Wednesday, 9 March 2016

విశ్వామిత్రుడు.! (బతుకమ్మ పాటలలో ఒక ముచ్చట )

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం     ఓం శ్రీ రాం     
ప్రాంజలి ప్రభ - విశ్వామిత్ర కధ 
                             సర్వేజనా సుఖినోభవంతు                                   


విశ్వామిత్రుడు.!
.
పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహొగ్రమైన తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేథ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. అశ్వం దొరకకపోతే తనకి మంచి జరగదు అని మహర్షులు చెప్పారు. కాని అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తిచెయ్యచ్చు అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు.

ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట, భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద, ఋచీకుడనే ఒక ఋషి భార్య పిల్లలతో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యాగాశ్వం అపహరణకి గురైనందుకుగాను నాకు ఒక యాగపశువు కావాలి, మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడా ఋచీకుడు ఇలా అన్నాడు " పెద్దకొడుకు ధర్మసంతానం( పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు) కావున నేను వాడిని ఇవ్వలేను, శాస్త్రం ప్రకారం చిట్టచివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడా మధ్య కొడుకైన శునఃశేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు.

రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి, యాగం పూర్తి చెయ్యడానికి తన కొడుకుని పంపాడు ఆ ఋచీకుడు. అంబరీషుడు ఆయనకి లక్ష గోవుల్ని దానంగా ఇచ్చాడు. శునఃశేపుడిని తీసుకెళుతున్న అంబరీషుడు కొంతదూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడకి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని శునఃశేపుడు చూశాడు. వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు " నేను నీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామఅవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరివాడిని మా అమ్మ ఇవ్వననింది, మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞపశువుగా ఇచ్చేసారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది. కాబట్టి మీరు నన్ను రక్షించాలి " అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకులని పిలిచి, తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ శునఃశేపుడి స్థానంలో యాగపశువుగా వెళ్ళండి అన్నాడు.

కథం ఆత్మ సుతాన్ హిత్వా త్రాయసే అన్య సుతం విభో |
అకార్యం ఇవ పశ్యామః శ్వ మాంసం ఇవ భోజనే ||
నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా, ఇంకొకడి కొడుకుని రక్షిస్తావ, మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టు ఉంది అని విశ్వామిత్రుడి కొడుకులన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు........
శ్వ మాంస భోజినః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు |
పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యాం అనువత్స్యథ ||

మీరు కూడా వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి వెయ్యి సంవత్సరాలు వాళ్ళలాగ కుక్క మాంసం తింటూ బతకండని శపించాడు.

అప్పుడాయన శునఃశేపుడితో.........నువ్వు బెంగపెట్టుకోమాకు, నిన్ను తీసుకెళ్ళి యూప స్తంభానికి కడతారు.

ఇప్పుడు నేను నీకు రెండు మంత్రాలని చెప్తాను, నిన్ను అలా యూప స్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ రెండు మంత్రాలని జపించు, అలా జపించడం వల్ల ఇంద్రుడు సంతోషించి, నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి, నేను ఈ యాగానికి ప్రీతి చెందాను అని యాగ ఫలితం ఇస్తాడని చెప్పి ఆ రెండు మంత్రాలని ఉపదేశం చేసి పంపించాడు.
తరవాత శునఃశేపుడిని యూప స్తంభానికి కట్టారు, అప్పుడాయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలని జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి, నేను ఈ యాగానికి సంతోషించాను, మీరు యాగపశువుని బలి ఇవ్వకుండానే మీకు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందరూ సంతోషించారు.

కోపంలో తన కొడుకులని శపించానని విశ్వామిత్రుడు బాధ పడ్డాడు. ఈ సారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలా ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడైనాడు.

మేనక! నేను నీయందు కందర్ప వశుడనయ్యాను( అంటే మన్మధ ఆవేశం కలిగింది), అందుకని నువ్వు నా
ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు అన్నాడు. మేనక సరే అనింది. అలా మేనకతో క్రీడిస్తూ క్రీడిస్తూ పదేళ్ళు గడిచిపోయాయి.

సర్వం సురాణాం కర్మ ఏతత్ తపో అపహరణం మహత్ |
అహో రాత్రా అపదేశేన గతాః సంవత్సరా దశ ||
పది సంవత్సరాల తరువాత విశ్వామిత్రుడికి అసలు తను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది. ఈ మేనకతో ఏదో, ఒక రోజు లేకపోతే రెండు రోజులు అనుకున్నాను, కాని ఇలా పది సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోలేదు. నా మనస్సుని దేవతలు వక్రీకరించడానికి ఈ మేనకని పంపారు అనుకొని కోపంగా మేనక వైపు చూశాడు, కాని ఇంతలోనే శాంతించి, ఇందులో నీ తప్పేముంది అని మేనకని వెళ్ళిపోమన్నాడు. ఈ సారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలని ఉత్తర దిక్కుకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.

ఉత్తర దిక్కున కౌశికి నది పక్కన కూర్చుని ఘోరాతిఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై, నేను నీ తపస్సుకి చాలా ఆనందించాను, ఇక నుంచి అందరూ నిన్ను మహర్షి అని పిలుస్తారు అని అన్నారు. ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ కాని సంతోషం కాని కలగలేదు. ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికి మహర్షిని అయ్యాను, ఇక బ్రహ్మర్షిని ఎప్పుడు అవుతానో అనుకొని బ్రహ్మగారిని, నేను నా ఇంద్రియాలనిగెలిచాన అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పటికైతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలని గెలవలేదు, ఇంద్రియాలని గెలవడం అంత తేలిక కాదు అన్నాడు.

మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్ఠుడి మీద నుంచి తన ఇంద్రియాల మీదకి వెళ్ళింది. తను అనవసరంగా వశిష్ఠుడి మీద క్రోధాన్ని పెంచోకోవడానికి, మేనకతో కామానికి లొంగడానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు.
మళ్ళి ఘోరమైన తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఈ సారి ఎండాకాలంలో తన చుట్టూ నాలుగు పక్కల అగ్నిని పెట్టుకొని, తల పైకెత్తి సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి తపస్సు చేశాడు. వానాకాలంలో నడుముదాకా నీళ్ళల్లో ఉండి తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సుని చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు. రంభ భయపడి వెళ్ళనంటే నానారకాలుగా నచ్చ చెప్పి పంపించాడు. మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళుతుంటే ఆయనకి అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న రంభ కనిపించింది, చెట్లన్నీ వసంత ఋతువులో ఎలా పూలతో ఉంటాయో అలా పూలతో కళకళలాడుతున్నాయి, కోకిల పాట కూడా వినిపించింది. విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాకపోయినప్పటికీ చెట్లన్నీ పూలతో ఉన్నాయి, కోకిల పాట పాడుతోంది. అయితే ఇదంతా ఇంద్రుడు నా తపోభగ్నానికి చేస్తున్న ప్రయత్నం అని గ్రహించి కోపంతో ఇలా అన్నాడు.....

యత్ మాం లోభయసే రంభే కామ క్రోధ జయ ఏషిణం |
దశ వర్ష సహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే ||
నన్ను ప్రలోభపెడదామని వచ్చిన ఓ రంభా! నువ్వు పదివేల సంవత్సరాలు రాయివై పడుండు అని శపించాడు.
తరవాత కొంతసేపటికి శాంతించి, అసలు రంభ చేసిన తప్పేముంది, నేను మళ్ళి క్రోధానికి లోనయ్యాను, ఇంద్రుడు పంపిస్తే ఆమె వచ్చింది అనుకొని రంభ అడగకుండానే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నీకు శాపవిమోచనం కలిగిస్తాడు అని అన్నాడు.

విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు, నా శత్రువులు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. ఈ కోపము, కామము నాకు కలగడానికి నా మనస్సు కారణం, ఆ మనస్సు నా ఊపిరి మీద ఆధారపడిఉంది. అందుకని ఊపిరిని తీసి బయటకి వదలను, కుంభకం(యోగాలో ఒక ప్రక్రియ) చేస్తాను, అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణం నా శరీరానికి కొంచెం ధృడత్వం ఉండడంవలన, కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకి వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోడానికి కొంత కబళాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది, మీదగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు. వచ్చిన వాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్ధమయ్యింది, కాని ఈ సారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు, ఇంద్రుడు తింటే ఏంటి నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్ళి కుంభకంలోకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.

అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానం నుంచి ఆయన తపఃశక్తి పొగగా బయలుదేరింది.

ఆయన తపోధూమం సమస్త లోకాలని కప్పేసింది, సముద్రాలు కదలడం ఆగిపోయాయి, సమస్త ప్రాణులు క్షోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవరూ కదపలేరు, ఆయనకి శత్రువు లేడు మిత్రుడు లేడు, ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మమే కనిపిస్తుంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి.........
బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపసా స్మ సు తోషితాః |
బ్రాహ్మణ్యం తపసా ఉగ్రేణ ప్రాప్తవాన్ అసి కౌశిక ||

ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్నుబ్రహ్మర్షి అని పిలుస్తున్నాను, నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయిష్మంతుడవై జీవిస్తావు అన్నారు.

అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితో.......నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము,వషట్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు( ఓంకారము, వషట్కారము భాసిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు, అలాగే తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక). అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానో, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు.

అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు.

ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో, ఆ వశిష్ఠుడి కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుడు రాముడితో చెప్పాడు.

బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలని జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇలాంటి గురువుని పొందిన రామ నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. విశ్వామిత్రుడి కథ విన్న
రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు.


ఆలుమగలు ;-
పండుగ సందర్భంగా ఇదిగో ఒక మంచి చమత్కార పాట.
పల్లెవాసులు వారు,
ఇతిహాసములలోని పాత్రలను తమవిగా చేసుకునే చనువు తీసుకోవడము
ఆలుమగల మధ్య సంభవించే చిలిపి తగాదాలను నేరుగా
సాక్షాత్తూ ఆ సీతా రామచంద్రులకే ఆపాదించేసారు.
చూడండి,చదవండి:
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! ! !
వాళ్ళ అందమైన సొంత హక్కు,
ఇలాంటి అద్భుత జానపద గేయా ఆణి ముత్యాలను
మన తెలుగు అక్ష్ర కడలిలో ప్రభవిల్లేలా చేసినవి.
పఠితల పెదవులపైన ముసిముసి నగవులను విరబూయిస్తూన్న
అలాంటి పల్లె పదము ఇదిగో! మరి!
హాస్య డోలలలో ఊగాలి మన మనసులు!
! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! !!! !
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! ! !
ముత్యాల పగడాలు అమ్మొచ్చినాయి;
రత్న, మరకతాలు ఉయ్యాలో! ఉయ్యాలో!
కొంటనని సీతమ్మ కొంగొడ్డినాది;
వద్దనుచు రామయ్య గద్దించినాడు
; ఉయ్యాలో! ఉయ్యాలో!
అలిగి వెళ్ళిపోయి మా జానకి,
బుంగమూతిని పెట్టి అరక కడ పండింది ;
దొప్పల్ల పూలన్ని గుప్పించి పోసేసి,
అమ్మను లేపండీ, సహన శీలుల్లార!
@) గుప్పినా లేవదూ గురజాల బంతి -
; ఉయ్యాలో! ఉయ్యాలో!
సానపై గంధాలు; చల్లి లేపండి -
సౌభాగ్యవతులార!
@): చల్లినా లేవదే సరసిజాక్షీ సీత -
: ఉయ్యాలో! ఉయ్యాలో!
@) విసనకర్రల తోటి విసిరీ లేపండీ -
ముత్తైదులార! నచ్చ జెప్పండి!
@) విసిరినా లేవదే విరజాజి మొగ్గ -
అవనిజకు అలుకలు ఔర! విడ్డూరమే!
కౌసల్య, కైకేయి లేపినా లేవదూ -
సుమ్మిత్ర దశరధులు పిలిచినా పలుకదూ;
ఆడుబిడ్డ శాంత వచ్చి వేడినకూడ ,
పట్టు వదలా లేదు; మా ముద్దు పూబోణి!
మరిది లక్ష్మణస్వామి, యారాలు ఊర్మిళ -
శ్రుతకీర్తి, మాండవి; వేడుకోలులు -
సుతరాము - అక్కరకు రానె లేదాయె -
\ ఉయ్యాలో! ఉయ్యాలో!
ముసుగు దన్ని మోము చూపదు మైధిలి;
ససేమిరా; మర్యాద పాటించనే లేదు!!!!!!
అయ్య! రామయ్య! ఇంక నీదే వంతు;
పంతాలు వీడి; ఒక మెట్టు దిగి రమ్ము!
ఆమైన రామయ్య గదిలోకి అడుగిడెను -
నీల మోహన మెరుపు దూసుకొచ్చిందంట!
సాక్షాత్తు తన భర్త శ్రీరామ చంద్రులు -
వెన్ను నిమిరీ లేపె వనజాక్షిని;
ముసి ముసిగ నవ్వుతూ ఓరగా చూసేను;
మూసిన దుప్పటిని తొలగించి ముదిత
పకపకా నవ్వుతూ, పరుపుల్లు దిగినాది -
ముసిరిన ముంగురులు సవరించుకున్నాది;
సీతాదేవి;
చిలుకోలె సీతమ్మ "గడి" - లోకి వెళ్ళింది -
సొమ్ములెన్నో కొనెను సంబరముగాను
చంద్ర కళ సీతమ్మ, రఘు రాము ప్రియ పత్ని -
పచ్చనీ గాధలు రామచిలుకమ్మల రమ్య గానాలు!
(“బతుకమ్మ! బతుకమ్మ! ఉయ్యాలో! -
బతుకమ్మ పాటలలో ఒక ముచ్చట

by ;- (సేకరణ: రామనిధి )

Saturday, 5 March 2016

ప్రత్యక్ష దైవం .శారదాంబా

శారదాంబ శతకము
(ఆటవెలదులలో...)
1. తల్లి నిన్ను తలచి తలపెట్టినానుగా
శతక మొకటి వ్రాయ సాహసముతొ
తప్పు దొర్లవచ్చు దండించకే తల్లి
సాకు మమ్మ మమ్మె శారదాంబ!!

2. ఆది శక్తివైన యా వేల్పుకై నీవె
చదువులమ్మ గాగ మది తలంచి
తోడు నిలచినావు వీడక నెప్పుడూ
సాకు మమ్మ మమ్మె శారదాంబ !!

3. ధాత నిన్ను తలచి తనకు సైదోడుగా
నాల్కపై నిడుకొనె నయముగాను
ఉర్వి సృజన సేసి రుభయులును గలసె
సాకు మమ్మ మమ్మె శారదాంబ !!

4. మరియు నొక్క గాథ మధురమైన దదియె
అవతరింపజేసి యాది శక్తి
నిన్నె ధాత కిచ్చె నేమి మా భాగ్యంబొ
సాకు మమ్మ మమ్మె శారదాంబ !!

5. తరచ నింకనొక్క తన్మయం చేసేటి
గాథ నీదు మాకు గామితంబె
తాత గానె విష్ణు ధాతకు నిన్నిచ్చె
సాకు మమ్మ మమ్మె శారదాంబ !!

6. గంగ తోడ గొడవ కన మాకు వరమయ్యె
నదిగ మారి నీవె నయముగాను
కల్మషముల నన్ని కడిగి వేసెదవుగా
సాకుమమ్మ మమ్ము శారదాంబ !!

7. లచ్చి జామివైన లక్ష్మీ సపత్నియే
ఆమె తోను గొడవ యదొక వింత
ముదితలుగను మీరె ముచ్చట గొల్పరా
సాకుమమ్మ మమ్ము శారదాంబ!!
(ఆధారం: దేవీభాగవత కథనమే.... 

భావము: లక్ష్మిసహా గంగ, సరస్వతి కూడా విష్ణువు దేవేరులే.
అయితే గంగపట్ల ఈసు పెంచుకున్న శారదమ్మ నోరు చేసుకుని అంతటితో ఆగక కొప్పు పట్టి మరీ గుంజడంతో లక్ష్మి వారిస్తుంది. దాంతో లక్ష్మిని నదివైపొమ్మని సరస్వతి శపిస్తుంది. ఫలితంగా గంగ సరస్వతిని ప్రతిగా సరస్వతి గంగనూ.... మొత్తం మీద ముగ్గురూ నదులై మన పాపాలను కడిగేస్తూ ఉంటారు. తర్వాత కథ ఇక్కడ అప్రస్తుతమే కదా)

8. బ్రహ్మ రుద్రులెన్ని వరముల నిచ్చినా
దైత్యు లందు నీదు దయయె లేక
వట్టిపోవ వారె మట్టిలో గలసిరీ
సాకుమమ్మ మమ్ము శారదాంబ !!
(భావము : రావణ, హిరణ్యకశిప, భస్మాసురాదులకు బ్రహ్మ రుద్రులిద్దరూ సందర్భానుసారం ఏవేవో వరాలిచ్చారు. కానీ వీరు వాటిని కోరుకునే సమయంలోనే శారద తన ప్రభావం చూపింది. ఫలితంగా వీరి పదజాలంలో వక్రత తలెత్తి విష్ణువు చేతిలో, లేదా రుద్రుని చేతిలోనే ప్రాణాలు కోల్పోయారు. కదా !)

9. సవతి తోడ నీవె జగడ మాడియు గూడ
సంగమించినావు సర్దుకొనుచు
నేర్వదలచినపుడు నేర్పు నీ పాఠమూ
సాకుమమ్మ మమ్ము శారదాంబ !

(భావము : గంగతో గతంలో గొడవ పడినప్పటికీ నదిగా మారిన తర్వాత అంతర్వాహినిగా ప్రవహిస్తూనే గంగా యములతో కలసి త్రివేణీ సంగమం అయినది దా సరస్వతి. అంటే అయిన వారితో మనస్పర్థలు తలెత్తినా కలకాలం గుర్తుంచుకో రాదనీ, తిరిగి సన్నిహితం కావాలనేదే ఈ ఉదంతం నేర్పే పాఠం అని నా భావం.)

10. పాఠములను జదువ పత్రంబులెన్నియో 
దక్కు, పైస, పదవి దఖలు పడును
నీదు గృపయె యున్న నిజమైన జ్ఞానమే
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!

(భావము : వివిధ పాఠ్యాంశాలూ చదివి ముక్కునబట్టి పరీక్షలలో నెగ్గితే ధృవ పత్రాలూ, వాటి ఆధారంగా ఉద్యోగాలూ, ధనమూ లభించ వచ్చు. వాటి వలన కొంత గౌరవమూ కలగవచ్చునేమో. కానీ, శారదాంబ దయ వలన కలిగేదే నిజమైన జ్ఞానము కదా....!!)
( Knowledge may be a power that may give some power to SOME EXTENT... but Education gives an ETERNAL POWER, which depends on the grace of Goddess SARASWATHI, me thinks !)

11. ఆది శక్తికున్న నైదు రూపములలో
ఒకటి నీవె యన్న యొప్పుదలయె
అరయ నీకె యెన్నొయాకారములు గదా
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!

(భావము : సరస్వతీ దేవిని సృజించిన ఆది పరాశక్తికి మొత్తం ఐదు రూపాలున్నయని శ్రీ దేవీ భాగవత ప్రవచనం. అవే...1) శివప్రియ, 2) లక్ష్మి, 3) సరస్వతి, 4) గాయత్రి, 5) రాధ.)
కాగా సరస్వతీ దేవికి సైతం తొమ్మిది రూపాలున్నాయంటారు. వాటి గురించి రేపటి నుంచి ఒక్కొక్క పద్య రూపంలో పేర్కొంటాను.
ముందుగా ఒక మనవి. శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధంలోని సమాచారం ప్రకారం సరస్వతీ దేవి కూడా 9 రూపాలలో ఉంటుంది. అయితే అది దేవీ భాగవతం మాత్రమే కావడం వలన పూర్తి వివరం లేదు. పేర్లు మాత్రమే ఉన్నాయి. అందుకని ఆ పేర్లనే ఆధారం చేసుకుని ఈ పద్యాలు అల్లుకున్నాను.
 -------------------
వరుస పద్యం 12. 
ఆ.వె. వందనములు పొందు వ్యాఖ్యాన రూపిణీ
నీదు కృపయె లేక నిక్కముగను
భాష్యమేది రాదు పండితులైననూ
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!

(భావము : మొదటి రూపము వ్యాఖ్యాన రూపిణియే. కనుక ఎంతటి పండితులైనా ఆమెను శ్రద్ధగా సేవించినపుడే దేనికైనా తగిన భాష్యం చెప్పగలరు. కదా)

13. సరిగమలను పలుక సంగీత రూపిణీ
నీదు దయయె గాద నిక్కముగను ?
గాత్రమిత్తువీవె కారుణ్య మూర్తివై 
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!

(భావము : రెండో రూపము సంగీత రూపిణియే. సరిగమల సాధనకూ ఆ సంగీత రూపిణి దయ అత్యావశ్యకం కదా...)

14. ధవళ వస్త్రధారి దయగల తల్లివే
తెలుపు శాంతి కనగ తెలుపు రంగు
శ్వేత వర్ణమెపుడు చేకూర్చు మదికదే
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!

(భావము : ధవళ రూపిణి. తెలుపు రంగును చూస్తేనే శాంతి సంకేతమై కనిపిస్తుంది కదా.)

15. ఎంత చదివితేమి యెన్ని నేర్చిన నేమి
నిన్ను గొల్వకున్న నిష్ఫలంబె !
మేదకులును గొల్చి మేధావు లగుదురూ
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
(భావము : ఈ రూపమే మేధ. ఎంత చదివినా, ఎన్ని విద్యలు నేర్చినా అమ్మ దయ లేకుంటే మేధావి యనిపించుకోలేము కదా)

16. ప్రతిభ కెపుడు నీవె ప్రధమ సంవరణమూ
నువ్వు గాచకున్న నవ్వుపాలె !
గణన పొందుటకును గరుణించవలె నీవె
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!

(భావము : ఇక్కడ ఈమె ప్రతిభా రూపిణియే. మన ప్రతిభా పాటవాలకు ఆమెయే మూల కారణము. సవరణమనగా కారణమే కదా.!)

17. ఫలము లేవియైన కలిగించు నీ కృప
సకల ఫలములకును స్థానమీవె !
నీదు రూపములకు నిదియొక భావము
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!

(భావము : ఇది సర్వ ఫలప్రద రూపము. ఫలితాలేవియైననూ అమ్మ కృతోనే లభిస్తాయి. కనుక అన్ని ఫలితాలకూ ఆమెయే అసలైన స్థానము. కదా !)

18. అతివ లేక జగతి యంద విహీనము
శీల రహితయైన సిగ్గు చేటె !
నిన్ను గొల్వ నెపుడు నిజశీల మబ్బును
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
(భావము : ఈ రూపంలో అమ్మ సుశీల. భావము సుబోధకమే అయినా మొదటి రెండు పాదాలను బట్టి స్త్రీలకు మాత్రమే అనవయించుకోకూడదేమో. సకల జనులకూ శీలం అవసరమేననీ అందుకు అమ్మ దయ చాలా ముఖ్యమనే నా భావము.)

19. విద్య యున్న గాదు, వినయమే ముఖ్యము
చిత్తి లేని యెడల సీత్కృతియెగ !
బుద్ధిమంతులనెగ పుణ్య శీలుర జేతు
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
(భావము : ఇక్కడ ఈమె బుద్ధి రూపిణి. విద్య ఉన్నంత మాత్రాన వినయమూ, అదివ్వగల మతి(చిత్తి) కూడా ఉండాలి. లేకపోతే ఛీత్కారాలే (సీత్కృతి) దక్కుతాయి. అందుకే అమ్మ దయ కావాలి. అదుంటే బుద్ధీ పుణ్య శీలమూ కూడా లభిస్తాయి...కదా)

20. జ్ఞాపకములు లేని జ్ఞాని వలన నేమి
కలగబోదు చూడు ఫలము సుంత !
స్మృతియు నీదు భిక్షె స్మృతి రూపిణివి నీవె
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!

(భావము : అమ్మ మరొక రూపమే స్మృతి. భావమూ సుబోధకమే కదా !)

21. అరయ, నాడు నీవె యాజ్ఞవల్క్యునకును
మనన శక్తి నీవ మమత జూపి ?
మనన సేయకున్న మతిని చేరదు విద్య
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!

(భావము : యాజ్ఞవల్క్యుడు వాస్తవానికి గొప్ప జ్ఞాని. కానీ, 
కారణాంతరాల వల్ల గురువు శాపానికి గురై జ్ఞాపక శక్తి కోల్పోతాడు. తర్వాత సూర్యుని సలహాపై సరస్వతీ దేవిని స్తుతించి తిరిగి జ్ఞాపకశక్తినీ, పూర్వ జ్ఞానాన్నీ కూడా పొందుతాడు. కాగా, పదే పదే మననం చేస్తేనే కదా జ్ఞాపకం ఉండేదీ...)

(ఇదీ శ్రీ దేవీ భాగవతంలోనే ఉన్నట్లు వికీ పీడియా కథనం.)
22. ముని వరేణ్యు తాత ముని సుతు కోసమే
జ్ఞాన మరిగి నిన్నె, జ్ఞాని యయ్యె !
కాంతుడైన నీకె కావలెగా చట్టు
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
(భావము : ముని కుమారులలో ఒకరైన సనత్కుమారుడు నారద మహర్షి తండ్రి(తాత) అయిన బ్రహ్మను తనకూ జ్ఞాన బోధ చేయాలని కోరగా, శ్రీకృష్ణుని సూచన మేరకు విరంచి సైతం శారదనే స్తుతించి మరీ బ్రహ్మ జ్ఞానం పొందాల్సి వచ్చిందని పురాణ ప్రవచనం. చట్టు అనగా శిష్యుడనే అర్థమూ ఉన్నది మరి.)
(ఇలాంటివే శారదాంబకు సంబంధించి మరి కొన్ని ఉన్నాయి. వీటన్నిటికీ ఆధారం... వికీయే)

23. అవని కోర తననె ఆ యనంతుడు నిన్నె
వేడి పొంది బ్రహ్మ విద్య యపుడు
పుడమికిచ్చెనన్న పుణ్యగాథే యది
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : భూదేవి అనంతుని తనకు జ్ఞానం ఉపదేశించమన్నది. దాంతో ఆయన కశ్యపుని ఆనతి మేరకు సరస్వతీ దేవిని ప్రార్థించి ఆమె నుంచి ఆ విద్య పొంది భూదేవికి బోధించాడని ఒక గాథ.]

24. దల్మి కొరకు శూలి తత్త్వ మరయ గోరి
నిన్నె వేడినాడు నిక్కముగను
వామ దేవునికిని వందితవైతివి
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : దల్మి అంటే ఇంద్రుడే. ఆయన తత్త్వ జ్ఞానం కోసం శివుని అనగా శూలిని అర్థించగా ఆయన(వామదేవుడు) సరస్వతీ దేవిని ప్రసన్నం చేసుకుని అప్పుడు ఇంద్రుడికి బోధించాడని ఓ గాథ.]
25. వ్యాసుడైన మరియు వాల్మీకి యైనను
నిన్ను గొలిచి గాద నిష్ఠ తోడ
జ్ఞానులైరి నీవె జ్ఞానంబు బంచగా
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడుగగా, వాల్మీకి సరస్వతి దయను పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందాడు. అలాగే వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు సరస్వతిని గురించి తపస్సు చేసి సత్కవీంద్రుడయ్యాడనీ, . ఆ తర్వాతే ఆయన వేద విభజన జరిగిందనీ ఐతిహ్యం.]
26. దేవ గురువు నిన్నె తీరుగా గొలిచెను
శబ్ద శాస్త్రమునకె శారదాంబ !
అదియు గూడ నరయ యా వేల్పురేనికే
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : ఇంద్రుడు తనకు శబ్ద శాస్త్రం కావాలని బృహస్పతిని అడిగితే ఆయన(దేవ గురువు) శారదాంబను స్తుతించి పొంది ఇంద్రుడికి బోధించాడు.].
27. హస్త భూషణమన పుస్తకమేయని
నీవె పట్టి చూపినావు మాకు
విద్య లేనివాడు వింత పశువు గాన
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : అమ్మ హస్త భూషణ కదా. ఆలోచిస్తే అందులోని ఆంతర్యమే ఈ పద్యానికి ప్రాతిపదిక. చేతికి ఎన్ని ఆభరణాలున్నా విద్యలేకపోతే అంతే కదా]
28. చేత వీణ బట్టి చెల్వు మీరగ నేర్పు
గళములుండవలెను గచ్ఛపి వలె ! 
స్వరమె బాగయున్న సకలము బాగుగా
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : అమ్మ వీణా పాణి. అంటే మన గొంతులు కూడా మాట్లాడేటప్పుడు వీణాస్వనము ( ఆమె వీణ పేరు కచ్ఛపి కదా) మాదిరి ఉండాలనీ, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనీ నేర్పుతున్న దనుకోవాలి.కదా!]
(ముందుగా ఒక మాట. నేటి నుంచి ద్వాదశ నామ స్తోత్రమే ప్రాతి పదిక. అయితే ప్రత్యేకించి నామార్థ విశేషాలు కానరానందున తోచిన మేరకు సొంతంగానే నిఘంటువుల ఆధారముగా భాష్యం చెప్పుకుంటున్నాను. విజ్ఞులు మన్నింతురు గాక..... ధన్యవాదాలతో...)
-----------------------
29. భాషణలకు రాణి భారతి నీవెగా
వాక్కు మంచిదైన వలన కలుగు
పసిడి పలుకులకును పాదుగా నిలుచుచు
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[అర్థాలు.. భారతి అనగా వాక్కు, భాషణము అనియూ, అలాగే వలన అనే పదానికి రక్షణ, పాదుకు ఆధారము పర్యాయ పదాలు..
కనుక భావము సుబోధకమే కదా)
30. సంస్మరింప నిన్నె సారస్వతములోన
గణన పొందవచ్చు కచ్చితముగ !
నీవు వెలయుటందు నిది యొక లక్ష్యమే
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[ భావము : ద్వాదశ నామ స్తోత్రంలో ఇది ద్వితీయ నామం. సారస్వత రంగంలో అనగా సాహిత్యాది సకల కళలలో పేరు పొందాలంటే సరస్వతీ మాత అనుగ్రహం తప్పని సరి. ఆమె అవతరణ లక్ష్యాలలో ఇదీ ఒకటి కదా.]
31. శారదనగ నెవరు? సారస్వతమ్మున
మునిగి దేలువారి మురిపెముగను
సేద దీర్చు తల్లి " శీతల " పవనాల
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : అమ్మ తృతీయ నామమే శారదా దేవి. అనగా శార అనగా పవనము అని నిఘంటు సమాచారం. అందుచేతను నేను జ్ఞానద, మోక్షద యనునట్లే శార ద అనుకుంటూ నాదైన భాష్యం అల్లుకొన సాహసించాను. ఆ ప్రకారముగా సారస్వత రంగాన మునిగి తేలేవారిని అమ్మ తన కరుణాత్మక శీతల పవనాలతో సేదదీరుస్తుందనే నా బావము.]
32. హంస వాహనంబు నది నేర్పు మాకెంతొ
మసలు కొనగ వలయు మంచిగాను
చెడుగు చెరగ నేర్పి చేర్చవా తీరము
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : తల్లి చతుర్థ నామమే హంస వాహన. హంసలు పాలు, నీరు వేరు చేయగలవని నానుడు. ఆ భావం ఆదారంగానే అమ్మను కూడా ఇలా ప్రార్థంచడం జరిగింది.చేటలతో తాలు వగైరా చెరిగి ఏరడం మన పెద్దల కాలంలో అలవాటు కదా]
33. " జగతి యందు ఖ్యాతి జనియించు జననితో
ఆమె కృపయె యున్న నదియె చాలు !"
అనెడివారి నెల్ల యాదరింతువు నీవె
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : జనని పంచమ నామమే జగతీ ఖ్యాతి. ఆమె పట్ల పూర్తి స్థాయిలో భక్తి విశ్వాసాలుంచి అమ్మ దయ ఉంటే చాలనుకునేవారిని తానే సర్వవిదాలా ఆదరిస్తుంది. కదా !]
34. వాక్కు నిచ్చుచుండు వాగ్దేవియే నీవు
గీత దాటకుండ కృపయె చూపు
మాట మీరనీక మన్నన గల్పిస్తు
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : అమ్మ షష్టమ నామమే వాగీశ్వరి. అనగా వాక్కుకు అధి దేవత. కనుక మాటలలో హద్దు మీరకుండా పది మందిలో మన్నన కలిగేట్లు కృప చూపాల్సింది ఆమెయే కదా..!]
35. కన్య లక్షణములె కచ్చితముగ దెల్పు
నీదు నామ మొకటి నిశ్చయముగ
కొమరితలకు నైన కూడదు త్రుళ్లింత
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : తల్లి సప్తమ నామమే కుమారి. అంటే సాదారణ పరిభాషలో అవివాహిత.(వివాహం కాని పడుచులకే కదా పేరు ముందు కుమారి శబ్దం.) ఆడకు పోయే పిల్ల కదా అని గారాబంగా పెంచవచ్చు, అయినప్పటికిన్నీ ఆమెకు ఏ విధమైన అతిశయం, అహంకారం ఉండరాదనీ, అణకువ మంచిదనీ చెప్పడమే నా బావం. కుమారి అంటే పార్వతి అనుకున్నా ఆమో తల్లి దండ్రులపట్ల ఎలా మెలగిందో ఎరుకే కదా!
అంత మాత్రాన ఈ పద్యం రూపేణా పురుషాధిపత్యం ప్రదర్శిస్తున్నాననుకో రాదని మనవి.]
36. బ్రహ్మ పత్నివైన బ్రహ్మచారిణివందు
ఎరుగ వలయు నిదియు నెరుక గలిగి
మోక్ష మార్గమునకు మూలమె యిది గదా
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : జనని అష్టమ నామమే బ్రహ్మచారిణి. దీనికి నేను రెండు రకాల భావాలు చెప్పుకుంటున్నాను. పతియైన బ్రహ్మ బాటలో నడిచేది, బ్రహ్మము తెలిసి ఆ తత్త్వము ననుసరించేది. బ్రహ్మ పత్నివైన అని ప్రారంభించడంలో ఆంతర్యం ఇదే. బ్రహ్మకు పత్నివైన నీవు ఆయన బాటలోనే నడుస్తున్నావు అనియున్నూ, బ్రహ్మ పత్నివైనప్పటికీ బ్రహ్మ చర్యము వీడక బ్రహ్మ చారిణి మాదిరిగా ఉన్నావు అనే. (వారుభయులూ సతీ పతులైనప్పటికీ, వారికి మానస పుత్రులే గానీ నిజ సంతానం లేదేమో కదా... ). బ్రహ్మ జ్ఞానము తెలిస్తేనే కదా మోక్షమార్గము తెలిసేది.]
37. ధరణి బుద్ధి కెపుడు ధాత్రివి నీవెగా
అంద జేతు వదియు నర్హులకునె
అర్హతలను పొంద నణకువ ముఖ్యము 
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : తల్లి నవమ నామమే బుద్ధి ధాత్రి. అంటే బుద్ధి జ్ఞానాలకు ఆమెయే తల్లి. (ధాత్రికి పర్యాయ పదాలే తల్లి, మాతృక వగైరా)అణకువ వంటి సద్గుణాలున్నవారినే ఆమె అర్హులుగా యెంచి వాటినందిస్తుందని గ్రహించాలి. బుద్ధి, జ్ఞానం అంటే కేవలం తెలివి తేటలే కాదు కదా !]

38. వరములిచ్చు తల్లి వరదాయినీ నీవు
కోరునదియె గాక కూర్మి తోడ
కావలసినదిస్తె కైవల్యమే కదా
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : తల్లి దశమ నామమే వరదాయిని. వరాలిచ్చే తల్లి. అయితే, ఏ తల్లి అయినా అడిగినవల్లా ఇస్తే అంతిమంగా అది మనకే ఇబ్బంది. కనుకే కావలసినవి మాత్రమే ఇస్తుందామె. అలాగే శారదాంబ లాంటి వారు ఇచ్చేది మోక్షసాధనాలే కదా !]

39. కాలి యందెలెపుడు కనువిందు సేయుగా
ఘట్టనంబుతోడ మట్టి గరపు
క్షుద్రులకును జూడ క్షోభ నీ వల్లనే
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : అమ్మ ఏకాదశ నామమే క్షుద్ర ఘంట. దీనికి రెండు రకాల అర్థాలు తీసుకోవచ్చనుకుంటున్నాను. ఒకటి ఏక పదంగా కాలి యందె. మరొకటి రెండు పదాలనుకుంటే క్షుద్ర ఘట్టనే. అనగా దుర్మార్గులను మట్టగించడమే. అప్పుడు ఆ అందెల చప్పుడు భక్తులకు కమనీయమే ననేది భావం.]

40. నిఖిల లోకములకు నీశ్వరివే నీవు
మాట మాదె యైన నాట నీదె
శివుని యాజ్ఞె యన్న శ్రీ మాట నీ యాన
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : అమ్మ ద్వాదశ నామమే భువనేశ్వరీ దేవి. అంటే లోకాలన్నిటికీ అధినేత్రి. దేవీ భాగవతం ప్రకారం త్రిమూర్తులనూ సృజించి బాద్యతలు అప్పగించింది అమ్మే కదా.]
------------- ఇక అష్టోత్తర నామాలే ఆధారం ---------------

41. శ్రీ ప్రదాంబ నీవు సిరులొసంగ గలవు
విద్య కన్న గొప్ప విత్తమేది ?!
అక్షరంబులున్న నక్షయ సంపదే
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : సుబోధకమే కదా.. 
నామము : ఓమ్ శ్రీప్రదాయై నమః ]

42. పద్మ నిలయ నీవె పద్మజుని రమణా !
పాద పద్మములకు ప్రణతులిత్తు !!
పద్మ హృదయ నిన్నె పరిపరి వేడెద
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : పద్మంలో ఉంటావు. పద్మజుని అనగా బ్రహ్మ యొక్క రమణ యనగా పత్నివి అయిన ఓ శారదాంబా నీకు ప్రణతులిస్తున్నాను. పద్మము వంటి హృదయము గల దేవీ మమ్ము నీవే సాకగలవు.
(భార్యకు గల పర్యాయ పదాలలో రమణ, రాణి కూడా ఉన్నాయి మరి.) ]
------------------------------------------------
నామము : ఓమ్. శ్రీ పద్మ నిలయాయై నమః

43. అక్షరునికి గావ యాత్మీయ సోదరి
అక్షరముల నిచ్చి యాదుకొమ్ము
లక్ష్య శుద్ధి కలిగి లక్షణముగ గొల్తు
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : ఆ పరమ శివునికి ఆత్మీయ సోదరివీ నీవే కదా తల్లీ. నిన్ను గతి, మతి చెడకుండా కొలిచెదము కావున అక్షర సంపదతో ఆదుకో అమ్మా..
అక్షరుడు అనగా త్రిమూర్తులలో ఎవరైనా కావచ్చును.కానీ నామము ప్రకారము శివుడే.
నామము : ఓమ్ శివానుజాయై నమః ]

44. క్ష్మాజ యనగ నీవె వ్యాజమే లేనట్టి
రహియె చూపినావు రాఘవునికి
రాక్షస గుణములనె రాకుండుగా జేసి
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : సీతా మాతవై ఆ రామచంద్రునికి కల్మషమెరుగని ప్రేమ చూపించావు కదా. అట్లే రాక్ష గుణములంటకుండుగా జేస్తూ మమ్మూ సాకవలసింది.
క్ష్మా యనగా భూమి. కనుక అందునుంచి జనించిన మాతయే సీతమ్మవారు. వ్యాజము అనగా కాపట్యము, వంచన. రహి యనగా ప్రేమాదరములే.
నామము : ఓమ్ సీతాయై నమః ]

44. క్ష్మాజ యనగ నీవె వ్యాజమే లేనట్టి
రహియె చూపినావు రాఘవునికి
రాక్షస గుణములనె రాకుండుగా జేసి
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : సీతా మాతవై ఆ రామచంద్రునికి కల్మషమెరుగని ప్రేమ చూపించావు కదా. అట్లే రాక్ష గుణములంటకుండుగా జేస్తూ మమ్మూ సాకవలసింది.
క్ష్మా యనగా భూమి. కనుక అందునుంచి జనించిన మాతయే సీతమ్మవారు. వ్యాజము అనగా కాపట్యము, వంచన. రహి యనగా ప్రేమాదరములే.
నామము : ఓమ్ సీతాయై నమః ]

46. శివుని పత్నిగాను శివమొసంగుదు వీవు
అమ్మ నామ మొకటి యవధరించి
మూర్తి భేదమున్న మూలము నీవెగా
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : అవతారాలేవైనప్పటికీ అన్నీ తానే కదా. ఆ ప్రకారంగా చదువుల తల్లి కూడా శివానియే అనుకోవాలి. 
నామము : ఓమ్ శివాయై నమః (శివా అంటే శివపత్ని యైన పార్వతియే)]

47. ధాత పత్నిగాను వ్రాతలు మార్చుచూ
తరతరములపాటు తలచు నటుల
తీర్చి దిద్ద గలవు తీరుగా నిను వేడ
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : సహజంగానే అమ్మ సరస్వతి అంటే విదాత అనగా బ్రహ్మదేవుని సతిగా గుర్తింపు కదా. కనుక ఆమెను తగిన విధంగా (మాత్రమే) కొలిస్తే తరతరాలు మన పేరు నిలిచేలా తీర్చిదిద్దగలదు కదా..
నామము : ఓమ్ బ్రాహ్మ్యై నమః (బ్రాహ్మి అంటే బ్రహ్మ పత్ని యైన సరస్వతియే)]

48. విమల యనుచు నిన్నె వేడుకొందుము మేము
కమలములను బోలు కనులు గలిగి
పూజ్య భావములునె పొంగారునట్లుగా 
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : పువ్వుల వంటి కనులు కలిగిన నిన్నే విమలా యంటూ వేడుకొంటాము. దయచేసి మాలో మంచి బావాలు పొంగేట్లుగా సాక
నామము : ఓమ్ విమలాయై నమః (విమల అంటే నిర్మలమైన లేదా ఒప్పుదలయైన)]

49. కామ రూపి నీవు కనగ యంతట నీవె
విశ్వమంత నిండి విబుధ జనుల
గాచుచుందు వీవు గారుణ్య మూర్తివై
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము సుబోధకమే...కదా
నామము : ఓమ్ కామ రూపాయై నమః ]

50. మా యెదలను నీవె మాలినివై యుండి
మధుర భావనలకు మరల జేసి
జగతి నందు మేమె యగణితు లగునట్లు 
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : మా హృదయాలలో నీవే మాలినివై కొలువు దీరి మమ్ము మంచి భావాల వైపు మరల జేస్తూ, ప్రపంచంలో మేము గొప్పవారమయ్యేట్లుగా సాకు తల్లీ.. !
మాలిని... మాలాకార సుదతి ... ఇదీ గౌరీ దేవికి పర్యాయ పదమే, అగణితులు అనగా గొప్పవారు అనే అర్థమూ ఉంది.
నామము : ఓమ్ మాలిన్యై నమః ]

51. పాపములను కడుగు పావన గంగవే
దుష్ట యోచనలను దూరముంచి
నడచు నటుల యెపుడు నలియైన బాటలో
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : గంగాదేవి పేరు కూడా కలిగియున్న నీవే మా నుంచి చెడు తలంపులను దూరం చేస్తూ, మేము యుక్తమైన బాటలో నడచునట్లు చూడవలసినది.
నలి అనగా యుక్తము అనే అర్థమూ ఉన్నది. కాగా, సంస్కృత నిఘంటువులో మహా భద్రా యనగా గంగా అనే అర్థమే యున్నది. వాస్తవానికి గంగ కూడా ఆదిశక్తి అవతారాలలో కూడా ఒకటే కదా!)
నామము : ఓమ్ మహా భద్రాయై నమః ]

52. మాయ జేసియైన మట్టు వెట్టుమరుల
మాయ లేవియైన మంచి కొఱకె
దుర్గమంబె దారి దురసిల్ల నీయక
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : దుర్గా దేవి నామమే ధరించిన ఓ శారదాంబా !మాయోపాయంతో నైనా సరే మా శత్రువులను అనగా మాలోని దుర్గుణాలను అణచు తల్లీ !! నీవు చేసే మాయలేవి యైన మంచి కొఱకే గదా. మా జీవన మార్గం సహజంగానే దుర్గమం. అయినా బాధపడనీయక సాక వలసినది. మహా మాయా అనగా దుర్గాదేవియేనని సంస్కృత నిఘంటు ప్రమాణం.
నామము : ఓమ్ మహా మాయాయై నమః ]

53. అవయవములు చూడ యద్భుతముగ నుండు
ఇంద్రియమ్ము మాది యినుమడింప
తీర్చి దిద్దవలయు తీరుగా నీవెగా
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : తల్లీ. నీ అవయవములన్నియునూ చాలా అద్భుతంగా నయనానందకరముగా ఉంటాయి కదా. మాకు అన్నీ కాకపోయినా ఒక్క ఇంద్రియమై(అంగము అంటే దురర్థానికి తావీయవచ్చుననే)నా తీర్చిదిద్దవలసిందిగా కోరుతున్నాము. అదే జ్ఞానేంద్రియము..అనగా మనసు లేదా మెదడే...
నామము : ఓమ్ దివ్యాంగాయై నమః ]

54. పద్మ వక్త్ర యన్న పలువిధంబుల యొప్పు
వదనమైన నేమి వచన మైన
గళము నందు నెపుడు కరుణయే వర్షించు
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : పద్మము వంటి వదనము లేదా సున్నితమూ, శ్రావ్యమూ నైన కంఠము గల తల్లీ మాకునూ సుస్వరాలే పలుకునట్లు సాక వలసినది.
వక్త్రము అనగా వదనము, మాట, నోరు ...ఇత్యాది అర్థాలున్నాయి కదా.
నామము : ఓమ్ పద్మ వక్త్రాయై నమః ]

55. జ్ఞాన ముద్ర గలిగి జ్ఞానుల సేసేటి
అమ్మ! మాకు నేర్పు మక్షరములు
నిండు మనసుతోటి నిన్నె గొల్చెదముగా
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : అమ్మది అభయ ముద్రే కాదు, జ్ఞాన ముద్ర కూడా. కనుకే ఆ తల్లి అక్షర జ్ఞానం కోసం వేడుకుంటాం. అయితే, మొక్కుబడిగా గాక నిండు మనసుతో కొల్చినవారికే ఆ జ్ఞానం రవ్వంతైనా లభిస్తుంది. కదా!
నామము : ఓమ్ జ్ఞాన ముద్రాయై నమః ]

56. పాతకముల నన్ని పరిహరింతువు నీవె
పాహి పాహి యన్న పాపినైన
చేరదీసి వాని చిత్తమె మార్చవా ?
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : సుబోధకమే కదా..
నామము : ఓమ్ మహాపాతక నాశిన్యై నమః ]

57. సత్య లోకమందు నిత్యమై భాసిల్లు
దేవి ! నిన్నె యెపుడు దీటుగాను
సురలు పొగడనేమి చోద్యమె కాదుగా
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : బ్రహ్మ పత్నిగా సత్య లోకంలో విలసిల్లే నిన్ను దేవతలు కూడా పొగడటంలో విశేషమేమి లేదు కదా తల్లీ... అట్టి ఓ శారదాంబా మమ్మూ నీవే సాకగలవు. ..
నామము : ఓమ్ సురవందితాయై నమః ]

58. కాళి వగుదు వీవు కఠిన హృదయులకు
కాటు వేయగలవు కర్కశులను
సాధు జనుల పట్ల శాంత మూర్తి వగుచు
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : కఠిన మనస్కులై ఎదుటివారిని పీడించే వారి పట్ల నీది కాళికావతారమే. అలాగే కర్కశులైన రక్కసులను కాలరాస్తావు కూడా కదా తల్లీ... అట్టి ఓ శారదాంబా మమ్మూ నీవే సాకగలవు. ..
నామము : ఓమ్ మహా కాళ్యై నమః ]

59. పాశములను బట్టి పాపాల నడగించి 
మోక్షదాత వగుదు ముదము తోడ
మోహ పాశములనె మూలకు నెట్టించి
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : పాశాలను అనగా త్రాళ్లే(యమ పాశములే) చేతబట్టి పాపుల పాపాలు తొలగించడం ద్వారా సంతోషంగా వారికీ మోక్షం అనుగ్రహిస్తావు కదా. అలాగే మాలోని మోహమనే పాశమును తొలగించి సాకగలవు. ..
నామము : ఓమ్ మహా పాశాయై నమః ]

60. కర్కశులకు నెపుడు కాళరాత్రివె నీవు
నీదు నామ మదియు నిజముగాను !
రాత్రి తొలగజేసి రాణింపు నొసగుచూ
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : దుర్మార్గుల పాలిట నీవెప్పుడూ కాళరాత్రివే అవుతావు కదా. కాగా, మాలోని అజ్ఞాన తిమిరాన్ని తొలగించి రాణింపు వచ్చేలా సాకగలవు. ..
నామము : ఓమ్ కాళరాత్రియై నమః ]

61. కాలమేదియైన కనగలవే నీవు
నీవెరుంగ నదియె నిజము లేదు
తెలియ వలసినదియె తెలియ జెప్పగలవు
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : మూడు కాలాల వివరాలూ, విశేషాలూ సమస్తం ఎరిగన నీకు తెలియ(రా)నిదేదీ లేదు. అట్టి ఓ తల్లీ కాలానుగుణంగా మాకునూ తెలియవలసినదే తెలిసేలా చేస్తూ మాలోని అజ్ఞాన తిమిరాన్ని తొలగించి రాణింపు వచ్చేలా సాకగలవు. ..
నామము : ఓమ్ త్రికాల జ్ఞానియై నమః ]

62. భోగ భాగ్యములనె భూరిగా నిత్తువు
సంపదనగ మాకు సాక్షరతయె
దాని వలనె మాకు తరుణ మార్గము ప్రాప్తి
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : భోగ భాగ్యాలను అందించేది నీవే. అయితే అక్షర జ్ఞానాన్ని మించిన సంపదేమున్నదీ. దాని వలనే కదా మేము గమ్యం చేరగలిగేది. కనుక అందుకు తగిన విధంగా సాకగలవు. ..
నామము : ఓమ్ భోగదాయై నమః ]

63. గోమతి యన నదివె కూర్మితోడను నీవె
కడిగివేయగలవు కల్మషములు
మా హృదయము లెపుడు మలచి యీ రీతిగా
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : సరస్వతీ దేవి రూపాలలో గోమతీ నది కావడమూ ఉన్నదిక దా. అందుకే ... 
నదీ రూపాన భక్తుల కల్మషాలను కడిగివేసే ఓ తల్లీ ! మా హృదయాలను కూడా అలాగే మలచవలసినది కోరుతున్నాను.
నామము : ఓమ్ గోమత్యై నమః ]

64. అంకుశంబు గావ నదలించుటకు నీవె
ఒజ్జ ధర్మ మదియె యొప్పుదలయె
దండమొకటి యుండు దారి తప్పిన చట్టు
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : శిష్యులు దారి తప్పితే దండించి దారిలో పెట్టాల్సిన బాధయత అయ్యవార్లదే. అందుకోసం వారు ఏనుగులను అదలించే అంకుశాల లాంటి సాధనాలనైనా వాడతారు. నీవూ అలాంటి అంకశంగా మారియైనా మమ్ములను దారిలో పెట్టు తల్లీ...
నామము : ఓమ్ మహాంకుశాయై నమః ]

65. ఆ.వె. అరయ సత్తు మార్చు సురసము రీతినే
మేధకునిగ జేయు మేదకులను
అమ్మ ! నీవె చూడు మదియు మా భాగ్యమే
సాకుమమ్మ మమ్ము శారదాంబ...
[భావము : రసము అంటే సత్తును బంగారం చేసేది, ఇక్కడ అజ్ఞానిని జ్ఞానిగా మార్చేది కనుక ఆ పేరు వచ్చింది.... వాస్తవానికి సురస అంటే నిఘంటు ప్రకారం పార్వతీదేవి నామం, తులసి మొక్క, నది, మధుర రసము అనే అర్థాలున్నప్పటికీ ఈమె ప్రధానంగా జ్ఞానాంబ కనుక కానీ, ఓ మిత్రుని సలహా మేరకు ఇలా రాసుకున్నాను....ఇప్పుడు సుబోధకమే కదా..
నామము : ఓమ్ సురసాయై నమః ]

66. చంద్ర వదన నీవె చంద్ర సహోదరీ
పక్షమేది యైన పట్టదసలు !
మాసమంత వెలుగు మహిని పరతు వీవు
సాకుమమ్మ మమ్ము శారదాంబ... !!
[భావము : లక్ష్మితో పాటూ నీవూ అమ్మ అంశమే(ఆధారం... గతంలో పేర్కొన్నట్లు శ్రీదేవీ భాగవతమే. ఈ తల్లి నామాలలో అనేకం అమ్మవారి నామాలే కదా) కనుక చంద్రునికీ సోదరివై, చంద్రుని వంటి తెల్లని ఆహ్లాదకరమైన వదనమే కలిగి ఉన్న ఓ తల్లీ ! శుక్ల, బహుళ పక్షాలతో నిమిత్తం లేకుండా నెలంతా జగతిని వెన్నెల పరుస్తావు కదా.. ఆ ప్రకారంగానే మమ్ములనూ సాకవలసింది... (వెన్నెలను జ్ఞాన జ్యోతిగా భావించుకోవచ్చు కూడా కదా)
నామము : ఓమ్ చంద్ర వదనాయై నమః ]

67. గో యనంగ పుడమి గోవింద నామమే
విశ్వమునకు జేయు విందు నదియె!
విష్ణు నామమనుచు వేరు దలచ లేము
సాకుమమ్మ మమ్ము శారదాంబ... !!

68. వేదములకు రక్ష విహిత ధర్మమె నీది
గో పదంబులోని గూఢమదియె !
విలువ నిలుపు నీవె వింతదేమున్నదీ
సాకుమమ్మ మమ్ము శారదాంబ... !!

69. కామ ధేనువన్న గాపాడు చుందువూ
ఆవు పూజలిచ్చు నక్షరంబె
అక్షరముల కన్న నన్య గోరికలేల ?
సాకుమమ్మ మమ్ము శారదాంబ... !!
[భావము 67, 68, 69 :సంస్కృతంలో గో యను శబ్దానికే భూమి, ఆవు, వేదము, వాక్కు అని నాలుగు అర్థాలున్నాయి.
ఆ ప్రకారంగా చూస్తే...
గోవింద అనేది కేవలం విష్ణునామమే కాదనీ, భూమికి, వేదాలకూ, గోవులకూ, వాక్కుకు సైతం పాలకురాలుగా రక్షణ కల్పిస్తూ ముదము చేకూర్చే దైవము నీవేనని మాకు ఎఱుకే తల్లీ. గో పూజతోనే మాకు అక్షరము (మోక్షము) కూడా కదా అమ్మా. అట్టి విజ్ఞానం కంటే మేము కోరేది మాత్రం ఏముంటుంది గనుక?. కాబట్టి ఆ రీతిగానే మమ్ము సాకవలసింది.. ]
మరియూ...

70. భూమి పైన నుండు భూజమొక్కటి కాదు
పట్టునిచ్చు నన్ని ప్రాణులకును
తెలియ వలయు మాకు విలువ తెలియు రీతి
సాకుమమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : భూమిపైన కేవలం చెట్టూ చేమ మాత్రమే కాదు. జీవకోటి చాలా ఉంటుంది. భూమితో సహా అన్నిటి విలువా తెలిసే రీతిలో మమ్ము సాకగలవు.]

71. గో పదమ్ములోన గూర్మితో జూడగా
జంతుజాల మంత చాయవాఱు
మాన్పి పాశవికత మనసులనే దిద్ది
సాకుమమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : గో అంటే కేవలం ఆవు కాదు. సకల జంతు జాలానికీ అది ప్రతీక. మాలోని పశు ప్రవృత్తిని మాన్పి సాటి ప్రాణులన్నిటి పట్లా సవ్యంగా వ్యవహరించేలా తీర్చి దిద్దవలసింది]

74. వసు నిలయమె నీవు వాస్తవ సంపద
అక్షరమ్ము గాక యన్యమేది ?!
'వసుధ' భావ మదియె వదలక నదె యిచ్చి
సాకుమమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : సంస్కృత నిఘంటువు ప్రకారము వసు అనగా విత్తము, సంపద. మరియూ ధ యనగా నిలయము, స్థానము. కనుక అమ్మను ఇలా వేడుకున్నాను.
ఓ తల్లీ! సంపదకు నీవు నిలయమే అనగా అది అక్షర జ్ఞానమే కదా, అదే మాకూ అందించి సాక వలసినది..
నామము : ఓమ్ వసుధాయై నమః ]
మరియూ...

75. విష్ణు బాళి నంది విశ్వము భరియించ
వసుధ వైతి వీవె వరము గోరి
భువిని బెట్టరాదు పుస్తకాదుల నంచు
సాకుమమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : వసుధ యనగా మనకు తెలిసిన యర్థమే. భూమి. అమ్మ భూమిగా మారడానికి ముందు విష్ణుమూర్తిని ఓ కోరిక కోరింది. తాను దేనినైనా భరించగలను గాని 21 వస్తు పదార్థాలను మాత్రం భరించలేననీ వాటికి తనను దూరము చేయాలన్నదే ఆ విన్నపము. ఆ వస్తు పదార్థాలే...
1. పుస్తకము, 2. పుష్పము, 3.పుష్పమాల, 4. ఆల్చిప్ప, 5. కర్పూరము, 6. తులసీ దళము, 7. గోరోచనము (కస్తూరి), 8. చందనము, 9. జపమాల, 10. దీపము, 11. బంగారము, 12. మాణిక్యము, 13. ముత్యము, 14. యంత్రము, 15. యజ్ఞోపవీతము, 16. రత్నము, 17. లింగము, 18. శంఖము, 19. శివమూర్తి, 20. సాలగ్రామము, 21. హరి పూజా ద్రవ్యములు .... కనుకే వీటిని నేరుగా నేలపై పెట్టరాదనీ ఏదేని పళ్లెరమో, పత్రమో లేదా కనీసము కాగితమైనా వేసి ఉంచాలని పెద్దలు చెప్తుంటారు కదా
నామము : ఓమ్ వసుధాయై నమః ]

76. రూపు పెద్దదైన రూపసివే నీవు
భారి కాయమైన భయమదేల ?
హాయి గొల్పుదువు మహాకారమైననూ
సాకుమమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : ఇక్కడ మహా ఆకారము అనుకోవడం జరిగింది. ఆ ప్రకారముగా భావము సుబోధకమే..కదా.]
కాగా, విడదీసి చదువుకున్నచో మహా కారాయై అనుకోవలసి యుంటుంది. కార అనగా మంచుకొండ (అమ్మవారు హైమవతి కూడా), అలాగే కార లేదా కారా యన్ననూ బంధన గృహము అనే యర్థాలూ ఉన్నాయి కదా. ఆ ప్రకారముగా...

77. సాధువులకు నీవె చల్లని తల్లివి
కర్కశత్వమునకు కారవమ్మ!
దుర్గుణములనట్లు తొలగ జేయుచు నీవె
సాకుమమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : సాధు, సజ్జనులకు నీవు చల్లని తల్లివి, దుర్గుణాలకైతే కారాగారానివే. అనగా వాటిని నీలోనే హరింపజేసుకుని మాలో మంచి తనమునే పాదుకొల్పగలవు. కదా. అట్టి శారదాంబా నీవే మమ్ము సాకవలసింది.
నామము : ఓమ్ మహాకారాయై నమః ]

78. బుద్ధి బలమునకును భుజ బలమ్మును జేర
చేయవచ్చు నన్ని చేవ యున్న !
నీదు నామ మందు నిజమదె యర్థమూ
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : కేవలం బుద్ధి బలం ఒక్కటే కాదు, దానికి కొంతైనా భుజ బలమూ ఉండాలి. అప్పుడే మనకు అసాధ్యం అనేది ఉండదు. నీ నామములోని బావమూ అదే కదా తల్లీ.. కనుక ఆ ప్రకారంగానూ మమ్ము సాకవలసినదిగా కోరుతున్నాను.
నామము : ఓమ్ మహాబలాయై నమః]

79. వందనములు నీకు వారాహివే నీవు
తత్త్వ మరయ జూడ దైత్యునొకని
సంహరించినట్టి శౌరికి బత్నివే
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : నాడు హిరణ్యాక్షుని సంహరించిన శ్రీహరి పత్నివే కదా తల్లీ. ఆ మేరకే కదా వారాహివైతివి. ఆ ప్రకారంగానూ మాలోని దుర్గుణాలను పెకలిస్తూ సాకవలసినదిగా కోరుతున్నాను.
నామము : ఓమ్ వారాహియై నమః]
(వివరణ : ఆది వరాహానికి స్త్రీ రూపమే వారాహి అంటున్నారు. ఆ మేరకు ఒరిస్సాలోనూ, వారణాసిలోనూ ఆలయాలు సైతం ఉన్నాయని తెలుస్తున్నది.)

80. వేదములకు నీవు వెలుగు నిత్తువు గాదె
వింతదేమి లేదు వేదములును
ఇమిడి యుండు జూడ నెపుడు నీలోననే
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : వేదాలకు నీవే వెలుగు నిస్తావంటారు. అయితే వాస్తవానికి అవీ నీలోనే నిబిడీకృతమై యుంటాయికదా తల్లీ. కావుననే ఆ సారం మాకు అవగతం కాకపోయినప్పటికీ ఆదరించ వలసిందిగా గోరుతున్నాను.
నామము : ఓమ్ త్రయీ మూర్తియై నమః
త్రయీ అనగా వేదములే కదా. కనుక అమ్మ వేదములు మూర్తీభవించిన దేవియే...]

81. పద్మ నయన నీవు పద్మ సంభవు సతీ
పంక్తి నెపుడు జూచు పదిలముగను !
నీదు వీక్షతోనె నిజమైన పులకింత
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : పద్మాల వంటి నయనాలు కలిగిన, పద్మ సంభవుని దేవేరియైన ఓ తల్లీ.. విశ్వముమునంతటినీ జాగ్రత్తగా చూసుకోవలసినది. నీ చూపులతోనే కదా మాకు నిజమైన పులకింత. అట్టి ఆనందమే మాకు సదా లభించునట్లు సాక వలసిందిగా గోరుతున్నాను.
నామము : ఓమ్ పద్మలోచనాయై నమః]

82. సాధు పట్ల నీది సత్త్వ గుణమె గాని
రాచబాట తప్ప రాజసంబె
నీతి తప్పినపుడు నీకు తామసముగా
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : సాధు జనుల పట్ల సాత్త్విక గుణము చూపుతావు. దారి తప్పితే రాజసమే. అనగా పాలకురాలిగా దండిస్తావు. ఇక నీతి తప్పినవారిపై తమో గుణ ప్రధానమైన కోపమే ప్రదర్శిస్తావు కదా. అట్ట మూడు గుణాలూ కలిగియున్న తల్లీ మమ్ము దారి తప్పకుండా సాకవలసిందిగా కోరుతున్నాను.
నామము : ఓమ్ త్రిగుణాయై నమః]

83. పథము తప్పినపుడు భయపెట్టుదువు నీవె
' జటిల ' నామ మదియె చాటుచుండు !
దారి చూపగలవు దండనతోనైన
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : జటిల యనగా సింహమనే అర్థము. కనుక.. భావము సుబోధకమే..కదా 
నామము : ఓమ్ జటిలాయై నమః]

84. సకల శాస్త్రములకు సాకారమై నీవు
పండితులను జేయు భక్తిపరుల
నిన్ను గొల్వ తెలియు నిజమైన శాస్త్రము
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : శాస్త్రమునకు మరో అర్థం జ్ఞానము కూడా కావచ్చు. కనుక భావము సుబోధకమే..కదా !
నామము : ఓమ్ శాస్త్ర రూపిణ్యై నమః]

85. కాచుకొనవ నిద్ర గాచుటకై మమ్ము
కాచుకొనగ మాకె కలుగు తెలివి
వలయు బోధ తోడ వదిలించి మా నిద్ర
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : మమ్ములను అనగా జగతిని కాచడం కఱకే నీవు నిద్ర కాచుకుంటావు. నిద్ర మత్తు వదిలితేనే మాకు నిజమైన తెలివి అనగా జ్ఞానం కలుగుతుంది. కనుక తగిన ప్రబోధాలతో మా మత్తువదిలిస్తూ మమ్ము సాకవలసిందిగా కోరుతున్నాను.
నామము : ఓమ్ వినిద్రాయై నమః]

86. కనగ జగతి నెపుడు కనులు విశాలము
కాశి నందు నున్న గాంచగలవు
అమ్మ పీఠమందు నందరికీ చోటు
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : జగతి యావత్తూ వీక్షించేందుకే కదా తల్లీ నీ కనులు సువిశాలమగుట. కనుకే కాశీలో విశాలాక్షిగా శక్తిపీఠంపై అధివసించినప్పటికీ నీ దృష్టిలో మా అందరికీ చోటు కల్పించగలవు కదా.
నామము : ఓమ్ విశాలాక్షియై నమః]

87. ధూమ్ర లోచనుడిని దునుమాడితివి నీవు
దుర్గుణములనట్లు ద్రుంచగలవు
దూతలైన నేమి ధూర్తుల శిక్షించి
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!

88. రక్తబీజు నడచి రక్షింప బుడమిని
నాలికంత జాచి కాళికవలె
రుధిరమంత బీల్చి రూపుమాపితివీవె
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!

89. అతివ యైన నేమి యబలనుకోరాదు
సమయమందు సమయ మీయగలదు
అసుర సోదరులనె యణచి చాటితివదే
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[ఈ మూడు పద్యాల భావాలు సుబోధకమే కదా. వివరణే ప్రదానమైనది...
అమ్మవారి నామాలలో అనేకం సరస్వతీదేవికి వర్తిస్తున్నాయనేది గమనార్హం. శ్రీదేవీ భాగవతం ప్రకారం శుంభాసురుని నిర్జించడం కోసం అమ్మవారు అతిలోక సుందరిగా అవతరించింది. అది చూసి శుంభుడు ఆమెను వశం చేసుకోవాలనుకున్నాడు. తాను తనను గెల్చినవాడినే పరిమయమాడగలనని కవ్వించడంతో ఆమెను పట్టి తీసుకురావాలంటూ ధూమ్ర లోచనుని పంపాడు. తొలుత దూతగా మాట్లాడి తదుపరి యుద్ధానికి ప్రేరేపించడంతో వాడి ప్రలాపాలకు ఆగ్రహించిన అమ్మ వాడిని సంహరించింది. సంగతి తెలిసి మండిపడుతూ రక్త బీజుని పంపగా వాడిని చంపడానికి ఆమె కాళికయై నాలుకను నేలంతా పరచి వాడి రక్తం పీల్చి చంపేసింది. చివరగా శుంభాసురునీ, వాడి సోదరుడినీ కూడా నేల గూల్చింది.
నామములు : 87. ఓమ్ ధూమ్రలోచన మర్దనాయై నమః

88. ఓమ్ రక్తబీజ నిహంత్రియై నమః

89. ఓమ్ శుమ్భాసుర ప్రమధిన్యై నమః]

90. పూరి నగరమందు పూజింతుమే నిన్ను
విష్ణు సోదరిగను వేడ్కతోడ
ఆడపడుచు విలువ నా విధమ్ముగ జూపు
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
లేదా/మరియూ...

91. మాకు జ్ఞానమొసగు మంగళదాయినీ
విద్య నేర్చినపుడె వెలగ గలము
తగిన విద్య నేర్పితరుణము జూపుచూ
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావములు తెలిపే ముందు నామము చూద్దాం. 
ఓమ్ సుభద్రాయై నమః
ఈ నామానికి రెండు రకాల అర్థాలు గోచరిస్తున్నాయి. సుభద్ర అంటే మంగళ ప్రదమైనది, మరియూ అర్జునుని భార్య.
కనుక అందుకు తగిన విదంగా రెండు పద్యాలు. మొదటిది సుబోధకమే కదా.
రెండో దాని ప్రకారం అక్షర జ్ఞానమే మనిషికి మంగళ ప్రదము. కనుక అదే ప్రసాదించమని అమ్మను వేడుకుంటున్నాను.]

92. కళలు వేటికైన కనగ యాధారమూ
నీవె యనగ వలయు నిక్కమెపుడు
ఆధరువులె లేక ఏది రాణించదూ
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : కళలన్నిటికీ ఆధారము నీవే కదా తల్లీ. ఆధారమే లేనిదే ఏ కళా రాణించదు కదా. కనుక మేము ఏదో ఒక కళలో రాణించేవిదంగా సాగవలసిందిగా కోరుతున్నాను.
ఓమ్ కళాధారాయై నమః]

93. అరుణ వస్త్ర మనగ నంబిక రూపివే
అసుర సంహరణకు నదియె యొప్పు
రంగులేవియైన రంజిల్లు మా హృది
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : సుబోధకమే...కదా
నామము : ఓమ్ చిత్రాంబరాయై నమః]

94. నీలి భుజములన్న నిక్కమరసి జూడ
వింత లేదు గాదె వేడ్క తోడ
ఆదరింతువీవు నన్ని వర్ణంబులు
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : తల్లులు తమ పిల్లలు ఎలాంటివారైనా ఆత్మీయంగానే చేరదీస్తారు. (వర్ణాలు అనేది గుణాలకు ఆపాదించాను.)కదా. ఆ ప్రకారంగానే శారదాంబకూడా దుర్గుణులను సైతం ఆత్మీయంగా దగ్గరకు తీసుకుంటుందనీ అందుకే ఆమె భుజాలు నీలం రంగుకు తిరిగాయని ఒక ఊహ.
నామము : ఓమ్ నీల భుజాయై నమః]

95. నీలి జంఘములన నీకది సాజము
రక్కసులను ద్రొక్క రంగు మారు
వర్ణమేదియైన వదల నీ పాదము
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : ఇదీ అమ్మ నామమే. ఆమె అవయవాలన్నీ సందర్భానుసారం నీలి రంగులోకి కూడా మారుతుంటాయని భావం. దానికి నా భాష్యమే.... రక్కసులను తొక్కి చంపడం వలన జంఘాలు అలా రంగు మారాయని. ఆమె ఏ అవయవము ఏ వర్ణములో ఉన్నా మనం శరణాగతులం కాక తప్పదు ...కదా 
నామము : ఓమ్ నీల జంఘాయై నమః]

96. నీదు పరిమళంబు నిక్కమనన్యము
పుష్పములకు తోడు పూజవేళ
లేపనంబె జేర లెస్సయా గంధము
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : ఇదీ అమ్మ నామమే. అమ్మ మేను సర్వకాల సర్వవిధాలా చిత్ర విచిత్రాలై పరిమళం వెదజల్లుతూ ఉంటుందని నామార్థం. మరి తనను కొలిచే పుష్పాలూ, అద్దుకునే లేపనమూ కలగలిస్తే అంతే కదా అని నా భావం. 
 నామము : ఓమ్ చిత్రగంధాయై నమః]

97. సౌమ్య మూర్తివీవె చోద్యమేమియు లేదు
పాపములను సేయు భక్తులైన
పాదములను తాక పాపలె నీకును
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : సుబోధకమే. కదా. 
నామము : ఓమ్ సౌమ్యా యై నమః]

98. అంజనంబు గల నిరంజనవే నీవు
విద్యతోడ పంచు వెలుగు లెపుడు
నీదు వదనమందు నిందు సమానము
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : కంటి నిండా కాటుక, అవసర సందర్భాలలో నీలవర్ణి ... అయినప్పటికీ నిండు పుననమి వంటిదానవే కదా తల్లీ నీవు. కనుకే మాకు జ్ఞానముతోపాటు జ్యోతులను కూడా అందిస్తూ సాకగలవు.
అంజనము అనగా కాటుక, చీకటి మరియూ నిరంజనము అనగా పున్నమియే..
నామము : ఓమ్ నిరంజనా యై నమః]

99. అక్షరముల తోడ యానందమే నీకు
అవియె యున్న మాకు నాదరంబె
కలుగజేసి యెపుడు కారుణ్య మూర్తివై
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : సరస్వతి అంటేనే సారస్వతానికి ప్రతీక. కనుక ఆమెకు అక్షరాలంటేనే ప్రీతి. అందుకే ఆమె చేతిలో సదా ఒక పుస్తకం. మనకూ అవి ఉంటేనే అనగా జ్ఞానులమైనప్పుడే ఆదరం. కదా
కనుక మాకు జ్ఞానముతోపాటు సర్వత్రా ఆదరం కూడా కలగజేస్తూ సాకగలవు.
ధృతి యనగా సంతోషము మరియూ ధరించి యుండు.
నామము : ఓమ్ పుస్తక ధృతే నమః]

100. కోరికలను తీర్చు కొలిచిన వారికి
కోరినదియె కాదు కూర్మితోడ
వలసినదియె యిచ్చి నిలబెట్టెదవు నీవె
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : అడగనిదే అమ్మయినా ఇవ్వదు. నిజమే. అలాగని అమ్మయినా అడిగినదల్లా ఇవ్వదు. పిల్లలకు ఏమి, ఎందుకు, ఎంత వరకూ కావాలో(తానే ఇవ్వాలో) తెలుసుకుని (తనకే తెలుసు కదా) మరీ అంతవరకే ఇచ్చి వారు వారి కాళ్ళపై నిలబడేలా చేస్తుంది. కదా. మమ్ము నీవూ ఆ విదంగానే సాకగలవు. 
నామము : ఓమ్ కామప్రదాయై నమః]

101. నాల్గు వర్గములను నయముగా నందించు
తల్లి నిన్ను గొల్వ తరతరములు
పూజ సేతు నీకె పురుషార్థములకైన
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : ధర్మార్థ కామ మోక్షములనెడి నాలుగు వర్గాలకూ నీవే అధినాయకురాలివి. నిన్ను కొలిచిన వారికి వాటిని నీవే తరతరాలపాటు అందించ గలవు. పేరుకు పురుషార్థాలే అయినా వాటికీ నిన్నే కొలవాలి. కనుక ఓ మాతా వాటినే అందిస్తూ మమ్ము సాక గలవు. 
నామము : ఓమ్ చతుర్వర్గ ప్రదాయై నమః]

102. తీరమునకు చేర్చు దీటుగానే నీవు
భూజముగను నీవవ్యాజరూపి
నిన్ను కొలువ మాకు నిక్కము పుణ్యము
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : తీరానికి అనగా గమ్యానికి చేర్చ వలసినది నువ్వే. అలాగే చెట్టు రూపంలోనూ నీవుప్రేమాస్పదమే కదా. కనుకనే నిన్ను కొలిచిన వారికి కచ్చితముగా పుణ్యము లభిస్తుందనే నమ్మికతో మమ్ము సాక వలసిందిగా కోరుతున్నాను.
తీవ్ర యనగా సంస్కృతాంధ్ర నిఘంటు ప్రమాణం... తులసి, నదీ విశేషం కూడా.
నామము : ఓమ్ తీవ్రా యై నమః]

103. చండికనగ నేమి, చంద్రిక యన నేమి
తల్లి నీవె గాన తప్పు లేదు !
నామమేది యైన నా భక్తినే జూసి
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : చండిక అన్నా, చంద్రిక అన్నా నీవే కదా తల్లీ. అందుకే ఎలా పిలిచినా తప్పులేదనుకుంటూ నా భక్తినే పరిగణనలోకి తీసుకుంటూ మమ్ము సాకవలసింది...
నామములు : 1. ఓమ్ చండికా యై నమః
2. ఓమ్ చంద్రికాయైనమః]

104. ఆత్మలేవియైన నన్నియు నీవెగా
'అమ్మ' సృజనె యదియు నాకు తెలుసు
అంశ యొకటి గాన నందరిలో నీవె
సాకు మమ్మ మమ్ము శారదాంబ !!
[భావము : ఆత్మా పరమాత్మా ఒక్కటే కదా. ఆ ప్రకారంగా ఎవరు ఏ పేరుతో కొలిచినా నీకే కదా చెందేదీ. అన్నిటా ఉన్నదీ ఆ అమ్మవారే కదా. కనుకా అమ్మ అంశ యైన నీవే మమ్ము సాకవలసింది...
నామములు : ఓమ్ సర్వాత్మికా యైనమః]
==============================
ధన్యవాద సమర్పణ....
----------------------------------------------
తే.గి. శతక మొక్కటి యల్లితి సాహసించి
తప్పులున్నను మనమున దలపబోకు
బిడ్డ చేష్టలు తల్లికే ప్రియము గాన
సాకు మమ్ముల సర్వదా శారదాంబ ..!!

-----------------------------------



ఓం శ్రీ రామ్  ఓం శ్రీ రామ్      ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - "రాం " తాత కధలు 

సర్వేజనా సుఖినోభవంతు 

శ్రీకాళహస్తీశ్వర మహత్యం,ధూర్జటి,పరమశివుడు! 


శ్రీకాళహస్తీశ్వర శతకమును మహాకవి ధూర్జటి రచించినారు. 

ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. ఇతనిని పెద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు. 

ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించిఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి పొత్తపి సీమ లోని, ప్రస్తుతం చిత్తూరు జిల్లా లో ఉన్న శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు. 
ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం మరియు శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్ర దేశములో ప్రచారములో ఉన్నవి. 
ప్రాంజలి ప్రభ .com 




విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధా 

రా వేగంబున మన్మనొబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్ 

దేవా! నీ కరుణా శరత్సమయ మింతేచాలు; చిద్భావనా 

సేవన్ దామర తంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా! 
తా|| సంపదలనెడి మెరుపుతీగెలతో గూడిన సంసారమనెడి మేఘముల నుండి కురిసిన పాపములనెడి నీటిధారాచేత నామన: పద్మము కాంతిలేక చిన్నబోయినది. నీ దయయను శరత్కాలము వచ్చినది. చాలు 
. ఇంక నా మన: పద్మము వికసించుటే కాదు సర్వసమృద్ధులు గలవాడనై 
నీ చిన్మూర్తిని ధ్యానించుచు బ్రతికెదను. 
(పద్మములు వానదెబ్బకు వాడిపోవును. 
శరత్కాలములో వికసించికాతిమంతము లగును).







ప్రాంజలి ప్రభ ను ఆదరిస్తున్న ప్రతిఒక్కరికి, గూగుల్ యాజమాన్యం వారికి ఉగాది శుభాకాంక్షలు ముందుగా తెలియపరుస్తున్నాను. నేను ఉగాదినున్ది పేస్ బుక్ , గోల్ + రోజూ రాం తాత కధలు (ఆద్యాత్మికమైనవి వివిధ పత్రికలద్వారా, అంతర్జాలంద్వారా,  వ్రాసినవి సేకరించి పపంచ తెలుగు ప్రజలందరికి అందచేయాలని సంకల్పంతో ప్రాంజలి ప్రభాద్వారా ) రికార్డు చేసి వినిపించ దలిచినాను .
వినండి, వినమని చెప్పండి, మనస్సు శాంత పరుచుకోండి
ప్రాంజలి ప్రభ కధలును
వినండి, వినమని చెప్పండి, మనస్సు శాంత పరుచుకోండి
సేకరణ, రచయత, వ్యాఖ్యాత, మల్లాప్రగడ రామకృష్ణ 
 విన్న వారు షేర్ చేయండి - స్నేహాన్ని పెంచుకోండి


స్త్రీ గౌరవం ప్రపంచానికే గౌరవం

ప్రాంజలి ప్రభ కధలును
వినండి, వినమని చెప్పండి, మనస్సు శాంత పరుచుకోండి
సేకరణ, రచయత, వ్యాఖ్యాత, మల్లాప్రగడ రామకృష్ణ
 నవరాత్రులు నవ రూపాలు 

 విన్న వారు షేర్ చేయండి - స్నేహాన్ని పెంచుకోండి

సాహిత్యం


ప్రాంజలి ప్రభ కధలును
వినండి, వినమని చెప్పండి, మనస్సు శాంత పరుచుకోండి
వ్యాఖ్యాత మల్లాప్రగడ రామకృష్ణ
  కాలం