Thursday, 4 July 2019




 04. శ్రీరామకృష్ణుని కధామృతం లోని కొన్ని అమృత బిందువులు- 11 .
🕉🌞🌎🌙🌟🚩

శ్రీరామకృష్ణులు -విద్యాసాగర్.

అందరూ యెంతో శ్రద్ధగా తనవాక్కులు వింటుండగా,   విద్యాసాగరుల సమక్షంలో,   రామకృష్ణులు,  ఋష్యాదులు, బ్రహ్మజ్ఞాన సాధనకు యెంత శ్రమించారో, చెబుతున్నారు. 

ఋషులకు బ్రహ్మజ్ఞానం కలిగిందంటే,  వారికి విషయాల మీద ఆసక్తి లేకపోవడం వలననే. వారు యెంత శ్రమించేవారు !   వేకువనే ఆశ్రమాన్ని వదలివెళ్ళి, ఏకాంతంలో, బ్రహ్మచింతనలో  గడిపేవారు.  ఆశ్రమానికి తిరిగి వచ్చిన తరువాత, కందమూలాలని  ఆహారం గా తీసుకునేవారు.  ఇంద్రియముల బారిన పడకుండా, శబ్ద స్పర్శ,  రూప రస గంధాది విషయాలనుండి మనస్సును దూరంగా వుంచేవారు.   అప్పుడు వారి చైతన్యమే బ్రహ్మమయమై వుండేది.  

ప్రస్తుత కాలంలో జీవులు అన్నగత ప్రాణులు అయినందువలన,  దేహాభిమానం నశించదు.  అలాంటి వారికి సో>హం  అనే భావన చెప్పినా తలకెక్కదు.    అన్ని కార్యక్రమాలూ చేసుకుంటూ,  ' నేను బ్రహ్మమును ' అనుకోమని చెప్పడం కూడా ఉచితం కాదు.   విషయబుద్ధి త్యజించలేని వారు కనీసం,  ' నేను భగవద్ భక్తుడిని,  ఆయనకు దాసుడిని. '  అనే భావం నిలుపుకోవడం మంచిది.  అదే కదా భక్తి మార్గం. 

ఇక జ్ఞాని అయినవాడు,  ' నేతి నేతి  ( న ఇతి   న ఇతి ) '  అని విచారణ చేస్తూ, విషయబుద్ధిని పూర్తిగా జయిస్తాడు.   అదే బ్రహ్మాన్ని తెలుసుకునే మార్గం.    ఒక్కొక్కమెట్టును వదులుతూ మేడపైకి చేరుకోవడం లాంటిది, ఈ సాధన. 

విజ్ఞాని అయినవాడు,  అంటే జ్ఞానికన్నా ఎక్కువ సాధన చేసినవాడు,  మేడ, మెట్లు రెండిటియందు వున్న విషయము ఒకటే అని తెలుసుకుని, నిర్గుణపరబ్రహ్మాన్ని, సగుణ బ్రహ్మంగా కూడా దర్శిస్తాడు.   అంటే ప్రతి చైతన్యంలో పరబ్రహ్మ తత్వమే కనబడుతుంది.  

ఇంటి మేడమీద ఎక్కినవారు ఎక్కువసేపు అక్కడ వుండక ఎలా దిగివస్తారో, సమాధిస్థితి కలిగి, బ్రహ్మసాక్షాత్కారం పొందినవారు కూడా,  కొద్దిసేపటికి దిగివచ్చి జగత్తును, జీవులను భగవంతునిగానే చూస్తారు.   ఇలాంటి  జ్ఞానానికి విజ్ఞానమనిపేరు.   జ్ఞానమార్గం, జ్ఞాన-భక్తి మార్గం, భక్తిమార్గం,  యివన్నీ భగవంతుని చేరే మార్గాలే.  ' నేను ' అనే భావం వున్నంతవరకు, భక్తి మార్గంలోనే పాకులాడాలి. అదే సులభం. 

విజ్ఞాని అయినవాడు,  బ్రహ్మాన్ని భగవంతునిగా దర్శిస్తాడు.  త్రిగుణాతీతుడైనవాడే షడ్ ఐశ్వర్య సంపన్నుడైన భగవంతుడని తెలుసుకుంటాడు.  ఈ బ్రహ్మాండం, మనస్సు, బుద్ధి, భక్తి, వైరాగ్యం, జ్ఞానం అన్నీ అయన సంపదలే !  '   అని చెబుతూ రామకృష్ణులు, ఇల్లూ వాకిలి లేనివాడిని ఎవరూ జమీందారు అన్నారు కదా !  ఈశ్వరుడు పరిపూర్ణ ఐశ్వర్యవంతుడు కాబట్టే,  ఆయన మాట అందరూ వింటారు.  లేకుంటే ఎవరు లెక్కచేస్తారు ?  '  అని అనగానే అంతా ఆమాటలకు ఫక్కున నవ్వి,  తమ ఆమోదం తెలిపారు. . 

ఇది అంతా విద్యాసాగర్ గారు కూడా యెంతో శ్రద్ధగా వింటున్నారు.  సామాన్యంగా విద్యాసాగర్ ధర్మ సంబంధిత బోధలు చెయ్యరు.  కానీ, అయన తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసినవాడే.   ఆయన గొప్ప మానవతావాది.  మానవసేవే మాధవసేవ అని త్రికరణశుద్ధిగా నమ్మినవాడు.   ఇతరులు మనలను ఉదాహరణగా అనుసరించాలనీ, అందరూ ఆ విధంగా జీవితసరళిని  దిద్దుకుంటే,  భూలోకమే, స్వర్గలోకం లాగా వుంటుందని, నమ్మేవాడు.  

విద్యాసాగర్ గారు చర్చలో పాలుపంచుకుంటూ,  '  భగవంతుడు కొందరికి అధికశక్తి, మరికొందరికి అల్పశక్తి ప్రసాదిస్తాడా ?  '  అని అడిగారు.   ఆయన సందేహం నివృత్తి చేయడానికి,  రామకృష్ణులు   చెప్పసాగారు. 

🕉🌞🌎🌙🌟🚩
 అంతా చిద్విలాసం
🕉🌞🌎🌙🌟🚩 

శివ శక్తులన్నా, ఈశ్వర జగత్తులన్న అంతా శివస్వరూపమే. ఒకటి శివుని అచల స్వరూపం, రెండవది శివుని సచల స్వరూపం, చిద్వస్తువే అటు అచలంగా , ఇటు సచలంగా కూడా ఉంది. చైతన్య స్వరూపులు కానివారెవ్వరు? చైతన్య స్వరూపమైన ఆత్మ ప్రత్యక్షం కాకపోతే శివుడు ప్రత్యక్షం కాలేదన్నమాటే.

🕉🌞🌎🌙🌟🚩

 మరణాన్ని ఎదుర్కొంటే మరణ భయం పోతుంది.


      మణ వాసి రామస్వామి అయ్యర్ ఇంటిదగ్గర ఎవరో పోయారు. ప్రక్కింట్లో చావు కాబట్టి రామస్వామి అయ్యర్ ఇంట్లో పిల్లలను  ఆ రోజంతా ఆశ్రమంలోనే ఉండమని పంపించారు. మణ వాసి రామస్వామి అయ్యర్ కుమార్తె రమణికి మనస్సులో ఏదో తెలియని భయం ఆవరించింది. భయంతో బెదిరి పోయింది. పిల్లలు ఆశ్రమం చేరారు. రమణి ఎటువంటి ఆలోచనలు లేకుండా తిన్నగా పాత హాలుకు భగవానుని దర్శించాలని వెళ్ళింది. భగవాన్ ను దర్శించి గానే మరుక్షణమే ఆమె తన భయాన్ని కోల్పోయింది. భగవాన్  రమణి తో "చనిపోయిన శవాన్ని చూసి ఎందుకు భయపడాలి ? ప్రాణం ఉన్న శవాన్ని చూసి ఒకవేళ భయపడినా అర్థం ఉంది "అన్నారు


“రమణ కరుణాసాగర తరంగాలు “ నుండి 

🕉🌞🌎🌙🌟🚩

 శిష్యుడు - అయితే , హృదయమే జీవునికి మూలస్థానము ( కేంద్రము ) అని చెప్పుచుంటిరిగదా . . . ? 


మహర్షి - నిజమే ! అది ఆత్మయొక్క పరమకేంద్రము , దానిని గురించి సంశయమక్కరలేదు . సత్యవస్తువగు ఆత్మయే హృదయమునందు జీవుని వెన్నంటియున్నది .

🕉🌞🌎🌙🌟🚩

 05. రమణాశ్రమ లేఖలు/ స్వర్ణోత్సవ కార్యక్రమము 9-9-46


  నిన్నటి జాబులో స్వర్ణోత్సవం గురించి కొంతవరకు వివరించాను. ఈ జాబులో నాటి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడుంబావు వరకు జరిగిన కార్యక్రమము క్లుప్తంగా వ్రాస్తున్నాను. 
  
     ఉదయం ఏడుంపావుకు  ఉమా, మొదలైన పుణ్యాంగనలు భజనలతో పాల కలశాలు తెచ్చి భగవానులకు, భక్తులకు సమర్పించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. పిదప భక్తులనేకులు సంస్కృతంలో, అరవం, తెనుగు, కన్నడం, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో వ్రాసిన వ్యాసాలు, పాటలు, పద్యాలు చదివారు. ఈ స్తోత్రం కొంత, కొంత వ్యవధితో మధ్యాహ్నం రెండింటివరకూ జరుగుతూనే ఉన్నది. సుమారు ఎనిమిదిన్నర మొదలు, తొమ్మిదిన్నరవరకూ బూదులూరి  కృష్ణమూర్తి అయ్యర్ పాటకచేరి. తొమ్మిదీ ముప్పావు మొదలు పదింటివరకు విశ్రాంతి. పదింపావుకు మాతృభూతేశ్వరాలయంలో పూజ,కర్పూర హారతి జరిగినవి. పదుకొండు గంటలకు అరుణాచలేశ్వరాలయం నుంచి గురుకుల ప్రసాదం తెచ్చి భక్తిపూర్వక ప్రణామంతో భగవానులకు సమర్పించారు. పదకొండు మొదలు పన్నెండువరకు విశ్రాంతి. 

   యధాప్రకారం రెండింటివరకు భగవాన్ హాలులో వుండి విశ్రాంతి తీసుకుంటే మంచిదని భక్తులు కోరారు గానీ, వారొప్పుకుంటారా?  భోజనమయ్యీ కాకుండానే కొలువు కూట మలంకరించారు. ఎంతెంత దూరం నుంచో ఎందరెందరో స్తుతించి సేవించాలని వస్తే, వ్యవధి చాలక వారికి ఆశాభంగ మౌతుందని; తమ శరీర కష్టాన్ని పాటించక ఆ కరుణామూర్తి అలా సేవను స్వీకరించి అనుగ్రహించారు.


   రెండింటివరకూ  భగవాన్ దర్శనం ఉండదని చాలామంది ఇంటికి వెళ్లారు.  భోజనానంతరం ఇట్టే వచ్చి చూతునుగదా  కోటిసూర్య ప్రకాశమానమగు తేజస్సుతో, భక్త బృందపరీవృతులై భగవాన్ పాకలో సోఫామీద కూర్చుని ఉన్నారు.  స్తోత్రం జరుగుతూనే ఉంది. ఏ చక్రవర్తినీ, ఏ దైవాన్నీ ఈ పురుషోత్తమునికి సరిపోల్చరాదు. ఏమంటే చక్రవర్తి దర్శనానికి  వెడితే ఎన్నో ఆటంకాలు, ఎంతమంది సిఫార్సులు కావాలి. దేవతా దర్శనమంటావా? వైకుంఠానికి వెళ్ళినా జయ-విజయులు ద్వారం దగ్గర కాపలా వుండి వేళకాదు పొంమ్మంటారు.  కైలాసానికి వెడితే ప్రమధ గణాలూ అంతే!   ఇక్కడో పశుపక్ష్యాదులతో సహా ఎప్పుడూ ఎవరికీ ఏ ఆటంకమూ పెట్టగూడదని ఒకటే శాసనం. చక్రవర్తి శాసనానికైనా తిరుగుందిగానీ; దీనికి తిరుగు లేదు. ఈ దయామూర్తి కెవరు సాటి? వారికి వారే సాటి. (ఇంక ఉంది)

🕉🌞🌎🌙🌟🚩
06-గీతా మకరందము.     అర్జునవిషాదయోగము
🕉🌞🌎🌙🌟🚩  
  
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అస్మాకం తు విశిష్టా  యే 
తాన్నిబోధ ద్విజోత్తమ
నాయకా మమ సైన్యస్య 
సంజ్ఞార్థం  తాన్ బ్రవీమి తే|| 

తా:- ఓ బ్రాహ్మణోత్తమా! ఇక మనసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరుకలరో వారలను జ్ఞాపకముకొఱకు మీకు చెప్పుచున్నాను. (వినుడు).

వ్యాఖ్య:- ప్రతిపక్షవీరులను మాత్రము తెలిపినచో ద్రోణున కొకవేళ అధైర్యము కలుగునేమోయని తలంచి ధైర్యోత్పాదనము కొఱకు స్వకీయ శూరవీరులను గూడ దుర్యోధనుడు తెలుప నారంభించుచున్నాడు. 


08
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ 
కృపశ్చ సమితింజయః | 
అశ్వత్థామా వికర్ణశ్చ 
సౌమదత్తి స్తథైవ  చ * || 


09
అన్యే చ బహవశ్శూరా 
మదర్థే త్యక్తజీవితాః | 
నానాశస్త్ర ప్రహరణాః 
సర్వే యుద్ధవిశారదాః ||


తా:- మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొఱకు తమతమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందఱును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్రసంపన్నులై ఇచట నున్నారు.

వ్యాఖ్య:- దుర్యోధనుడు వీరులను పేర్కొనునపుడు తన పక్షమునకు భీష్ముడు సేనాపతి
యైయుండ, ఆతని పేరు ముందు చెప్పక ద్రోణునిపేరు ఏల చెప్పవలసివచ్చెను? ఎదుటనున్న ద్రోణు డేమి భావించుకొనునోయని సందేహించికాని, గురువును ప్రప్రథమమున ఎన్నుకొనుట భావ్యమని తలంచికాని, ద్రోణాచార్యుని ఉత్తేజపఱచు నుద్దేశ్యముతోగాని అట్లు చేసియుండవచ్చును.
రెండు సేనలయందలి శూరవీరులను ద్రోణాచార్యుడెఱిగియున్నను, అతనితో జెప్పునెపమున దుర్యోధనుడు వారలను తిరిగి జ్ఞాపకము చేసికొని బలాబలములను లెక్కించుచున్నాడు. 

'త్యక్తజీవితాః' = (ప్రాణములను విడిచిపెట్టినవారు) — అను పదము దుర్యోధనుని ముఖతః వెలువడుటబట్టిచూడ తన వారందఱున్ను నశించియే పోవుదురని ముందుగనే అతని అంతరాత్మ భావించియుండవచ్చునని తోచుచున్నది. ఆ ప్రకారముగ పలుకుట దుర్యోధనునకు దుర్నిమిత్తసూచకమని కొందఱి మతము.
------------
*సౌమదత్తిర్జయద్రథః - (పాఠాన్తరము)

🕉🌞🌎🌙🌟🚩
07  శ్రీ ఆదిశంకరాచార్య  విరచితం
శ్రీ జగన్నాథాష్టకం
🕉🌞🌎🌙🌟🚩

1)కదాచిత్కాళిందీ తటవిపినసంగీతకవరో
ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః
రమాశంభుబ్రహ్మామరపతిగణేశార్చితపదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 


2)భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచరకటక్షం విదధత్
సదా శ్రీమద్బృందావనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 


3)మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ప్రాసాదాంతః సహజబలభద్రేణ బలినా
సుభద్రామధ్యస్థః సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 


4)కృపాపారావారః సజలజలదశ్రేణిరుచిరో
రమావాణీసౌమ స్ఫురదమలపద్మోద్భవముఖైః
సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 


5)రథారూఢో గచ్ఛన్పథీ మిళితభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః
దయాసింధుర్భంధుః సకలజగతాః సింధుసుతయా
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 


6)పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోఽనంతశిరసి
రసానందో రాధాసరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 


7)న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవే
న యాచేఽహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరపధూమ్
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 


8)హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే
హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే
అహో దీనానాథం నిహితమచలం పాతుమనిశ
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 

No comments:

Post a Comment