*రుద్రవీణ -16*
"నీకు నిద్ర వస్తున్నట్టుంది. అదుగో అక్కడ పడుకో” అంటూ చూపించాడు.
అలాగే చెయ్యి అడ్డం పెట్టుకుని నిద్రలోకి జారి పోయాడు విజయ్. అదీ- పావుగంటే. ఆ తర్వాత మెలకువ వచ్చేసింది.
గిరిప్రసాద్ కూర్చుని ఏవో గీతలు గీస్తున్నాడు కాగితంమీద.
"ఏం చేస్తున్నారండీ" అని అడిగాడు విజయ్
ఆశ్చర్యంగా.
“ఏంలేదు… నేను అస్సాం నుంచి వచ్చాను. ఎందుకో తెలుసా! తంత్రశాస్త్రాన్ని కూలంకషంగా తెలుసుకోవాలని” అంటూ అగి పరిశీలనగా అతని ముఖం లోకి చూశాడు.
అతను ఆశించిన ఎఫెక్టు రానేవచ్చింది. అతని ముఖంలో సంభ్రమాశ్చర్యాలు ముప్పిరిగొన్నాయి. తన నేత్రాలను మరింత విశాలం చేస్తూ అతని వంకే చూశాడు విజయ్.
"ఏం అలా చూస్తున్నావు?" అని అడిగాడు గిరిప్రసాద్.
"ఏంలేదు. అస్సాంనుంచి ఇక్కడికి రావడం దేనికి! అస్సాంకే కామరూప దేశం అని పేరు వుంది కూడా. అదే తంత్ర శాస్త్రానికి ప్రసిద్ధికదా- అందులో గౌహతిలోని కామాఖ్య దేవాలయం సుప్రసిద్ధం కదా!" అన్నాడు విజయ్.
గిరిప్రసాద్ సన్నగా మందహాసం చేశాడు.
“ఫర్వాలేదు కుర్రాడు లైన్ లోనే వున్నాడు" అనుకున్నాడు.
“నేనూ అదే అనుకునే అక్కడికి అంటే గౌహతి వెళ్ళాను. అక్కడ ది బ్రూఫర్ లో తాంత్రికాచార్య పండిత లోకనాధశాస్త్రి గారిని కలుసుకున్నాను.
ఆయన అన్నదేమిటంటే “నాయనా! తంత్ర శాస్త్రానికి నిలయాలు ఒక్క అస్సాంలోనే గాదు- నేపాల్, సిక్కిం, టిబెట్, పశ్చిమబెంగాల్, బీహార్ లో కూడా తంత్రశాస్త్రంలో నిష్ణాతులైన వారెందరో వున్నారు. నీకొక్క సలహా ఇస్తాను. నువ్వు ఎలాగైనా నేపాల్ చేరుకుని భూటాన్ లో వున్న
తాంత్రికాచార్య పండిట్ దేవదత్త శాస్త్రిని కలుసుకో, ఆయన కాళ్ళమీద పడి ఆయన శుశ్రూష చెయ్యి- నీ మనోభీష్టం నెరవేరగలదు అంటూ ఆశీర్వదించి పంపారు" అంటూ ఆగాడు గిరిప్రసాద్.
"అందుకని మీరిక్కడికి వచ్చారన్నమాట" అన్నాడు కుతూహలంగా విజయ్.
"అవును నేను వచ్చిన దరిద్రపు వేళ ఎటువంటిదో కాని ఆయనేదో వూరుపోయాడు. రాత్రికి వస్తాడని ఇందాక చెప్పారు వెళ్ళి కనుక్కుంటే. నేను ఇక్కడికి వచ్చి వారం రోజులయింది. ఈ వారం నుంచీ ఇదే తిండి తింటూ ఇలాగే పడివుంటూ కాపలా కాస్తున్నాను" అన్నాడు గిరిప్రసాద్ విచారంగా.
"నేపాల్ రావడానికి వీసా కావాలిగా!” సందేహంగా అడిగాడు విజయ్.
“కావద్దామరి - డార్జిలింగ్ లో నేపాల్ హైకమిషనర్ ని పట్టుకుని నేపాల్ లో ఏడాది వుండటానికి వీసా సంపాదించాను” అన్నాడు గర్వంగా గిరిప్రసాద్.
“పశుపతినాథ దేవాలయం ఖాట్మండ్ లో వుంది. ఆ దేవాలయం ప్రక్క 20 వ నె.బరు గల్లీలో వుంటున్నాడు పండిట్ దేవదత్తశాస్త్రి. అతన్ని మనం కలుసుకోవాలి. నువ్వూ నాతో వస్తావా?” అని అడిగాడు గిరిప్రసాద్.
"అ! తప్పకుండా వస్తాను" అన్నాడు ఉత్సాహంగా
విజయ్.
ఆ బట్టలు జాడించి "నా లుంగీ ఇస్తాను- కట్టుకుని ఆరేసుకో!?" అంటూ లుంగీ ఇచ్చి తను బయటకు వెళ్ళాడు గిరిప్రసాద్.
ఆ పనిలో పడిపోయాడు విజయ్.
"గిరిప్రసాద్ అంటే వీసా సంపాదించాడు! మరి తనకెలా వస్తుంది!" అనుకున్నాడు సాలోచనగా. తననెవరన్నా వీసా చూపించమంటే అని హడిలిపోయాడు.
నిముషాలు, గంటలు, రోజులు లాగా మార్తుంటే గిరిప్రసాద్ చెప్పిన ఆ రేపు రానే వచ్చింది. తెల్లవారగానే అన్నీ సర్దేసి అతన్ని తీసుకుని బయలుదేరాడు గిరిప్రసాద్. మొత్తంమీద 30 వ నెంబరు గల్లి పశుపతినాధ దేవాలయం దగ్గర వెతికి పట్టుకున్నాడు. 'పండిత దేవదత్తశాస్త్రి తాంత్రిక్' అన్న బోర్డు కూడా వుంది.
అక్కడే నిలబడి "స్వామి" అని పిలిచాడు గిరిప్రసాద్.
నలభై అయిదేళ్ళ దేవదత్తశాస్త్రి లోపల కాళికాదేవి పూజలో నిమగ్నమయి వున్నాడు. అతనికి “స్వామి” అన్న పిలుపు లీలగా వినిపించింది. పూజ ముగించి బయటకు వచ్చాడు దేవదత్తశాస్త్రి. ఆయన్ని చూస్తూనే కాళ్ళ మీద పడిపోయాడు గిరిప్రసాద్.
అలా పడిపోయినవాడు అలాగే వుండిపోయాడు. కళ్ళంబడి నీళ్ళు జలజలా రాలి దేవదత్తశాస్త్రి పాదాలను అభిషేకిస్తున్నాయి. శంఠం రుద్ధమౌతోంది.
"ఎవరు నాయనా నువ్వు! ఏమిటి నీ కోరిక?" అని అడిగాడు దేవదత్తశాస్త్రి.
"స్వామీ! మీరు నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి. అలా చేర్చుకుంటాన నేదాకా మీ పాదాలను
వదిలేది లేదు" అన్నాడు గిరిప్రసాద్.
విజయ్ మాత్రం నిలబడి ఈ తతంగమంతా చూస్తున్నాదంతే!
“నువ్వు ఎక్కడినుంచి వచ్చావు నాయనా?” అని అడిగాడు శాస్త్రి.
“ఎక్కడో ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లా నుంచి వచ్చాను" అన్నాడు గిరిప్రసాద్.
"ఏమాశించి ఈ తాంత్రిక శాస్త్రం నేర్చుకోవాలను కుంటున్నావు!" అని అడిగాను శాస్త్రి.
"డబ్బు! కూచుంటే డబ్బు- నుంచుంటే డబ్బు-ధన కనక వస్తువాహనాలతో అందరి కళ్ళూ కుట్టి పోయేలా ఈర్ష్యతో చచ్చేలా నేను వైభవోపేతమైన జీవితం గడపాలి. నేను ధనహీనుడిని కావడం చేత లోకంలో అందరిచేతా హేళన చేయబడుతూ ఇంతకాలం రోజులు నెట్టుకొచ్చాను. ఇకపై అలా దూషణ తిరస్కారాలను భరించే శక్తి లేదు. నాకు ఎంత కష్టపడినా రోజుకు పదిరూపాయలు కనబడటం కష్టంగా వుంది. జీవితం దుర్భరమయి పోయింది. ఏదో మిరకిల్ జరగాలి… నేను ధనవంతుడిని కావాలి. అందుకు శీఘ్రంగా సిద్ధించే ఈ తంత్రశాస్త్రమే నాకు మహా బాగు అనిపించింది" అంటూ దాచకుండా అంతా చెప్పేశాడు గిరిప్రసాద్.
"నాయనా ఈ తంత్రవాదుల్లో వామాచారమని, దక్షిణాచారమని రెండు రకాలున్నాయి" అన్నాడు దేవదత్త శాస్త్రి.
"అంటే ఏమిటి?" కుతూహలంగా అడిగాడు విజయ్.
“వెనక పాలసముద్రం మధించినప్పుడు సురాకలశంతో-ఎర్రని చీర, పచ్చని రవిక తొడిగిన పచ్చని కుందనపు బొమ్మ ఒక త్రిలోక మోహిని ఉదయించింది. శుక్రాచార్యుల ప్రభావంతో ఈ దేవతలను జయించి అసురులు ఆ సురను త్రాగారు. ఎవరైతే ఆనాడు ఆ సురాపానం చేశారో వాళ్ళంతా వామాచారులయ్యారు…
సురాపాన మత్తులైనవారు మళ్ళీ దేవతలతో కలిసి అమృత మధనం చేయగా ఈసారి లభించిన అమృతం విష్ణు మాయ వల్ల దేవతలకు దక్కింది. ఇది త్రాగినవారంతా దక్షిణాచారులయ్యారు.
దక్షిణాచారం చేసేవారు వామాచారంలోకి
దిగకూడదు. వామాచారం చేసేవారు దక్షిణాచారం లోకి మారకూడదు. దక్షిణాచారంలో సిద్ధికి సమయం పడుతుంది. ముందుగా ఎవరు ఏది ఎన్నుకుంటారో వారదే పరిపూర్ణంగా ఉపాసించాలి.
*సశేషం*
*రుద్రవీణ -17*
వేదమంత్రం పరమైంది దక్షిణాచారం. అది మనమే ఎందుకు చేయాలి అనుకుని శీఘ్రముగా ఫలితమిచ్చే వామాచారంలోకి మారి సురాపానం తో మంత్రజపం చేయదల్చుకుంటే మిగిలేది బూడిదే… ఉభయభ్రష్టుత్వం.
అలాగే వేదవిద్యను వామాచార పద్ధతిలో సాధిద్దాం అనుకోవడం కూడా బుద్ధిహీనతే దానివల్ల ఏమీ మిగలదు. మీరేది నిర్ణయించు కుంటారు?” అని అడిగాడు దేవదత్తశాస్త్రి.
"ఆలస్యం అవనీ, ఈ జన్మంతా పట్టనీ, నేను దక్షిణాచారమే ఎన్నుకుంటాను” అన్నాడు విజయ్.
“మళ్ళీ జన్మ వుందో చచ్చిందో. వున్నా మానవుడిగా పుడతామో, ఏం చస్తామా - ఈ క్షణంలో ఒక ఏడాదిలో నాకు ఫలితం ఇచ్చే తంత్రశాస్త్రం కావాలి- అది ఏదో ఏ విధంగానో మీరే చెప్పాలి" అన్నాడు గిరిప్రసాద్.
ఒక్క క్షణం ఆ యిద్దరివంకా చూశాడు దేవదత్త
శాస్త్రి.
"నిన్ను నా శిష్యుడిగా చేర్చుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నా దగ్గర పదిహేనుమంది దాకా వున్నారు ఈ తంత్రశాస్త్రం నేర్చుకుంటున్న వారు, ఇది ఒక విధంగా గురుకులం లాంటిది. ఇక్కడే వుండాలి, ఇక్కడే భోంచేసి పడుకుంటూ చెప్పింది చెప్పినట్టు చేస్తూ వుండాలి అప్పుడు గాని ఏటూ ఫలితంరాదు" అన్నాడు దేవదత్తశాస్త్రి
ఆ మాటలు అమృత మధురంగా- అప్పటికప్పుడే టాటా, బిర్లాల వారసుడిలా డబ్బుతో మూలుగుతున్న వాడిలా పరమానందంతో వూగిపోయాడు గిరిప్రసాద్.
"ధన్యుడినైపోయాను. ఇక నేను కోటీశ్వరుడిని అయిపోయిన" అన్నాడు మళ్ళీ దేవదత్తశాస్త్రి కాళ్ళమీద పడిపోతూ.
"ఈనాడు నా పదిహేనుమంది శిష్యులలో నువ్వూ ఒకడిగా చేరిపోయావు. నాకు తెల్సినవన్నీ నీకు నేర్పుతాను” అంటూ లేవదీశాడు దేవదత్తశాస్త్రి.
“మరి ఇతని మాటా?” అని అడిగాడు.
"అతనికి చెప్పడం నావల్ల కాదు… కాని పెట్టక పోయినా పెట్టే యిల్లు చూపించమని సామెత. అతనికి ఒక అడ్రసిస్తాను. వెళ్ళమను. అతని అదృష్టం ఎలా వుంటే అలా జరుగుతుంది” అన్నాడు దేవదత్తశాస్త్రి.
అందుకు చాలా సంతోషించాడు విజయ్.
📖
నేను దేవదత్తశాస్త్రిగారి దగ్గర వుంటాను. నా నివాసస్థలం నీదిగా చేసుకో. నువ్వు ఆ అడ్రసు ప్రకారం వెళ్ళి కలుసుకుని అన్నీ సెటిల్ చేసుకునే వరకు పెద్ద పెద్ద స్థలాల్లో నువ్వు వుండలేవు. నీ దగ్గర డబ్బేది” అని అడిగాడు గిరి ప్రసాద్.
ఆ మాటకు తల పంకించాడు విజయ్.
అంతకంటే తనకి దారిలేదు. “తనిక్కడ ఏదో సాధించాలి, సాధించేవరకూ కదలకూడదు" అనుకున్నాడు దృఢ నిశ్చయానికి వస్తూ.
గిరిప్రసాద్ దేవదత్తశర్మ ఇంటికి వెళ్ళాడు.
విజయ్ ని కూడా త్వరగా గురువుని కలుసుకుని ఒక దారి ఏర్పరచుకోమని గట్టిగా హెచ్చరించి మరీ వెళ్ళాడు. తన చేతిలో పైసలేదు. ఈ వాచీ అమ్మివేస్తేగాని తనకి ఏదీ జరుగుబాటవదు. తిండికి మొహం వాచిపోయాను ముందు అని అనుకున్నాడు విజయ్.
అందుకు గిరిప్రసాద్ తగినవాడు. అతనికి చెబితే ఎక్కడో అక్కడ అమ్ముకువచ్చేవాడు. తనకి ఏదన్నా వస్తువు కొనడమేగాని అమ్మడం అనేది లేదింతవరకు. పైగా ప్రస్తుతం తనున్న పరిస్థితిలో ఆ వాచీ తీసుకుపోయి అమ్ముతే ఎవడో దొంగ వెధవ క్రింద భావిస్తారేగాని తనని సానుభూతిగా చూడరు ఎవరు. గిరిప్రసాద్ వెళ్ళిపోయినందుకు చాలా చింతించాడు విజయ్. వెళ్ళిపోయినందుకు విచారించేకంటే అక్కడికే వెళ్ళి అడిగితే సరిపోతుంది అనుకుంటూ తనని సమాధాన పరుచుకున్నాడు.
అలాగే వెళ్ళాడు కూడా. ఆయన కూర్చోమని సంజ్ఞ చేశాడు విజయ్ ని చూసి. అందర్నీ కూర్చోపెట్టుకుని ఏదో బోధిస్తున్నాడు దేవదత్తశాస్త్రి.
"ఈ తంత్రం అనేక విధాలు. ఇందులో డెబ్బయి రెండు రకాలున్నాయని పెద్దలు అంటారు. జనార్ణ వం, కులార్ణవం మొదలైనవి ఎన్నో వున్నాయి. అన్ని తంత్రాలు నేర్చినవానికి, జల స్థంభన, అగ్నిస్థంభన, వాయుస్థంభన, రససిద్ధి, పాదుకా సిద్ధి, పరకాయ ప్రవేశం, భేచరీగమనం. ఇవన్నీ కరతలామలకమవుతాయి. అనేక మంత్రాలు పఠించి తంత్రశాస్త్రంలో ఎవరైనా నిష్ణాతులు కావచ్చు-
విజయ్ వింటున్నాడు.
సిద్ధి, ఇష్ట కామ్యసిద్ధి పొందడానికి జగద్గురు శంకరాచార్యులవారే సౌందర్యలహరిలో అనేక మంత్రాలు, యంత్ర పూర్వక సాధనాలు నిక్షిప్తం చేసి మనకి అందించారు. దానికి ఏ శ్లోకం పఠిస్తే, నియమనిష్టలతో ఏది జపిస్తే ఏ విధమైన ఫలితం వుంటుందో చెప్పారు.
కాళికను ప్రసన్నురాలిని చేసుకోదలచినవారు ఇతర దేవతలను కూడా ఉపాసించవచ్చు.
మంత్రతంత్రాలకు సంతుష్ఠలై సాక్షాత్కరించి అభీష్ఠసిద్ధి చేసే దేవతలు అనేకమంది వున్నారు.
ప్రతి దేవతకూ మంత్రం వుంది. ప్రతి మంత్రం బీజాక్షర సంకలితం– మంత్రం గురుముఖంగా
పొంది నిర్దిష్ట దినాల్లో ఉపదేశం జపించి సిద్ధి పొందవచ్చు” అంటూ ఆగాడు దేవదత్తశాస్త్రి.
ప్రతిమంత్రం "ఓం తో ప్రారంభమై నమః" తో ముగుస్తుంది.
"ఓంకారమే ప్రణవం. అదే జగత్తుకు మూలం. ఈ విశ్వమంతటిని పాలించేది ఆ ఓంకారమే” అంటూ చెబుతున్నాడు.
విజయ్ కళ్ళముందు గొప్ప వెలుగుతో ఓం ప్రత్యక్ష మయింది. అంతకంటే వేయినాదాలతో ఓంకారం ప్రతిధ్వనిస్తూ అతని చెవులకు సోకింది. ఆపాదమస్తకం పులకించిపోయాడు. వళ్ళంతా ఏదో విద్యుతరంగాలు ప్రసరించినట్లయింది. అతని తన్మయావస్త గ్రహించాడు దేవదత్తశాస్త్రి.
"చూడుబాబు… ఇదుగో అడ్రసు. ఈ అడ్రసు తీసు కుని నువ్వు టిబెట్ వెళ్ళి- ఇదుగో నేను ఇస్తున్న పరిచయ లేఖ" అంటూ అందించాడు కవర్లో పెట్టి విజయ్ కి దేవదత్తశాస్త్రి.
"నిన్న మీరు ఒక అడ్రసిచ్చారు గదూ!" సందేహం గా అడిగాడు విజయ్.
"అవును ఇచ్చాను- కాని అతను దేశాంతరం పోయాడట. నాలుగైదు నెలల వరకూ రాడట.
అయినా ఇప్పుడు నేనిచ్చిన అడ్రసుకు వెడితే ఈయన నేర్పేవి, ఆయన నేర్పేవి కూడా ఆయనే చెప్పగలడు" అన్నాడు విజయ్ కేసి అభిమానంగా చూస్తూ దేవదత్తశాస్త్రి.
"ఒకసారి గిరిప్రసాద్ ని బయటకి పంపిస్తారా" అని అడిగాడు విజయ్.
"ఆ! వెళ్ళవచ్చు” అన్నాడు అతని కేసి తిరిగి.
గిరిప్రసాద్ బయటకి వచ్చాడు.
“చూడు ఫ్రెండ్! నాకు ఈ వాచీ అమ్మిపెట్టాలి. ఇది నీవల్ల తప్ప మరెవరివల్లా కాదు" అన్నాడు విజయ్ వాచీ తీసి అందిస్తూ.
“ఈ వాచీ అమ్మితే ఎంత వస్తుందని నీ అంచనా! ఇప్పటికిప్పుడు ఎవరు కొంటారు?” అడిగాడు గిరి ప్రసాద్.
ఆ సంభాషణంతా విన్న దేవదత్తశాస్త్రి "చూడు బాబు, దీనికి గిరిప్రసాద్ రానవసరంలేదు. అలా తూర్పుగా పోయి దక్షిణానికి తిరుగు చక్కని మెయిన్ రోడ్డు వస్తుంది, ఆ రోడ్డులో నాలుగవ మేడలో వాచీ షాపుంది అక్కడికి వెళ్ళి తాంత్రికా చార్య పండిత దేవదత్తశాస్త్రి ఈ వాచీకి తగిన విలువకట్టి డబ్బు ఇవ్వమన్నారని చెప్పు ఇస్తాడు. ఆ డబ్బుతో నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా టిబెట్ వైపుకి పో- నీ కోరిక ఫలిస్తుంది” అని చెప్పాడు దేవదత్తశాస్త్రి.
ఆయనకి నమస్కరించి వచ్చేశాడు విజయ్.
*సశేషం*
*రుద్రవీణ -18*
ఇప్పుడు విజయ్ మనసులో ఇతరుల నుదుటి వ్రాత ఎలా వున్నది పరిశీలించడంకంటే ముందు తన నుదుటి రాత ఎలా వున్నదీ చూసుకోవాలన్న తపన ఎక్కువయింది. ఆ చెంబుమీద, ఆ రాగి రేకులమీద వున్న భాష తను సంపూర్ణంగా నేర్చుకుని ఆ రాగి రేకుల మంత్రం తనే జపించి నారదుడు బ్రహ్మలోకం పోయి తండ్రిని నిలవేసి అడిగినట్టు తనా శంకరుడిని బొందితో కైలాసం చేరి నాలుగూ అడిగేస్తే సరి అనుకున్నాడు హుషారుగా.
దేవదత్తశాస్త్రి చెప్పినట్టే ఆ వాచీల షాపుని తేలిగ్గానే కనుక్కున్నాడు విజయ్. అక్కడికి వెళ్ళి నిర్భయంగా దేవదత్తశాస్త్రి చెప్పమన్నదే చెప్పాడు.
ఆ పేరు వింటూనే షాపువాడు కుర్చీలోంచి లేచి వాచీ అందుకుని అన్నీ సరిగానే వున్నాయని గ్రహించి డ్రాయరు సొరుగులాగి రెండువందలు చేతిలో పెట్టాడు. పైన ఒక రూపాయి అడిగి తీసుకున్నాడు విజయ్. అవి అందుకుని తిన్నగా టిబెట్ కి ప్రయాణమైనాడు.
వెడుతూ రెండు ఇన్ లాండ్ కవర్లుకొని ఒకటి పశ్యంతికి, మరొకటి విశ్వప్రసాద్ కి లెటర్సు రాద్దామని జేబులో పెట్టుకున్నాడు విజయ్.
అతను పోస్టాఫీసు నుంచి ఇన్లాండ్ కవర్లు కొనుక్కుని వస్తుంటే ఎదురుగా బార్ లో కూర్చుని డ్రింక్ సేవిస్తున్న విలియం స్పష్టంగా చూశాడు.
అప్పటికప్పుడు ఫోన్ అందుకున్నాడు. అబ్రహంకి డయల్ చేశాడు.
"డియర్ ఫ్రెడ్ అబ్రహం. పోస్టాఫీసులో లెటర్సు కొంటూ విజయ్ గాడు కనిపించాడు.”
"అతని సంగతి నేను చూసుకుంటాను- నువ్వు బెనారస్ వెళ్ళే ప్రయత్నం చెయ్యి.”
“చేయడానికి మనమీద పోలీసులు నిఘా వేశారుగా బెనారస్ లో- అంచేత అతి పకడ్బందీ గా చిన్న కారులో ఏ హోటల్లో ఎక్కడా దిగకుండా వుండేలా చూసుకుంటూ వెళ్ళాలి- అందుకే ఆగిపోయాను, కాస్త సద్దుమణిగాక వెడతానులే.”
“విజయ్ గాడు కనిపించాడంటే వాడు బతికే వున్నాడన్నమాట. ఏమయినా ఒక కన్ను అతనిమీద వేసివుంచు” అన్నాడు అవతల్నించి అబ్రహం.
"ఆ! అతన్నించి ఆ రాగి చెంబు విషయం దాకా అతన్ని వదలను” అంటూ తేల్చుకునే భరోసా ఇచ్చాడు విలియమ్.
అతన్ని గాని, అతను ఫోనుచేయడాన్ని గాని గమనించనేలేదు విజయ్. తనదారిన తను టిబెట్ వెళ్ళాలన్న ఉత్సుకతతో వున్నాడు.
"తన సూట్ కేస్ రాగి రేకులు- భద్రంగా ఇంటికి చేర్చి వుంటారు మిత్రులు” అని అతను అనుకున్నాడు. సరే చెంబు ఉజ్వల దగ్గర భద్రంగా వుంటుంది. ఉజ్వల హైద్రాబాద్ వెళ్ళిపోయినా తను బెనారస్ లో విశ్వప్రసాద్ ని కలుసుకుంటే ఆమె అడ్రసు తెలియకపోదు. ఆమె దగ్గర వున్నవి భద్రంగా వుంటాయని తనకి నమ్మకం వుంది.
తన దగ్గర ఏంలేవు. కట్టుగుడ్డలు తప్ప. ఇంక తనకి బెంగేముంది. దొంగచాటుగా లాగారుగాని, ఎదుటపడితే విలియమ్ అబ్రహులతో ముష్టి ఘాతానికి దిగేవాడే తను అనుకున్నాడు విజయ్ మంటగా.
📖
హిమాలయపర్వత కనుమలగుండా కంచర గాడిదనెక్కి కొంతదూరం, డోలీలో కొంతదూరం పయనించి టిబెట్ ప్రధాన నగరం లాసా కి చేరుకున్నాడు విజయ్.
సూర్యరశ్మికి ఆ ప్రాంతం – ప్రకృతి అంతా శోభాయమానమై తేజరిల్లుతోంది. సూర్యశాంతిలో పరిసర పర్వత ప్రాంతం మనోహరంగా కనిపించింది. మలయమారుతం వీచి పూలు రాలి పడుతున్నాయి. గగనవీధిలో పక్షుల కిలకిలా రవాలతో అతనికి స్వాగతం పలుకుతున్నట్టు వుంది.
లాసాలో బౌద్ధారామాలు, విహారాలు దూరానికే కనువిందు చేశాయి అతనికి. భౌగోళికంగా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఈ టిబెట్'ని టాప్ ఆఫ్ ది వరల్డ్ గా చెప్పుకుంటారు.
అక్కడ తనకి కావలసిన వ్యక్తి కోసం ఎంక్వయిరీ చేశాడు… దోడ్యూంగ్ లామా నివాసానికి అతను చేరేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలు అయింది.
అక్కడ ఏటవాలుగా కట్టిన అందమైన చిన్న ఆశ్రమం లాంటిది ఏర్పరచుకుని కొండమీద నివసిస్తున్నాడు దోడ్యూంగ్ లామా.
లాసాలో అతి ముఖ్యమైంది పొటాలో- దూరానికే దర్శనమిచ్చే ఈ కొండమీది రాజభవనం దలైలామా నివాస స్థలం. (అవన్నీ కమ్యూనిష్టు చైనా ఆక్రమించేసిందనుకోండి)
ఆయన్ని చూసి నమస్కరించి దేవదత్తశాస్త్రి ఇచ్చిన లేఖ అందించాడు. అది పూర్తిగా ప్రాకృత భాషలో వుంది.
తను నేర్చిన భాషలు- తన విజ్ఞానం అంతా కలిపితే సముద్రంలో నీటిబిందువు లాంటివి. తెలుసుకోవలసినవి, నేర్చుకోవలసినవి అనంతమైనవి. ఎంత నేర్చినా ఇంకా నేర్వవల సింది ఎంతో వుంటుంది. తనకి ఇంగ్లీషు కాస్త హిందీ తప్ప వేరే ఏ భాషా రానందుకు సిగ్గుపడిపోయాడు.
తెలుగు మాతృభాష. కనీసం పొరుగు రాష్ట్రమైన తమిళం కూడా నేర్చుకోలేదు. ఇకనైనా ఈ ప్రాకృత భాష- పాళీ భాష నేర్చుకుంటేగాని ఇక్కడ బౌద్ధతంత్ర రహస్యాలు ఏం నేర్చుకోలేనని గ్రహించాడు.
ఆ ఉత్తరం చదివి అతను ఆదరంగా ఆహ్వానించాడు…
“ముందు స్నానం చేసి భోజనం చేసి కాసేపు విశ్రమించండి. తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం” అన్నాడు దోడ్యూంగ్ లామా.
ఆ మాటకు తల పంకించాడు విజయ్. అతను చెప్పినటే విశ్రాంతి తీసుకున్నాడు భోజనం చేసి..
📖
"అబ్రహం! విజయ్ హిమాలయాలు దాటి వెళ్ళాడు. నేను కూడా అతన్ని వెంబడించనా!" అని అడిగాడు ఫోనులో మరో నాలుగురోజుల తర్వాత విలియమ్.
"అతను హిమాలయాలు దాటి ఎక్కడికి
పోయాడంటావు?”
"టిబెట్… తను టిబెట్ వెడుతున్నానని బెనారస్ హిందూ యూనివర్సిటీలో లీడర్ గా పనిచేస్తున్న విశ్వ ప్రసాద్ కి రాశాడు.
"ఆ లెటరు నేను పట్టుకున్నాను. విప్పి చదివాను. ఇంకో లెటరు వాళ్ళ భాషలో రాశాడు అది నేను చింపేశాను. మనకి ఆ భాష తెలియదుగా అందులో ఏం రాశాడో?”
"వండ్రఫుల్! వాడు టిబెట్ వెళ్ళాడంటే అది మామూలు విషయం కాదు, ఆ రాగి చెంబు విషయాలు తెలుసుకునే వెళ్ళివుంటాడు” అన్నాడు అబ్రహాం.
"చెంబు విషయం, రాగి రేకుల విషయం అందులో ఏంలేదు. కాకపోతే మనిద్దరి విషయం రాశాడు. సారనాథ్ లో కొట్టి తీసుకుపోయి ఖాట్మండు పొలిమేరల్లో పడేశామని.”
"బాగు బాగు ఎలా పట్టుకున్నావా లెటర్స్ ని?”
“పోస్టు తీసేవాడిలా నటించి ఆ రెండూ అందు కున్నాను.”
"అతడు నిన్ను గమనించలేదా?”
"గమనించకుండా వేషం మార్చాను.”
"వెరీగుడ్… నువ్వు చైనీస్ ఎంబసీతో మాట్లాడి లాసాలో అతన్ని పట్టుకునేందుకు ఏం అవకాశా లుంటే అవన్నీ ఉపయోగించుకో. అతన్ని బంధించి వుంచుతే మనం ఏదో రకంగా అతన్ని కలుసుకోవచ్చు,”
ఆ మాటకు తల పంకించాడు విలియమ్.
“నువ్వీలోగా విశ్వప్రసాద్ ఇంట్లో సోదా చేస్తే మంచిది- ఒకవేళ అక్కడ దాచి వుంచాడేమో...” అన్నాడు విలియమ్.
"నేను వెడతాను బెనారస్ రేపోమాపో..." అంటూ ఫోను పెట్టేశాడు అబ్రహాం.
విలియమ్ ఒక్క క్షణం ఆలోచనలోపడ్డాడు.
"విజయ్ కి టిబెట్ వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అవన్నీ చదివి తెలుసుకున్నాడా? సరే! ఏదయితే నేం.ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అతన్ని పట్టుకుని ఈసారి వదిలి పెట్టకూడదు. అవి ఎక్కడున్నా సంపాదిస్తే అతన్ని ఒక్క షాట్ తో పేల్చి పారేయచ్చు” అనుకుంటూ ఆ పని మీద లేచాడు.
📖
గిరిప్రసాద్ దేవదత్తశాస్త్రి దగ్గరే వుండిపోయాడు. “ఈరోజు రాత్రికి చక్రపూజ" అన్నారు శిష్యులు.
"ఆ చక్రపూజ ఎలా వుంటుందో!" అని అనుకున్నాడు గిరిప్రసాద్ కుతూహలంగా.
ఆ పూజ శాస్త్రి ఇంట్లో కాక ఖాట్మండ్ లో అష్టయి శ్వర్యవంతుడని పేరుపొందిన ప్రతాప్ తేజ్ రాణా మేడలో జరుగుతుందని, రమ్మని ఆహ్వానించారు మిగిలిన శిష్యులు.
గిరిప్రసాద్ వారి వెనుకే బయలుదేరాడు.
*సశేషం*
*రుద్రవీణ -19*
పూజామందిరం శుభ్రంగా అలకబడింది. ముగ్గుల తో చక్రం వేశారు. ముగ్గుల మధ్య వేదికను అమర్చారు.
సరిగ్గా తొమ్మిది గంటలకు కాళీ పూజ మొదలు పెట్టాడు దేవదత్తశాస్త్రి. రాణా, అతని భార్య పీతాంబరాలు ధరించి వచ్చి కూర్చున్నారు. శాస్త్రి ప్రార్ధనా శ్లోకం చదివాడు. శిష్యులంతా పద్మాసనం వేసుకుని కూర్చుని —
ఓం కాళీ-ఓం బాల- ఓం భగవతి- ఓం భగళ అంటూ శాస్త్రి, ఏ మంత్రాలు చదువుతున్నాడో అవే వల్లించసాగారు.
పదిహేను సంవత్సరాల వయస్సుగల అందమైన కన్య వచ్చి వేదికనెక్కింది. శాస్త్రి మంత్రాలు చదువుతు పూలున్న పళ్ళెం అందుకుని వేదిక మీద నిలబడిన ఆ యువతిమీద వేయసాగాడు పూవులు. ఆ పూజ అవగానే ఆమె నృత్యం చేయడం ప్రారంభించింది. ఆమె నడుము చుట్టూ చిన్న గంటలు కట్టారు. ఆ యువతులందరికీ అదే అలంకరణ. అంతా నృత్యం చేస్తుంటే లయ బద్ధంగా మోగుతున్నాయి గంటలు.
"ఇదేం పూజ?" అని అడిగాను గిరిప్రసాద్ ఆశ్చర్యంగా.
"చక్రపూజలో ప్రాధాన్యత వహించే మర్మావయవాల పూజ" అంటూ రహస్యంగా చెప్పాడు ఆ శిష్యుడు.
ఆ వేడుకంతా చూస్తునే వున్నాడు గిరిప్రసాద్.
“ఇవన్నీ తను చేయాలా?” అనుకుంటూ హడిలి పోయాడు గిరిప్రసాద్.
“ఆఖరికి ఈ విధంగా డబ్బు సంపాదించడం కూడా కష్టమే!" అనిపించింది అతనికి. అయినా దిగాక లోతుని గురించి ఆలోచించడం అనవసరం తను ఏ విధంగా ఎలా సంపాదించాలనుకున్నాడో అలాగే సంపాదించాలి. ఇక దానికి తిరుగులేదు.
పూజలు ముగిశాయి. రాణా దంపతులు విడిగా కుర్చీల్లో ఆసీనులయ్యారు. అంతా అక్కడే పరివేష్టించారు…
రాణా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు దేవదత్తశాస్త్రి.
"సామాన్యంగా వామాచారం నిషిద్ధం. ఎవరో శక్ష పూనినవాళ్ళు, శత్రుమరణాన్ని కాంక్షించేవారు అలాంటివి తలపెడతారు. చేతబడి వగైరాలీ కోవలోకి వస్తాయి. వీరి నివాసం స్మశానం. మద్యం, మాంసం పుర్రెలలో నైవేద్యం పెడతారు. అదే తింటారు. స్త్రీల మృతదేహాలతో సంభో గిస్తారు. అవన్నీ చేస్తే కొన్ని పైశాచిక శక్తులు అలవడుతూ వుంటాయి” అంటూ చెప్పుకుపో సాగాడు దేవదత్తశాస్త్రి.
"దేనికైనా కాళీ దయ వుండాలి. నరబలి, శిశుబలి ఇవ్వడానికి కూడా వెనుకాడకూడదు" అన్నాడు చివరగా.
గిరిప్రసాద్ కి వళ్ళు జలదరించింది.
"డబ్బు దస్కం లేకపోతే పీడాపోయింది ఇంటికి తిరిగిపోదాం" అని అనుకున్నాడు కూడా. అయినా ఎందుకో వెనక్కి తిరగలేకపోయాడు.
"కానీ మనం ఏది నేర్చుకున్నా దుర్వినియోగం చేస్తే గదా భయం? నేను ఎవరూ చావాలని కోరుకోను. ఎవరికీ చేతబడిలాంటివి చేయను, మంచికే వినియోగిస్తాను” అనుకున్నాడు మనసులో.
“నాకున్నది ధనకాంక్ష, వ్యాపారాలు చేయడానికి డబ్బులేదు, ఏ ధర్మాత్ముడూ అప్పివ్వడు, ఏ బ్యాంకీ వారు తన మొర ఆలకించలేదు. అడిగేవాడు ఇచ్చేవాడికి లోకువ అని ప్రతిదానికీ సెక్యురిటీలుండాలి. అదేదో సామెత అదే వుంటే ఇంత దూరం దేనికి రావడం!"
దేవదత్తశాస్త్రికి శుశ్రూష చేస్తూ అక్కడే వుండి పోయాడు గిరిప్రసాద్. అతను చెప్పేదంతా చేస్తూ, నేర్చుకుంటూ, తంత్ర శాస్త్రంలోని మెళకువలు, పద్ధతులు అన్నీ కూలంకషంగా నేర్చుకోసాగాడు.
అతనికి అప్పుడప్పుడూ విజయ్ గుర్తువచ్చినా “ఎక్కడో ఏదో నేర్చుకుంటున్నాడులే పాపం" అని అనుకునేవాడు.
అతని గత చరిత్రగాని, అతని విషయంగాని ఏమీ అడిగి తెలుసుకోలేదు గిరిప్రసాద్. అందుకే విజయ్ ని వెంటాడే అబ్రహం కాని విలియమ్ కాని అతనికి తెలియలేదు.
విలియమ్ చైనీస్ ఎంబసీకి వెళ్ళి లాసాలో వున్న విజయ్ పోలికలు వర్ణించి, ఆ వ్యక్తి గూఢచారి కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాడని చెప్పాడు.
📖
దోండ్యూగ్ లామా దగ్గర శిష్యత్వం ప్రారంభించిన విజయ్ మరోలా మా దగ్గర పాక్రతం, పాళీభాషలు నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ లామాను దొండ్యూగ్ లామాయే కుదిర్చిపెట్టాడు. తను చిన్న చిన్న విషయాలు చెబుతున్నాడు.
తంత్రశాస్త్రం అతను నేర్చుకోబోయే ముందు విజయ్ ని ఆ లామాలిద్దరూ శ్మశానవాటికకు తీసుకుపోయారు. అక్కడ సమాధుల మధ్య వున్న తిన్నె మీద పడుకోమని కొన్ని మంత్రాలు చదివారు. విజయ్ కి వెంటనే నిద్ర ముంచుకు వచ్చింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.
అర్ధరాత్రి ఏవో శబ్దాలు, పిశాచాల నృత్యాలు, ఇవన్నీ అతని చుట్టూ వున్నట్టు గమనించాడు. అలాగే మూడు రోజులు గడిపాడు. నాలుగవ రోజున దోడ్యూంగ్ తన మిత్రుడైన లామాతో కలిసి ఆ శ్మశానానికి వచ్చాడు విజయ్ ని లేపాడు.
“సెభాష్! నువ్వు నిజంగానే ధైర్యవంతుడివి.
మాకు ఆ విషయం ఋజువు అయింది. అందుకోసమే నిన్ను మూడు రోజులు ఈ సమాధుల మధ్య వుంచాము. మరో ప్రయోగం రేపు చేస్తాం" అన్నాడు దోడ్యూంగ్ లామా.
విజయ్ మెల్లగా వారి వెనుకే వచ్చాడు.
ఆ మర్నాడు మళ్ళీ ఇద్దరూ వచ్చారు. ఒక ఇంట్లో చీకటి గదిలో వుంచారు. ఒక వెండి వూచ తెచ్చారు. దాని కొన సూదిలా వుంది. ఆ ఊచకు ఏదో పసరు పూశారు. ఆ వూచను రెండు కనుల మధ్య గట్టిగా పొడిచారు. అది సరాసరి పుర్రెలోకి దిగింది. విజయ్ బాధగా అరిచాడు.
ఏదో మందు రాసారు- “వూచను అలా వుంచి
పదిహేను రోజులు ఇదే గదిలో వుండాలి- నీకు కావలసిన సదుపాయాలన్నీ మేము చేస్తుంటాము.” అన్నారు.
"ఇక్కడ నీకు ఒక నౌకరుని పెడతాము- ఏది కావా లంటే అదే అమర్చి పెడతాడు" అంటూ చెప్పారు.
సరేనన్నాడు విజయ్.
ఈ విధంగా చీకటి గదిలో బందీ అవడం ఒకవిధంగా అదృష్టం అతనిది.
లాసాలోని చైనీస్ కార్యాలయానికి విజయ్ రూపు రేఖలు వర్ణిస్తూ అలాంటి వ్యక్తి కనిపిస్తే తక్షణం పట్టుకోమన్న వార్తలు అందినాయి.
“మనిషి ఇండియన్. భాష తెలుగు. ఇంగ్లీషు
ధారాళంగా మాట్లాడుతాడు” అంటూ మరోకొద్ది వివరాలు కూడా అందించారు. ఆ ప్రయత్నంమీద పడ్డారు అక్కడి గూఢచారులు.
అవేమీ తెలియని విజయ్ మటుకు చీకటి గదిలో అలాగే వుండిపోయాడు పదిహేను రోజులు.
📖
“ఈ ప్రపంచానికి మూలమైన శక్తి ఒకటి వుంది. ఆ శక్తిని తెలుసుకుంటేనే సృష్టి రహస్యం తెలుస్తుంది. మన సందేహాలు బంధనాలు పటాపంచలవుతా యి. ఆ పరాత్పర మూర్తిని దర్శిస్తే హృదయపు ముడి విడిపోతుంది - సర్వ సందేహాలు నివృత్తి అవుతాయి. సర్వకర్మలు క్షయమైపోతాయి. ఇది ముండకోపనిషత్తు చెబుతుంది.
అలాంటి శక్తిని తెలుసుకోవాలంటే మనస్సుతోనే
సాధ్యపడుతుంది…ఆ మనసు దేనికీ లొంగక తనకు తానుగా వుండి అఖండ జ్యోతిలా వెలుగుతూ కార్యాలు నిర్వహించే మార్గం కావాలి. అదే యోగం.
సాధ్యమయినంత త్వరగా కైవల్యం సాధించి ముక్తి పొందాలనుకునేవారు దేహాన్ని, మనస్సుని శ్రమపెట్టి లొంగదీసుకుంటారు- దీనికి హఠయోగం అని పేరు.
ఈ హఠయోగంతో కడుపు క్రింద మూలాధారంలో నిద్రించే కుండలిని శక్తి పైకి లేస్తుంది. అది సుషుమ్న అనే నాడి మూలంగా దేహఁలోని మూలాధారం మొదలు, బ్రహ్మరంధ్రం వరకు గల షట్చక్రాలను క్రమంగా ఛేదించి చివరదైన సహస్రాల చక్రం చేరగా అక్కడ బ్రహ్మ సాక్షాత్కారం కలిగి అసంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది.
ఇదే రాజయోగం. సాధారణంగా సాధన చేసేవారు హఠయోగ ఫలసిద్ధులగు ఆకాశ సంచార, కామరూప, పరకాయ ప్రవేశాలను ఆకాంక్షించి ఆ సమాధిని వదులుకుంటారు.”
పదిహేను రోజులకు ఆ లామాలిద్దరూ తిరిగి
వచ్చారు. ఆ వెండి వూచను తీసేసారు. అది అతని త్రినేత్రం. అప్పుడు మెల్లమెల్లగా విజయ్ తన మూడవకన్ను తెరిచాడు.
🏺
*సశేషం*
*రుద్రవీణ -20*
అప్పుడు మెల్లమెల్లగా విజయ్ తన మూడవకన్ను తెరిచాడు.
ఎదురుగా టిబెటియన్ ప్రజలు అగ్నిజ్వాలల మధ్య దహించుకుపోతున్నట్టు కనిపించి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు విజయ్.
అదే పైకి అన్నాడు కూడా-
అతని మాట విని ఒకరి ముఖాలు ఒకరు చూసు కున్నారు ఆ యిద్దగు లామాలు.
"శభాష్ - ఇప్పుడు నువ్వు కుండలిలోని ఆరవ చక్రం తెరిచావు. కన్నుమూసుకో, కుండలిని సర్పాకారంలో వెన్నెముక పొడవునా వుంటుంది. ఇప్పుడు నీకు దివ్యదృష్టి లభించింది, అది సూక్ష్మ నేత్రమన్నమాట. ఏ వస్తువు ఎక్కడ వున్నా నీకు కనిపిస్తుంది- మళ్ళీ అయిదు రోజులు ఇలాగే వుండు" అన్నాడు లామా.
“అవును. అయిదురోజులిలాగే వుంటే అప్పుడు నువ్వు బయటకు రావచ్చు" అన్నాడు దోడ్యూఁగ్ లామా.
మళ్ళీ మందు రాశారు. నౌకరుకి టిబెటన్ భాషలో ఏదో చెప్పారు. అంతా కలిసి వెళ్ళిపోయారు.
వాళ్ళు చెప్పినట్టే ఐదు రోజులకి వచ్చారు.
"మిస్టర్ విజయ్! ఇప్పుడు నువ్విక బయటకి రావచ్చు. కాని ఒక్క విషయం మరిచిపోకు. నీకు అలవడిన ఈ మూడవ కన్ను సంగతి, దివ్యదృష్టి దుర్వినియోగం చేయకు. ఇంక నీకేం కావాలి?” అని అడిగాడు దోడ్యూంగ్ లామా.
విజయ్ నవ్వాడు.
ఆ తర్వాత- “మహాతాంత్రికుడు భేట్సేరిపోను పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆయన దగ్గర భేచరీ విద్యను, ప్రకృతిని అదుపు లో పెట్టగల శక్తిని సంపాదించుకోవాలని అనుకుంటున్నాను" అన్నాడు విజయ్.
దోడ్యూంగ్ లామా అలాగేనన్నట్టు తల వూపాడు.
పదివేల అడుగుల ఎత్తున ఒక కొండపైన విహారం నిర్మించుకుని అందులో వుంటున్నాడు భేట్సేరిపో.
అతని దగ్గరకి తీసుకువెళ్ళి విజయ్ ని పరిచయం చేసి వచ్చిన పని తెలియచేశాడు.
భేట్సేరిపోకి 90 ఏళ్ళు. అయినా 50 ఏళ్ళవాడిలా దృఢంగా వున్నాడు. అందరికీ టీ ఇచ్చాడు.
“నువ్వు నా దగ్గర పదిహేను రోజులు వుంటే ఆ మంత్రం చెప్పడం - ఎలా చేయాలో వగైరాలన్నీ క్షుణ్ణంగా నేర్పుతాను, ఆ తర్వాత నువ్వు దాన్ననుసరించి సిద్ధి పొందవచ్చు” అన్నాడు భేట్సేరిపో.
అందుకు అంగీకరించాడు విజయ్. అతనికి కావలసింది సాధించేవరకు ఎక్కడ ఎన్నాళ్ళు వుండమన్నా వుంటాడు ఏం చేయమన్నా చేస్తాడు.
📖
లాసాలో పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతివారినీ ఎంక్వయిరీ చేస్తున్నారు. వాళ్ళకి విజయ్ పోలికలు గల వ్యక్తి అంతవరకూ తారసపడలేదు. అతను గదిలో బంధింపబడి ఇరవై రోజుల దాకా బయటకే రాలేదు.
అదే విషయం ఫోను చేశారు ఖాట్మండుకు. విలియమ్ అది విని "అతను బహుశ ఏ లామా దగ్గరయినా వున్నాడేమో, లామా లనందర్నీ పిలిపించి ఎంక్వయిరీ చేయండి” అన్నాడు.
అబ్రహం మళ్ళీ బెనారస్ వెళ్ళాడు. విశ్వప్రసాద్ ఇంట్లోకి రహస్యంగా చొరబడే మార్గాలను గురించి క్షుణ్ణంగా పరిశీలించసాగాడు.
"ఎలాగైనాసరే! ఈ రాత్రికి ఈ యింట్లో ప్రతి గది, ప్రతి చోటా వెతకాలి. వెతికితీరాలి” అన్న నిర్ణయానికి వచ్చాడు.
📖
విహారయాత్రలకంటూ వెళ్ళిన భర్త నెలదాటి రెండు నెలలు కావస్తున్నా ఇంకా రాలేదేమిటా అనుకుంది పశ్యంతి.
రెండు నెలలు కూడా పూర్తికావస్తుంటే "ఆయన గారు ఇంటి దగ్గర ఒక్కరే వచ్చి వుంటున్నారేమో కాలేజీకి శెలవు లేదని, నేను వెడతాను” అంది పశ్యంతి.
తాళాలన్నీ యధాప్రకారం వున్నాయి ఆమె ఇంటికి వచ్చేసరికి. “ఏమిటీ ఆయన అప్పటినుంచి ఇంటికి రాలేదా?” అని అనుకుంది.
“మీకోసం వాళ్ళ కాలేజీవాళ్ళు రెండు మూడుసార్లు వచ్చారు” అంటూ చెప్పారు పక్కవాళ్ళు.
ఆ మాటకు ఆశ్చర్యపడింది పశ్యంతి.
"తనకోసం వాళ్ళెందుకు రావాలి? ఏమయ్యారీ యన అంతూపంతు లేకుండా" అనుకుంటూ మళ్ళీ పుట్టింటికి లెటరు రాసింది. వెంటనే తమ్ముడ్ని పంపమని. ఆమె ఉత్తరం అందగానే వచ్చాడు పశ్యంతి తమ్ముడు ప్రసేన్.
“మీ బావగారి కాలేజీకి వెళ్ళి కనుక్కోరా ఆయన
కాలేజీ వాళ్ళు ఎందుకో రెండు మూడుసార్లు వచ్చారట” అని అంది పశ్యంతి.
వెంటనే కాలేజీకి వెళ్ళాడు ప్రసేన్. అతనికి ముందు అరుణ్ కుమారే కనిపించాడు.
“నేను విజయ్ గారి బావమరిదిని సార్. మా అక్కయ్య మొన్ననే ఇక్కడికి వచ్చారు. మీరు రెండు మూడుసార్లు వచ్చారట. ఏమిటో విషయం కనుక్కుందామని వచ్చాను. మా బావగారు అట్నించి ఏదన్నా వూరు వెళ్ళారా?" అని అడిగాడు ప్రసేన్.
ఆ మాటతో ఇంక పూర్తిగా విజయ్ రాకని గురించి అనుమానం వదిలేసుకుని “మీ అక్కయ్య గారిని ఇంటిదగ్గర వుండమను, మేము వచ్చి చెబుతాం" అని అన్నాడు అరుణ్.
అలాగేనన్నట్టు తల పంకించి వెళ్ళిపోయాడు సైకిల్ మీద. వెళ్ళి అక్కగారికి ఆ మాట చెప్పాడు ప్రసేన్.
పశ్యంతి కాస్త గాభరాపడింది. “వచ్చి చెబుతాం అంటున్నారు ఏమన్నా గొడవ జరిగిందా - అసలే తలతిక్క మనిషి" అని అనుకుంది కొంచెం చిరాకును కూడా మేళవించుకుని.
మరో అరగంటకి అరుణకుమార్, సుధీర్, హరీంద్ర నాథ్ ముగ్గురూ పశ్యంతి ఇంటికి వచ్చారు.
🏺
*సశేషం*
No comments:
Post a Comment