Friday, 4 June 2021

ప్రాంజలి ప్రభ పాత కధలు (191---200)

191...టైం మెషిన్ లో 50 ఏళ్ల క్రితం

అర్ధశతాబ్ద పూర్వం జీవన శైలి.

ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందుం పుల్లలు అని కూడా అనే వారు.

కొంతమంది కచ్చిక (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ఉపయోగించేవారు.

మొగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి.

ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు.

కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు.

బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది UMRAO వత్తుల స్టౌ (కిరసనాయిలుది) / పంపు స్టౌ వాడేవారు.

అదే విధంగా గా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం( పావు వీశ)గా తూచే వారు.

ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ  రాచ్చిప్ లు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు,  ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే.

అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి.

అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు.

బియ్యం లో అక్కుళ్లు, మొలకొలుకులు ఆట్రగడ్డలు, వంకసాన్నాలు, SLO, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, SLO మధ్య రకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు.

సీతారామాభ్యానమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్ళకు వచ్చి తిథి వార నక్షత్రాలు చెప్పి (ఇప్పుడు WhatsAppలో రోజూ ఉదయం పంచాంగం పోస్ట్ చేస్తున్నట్టుగా) వెంటనే వెళ్లి పోయేవారు. వెళ్లిపోయే లోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసే వారు. ఒక వేళ మిస్స్ అయితే ఏదో తప్పు చేసినట్లుగా, అపరాధ భావనతో ఉండి, మర్నాడు ముందే రెడీగా ఉండి, రెండు గుప్పెళ్లు వేసేవారు బియ్యం.

రాత్రి పూట 7, 8 గంటలకు మాదాకవళం తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు పేచీ పెడుతుంటే మాదాకవళo అబ్బాయికి ఇచ్చేస్తానని భయపెట్టేవారు తల్లులు.

టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్ర నూక ఉప్మా లాంటివి ఉండేది.

పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినే వారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు.

ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు.

డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితి మంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వారు.

3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బు కి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది.

వైద్యం కి ఆయుర్వేద వైద్యులదగ్గరకు తీసుకువెళ్ళేవారు. డా. శిష్ట్లా సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ఆయుర్వేదం, అల్లోపతి అయితే వాడపల్లి వెంకటేశ్వరరావు గారు. వాళ్లు చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గే వరకూ లంఖణమే. తర్వాత bread, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్  భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది.

ఇంకా, పిల్లల చదువుల మీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు. అంతే. ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసే వారు కాదు.

పుస్తకాలు ఎప్పుడు 2nd hand వే. పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేట్ కి టెక్స్ట్ బుక్స్ కొనే వారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. Last year నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త బుక్ లా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు.

రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం అర్థం అయినా కాకపోయినా. రాత్రి పెంద్రాలే నిద్ర. వేసవి కాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసినికర్రే.

ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది. 2 రూపాయలు పెట్టి ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు.

అదీ ఆరోజుల్లో జీవన శైలి.

ఎవరికీ ఏ చీకూ చింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు  నిర్వహించేవారు.

*****

192... దేవునిపై మనకున్న భక్తిని వివరించే మంచి సారాంశం గల ఓనీతి కథ, సమయం ఉన్నవారు తప్పక చదవండి..🌺🙏

🌺ఒక రాజ్యంలో ఒకరాజు ఉండేవాడు. అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం, అందరి కష్టా సుఖలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు. 

ప్రజలంటే చాలావాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం  కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు. రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ, స్మరణం, నామజపం చేసుకునే వాడు. 

      ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు.

 “రాజా, నీ భక్తిని మెచ్చుకోలేక పోతున్నాను, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు.”

 అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు.

  “భగవాన్, నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికి నాకు ఒకటే కోరిక! ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే, మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే, నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చేయండి. వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు..”

 భగవంతుడు రాజును చూసి “ఇది సంభవం కాదు కదా..” అని ఏదో చెప్పబోయాడు. కాని రాజు మాత్రం చాలా పట్టుబట్టి “ఈ కోరికను తీర్చవలసిందే స్వామి”  అన్నాడు.

       భగవంతుడు చివరకు తన ప్రియ భక్తుడికి లొంగక తప్పలేదు. ఆయన చివరకు ఇలా అన్నాడు “సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా! నేను ఆ కొండమీద అందరికీ దర్శనమిస్తాను.” 

        అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై,  భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుని,   మరుసటిరోజు తన నగరంలో దండోరా వేయించాడు.

"రేపు అందరు కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని, అక్కడ మీకందరికి కూడా ఆ భగవంతుడు దర్శనం ఇస్తాడు, ఇది రాజుగారి ఆజ్ఞ!” 

   రెండవ రోజు రాజు తన ప్రజలందరిని తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు, నడుస్తూ నడుస్తూ ఉండగా కొండ దారిలో ఒకచోట రాగి నాణేల నిధి కనిపించింది. ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు. 

    అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరిని సమాధానపరచి, "అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు,  ఎందుకంటే.. మీరు అందరూ  భగవంతుడిని కలవటానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణాల వెనకాలపడి, మీ అదృష్టాన్ని కాలతన్ను కోకండి.” అన్నాడు. 

      కానీ లోభం ఆశవల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆనాణేలను మూటకట్టుకుని తిరిగి తమ ఇంటివైపు వెళ్ళిపోయారు. 

    వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు

 'మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేర్చుకుందాము. భగవంతుడిని మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా' అని! 

       రాజు మాత్రం ముందుకు సాగాడు. కొంతదూరం పోయాక అందరికి ఒకచోట వెండి నాణేల కొండ నిధి కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు. 

       వెండి నాణేలను మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్ళకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది. ‘వెండి నాణేలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు, భగవంతుడు అయితే మళ్ళి అయినా దొరుకుతాడు కదా!’ 

అనిపించింది.

           ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తర్వాత అందరికి విచిత్రంగా బంగారపు నాణేల నిధి కనిపించింది. 

 ప్రజలలో ఇక మిగిలినవారంతా, రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరుగెత్తడం మొదలుపెట్టారు. 

     వాళ్ళు కూడా ఇతరులలాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. 

 ఇంక కేవలం రాజు, రాణి మిగిలారు. రాజుగారు రాణితో అన్నాడు.

 “చూడు, ఈ ప్రజలు ఎంత ఆశపోతులో...! భగవంతుడి నిజ దర్శనం లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటంలేదు! భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒకలెక్కకాదే!” 

      నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది. వారిద్దరు ముందుకు సాగారు. 

     కొంతదూరం వెళ్లాక  రాణికి, రాజుకు ఏడురంగులలో దగదగ మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది. ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది. ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నింటినీ మూట కట్టుకోవటం ప్రారంభించి, "మీరు త్వరగా  వెళ్ళిరండి, నేను మీరు వచ్చేలోపు వీటన్నింటిని పోగుచేసి ఉంచుతాను" అంది.

    అదిచూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనసు విరక్తి చెంది, చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు.

నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు.    రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు.

"ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ యొక్క బంధువులు?  నేను ఎప్పటి నుంచో.. ఇక్కడే నిలబడి మీ అందరికోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నాను.” 

     రాజుగారు చాలా సిగ్గుతో, భగవంతుని ముందు తల దించుకున్నాడు. 

      ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు.

“ఓ రాజా, ఎవరైన సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికి నేను లభించను, కనిపించను! వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు!” 

ఈ కథ యొక్క సారాంశం :

ఎవరైన సరే తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతున్ని శరణు వేడుతారో, ఎవరు తమ లౌకిక మోహాలన్నింటినీ విడిచి, ఇష్టంతో భక్తితో భగవంతున్ని కొలుస్తారో, వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు.

*****

193....శాశ్వతమైన ఆనందం🧘‍♀️

మనం ఆత్మ స్వరూపులం అజ్ఞానం చేత మన స్వరూపాన్ని మరచిపోయాం. మన స్వరూపాన్ని మరచిపోవటంతో జీవుణ్ణనే భ్రాంతి కలిగింది. భ్రాంతి వల్ల అశాంతి కలిగింది. ఆ అశాంతి-భయం- దు:ఖం ఎంత కాలం ఉంటాయి? ఆ భ్రాంతిలో ఉన్నంత వరకూ ఉంటాయి.

  భ్రాంతి ఎప్పటి దాకా ఉంటున్నది? అజ్ఞానం తొలగే దాకా అజ్ఞానం ఎప్పుడు తొలగుతుంది?జ్ఞానం కలగగానే వెలుగు రాగానే చీకటి తొలగినట్లు జ్ఞానం రాగానే అజ్ఞానం తొలగి పోతుంది. దానితో భ్రాంతి-అశాంతి బాధలు తొలగి పోతాయి.

మన పెరట్లో భావి దగ్గర త్రాడు పడి ఉంది. అలా పడి ఉండటాన్ని మనం పగలు చూడలేదు. కనుక అక్కడ త్రాడు ఉన్నదనే జ్ఞానం లేదు. అదే అజ్ఞానం. చీకట్లో అనుకోకుండా పెరట్లోకి వెళ్ళాం. అసలే భయం భయంగా ఉంది.

 బావి దగ్గరగా ఏదో  పాము ఉన్నట్లు భ్రాంతి కలిగింది. అంటే వెంటనే మెరుస్తున్న చర్మము, కదులుతున్న శరీరం, ముందుకు వస్తున్నా కోరలు, పైకి లేచిన పడగ, ఆ పడగపై చారలు, బుసకొడుతున్న శబ్దము ఒక దాని వెంట ఒకటిగా తెలియవస్తున్నాయి. అది నన్నే చూస్తున్నట్లుగా, నావైపే కదిలి వస్తున్నట్లుగా అనిపిస్తున్నది. దానితో ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. గుండె దడదడా కొట్టుకుంటున్నది. చుట్టూ ఎవరూలేరనే దిగులు. చేతిలో కర్రగాని, లైటు గాని లేక పోయెనే అనే చింత. ఒకటే భయం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మెల్లిగా అడుగులేస్తున్నాను.

ఇంత భయం, దు:ఖం, అశాంతి, ఎందువల్ల వచ్చినై ? అంటే అక్కడున్నది పాము అని అనుకోవటం వల్లనే. భ్రమ చెందటం వల్లనే. మరి ఈ భయం, దు:ఖం, అశాంతి తొలగేదెలా? అది పాము కాదని, త్రాడేనని నిశ్చయంగా , సందేహరహితంగా తెలిస్తేనే ఆ సమయములో నీ మిత్రుడో, బంధువో, ఇంటిలోని వ్యక్తో,-ఎవరో ఒకరు అది పాము కాదని త్రాడేనని, నమ్మకంగా చెబితే అప్పుడు ఆలోచన చేస్తావు.

 ఇది పాము కాదేమోనని భావించి, నెమ్మదిగా దగ్గరకు వెళ్తావు, అలికిడి చేస్తావు, చప్పట్లు కొడతావు, పుల్లతో కదిలిస్తావు. దానితో ధైర్యం వస్తుంది. ఇప్పుడు చేతితో పట్టుకొని చూస్తావు. అవును నిజమే. ఇది త్రాడేనని తెలుసుకుంటావు. దానితో నీ భయం, దు:ఖం  పటాపంచలైపోతాయి. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటావు. హాయిగా ఉంటావు.

అలాగే మన నిజ స్వరూపం, నిరాకార, నిర్గుణ, ఆనందస్వరూపఆత్మ అని తెలియకపోవటం వల్ల-అజ్ఞానం వల్ల. ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో కూడిన పరిమిత జీవుణ్ణి అనుకున్నాం. దేహేంద్రియాలతో తాదాత్మ్యం పెట్టుకొని కర్మలు చేస్తున్నాను, కర్తను అని భావిస్తున్నాం. మనోబుద్ధులతో తాదాత్మ్యం పెట్టుకొని సుఖదు:ఖాలను అనుభవిస్తూ భోక్తను అనుకుంటున్నాం.

కర్మలు చేస్తూ కర్మఫలాలను కూడబెట్టుకుంటున్నాం, ఆలోచనలుచేస్తూ వాసనలను కూడబెట్టుకుంటున్నాం. ఈ కర్మఫలాలు, వాసనల కారణంగా జననమరణాలనే సుడిగుండంలో పడి అందులోనే దు:ఖాన్ని, భయాన్ని అనుభవిస్తున్నాం.

ఈ భయాన్ని, దు:ఖాన్ని తొలగించుకోవటం ఎలా? ఎంతకాలం జీవభావంలో ఉండి ఏమేమి చేస్తున్నా ఒక దు:ఖం తొలగి మరో దు:ఖం, ఒక భయం తొలగి మరో భయం రాక తప్పదు. మరి శాశ్వతంగా ఈ దు:ఖం తొలగాలి. అలాగే శాశ్వతంగా ఆనందాన్ని పొందాలి. ఎలా?

 అనేక జన్మలలో మనం చేసుకొన్న సుకృతం కారణంగా ఏదో ఒక సందర్భంలో, ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒక గురువు నీ నిజస్వరూపం  ఇది కాదు. నీవు జీవుడివి కాదు. నీవు ఆనంద స్వరూప ఆత్మవు. తత్వమసి  అని తెలియజేస్తాడు. నీ సుకృతాన్ని బట్టి, నీ పూర్వ జన్మల పుణ్యాన్ని బట్టి, నీ ప్రయత్నాన్ని పట్టుదలను బట్టి గురువు ఆ మాట చెప్పగానే చెవికెక్కించుకుంటావు. శాస్త్ర శ్రవణం చేస్తావు. విచారణ చేస్తావు. శాస్త్రాలను శోధిస్తావు. గురువులను సేవిస్తావు. విచారణ కొనసాగిస్తావు, వైరాగ్యాన్ని అలవరచుకుంటావు. నీ నిజస్వరూపం ఆత్మయని-ఆత్మ అంటే సర్వవ్యాపక చైతన్య స్వరూప పరమాత్మేనని తెలుసుకుంటావు. 'అహం బ్రహ్మాస్మి' అనే అనుభవాన్ని పొందుతావు. జీవభ్రాంతిని తొలగించుకొని దు:ఖనివృత్తి గావించుకుంటావు. ఆత్మననే జ్ఞానంతో ఆనందాన్ని - శాశ్వతంగా పొందుతావు. పొందటం కాదు. ఆనంద స్వరూపంగా ఉండిపోతావు.

--(())--

194.... అహం అనర్థ హేతువు 

ఒకప్పుడు పాశుపతాస్త్రం పొందగోరి అర్జునుడు, పరమశివుణ్ణి గూర్చి తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. అందునిమిత్తం ఒంటరిగా రథంలో బయలుదేరిన అతడు అరణ్య మార్గంలో అనేక మృగాలను వేటాడుతూ ఒక పగటి వేళ రామేశ్వరం చేరుకున్నాడు.

అక్కడ అతడు సముద్రస్నానం చేసి మాధ్యాహ్నికం నిర్వర్తించాడు. ఆ తరువాత గర్వంతో రథాన్ని సముద్ర తీరంలో అటూ ఇటూ సమధికోత్సాహంతో వేగంగా నడిపించాడు.

అప్పుడు అక్కడ అరణ్యంలోని కొండ మీద శ్రీరామభక్త హనుమాన్ తపస్సు చేసుకొంటున్నాడు. 'రామ రామ' అంటూ జపంలో లయించిపోయి ఉన్న ఆంజనేయుని యాదృచ్ఛికంగా అర్జునుడు అక్కడ చూశాడు.

ఆయనను చూసి గర్వంతో అర్జునుడు, "ఏయ్ ముసలి కోతీ! నువ్వు ఎవరు? నీ పేరేమిటి?” అని గద్దిస్తూ అడిగాడు.

అందుకు ఆంజనేయుడు నవ్వుతూ ప్రశాంతంగా, “శ్రీరాముడు బండరాళ్ళతో సేతువు నిర్మించి, లంకకు వెళ్ళి రావణుణ్ణి సంహరించాడు. అంతటి 

కీర్తిమంతుడైన శ్రీరామునికి దాసుణ్ణి నేను. నన్ను హనుమంతుడనీ, వాయుపుత్రుడనీ పేర్కొంటారు" అని చెప్పాడు.

ఆంజనేయుడు, శ్రీరాముని ఆ విధంగా ప్రశంసిస్తూ చెప్పడం విన్న అర్జునునికి నవ్వాగలేదు. అతడు పరిహాసంగా, “ఓ వానరమా! నీ రాముడు పరాక్రమవంతుడై ఉండి ఉంటే సముద్రం మీద సేతువు నిర్మించే కార్యానికి అనవసరంగా ఎందుకు ఉపక్రమించాడు? ఆయన నిజంగానే మేటి విలుకాడై ఉండే పక్షంలో, తన బాణాలతోనే వంతెన నిర్మించి ఆ కార్యాన్ని స్వయంగా తానే పూర్తి చేసి ఉండకూడదా?" అంటూ, అహంకారంగా ప్రశ్నించాడు.

అంతదాకా ప్రశాంతంగా ఉన్న హనుమంతునికి, అర్జునుడు రాముని గూర్చి అమర్యాదగా మాట్లాడటంతో ఆగ్రహం ముంచుకొచ్చింది. తన గురించి అమర్యాదగా మాట్లాడినా కూడా ఆయన సహించి ఉండేవాడు. శ్రీరాముని ఒకడు పరిహసిస్తూ మాట్లాడితే ఆయన ఎలా సహనంతో ఉండగలడు? అందుకే ఆయన కోపోద్రేకంతో, "అర్జునా! బాణాలచే వారధి నిర్మిస్తే నా వంటి వానర సైన్యంలోని బలిష్టమైన వారి భారం కారణంగా వారధి సముద్రంలో మునిగిపోతుందని రాముడు. బాణాలచే వారధి నిర్మించలేదు. నువ్వు నా రాముని కన్నా గొప్ప విలుకాడవా?" అని అడిగాడు.

'విల్లుకు విజయుడు' అనే ఖ్యాతి అర్జునునికి ఉంది కదా! దాంతో అతడు అహంకారంతో, "ఆంజనేయా! బాణాలచే నిర్మితమైన వారధి కోతుల భారంతో సముద్రంలో మునిగిపోతే, ఇక విలుకాని విలువిద్యకు ఏం మహత్వం ఉంటుంది? నేను ఇప్పుడే నువ్వు చూస్తూ ఉండగానే నీ కళ్ళ ముందే బాణాలచే అద్భుతమైన వారధిని నిర్మిస్తాను. నువ్వు దానిపైకెక్కి నిలబడి నీ ఇష్టం వచ్చినట్లు ఎంతసేపైనా గంతులు వెయ్యి. తరువాత నేను నీ రామునికన్నా గొప్ప విలువిద్యాపారంగతుణ్ణా, కానా అని నువ్వే తెలుసుకో" అని పలికాడు.

అందుకు ఆంజనేయుడు మందహాసం చేస్తూ, "బాణాలచే నువ్వు కొత్తగా నిర్మించే వారధి మీద నేను ఎక్కి గంతులేస్తాను. అప్పుడు అది కుప్పకూలితే నువ్వేం చేస్తావు? నా కాలి బొటనవేలు పడగానే నువ్వు నిర్మించే వారధి కూలి సముద్రంలో మునిగిపోతే అర్జునా! నువ్వు ఏం చేస్తావో చెప్పు?" అన్నాడు ధీమాగా.

ఆ మాటలకు ప్రతిస్పందిస్తూ అర్జునుడు, “ఆంజనేయా! నీ భారం కారణంగా నేను నిర్మించే వారధి కూలి సముద్రంలో మునిగిపోతే, ఇక్కడే అగ్ని రాజేసి అగ్నిప్రవేశం చేసి ప్రాణాలు విడుస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ! వారధి సముద్రంలో మునిగిపోకపోతే నువ్వు ఏం చేస్తావో చెప్పు?" అని ప్రశ్నించాడు.

అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ విని ఆంజనేయుడు, "అర్జునా! నువ్వు నిర్మించే ఆ బాణాల వంతెనను నేను నా కాలి బొటనవేలితో సముద్రంలో ముంచివేస్తాను. ఆ విధంగా జరుగకపోతే నీ రథ పతాకంలో కొలువుదీరి నీకు అవసరమైన అన్ని తోడ్పాట్లు అందిస్తాను” అని జవాబిచ్చాడు.

"ఆహా! అట్లే కానివ్వు!” అంటూ అర్జునుడు, హనుమంతునితో పందానికి ఒప్పుకున్నాడు.

'హనుమంతుడు ఎదురు చూడని విధంగా అనేకరెట్లు పటిష్టతతో కూడుకున్న వారధిని నిర్మిస్తాను' అని మనసులో అనుకొని అర్జునుడు తన గాండీవాన్ని చేతుల్లోకి తీసుకుని బాణాలను ప్రయోగించ నారంభించాడు. కాసేపటికల్లా అర్జునుడు కురిపించిన బాణవర్షంతో చక్కని వారధి నిర్మాణం జరిగింది. తరువాత అతడు సగర్వంగా, “హుం, వారధిని ఆసాంతం పరిశీలించి చూసుకో!" అని హనుమంతుడితో చెప్పాడు.

అప్పుడు హనుమంతుడు 'రామా! నేను నీ దాసుణ్ణి. నన్ను నువ్వు ఎలాగైనా చేసుకో' అని మనస్సులో ప్రార్థించాడు. తరువాత, “రామ్ ! రామ్!" అంటూ అర్జునుడు సముద్రం మీద నూరు యోజనాల దూరానికి నిర్మించిన బాణ వారధిపైకి ఎక్కకుండానే తన కాలి బొటన వేలితో ఒక మూల అదిమి నొక్కాడు. అంతే! మరుక్షణమే ఆయన ఆ విధంగా చెయ్యాలి అని కాచుకున్నట్లుగా ఆ వారధి కుప్పకూలి, వారధి ఉండేదనే ఆనవాలుకూడా లేకుండా సముద్రంలో మునిగిపోయింది. పిల్లలు అట్టలతో కట్టిన ఇల్లు గట్టిగా గాలి వీచినప్పుడు కూలిపోయే రీతిలో వారధి కూలి, సముద్రంలో జాడకూడా తెలియనంతగా మునిగిపోయింది.

ఈ ఘటనతో వీరాధివీరుడైన అర్జునునికి అవమానంతో ముఖం చిన్నబోయింది. అతడు నిశ్చేష్టితుడయ్యాడు. అగ్నిప్రవేశం చేసి మరణించడానికి అతడు ఏమాత్రం సంకోచించలేదు, విచార పడలేదు. 'పాశుపతాస్త్ర సముపార్జనకై వచ్చిన నేను, వచ్చిన మహత్కార్యాన్ని నెరవేర్చలేకపోయానే! నాకు పట్టిన గతి తెలియక, నా సోదరులైన పాండవులు తల్లడిల్లిపోతూ నన్ను వెతుకుతుంటారే!' అని అనుకుంటూ అతడు బాధపడ్డాడు.

[ఎంతో గొప్ప లక్ష్యం కోసం మనం ఏతెంచాం; మహత్కార్యాలు సాధించే స్థితిలో ఉన్నాం. దాన్ని వదలిపెట్టి, అహంకారంతో మనలను మనమే నాశనం చేసుకొంటున్నాం. మన అహంకారమే ఎన్నెన్నో మంచి పనులు జరగడానికి ఆటంకంగా ఉంటున్నది. ఇది గ్రహించి కూడా మన అహంకారాన్ని తొలగించుకోవడానికి మనం సిద్ధంగా లేము. అంతేకాక ఇతరుల దుఃఖానికి కారణమౌతున్నాం. మహత్కార్యాలు సాధింప వచ్చిన మనం, సిగ్గులేకుండా అల్పవిషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకు మనం సిగ్గుపడాలి - ఈ గుణపాఠానికి అర్జునుడి స్థితి అద్దం పడుతున్నది కదా!]

పాపం! అర్జునుడు ఏం చేస్తాడు? అతడి ప్రగల్భాలు తేలిపోయాయి. తన ప్రతిజ్ఞ మేరకు అగ్నిప్రవేశం చేయడానికి ఏర్పాట్లు చేయనారంభించాడు.

అర్జునుణ్ణి అగ్నిప్రవేశం చెయ్యవద్దని ఆంజనేయుడు పరిపరి విధాల బతిమాలుతూ చెప్పాడు. అయినప్పటికీ అర్జునుడు తన ప్రతిజ్ఞను నెరవేర్ప కట్టెలు పేర్చి అగ్ని రాజేశాడు.

చివరగా అర్జునుడు తన ఆప్తమిత్రుడు, గురువు అయిన కృష్ణుణ్ణి తలచుకొని, "కృష్ణా! నన్ను ఇలా వదలిపెట్టావే? చివరికి ఈ దుస్థితికి దిగజారిపోయేలా చేశావే!" అంటూ హృదయం ద్రవించేలా ప్రార్థించాడు. ఇక అతడు అగ్నిప్రవేశం చెయ్యడానికి ఇంకా కొన్ని క్షణాలే ఉన్నాయి.

అర్జునుని ప్రార్థనలకు దిగివచ్చిన కృష్ణుడు ఒక బ్రహ్మచారి రూపంలో అక్కడకు వచ్చాడు. అప్పుడు అతడు, "అరే! నీవు ఖ్యాతి గాంచిన అర్జునుడివి కదా! నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?” అని అర్జునుని అడిగాడు.

ఏడుపు ఒక్కటి రావడమే తక్కువ, అర్జునుడు ఆ బ్రహ్మచారికి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు.

అంతా సావధానంగా విన్న బ్రహ్మచారి రూపంలోని కృష్ణుడు, "ఆహా! అర్జునా, మహావీరుడవైన నీ కథ చివరికి ఇలాగా అయిపోయింది!" అన్నాడు తెచ్చిపెట్టుకున్న విస్మయంతో...

తరువాత కాసేపు ఏదో ఆలోచించి ఆంజనేయునితోనూ అర్జునునితోనూ ఇలా చెప్పాడు: "మీరిద్దరూ పాల్గొన్న పోటీలో న్యాయం. లేదు. ఎప్పుడైనా సరే పోటీ అంటూ వచ్చినప్పుడు అందుకు సాక్షిగా మధ్యస్థుడు లేక నిర్ణేత అనే ఒక వ్యక్తి ఉండాలి. అదే న్యాయమైన పద్ధతి. మధ్యస్థుడు ఉండి పోటీ ఫలితం ఇది అని తీర్పు ఇవ్వడం సముచితం. మధ్యస్థుడు లేకుండా మీరుగానే పోటీ ఫలితాన్ని తీర్మానించడం సబబు కాదు; దాన్ని పోటీ అని పరిగణించడం కూడా సరికాదు. మీరిద్దరూ మునుపటి మాదిరే మళ్ళీ ఇప్పుడు పోటీ చేయండి. నేను మధ్యస్థుడిగా ఉండి పోటీని పర్యవేక్షించి ఫలితం ప్రకటిస్తాను.”

బ్రహ్మచారి యోచనకు ఇద్దరూ సమ్మతించారు.

అర్జునుడు మొదటి పనిగా, కృష్ణుని సహాయం అర్థిస్తూ చిత్తశుద్ధితో ప్రార్థించాడు. ఆ తరువాత మునుపటిలాగానే బాణప్రయోగంతో వారధిని నిర్మించాడు. సాక్షాత్తూ బ్రహ్మచారి రూపంలోని శ్రీమన్నారాయణుడు తన చక్రాయుధాన్ని వారధి మధ్యలో నిలిపి ఉంచాడు.

ఆంజనేయుడు అప్పటికే ఒకసారి వారధిని సముద్రంలో ముంచివేశాననే గర్వంతో మునుపటి మాదిరే కాలి బొటనవేలితో వారధిని అదిమి నొక్కాడు. కాని వారధి చెక్కుచెదరలేదు! దాంతో విస్తుబోయిన ఆంజనేయుడు వారధినెక్కి తన బలాన్నంతా ప్రదర్శిస్తూ అటూ ఇటూ గెంతసాగాడు. కాని ప్రయోజనం శూన్యం. చివరికి విశ్వరూపం దాల్చి పదేపదే వారధి పైకి దూకాడు. కాని వారధి కించిత్తుకూడా చలించక సుదృఢంగా నిలబడింది.

ఆంజనేయుడు ఇక ఓటమిని ఒప్పుకొనే ఉద్దేశంతో తీరం మీదికి దూకాడు. అదే సమయంలో కృష్ణుడు బ్రహ్మచారి రూపం విడిచి. రాముడుగా కృష్ణుడు దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో ఒకసారి రాముడు, "ద్వాపరయుగంలో కృష్ణుడిగా నీకు దర్శనమిస్తాను" అని మాట ఇవ్వడం ఆంజనేయుడికి చటుక్కున గుర్తుకొచ్చింది. ఆయన అలా అనుకున్న అదే సమయంలో, రాముడు కృష్ణుడిగా మారి ఆంజనేయునికి దర్శనం ఇచ్చాడు.

తనకు వంగి నమస్కరిస్తున్న ఆంజనేయుని కృష్ణుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. తరువాత ఇలా చెప్పాడు: “ఆంజనేయా! నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి. రాముడిగా, కృష్ణుడిగా విభిన్న నామాలతో నన్ను అర్చించే మీ ఇద్దరినీ ఒకే త్రాటి మీదకు చేర్చడానికే ఈ లీల జరిపాను.

అర్జునా! రాముని తక్కువ చేసి మాట్లాడీ, నన్ను మరచిపోయి మొదటిసారి వారధి నిర్మించావు. ఆంజనేయుడు నన్ను మనసారా ప్రార్థిస్తూ పనికి ఉపక్రమించడంతో సాఫల్యం పొందాడు, వారధి కుప్పకూలింది. రెండవసారి నన్ను మనస్సులో తలచుకుని వారధి నిర్మించావు. కాబట్టే ఇప్పుడు విజయం నిన్ను వరించింది.

“ఆంజనేయా! మొదటిసారి నన్ను తలచుకోవడం వలన పోటీలో విజయం పొందిన నువ్వు రెండవసారి నన్ను మరచిపోయావు; అంతేకాక మొదటిసారి గెలుపును తలచుకుని గర్వించి వారధిని కూల్చ ప్రయత్నించావు. నీ ఆ మనోస్థితే నీ ఓటమికి కారణం అయింది."

ఇలా చెప్పి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు. వారధి మధ్యలో ఉన్న సుదర్శనచక్రం మళ్ళీ తన ఆవాసానికి తిరిగి వెళ్ళిపోయింది.

ఈ సంఘటన ద్వాపరయుగాంత సమయంలో జరిగినట్లు ఆనందరామాయణంలో చోటుచేసుకొంది.

మహాభారత యుద్ధంలో అర్జునుని రథ పతాకంలో హనుమంతుడు ఆసీనుడై భాసించాడు. ఆ కారణంగా కపిధ్వజుడు అనే పేరు అర్జునునికి కలిగింది.

గర్వం పనికిరాదు, భగవంతునికి పూర్తిగా శరణాగతులం కావాలి. విభిన్న నామాలతో ఒకే భగవంతుడే విరాజిల్లుతున్నాడు. నిజమైన భక్తులకు ఎప్పుడో ఎంతో అరుదుగా గర్వం తలెత్తినా, ఆ గర్వాన్ని తొలగించి. భగవంతుడు అనుగ్రహిస్తాడని మనం పైన చూసిన ఈ కథ చెప్పక చెబుతోంది.

***

195...తెనాలి గురించి    ~కొడవటిగంటి కుటుంబరావు

1.

గుంటూరు వారున్నారు, చేబ్రోలు వారున్నారు, ఒంగోలు వారున్నారు,

తెనాలివారు లేరు.నేనెరిగినంత మట్టుకు లేరు. రామలింగడు తప్ప.

రామలింగడివల్ల తెనాలికి ప్రసిద్ధి వచ్చిందా, తెనాలి వల్ల రామలింగడు ప్రసిద్ధికి వచ్చాడా ?

చెట్టు ముందా, విత్తు ముందా వంటి ప్రశ్న ఇది ఆ విషయం ఎవరూ తేల్చలేరు.

2. 

రెండు సికింద్రాబాదులూ, రెండు హైదరాబాదులూ, రెండు అన్నవరాలు,

రెండు పూండ్లలూ -ఒకటే తెనాలి. 'ప్రపంచమంతటికీ!'

అందుకనే రామలింగడా పేరు ఇంటి పేరు చేసుకున్నాడేమో.

3.

రామలింగడి కాలం వదిలి వర్తమానానికి వస్తే తెనాలి చాలా విషయాలకు ప్రసిద్ధి కెక్కింది. బియ్యానికి, కాఫీ హొటెళ్ళకూ, పత్రికల అమ్మకానికీ దోమలకూ,  వానాకాలం బురద రోడ్లకు, వగైరాలకు.

4.

తెనాలి బియ్యం లండన్లో కూడా చెప్పుకుంటారు అని నేను నమ్మకంగా విన్నాను.

తెనాలి కాఫీ హొటెళ్ళు జగత్ప్రఖ్యాతి గలవి. తెనాలి చుట్టు పట్ల వారంతా

ఒక్కొక్కప్పుడు 20 మైళ్ళనించి కూడా -ఉదయం పూట రైళ్ళ మీదా,

 జట్కా బళ్ళ మీదా,నడిచి తెనాలి చేరుకుంటారు.

తెనాలిలో చెప్పుకోదగ్గ అయ్యరు హొటలు లేదు. కాఫీ ఇవ్వడం అయ్యర్లకే చేతనవుననే అనుమానం ఎవరికైనా ఉంటేతెనాలి పోయి కాఫీ తాగి చూడండి.

మా తెనాలి వాళ్ళునలుగురువచ్చి మద్రాసులో కాఫీ హొటళ్ళు ప్రారంభిస్తే 

అరవాళ్ళు పంజాలు తెంచుకొని పట్నం వదిలి పారిపోతారు.

5. 

తెనాలి వాళ్ళు  పత్రికలు చదవడంలో కూడా ప్రధములు ఆంధ్రదేశం మొత్తం మీద అమ్ముడుపోయే పత్రికల సంఖ్యలో ఏ పదో వంతో తెనాలిలో అమ్ముడుపోతుంది.

అది రామలింగడి ఆశీర్వాదం కావచ్చు, సాహితీ సమితి పుట్టిన ప్రభావం కావచ్చు. 

6. 

తెనాలి దోమలు దాదాపు విశాఖపట్నం దోమలంత ఉంటై. ఒక దోమలషో పెట్టి 

(బేబీ షో పెట్టినట్టు) అందులో విశాఖపట్నం దోమనీ తెనాలి దోమనీ తూకం వేస్తే

విశాఖపట్నం దోమకిడిపాజిట్ కూడా నమ్మకం లేదు

7. 

వేసవి కాలమంటే జ్ఞాపకం వచ్చింది , వేసవి కాలంలో మా ఊరు బెజవాడ వారికీ ,

గుంటూరు వారికి సిమ్లా  లాంటిది.

8. 

తెనాలి నాటకాలకి, నటులకీ ప్రసిద్ధి కెక్కింది. మొదటి నాట్య కళా పరిషత్తు తెనాలిలో జరిగింది. మిగిలిన ఆంధ్రదేశమంతా కలిసి ఎంతమంది పెద్దా చిన్నా నటులున్నారో తెనాల్లో అంతమంది ఉన్నారు.

అసలు ప్రతీ తెనాలివాడూ వేషధారే. అంత దాకా ఎందుకు 

తెనాలి నటుడు లేని టాకీ ఉందీ? 

9. 

నాట్యకళ మా తెనాలి వారి కంత బాగా తెలుసు కనకనే మా తెనాల్లో పై ఊళ్ళవాళ్లు పరాభవం పొందారు.పైనుంచి వచ్చి తెనాలి వారిని మెప్పించి పోయినవాడు గట్టిగా లెక్కిస్తే ఒక్క బళ్ళారి రాఘవాచారి గారే.

10. 

తెనాలిలో అనిర్వచనీయమైన ఆకర్షణ ఉంది. అది తెనాలి వాళ్ళ కన్నా పై వాళ్ళకు తెలుస్తుంది.తెనాలి నుండి బదిలీ అయిపోయి పోవలసి వస్తే ఉద్యోగానికి నీళ్ళొదలిన వాళ్లున్నారు.

ఏ పని మీదో వచ్చి తెనాలిలో వేళ్ళతో సహా పాతుకు పోయిన వాళ్ళున్నారు.

ఇంకే పనీ లేక తెనాలిలో ఉండటమే జీవితాశయంగా పెట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు.

ఏ బస్తీలో కన్నా తెనాల్లో నిరుద్యోగులు అధికంగా ఉండటానికి కారణం ఈ ఆకర్షణే. తెనాలి గురించి " వెధవ తెనాలి " అంటుంటే నమ్మకండి.

గవర్నరు గిరి వచ్చినా చేయడానికి తెనాలి వాడు తెనాలి వదలడు.

11. 

మరి కొన్ని బస్తీల మాదిరిగా తెనాలి అట్టే గొప్పవారిని చెప్పుకోక పోవడానికి కారణం..బుద్ధిమంతుడు సులభంగా ఊహించవచ్చు.

మా తెనాలి వాళ్ళం ఇతర ఊళ్ళ మాదిరిగా ఒక వ్యక్తిని ఆరాధించి పైకెత్తం.మా చవిలి నాగేశ్వర రావుకీ మా గోవిందురాజు సుబ్బారావుగారికి మా స్థానం వారికి,మా మాధవపెద్దికి, ఇతరులు బ్రహ్మరధం పట్టొచ్చు గాక మేం పట్టం. మాకు వాళ్ళు మామూలు మనుష్యులే. రిని ఆరాధిస్తూ కూర్చుంటే ప్రపంచం ఆరాధించే మనుష్యుల్ని మేమెట్లా సృష్టించగలుగుతాం ?

మనుష్యుల్ని తయారు చేసి లోకం మీద వదలటం మాత్రమే మా వంతు.

మాస్టర్ అంజిని, బసవలింగాన్ని, పిల్లమర్రి సుందర రామయ్యనూ మేమే తయారు చేసాం. భీమవరపు నరసింహరావునూ, ప్రభల సత్యన్నారాయణనూ,

మేమే తయారు చేసాం. ములుగు శివానందం గారు మా వాడు. మా గొప్ప వాళ్ళెవరూ మా ఊళ్ళో ఉండరు. దేశాలు పట్టి పోతారు. కాంచనమాలది మా ఊరే

ఆవిడా అంతే. మూడు కలువల నడుమ నడిచేదే తెనాలి ఇలా ప్యారీస్ లోనూ

తెనాలి లోనే ఉంటుంది

అందుకేతెనాలిని ఆంద్రా ప్యారీస్ అంటారు 

ఆంధ్రపత్రిక 12-2-1941 (కొకు వ్యాస ప్రపంచం నుంచి తెనాలి మిత్రుల కోసం )

-****

196.....అనుబంధాలు

       బంధాలు వాటంతటవే దూరం కావు , వ్యక్తిత్వం వల్లనో ప్రవర్తన వల్లనో ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వల్లనో అవి దూరమవుతాయి .

      నిజాలు మాట్లాడే వారు ఎప్పుడూ ఒంటరిగా మిగిలిపోతారూ నిజాయితీగా ప్రేమించే వారి ప్రేమను ఎప్పుటికి పొందలేరూ బంధాలు ప్రేమించే వారు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారూ  కుటుంబం కోసం కష్ట పడేవారినీ ఎప్పటికి సుఖ పడనివ్వరూ . పదిమంది కోసం పాటుపడే వారు నిందలపాలు అవుతూనే ఉంటారు . కానీ మనిషి గా మంచివారి మనస్సులలో శాశ్వతంగా ఉంటారు .

     డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళ గలదు , అందులో ఎటువంటి అనుమానం లేదు , కానీ!.మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బుని తీసుకెళ్ళలేడు ఇందులోను ఎంటువంటి అనుమానం లేదు ! ఐనా మనిషి ఆకలి కోసం చేసే పోరాటం కన్నా పైసలు కోసం చేసే పోరాటమే ఎక్కువైంది. ఇది పచ్చి నిజం🍁🌼🌷

    ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి . ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి . అందుకే గతం మరిచిపోవద్దు నేస్తమా .🌻🌺🌹

     సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనషుల విలువలను కూడా సంపాదించాలి కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెకించే వారిని సంపాదించాలి భాదల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి,🌼🌻🌹

మన మనసుకి హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు , మన మనసు నొచ్చుకునేలా మాట్లాడే వారు మరికొందరు మనతో మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు మన అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం .🌷🌹

     దైర్యం అంటే ఎవరో నీకు తోడు వున్నానని చెప్పడం కాదు ! ఎవరు లేకున్న నాకు నేను వున్నానని చెప్పుకోవడమే అసలైనా దైర్యం.

    ఈ రోజుల్లో మోయలేనంత డబ్బులు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు కానీ ! చివరికి మనల్ని మోయల్సిన నలుగుర్ని సంపాదించుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు ఈ కరోనా వైరస్ వలన .

    మనం దేనినైనా పోగొట్టుకోవడం చాలా సులువు కానీ ! దానిని సంపాదించడమే చాలా కష్టం అది సంపద అయినా ప్రేమ అయినా స్నేహమైనా నమ్మకమైనా . 🌹🌷🙏

     మన చేతిలో ఏది ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు , ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు నేస్తమా !

****

197.... ఇతర జీవులతో, మన ఋణాలు ఎలా ఉంటాయంటే?

మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా, ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గానూ వారే తారసపడతారు.

ద్వేషం కూడా బంధమే! పూర్వజన్మలో మనమీద గల పగను తీర్చుకోవడానికే, మనల్ని హింసించే యజమానిగానో లేదా సంతానంగానో ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.

మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి, ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా తిరిగి ఎదురవుతారు!

మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి వచ్చేవారు మాత్రం, మనకు ఈ జన్మలో మిత్రులు గానో, సహాయకులు గానో మనకు ఎదురవుతారు.

ఉదాహరణకు ఓ జరిగిన కథ..

కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర యాచన చేసే ఒక కుంటి బిచ్చగాడు, ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు.

ఆ వృత్తిలో నెలకి పదివేల రూపాయలకు పైగానే సంపాదించేవాడు.

కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే, బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచ లోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.

తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు. ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు.

పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదనీ..

అందుకే, ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ, బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడనీనూ!

ఒకోసారి, మనం తెలిసీ తెలియక చేస్తూన్న చిన్న చిన్న తప్పులు కూడా, మనకు బంధాలు అవుతాయని నిరూపించే మరొక కథ ఇదిగో..

ఒకసారి ఒక మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో, తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు.

అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణమేమని?

ఈ పిల్లలంతా వారి గత జన్మలలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో, ఇలా ఆహారం కోసం పరితపిస్తున్నారు - అని స్వామివారు జవాబు చెప్పారు.

ఎవరైనా నీటిని బాగా దుర్వినియోగం చేస్తే, వారు మరుజన్మలో ఎడారిలో పుడతారు. కాబట్టి ఏ వనరులను దుర్వినియోగం చేసినా, దాని ఫలితాన్ని మనం తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి!

ఒకమారు శ్రీవిద్యాప్రకాశానందగిరి స్వామివారు బందరుకి వెళ్ళేందుకై తమ గురువైన శ్రీమలయాళ స్వామివారి అనుమతి తీసుకుని వెళ్ళబోతూంటే - ఆయన వెనక్కి పిలిచి, నీ చేతి సంచి ఏది అని అడిగారట! 'పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది' అని చెబుతారు శిష్యులు. అప్పుడు మలయాళ స్వామి వారు - 'నువ్వు మోయగలిగి ఉండి కూడా, ఈ జన్మలో నీ మిత్రుడి చేత సంచీని మోయిస్తే, వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది మరి! అన్నారు.

ఇలాంటివి మనము తెలిసీ తెలియక , చాలానే చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో, ఉచితంగా స్వీకరించినవన్నీ కూడా కర్మబంధాలయి జనన-మరణచక్రంలో మనల్ని బంధిస్తాయి.

కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే, నాకూ ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.

అవి కర్మ బంధాలవుతాయని తెలియక, మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలలో చిక్కుకుపోతూంటాము. ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషమైనా కూడా అంతే ప్రమాదకరం కదా! అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కావడం జరగదు.

*****

198....ఓం పూర్ణమిదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే |

పూర్ణస్య పూర్ణ మాదాయా  పూర్ణమేవావశిష్యతే ||

ఓం శాంతి శాంతి శాంతిః 

 ::తాత్పర్యం::

*****

భగవంతుడు పూర్ణుడు.... పూర్ణానికి పూర్ణం కలిపినా.. పూర్ణంలోంచి పూర్ణం తీసేసినా.... మిగిలేది పూర్ణమే..

ఇదే శ్రుతి వాక్యం. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే..... జీవితమంతా ఇందులోనే దాగుంది. మోక్ష మార్గం ఇందులోనే దాగుంది.. సమస్త సాధనాల సారం ఇందులోనే ఉంది.

0 + 0 = 0....

0 ౼ 0 = 0....

కానీ.....

0+1 = ఎంత అంటే.....

మనం వెంటనే 1 అని సమాధానం ఇస్తాం.....

ఇక్కడ సున్నా ...ఒకటితో కలవగానే అది 1 గా మారిపోయింది.

0+2 = 2.....

సున్నా 2 తో కలవగానే సున్న మాయమై...

అది రెండుగా మారిపోయింది... అంటే..

సున్న దేనితో కలిస్తే అదిగా మారిపోతూంది.

గాఢ నిద్రలో మనం పూర్ణమైన భగవంతుడిగా ఉంటాం. మనకప్పుడు ఏ భావోద్వేగాలు ఉండవు. ఎప్పుడైతే సున్న లాంటి మనం నిద్ర లేవగానే ప్రకృతితో కలుస్తామో... మనం ప్రకృతే ఐపోతున్నాం.

మనం దేనితో కలుస్తామో... దానిగా మారిపోతున్నాం..

బాగా గమనించు....

నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు...

అతడు గతంలో నీకు ఎంతగానో సహాయం చేసాడు.. ఆ వ్యక్తి ని చూడగానే.. నీలో అతని పట్ల ఆత్మీయత కలుగుతుంది... నువ్వూ అతనికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఆలోచిస్తావు. 

ఒక వ్యక్తి నిన్ను ఎంతగానో బాధించాడు... అతను కనబడగానే నువ్వు కూడా అతన్ని ఎలాగైనా బాధించాలని ఆలోచిస్తావ్...

ఎదుటి వ్యక్తి ప్రేమతో వస్తే... నీకూ అతని పట్ల ప్రేమ కలుగుతోంది.....

ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవిస్తే... నీకూ అతని పట్ల గౌరవం కలుగుతుంది.....

అంటే.....

మనం ఎదుటి వ్యక్తిలోని ఏ గుణాన్నయితే గమనిస్తున్నామో... మనం మనకు తెలీకుండానే ఆ గుణంతో కలిసిపోయి... ఆ గుణం గానే మారిపోతున్నాం.....

"మనం దేనితో కలుస్తున్నామో... అది గా మారిపోతున్నాం."

మనలో సున్న (0) లా ఉన్న పరమాత్మ తత్వం..... 

ఎదుటి వ్యక్తీ లోని కోపం తో కలవగానే అది కోపంగా మారిపోయి మనకు కోపం వస్తుంది.

నువ్వు ప్రేమతో కలిస్తే ప్రేమగా..... 

ద్వేషం తో కలిస్తే ద్వేషంగా..... మారిపోతావ్.

ఎదుటివారి లోని అహంకారాన్ని చూస్తే నీలో కూడా అహంకారం మొలుస్తుంది.

అందుకే..... ప్రతి జీవిలోనూ..... మనిషిలోనూ..... పరమాత్మ ఉన్నాడని గ్రహించి...... ఆయనతో అనుసంధానం అవ్వు...

అంటే నీలోని పూర్ణాన్ని..... ఎదుటి వ్యక్తీ లోని పూర్ణంతో కలుపు.....

వచ్చేది పూర్ణమే.

ఎదుటి మనిషిని చూడగానే అతనిలోని దోషాలను గుర్తిస్తే.....

మనం అతనిలో దేన్ని ముందుగా చూస్తామో.....

మనం అదిగా మారిపోతామన్న  మహా సత్యాన్ని గమనించాలి.

అందుకే ఎలాంటి వారిలోనైనా..... భగవంతుణ్ణి చూడగల్గి.....

ఆయనతో కలిస్తే.... మనం కూడా భగవత్ తత్వంగా మారిపోతాము.

సదా ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ పరమాణు స్వరూపంతో ఉన్న భగవంతునితో అనుసంధానమవుతూ..... ఉండాలి.

🙏🙏🙏

199..#భార్యాభర్తలు ఇద్దరూ ఒక హోటల్లో కూర్చోని  టిఫిను టున్నారు......

భార్య భర్తను ఇలా

అడిగింది.

" ఏమండీ! మిమ్మల్ని ఒక విషయం అడగనా? "

భర్త; అడుగు....దానికి పెర్మిషను అవసరమా?

భార్య; అదేంలేదండీ ఒక నెల నుంచి మీరు ఆఫీసునుండి లేటుగా రాకుండా

మమ్మల్ని తరచుగా బయటికి తీసుకుని వెళ్తూ.... పిల్లలతో

హోం వర్కు చేయిస్తూ.......వారితో గడుపుతూ......నాతో చాలా

ప్రేమగా ఉంటున్నారు.కారణం ఏంటో తెలుసుకుందామని.....అంటూ

కాస్త భయంగానే అడిగింది.

భర్త; అదేంలేదే! నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే!

నీకెందుకు అలా అనిపిస్తోందో అర్థం కావడం లేదు మరి.

భార్య; నిజం చెప్పండి. మీ మొహంలో తేడా కనిపిస్తోంది. కొంపతీసి

చిన్న ఇల్లు కానీ పెట్టలేదుకదా!

భర్త; అమ్మొయ్......నీకు దండం పెడతానే అలాంటి ఆలోచనకూడా రానివ్వకు.

భార్య; అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే! చెప్పండి.

భర్త; విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్లు కాదు......

అంటూ తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెట్టాడు.

ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచి చదవసాగింది భార్య.

ఆ ఉత్తరం తన అత్తగారు కొడుకుకు వ్రాసిన ఉత్తరం.....కన్నీళ్ళు నిండిన

కళ్ళతో చదవసాగింది.

ప్రియమైన కుమారునికి......

ఎప్పుడో ఒకరోజు ఈ ఉత్తరం నీ చేతికి దొరుకుతుందని ఆశతో వ్రాస్తున్నాను.

కాస్త ఓపిగ్గా పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువు చిన్నా! ఈ తల్లి మనసును

అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను......

మీ నాన్న ను పెళ్ళి చేసుకునేదానికి ముందు నేనో లెక్చరరుని.....పెళ్ళైన 

తరువాత నువ్వు పుట్టావు...మీ నాన్నకు అదృష్టం కలిసి వచ్చింది.

బాగా సంపాదించసాగారు. నీకో చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం

మానేసాను.మీ నాన్న చాలా బిజీ అయ్యారు.

వివాహం అయిన ఒక్క సంవత్సరం ఎలాంటి బాధలేకుండా ఉన్నది.

తరువాత అన్నీ #ఎదురుచూపులే!

మీ నాన్నకోసం ఎదురుచూపులు......ఆయనకు ఆదాయంపై మోజుతో

సమయానికి ఇంటికి రారు. మీరే నాకు దిక్కు......మీతోనే నా సంతోషం.

ఉదయం లేవగానే మీరు తయారై స్కూలుకు వెళ్తారు......

మీ రాక కోసం ఎదురుచూపు.........

ఇలా మీరు పెద్దవారైపోయారు.......నాతో మాట్లాడటానికి కూడా

సమయం ఉండేది కాదు...అవసరానికో మాట అంతే,,,,,,

ఉద్యోగాలు వచ్చేశాయి మీకు.......మీ హడావిడి మీది... పిల్లలైనా

నాతో మాట్లాడుతారేమో అని ఎదురుచూపు.........

మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపు........రాగానే అలసిపోయి

భోంచేసి పడుకుంటారు......వంట బాగుందనికానీ బాగలేదనికానీ

చెప్పడానికి కూడా మీకు టైం ఉండదు.....

.నువ్వుకూడా బిజీ అయిపోయావు.

నీ చెల్లెలికి పెళ్ళి చేశాము......తను హాయిగా విదేశాలకు వె్ళ్ళిపోయింది.

ఆమె సంసారం ఆమె జీవితం.......వారానికి ఒకసారి 2 నిమిషాలు

మాత్రమే పోనులో మాట్లాడేది......ఆమె ఫోనుకోసం ఎదురుచూపు......

మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి ఆహారాన్ని

అందివ్వడానికి........మాత్రలు అందించడానికి ఎదురుచూస్తూ గడిపేదాన్ని.

చూశావా నా బ్రతుకంతా ఎదురుచూపులోనే ముగిసిపోయింది.

నీకు భార్య......కూతురు , కొడుకు వున్నారు. బ్రతికి ఉన్నప్పుడు

చెప్పలేకపోయాను......చనిపోయేముందు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.

మీ నాన్న గారు ఆరోగ్యం బాగలేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా

మాత్రలు ఇస్తావా.......అన్నం పెడతావా.......అవసరానికో మాట అంతే

పేపరు చదవడానికి టైం ఉంటుంది....నాతో మాట్లాడటానికి టైం

ఉండదు మీ నాన్నకు....మీ సంగతి సరే సరి....

వయస్సులో సంపాదన మోజులో పడి నాతో ,మాట్లాడటానికే టైం లేదు మీ నాన్నగారికి.......ఇక ఈ వయస్సులో మాట్లాడటానికి ఏముంటుంది?

ఎదురుచూపు..........ఎదురుచూపు.........ఎదురుచూపు......

ఇప్పుడు చావుకోసం ఎదురుచూపు........

నాలా నీ కూతురో .కొడుకో ఇలా ఉత్తరం వ్రాయకూడదనే ఉద్దేశ్యంతో

ఈ ఉత్తరం వ్రాస్తున్నాను...

ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనసు ఉంటుందని....మనకోసమే

బ్రతుకుకుందనీ గ్రహించు........నేను ఎదురుచూసినట్లు నీ భార్యను

బాధపెట్టవద్దు......మనసువిప్పి తనతో అన్నింటినీ షేర్ చేసుకో!

నిన్ను నమ్ముకుని నీవే లోకంగా వచ్చిన నీ భార్యతో.......నీ పిల్లలతో కొద్ది గంటలైనా గడుపు......ధనార్జనతో వారిని నిర్లక్షం చేయకు........ఇదే

నా చివరి కోరిక....కోడలు........మనవడు......మనవరాలు జాగ్రత్త......

నా పరిస్థితి నాకోడలికి రాకుండా చూసుకో! తనకూ ఒకమనసు ఉంటుందనీ

అందులో మీరే ఉంటారనీ.....తననేశ్రద్ధగా

 చూసుకోవాలని ప్రేమను అందించాలని కోరుకుంటుందనీ అర్థం చేసుకో! మనిషిగా ముందు గుర్తించు

యాంత్రికంగా జీవించి నాలా బాధపడుతూ ఎదురుచూపులతో కాలాన్ని

వెళ్ళదీయనీయకు.........నీవు ఎప్పూడూ సంతోషంగా ఉండాలనే

ఈ తల్లి కోరుకుంటుంది..........ఉంటాను.

ఇట్లు 

మీ మంచికోసమే ఎదురుచూసే నీ తల్లి,.

దయచేసి మీ కుటుంబంతో గడపండి......వారి మనస్సును బ్రతికి ఉన్నప్పుడే

గెలుచుకోండి........యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి..మీ సంసారమే

మీకు అన్నింట్లో తోడుంటారని మరువ వద్దని ప్రార్థన...


 👏👏

200.... Stockdale Paradox అనే పదం ఎప్పుడైనా విన్నారా?

James Stockdale అనే అమెరికన్ సైనికుడు  –  వియత్నాం యుద్ధం లో యుద్ధఖైదీగా మరి కొందరు తోటి అమెరికన్  సైనికులతో సహా దొరికిపోయాడు.. 

వీరిని జైలులో పెట్టడం జరిగింది... ఇతనితోపాటు ఆ జైలులో ఉన్న సైనికులు, తాము  క్రిస్టమస్ కు బయటకొచ్చేస్తామని ఆశించారు. కాని కుదరలేదు. 

మళ్ళీ న్యూఇయర్ కు వదిలేస్తారను కున్నారు. వదల్లేదు. 

ఈస్టర్ కు వదులుతారనుకుంటే, అప్పుడూవదల్లేదు. 

ఇలా ప్రతీ సంవత్సరం వదిలేస్తారనుకుంటే వదలడం లేదు. 

ఇలా ప్రతీ సంవత్సరం పెట్టుకున్న HOPE  నెరవేరకపోవడంతో రెండు మూడేళ్ళల్లో ఒక్కొక్కరు చచ్చిపోవడం జరిగింది. 

ఇలా తోటివారందరూ చనిపోతున్నా , Stockdale మాత్రం బ్రతికే వున్నాడు....!

కారణం....?

Extreme or too much hope చాలా ప్రమాదకరం.

మనం అనుకున్నది జరగకపోతే Disappoint అవుతాం.

అలాకాకుండా Stockdale లాగా Final గా శుభమే ఉంటుందని నమ్మడం కొన్నిసార్లు మంచే చేస్తుంది.

Stockdale మాత్రం ప్రతీ సంవత్సరం, ప్రతీసారి తాను బయటకు వచ్చేస్తానని మాత్రం ఆశించలేదు. ఎప్పటికైనా తాను విడుదల అవుతానని మాత్రం అనుకున్నాడు. ఖచ్చితంగా తాను బయటకువెళ్ళి  తనవాళ్ళను తప్పకుండా కలవగలననే నమ్మకం పెట్టుకున్నాడు.

అంతేగాని... మిగిలినవాళ్ళలాగా point of time గురించి గానీ,  period of time గురించి గాని ఆలోచించలేదూ. మిగిలిన వారిలాగా Extreme Hope పెట్టుకోలేదు.

కాని తనకథకు మాత్రం Happy Ending ఉంటుందని మాత్రం నమ్మకం పెట్టుకున్నాడు.

ఆఖరికి ఏడున్నర సంవత్సరాల తరువాత అతను జైలునుండి రిలీజయ్యాడు. కాని తన తోటివారు మాత్రం అప్పటికే చనిపోయారు.

ఇలా ఇతను బ్రతకడానికి తోడ్పడిన ఈ ఆలోచనా విధానాన్నే Stockdale Paradox అంటారు.

ఇప్పుడు ఈ thought process కరోనా విషయంలోనూ అవసరమే. 

ఇప్పుడు తగ్గుతుంది, అప్పుడు తగ్గుతుందనే short term  Extreme Hopes పెట్టుకునేకన్నా, ఖచ్చితంగా మనం ఈ pandemicను దాటుకుని గతంలో లాగానే చక్కగా, సంతోషంగా తిరగగలుగుతామనే నమ్మకాన్ని ఉంచుకుని , ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని, ఓపికగా ఎదురు చూడండి.

కరోనాకే బోర్ కొట్టి - అది మనల్ని వదలి వెళ్ళే రోజు  ఎంతో దూరం ఉండబోదని నా ఉద్ధేశం.

Happy Ending కు ఎదురుచూద్ధాం.

ఆతరువాత Stockdale అమెరికన్ సైన్యంలో admiral గా పనిచేసాడు. ఆతరువాత ఆయన రాసిన పుస్తకం A Vietnam Experience.

 ఆతరువాత Jim Collins అనే ఆయన Good to great అనే Book లో ఈ Stockdale Paradox గురించి వ్రాయడం జరిగింది.

ఈ Stockdale Paradox Theory ని ఈ మధ్యనే Harvard university , తమ Business School meeting లో,

కరోనా విషయంలో ఈ papers ని release చేసింది.......

వీలుకుదిరితే ఆ పుస్తకాలు చదవండి. Stockdale Paradox Theory ని మర్చిపోకండి.


100 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మన ఓపికను పరిష్కరించుకోగలిగే అవకాశం వస్తుంది. 

మనకి అద్భుతమైన ఓపిక ఉందనే విషయం మనకి ఇప్పటికే అర్థమైపోయింది.

ఇంకెంత కొంతకాలమే ఈ పరీక్ష! 

చివరిదాకా ఓపికతో ఉన్నవాడే ,  యుద్ధాన్ని గెలవగలడు.

ఇంకో విషయం -

ఇంత భయంకరమైన కరోనానే ఓపిక తో జయించగలిగినపుడు – భవిష్యత్ లో మీ జీవితంలో కి అడుగు బెట్టేవి చాలా చిన్నసమస్యలైపోతాయి.

అన్నింటికన్నా పెద్దసమస్య - మరణం.

దానినే మీరు

 ఎదుర్కోని బయటకు రాగలిగినపుడు, ఇక మిగిలిన సమస్యలన్నీ చాలా చిన్నవి. తేలికగా పరిష్కరించగలరు.

🙏🙏🙏🙏

No comments:

Post a Comment