Thursday 1 October 2015

ప్రాంజలి ప్రభ - లాల్ బహదూర్ శాస్త్రీజీ.

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి  ప్రభ - లాల్ బహదూర్ శాస్త్రీజీ...
 
సర్వేజనాసుఖినోభవంతు 





లాల్ బహదూర్ శాస్త్రీజీ...

క్షమించండి మా నిర్లక్ష్యాలని... మర్రి చెట్టు నీడలో మరే చెట్టు ఎదగదు అన్నట్లు మహాత్ముని స్మరణలో మిమ్మల్ని మరచిపోతున్న నీ జాతి అజ్ఞానాన్ని.

ఎందరెందరో మహానుభావులు స్వాతంత్ర్యాన్ని కొందరికే అంటగట్టేసి మహాత్ములని జాతిపితలని చేసిన జాతి మాది. గాంధీజీ... చాచాజీ... వ్యక్తిగత జీవితాల మీద మచ్చలు... ఆరోపణలు వచ్చాయేమో కానీ ఏ మచ్చా వినపడని సిసలైన రాజ నీతిజ్ఞులు మీరు.

శాస్త్రి అనేది మీ కులం వల్ల సంక్రమించినదని భావించి మిమ్మల్ని ఒక కుల ప్రతినిధిగా పొరపడ్డ మిత్రులెందరినో నేను చూసాను. అది కుల నామం కాదని మీ విద్వత్తుతో మీరు సంపాదించుకున్న బిరుదు అని ఈనాటికీ ఏంతో మందికి తెలియదు. జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కూడా బట్టీ పట్టే మా నవ జాతికి మాత్రం మీరు భారతదేశ రెండవ ప్రధానమంత్రి. అది కూడా ఎంతమందికి గుర్తు ఉందో మరి.

ఇక మా మీడియా మిత్రుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది... మహాత్ముడు ప్రవచించిన అర్ధరాత్రి స్వాతంత్ర్యం నుండి అహింసా సిద్ధాంతం వరకూ ప్రతి ఏడాది చద్ది కంపు కొట్టే అవే కబుర్లు ప్రత్యేక కార్యక్రమాల్లో హోరెత్తిస్తారు గానీ వ్యవసాయాధారిత దేశమైన మనదేశానికి వెన్నముక అయిన రైతుని... అహో రాత్రాలూ అన్ని వాతావరణాలని తట్టుకుంటూ సరిహద్దుల్ని కళ్ళల్లో పెట్టుకుని కాపలా కాస్తున్న వీర సైనికులని ‘జై జవాన్ జై కిసాన్’ అంటూ ఒకే నినాదంలో నింపేసి అమరత్వం ఇచ్చిన అమృత మూర్తివని ఎందరికి తెలుసయ్యా...? అది ఈ తరానికి సరిగ్గా చేర వేసేవారెవరయ్యా?

లక్షల కోట్ల స్కాములు బయట పడ్డా చీమకుట్టినట్లు అయినా లేకుండా కెమెరాల ముందు నవ్వులు విరబూస్తూ సచ్చీలురులా ప్రవర్తించే నేటి నాయకులే మాకు తెలుసు. ఒకే ఒక్క రైలు ప్రమాదం జరగగానే నైతిక భాధ్యత వహించి కేంద్ర రైల్వే మంత్రి పదవినే తృణప్రాయంలా వదిలేసినా నిజమైన నాయకుడి నీవు...

ఆహార సంక్షోభం చుట్టుముట్టిన తరుణంలో దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కుని మరో సారి అలాంటి సంక్షోభాలు దరి చేరనివ్వకుండా వ్యవసాయ విప్లవానికి (గ్రీన్ రివల్యూషన్), పాల విప్లవానికి (వైట్ రివల్యూషన్) దారులు పరచిన దార్శనికుడవు నీవు...

కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి రాజధానికి అవసరమంటూ లక్షల ఎకరాల వ్యవసాయ భూములని కాంక్రీట్ జంగిల్స్ లా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయ్... ఒకరిని చూసి ఇంకొకరు అవసరాల పేరు మార్చుతారేమో కానీ సారవంతమైన భూముల్లోనే కాంక్రీట్ అడవులు మొదలు పెట్టరని నమ్మకం ఏమిటి. మరో సారి మన దేశం లో ఆహార సంక్షోభం రాదని చెప్పగలిగే పరిస్థితిలో ఇప్పుడు మేము లేము.

పాకిస్తాన్ సేనలని తరిమికొట్టిన యుద్ధంలో పూర్తి విజయం సాధించినా శాంతి స్తాపనకై తాష్కెంట్ ఒప్పందం చేసుకున్న మరునాడే అనుమాదాస్పద మృతి చెందిన మీ మరణం వెనక నిజాలు బయటకి వచ్చి అంతర్జాతీయ కుట్రలు బయట పడేలా ఉంటే భారతీయుడిగా నేను గర్విస్తా.

దేశం నాకేమిచ్చింది అని కాదు దేశానికి నువ్వేమిచ్చావ్ అన్న మాటని అక్షరాలా చేతల్లో చూపించిన మహా నేత మీరు .

ఇప్పుడు కావాల్సింది నీ లాంటి నేతల సిద్ధాంతపు వారసత్వాలే కానీ బానిస బతుకుల్ని నెత్తిన రుద్దే రాజకీయ వారసత్వాలు కాదు.

అందుకే మీలాంటి మహా మనీషులు మళ్ళీ పుట్టాలి ఈ జాతిని జాగృతం చెయ్యటానికి.
జై జావాన్ -జై కిసాన్ నినాధుడు శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి జోహర్లు... 
ఇట్లు

ఓ భారతీయుడు

No comments:

Post a Comment