Sunday, 10 July 2022








నువ్వు చేసే పని చెప్పుకునే లా ఉంటే నువ్వు మంచి మార్గంలో ఉన్నట్టు నువ్వు చేసే పనికి చెప్పుకోవడానికి భయపడిన సిగ్గుపడిన నువ్వు సమాజం అంగీకరించని తప్పు చేస్తున్నావు అని అర్థం.. సమాజంలో కట్టుబాట్లకు విలువ ఇచ్చిన వాడు రాముడు అయ్యాడు, కట్టుబాట్లకు విరుద్ధంగా చేసి ప్రవర్తించిన వాడు రావణాసురుడు అయ్యాడు..
ఇప్పుడు ఏది మంచి ఏది చెడు అన్నది మీరే నిర్ణయించు కోండి ..



రామాయణం  

దశరథుడు రాముణ్ణి తన వద్దకు తీసుకురమ్మని తన సారథి అయిన సుమంత్రుడితో చెప్పాడు. సుమంత్రుడు వెళ్ళీ రథంలో రాముణ్ణి తెచ్చాడు. దశరథుడు రాముడితో " నాయనా, నీకు రాజ్యాభిషేకం చేస్తాను. ధర్మాన్ని పాలిస్తూ తగినవిధంగా నీవు రాజ్యం ఏలుకో," అని చెప్పి అతన్ని పంపేశాడు. తరవాత, దూరదేశాల నుంచి వచ్చిన రాజులూ, ప్రజలూ ఎవరి దారిన వారు వెళ్ళిపో యారు. రాముడి మిత్రులు కొందరు కౌసల్యకు ఈ శుభవార్త చెప్పారు. కౌసల్య ఆనందంతో వారికి బంగారమూ, ఆవులూ, రత్నాలూ బహూకరించింది.

అందరూ వెళ్ళాక దశరథుడు తన మంత్రులతో ఆలోచించి, "రేపు పుష్యమీ నక్షత్రం. పట్టాభిషేకానికి చాలా బాగుంటుంది. అందు చేత రేపే జరుపుదాం," అని నిశ్చయించి, రాముణ్ణి తీసుకురుమ్మని సారథి సుమంత్రుణ్ణి పంపాడు. సారథి వచ్చి తండ్రిగారు రమ్మంటున్నారని చెప్పాగానే రాముడు , "నే నిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. మళ్ళి ఎందుకు రమ్మన్నారు?" అని అడిగాడు. "నిజమే. అయినా మహారాజుగారు తమరిని చూడాలన్నారు. వెంటనే తీసుకురమ్మ న్నారు," అన్నాడు సారథి.

రాముడు తత్తరపడి సారథి వెంట బయలుదేరాడు. పై వాళ్ళెవరూ లేరుగనక దశరథుడు ఈసారి తన కాళ్ళకు నమస్కరించే రాముణ్ణి లేవనెత్తి, ఆలింగనం చేసుకుని, ఉన్నతాసనంపై కూచోబెట్టి, "నాయనా, రామా!నేను ముసలివాణ్ణి కావటం అలా ఉంచి, నా జన్మనక్షత్రంలో దుష్టగ్రహాలు చేరాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. పీడకలలు వస్తున్నాయి. కనక నా దేహంలో ఊపిరి ఉండగానే పట్టం కట్టుకో. ఇవాళ పుష్యమి. రేపు పునర్వసు. శుభకార్యాలకు చాలా మంచిది. ఈ రాత్రికి నీవూ, నీ భార్యా దర్భలపై పడుకుని ఉపవాసం చెయ్యండి. నీ తమ్ముడు భరతుడు తన మేనమామ ఇంటి నుంచి తిరిగిరాక పూర్వమే ఈ పట్టాభిషేకం ముగించటం మంచిదని నాకు తోచింది. వాడైనా పెద్దలంటే భక్తిగల వాడే; ఈ పట్టభిషేకానికి ఎదురు చెప్పబోడు. అయినా మానవస్వభావం అమిత చంచలమైనది," అని చెప్పాడు.

రాముడు తండ్రి అనుమతితో అక్కడి నుండి బయలుదేరి తన తల్లి అయిన కౌసల్య మందిరానికి వచ్చేసరికి ఆమె మౌనంతో రాజ్యలక్ష్మిని ప్రార్థిస్తూ కనిపీంచింది. రాముడు రాక పూర్వమే పట్టాభిషేక వార్త తెలిసి సుమిత్రా లక్షణులు సీతను తమ వెంట కౌసల్య మందిరానికి తెచ్చారు. రాముడు తల్లికి నమస్కరించి తన పట్టాభిషేక వార్త తెలిపి, "అమ్మా, రెపటి పట్టాభిషేకానికి నేనూ, సీతా ఏమేమి అలంకారాలు చేసులోవాలో అవన్నీ చేయించు," అని కోరాడు.

రాముడు లక్ష్మణుడితో, "లక్ష్మణా, నాతో బాటు నీవుకూడా ఈ భూమినంతా పాలింతువుగాని. మనిద్దరమూ ఒకటేగదా. నేను రాజయితే నీవూ రాజువే. మనిద్దరమూ సమస్త సుఖాలూ ఒక్కటిగా అనుభవించుదాం," అన్నాడు. తరవాత అతను తల్లుల అనుమతి పొంది సీతతోసహా తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాముడిచేతనూ, సీతచేతనూ ఉపవాసవ్రతం సక్రమంగా చేయించ టానికి దశరథుడి కోరికపై వసిష్ఠుడు రథమెక్కి రాముడుండే నగరుకు వెళ్ళి ఆ పని పూర్తి చేసి తెరిగి వచ్చే సమయంలో వీధులన్నిటా జనంతండోపతండా లుగా కనిపించారు. రేపటి ఉత్సవం తాలూకు ఉత్సాహంలో వారు సంతోష ధ్వానాలు చేస్తున్నారు వీధులలో నీళ్ళు చల్లి, పూలదండలు కట్టారు. ప్రతి ఇంటిమీదా జెండా ఎగురుతున్నది. స్త్రీలూ, పిల్లలూ, వృద్దులూ ఇప్పటినుంచే పట్టాభిషేకానికి ఎదురుచూస్తునారు.

వసిష్ఠుడు వెళ్ళిపోయాక రాముడు స్నానం చేసి, సీతతో కూడా హొమం చేసి, హొమశేషం తిని, నిశ్చలమైన మనస్సుతో నారాయణాలయంలో భగవంతుణ్ణి ధ్వానం చేసి అక్కడే పడుకుని ఒక ఝాముసేపు నిద్రపోయి, వందిమాగధుల మేల్కొలుపులకు లేచాడు. ఆయన ఉదయం సంధ్యావందనం మొదలైనవి పూర్తిచేసేసరికి తెల్లవారింది. బ్రాహ్మాణులు వచ్చి పుణ్యాహావాచనం చేశారు. మంగళవాద్యాలతో అయోధ్య యావత్తూ మారుమోగిపోయింది.

తెల్లవారుతూనే మళ్ళీ పౌరులు తమ ఇళ్ళను అలంకరించసాగారు

--(())_-- 

 గురు బోధ

ఆత్మ బంధువు లందరికీ శుభోదయం మరియు శుభాశీస్సులు.

ఆత్మ బంధువు లారా మనం అందరం దైవ వారసులం.

కామ క్రోధం గూర్చి

--------------------    తెలుసుకోండి.

భగద్గీతలోని 2 వ అధ్యాయములో 62 వ శ్లోకం లో భగవంతుడు క్రోధం గూర్చి, దానివలన వచ్చే నష్టాల గూర్చి ఈ విధంగా తెలియ జేస్తున్నాడు.పూర్తిగా చదివి మీ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకొండి. 

 "ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।

సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ।। 62 ।।"

ధ్యాయతః — చింతన చేయునట్టి; విషయాన్ — ఇంద్రియ విషయములు; పుంసః — వ్యక్తికి; సంగః — సంగము (మమకారాసక్తి); తేషు — ఆ విషయములయందు; ఉపజాయతే — కలుగును; సంగాత్ — సంగము (మమకారాసక్తి) నుండి; సంజయతే — ఉత్పన్నమగును; కామః — కోరికలు; కామాత్ — కోరికల నుండి; క్రోధః — కోపము; అభిజాయతే — ఉద్భవించును.

ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగ చేస్తుంది, ఆ కోరికల నుండే క్రోధం ఉత్పన్నమవుతుంది.

క్రోధం, లోభం, కామము మొదలగునవి వైదిక వాజ్ఞ్మయం లో మానసిక రోగాలు అని పరిగణించబడ్డాయి. రామాయణం ఇలా పేర్కొంటున్నది : మానస్ రోగ కచ్చుక మై గాయే హహిన్ సబ కే లఖి బిరలేన్హ పాయే. మనకందరికీ శారీరిక వ్యాధులు అంటే ఏమిటో తెలుసు - ఎదో ఒక్క శారీరిక జబ్బుకి కూడా మనిషి రోజంతా దుర్భరం చేసే శక్తి ఉంది. - కానీ మనము ప్రతి నిత్యం చాలా మానసిక రోగాలతో సతమతమౌతునట్టు మనకు తెలియట్లేదు. మనము కామ, క్రోధ, లోభాదులను మానసిక వ్యాధులుగా పరిగణించక పోవటం వలన మనం వాటిని నయం చేసుకోవటానికి ప్రయత్నించటం లేదు. మనస్తత్త్వశాస్త్రము అనేది మానవ విజ్ఞానంలో ఒక భాగం, అది ఈ వ్యాధులను విశ్లేషించి వాటికి పరిష్కారం సూచిస్తుంది. కానీ, పాశ్చాత్య మనస్తత్త్వశాస్త్రము సూచించే విశ్లేషణ మరియు పరిష్కారం రెండూ కూడా అసంపూర్తిగా ఉండి, మనస్సు యొక్క వాస్తవ తత్వానికి, గుండుగుత్తంగా ఒక అంచనా మాత్రమే అని అనిపిస్తుంది.

ఈ శ్లోకం ఇంకా తదుపరి శ్లోకం లో శ్రీ కృష్ణుడు మనస్సు యొక్క పనితీరుమీద సంపూర్ణమైన మరియు లోతైన అవగాహన కల్పించాడు. మనం ఒక వస్తువు వలన ఆనందం కలుగుతుంది అని పదే పదే అనుకుంటే, మనస్సుకి ఆ వస్తువుతో మమకార బంధం ఏర్పడుతుంది. ఉదాహరణకి, ఒక తరగతిలో ఉన్న కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు, అమాయకంగా అందరూ కలిసి పని చేసుకుంటున్నారనుకుందాం. ఒక రోజు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి గురించి ఏదో గమనించి ఇలా అనుకుంటాడు, "ఆమె నాదవుతే ఏంతో బాగుంటుంది" అని. ఈ ఆలోచనని నిరంతరం మనస్సులో తిప్పటం వలన, అతని మనస్సు కి ఆమె పట్ల అనురక్తి ఏర్పడుతుంది. అతను తన స్నేహితులతో, తను ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని, తన మనస్సు నిరంతరం ఆమె వైపే వెళ్తుండటం వలన చదవలేక పోతున్నానని చెప్తాడు. మేమందరం తరగతిలో ఆ అమ్మాయితో కలసి పని చేస్తున్నాము, మాకెవరికీ ఆమె మీద పిచ్చి వ్యామోహం లేదని, అతని స్నేహితులు వాడిని ఎగతాళి చేస్తారు. ఎందుకు ఆ అబ్బాయి ఆమె కోసం తన నిద్ర ని చెడగొట్టుకొని, ఇంకా తన చదువును పాడు చేసుకుంటున్నాడు? ఎందుకంటే, అతను, ఆ అమ్మాయిలో సుఖం ఉంది అని పదేపదే అనుకోవటం వలన అతని మనస్సుకు ఆమెతో మమకారానుబంధం ఏర్పడింది.

ఇప్పుడు ఆ అనురాగం మొదట్లో హానిచేయనిది గా అనిపిస్తుంది. కానీ, ప్రమాదం ఏమిటంటే అనురాగం నుండి కోరిక జనిస్తుంది. ఒక వ్యక్తికి తాగుడు మీద అనురాగం ఉంటే తాగుదామనే కోరిక పదే పదే మనస్సులో వస్తుంటుంది. ఒకడికి ధూమపానం మీద అనురాగం ఉంటే సిగరెట్టు తాగితే ఉండే ఆహ్లాదము మీదికే మనస్సులో తలపులు పదేపదే వస్తుంటాయి, అవి ఒకలాంటి యావ కలిగిస్తాయి. ఈ ప్రకారంగా, మమకారం అనేది కోరికలకు దారి తీస్తుంది.

ఒకసారి కోరిక జనిస్తే, అది ఇంకా రెండు సమస్యలను సృష్టిస్తుంది - లోభము (అత్యాశ) మరియు క్రోధము. కోరికలు తీరటం వలన అత్యాశ కలుగుతుంది. “జిమి ప్రతిలాభ లోభ అధికాఈ” (రామాయణం) “కోరికలను తీర్చుకుంటే అది అత్యాశ కు దారి తీస్తుంది.” కాబట్టి, వాంఛలను తృప్తి పరచటం ద్వారా వాటిని పోగొట్టుకోలేము:

"ఎవరికైనా ప్రపంచంలోని సమస్త సంపదలు, విలాసాలు మరియు భోగ వస్తువులు వచ్చినా అతని తృష్ణ చల్లారదు. కాబట్టి, దుఃఖానికి మూల కారణం కోరికలే అని తెలుసుకొని తెలివైన వ్యక్తి వాటిని త్యజించాలి."

మరోపక్క, కోరికలు తీర్చుకోటానికి ఆటంకం కలిగినప్పుడు ఏమవుతుంది? అది కోపం కలుగ చేస్తుంది. గుర్తుంచుకోండి, కోపం అనేది దానికదే ఉత్పన్నమవదు. అది కోరికలకు ఆటంకం కలగటం నుండి వస్తుంది; కోరిక మమకారబంధం నుండి వస్తుంది; మమకారాసక్తి అనేది ఇంద్రియ విషయముల యందు పదేపదే ఆలోచించటం వలన కలుగుతుంది. ఈ విధంగా, ఇంద్రియ భోగ వస్తు విషయముల మీద పదేపదే చింతించటం అనే సాధారణ క్రియ, లోభము, క్రోధము అనే జంట రోగాల దిశగా పతనానికి దారి తీస్తుంది. ఈ క్రోధం ఎంతో అనర్థాలకు దారి తీస్తుంది. కావున అందరూ కోర్కెలకు దూరంగా ఉండడమే, అన్ని రోగాలకు  ( శారీరక, మానసిక ) దూరంగా ఉండవచ్చు.... 


సేకరణ: భగవద్గీత.2 వ అధ్యాయం.62 వ శ్లోకం.


మీ

హరే కృష్ణ.


No comments:

Post a Comment