి వంక గర్వంగా చూస్తూ అంత స్వల్పమైన విషయాన్ని యెంతోసేపు మాట్లాడతారు, వాళ్ళతో భగవాన్, దూరం నుంచి వచ్చి; త్వరలో వెళ్ళవలసిన ఇంకోరు తమ సందేహాలతో రోజులకి రోజులు వుండిపోవలసిందే. యెవ్వరికేది అవసరమో, ఏది వారిని తనకి కట్టి వేస్తుందో, ఏది వారి అహాన్ని అణుస్తుందో ఆ విధంగా జరిగిపోయేది భగవాన్ ద్వారా.

📖

ఆశ్రమంలో తనకి ఇష్టంలేని పని కాని, తను వద్దన్న పని కాని జరుగుతూ వుంటే, పిలిచి చీవాట్లు వేసేవారు. కాని, అప్పటికి వినకపోతే మాట్లాడకుండా వూరుకొనే వారు. చాలాసార్లు భగవాన్ మీదే ఆంక్షలూ అజ్ఞలూ పెట్టేవారు ఆశ్రమాధికార్లు.

మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల దాకా భగవాన్ని ఎవరూ చూడకూడదని టైమ్ నిర్ణయించి, భగవాన్ని అడగకుండానే హాలు తలుపులు వేయించి వేశారు.

భగవాన్ “ఇదేమిటి?" అని అడిగితే, "మీ ఆరోగ్యము కోసం” అన్నారు. తలుపులు ముయ్యడానికి వీల్లేదనీ, 24 గంటలూ తలుపులు తెరిచి వుండాలనీ భగవాన్ అన్నా కూడా వినిపించుకోలేదు అధికార్లు. అందుకని ఆయనే హాల్లోంచి బైటికి వచ్చి కూర్చున్నారు. కాని, అప్పటికీ ఆశ్రమం వారు ఆయన మాట వినలేదు. ఒకటే బతిమాలారు, చివరికి అట్లాగే కానీ అని హాల్లోనే వుండిపోయినారు భగవాన్.

అనేకమంది భగవాన్ కి ఫలహారాలు తెచ్చి పెట్టేవారు, వేళగాని వేళల కూడా ఆయనకి అవి జీర్ణమవుతాయా, లేదా అనే ఆలోచన కూడా లేకుండా. చాలాసార్లు అవి తిని బాధపడేవారు భగవాన్. ఒకరు యెంత తెచ్చిపెట్టినా తినేవారు. ఇంకోరు యెంతో భక్తితో విలువైన ఫలహారాలు తెచ్చిపెట్టి తినమంటే అటు తల త్రిప్పి కూడా చూసే వారుకారు. కొందరు ఆయన ముందు ఫలహారం పెట్టి, ఆయన పలక్కపోతే, అట్టానే చేతులు కట్టుకుని నించుని నించుని, ఇంక గతిలేక వెళ్లిపోయేవారు. ఒకరి చేతినుంచి ఇవాళ తిని ఇంకోసారి వాళ్లు తెస్తే, వాళ్ల వంక చూడనే చూడరు.

📖

భగవాన్ ప్రవర్తన ఎప్పటికప్పుడు మారేది. ఆయన ఏ అనంద నిబిడీకృతమైన తేజోశూన్యంలోకో కిటికీలోంచి దిక్కుల అంచుల్ని దాటి చూస్తున్నప్పుడు, ఆయన ధ్యానముద్రలో కూచున్న సాక్షాత్ దక్షిణా మూర్తి  అనిపించేవారు. పోజు లేని ఆ శాంభవీ ముద్ర ఎంతో ఆర్టిస్టిక్ గా వుండేది! ఆ అందంనించి కళ్లు తిప్పుకోలేకపోయే వాళ్లం, కదలని మారని సూర్యోదయాన్ని చూసినట్లుండేది. ఆయన ' ముఖంకాని, ఆయన దేహంకాని, మామూలుగా అందాలు అలవాటైన నా కళ్ళకి, అందంగా కనపడేవి కావు. కాని, ఆయన నిశ్చలంగా, గంభీరంగా కూచున్నారా-(ఆయన దేహం అట్లాగే వుండేది,) కాని, మరి ఏమిటో యింత అందం, ఇంత లావణ్యం! అవేంకాదు; ఏదో మనకు అలవాటైన సౌందర్యాలకి art కూడా అందుకోలేని దేదో ఆయన్ని వెలిగిస్తున్నట్టుండేది. ఒక్క కౌపీనం పెట్టుకున్న ఆయన, చక్రవర్తి దుకూలాలు కట్టుకుని, రాజలాంఛనాలతో, నవరత్న సింహాసనంపై కూచున్నట్లుగా వుండి దిగ్భ్రాము చెందేవాళ్లం, ఆ స్థితిలో నైనాసరే, ఎవరన్నా "భగవాన్!" అన్నాడూ -ఎక్కడనించి దిగివచ్చేదో ఆయనకి ఈ లోకస్మృతి. కాని సర్వాంతర్యామి అయిన ఆయన దృష్టి దిగిరావడమేముంది!

భగవాన్ని పలకరించడమంటేనే యెంతో భయం. ఏ అధికారమూ, పరివారమూ లేని, బలంలేని స్వరూపం ముందు, గొప్ప పదవుల్లో, అధికారాలలో వుండేవారు, అతి గర్విష్టులు, సైన్యాధికారులు నమస్కరించడానికి వణికిపోయినారు.

రోజుకి మూడు నాలుగుసార్లు, ఆశ్రమం నించి కొండ మీదికి వెళ్ళేవారు భగవాన్. ఆయన ముందు నడుస్తూ, వెనక కమండలం పట్టుకుని శిష్యుడూ, ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ వుండేవారు. 

అప్పుడప్పుడు కొండని ఇటూ అటూ చూసి, వెనక్కి తిరిగి శిష్యుడితో చల్లగా మాట్లాడుతూ వుండేవారు.కింద నుంచున్న నాబోటివారు తదేక దృష్టితో ఆయనవంకే చూస్తూ నుంచునేవారు, వారు కనుమరు గయిందాకా. ఏమనిపించేదంటే- అట్లా ఒక్కొక్క మెట్టే యెక్కుతూ కొండ చివరికి వెళ్లి, అక్కడనించి అట్లా ఆకాశంలోకి మాయమై ఇంక తిరిగి రారేమోననిపించేది ప్రతిసారీ.

భగవాన్ చివరి రోజుల్లో కురుపులేచి ఆపరేషన్లు అయి, శరీరం బలహీనమైన తరువాత ఆయన సోఫామీద నించి లేవడానికి చేసే ప్రయత్నం చూస్తే చుట్టూ కూచున్న వారికి ఆ బాధ తమ దేహాలలో పలుకుతున్నట్లుండేది. అట్లా బాధ పలకడా నికే ఆయన ఆ నెప్పిని పోగొట్టుకునేవారు కారేమో! ఆయన పొందిన మహోన్నత స్థితీ, అనిర్వచనీయమైన ఆనందమూ, అవేకాదు, ఆయన శరీరానికి తటస్థించిన బాధలు కూడా ఈ ప్రజలకోసమే గావును! కొన్ని ఏళ్ళు ఆయనకు మోకాళ్లు నెప్పులు వుండేవి. ఎవరో ఒకరు పంపిన మందు తైలాన్ని మర్ధన చేస్తూనే వున్నారు, పిసికే వారు. సోఫామీదనించి లేస్తూ భగవాన్ తన మోకాళ్లని పిసుక్కునేవారు. ఎవరన్నా పిసకబోతే "వుండవయ్యా! అంత పుణ్యమూ మీకేనా, ఈ మోకాళ్లని పిసికి నన్ను కొంచెం పుణ్యం సంపాయించుకోనీ” అనేవారు. ఆయన లేచి నుంచుని కర్ర నానుకుని ఒక్కొక్క అడుగు వేస్తూవుంటే, భక్తుల్లో ప్రతివారి వూపిరీ యెగిరిపోతూ వుండేది ఆయన వేసే ప్రతి అడుగుకీ.

🪷

సశేషం

No comments:

Post a Comment