ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ
సర్వేజనా సుఖినోభవంతు
" ఆవకాయ్ " పద్యాలు.
గతములో శ్రీమతి వలబోజు జ్యోతి గారు నిర్వహించిన "ఆవకాయ పద్యాలు" ఎ-బూక్ కొరకు నేను వ్రాసిన పద్యములు.
ఆటవెలది:
ఆవ పిండి ముద్ద నర చేత బట్టిన
పసుపు గణపతి గనపడును గాదె
అయ్య దలచి నేడు , నయ్యావకాయను
దలచి వ్రాతు పద్యములను నేను.
కందము:
పుల్లని మామిడి ముక్కలు
చెల్లగ సన్నావ పిండి చేతన్ గలుపన్
తెల్లని లవణము, కారము
మెల్లగ తైలమ్ము జేర్చ మీదట నావౌ.
ఆటవెలది:
మజ్జిగన్నమందు మరియావ ముక్కను
నంజుకొనగ దినుచు నమలి తొక్క
టెంకె మీది పీచు నింకనింకను గోరి
పీకిపీకి దినుట ప్రియము గాదె.
తేటగీతి:
వేడియన్నములో కొంత వేడినెయ్యి
ముద్దపప్పును జేరిచి ముద్దుగాను
ఆవకాయను గలిపిన యావ గలుగు
తినగ నోటికి , తెలియర తెలుగు వాడ.
కందము:
పడిపోయిన లక్ష్మణుకై
వడి సంజీవనిని దెచ్చెవాయుసుతుండే
మడిజాడి నావకాయను
సడిలేకను దెచ్చి పెట్ట సరియగు గాదా !
కందము:
ఇయ్యావ దినిన దేవత
లయ్యమృతమ్మునకు బోవ నాశించరుగా
అయ్యారె ! తెలుగు వారుగ
నియ్యవనిని బుట్టి ' నాక ' మిచటికి దేరే.
కందము:
వ్రేపల్లియలో గాకను
" రేపల్లె " ను కృష్ణుడుండ రేపులు మాపుల్
ఆ పాలు వెన్న వలదని
తాపెరుగున నావకాయ తనివిని దినుగా.
ఆటవెలది:
వేదములను సామ వేదమ్ము తాననె
పక్షులందు గరుడ పక్షిననియె
తెలుగు వాడె యైన పలుకును హరి " యూర
గాయలందు నావకాయ నేను. "
కందము:
ఖండాంతరమందున్నను
ఖండితముగ జెప్పవచ్చుకలిపిన ముద్దన్
మెండుగ నావను జేరిచి
మండుటలేదనుచు జెప్ప మన " తెలుగోడే ".
కందము:
ఎరుపుగను నూనె గారుచు
మెరుపుగ నున్నావకాయ మేలుగ గలుపన్
పెరుగన్నములో, రుచియే
పెరుగునులే నిజము, తినగ ప్రియ నేస్తమ ! రా !
కందము:
ఆవది, రుచులను జేర్చెడి
నావది, తగు ఘాటు, వేడి నందించుటకున్
త్రోవది, శ్రమ జీవులకున్
చేవది, విను దీనిగొప్ప చెప్పగ లేనే !
"ఆవకా"వ్యం|
ఆవకాయీ!ఓ ఆవకాయీ!హే ఆంధ్ర మిశ్రమా! మిత్రమా! నిన్నున్ ఏకాత్మ రూపంబునం ధ్యానించి..
నీ రంగునున్ దర్శించి..
నీరూపము న్నా మదిన్ గాంచి..
నీ రుచిన్ ప్రశంశింప.. నీదుపై నొక్క కావ్యంబు చిత్రించి జనులొప్పగా జెప్ప..
మదీయ రసనేంద్రియ జన్మంబు సఫలీకృతంబౌనట్టు..
నేడు నా భాగ్యమెట్టిదో!మత్పూర్వజ కవుల్ "నరసింహ" "సుబ్బారాయు"లీ పుడమిన్ నిన్నూహించి కవిత్వం చెప్ప నైతిరి గదే!..
వారల నుతించి నీదు పై నే కవిత్వంబొక్కటిన్ ఊహించి.. తెనింగించి అస్మదీయ జిహ్వ చాపల్యమున్, తదృణమున్ నిశ్శే షంబు గావించె దన్!
హే ఆవమా!మా పూర్వ పుణ్యమా! అపూర్వమా! పూర్వమున్ గ్రీష్మ తాపంబు తాళకన్,
నల భీమాదుల్ ఖిన్నులై తాపశమంబు కై నొక్క ఉపాయంబు నూహింప ధన్వతరిం
ప్రార్ధింపగా...
ధరణి లో జనులకున్ అపరామృతంబుగా నిన్నున్ ప్రసాదింపగా..సాధింపగా..
ఇద్ది వ్యాకృతిన్ పూని ఆంధ్ర దేశంబుకున్ వేంచేసి..
ఇంటింటి వంటింటిలో ప్రత్యక్ష మైతివి గదే!
నీకున్ నమస్తే నమః!
ఓ ఆవకాయా! సకాయా! నీకాయమున్ ..ధన్వంతరీ దివ్యౌ షధంబున్.. "రివర్సు ఇంజినీరింగు" గావించిరే
మేధావులయినట్టి తెలుగు పుత్రుల్ నీ కాయంబునన్ దాగున్న ధాతువుల్ విమర్శించి..
తన్మిశ్రముల్ దర్శించి నిన్నున్ పునః సృష్టి గావించిరే
పుడమిన్,వారి కార్యంబు జగత్ ప్రసిద్ధమౌ!
నీ కున్ వారికిం నమస్తే నమః!
హే ఆవకాయా!
నీ "కాయ"మందున్..
పచ్చని పుల్లని ఫల రాజు ఏతెంచి
ఋతురాజు పుణ్యమై ప్రథమ ధాతువుగాగ|
మెండైన ఎండైన గుంటూరు మెరపలు
పొడిచేసి నట్టివై ద్వితీయంబు గాగ|
రుచుల రే డై న లవణంబు తా
లావణ్యమయి నీయందు తృ తీయంబుగాగ|
రోగ పర్వత ధ్వంసి రుచి బుట్టించు నట్టి
ఆవ పిండి తా చతుర్ధంబు కాగ|
శక్తి కల్గించు చక్కని తైలంబు నీ యందు
పంచమ మై ధారగా కాగ|
మధుమేహ తాపంబు హరింప వేంచేసి
మెప్పైన మెంతులు షష్ఠమ ధాతువు గాక|
హృద్రోగ నాశి వై.. హృద్యంగమయి నట్టి
వెల్లుల్లి తా సప్తమంబు గాగ|
హే ఆవమా! నీదు దేహంబు అస్మద్దే హంబు వోలె
సప్త ధాతు నిర్మితమై ఉండ
ఇవ్విధంబయిన పొలికచే బాంధవ్యమేర్పడ..
మైత్రితో నీతోటి సప్తపదములు నడిచిరే! ఈ తెలుగు జనులు!
నీకున్ వారికి వియోగంబు జన్మ జన్మములకూ లేనట్టు వరమీయగదే !
నీకున్ నమస్తే నమః!
ఓ ఆవకాయా! నిన్నున్ సృష్టింప పై జెప్ప ధాతువుల్ నేర్పుతో ఓర్పుతో శుచితో సమ పాళ్ళలో చొప్పించి..
మిశ్రంబు గా జేసి..
మెండైన పొడి ఐన పింగాణి పాత్రలో నింపగా...
ఓ సప్త మిశ్రమా! నిన్నున్ సప్త దినముల్ సూర్య చంద్రుల్ జల వాయువుల్ గానగా లేని రీతిన్ బంధింపగా...
నీలోని ధాతువుల్ ఒకదానితో నొకటి సన్మి త్రులయి కలవ..
నీలోని ఫల రేడు చాక్కగా ఊరగా ..
నీలోని లవణంబు లావణ్యమయి కలవ..
తైలంబు,కారంబు చక్కగా చిక్క నౌ!
నీలోని ఆవము పాత్రంబునంతటం క్రమంగా ఆక్రమింపఁగా..
ఓ ఆవమా.. నీకున్ నమస్తే నమః॥
హే ఆవకాయమా ! నవ కాయమా! సప్త దినముల్ జల వాయు భక్షనల్ జేయక సమాధి నిష్ఠ
వై, పూర్ణమై,పరిపూర్ణ మై,సంపూర్ణ మై, సంశ్లేష మై, శక్తీ మయివై, అరుణ
వర్ణవై..
సర్వ రుచి మయివై..
సర్వ నేత్ర జిహ్వ, ఘ్రాణ చిత్త హృదయా కర్షిణివై..
గ్రీష్మ తాప శమనివై,
తెలగాణాంధ్ర జన సుఖ దాత్రివై
"Priya" రూపివై, " Mother" రూపివై..సర్వ దేశ సంచారిణివై..
సర్వ జన జిహ్వ చాపల్య సంఘాతినివై..
ఈరీతిన్ బహిర్గత మైతివే!
హే జిహ్వజయినే! నీకున్ నమస్తే నమః|
నీదు అవతారముల్ వర్ణింప నేనెంత వాడనే??
తొల్లి నారాయణుండిందు దశాకృతిం దాల్చగా నీవున్నాతని ధిక్కరించి..అతిశయించి..
నీ విశ్వ రూపంబు చూపగా ..
దోస వై, పెసర వై, మెంతి వై, అల్ల మై, బెల్లమై, ఉసిరి వై,
వంగ వై, పులిహోర వై, శనగ వై, వెల్లుల్లి వై, నువ్వు వై,
కొబ్బరి వై, ముక్క వై, తొక్కు వై, తురుము వై, మాగాయవై..
మమ్ము కావగా...ఆవగాయ వై..
సర్వ రూపిణివై, త్రివిక్రమివై, విశ్వంబునంతటం ఆక్రమించితివి గదే!
హే మహా రూపే! మహా రుచే! మహా రసనే! మహా గంధే!
నీదు స్పర్శంబు నిరంతరమున్ నాదు జిహ్వ పైనుండు వరమీయవే!
నా జిహ్వ పై నర్తింపవే!
నా వినతిన్ మన్నింపఁ ..నీ రుచిం తెలియజేయంగ..
"దివ్య జిహ్వ"మున్ ప్రసాదించి నన్ కటాక్షించవే!
పాహిమాం పాహిమాం పాహిమాం పాహి పాహి!!!!
(నాకు watsapp లో వచ్చిన msg) |
|
|
|
No comments:
Post a Comment