( శ్రీ శంకర భగవత్పాద విరచితము)
జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు రచించిన స్తోత్ర గ్రంథాలలో " సౌందర్య లహరి", " శివానంద లహరి" ఒక ప్రత్యేక తను సంతరింౘు కొని మకుటం లేని శతకాలుగా కీర్తి శిఖరాలను అందు కున్నాయి. " సౌందర్య లహరి" శ్రీ విద్యా రహస్యాలతో శోభిల్లగా, " శివానందలహరి" పరబ్రహ్మ భావనయే పరమేశ్వర భావనగా విరాజిల్లునట్టిది.
జగద్గురువు లు ఆదిశంకరులు అనుగ్రహించిన " శివానందలహరి" ఒక భక్తిరస సింధువు. శివాత్మకమైన ఆనంద పయోనిధిలో ని ఒక్కొక్క తరంగమొక్కొక్క శ్లోకము.
నేను పామరుణ్ణి అనుకొనే వాడు కూడా__ఈ శ్లోకాలను ,అందులోని భావాలను ౘదివి, పండితుడ య్యే అవకాశముంది. ౘదవడానికి ప్రయత్నం చేయడమే మనపని. ఆ తరువాత అదే ౘది విస్తుంది.
దేవాది దేవుడైన పరమశివుడిని చేరుకోవాల్సిన అవసరాన్ని, అందుకు మార్గాన్నీ " శివానందలహరి" మనకు ౘూపిస్తుంది. దీన్ని ౘదువుదాం శివుని కృపాదృష్టికి పాత్రులవుదాం.
పూర్వము " సౌందర్య లహరి" ని అపూర్వంగా అపురూపంగా ఆదరించి నన్ను ప్రోత్సహించిన బంధుమిత్రులు ఈ " శివానందలహరి" ని కూడా ఆస్వాదిస్తారని , ఆశిస్తున్నాను.
విశ్వనాథుడైన పరమశివుడు ౘదువరులందరికీ అభీష్ట సిద్ధిని ప్రసాదింౘుగాక.
శివానందలహరి
1 వ శ్లోకం
(19_02_18)
" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"
అవతారిక:
పూజ్యశ్రీ కరుణాంతరంగులైన శ్రీ శంకర భగవత్పాదులు పరమేశ్వరునికి నమస్కరింౘడంవల్ల, సమస్త పురుషార్థములు సిద్ధిస్తాయని తెలిసి, సంసార సాగరం నుండి తాము తరింౘడానికి, ఇతరులను తరింపచేయడానికి ఈశ్వరుణ్ణి స్తోత్రం చేయడానికి ప్రారంభిస్తూ, నిర్విఘ్నంగా గ్రంథం పూర్తి కావడానికి, పార్వతీ పరమేశ్వరులకు నమస్కార రూపమైన మంగళమును చేస్తున్నారు.
"కలాభ్యాం ౘూడాలంకృత శశికలాభ్యామ్ నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే
శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున
ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్!!"
పదవిభాగం:
కలాభ్యాం - ౘూడాలంకృత శశికలాభ్యామ్ - నిజతపఃఫలాభ్యామ్ - భక్తేషు - ప్రకటితఫలాభ్యామ్ - భవతు - మే - శివాభ్యామ్ - అస్తోకత్రిభువన శివాభ్యామ్ - హృది - పునర్భవాభ్యామ్ - ఆనంద స్ఫురదనుభవాభ్యామ్ - నతిః - ఇయమ్.
తాత్పర్యం:
సకల విద్యాస్వరూపులునూ , సిగలపై అలంకరింౘుకొనిన చంద్రరేఖలు గలవారు నూ, ఒండొరుల తపస్సు నకు ఫలంగా దాంపత్యమును పొందిన వారు నూ, భక్తులకు అభీష్ట ఫలములను ఇౘ్చువారునూ ,, ముల్లోకములకూ అధికమైన మంగళములను ఇౘ్చువారునూ, ధ్యానము చేయువారల హృదయంలో మాటిమాటికీ సాక్షాత్కరింౘువారునూ, ఆనందంతో పాటు స్ఫురింౘు అనుభవం గలవారునూ, అయిన పార్వతీపరమేశ్వరుల కు నా నమస్కారములు అగుగాక !
( నమస్కరిస్తున్నాను).
వివరణ:
ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరుల నిద్దరినీ ఉద్దేశించి చేసిన ప్రార్థనా శ్లోకమిది. శివా శివులిద్దరూ ఒకరిని ఒకరు ఆశ్రయించి ఉంటారు. "శివశ్శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం" అనగా శివుడు శక్తితో కలసి నపుడే, సృష్టికార్యానికి శక్తుడవుతాడని శంకరులు సౌందర్య లహరి లో
చెప్పియున్నారు.
పార్వతీపరమేశ్వరుల వలెనే, లక్ష్మీనారాయణులు, సీతారాములు, రాధాకృష్ణులు
సరస్వతీ చతుర్ముఖులు - వంటి జంటలనూ, వీరిని ఒకరిని విడిచి ఒకరిని ఉపాసింౘరాదు. భక్తులు పైవిషయాన్ని గమనింౘాలి.
--((**))--
No comments:
Post a Comment