Sunday, 22 October 2017

(శంకరజయంతి సందర్భంగా "పునర్ముద్రణ!")




శ్రీ శంకరుల “రచనాచమత్కృతి” (శంకరజయంతి సందర్భంగా "పునర్ముద్రణ!")

వేదాంతసందేశంతోబాటు ఆదిశంకరులు కవిత్వవిషయమై కూడా ఎన్నో సందర్భాలలో తన అసాధారణ ప్రతిభాపాటవాలను చూపిస్తూంటారు!

ఆయన రచనలు రెంటిని గమనించగా వాటిలో ఆయన రచనాచమత్కృతి ఒకటి ప్రస్ఫుటంగా కనిపించింది - మొదటిది “అర్ధనారీశ్వరస్తోత్రమ్”, రెండవది “ఉమామహేశ్వరస్తోత్రమ్.” మొదటిదానిలో 8, రెండవదానిలో 12 శ్లోకాలు ఉన్నాయి.

“అర్ధనారీశ్వరస్తోత్రమ్”లో ఇద్దరినీ విడివిడిగా (తనువులు సగంసగంగా) పరిగణించి స్తుతించాడాయన.

“ఉమామహేశ్వరస్తోత్రమ్”లో ద్వివచనాన్నుపయోగించి, “వారిద్దరినీ కలిపి/ఒకటిగా చేసి” వ్రాశాడు!

‘నమః’ అనే శబ్దానికి చతుర్థీవిభక్తి ఉంటుందని గుర్తుచేసుకుని (ఏకవచనంలో) శివాయ నమః - శివునికొరకు నమస్కారము - అకారాంత పుంలింగశబ్దం - “శివ”; శివాయై - శివాకొరకు (పార్వతీదేవికొరకు) నమస్కారము - ఆకారాంత స్త్రీలింగశబ్దం - “శివా”; శివాయై), రెండు శ్లోకాలనూ పరిశీలించుదాం!

ఆలాగే ద్వివచనంలో “భ్యామ్” అనే ప్రత్యయం చతుర్థిలో వస్తుంది.

1) మొదట “అర్ధనారీశ్వర.. “

(‘అర్థ’ కాదు! అర్ధం - అంటే సగం; ‘అర్థం’ అంటే ‘మీనింగ్’, పురుషార్థం, దేనికోసమో అది’ మొ/)

2వ శ్లోకం:

కస్తూరికా కుంకుమచర్చితాయై

చితారజః పుంజ విచర్చితాయ/

కృతస్మరాయై వికృతస్మరాయ

నమశ్శివాయై చ నమశ్శివాయ//

(చర్చిత - పూయబడినది; విచర్చిత - విశేషంగా పూయబడిన; చితారజఃపుంజ - చితియందలి భస్మపు కుప్పచేత; స్మరుడు - మన్మథుడు; కృతస్మరా - (శివుడికి) మన్మథవికారము కలిగించిన పార్వతి; వికృతస్మరుడు - మన్మథుడిని విరూపుడిగా చేసిన శివుడు)

కస్తూరితోను, కుంకుమతోను పూయబడినది, శివుడికి మన్మథవికారమను కలిగించినదియైన పార్వతీదేవికి నమస్కారము.

చితియందలి భస్మాన్ని విశేషంగా పూసుకొన్నవాడు, మన్మథుడికి వికృతిని (నాశనాన్ని) కలిగించినవాడు ఐన శివుడికి నమస్కారం.

ఇక్కడ వారిద్దరినీ విడివిడిగా పరిగణించాడు కవి, క్రమాలంకారాన్ని కూడా ప్రయోగించాడు.

2) ఇక “ఉమామహేశ్వర..” మొదటి పద్యం:

నమశ్శివాభ్యాం, నవయౌవనాభ్యామ్,

పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యామ్/

నగేన్ద్రకన్యా వృషకేతనాభ్యామ్

నమో నమః శంకరపార్వతీభ్యామ్//

(ఆశ్లిష్ట - కలిసిపోయిన/పెనవేసుకున్న; నగ+ఇన్ద్రకన్యా - పర్వతరాజు కుమార్తె; వృషకేతనుడు - ఎద్దు తన వాహనంగా/గుర్తుగా కలవాడు)

( నవయౌవనవంతులైన, పరస్పరం ఒకరిలో ఒకరు ఇమిడిపోయిన శరీరాలు కలవారైన, హిమవంతుడికుమార్తె, వృషధ్వజమును కలిగిన - “శివా (పార్వతి), శివ (శివుడు) - వీరిరువురికీ నమస్సులు!)

రెంటిలోనూ చెప్పేది ఒకే జంటగురించే, కానీ అభేదస్వరూపులైన వారిరువురియందు రచనలో/ప్రకటనలో ఒక రకమైన భేదాన్ని చూపడం వీటిలోని వైవిధ్యం!

మిగతా శ్లోకాలలో కూడా ఇదే పద్ధతి కనిపిస్తుంది, అన్వేషించి, చదివి, అవసరమైతే చర్చించి, ఆనందించండి!

No comments:

Post a Comment