Wednesday, 1 June 2016



ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - ఆద్యాత్మిక ప్రభ 
సర్వేజనా సుఖినోభవంతు 

1.ప్రతిమలో నినుగాంచి బండరాయంటినీ 
. మ్రొక్కుచుండెడి వాడు మూఢుడంటి 
నీ శక్తి నెరుగక నిన్ను దూషించితి 
. నరునికంటెను గొప్ప నాస్తి యంటి 
భ్రాంతిలో మునిగితి నింతకాలము నేను 
. కమలాక్షీ నీశక్తి గాంచనైతి 
వయసు శాశ్వతమంచు బాపముల్ సల్పితిన్ 
. బరమ పాపిని నేను పాహి పాహి 

మూఢమతులను బ్రోచుచున్ ముక్తినిచ్చి 
జ్ఞాన సంపద నివ్వవే జ్ఞానదాయి 
శరణు శరణంటి పదమంటి శారదాంబ 
వాసరాపుర వాసిత వాసరాంబ


2.నల్లనివాడు! పద్మనయనంబులవాడు! మహాశుగంబులన్ 
విల్లును దాల్చువాడు! గడు విప్పగు వక్షమువాడు! మేలు పై 
జల్లెడువాడు! నిక్కిన భుజంబులవాడు! యశంబు దిక్కులం 
జల్లెడువాడు! నైన రఘుసత్తముడీవుత మా కభీష్టముల్

3.అదిదేవుడైన యారామచంద్రుని 
కబ్ధి గట్టుటెంత? యసురకోటి 
జంపుటెంత? కపుల సహయ్య మదియెంత 
సురుల కొరకు క్రీడ జూపె గాక!!

4.విషధర రిపు గమనునికిని 
విషగళ సఖునికిని, విమల విషశయునునికిన్ 
విషభవభవజనకునికిని 
విషకుచ చను విషముఁగొనుట విషమే తలపన్ 

విషధర=సర్పాలకు, రిపు=శత్రువైన గరుడుని గమనునికి=వాహనముగా గలవనికి, విషగళ=శంకరుని, సఖుడు=శ్రీవిష్ణువు, విషశయనునికిన్=విష మనగ నీరు, అనగా పాల సముద్రమున పవ్వళించును కదా, విషభవ=నీటిలో పుట్టిన, భవ=బ్రహ్మయొక్క, జనకునికి=తండ్రికి, విషకుచయగు పూతన విషము తీసుకొనుటపెద్ద విషమగునా. యేమంత విషయము కాదనుట.

5.కేరింతల్ కడుసల్పు పాప డపుడే కేల్గాలు లాడించుచున్ 
సారిoచున్ తన దివ్య లోకనములన్ సర్వ ప్రపంచమ్ముపై 
పారించెంతయు బోసి నవ్వు నదులన్ భాసించు గంధర్వుడై 
కేరంచేడ్చును దిక్కులన్ మధుర సంగీతంబు నిండించుచున్ 

పాపడి మర్మార్థ వాక్యాలకును వ్యాక 
రణము వ్రాసెడి సుదీమణియె లేడు 

పాపడి లొల్లాయి పాటల సంగతుల్ 
పసిగట్టు సంగీత పరుడు లేడు 

పాపడి అభినయ ప్రజ్ఞ జూసియు దర్శ 
కత్వము గావించు ఘనుడు లేడు 

పాపడు క్రీడించ పటిమ శిక్షణ నిచ్చి 
ఆడించు మేలు కిలాడి లేడు 

లక్షణoబులకును మున్న లక్ష్య మనగ 
మాతృ మూర్త్యంకమే సభా మంటప మన 
సహజ సత్కళా వైభవ స్థాపకుండు 
వన్నె చిన్నెల చిన్నారి పాపడుండు

6.ఏ వేల్పులకు లేని యీశ్వర శబ్దంబుఁ దాల్చు నెవ్వఁడు సుధా ధాముతోడ 
నవని ప్రధానంబు లైన యంగంబుల సవరించు నెవ్వాఁడు సకల జగము 
నేకతంబున వసియించి యెవ్వనిఁ గంద్రు యోగీశ్వ రేశ్వరుల్ యోగదృష్టి 
నెవ్వని పదము సూక్ష్మేక్ష బుధుల్ పున రావృత్తి శూన్యక మండ్రు తెలిసి 

యతఁడు శంభుండు విశ్వ లోకైకసాక్షి 
యడుగఁ బుత్తెంచినాఁడు నీ యనుఁగుఁ గూఁతు 
నిమ్ము పెండిలి పెద్దల పెద్దల మేము మీకుఁ 
దిహిన గిరి రాజ! భాగ్యవంతుండ వైతి 

హిమవంతునితో శివునకు కన్యాదానము చేయుమని పెండ్లి పెద్దగా వచ్చిన బృహస్పతి చెప్పిన మాటలు. 
శ్రీనాధ మహాకవి "హరవిలాసము" నుండి

7.పట్టాభియోగ సౌభాగ్యము ల్దిలకించి నందుండు సంతతానందమొందఁ 
ద్రోటుపల్కులు ముద్దుదొలఁకు నవ్వులు గాంచి మురిసి యశోద సమ్మోదమంద 
నవమోహనాంగ సౌందర్యంబు భావించి పసిగాఁపు గుబ్బెతల్ పైఁబడంగఁ 
బూఁటపూఁటకు వృద్ధిఁబొందురూపముఁజూచి జనులెల్ల నాశ్చర్యమునఁ జెలంగ 

తలిరువలె గోమునై మొగ్గవలెను సోగ 
యై యలరువలె మృదువునై కాయవలెను 
బెక్కువై పండువలె నెఱచొక్కమగుచుఁ 
దేనెవలెఁ దేటయై శౌరి తేజరిల్లె 

వెలిదిండ్ల వేంకటపతి మహాకవి విరచిత "శృంగార రాధామాధవ సంవాదము" నుండి

--((*))--

9.నారాయణునిదివ్యనామసంకీర్తనం బనిశంబుఁ జేయుమహాత్ములకును 
బద్మాక్షుశ్రీపాదపద్మంబు లత్యంత భక్తిమైఁ బూజించు ప్రాజ్ఞులకును 
విశ్వరూపునిమూర్తివిభవంబు నేకాగ్ర బుద్ధి భావించుసత్పురుషులకును 
లక్ష్మీశ్వరునిసముల్లాసహేతువులగు వ్రతములు సల్పు సద్వర్తనులకు 

భవము దీఱినతుది వచ్చి భవ్యసుఖము 
లనుభవింపగఁ దగునెల వగుటఁ జేసి 
యఖిలవస్తుసంపదలకు నాకరంబు 
గుణవిథావిభాసురము వైకుంఠపురము 

ప్రబంధపరమేశ్వరుడు ఎఱ్ఱాప్రగడ విరచిత "నృసింహపురాణము" నుండి వైకుంఠపుర మహిమ వర్ణనము.

10.భువనరక్షక! నిన్నుఁ బొగడనెరని నోరు, ప్రజ కగోచరమైన పాడుబొంద 
సురవరార్చిత! నిన్నుఁ జూడఁగోరని కనుల్, జలములోపలి నెల్లి సరపుగుండ్లు 
శ్రీరమాధిప! నీకు సేవఁజేయని మేను, కూలి కమ్ముడువోని కొలిమితిత్తి 
వేడ్కతో నీకథల్ వినని కర్ణములైనఁ, కఠినశిలాదులఁ గలుగు తొలలు 

పద్మలోచన నీమీఁది భక్తిలేని 
మానవుఁడు రెండుపాదాల మహిషమయ్య 
భూషణవికాస! శ్రీధర్మపురనివాస 
దుష్టసంహార! నరసింహ దురితదూర! 

శేషప్పకవి "నరసింహ శతకము" నుండి

11.మృదుతల్పమై నీదు మదికిఁబ్రీతినిఁ గొల్ప, భోగీంద్రుఁడనుకాను భోగిశయన 
భుజమునందిడినిన్ను భువిఁద్రిప్పి మెప్పింపఁ, బక్షిరాజునుగాను పక్షివాహ 
స్వాంతాంబుకఱగున ట్లెంతయు వేఁడంగ, దంతీశుఁడనుకాను దంతిరక్ష 
భక్తిచే నీకృపా పరఁతఁగాంచుటకుఁ బ్ర, హ్లాదుండఁగాను ప్రహ్లాదవరద 

యెటులప్రోచెదొ మదిఁదోప దించుకైన 
మానసంబున భక్తి నమస్కరింతు 
సాంద్రకరుణాలవాల విశాలశీల 
భక్తజనలోల గోపాలబాల 

పన్నాల వేంకటసుబ్బరాయశర్మ "గోపాల శతకము" నుండి

12.రాకామలజ్యోత్స్నఁ ద్రావ నిచ్చలు గన్న నాచకోరంబుల కరుచి యగునె
సహకారపల్లవచయములు దొరకిన జాతికోయిలలకుఁ జప్ప నగునె
క్షీరాబ్ధిలోపలఁ గ్రీడింపఁగల్గిన భువి రాజహంసకుఁ బుల్ల నగునె
విరిదమ్మివాసనవెల్లి ముంచినఁ గ్రోలు షట్పదముల కనాస్వాద్య మగునె

బహుళతరదయార్ద్రభావప్రభావన
మహిమఁ దనరు జంగమంబు రాఁగ
నతులభక్తిపరుల కాహ్లాదకర మగుఁ
బరిహృతాభిషంగ బసవలింగ

పాలకురికి సోమనాథమహాకవి ప్రణీత "చతుర్వేదసారము" నుండి

13.కట్టడ యైనయట్టినిజ కర్మము చుట్టుచువచ్చి యేగతిం
బెట్టునొ పెట్టిన ట్లనుభవింపక తీఱదు; కాళ్ళు మీఁదుగాఁ
గిట్టక వ్రేలుఁ డంచుఁ దల క్రిందుగఁ గట్టిరె యెవ్వరైన నా
చెట్టున గబ్బిలంబులకుఁ జేరినకర్మము గాక భాస్కరా


14.వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి, ని
ర్వాణశ్రీఁ చెరపట్టఁ చూచిన విచారద్రోహమో, నిత్య క
ళ్యాణ క్రీడలఁ బాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ
శ్రేణీ ద్వారము దూరఁ జేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా!

ఒక మంచిపద్యరూపప్రణయలేఖ...... 

పింగళి సూరనమాత్యుడు క్రీ.శ. 1560ప్రభావతీ ప్రద్యుమ్నమున ప్రద్యుమ్నుని యుత్తరము పద్యముగానే వ్రాసియున్నాడు.. 

సీ... ''శ్రీ మత్స్సరవతీ రాలాకృపా సంప్ర 
యుక్తోపమాతిశ యోక్తికామ 
ధేను సద్బిరుదాంక దివ్యమంజీర సం 
శోభిత పాదకు శుచిముఖికిని 
ప్రద్యుమ్ను డూర్జిత ప్రణయపూర్వకముగా 
ననిపిన యట్టిరహస్య లేఖ 
ప్రప్రభా వతి బలు తెరంగుల నీవు 
రచియింప'' నని చదువుచునె యబ్బి 

గీ..సంతసము నాపజాలక చంక వైచు 
కొనుచు నొకదాటుకుని నిన్నుగూర్చి కాంతు 
డనిపినట్టి పత్రిక యెకదమ్మ భాగ్య 
వతివి నీవని చెలిప్రభావతిని బల్కె..

15.పొడువకుండఁగ నోడుఁ బొడువంగ నోడు శి వాజ్ఞను మీఱి యహస్కరుండు 
వీవకుండఁగ నోడు వీవంగ నోడు శి వాజ్ఞను మీఱి మహానిలుండు 
కాలకుండఁగ నోడుఁ గాలంగ నోడు శి వాజ్ఞను మీఱి హుతాశనుండు 
కురియింపమికి నోడుఁ గురియింప నోడు శి వాజ్ఞకు వెఱచి వజ్రాయుధుండు 

చంపకుండఁగ నోడును జంప నోడు 
మృడునియాజ్ఞను మీఱియు మృత్యు దండ 
ధర విధాత లోడుదురట "ధావతి" యని 
పరగ శ్రుతులిట్టులను మ్రోయు బసవలింగ 

పాల్కూరికి సోమనాధుని "చతుర్వేదసారము" నుండి

16.దేవాదిదేవుని తెఱఁగిట్టిదందమా తెఱఁగులెల్లను బుట్టు తెఱఁగుదాన 
మదనమదారాతిఁ జదివెదమందమా చదువుల కెల్లను మొదలుదాన 
బ్రహ్మాదివంద్యుని బరికింతమందమా బ్రహ్మాదులకునైన బ్రహ్మదాన 
దేవతారాధ్యుని దెలిసెదమందమా తెలిసిన మీఁదటిధృతియుఁదాన 

యెంత యనఁగ నేర్తు నేమని వర్ణింతు 
నేది యాది యంత్య మేదియరయ 
సకలమునకు నతనిసంతతానందంబు 
నెఱిఁగి కొలఁదిసేయు నెట్లువచ్చు 

పరమశివుని గురించి చెప్పమని అడిగిన మునులతో వాయుదేవుడు పలికిన పలుకులు 
పోతనామాత్య "వీరభద్ర విజయము" నుండి

17.కరతల మల్లఁజూచి పులకండము నెయ్యియుఁ బిండి యుం 
డ్రముల్, పొరిఁబొరిఁగళ్ళు సేయుచును బుగ్గలఁ బెట్టుచుఁ 
బావుకొంచు నచ్చెరువుగ లీలతో నమలి చిక్కుచు 
సొక్కుచు గౌరిముందఱన్, గురువులవారు వ్రేఁగడుపుఁ 
గుఱ్ఱఁడు మాకు బ్రసన్నుఁ డయ్యెడిన్ 

పోతనామాత్య "వీరభద్రవిజయము" నుండి వినాయక స్తుతి

18.హరి దేవకికిఁ బుట్టె ననుపురాణము విండ్రు హరి పుట్టె నీశున కనుట వినరు 
హరి మ్రొక్కెఁ గొంతికి ననుపురాణము విండ్రు హరి మ్రొక్కె నీశున కనుట వినరు 
హరి బుద్ధపదవర్తి యనుపురాణము విండ్రు హరి శైవపదవర్తి యనుట వినరు 
హరి చచ్చె బోయచే ననుపురాణము విండ్రు హరి చచ్చె శరభుచే ననుట వినరు 

హరియుఁ గ న్ని చ్చె నరునకు ననుట విండ్రు 
హరియుఁ గ న్ని చ్చె నీశున కనుట వినరు 
జ్ఞానహీనులు మూర్ఖు లజ్ఞానరతులు 
పాపమతు లెట్టిదుష్టులో బసవలింగ 

పాల్కూరికి సోమనాధుని "చతుర్వేదసారము" నుండి 



21.తన్ను లోనుగఁ జుట్టుకొన్న వటచ్చాయ నిజదీప్తి మొగులునా నింగిఁ బర్వ, 
బ్రహ్మసంహననామరద్రు పల్లవశిఖా చ్చటలునాఁ గుఱుచకెంజెడలు దనర, 
నీశ్వరోహమ్మను నీరహస్యము దెల్పు మురువున సుజ్ఞానముద్ర మెఱయ 
మనము చిద్రసములో మునిఁగి మాటాడంగ నెఱుఁగఁడో యన మౌన మెసకమెసఁగ, 

నమ్మహాలింగ మధ్యంబునందునుండి 
దక్షిణామూర్తి రూపంబుఁ దాల్చి శివుఁడు 
యౌవనశ్రీసమేతుఁడై యవతరింప; 
శక్తి తండ్రియు నత్యంత భక్తి తోడ 

దూర్జటి "శ్రీకాళహస్తి మహాత్మ్యము" నుండి 

'22. ప్రాణము వోవునో తనువు భంగము నొందునొ ' నాక , తూణికా 
బాణము జిఱ్ఱునం దిగిచి భల్లముఖాగ్రము రక్తపద్మ దృ 
క్కోణముఁ జేర్చి గ్రుచ్చి, యొకగ్రుడ్డు వడిం బెకలించి శోణిత 
ద్రోణికయైన దైవతశిరోమణి కంట నమర్చె నంతటన్ 

మున్నిటి కంటికంటెఁ గడు మోహనమై తనకన్ను వచ్చినన్ 
మన్ననఁ జూచి మెచ్చక, యుమాపతి రెండవకంట శోణిత 
క్లిన్నతఁ జూపినన్, నగి పుళిందుఁడు ' నీ కృపచేతఁ గన్న మం 
దున్నది, దీనికిన్ వెఱవ, నొక్కటి నావ్రత మింక శంకరా! 

లలాట లోచనంబునఁ 
గీలాలము దొరఁగె నేని, కేవలభక్తిన్ 
గీలించి, మనోదృష్టికి 
మూలంబగు నాదు ప్రాణముల్ నీ కిత్తున్ ' 

అని చెప్పుఁగాల నిటలా 
క్షుని కన్గొనఁ దన్నిపట్టి, సునిశిత బాణం 
బునఁ దన రెండవ కను గ్రు 
డ్డును బెకలింపంగఁ బూనుడును సదయుండై 

దూర్జటి మహాకవి "శ్రీకాళహస్తి మహాత్మ్యము" నుండి 

23.మువ్వన్నె పులి తోలు మొలదిండుగాఁ గట్టి కర్కోట కాహి పాగ బిగించి 
చిలువ పోఁగులను వ్రేల్చెవులఁ గీలన చేసి వలరాచ నీఱు మైఁ గలయ నలఁది 
చిన్నారి పొన్నారి శిశిరాంశుఁ దలఁదాల్చి కొన గోటి జత లేటి కొదమఁ బూని 
పచ్చి యేనిక తోలు పచ్చడంబు ధరించి గిలుకు మువ్వల కోలఁ గేలఁ బట్టి 

పసిఁడి జలపోసనముతోడ నెసఁక మెసఁగు 
బిసరు హాసను పుఱియ కప్పెర ధరించి 
పెద్ద నడివీథి నిలుచుండి భిక్ష యడుగు 
నాశ్రమంబునయందు ఖట్వాంగపాణి 

శ్రీనాధ మహాకవి "హరవిలాసము" నుండి 

24.పరఁగ నేదేవుండు ప్రళయకాలంబున నెందఱుబ్రహ్మల యేపు మాపె 
వెలయ నేదేవుండు విలయావసరమున నెందఱువిష్ణుల యేపు మాపె 
జడియకే దేవుండు సంహారవేళల నెందఱనింద్రుల యేపు మాపె 
నరయంగ నేదేవుఁ డంత్యకాలములోన నెందఱురుద్రుల యేపు మాపె 

నట్టిదేవదేవు నభవు నవ్యయు నీశుఁ 
గమలజాండనాథు గౌరీనాథు 
నిఖిలలోకనాథు నిందింపఁగారాదు 
పాతకంబు దక్ష పాపచక్ష 

పోతనామాత్య "వీరభద్ర విజయము" నుండి


25.శివ శివ శివ భో 
రాగం: నాదనామక్రియా 
తాళం: మిశ్ర ఝంప 
జయచామరాజ వొడెయార్ కృతి 

పల్లవి: 

శివ శివ శివ భో మహాదేవ శంభో శివా రమణ మమాపరాధం క్ష్యమస్వ 
(శివ) 

అనుపల్లవి: 

సర్వ సర్వానందకర అఖిలాండ ప్రభో భవ సాగర తారక అక్షయలింగ విభో 
(శివ) 

చరణం 

నమస్తే స్థాణో ప్రళయ కాల జగద్భక్షక నమక చమక ప్రకటిత రుద్ర సూక్త తోషక 
కామారే త్రిపురారే కుంభొద్భవ నుతిపాత్ర కామేశ్వరి వల్లభ కుబేర మిత్ర 

మధ్యమ కాలం: 

కపాలి కాలభైరవీ త్రివిఖ్యాత శ్రీ విద్యా వినుత నాదనామక్రియ తోషిత 
(శివ)



కమనీయవిమలశృంగారాంబుసంభూత, కమలమో యన ముఖకమల మమర 
బ్రహ్మాండగేహదీపంబు లనం గ్రాలు , తాటంకమణిరుచుల్ తాండవింప 
సంగీతసాహిత్య సరసిజాతము లైన, కోరకంబు లనంగఁ గుచము లలర 
సంపూర్ణపూర్ణిమా చంద్రిక యనుభాతి, ధవళాంబరము ధగద్ధగల నీన 

దేవగజదంతతుల్యమై దేహకాంతి 
చంద్రకాంతపీఠంబున సంగమింప 
వివిధకవిపుంగవుల మనోవీథి మెలఁగు 
వాణి నివసించుఁ గాక మత్స్వాంతమునను 

భాగవతుల నృసింహశర్మ గారి "శృంగారసంధ్య" (కాళికాపురాణాంతర్గతము)నుండి

26.ప్రాలేయాచలకన్యకా వదనశుంభత్పద్మ సౌరభ్యమున్ 
గ్రోలంగల్గియు దుష్టిలేక మునిహృత్ర్కోడాబ్జసౌగంధ్యలీ 
లాలాలిత్యముఁ గొరు నొక్క సితరోలంబంబు నైజాకృతిన్ 
డాలొదించుఁ బరాసులన్ భ్రమరకీటకన్యాయరీతిన్ బురిన్ 

అర్ధం: ప్రాలేయాచల ... సౌరభ్యమున్ = మంచుకొండపుత్రికయగు పార్వతియొక్క ముఖమను వికసించుచున్న పద్మముయొక్క పరిమళమును; క్రోలంగల్గియున్=అనుభవింపఁజాలియు; తుష్టిలేక=తనివితీరక; ముని ... లాలిత్యమున్=మునుల హృదయములలోపలి పద్మముయొక్క పరిమళవిలాసపు మనోజ్ఞతను (మనోజ్ఞమైన మునుల హృదయకమల పరిమళముననుట) సితరోలంబంబు=తెల్లతుమ్మెద=తెల్లతుమ్మెద (శివుడని భావము) నైజాక్ర్తిన్=తనయాకారముతో; డాలొందించున్=ప్రకాశింపజేయును. 
భ్రమరకీటకన్యాయము=తుమ్మెద యొక కీటకమును దెచ్చి తనగూటీలో నుంచి రొద చేయును. ఆ గూటి చుట్టును తిరుగుచుండును. కొంతకాలమునకా కీటకము కూడా భ్రమర మగునట; అట్లే ముని హృత్కమలములఁ జరించు శివుడు వారికందరికిని సారూప్యసిద్ధిని కలిగించునని భావము. 


28.అఖిలాండేశ్వరి 
ద్వీజావంతి - ఆది 

అఖిలాండేశ్వరి రక్షమాం శ్రీ 
ఆగమ సంప్రదాయ నిపుణే 

నిఖిలలోక నిత్యాత్మికే విమలే 
నిర్మలే శ్యామలే సకలకళే 

లంబోదరగురుగుహ పూజితే లంబాలకోధ్బాసితే హసితే 
వాగ్దేవతారాధితే వరదే వరశైలరాజనుతే శారదే 
జంబారిసంభావితే జనార్ధననుతే జుజావంతిరాగనుతే 
ఝల్లిమద్దెలఝర్ఝరవాద్య నాదముదితే జ్ఞానప్రదే


--((*))--

29.భసితాంగరాగాయ భక్తానురాగాయ సాలేక్షణాయ తుభ్యం నమోస్తు 
భర్మాద్రిచాపాయ భద్రేంద్రవాహాయ భయవిదూరాయ తుభ్యం నమోస్తు 
భండనోద్దండాయ భానుప్రతాపాయ భవ్యరుపాయ తుభ్యం నమోస్తు 
భరతప్రవీణాయ భవనాయితనగాయ భద్రప్రదాయ తుభ్యం నమోస్తు 

భావభవసంహరాయ తుభ్యం నమోస్తు 
భవసరన్నావికాయ తుభ్యం నమోస్తు 
భద్రచర్మాంబరాయ తుభ్యం నమోస్తు 
భారతీశార్చితాయ తుభ్యం నమోస్తు 

జయజయ కైలాసశైలనికేతన జయజయ దేవతాసార్వభౌమ 
జయజయ గిరితనూజామనోంబుజభృంగ జయజయ దైవవేశ్యాభుజంగ 
జయజయ నిగమాంతసముదయసంవేద్య జయజయ భువనరక్షాధురీణ 
జయజయ జలజాతసంభవాండపిచండ జయజయ శాశ్వతైశ్వర్యధుర్య 

జయపురందరహరివిరించనముఖాఖి 
లామరస్తోమముకుటాంచలాంచితాబ్జ 
రాగమణిక్యరోచిర్విరాజమాన 
చరణపంకేరుహాద్ధేశ జయమహేశ 

నారదుని శివస్తోత్రం 
కూచిమంచి తిమ్మకవి "శివలీలా విలాసము" నుండి

--((*))--

30.నవపుష్పకోమలి! నారీశిరోమణి! గిరిరాజనందన! కీరవాణి! 
గగనసన్నిభమధ్య! గంధేభమదయాన! యరవిందలోచన! హంసగమన! 
కనకజ్జగన్నాథచంద్రబింబానన! సరసిజాసన వినుతచరణయుగళ! 
భ్రమరసుందరవేణి! భక్తచింతామణి! భూరిగుణశ్రేణి! పుష్పవేణి! 

గౌరి! కల్యాణి! శాంభవీ పద్మపాణి! 
యంబ జగదంబ భ్రమరాంబ! నాత్మదలఁతు 
సర్వగుణధామ! శ్రీశైలసార్వభౌమ! 
చెన్నమల్లేశ! శివలింగ! శరణుశరణు! 

గంగాధర కవి "చెన్నమల్లేశ శతకము" నుండి

31.ఆసనంబిచ్చెద ననుకొన్న బ్రహ్మాండ, మెల్లనిండిన నీకు నేమియిత్తు 
పాద్యమిత్తునటన్నఁ బాదమ్మునన్గంగ, ప్రభవించె నింకేమి పాద్యమిత్తు 
న్నానార్థ ముదకమొ సంగుదునన నబ్ధి, శయనుండవౌట నే చందమిత్తు 
భువి పాదపూజ సల్పుదుననఁ బదపద్మ, ములమించు సుమములే వలను దెత్తు 

ప్రీతి నైవేద్యమును సమర్పింతమనిన, దేవతలకీవె సుధనీయ దేనినిత్తు 
సాంద్రకరుణాలవాల విశాలశీల, భక్తజనజాలలోల గోపాలబాల 

పన్నాల వేంకటసుబ్బరాయశర్మ " గోపాల శతకము" నుండి

32.కులగోత్రములు రూపు గుణము మానము లేని వానికి న న్నియ్యవచ్చునఁటరె 
నీటుగఁ బాముపై నిద్రించుమాయల వానికి న న్నియ్యవచ్చునఁటరె 
యెల్లజోగుల మనం బిల్లుగాఁ దిరిగెడు వానికి న న్నియ్యవచ్చునఁటరె 
వావివర్తన బంధువర్గంబు లేనట్టి వానికి న న్నియ్యవచ్చునఁటరె 

ఇట్టివానికి మావార లిచ్చినపుడె వడ్లతోఁ దట్ట యెండఁగా వలసివచ్చె 
చెలియ నీ వేఁగి కలువాయి చిన్ని కృష్ణుఁ దోడుకొని వేగ రాఁగదే తోయజాక్షి! 

"కలువాయి శతకము" నుండి

--((*))--

33.ఎవ్వఁడు విశ్వంబు నెల్ల సలీలుఁడై పుట్టించు రక్షించుఁ బొలియఁజేయు 
నెవ్వని చేష్టల నెఱుఁగరు బ్రహ్మాదు లెవ్వనిమాయ మోహించు భువన 
మేడేండ్లబాలుఁడై యేవిభుఁడొకచేత గోరక్షణమునకై కొండనెత్తె 
నెవ్వఁడు కూటస్థుఁ డీశ్వరుఁ డద్భుత కర్ముఁ డనంతుడు గర్మసాక్షి 

యట్టి ఘనునకు శౌరికి ననవరతము మ్రొక్కెదముగాక విద్వేషమునకునేము 
వెఱతుమొల్లము నీపొందు వేగఁబొమ్ము చాలుఁ బదివేలువచ్చె నీ సఖ్యమునను. 

శతద్వనుడు అక్రూరుని హరిపై పగ సాధించుటకు కోరిన అక్రూరుడు పలికిన పలుకులు. 
పోతనామాత్య భాగవతము దశమస్కంధము నుండి

--((*))--

34.వనితరొ వెండికొండ నెలవంకలు పెక్కు వహించెఁ జూచితే 
యని సరసోక్తిఁ దా ననిన నచ్చపుగందపుఁబూతగుబ్బ జా 
ఱిన నునుఁబైఁటకొంగు సవరించుచు నవ్వినగౌరిఁ గౌఁగిటం 
దనిపెడు చంద్రశేఖరుఁ డుదారకృపన్ మముఁ బ్రోచుఁ గావుతన్ 

ఊరక చుట్టుకొన్నఁ గమలోత్పలపంక్తులు వాడు నంచునో 
యేఱును గూర్చి చుట్టితివ యెంతటిజాణవు మేలు మేలు నీ 
నేరుపు మెచ్చవచ్చు నని నిచ్చలు మచ్చిక శంభుఁ గేరునీ 
హారగిరీంద్రకన్యక దయామతిఁ గోర్కులు మా కొసంగుతన్ 

కంకంటి పాపరాజు ప్రణీత "శ్రీమదుత్తరరామాయణము" నుండి

--((*))-- 

35.అతిసమర్థునకు సేయఁగ రానిపని లేదు విద్యాధికున కెందు వింతలేదు 
పరుషోక్తునకు నోటఁ బలుకరానిది లేదు సత్యసంధునకుఁ బక్షంబు లేదు 
హననకారికి నితడాతఁ డన్నది లేదు దురితాత్మునకు వావి వరుస లేదు 
భాగ్యశాలికి లభింపని శోభనము లేదు చెడ్డవానికి రాని చేటు లేదు 

నేర్చిదిరిగినవానికి నిందలేదు కష్టమోర్వకయున్న సౌఖ్యంబు లేదు 
జ్ఞాననిథిగాకయున్న మోక్షంబులేదు రామలింగేశ రామచంద్రపురవాస 

అడిదము సూరకవి "రామలింగేశ శతకము" నుండి 

--((*))--


స్తాపకాయ చ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే   
అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ:

భగవంతుడు కేవలం మంచిని నిల బెట్టడానికే మనిషిగా మనమద్యకు వస్తాడు, మన అడుగులో అడుగు వేసి నర్తించినట్లు నటించి మన తప్పటడుగుల్ని సరిదిద్దుతాడు 
అందరికీ శుభాకాంక్షలు  

36.రాకేందునీకాశరమ్యగాత్రమువాని రమణీయఫణిభూషణములవానిఁ 
గందర్పశతకోటిసుందరాకృతివాని డమరుత్రిశూలఖడ్గములవాని 
సదమలదరహాససరసాననమువాని భసితాంగరాగవిభ్రమమువాని 
సింధూరాజినసమంచితనిచోళము వానిఁ గరుణాకటాక్షవీక్షణమువానిఁ 

బ్రధితభువనోద్భుతోరువైభవమువాని 
ఘనతరానందహృదయపంకజమువాని 
సకలలోకాధిపతి యైన సాంబశివునిఁ 
గనియె మునిమౌళి కన్నులకఱవుదీఱ 

నారదమునికి దర్శనమిచ్చిన శివుని స్వరూప వర్ణన 
కూచిమంచి తిమ్మకవి విరచిత "శివలీలా విలాసము" నుండి

37.అమరకోశము శబ్దాది వర్గము

శబ్దే నినాద నినద ధ్వని ధ్వాన రవ స్వనాః

స్వాన నిర్ఘోష నిర్ర్హాద నాద నిస్వాన నిస్వనాః

ఆర వారావ సంరావ విరావాః

నినాదః, నినదః = మ్రోయునది నినాదము

ధ్వనిః, ద్వానః = ధ్వనించునది

రవః, స్వనః = రవము చేయునది

నిర్ఘోషః, నిర్ర్హాదః = అవ్యక్త శబ్దములు

నాదః = నదించునది

నిస్వాదః, నిస్వనాః = స్వన శబ్దము

రవః, ఆరావః, సంరావః, విరావః = రవమగు శబ్దములు

ఇవి పదిహేడున్ను మ్రోతకు పేర్లు

అథః మర్మరః

మర్మరః = మరమరమను శబ్దము కలుగును

కోకలు, ఆకులు మొదలగు వాని మ్రోత పేరు

భూషణానాం తు శిఞ్జితమ్

శిఞ్జితం = అస్ఫుతముగా మ్రోయునది

ఇది భూషణముల ధ్వనికి పేరు

నిక్వాణో నిక్వణః క్వాణః క్వణః క్వణన మిత్యపి

నిక్వాణః, నిక్వణః, క్వాణః, క్వణః, క్వణః =లెస్సగా పలుకునది

ఇవి ఐదున్ను వీణాది సకల వాద్యముల ధ్వనులకు పేర్లు

వీణాయాః క్వణితే ప్రాదేః ప్రక్వాణ ప్రక్వణాదయః

ప్రక్వాణః, ప్రక్వణః = మిక్కిలి మ్రోయునది

ఇవి రెండున్ను వీణాది ధ్వని పేర్లు

కోలాహలః కలకలః

కోలాహలః = కోలములు, వరాహములు వీటిని భయపరచునది

కలకలః = అవ్యక్తముగా పలుమారులు పలుకబడునవి

ఇవి రెండున్ను గుంపున పుట్టిన గొప్ప ధ్వనికి పేర్లు

తిరశ్చాం వాశితం రుతం

వాశితం = పలుకబడునది

రుతం = పలుకబడునది

ఇవి రెండున్ను మృగ పక్ష్యాదుల ధ్వనికి పేర్లు

స్త్రీ ప్రతిశ్రు త్ప్రతిద్వానే

ప్రతిశ్రుతిః = ఎదురుగా వినబడునది

ప్రతిద్వానః = ఎదురుగా పలుకుట

ఇవి రెండున్ను ప్రతిధ్వని పేర్లు

గీతం గాన మిమే సమే

గీతం , గానం = పాడబడునది

ఇవి రెండు పాట పేర్లు

ఇవి రెండునూ సమానార్ధకములు

శబ్దాది వర్గము సమాప్తము తరువాత నాట్య వర్గము

38.విరించి విరచిత వాసరాంబ శతకము 

పాపకర్ముల మంచు పాపుల మేమంచు 
. నిందించు టేలనో నీరజాక్షి 
పద్మగర్భుడు నీదు భవుడు వ్రాసిన వ్రాత 
. నాచరించెడు వారమవని యందు 
మర్కట సమమైన మానసమ్మేయిచ్చి 
. రాగబంధాలనే రసము నిచ్చి 
కీలుబొమ్మగమమ్ము క్రీడింప జేతురే 
. పరమాత్మ క్రీడలో పాచికలము 

ధాత గీతను మాకింక దాటవశమె 
పాప మందున మాకెట్టి బాధ్య తగును 
శరణు శరణంటి పదమంటి శారదాంబ 
వాసరా పుర వాసిత వాసరాంబ

--((*))-- 


39.క్షీరోదకన్యకు శ్రీమహాలక్ష్మికిఁ గమలాయతాక్షికిఁ గంబుకంఠి
కఖిలలోకేశ్వరి కామ్నాయవినుతకుఁ గనకకైతకపుష్పగర్భగౌరి
కరుణాధరోష్ఠికి నమరకోటికిరీట కోటివిటంకసంఘాటఘటిత
రత్నాంకురప్రభారాజి నీరాజిత శ్రీపాదపద్మపీఠోపకంఠ

కంబురుహనాథుదేవికి నాదిశక్తి
కిందిరకు లోకమాతకు నిగురుఁబోఁడి
కలరువిల్కానితల్లికి నాశ్రితార్థ
కల్పవల్లికి మ్రొక్కఁగఁ గంటిమంటి

అగస్త్యముని చేసిన కొల్లాపురి శ్రీమహాలక్ష్మీ స్తోత్రం
శ్రీనాధ కవి విరచిత "కాశీఖండము" నుండి 

--((*))-- 

40.ఆడమోడి గలదే 
రాగం: చారుకేశి 
తాళం: ఆది 
త్యాగరాజ స్వామి కృతి 

ఫల్లవి 

ఆడమోడి గలదే రామయ్య! మాట 
(లాడమోడి) 

ఆనుపల్లవి 

తోడు నీడ నీవె అనుచును భక్తి గూడి నీ పాదము బట్టిన నాతొ మాట 
(లాడమోడి) 

ఛరణం 

చదువులన్ని దెలిసి శంకరాంశుతుడై సదయు-దాసుగ- సంభవుడు మ్రొక్క 
కదలు తమ్ముని బల్క జేసితివి గాకను త్యాగరాజే పాటి మాట 
(లాడమోడి)

41.శా. భూషామౌక్తికకాంతి దేహరుచితోఁ బోరాటమాడన్ మరు 
ద్యోషారత్నకిరీటఝూటసుషమా యోయుజ్యమానాంఘ్రి ని 
శ్శేషశ్రీ విరిదమ్మిగద్దియ సమాశ్లేషింపఁ గొల్వుండు నా 
భాషాదేవిఁ దలంచెదన్ రసలసద్భాషావిశేషార్థినై 

(ఆభరణములయందలి ముత్యములకాంతి శరీరచ్ఛాయతో సాటిరాఁదలఁచుచుండఁగాను, దేవతాస్ర్తీలయొక్క మకుటములయందుఁ గూర్పబడిన వివిధమణులయొక్క కాంతులతోఁ గూడినదై పాదములసంపద పుండరీకాసనమునఁ గలియఁగాను, గొలువుదీరియున్న వాగ్దేవతను నవరసపూరితములై మనోహరములగు వాక్కుల నొసంగుటకు ప్రణుతించెదను) 

ఉ. చెక్కిటఁ బత్త్రవల్లరి సృజింపఁగఁబూని మనోజకేళి నా 
యక్కఱ దీర్పవేయనుచు నక్షరపంక్తి లిఖింపఁగాఁ దద 
న్యక్కృతకైతవంబు హృదయంబున నారసి ప్రాణనాథుతో 
నొక్క పిసాళినవ్వు ననలొత్తఁగనవ్వెడువాణిఁ గొల్చెదన్ 

బ్రహ్మ తనచెక్కిలియందు మకరికపత్త్రముల వ్రాయుచు రతికేళియందు నాకోరిక దీర్పుమను నక్షరములను వ్రాయగా నది కనుగొని యందులకు సమ్మతించినభవముతో నేదియో యొక నెపమున దన చెక్కిటగల మకరికాపత్రములు ముడుచుకొనునట్టు నవ్వుచున్న సరస్వతీదేవిని సేవించెదను. 

కందుకూరి రుద్రకవి "నిరంకుశోపాఖ్యానము" నుండి

--((*))--

43.తలవాఁకిటను మెలంగెడు

పొలఁతుక పలుకుల వెలఁది పొత్తముముత్తో

నలువపడఁతి కలుములపై

దలికోడ లనంగఁ బరఁగు (ధర) వాణి (శివా)

తలవాఁకిటను మెలంగెడు పొలఁతుక=శిరస్సునకు ద్వారమైన నోటియందు సంచరించెడు స్త్రీ, పలుకుల వెలంది= వాక్కుల కధిదేవత యగు పడుచు, పొత్తము ముత్తో= పుస్తకములయందు వెలయునట్టి ముత్తైదువ, నలునపడఁతి= బ్రహ్మదేవుని భార్య,  కలుములపైదలి కోడలు= సంపద కధిదేవత యగు లక్ష్మీదేవికి కోడలు, (లక్ష్మీ పుత్రుడు బ్రహ్మ కు భార్య యగుటచే లక్ష్మీకి కోడలు) అనునవి సరస్వతీ దేవికి పేర్లు.

పైడిపాటి లక్ష్మణకవి "ఆంధ్రనామ సంగ్రహము" నుండి

45.తెలియలేరు రామ భక్తి మార్గమును 
రాగం: ధేనుక 
త్యాగరాజ స్వామి కృతి 

ప) తెలియలేరు రామ భక్తి మార్గమును || తెలియలేరు 

అ) ఇలనంతట తిరుగుచూ మరి (తిరుగుచును) కలువరించెరే గానీ || తెలియలేరు 

చ) వేగ లేచి నీట మునిగి భూతి (బూది) పూసి (పూచి), 
వ్రేళ్ళనెంచి (వేళనెంచి) వెలికి శ్లాఘనీయులై (వేషధారులై), 
బాగా పైకమార్జన లోలులైరే గాని - త్యాగరాజ వినుత! | తెలియలేరు 
(బాపు గారి బొమ్మ)

46.బంటురీతి కొలువియ్యవయ్య రామా 
రాగం: హంసనాదం 
తాళం: ఆది 
త్యాగరాజ కృతి 

పల్లవి: 
బంటు రీతి కొలువీయ వయ్య రామ 

అనుపల్లవి: 
తుంట వింటి వాని మొదలైన 
మదాదుల బట్టి నేల కూలజేయు నిజ 

చరణం: 
రోమాంచమనే, ఘన కంచుకము 
రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు 
రామ నామమనే, వర ఖఢ్గమి 
విరాజిల్లునయ్య, త్యాగరాజునికే


--((*))-- 

47.చంద్రఖండ కలాపుఁ జారువామనరూపుఁ గలితచంచలకర్ణుఁ గమలవర్ణు

మోదకోజ్జ్వలబాహు మూషకోత్తమవాహు భధ్రేభవదను సద్భక్త సదను

సన్మునిస్తుతిపాత్రు శైలసంభవపుత్రు ననుదినామోదు విద్యాప్రసాదుఁ

బరమదయాభ్యాసుఁ బాశాంకుశోల్లాసు నురుతరఖ్యాతు నాగోపవీతు

లోకవందితగుణవంతు నేకదంతు

నతులహేరంబు సత్కరుణావలంబు

విమలరవికోటితేజు శ్రీవిఘ్నరాజుఁ

బ్రథితవాక్ప్రౌఢి సేవించి ప్రస్తుతింతు

ఆతుకూరి మొల్ల విరచిత "మొల్ల రామాయణము" నుండి గణేశ ప్రార్ధన

48.శ్రీగణనాథ పరాత్పర

వాగీశ సురేశవంద్య వరగుణసాంద్ర

వేగమె నినుగొల్చెద నను

బాగుగ బాలింపవయ్య పార్వతితనయ

శ్రీ త్యాగరాజ విరచిత "నౌకా చరిత్రము" నుండి గణపతి వందన


49..ఏక ఏవ పరో బన్ధు ర్విషమే సముపస్ధితే | 
గురు స్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః || 
భావము :-విషమ పరిస్ధితులు ప్రాప్తించు నపుడు బంధువులందరికంటే 
అధికుడయిన బంధువు సద్గురుడే ,శిష్యుడు ఆచరింప వలసిన ధర్మరూపుడా గురువే 
కనుక ఆయన నెల్లప్పుడు ధ్యానించుటయే ,శరణు పొందుటయే ,సకల ధర్మములను ఆచరించుట , 
గీతలో "సర్వ ధర్మాన్ ,పరిత్యజ్య 'అన్న శ్లోకం వివరిస్తున్నది

  
50.నండూరి వారి .“నమిలి మింగిన నా యెంకి” 
ఎంకి నాయుడుబావల ప్రణయానికి, ప్రేమకు పరాకాష్ఠ 
సాటేలా? నీకు మాటేలా? 
సిన్నతనమేలా? సిగ్గేలా? 
ఆ సీమ యీ సీమ 
అందచందాలు 
తిన్నంగ నిను సూసె 
దిద్దుకుంటారు 
…………….. 
యెంకొక్క దేవతై 
యెలిసెనంటారు – 
యింటింట పెడతారు 
యెంకి నీ పేరు 
.......యెంకితో తీర్తానికెళ్ళాలి 
సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటే 
……………… 
కోనేటిలో తానమాడాలి! 
గుడిసుట్టు ముమ్మారు తిరగాలి! 
కోపాలు తాపాలు మానాలి! 
యిద్దరము పిల్లోణ్ణి యీశుడికి సూపాలి!


--((*))--

హరికథా పితామహులు శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారు బహుృచమత్కార భాసురంగా  యీశైలిలో మహేశ్వర వర్ణనం నిర్వహించారు . ఆపద్యాన్ని పరిశీలించండి! 

" ఉ: " హెడ్జున మూను , స్కిన్నుపయి నెంతయు డెస్టును , ఫైరు నేత్రమున్ , 
సైడున గ్రేటు బుల్లు , బహు చక్కని గాంజెసు హైరు లోపలన్ , 
బాడికి హాఫెయౌచు నల పార్వతి , మౌంటెను డాటరుండ , ఐ 
షుడ్డు డివోటు , దండములు సోకగ ,,ప్రేయరు సేతు నెప్పుడున్ " 


భావము; తలపై నెలవంక, శరీరమున భస్మము , అగ్గి కన్ను(మూడవకన్ను) ప్రక్కనే వాహనమైన నంది , సిగలోగంగ, అర్ధనారియై పార్వతి , హిమగిరి కుమారి యుండగా వేరెవ్వరికి మ్రొక్కను? తప్పక శివునే భక్తితో కొలిచెదను.శిరమున చేతులుంచి నమస్కరించుచు పరమశివుని యెల్లపుడు ప్రా్ర్ధన సేతును. 

బాగుంది కదండీ! రేపు మరో పద్యం పరశీలిద్దాం! స్వస్తి ! 

51.జన్యంబున దనుజుల దౌ 
ర్జన్యము లుడుపంగఁ గోరి చనుదెంచిన సౌ 
జన్యవతిఁ జూచి యదురా 
జన్యశ్రేష్ఠుండు సరస సల్లాపములన్ 

లేమా! దనుజులఁ గెలువఁగ 
లేమా నీ వేల గణఁగి లేచితి విటు రా 
లే మాను మాన వేనిన్ 
లేమా విల్లందుకొనుము లీలం గేలన్ 

హరిణాక్షికి హరి యొసఁగెను 
సురనిక రోల్లాసనమును శూర కఠోరా 
సుర సైన్య త్రాసనమును 
బరగర్వ నిరాసనమును బాణాసనమున్ 

నారి మొరయించె రిపు సే 
నా రింఖణ హేతువైన నాదము నిగుడన్ 
నారీమణి బలసంప 
న్నారీభాదికము మూర్ఛ నంద నరేంద్రా! 

కొమ్మా! దానవనాధుని 
కొ మ్మాహవనమునకుఁ దొలఁగె గురువిజయముఁ గై 
కొమ్మా మెచ్చితి నిచ్చెదఁ 
గొ మ్మాభరణములు నీవు గోరిన వెల్లన్ 

పోతనామాత్య భాగవతం దశమస్కంధం లోని నరకాసురవధ ఘట్టం నుండి కొన్ని అందమైన కందాలు.

పద్మ  లోచన కృష్ణ1  భక్త భయప్రద

వినుము సంసరాగ్ని వేగుచున్న

జనుల సంసారంబు సంహరింపగా నీవు

దక్క నన్యులు  లేరు తలచి చూడ

సాక్షాత్కరించిన సర్వేశ్వరుడవు

ప్రకృతికి నవ్వలి ప్రభుడ వాద్య

పురు షుండవగు నీవు బోధముచే మాయ

నడతువు నిశ్శ్రేయసాత్మ యందు 

మాయ చేత మునిగి మనువరాలకు కృప

చేసి ధర్మముఖ్య చిహ్నమైన

శుభము సేయు నీవు సుజనుల నవనిలో

గాన పుట్టుడువు జన్నివాస 


" సంసారజ్వాలల్లో తపించిపోతున్న జనుల కష్టాన్ని పోగొట్ట్టడం నీకు తప్ప మరొకరికి శక్యం కాదు.  నివు సాక్షాత్తూ సర్వే శ్వరుడవు   ఈ ముల్లోకాలకూ అవలివాడవు. ఆది పురుషుడవైన ప్రభువు నీవు ముముక్షువులకుజ్ఞానాన్ని ప్రసాదించి మాయను మటుమాయం చేస్తావు. నీవు మాయాజాలంలో మునిగిన  వారికి ధర్మసమ్మతమైన తేజస్సును అనుగ్రహిస్తావు. ఓ జగన్నివాసా శిష్టరక్షణ కోసమే నీవు ఈ  జగత్తులో జన్మిస్తావని ప్రస్తుతిస్థూ ఫల్గుణుడు వేడుకున్నాడు

No comments:

Post a Comment