Wednesday, 21 October 2015

ప్రాంజలి ప్రభ - భజ గోవిందం వివరణ (1-15 శ్లోకాలు),

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం

సర్వేజనాసుఖినోభావంతు

భజ గోవిందం వివరణ (1-15 శ్లోకాలు)

1. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే, నహినహి రక్షతి డుకృఙ్కరణే ||
2. మూఢ ! జహీహి, ధనాగమతృష్ణాం, కురుసద్ బుద్ధిం మనసి వితృష్ణాం |
యల్లభసే నిజకర్మోపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తం ||

3. నారీస్తనభరనాబీదేశం, దృష్ట్వా మాగా మోహావేశం|
ఏతన్మాంసవసాదివికారం, మనసి విచింతయ వారం వారం ||

4. నళినీదళగతజలమతితరళం, తద్వత్ జీవిత మతిశయచపలం|
విద్ధి, వ్యాధ్యభిమానగ్రస్తం, లోకం శోకహతం చ సమస్తం ||

5. యావత్ విత్తోపార్జనశక్తః తావన్నిజపరివారోరక్తః |
పశ్చాత్ జీవతి, జర్జరదేహే, వార్తాం కీపి న పృచ్చతి గేహే ||

6.యావత్ పవనో నివసతి దేహే, తావత్ పృచ్చతి కుశలం గేహే |
గతవతి వాయౌ దేహాపాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే ||
7. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీ సక్తః |
వృద్ధస్తావత్ చితాసక్తః పరమే బ్రహ్మణి కో పి న సక్తః ||

8. కాతే కాంతా కస్తే పుత్రః, సంసారోయమతీవ విచిత్రః, |
కస్య త్వం వా కుత ఆయాతః తత్వం చింతయ తదిహభ్రాతః ||

9. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే, నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

10. వయసి గతే కః కామ వికారః శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారో, జ్ఞాతే తత్త్వే కః సంసారః ||

11. మా కురు ధనజనయౌవన గర్వం, హరతి నిమేషాత్ కాలః సర్వం|
మాయామయమిదమఖిలం బుద్ధ్వా, బ్రహ్మ పదం త్వం ప్రివిశ విదిత్వా||

12. దినయౌమిన్యౌ సాయం ప్రాతః, శిశిరవసంతౌ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్వాశావాయుః ||

13. కాతే కాంతా ధనగతచింతా, వాతుల కిం తవ నాస్తి నియంతా |
తిజగతి సజ్జనసంగతిరేకా, భవతి బవార్ణవతరణే నౌకా ||

14. జటిలో ముండీ లుంచిత కేశః, కాషాయాంబర బహుకృతవేషః |
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదరనిమిత్తం బహుకృతవేషః ||

15. అంగం గళితం, పలితం ముండం, దశనవిహీనం జాతుం తుండం |
వృద్ధో యాతి గృహీత్వా దండం, తదపి నముంచత్యాశాపిండం ||

భజ గోవిందం వివరణ (1-15 శ్లోకాలు)

1. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే, నహినహి రక్షతి డుకృఙ్కరణే ||

"గోవిందుని భజించు, సేవించు గోవిందుని, గోవిందునే భజింపవోయీ మూఢమతీ ! నీ అంత్యకాలం ఆసన్నమైనప్పుడు నీవు వల్లెవేస్తున్న ఈ వ్యాకరణసూత్రం నిన్ను ఏవిధంగానూ రక్షించలేదు సుమా"

2. మూఢ ! జహీహి, ధనాగమతృష్ణాం, కురుసద్ బుద్ధిం మనసి వితృష్ణాం |
యల్లభసే నిజకర్మోపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తం ||

"ఓ మూఢుడా ! ధనార్జన 
చేయాలనే తృష్ణను నీ మనసు నుండి పారద్రోలు. తృష్ణ లేకుండా చేయబడిన నీ మనసులోనికి, సద్బుద్ధితో కూడియున్న ఆలోచనల్నే ప్రవేశింపజేయి. నీ స్వధర్మానుగుణమైన కర్మలు చేస్తూ, వాటివల్ల లభించు విత్తము (ఫలము)ను అనుభవిస్తూ ఆనందించు."

3. నారీస్తనభరనాబీదేశం, దృష్ట్వా మాగా మోహావేశం|
ఏతన్మాంసవసాదివికారం, మనసి విచింతయ వారం వారం ||

వనితల వక్షస్థల శోభ, నాభీస్థల ఆకర్షణలో పడి, మోహావేశానికి పాల్పడవద్దు. అవి కేవలం శరీరంలోని మాంసము, కొవ్వులతో ఏర్పడిన ఆకారాలు మాత్రమే అని బాగుగ గ్రహించి, మాటి మాటికి ఈ సత్యాన్నే గుర్తు తెచ్చుకుంటూ ఉండు.

4. నళినీదళగతజలమతితరళం, తద్వత్ జీవిత మతిశయచపలం|
విద్ధి, వ్యాధ్యభిమానగ్రస్తం, లోకం శోకహతం చ సమస్తం ||

తామరాకు మీది నీటిబిందువెంత తరళమై యుంటుందో (అస్థిరంగా కదులుతుందో) అలాగే ఈ జీవితం కూడా అతి చపలం (చంచలం) అయినట్టిది. ఈ లోకమంతా రోగాలతోనూ, మానసిక దురహంకార, దుఃఖః, దురభిమానాలతోనూ పీడింపబడుతూ ఉంటుందని తెలుసుకో.

5. యావత్ విత్తోపార్జనశక్తః తావన్నిజపరివారోరక్తః |
పశ్చాత్ జీవతి, జర్జరదేహే, వార్తాం కీపి న పృచ్చతి గేహే ||

నీలో ధనార్జన శక్తి ఉన్నన్నాళూ (నీవు సంపాదిస్తున్ననాళ్ళూ) నీ పరివారం అంతా నీ యందు అనురాగం చూపుతారు. ఆ తరవాత నీ దేహంలో ముసలితనం ప్రవేశించినప్పుడు, నీ ఇంట్లోనే, నీ క్షేమ సమాచారాలు ఎవారూ అడగరు.

6.యావత్ పవనో నివసతి దేహే, తావత్ పృచ్చతి కుశలం గేహే |
గతవతి వాయౌ దేహాపాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే ||

శరీరంలో ఊపిరి ఉన్నంతవరకే, ఇంట్లో వారు నీ కుశలం గురించి అడుగుతారు. ఆ వాయువు కాస్తా వెళ్ళిపోయి, దేహం చెడేసరికీ, ఈ శరీరాన్ని చూసి నీ భార్య కూడా భయపడిపోతుంది.

7. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీ సక్తః |
వృద్ధస్తావత్ చితాసక్తః పరమే బ్రహ్మణి కో పి న సక్తః ||

దేనియందైనా ఆసక్తి, అనురాగం, సంగము కలిగితే అది మనుజుని కాళ్ళకు గొలుసులాగ బంధించి, పైకి లేవనీయదు. బాల్యంలో ఆటపాటలయందుండు ఆసక్తి బంధించుతుంది. ప్రౌఢవయస్సులో సంసార బరువు బాధ్యతలు బంధించుతాయి. వృద్ధాప్యంలో అనేకరకాల చింతలు - పూర్వపు ఆశానిరాశలు, గతించిన అధికార బలదర్పాలు, ప్రస్తుతపు అనారోగ్య శక్తిహీనతలు గురించిన చింతలు, బంధించుతాయి. జీవితం అంతా ఈ విధమైన బంధనాలతోనే సతమతమవుతుంటాడు గానీ పరబ్రహ్మను గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపడు. ఇది చాలా శోచనీయస్థితి కదా !

8. కాతే కాంతా కస్తే పుత్రః, సంసారోయమతీవ విచిత్రః, |
కస్య త్వం వా కుత ఆయాతః తత్వం చింతయ తదిహభ్రాతః ||

నీ భార్య ఎవరు ? నీ పుత్రుడెవరు ? నీ వెవరివాడవు ? ఎక్కడనుంచి వచ్చావు ? ఈ సంసారం అతి విచిత్రమైనది సుమా ? ఈ తత్వం గురించి నీవు ఇపుడే బాగుగ విచారణ చేయవోయి తమ్ముడా ! (భ్రాంతుడా)!

9. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే, నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

నిస్సంగం (అసంగం, సంగరాహిత్యం) అనగా దేనియందూ, ఏ విధమైన అనురక్తి లేకుండడం, సంగము (ప్రగాధమైన అనుబంధం) వస్తువులందు, వ్యక్తులందు, విషయాలందు ఏర్పడుతుంది. సంగము సంకెళ్ళవలె మానవుని బంధించివేస్తుంది. ప్రాపంచిక విషయాల్లో, లౌకిక వ్యాపారాల్లో తగుల్కొంటున్న కొద్దీ ఈ బంధనాలు మరింత దృఢమైపోతాయి. దీనికి విరుగుడు సంత్సంగమే అని పేర్కొన్నారు. సత్సంగమంటే, సజ్జనులతోను, సత్గ్రంధములతోను, సత్ కర్మలతోను, సత్ స్వరూపునితోను సంగము (సాంగత్యము, సంపర్కము) ఏర్పరచుకోవడం. సత్సంగ్ మానవునికి ఎనలేని మేలును చేకూర్చుతుంది. ఇలా సత్సంగాలలో పాల్గొని నిశ్చలతత్వాన్ని, జీవన్ముక్తిని సాధించాలి.

10. వయసి గతే కః కామ వికారః శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారో, జ్ఞాతే తత్త్వే కః సంసారః ||

వయసు గతించి, యౌవనం క్షీణిస్తే, ఇక కామవికారం (తృష్ణ) ఎక్కడుంటుంది ? నీరు ఎండిపోతే ఇక చెరువు ఎక్కడుంటుంది ? సిరిసంపదలు హరించుకుపోతే ఇక ఆశ్రిత జనాలెక్కడుంటారు ? తత్వజ్ఞానం కలిగితే ఇక సంసార వ్యామోహం ఎక్కడుంటుంది ?

11. మా కురు ధనజనయౌవన గర్వం, హరతి నిమేషాత్ కాలః సర్వం|
మాయామయమిదమఖిలం బుద్ధ్వా, బ్రహ్మ పదం త్వం ప్రివిశ విదిత్వా||

నీకు విశేషమైన ధనమున్నదనిగాని, ప్రజల మద్దతు ఉన్నదని గాని, యౌవన శక్తి ఉన్నదనిగాని గర్వించకు. వీటన్నిట్ని కాలం ఒక్కనిముషంలోనే హరించి వేయగలదు సుమా! ఇదంతా మాయామయం అని గుర్తించి బ్రహ్మపదాన్ని తెలుసుకొని అందు ప్రవేశించు.

12. దినయౌమిన్యౌ సాయం ప్రాతః, శిశిరవసంతౌ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్వాశావాయుః ||

రాత్రీపగళ్ళు, ఉదయం సాయంసంధ్యలు, శిశిర వసంతాది ఋతువులు, క్రమం తప్పకుండా ఒకదానివెనుక ఒకటిగా, వస్తూపోతూ, చక్రంలాగ తిరుగుతూ ఉంటే, కాలం, వినోదంగా ఆడుకుంటూ, ఆయువును హరించుకుపోతుంటే, మానవుడు మాత్రం తన ఆశా, కాక్ష, మమకారాల గూడును విడువకుండా అంటిపెట్టుకుని ఉంటాడు.

13. కాతే కాంతా ధనగతచింతా, వాతుల కిం తవ నాస్తి నియంతా |
తిజగతి సజ్జనసంగతిరేకా, భవతి బవార్ణవతరణే నౌకా ||

ఓయీ వాతులా ! (వాతుల అంటే మూర్ఖుడే కాదు, ఇంద్రియలోలుడు కూడా) కామినీ కాంచనాల గురించే నీకెందుకయ్యా ఇంత యాతన ? చింతన చేయడానికి నీకు ఈశ్వరుడు లేడా ? సంసార సాగరాన్ని దాటించగల నౌక, ఈ ముల్లోకాల్లోనూ ఒక్కటే ఉన్నది. అదే సజ్జన సాంగత్యమని తెలుసుకో !

14. జటిలో ముండీ లుంచిత కేశః, కాషాయాంబర బహుకృతవేషః |
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదరనిమిత్తం బహుకృతవేషః ||

జడలు కట్టిన జుట్టు కలవాడైనను, గుండుగా గీయబడిన తలగలవాడైనను, వెంట్రుకలని ఒక్కొక్కటిగా పీకివేయబడిన తలగలవాడైనను, కాషాయ వస్త్రం ధరించినవాడైనను, ఇలాంటి అనేకమైన వేషాలు వేసినవాడైనను, చూస్తూ కూడా, ఏమీ చూడనట్టి మూఢుడే , ఏలనన, ఈ వేషాలన్నీ, కేవలం ఉదరపోషణ కోసం వేసినవే గనుక.

15. అంగం గళితం, పలితం ముండం, దశనవిహీనం జాతుం తుండం |
వృద్ధో యాతి గృహీత్వా దండం, తదపి నముంచత్యాశాపిండం ||

శరీరం శిధిలమైపోయింది. తల నెరిసిపోయింది, దంతాలు లేని నోరు బోసిపోయింది. వృద్ధుడు కర్ర పట్టుకుని తిరుగుతాడు, అయినా, అతడు తన కోరికల మూటను విడిచిపెట్టడు కదా !

2 comments: