Friday, 19 February 2016

ప్రాంజలి ప్రభ -సూక్తి ముక్తావళి -3 (1 to 25)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ -ఆద్యాత్మిక ప్రభ 


సర్వేజనా సుఖినోభవంతు


1. ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి - ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు. నిర్వాణ షట్కము ప్రకరణగా భావించ వచ్చు. (ప్రకరణ అంటే - శాస్త్రాలలో ఇచ్చిన వివరణలో వచ్చిన సందేహాలను నివృత్తి చేసేవి అని). ఆత్మ అంటే ఏమిటి అనే దాన్ని ఏవేవి కాదో, ఏవేవి అంటవో, పట్టవో చెప్పి తర్వాత ఏమిటో అద్భుతంగా చెప్తుంది ఈ నిర్వాణ షట్కము. శ్లోకాలు, తాత్పర్యం మీకోసము.

మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే
న చ వ్యోమభూమిర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం

నేను (ఆత్మను) - మనసును కాను; బుద్ధిని కాను; అహంకారాన్ని కాను; చిత్తం (మెదడు లోని విషయాన్ని దాచే ప్రాంతం - మతి) కాను; చెవులు కాను; నాలుక కాను; ముక్కు కాను; కళ్ళు కాను; ఆకాశాన్ని కాను; భూమిని కాను; అగ్నిని కాను; వాయువును కాను. నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశః
న వాక్పాణిపాదౌ న చోపస్థపాయూ
చిదానంద రూపః శివోహం శివోహం

నేను (ఆత్మను) - ఊపిరిని, ఉచ్ఛ్వాస/నిశ్వాసను కాను; పంచప్రాణాలు కాను; ఏడు ధాతువులను (రస, రక్త, మాంస, మేధస్, ఆస్తి, మజ్జ, శుక్ర) కాను, పంచ కోశములు (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ) కాను ; వాక్కును కాను, చేతులు కాను, పాదములు కాను; పురుషాంగము/యోని కాను; విసర్జన చేసే అంగమును కాను; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం

నాకు రాగద్వేషాలు, లోభమోహాలు లేవు; నాకు మద మాత్సర్యాలు లేవు; నేను ధర్మార్థకామమోక్షాల వెంట పడను ; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనైవ న భోజ్యం న భోక్తాః
చిదానంద రూపః శివోహం శివోహం


నాకు పాప పుణ్యములు, సుఖ దుఃఖాలు లేవు; నాకు మంత్రము, తీర్థము, వేదము, యజ్ఞములతో పని లేదు; నాకు ప్రియమైనది, ప్రీతిని కలిగించేది, నా చే ప్రీతి పొందబడేది లేదు; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

న మే మృత్యుశంకా న మే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం

నాకు మృత్యు భయము, జాతిభేదము, తల్లి, తండ్రి, జననము లేవు; నాకు బంధువులు, మిత్రులు, గురువులు, శిష్యులు లేరు; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణి
సదా మే సమత్వం న ముక్తిర్నబంధః
చిదానంద రూపః శివోహం శివోహం

నేను అన్ని గుణాలకు అతీతుడను (ఎటువంటి షరతులు లేని వాడిని); నేను నిరాకారుడను, అంతటా వ్యాపించి ఉన్నాను; నాకు ఇంద్రియాలు లేవు; నేను ఎల్లప్పుడూ ఒక్కలాగే ఉంటాను; నాకు బంధనాలు, విడుపు లేవు. నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

https://www.youtube.com/watch?v=br29S_GBBjQ



రమణీయ శృంగార రజత పర్వతము నా, శోభిల్లు శుద్ధ విస్ఫూర్తి మూర్తి
ఆ పర్వతాగ్ర హేమైక శృంగంబు నా, నమరు జటామకుటాతి భాతి
ఆ తుంగ శృంగజలాపూర్ణ సరసి నాఁ, బొంగారు జాహ్నవీ భూరి వారి
ఆ నిమ్న సరసీ విహార మరాళికా, పంక్తి నా నొప్పు కపాలమాల

ఆ మహామరాళికాబర్హ ణాంభోజ
పుష్ప నిభ సముత్థ భోగభోగి
సమితిఁ దాలిచి పోల్చు శంకరుఁ డంబికా
ధవుఁడు మా కభీష్టదాత గాత

తాత్పర్యము: మనోహరమైన సొగసుగల కైలాస మనునట్లు ప్రకాశించు తెల్లని ఆకారమును, ఆ కొండపై నుండు బంగారు శిఖర మనునట్లొప్పు జడల కిరీటపు అధికమైన కాంతిని, ఆ యెత్తైన శిఖరమునందలి నీటితో బాగుగా నిండిన సరస్సు అనునట్లుగా ఉప్పొంగు గంగ యందలి అధికమైన నీటిని, ఆ గంభీరమైన సరస్సు నందు విహరించు నాఁడుహంసల వరుస అనునట్లొప్పు పుఱ్ఱెల దండను, ఆ యాఁడుహంసల దెబ్బలు గల (కాడలతోడి) తామరపూలతో సమానమైన విప్పారిన పడగలుగల పాముల సమూహమును ధరించి యొప్పు పార్వతీ భర్త యగు శంకరుడు మాకు కోరికల నిచ్చువాడు అగుగాక!!

నన్నెచోడదేవకృత "కుమార సంభవము" నుండి ప్రథమ పద్యం

 



 
02. మేలుచుక్కలమధ్య మేఘంబుకైవడి వ్రజసుందరీజనవ్రజము నడుమ
వేణురవామృతవిభవదిగంతుఁడై రచన మెరయ మోహరజ్జువలన
రమణులహృదయసారముల బంధించి విరిశరుమేలుసంగరము కదను
గఱపుచు వృషభంబుగతి చతురత దోఁప వలపల దాపలఁ గలయదిరిగి

రతుల దేలించి కామినీతతులతోడ నతిముదంబున నాడుకల్యాణగుణుఁడు
ఘనుఁడు వరదుఁడు నామానధనుఁడు వరుఁడు కేశవుడు వాఁని దేఁగదే కీరవాణి

గంగాధర కవి "కీరవాణి శతకము" నుండి


                                          
03..కం. శ్రీ పార్వతీశ శంకర!
నా పాపములకు సెమించు నగ తనయేశా!!
నీ పాదములకు తగనని
కోపావేశంబు వలదు కోటప్ప హరా !!
 
2.ఆ.వె. శివుని కులము నందె సృష్టి పొందితి నేను
పేరు వైష్ణవంబు పేచి లేదె?
పట్టె యెట్టులున్న పట్టింపు లేదుగా
పుట్టు వారు నీకె పుట్టువారె!!
 
3.ఆ.వె. లింగ మనగ నేమొ? లెస్స సెప్ప గలరు
ఆది, యంతమునకు ఆనవాలు?!
హరియు, ధాత గూడ హద్దు చూడగ లేదె
జాగరంబు లోనె జనియె రేయి!!
 
4.కం. లయకారుడు ఈ శివుడని
భయమేమీ వలదు మనకు భక్తి గణాలన్
దయతో గాచును ఇతడే
జయమొసగుచు బెంచు మనలొ భక్తి ప్రపత్తుల్ !!
 
5.ఆ.వె. శివుని గొల్వ మనకు సిరులు యేల? ఇపుడు
ఇంత బూది, నీళ్ళు ఇన్ని చాలు!
మఱ్ఱి పత్రి, మరియు మారేడు తక్కువా?!
భస్మ ధారె బ్రోచు భక్తవరుల!!
 
6.కం. శంకర శివ శంకర శివ
కింకరులను అదుపుచేసి ఏలుము నీవే!
వంకర యైనా నా మది
సంకరమే కాదుగింక శంకర కృపతో!!




04. . ఆ:వె :జన్మ లేని వాడ జగములేలెడివాడ
నీకు జన్మ దినము నిశ్చయించి
తనివి తీర నిన్ను తమ బిడ్డగా గొల్చు
భాగ్యమిచ్చినావు ,ప్రణతి గొనుమ !.

2. ఆ.వె: వెల్లగజము నొదలి వేల్పుమానునొదలి
సుధను ,పాల కడలి సుతను వదలి
కాలకూట విషము కంఠమందు న బట్టి
లోక రక్ష చేయ నీకె చెల్లు!

3. ఆ.వె: భక్తి తోడ బిల్వ పత్రమిచ్చినచాలు
గరిట నీరు పోయ గంగ చాలు ( చాలు= పోలిక)
శక్తి లేని వారు శంకరా యన చాలు
చింత దీర్తు వౌర సంతసించి!

4. ఆ.వె: నీదు భక్తులయిన నిను దిట్టువారైన
నీదు నామ స్మరణ చేయగానె
శివము నిచ్చెదవట శివ శివా నీప్రేమ (శివము= శుభము)
తెలియమైతిమయ్య యెలమి జూపు!

5. సీ: హరియు బ్రహ్మయుజేరి- రకట గొప్పలు పోవ
నగ్గి లింగము రీతి-నవతరించి
ఆద్యంతములు జెప్ప-నానతిచ్చితివంట
నీశక్తి దెలుపంగ-నిరువురకును
యెరుగలేమని దెల్సి -నిద్దరూ నినుగొల్వ
భక్తి పాశమునకు- బద్ధుడౌచు
హరికి పాలకవిధి-నజునకున్ సృజనిడి
కనికరించితివయ్య -కాలరూప
తే: గీ :పరమ శివుడనిన్ను తలచి పరవసింతు
భక్త సులభుడవనుచు నే భక్తి గొలుతు
మంత్ర పుష్పము రీతి నా మనసు నిత్తు
హరుడ దయచూడు నను కాళహస్తి రీతి!!

6. కం: భోళా శంకరుడవనుచు
వేళాకోళములు జేయ -వేలిమియందున్
హేలగ దక్షుని దునిమిన
కాలాత్ముని నే గొలిచెద -కైవల్యమిడన్!





05. శ్లో: నిఖిలభువనలక్ష్మీనిత్యలీలాస్పదాభ్యాం 
కమలవిపినవీథీగర్వసర్వఙ్కషాభ్యాం ! 
ప్రణమదభయదానప్రౌఢిగాఢోద్ధతాభ్యాం 
కిమపి వహతు చేతః కృష్ణపాదాంబుజాభ్యాం 

లీలాశుక యోగింద్రుని "శ్రీకృష్ణ కర్ణామృతము" నుండి 



టీక: నిఖిల= సమస్తములైన, భువన=లోకములందలి, లక్ష్మీ=లక్ష్మియొక్క, నిత్య=ఎడతెగని, లీలా=విలాసక్రీడలకు, అస్పదాభ్యాం= స్థానములైనవియు, (లోకములందలి శోభాసంపత్తియంతయూ ఎపుడూను అందు వన్నెలు చూపుచుండునని యర్థము), కమల విపిన=పద్మవనములయొక్క తామర తంపరలయొక్క, వీథీ=పంక్తులయొక్క, గర్వ=గర్వమును-మనోజ్ఞత్వముయొక్క నిక్కును, సర్వఙ్కషాభ్యాం= అంతటిని పోగొట్టు ననియు (తామరతంపరవరుసలయొక్క, చెలువంపునిక్కు నంతయు కొంచమైనను నిలుపక నిర్మూలనము గావించునవియనుట), ప్రణమత్=నమస్కరించువారలకు, అభయదాన=అభయము నిచ్చుటయొక్క ప్రౌఢి=ఆధిక్యమునందు, (మిక్కిలి అభయమిచ్చుటయందనుట), గాఢ=మిక్కిలి ఉద్దతాభ్యాం=విజృంభించి యుండుననియు (నమ్రులకు మీదుమిక్కిలి యభయమిచ్చు విషయమునందు ఎంతయు నుత్సాహముతో నాయుత్తమై యుండునవి యనుట) అగు, క్ర్ష్ణపాదాంబుజాభ్యాం=శ్రీకృష్ణునిచరణారవిందములచేత, చేతః=నామనసు, కిమపి=చెప్పనలవికాని సంతోషమును, వహతు=వహించుగాక.

 ఇచట కేవలలక్ష్మిని చెప్పక "నిఖిలభువన" ములలక్ష్మి యనుటచే లోకములలోని లక్ష్ములన్నిటినీ ఏర్చికూర్చి చేయబడునో ఆపాదములలక్ష్మి నిరుపమానమైనదనియు, నిత్య శబ్ధమువ్చే తక్కిన లక్ష్ములవలె అనిత్యం గాక అది నిత్యమైన దనియు స్ఫురించును. కేవలము "కమల"మును చెప్పక కమలముయొక్క "విపినవీథు" లను చెప్పుటచే తామరతంపరలన్నింటి యొప్పులను కుప్పచేసినను దానినిగూడ నిరసింపజాలినంత నిరతిశయమైనవనియు, "సర్వంకస్ష" శబ్ధముచే అనిరసించుటయొక్క ఔద్ధత్యమును దానిచే వానిశొభాప్రకర్షమును దెలియచున్నవి.


 కేవల "మభయదాన"మందుగాక "అభయదానప్రౌఢి"యందు "ఉద్ధతాములైన వనుటచే ఆదానమునుకొలదికి మీరనిచ్చునట్టి కారుణాతిశయము గలదనియు, ఉద్ధతత్త్వమును "గాఢ"మైన దనుటచే ఆ కరుణాతిశయముయొక్క ఔత్కంఠ్యము సూచితము. ఇట్లు నిరవధికాతిశయలక్షణలక్షిత మైనకృష్ణపాదాంబుజములచే నామనస్సు నిరవధికాతిశయమైనదేదో కలిగియున్నది. దానిని సంతోషమని చెప్పుటచాలదు. కాన "కిమపి" (ఎదోఒకటి) అనిమాత్రము చెప్పెదనని భావము. 

లలితాశేషాదిశానాథనగరీ లక్ష్మీవిలాసాస్పదం 
బులు నీరేరుహగర్వసర్వవిభవ ప్రోన్మూలనశ్రీపదం 
బులు వందారుమనోరథార్థఘటనా పూర్ణానుకంపాస్పదం 
బులు శ్రీకృష్ణపదంబు లూని మన మామోదంబునం బొందెడిన్! 

(వెలగపూడి వెంగనామాత్య విరచిత ఆంధ్ర అనువాద పద్యం) 

తాత్పర్యం: సకలలోకంబులందలి సిరులకు చెలువారుపట్టులై తామరపువ్వులం దెగడునట్టి దిట్టలై శరణాగతులకు మీదుమిక్కిలి యభయ మొసంగుటయందు మిక్కిలి యుత్సాహము కలిగియున్న చిన్నికృష్ణుని యడుగుదమ్ములు నామనంబున కింతింతనరాని సంతసంబును గూర్చుచున్నవి




06. కదిరి నృసింహుడు 
అన్నమాచార్య కృతి 

పల్లవి: 
కదిరి నృసింహుడు కంభమున వెడలే 
విదితముగా సేవించరో మునులు 

చరణం: 
1. ఫాలలోచనము 
భయదోగ్ర ముఖము 
జ్వాలామయ కేశరములునూ 
కాలరౌద్ర సంఘటిత దంతములు 
హేలాగతి ధరియించుక నిలిచే 

2. ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు 
గడగడ నదరెడి కటములునూ 
నిడుత నాలుకయు నిక్కు కర్ణములు 
నడియాలపు రూపై వెలసే 

3. సకలాయుధములు సహస్ర భుజములు 
వికట నఖంబులు వెసబూనీ 
వెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడు 
ప్రకటపు దుష్టుల భంజించేనిదివో 





07. ఒకటి యక్షరవిలాసోల్లాసమున మించ, నొకటి తాళప్రౌఢి నుల్లసిల్ల 
నొక్కటి నారికేళోన్నతిఁ దాల్ప నొ, క్కటి గోస్తనీగుచ్ఛకలనఁ దనర 
నొకటి సువృత్తభావోన్మేష మొంద నొ, క్కటి వల్లకీతుంబికలనఁ జెలఁగ 
నొకటి భారవిశేషయుక్తిఁ బెం పొంద నొ, క్కటి గిరీశమతానుకారి గాఁగ 

నసమసాహిత్య సంగీతరసము లనెడు 
గుబ్బపాలిండ్లు గల్గుపల్కుల వెలంది 
సరసగుణహారు నోబయనరనధీరు 
నవ్యకృతినాయకునిఁ గా నొనర్చుఁ గాత! 

రామరాజ భూషణుని "కావ్యాలంకార సంగ్రహము" నుండి సరస్వతీ వందన





08. అలసత్వం బధికంబు గ్రంథములు పర్యాయంబునం జుాడఁగాఁ 
గలనా లెక్కకురాని వెట్లయినఁ జక్కంజేసి చుాడంగ నం 
దలి తాత్పర్యము దుర్లభం బనుచుఁ గానంజాలకున్నాఁడఁ ద్వ 
త్కలితానుగ్రహ మెుక్కఁడుండఁ గొఱఁతా జ్ఞానప్రసుానాంబికా 

శిష్టుసర్వశాస్త్రి " జ్ఞానప్రసుానాంబికా శతకము" నుండి





09. నను పాలింప 
మోహన రాగం; ఆది తాళం 
త్యాగరాజస్వామి కృతి 

పల్లవి 

నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణనాథ 

అనుపల్లవి 

వనజ నయన మోమును జూచుట జీవనమని నెనరు నా మనసు మర్మము తెలిసి 

చరణం 

సురపతి నీల మణినిభ తనువుతో నురమున ముత్యపు సరుల చయముతో 
కరమున శర కోదండ కాంతితో ధరణి తనయతో త్యాగరాజార్చిత 






10. చందనచర్చిత నీలకళేబర 
మోహనరాగం - ఆదితాళం 
శ్రీ జయదేవ అష్టపది 

చందనచర్చిత నీళకళేబర పీతవసన వనమాలీ 
కేళిచలన్మణి కుండలమండిత గండయుగస్మితశాలీ 
హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళిపరే 

పీనపయోధరభారభరేణ హరిం పరిరభ్య సరాగం 
గోపవధూరనుతగాయతి కాచిదుద ఞ్చితపంచమరాగం 
హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళిపరే 

కాపి విలాసవిలోలవిలోచన ఖేలనజనితమనోజం 
ధ్యాయతి ముగ్ధవధూ రధికం మధుసూధనవదనసరోజం 
హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళిపరే 

కాపి కపోలతలే మిళితా లపితుం కమపి శ్రుతిమూలే 
కాపి చుచుమ్బ నితంబవతీ దయితంపులకై రనుకూలే 
హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళిపరే 

కేళికళాకుతుకేన చ కాచిదముం యమునాజలకూలే 
మంజులవంజులకుంజగతం విచకర్ష కరణే దుకూలే 
హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళిపరే 

కరతలతాళతరళవలయా వళికలితకలస్వనవంశే 
రాసరహే సహనృత్యపరా హరిణా యువతిః ప్రశశంసే 
హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళిపరే 

శ్లిష్యతికామపి చుంబతి కామపి రమయతికామపి రామం 
పశ్యతి సస్మితచారుపరామపరా మనుగచ్ఛతి వామాం 
హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళిపరే 

శ్రీజయదేవభణిత మిద మద్భుతకేశవకేళిరహశ్యం 
బృందావనవిపినే లలితం వితనోతు శుభాని యశస్యం 
హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళిపరే



--((*))-- 





11. కాళియ మర్దన ! 
క. 
వారిజలోచనుఁ డెవ్వరు 
వారింపగలేని ఫణినివాసత్వంబున్ 
వారించిన యమున సుధా 
వారిం బొలుపారె నెల్లవారికిఁ బ్రియమై. 

కమలలాంటి కన్నులున్న కన్నయ్య ..ఎవరికి వారింప శక్యంకాని 
కాళియుడనే సర్పం నివాసాన్ని తొలగించగానే 
యమునానది అమృతం వంటి నీళ్ళతో అందరికి ప్రీతిపాత్రమై విలసిల్లింది.”








12. సా విరహే తవ దీనా 
కల్యాణి రాగం -ఆది తాళం 
శ్రీజయదేవ అష్టపది 

సా విరహే తవ దీనా 

నిందతి చందన మిందుకిరణ మనువిందతి ఖేదమధీరం 
వ్యాళనిలయమిళనేన గరళమివ కలయతి మలయసమీరం 
మాధవ మనసిజవిశిఖభయా దివ భావనయా త్వయి లినా 
సా విరహే తవ దీనా 

అవిరళనిపతిత మదనశరాదివ భవదవనాయ విశాలం 
స్వహృదయమర్మణి వర్మ కరోతి సజలనళినదళజాలం 
సా విరహే తవ దీనా 

కుసుమవిశిఖిశరతల్ప మనల్పవిలాసకలాకమనీయం 
వ్రతమివ తవపరిరంభసుఖాయ కరోతికుసుమశయనీయం 
సా విరహే తవ దీనా 

వహతి చ వలితవిళొచన జలధరమాననకమలముదారం 
మిధు మివ వికటవిధుంతుదదంతదళనగళితామృతధారం 
సా విరహే తవ దీనా 

విలిఖితి రహసి కురంగమదేన భవంత మసమశరభూతం 
ప్రణమతి మకర మధోవినిధాయకరేచశరం నవచూతం 
సా విరహే తవ దీనా 

ధ్యానలయేన పురఃపరికల్ప్య భవంత మతీవ దురాపం 
విలపతి హసతి విషీదతి రోదితి చంచతి ముంచతి తాపం 
సా విరహే తవ దీనా 

ప్రతిపదమిదమపినిగదతిమాధవ! తవచరణే పతితాహం 
త్వయివిముఖేమయి సపదిసుధానిధిరపి తనుతే తనుదాహం 
సా విరహే తవ దీనా 

శ్రీజయదేవభణిత మిద మధికం యది మనసా నటనీయం 
హరివిరహాకులవల్లవయువతిసకీవచనం పఠనీయం 
సా విరహే తవ దీనా



*. అన్నమాచార్య కీర్తనలో  ఉన్న  ఆద్యాత్మిక అమృత వాహిని
( చదివినవారు మల్లాప్రగడ రామకృష్ణ గారు
కీర్తన: ఎన్నడు విజ్ఞానమిక నాకు .........(16.05)


13. వేదాలు సృజియించి విజ్ఞాన కాంతులన్ 
. విశ్వాని కొసగిన వేదదాయి 
పద్మాసనీ తల్లి పద్మ గర్భుని రాణి 
. పాపాలలెక్కింప పాటి గాదు 
ధాతమానసరాణి ధవళాంబరీ వాణి 
. ధరణినేలెడువేళ దయను విడక 
కరుణించవే మమ్ము ఘనసాంద్రరూపిణి 
. కల్పాన జీవించు ఖలులగాంచి 

జ్ఞానకాంతుల గోరెడు మానవాళి 
నిన్ను స్మరియింప దయజూపు నీరజాక్షి 
శరణు శరణంటి పదమంటి శారదాంబ 
వాసరా పుర వాసిత వాసరాంబ






14. దైవాస్త్రమేసిన దైవాస్త్రమేసి, గాంధర్వంబునేయ గాంధర్వమేసి 
రాముఁడా రావణాస్త్రములను వమ్ముసేయంగ రక్కసుఁడు కోపాగ్నులురలఁ 
బన్నగాస్త్రంబును బట్టివైవఁగ నది బంగారునగలతోఁ బన్నగగమి 
యై, విషాగ్నులతోడ నారామదేహంబు గప్పి దిక్తటములఁ గ్రమ్మికొనుచు 

నంబరమునిండి భీకరమైచెలంగ 
దానిఁగాంచిన రాముఁడుఁ బూనికమెయి 
గరుడాస్త్రంబు విడువఁ దద్భూరిశక్తి 
నదియు నిస్తేజమై భగ్నమై నశించె 

రామ రావణ యుద్ధ వర్ణన 
' కవిహంస ' శ్రీ వేదుల వేంకటశాస్త్రి ప్రణీత "అద్భుత రామాయణము" నుండి



 --((*))--



15. శ్రీ కటక చండీ స్తుతిః 
శ్రీభళ్ళముడి సీతారామమూర్తి గారు రచించిన ముద్రించిన నుతి మంజరి పుస్తకము నుండిసంగ్రహించ బడినది 

సంస్కృత జ్ఞానము ఇసుమంతైనా నాకు లేని కారణంగా తప్పులు దొర్లిఉండునేమో. సంస్క్రత జ్ఞానమున్న మిత్రులుసరిచేసి తెలియ బరిస్తే నేను సరి జేసు కొనుటకు సహాయ మౌతుంది 
విధేయుడు 
భళ్ళముడిసత్యవాసు 

౧: శ్రీచండీరిపురుండ ముండగళ మండా లోల హారావళీ 
హిండోలీ వరరాగ సుస్వర వదాందోలద్విలాసాలసా! 
పాండిత్యా ప్రతిభా ప్రదర్శక బుధా ఖండస్తుతిం ప్రస్తుతాఁ 
దండా పాతనమః పరం కరుణయాఖండా చిరంపాతు మామ్|| 

౨:శా: 
చండోద్దండరిపూ ప్రఖండన కళాశౌండీరతత్తత్కరా, 
గండూషోఙ్ఞిత రక్తభాండ భరితా ప్రాఙ్ముండ పేమండితే! 
ఢింఢింఢిమ్మితి డిండిమారవనటచ్చండాలికాసేవితా 
చండీ మామవతాదఖండ కరుణా బ్రహ్మాండ భాండేశ్వరీ|| 

౩:శా 
పిండాండోద్గత భూతజాత తత బ్రహ్మండేశ్వరీ చండికా 
గండోలీ ప్రఖరాసి కాండ పరశూ ప్రోద్దండ హస్తోజ్వలా! 
తండ్వాదీష్ట జనేన భక్తజన తండేనార్చితా కుండలీ 
చండా మామవతా దఖండ కరుణాసాఖండలాదిస్తుతా|| 

౪: 
చండాలోస్తు సవేద పాఠన పరఃపండాస్తుయోమండపే 
తుండేనా స్తుతి మాతనోతి నిరతంముండేనభూమింశ్పృశన్! 
కుండే యోజహుతే సమంత్ర మనిశం చండీశ్వరీ సాదకః 
చండీ తంత్వవతీ హ్యవేదపి చ మాం బ్రహ్మాండ భాండేశ్వరీ|| 

౫: కౌండిన్యర్షి సగోత్ర పండిత కవిశ్చండిం పదోపాసకః 
హిండత్కుండల రత్నమండల లసద్గండా స్థలాం నిస్తులామ్ 
తుండామోదముదార్ద్ర భాషణ చణా మాఖండలార్చద్గుణామ్ 
చండీమాతర మండ జాసన నుతాం సోహం శరణ్యాం వృణే ||  




 16. పవనాత్మజాగచ్ఛ
రాగం: నాట; తాళం: ఆది
ముత్తుస్వామిదీక్షితార్ కృతి

పల్లవి:
పవనాత్మజాగఛ్ఛ పరిపూర్ణ స్వచ్ఛ! పరమాత్మ పుచ్ఛ!
పాహిమాం జయజయ నవ నవ నవ జయ జయ!!

అనుపల్లవి:
నవవ్యాకరణ నిపుణ నవ విధాంతః కరణ!
శివ రామ హరికృష్ణ శ్రీగురుగుహ స్మరణ!!

చరణం:
కపట వానర వేష! కావ్య నాటక తోష!
కపియూధ పరిపోష!
కమనీయ భాష! అపగతాఖిలదోష! హతరాక్షసాశేష!
ఉపనిషత్పద ఘోష! ఉదిత మిత్ర ద్వేష!!

మ!! సా!!
అపురూప మణిభూష! రిపుజయ బలవిశేష
జప సమాద్యభిలాష! అపరిమిత సంతోష ||పవ||
    











17. కాటుక నెఱయంగఁ గన్నీరు వరదలై కుచకుంభ యుగళ కుంకుమము తడియ 
విడువక వెడలెడి వేఁడి నిట్టూర్పుల లాలితాధర కిసలయము కందఁ 
జెలువంబు నెఱదప్పి చిన్నఁబోవుచు నున్న వదనారవిందంబు వాడు దోఁప 
మారుతాహతిఁ దూలు మహిత కల్పకవల్లి వడువున మేన్ వడ వడ వణంకఁ 

జిత్త మెరియంగఁ జెక్కిటఁ జెయ్యి చేర్చి 
కౌతుకం బేది పదతలాగ్రమున నేల 
వ్రాసి పెంపుచు మో మరవాంచి వగలఁ 
బొందె మువ్వంబు గందిన పువ్వుఁబోలె 

పోతనామాత్యుని "భాగవతము" దశమ స్కంధము నుండి రుక్మిణిదేవి విలాప సన్నివేశం




18. శ్రీనాథ మహాకవి ఇంత ఖచ్చితంగా చెప్పింది ఎవరు కాదనగలరు? 

సకలలోక ప్రపంచమును లింగమయంబు త్రిజగంబు లింగప్రతిష్ఠితంబు 
సంభవస్థితిలయ స్థానంబు లింగంబు లీనార్థగమకంబు లింగమనఁగ 
లింగప్రసాదంబు లేక సిద్ధింపవు భోగమోక్షంబులే యోగములను 
లింగాజ్ఞవెలిగాఁగ లేశమాత్రంబును సంచలింపదుపో తృణాంచలంబు 

మంటినైనను లింగంబు మలిచికొలుఁడు 
ఇసుకనైనను లింగంబు నేర్చి కొలుఁడు 
పేఁడనైనను లింగంబుఁ బెట్టికొలుఁడు 
నీటనైనను లింగంబు నిలిపి కొలుఁడు 

శ్రీనాథ కవి "భీమేశ్వర పురాణము" నుండి 





19. మ్రింగెడివాఁడు విభుండని 
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ 
మ్రింగుమనె సర్వమంగళ 
మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో 

ఉదరము లోకంబులకును 
సదనంబగుటెఱిఁగి శివుఁడు చటులవిషాగ్నిన్ 
గుదురుకొనఁ గంఠబిలమునఁ 
బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసముక్రియన్ 

హరుఁడు గళమునందు హాలాహలము వెట్టఁ 
గప్పుగలిగి తొడవుకరణినొప్పె 
సాధురక్షణంబు సజ్జనునకు నెన్న 
భూషణంబు గాదె భూవరేంద్ర




20. మోహము లేక జగంబుల 
మోహింపఁగ జేయు నేర్పు మెునసిన విష్ణున్ 
మోహింపించెద ననియెడి 
మోహమున విధాత తానె మోహితుఁ డయ్యెన్ 

పోతనామాత్య "భాగవతము" దశమ స్కంధము నుండి




21.రుద్ర ధ్యానమ్ 
************ 
సద్యోజాతం ప్రపద్యామి 
సద్యోజాతాయవై నమో నమః | 
భవే భవే నాతిభవే భవస్వమామ్ | భవోద్భవాయ నమః|| 
(తై. అరణ్యకము 10 ప్ర. 43-44 అను.) 

భావం:: మహాదేవుని పశ్చిమముఖమునకు 'సద్యోజాతము' అని సంప్రదాయ సిధ్ధవ్యవహార నామము. అట్టి 'సద్యోజాత' ముఖమే తన రూపముగా కల పరమేశ్వరుని ఆశ్రయించుచున్నాను. ఆ 'సద్యోజాత' మహాదేవుని (అనుగ్రహింపజేసికొనుట) కొరకే నా ఈ నమస్కారం; మహాదేవ! నన్ను నీవు "నాకు మరల జన్మము కలుగు విషయమున (కలుగునటుల) ప్రేరేపించకుమా! ఈ భవమును(సంసారమును-జన్మపరంపరను) అతిలంఘించి ముక్తిని సాధించుకొనునట్లు నన్ను ప్రేరేపించుమా! సంసారము(జన్మము) నుండి తన ఉపాసకులను ఉద్ధరించు సద్యోజాతునికొరకు ఈ నా నమస్కారాలు. 

సద్యోజాత శబ్దమునకు వ్యుత్పత్తి : సద్ (సదా) యః అజాతః - ఎవడు ఎల్ల. సమయములందు జనించని నిత్యసిధ్ధతత్వ్తరూపుడో. 




22.అంకముఁజేరి శైలతనయా స్తన దుగ్ధము లానువేళ బా 
ల్యాంక విచేష్టఁ దొండమున నవ్వలి చన్ కబళింపఁబోయి, యా 
వంకఁ గుచంబు గన కహివల్లభహరముఁ గాంచి వే మృణా 
ళాంకురశంక నంటెడు గజాస్యునిఁ గొల్తు నభీష్ట సిద్ధికిన్ 

అల్లసాని పెద్దనామాత్యుని "మనుచరిత్రము" నుండి 





23.మ. హరిదంభోరుహలోచన ల్గగనరంగాభోగరంగత్తమో 
భరనేపథ్యము నొయ్య నొయ్య సడలింపన్ రాత్రిశైలూషికిన్ 
వరుసన్ మౌక్తికపట్టమున్ నిటలమున్ వక్త్రంబును దోఁచె నా 
హరిణాంకాకృతి వొల్చె రే కయి సగంబై బింబమై తూర్పునన్ 

హరిత్=దిక్కులనెడు, అంబోరుహలోచనల్-స్త్రీలు, గగన=ఆకాశమనెడు, రంగాభోగ=నాట్యస్థానపరిపూర్ణతయందు, రంగత్=ఒప్పుచున్న, తమోభర=చీకటియనెడు, నేపథ్యమున్=తెరను, ఒయ్యనొయ్య సడలింపన్=తిన్నతిన్నగా తగ్గ్గింపగా, రాత్రిశైలీషికిన్=రాత్రి యనెడు నాట్య స్త్రీకి, వరుసన్=క్రమముగా, మౌక్తికపట్టమున్=ముత్యాలపట్టయును-(అనగా నొసటికిపైన ముత్యాలతో కూర్చి అడ్డముగా కట్టుకునెడి పట్ట) నిటలమున్=నొసలును, వక్త్రంబును=ముఖమును, తోచెనాన్=ప్రకాసించెనో యన్నట్లుగా, హరిణాంకృతి=చంద్రునియొక్క రూపము, రేకయి=రేఖాకారమై, సగంబై=సగపాలై, బింబమై=సంపూర్ణమై, తూర్పునన్=తూరుపుదిక్కున, పొల్చెన్=ప్రకాశించెను. (క్రమాలంకారము) 

దిక్కులనెడి స్త్రీలు ఆకాశమనెడి రంగస్థలముపై చీకటియనెడు తెరను మెల్లమెల్లగా తగ్గించగా రాత్రి అనెడి నాట్యకత్తె కు మొదట నొసటిపైన కట్టుకున్న ముత్యాలపట్టిగా, తరువాత నొసలు, ఆపైన ముఖము కనిపించిన విధంగా చంద్రోదయ సమయమున చంద్రుని రూపము మొదట రేఖవలె, ఆతరువాత సగము రూపై ఆపైన పూర్ణబింబమై తూరుపు దిక్కున కనిపించెను. 

రామరాజభూషణుని " వసుచరిత్రము" చతుర్ధాశ్వాసము నుండి చంద్రోదయ వర్ణన 





24.జనని స్తన్యముఁ గ్రోలుచుం జరణ కంజాతంబునం గింకిణీ 
స్వన మింపారఁగఁ దల్లి మేన మృదుల స్పర్శంబుగాఁ దొండ మ 
ల్లన యాడించుచుఁ జొక్కు విఘ్నపతి యుల్లసంబుతో మంత్రి వె 
న్ననికిన్ మన్నన సొంపు మీఱ నొసఁగున్ భద్రంబు లెల్లప్పుడున్ 

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి "శృంగార శాకుంతలము" నుండి వినాయక ప్రార్థన 




25.అర్థాతురాణాం న గురుర్ న బంధుః 
క్షుధాతురాణాం న రుచికి న పక్వం 
విద్యాతురాణాం న సుఖం న నిద్ర 
కామాతురాణాం న భయం న లజ్జ 



ధనార్జన చేయువానికి గురువులు, బంధువులు అన్నది ఉండదు. ఆకలిగొన్నవాడికి రుచి, పక్వం పట్టింపు ఉండదు. నేర్చుకోవాలి(చదువుకోవాలి) అన్న ధృతి ఉన్నవాడికి నిద్ర, సుఖము తెలియదు. కోరికలతో సతమతమయ్యేవాడికి భయము, సిగ్గు ఉండవు.  

No comments:

Post a Comment