*భైరవవాక -1*
🔱
అర్ధరాత్రి!
చుట్టూ కటిక చీకటి.
శీతాకాలపు చలి మనిషిని నిలువునా ఒణికించేస్తోంది. నిర్మానుష్యమైన ఆ అర్ధరాత్రి రోడ్లన్నీ వచ్చే పోయే వాహనాలతో అప్పుడప్పుడూ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తున్నాయి.
మనిషిని నిలువునా చీల్చేయడానికి కూడా వెనుకాడని కిరాయి హంతకులు........ తమ అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి అల్లకల్లోలం సృష్టించగల నాయకులు.... వీధి రౌడీల దగ్గర నుంచి అంతర్జాతీయ స్థాయిలో నేరాలు ఘోరాలు చేసి దర్జాగా తిరిగే ఎందరో నేర ప్రవృత్తి గల నరరూప రాక్షసుల స్థావరం ఆ మహానగరం.
అలాంటి ... ముంబాయ్ మహానగరంలో
అంధేరీ ప్రాంతం అది. కింగ్ సర్కిల్ సెంటర్ కి ఆమడ దూరంలో ఉన్న పదంతస్థుల అపార్ట్ మెంట్ చివరి ప్లాటులో ఆరుగురు ఆగంతకులు ఆశీనులై ఉన్నారు. ఆ ప్లాటులో అదే పెద్ద హాలు. హాలు ప్రక్కనే ఆగ్నేయంలో వంటగది, నైరుతిలోనూ, వాయవ్యంలోనూ రెండు బెడ్ రూమ్ లు ఉన్నాయి. ఉత్తరాన ముఖద్వారం ఉంది. హాలుకు ఆనుకొని ఉన్న తలుపులు అన్ని మూసి ఉన్నాయి.
అరక్షణం వారి మధ్య మౌనం రాజ్యమేలింది.
మద్యం గ్లాసులు ముందున్నా మదిలో చెక్కు చెదరని దీర్ఘాలోచనలతో అందరూ శిలల్లా కూర్చున్నారు. ఏదో కోరికతో తపస్సులో కూర్చున్న మునుల్లా ఉన్నారు.
అందరి ముందూ ఠీవిగా కూర్చున్న వ్యక్తి ముందుగా గొంతుసవరించుకున్నాడు.
"ఆరు నెలల లోపల మనం ఈ పని పూర్తి చేయాలి. మనకి తోడుగా మనకెవరికీ పరిచయం లేని .... మన గురించెవరికీ ఆచూకి చెప్పలేని.... కిరాయి గూండాలని ఆ సమయం లో తోడుగా తీసుకు వెళ్దాం. ఏమంటారు?!" అన్నాడు.
ఎవరూ మాట్లాడలేదు. అందుకు సమాధానంగా తలలూపారు. ఆ ఆరుగురిలో ఒకే ఒక్క స్త్రీ ఉంది. ఆమె లేచి నిలబడింది. ఆమెని ఎన్నో సంశయాలు.. సందేహాలు.. వెంటాడుతుండగా "నేనిప్పుడేం చేయాలి?" స్థిర నిర్ణయంతో అంది. తనడిగిన ప్రశ్న తనకే ప్రశ్నార్ధకంగా అనిపించినా
.... తనలో రేగే ఎన్నో అనుమానాలకు సమాధానం వెతుక్కుంటూ అంది.
"నువ్వీక్షణం నుంచే కార్యరంగంలో దిగాలి. నువ్వక్కడ మారువేషంలో ఈ ఆర్నెళ్లూ గడపాలి. నీతోపాటే మన మనిషి మరొకరు అక్కడే ఉంటారు. మీరిద్దరూ మన పని నిర్విఘ్నంగా సాగడానికి పధకరచన చేయాలి.” చెప్పాడతను.
"అంటే...?" కుతూహలంగా అంది ఆమె.
"మనమందరం ఎప్పుడు? ఎక్కడ? ఎలా కలవాలి? మన పని పూర్తయ్యాక ఎలా తప్పించుకోవాలి అన్న ప్రధాన పధకం సిద్ధం చేయాల్సింది మీరిద్దరే. మనలో ఏ ఒక్కరికి ఎలాంటి ప్రమాదం ఎదురు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి." ఆ ఆరుగురిలో నాయకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి అన్నాడు.
ఆమె మౌనంగా వింది.
"ఈ ప్రయత్నంలో మీ దారికెవరు అడొచ్చినా ఆలోచించకండి. వెంటనే మట్టుపెట్టండి. మన పధకం నెరవేరాలి. మనం తప్పక విజయం సాధించాలి" వేరొకవ్యక్తి లేచి నిలబడి చెప్పాడు.
"మీతో కలవాలన్నా .. మాట్లాడాలన్నా ఎలా?" మళ్ళా ఆమె లీడర్ అంది.
" మీరు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడానికి... మీకు అక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ నేనే దగ్గరుండి చూస్తాను. మనం ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం మీరిద్దరూ బయలుదేరండి. ఏ ఒక్కరికీ ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించండి. ఈ ఆర్నెల్లలో మిమ్మల్నప్పు డప్పుడూ నేను కలుస్తూనే ఉంటాను. అవసరం అయితేనే సెల్ ఫోన్లు ఉపయోగించండిసరేనా?" మాట్లాడుతూనే అతను ఒక్కసారి గతుక్కుమన్నాడు.
ఎవరో తమని గమనిస్తున్నారు. ఆ అపార్ట్మెంట్ లో..హాలుకు ఆగ్నేయంలో ఉన్న వంటగది తలుపు పక్కన ఎవరో నిలబడి ఉన్నారు.
"ఎవరై ఉంటారు . . .?"
తమ పధకం ప్రకారం 'ఆంధ్రా' లో పని పూర్తి కాగానే అందరూ ఇక్కడ... ఈ ముంబాయిలో కలసుకోవడం కోసం తీసుకున్న ఆపార్ట్మెంట్ ఇది. ఏ ఒక్కరికీ అనుమానం రాకుండా ఉండడానికి ఈ అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి కాపురం ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసాడు. అతనికి తమ పథకం తెలియకూడదని అరగంట ముందే పని పురమాయించి బైటకు పంపేసాడు తను.
అతనూ ఓ మోస్తరు నేరస్తుడే. పొట్ట కూటికి చిన్నా చితక దొంగతనాలు చేసుకు బ్రతికే మనిషి, ఎవరూ లేని ఏకాకి. కొంపదీసి అతను కాదు కదా!?! తామంతా ఎందుకు ఇక్కడ ఇలా కలిసామో ఆరా తీస్తున్నాడా?!
అర్ధగంట నుంచీ తాము మాట్లాడుకుంటున్న మాటలన్నీ పొంచి వింటున్నాడా? అతను అంతర్జాతీయ స్థాయిలో తాము చేపట్టబోతున్న నేరాన్ని పసిగట్టేసాడా?!'
ఆ ఆలోచన కలగడంతోనే అతనికి ఒక్కసారిగా ముచ్చెమటలు పోసాయి.
'కోట్ల రూపాయల విలువచేసే తమ బృహత్తర పధకాన్ని తెలుసుకున్నాడా?!' ఆ వూహ అతని మదిలో మెదిలేసరికి కోపం తారాస్థాయిని అందుకుంది.
ఆ గదికేసి తిరిగి" ఎవరది?! ఇలా రండి!" బిగ్గరగా... కర్కశంగా అరిచాడు.
అతని గొంతు తీవ్రతకి అక్కడున్న వారితోపాటు గదికి ఆవల తలుపు ప్రక్కన నిలబడ్డ వ్యక్తి గజగజవణికి పోయింది, తనని గమనించి తనకేసి అతి భయంకరంగా చూస్తూ రమ్మని పిలుస్తున్నట్టు గ్రహించి భయంతో వణికి పోయిందామె.
తననే పిలుస్తున్నాడని గ్రహించి గబాల్న వారి ముందుకొచ్చి నిలబడింది.
ఆమె చేతిలో పళ్లు, ఫలహారాలతో నిండివున్న 'ట్రే' ఉంది. తనూహించుకున్నట్టు జరగలేదు. అతను కాదు.' తన పిచ్చిగాని బయటకు వెళ్ళిన వ్యక్తి ఇక్కడ ఎలా ఉంటాడు?
అయితే, ఈమె ఎవరు?!
తామంతా అరగంటయి ఈ అపార్ట్మెంట్ లో ఉండగా ఈమెని చూడలేదు.
అతను పనిమీద బైటకు వెళ్తూ సోడాలు, నీళ్లు, డ్రింకులు, మందు సర్వే చేసి వెళ్ళాడేగాని 'ఈమె' తనతో పాటు ఇక్కడే ఉన్న విషయం మాట మాత్రం చెప్పలేదు.
"ఎవర్నువ్వు?" అతను ఇంకా ఏదో అడిగేలో గానే పళ్ళూ, ఫలహారాల 'ట్రే' బల్లమీద ఉంచేసి ఛటుక్కున వంటగది పక్కనే ఉన్న వరండాలోకి పరుగున వెళ్ళిపోయిందామె.
అక్కడున్న అందరికీ నోటమాట రాలేదు. బైటకు వెళ్ళిన వ్యక్తి వచ్చేలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి? అనుమానం లేదు. ఈమె తమ గురించి సర్వం తెలుసుకుంది. అందుకే భయపడి పారిపోయింది.
ఇప్పుడెలా?! ఈమెనిలా వదిలేస్తే విషయం విషమౌతుంది. ఈమె నుంచి అతనికి చేరుతుంది అలా ... అలా ... ?! నో! నెవ్వర్!
ఆ ఆరుగురిలోనూ అదే ఆలోచన.... అదే ఆందోళన ...!
🔱
*సశేషం*
****
*భైరవవాక - 2*
🔱
ఆ ఆరుగురిలోనూ అదే ఆలోచన.... అదే ఆందోళన ...!
టీమ్ లీడర్ స్థిర చిత్తంతో లేచి నిలబడ్డాడు. అందరిలోకీ ముందుగా తేరుకున్న వ్యక్తి అతనే. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళాడు.
వరండాలో నిలబడి ఎత్తైన పదంతస్థుల భవనం లో నుంచి నగరం అందచందాలు తిలకిస్తూ నిలబడిందామె.
దేదీప్యమైన కాంతులతో ముంబాయ్ మహానగరం కళకళలాడుతోంది. రోడ్ల మీద తూనీగల్లా తిరుగుతున్న వాహనాల హెడ్ లైట్ వెలుగులు పోటీ పడి పరిగెడుతున్న ట్టున్నాయి. ఎత్తైన భవనాలు భీకర పోరాటానికి సిద్ధంగా ఉన్న ఆంబోతుల్లా ఉన్నాయి. నగరమంతా వెలిగిన వెలుగు మిలమిల మెరుస్తూ ఆరబోసిన నక్షత్రాల సముదాయంలా ఉంది.
అడుగుల సవ్వడి కాకుండా నెమ్మదిగా వెళ్ళి ఆమె వెనుకే నిలబడ్డాడతను. ఆమె భుజం మీద చెయ్యివేసాడు. ఉలిక్కిపడి వెనుదిరిగిందామె.
ఆమె కళ్ళల్లో బెదురు భయం స్పష్టంగా గోచరించాయతనికి. చిన్నగా ... పరిచయంగా నవ్వాడు.
ఆమె మనసు కొంచెం కుదుట పడ్డట్టయింది. రాని నవ్వు పెదవుల పైకి తెచ్చుకుంటూ కనీ కనిపించకుండా నవ్వింది.
అంతలోనే కర్తవ్యం అతన్ని రాక్షసుణ్ణి చేసింది.
పద్దెనిమిదేళ్ళు కూడా నిండా నిండని ఆమెని అమాంతం రెండు చేతులతో గండెలకు హత్తుకున్నట్టే ఎత్తుకొని ఎత్తైన భవనం పైనుంచి క్రిందకు పడేసాడు.
ఆ క్షణం అతను నరరూప రాక్షసుడే అయ్యాడు. క్షణంలో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ఆమెని ఏం చేస్తాడో తెలీక ఉత్సుకతతో అతని వెంటే వరండా దగ్గరకు చేరుకొని కొంచెం దూరంగా నిలబడి గమనిస్తున్న మిగతా వారంతా ఆ సంఘటన చూసి అవాక్కయ్యారు. అంతులేని ఆందోళనతో అదిరిపడ్డారు.
ఇప్పుడా వ్యక్తి బైట నుంచి వస్తే ఏం చెప్పాలి? అందరి వదనాల్లోనూ అదే ఆలోచన. అదే ఆందోళన.
అంతలోనే కాలింగ్ బెల్ మ్రోగింది.
అందరూ ఒకరి మొహాలోకరు చూసుకున్నారు. అందరికీ ఆందోళనగానే ఉంది. అంతుచిక్కని ఆలోచన చిత్రవధ చేస్తూనే ఉంది.
ఏం జరగబోతోందో ఎవరికీ అంతు చిక్కటం లేదు. నాయకుడే ముందుగా తేరుకొని తలుపులు తీసాడు.
అవతలి వ్యక్తి గదిలోకి అడుగుపెట్టాడు. అతని చేతిలో పీటర్ స్కాట్ ఫుల్ బాటిల్స్ ఉన్నాయి.
అందరూ ఆందోళనగా వరండాలో నిలబడి ఉండడం గమనించాడతను. బాటిల్స్ హాల్లో టేబుల్ మీదుంచి ఆత్రుతగా వారి దగ్గరకు చేరుకున్నాడు.
"ఏమైంది?!" ప్రశ్నించాడతను. ఏదో జరగరానిది జరిగిందని గ్రహించాడు.
"నీ ఇంట్లో ఉంటున్నామె పై నుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకుంది. వెనుక నుంచి తలుపులు బిడాయించి వస్తూ ఆ గ్రూపు లీడర్ చెప్పాడు.
"అబద్ధం” అప్రయత్నంగా అన్నాడతను.
"నేనే ఆమెని పైనుంచి తోసేసాను. ఇది నమ్ముతావా?" నిష్కర్షగా చెప్పాడు లీడర్.
ఆఁ !"అతనికి నోటమాట రాలేదు. భయం నెమ్మది నెమ్మదిగా అతని శరీరాన్ని ఆవహిస్తోంది.
'అతనికి తెలుసు ఈ ఆరుగురూ ప్రాణాలు తీయడానికైనా వెనుకాడని నరరూప రాక్షసులని. వీళ్ళందరికీ నాయకుడైన ఇతను తన కార్యం నెరవేరడం కోసం దేనికైనా తెగిస్తాడని తెలుసు. అయితే భుక్తి కరువై అతను కోరిన ప్రకారం తానీ అపార్ట్ మెంట్ లో కాపురం ఉండడానికి అంగీక రించాడు. దానికి ప్రతిఫలంగా పుష్కలంగా డబ్బు కూడా ఇచ్చాడు. అందుకే ఆనందంగా అంగీకరించాడు. అయితే, అన్నెం పున్నెం ఎరుగని అమాయకురాల్ని ఎందుకు చంపారు?!' ఆలోచనలతో అచేతనంగా నిలబడ్డాడతను. ఏం మాట్లాడితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో నని అతనికీ భయంగానే ఉంది. 'తప్పుగా ప్రవర్తిస్తే తన తల తీసేసినా తీసేస్తారీ దుండగలు'.
"ఏం? మా మాటలు నమ్మటం లేదా?" వారితో ఉన్న ఆమె అంది.
"మా మాటలు ... మా పధకం విన్న ఎవరైనా బ్రతికుండరని నీకు తెలుసు అవునా?" లీడరే నిలదీసాడు.
"అవునవును... కానీ...?" అతనికి ఏం చెప్పాలో పాలు పోలేదు.
"ఏఁవిటీ? పోలీసు భయమా?! అదేం జరక్కుండా నేను చూస్తాను. ప్రమాద వశాత్తు పడిపోయినట్టు అందర్నీ నమ్మిద్దాం. నీ పైన ఎలాంటి అనుమానం రాకుండా నేను చూస్తాను. సరేనా.... ?!" సముదాయిస్తున్నట్టే అన్నా 'హుకుం జారీ చేస్తున్నట్టే ఉంది నాయకుడి గొంతు.
"ని..జ..మే..! మీరుండగా నాకలాంటి భయమెందుకు? ఎవరూ లేని అనాధ పిల్లని నాకు తోడుగా ఉంటూ వంట పని... ఇంటిపని చేస్తుందని ఉండమన్నాను. అయితే, ఆ పిల్లకి మన మాటలు సరిగ్గా వినపడవు. గట్టిగా కేకేసి చెప్తేగాని ఏం అర్ధంకాదు. సరికదా, ఏం మాట్లాడలేదు కూడా" అతను బాధగా అన్నాడు.
"అర్ధంకాలేదు.” నిశ్చలంగా ... నిర్వికారంగా అన్నాడు గ్యాంగ్ లీడర్.
"ఆ అమ్మాయి మూగపిల్ల. చెవులు కూడా సరిగ్గా పనిచెయ్యవు". ఒకింత నిష్ఠూరం గానే అన్నాడతను. మీరందరూ కలిసి ఆ అమాయకురాల్ని పొట్టనబెట్టుకున్నారనే అర్థం ధ్వనించేలా ఉందతని గొంతు.
అతను చెప్పింది వినేసరికి ఆ ఆరుగురూ ఒక్క క్షణం అచేతనంగా నిలబడి పోయారు.
📖
చీకటి తెరలు ఆకాశాన్ని ముసురుకుంటు న్నాయి. చంద్రుని కిరణాలు దట్టంగా అలముకుంటున్న మబ్బుల్ని చీల్చడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. మంచు వెండి జరీలా అల్లుకుంటోంది. పిల్లగాలి నెమ్మదిగా
... హాయిగా శరీరాన్ని తాకుతోంది.
పాత్రో మనసుకు ఆనందంగా ఉంది.
ఎన్నాళ్ళయిందో కదా ఆంధ్రాలో అడుగు పెట్టి. ఎప్పటి మాట? ఎన్నేళ్ల జ్ఞాపకం! ఆంధ్రాలో ఆరు నెలలు కాపురం ఉన్నాడు. ఆ ఆర్నెల్లలో తేట తెలుగు తియ్యదనాన్ని.. కమ్మదనాన్ని ఆస్వాదించగలిగాడు. మధురమైన తెలుగు నుడికారాన్ని అంతో ఇంతో అర్థంచేసుకోగలిగాడేగాని నేర్చుకో లేకపోయాడు.
ఆ రోజుల్లో...
ఉద్యోగరీత్యా శ్రీకాకుళం ప్రాంతాల్లో గడిపినా అప్పుడప్పుడూ విహార యాత్రలా విశాఖపట్నంలో సుందర సముద్ర తీరం... అమోఘమైన పారిశ్రామిక వాడే కాకుండా అందమైన వైజాగ్ జిగిజాగ్ లని నలుమూలలా తిరిగి తిలకించాడు.
విజయనగరం భూపతుల కోటంతా మూల... మూల పరికించి ... పరిశీలించి చూడగలిగాడు. కైలాసగిరి, ఉడా పార్క్, తొట్ల కొండలోని బౌద్ధరామం ఇలా ఎన్నో చూసాడు.
విశాఖ ఉక్కు కర్మాగారం పనులు ఎలా సాగుతున్నాయో చూడ్డానికి పంపబడ్డ ప్రతినిధిలా రెండు రోజులు అటు అగనం పూడి నుంచి ఇటు భీమిలి ప్రాంతమంతా తిరిగి... తిరిగి...
అబ్బ ! ఆ అనుభవాలు... అనుభూతులు గుర్తొస్తేనే మధురంగా ఉన్నాయి. ఆ క్షణం గుర్తొచ్చేసరికి పాత్రో మనసు పులకించిపోయింది.
రాయపూర్ ఎక్స్ ప్రెస్ గున్న ఏనుగులా ఆయాసంతో రొప్పుతూ... అరుస్తూ... పరుగులెడుతోంది. కొండచిలువలా భారంగా మెలికలు తిరుగుతూ ముందుకు సాగుతోంది.
పాత్రో ఆలోచనలు ఆవిరిలా పైకెగసి పోయాయి.
ఏదో గుర్తొచ్చి కిందా మీదా జేబులన్నీ ఆత్రుతగా... ఆందోళనగా వెతుక్కున్నాడు.
వెనుక జేబులో భద్రంగా దాచుకున్న కాగితం బైటకు తీసాడు. అది అతని మిత్రుడు రాసిన ఉత్తరం. ఇప్పటి సెల్ ఫోన్ ల మూకుమ్మడి దాడిలో గుర్తుగా మిగిలిన తియ్యటి జ్ఞాపకం ఆ ఉత్తరం. ఆనందాన్ని పంచుకోవాలన్న... అనుభవాల్ని నెమరు వేసుకోవాలన్న... క్షణాలను అణాలతో గుణించే సెల్ ఫోన్ కి వీలవుతుందా? లేదుగాక లేదు!. ఉత్తరానికి ఉన్న ఉదాత్త గుణం దేనికీ లేదు.. రాదు. మనసు పులకించిన ప్రతిక్షణం ఎన్నిసార్లు చదివి చదివి చేతుల్లో నలిగి నలిగి, నీరసించినా ఉత్తరం నిత్యం సత్యమే. చదివిన ప్రతి క్షణం నవరస భరితంగా భావోద్విగ్నతలు పంచుతూనే ఉంటుంది. ఈ ఒక్క ఉత్తరం ఎన్ని ఏళ్ళయినా... ఎన్ని సార్లయినా... జ్ఞాపకం వచ్చిన ప్రతిక్షణం... చదివిన ప్రతి ఘడియ ... ఘడియకూ.... అందాన్ని... ఆనందాన్ని... అనుభూతుల్ని అందిస్తూనే ఉంటుంది. బ్రతుకు పుస్తకంలో చెరగని చిరునవ్వుల మిగిలివుంటుంది.
అందుకే అప్పటికి... ఇప్పటికి... ఎప్పటికి మా మధ్య ఉత్తరాలే ఊసుల్ని మోసుకొస్తుంటాయి.
మేమెళ్తున్న దివ్య క్షేత్రం హిల్ ప్రాంతం కావటం వలన సెల్ సిగ్నల్స్ నిల్. ఏదో ఒకటి రెండు సెల్ కంపెనీ వాళ్ళ సెల్స్ పనిచేస్తే చెయ్యొచ్చు అని ముందే చెప్పాడు విశ్వం.
'విశ్వం' పేరులాగే విశాల హృదయుడు విశ్వం.
విశ్వం ఎప్పుడు గుర్తొచ్చినా పాత్రో మనసు ఆనంద తాండవం చేస్తుంది. అప్పటికే నలిగి నీరసించి మంచాన పడి రోగిలా, ముడతలు పడి చిరగడానికి సిద్దంగా ఉన్న ఉత్తరాన్ని జాగ్రత్తగా విప్పాడు పాత్రో.
🔱
*సశేషం*
రచన: ఇందూ రమణ