Saturday, 2 December 2017

ప్రాంజలి ప్రభ - (జి .కే - 7)



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - (జి .కే - 7)


సేకరణ/ రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  

మానవజన్మ - సుగుణాలు 

హస్తస్య భూషణం దానం -- చేతులకు దానమే భూషణం 

సత్యం కంఠస్య భూషణం -- కంఠమునకు సత్యమే భూషణం 

శ్రోతస్య భూషణం శాస్త్రం -- చెవికి ధర్మ వచనములే ఆభరణం. 

ఇవే సహజమైన, శాశ్వతమైన భూషణాలని ఘోషించాడు భర్తృహరి. మానవ ధర్మానికి సంబంధించిన ఈ సుగుణాలు లేకుంటే మానవజన్మ వ్యర్ధమవుతుందని హెచ్చరించాడు.    

ఒక అడవిలో మనుష్య శవం ఉంది. కొద్ది దూరంలో మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ శవాన్ని తినేందుకు నక్క ముందుగా శవం చేతులను సమీపించింది. ఆ మహర్షికి అతరాయం కలిగి కన్నులు తెరచి చూశాడు. వెంటనే దివ్య  దృష్టితో చనిపోయిన ఆ వ్యక్తిని గురించి తెలుసుకున్నాడు. నక్కను ఉద్దేశించి " ఈతని చేతులు ఎన్నడూ దానం చేసి ఎరుగవు. కనుక వాటిని తినకూడదని" అన్నాడు. అప్పుడా నక్క చేతులను వదలి చెవులను తినబోగా, " ఈతని చెవులు ఏనాడు ధర్మశాస్త్రాలు గాని, ఆత్మజ్ఞానానికి సంబంధించిన అంశాలనుగాని వినలేదు. కాబట్టి చెవులు ముట్టతగినవి కావు" అని అన్నాడు. అప్పుడా నక్క కళ్ళను తినబోయింది. " ఈ నేత్రాలెన్నడు సాధువులను దర్శించినవి కావు. కనుక తినరాదని" అన్నాడు. అప్పుడా నక్క కాళ్ళను తిందామనుకుంది. అది గ్రహించి, " ఆ కాళ్ళు ఏనాడు మానవులను భవసాగరమునుంచి తరింప సజ్జనులను, తీర్ధాలను దర్శించి ఎరుగవు. కావున తినడానికి తగినవి కావని" అన్నాడు. 

మృతుడి ఉదరం అన్యాయార్జితంతో పెరిగింది కాబట్టి అదీ తినకూడనిదేనని మహర్షి చెప్పాడు. అప్పుడా నక్క కనీసం తలనైనా తిని తన పొట్ట నింపుకొందామనుకుంది. బతికి ఉండగా ఇతగాడి తల గర్వంతో మిడిసిపడుతుండేది. అదీ  తినేందుకు తగింది కాదని మహర్షి వారించాడు. మహర్షి ఆ నక్కకు తన ఆశ్రమంలోని కందమూలములు ఇచ్చి దాని క్షుద్భాధ తీర్చి పంపాడు. 

" సత్యవాది, ధర్మాత్ముడు, సదాచారశీలి . సౌశీల్యమూర్తిగా మనిషి మెలగితేనే మానవధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తించినట్లు " అని ఈ కధ ద్వారా మనం గ్రహించాల్సినది.


No comments:

Post a Comment