Saturday, 28 March 2020

sivoham

శివోహం

శ్రీరుద్రం - నమకం - చమకం - తాత్పర్య - ఆడియో... సహితం


రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి.


 యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘు రుద్రాభిషేకం'. 11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది. ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది. ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు పరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు.


మహాన్యాసము
నారుద్రో రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.

మరి ఈ మహాన్యాసము అంటే?
మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.

రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు  కలిగినది.
1. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు  కలది
2.  ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది
౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది
4. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది
5. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము  పంచాంగన్యాసము కలది

ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు. 



శ్రీరుద్రధ్యానమ్......

బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచో - భాసమానా భుజంగైః
కంఠేకాలాః కపర్దాకలిత శశికలా - శ్చండకోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరాః - శాంభవా మూర్తిభేదాః
రుద్రాః శ్రీ రుద్రసూక్తప్రకటిత విభవా - నః ప్రయచ్ఛంతు సౌఖ్యం


తాత్పర్యము:

 బ్రహ్మాండము నందంతటను వ్యాపించిన దేహము కలవారును, భస్మము చేత మంచుకాంతి వంటి దేహకాంతి కలవారును, సర్పములతో ప్రకాశించువారును, తమ కంఠములందు నలుపు వన్నె కలవారును, జటా ఝూటము నందు చంద్ర కళలు కలవారును, భయము గొలుపు ధనుస్సులు తమ హస్తములందు కలవారును, మూడు కన్నులు కలవారును, రుద్రాక్షలు తమ అలంకారములుగా కలవారును, తమ విషయమున ప్రణమిల్లిన వారి భయమును పోగొట్టువారును, పూజ్యమగు రుద్రసూక్త మంత్రములచే ప్రకాశింప జేయబడిన వైభవము కలవారును అగుచు శంభుని మూర్తి భేదములే అగు రుద్రులు మాకు సౌఖ్యమును కలిగింతురు గాక!


ప్రకారాంతరేణ శ్రీరుద్రధ్యానమ్
శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్


తాత్పర్యము:


 శుద్ధ స్పటికమువలె ప్రకాశించు వానిగా, మూడు కన్నులు, ఐదు ముఖములు, పది భుజములు కలవానిగా, సర్వాభరణములతో అలంకరించబడిన వానిగా, నీలకంఠముతో, చంద్రుని ఖండపు గుర్తుతో, సర్పపు యజ్ఞోపవీతము, నాగాభరణములు, పులిచర్మపు ఉత్తరీయము, హస్తములందు కమండలము, జపమాల, అభయము, వరదానము తెలిపే హస్త ముద్రలు, హస్తమునందు శూలము కలిగి ప్రజ్వలించుచు కపిల వర్ణము (ఎరుపు పసిమి కలిసిన) కళ జడలును, పైకి ఎత్తి కట్ట బడిన శిఖ కలిగి,  నంది వృషభపు మూపును ఆరోహించి దేహార్ధమున ఉమను కలిగి అమృతముతో తడిసిన వానిగా హర్షము, దివ్యభోగాములు కలిగి దిగ్దేవతలతో కూడి సురాసురుల నమస్కారములను అందుకొనువానిగా, నిత్యునిగా, శాశ్వతునిగా, శుద్దునిగా, సర్వవ్యాపియగు ఈశానునిగా సకల జగద్రూపునిగా రుద్రుని భావించి ధ్యానించ వలెను. 



రుద్రాధ్యాయములో (శ్రీ రుద్రం) నమకం-చమకం ముఖ్యమైనవి. 'నమ' తో అంతమయ్యే శ్లోకాలు నమకము గాను, 'చమే' తో అంతమయ్యే శ్లోకాలు చమకంగా చెప్పబడ్డాయి. ఇందులో నమకము రుద్రునికి భక్తుని ప్రార్థనగా, చమకము భక్తునికి రుద్రుని ఆశీర్వచనం గా చెప్పబడ్డాయి. ఈ నమక చమకాలు ఏ విధంగా పఠనం చేయాలి అన్నది చేసే రుద్ర విధిని బట్టి ( లఘు రుద్రం, మహా రుద్రం, అతి రుద్రం, శత రుద్రం ) ఉంటుంది.

శ్రీ రుద్ర ప్రశ్నః

కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహితా
చతుర్థం వైశ్వదేవం కాణ్డమ్ పఞ్చమః ప్రపాఠకః


నమకం
మొదటి అనువాకము:


ఓం నమో భగవతే’ రుద్రాయ || నమ’స్తే రుద్ర మన్యవ’ ఉతోత ఇష’వే నమః’ | నమ’స్తే అస్తు ధన్వ’నే బాహుభ్యా’ముత తే నమః’ | యా త ఇషుః’ శివత’మా శివం బభూవ’ తే ధనుః’ | శివా శ’రవ్యా’ యా తవ తయా’ నో రుద్ర మృడయ | యా తే’ రుద్ర శివా తనూరఘోరా‌உపా’పకాశినీ | తయా’ నస్తనువా శన్త’మయా గిరి’శంతాభిచా’కశీహి | యామిషుం’ గిరిశంత హస్తే బిభర్ష్యస్త’వే | శివాం గి’రిత్ర తాం కు’రు మా హిగ్‍మ్’సీః పురు’షం జగ’త్| శివేన వచ’సా త్వా గిరిశాచ్ఛా’వదామసి | యథా’ నః సర్వమిజ్జగ’దయక్ష్మగ్‍మ్ సుమనా అస’త్ | అధ్య’వోచదధివక్తా ప్ర’థమో దైవ్యో’ భిషక్ | అహీగ్’‍శ్చ సర్వాం”జమ్భయన్త్సర్వా”శ్చ యాతుధాన్యః’ | అసౌ యస్తామ్రో అ’రుణ ఉత బభ్రుః సు’మఙ్గళః’ | యే చేమాగ్‍మ్ రుద్రా అభితో’ దిక్షు శ్రితాః స’హస్రశో‌உవైషాగ్ం హేడ’ ఈమహే | అసౌ యో’‌உవసర్ప’తి నీల’గ్రీవో విలో’హితః | ఉతైనం’ గోపా అ’దృశన్-నదృ’శన్-నుదహార్యః’ | ఉతైనం విశ్వా’ భూతాని స దృష్టో మృ’డయాతి నః | నమో’ అస్తు నీల’గ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే” | అథో యే అ’స్య సత్వా’నో‌உహం తేభ్యో’‌உకరన్నమః’ | ప్రముం’చ ధన్వ’నస్-త్వముభయోరార్త్ని’ యోర్జ్యామ్ | యాశ్చ తే హస్త ఇష’వః పరా తా భ’గవో వప | అవతత్య ధనుస్త్వగ్‍మ్ సహ’స్రాక్ష శతే’షుధే | నిశీర్య’ శల్యానాం ముఖా’ శివో నః’ సుమనా’ భవ | విజ్యం ధనుః’ కపర్దినో విశ’ల్యో బాణ’వాగ్మ్ ఉత | అనే’శన్-నస్యేష’వ ఆభుర’స్య నిషఙ్గథిః’ | యా తే’ హేతిర్-మీ’డుష్టమ హస్తే’ బభూవ’ తే ధనుః’ | తయా‌உస్మాన్, విశ్వతస్-త్వమ’యక్ష్మయా పరి’బ్భుజ | నమ’స్తే అస్త్వాయుధాయానా’తతాయ ధృష్ణవే” | ఉభాభ్యా’ముత తే నమో’ బాహుభ్యాం తవ ధన్వ’నే | పరి’ తే ధన్వ’నో హేతిరస్మాన్-వృ’ణక్తు విశ్వతః’ | అథో య ఇ’షుధిస్తవారే అస్మన్నిధే’హి తమ్ || ౧ ||

శమ్భ’వే నమః’ | నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యమ్బకాయ’ త్రిపురాన్తకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’ నీలకణ్ఠాయ’ మృత్యుంజయాయ’ సర్వేశ్వ’రాయ’ సదాశివాయ’ శ్రీమన్-మహాదేవాయ నమః’ ||

తాత్పర్యము:


భగవంతుడైన రుద్రునికి నా నమస్కారములు. ఓ రుద్రా! నీ శరములకు, ధనుస్సుకు, బాహువులకు నమస్కారము. ఎంతో శుభకరమైన నీ అమ్ముల పొది, అస్త్ర శస్త్రముల్తో మాకు ఆనందాన్ని కలిగించు. వెండి కొండ పైనుండి మమ్మల్ని ఆనంద పరిచే ఓ రుద్రా! ఎంతో శాంతి కలిగిన, శుభకరమైన, పాపరహితమైన, మోక్షకరమైన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే నీ వీక్షణములను మా వైపు ప్రసరించు. మాకు ఆత్మ జ్ఞానాన్ని కలిగించు. ధవళగిరిపై కూర్చుని మాకు ఆనందము, ఉపశమనము కలిగించే, పాపులను నాశనం చేయటానికి పొందిన అస్త్రాలను శాంతింప చేయుము. నిన్ను కాన్చుటకు మేము నిన్ను స్తుతించి, నుతించు చున్నాము. ప్రసన్నుడవై మమ్ము, మా బంధువులను, గోవులను కాపాడి మాకు రోగములనుండి విముక్తి కలిగించుము. మేము ప్రేమతో ఉండునట్లుగా చేయుము. అన్నిటా ప్రథముడై, దేవతలలో దైవత్వమై, భక్తుల రోగాలను బాపే వైద్యుడై, భక్తుల సత్కార్యములను పొగడే వాడి, వారి పాపములను పోగోట్టేవాడైన ఓ రుద్రా! అసురులను, క్రూర మృగములను నాశనము చేసి మమ్ము కాపాడుము.  ఎరుపు, బంగారపు వర్ణములో ఉండి, తానే సూర్యుడై ఉన్నాడు ఆ రుద్రుడు. అటువంటి సహస్ర దిక్కులలో ఉన్న సహస్ర రుద్రులకు మా నమస్కారములు. వారంతా శాంతిన్చెదరు గాక.  గరళము కంఠం నందు కలిగి పశుకాపరులకు, స్త్రీలకు కూడా ఎర్రని కాంతితో రాగి రంగులో సూర్యుని వలె కనిపించే ఆ రుద్రుడు మా అందరికి ఆనందమునిచ్చు గాక. నీలకంఠుడు, వేయి కన్నులు కలవాడు, అనంతమైన వరాలు ఇచ్చేవాడు అయిన ఆ రుద్రునికి, ఆయన భక్తులకు నా నమస్కారములు. ఓ దేవా! ధనుస్సు యొక్క తాడు ముడి తీసి, దానిని దించి, అస్త్రములను అమ్ములపొదిలో ఉంచి దానిని పక్కకు పెట్టుము. బాణముల పదునైన మొనలను త్రుంచి, ధనుస్సును దించి, శాంత రూపంతో మమ్మల్ని ప్రసన్నించు. అస్త్రములు, ఆయుధములు అన్ని శాంతించి, వాటి స్థానాల్లో ఉండు గాక. భక్తుల కోర్కెలను తీర్చే ఓ రుద్రా! మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు. నీ ఆయుధాలకు, ధనుస్సుకు నా వందనములు. నీ అస్త్ర శస్త్రాలు మా శత్రువులను నాశనము చేయు గాక (శత్రువులంటే పాపములు). అవి మా నుండి దూరముగా వెళ్ళు గాక. జగత్పతి, దేవాదిదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, ప్రళయాగ్ని రూపుడు, నీలకంఠుడు, యముని జయించిన వాడు, అన్నిటికి నాథుడు, శాంతముర్తి, సమస్త శుభకరుడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

రెండవ అనువాకము:


నమో హిర’ణ్య బాహవే సేనాన్యే’ దిశాం చ పత’యే నమో నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యః పశూనాం పత’యే నమో నమః’ సస్పిఞ్జ’రాయ త్విషీ’మతే పథీనాం పత’యే నమో నమో’ బభ్లుశాయ’ వివ్యాధినే‌உన్నా’నాం పత’యే నమో నమో హరి’కేశాయోపవీతినే’ పుష్టానాం పత’యే నమో నమో’ భవస్య’ హేత్యై జగ’తాం పత’యే నమో నమో’ రుద్రాయా’తతావినే క్షేత్రా’ణాం పత’యే నమో నమః’ సూతాయాహం’త్యాయ వనా’నాం పత’యే నమో నమో రోహి’తాయ స్థపత’యే వృక్షాణాం పత’యే నమో నమో’ మన్త్రిణే’ వాణిజాయ కక్షా’ణాం పత’యే నమో నమో’ భువన్తయే’ వారివస్కృతా-యౌష’ధీనాం పత’యే నమో నమ’ ఉచ్చైర్-ఘో’షాయాక్రన్దయ’తే పత్తీనాం పత’యే నమో నమః’ కృత్స్నవీతాయ ధావ’తే సత్త్వ’నాం పత’యే నమః’ || ౨ ||

తాత్పర్యము:


స్వర్ణ భుజములు కలిగి, సేనాపతి, దిక్కులకు అధిపతి, వృక్షముల వలె ప్రకాశించు వాడు, ఆకులను జుట్టుగా కలవాడు, అన్ని జీవరాసులకు పతి, లేత చిగురుల వలె పచ్చగా, ఎర్రగా ఉన్నవాడు, మిక్కిలి ప్రకాశించేవాడు, మనలను సమస్త మార్గములలో నడిపే వాడు, నందిని అధిరోహించే వాడు, శత్రువుల పాలిటి రోగము వంటి వాడు, సమస్త ఆహారములకు అధిపతి, నల్లని జుట్టు కలవాడు, ఉపవీతమును ధరించిన వాడు, శక్తిమంతులకు అధిపతి, భవసాగరాన్ని దాటించేవాడు, ధనుస్సును ధరించిన వాడు, క్షేత్రములకు అధిపతి, జీవితమనే రథాన్ని నడిపించే వాడు, అజేయుడు, అరణ్యమునకు అధిపతి, ఎరుపు వర్ణము కలిగిన వాడు, అన్నిటికి అధిపతి, వృక్షములకు అధిపతి, మంత్రి, వ్యాపారి, చెట్టు చేమకు అధిపతి, చుట్టూ సైన్యము ఉండే వాడు, భక్తులను కాపాడే వాడు, మంచి వారికి అధిపతి అయిన రుద్రునికి నా నమస్కారము. 


మూడవ అనువాకము:


నమః సహ’మానాయ నివ్యాధిన’ ఆవ్యాధినీ’నాం పత’యే నమో నమః’ కకుభాయ’ నిషఙ్గిణే” స్తేనానాం పత’యే నమో నమో’ నిషఙ్గిణ’ ఇషుధిమతే’ తస్క’రాణాం పత’యే నమో నమో వఞ్చ’తే పరివఞ్చ’తే స్తాయూనాం పత’యే నమో నమో’ నిచేరవే’ పరిచరాయార’ణ్యానాం పత’యే నమో నమః’ సృకావిభ్యో జిఘాగ్‍మ్’సద్భ్యో ముష్ణతాం పత’యే నమో నమో’‌உసిమద్భ్యో నక్తఞ్చర’ద్భ్యః ప్రకృన్తానాం పత’యే నమో నమ’ ఉష్ణీషినే’ గిరిచరాయ’ కులుఞ్చానాం పత’యే నమో నమ ఇషు’మద్భ్యో ధన్వావిభ్య’శ్చ వో నమో నమ’ ఆతన్-వానేభ్యః’ ప్రతిదధా’నేభ్యశ్చ వో నమో నమ’ ఆయచ్ఛ’ద్భ్యో విసృజద్-భ్య’శ్చ వో నమో నమో‌உస్స’ద్భ్యో విద్య’ద్-భ్యశ్చ వో నమో నమ ఆసీ’నేభ్యః శయా’నేభ్యశ్చ వో నమో నమః’ స్వపద్భ్యో జాగ్ర’ద్-భ్యశ్చ వో నమో నమస్తిష్ఠ’ద్భ్యో ధావ’ద్-భ్యశ్చ వో నమో నమః’ సభాభ్యః’ సభాప’తిభ్యశ్చ వో నమో నమో అశ్వేభ్యో‌உశ్వ’పతిభ్యశ్చ వో నమః’ || ౩ ||

తాత్పర్యము:


శత్రువులను సంహరించేవాడు, అటువంటి వారికి అధిపతి, ఉన్నతమైన వాడు, ఖడ్గమును, అమ్ముల పొది, ధనుస్సును ధరించేవాడు, తస్కరులకు అధిపతి, మోసము చేసే వాడు, మోసగాళ్ళకు అధిపతి, అడవులను దోచుకునే వారికి అధిపతి, నిశాచరుడు, హంతకులకు అధిపతి, తలపాగా ధరించే వాడు, అడవులలో నివసించేవాడు, ధనుస్సును, బాణములను ధరించి సంధించే వాడు, చేదించేవాడు, స్థిరాసనంలో ఆసీనుడై ఉన్నవాడు, పడుకొని ఉన్నవాడు, నిద్ర, చేతనావస్థలో ఉండేవాడు, స్థిరముగా ఉన్నవాడు, పరుగెత్తే వాడు, సభలో ఉన్నవాడు, సభాధ్యక్షుడిగా ఉన్నవాడు, సదాత్మల పట్ల ఆదరం చూపేవాడు, దురాత్మల పట్ల ఆగ్రహం చూపేవాడు, తానే ఆశ్వమైన వాడు, ఆశ్వపతి అయిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.


నాలుగవ అనువాకము:


నమ’ ఆవ్యాధినీ”భ్యో వివిధ్య’న్తీభ్యశ్చ వో నమో నమ ఉగ’ణాభ్యస్తృగం-హతీభ్యశ్చ’ వో నమో నమో’ గృత్సేభ్యో’ గృత్సప’తిభ్యశ్చ వో నమో నమో వ్రాతే”భ్యో వ్రాత’పతిభ్యశ్చ వో నమో నమో’ గణేభ్యో’ గణప’తిభ్యశ్చ వో నమో నమో విరూ’పేభ్యో విశ్వరూ’పేభ్యశ్చ వో నమో నమో’ మహద్భ్యః’, క్షుల్లకేభ్య’శ్చ వో నమో నమో’ రథిభ్యో‌உరథేభ్య’శ్చ వో నమో నమో రథే”భ్యో రథ’పతిభ్యశ్చ వో నమో నమః’ సేనా”భ్యః సేనానిభ్య’శ్చ వో నమో నమః’, క్షత్తృభ్యః’ సఙ్గ్రహీతృభ్య’శ్చ వో నమో నమస్తక్ష’భ్యో రథకారేభ్య’శ్చ వో నమో’ నమః కులా’లేభ్యః కర్మారే”భ్యశ్చ వో నమో నమః’ పుఞ్జిష్టే”భ్యో నిషాదేభ్య’శ్చ వో నమో నమః’ ఇషుకృద్భ్యో’ ధన్వకృద్-భ్య’శ్చ వో నమో నమో’ మృగయుభ్యః’ శ్వనిభ్య’శ్చ వో నమో నమః శ్వభ్యః శ్వప’తిభ్యశ్చ వో నమః’ || 4 ||

తాత్పర్యము:

దుష్ట శక్తుల పాలిటి శత్రువు, వాటిని ఎదుర్కునే వాడు, ఉపకారము చేసే ఆత్మయే తానై, ఆ యాత్మలకు సహకరించే వాడు, అనుబంధములు కలిగిన వాడు, అట్టి వారికి అధిపతి అయిన వాడు, రకరకములైన జీవరాసుల సమూహము అయిన వాడు, అట్టి సమూహములకు అధిపతి అయిన వాడు, గణములో సభ్యుడు, గణములకు అధిపతి అయిన వాడు, సామాన్యమునగాను, భయానకముగాను కనిపించే వాడు, ఉత్తమమైన ఆత్మగా, బలహీనంగా కనిపించేవాడు, రథమును అధిరోహించే వాడు, రథము లేని వాడు, తనే రథమైన వాడు, రథపతి అయిన వాడు, తానే సైనికుడు, సేనాధిపతి అయిన వాడు, తానే రథమును నడిపేవాడు, రథమును ఆపగలిగిన శక్తి గలవాడు, కుమ్మరి వాడు, స్వర్ణకారుడు, వేటగాడు, మత్స్యకారుడు, ధనువు, బాణములు తయారు చేసే వాడు, శునకముల కాపరి, తానే శునకరుపమై, వాటిని కాపాడే వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.


అయిదవ అనువాకము:


నమో’ భవాయ’ చ రుద్రాయ’ చ నమః’ శర్వాయ’ చ పశుపత’యే చ నమో నీల’గ్రీవాయ చ శితికణ్ఠా’య చ నమః’ కపర్ధినే’ చ వ్యు’ప్తకేశాయ చ నమః’ సహస్రాక్షాయ’ చ శతధ’న్వనే చ నమో’ గిరిశాయ’ చ శిపివిష్టాయ’ చ నమో’ మీఢుష్ట’మాయ చేషు’మతే చ నమో” హ్రస్వాయ’ చ వామనాయ’ చ నమో’ బృహతే చ వర్షీ’యసే చ నమో’ వృద్ధాయ’ చ సంవృధ్వ’నే చ నమో అగ్రి’యాయ చ ప్రథమాయ’ చ నమ’ ఆశవే’ చాజిరాయ’ చ నమః 
శీఘ్రి’యాయ చ శీభ్యా’య చ నమ’ ఊర్మ్యా’య చావస్వన్యా’య చ నమః’ స్త్రోతస్యా’య చ ద్వీప్యా’య చ || 5 ||

తాత్పర్యము:


సృష్టి కారకుడు, దుఃఖమును పోగొట్టేవాడు, పాపములను తొలగించే వాడు, జగత్తుకు అధిపతి, నీలకంఠుడు, భస్మమును దేహమంతా కలిగిన వాడు, కపాలములు ధరించి, కేశములు ముడి వేసుకొన్న వాడు, వేయి కన్నులు, వందల అస్త్రములు కలవాడు, గిరీశుడు, కాంతితో సమానమైన వాడు, సువృష్టి కురిపించే వాడు, చిన్నగాను, పొట్టిగాను ఉండేవాడు, పెద్దగా ఉండేవాడు, సర్వ సులక్షణ సంపన్నుడు, వృద్ధునిగా కనిపించే వాడు, అనంతమైన యశస్సు కలవాడు, సృష్టి కన్నా ముందే ఉన్నవాడు, దేవతలలో ప్రథముడు, అంతటా ఉన్నవాడు, వేగముగా కదిలేవాడు, వేగమైన ప్రవాహములో ఉన్నవాడు, అట్టి ప్రవాహంలో ఈదగలవాడు, అలలలో, నిశ్చలమైన నీటిలో, సెల ఏళ్ళలో, ద్వీపములలో  ఉన్నరుద్రునికి నా నమస్కారములు.


ఆరవ అనువాకము:

నమో” జ్యేష్ఠాయ’ చ కనిష్ఠాయ’ చ నమః’ పూర్వజాయ’ చాపరజాయ’ చ నమో’ మధ్యమాయ’ చాపగల్భాయ’ చ నమో’ జఘన్యా’య చ బుధ్ని’యాయ చ నమః’ సోభ్యా’య చ ప్రతిసర్యా’య చ నమో యామ్యా’య చ క్షేమ్యా’య చ నమ’ ఉర్వర్యా’య చ ఖల్యా’య చ నమః శ్లోక్యా’య చా‌உవసాన్యా’య చ నమో వన్యా’య చ కక్ష్యా’య చ నమః’ శ్రవాయ’ చ ప్రతిశ్రవాయ’ చ నమ’ ఆశుషే’ణాయ చాశుర’థాయ చ నమః శూరా’య చావభిన్దతే చ నమో’ వర్మిణే’ చ వరూధినే’ చ నమో’ బిల్మినే’ చ కవచినే’ చ నమః’ శ్రుతాయ’ చ శ్రుతసే’నాయ చ || 6 ||

తాత్పర్యము:

అందరికన్నా పెద్ద వాడు, మరియు చిన్న వాడు, అన్నిటికన్నా ముందు జన్మించిన వాడు, తర్వాత జన్మించిన వాడు, మధ్య వయస్కుడు, అతి పిన్నవాడు, మూలమునుంచి మరియు మధ్య నుంచి జన్మించిన వాడు, భూ మరియు ఇతర లోకముల నుండి జన్మించిన వాడు, నరకమున శిక్ష వేసి స్వర్గమున సుఖమును ఇచ్చేవాడు , పొలములలోను , వనములలోను ఉండే వాడు,   వేదములలో, వాటి శాంతి మంత్రములలో పొగడబడిన వాడు, అడవులలోని వ్రుక్షములలోను, చిన్న పొదలలో ఉండేవాడు, శబ్దము మరియు ప్రతిధ్వనిలోను ఉండేవాడు, వేగముగా నడిచే సైన్యము, ఆయుధాలలో ఉండేవాడు, వీరులు మరియు రాజుల రూపములో ఉండేవాడు, అస్త్ర శాస్త్రములు కలిగి రథమును అధిరోహించిన వాడు, శిరస్త్రాణము మరియు కవచము ధరించిన వాడు,  గొప్ప యశస్సు మరియు సేన కలిగిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.


ఏడవ అనువాకము:

నమో’ దుందుభ్యా’య చాహనన్యా’య చ నమో’ ధృష్ణవే’ చ ప్రమృశాయ’ చ నమో’ దూతాయ’ చ ప్రహి’తాయ చ నమో’ నిషఙ్గిణే’ చేషుధిమతే’ చ నమ’స్-తీక్ష్ణేష’వే చాయుధినే’ చ నమః’ స్వాయుధాయ’ చ సుధన్వ’నే చ నమః స్రుత్యా’య చ పథ్యా’య చ నమః’ కాట్యా’య చ నీప్యా’య చ నమః సూద్యా’య చ సరస్యా’య చ నమో’ నాద్యాయ’ చ వైశన్తాయ’ చ నమః కూప్యా’య చావట్యా’య చ నమో వర్ష్యా’య చావర్ష్యాయ’ చ నమో’ మేఘ్యా’య చ విద్యుత్యా’య చ నమ ఈధ్రియా’య చాతప్యా’య చ నమో వాత్యా’య చ రేష్మి’యాయ చ నమో’ వాస్తవ్యా’య చ వాస్తుపాయ’ చ || 7 ||

తాత్పర్యము:

పెద్ద నగారా నుంచి వెలువడే శబ్దము నందు ఉన్న వాడు, ఆ నగారా మోగించే ఓడు నందు ఉండే వాడు, సమరభూమి నుంచి పారిపోని వాడు, వేగు తెచ్చిన సమాచారాన్ని పరిశీలించేవాడు, దూత మరియు సేవకుని రూపములో ఉండేవాడు, ఖడ్గము, అమ్ముల పొది కలిగిన వాడు, పదునైన బాణములు మరియు ఇతర అస్త్రములు కలిగిన వాడు, ఉత్తమమైన ధనుస్సు మరియు ఇతర శస్త్రములు కలిగిన వాడు, విశాలమైన మరియు ఇరుకైన మార్గములందు వెళ్లే వాడు, కాలువలలోను, సెలయేటి లోను ఉండేవాడు, నీటి మడుగులోను, సరస్సులోను ఉండేవాడు, నదులలోను, ఏటి లోను ఉండేవాడు, బావిలోను, జలపాతములలోను ఉండేవాడు, వర్షములోను, ఎడారిలోను ఉన్నవాడు,  మేఘము మరియు మెరుపులో ఉన్నవాడు, నిర్మలమైన శరదృతు ఆకాశాములోను, వర్షములోను, సూర్యుని లోను ఉన్నవాడు, భీకర వర్షపు గాలిలోనూ, వేడి వడగాల్పు లోను ఉన్నవాడు, గృహ నిర్మాణములో ఉండే ప్రతి వస్తువులోను,  వాస్తు పురుషుడి రూపంలో గృహాన్ని కాపాడే వాడు అయిన ఆ రుద్రునికి నా నమస్కారములు.


ఎనిమిదవ అనువాకము:


నమః సోమా’య చ రుద్రాయ’ చ నమ’స్తామ్రాయ’ చారుణాయ’ చ నమః’ శఙ్గాయ’ చ పశుపత’యే చ నమ’ ఉగ్రాయ’ చ భీమాయ’ చ నమో’ అగ్రేవధాయ’ చ దూరేవధాయ’ చ నమో’ హన్త్రే చ హనీ’యసే చ నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యో నమ’స్తారాయ నమ’శ్శమ్భవే’ చ మయోభవే’ చ నమః’ శంకరాయ’ చ మయస్కరాయ’ చ నమః’ శివాయ’ చ శివత’రాయ చ నమస్తీర్థ్యా’య చ కూల్యా’య చ నమః’ పార్యా’య చావార్యా’య చ నమః’ ప్రతర’ణాయ చోత్తర’ణాయ చ నమ’ ఆతార్యా’య చాలాద్యా’య చ నమః శష్ప్యా’య చ ఫేన్యా’య చ నమః’ సికత్యా’య చ ప్రవాహ్యా’య చ || 8 ||

తాత్పర్యము:


ఉమాపతి, దుఃఖములను పోగొట్టే వాడు, సూర్యోదయ, అస్తమయ సమయము నాటి సూర్యుని వర్ణము కలిగిన వాడు, సంతోషాన్ని కలిగించే వాడు, రక్షకుడు, ఉగ్రముగాను, భయానకముగాను ఉన్నవాడు, నాయకుడు, శత్రు సంహారము చేసే వాడు, దూరము నుండి మాట్లాడే వాడు, ప్రళయ కారకుడు (పూర్తి విధ్వంసం), కర్మ యనే సువ్రుక్షమైన వాడు, ఓంకార ప్రకాశకుడు, భోగ కారకుడు, మోక్ష కారకుడు, అనేక లోకముల భోగమునిచ్చే వాడు, శుభమైన వాటిలో ఉన్నవాడు, శుభకరుడు, పవిత్రమైన జలము లో ఉన్నవాడు, ప్రవాహముల వద్ద అర్చించ బడే వాడు, సిద్ధి పొందిన వారిచే నుతించ బడిన వాడు, కామ్యప్రదుడు, భవ సాగరాన్ని, పాపాలను దాటించి, మోక్షాన్ని కలిగించే వాడు, ఆత్మలను ఈ ప్రపంచములోకి పంపించే వాడు, కర్మ ఫలములను అనుభవింప చేసే వాడు,  రెల్లుగడ్డి లోను, నీటి ప్రవాహపు నురగలోను, నదులయందు ఇసుకలోను, నీటి ప్రవాహంలో ఉండేవాడు అయిన రుద్రునికి నా నమస్కారములు


తొమ్మిదవ  అనువాకము:


నమ’ ఇరిణ్యా’య చ ప్రపథ్యా’య చ నమః’ కిగ్ంశిలాయ’ చ క్షయ’ణాయ చ నమః’ కపర్దినే’ చ పులస్తయే’ చ నమో గోష్ఠ్యా’య చ గృహ్యా’య చ నమస్-తల్ప్యా’య చ గేహ్యా’య చ నమః’ కాట్యా’య చ గహ్వరేష్ఠాయ’ చ నమో” హృదయ్యా’య చ నివేష్ప్యా’య చ నమః’ పాగ్‍మ్ సవ్యా’య చ రజస్యా’య చ నమః శుష్క్యా’య చ హరిత్యా’య చ నమో లోప్యా’య చోలప్యా’య చ నమ’ ఊర్మ్యా’య చ సూర్మ్యా’య చ నమః’ పర్ణ్యాయ చ పర్ణశద్యా’య చ నమో’‌உపగురమా’ణాయ చాభిఘ్నతే చ నమ’ ఆఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ నమో’ వః కిరికేభ్యో’ దేవానాగ్ం హృద’యేభ్యో నమో’ విక్షీణకేభ్యో నమో’ విచిన్వత్-కేభ్యో నమ’ ఆనిర్ హతేభ్యో నమ’ ఆమీవత్-కేభ్యః’ || 9 ||

తాత్పర్యము:


నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నివసించేవాడు, మార్గములో నడిచేవాడు,  ఎడారుల్లో, ఉన్నతమైన ప్రదేశాల్లో నివసించేవాడు, జటా ఝూటములు కలిగి, భక్తులను కాపాడుటలో ముందుండే వాడు, గృహములలోను, పాకలలో, గుహలలోను నివసించేవాడు, తల్పముపై ఉండేవాడు, అలంకరిచబడిన మందిరములలో, ముళ్ళ పొదలలో నివసించేవాడు, లోతైన నీటి మడుగుల్లో, హిమ బిందువుల్లో ఉన్నవాడు, ధూళిలో , బురద మట్టిలో, ఎండిపోయిన చెక్కలో, పచ్చి కొమ్మలో, నేలలో, పచ్చికలో,  మైదానములో, నీటి తరంగాలలో, పచ్చని ఆకులలో, ఎండుటాకులలో ఉండేవాడు, అస్త్రములు ధరించి శత్రు సంహారం చేసే వాడు,  ఎక్కువ బాధ పెట్టని వాడు, పెట్టే వాడు, భక్తులకు సకల సంపదలు ఇచ్చే వాడు, దేవతల ఆత్మలలో ఉన్నవాడు, నాశనములేని వాడు, దేవతల హృదయంలో ఉన్నవాడు,  కోర్కెలు తీర్చే వాడు, పాపములను తొలగించే వాడు, సర్వాంతర్యామి అయిన రుద్రునకు నా నమస్కారములు.   


పదవ అనువాకము:


ద్రాపే అన్ధ’సస్పతే దరి’ద్రన్-నీల’లోహిత | ఏషాం పురు’షాణామేషాం ప’శూనాం మా భేర్మా‌உరో మో ఏ’షాం కించనామ’మత్ | యా తే’ రుద్ర శివా తనూః శివా విశ్వాహ’భేషజీ | శివా రుద్రస్య’ భేషజీ తయా’ నో మృడ జీవసే” || ఇమాగ్‍మ్ రుద్రాయ’ తవసే’ కపర్దినే” క్షయద్వీ’రాయ ప్రభ’రామహే మతిమ్ | యథా’ నః శమస’ద్ ద్విపదే చతు’ష్పదే విశ్వం’ పుష్టం గ్రామే’ అస్మిన్ననా’తురమ్ | మృడా నో’ రుద్రోత నో మయ’స్కృధి క్షయద్వీ’రాయ నమ’సా విధేమ తే | యచ్ఛం చ యోశ్చ మను’రాయజే పితా తద’శ్యామ తవ’ రుద్ర ప్రణీ’తౌ | మా నో’ మహాన్త’ముత మా నో’ అర్భకం మా న ఉక్ష’న్తముత మా న’ ఉక్షితమ్ | మా నో’‌உవధీః పితరం మోత మాతరం’ ప్రియా మా న’స్తనువో’ రుద్ర రీరిషః | మా న’స్తోకే తన’యే మా న ఆయు’షి మా నో గోషు మా నో అశ్వే’షు రీరిషః | వీరాన్మా నో’ రుద్ర భామితో‌உవ’ధీర్-హవిష్మ’న్తో నమ’సా విధేమ తే | ఆరాత్తే’ గోఘ్న ఉత పూ’రుషఘ్నే క్షయద్వీ’రాయ సుమ్-నమస్మే తే’ అస్తు | రక్షా’ చ నో అధి’ చ దేవ బ్రూహ్యథా’ చ నః శర్మ’ యచ్ఛ ద్విబర్హా”ః | స్తుహి శ్రుతం గ’ర్తసదం యువా’నం మృగన్న భీమము’పహన్తుముగ్రమ్ | మృడా జ’రిత్రే రు’ద్ర స్తవా’నో అన్యన్తే’ అస్మన్నివ’పన్తు సేనా”ః | పరి’ణో రుద్రస్య’ హేతిర్-వృ’ణక్తు పరి’ త్వేషస్య’ దుర్మతి ర’ఘాయోః | అవ’ స్థిరా మఘవ’ద్-భ్యస్-తనుష్వ మీఢ్-వ’స్తోకాయ తన’యాయ మృడయ | మీఢు’ష్టమ శివ’మత శివో నః’ సుమనా’ భవ | పరమే వృక్ష ఆయు’ధన్నిధాయ కృత్తిం వసా’న ఆచ’ర పినా’కం బిభ్రదాగ’హి | వికి’రిద విలో’హిత నమ’స్తే అస్తు భగవః | యాస్తే’ సహస్రగ్‍మ్’ హేతయోన్యమస్మన్-నివపన్తు తాః | సహస్రా’ణి సహస్రధా బా’హువోస్తవ’ హేతయః’ | తాసామీశా’నో భగవః పరాచీనా ముఖా’ కృధి || 10 ||

తాత్పర్యము:


పాపులను నరకంలో శిక్షించే, భక్తులకు ఆహారాన్ని ఇచ్చే, జ్యోతి స్వరూపుడవు, నీలకంఠుడవు, ఎరుపు వర్ణము కలవాడవు అయిన ఓ దేవా! భక్తులకు భయము, మృత్యువునీయకు, రోగముల నుండి కాపాడు. ఓ రుద్రా! జగత్పాలకా! జనన మరణాల నుండి ముక్తిని కలిగించే, నీలో ఉన్న, పార్వతి దేవితో కూడిన రూపమును మాకు అనుగ్రహించుము. మేము ఎలా జీవించాలో అలా జీవించే వరం ప్రసాదించు. ఓ రుద్రా! జగత్పాలకా! జటా ఝూటములు కలిగిన, ధ్యానములో ఉన్న తపస్వీ, వ్యాకులమైన మా మనస్సులను నీ మీదకు మరల్చు. నీ ధ్యానముతో మాకు, గోవులకు సకల పాపములు తొలగి, శుభములు కలిగి, ఆరోగ్యవంతులమగుదుము, మరల మాకు రోగములు రావు. ఓ రుద్రా! జగత్పాలకా! మాకు ఆనందము కలిగించు, మోక్షము కలిగే అవకాశాలు పెంచి, పాపములు చేసే అవకాశాలు తగ్గించు.  మాకు ఆనందము, మోక్షము కలిగించుటకు నీకు మరోసారి మా ప్రణామములు. ఓ రుద్రా! జగత్పాలకా! వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు, గర్భము నందున్న శిశువులకు, తల్లీ, తండ్రులకు ఎప్పుడు హాని కలగకుండా చూడు. మాకు ప్రియమైన ఈ శరీరమునకు హాని కలుగకుండా చూడు. ఓ రుద్రా! జగత్పాలక! మా సంతానమునకు శోకము కలుగ కుండా కాపాడు. ఆవులను, ఆశ్వములను కాపాడు. కోపాగ్నికి మా సేవకులను గురి చేయకు. నీకు పవిత్రమైన వస్తువులు, నమస్కారములు సమర్పిస్తాము. ఓ రుద్రా! జగత్పాలకా! నీ భయానక తత్వము మాకు, మా సేవకులకు దూరముగా ఉండు గాక. నీ శుభ తత్వము మాతో ఉండు గాక.  నీ కరుణ ఎల్లప్పుడూ మాతో ఉండు గాక. మాకు సకల లోకాల సుఖాలు అందించు. ఓ మనసా! నీ హృదయ కమలములో యున్న, నిత్య యౌవనుడైన, సింహమువలె శత్రువులను సంహరించే, అమితమైన యశస్సు కల్గిన ఆ రుద్రుని ధ్యానము చేయుము. ఓ రుద్రా! నీ సైనికులచే మా శత్రువులను సంహరించు. రుద్రుని ఆయుధములు మా నుండి దూరముగా ఉండు గాక. శత్రు సంహారము చేయగల ఆ రౌద్ర రూపము మానుండి దూరముగా ఉండు గాక.  ఓ రుద్ర! నీ రౌద్ర రూపమును మిమ్ము ప్రార్థించే, హవనము సమర్పించే మా పట్ల శాంతింప చేయుము. మా పుత్ర పౌత్రాదులను కాపాడుము.  భక్తుల కోర్కెలను తీర్చతంలో అగ్రుడవైన ఓ రుద్రా!  శుభ వీక్షణములు కలిగిన ఓ రుద్ర!  నీ అస్త్రములు వృక్షముపై ఉంచి, పులి చర్మము ధరించి, పినాకము అలంకారముగా ఉంచుకొని మా వద్దకు శుభకరుడవై రమ్ము. మాకు సంపదలు ఇచ్చే, ఎరుపు వర్ణములో ఉన్న ఓ రుద్రా! నీకు మా నమస్కారములు. నీ ఆయుధములు మా శత్రువులను నాశనం చేయు గాక. వేల రకాల, వేల ఆయుధాలు కలిగిన ఓ రుద్రా! నీ అస్త్రాలు మమ్ములను దాడి చేయకుండు గాక.


పదకొండవ అనువాకము:

సహస్రా’ణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యా”మ్ | తేషాగ్‍మ్’ సహస్రయోజనే‌உవధన్వా’ని తన్మసి | అస్మిన్-మ’హత్-య’ర్ణవే”‌உన్తరి’క్షే భవా అధి’ | నీల’గ్రీవాః శితికణ్ఠా”ః శర్వా అధః, క్ష’మాచరాః | నీల’గ్రీవాః శితికణ్ఠా దివగ్‍మ్’ రుద్రా ఉప’శ్రితాః | యే వృక్షేషు’ సస్పిఞ్జ’రా నీల’గ్రీవా విలో’హితాః | యే భూతానామ్-అధి’పతయో విశిఖాసః’ కపర్ది’నః | యే అన్నే’షు వివిధ్య’న్తి పాత్రే’షు పిబ’తో జనాన్’ | యే పథాం ప’థిరక్ష’య ఐలబృదా’ యవ్యుధః’ | యే తీర్థాని’ ప్రచర’న్తి సృకావ’న్తో నిషఙ్గిణః’ | య ఏతావ’న్తశ్చ భూయాగ్‍మ్’సశ్చ దిశో’ రుద్రా వి’తస్థిరే | తేషాగ్‍మ్’ సహస్రయోజనే‌உవధన్వా’ని తన్మసి | నమో’ రుధ్రేభ్యో యే పృ’థివ్యాం యే”‌உన్తరి’క్షే యే దివి యేషామన్నం వాతో’ వర్-షమిష’వస్-తేభ్యో దశ ప్రాచీర్దశ’ దక్షిణా దశ’ ప్రతీచీర్-దశో-దీ’చీర్-దశోర్ధ్వాస్-తేభ్యో నమస్తే నో’ మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ’ నో ద్వేష్టి తం వో జమ్భే’ దధామి || 11 ||

త్ర్యం’బకం యజామహే సుగన్ధిం పు’ష్టివర్ధ’నమ్ | ఉర్వారుకమి’వ బన్ధ’నాన్-మృత్యో’ర్-ముక్షీయ మా‌உమృతా”త్ | యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓష’ధీషు యో రుద్రో విశ్వా భువ’నా వివేశ తస్మై’ రుద్రాయ నమో’ అస్తు | తము’ ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వ’స్య క్షయ’తి భేషజస్య’ | యక్ష్వా”మహే సౌ”మనసాయ’ రుద్రం నమో”భిర్-దేవమసు’రం దువస్య | అయం మే హస్తో భగ’వానయం మే భగ’వత్తరః | అయం మే” విశ్వభే”షజో‌உయగ్‍మ్ శివాభి’మర్శనః | యే తే’ సహస్ర’మయుతం పాశా మృత్యో మర్త్యా’య హన్త’వే | తాన్ యఙ్ఞస్య’ మాయయా సర్వానవ’ యజామహే | మృత్యవే స్వాహా’ మృత్యవే స్వాహా” | ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా’ విశాన్తకః | తేనాన్నేనా”ప్యాయస్వ ||

ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యు’ర్మే పాహి ||

సదాశివోమ్ |

ఓం శాంతిః శాంతిః శాంతిః

తాత్పర్యము:

ఓ రుద్రా! వేల కొలది, వేల రకాల ఆయుధాలు కలిగి ఉన్న వేల మంది నీ సైనికులను మాకు వేల మైళ్ళ దూరమున ఉంచు. ఈ విశ్వములో ఉన్న అనంతమైన రుద్రుని సైనికులు - కంఠములు నీలము, తెల్లగను గలిగిన వారు, పాతాళంలో, స్వర్గంలో ఉండే వారు,   కంఠములు నీలము, ఎరుపుగాను ఉండి వ్రుక్షములపై ఉన్నవారు, ముడి వేసుకున్నవారు, కేశములు లేని వారు, జనులను బాధించి వారు పాత్రలనుండి ఆహారము, నీరు తీసుకునే వారు, అన్ని మార్గములలో నున్న వారిని రక్షించే వారు, కాపాడే వారు, పదునైన ఆయుధములు కలిగిన వారు,  పవిత్రమైన జలాలను కాపాడే వారు - వివిధ దిక్కులలో నున్న వీరందరినీ, వారి ఆయుధాలను మానుండి దూరముగా ఉంచుము. భూమి, ఆకాశము, ఇతర లోకములలో ఉండి మమ్మల్ని కాపాడే సైనికులకు మా వ్రేళ్ళతో, చేతులతో, దిక్కు దిక్కున నమస్కారములు. మాకు వారు ఆనందము కలిగింతురు గాక. వారికి మేము మా శత్రువులను ఆహారముగా సమర్పిస్తున్నాము. సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!. సమస్త జగత్తు యందు ఉన్న ఆ శివునికి మా నమస్కారములు. ఉత్తమమైన అస్త్ర శాస్త్రములు కలిగి, వైద్యుడై మన రోగాలను నిర్మూలించే, రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు. శివుని తాకి, పూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినా ఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము. ఓ దేవా! ప్రాణులను చంపుటకు ఉపయోగించే సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా యుంచమని మా ప్రార్థన. దానికోరకై మేము ఈ అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని సమర్పిస్తున్నాము. రుద్రునకు నా నమస్కారములు. మృత్యుదేవత నా వాద్దకు రాకుండు గాక. ప్రాణము, ఇంద్రియముల కలిసే గ్రంధులలో నివసించే ఓ దేవా! నేను సమర్పిస్తున్న ఆహారమును స్వీకరించి నాయందు నివసించుము. మృత్యు దేవతను నా నుండి దూరముగా ఉండు గాక.


ఓం శాంతి శాంతి శాంతి. ఇది కృష్ణ యజుర్వేదములోని, నాలుగవ కాండ, అయిదవ ప్రపాఠకములోనిది.


చమకం

భక్తుడు తనకు ఏమి కావలెనో ఆ రుద్రుని చమక రూపంలో అడగబడింది. నమకంలో లాగానే దీనిలో కూడా పదకొండు అనువాకములు. నమక చమకాలు కలిపి చదివితేనే అభిషేకం సంపూర్ణం. చమకాన్ని భక్తుని వాక్కులో రుద్రుని ఆశీర్వచనంగా వ్యాఖ్యానించ బడింది.

మొదటి అనువాకము:

ఓం అగ్నా’విష్ణో సజోష’సేమావ’ర్ధన్తు వాం గిరః’ | ద్యుమ్నైర్-వాజే’భిరాగ’తమ్ | వాజ’శ్చ మే ప్రసవశ్చ’ మే ప్రయ’తిశ్చ మే ప్రసి’తిశ్చ మే ధీతిశ్చ’ మే క్రతు’శ్చ మే స్వర’శ్చ మే శ్లోక’శ్చ మే శ్రావశ్చ’ మే శ్రుతి’శ్చ మే జ్యోతి’శ్చ మే సువ’శ్చ మే ప్రాణశ్చ’ మే‌உపానశ్చ’ మే వ్యానశ్చ మే‌உసు’శ్చ మే చిత్తం చ’ మ ఆధీ’తం చ మే వాక్చ’ మే మన’శ్చ మే చక్షు’శ్చ మే శ్రోత్రం’ చ మే దక్ష’శ్చ మే బలం’ చ మ ఓజ’శ్చ మే సహ’శ్చ మ ఆయు’శ్చ మే జరా చ’ మ ఆత్మా చ’ మే తనూశ్చ’ మే శర్మ’ చ మే వర్మ’ చ మే‌உఙ్గా’ని చ మే‌உస్థాని’ చ మే పరూగ్‍మ్’షి చ మే శరీ’రాణి చ మే || 1 ||

తాత్పర్యము :

ఓ దేవా! అగ్ని విష్ణు రూపమైన వాడ!  మీరు నా పట్ల సంతుష్టులై ఉండుటకు నేను నుతించే ఈ పదములు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుండు గాక. నాకు ఎల్లపుడు ఆహారము, ధనము సమృద్ధిగా నుండు గాక. 

రెండవ అనువాకము:

జైష్ఠ్యం’ చ మ ఆధి’పత్యం చ మే మన్యుశ్చ’ మే భామ’శ్చ మే‌உమ’శ్చ మే‌உమ్భ’శ్చ మే జేమా చ’ మే మహిమా చ’ మే వరిమా చ’ మే ప్రథిమా చ’ మే వర్ష్మా చ’ మే ద్రాఘుయా చ’ మే వృద్ధం చ’ మే వృద్ధి’శ్చ మే సత్యం చ’ మే శ్రద్ధా చ’ మే జగ’చ్చ మే ధనం’ చ మే వశ’శ్చ మే త్విషి’శ్చ మే క్రీడా చ’ మే మోద’శ్చ మే జాతం చ’ మే జనిష్యమా’ణం చ మే సూక్తం చ’ మే సుకృతం చ’ మే విత్తం చ’ మే వేద్యం’ చ మే భూతం చ’ మే భవిష్యచ్చ’ మే సుగం చ’ మే సుపథం చ మ ఋద్ధం చ మ ఋద్ధిశ్చ మే క్లుప్తం చ’ మే క్లుప్తి’శ్చ మే మతిశ్చ’ మే సుమతిశ్చ’ మే || 2 ||

తాత్పర్యము :

నేను రుద్రుని అర్చించుట వలన - ఆహారము, దాన్ని ఇచ్చే మనసు,  ఉత్సాహము, కాపాడుకునే శక్తి, ఆహారాన్ని సంపాదించే శక్తి, దోషములు లేకుండా మంత్రోచ్చారణ చేసే సామర్థ్యం, యశస్సు, ఉచ్చారణ, వివేకము, స్వర్గము, ఆత్మ శక్తి,  అపాన వ్యానాదులు,  ఆత్మ, ఆలోచన, ఆలోచనచే గ్రహించ బడేవి, వాక్కు, మనస్సు, ఇంద్రియములు, జ్ఞానమును పొందుటకు కావలసిన ఇంద్రియ శక్తి, ఆత్మ బలము, శత్రువులను సంహరించే శక్తి, ఆయుష్షు, వృద్ధాప్యం, ఆరోగ్యకరమైన శరీరము, ఆనందము, శరీరాన్ని కాపాడటానికి ఆయుధాలు, బలమైన, స్థిరమైన అవయవములు, ఎముకలు, కీళ్ళు మొదలగు అవయవములు - నాతో, నాలో ఉండు గాక. 


మూడవ అనువాకము:

శం చ’ మే మయ’శ్చ మే ప్రియం చ’ మే‌உనుకామశ్చ’ మే కామ’శ్చ మే సౌమనసశ్చ’ మే భద్రం చ’ మే శ్రేయ’శ్చ మే వస్య’శ్చ మే యశ’శ్చ మే భగ’శ్చ మే ద్రవి’ణం చ మే యన్తా చ’ మే ధర్తా చ’ మే క్షేమ’శ్చ మే ధృతి’శ్చ మే విశ్వం’ చ మే మహ’శ్చ మే సంవిచ్చ’ మే ఙ్ఞాత్రం’ చ మే సూశ్చ’ మే ప్రసూశ్చ’ మే సీరం’ చ మే లయశ్చ’ మ ఋతం చ’ మే‌உమృతం’ చ మే‌உయక్ష్మం చ మే‌உనా’మయచ్చ మే జీవాతు’శ్చ మే దీర్ఘాయుత్వం చ’ మే‌உనమిత్రం చ మే‌உభ’యం చ మే సుగం చ’ మే శయ’నం చ మే సూషా చ’ మే సుదినం’ చ మే || ౩ ||

తాత్పర్యము :

ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - కీర్తి, నాయకత్వము, క్రోధము, చలించని మనసు, చల్లని నీరు, గెలిచే మరియు గౌరవము పొందే సామర్థ్యము, స్థిరాస్తులు, పుత్ర పౌత్రాదులు,   అప మృత్యువు లేని సంతానము, ధన ధాన్యములు, పెరిగే జ్ఞానము, సత్యము, వివరము పట్ల ధ్యాస, ఆకట్టుకునే సామర్థ్యము, శరీర సౌందర్యము, క్రీడలు ఇతర విషయముల వలన కలిగే ఆనందము, చేసేది, చేయబడేది, దేవతలా ఆశీర్వాదము, సత్కార్యములు, ఖజానా, నిలిచే సంపాదన, ఎక్కువ సంపాదించే సామర్థ్యము, ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి, మంచి మార్గములు, మంచి యజ్ఞ ఫలము, పుణ్యము, సత్సంపాదన, పని చేయ గలిగిన మంచి సామర్థ్యము, ముందు చూపు, నిలకడ - నాకు కలిగి, నాతో ఉండు గాక.


నాలుగవ అనువాకము:


ఊర్క్చ’ మే సూనృతా’ చ మే పయ’శ్చ మే రస’శ్చ మే ఘృతం చ’ మే మధు’ చ మే సగ్ధి’శ్చ మే సపీ’తిశ్చ మే కృషిశ్చ’ మే వృష్టి’శ్చ మే జైత్రం’ చ మ ఔద్భి’ద్యం చ మే రయిశ్చ’ మే రాయ’శ్చ మే పుష్టం చ మే పుష్టి’శ్చ మే విభు చ’ మే ప్రభు చ’ మే బహు చ’ మే భూయ’శ్చ మే పూర్ణం చ’ మే పూర్ణత’రం చ మే‌உక్షి’తిశ్చ మే కూయ’వాశ్చ మే‌உన్నం’ చ మే‌உక్షు’చ్చ మే వ్రీహయ’శ్చ మే యవా”శ్చ మే మాషా”శ్చ మే తిలా”శ్చ మే ముద్గాశ్చ’ మే ఖల్వా”శ్చ మే గోధూమా”శ్చ మే మసురా”శ్చ మే ప్రియఙ్గ’వశ్చ మే‌உణ’వశ్చ మే శ్యామాకా”శ్చ మే నీవారా”శ్చ మే || 4 ||

తాత్పర్యము :

ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - ఇహ లౌక, పారలౌకిక ఆనందాలు, కోరిక, దాని ఫలము, ప్రీతి కలిగించే బంధు జనము, రక్షణ, యశస్సు , కీర్తి, మంచి అలవాట్లు, అదృష్టము, సంపద, తండ్రి వలె నన్ను నడిపించే సద్గురువు,  ఆస్తులను కాపాడుకునే శక్తి, స్థైర్యము, మంచితనము, గుర్తింపు, వేద శాస్త్రాల జ్ఞానము, అధ్యాపకత, పని చేసే, చేయించ గలిగే సామర్థ్యము, ఆజ్ఞాపించే అధికారము, పశు సంపద, అవరోధము లేని మార్గము, మంచి అగ్నిహోత్రము, ద్రవ్యములు, వాటి వలన కలిగే శుభములు, క్షయ వ్యాధి నుంచి రక్షణ, జ్వరములనుండి రక్షణ, ఔషధ సేవ లేని జీవితం, దీర్ఘాయుష్షు, అందరితో స్నేహంగా ఉండే వాతావరణము, నిర్భయము, సత్ప్రవర్తన, మంచి నిద్ర, మంచి ఉదయము, మంచి రోజులు - నాతో ఉండు గాక. 


అయిదవ అనువాకము:

అశ్మా చ’ మే మృత్తి’కా చ మే గిరయ’శ్చ మే పర్వ’తాశ్చ మే సిక’తాశ్చ మే వనస్-పత’యశ్చ మే హిర’ణ్యం చ మే‌உయ’శ్చ మే సీసం’ చ మే త్రపు’శ్చ మే శ్యామం చ’ మే లోహం చ’ మే‌உగ్నిశ్చ’ మ ఆప’శ్చ మే వీరుధ’శ్చ మ ఓష’ధయశ్చ మే కృష్ణపచ్యం చ’ మే‌உకృష్ణపచ్యం చ’ మే గ్రామ్యాశ్చ’ మే పశవ’ ఆరణ్యాశ్చ’ యఙ్ఞేన’ కల్పన్తాం విత్తం చ’ మే విత్తి’శ్చ మే భూతం చ’ మే భూతి’శ్చ మే వసు’ చ మే వసతిశ్చ’ మే కర్మ’ చ మే శక్తి’శ్చ మే‌உర్థ’శ్చ మ ఏమ’శ్చ మ ఇతి’శ్చ మే గతి’శ్చ మే || 5 ||

తాత్పర్యము :

ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - భుక్తి, మంచి వాక్కు, పాలు, మీగడ, నెయ్యి, తేనె, బంధువులతో భోజనము, పానము, వ్యవసాయము, వర్షములు, విజయ భూమి, వృక్షములు, మొక్కల సేద్యము, స్వర్ణము, రత్నములు, సంపదతో వచ్చే కీర్తి, ఆరోగ్యము, విలువైన పంట, మంచి పంట తెచ్చే ఇతర శుభములు, దినదినాభి వృద్ధి, పూర్ణత్వము, ఉత్కృష్టము కన్నా ఉన్నతమైనది, మరణము లేని స్థితి, బియ్యము, సజ్జలు, గోధుమలు, రాగులు, మినుములు, పెసలు మొదలగు ధాన్యములు, నూనె గింజలు, పప్పు దినుసులు - అన్ని నా వద్ద సమృద్ధిగా ఉండు గాక.


ఆరవ అనువాకము:

అగ్నిశ్చ’ మ ఇన్ద్ర’శ్చ మే సోమ’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే సవితా చ’ మ ఇన్ద్ర’శ్చ మే సర’స్వతీ చ మ ఇన్ద్ర’శ్చ మే పూషా చ’ మ ఇన్ద్ర’శ్చ మే బృహస్పతి’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే మిత్రశ్చ’ మ ఇన్ద్ర’శ్చ మే వరు’ణశ్చ మ ఇన్ద్ర’శ్చ మే త్వష్ఠా’ చ మ ఇన్ద్ర’శ్చ మే ధాతా చ’ మ ఇన్ద్ర’శ్చ మే విష్ణు’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే‌உశ్వినౌ’ చ మ ఇన్ద్ర’శ్చ మే మరుత’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే విశ్వే’ చ మే దేవా ఇన్ద్ర’శ్చ మే పృథివీ చ’ మ ఇన్ద్ర’శ్చ మే‌உన్తరి’క్షం చ మ ఇన్ద్ర’శ్చ మే ద్యౌశ్చ’ మ ఇన్ద్ర’శ్చ మే దిశ’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే మూర్ధా చ’ మ ఇన్ద్ర’శ్చ మే ప్రజాప’తిశ్చ మ ఇన్ద్ర’శ్చ మే || 6 ||

తాత్పర్యము :

ఓ రుద్రా!  నిన్ను అర్చించుట వలన - రాళ్ళు, మట్టి, కొండలు, పర్వతాలు, ఇసుక, భూమి యందు పెరిగే అన్ని వస్తువులు, అన్ని రకముల ఖనిజములు, లవణాలు, అగ్ని, నీరు, తీగ మొక్కలు,  ఔషధపు మొక్కలు, పెంచేవి, పెంచని మొక్కలు, గ్రామాలలో, అరణ్యాలలో ఉండే సంపద, పశుసంపద, అగ్నిహోత్రములో వాడే ద్రవ్యములు,  పిత్రార్జితములు, సంతానము మరియు ఇతరులకు చెందిన ఆస్తులు, స్థిర, చరాస్తులు, నా ధర్మమునకు చెందిన కర్మలు, కర్మలు చేయుటకు కావలసిన శక్తి, వాటి ఫలము, ఆనందము పొందే సాధనములు, వాటి ఫలితములు - నాతో ఉండు గాక. 


ఏడవ అనువాకము:

అగ్ంశుశ్చ’ మే రశ్మిశ్చ మే‌உదా”భ్యశ్చ మే‌உధి’పతిశ్చ మ ఉపాగ్ంశుశ్చ’ మే‌உన్తర్యామశ్చ’ మ ఐన్ద్రవాయవశ్చ’ మే మైత్రావరుణశ్చ’ మ ఆశ్వినశ్చ’ మే ప్రతిప్రస్థాన’శ్చ మే శుక్రశ్చ’ మే మన్థీ చ’ మ ఆగ్రయణశ్చ’ మే వైశ్వదేవశ్చ’ మే ధ్రువశ్చ’ మే వైశ్వానరశ్చ’ మ ఋతుగ్రహాశ్చ’ మే‌உతిగ్రాహ్యా”శ్చ మ ఐంద్రాగ్నశ్చ’ మే వైశ్వదేవశ్చ’ మే మరుత్వతీయా”శ్చ మే మాహేన్ద్రశ్చ’ మ ఆదిత్యశ్చ’ మే సావిత్రశ్చ’ మే సారస్వతశ్చ’ మే పౌష్ణశ్చ’ మే పాత్నీవతశ్చ’ మే హారియోజనశ్చ’ మే
 || 7 ||

తాత్పర్యము :

ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన -  అగ్ని మరియు ఇంద్రుడు, చంద్రుడు మరియు ఇంద్రుడు, సూర్యుడు మరియు ఇంద్రుడు, సరస్వతి మరియు ఇంద్రుడు, పూషా మరియు ఇంద్రుడు, బృహస్పతి మరియు ఇంద్రుడు, మిత్రుడు మరియు ఇంద్రుడు, వరుణుడు మరియు ఇంద్రుడు, త్వష్ట మరియు ఇంద్రుడు, ధాత మరియు ఇంద్రుడు, అశ్వినీ దేవతలు మరియు ఇంద్రుడు, మరుత్ దేవతలు మరియు ఇంద్రుడు, వసువులు మరియు ఇంద్రుడు, భూమి మరియు ఇంద్రుడు, అంతరిక్షము మరియు ఇంద్రుడు, స్వర్గము మరియు ఇంద్రుడు, నాలుగు దిక్కులు మరియు ఇంద్రుడు, మూర్ధ్నము మరియు ఇంద్రుడు, ప్రజాపతి మరియు ఇంద్రుడు - నన్ను ఆశీర్వదించు గాక.


ఎనిమిదవ అనువాకము:

ఇధ్మశ్చ’ మే బర్హిశ్చ’ మే వేది’శ్చ మే దిష్ణి’యాశ్చ మే స్రుచ’శ్చ మే చమసాశ్చ’ మే గ్రావా’ణశ్చ మే స్వర’వశ్చ మ ఉపరవాశ్చ’ మే‌உధిషవ’ణే చ మే ద్రోణకలశశ్చ’ మే వాయవ్యా’ని చ మే పూతభృచ్చ’ మ ఆధవనీయ’శ్చ మ ఆగ్నీ”ధ్రం చ మే హవిర్ధానం’ చ మే గృహాశ్చ’ మే సద’శ్చ మే పురోడాశా”శ్చ మే పచతాశ్చ’ మే‌உవభృథశ్చ’ మే స్వగాకారశ్చ’ మే || 8 ||

తాత్పర్యము :

ఓ రుద్రా! నిన్ను అర్చించుట కొరకు  -  సోమయాగమునకు కావలసిన పాత్రలు, ఆజ్య పాత్రలు, ఘ్రుత పాత్రలు,  ఇంద్రాది దేవతలకు సమర్పించ వలసిన సోమరస పాత్రలు,  ఆశ్వినాది ఇతర దేవతలకు సోమరస పాత్రలు, వైశ్వదేవాది దేవతలకు సోమరస పాత్రలు మొదలగునవి నా చేత ఉన్నాయి.


తొమ్మిదవ అనువాకము:

అగ్నిశ్చ’ మే ఘర్మశ్చ’ మే‌உర్కశ్చ’ మే సూర్య’శ్చ మే ప్రాణశ్చ’ మే‌உశ్వమేధశ్చ’ మే పృథివీ చ మే‌உది’తిశ్చ మే దితి’శ్చ మే ద్యౌశ్చ’ మే శక్వ’రీరఙ్గుల’యో దిశ’శ్చ మే యఙ్ఞేన’ కల్పన్తామృక్చ’ మే సామ’ చ మే స్తోమ’శ్చ మే యజు’శ్చ మే దీక్షా చ’ మే తప’శ్చ మ ఋతుశ్చ’ మే వ్రతం చ’ మే‌உహోరాత్రయో”ర్-దృష్ట్యా బృ’హద్రథంతరే చ మే యఙ్ఞేన’ కల్పేతామ్ || 9 ||

తాత్పర్యము :

ఓ రుద్రా! నేను నీ భక్తుడనయినందు వలన - మర్రి చెట్టు చిదుగులు, దర్భలు, యాగశాల, సహాయమునకు స్త్రీలు, సోమరస పాత్రలు, సోమ తీగ చిగుళ్ళు నూరుటకు రాళ్ళు, సమిధలు, చెక్కలు, అగ్ని సృష్టించుటకు భూమిలో రంధ్రములు, ద్రోణము, వాయవ్యసము, ఇతర పవిత్రమైన పాత్రలు,యాగ ద్రవ్యములు ఉంచుటకు, స్త్రీలు ఆసీనులు అగుటకు, ఇతరులు వీక్షించుటకు ప్రదేశము, చెరువు (హోమములో హుతమునకు), బలి, అనంతరము స్నానమునకు ప్రదేశము, సమిథలతో పాటు హవానములో వేసే ఇతర ద్రవ్యములు నా చెంత ఉండు గాక. 


పదవ అనువాకము:
గర్భా”శ్చ మే వత్సాశ్చ’ మే త్ర్యవి’శ్చ మే త్ర్యవీచ’ మే దిత్యవాట్ చ’ మే దిత్యౌహీ చ’ మే పఞ్చా’విశ్చ మే పంచావీ చ’ మే త్రివత్సశ్చ’ మే త్రివత్సా చ’ మే తుర్యవాట్ చ’ మే తుర్యౌహీ చ’ మే పష్ఠవాట్ చ’ మే పష్ఠౌహీ చ’ మ ఉక్షా చ’ మే వశా చ’ మ ఋషభశ్చ’ మే వేహచ్చ’ మే‌உనడ్వాం చ మే ధేనుశ్చ’ మ ఆయు’ర్-యఙ్ఞేన’ కల్పతాం ప్రాణో యఙ్ఞేన’ కల్పతామ్-అపానో యఙ్ఞేన’ కల్పతాం వ్యానో యఙ్ఞేన’ కల్పతాం చక్షు’ర్-యఙ్ఞేన’ కల్పతాగ్ శ్రోత్రం’ యఙ్ఞేన’ కల్పతాం మనో’ యఙ్ఞేన’ కల్పతాం వాగ్-యఙ్ఞేన’ కల్పతామ్-ఆత్మా యఙ్ఞేన’ కల్పతాం యఙ్ఞో యఙ్ఞేన’ కల్పతామ్ || 10 ||

తాత్పర్యము :

ఓ రుద్రా! నేను నీ భక్తుడనయినందు వలన యాగామునకు కావాల్సిన అగ్ని, అగ్ని కార్యమునకు కావాల్సిన ఇతర పూర్వ కార్యక్రమములు, దిక్పాలకులకు, పంచాభూతములకు చేయవలసిన సమర్పణ (ఆశ్వాది బలులు), వేద పారాయణ , ప్రాయశ్చిత్తము, శాంతి హోమములు, పూర్ణాహుతి ముహూర్త నిర్ణయం, పూర్ణాహుతి కార్యక్రమము, ఇతర క్రియలు నా చేతుల మీదుగా జరుగు గాక.

(ఇక్కడ గో స్తన్యము నుండి పాలు త్రాగుట, అశ్వాన్ని బలి ఇవ్వటం(దీనిపై తగు వివరణ కలదు. అన్యధా భావించరాదు), వివిధ దేవతలకు బలి సమర్పించటం, శుద్ధి, ప్రాయశ్చిత్తం వివరాలు పై రెండు అనువాకాల్లో పేర్కొన బడ్డాయి)


పదకొండొవ అనువాకం :

ఏకా’ చ మే తిస్రశ్చ’ మే పఞ్చ’ చ మే సప్త చ’ మే నవ’ చ మ ఏకా’దశ చ మే త్రయోదశ చ మే పఞ్చ’దశ చ మే సప్తద’శ చ మే నవ’దశ చ మ ఏక’విగ్ంశతిశ్చ మే త్రయో’విగ్ంశతిశ్చ మే పఞ్చ’విగ్ంశతిశ్చ మే సప్త విగ్‍మ్’శతిశ్చ మే నవ’విగ్ంశతిశ్చ మ ఏక’త్రిగ్ంశచ్చ మే త్రయ’స్త్రిగ్ంశచ్చ మే చత’స్-రశ్చ మే‌உష్టౌ చ’ మే ద్వాద’శ చ మే షోడ’శ చ మే విగ్ంశతిశ్చ’ మే చతు’ర్విగ్ంశతిశ్చ మే‌உష్టావిగ్‍మ్’శతిశ్చ మే ద్వాత్రిగ్‍మ్’శచ్చ మే షట్-త్రిగ్‍మ్’శచ్చ మే చత్వారిగ్ంశచ్చ’ మే చతు’శ్-చత్వారిగ్ంశచ్చ మే‌உష్టాచ’త్వారిగ్ంశచ్చ మే వాజ’శ్చ ప్రసవశ్చా’పిజశ్చ క్రతు’శ్చ సువ’శ్చ మూర్ధా చ వ్యశ్ని’యశ్-చాన్త్యాయనశ్-చాన్త్య’శ్చ భౌవనశ్చ భువ’నశ్-చాధి’పతిశ్చ || ౧౧ ||

ఓం ఇడా’ దేవహూర్-మను’ర్-యఙ్ఞనీర్-బృహస్పతి’రుక్థామదాని’ శగ్ంసిషద్-విశ్వే’-దేవాః సూ”క్తవాచః పృథి’విమాతర్మా మా’ హిగ్ంసీర్-మధు’ మనిష్యే మధు’ జనిష్యే మధు’ వక్ష్యామి మధు’ వదిష్యామి మధు’మతీం దేవేభ్యో వాచముద్యాసగ్ంశుశ్రూషేణ్యా”మ్ మనుష్యే”భ్యస్తం మా’ దేవా అ’వన్తు శోభాయై’ పితరో‌உను’మదన్తు ||


ఓం శాంతిః శాంతిః శాంతిః 

తాత్పర్యము :
గర్భిణీలు అయిన గోవులు, గోవులు, దూడలు, ఒకటిన్నర, రెండు, రెండున్నర, మూడు, మూడున్నర, నాలుగు సంవత్సరములున్న గోవులు, ఎద్దులు, వీర్యమున్న ఎద్దులు, బాలింతలైన గోవులు, గొడ్లు అందుబాటులో ఉండుగాక. ఈ అగ్నిహోత్రములోని అగ్ని నాకు పూర్ణాయుష్షు, ఉచ్చ్వాశ నిశ్శ్వాసలు, ఆరోగ్యకరమైన కళ్ళు, చెవులు, మనసు, వాక్కు, ఆత్మను ఇచ్చు గాక. ఇటువంటి కార్యములు ఇంకా చేయుటకు శక్తిని ఇచ్చు గాక. ఒకటి, మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు, పదిహేను, పదిహేడు, పంతొమ్మిది, ఇరవై ఒకటి, ఇరవై మూడు, ఇరవై ఐదు, ఇరవై ఏడు, ఇరవై తొమ్మిది, ముప్ఫై ఒకటి, ముప్ఫై మూడు నాతో ఉండు గాక. నాలుగు, ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇరవై, ఇరవై నాలుగు, ఇరవై ఎనిమిది, ముప్ఫై రెండు, ముప్ఫై ఆరు, నలభై, నలభై నలుగు, నలభై ఎనిమిది నాతో ఉండు గాక. ఆహారము, ధాన్యము, ధన్యోత్పత్తి, దాని వృద్ధి, అగ్నిహోత్రము నాతో ఉండు గాక. దీనికొరకు నేను పంచ భూతములను, దిక్పాలకులను నాయందు కరుణ చూపవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

(ఇక్కడ చెప్పబడిన సంఖ్యలు సరి సంఖ్యలు భూలోక సంబంధమైనవి గా, బేసి సంఖ్యలు  దేవలోక సంబంధమైనవిగా వ్యాఖ్యానించ బడినది. ఇంకొక వ్యాఖ్యానం -  ఒక ప్రకృతి, మూడు గుణములు, పంచ భూతములు,  ఏడు ఇంద్రియములు, నవ రంధ్రములు...ఇలా ప్రతి ఒక సంఖ్య ఒక విశేషమైన ప్రాధాన్యత సంతరించు కొన్నట్లు)

కామధేనువు దేవతలను ఆహ్వానించు గాక; మనువు కార్యము చేయు గాక.  బృహస్పతి మంత్రములు చదువు గాక. విశ్వ దేవుడు పధ్ధతి చెప్పు గాక. ఓ భూమాత! మాకు ఆటంకములు కలిగించకు. నేను ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో, సత్కార్యములు చేస్తూ, దేవతలకు ప్రీతికరమైన వస్తువులు తెచ్చి సమర్పిస్తాను. సజ్జనులారా! నేను ఈ విధంగా చేసినందు వలన ఆ దేవతలు, పితరులు నన్ను రక్షింతురు గాక.  


ఓం శాంతి శాంతి శాంతి ఇది కృష్ణ యజుర్వేదములోని, నాలుగవ కాండ, ఏడవ ప్రపాఠకములోనిది.

శ్రీరుద్రం నేర్చుకోవాలనుకునే జిజ్ఞాసువుల కోసం ఆడియో పిడిఎఫ్ లింక్ జతపరుస్తున్నాను
నమకం: http://www.sssbpt.org/sri-rudram/instructions-to-user.htm
చమకం: http://www.sssbpt.org/sri-rudram/chamakam.html


పాఠకులకు విజ్ఞప్తి. నమక,చమక భావాల యొక్క అర్థం....మనకు సామాన్య రూపంలో కనబడినా, వాటి "పరా" అర్థం అనేది సామాన్య మానవుల భావాలకు అతీతంగా ఉంటుంది.

సంకలనం

No comments:

Post a Comment