Tuesday, 17 May 2016

పరిపూర్ణ మానవుడు శ్రీరాముడు

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సేకరణ ప్రభ 

మంచిని గ్రహించు - అందరికి భోధించు
సర్వేజనా సుఖినోభవంతు 


శ్రీమహాగణాధిపతయేనమః
పరిపూర్ణ మానవుడు శ్రీరాముడు
రచన: రాయపెద్ది అప్పాశేషశాస్త్రి,
రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఆదోని



లీలా నాటక సూత్రధారి, జగదానందకారకుడైన శ్రీ మహావిష్ణువు ధర్మసంరక్షణార్థము, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థము అనేక అవతారాలు ధరించాడు. సనకసనందనాదుల శాపానికి గురి అయిన జయ విజయులు మూడు జన్మలలో శ్రీ మహావిష్ణువు శత్రువులుగాజన్మించి, అతని చేతిలోనే మరణించి శీఘ్రంగా వైకుంఠప్రాప్తిని పొందాలని కోరగా శ్రీ మహావిష్ణువు వారిని తథాస్తు అని అనుగ్రహిస్తాడు. అలా శాప కారణంగా హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంత వక్త్రులుగా జన్మించిన తన సద్భక్తులను అనుగ్రహించడానికి వచ్చిన అవతారాలు వరాహావతారం, నరసింహావతారం, శ్రీరామావతారం, శ్రీకృష్ణావతారాలు. హిరణ్యాక్ష వధ, హిరణ్యకశ్యపుని వధ కొరకే అవతరించినవి వరాహావతారం, నరసింహావతారాలు.


శిశుపాల దంత వక్త్రుల వధానంతరం కూడా సుదీర్ఘ కాలం పృథ్వి పైన జీవించి సద్గురువుగా గీతోపదేశం చేసిన అవతారం శ్రీకృష్ణావతారం. విచిత్రం ఏమిటంటే శ్రీకృష్ణావతారంలో జననం నుంచీ మరణం వరకూ తాను మానవరూపం ధరించిన భగవంతుడిని అన్న విషయాన్ని ఎక్కడా దాచకుండా భగవత్ స్వరూపముగానే ప్రవర్తించి అవతార పరిసమాప్తి చేస్తాడు శ్రీకృష్ణుడు.

అలాగే రావణ కుంభకర్ణుల వధానంతరం కూడా సుదీర్ఘకాలం పృథ్వి పైన జీవించి మానవాళికి జీవనమార్గాన్నీ, ఆదర్శ జీవన విధానాన్ని తన జీవితమే ఉదాహరణంగా దర్శింపజేసిన అవతారం శ్రీరామావతారం. కానీ అద్భుతమైన, ఆదర్శవంతమైన గుణాలు కల రాముడు ఎక్కడా తాను భగవంతుడనని చెప్పుకోలేదు. ఇతరులు ఎవరైనా నీవు భగవంతుడివి అన్నా "ఆత్మానం మానుషం మన్యే" - నేను సాధారణ మానవుడిని అని నిక్కంగా పలుకుతాడు. తాను భగవదవతారం అన్న విషయం ఎక్కడా తనకు తెలిసినట్లుగా ప్రవర్తించకుండా, మానవునిగానే జీవితకాలమంతా సంచరించడం శ్రీరామావతారంలో చెప్పుకోదగిన విశేషంగా మనకు గోచరిస్తుంది. దానికి కారణమూ స్పష్టంగానే కనిపిస్తుంది. బ్రహ్మ ఇచ్చిన వరాలబలం వల్ల రావణ వధ దేవ, దానవ, యక్ష, సిద్ధ,సాధ్య, కిన్నెర, కింపురుషాదులు ఎవరికీ సాధ్యం కాని పని. నర వానరుల పట్ల రావణునికి ఉన్న తేలికభావం కారణంగా వారిచేతిలోమరణం లేకుండా ఉండాలని వరంలో భాగంగా బ్రహ్మను కోరనూలేదు, బ్రహ్మ ఇవ్వనూ లేదు. అందువల్ల నరుడుగా జన్మించి, నరుడుగా వ్యవహరించినపుడు మాత్రమే శీమహావిష్ణువుకైనా రావణుని చంపడం సాధ్యమౌతుంది. ఇందుకొరకు వానరరూపంలో జన్మించిన దేవతాగణాల సహాయం తీసుకొని రావణుని వధించవలసి వచ్చింది. మామూలుగా ఐతే రావణ సంహారంతో కథ ముగిసిపోయి అవతార పరిసమాప్తి జరగాలి కదా, కానీ అలా జరగలేదు. దశరథుని పుత్రకామేష్టి యాగానికి వచ్చిన దేవతలకు ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు, తాను దశరథాత్మజునిగా జన్మించి "దశవర్ష సహస్రాణి, దశవర్ష శతానిచ" అనగా పదకొండువేల సంవత్సరాలు మానవునిగా జీవిస్తానని ప్రకటిస్తాడు. ఇలా ఎందుకు చేయవలసి వచ్చింది అన్న అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలి. ఒక పరిపూర్ణ మానవుడు, ఒక ఆదర్శమానవుడు ఎలా ప్రవర్తించాలి? నరుల పట్ల ఉన్న తేలికభావం తొలగించాలన్నా, ఆదర్శ మానవసంబంధాలు, ఆదర్శ కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని నా జీవితమే నా సందేశం అన్నట్లుగా జీవించి చూపాలన్నా ఇది అవసరం అవుతుంది. అలా జీవించి చూపిన అవతారమే శ్రీరామావతారం.
అందుకే
"యావత్ స్థాశ్యంతి గిరయః సరితశ్చ మహీతలే!
 తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతే!!"

పర్వతాలు, నదులు ఈ భూమిపై ఉన్నంత కాలం రామ కథ నిలిచి ఉంటుంది. అని బ్రహ్మ అంటాడు. ఏనాడో త్రేతాయుగంలో జరిగిన గాధ ఈ నాటికీ కలియుగంలో కూడాసజీవంగా, చైతన్యవంతంగా ఉండటానికి ఇదే కారణం. మానవసంబంధాలు గతి తప్పి, వికృత, విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్నిఅధ్యయనం చేయవలిసిన అవసరం మునుపటికంటే చాలా ఎక్కువగాఉంది. ఈరోజుల్లోనే, రామ కథాశ్రవణం, రాముని గుణగణాల అధ్యయనం, రాముని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరం. రాముడిని దేవుడిగా కొలవడం ముమ్మాటికీ తప్పు కాదు. కానీ రాముడిని దేవుడిగా ఆరాధిస్తూనే, రాముడిజీవితంనుంచీ మనం ఎలా జీవించాలి అన్న అంశాన్ని నేర్చుకోవడం అంతకంటే ముఖ్యం రామాయణ రచనా ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి వచ్చిన బ్రహ్మ మానస పుత్రుడైన నారదమహర్షిని అడిగిన ప్రశ్నను పరిశీద్దాము. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగాడంటె................

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ | 
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||

 
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |

విద్వాన్ కః, కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ||

 
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |

కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే ||

ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, ఎవరి కోపం దేవతలను కూడ భయపెడుతుందో అట్టివ్యక్తి ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు. అనేక సంవత్సరాల తపస్సుతో తన జీవితాన్ని పండించుకొన్న వాల్మీకి మహర్షిలో జాగృతమైన బ్రహ్మజిఙ్ఞాసే ఈ ప్రశ్న అన్నదిఇందులో ఉన్న నిగూఢార్థం ,


ఇందులో వాల్మీకి మహర్షి నారదులవారిని షోడశ గుణాత్మకమైన భగవత్ తత్వాన్ని గురించి ప్రశ్నించగా నారదుడు ఈ లక్షణాలన్నీ నరరూపంలో భూమిపై నడయాడుతున్న నారాయణుడైన శ్రీరామునివేనని వివరిస్తాడు. అలా ఈ లక్షణాలు పరిపూర్ణ మానవుని లక్షణాలుగా కూడా స్వీకరించదగినవి. చాలా చిన్నకారణాలకే కుంగిపోయి నిస్పృహకు గురయ్యే నేటి తరం శ్రీరాముని వద్ద నేర్చుకోవలసిన అతి గొప్ప లక్షణం స్థిత ప్రఙ్ఞత్వం. ఈ రోజు ఉదయం తండ్రి పిలిచి "రామా రేపే నీ పట్టాభిషేకం నీవు, నీ భార్య అవసరమైన దీక్షను చేపట్టండి" అన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండిపోయాడో ఆరోజే రాత్రి కైకేయి పిలిపించి, రామా! మీ నాన్న చెప్పలేకపోతున్నారు. నీవు అంగీకరిస్తావో లేదో అని భయపడుతున్నారు. నీకు పట్టాభిషేకం చేయడంలేదు, రేపటినుంచీ నీవు జటాధారివై, మునివృత్తి స్వీకరించి 14 సంవత్సరాలపాటు వనవాసం చేయాలి అని చెప్పినపుడూ అంతే సహజంగా నిర్వికారంగా స్వీకరించాడు. తల్లి పైన గానీ తండ్రి పైన గానీ ఆవేశపడిపోయి, తల్లితండ్రులను శాపనార్థాలు పెట్టకుండా ఉండడమే కాక, ఆవేశపడుతున్న లక్ష్మణుడిని మందలించి అరణ్యవాసానికి చాలా హాయిగా సిద్ధపడిపోయాడు. అంతకంటే పెద్దకష్టాలా మనకు వచ్చినవి అని ఆలోచించగలిగితే డిప్రెషన్ కు తేలికగా గురవుతున్న నేటియువతరంలో చాలా మార్పు వస్తుంది.

దేశభక్తి మాతృభక్తి కూడా రామునిచూసి నేర్చుకోవాలి. రావణసంహారం తరువాత లంకా నగరంలో సంచరిస్తూ లంకా నగర సౌందర్యానికి ముగ్ధుడైన లక్ష్మణునితో రాముడన్న మాటలను ఒక్క సారి గమనిద్దాం: "అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" బంగారంతో నిండినదైనా నాకు లంకానగరం రుచించదు లక్ష్మణా, జననీ జన్మభూములు స్వర్గంకంటే గొప్పవి అన్నమాటలు రాముని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇంతకుమించిన దేశభక్తి, జాతీయతాభావన మరెక్కడ కనిపిస్తాయి?

కృతఙ్ఞతా గుణం మానవునికి వుండవలసిన ఉత్తమగుణాలలో ప్రధానమైనది. ఈ గుణం రామునిలోపుష్కలంగా దర్శనమిస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల తండ్రికి దహనసంస్కారం కూడా చేయలోకపోతాడు రాముడు. తనభార్య సీతను రక్షించడంకోసం రావణునితో పోరాడి కొసప్రాణాలతో మిగిలి ఉన్న జటాయువు పట్ల కృతఙ్ఞతాభావంతో రాముడు. జటాయువుకు అంత్యక్రియలు నిర్వహిస్తాడు. ఇదీ కృతఙ్ఞతా గుణం అంటే. మనకు ఏ చిన్న ఉపకారం చేసినవారిని కూడా మరచిపోకుండా వారికి అవసరమైనపుడు ప్రతిసహాయంచేయగలిగే సంస్కారం రాముని దగ్గరే నేర్చుకోవాలి.
మనలను ఆశ్రయించి శరణు కోరిన వారిని పరిత్యజించకుండా శరణు ప్రసాదించడాన్ని వ్రతంగా కొనసాగించినవాడు రాముడు. చంపదగినట్టి శత్రువు రావణుని సోదరుడైన విభీషణుడు తనను శరణు కోరి అర్థించినపుడు, (హనుమంతుడు తప్ప మిగిలిన) వానర ప్రముఖులు అనుమానించినా, ఎట్లాంటి సంశయం లేకుండా అతనికి శరణు ప్రసాదించి, రావణుడే కోరినా శరణమిస్తానని అంటాడు. ఈ మాటలు రాముడు తప్పించి ఇంకొకరు పలకలేరేమో. అందుకే "శరణాగత త్రాణ బిరుదాంకితుడవు" అని కీర్తిస్తాడు రామదాసు.

ఒక పాలకుడుగా ప్రజారంజకమైన పాలన అందివ్వడమే కాదు. ప్రజలకు తాను ఆదర్శంగా నిలవగలగాలి. ఉత్తముడైన పాలకుని లక్షణం అది. ఎందుకంటే "యద్యదాచరతి శ్రేష్ఠః , తత్తదేవేతరో జనాః" అని కదా గీతా వాక్యం. శ్రేష్ఠుడైన వాడెలా ప్రవర్తిస్తాడో, అతనిని నమూనా(మాడెల్) గా తీసుకొని ఇతరులూ అలాగేప్రవర్తిస్తారని గీతచార్యుని భావం. కనుక పాలకుడైన వాడు తనలో చిన్న మచ్చకూడా లేకుండా జాగ్రత్త పడాలి. నా వ్యక్తిగత జీవితం, నా ఇష్టం అనడానికి పాలకునికి హక్కు లేదు. ప్రజా పాలకుని జీవితం తెరిచిన పుస్తకంగా ఉండాలి. అందుకే తను రావణ వధానంతరం సీతను చేపట్టడాన్ని గురించి విమర్శ రాగానే, ఆమెను పరిత్యజించడానికి సిద్ధపడతాడు. రాముడు కేవలం సీతారాముడే కాదు రాజా రాముడు కూడా. తన మీద విమర్శలు వెల్లువెత్తుతున్నా, ప్రజలు చీదరించుకొంటున్నా, నీ చేష్ఠలు భరించలేకుండా ఉన్నాం, దిగిపోవయ్యా మహానుభావాఅని ప్రజలు నెత్తీ నోరూ మొత్తుకొంటున్నా కుర్చీని పట్టుకొని వేలాడుతున్న నేటి రాజకీయ నాయకులు రాముని చూచి నేర్చుకోవాలసినది ఎంతైనా ఉంది.

క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అని చెపుతడు భర్తృహరి. ఇతర ఆభరణాలన్నీ నశించిపోయేవే శాశ్వతమైన భూషణం వాగ్భూషణమే అని దీని భావం. వాక్కు భావ ప్రకటనాసామర్థ్యానికి ప్రధానమైన సాధనం. ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులు కమ్యూనికేషన్ స్కిల్స్ గాపేర్కొనే ఈ సామర్థ్యం రాముని సహజ లక్షణము. శ్రీరాముడిని ‘వచస్విగా, ‘వాగ్మి’(చక్కని వక్త)గా వాల్మీకి వర్ణించాడు. రామచంద్రుడు మృదుభాషి, మితభాషి, మధురభాషి, పూర్వభాషి, స్మితపూర్వభాషి అని ప్రశంసించాడు. తానే ముందుగా పలకరించడం, నెమ్మదిగా, ప్రశాంతంగా ఆవేశానికి లోను కాకుండా మాట్లాడగలగడం రాముని ప్రధాన లక్షణాలు. రాముడు పూర్వభాషి మాత్రమే కాదు. బంగారానికి తావి అబ్బినట్టు, స్మిత పూర్వభాషి కూడా. ముందు చిరునవ్వుతో పలకరించి, తరువాత మధురమైన మాటలతో మనసు చల్లబరచేవాడు. మితభాషిత్వం, సత్యభాషిత్వం, చిరునవ్వుతో సంభాషించడం ఇవన్నీ మనకందరికీ అనుసరణీయాలూ, ఆచరణీయాలు కూడా. అంతేకాదు. కొద్ద్ది నిముషాలు ఎదుటివ్యక్తితో మాట్లాడగానే అతని వ్యక్తిత్వాన్నీ, సామర్థ్యాన్నీ అంచనా వేయగలిగే సామర్థ్యం కూడా రాముని సొత్తు. కిష్కింధకాండలో హనుమంతుదు రాముని తొలిసారిగా యతి వేషంలో కలిసి రామునితో పరిచయవాక్యాలుగా నాలుగు మాటలు మాట్లాడుతాడు. సహజంగా తానే వాగ్మి ఐన రాముడు హనుమన్ంతుని సామర్థ్యాన్ని గురించి ఖచ్చితమైన అంచనా వేస్తాడు. ఈ వ్యక్తి వేదవేత్త అనీ, వ్యాకరణ నిపుణుడనీ, మాట్లాడే సమయంలోఇతని శరీర భంగిమలూ(బాడీ లాంగ్వేజ్) మాట్లాడే విధానమూ ఇతనిని ఒక అసాధారణ ప్రతిభాసంపన్నుడిగా తెలియచేస్తున్నాయని అంటాడు. ఇట్టి మంత్రివర్యుని కలిగిన రాజుకు అసాధ్యమైనది ఉండదనీ లక్ష్మణునితో చెబుతాడు రాముడు. దీన్నిబట్టే రాముని సూక్ష్మబుద్ధి ఎలాంటిదో తెలుసుకోవచ్చు.

రాముని సోదర ప్రేమ, సోదరుల పట్ల అతనికి ఉన్న తాపత్రయం వారి పట్ల అతనికి ఉన్న విశ్వాసం అసాధారణమైనవి. అరణ్యవాసం ప్రారంభంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి. రాముని మరలా రాజ్యానికి తీసుకు వెళ్ళి రాజ్యభిషేకం చేయడానికి భరతుడు సైన్యంతో సహా బయలుదేరాడు. దూరంనుంచీ సైన్యసమేతంగావస్తున్న భరతుని చూచి మనలను చంపి రాజ్యాధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి భరతుడు వస్తున్నాడు.అతడిని నేను తుదముట్టిస్తానని ఆవేశపడతాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు భరతుని సోదరప్రేమనూ, తనపట్ల అతనికి ఉన్న భక్తి భావాన్ని లక్ష్మణునికి వివరిస్తాడు. వ్యక్తుల పట్ల లోతైన అవగాహనతో కూడిన రాముని వ్యక్తిత్వం అచ్చెరువు కొలుపుతుంది. గుహుని రాముడు ఆదరించిన విధానం, శబరిని రాముడు అనుగ్రహించిన తీరు అతనిని తర తమ భేదాలను పాటించని ఒక మహోన్నత పురుషోత్తమునిగా మనముందు నిలుపుతాయి.

తండ్రి నేరుగా అడవులకు వెళ్ళమని చెప్పలేదు, మీదు మిక్కిలి వెళ్ళవద్దని బతిమాలుతున్నాడు. ఐనా తండ్రి ఏనాడో ఇచ్చిన మాట వ్యర్థం కారాదనీ తద్వారా తండ్రికి అసత్యదోషం అంటరాదన్న రాముని తపన ఎంత విశేషమైనది. తండ్రి మరణించాక అతని అప్పులతో మాకు సంబంధం లేదు ఏం చేసుకొంటారో చేసుకొండి అని అప్పులవాళ్ళను బుకాయిస్తున్న నేటి సంతానం రామునినుంచి ఎంత నేర్చుకోవాలి. తల్లితండ్రులను అనాథాశ్రమాలలో చేర్చి వదలించుకొనే ప్రయత్నాలు చేయడం, ఆస్తిపాస్తులకోసం అవసరమైతే తల్లితండ్రులనూ, సోదరులనూ తుదముట్టించడానికి వెనుకాడని నేటి యువత రాముని పితృప్రేమనుంచీ, సోదరప్రేమనుంచీ ఎన్ని గుణపాఠాలనునేర్చుకోవాలి? రామకథ ఈ నాటి సమాజానికి కూడా గురుస్థానంలో నిలుపుకోవలసిన మహాకావ్యమే, రాముడు నేటికీ మనకు మార్గదర్శకుడే.
ఒక మంచి సోదరుడు, ఒక మంచికుమారుడు, ఒకమంచి పాలకుడు, ఒక మంచి మిత్రుడు,ఒక మంచి శిష్యుడు, ఒకమంచి నాయకుడు, అసమాన వీరుడు ఇలా ఎన్నో ఉత్తమ పార్శ్వాలు దర్శనమిస్తాయి. మాధవుడే మానవునిగా జన్మించి, పరిపూర్ణమానవునిగా, మానవాళికి వెలుగుచూపే దారిదివ్వె. నాటికీ, నేటికీ, ఏనాటికీ రాముని శీలసంపద, గుణసంపత్తి, అగాధమైన అమృతసాగరం. సర్వకాలాలకూ, సర్వదేశాలకూ ఒక దీపస్తంభం రాముని వ్యక్తిత్వం. జన్మతః రాక్షసుడైనారామబాణ స్పర్శతో విశేషమైన పరివర్తనకు లోనైన మారీచుడు రాముని వ్యక్తిత్వాన్నీ, దివ్యత్వాన్నీ సంపూర్ణంగా అవగాహన చేసుకొన్న ధన్యజీవి. అతని మాటల్లోనే రాముని గురించిన ఏకవాక్య సమగ్ర వివరణ రామో విగ్రహవాణ్ ధర్మః.
మూర్తీభవించిన ధర్మమే రాముడు.
జైశ్రీరాం- ఓం శ్రీరాం - ఓం శ్రీ సీతా రామాంజనేయ నమ:
ఇంతటి మహోదాత్తమైన విశ్లేషణ మనతో పంచుకున్న శ్రీ Ras Sastry గారికి కృతజ్ఞతాభివందనములు అర్పించటమే మనము వారికి చేయగల సత్కారము.

No comments:

Post a Comment