*నిత్యానందం*
🤥
రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి
*నిత్యానందం గారి వివాహం - 1*
"వొళ్ళు రవరవ మండిపోతోంది. కోపం ఆగడంలేదు. 'ఏదో ఆఘాయిత్యం చేసేస్తాను. సందేహంలేదు. 'వీడు కోపధారి వెధవ, ఎప్పుడో ఏదో అఘాయిత్యం చేసేస్తా'డని మా నాయనమ్మ అంటూనే వుండేది.
ఎందుకింత కోపం, ఏం ముంచుకు పోయిందా? ముంచుకుపోయిందా, ముంచుకుపోయిందిన్నరా? ముంచుకు పోయిందిన్నర అంటే ఏమిటా ? నీబొంద! అసలే కోపంగావుంటే కవ్వించకు, నన్ను రెచ్చగొట్టకు. అగ్గిమీద గుగ్గిలం, కోపమొస్తే వొళ్ళూపై తెలీదు నాకు. మా నాయనమ్మ అంటూవుండేది కోపమొస్తే వీడికి వొళ్లూపై తెలీదని ! కొపమొస్తే నేను నిప్పులుతొక్కిన కోతిని! కాలు గాలిన పిల్లిని! రేగిన తేనెటీగని! బెదరిన మదపుటేనుగుని!! నాకు కోపమొస్తే ఎంత ఉపద్రవమో నాయనమ్మకి తెలుసు."
"ఇంతకీ సంగతేమిటో చెప్పమంటావు? పానకంలో పుడకలా మాట మాటకీ అడ్డు తగులుతూ, నేనేదో జాప్యం చేసినట్టు, నీ యిదేమిటి? కుక్కిన పేనులా నోరువిప్పక, చెవులు అప్పగించి విను కుక్కిన పేనుకి నోరుంటుందా అంటావు, నీకుందిగా దానిలా నోరు. దయచేసి దానికి తాళమే సెయ్యి. అదిగది. రెండు చేతులతోటి నోరు మూసుకో, చొప్పదంటు ప్రశ్నలెయ్యకు. భేష్!"
"రామాయణంలో ఈ పిడకలవేటతో ధోరణి తెగిపోయింది. ఎంతదాకా చెప్పనబ్బా ! ఆఁ జ్ఞాపక మొచ్చింది. వొళ్ళు రవ రవ మండి పోతోంది. అఘాయిత్యం చేసేస్తానంటున్నా ను. ఏమిట్రా, ఆ వెధవ సంజ్ఞలు ? నోరు లేదూ ? మూగాడివా? అవునవును విప్ప కూడదు. చేతులూ కాళ్ళూ కూడా కట్టేసుకు విను.
ఈ పెళ్ళి నాకిష్టం లేదు. ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రం కట్టేశాననుకో. నే కట్టనని చెబుదామనుకుంటే, మాట విని పించకుండా వెనకాల ఢమఢమ డోలు వాయించేశారు. జబ్బ ఊడిపోయేలా నా చెయ్యి లాగేసి, ముడేయించేశాడు ఆ పురోహితుడు. ఆ మటకొస్తే, వాడే వేసేశాడు. 'మమ' అనికూడా అనుకోలేదు. అయినా ఆ అమ్మాయి నా పెళ్ళామేనట ! ఆ అమ్మాయి నా కిష్టంలేదు."
"నిజమేరా, పెళ్ళికి ముందు వాళ్ళింటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసిన తరవాతే పెళ్ళి ముహూర్తం పెట్టారు. కాని దాన్ని పెళ్ళి చేసుకుందామని నేనెప్పుడూ అనుకోలేదు. ఒప్పుకోలేదా అంటే, నోటితో ఎప్పుడూ ఒప్పుకోలేదు. పిల్లని చూడ్డానికి నాకు తోడుగా నక్షత్రకుణ్ణి పంపించారుగా ! నక్షత్రకుడిని ఎరగవూ? మా వెంకట్రా మయ్య ! వాడికేదైనా అప్పజెప్పితే జలగ లా పట్టుకుంటాడు. జీడిలా అంటుకుంటా డు. బంకలా తగులుకుంటాడు. ఇంకేముంది! బయలుదేరినదగ్గిర నించి కురుపు సలిపినట్టు ఒకటే సలపడం..
'అబ్బాయ్, బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరాదు. యాభై ఏళ్ళకి శక్తి అంతా వుడిగిపోయిన తరవాత పెళ్ళి చేసుకుని లాభమేమిటి? మీ నాయనమ్మ నీ పెళ్ళి చూడాలని తహ తహలాడి చచ్చిపోయిందా? మీ నాన్న కూడా పెద్దవాడైపోయాడు, ఆయనా పోవచ్చు, దాంతో బెంగపెట్టుకుని మీ అమ్మా పోతుంది. ఇహ, నేను వచ్చే ఏళ్ళే గాని, పోయే ఏళ్ళు కావు గదా! పెళ్ళి కూతుళ్ళని చూడ్డానికి నేనూ నీతో రాలేను, నువ్వు ఒక్కడివీ ఏమీ చూసుకోలేవు. నీకేమీ తెలియదుగదా! వెంటనే పెళ్ళికి ఒప్పేసుకోవాలి. నువ్వు పెళ్ళికి మాత్రం ఒప్పేసుకోవాలి! ఊపిరి సలపనివ్వడు, ఆలోచనా తెమలనివ్వడు. పాడిందే పాట: చెవులు హోరెత్తిపోయాయి. విసుగెత్తి పోయి 'సరే నయ్యా' అన్నాను.
"అమ్మయ్య. పెళ్ళికి ఒప్పేసుకున్నావుగదా, ఇంక పెళ్ళికూతురే కుదరాలన్నమాట. అదెంతసేపు! చూడబోతున్నాంగా ఇప్పుడో పిల్లని, ఈ పిల్ల కాకపోతే మరోటి.. రంభ కాకపోతే ఊర్వశి. అదీ నచ్చకపోతే తిలోత్తమ. కొండమీద కోతి కావాలంటే దాన్నే తీసుకొస్తాం."
పెళ్ళి కూతురిగారింటికి చేరుకునే దాకా నోరు మూతపడలేదు. నా తల దిమ్మెత్తి పోయింది. పెళ్ళికూతురిగారింట్లో ఫలహారం సిద్ధంగా వుంది. జీడిపప్పు పాకం, చేగోడీలు. రెండూ నాకిష్టమే· మా వెర్రినాగమ్మకి చాలా ఇష్టమని కోమటి కోటిలింగాలు మిఠాయి దుకాణంనించి రహస్యంగా తెప్పించిపెడుతూ వుండేది నాయనమ్మ. కోటిలింగాలు దుకాణంలోనే అసలు నేతిసరుకు దొరికేది. ఆ ఫలహారం చూసిన తరవాత కాస్త ప్రాణం స్తిమిత పడింది. మా నాయనమ్మ జ్ఞాపకమొచ్చి కళ్ళ నీళ్ళు తిరిగాయి. నోట్లో నీళ్ళు ఊరించింది ఫల హారం.
"అబ్బాయ్, కతికితే అతకదు. నువ్వు తినకూడదు." అని బాంబు విసిరాడు నక్షత్రకుడు, ఈ రోజుల్లో ఆ పట్టింపులు పనిచెయ్యవని పిల్ల తండ్రి చెప్పినా వినిపించుకోడు. నాకు లేకుండా తిండి ప్రారంభించాడు.
"జీడిపప్పు పాకం చాలా బాగుందే! బెల్లప్పాకం! పంచదారకంటే బెల్లప్పాకమే మంచిది సుమండీ మ్యమ్ మ్యమ్... ఇప్పుడన్నీ సుతారం తిళ్ళు. తెల్లగా వుంటుందని పంచదార తింటే నులి పురుగులు పుట్టుకొస్తాయి...మ్యమ్ మ్యమ్... బెల్లానికి ఆ బాధ లేదు. ఈ ఊళ్ళో తప్ప మంచిబెల్లం దొరకదండి... మ్యమ్ మ్యమ్!!
'ఒకటే' దవడ ఆడింపు. నక్షత్రకుడి ప్లేటు ఖాళీ. నాకోసం తెచ్చిన ప్లేటులోనివి కూడా వాడి ప్లేటులోకి దొర్లిపోయాయి.
"అనుకున్నా, బజారు సరుకు ఇంత ఎలా బాగుందా అని. అమ్మాయి స్వయంగా చేసిందా ? అసలు పిండివంటల దాకా కాకపోయినా మాములు వంట వచ్చునన్న మాట. ఇంకేం. పిండివంటలు కూడా నేర్పెయ్యండి. మావాడికి పిల్ల బాగా నచ్చి పోయిందన్న మాటే...హిహిహి మావాడు భోజన ప్రియుడులెండి.. నిత్యానందం, నువ్వు తినకూడదు గానీ, ఈ తిండి చాలా బాగుందోయ్! చేగోడీలు కూడానూ... కమ్మగా కరకరలాడుతూ వున్నాయి."
నా వొంతు కూడా వాడే తినేశాడు.. నరికి పారెయ్యాలన్నంత కోపమొచ్చింది. గుడ్లెర్ర చేశాను. పళ్లు పటపట కొరికాను. అసలు నక్షత్రకుడికి అది అర్థమై ఏడిస్తేగా ! ఓ గ్లాసు మంచినీళ్ళు, రెండుగ్లాసుల కాఫీ తాగి, బ్రేవ్ మని త్రేన్చాడు.
"దుర్ముహుర్తం రాకుండా పిల్లని రప్పించండి!"
వచ్చింది ఆ అమ్మాయి. గజగమనం, మందగమనంతో కాదు, తారాజువ్వలా రివ్వున వచ్చింది. కుర్చీలో ధీమాగా కూర్చుంది. సిగ్గుపడలేదు. తల వొంచుకోలేదు.
🤠
*సశేషం*
꧁
*నిత్యానందం*
*నిత్యానందం గారి వివాహం - 2*
'బాగానే వుంది కదూ' నక్షత్రకుడు నా చెవులో గుసగుస. ఆడవాళ్ళంటే నాకసలే సిగ్గు, అందులో ఆ అమ్మాయి నాకేసి అలా ధాటీగా చూసేస్తూవుంటే...! 'పిల్లని తిన్నగా చూసుకోవోయ్,' అంటూ నక్షత్రకుడు !
"అమ్మాయ్, కొంచెం వెలుగుపడేలా కూర్చో అమ్మా! వెనకటికి ఓ పెళ్ళికొడుకు పిల్లని పసందుచేసి తరవాత క్రీనీడలో తిన్నగా కనిపించలేదు కనక ఒప్పుకున్నానని పేచీ పెట్టాడుట. ఆం.. అది, ఇప్పుడు చూసుకో వోయ్"
ఏం చూడను. ఓ అమ్మాయి, అందులో పెళ్ళికున్నది, సిగ్గూ, శరం లేకుండా చూస్తూ వుంటే, ఆ అమ్మాయి చూడకుండా, నే చూద్దామంటే, ఎప్పుడు ఆ అమ్మాయి నాకేసి చూడబోయినా, ఆ అమ్మాయి నాకేసి చూస్తూనే వుంటుంది. ఆడదాని చూపులు మన్మధుడి బాణాలంటారు. అమ్మాయి చూపులు నాకు ముళ్ళలా గుచ్చుకున్నాయి. "చూశావా, చూశావా అని చెవి కొరుకుతాడు నక్షత్రకుడు. చూశాను ! నెత్తిమీద పువ్వుల గోలెంతప్ప మరేమీ కనిపించలేదు.
"పిల్ల బాగానే వుందికదూ! ఏం? ప్రశ్నలేమన్నా వేస్తావా"
ఎవరిని? అమ్మాయినేట? ఇంతమందిలో చూడ్డానికే సిగ్గుగా వుంటే ఇక నే ప్రశ్నలేం వెయ్యగలను ? బొంచాయిలాటి వూళ్ళలో అమ్మాయినీ, అబ్బాయినీ, ఏ సినిమాకో, బీచీకో తోడు లేకుండా పంపిస్తారుట! అలా వదిలిపెడితే చూపిద్దును నా మజా? అంతేగాని పదిమందిలో కూచోపెట్టి, మాట్లాడమంటే, జంకుగా వుండదూ!
"పోనీ, నేనే పలకరిస్తానులే" అన్నాడు.
"నీ పేరేమిటమ్మా ?"
"సుబ్బమ్మ !"
"బాగుంది, సాంప్రదాయకమైన పేరు." ఆ అమ్మాయి పేరు దిబ్బమ్మ అయితే మరీ సంతోషంగా వుంటుందన్నట్టు మాట్లాడాడు నక్షత్రకుడు..
"చదువుకుంటున్నావా అమ్మా ?"
“ఆ... "
"ఎన్నో క్లాసు ?"
"ఆరో క్లాసు"
"ఆరో క్లాసే? రాసుల పేర్లు తెలుసా ?"
మేగజైన్లలో నక్షత్రకుడు వారఫలాలు తప్ప ఏమీ చూడడు.
" తెలుసండి!"
"చెప్పమ్మా!"
"అశ్వని, భరణీ... వృశ్చికం" అంటోంది ఆ అమ్మాయి నాకు మా చిరాకెత్తుకొచ్చింది. 'అనవసరంగా చంపకోయ్' నీ అవకతవక జవాబుల్తో, మమ్మల్ని చంపొద్దని ఆ అమ్మాయిననాలని నా ఉద్దేశం. 'అనవసరంగా చంపకోయ్ అ మ్మా యి ని' అని నోరు జారిపోయింది.
"మావాడు చాలా మంచివాడులెండి. భార్యని పువ్వుల్లో పెట్టి పూజించుకుంటా డు. ఏమంటావు ?" తొడమీద ఫేడేల్ మని కొట్టాడు.
"ఇంగ్లీషు చదువులు చూడండి. తెలుగు పేర్లన్నా తిన్నగా చెప్పరు. మా అమ్మాయికి హిస్టరీ జాగర్ఫీలు బాగా వచ్చునండీ!" ముక్కుమాటలతో అంది ఆ పిల్ల తల్లి.
"అమ్మా ! అశోకచక్రవర్తి ఏంచేశాడు ?"
"అశోకచక్రవర్తి గొప్ప చక్రవర్తి. ఆయన రోడ్లను త్రవ్వించెను, జంతువులకు.... జంతువులకు, మరమ్మత్తులను చేయించెను. అహా..., ఆసుపత్రులను వేయించెను. చెట్లను కట్టించెను. "
"శభాష్ ! చాలమ్మాచాలు. మెతుకు పట్టుకు చూస్తే చాలదూ! హిస్టరీ చాలా ధాటిగా వచ్చిందండి?" అని నక్షత్రకుడి మెప్పు !
"జాగర్భి కూడానండీ ! భూమధ్య రేఖ ఎక్కడుంది తల్లీ :"
"భూమధ్య రేఖ భూమధ్యంలో ఉందండీ ?"
"రైట్ ! జాగర్భీ క్షుణ్ణంగా వచ్చునండీ మా అమ్మాయికి. ఇంకా ఏమన్నా ప్రశ్న వేస్తే వెయ్యండి?"
నక్షత్రకుడికి అసలు జాగర్భీ అంటే ఏమిటో తెలిస్తేగా ప్రశ్న వెయ్యడానికి.
"తెలుస్తూనే వుందిలెండి - అనవసరంగా అందులో ప్రశ్నలెందుకు ? అమ్మాయికి వంటవచ్చునని ముందరే తేలిపోయింది. ఇంకేం కావాలీ...ఆఁ... సంగీతం ఏమైనా చెప్పించారా ?"
"నోటి పాటేనా, వాయిద్యం కూడానా?"
“నోటి పాటేనండి. వాయిద్యం చాలాయేళ్లు సాధకం చెయ్యాలి. అత్తారింటికెళితే అక్కడ కుదరదు. నోటి పాటైతే ఖర్చు పూర్తిగా వృధాపోదు పేరంటాల్లో మంగళ హారతో, పిల్లలుపుడితే జోలపాటో పాడుకోడానికైనా పనికొస్తుంది."
"అవునవును. సంసారుల సంగీతం అంతేలెండి. కృతులు నేర్పించారా ఏమిటి? బాగుంది. శాస్త్రీయ సంగీతం తప్పకుండా నేర్పంచాలండీ ! త్యాగయ్య మనవాడా అరవలు చూడండి. ఆయన్ని ఖూనీ చేసి పారేస్తున్నారు. మనం నేర్చుకోవాలి. ఏదీ ఒక్క కృతి పాడమ్మా?"
"శ్రుతి లేందే నే పాడలేనండీ నాన్నారూ?"
"శృతి కేమమ్మా ! సా.పా, సా" అన్నాడు నక్షత్రకుడు.. వాడి కోతిచేష్టలు చూస్తూ వుంటే నాకు చిరాకెత్తుకొస్తోంది. 'నీ పాటెవరికి కావాలోయ్, నోరుమూసుకో!' అందామనుకున్నాను గాని వాళ్ళం దరిముందూ గదమాయిస్తే ఏడిచిపోతాడు గదా అని వూరుకున్నాను.
వాళ్ళ నాన్న, అమ్మ, అన్నలు, తమ్ముళ్లు అందరూ బతిమాలగా పాట మొదలెట్టింది.
"నను పాలింపగ నడచి వొచ్చితివో, నా ప్రాణనాధ" అంటూ!
''ఆ హా హా ? యుక్తమైన పాట పాడావు. నడిచిరాలేదు. రైలే ఎక్కి వచ్చాడనుకో, హి హి హి..." తన తెలివికి తనే సంతోషించ ప్రారంభించాడు నక్షత్రకుడు.
"మా అమ్మాయికి సినిమా పాటలు చాలా బాగా వచ్చునండీ! తెలుగే కాదు, హిందీ కూడాను "
"అలాగా, ఏదమ్మా! ఓ సినిమా సాంగు విసురు."
''పందిట్లో పెళ్ళవుతున్నదీ... బలె విందౌతున్నది..."
"ఎందులోదోయ్ ఈ పాట నిత్యానందం ? మా వాడికి సినిమాపిచ్చిలెండి. ఊళ్లో వచ్చిన ప్రతి సినిమా చూస్తాడు, దాన్లో స్టార్లూ, పాటలూ అన్నీ మావాడికి కంఠతా. అవునా, నిత్యానందం?'' తొడమీద మళ్ళీ ఫెడేల్ మని కొట్టాడు. వీడికిదో రోగం. 'అవునా, ఏమంటావు' అని పక్కవాడి తొడమీద చరుస్తాడు. చాచి పుచ్చుకు లెంపకాయ కొడదామన్నంత కోపమొ చ్చింది. పరాయి వాళ్ల ముందర, అవమానం చెయ్యడమెందుకు,అఘోరించి పోతాడని వూరుకున్నాగాని ! 'రైలుకి టైమైనట్టుంది పద' అని వెంటనే బయటి
కొచ్చేశాను. నక్షత్రకుడు పిల్లతండ్రితో పావుగంట గుసగుసలాడాడు. జీడిపప్పు పాకం పొట్లం తెచ్చుకున్నాడు. ఇంకేముందీ! ఆయనకి దాసుడైపోయాడు. భట్రాజులా వాళ్ళని పొగిడాడు.
"ఆడ కూతుళ్ళని కన్నవాళ్ళు ఆశతో వేగిపోతూ వుంటారు. సంధిగ్ధంలో వుంచ కూడదు. పిల్ల సంగతి నువ్వే తేల్చు, కట్నం, కానుక సంగతి నే తేలుస్తాను." మళ్ళీ కురుపు నలుపు !
"ఆ అమ్మాయి పాటేం బాగాలేదు" అన్నాను.
"వరసలు బాగానే వచ్చాయి. పడగ్గదిలో నీకు వినిపించడానికి అది చాలు, కచేరీలు చేయించవుగా ?"
"పిల్ల అందంగా లేదు"
"అందం కొరుక్కుతింటామా?"
"అందం లేకపోతే మానె, ఆ అమ్మాయి ముక్కు వంకరగా ఉన్నట్టుంది."
"నీ ముక్కంత మెలికలు తిరగలేదు."
"మెల్లకన్నులా వుంది,"
''పెళ్ళానికి మెల్లయితే మొగుడికి అదృష్టం."
"బుద్ధున్నవాడు అనవలసిన మాటే అది? వొళ్ళు మండిపోయింది. ఛీ ఛీ! నీతో మాట్లాడకూడదనుకున్నాను. మోసం."
"అబ్బాయి ! నే చెదుతున్నాను విను. ఈ పిల్ల అన్నివిధాలా నీకు తగింది. ఆ మాటకొస్తే పిల్లముందు నువ్వే తీసికట్టని అనిపించావు. నువ్వు నోరు విప్పి పలకరించలేకపోయావు. నీకేమీ రాదేమో నని వాళ్ళకి అనుమానం పుడితే,... 'లేదండీ, మా వాడికి కొంచెం సిగ్గు? మొహమాటం, చనువయిన తరువాత చూడండి, మా వాడి తడాఖా అని నచ్చ చెప్పేసరికి నా తాతలు దిగొచ్చారు. నువ్వు అసమర్థుడవని నీ సంబంధం వాళ్ళకి నచ్చకపోతే. అది దేశమంతా పాకిపోయి, నీకు అసలు పెళ్ళి యోగం లేకుండా పోతుంది. నీ మేలుకోరి చెబుతున్నా ఒప్పేసుకో ... కానింటి రంభ కంటె అయినింటి కోతిని చేసుకోమన్నారు. ఈ సంబంధం కుదిరితే నువ్వు చాలా అదృష్టవంతుడివే ! "
అర్థం పర్థం లేని ఒకటే వాగుడు. ఎంత వాగినా నే జవాబు చెప్పలేదు. పో పో ! వాక్కుని వాక్కుని నీ నోరే నొప్పెట్టి పోతుంది అనుకున్నాను. అంతే భీష్మించు కు మౌనంగా ఉండిపోయాను. నువ్వేచెప్పు నాకిష్టం లేదని తేల్చేసినట్టేనా? కాని, ఇంటి కొచ్చేసింతరవాత పిల్ల నాకు నచ్చిందని నక్షత్రకుడు అందరితోటీ చెప్పేశాడు. నాన్నా, నక్షత్రకుడూ కలసి కట్నాలూ, కానుకలూ అన్నీ నిర్ణయం చేశారు. నన్ను దేనికీ సంప్రతించరు. ఏమీ అడగరు. నాకు ఒళ్లుమండిపోతోంది. ఎప్పటికప్పుడే 'నాకక్కర్లేదు, పెళ్ళి పనులు చేయించకండ ర్రా' అని చెబుదామనుకునేవాణ్ణి. మా నాయనమ్మ ఉంటే పైకి చెప్పకపోయినా మొహాన్ని బట్టే కనిపెట్టేసేది. ఏమిట్రా నాయనా ! ఆముదం తాగిన వాడిలా మొహం పెట్టావు?' అని అడిగి వుండేది.
"నాయనమ్మా! నాకీ పెళ్ళి ఇష్టంలేదే!" అనేవాణ్ణి.
"ఎందుకురా" అనేది.
"ఆ పిల్ల నాకు నచ్చలేదే!"
"ఎందుకు నచ్చలేదురా ?"
"ఆ పిల్లకి మెల్ల.. ముక్కు వంకర. కీచు గొంతుక. పాట రాదు"
'అలాట్రా వెర్రికుంకా! నీకు నచ్చనిపిల్లనిచ్చి పెళ్ళెందుకు చేస్తామురా. వద్దని ఉత్తరం రాయించేస్తానులే" అనేది.
"థాంక్యూ, నాయనమ్మా !"
దాంతో పెళ్ళి బంద్. 'పదిమంది పిల్లల్ని చూసి, అందులో ముగ్గుర్ని ఏరి, వాళ్ళని మళ్ళీ చూసి, ఆ ముగ్గుర్లో ఒకర్తిని ఎన్నుకో వాలని నా ఆశయం. చూసిన మొదటి పిల్లనే నాకు అంటగట్టేస్తే ఎలా భరించగల ను 'నువ్వు చచ్చిపోయి ఎంత సంకటం తెచ్చిపెట్టావు నాయనమ్మా ! నా పెళ్ళి చూడకుండా చావననేదానివి ఎంతపని చేశావు నాయనమ్మా! నా మొహంచూసి భావం కనిపెట్టే మనిషి లేదుకదా ! ఇంట్లో అన్నీ నేనే మాటల్లో చెప్పాలి. కోపమొస్తే నాకు మాటలు త్వరత్వరగా రావని నీకు తెలుసుగా' రంపం లాటి వాడిగల మాటల కోసం వెతుకుతాను, అవి దొరక్కపోతే నాలిక తడబడుతుంది. నాలిక తడబడితే నాన్న కరుస్తాడు అంచేత ధాటీగా పెద్ద ఉపన్యాసం తయారుచేసుకుని వెడదామ నుకుంటూ ఉంటే ముహూర్తం వచ్చేసింది. పీటలమీంచి లేచిపోదామనుకున్నప్పుడ ల్లా, పురోహితుడు నొక్కేసి, కూర్చోబెట్టేసే వాడు. పుస్తెకట్టించేశాడు. నేనొప్పుకోను. ఈ పెళ్ళి నాకొద్దు... ఏదో అఘాయిత్యం చేసేస్తాను.
"ఇక్కడే ఉన్నానండీ నాన్నగారూ!"
"గదిలో కెళ్ళడానికి టైమయిందిట్రా...''
“వస్తున్నానండీ నాన్నగారూ! వస్తున్నానండీ !"
"ఇంకేం అఘాయిత్యామా... ఏం? జవాబు చెప్పక ఇకిలిస్తావేమిటిరా? పోకిరీ పెద్దమ్మా?''
రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి
*సశేషం*
*నిత్యానందం - 3*
*నిత్యానందం గారి సాంసారిక విజయాలు -1*
“ఇంత పొద్దెక్కినా తలపు తీసి ఊడిపడరేం? అమ్మాయ్ సుబ్బమ్మా, వాడికి లేకపోతే మానె, నీకైనా బుద్ధిలేదే? ఎంతసేపు గడియ బిడాయించుకు పడుకుంటారు" అని అమ్మ సాధింపు ప్రారంభించింది.
అమ్మకి నాలుగున్నర నించీ నిద్దురపట్టదు. నాయనమ్మ లాగ గజేంద్రమోక్షంలో పద్యాలూ, భజగోవింద శ్లోకాలూ చదువుకుంటూ మంచం మీదే నడుంవాల్చి వుండిపోదు. లేచి ఇల్లంతా సవరిస్తుంది. ఒంట్లో బాగాలేకపోయినా, చచ్చేదాకా వెట్టి చాకిరీ తప్పదని గొణుక్కుంటుంది. విసుక్కుంటుంది.
"లేవరా నిత్యానందం, ఎండెక్కిపోయింది రా..."
కళ్లు నులుముకుంటూ లేవబోయాను.
"ఇంకా బద్ధకం తీరలేదు. పడుకోండి" అంది మా ఆవిడ.
"ఎండెక్కి పోయిందట" అన్నాను.
"మరేం ఫరవాలేదు. ఇంకా ఆరున్నర కాలేదు. ఈ వెధవ్వూళ్ళో తెల్లారకుండానే ఎండొస్తుంది. మీ నాన్న ఆఫీసుకి టైముని బట్టి వెళతారా, ఎండనిబట్టా? పడుకోండి, పడుకోండి"
"నే లేస్తాను. నువ్వు పడుకో"
"మీరు మాత్రం లేచి వెలగబెట్టే రాచకార్యా లేమున్నాయి. మొగుడు లేచినా ఇంకా పడుకుందని నన్ను ఆడిపోసుకోడానికా, మీరూ పడుకోండి" అని దబాయించేసింది.
"లేవరా"
“పడుకోండీ”
"నిన్నేరా"
"మిమ్మల్నేనండీ"
"లెమ్మంటే"
“పడుకోమంటే"
అవతల తల్లి, గదిలో భార్య. ఎవరు గెలిచారా? ఏమిట్రా. చొప్పదంటు ప్రశ్న ? ఇలాటి విషయాల్లో ఎవరు గెలుస్తార్రా?
"వొరేయ్. ఎంతసేపురా మొద్దు నిద్దర ? లే" అని మా నాన్న అందుకున్నాడు. వెంటనే ఉలిక్కిపడి లేచి కూచున్నాను. నాన్న అందుకుంటే రండోలు వాయించినట్టే. ఇహ లాభం లేదు. లేచి బయటికి పోతేనే మంచిది.
"అనవసరమయిన విషయాల్లో జోక్యం కలుగజేసుకుంటున్నారు మీ నాన్న" అంది మా ఆవిడ, తనేదో మహాసత్యం మొట్ట మొదటి మాటగా కనిపెట్టినట్టు. నాకెప్పుడో తెలుసునయ్యె ఆ సంగతి. లేకపోతే ఈ పెళ్ళి మాత్రం జరిగుండేదీ! మొదట ఇష్టం లేదన్నానే. ఆ అమ్మాయే. ఇప్పుడిష్టమే. ఎలా మారిపొయానా? ఒరే, పిచ్చి ప్రశ్న వెయ్యకు. పెళ్ళామంటే అందరికీ ఎలా ప్రేమ పుట్టుకొస్తుందో, నాకూ అలానే. వొరేయ్ కాస్సేపు నీ కుళ్ళంకలు కట్టేసి, విను, ఏం చెబుతున్నానూ? మా నాన్న అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటు న్నాడని మా ఆవిడ అంది కదూ.
"అవును. ఆ సంగతి నా కెప్పుడో తెలుసు" అన్నాను.
"అనవసర జోక్యం కలగజేసుకోవద్దని చెప్పండి" అంది.
"నేనే? మా నాన్నతోటే ? కరుస్తాడు."
"కరవడానికి కుక్కా ఏమిటండీ, మనిషేగా?"
"నీకేం నువ్వేమైనా చెబుతావు, ఎదట పడేది నువ్వా నేనా?"
"ఏమిట్రా గదిలో గుసగుసలు, లేచి రమ్మంటేను" గుండెలు అదిరిపోయే లాగ నాన్న కేక. ఎదిగి, పెళ్లాంతో కాపురం చేస్తున్న కొడుకుని అనవలసిన మాటే ? 'నాన్నగారూ, ఇలా నాతో మాట్లాడ్డానికి వీల్లేదు. మా ఆవిడ వింటూంటే నామీద అధారిటీ చెలాయించడానికి వీల్లేదు' అని లేచి చెప్పేద్దామనుకున్నాను. కాని నేను ఊరికే లేచిపోతున్నాననుకుంది కాబోలు మా ఆవిడ, నే లేవకుండా అదిమిపెట్టి "ఆయనకి తల నొప్పిగా ఉందండీ, లేవ లేకుండా వున్నారు" అని జవాబు చెప్పింది.
"అజీర్తి తిళ్ళు తింటే తల నొప్పి రాకేంజేస్తుంది !"
"నిన్న రాత్రి తిన్నగా భోం చెయ్యనే లేదు."
"సాయంకాలం టిఫిను మస్తుగా తింటే రాత్రి భోజన మెందుకు !"
"ఏ తల నొప్పయినా, లేచి వొళ్ళువొంచి పని చేస్తే అదే పోతుంది"
"అది పోతేగాని లేవడానికి ఓపికరాదు. లేస్తే తల తిరుగుతుంది"
మా నాన్న వెనక్కి తగ్గాడు.
"తల తిరుగుతోందీ? జ్వర మొచ్చిందేమో చూడనీ" అని మా అమ్మ కేకెట్టింది.
"జ్వరం లేదులెండి"
"అన్నీ తెలిసినట్టు మాట్లాడతావేమిటి ? వొళ్ళు చూడనీ"
"నే చూసే చెబుతున్నాను. చల్లగానే వుంది”
"మా అబ్బాయి సంగతి నీకు తెలీదు. పైకి చల్లగా వున్నా ఒక్కొక్కప్పుడు ఉష్ణం వుంటుంది.”
"దానికి ముసుగెట్టుకు పడుకోడమే మందు"
"శొంఠి కొమ్ము అరగదీసి పెడితే రెండు నిమిషాల్లో తలనొప్పి పోతుంది".
"ఆ నాటు వైద్యపు రోజులు పోయాయి, ఇప్పుడు అంజనాలకి, ఆస్పిరిన్లకీ గాని లొంగడం లేదు ఈ తలనొప్పులు."
మాటకి మాట జవాబు చెబుతూ పావుగంట దాకా మా ఆవిడ తను గదిలో నుండి కదల్లేదు, నన్ను కదలనివ్వలేదు. కొంత అయిన తరువాత "బద్ధకం బలిస్తే, తలనొప్పేగాదు, ఒళ్ళంతా నొప్పులు పుట్టుకొస్తాయి. లేచి మందన్నా మింగమను" అని నసుక్కుంటూ నాన్న జారుకున్నాడు.
"అన్నిటికీ అదే జవాబు చెబుతుంది కాని వీడి నోరు పెగలదే ?" అని గొణుక్కుంటూ చివరికి అమ్మ జారుకుంది. అలా మరో పావుగంట విశ్రాంతి తీసుకునిగాని మేం బయటపడలేదు తరువాత ఒకటి రెండు మార్లు మళ్ళీ మమ్మల్ని పెందరాళే లేపడానికి ప్రయత్నం చేశారు కాని, మనం కొరకబడలేదు. ఏమిటనుకున్నావురా, నిత్యానంద మంటే? మనకి కొంత మాట సాయం, వెనక దమ్ము వుండాలి గాని నే లేస్తే మనిషినిగాను. మా నాయనమ్మ బతికి వున్న రోజుల్లో, నీకు జ్ఞాపకం లేదూ, అప్పడాల పిండి మాష్టారుక్కూడా నేనంటే హడలు పుట్టింది. అప్పడాల పిండి మాష్టార్నెరగవురా, గవర్రాజుగారి బడిలో రెండో మాష్టారు. చిన్నప్పుడెప్పుడో వాళ్ళమ్మ అప్పడాల పిండి కలిపి పెట్టుకుంటే, దబ్బకాయంత ముద్ద ఎవరూ చూడకుండా ఎత్తుకు పోయి, స్వయంగా అంతా భక్షించేశాడుట. దాంతో నాలుగు రోజులు విరోచనాలు పట్టుకున్నాయట.
కలరా వచ్చిందేమోనని రెండు రోజులు మందులిప్పించిం తరవాత ఈ సంగతి బయటపెట్టాడుట. అంచేత వాళ్ళింట్లో వాళ్ళే అప్పడాల పిండి అని ఓ ముద్దు పేరెట్టుకున్నారుట. వాళ్ళ వాళ్లు పెట్టుకున్న పేరే గదా సంతోషంతో స్వీకరించగూడదూ ! ఆ మాట ఏ రూపంలో వినిపించినా వుడుక్కునేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు. పేంబెత్తంతో కాదురా, రూళ్ళ కర్రతో కొట్టేవాడు. ఎక్కాలు వల్లించమనడం తప్ప క్లాసులో చెప్పే పాఠం లేదు. దానికి తోడు వాడికి నత్తి కూడాను. బకాసురుడు అదేదో ఊరి మీదపడి అందర్నీ పీడించుకుతిన్నట్టు స్కూల్లో పిల్లల్నందర్నీ పీడించుకుతినే వాడు. కాని బకాసురుని ప్రాణానికి భీముడు తటస్థపడ్డాడు. అప్పడాల పిండి మాస్టారుకి ఏకు మేకై గుచ్చుకున్నాడు నిత్యానందం. ఎలా గంటావా? ఓనాడు మా నాయనమ్మంది "వొరే నిత్యానందం. అప్పడాలు ఎండబెట్టాను. కాకులు రాకుండా కాయరా అంది.
"కాకుల్నయితే కాస్తానుగాని, పిచ్చికల్ని పిలుస్తాను నాయనమ్మా" అన్నాను.
"వీపు చిట్లగొడితే బావురుమని ఏడుస్తావు కూడాను'' అన్నాడు మా నాన్న, మా నాన్నకి 'జోకులు' తెలిసేవి గావు. మా నాయనమ్మ మాత్రం 'నిత్తిగాడికి కవిత్వం చెప్పడ మొస్తుంది.' అని సంతోషించింది. ఉష్ ఉష్ అని కాకుల్ని కాసి అలిసిపోయి, ఆలశ్యంగా స్కూలుకెళితే మాస్టారు పట్టుకున్నాడు.
రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి
*సశేషం*
*నిత్యానందం - 4*
రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి
*నిత్యానందం గారి సాంసారిక విజయాలు - 2*
*ఎ.. ఎందుకింత ఆలశ్యమయింది"
"మాస్టారండీ మరేమోనండీ..."
"ని.. ని.. నీళ్ళు న.. న.. నమలకు"
"మా నాయనమ్మండి అప్పడాలు ఎండబెట్టి కాకుల్ని కాయమందండి. అంచేత ఆలశ్యమయి పోయిందండి."
"భ.. భ.. భడవా బె.. బ్బెంచెక్కు"
"నేనేం చెయ్యలేదండి మాస్టారూ. మా నాయనమ్మే అప్పడాలు ఎండబెట్టి కాపలా వుండమందండి. మా ఇంట్లో కాకులు చాలా ఎక్కువ. కాపలా కాయకపోతే అప్పడాలు బతకనివ్వవు."
"పు.. పుండాకోర్ గొ.. గ్గోడ కుర్చీ వెయ్యి."
"తప్పంతా కాకుల్దండి. నాది కాదండి"
"వీపు చి.. చీరేస్తాను ఒ.. ఒళ్లు ఉతికేస్తా ను". అసలు మాట వినిపించుకోడు. ఒకటే ధుమధుమ.
"చె.. చెయ్యిపట్టు" అరిచెయ్యి వెనక్కి తిప్పి రూళ్ళకర్రతో ముడికలమీద వాయించాడు.
"మా నాయనమ్మతో చెబుతానుండండి'' అని ఏడుచుకుంటూనే స్కూల్లోంచి పారిపోయాను. నాయనమ్మ రెట్టింపు పటిక బెల్లం పెడితేగాని, ఏడుపు మానలేక పోయాను..
"నే నింక ఆ స్కూల్లో చదువుకోను నాయనమ్మా. మరో స్కూల్లో చేర్చేసెయ్యి !"
"వెర్రి నాన్నా, అద్దాంతరంగా ఇంకో స్కూల్లో ఎలా చేర్చుకుంటార్రా..."
"నువ్వు చెబితే చేర్చుకుంటారు"
"ఏడాది మధ్యలో నే చెప్పినా చేర్చుకోరురా"
"అయితే ఈ ఏడు చదువు మానేస్తాను. అప్పడాల పిండిగాడు నన్ను కొట్టి చంపుతున్నాడు. వాడిదగ్గర నే చదువుకోను"
"కొట్టొద్దని నే చెబుతానులే”
"వాడూరికే వుడుక్కుంటాడు. అనవసరం గా దంచుతాడు. చెప్పే పాఠాలు తక్కువ. కొట్టే దెబ్బ లెక్కువ.”
''నీ జోలికి రావొద్దని నే చెబుతాగా”
“మెల్లిగా చెబితే లాభం లేదు.”
"గట్టిగానే చెబుతాలే, వెళ్ళు"
"నువ్వొచ్చి దిగబెడితేనేగాని వెళ్ళను”
పది నిమిషాలు బేరమాడిన తరువాత, మళ్ళీ కసింత పటికబెల్లం పెట్టి నాయనమ్మ కర్ర పొడుచుకుంటూ నాతో స్కూలు కొచ్చింది. నాయనమ్మ ఇంట్లో నడవడానికి కర్రసాయం అక్కర్లేదుగాని, రోడ్డు మీద నడవాలంటే కర్ర చేతిలో వుండాలి. కుక్కల్నీ పందుల్నీ ఝడిపించడానికి. తిన్నగా క్లాసులోకే వెళ్ళిపోయాం.
"నాలుగు మూళ్ పన్నెండు. నాలుగు నాళ్ పదహారు" అని క్లాసంతా అరుస్తున్నారు. అప్పడాల పిండి వెంకన్నబుగ్గలు నులుము తున్నాడు. నన్నూ, మా నాయనమ్మనీ చూడగానే క్లాసంతా నిశ్శబ్దమైపోయింది. అప్పడాల పిండి నాకేసి పెద్దగా గుడ్లురిమి చూశాడు. నాయనమ్మ వెనకాలుంటే నాకేం లెక్క! పో పో, చూసుకో అనుకున్నా.
"ఏమయ్యా, ఎందుకయ్యా పిల్లల్ని అలా కొట్టి చంపుతావు" అంది నాయనమ్మ. రూళ్ళకర్రతో వేళ్ళ మీద కొట్టావట, మా వెర్రి నాగమ్మని!"
"అల్లరి చె..చేస్తే పనిష్ మెంట్ ఇ.. ఇవ్వద్దా"
"పిర్రమీద దెబ్బకి ఫిర్యాదు లేదుగాని, వేళ్ళ మీద కొడితే వూరుకుంటారుటయ్యా. అయినా మా వాడిప్పుడు ఏం అల్లరి చేశాడని కొట్టినట్టు"
దానికి జవాబు చెప్పగలిగితేనా. గుడ్లు మిటకరించి చూశాడు మాష్టరు.
"నాయనమ్మా, నువ్వు అప్పడా లెండబెట్టి నన్ను కాకుల్ని కాయమన్నావా. ఎందుకాలిశ్యంగా వచ్చావని అడిగితే మాస్టారూ, 'మా నాయనమ్మ అప్పడాలు ఎండబెట్టి కాకులెత్తుకుపోకుండా కాయ మంది" అన్నాను, అంతే. అప్పడాలు అనగానే ఆయనకి కోపమొచ్చింది. నువ్వే చెప్పు అప్పడాలు అన్నాను గాని అప్పడాల పిండి అన్లేదుగా, ఇందులో నా తప్పేమన్నా వుందా?'' అన్నాను.
"అయ్యో, అప్పడాల పిండీ. ఇన్నేళ్ళొచ్చినా ఇంకా ఉడుక్కుంటూనే ఉన్నావుటయ్యా''
"ఏమండోయ్ బామ్మగారూ, పెద్దవారని మర్యాదగా ఊరుకుంటే” అప్పడాల పిండి గుడ్లెర్రజేశాడు. నాయనమ్మ ఝడుస్తుందా!
"ఉడుకుడుకు బోలే" అంది. క్లాసంతా గొల్లుమన్నారు. ఏం జేస్తాడు? ఆయన చేతిలో రూళ్ళకర్రయితే, మా నాయనమ్మ చేతిలో పెద్ద కర్ర. మా నాయనమ్మతో చాల్లేడుగా.
"మావాడి జోలికి ఇంకెప్పుడూ రాకు. వాడి వల్లెమన్నా తప్పు వుంటే నాతో చెప్పు. నే కేకలేస్తాను" అని కట్టడిచేసివెళ్ళిపోయింది. ఆ తరవాత, మాస్టారుకి నాయనమ్మ, మనమంటే హడల్.
ఇప్పుడు మా ఆవిడ వల్ల మన అథారిటీ మళ్ళీ లేచిపోయింది. మొదటి విజయం నిత్యానందంగారు ఇష్టమొచ్చినంతసేపూ విశ్రాంతి తీసుకోవచ్చును. వారిని లెమ్మని వొత్తిడి చెయ్యడానికి ఎవరికీ అధికారం లేదు. ఎవరైనా ఆ విషయం గుర్తించక ఒత్తిడి చేసినా, నిత్యానందం గారు ఖాతరు చెయ్యరు. హాయిగా నిద్రపోతారు. నిద్ర పట్టకపోతే కళ్ళు తెరిచే నడుం వాలుస్తారు. లేదా, పక్కమీద పడుకుని, అటూ ఇటూ దొర్లుతారు. కాని, లేవరు. అదే విధంగా నక్షత్రకుడి బాధా వదిలిపోయింది. మా పెళ్ళయిం తరువాత వాడిపోరు భరించడం మరీ దుర్భరమయింది. నాకే కాదు, మా ఆవిడకి కూడా సలహాలివ్వడం ప్రారంభించాడు. - బోడి సలహాలు. మా పెళ్ళి తన వల్లే జరిగిందిట. వెయ్యి అబద్ధా లాడి ఇల్లు నిలబెట్టాలన్న సామెత పట్టుకుని ఎంతో కష్టపడి, ఈ సంబంధం కుదిర్చాడుట. అంచేత మా సంసారం దిద్దడానికి తనేవో బోలెడు హక్కులు దాచి పెట్టుకున్నట్టు అన్ని విషయాల్లోనూ
లుడుంగున జొరబడి చెప్పొచ్చేవాడు.
"ఏమిటోయ్ నిత్యానందం. మీ అమ్మగారు గోలెట్టి పోతున్నారు. ఆవిడొచ్చిందగ్గిర్నించీ అమ్మగారి మాట అసలే వినడంలేదుట. మీఅమ్మ నీమీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎప్పుడు కోడలొస్తుందా, ఎప్పుడు సుఖ పెడుతుందా అని ఎదురు చూసింది. కాని చిన్న మెత్తు సాయం చెయ్యదుట నీ పెళ్ళాం. ఎక్కడ కందిపోతుందో అని అన్ని టికి వెనకేసుకొస్తావుట. మా అందరికీ పెళ్ళిళ్ళవలేదా? పెళ్ళాలు కాపరానికి రాలేదా? తప్పు సుమా. పెళ్ళాన్ని అదుపులో ఉంచుకోవాలి. అతి చనువిచ్చి ముద్దుచేస్తే ముక్కట్టుకుంటారు. 'తల్లి విష మాయె, పెళ్ళాము బెల్లమాయే' అవకూడదు"
మనవాడి ఉపన్యాసాలు వినే రోజులు పోయాయి. 'ఈ గోడలకీ ఆ స్తంభాలకి చెప్పుకో' అని వాడు ప్రారంభించగానే చల్లగా జారిపోయేవాడిని.
"చూడు సుబ్బమ్మా" అని మా ఆవిడ దగ్గిర ప్రవేశించేవాడు. "నీ పెళ్ళి చేయించిన వాడిని కనక, నీ మంచి కోరినవాడిని కనక, చెబుతున్నాను" అని ప్రతి మాటూ ఉపోద్ఘాతం. ''మా పెళ్ళి చేయించింది పురోహితుడయ్యా, నువ్వు కాదు" అందామనుకునే వాడిని. అత్తగారికి అణుకువగా వుండాలి. గుట్టుగా సంసారం దిద్దుకోవాలి.”
"అవునండి అబద్దాలాడ కూడదు. దైవభక్తి కలిగి వుండాలి. పెద్దల మాట ధిక్కరించ రాదు. ఇంకా చాలా నీతులు స్కూల్లోనే నేర్చుకున్నానండి." అని మా ఆవిడ జవాబు. ఏ మాత్రం బుద్ధున్న వాడయినా దాంతో వెనక్కి తగ్గవలసిందేనా... కాని వాడికి సున్నితంగా చెబితే అర్థంకాదుగా. అలా నీతులు చెబుతూనే ఉన్నాడు-సల హాలు ఇస్తూనే ఉన్నాడు...
🤠
*సశేషం*
꧁☆•┉┅
*నిత్యానందం -5*
*నిత్యానందం గారి సాంసారిక విజయాలు - 3*
"నీకే ఓ కొడుకున్నాడనుకో. వాడు పెద్ద వాడయినాక పెళ్ళి చేశావనుకో. కోడలు ఇంటికి కాపరానికొచ్చి నువ్వు చెప్పినమాట సుతరామూ వినలేదనుకో. అప్పుడు నీకెలా ఉంటుంది. ఆలోచించుకో''
మా ఆవిడ కింకా నెలలన్నా తప్పలేదు. వాడు అనుకోమన్నవన్నీ ఆలోచించుకుంటే బుర్ర గిరగిర తిరిగిపోదూ. మా ఆవిడ విసిగిపోయిందంటే తప్పా, విని విని చివరికి ఓనాడు మా ఆవిడంది...
"నక్షత్రకుడుగారూ, నాదో చిన్న కోరిక''
ఆ పేరు వినగానే వాడు బిక్కచచ్చి పోయాడనుకో. ఇన్ని రోజుల్నించీ వాడికి పేరంటే పెట్టాముగాని, ఎదటబడి ఆ పేరెట్టి ఎప్పుడూ వాణ్ణి పిలవలేదు.
"నక్షత్రకుడుగారూ, మా ఇంటి నుంచి
వీసెడు జీడిపప్పుపాకం తెప్పించి పెడతాను గాని, మాకు సలహాలివ్వడం మానుకుంటారూ?" దాంతో వాడి పై ప్రాణం పైన పోయింది. మొహం పాలిపోయింది. నిజమే, నలుపు మనిషి కనక ఎంత పాలి పోయినా, మొహంలో కనిపించదనుకో. కాని వాడి వాలకం చూస్తే పాలిపోయినట్టు తెలిసిపోయింది. వుండరా! చొప్పదంటు ప్రశ్నవేసి చంపొద్దని చెబితే వినిపించుకోవే మిట్రా? మా ఆవిడ ఇంత గట్టిదని తెలిసుం టే ఈ పెళ్ళి రికమెండు చేసే వుండనని, అమ్మతోటో, ఇంకా ఎవరితోటో చెప్పుకు ఏడ్చాడుట.
"ఏడవకు ఏడవకు వెర్రి నాగమ్మ, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు గారు" అని ఓదారుద్దామను కున్నాగాని, మన వేళాకోళం అర్థంగాక, తిరిగి తగులుకుంటాడేమోనని కిక్కురు మనకుండా వూరుకున్నా. పర్యవసానం, మా జోలికి రావడం మానుకున్నాడు.
నక్షత్రకుడి నోరు మూయిస్తే బాగానే వుంది గాని, నా స్నేహితుల్ని కూడా ఝడిపించి నే వాళ్ళని కలుసుకోనివ్వకుండా చేస్తోందిరా ! ముఖ్యంగా బండరాముణ్ణి. బండరాముడు నీకు తెలుసుగా. ఒకటో క్లాసు నించి నేనూ వాడూ స్నేహితులం. నేను స్కూలుకెళ్ళనని మారాము పెడుతూ వుంటే వాణ్ణి మచ్చిక చేసి, సాయమిచ్చి స్కూలుకి పంపించింది నాయనమ్మ. నేనంటే వాడికి తగని ఇష్టం. నామీద ఈగ వాలనిచ్చేవాడు కాదు. అప్పుడప్పుడు నే చేసిన అల్లరికి, వాడు కిక్కురు మనకుండా దెబ్బలు తిన్నాడు కూడాను. బండ వెధవైనా, బుద్ధిమంతుడ ని నాయనమ్మే సర్టిఫికెట్ ఇచ్చింది. మాట మోటు అనుకో, మా ఆవిడ దగ్గర జాగర్తగా వుండాలని వాడికి తెలియొద్దూ.
ఓనాడేం చేశాడంటే, రోడ్డు మీద నించుని, “ఒరే నిత్యానందం పెళ్ళయిందగ్గిర్నించి నీ దర్శనమే మాకు కరువయిపోయింది. పడక గది వదలడమే లేదు. ఈ పద్ధతిని పీనుగయిపోతావు జాగర్త. సరసాలు చాలించి, బయటకిరా' అని ఇంటి కప్పెగిరి పోయేలా అరిచాడు.
''ఎవరండోయ్ ఈ స్నేహితుడు ?" అంది.
"వాడా-బండ రాముడు !"
"పోకిరీ రాముడులా వున్నాడు"
"శుభమ్ ఆ టైటిల్ తో మరో సినిమా తీసి పారెయ్యొచ్చు. మాటలు నువ్వూ, పాటలు నేనూ రాసేద్దాం" అన్నాను. మా ఆవిడ మెత్తబడబోయింది కాని ఇంతలోనే “ఓరేయ్ బయటి కొస్తావా, ఇంట్లో చొరబడి ఈడ్చుకు రమ్మంటావా'' అని వాడు మళ్ళీ అరిచాడు. వాడికి ఆవేశమొస్తే వొళ్లూ పై తెలీదు. అన్నంత పనీ చేసేస్తాడు. ఎవడో సవాలు చేశాడని ఈత రాకుండనే కాలవ లోకి ఉరికాడు. వుషారిస్తే, తాటిచెట్టు మీదకి పాకిపోయాడు. చచ్చినంత పని అయేదనుకో! అందుకే బండరాముడని బిరుదొచ్చింది. వాణ్ణి కవ్వించడం కొరివితో తల గోక్కోడం.
"క్యా బాత్ హై. ఆడంగులంటే మనకేం భయం లేదురోయ్. రమ్మంటావా లోపలికి,” అన్నాడు.
“వొద్దు నేనే వస్తున్నారా. నువ్వు లోపలికి జొరబడకు'' అని ఆపేశాను.
“ఇలాటి వెధవల్తో మీకు స్నేహ మేమిటండీ" అంది మా ఆవిడ. మా స్నేహం యొక్క హిస్టరీ, జాగర్ఫీలు చెప్పాను. చివరికి ఈ మాటుకి మాత్రం వెళ్ళనిస్తున్నాని వదిలి పెట్టింది.
"పోకిరీ వెధవల్తో స్నేహం కూడదు చెడిపో తారంటుంది. ఇదివరకు రోజూ కలుసుకునే వాళ్ళం. ఇన్నాళ్లూ చెడిపోనిది, ఇహ ముందు మాత్రం ఎందుకు చెడిపోతాను అంటే వినదు. ఇప్పటికే చెడిపోలేదని గ్యారంటీ ఏమిటంటుంది! ఒక్కొక్కప్పుడు మహ మూర్ఖపు పట్టుబడుతుంది. ఆడవాళ్ళంతా, ముఖ్యంగా పెళ్ళాలంతా అంతేనా. అలాటప్పుడేం చెయ్యాలిరా. దంచాలా ? ఏడిశావులే. పిచ్చి సలహాలు చెప్పకు. మా ఆవిడంటే ఇప్పుడు నాకు చాలా ఇష్టంరా ! ఆవిడొచ్చిన తరవాత మనకింట్లో చాలా సౌకర్యాలు ఏర్పడ్డాయి. అంచేత అప్పుడప్పుడు నాకు వళ్లు రవరవ మండిపోయి డొక్క నాలికలు చీరేద్దామ న్నంత కోపమొచ్చినా కొట్టడానికి చేతులు లేవవు. మనకే ఎదురు తగులుతాయేమో నన్న భయమేమోనంటావా. పోరా. అలాటప్పుడు ఏం చెయ్యమంటావురా... అయితే బతిమాలుకోమంటావా! వొరేయ్ నే అదే చేస్తున్నారా! ఎలాగో అలాగ నా మాట నెగ్గుకొస్తూనే వుంది, భయాన సాధించినా, నయాన సాధించినా విజయం విజయమే కదురా! ఎందుకురా ఆ నవ్వు? పో, నీ పారపళ్లే బయట పడతాయి, నాకేం!
📖
*నిత్యానందంగారి విజ్ఞాన యాత్ర -1*
😎
కనిపించిన శుంఠల్లా, ఏమండోయ్ నిత్యానందంగారూ, ఎంతవర కొచ్చింది. మీ విజ్ఞానయాత్ర అని అడిగేవాళ్ళే, దిష్టి తగలక ఏం చేస్తుంది. పురిట్లోనే సంధి కొట్టింది. అదేమిటంటా? మొదట్నించీ చెబుతాను విను.
ఓనాడు నేమా, రంగాచారీ, మస్తాన్, సుభాష్ చంద్రబోసూ, చంద్రరావూ మా ఇంటి అరుగుమీద కూర్చుని బాతాఖానీ కొడుతున్నాము. అసలు ఎప్పుడూ వొంతెన గట్టుమీద కూచుని బాతాఖానీ వేసేవాళ్ళం. మా ఆవిడ తగాదా పెడితే, మా ఇంటి అరుగుమీదికి మార్చాము, ఇదీ మానుకోమని మా ఆవిడ పేచీ పెడుతోంద నుకోండి. అయినా ఎలాగో సముదాయించి వారానికోమాటైనా కలుసుకుంటున్నాము. మాటల సందర్భంలో నేనన్నాను. 'వొరేయ్ మనం మరీ వేసిన గొంగళీల్లా అయిపోతు న్నాం రా. దేశాటనం చేస్తే జ్ఞానం వృద్ధి అవుతుందంటారు. మనం ఓమాటు దేశ సంచారానికి బయటదేరాలిరా.'
“నాకూ అదే అనిపిస్తోందిరా" అన్నాడు చంద్రరావు.
"ఏడిశావు. నాకు అనిపించినప్పుడే నీకూ అనిపించిందేం"
“నిజం. ఇవాళే ఓ ప్రకటన చదువుతూ వుంటే అనిపించింది."
"ఏమిట్రా ఆ ప్రకటన ?''
"ఇదిగో వినండి...''మంచిసమయము, మించిన దొరకదు. త్వరపడుడు, త్వరపడుడు. కన్యాకుమారి నించి బదరీ నాథము వరకూ పుణ్యక్షేత్రముల దర్శించి తరించండి. చవక, అతిచనక కన్నుల పండువైన సుందరదృశ్యాలు. పుష్టికరమైన భోజనాలు, రాఘవరావుగారి సంపూర్ణ యాత్రా స్పెషల్. కడుపులో చల్ల కదలకుండా ప్రయాణం చెయ్యండి. పుణ్య మార్జించుకోండి. చవక, అతి చవక. మడిగా ప్రయాణం చెయ్యదలచిన వారికి ప్రత్యేక సౌకర్యాలు. త్వరపడుడు. రాఘవరావుగారి సంపూర్ణ యాత్రాస్పెషల్. కొద్ది టిక్కట్లే మిగిలాయి."
ఇది చదివినప్పుడే నాకూ ఆ బుద్ధిపుట్టింది. మనం కూడా బయలుదేరితే సరి." అన్నాడు చంద్రరావు.
*సశేషం*
꧁☆•
*నిత్యానందం -6*
రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి
*నిత్యానందం గారి సాంసారిక విజయాలు - 4*
ఇది చదివినప్పుడే నాకూ ఆ బుద్ధి పుట్టింది. మనం కూడా బయలుదేరితే సరి." అన్నాడు చంద్రరావు.
"ప్రకటల్ని చూసి మోసపోకూడదు" అన్నాడు సుభాష్ చంద్రబోసు. ఓ సంవత్సరం క్రితం పదిరూపాయలు పెట్టి వాడో రిస్టు వాచీ కొన్నాడు, కొండ మీద నించి ఎత్తేసినా, సముద్రంలో ముంచేసినా అది పాడవదనీ, ఆగదనీ పేపర్లో గ్యారంటీ చూసి! బ్రహ్మాండ మైన వాచీ చవగ్గా వచ్చేస్తోందని మురిసిపోయి కొనేశాడు, వద్దని మేం హెచ్చరిస్తున్నా వినకుండా కొనేశాడు. అది పన్నెండు గంటలన్నా తిరక్కుండా ఆగిపోయింది. కొండమీద నించి ఎత్తేసినప్పుడు ఆగిపోతేనే మేము బాగుచేస్తాం కాని ఇంట్లో కూర్చుని చేతికి పెట్టుకున్నప్పుడు తిరగడం మానేస్తే బాగుచేస్తామన్న గ్యారంటీ లేదంటుంది
కంపెనీ, వీడింకా కంపెనీకి ఉత్తరాలు వ్రాస్తూనే వున్నాడు - వాళ్లు జవాబులు వ్రాయడం మానుకున్నా !
"భయపడకురా. అందరూ నీలాగే పప్పులో కాలేస్తామనుకున్నావురా! వివరాలన్నీ తెలుసుకునే డిసైడ్ చేస్తాం. ఏమయినా
గోల్డెన్ ఆపర్చునిటీలా వుంది. వదులుకో కూడదు.'' అన్నాడు చంద్రరావు.
"పధ్నాలుగు కారట్ల గోల్డెన్ అపర్చూనిటీ" అన్నాడు రంగాచారి.
"కారక్టర్లు కాదురా, కారట్లు" అన్నాను.
“ఏడిశావు. మహ తెలిసినవాడిలా మాట్టాడకు. కారట్ అంటే ఇంగ్లీషు కూర. పచ్చిది కూడా తినచ్చు. అదెందుకు ఉంటుంది" అన్నాడు రంగాచారి. వాడికి వాదించడమంటే చాలా ఇష్టం. ప్రతిదానికీ ఎడ్డెమంటే తెడ్డెమంటాడు. పెడర్థాలు తీస్తాడు.
కారట్లు బంగారంలో కాదు. పులుసులో వుండొచ్చును" అన్నాడు.
“కారక్టర్ మనుష్యులకుంటుందిగాని, బంగారానికి కారక్టరేమిటి ?"
"కల్తీ బంగారానికి కారక్టర్ తక్కువన్న మాట"
"నాన్సెన్సు బంగారానికి వుండేది కారటే"
"గోన్ సంచి. బంగారానికి వుండేది కారక్టరే''
"కాదు"
"అవును"
"కా... దు"
"అ...వు... ను!"
"ఛాలెంజి. మా ఆవిడని అడుగుదామా”
"మీ ఆవిడ అధారిటీ నీమీద గాని నాకేమిట్రా, ఛాలెంజి పిలు చూద్దాం'' అన్నాడు రంగాచారి.
"వొద్దు బాబో వొద్దు. ఆవిడతో వాదించి గెలవడానికి నీ ముత్తాతలు దిగి రావాలి. అసలు ఆడంగులకి ఇందులో ప్రమేయం లేదు.'' అన్నాడు సుభాష్ చంద్రబోసు.
"నేతాజీ పేరెట్టుకునిగూడా ఆడంగులంటే డంగెత్తిపోతాడేం వీడు" అన్నాడు రంగాచారి.
''సుబ్బాయమ్మగారి కొంగు పట్టుకుని వాదనలోదిగే నిత్యానందం శిఖండిని ముందెట్టుకు కదనరంగంలో ఉరికిన భీష్మాచార్యుడు! వాడిని జయించడం ఎవరికి తరంగాదు. వెనక్కితగ్గు" అన్నాడు చంద్రరావు.
"శిఖండిని ముందెట్టుకున్నది భీష్మాచార్యులురా ! ఆయన్ని చంపడానికి అర్జునుడు శిఖండిని ముందెట్టుకున్నాడు'' అన్నాడు. మస్తాన్ సాయిబు.
"అందుకే కలికాలం. సాయిబుకి తెలిసిన పాటి పురాణాలు మనకి తెలియకుండా పోయాయి" అన్నాడు సుభాష్ చంద్రబోసు.
"నీ పురాణజ్ఞానం ఏడిసినట్టుంటే. నీ ఉపమానం అఘోరించినట్టుంది. సుబ్బాయమ్మగారిని శిఖండితో పోల్చిన వైనం అవిడగారి చెవినిబడితే మనకి ఉద్వాసనం" అన్నాడు మస్తాన్.
సాయిబైనా, ఫస్టు మార్కులు తెలుగులో ఎప్పుడూ వాడివే!
“నోరుమూసుకోండిరా. మా ఆవిడ సంగతెత్తకండి" అన్నాను.
"అదే నేనూ ఇస్తున్న సలహా" అన్నాడు మస్తాన్.
"సాయిబు సలహాలు బోడిసలహాలు. మరోలా వుండడానికి వీలులేదు" అన్నాడు రంగాచారి.
"పంగనామం పెట్టే సలహాలు ఆచార్లవి" అన్నాడు మస్తాన్.
"గుండులేని సాయిబువి నువ్వూ, నామం లేని ఆచార్లు వాడూ ఇద్దరూ కూడా ట్రేడ్ మార్కు లేని మనుష్యులు. ఆ మార్కు లేని వస్తువులకి విలువలేదు. మీ సలహాలకీ విలువలేదు!" అన్నాడు చంద్రరావు.
"పంచపాండవులంటే నేనెరగనా. మంచం కోళ్ళలా ముగ్గురే కాదా అనేవాడివి నీకు వేరే ట్రేడుమార్కు అక్కర్లేదు. మైలు దూరం కంపుకొట్టే కల్తీ నెయ్యిలాటిది నీ సలహా! దానికి దూరం నించే నమస్కారబాణం విసిరెయ్యాలి" అన్నాడు రంగాచారి.
"అదే విధంగా సుబ్బాయమ్మగారికీ దూరం నించే ఒక నమస్కారం చేసి ఊరుకుంటేనే బతికిపోతాం" అన్నాడు సుభాష్.
"విశ్వాసఘాతకుల్లారా ! తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే మనుష్యుల్లారా, మా ఇంటి అరుగుమీద కూర్చునే మా ఆవిడని మాటలంటుంటారురా" అన్నాను. కోపమొచ్చిందేమో, కొంచెం గట్టిగా అరిచినట్టున్నాను.
"ఏమండి. ఓ మాటిలారండి" అని లోపల నించి మా ఆవిడ కేక వినిపించింది.
"శ్రీమద్రమారమణ గోవిందో హరి" అన్నాడు ఆచారి.
తినవలసిన చీవాట్లేమిటో కిక్కురుమన కుండా త్వరగా తినేసి వచ్చెయ్యి" అని సలహా ఇచ్చాడు సుభాష్.
"అవునవును. మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు" అన్నారు. జవాబు చెబితే మొహం మరికొంచెం వాస్తుంది. ఈ చెవి లోంచి విని, ఆ చెవిలోంచి వదిలేసి త్వరగా వచ్చెయ్యి" అన్నాడు చంద్రరావు.
"ఆరునెల్లయి కాపరం చేస్తున్నాడు. వాడికన్నీ తెలుసులెండిరా వెళ్ళిరా నాయనా, వెళ్ళిరా" అన్నాడు మస్తాన్.
"గప్ చిప్. అందరూ షటప్" అన్నాను.
"అర్జెంటుగా రండి" అని మళ్ళీ మా ఆవిడ లోపలి నుండి కేక.
భయంలేదని ఎంత ధైర్యం చెప్పుకున్నా గుండెలు గుభీ గుభీ మని కొట్టుకోడం ప్రారంభించాయి. మా మాటలు విని పిలిస్తే సముదాయించడం కష్టమే. అల్లరిమూకను ఇంట్లో చేర్చొద్దని ఎప్పుడూ నాకు బుద్ధి చెబుతూనే వుంటుంది. నోరు దగ్గిర పెట్టుకుని మాట్లాడండిరా అంటే వాళ్ళకి బుద్దిలేదు. మధ్య నాకు ప్రాణసంకటం. పెద్దపులిలా బయలుదేర్దామనుకున్నాను, కాని పిల్లి పిల్లలా అడుగులు పడ్డాయి...
😆
*సశేషం*
꧁☆•┉
*నిత్యానందం -7*
🤥
రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి
*నిత్యానందంగారి విజ్ఞాన యాత్ర -2*
“పాతాళించిన శనగలున్నాయి తినండి” అంది మా ఆవిడ.
“శనగలు తినడానికా పిలిచావు”.
“ఏం ? మీకిష్టమేగా”
అమ్మయ్య ! ప్రాణం కుదటబడింది.
“ఇష్టమే, వాళ్ళందరూ వుండగా...”
“మరేం పరవాలేదు. తినేసి నీళ్ళు తాగెయ్యండి”
మా వాళ్ళందరూ డింకీ తినేశారు. మా ఆవిడ చీవాట్లు పెడుతుందనుకున్నారు, పాతాళించిన శనగలు పెట్టింది. శ్రావణ మంగళవారంనాడు పేరంటానికెళ్ళి తీసుకొచ్చిన శనగలు. చాలా రుచిగా వున్నాయి. గబగబ బొక్కెయ్యడం ప్రారంభించాను. "శనగలు నమలకుండా మింగెయ్యకండి. రాత్రంతా కడుపునెప్పితో బాధపడాలి. అవతల ముంచుకొచ్చిన పనేంలేదు. సావకాశంగా కూర్చొని నమిలితినండి." అంది.
కసిరినట్టు మాట్లాడుతుందిగాని మా ఆవిడకి నేనంటే చాలా ఇష్టమే నాకు కడుపునెప్పి రాకుండా చాలా సలహాలిస్తూ వుంటుంది.
📖
“వాళ్ళందరూ...”
“ఉంటే వున్నారు... అందరూ కలిసి చేసే పని గుడ్డిగుర్రానికి పళ్ళు తోమటమేగా."
"నో' నో... పనిలేని మంగలి చేస్తాం."
"క్షవరం ప్రారంభించారా పిల్లిని వెతికి పట్టుకోడంలోనే వున్నారా ఇంకా."
మా ఆవిడకి ఏదైనా చెబితే ఇట్టే అర్థమై పోతుంది. సరదాగా వున్నప్పుడు జోకుచేస్తే జవాబుతో జోకూ చేస్తుంది. మాటలు పెట్టుకు కూర్చుంటే అవతల మా వాళ్ళు తిట్టుకుంటారని జవాబు చెప్పకుండా త్వరత్వరగా తినేసి, మంచినీళ్ళు తాగి త్రేన్చేశాను.
"బాతాఖానీ త్వరగా తెమిల్చేసి ఇంట్లో పడండి" అంది మా ఆవిడ.
"మాది బాతాఖానీ కాదు. పూర్ణయాత్రా స్పెషల్లో దేశ సంచారానికి బైలుదేరుదా మని ప్లానులు వేస్తున్నాం."
"ఆ అల్లరిమూకతోటా?"
"తూముకట్టు మీద కూర్చుని బాతాఖానీ కొట్టినప్పుడు అల్లరి మూకగాని యాత్రా స్పెషల్లో ప్రయాణం చేసేటప్పుడు గొప్ప భక్తులుగా మారిపోతాం."
"మీరు వాళ్ళతో ఒక్కరూ వెళ్ళడానికి వీల్లేదు. నేనూ వస్తాను."
"నువ్వు కూడానా?"
"అవును"
"నువ్వెందుకు ?"
"మీరెందుకు ?"
"మొగాళ్ళందరమూ!"
"ఆ రైల్లో ఆడవాళ్ళుండరా ఏమిటి?"
"మా అల్లరిమూకతో.."
"అల్లరిమూకగాదు, గొప్ప భక్తులని మీరే అన్నారుగా.."
అన్నా, నామాట మీదే పట్టేసుకుందే. ఇహ వాదించి లాభంలేదు.
"అలాగేలే. మేం వెళ్ళితే నువ్యూ వద్దువు గాని" అని స్నేహితుల్ని చేరుకున్నాను.
"వొరేయ్, తల తడవనీ- ఎన్ని బొప్పెలు కట్టాయో" అన్నాడు రంగాచారి.
"ఆవిడింకా చెయ్యిచేసుకోడం దాకా రాలేదురా. కేకలేస్తుంది. బాగా చీవాట్లు తినిపిస్తుంది. మొహం ఎంత వాచిందో చూద్దాం" అన్నాడు మస్తాన్.
"నోరు ముయ్యండిరా. మనం తీర్థయాత్రల కి వెళితే తను కూడా వస్తానని చెప్పడానికి పిలిచింది. అంతే" అన్నాను. బాగుండదని పాతాళించిన శనగల సంగతి చెప్పలేదు.
"ఆడవాళ్ళతో ప్రయాణం పడదు" అన్నాడు సుభాష్.
పూర్ణయాత్రా స్పెషల్ నూటికి డెభ్బయి పైగా ఆడవాళ్ళుంటారు. అదీ ఒక ఎట్రాక్షన్" అన్నాడు చంద్రరావు.
"దాంట్లో ముప్పాతికమంది విధవలై వుంటారు. మడిగా భోజనాలున్నాయన్నా వు. బోడీ ఎట్రాక్షన్ జోరుగా వుంటుందన్న మాట. పుణ్యంలో మరో పుణ్యం. లేవగానే గుళ్ళ దర్శనం. శ్రీ మద్రమా రమణగోవిందో హరి!” అన్నాడు రంగాచారి.
"మా ఇంట్లో అరుగుమీద కూర్చున్నప్పుడు పోకీరీ మాటలు మాట్లాడకండి" అని కసిరాను.
"తీర్థయాత్ర ప్లాను నాకేం నచ్చలేదు. మనమేం పాపాలు చేశామా?” అన్నాడు సుభాష్.
“పాపాలు చేసిన తరవాతనే పుణ్యమార్జిం చాలని లేదురా. బ్యాంక్ లో డబ్బు నిలవ చేసుకున్నట్టు ముందుగానే పుణ్యమార్జిం చుకుని చిత్రగుప్తుడి దగ్గిర దాచుకోవచ్చు ను" అన్నాడు రంగాచారి.
"పుణ్యం మాట దేవుడెరుగును. దేశం తిరుగుతే జ్ఞానం పెరుగుతుంది" అన్నాను.
"అయితే తిన్నగా విజ్ఞానయాత్రకే బయలు దేరక డొంకతిరుగుడుగా తీర్థయాత్రల కెందుకు ?" అన్నాడు సుభాష్.
"ఒక్క రాయితో రెండు పిట్టల్ని కొట్టడానికి."
"రంగాచారి తీర్థయాత్రా స్పెషల్లో పిట్టల వేటంటే, ఆ రాయి తిరిగొచ్చి మనకే తగిలి, పళ్ళూడవచ్చు" అన్నాడు సుభాష్.
"ఈ మాటలు మా ఆవిడ వింటే ఇప్పుడే ఊడతాయి మీకు పళ్ళు"
"యాత్రలంటే నేను రాలేను" అన్నాడు మస్తాన్.
"నిజమేరోయ్. పూర్ణయాత్రా స్పెషల్ సాయిబుల్ని రానిస్తారో లేదో" అన్నాను.
“మస్తాన్ గాడు సాయబేమిటి? బొట్టు పెడితే బ్రాహ్మడే!" అన్నాడు చంద్రరావు.
"అవునవును."
"బొట్టు కట్టు గూర్చి పట్టింపు లెక్కువై
శైవ వైష్ణవులకు సమరమైయ్యే
ఒకడు సున్నియయ్యె
నొకడు షియాయయ్యె
విశ్వదాభిరామ వినుర వేమ !
అన్నారు కృష్ణ శాస్త్రిగారు.వీడు అలా సాయిబయిన బ్రాహ్మడే !" అన్నాడు రంగాచారి.
"వాడికి పులిహారంటే చాలా ఇష్టం. వైష్ణవం లోంచి జారినవాడే అనుకుంటాను" అన్నాడు సుభాష్.
"సందేహంలేదు. అడియేన్ దాసోహం. మస్తానాచార్లుగారు'' అన్నాడు చంద్రరావు.
"తీర్థయాత్రకంటే నేను రాను."
"మక్కా మదీనా, నీతో మేమూ వస్తాంరా. పులి వేషాల వెంట పీర్ల పంజాలకి మేమూ వొచ్చేవాళ్ళంగా"
“విజ్ఞానయాత్రకయితే నేనొస్తాగాని, తీర్థ యాత్రకయితే నేను రాను. "
"మాకూ యాత్రలక్కర్లేదు. విజ్ఞాన యాత్రకే బయలుదేరుదాం. టిక్కట్లేమున్నాయో కనుక్కుందాము."
😎
*సశేషం*
꧁