ప్రాంజలి ప్రభ.కం
ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణా యనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణా యనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
గృహస్తాశ్రమం !
.
ప్రస్తుత కాలంలో , మధ్యతరగతిలో (దిగువ, ఎగువ), ధనిక తరగతులలో ఒక విశ్వాసం ప్రబలినట్లు కనిపిస్తున్నది. అదేంటంటే, గృహస్తాశ్రమం కన్నా బ్రహ్మచర్యం గొప్పది, అని. బ్రహ్మచర్యం అనేది ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పటం లాంటిది. ఈదినప్పుడు కదా ఈతలో మజా తెలిసేది.
ఈతలో కష్టాలు నాకు ముందే తెలుసు కాబట్టి నేను ఈదను, మీరు కూడ ఈదకండి. నేను ఈదను కాబట్టి మీకన్నా గొప్ప వాడిని. మీకు బోధించే అర్హత నాకు వస్తుంది. నేను పరమహంసను.
మీరు నా కాళ్ళమీద పడుతుంటే, నేను మీ నెత్తి మీద చేతులు పెట్తూ ఉంటాను అనే ప్రవృత్తి మనదేశంలో బుధ్ధుడి కాలం నుండీ ప్రబలి ఉన్నది. అదేంట్రా నాయనా అంటే, నా కాషాయ గుడ్డలే, నా మంత్రదండమే, నా అర్హతలు. ఇలాగా అన్ని మతాలలోని బోధకులు గృహస్తుల నెత్తిన కూర్చోటం అలవర్చుకున్నారు.
.
''వినదగు నెవ్వరు చెప్పిన'' అన్నట్లుగా, మహాభారతంలో ధర్మరాజు గారికి మంచి వినికిడి ఓపిక ఉన్నది. మహాభారత యుధ్ధంలో 18 అక్షౌహిణీల సైన్యం ప్రాణాలు కోల్పోయాక, తాతలు, గురువులు, అందరినీ చంపాక, ధర్మరాజు గారికి కిల్బిష భయం (పాప భీతి) పట్టుకుంది. నేను సన్యాసం పుచ్చుకుంటానంటాడు. ఆసమయంలో ఆయనకు ఉద్ బోధ చేసిన వాళ్ళు చాల మంది ఉన్నారు.
సాధారణంగా, నకుల సహదేవులకి ఉద్ బోధలు చేసే ఛాన్సులు రావు. శాంతి పర్వంలో, ప్రథమాశ్వాసంలో, నకులుడికి అలాంటి ఛాన్స్ ఒకటి వచ్చింది. నకులుడు, సన్యాసం తీసుకోవద్దు, గృహస్తాశ్రమమే మిన్న అని ధర్మరాజుకి ఉద్ బోధ చేశాడు. ఆ ఉద్ బోధలోంచి కొన్ని పద్యాలను ఈక్రింద ఇస్తున్నాను.
(తిక్కన ప్రణీత శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతి పర్వం,)
కంద పద్యం.
తక్కిన మూడాశ్రమములు
నొక్క దెస, గృహస్థ ధర్మ మొక దెసఁ తులయం
దెక్కింప వానితో న,
య్యొక్కటి సరి తూఁగె నందురు ర్వీశ బుధుల్.
తెలుగు సారం:
గృహస్థాశ్రమాన్ని త్రాసులో ఒక పళ్ళెంలో వేసి, రెండవ పళ్ళెంలో మిగిలిన మూడాశ్రమాలను అంటే బ్రహ్మచర్య, వానప్రస్థ (అడవులలో ఉండటం), సన్యాసాశ్రమాలను పడేస్తే, మొగ్గు గృహస్తాశ్రమం వంకే ఉంటుంది అని పండితులు చెప్తారు.
81 వ పద్యం. కందం.
పరుల వధింపక యెవ్వడు,
ధర యేలెం జెపుమ పూర్వ ధరణీశులలోఁ
బొరయరు పాపము సుగతిక,
యరిగిరి వా రీవు నట్ల యగు టొప్పు నృపా.
తెలుగు సారం: ఓ రాజా, పూర్వపు రాజులలో, ఇతరులను చంపక ఏ రాజు భూమిని యేలాడు చెప్పు, వారు సుగతికి అంటే మంచి లోకాలకే వెళ్ళారు, నీవు కూడ అలాగే వెళ్తావు.
82 వపద్యం. కందం.
రక్ష ప్రజ గోరు నిజయో
గ క్షేమార్ధముగ జన సుఖ స్థితి నడపన్
దక్షుడగు రాజు నడప కు
పేక్షించినఁ పాపమొందడే కురు ముఖ్యా.
ఓ కురు ముఖ్యా, జనం తమ యోగ క్షేమాలు చక్కగ సుఖంగా గడచి, రక్షణ కావాలని కోరుతుంటే సమర్ధుడైన రాజు పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉంటే, పాపం పొందడా?
83 వపద్యం. తేటగీతి.
గోవులను ఘోటకంబులఁ, కుంజరముల
దాసులను ప్రీతి నిమ్మెల్ల ధాన్యములను
గ్రామముల మందిరముల నిష్కముల వేడ్క
నొసగు తత్తత్ సుపాత్రత్వ యుక్త విధుల. అర్ధము
తెలుగు సారం: గోవులంటే ఆవులు. ఘోటకాలు అంటే గుర్రాలు. కుంజరాలు అంటే ఏనుగులు. దాసులంటే సేవకులు. ధాన్యాలు, గ్రామాలు, ఇళ్లు, నిష్కాలు అంటే ఆనాటి నాణెములు, ఇలాగా అన్నిటినీ వేడుకతో, ప్రీతితో, రాజు, సుపాత్రులు అంటే అర్హులైన వారికి తగినట్లుగా ఇస్తాడు.
--((**))--
No comments:
Post a Comment