Wednesday, 9 March 2016

విశ్వామిత్రుడు.! (బతుకమ్మ పాటలలో ఒక ముచ్చట )

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం     ఓం శ్రీ రాం     
ప్రాంజలి ప్రభ - విశ్వామిత్ర కధ 
                             సర్వేజనా సుఖినోభవంతు                                   


విశ్వామిత్రుడు.!
.
పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహొగ్రమైన తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేథ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. అశ్వం దొరకకపోతే తనకి మంచి జరగదు అని మహర్షులు చెప్పారు. కాని అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తిచెయ్యచ్చు అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు.

ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట, భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద, ఋచీకుడనే ఒక ఋషి భార్య పిల్లలతో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యాగాశ్వం అపహరణకి గురైనందుకుగాను నాకు ఒక యాగపశువు కావాలి, మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడా ఋచీకుడు ఇలా అన్నాడు " పెద్దకొడుకు ధర్మసంతానం( పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు) కావున నేను వాడిని ఇవ్వలేను, శాస్త్రం ప్రకారం చిట్టచివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడా మధ్య కొడుకైన శునఃశేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు.

రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి, యాగం పూర్తి చెయ్యడానికి తన కొడుకుని పంపాడు ఆ ఋచీకుడు. అంబరీషుడు ఆయనకి లక్ష గోవుల్ని దానంగా ఇచ్చాడు. శునఃశేపుడిని తీసుకెళుతున్న అంబరీషుడు కొంతదూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడకి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని శునఃశేపుడు చూశాడు. వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు " నేను నీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామఅవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరివాడిని మా అమ్మ ఇవ్వననింది, మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞపశువుగా ఇచ్చేసారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది. కాబట్టి మీరు నన్ను రక్షించాలి " అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకులని పిలిచి, తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ శునఃశేపుడి స్థానంలో యాగపశువుగా వెళ్ళండి అన్నాడు.

కథం ఆత్మ సుతాన్ హిత్వా త్రాయసే అన్య సుతం విభో |
అకార్యం ఇవ పశ్యామః శ్వ మాంసం ఇవ భోజనే ||
నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా, ఇంకొకడి కొడుకుని రక్షిస్తావ, మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టు ఉంది అని విశ్వామిత్రుడి కొడుకులన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు........
శ్వ మాంస భోజినః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు |
పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యాం అనువత్స్యథ ||

మీరు కూడా వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి వెయ్యి సంవత్సరాలు వాళ్ళలాగ కుక్క మాంసం తింటూ బతకండని శపించాడు.

అప్పుడాయన శునఃశేపుడితో.........నువ్వు బెంగపెట్టుకోమాకు, నిన్ను తీసుకెళ్ళి యూప స్తంభానికి కడతారు.

ఇప్పుడు నేను నీకు రెండు మంత్రాలని చెప్తాను, నిన్ను అలా యూప స్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ రెండు మంత్రాలని జపించు, అలా జపించడం వల్ల ఇంద్రుడు సంతోషించి, నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి, నేను ఈ యాగానికి ప్రీతి చెందాను అని యాగ ఫలితం ఇస్తాడని చెప్పి ఆ రెండు మంత్రాలని ఉపదేశం చేసి పంపించాడు.
తరవాత శునఃశేపుడిని యూప స్తంభానికి కట్టారు, అప్పుడాయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలని జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి, నేను ఈ యాగానికి సంతోషించాను, మీరు యాగపశువుని బలి ఇవ్వకుండానే మీకు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందరూ సంతోషించారు.

కోపంలో తన కొడుకులని శపించానని విశ్వామిత్రుడు బాధ పడ్డాడు. ఈ సారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలా ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడైనాడు.

మేనక! నేను నీయందు కందర్ప వశుడనయ్యాను( అంటే మన్మధ ఆవేశం కలిగింది), అందుకని నువ్వు నా
ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు అన్నాడు. మేనక సరే అనింది. అలా మేనకతో క్రీడిస్తూ క్రీడిస్తూ పదేళ్ళు గడిచిపోయాయి.

సర్వం సురాణాం కర్మ ఏతత్ తపో అపహరణం మహత్ |
అహో రాత్రా అపదేశేన గతాః సంవత్సరా దశ ||
పది సంవత్సరాల తరువాత విశ్వామిత్రుడికి అసలు తను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది. ఈ మేనకతో ఏదో, ఒక రోజు లేకపోతే రెండు రోజులు అనుకున్నాను, కాని ఇలా పది సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోలేదు. నా మనస్సుని దేవతలు వక్రీకరించడానికి ఈ మేనకని పంపారు అనుకొని కోపంగా మేనక వైపు చూశాడు, కాని ఇంతలోనే శాంతించి, ఇందులో నీ తప్పేముంది అని మేనకని వెళ్ళిపోమన్నాడు. ఈ సారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలని ఉత్తర దిక్కుకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.

ఉత్తర దిక్కున కౌశికి నది పక్కన కూర్చుని ఘోరాతిఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై, నేను నీ తపస్సుకి చాలా ఆనందించాను, ఇక నుంచి అందరూ నిన్ను మహర్షి అని పిలుస్తారు అని అన్నారు. ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ కాని సంతోషం కాని కలగలేదు. ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికి మహర్షిని అయ్యాను, ఇక బ్రహ్మర్షిని ఎప్పుడు అవుతానో అనుకొని బ్రహ్మగారిని, నేను నా ఇంద్రియాలనిగెలిచాన అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పటికైతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలని గెలవలేదు, ఇంద్రియాలని గెలవడం అంత తేలిక కాదు అన్నాడు.

మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్ఠుడి మీద నుంచి తన ఇంద్రియాల మీదకి వెళ్ళింది. తను అనవసరంగా వశిష్ఠుడి మీద క్రోధాన్ని పెంచోకోవడానికి, మేనకతో కామానికి లొంగడానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు.
మళ్ళి ఘోరమైన తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఈ సారి ఎండాకాలంలో తన చుట్టూ నాలుగు పక్కల అగ్నిని పెట్టుకొని, తల పైకెత్తి సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి తపస్సు చేశాడు. వానాకాలంలో నడుముదాకా నీళ్ళల్లో ఉండి తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సుని చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు. రంభ భయపడి వెళ్ళనంటే నానారకాలుగా నచ్చ చెప్పి పంపించాడు. మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళుతుంటే ఆయనకి అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న రంభ కనిపించింది, చెట్లన్నీ వసంత ఋతువులో ఎలా పూలతో ఉంటాయో అలా పూలతో కళకళలాడుతున్నాయి, కోకిల పాట కూడా వినిపించింది. విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాకపోయినప్పటికీ చెట్లన్నీ పూలతో ఉన్నాయి, కోకిల పాట పాడుతోంది. అయితే ఇదంతా ఇంద్రుడు నా తపోభగ్నానికి చేస్తున్న ప్రయత్నం అని గ్రహించి కోపంతో ఇలా అన్నాడు.....

యత్ మాం లోభయసే రంభే కామ క్రోధ జయ ఏషిణం |
దశ వర్ష సహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే ||
నన్ను ప్రలోభపెడదామని వచ్చిన ఓ రంభా! నువ్వు పదివేల సంవత్సరాలు రాయివై పడుండు అని శపించాడు.
తరవాత కొంతసేపటికి శాంతించి, అసలు రంభ చేసిన తప్పేముంది, నేను మళ్ళి క్రోధానికి లోనయ్యాను, ఇంద్రుడు పంపిస్తే ఆమె వచ్చింది అనుకొని రంభ అడగకుండానే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నీకు శాపవిమోచనం కలిగిస్తాడు అని అన్నాడు.

విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు, నా శత్రువులు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. ఈ కోపము, కామము నాకు కలగడానికి నా మనస్సు కారణం, ఆ మనస్సు నా ఊపిరి మీద ఆధారపడిఉంది. అందుకని ఊపిరిని తీసి బయటకి వదలను, కుంభకం(యోగాలో ఒక ప్రక్రియ) చేస్తాను, అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణం నా శరీరానికి కొంచెం ధృడత్వం ఉండడంవలన, కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకి వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోడానికి కొంత కబళాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది, మీదగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు. వచ్చిన వాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్ధమయ్యింది, కాని ఈ సారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు, ఇంద్రుడు తింటే ఏంటి నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్ళి కుంభకంలోకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.

అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానం నుంచి ఆయన తపఃశక్తి పొగగా బయలుదేరింది.

ఆయన తపోధూమం సమస్త లోకాలని కప్పేసింది, సముద్రాలు కదలడం ఆగిపోయాయి, సమస్త ప్రాణులు క్షోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవరూ కదపలేరు, ఆయనకి శత్రువు లేడు మిత్రుడు లేడు, ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మమే కనిపిస్తుంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి.........
బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపసా స్మ సు తోషితాః |
బ్రాహ్మణ్యం తపసా ఉగ్రేణ ప్రాప్తవాన్ అసి కౌశిక ||

ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్నుబ్రహ్మర్షి అని పిలుస్తున్నాను, నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయిష్మంతుడవై జీవిస్తావు అన్నారు.

అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితో.......నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము,వషట్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు( ఓంకారము, వషట్కారము భాసిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు, అలాగే తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక). అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానో, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు.

అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు.

ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో, ఆ వశిష్ఠుడి కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుడు రాముడితో చెప్పాడు.

బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలని జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇలాంటి గురువుని పొందిన రామ నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. విశ్వామిత్రుడి కథ విన్న
రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు.


ఆలుమగలు ;-
పండుగ సందర్భంగా ఇదిగో ఒక మంచి చమత్కార పాట.
పల్లెవాసులు వారు,
ఇతిహాసములలోని పాత్రలను తమవిగా చేసుకునే చనువు తీసుకోవడము
ఆలుమగల మధ్య సంభవించే చిలిపి తగాదాలను నేరుగా
సాక్షాత్తూ ఆ సీతా రామచంద్రులకే ఆపాదించేసారు.
చూడండి,చదవండి:
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! ! !
వాళ్ళ అందమైన సొంత హక్కు,
ఇలాంటి అద్భుత జానపద గేయా ఆణి ముత్యాలను
మన తెలుగు అక్ష్ర కడలిలో ప్రభవిల్లేలా చేసినవి.
పఠితల పెదవులపైన ముసిముసి నగవులను విరబూయిస్తూన్న
అలాంటి పల్లె పదము ఇదిగో! మరి!
హాస్య డోలలలో ఊగాలి మన మనసులు!
! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! !!! !
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! ! !
ముత్యాల పగడాలు అమ్మొచ్చినాయి;
రత్న, మరకతాలు ఉయ్యాలో! ఉయ్యాలో!
కొంటనని సీతమ్మ కొంగొడ్డినాది;
వద్దనుచు రామయ్య గద్దించినాడు
; ఉయ్యాలో! ఉయ్యాలో!
అలిగి వెళ్ళిపోయి మా జానకి,
బుంగమూతిని పెట్టి అరక కడ పండింది ;
దొప్పల్ల పూలన్ని గుప్పించి పోసేసి,
అమ్మను లేపండీ, సహన శీలుల్లార!
@) గుప్పినా లేవదూ గురజాల బంతి -
; ఉయ్యాలో! ఉయ్యాలో!
సానపై గంధాలు; చల్లి లేపండి -
సౌభాగ్యవతులార!
@): చల్లినా లేవదే సరసిజాక్షీ సీత -
: ఉయ్యాలో! ఉయ్యాలో!
@) విసనకర్రల తోటి విసిరీ లేపండీ -
ముత్తైదులార! నచ్చ జెప్పండి!
@) విసిరినా లేవదే విరజాజి మొగ్గ -
అవనిజకు అలుకలు ఔర! విడ్డూరమే!
కౌసల్య, కైకేయి లేపినా లేవదూ -
సుమ్మిత్ర దశరధులు పిలిచినా పలుకదూ;
ఆడుబిడ్డ శాంత వచ్చి వేడినకూడ ,
పట్టు వదలా లేదు; మా ముద్దు పూబోణి!
మరిది లక్ష్మణస్వామి, యారాలు ఊర్మిళ -
శ్రుతకీర్తి, మాండవి; వేడుకోలులు -
సుతరాము - అక్కరకు రానె లేదాయె -
\ ఉయ్యాలో! ఉయ్యాలో!
ముసుగు దన్ని మోము చూపదు మైధిలి;
ససేమిరా; మర్యాద పాటించనే లేదు!!!!!!
అయ్య! రామయ్య! ఇంక నీదే వంతు;
పంతాలు వీడి; ఒక మెట్టు దిగి రమ్ము!
ఆమైన రామయ్య గదిలోకి అడుగిడెను -
నీల మోహన మెరుపు దూసుకొచ్చిందంట!
సాక్షాత్తు తన భర్త శ్రీరామ చంద్రులు -
వెన్ను నిమిరీ లేపె వనజాక్షిని;
ముసి ముసిగ నవ్వుతూ ఓరగా చూసేను;
మూసిన దుప్పటిని తొలగించి ముదిత
పకపకా నవ్వుతూ, పరుపుల్లు దిగినాది -
ముసిరిన ముంగురులు సవరించుకున్నాది;
సీతాదేవి;
చిలుకోలె సీతమ్మ "గడి" - లోకి వెళ్ళింది -
సొమ్ములెన్నో కొనెను సంబరముగాను
చంద్ర కళ సీతమ్మ, రఘు రాము ప్రియ పత్ని -
పచ్చనీ గాధలు రామచిలుకమ్మల రమ్య గానాలు!
(“బతుకమ్మ! బతుకమ్మ! ఉయ్యాలో! -
బతుకమ్మ పాటలలో ఒక ముచ్చట

by ;- (సేకరణ: రామనిధి )

1 comment: