Saturday, 13 September 2025

 

**అతను అతను కాడు -1*


రచన: కొమ్మూరి సాంబశివరావు


“డాక్టర్ భార్గవీ! ఏమిటి ఆలోచిస్తున్నారు?" అడిగాడు డైరెక్టర్.


శ్రీమతి భార్గవి ఉలిక్కిపడి, తేరుకొని, చిన్నగా నవ్వి “సారీ సర్! ఒక్క నిముషం ఏదో పర్సనల్ విషయంమీద మనసు పోయింది క్షమించండి. మళ్ళీ చెప్పండి!" అడిగింది.


“ఒకసారి ఉపయోగించిన యురేనియంని శుద్ధి చేసి మళ్ళీ ఉపయోగించే సాంకేతిక విజ్ఞానం మనకి లేదని అనుకొనేవాళ్ళు ఉన్నారు... ఉన్నారని భయపడే వాళ్ళు ఉన్నారు."


శ్రీమతి భార్గవి తలవూపింది. “వచ్చే సోమవారం- అంటే ఇంకా ఆరు రోజులు వ్యవధి వుంది. ఈలోగా మీరు వివరాలన్నీ తయారుచేయాలి. ప్రప్రథమంగా ఇక్కడ- మనం ఒకసారి ఉపయోగించబడిన యురేనియాన్ని శుద్ధి చేసి మళ్ళీ ఉపయోగానికి సిద్ధం చెయ్యాలి. మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఈ విషయం చాలా రహస్యంగా వుంచాలి” అన్నాడు కల్పాకం అణుశక్తి కేంద్రం డైరెక్టర్.


“యస్ సర్” అన్నది శ్రీమతి భార్గవి.


"మీకు సెక్యూరిటీ కావలిస్తే... సి.బి.ఐ. వారికి చెప్తాను. ఇంతవరకూ రహస్యంగా వుంది. మీకూ నాకూ తప్ప అసలు విషయం ఎవరికీ తెలియదు కనుక భయం ఏమీలేదు. అయినా...”


"అవసరం లేదు సర్!” అన్నది శ్రీమతి భార్గవి.


“అయితే మీ పని మీరు కానివ్వండి” అనగానే భార్గవి కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయింది.


శ్రీమతి భార్గవి తన గదిలోకి వెళ్ళి తలుపు మూసేసి తన కుర్చీలో కూర్చున్నది. బల్ల మీద ఎదురుగా ఫైల్సు వున్నాయి. పక్కన షెల్ఫులు, వాటిలో, పుస్తకాలు, బల్లమీద రెండు టెలిఫోన్స్... ఒకటి ఇంటర్నల్ ఎక్స్ఛేంజ్ రెండవది డైరెక్ట్ కనెక్షన్. అంటే ఆపరేటర్ సహాయం లేకుండా ఫోన్ చెయ్యవచ్చు. అయిదు నిముషాలపాటు ఆలోచిస్తూ కూర్చున్నది. చటుక్కున ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల విదిలించి, డైరెక్టరీ తీసి ఒక నెంబర్ చూసి తిప్పింది.


"హల్లో!" అవతలనించి,


"హల్లో! డిటెక్టివ్ యుగంధర్ వున్నారా?”


"స్పీకింగ్!"


"నా పేరు భార్గవి, డాక్టర్ భార్గవి. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ని కాను. మీ సహాయం కావాలి” భార్గవి చేతిలోని టెలిఫోన్ వొణుకుతోంది.


"యస్... ఎప్పుడు రాగలరో చెప్పండి... కన్సల్టింగ్ రూంలో ఉంటాను" అని అవతలనించి డిటెక్టివ్ యుగంధర్.


"క్షమించాలి. నేను రాలేను. నేను మిమ్మల్ని కలుసుకోవడం చాలా రహస్యంగా సాగాలి. ఎవరికీ తెలియకూడదు. ఆఖరికి మా ఆఫీసులో కూడా.”


"అలాగా, ఏదయినా పథకం ఆలోచించారా?” అడిగాడు యుగంధర్.


"లేదు. మీరే చెప్పాలి.”


"మీరు ఆఫీసునించి ఇంటికి ఎన్ని గంటలకి బయలుదేరుతారు?”


"సాయంకాలం అయిదు గంటలకి కారులో. నెంబర్ TMX 443565. ఆకుపచ్చ అంబాసిడర్.”


"మీ ఇల్లు ఎక్కడ?"


"త్యాగరాయనగర్."


"మీరు ఎక్కణ్నించి ఫోన్ చేస్తున్నారు?"


"కల్పాకం ఆటమిక్ రిసెర్చ్ స్టేషన్నించి, డెప్యూటీ డైరెక్టర్ ని ” అన్నదామె. 


"ఆపీసునించి చాలా దూరంలో ఉంటున్నా రన్న మాట. వేషం మార్చుకుని మీ ఇంటికి రానా?"


“వద్దు.. ప్లీజ్”


"అయితే ఎలా కలుసుకోవడం... మీరే చెప్పండి."


“ఒక్క క్షణం... ఆలోచించనివ్వండి! ఆ! ఒక ఆలోచన. మా ఆఫీసు దాటిన తర్వాత రెండు మైళ్ళు వెళ్ళిన తర్వాత, ఒక ఇల్లు కానీ, చెట్టుకానీ, లేకుండా రోడ్డు నిర్జనంగా వుంటుంది. దయచేసి మోటార్ మెకానిక్ వేషంలో మీరు సైకిల్ మీద రండి. నేను కారు ఆపుతాను, చెడిపోయినట్లు. మీరు సహాయానికి రండి. నా కారు రిపేరు చేస్తున్నట్టు... కాస్త చెడగొట్టి, మళ్ళీ రిపేరు చెయ్యండి. రిపేరు చేస్తుండగా మీ పక్కన నిలబడి అసలు విషయం చెబుతాను." 


"వెరీగుడ్... ఏదయినా పొరపాటువల్లో... పథకం తారుమారు అయ్యో మీరు వేరే కారులో వెళ్ళితే మిమ్మల్ని నేను తేలికగా గురుపట్టేందుకు... కాస్త మీ రూపాన్ని...”

అడిగాడు యుగంధర్.


శ్రీమతి భార్గవి నవ్వింది. "నన్ను నేనే వర్ణించుకోవాలా? కష్టం. చామనఛాయ, సాఫీజుట్టు, జడ వేసుకుంటాను. అనాకారిని కాను. ఈ రోజు గులాబీరంగు వాయిల్ చీర కట్టుకొన్నాను.”


"చాలు. సాయంకాలం కలుసుకుందాం.”


"థాంక్స్!” అని శ్రీమతి భార్గవి రిసీవర్ పెట్టేసింది. బల్ల సొరుగు తాళం వేసి, గది బయటికి వచ్చి తలుపు తాళం వేసుకొని, భార్గవి వసారాలోకి వచ్చి నిలబడింది. ఒక పక్క భయం, ఇంకోవైపు ఆశ. తనని కష్టాలనించి ఆ డిటెక్టివ్ యుగంధర్ రక్షించగలడా? ఏమో! చాలా గొప్ప పేరున్నది యుగంధర్ కి. ఇంతకన్న తనేం చెయ్యలేదు. తర్వాత ఏంచెయ్యాలో యుగంధర్ వివేకానికే వదిలిపెడితే సరి. తాళంచెవుల గుత్తి హ్యాండ్ బ్యాగ్ లో వేసుకొని, కారు తాళంచెవి తీసుకుని, బయటికి వచ్చి కారు ఎక్కింది. కారు తలుపు మూసుకున్నది. భార్గవి కారుని చూసి ఆమెని గుర్తుపట్టిన తర్వాత జవాను గేటు తెరిచాడు. భార్గవి కారు ముందుకు పోనిచ్చింది. గేటు దాటిందో లేదో... కారుకి అడ్డంగా వచ్చి ఆపమని సంజ్ఞ చేశాడు.


“ఏమిటి మోహన్ ఇక్కడికి వచ్చావు?" అడిగింది భార్గవి. అతను కారు తలుపు తెరిచి, ఆమె పక్కన కూర్చున్నాడు.


"ఊ పోనియ్యి చెపుతాను. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు!" అన్నాడు.


"ఏమని?” అడిగింది భార్గవి.


“శుద్ధి చేసేందుకు యురేనియమ్... ఎప్పుడు ఇక్కడికి వస్తుందో... ఆ రోజు చెప్పాలిట. చెప్పకపోతే...”


"ఆరోజు నాకే తెలియదు. ఎలా చెప్పడం?" అన్నది భార్గవి.


"వాళ్ళు రాత్రి తొమ్మిది గంటలకి ఫోన్ చేస్తామన్నారు. నువ్వే చెప్పు! ఎలాగో వాళ్ళని ఒప్పించు. రవి ప్రాణాన్ని బలి ఇవ్వలేము. తలుచుకుంటేనే నా గుండె ఆగిపోతోంది” అన్నాడు మోహన్... ఆమె భర్త. భార్గవి కళ్ళల్లో నీళ్లు నిండాయి. మౌనంగా వుండిపోయింది.

📖


డిటెక్టివ్ యుగంధర్ కాకీ పాంటు, కాకీ షర్టు వేసుకుని సైకిల్ మీద వెళుతున్నాడు. దూరాన్నించి చూశాడు ఆకుపచ్చని అంబాసిడర్ కారు రావడం. తనేదో పని మీద వెళుతున్నట్లు, ఈల వేసుకుంటూ సైకిల్ తొక్కుతున్నాడు. ఆ కారు తనకి దగ్గిరవుతోంది. తనకి కాస్త దూరంగా వెళ్ళి ఆగుతుంది. అప్పుడు తను... ఆలోచిస్తున్నాడు. 


యుగంధర్ ఆలోచన పూర్తికాకముందే ఆ కారు చాలా స్పీడుగా తన పక్కనించి వెళ్లిపోతోంది. కారు డ్రైవ్ చేస్తున్న భార్గవి నీ, ఆమె పక్కన కూర్చున్న యువకుణ్నీ స్పష్టంగా చూశాడు యుగంధర్. అంతేకాదు, కారు డ్రైవ్ చేస్తున్న ఆమె చీరని బట్టి, ఆమె శ్రీమతి భార్గవియే అయ్యుండాలనీ నిశ్చయించుకొన్నాడు. కారు డ్రైవ్ చేస్తూ, చెయ్యి బయటికి పెట్టి, చేతిలోంచి ఏదో కిందకి జారవిడిచింది ఆమె. ఏమిటది? వెంటనే యుగంధర్ సైకిల్ దిగాడు. కారుని బాగా దూరం వెళ్ళనిచ్చి, రోడ్ మీద పడివున్న చేతి రుమాలుని తీసుకున్నాడు. అది చిన్న గులాబీరంగు చేతిరుమాలు. కాస్త తడిగా వుంది. అంతే... దానిమీద చాకలి గుర్తు తప్ప ఇంకేమీ లేదు. అయితే ఎందుకు భార్గవి ఈ రుమాలు రోడ్డు మీద వేసింది? అగోచరమైన సిరాతో ఏమైనా రాసిందా? చూడాలి. అనుకుంటూ యుగంధర్ మళ్ళీ సైకిల్ ఎక్కాడు.

📖


"భార్గవి... నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు ఈ మాత్ర వేసుకో. మనస్సు కాస్త నెమ్మదిస్తుంది."


"ఏం మాత్ర?" అడిగింది భార్గవి.


"విషం కాదు... కాంపోజ్!” నవ్వుతూ మాత్ర ఆమె చేతికిచ్చి, తనే వెళ్ళి ఒక గ్లాసులో మంచినీళ్ళు తెచ్చియిచ్చాడు మోహన్.


"ఇది మింగి, కాసేపు కళ్ళు మూసుకో. ఇంకా ఏడున్నరన్నా కాలేదు. తొమ్మిది గంటలకి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఈలోగా వంట నేను చేస్తాను" అన్నాడు అతను.


"వంటా... నాకేం తినాలని లేదు.”


"నాకూ లేదు. కాని తప్పదు. రవిని ఆపద లోంచి తప్పించాలంటే, మనం ఇద్దరం ముందు మన ఆరోగ్యం కాపాడుకోవాలి. తప్పదు... తినడం ఇష్టం లేకపోయినా మందులా నాలుగు ముద్దలు మింగాలి” అన్నాడు మోహన్.


భార్గవి మాత్ర వేసుకుని, సోఫాలో వెనక్కి జారగిలబడి, కళ్ళు మూసుకున్నది.

📖


యుగంధర్ తన కన్సల్టింగ్ రూంలోకి రాగానే “ఏమైంది ఇంత త్వరగా వచ్చేశారు?" అడిగాడు రాజు. జరిగింది చెప్పి, “ఈ జేబురుమాల్ ని లాబ్ లోకి తీసికెళ్ళి పరీక్ష చెయ్యి ముందు" అన్నాడు యుగంధర్. రాజు లాబ్ లోకి వెళ్ళాడు. పదిహేను నిముషాల తర్వాత వచ్చి “ఏమీలేదు...” అన్నాడు. యుగంధర్ ఆలోచిస్తున్నాడు.


"మీతో చెప్పినట్టుగా కారు ఆపకుండా ఎందుకు వెళ్ళిపోయింది! జేబు రుమాల్ ఎందుకు పడేసింది?" అడిగాడు రాజు.


"అదే నేనూ ఆలోచిస్తున్నాను. ఆమె పక్కన ఎవరో కూర్చునున్నారు. బహుశా ఆమె అందువల్ల కారు ఆపలేదు అనుకుంటాను. తను నన్ను గుర్తుపట్టాననీ, కారు ఆపలేక పోతున్నాననీ నాకు తెలియజేసేందుకు ఈ జేబురుమాల్ ని ఇలా కింద పడేసిందని అనుకుంటున్నాను.”


"ఇంట్లో ఫోన్ వుండి వుంటుంది... మనం ఫోన్ చేస్తే?” అడిగాడు రాజు.


"ఆలోచించాలి. అది వివేకమైన పనా కాదా అని” అంటూండగా టెలిఫోన్ గణగణ మోగింది.


"బహుశా శ్రీమతి భార్గవే అయ్యుంటుంది" అన్నాడు రాజు రిసీవర్ తీస్తూ.. 

"యస్... ఉన్నారు చెప్పండి. నేను ఆయన అసిస్టెంటు రాజుని. అలాగా క్షణం ఉండండి చూస్తాను" అని రిసీవర్ మౌత్ 

పీస్ మీద అరచేయి అడ్డంపెట్టి 

"ఎవరో... స్త్రీ కాదు... మొగాడు... మీతోనే మాట్లాడాలిట. అత్యవసరం అని అంటున్నాడు" అన్నాడు రాజు.


"హల్లో! యుగంధర్ స్పీకింగ్.”


"హల్లో! శ్రీమతి భార్గవిని కలుసుకోవడానికి మీరు ఎటువంటి ప్రయత్నమూ చెయ్యవద్దు.”


"చేస్తే?” అడిగాడు యుగంధర్.


"ఆమెకీ... మీకూ ప్రాణాపాయం.”


"బెదిరింపులకి లొంగేవాణ్ని కాను” అన్నాడు యుగంధర్.


"ఇది ఉత్త బెదిరింపు కాదు. బి వేర్" క్లిక్ మన్నది.


రిసీవర్ హుక్ మీద పెట్టేసి యుగంధర్ తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. యుగంధర్ ఆలోచనలు చెడగొట్టడం ఇష్టంలేక మౌనంగా వుండిపోయాడు రాజు.


"రాజూ! టెలిఫోన్ డైరెక్టరీ తీసి శ్రీమతి భార్గవి పేర టెలిఫోన్ వున్నదేమో చూడు" అన్నాడు అయిదు నిముషాల తర్వాత యుగంధర్.


"కల్పకం ఆటమిక్ రీసెర్చి సెంటర్ తీసి, ఆఫీసులో ఆమె పేర్న ఫోను వున్నదేమో చూడు" మళ్ళీ చెప్పాడు యుగంధర్.


రెండు నిముషాలు పేజీలు తిప్పి, "యస్ సర్! డాక్టర్ శ్రీమతి భార్గవి.... డెప్యూటీ డైరెక్టర్ 5982891" చెప్పాడు రాజు.


"అంటే ఎక్స్ టెన్షన్ ఫోన్ కాక, ఆమెకి డైరెక్టుగా ఫోన్ వున్నది. డైరెక్టు ఫోన్ లో ఆమెతో నేను మాట్లాడిన విషయం ఎవరికో ఎలా తెలిసింది?" అన్నాడు యుగంధర్.


"ఆమె ఫోన్ చేస్తున్నప్పుడు గదిలో ఇంకెవరన్నా వున్నారేమో!"


"అంత పూల్ కాదు, చాలా రహస్యంగా... తన ఆఫీసులో కూడా ఎవరికీ తెలియ కూడదన్న మనిషి, ఎవరో గదిలో వుండగా ఫోన్ చేస్తుందా?”


“ఒకవేళ ఆమె ఎవరితోనైనా చెప్పిందేమో! మీకు ఫోన్ చెయ్యకముందే, ఎవర్నయినా సలహా అడిగితే మీ పేరు చెప్పారేమో!”


"అతి రహస్యమైన విషయం అన్నది. ఆమె అలా ఎవరితోనూ చెప్పి వుండదు."


"అయితే?” అడిగాడు రాజు.


"రాజూ! రాను రాను ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చాలా వస్తున్నాయి. ఒక చిన్న మైక్ కమ్ ట్రాన్స్మీటర్ ఆమెకి తెలియకుండా ఆమె మెళ్ళో లాకెట్కో, చేతి గడియారానికో పెట్టి వుండాలి. కనుక మనం ఆమె ఇంటికి ఫోన్ చెయ్యడం కూడా వివేకమైన పనికాదు.”


"అయితే ఆమెని కలుసుకోవడం ఎలా?” అడిగాడు రాజు.


"అదే ఆలోచించాలి. పటిష్టమైన పథకం వెయ్యాలి" అన్నాడు యుగంధర్.

👥

*సశేషం*

꧁☆•┉┅━

మాతృశ్రీ

పతి నమ్మే స్థితి పాఠమోసుఖమగు పాశమ్ము పత్ని స్థితిన్
సతి వాంఛల్ నిధి గాకుటుంబమగుటన్ సాధ్యమ్ము తోడైగతిన్
గతి నేస్తమ్మగు కామ్యతీరగుట యున్ గమ్యమ్ము సర్వమ్ముగన్
మతి మార్గమ్మగు జీవితం బ్రతుకుగన్ మానమ్ము సౌఖ్యంబుగన్

భార్య భర్తను నమ్మిన స్థితి ఒక జీవన పాఠం.ఆ నమ్మకం ఆమె బంధానికి సుఖాన్ని ప్రసాదిస్తుంది.
"పాశము" అంటే బంధం – ఇది ఇక్కడ దృఢమైన అనుబంధాన్ని, సద్భావితాన్ని సూచిస్తోంది.

పత్ని స్థితిన్ – భార్యగా ఉండే స్థితిని అత్యంత గౌరవంతో చూచారు.

సతీమణిగా (సతి) ఆమె వాంఛనీయ లక్షణాలు ఒక నిధిగా నిలుస్తాయి.

కుటుంబ జీవితం ఓ విలువైన ధ్యేయంగా మారుతుంది.

– సాధ్యం చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరూ సహకారం ఇవ్వాలి అనే భావన.

" జీవన గమ్యం తెలియాలంటే నీకు నేస్తం అవ్వాల్సింది గతి.
కామాన్ని అధిగమించడం.

ఆ స్థితిలోనే సర్వ గమ్యమూ సాధ్యమవుతుంది.
ఇక్కడ 'నేస్తం', 'కామ్యతీరం', 'సర్వగమ్యం' అనే పదబంధాల మాధుర్యం స్పష్టంగా కనిపిస్తోంది.

మంచి మతిమార్గమే జీవితం బ్రతుకుకు దిక్సూచి.
అది మానవత్వంకి ఆధారంగా మారుతుంది.
చివరగా సౌఖ్యం అనే ఫలితాన్ని ప్రసాదిస్తుంది.
ఈ చరణం పూర్తిగా తాత్విక జీవనబోధను ఇస్తోంది.
******
అతను అతను కాడు - 2*
👥

రచన: కొమ్మూరి సాంబశివరావు

ఆ నిశ్శబ్దం లోంచి చెవులు చిల్లులు పడేటట్టు వినిపించింది టెలిఫోన్ గణగణ. మోహనరావు వెళ్ళి రిసీవర్ తీసుకొన్నాడు. “ఆ! వున్నది. పిలుస్తాను...క్షణం..."

“భార్గవిగారు!”

"ఆ!"

"శుద్ధి చెయ్యడానికి యురేనియం తారాపూర్ నుండి ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా వస్తున్నదో చెపుతారా? చెపితే మీ అబ్బాయి రవిని సురక్షితంగా మీకు అప్పచెపుతాము. చెప్పకపోతే...”

"హల్లో! ప్లీజ్, నాకు తెలియదు. చాలా రహస్యంగా దాచారు. నిజం. రవిని ఏం చెయ్యకండి. తెలిస్తే తప్పకుండా చెపుతాను" అన్నది దీనంగా భార్గవి.

“ఇప్పటికింకా మీకు తెలియదంటే నమ్ముతాము. కాని మీకు కూడా తెలియ కుండా తారాపూర్ నించి యురేనియం వచ్చి, దాన్ని శుద్ధి చేస్తారంటే నమ్మము."

"నిజం చెపుతున్నాను. ఇంతవరకూ ఆ విషయం నాకు తెలియదు.

"అది నిజమే అయ్యుండవచ్చు ఇంత వరకూ తెలియకపోవడం, శ్రీమతి భార్గవీ! మీకు ఇరవై నాలుగు గంటల వ్యవధి ఇస్తున్నాము. రేపు రాత్రి ఇదే సమయానికి ఫోన్ చేస్తాము. అప్పటికి మీరు ఎలా తెలుసుకుంటారో... అది మీ వంతు. మాకు ప్రమేయం లేదు... మేము కోరిన విషయాలు తెలుసుకొని చెప్పకపోతే, రేపు రాత్రి పన్నెండు గంటల లోపున మీ అబ్బాయి రవి శవాన్ని మీకు పంపుతాము. సరదాకి కాదు. సీరియస్ గా చెపుతున్నాము”

అవతల మనిషి రిసీవర్ పెట్టేశాడు. భార్గవి గజగజ వొణుకుతోంది. నుదుటిమీద నించి చెమట ధారలుగా కారుతోంది.

"ఏమిటి భార్గ... ఏమిటి? ఎందుకు అలా అయిపోయావు?” అడిగాడు మోహన్. భార్గవి చెప్పింది.

భార్గవి కళ్ళప్పగించి అతన్నే చూస్తోంది.

"నువ్వు డెప్యూటీ డైరెక్టర్ వి. ఇప్పటి వరకూ, ఆ యురేనియమ్ ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా, డైరెక్టర్ దాచి వుంచాడనుకోను. వెంటనే చెప్పడం అవసరంలేదని చెప్పలేదేమో! నువ్వు ప్రయత్నిస్తే ఆ యురేనియమ్ ఎప్పుడు, ఎలా వస్తుందో... ఎవరు తెస్తారో సులభంగా తెలుసుకోగలవు. మన రవి ప్రాణం కన్నా, ఆ యురేనియమ్ మనకి ముఖ్యం కాదు. మనకి వున్నవాడు... ఒక్కడే ఒక్కడు. ప్లీజ్ భార్గవీ! వివరాలు సేకరించు. రేపటికి వాళ్లకి చెప్పెయ్యి. రవిని రక్షించుకో” అన్నాడు మోహన్.

భార్గవి తల వూపింది.

"అదుర్దాతో నువ్వు నెర్వస్ రెక్ వి అయ్యావు. ఇంకో కాంపోజ్ వేసుకొని నిద్రపో" అంటూ భార్గవిని చెయ్యిపట్టుకొని నడిపించుకొని, పడకగదిలోకి తీసుకుని వెళ్ళి "క్షణం ఆగు. బ్రెడ్, పాలు తెచ్చి ఇస్తాను. తర్వాత మాత్ర వేసుకోవచ్చు" అన్నాడు ఆమె భర్త మోహన్.

భార్గవి మనస్సులో ఆలోచనలు లేవు, భయం తప్ప, విపరీతమైన భయంతో ఒకరకమైన మత్తు అలుముకున్నది నిద్ర మాత్ర వేసుకున్నట్లు.
📖

సిగిరెట్ ఆష్ ట్రేలో పడేసి, యుగంధర్ లేచి నిలుచున్నాడు.

"ఏమిటి పథకం?" అడిగాడు రాజు.

"చాలా సింపుల్... కాని డేంజరస్" అన్నాడు యుగంధర్.

"చెప్పండి?”

"నువ్వూ... నేనూ ఈ రాత్రికి డిటెక్టివ్ లము కాము. దొంగలము. ముందు ఒకసారి వెళ్ళి శ్రీమతి భార్గవి ఇల్లు, ఆ పరిసరాలూ పరీక్షించి వద్దాము. తర్వాత రాత్రి అర్థరాత్రి ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాలి. శ్రీమతి భార్గవి మనల్ని చూడలేదు. మనం మారు వేషాలలో వుంటాము. మనల్ని ఆవిడ గుర్తుపట్టలేదు. ఎలాగయినా శ్రీమతి భార్గవిని ఎత్తుకొని వచ్చేద్దాము” అన్నాడు యుగంధర్.

"గుడ్ గాడ్. అంత సులభంగా అయ్యే పనేనా? శ్రీమతి భార్గవి డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆటమిక్ రీసెర్చి సెంటర్. ఇటు రాష్ట్ర ప్రభుత్వమూ, అటు కేంద్ర ప్రభుత్వమూ ఆమెకీ, ఆమె ఇంటికీ రక్షణ ఏర్పాటుచేసి వుంటారు. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు. అంతేకాదు... అసలు కష్టం... భార్గవిని కలుసుకోవద్దని మనల్ని హెచ్చరించిన ఆ అజ్ఞాత శత్రువుల విషయం మర్చిపోతున్నారు. మనం ఇక్కణ్నించి బయటికి వెళ్ళిన మరుక్షణం  మనకి తెలియకుండా వాళ్ళు మనల్ని కనిపెడుతూనే వుంటారు" అన్నాడు రాజు.

"థాంక్స్ రాజూ! చాలా తార్కికంగా మాట్లాడావు. ముందు మనం శ్రీమతి భార్గవి ఇంటి ప్రాంతాలకి వెళ్ళినపుడు, ఆమె ఇంటికి ఎవరు కాపలా వున్నదీ తెలిసిపోతుంది. ఆ ఇంట్లో ఎంతమంది వున్నదీ తెలుసుకోవడం కష్టం కాదను కుంటాను పక్కన కొట్లల్లోనో ఎక్కడో విచారిస్తే. ఇక మూడో సమస్య. శత్రువుల కంటపడకుండా మనం ఇక్కణ్ణించి వెళ్ళడం! అది సులభం కాదు. కాని ఇక్కణ్నించి వెళ్ళిన తర్వాత... వాళ్ళనించి తప్పించుకోవచ్చు. దానికి మార్గం లేకపో లేదు. ఎటొచ్చీ పెద్ద సమస్య శత్రువులు భార్గవి ఇంటి వద్ద కాపలా వుంటారా! చూద్దాం" అన్నాడు యుగంధర్.

డిటెక్టివ్ యుగంధర్ తన క్రిజ్లర్ కారు హోటల్ రాజ్ పార్కింగ్ స్పేస్ లో ఆపాడు. కారు తలుపుల అద్దాలు ఎత్తేసి తలుపులు తాళంవేసి, ఒక బ్రీఫ్ కేస్ తీసుకుని తిన్నగా రిసెప్షన్ కౌంటర్ దగ్గిరికి వెళ్ళాడు. రిసెప్షన్ కౌంటర్ లో మేనేజర్ వున్నాడు. తను వస్తున్నాననీ మేనేజర్ ని కౌంటర్ లో వుండమనీ ఫోన్ చేసి చెప్పాడు ముందే.

"వెల్కమ్ సర్" అన్నాడు మేనేజర్.

"నాకు గది కావాలి. ఒక క్లయింట్ తో మాట్లాడేందుకు.”

"విత్ ప్లెజర్" అంటూ ఒక గది తాళం చెవులు తీసి, యుగంధర్ కి ఇచ్చాడు మేనేజర్.

"రిజిష్టర్!" అడిగాడు యుగంధర్.

మేనేజర్ రిజిష్టర్ ని యుగంధర్ ముందుకి తోశాడు. రిజిష్టరులో తన పేరు చిరునామా రాస్తూ, పక్కన వేరే ఒక కాగితంమీద, "మీరు నాకు ఇచ్చిన గది మూడో అంతస్తులో ఉంది. రూం నెంబర్ 102. దయచేసి రహస్యంగా ఎవరికీ తెలియకుండా, అయిదవ అంతస్తులో ఇంకో గది నాకు ఇవ్వండి. ఆ గదిలోకి మీరే స్వయంగా ఎవరూ చూడకుండా, ఈ బ్రీఫ్ కేస్ తీసుకువెళ్ళి పెట్టాలి. తర్వాత ఆ గది తాళం చెవులు ఎవరికీ తెలియకుండా మీరే నాకు తెచ్చి ఇవ్వండి. నేను రెస్టారెంటులో వుంటాను" అని రాశాడు యుగంధర్.
రిజిష్టర్ తో పాటు ఆ చీటీ మేనేజర్ కి అందజేసి, తను తెచ్చిన బ్రీఫ్ కేస్, మేనేజర్ కి ఇచ్చాడు యుగంధర్. తర్వాత ఏ చీకూచింతా లేనట్టు తాపీగా లోపల రెస్టారెంటులోకి వెళ్ళాడు. వెయిటర్ మెనుకార్డు తెచ్చిఇస్తే "కాఫీ ప్లీజ్" అన్నాడు. తనని ఎవరన్నా కనిపెడుతున్నారా! ఎక్కణ్నించి... ఎక్కడ కూర్చున్నారు! ఇలాంటి ప్రశ్నలు ఎన్ని మనస్సులోకి వస్తున్నా, పక్కలకి కానీ, వెనక్కి కానీ చూడకుండా యుగంధర్ తాపీగా కాఫీ తాగుతున్నాడు. పదినిముషాలు తర్వాత మేనేజర్ యుగంధర్ కూర్చున్న కుర్చీ దగ్గరికి వచ్చి, పక్కన నిలబడి, "కాఫీ మాత్రం తాగుతున్నారేం... ఈ రాత్రి స్పెషల్ డిన్నర్, ఆర్డర్ ఇవ్వలేదా!" అని బిగ్గరగా అంటూ, యుగంధర్ కోటుజేబులోకి ఒక తాళంచెవిని జారవిడిచాడు... ఎవరికీ కనిపించకుండా.

"అయిదో అంతస్తులో లిఫ్టుకి ఎడంవైపున, మొదటి గది రూం నెం. 244" అన్నాడు రహస్యంగా.

"నో! నో! డిన్నర్ కి రాలేదు. పనుండి వచ్చాను" అని యుగంధర్ బిల్లు చెల్లించి లేచాడు.

“మీ పని త్వరగా పూర్తయితే డిన్నర్..." అంటున్నాడు మేనేజర్.

“తప్పకుండా వస్తాను” అని యుగంధర్ లిఫ్ట్ వైపు వెళ్ళాడు. అది ఫైవ్ స్టార్ హోటల్. వరసగా నాలుగు లిఫ్ట్ లు ఉన్నాయి. ఒక లిఫ్ట్ లో మాత్రం లిఫ్ట్ బాయ్ ఉన్నాడు. మిగతావి ఎవరికి వారు మీట నొక్కి నడుపుకునేవే. ఒక లిఫ్ట్ దిగివచ్చి ఆగింది. తన పక్కనున్నవారు గబగబా ఆ లిఫ్ట్ వైపు వెళ్ళారు. యుగంధర్ కాచుకున్నాడు. ఇంకో లిఫ్ట్ వచ్చింది. అందులోంచి ఎవరో ముగ్గురు బయటికి వచ్చారు. చటుక్కున యుగంధర్ ఆ లిఫ్ట్ లోకి వెళ్ళి తలుపు మూసేసుకోగానే, నాలుగో అంతస్థు మీట నొక్కాడు. నాలుగో అంతస్థులో లిఫ్ట్ ఆగగానే, యుగంధర్ బయటికి వచ్చి క్షణం ఆలస్యం చెయ్యకుండా గబగబా మెట్లు ఎక్కి అయిదవ అంతస్థులోకి వెళ్ళాడు.

లిఫ్ట్ పక్కన మొదటి గది 244 గది. తాళం తీశాడు. లోపలికి వెళ్ళి తలుపు మూసి గడియపెట్టి చుట్టూ చూశాడు. ఎదురుగా బల్లమీద వున్నది తన బ్రీఫ్ కేస్. వ్యవధి లేదు, త్వరగా వెళ్ళాలి. యుగంధర్ బ్రీఫ్ కేస్ తెరుస్తున్నాడు. అంతలో టెలిఫోన్ గణగణ మోగింది. యుగంధర్ టెలిఫోన్ వైపు చూశాడు. తనకి అయ్యుండదు. బహుశా ఈ గది ఖాళీ చేసిన వాళ్ళకి అయ్యుండవచ్చు. లేదా ఈ గది బుక్ చేసుకున్న వాళ్ళకేమో! ఆ టెలిఫోన్ అలా మోగుతూనే వుంది. మేనేజర్ టెలిఫోన్ ఆపరేటర్ కి చెప్పాడా! మేనేజర్ ఫోన్ చేస్తున్నాడా! పథకంలో ఏదైనా మార్పు చెయ్యవలసివచ్చి రాజు ఫోన్ చేస్తున్నాడా! ఏమైతేనేం యుగంధర్ రిసీవర్ తీశాడు.

"హల్లో!”

"హల్లో, యుగంధర్!”

“ఎవరు?” అడిగాడు యుగంధర్, తెలియక కాదు. కంఠస్వరం గుర్తుపట్టాడు. శ్రీమతి భార్గవిని కలుసుకోవద్దని తనని ఇంతకు ముందు హెచ్చరించిన మనిషే... ఎలా తెలుసుకున్నాడు? అంత జాగ్రత్తగా, ఒక గది తీసుకుని, ఇంకో గదికి వచ్చాడు. ఎవరికీ కనిపించకుండా గదిలోకి వచ్చాడే.. ఎలా తెలుసుకున్నాడు?

“ఎవరో చెప్పవలసిన అవసరం లేదు. శ్రీమతి భార్గవిని ఈ హోటల్లో కలుసుకోవ డానికి ఏర్పాటు చేసుకున్నారా! లేక ఇంకేదయినా పథకం  వేశారా?"

"నా వృత్తికీ.. నా క్లయింట్స్ కీ సంబంధించి న విషయాలన్నీ నీకు చెప్పాలా?" అడిగాడు యుగంధర్ కోపంగా.

“అవసరంలేదు యుగంధర్! మీరు శ్రీమతి భార్గవిని కలుసుకోకూడదు. నాకు కావలసింది అంతే. ఎన్నిరకాల వేషాలు మార్చుకున్నా, మీరు ఎన్ని కిటుకులు ఆలోచించినా, వెయ్యికళ్ళతో మిమ్మల్ని కనిపెడుతూనే వుంటాను జాగ్రత్త!". ఫోన్ క్లిక్ మన్నది.

యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. డామిట్! ఎంతో ఆలోచించి పటిష్టమైన నిర్దుష్టమైన పథకం ఆలోచించాను అనుకున్నాడు. అంతా తారుమారు అయింది. ఎలా తెలిసింది వాళ్ళకి! ఆశ్చర్యం! రిసీవర్ తీసి, "ఆపరేటర్... కనెక్ట్ మీ టు ది మేనేజర్” అన్నాడు యుగంధర్.

"హల్లో! మేనేజర్ స్పీకింగ్.”

"యుగంధర్ హియర్. నేను 244 గదిలో వున్నట్లు మీరు ఎవరికయినా చెప్పారా?" అడిగాడు.

"యస్. ఇప్పుడే చెప్పాను మీ అసిస్టెంట్ రాజుకి.”

"అలాగా! రాజు ఏమని అడిగాడు?”

"రూం నెంబర్ 102కి ఫోన్ చేశాననీ... రెస్పాన్సు లేదనీ, మీతో తను అత్యవసరం గా మాట్లాడాలని, ఎక్కడున్నారో చెప్పమనీ అడిగాడు. రూం నెc.244లో వున్నారని చెప్పాను. మీ అసిస్టెంట్ రాజు ఫోన్ చేశాడు కనుక అందులోనూ, చాలా అర్జంటని అన్నాడు కనుక చెప్పాను.”

“దట్ ఈజ్ ఆల్ రైట్" అని యుగంధర్ రిసీవర్ హుక్ మీద పెట్టేశాడు.. పొరపాటు మేనేజం కాదు. తనది. ఎవరు ఫోన్ చేసినా చెప్పవద్దని తను ముందుగా మేనేజర్ ని హెచ్చరించి వుండవలసింది. అతనెవరో ముందు నెంబర్ 102 గదికి ఫోన్ చేసి, రెస్పాన్సు లేకపోతే బహుశా ఆ గదికి వెళ్ళి చూసి ఉంటాడు. తను ఆ గదిలో లేక పోయేసరికి అనుమానం కలిగి, బహుశా ఆ గదిలోంచే రాజులా మాట్లాడి, తను ఉన్న గది నెంబర్ తెలుసుకుని ఫోన్ చేశాడు. చాలా సింపిల్. ఇప్పుడు తను అనుకున్న పథకం అమలు జరపడం మూఢత్వం అవుతుంది. ఈ గదిలోంచి తను బైటికి ఏ రూపంలో వెళ్ళినా, తనని కనిపెడుతూనే వుంటారు శత్రువులు.

బ్రీఫ్ కేస్ తెరిచి, ఒక తెల్లకాయితం తీసి, “రాజూ! ప్లాను మార్చవలసివచ్చింది. మౌంట్ రోడ్ పోస్టాఫీసు ప్రాంతాల్లో కారు ఆపివుంచు వస్తాను" అని రాసి కాయితం జేబులో పెట్టుకొని, బ్రీఫ్ కేస్ తీసుకుని, యుగంధర్ గదిలోంచి బయటికి వచ్చి, తలుపు తాళం వేసి కిందకివెళ్ళాడు.

"థాంక్ యు. ఇదిగో తాళంచెవి. బిల్ ప్లీజ్!” అన్నాడు.

"నో! నో! ఒక అరగంట కూడా మీరు గదిని వాడుకోలేదు. బిల్లు ఏమిటి?" అన్నాడు మేనేజర్.

యుగంధర్ చిన్ననవ్వు నవ్వి, “థాంక్స్” అని కారు పార్కింగ్ స్పేస్ వైపు నెమ్మదిగా నడుస్తూ వెళుతున్నాడు. చాలా కార్లు కొత్తవీ, పాతవీ, రకరకాల కార్లు ఆగి ఉన్నాయి. కొందరు డ్రైవర్లు కారువద్ద నిలబడి మాట్లాడుకుంటున్నారు. కొందరు కార్లలోనే వున్నారు. యుగంధర్ ఒక పాత షెవర్లీ కారు పక్కనించి వెళుతూ, కారు డ్రైవింగ్ సీటులోకి తను రాసిన ఉత్తరాన్ని పడేసి, ధీమాగా వెళ్ళి తన క్రిజ్లర్ ఎక్కి స్టార్టు చేశాడు.
👥
*సశేషం*
꧁☆•

*అతను అతను కాడు - 3*

🕵️‍♂️


రచన: కొమ్మూరి సాంబశివరావు



అంత జాగ్రత్తగా ఆలోచించి తయారుచేసిన పథకం ఎలా తారుమారు అయింది! యుగంధర్ క్రిజ్లర్ లో వెళ్ళిన అయిదు నిముషాల తర్వాత పెన్సిల్ టార్చి వెలుగు లో ఉత్తరం చదివాడు రాజు. యుగంధర్ ని కలుసుకుంటే కానీ తెలియదు. తనని ఎవరూ గుర్తుపట్టరని రాజుకి పూర్తినమ్మకం వుంది. కారు డ్రైవర్ డ్రెస్ లో ఉన్నాడు. పెద్ద మీసాలు అతికించుకున్నాడు. అంతే కాదు. ఒంటి రంగు కూడా నల్లగా చేసుకున్నాడు. పదినిముషాల తర్వాత కారు స్టార్టుచేశాడు. కారు పైకి చూడడానికి పాతగా వున్నా సరికొత్త ఇంజన్. ఏక్సిలేటర్ మీద కాలు పెట్టగానే కదిలింది. పావుగంట తర్వాత, మౌంట్ రోడ్ పోస్టాఫీస్ ఆవరణలో కారు ఆపాడు. బద్ధకంగా సిగిరెట్ తీసి వెలిగించి కాచుకున్నాడు. అక్కడెక్కడా దీపాలు లేవు. కార్లు కూడా ఎక్కువ లేవు. న్యాయానికి అసలు అక్కడ కారు ఆపకూడదు. చీకటి పడింది. ఎవరూ అడ్డుపెట్టరని, కొందరు కార్లు ఆపారు. యుగంధర్ మారువేషంలో వస్తారా! ఎంతసేపటికి వస్తారు? ఎలా వస్తారు? కారులోనా? నడిచా? టాక్సీలోనా-? ఎవరో కారులోకి ఎక్కారు. పక్కన కూర్చున్నారు.


"పోనియ్యి...” అన్నాడు ఆ మనిషి. యుగంధర్ కాదు. ఎవరది? నడుంలో ఏదో గుచ్చుకున్నట్లయింది. “ఇది పిస్తోలు... చెప్పినట్లు చెయ్యకపోతే ప్రాణాలు ఎగిరి పోతాయి. త్వరగా స్టార్టు చెయ్యి” అన్నాడతను.


రాజుకి తెలుసు... అతని కంఠస్వరాన్ని బట్టి దయ, దాక్షిణ్యమూ లేని కర్కోటకుడు అని. కారు స్టార్టు చేశాడు. "త్వరగా... స్పీడుగా...” ఆజ్ఞాపించాడు అతను. రాజు మెదడులో ఏవేవో ఆలోచనలు ఉరకలు వేస్తున్నాయి. ఏ కిటుకుతో అతన్నించి తప్పించుకోవడం!

📖


డిటెక్టివ్ యుగంధర్ క్రిజ్లర్ కారు రాణి సినిమా థియేటర్ ప్రాంతాల ఆపాడు. బ్రీఫ్ కేసు తీసుకొని, థియేటర్ వైపు నడుస్తూ చేతిగడియారం చూసుకున్నాడు. సినిమా పూర్తయి జనం బయటికి వచ్చే సమయం ఇంకో ఐదు నిముషాలలో. అనుకొన్నట్లు గానే థియేటర్లోంచి జనం తోసుకొని వస్తున్నారు. ఆ జన సమూహంలోకి వెళ్ళిపోయాడు యుగంధర్. ఎంత ప్రవీణుడయినా, ఎంతటి అనుభవశాలి అయినా, సినిమా హాలులోంచి వచ్చే జనం లో కలిసిపోయిన మనిషి జాడని పసికట్టి, మళ్ళీ ఆ మనిషిని పట్టుకోవడం చాలా కష్టమని అనుభవం మీద యుగంధర్ కి తెలుసు. కార్లు వెళుతున్నాయి. ఆటోల్లో ఎక్కుతున్నారు. టాక్సీల్లో ఎక్కుతున్నారు. నడిచి వెళ్ళేవాళ్ళు, సైకిళ్ళు, స్కూటర్స్, మోటార్ సైకిల్స్... అంతా గందరగోళం. చటుక్కున ఖాళీగా వున్న ఆటో ఎక్కి పది రూపాయల నోటు డ్రైవర్ కి ఇచ్చి "త్వరగా పోనియ్యి!" అన్నాడు.


ఆటో కదిలింది. అరఫర్లాంగు కూడా వెళ్ళక ముందే, "ఆగు!” అని ఆటో దిగి చీకట్లోకి వెళ్ళిపోయాడు యుగంధర్. పోస్టాఫీస్ కారు పార్కింగ్ స్పేస్ అది. అయిదారు కార్లున్నాయి, రాజు కానీ, అతని షెవర్లీ కానీ లేవు. ఏమయ్యాడు! ఈ కాస్త దూరం రావడానికి ఇంత ఆలస్యం కాదే... ఆలోచిస్తూ నిలుచున్నాడు. ఎవరో కుర్రాడు వచ్చి యుగంధర్ మోచెయ్యి తట్టాడు. 


"ఎవరు?"


ఆ కుర్రాడు ఒక కాయితం యుగంధర్ కి ఇచ్చి పరుగెత్తుకొని పారిపోయాడు. ఆ కాయితం తీసుకొని, అవతల రోడ్ మీద వున్న దీపం కిందకి వెళ్ళి చదివాడు యుగంధర్.


"మిష్టర్ యుగంధర్!


షెవర్లీ కారులో మీకోసం కాచుకొన్న రాజుని బందీగా తీసుకొని వెళ్ళాము. రాజుని ప్రాణాలతో మీకు అప్పగించడమా... లేదా అనేది మీ ప్రవర్తనమీద ఆధారపడి వుంటుంది. త్వరగా ఇంటికి వెళ్ళండి. రాజు ఫోన్ లో మీతో మాట్లాడుతాడు.”


సంతకం లేదు. యుగంధర్ పళ్ళు పటపట కొరికాడు. ఈ శత్రువులు ఎవరో తను వేసే ప్రతి పథకం తెలుసుకొంటున్నారు. అసలు తనకన్నా ఒక ఎత్తు ముందు వేస్తున్నారు! రాజుని పట్టుకున్నారా! రాజు వాళ్ళ బందీగా వున్నాడా! ఆ ఉత్తరం తెచ్చి ఇచ్చిన కుర్రాణ్ని పట్టుకోవడం కష్టంకాదు. కానీ ఆ కుర్రాడి ద్వారా ఏమీ తెలియదు. ఎవరో అయిదురూపాయలు ఇచ్చారు ఆ ఉత్తరం ఇవ్వమని అని చెపుతాడు. అది నిజం అయ్యుంటుంది. ఒక్క నిట్టూర్పు వదలి యుగంధర్ క్రిజ్లర్ కారువైపు వెళ్ళాడు.

📖


"తిన్నగా పోనియ్యి. స్పీడు తగ్గించవద్దు. సడన్ బ్రేక్ వేస్తే పిస్తోలు పేలుతుంది. అటువంటి కిటుకులు వద్దు" అని హెచ్చరించాడు పక్కన కూర్చున్న మనిషి. అటువంటి కిటుకులు ఉపయోగించాలని రాజు ఉద్దేశించలేదు. సామాన్యమైన దొంగ అయితే... అటువంటి కిటుకులు బాగా పనిచేస్తాయి. కాని ఎత్తుకు పై ఎత్తు వేసే ఘటికులయిన శత్రువులు వీళ్ళు. తను తొందరపడితే ప్రాణానికి ముప్పు. ప్రాణానికి ప్రమాదం అని తను అతను చెప్పినట్టు చేస్తే... వాళ్ళకి బందీ అయిన తర్వాత ప్రాణానికి ముప్పు. ఏక్సిలేటర్ మీదనించి, కాలు తీసి మళ్ళీ పెడుతున్నాడు. కారు ఆగి, ఆగి వెళుతోంది.


"ఏమైంది?” అడిగాడు అతను.


“పెట్రోలు కార్బరేటర్ కి సరిగా రావడం లేదు" చెప్పాడు రాజు.


"అయితే చోక్ లాగు!"


“ఊ!” అని రాజు డాష్ బోర్డుమీద వున్న చిన్న మీట లాగాడు.


కారు స్పీడుగా పోతోంది. రాజు మొహం తలుపు వైపు పెట్టుకున్నాడు. కారులోకి తియ్యని వాసన వస్తోంది. ఆ వాసన కారులో అలుముకుంటోంది.


"ఏమిటీ వాసన?”


“పెట్రోలు...”


“వాట్! పెట్రోలు వాసనలా లేదు.”


"అయితే బంక్ వాడు పెట్రోలు బదులు పన్నీరు పోశాడేమో టాంకులో..." అన్నాడు రాజు. అప్పటికీ మొహం కిటికీ వైపే పెట్టుకున్నాడు.


వాసన ఘాటు ఎక్కువైంది.


"ఏమిటిది? తల తిరుగుతోంది."


“నువ్వేదో చెత్త తిని వుంటావు! కడుపులో తిప్పుతోందేమో!" అన్నాడు రాజు. నడుం మీద ఆనించిపెట్టి వున్న పిస్తోలు నెమ్మదిగా జారుతోందని గమనించాడు.


"కారు ఆపు! దిగాలి..."


“ఆపుతాను” అన్నాడు కాని వెంటనే ఆపలేదు. ఇంకొక రెండు నిముషాలు చాలు. నడుంకి ఆనించి పెట్టిన పిస్తోలు సీటు మీద పడిపోయింది. పక్కన కూర్చున్న అతను స్పృహ తప్పి తల వెనక్కి వేళ్ళాడేసి పడిపోయాడు. ఇంకో గంటకి కాని స్పృహ రాదు. చోక్ మీట నొక్కేశాడు. కారులోకి వచ్చిన ఈథర్ రావడం ఆగిపోయింది. కారులో వున్న ఈథర్ కాసేపటితో పోతుంది. త్వరగా వెళ్ళాలి. మళ్ళీ వెనక్కి పోస్టాఫీసుకా? ఇంటికా? అప్పటికి కారు మౌంట్ రోడ్ మీద నందనం ప్రాంతాలకి చేరుకున్నది. కారు వెనక్కి తిప్పాలని అనుకుంటుండగా రెండు కార్లు వెనకనించి, అతని కారు ముందుకి వచ్చి.. స్పీడు తగ్గించాయి. రాజు కూడా స్పీడు తగ్గించక తప్పింది కాదు. అంతే ముందున్న కార్లలోంచి తన కారు విండ్ షీల్డుమీద టైర్ల మీద పిస్తోలు గుళ్ళ వర్షం కురిపించారు ఆ రెండు కార్లలో వున్న వాళ్ళు. రాజు తనలో తను నవ్వుకొన్నాడు విండోషీల్డు బులెట్ ప్రూఫ్, టైర్లకి ముందు, పక్క, బులెట్ షీల్డ్స్ వున్నాయి. 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

ఇంత తెగించినవాళ్ళు, ఇన్ని కిటుకులు తెలుసుకొన్నవాళ్ళు ఆ మాత్రం అని అనుకుంటూ, రివర్సు గేరు వేసి, కారు స్పీడుగా వెనక్కి తిప్పి, ఒక్క ఊపుతో స్పీడు పెంచేశాడు. రెండు నిముషాలలో, రెండు కార్లకీ దూరం అయ్యాడు.

📖


టెలిఫోన్ వైపు తదేకంగా చూస్తూ కూర్చున్నాడు యుగంధర్. ఇంకా ఫోన్ చెయ్యడేం! రాజు ఏమయ్యాడు! ఎక్కడికి తీసుకుని వెళ్ళివుంటారు? అంతలో బైట కారు ఆగిన చప్పుడయింది. యుగంధర్ వెళ్ళి కిటికీలోంచి బయటికి చూశాడు. రాజు షెవర్లీ పోర్టికోలో ఆపాడు. కారు ముందు సీటులోంచి ఒక మనిషిని బైటికి లాగి భుజంమీద వేసుకొని పైకి మెట్లు ఎక్కుతున్నాడు. వెంటనే తలుపు తీశాడు యుగంధర్. రాజు లోపలికి రాగానే మళ్ళీ తలుపు మూసేశాడు.


భుజంమీద వున్న మనిషిని సోఫాలో పడేసి, ఆయాసంతో, "శత్రువుల్లో ఒకడు" అన్నాడు రాజు నవ్వుతూ.


"ఏమి జరిగింది రాజూ?" అని అడిగాడు యుగంధర్.


రాజు చెప్పాడు వివరంగా, "గుడ్! ఈ మనిషికి స్పృహ వచ్చిన తర్వాత అసలు విషయం తెలుసుకోవచ్చు" అన్నాడు యుగంధర్.


"అంత సులభంగా చెపుతాడనుకోను. ఆరితేరినవాళ్ళు" అన్నాడు రాజు.

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

“అవసరమై..." అంటుండగా టెలిఫోన్ మోగింది. యుగంధర్ రిసీవర్ తీసుకున్నాడు. 


“హలో!"


"యుగంధర్?"


"ఎస్!"


"మీ అసిస్టెంట్ రాజుకి మా అభినందనలు. మా మనిషిని పట్టుకొని తీసుకువచ్చాడు. ఎంతయినా ప్రఖ్యాత యుగంధర్ గారి అసిస్టెంటు కదా, ఘటికుడు!"


"మీ మెప్పులు అనవసరం...”


"అవును. అనవసరం. మా మనిషిని బంధించి, హింసించి, మా గురించి రహస్యాలు తెలుసుకోవాలని ఉద్దేశిస్తున్నా రేమో! అటువంటి ప్రయత్నం వద్దు.. అతన్ని వదిలెయ్యండి. అంతేకాదు, అతను ఎక్కడికి ఎటు వెళుతున్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నించకండి"


"నీ బెదిరింపు ఏమిటి? నీ మనిషి మాకు చిక్కినప్పుడు బెదిరించవలసిన వాణ్ని నేను" అన్నాడు యుగంధర్.


"సామాన్య పరిస్థితులలో... ఇప్పుడు పరిస్థితులు వేరు. శ్రీమతి భార్గవి మీకు టెలిఫోన్ చేస్తుంది. కాస్త ఓపిక పట్టండి" క్లిక్ మన్నది రిసీవర్. యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. స్పృహ లేకుండా పడివున్న మనిషి అప్పుడే కదులుతున్నాడు. స్పృహ వస్తోంది.


"స్మెల్లింగ్ సాల్టు వాసన చూపించు రాజూ! త్వరగా కోలుకుంటాడు" అంటున్నాడు యుగంధర్. అంతలో మళ్లీ టెలిఫోన్ మోగింది.


“హాల్లో!"


"డిటెక్టివ్ యుగంధర్ రా?”


"ఎస్..."


"నేను... భార్గవిని.”


"కంఠస్వరం గుర్తుపట్టాను, చెప్పండి”


"పొద్దున్న మీకు ఫోన్ చేశాను.”


“అవును.”


"మీరు ఒక మనిషిని పట్టుకున్నారు. అంటే మీ అసిస్టెంటు రాజు.”


"అవును.”


"దయచేసి... ప్లీజ్... నా కోసం... అతన్ని వదిలెయ్యండి.”


"సారీ మేడమ్! పిస్తోలుతో బెదిరించి, రాజుకి హాని తలపెట్టిన ఒక దుర్మార్గుణ్ని వదిలిపెట్టలేను.”


"యుగంధర్ గారూ! మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను. అతన్ని మీరు తక్షణం వదిలెయ్యకపోతే నా ప్రాణానికి ముప్పు, ప్లీజ్” అని ఏడుస్తోంది భార్గవి.


"ఏమమ్మా! అసలు నీకు వచ్చిన కష్టం ఏమిటి? ఎవరు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు! చాలా పెద్ద ఉద్యోగంలో వున్నదానివి. పోలీసులు, అవసరమైతే సి.బి.ఐ. ఇంకా అవసరమైతే ఆర్మీ ఇంటిలెజెన్స్ నీకు రక్షణగా వుంటారు. ఎందుకలా కంగారుపడతాన్నావు?"

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

"దయచేసి నన్నేమీ ప్రశ్నలు అడగకండి. ప్లీజ్! అతన్ని వదిలెయ్యండి... తక్షణం. లేదా ఇంకో అయిదు నిముషాలలో నా ప్రాణం పోతుంది. అంతే చెప్పగలను నేను"


"పిస్తోలు పట్టుకొని, నీ వెనుక నిలబడి ఎవరన్నా నిన్ను బెదిరిస్తున్నారా?”


“ప్లీజ్... మీ ప్రశ్నలకి వేటికీ నేను జవాబు చెప్పలేను. అతన్ని వదిలెయ్యండి. వదిలేస్తానని మాట ఇవ్వండి.”


"ఆల్ రైట్? అతన్ని వదిలేస్తాను” అన్నాడు యుగంధర్.


"థాంక్స్... వెయ్యి... కాదు... లక్ష థాంక్స్" అని భార్గవి రిసీవర్ పెట్టేసింది.


యుగంధర్ భార్గవితో మాట్లాడి, రిసీవర్ పెట్టేటప్పటికి ఆ మనిషికి పూర్తిగా స్పృహ వచ్చింది. క్షణంపాటు అటూ ఇటూ చూశాడు.


"నేను... ఎక్కడ వున్నాను?” అడిగాడు.


“ఎక్కడ వుంటేనేం... వెళ్ళు... తక్షణం ఈ ఇంట్లోంచి వెళ్ళిపో” అన్నాడు యుగంధర్ కోపంగా.


అతను లేచి నిలుచున్నాడు. రాజు ఆశ్చర్యంతో యుగంధర్ ని చూస్తున్నాడు.


"థాంక్స్!” అని అతను తనే తలుపు తెరుచుకొని, బయటికి చీకట్లోకి వెళ్ళిపోయాడు.


రాజు "అదేమిటి సార్ వెళ్ళనిచ్చారు? వెళ్ళనా! వెనకే వెంబడించనా?” అడిగాడు.


“వద్దు, కూర్చో” అని తనకీ, భార్గవికీ జరిగిన సంభాషణ చెప్పి, “శ్రీమతి భార్గవి ఏదో చాలా పెద్ద ఇబ్బందిలో ఇరుక్కున్నది. నా సహాయం కోరింది. కాని, నేను ఆమెని కలుసుకొనే అవకాశం లేకుండా శత్రువులు 

... వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు. ఆటంకాలు కల్పిస్తున్నారు.”


“అయితే ఇప్పుడేం చేస్తారు?" అడిగాడు రాజు.


“ఒకటే మార్గం... తప్పదు" అంటూ రిసీవర్ తీసి ఒక నెంబర్ తిప్పాడు డిటెక్టివ్ యుగంధర్.

👥


*సశేషం*

꧁☆•┉┅━

*అతను అతను కాడు - 4*


రచన: కొమ్మూరి సాంబశివరావు



మరో రెండు మాత్రలు కాంపోజ్ వేసుకున్నా ఆ రాత్రి భార్గవికి నిద్రపట్టలేదు. రకరకాల ఆలోచనలు, భయం. తెల్లారకముందే లేచి, స్నానంచేసి, డ్రెస్ చేసుకున్నది.


"ఈ రోజు చాలా త్వరగా తయారయ్యావు! ఏమిటి విశేషం?" అడిగాడు. ఆమె భర్త మోహన్.


"త్వరగా ఆఫీసుకి వెళ్ళాలి."


"ఎందుకు? మీ డైరెక్టర్ పదిగంటలకి కాని రాడుగా! అయినా, నువ్వు అలా పీక్కు పోయిన మొహంతో, ఎర్రబడిన కళ్ళతో ఆఫీసుకు వెళితే నీ మొహమే చెప్పేస్తుంది

... ఏదో జరుగుతోందని. మనం రహస్యంగా దాచినది బయటపడుతుంది. రవి మనకు దక్కడు" అన్నాడు మోహన్.


భార్గవి అద్దంలో మొహం చూసుకొని, దిగులుగా నవ్వి “రాత్రి సరిగా నిద్రపట్ట లేదని ఏదో సాకు చెప్పాలి. డైరెక్టర్ రాక ముందు ఆయన గదిలోకి వెళ్ళాలి..."


“అదా... వెరీగుడ్ ప్లాన్... కానియ్యి...” అన్నాడు మోహన్. ఎందుకు త్వరగా ఆఫీసుకి వెళ్ళాలని తను అనుకున్నదో తనకే తెలియదు. ఏమీ ఆలోచించలేదు.


"డ్రైవర్ ని కారు పోర్టికోలోకి తీసుకుర మ్మంటాను" అన్నాడు మోహన్.


భార్గవి తలవూపింది. మరొకసారి తనని తను అద్దంలో చూసుకుంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద వున్న తన కొడుకు రవి ఫోటోని రెండుచేతుల్లోకీ తీసుకుని ఫోటోని ముద్దుపెట్టుకొని, మళ్ళీ అక్కడే పెట్టేసి, హైహీల్స్ షూస్ వేసుకొని టకటక మెట్లు దిగింది.


హాల్లో మోహన్ తోపాటు మరో నలుగురు మొగాళ్ళు వున్నారు. వాళ్ళల్లో ఒకరు పోలీస్ యూనిఫాంలో వున్నారు.


"దిస్ ఈజ్ నాన్సెన్స్! భార్గవి ఎవరో అనుకుంటున్నారు. డిప్యూటీ డైరెక్టర్.వాళ్ల డైరెక్టర్ అనుమతి లేకుండానా...?" అరుస్తున్నాడు మోహన్.


"ఏమిటి మోహన్! ఏమిటీ గొడవ?” అడిగింది భార్గవి.


"వీళ్ళు... వీళ్ళు... పోలీస్ ఆఫీసర్ ఒకడు, సి.బి.ఐ.వాళ్ళు ఇద్దరు, మిలటరీ ఇంటెలిజెంట్ వాడు ఒకడు" అన్నాడు కోపంగా.


"అలాగా... ఏం పనిమీద వచ్చారు?"


"క్షమించండి. పై అధికారుల అజ్ఞానుసారం మా డ్యూటీ మేము చెయ్యడానికి వచ్చాం. మీ భర్త మోహన్ గారు అనవసరంగా టెంపర్ పోగొట్టుకుంటున్నారు" అన్నాడు వాళ్ళలో ఒకరు.


"ఏమిటీ మీ డ్యూటీ?" అడిగింది భార్గవి.


"ఇదిగో! వారెంట్. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ప్రకారం మిమ్మల్ని ఇప్పుడే అరెస్ట్ చేస్తున్నాము” అని వారెంట్ అందించాడు ఒక ఆఫీసర్.


"అఫీషియల్ సీక్రెట్స్ యాక్టా? నేనా...”


“ప్లీజ్... మాతో ఏమీ చెప్పనవసరంలేదు. పై అధికారులతో చెప్పండి. ఇప్పుడు మీరు ఏం చెప్పినా, తర్వాత ఆ విషయాలు మీరిచ్చిన వాజ్ఞ్మలంగా పరిగణిస్తాము. మీ అడ్వకేట్ కి తెలియచెయ్యండి" అన్నాడు ఇంకో ఆఫీసర్.


"నాకు అడ్వకేట్ లేడు.”


"నేను ఏర్పాటు చేస్తాను. గంటలోపున బెయిల్ మీద విడిపిస్తాను" అని అరిచాడు మోహన్.


"ఆ ఏర్పాటు చెయ్యండి. భార్గవిగారూ! వస్తారా?” చాలా మర్యాదగా అడిగాడు ఒక ఆఫీసర్.


"ఇలాగేనా! చేతికి సంకెళ్ళు...?”


“ప్లీజ్.. చాలా అయిష్టమైన పని చేస్తున్నాం. మీలాటి పెద్ద ఆఫీసర్ని అరెస్ట్ చెయ్యడం మాకు మాత్రం ప్లెజెంట్ గా వుంటుందా?”


భార్గవి ఆ ఆఫీసర్ తో కారెక్కింది.

📖


తెల్లారగట్ట తలుపు దగ్గర కాచుకొని వున్నాడు రాజు. ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు. సైకిల్ బెల్ చప్పుడయింది. రాజు తలుపు తీశాడు.


నాలుగు ప్లాస్టిక్ సంచీలు పాలు తీసుకొని వచ్చి వసారాలో పెట్టి వెళ్ళిపోతున్నాడు పాలుతెచ్చే ముసలతను.


"ఒక్కక్షణం, ఆగు.." అన్నాడు రాజు.


"ఏమయ్యా!"


“ఒకసారి ఇటురా"


ఆ ముసలతను లోపలికి వచ్చాడు పాల సంచీలు తీసుకుని.


"నువ్వు మాకు ఒక సహాయం చెయ్యాలి” అన్నాడు రాజు.


"నేను మీకు సహాయమా సర్! ఇంకో రెండు సంచీలు పాలు..."


"కాదు. చెపుతాను విను. నీకు వంద రూపాయలు ఇస్తాము. కాని ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు.”


“చెప్పండి. చేతనయితే చేస్తాను” అన్నాడు ఆ ముసలతను.


రాజు చెప్పాడు.


"నాకు అభ్యంతరం లేదు కాని పాలసంచీలు అందరికీ...”


"నీ దగ్గిర చిరునామాల జాబితా వుందా?"


"ఉన్నది” అన్నాడు ముసలతను.


"అయితే ఇబ్బంది ఏమీలేదు. పాల సంచీలు జాగ్రత్తగా వాళ్ళకి చేరుస్తాము. నువ్వు హాయిగా గదిలోకి వెళ్ళి పడుకో” అన్నాడు రాజు.


సైకిల్ బెల్ మోగింది. గేటు దగ్గిర కునికిపాట్లు పడుతున్న కానిస్టేబుల్ ఉలిక్కిపడి లేచి, “ఎ వరు?” అని అడిగాడు.


"పాలు"


"ఇందాకేగా పాలు ఇచ్చి వెళ్ళాడు!"


"అమ్మగారు ఎగస్ట్రా పాలు కావాలన్నారు. తెచ్చాను" అని రెండు సంచీలు పాలు చూపించాడు ఒక ముసలతను.


“సరే వెళ్ళు” సైకిల్ తొక్కుకుంటూ ముసలతను గేటుదాటి లోపలికి వెళ్ళాడు. సైకిల్ పనివాళ్ళుండే వైపుకి తీసుకువెళ్ళి, టంగ్ టంగ్ మని బెల్ మోగించాడు.


"ఎవరది?" నిద్రమత్తులో నౌఖరు అరిచాడు.


"పాలు"


"పాలు తెచ్చిఇచ్చాడు ఇందాక."


"అమ్మగారు... ఎక్స్ట్రా పాలు కావాలన్నారు."


"సరే వుండు. వస్తున్నాను" అని గదిలోంచి నౌఖరు వచ్చాడు.


ముసలతను ఒక సంచీ పాలు, ఒక ఉత్తరం నౌఖరికి ఇచ్చి "ఈ రెండు అమ్మగారికి ఇచ్చి ఏం చెపుతారో కనుక్కొని రా” అన్నాడు.


"ఏమిటీ కవరు?"


"నాకేం తెలుసు... డిపో మేనేజర్ అమ్మగారికి ఇవ్వమన్నారు. జవాబు కావాలన్నాడు" అన్నాడు ముసలతను.


నౌఖరు ఒక సంచీ పాలు, ఆ కవరు తీసుకుని వెళ్లి ఐ.జి. ఆఫ్ పోలీస్ భార్యకి ఇచ్చాడు.


"ఏమిటీ కవరు?" అడిగింది ఆమె.


"నాకు తెలియదు. డిపో మేనేజర్ మీకు ఇవ్వమన్నారు. బదులు కోసం ముసలాడు కాచుకున్నాడు”


ఆమె విసుగ్గా కవరు చింపింది. అందులో ఇంకో చిన్న కవరు. కవరు పైన, “దయచేసి ఈ కవరు మీ భర్త ఐ.జి. గారికి వెంటనే ఇవ్వండి. డిటెక్టివ్ యుగంధర్. ఈ విషయం నౌఖరుకి కూడా చెప్పవద్దు” అని ఎర్రని సిరాతో వ్రాసి వుంది. 


"ఆ పాలమనిషిని అక్కడే వుండమను” అని ఆమె భర్తని నిద్రలేపి కవరు ఇచ్చింది.


"ఇంకో దారిలేక ఇలా మారువేషంలో రావలసివచ్చింది. మీతో మాట్లాడాలి. అత్యవసరం. నేను ఎవరో నౌఖరుకి కూడా తెలియకూడదు. డిటెక్టివ్ యుగంధర్" అంతే. ఆ వాక్యాలు చదవగానే నిద్రమత్తు పూర్తిగా పోయింది ఆ పోలీస్ ఉన్నతోద్యోగికి.


"ఆ పాలమనిషిని వెంటనే రమ్మని చెప్పు!" అన్నాడు భార్యతో.


"ఆ పాలమనిషిని వెంటనే లోపలికి రమ్మని చెప్పు" అన్నది ఆమె నౌఖరుతో.


పాలు తెచ్చే ముసలివాడి వేషంలో వున్న యుగంధర్ రాగానే “ఏమిటి యుగంధర్... ఇంత తెల్లారే ఈ వేషం ఏమిటి" అడిగాడు ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్.


"కష్టపడి పదిళ్ళల్లో పాలసంచీలు పంచిపెట్టి ఆరుమైళ్ళు సైకిల్ తొక్కి వచ్చాను. దయచేసి ముందు ఒక కప్పు కాఫీ వేడిగా ఇస్తే తర్వాత చెపుతాను" అన్నాడు యుగంధర్.


"క్షమించండి. ఇప్పుడే క్షణంలో తెస్తాను" అని ఐ.జి. భార్య గదిలోంచి బైటికి వెళ్ళిపోయింది. అయిదు నిముషాలలో వేడి కాఫీ రెండు కప్పులు తెచ్చిపెట్టి, ఆమె గదిలోంచి వెళ్లిపోయింది.


"చెప్పండి యుగంధర్” అన్నాడు ఐ.జి. యుగంధర్ చెప్పడం ప్రారంభించాడు.

📖


తన బాబు రవి ప్రాణాన్ని కాపాడుకోడానికి ఆ రోజు రాత్రి శత్రుదేశ గూఢచారులకి యురేనియం ఎప్పుడు వచ్చేదీ తను చెప్పెయ్యదలచుకున్నదని సి.బి.ఐ.వాళ్ళకి ఎలా తెలిసింది? తన రవి ప్రాణాన్ని కాపాడుకోవడానికి తను దేశద్రోహానికి తలపెట్టడం నేరం. ఘోరమైన నేరం. కాని తను ఇంకా నేరం చెయ్యలేదు. నేరం చెయ్యాలనే ఆలోచన కలిగింది. నేరం చెయ్యాలనే ఆలోచన రావడం కూడా చట్ట ప్రకారం నేరమా! ఏమో! ఏదీ ఆలోచించే శక్తిలేదు మనస్సుకి, ఏం జరుగుతుందో అది జరుగుతుంది. కారులో వెనక్కి జారగిలబడి కూర్చున్నది. కారు ఎక్కడికి వెళుతున్నది? వీళ్ళు ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు? ఈ ప్రశ్నలు కూడా అడగాలని అనిపించలేదు. ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ ఆవరణలో కారు ఆగిన తర్వాత కాని తను అక్కడి పరిసరాలను గమనించలేదు శ్రీమతి భార్గవి. కారు తలుపు ఎవరో తెరిచారు. దిగమన్నారు మరెవరో. వాళ్ళతో వెళ్లింది.


"కూర్చోండి" అన్నారు మరెవరో. కుర్చీలో కూర్చున్నది.


ఆజానుబాహువు, ఆరు అడుగుల మూడు అంగుళల పొడుగు, వెడల్పయిన ఛాతీ. కండలు తిరిగిన శరీరం. కళ్ళల్లో తెలివీ, తేజస్సు మాత్రమే కాక దయా, జాలి. అతన్ని చూస్తేనే లేచి నిలుచోవాలని అనిపించింది. వెంటనే లేవబోయింది. లేవవద్దన్నట్లు సంజ్ఞ చేసి, చేతికి ఒక కాగితం ఇచ్చాడు.


ఆ కాగితంలో ఇలా రాసి ఉంది..


"బిగ్గరగా చదవకండి. చదివిన తర్వాత కూడా దయచేసి మాట్లాడకండి. పక్కన గదిలోకి వెళ్ళి, మీ హ్యాండ్ బ్యాగ్, వేలి ఉంగరాలు, మెళ్లో గొలుసులు, లాకెట్లు, చేతి గడియారం, ఇంకా ఏమైనా ఆభరణాలో, వస్తువులో వుంటే వాటిని తీసేసి అక్కడే బల్లమీద వున్న పెట్టెలో పెట్టి మూసేసి ఒకసారి చీరని పూర్తిగా విప్పుకొని చీరకి ఏవైనా ఎలక్ట్రానిక్, మైక్రోడివైజస్ వున్నాయేమో పరీక్ష చేసుకుని, మీ వద్ద అటువంటిదేదీ లేదు అని నిశ్చయించుకు న్న తర్వాత మళ్లీ ఈ గదిలోకి రండి.


మీ మిత్రుడు."


ఉత్తరం చదివి అర్ధంకానట్టు బెదురు చూపులు చూసింది శ్రీమతి భార్గవి.


ఒక చిన్ననవ్వు నవ్వి, తలుపువైపు చెయ్యి చూపించాడు. అతని ఆజ్ఞని పాటించక పోవటం సత్ప్రవర్తన కాదనిపించింది ఆమెకి. అతనిమీద కలిగిన గౌరవం అలాటిది. వెంటనే లేచి పక్కన గదిలోకి వెళ్లిపోయింది. సరిగా పావుగంట తర్వాత తిరిగివచ్చింది. అతను వెళ్ళి అవతల గదికీ, ఈ గదికీ మధ్య వున్న తలుపు గట్టిగా మూసి, “కూర్చోండి భార్గవిగారూ! మీరు నన్ను ఇంతకు పూర్వం చూడలేదు. నాతో ఫోన్ లో మాట్లాడారు. నేనే డిటెక్టివ్ యుగంధర్ ని ” అన్నాడు.

👥

*సశేషం*

********


*అతను అతను కాడు - 5*

రచన: కొమ్మూరి సాంబశివరావు

భార్గవిని ఆఫీసర్లు కారులో తీసుకొని వెళ్లిపోగానే, మోహన్ చిందులు తొక్కుతూ, భార్గవి పై అధికారి అయిన డైరెక్టర్ కి ఫోన్ చేసి చెప్పాడు.

"వాట్ నాన్సెన్స్! ఎవరికో మతిపోయింది. భార్గవిని ఏమిటి! అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ నిబంధనల ప్రకారం అరెస్ట్ చెయ్యడం ఏమిటి? నేను మాట్లాడుతాను. మీరు కంగారుపడకండి” అన్నాడు కల్పాకం ఆటమిక్ రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్ నారాయణన్.

“యస్. దయచేసి మీరు కల్పించుకోవాలి. లేదా భార్గవిమీద లేనిపోని కేసులు బనాయిస్తారు ఈ పోలీసులు. అయినా, ఎందుకయినా మంచిది బెస్ట్, క్రిమినల్ లాయర్ ని ఏర్పాటుచేసి, వెంటనే బెయిల్ మీద విడిపించేందుకు ఏర్పాటు చేస్తాను!" అన్నాడు మోహన్.

"గుడ్... మీరు ఆ పని చెయ్యండి. నే చెయ్యగలిగింది నే చేస్తాను" అన్నాడు నారాయణన్.
📖

"శ్రీమతి భార్గవిగారూ! డాక్టర్ అనాలా!" అని నవ్వి "అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చెయ్యడం... ఇదంతా కేవలమూ నేను ఆడించిన నాటకం. మీమీద ఏ విధమైన ఆరోపణా లేదు. నన్ను మీరు కలుసుకోవాలని కోరారు. మనం కలుసుకోకుండా ఎవరో చాలా ప్రయత్నం చేశారు. కలుసుకుంటే నా ప్రాణమూ, మీ ప్రాణమూ తీస్తామనీ బెదిరించారు. ఇప్పుడు ఎవరికీ తెలియ కుండా ఇక్కడికి వచ్చాను. నేను పోలీస్ యూనిఫాంలో వున్నాను. నేను పోలీస్ అధికార్ని కాను. శత్రువులు నన్ను గుర్తు పట్టకుండా వుండేందుకే ఈ వేషం వేసుకున్నాను" అన్నాడు యుగంధర్.

ఒక పోలీస్ కానిస్టేబుల్ రెండు కప్పులు కాఫీ తెచ్చి బల్లమీద పెట్టి తలుపు మూసి వెళ్ళిపోయాడు.

"నేను ప్రైవేట్ డిటెక్టివ్ ని. నాతో మీరు చెప్పే విషయాలన్నీ ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్స్... అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను మీరు చెప్పే విషయాలు మీ అనుమతి లేనిదే ఎవరికీ చెప్పకూడదు. చదువుకున్నవారు. ఇంకా వివరించి చెప్పనవసరం లేదు. ఏ విషయంలో మీరు నా సహాయం కోరారో చెప్పండి. సంకోచించకండి" అన్నాడు యుగంధర్.

అంత దయతో, ఆపేక్షతో మాట్లాడేసరికి తనకి తెలియకుండానే భార్గవి కళ్ళల్లో నీళ్ళు నిండాయి. చీరకొంగుతో కళ్ళు తుడుచుకుని, "ఎలా మొదలుపెట్టాలో నాకు అర్థంకావటంలేదు" అన్నది.

"మొదటి నుంచీ మొదలుపెట్టండి. అదే సరయిన పద్ధతి. రోజంతా వ్యవధి వుంది. మీవారు బెయిల్ కోసం ప్రయత్నిస్తారు. మన సంభాషణ పూర్తి అయిన తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను మీకు ఎటువంటి ఆపదా లేదని తోస్తే. బెయిల్ మీద వదిలే ఏర్పాటు చేస్తాను. అదీ నాటకమే" అన్నాడు యుగంధర్.

"యుగంధర్ గారూ! వివరంగా చెప్పాలంటే నా కాలేజీ చదువు దగ్గర ప్రారంభించాలి" అన్నది భార్గవి.

“అలాగే. అక్కణ్నించే ప్రారంభించండి" అన్నాడు యుగంధర్.

భార్గవి చెప్పడం ప్రారంభించింది.

"నేను మద్రాసులో ప్రెసిడెన్సీ కాలేజీలో బి.యస్సి. చదివాను. మోహన్ నా క్లాస్ మేట్. సామాన్యంగా, మొదటి రెండవ స్థానాలకి మేము ఇద్దరమే పోటీలు పడేవారం. ఆ పోటీ మా ఇద్దరిమధ్య వైరంకాని, అసూయకాని తీసుకురాలేదు. ఇద్దరిమధ్య ఆకర్షణ, అనురాగం, ఆప్యాయత ఏర్పడ్డాయి. బి. యస్సి పూర్తి చేసిన తర్వాత మోహన్ ఉద్యోగం కోసం ప్రయత్నం ప్రారంభించాడు. నేను బి.యస్సి మంచి మార్కులతో పాసయ్యాను. నన్ను ఎం.ఎస్సి. చదివించాలని మా నాన్నగారు నిశ్చయించుకున్నారు. మోహన్ కి అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు లేకపోయినా, వాళ్ళ నాన్నకి ఒక ఉద్యోగం నికరంగా నెలకి ఇంత సంపాదనా అని లేకపోవడం వల్ల పై చదువు చదవడానికి మోహన్ కి అవకాశం లేకపోయింది. అందుకే, రిజల్ట్స్ రాకముందే, ఏదో కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా ఉద్యోగంలో చేరాడు. నాకు ఆంధ్రా యూనివర్శిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ కి ఎం.ఎస్.సికి విశాఖపట్నంలో సీట్ దొరికింది. విశాఖపట్నం వెళ్ళిపోయాను. అయినా తరచూ ఉత్తరాలు రాసుకుంటూ నే వుండేవాళ్ళం. ఎం.ఎస్సి. అయిన తర్వాత నేను రిసెర్చి ప్రారంభించి, డాక్టరేట్ సంపాదించాను. తర్వాత బొంబాయిలో ఆటమిక్ రిసెర్చ్ సెంటర్లో ఉద్యోగం దొరికింది. రెండేళ్ళు బొంబాయిలో ఉద్యోగం చేసిన తర్వాత నన్ను మద్రాసుకి కల్పాకం ఆటమిక్ రిసెర్చ్ సెంటర్ కి బదిలీ చేశారు. నాకు ఒక అన్న, చెల్లెలు, ఒక తమ్ముడూ వున్నారు. మా అన్న కెమికల్ ఇంజనీర్. బరోడాలో ఉద్యోగం చేస్తున్నాడు. నా చెల్లెలు బి.ఎస్.సి. చదివింది. పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు. నా తమ్ముడు ఎం.ఎ. పాసై కొంతకాలం ఇక్కడ లెక్చరర్ గా పనిచేసి, ఈ మధ్య లిబియాకి వెళ్ళాడు అక్కడ ఉద్యోగం దొరికితే. ఇది నా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్. పెళ్ళి కాలేదు కనుక మా నాన్న అమ్మ నా దగ్గరే వుండేవారు. మా నాన్న నాకు పెళ్ళి సంబంధాలు చూస్తూనే వున్నారు. నేను మద్రాసుకి బదిలీ అయిన వారంరోజుల తర్వాత మోహన్ ని మళ్ళీ కలుసుకున్నాను. అది కాకతాళీయంగా జరగలేదు.

మోహన్ సదరన్ ఫార్మాస్యూటికల్స్ లో పనిచేస్తున్నాడని తెలుసు. అతనికి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాను. వచ్చాడు. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం తెగిపోయిన మా అనుబంధం మళ్ళీ చిగురేసింది. తను తక్కువ చదువుకున్నాననీ, తన ఉద్యోగం చిన్నదనీ, తన జీతం కూడా చాలా తక్కువ అనీ మోహన్ లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వుండేది ప్రారంభంలో. ఒకళ్ళని ఒకళ్ళు అర్ధం చేసుకుని ప్రేమించుకున్న తర్వాత ఈ తారతమ్యాలు సుఖజీవనానికి అడ్డు రావనీ, తనకన్న ఏ విధంగానూ నేను గొప్పదాన్ని అని అనుకోవడం లేదనీ, నాకు కలిగిన అవకాశం అతనికీ కలిగివుంటే నాకన్నా ఇంకా గొప్ప చదువు చదివి, పెద్ద ఉద్యోగంలో వుండేవాడనీ, నేను అతనికి ఎన్నోసార్లు నచ్చచెప్పాను. నిజం చెప్పాలంటే నేనే ఎక్కువగా బలవంతం చేశాను. పెళ్ళికి ఒప్పించాను" అన్నది శ్రీమతి భార్గవి.

“మీ వాళ్లు ఒప్పుకున్నారా?” అడిగాడు యుగంధర్.

"ఎందుకు ఒప్పుకుంటారు? ముఖ్యంగా మా నాన్నగారు మండిపడ్డారు. చిందులు తొక్కారు. విదేశాలకి వెళ్ళివచ్చిన ఏ గొప్ప సైంటిస్టో నాకు భర్తగా దొరుకుతాడనీ ఒక సామాన్యమైన మెడికల్ రిప్రజెంటేటివ్ ని, ఒక బి.ఎస్.సి.ని పెళ్ళి చేసుకోవడం తెలివి తక్కువ పని అని, బుద్దిలేని పని అని తిట్టారు. చదువుకన్నా సంస్కారమూ గొప్ప ఉద్యోగం కన్నా పరస్పర అనురాగం గొప్ప, జీతం కన్న ప్రేమ ముఖ్యమనీ మోహన్ తో తప్ప మరొకరితో సుఖంగా వుండలేననీ, అతన్నే పెళ్ళి చేసుకుంటాననీ నిశ్చయంగా మా నాన్నగారికి చెప్పేశాను. ఇక వాళ్లు ఏం చెయ్యలేకపోయారు. వాళ్ళ అయిష్టం
వెలిబుచ్చేందుకు, పెళ్ళికి ముందుగానే అమ్మ నాన్న ఇద్దరూ మా అన్నయ్య ఇంటికి బరోడాకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఊరికి వెళ్ళిన నెలరోజుల తర్వాత నేనూ మోహన్ రిజిష్టర్ పెళ్ళి చేసుకున్నాము” అని ఒక చిన్న నవ్వు నవ్వి "కాసిని మంచి నీళ్ళు కావాలి" అన్నదామె. యుగంధర్ తనే వెళ్ళి, గదిలో మూల బల్లమీద వున్న కూజాలోంచి మంచినీళ్ళు గ్లాసులో పోసి తెచ్చి, ఆమె కిచ్చి కూర్చుంటూ, “అంటే మీ పెళ్ళికి మీ నాన్నా, మీ వాళ్ళూ, ఎవరు రాలేదన్నమాట... పోనీ ఆ తర్వాత అయినా మీ వాళ్ళు రాజీపడ్డారా?" అడిగాడు.

“లేదు. మా పెళ్ళికి నా స్నేహితులు, మోహన్ స్నేహితులు వచ్చారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత హోటల్లో డిన్నర్ ఇచ్చాము. నాకు మోహన్ అంటే ఎంత ఇష్టమో... అంతకన్న పదిరెట్లు అతనికి నా మీద ప్రేమ. ఏనాడైనా నాకు తలనొప్పిగా వుంటే ఆఫీసుకి సెలవుపెట్టి, నా పక్కన కూర్చునేవాడు. సామాన్యంగా నేను ఇంటికి వచ్చిన తర్వాతే అతను ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చినప్పట్నించీ, నేను ఏ గదిలో వుంటే ఆ గదిలో, పసి పిల్లాడు తల్లికొంగు పట్టుకుని తిరిగినట్లు, నా కూడా తిరిగేవాడు. నెలలో దాదాపు పది రోజులు టూర్ మీద వెళ్ళేవాడు. టూర్ నుండి వచ్చేనాడు వీలుంటే ముందు ఉత్తరం వ్రాసేవాడు లేకపోతే ట్రంకాల్ చేసి చెప్పేవాడు. టూర్ నుండి రాగానే తలంటి పోయమనేవాడు. ఇలా మా ఇద్దరి దాంపత్యానికి సంబంధించిన వివరాలు. మా ఆనందం సంతోషం చెప్పుకుపోతుంటే రోజులు చాలవు. పెళ్ళయిన రెండేళ్ళకు మాకు కొడుకు పుట్టాడు. 'రవి' అని పేరు పెట్టాము.”

"అప్పటికీ మీవాళ్ళు రాజీపడలేదా? మనవణ్ని చూడటానికి కూడా రాలేదా?" అడిగాడు యుగంధర్.

“లేదు. ఉత్తరం వ్రాస్తే జవాబు కూడా వ్రాయలేదు. అయితేనేం... మేము సృష్టించుకున్న ఆనందమైన ప్రపంచంలో మా జీవితాలు ప్రతిరోజూ ఒక పండగలా గడిచిపోతున్నాయి. నాకు త్వరత్వరగా ప్రమోషన్స్ వస్తున్నాయి. ప్రమోషన్ రావడానికి మోహన్ కి అవకాశంలేదు. అతనికన్నా సీనియర్స్ చాలామంది ఉన్నారు కంపెనీలో. అయినా అది అతన్ని కానీ నన్ను కానీ ఇబ్బంది పెట్టలేదు. మా ఇద్దరి జీతాలు చాలు. డబ్బుకి ఇబ్బంది లేదు. రవికి మూడేళ్ళు రాగానే స్కూల్లో చేర్పించాము. నేనో, మోహనో ఎవరు ముందు ఇంటికి వస్తే వాళ్ళు రవి స్కూలికి వెళ్ళి ఇంటికి తీసుకుని వచ్చేవాళ్ళం. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. రవికి ఎనిమిదేళ్ళు వచ్చాయి. తెలివైనవాడు. క్లాసులో ఎప్పుడూ మొదటి రాంక్" అని నిట్టూర్చింది. అప్రయత్నంగా కళ్ళల్లో నిండిన నీళ్ళని మళ్ళీ చీరకొంగుతో తుడుచుకున్నది భార్గవి.

"చాలా అదృష్టవంతురాలివన్న మాట... మంచి ఉద్యోగం... ఉత్తముడయిన భర్త, తెలివైన కొడుకు... అంతకన్న ఏం కావాలి?" అన్నాడు యుగంధర్.

"అవును. నా ఆనందాన్ని, నా సంతోషాన్ని తలచుకొని నాకే ఒక్కొక్కప్పుడు భయం వేసేది. భగవంతుడికి కూడా ఈర్ష్య కలిగి, ఏ ఆపద ఎవరికి  కలుగుతుందో? మా ఆనందానికి ఏ క్షణంలో విఘాతం కలుగుతుందో అని భయపడేదాన్ని."

"అలా భయపడడానికి ఆధారాలు ఏమైనా వుండేవా?" అడిగాడు యుగంధర్.

“అబ్బే, సూచనకి కూడా అటువంటి ఆధారాలు లేవు. కాని..."

"కాని...?” అడిగాడు యుగంధర్.
👥
*సశేషం*
*అతను అతను కాడు - 6*
👥

రచన: కొమ్మూరి సాంబశివరావు

"కాని?" అడిగాడు యుగంధర్.

"క్షణం ఆగండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చెయ్యకుండా చెప్పాలి మీకు అర్థమయ్యే టట్టు" అని అయిదు నిముషాలు మౌనంగా వుండి, తర్వాత ఒక నిట్టూర్పు వొదిలి "రెండు నెలల క్రితం యధాప్రకారం మోహన్ కంపెనీ పనిమీద టూర్ వెళ్ళాడు. ముందే చెప్పాడు అది చాలా పెద్ద టూర్ అనీ, మూడు జిల్లాల్లో డాక్టర్లనీ, మందుల షాపులవాళ్ళనీ కలుసుకోవాలనీ, దాదాపు ఇరవై రోజుల పైన పట్టవచ్చనీ, మా ఇద్దరి మధ్య ఎన్నడైనా ఘర్షణ అని జరిగితే అది అతని ఉద్యోగం గురించే జరిగేది. అడపా దడపా టూర్ చేసి, ఆరోగ్యం చెడిపోయే ఆ ఉద్యోగం మానేసి, ఇంకేదయినా ఉద్యోగం లో చేరమని చెప్పేదాన్ని నేను. అన్నేళ్ళ సర్వీసు వున్న ఉద్యోగం మానడం తనకి ఇష్టం లేదనీ, ఇంకో రెండు మూడేళ్ళలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం ఇస్తారనీ, అప్పుడు ఇంక టూర్ కి వెళ్ళవలసిన అవసరం వుండదనీ చెప్పేవాడు. అతను ఆ రోజు టూర్ మీద వెళుతున్నప్పుడు మళ్ళీ మా ఇద్దరికీ అదే వాదన జరిగింది.

"మైడియర్! డోంట్ బి సిల్లీ. బహుశా ఇదేననుకుంటాను రిప్రజెంటేటివ్ గా నా చివరి టూర్. సూచనగా మేనేజింగ్ డైరెక్టర్ చెప్పాడు... టూర్నించి రాగానే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రమోట్ చేస్తానని. డోంట్ వర్రీ. ఇక ఇరవైరోజులేగా! వచ్చేస్తాను" అని సామాన్లు తీసుకుని వెళ్లిపోయాడు. ఇరవై రెండు రోజులయినా రాకపోయేసరికి, నాకు కాస్త కంగారు కలిగి వాళ్ల ఆఫీసుకి ఫోన్ చేసి అడిగాను. అనుకున్న ప్రకారం ప్రోగ్రాం పూర్తికాలేదని, రెండు రోజుల క్రితం మోహన్ నుండి రిపోర్టు వచ్చిందనీ, ఇంకో నాలుగయిదు రోజుల్లో వస్తాడనీ చెప్పారు వాళ్ళ ఆఫీసులో వాళ్ళు."

"టూర్ మీద వెళ్లిన తరువాత మీవారు మీకు ఉత్తరం వ్రాయలేదా?" అడిగాడు యుగంధర్.

"వారానికి ఒక ఉత్తరం చొప్పున వ్రాశాడు. ప్రత్యేకంగా విశేషాలు ఏమీ వ్రాయలేదు. తన ఆరోగ్యం బాగుందనీ.. రవిని జాగ్రత్తగా చూసుకోమనీ, నా ఆరోగ్యం కూడా జాగ్రత్త అనీ... అంతే! ఉత్తరం వచ్చి వారంరోజులు అయింది. అందువల్ల ఆఫీసుకి ఫోన్  చేశాను”

"తర్వాత...” అడిగాడు యుగంధర్.

"ఆవేళ పొద్దున్న మబ్బు పట్టింది. రెండు రోజుల పాటు భారీగా వర్షం కురుస్తుందనీ, తుఫాను కూడా రావచ్చనీ పొద్దున్న రేడియోలో చెప్పారు. రవిని స్కూల్లో దింపి, నేను తిరిగి వచ్చేటంతవరకూ స్కూలు బిల్డింగ్ లోంచి బయటకు రావద్దనిచెప్పి ఆఫీసుకు వెళ్ళాను. నా కారు నేనే డ్రైవ్ చేసుకుంటాను. నిజం చెప్పాలంటే ఆ సాయంకాలం ఆఫీసునించి ఇంటికి డ్రైవ్ చెయ్యడం చాలా కష్టమైంది. వైపర్స్ పనిచేస్తున్నా వాన అంత జోరుగా కురుస్తోంది. ఏమీ కన్పించడంలేదు. ఎలాగో నెమ్మదిగా కష్టపడి స్కూల్ కి చేరుకున్నా ను. పోర్టికోలో కారు ఆపగానే రవి వచ్చి కారు ఎక్కాడు. మొత్తానికి తడవకుండా ఇద్దరం ఇంటికి చేరుకున్నాం. టి.వి.లో ఇంగ్లీష్ న్యూస్ విన్న తరవాత భోజనానికి లేచాము.”

“ఇంట్లో వంటమనిషి వుందా?" అడిగాడు యుగంధర్.

"లేదు. నేనే వంట చేసుకుంటాను. సాయంకాలం ఆఫీసునించి రాగానే వంట ముగించేశాను."

“టి.వి.లో ఇంగ్లీషు' న్యూస్ రాత్రి 9-45 నించి పది గంటలవరకూ కదా! మరి చిన్నపిల్లాడు రవి అంతవరకూ మెలుకువ గా అన్నం తినకుండా వుంటాడా?" అడిగాడు యుగంధర్.

"సామాన్యంగా ఎనిమిది గంటలకల్లా అన్నం తిని పడుకుంటాడు. మర్నాడు స్కూలు లేదు. అందువల్ల నాతో కలిసి తినాలని కాచుకున్నాడు."

"దట్ ఈజ్ ఆల్ రైట్. మధ్య మధ్య సందేహాలు కలిగితే అడుగుతూ వుంటాను చాలా చిన్నవి అయినా" అన్నాడు యుగంధర్ నవ్వుతూ. ఆమె తిరిగి నవ్వలేదు. చాలా సీరియస్ గా బల్లమీద వున్న పేపర్ వెయిట్స్ అటూ ఇటూ జరుపుతూ "టి.వి. ఆఫ్ చేశాను. కుర్చీ లోంచి లేచాను. అప్పుడే మెట్లమీద అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరు వచ్చారో తెలుసు. బయట వాళ్ళు ఎవరూ ఇంట్లోకి ఆ రాత్రి సమయంలో రాలేరు. బయట వాచ్ మెన్ వున్నాడు. ఆ విషయం రవికి కూడా తెలుసు.

"అమ్మా... నాన్న..." అంటున్నాడు. ఇద్దరం గదిలోంచి బయటికి వెళ్ళాం. మోహన్ మెట్లు ఎక్కి వస్తున్నాడు. ముద్దగా తడిసి వున్నాడు. బట్టలనుంచి, తలమీద నుంచి నీళ్ళు కారుతున్నాయి.

"సారీ డియర్! గదిలో తివాసీ చెడగొట్టడం దేనికి... పక్కగదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుంటాను. బీరువాలోంచి పంచా అవీ ఇవ్వు" అన్నాడు నవ్వుతూ.

"ఈ రాత్రి ఈ వానలో ఇలా ముద్దగా తడిసి రాకపోతేనేం... పొద్దున్న వరకూ కాచుకుని వుండకపోయావా! లేకపోతే స్టేషన్నించో, బస్టాండ్నించో దేంట్లో వచ్చావో అక్కణ్నించి కారు తీసుకురమ్మని ఫోన్ చెయ్యక పోయావా?" అడిగాను.

“ఏమిటి! ఈ సైక్లోన్ లో నిన్ను కారు తీసుకు రమ్మని ఫోన్ చెయ్యనా! స్టుపిడ్. డార్లింగ్! పొడిబట్టలు ఇవ్వు..."

క్షణంలో తువ్వాల, పొడిబట్టలు బీరువా లోంచి తీసుకుని వచ్చి "కమ్ ఆన్ డియర్
... తల తుడుస్తాను" అన్నాను.

"నో! నో! చాలా ఘోరమైన జలుబు రెండు రోజుల్నుంచీ. దగ్గిరికి వచ్చావో జలుబు మరుక్షణంలో నీకు అంటుకుంటుంది. నువ్వూ, రవీ... ఇద్దరూ, నాకు కాస్త దూరంగా వుండండి, ఆ బట్టలు ఇలా ఎగరెయ్యి” అన్నాడు.

"యు ఆర్ మేకింగ్ టూమచ్ ఆఫ్ యువర్ సిల్లీ కోర్టు" అంటూ అతనికి బట్టలు అందించాను.

మోహన్ టూర్ నుంచి రాగానే, వెళ్ళి గట్టిగా కావలించుకుని, ముద్దుపెట్టుకోవడం రవికి అలవాటు, జేబుల్లోంచి చాక్లెట్లు, ఇంకా ఏవైనా తెస్తే అదీ రవికి ఇవ్వడం పరిపాటి, తండ్రి అలా తనని పలకరించ కుండా బట్టలు తీసుకొని ఇంకో గదిలోకి వెళ్ళేసరికి రవి మొహం మాడ్చుకుని, "అమ్మా" జలుబు అంత సీరియస్ జబ్బా?" అని అడిగాడు. నేను జవాబు చెప్పేలోగా, మోహన్ తల తుడుచుకుంటూ వచ్చి, "అవును యంగ్ మాన్, జాగ్రత్తగా వుండక పోతే జలుబు నిమోనియా అనే రోగం లోకి దింపుతుంది. అంతేకాదు, దరిదాపులకి వచ్చిన వాళ్ళకి అంటుకుంటుంది. ఇన్ని రోగాలకి ఇన్ని మందులు వచ్చాయి. కాని కామన్ కోల్డ్ కి ఇంతవరకూ ఏ మేధావీ మందు కనిపెట్టలేకపోయాడు" అన్నాడు.

"డార్లింగ్! త్వరగా తల తుడుచుకో! ఇప్పటికే ఆలస్యం అయింది. అన్నం తిందువుగాని" అన్నాను.

"అన్నమా! ఇప్పుడా! మందు తీసుకోవాలి. తర్వాత అన్నం" అన్నాడు.

"మందా! ఏం మందూ?" అడిగాను.

"కింద హాల్లో నా బ్రీఫ్ కేస్ బల్లమీదపెట్టాను. తాళం వెయ్యలేదు. వెళ్ళి అందులో రవికి తెచ్చిన చాక్లెట్లు, ఆడుకునేందుకు తెచ్చిన వాటర్ గన్ తీసుకురా. అలాగే బ్రాందీ సీసా వుంటుంది. అది తీసుకురా" అన్నాడు.

"బ్రాందీ అలవాటు ఎప్పట్నించీ?" అడిగాను కోపంగా.

"అంత కోపం ఎందుకు? అలవాటు కాదు డియర్. రెండురోజుల క్రితం జలుబు వచ్చింది. బాగా ఎక్కువయింది. పైగా అక్కడ చాలా చలి. డాక్టర్ చెప్పాడు, మూడు ఔన్సులు బ్రాందీ తాగమని, ఈ జలుబు పొయ్యేటంతవరకూ. తనే ప్రిస్క్రిప్షన్ వ్రాసి, పర్మిట్ కూడా తెప్పించి ఇచ్చాడు. వెరీగుడ్ ఫెలో" అన్నాడు.

నేను కిందికి వెళ్లి అతని బ్రీఫ్ కేస్ తెరిచి చూశాను. అతను చెప్పినట్టే కొడైకెనాల్ లో డాక్టర్ వ్రాసి ఇచ్చిన పర్మిట్ కూడా వుంది. రవికి తెచ్చినవీ, అతనికి బ్రాందీసీసా తీసుకుని వచ్చాను.

“థాంక్స్ డార్లింగ్, ఒక గ్లాసు, కాసిని నీళ్లు తెచ్చిస్తావా?"

"తెచ్చిస్తాను. కాని ఎవరా డాక్టర్? జలుబు చేస్తే బ్రాందీ తాగమని చెప్పిన డాక్టర్. బుద్ధి లేని పని. తరవాత అలవాటయితే" అన్నాను.

మోహన్ విరగబడి నవ్వి "మరీ అంత సంకుచితంగా వుండకూడదు. కాస్త బ్రాందీ తాగినంత మాత్రాన కొంపమునిగిపోదు! డోంట్ వర్రీ" అన్నాడు.

గ్లాసులో బ్రాందీ పోసుకుని, నీళ్ళు కలుపుకుని నెమ్మదిగా తాగుతున్నాడు.

“ఈ తతంగం ఎంతసేపవుతుంది? రవికి ఆకలేస్తోంది" అన్నాను.

"జస్ట్... అరగంట... మరీ ఆకలేస్తే వాడికి అన్నం పెట్టేయి...”

"ఊహు! నేను నాన్నతో తింటాను" అన్నాడు రవి.

భోజనానికి కూర్చునేటప్పటికి దాదాపు పదకొండు గంటలయింది. అన్నం తిన్నాడో లేదో రవి, వెళ్ళి పడుకున్నాడు. రవికి వేరే మంచం వుంది. కాని ముగ్గురికీ కలిసి పడక గది ఒక్కటే. నేను, మోహన్ డబుల్ బెడ్ మీద పడుకుంటాము. మోహన్ సిగిరెట్ తాగుతున్నాడు.

"అంత జలుబు చేస్తే టూర్ మానేసి వెనక్కి వచ్చెయ్యకపోయావా?" అడిగాను.

"ఎలా రాను! పని పూర్తి కాలేదు. పూర్తి చేస్తే మళ్ళీ టూర్ కి వెళ్ళవలసిన అవసరం వుండదు" అన్నాడు ఆవులిస్తూ.

"సారీ డియర్! బాగా అలసిపోయినట్లు న్నావు! ఇంతకీ ఎందులో వచ్చావు?"

"బస్సులో" అన్నాడు సిగిరెట్ ఆస్ట్రలో పడేస్తూ.

"అయితే మరీ టయిర్ అయ్యుంటావు. రా! పడుకుందాం" అన్నాను.

"ఎక్కడికి రాను! బెడ్రూంలోకా? మనిద్దరం ఒక పక్కమీదా! డార్లింగ్ నీకు ఏమైనా మతిపోయిందా?" అడిగాడు నేనేదో అవినీతికరమైన కోర్కె కోరినట్టు.

"ఏం... అభ్యంతరం ఏమిటి?" అడిగాను నిలబడే.

"చెప్పానుగా డార్లింగ్. హెవీ కోల్డు. దగ్గిరికి వచ్చావో నీకు తప్పక అంటుకుంటుంది. వారంరోజులు బాధపడతావు, పైగా నీకు జలుబుచేస్తే ఒక పట్టాన పోదు. ఈ జలుబు తగ్గేటంతవరకూ నేను ఇక్కడ సోఫా కమ్ బెడ్ మీద పడుకుంటాను. ఒక రెండు దిళ్లు, దుప్పటి తెచ్చి ఇవ్వు."

“మోహన్! కాస్త జలుబు చేస్తే.. మసూచికం వచ్చినంత గొడవ చేస్తున్నావు!. మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం కాదుకానీ నీకు చాదస్తం ఎక్కువైంది" అన్నాను కాస్త విసుగ్గా.

"భార్గవీ... నిజంగా నాకు మసూచికం వస్తే నువ్వు నా దగ్గిరికి రావా?" అన్నాడు దీనంగా.

"ఛ! ఛ! అలా అనలేదు. జలుబు వచ్చినందుకు ఇంత హంగామా ఎందుకు? రా, పడుకుందాం"

"నాకూ ఆకలిగా వుంది. కాని వెధవ జలుబు..." అన్నాడు.

ఇక అతనితో వాదించి ప్రయోజనంలేదు. రెండు దిళ్ళు, రెండు దుప్పట్లు, ఒక బ్లాంకెట్ తెచ్చి ఇచ్చి, "గుడ్ నైట్!” అని నేను పడకగదిలోకి వెళ్ళి, రవి పక్కన పడుకున్నాను. నాలుగురోజుల తర్వాత అతనికి జలుబు తగ్గింది. నేను ఆఫీసుకు వెళుతూ "ఆర్ యు ఆల్ రైట్?” అడిగాను నవ్వుతూ
"జలుబు తగ్గింది, కాని ఒంట్లో బాగా లేదు.”

"ఏం?" అడిగాను.

"వీపులో పోటు... అప్పుడప్పుడూ చెస్టులో కూడా వస్తోంది” అన్నాడు.

"నీకు బ్లడ్ ప్రెజర్ లేదు. ఎందుకు ఖంగారు పడతావు? బహుశా మస్కులర్ పెయిన్ అయ్యుంటుంది” అన్నాను.

"అనే అనుకుంటున్నాను. సాయంకాలం డాక్టర్ దగ్గిరికి వెళ్ళాలి. ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది.”

"సాయంకాలం వరకూ ఎందుకూ? ఇప్పుడే వెళ్ళు. ఈ రోజు నువ్వు ఆఫీసుకు వెళ్లొద్దు" అన్నాను.

"సాయంకాలం లోపున ఏమీ ముణిగిపోదు నువ్వు ఆఫీసునించి వచ్చాక వెళదాం" అన్నాడు. సాయంకాలం నేను ఆఫీసు నించి వచ్చేటప్పటికి అతనే వెళ్ళి రవిని ఇంటికి తీసుకువచ్చేశాడు స్కూటర్ మీద.

"అసలే ఒంట్లో బాగాలేదని, స్కూటర్ ఎందుకు తోలావు" కాస్త కోపం నటిస్తూ అడిగాను.

చిన్నపిల్లాడిమల్లే నవ్వి, “డాక్టర్ దగ్గిరికి వెళదామా?" అని అడిగాడు.

"పద!" అన్నాను. తీరా బయలుదేరాక మా ఫ్యామిలీ డాక్టర్ వద్దకు వద్దనీ, స్పెషలిస్టు వద్దకు వెళదామనీ అన్నాడు.

"ఎవరా స్పెషలిస్టు?" అడిగాను.

"డాక్టర్ నటరాజ్, కార్డియాలజిస్టు, ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకున్నాను" అన్నాడు.

నటరాజ్ కన్సల్టింగ్ రూం పూనమల్లి హైరోడ్ మీద ఉంది. మేము వెళ్ళగానే లోపలకు రమ్మన్నాడు. మోహన్ కి బాగా ముందునుండే పరిచయం ఉన్నట్లు చనువుగా పలకరించాడు. అందులో ఆశ్చర్యం ఏముంది! మెడికల్ రిప్రజెంటేటివ్ లకి డాక్టర్లు పరిచయం ఉండడంసహజమే. మోహన్ తన కంప్లయింట్ అని చెప్పాడు. డాక్టర్ ముందు స్టెత్ తో, అతని ఛాతీ అవీ పరీక్ష చేసి తర్వాత బ్లడ్ ప్రెజర్ చూసి ఆ తర్వాత అప్పుడే యి.సి.జి. తీశాడు.
👥
*సశేషం*
*అతను అతను కాడు - 7*
👥

రచన: కొమ్మూరి సాంబశివరావు

"హార్టు కండిషన్ నాకు తృప్తికరంగా లేదు. ఎందుకయినా మంచిది ఎక్సరే కూడా తీయించండి. పక్కనే వుంది ఎక్సరే ఇన్స్టిట్యూట్ వెళ్లి, తీయించుకురండి. తర్వాత నేను వెళ్ళి వెట్ ప్రింట్ చూసి వస్తాను” అన్నాడు. అరగంట తర్వాత డాక్టర్ ఎక్సరే చూసి తిరిగివచ్చి “సారీ మిష్టర్ మోహన్! మీకే తెలియదు. ఎప్పుడో ఈమధ్య మీకు మయోకార్డియక్ ఇన్ ఫ్రాక్షన్ జరిగింది. గుండె కూడా కాస్త ఎన్ లార్జి అయింది. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలి. నేనిచ్చే మందులు మర్చిపో కుండా వాడాలి. ఖంగారుపడవలసిన అవసరం లేదు. యు ఆర్ యంగ్. వయస్సు మీ వైపున్నది. ఇది వయస్సు ముదిరినవారికి వస్తే పరిస్థితి ప్రమాదం అని చెప్పేవాణ్ని” అన్నాడు డాక్టర్.

"విశ్రాంతి అంటే పూర్తిగా, పక్కమీదే వుండాలా?” అడిగాడు మోహన్-

"నో! నో! అలా పక్కమీద వుండకూడదు. అది పాతపద్ధతి. కొంత ఎక్సర్ సైజ్ ఉండాలి. తిరగడం, బరువులుమొయ్యడం లాంటి పని లేకపోతే ఆఫీసుకి కూడా వెళ్ళవచ్చు. కాని ఒక నెలరోజులు సెలవు పెట్టడం మంచిది.

భోజనంలో నూనె పదార్థాలు, సులభంగా జీర్ణం కానివి మానెయ్యండి. మీకు అలవాటుంటే, రోజూ రాత్రి మూడో నాలుగో ఔన్సులు బ్రాందీ తీసుకోండి"
అన్నాడు డాక్టర్.

"ఇంకేమైనా ఇన్ స్ట్రక్షన్స్?" అడిగాడు మోహన్.

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వ్రాస్తూ "అఫ్కోర్స్! మీరిద్దరూ చదువుకున్నవారు. అందులో మిష్టర్ మోహన్! యు ఆర్ ఎ మెడికల్ రిప్రజెంటేటివ్... దాదాపు సగం డాక్టరన్న మాట. ఆవేశం పనికిరాదు ఆరోగ్యం చేకూరే వరకూ. నేను మళ్ళీ చెప్పేటంత వరకూ మీరిద్దరూ విడివిడిగా.... వేరే వేరే గదుల్లో పడుకోవడం మంచిది."

"తప్పదా?" అడిగాడు మోహన్ దిగులుగా.

"యస్, డోంట్ టేక్ రిస్క్, మిసెస్ మోహన్! ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్టర్ మోహన్ ఆవేశపడకుండా చూసుకోవడం మీ వంతు.”

ఆ రాత్రినించీ మోహన్ పడక పక్కనున్న గదిలో. వొంటిగా పడుకునేవాడు. అలా వొంటిగా పడుకోవడం మంచిది కాదనీ... ఏ రాత్రి ఏ నెప్పో వస్తే ఎలా అనీ, పక్కన దూరంగా మంచం వేసుకుని పడుకుంటా ననీ చెపితే వద్దు అని తిట్టాడు. రోజూ పొద్దున్నే వాకింగ్ వెళ్ళేవాడు. సాయంత్రం తనే రవిని స్కూలునించి ఇంటికి తీసుకు వచ్చేవాడు. సెలవు పెట్టాడు నెలరోజులు. ఆరోజు ఆదివారం, సామాన్యంగా ప్రతి ఆదివారం... అతను ఊళ్ళో వుంటే అతనికి షాంపూతో తలకి పొయ్యటం అలవాటు.

"తలకి పోసుకుంటావా?" అడిగాను.

"ఆ! వేడినీళ్ళు పెట్టు.”

“పెట్టాను” అన్నాను. తువ్వాల, షాంపూ తీసుకుని అతనితో పాటు వెనకే వెళ్ళాను. నీళ్ళగది. వరకూ వెళ్ళాక, ఆ రెండూ ఇవ్వమని చెయ్యి జాపాడు.

"నేను పోస్తాను."

"వద్దు" అన్నాడు.

"ఏం?"

"డాక్టర్ ఇన్ స్ట్రక్షన్స్ మర్చిపోయావా?” అన్నాడు. నా మనస్సు చివుక్కుమన్నది. అతను బట్టలు మార్చుకునేటప్పుడు గది తలుపు గడియ వేసుకునేవాడు. ఎందుకని నేను అడగలేదు. పొరపాటునన్నా నా ముందు షర్టు కూడా తీసేవాడుకాడు. అదీ పట్టించుకోలేదు. అతనికి ఓరోజు తలనెప్పి గా వుందంటే మాత్రలు, మంచినీళ్ళు పక్కన బల్లమీద పెట్టాను. తల నిమరడా నికి కూడా సాహసించలేదు. అలా రోజులు గడిచిపోతున్నాయి. అయిదు రోజులక్రితం నేను ఆఫీసు నించి సాయంకాలం ఇంటికి వచ్చాను. రోజూ సామాన్యంగా మోహన్, రవీ ఇద్దరూ హాల్లో నాకోసం కాచుకుని వుంటారు. అవ్వేళ ఇద్దరూ హాల్లో లేరు. తిన్నగా మేడమీదికి వెళ్ళాను. మోహన్ గది తలుపు తెరిచే వుంది. "మోహన్!" అన్నాను. లోపలికి వెళ్ళాను. నన్ను చూసి మాట్లాడకుండా కళ్ళల్లో నిండిన నీళ్ళని తుడుచుకుంటున్నాడు.

"ఏమిటి మోహన్! ఏం జరిగింది?" అడిగాను ఖంగారుగా. ఒక కాయితం ఇచ్చాడు. ఎర్రని సిరాతో వ్రాసి వుంది ఆ ఉత్తరం.

"జాగ్రత్త. పోలీసులకి రిపోర్టు ఇవ్వవద్దు, ఇస్తే ఈ రాత్రికే మీ రవి శవాన్ని చూస్తారు. మేము ఫోన్ చేస్తాము, ఏం కావలసిందీ.”

"ఏమిటి మోహన్ ఈ ఉత్తరం? రవి ఏమయ్యాడు?" అడిగాను. అతను ఏడుస్తున్నాడు. అతను ఏడవడం నాకు తెలిసి అదే మొదటిసారి.

"చెప్పు మోహన్! ఏమిటి జరిగింది?”

"స్కూలు నించి రవిని తీసుకుని వస్తున్నాను. రవి స్కూల్ బ్యాగ్ నేనే పట్టుకున్నాను. ఒక ఫర్లాంగు వచ్చామో లేదో, ఒక పెద్దకారు వచ్చి మా పక్కన ఆగింది. అందులోంచి ఇద్దరు దిగారు. "మిస్టర్ మోహన్!” అడిగాడు ఒకతను. "యస్!" అన్నాను. అంతే, ఈడ్చి చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బకి నేను కింద పడ్డాను. నేను పడుతున్నప్పుడు చూశాను రవిని బలవంతాన ఒక్క లాగు లాగి కారు లోకి తోసేశాడు. కారు వెళ్ళిపోయింది. ఇదంతా అరక్షణంలో జరిగింది. నేను కింద పడుతున్నప్పుడు నన్ను కొట్టిన మనిషి ఈ ఉత్తరం చేతిలో పెట్టాడు.”

"వీధిలో జనం ఎవరూ లేరా?" అడిగాను.

"మేము హైరోడ్ మీద కాక, పక్కనున్న సందులోంచి వస్తాము రోజూ. ఎవరూలేరు. తర్వాత ఎవరో వచ్చారు. వాళ్ళు వచ్చే లోపున నేను ఈ ఉత్తరం చదివాను. ఏం జరిగింది? ఎందుకు కిందపడ్డావని వాళ్ళు అడిగారు. కాలు జారిపడ్డానని అబద్ధం చెప్పాను" అన్నాడు. అతని కంఠస్వరం వొణుకుతోంది.

"కారు నెంబర్ చూశావా?”

"లేదు. అంత వ్యవధి లేదు. చూసివున్నా మాత్రం ఏం ప్రయోజనం? మనం పోలీసులకి రిపోర్టు ఎలా ఇస్తాము? రవి ప్రాణాన్ని బలియివ్వడమే అవుతుంది. లక్ష లక్షన్నరనో... ఎంత డబ్బు అడుగుతారో... ఫోన్ చేస్తామన్నారు.

"గుండె రాయిచేసుకో! ఆ ఫోన్ కాల్ కోసం కాచుకోవాలి" అన్నాడు మోహన్. నా మతి స్తంభించిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. ఆ గూండాలకి లొంగకూడదనీ, వెంటనే పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలనీ అన్నాను మోహన్ తో. అది వివేకమైన పని కాదనీ, ఇలా కిడ్నాప్ చేసేవాళ్ళు పోలీస్ కంప్లెయింట్ ఇస్తే తప్పకుండా రవిని చంపేస్తారనీ నచ్చచెప్పాడు. అతను చెప్పిన విషయంలోనూ నిజం వుంది. సరే, టెలిఫోన్ వంక చూస్తూ కూర్చున్నాను. మోహన్ వంటింట్లోకి వెళ్లి కాఫీ చేసి తెచ్చి ఇచ్చాడు.

"ఇదేమిటి డియర్ నేను చెయ్యనా!" అన్నాను.

"నువ్వు చెయ్యవని కాదు" అని నా కెదురుగా కూర్చున్నాడు. ఇద్దరం కాఫీ తాగుతూ, గడియారం చూస్తున్నాం. సరిగ్గా ఎనిమిది గంటలకి టెలిఫోన్ మోగింది. మోహన్ రిసీవర్ తీశాడు. క్షణం తర్వాత నన్ను రమ్మని సంజ్ఞ చేసి, "నీతో మాట్లాడాలిట... వాళ్ళే..." అన్నాడు రహస్యంగా.

"హల్లో!" అన్నాను.

"హల్లో! డాక్టర్ భార్గవిగారా?”

"అవును"

"మీ అబ్బాయి రవి మాట్లాడుతాడు, వింటారా?" నా సమాధానం కోసం కాచుకోలేదు.

"అమ్మా! అమ్మా! నేను రవిని, నన్ను వీళ్ళు..." అంతే మళ్ళీ రవి మాటలు వినిపించలేదు.

"మీ అబ్బాయి రవి మా దగ్గిర క్షేమంగా వున్నాడని తెలిసిందా?” అడిగాడు.

"ఆ! ఎంత కావాలి?" అడిగాను.

"డబ్బా! డబ్బు అయితే మీకే ఇస్తాము. మాకు కావలసింది డబ్బు కాదు."

"మరేం కావాలి?" అడిగాను.

"బొంబాయి నించి యురేనియం మీ డిపార్టుమెంట్ కి తెస్తున్నారు శుద్ధి చెయ్యడానికి, ఎప్పుడు, ఎలా వస్తోంది? ఆ వివరాలు కావాలి. ఆ వివరాలు మీరు చెప్పిన అరగంటకల్లా రవిని మీ ఇంట్లో సురక్షితంగా దింపుతాము. చెప్పకపోతే రవి శవాన్ని మీకు అందజేస్తాము.”

"ఆ వివరాలు నాకు తెలియవు" అన్నాను.

"ఇప్పటికింకా తెలియదేమో! బహుశా ఇంకో రెండు మూడు రోజుల్లో తెలుస్తాయి. అంతవరకూ రవిని చాలా జాగ్రత్తగా గారాబంగా చూసుకుంటాము. రెండు మూడు రోజుల్లో తెలియకపోతే... మీరు తెలుసుకునేందుకు ప్రయత్నించి, మాకు కావలసిన వివరాలు తెలుసుకుని, చెప్పవలసిన బాధ్యత మీది. మీకు మీ అబ్బాయి ప్రాణాలతో కావలిస్తే... పోలీస్ లకి కానీ, ఆఫీసులో కానీ ఎవరికీ చెప్పవద్దు. బివేర్...” ఫోన్ పెట్టేశాడు.

"ఎంత అడిగాడు?" అని మోహన్ ప్రశ్న.

చెప్పాను.

"నీకు నిజంగా తెలియదా ఆ యురేనియం ఎప్పుడు, ఎలా వచ్చేదీ?" అడిగాడు మళ్ళీ.

"మోహన్! నీతో అబద్ధం ఎందుకు చెపుతాను?" అన్నాను.

"తెలుసుకోలేవా?" అడిగాడు మళ్ళీ.

"ఎలా తెలుసుకుంటాను? డైరెక్టర్ తనంతట తను చెపితే కానీ, నేనే అడిగితే చెప్పరు సరికదా... నామీద అనుమానం కలుగుతుంది" అన్నాను.

"తెలుసుకునే అవకాశాలు?" అడిగాడు.

"నాకేం తెలియదు.
"డార్లింగ్! ఇది మన రవి ప్రాణానికి సంబంధించిన విషయం. తాత్సారం పనికిరాదు. నువ్వు డిప్యూటీ డైరెక్టర్ వి. తెలుసుకోవాలని నిశ్చయించుకుంటే తెలుసుకోగలవు. నీకన్నా మీ డిపార్ట్మెంట్లో సీనియర్ ఒక్కడే- డైరెక్టర్ నారాయణన్. అవసరమైతే అతన్ని కబుర్లలోకి దింపి ఆ రహస్యం కనుక్కో. ఎంత త్వరగా మనం ఆ రహస్యం వాళ్ళకి చెపితే అంత త్వరగా మన రవి మనకి దక్కుతాడు" అన్నాడు.
📖

మర్నాడు రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకి మళ్ళీ ఫోన్ చేశాడు అతను. నాకింకా తెలియలేదన్నాను, తెలుసుకుని చెప్పమన్నాడు.

"మోహన్! నేను ఆ రహస్యం తెలుసుకుని వాళ్ళకి చెప్పినా రవిని మనకి క్షేమంగా ఒప్పగిస్తారని నిశ్చయం ఏమిటి?" అడిగాను.

"ముందు నువ్వు ఆ రహస్యం తెలుసుకో. ఆ యురేనియం ఎప్పుడు, ఎలా ఎవరు తీసుకుని వస్తున్నారో... ప్లేన్ లో వస్తోందా? స్పెషల్ చార్టర్ ప్లేనా? ఎవరు తీసుకుని వస్తున్నారు? ఏమిటి కట్టుదిట్టాలు! నాకు చెప్పు! తర్వాత వాళ్ళతో బేరం ఆడడం... రవిని మనకి ఒప్పచెపితే కాని రహస్యాలు చెప్పనని చెప్పడం... రవిని తీసుకురావడం నా వంతు” అన్నాడు మోహన్.

"వాళ్ళు ఇన్ని వివరాలు అడగలేదే?" అన్నాను అయోమయంగా.

"ఇప్పుడు అడగలేదు. తర్వాత అడుగుతారు. అందుకనే ముందే తెలుసుకోమన్నాను.”

"నాకేదో భయంగా వుంది."

"భయం ఏమీ లేదు. నేను చెప్పినట్లు చెయ్యి, రవిని సురక్షితంగా ఇంటికి తీసుకు వచ్చే బాధ్యత నాది” అన్నాడు మోహన్.

"రవి ఏమయ్యాడు? అని నౌఖర్లు, స్కూల్లో వాళ్ళు అడగలేదా?” అడిగాడు యుగంధర్.

"అడిగారు. రవిని వాళ్ళ తాతగారికి జబ్బుగా వుంటే వూరికి పంపించామని అబద్ధం చెప్పాము" అన్నది భార్గవి.

యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు. “చాలాసేపయింది. మీరు, నేను భోజనం కూడా చెయ్యలేదు. భోజనం చేస్తూ మిగతా వివరాలు చెప్పండి” అని బెల్ నొక్కాడు. ఒక కానిస్టేబుల్ రాగానే భోజనాలు ఏర్పాటు చెయ్యమని చెప్పాడు యుగంధర్..

"రెడీ సర్!" అన్నాడు ఆ కానిస్టేబుల్.

"పదండి! అవతల గదిలో భోజనాలు ఏర్పాటు చేశారు" అన్నాడు యుగంధర్.
👥
*సశేషం*
꧁☆•

*అతను అతను కాడు - 8*
👥

రచన: కొమ్మూరి సాంబశివరావు

"పదండి! అవతల గదిలో భోజనాలు ఏర్పాటు చేశారు" అన్నాడు యుగంధర్.

"నాకు ఆకలి వెయ్యడంలేదు" అన్నది భార్గవి.

“అవును. ఆకలి వెయ్యదు. మానసిక క్షోభ ఆకలిని చంపేస్తుంది. కానీ తిండి తినకుండా నీరసించి, మీరు సాధించేది ఏమీలేదు. రండి" అన్నాడు యుగంధర్.

యుగంధర్, భార్గవీ పక్కనున్న ఇంకో గదిలోకి వెళ్ళారు. బల్లమీద రెండు కంచాలు, విడివిడిగా టిఫిన్ కారియర్ గిన్నెలు వున్నాయి.

"మనమే వడ్డించుకోవాలి. ఎవర్నీ లోపలికి రావద్దన్నాను" అని తనే అన్నం రెండు కంచాల్లో వడ్డించాడు. భార్గవి కూడా కూరా, కూటూ వడ్డించింది.

"ఊ! తర్వాత! చెప్పండి" అన్నాడు యుగంధర్.

భార్గవి గొంతు సవరించుకుంది. “అలా వాళ్ళు రోజూ ఫోన్ చేస్తూనే వున్నారు. నాకింకా ఏమీ తెలియదని చెపుతూనే వున్నాను. ఇలా ఇంకో రెండు రోజులు గడిచాయి” అని ఆగిపోయింది.

"చెప్పండి” అన్నాడు యుగంధర్.

"తర్వాత చెప్పడం... నిజంగానే అఫీషియల్ సీక్రెట్ ని బయటపెట్టడం అవుతుంది. క్షమించాలి" అన్నది భార్గవి.

యుగంధర్ నవ్వి, ఎడంచెయ్యి కోటు జేబు లోకి పోనిచ్చి, ఒక కార్డు తీసి, భార్గవికి ఇచ్చాడు.

"ఏ ప్రభుత్వోద్యోగి, ఏ విషయం డిటెక్టివ్ యుగంధర్ కి చెప్పినా, అది అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ని ఉల్లంఘించినట్టు కాదు" హోంమినిష్టర్ సంతకం, ముద్ర వుంది కింద. భార్గవి ఆ కార్డు చూసి "ఎక్స్ క్యూజ్ మి మీకు అధికార వర్గాలలో అంత పరపతి వున్నదని నాకు తెలియదు" అన్నది.

"పరపతి కాదు. అవసరం. ఇప్పుడిక ధైర్యంగా చెపుతారా?" అడిగాడు.

"నిన్న డైరెక్టర్ నారాయణన్ నన్ను తన గదికి రమ్మని పిలిపించి, ఇక ఆరు రోజుల్లో తారాపూర్ నుండి యురేనియం వస్తుందని దాన్ని శుద్ధిచేసే ఏర్పాట్లు చెయ్యమనీ చెప్పారు. అప్పటివరకు నాకూ ఆ విషయం తెలియదు. డైరెక్టర్ 'నారాయణన్' ఆ విషయం చెప్పగానే తుఫానులో ఇరుక్కు న్నట్లయింది. ఈ రహస్యం వాళ్ళకి చెప్పి, నా రవి ప్రాణం కాపాడుకోవడమా, లేక దేశ క్షేమం కోసం రహస్యం చెప్పకుండా వుండి, రవి ప్రాణాన్ని బలి ఇవ్వడమా! ఏదీ  సరిగ్గా నిర్ణయించుకోలేకపోయాను. మీ పేరు జ్ఞాపకం వచ్చింది. మీరు తప్పక సహాయం చెయ్యగలరనీ, నన్ను, నా రవినీ రక్షిస్తారనీ ఆశతో మీకు ఫోన్ చేశాను.”

యుగంధర్ అయిదు నిముషాలపాటు మౌనంగా వుండిపోయాడు.

"ఏమిటి ఆలోచిస్తున్నారు?” అడిగింది భార్గవి.

"మీరు నాకు ఫోన్ చేసిన విషయం వాళ్ళకి తెలిసిపోయింది. కాని, మీ డైరెక్టర్ నారాయణన్ యురేనియం ఆరు రోజుల్లో వస్తుందని మీతో చెప్పిన విషయం వాళ్ళకి ఎందుకు తెలియలేదు? అదే విషయం ఆలోచిస్తున్నాను. మీ గదిలో వుండగా మీ దగ్గర వున్న వస్తువూ, డైరెక్టర్ గదిలోకి వెళ్ళినపుడు మీ దగ్గిర లేని వస్తువూ ఏదో జ్ఞాపకం చేసుకుని చెప్పగలరా?" అని అడిగాడు.

"నా హ్యాండ్ బ్యాగ్..." అన్నది భార్గవి వెంటనే.

"అలాగా... నేను వెళ్ళి మీ హ్యాండ్ బ్యాగ్ పరీక్షచేసి వస్తాను” అని యుగంధర్ అవతల గదిలోకి వెళ్ళిపోయాడు. యుగంధర్ సహాయం చెయ్యగలడా! ఇంకా తను అసలు విషయం చెప్పనేలేదు. అదీ చెప్పిన తర్వాత ఏమంటారు? అని ఆలోచిస్తోంది.

"యస్! యు ఆర్ కరెక్ట్. మీ హ్యాండ్ బ్యాగ్  క్లిప్ కి చిన్న ట్రాన్స్ మీటర్ ఏర్పాటు చేశారు. ఆ హ్యాండ్ బ్యాగ్  మీ దగ్గర పది గజాల దూరంలో వున్నంతసేపు మీరు ఎవరితో ఏది మాట్లాడినా వాళ్ళకి వెంటనే తెలుస్తుంది. మీ అదృష్టం, డైరెక్టర్ గదిలోకి వెళ్ళినపుడు హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళలేదు. దటీజ్ ఆల్ రైట్! ఇంకో చిన్న సందేహం. నిన్న రాత్రి నన్ను రమ్మనీ, తోవలో కారు ఆపుతాననీ చెప్పి, ఆపకుండా ఎందుకు వెళ్ళిపోయారు?" అడిగాడు యుగంధర్.

"ఆఫీసు గేటు దాటగానే బైట మోహన్ ఎదురయ్యాడు. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారనీ, ఎలాగయినా ఆ రహస్యం తెలుసుకుని రవిని రక్షించాలనీ అన్నాడు. మోహన్ నా పక్కన వుండగా కారు ఆపడం మీతో మాట్లాడడం ఇష్టంలేక.. అంటే వివేకమైన పనికాదు అని ఆపలేదు. ఆ విషయం మీరు గ్రహించాలని నా జేబు రుమాల కిందపడేశాను" అన్నదామె.

యుగంధర్ సిగిరెట్ వెలిగించి, "భార్గవి గారూ! మోహన్, మీరూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. చాలా ఆనందంగా సుఖంగా దాంపత్యం సాగిస్తున్నారు. మీ మధ్య ఎటువంటి మనస్పర్థలూ లేవు. అలాంటప్పుడు, నాతో సంప్రదించడం మీ భర్తకి తెలియకూడదని... వివేకం కాదని మీరు ఎందుకు నిర్ణయించుకున్నారు?” అడిగాడు.

భార్గవి చాలా ఇబ్బందిగా అటు ఇటూ చూసింది.

"ఈ మోహన్... నా మోహన్ కాదని... నా భర్త కాడని... అతను, అతను కాడని అనుమానం వల్ల...” అన్నది నెమ్మదిగా.

"వాట్! మీ భర్త అవునా, కాదా తెలుసుకో లేకపోయారా? దాదాపు పదేళ్ళు కాపురం చేసిన తర్వాత భర్తని గుర్తుపట్టలేని స్త్రీ వుంటుందా?" అడిగాడు ఆశ్చర్యంతో.

"ప్రారంభంలో నాకు అసలు అటువంటి అనుమానం కలగలేదు. డాక్టర్ నటరాజ్ మా ఇద్దరికీ శరీర సంబంధం ఉండకూడద ని చెప్పిన తర్వాత కూడా నాకు ఎటువంటి అనుమానం కలగలేదు. అనుమానం కలగడానికి అతని ముఖంలో, మాటల్లో, ఉచ్ఛారణలో, కదలికలో, అతని మాటల ధోరణిలో... నా మోహన్ కి ఇతనికి ఎటువంటి వ్యత్యాసమూ లేదు... కాని...’

"కాని, అతను టూర్ నుండి వచ్చినప్పటి నించీ తనని ఆఖరికి చిటికెనవేలు కూడా ముట్టుకోవడానికి వీలులేకుండా చేశాడు. ప్లాస్టిక్ సర్జరీతో మొహం మోహన్ లా తయారుచేసుకోవచ్చు. అతనిలా నటించ వచ్చు. కాని దగ్గరగా వున్నప్పుడు ఆ మొగుడు తన భర్త అయినదీ కానిదీ తెలిసిపోతుంది" అన్నది భార్గవి.

"క్షమించమ్మా! అలాటి పరిస్థితి ఏర్పడడం వల్లే అతను నీ భర్త కాడని అంటున్నావా?" అడిగాడు యుగంధర్.

"ఛ! ఛ! అటువంటి పరిస్థితి రాకుండా జలుబనీ, గుండెజబ్బనీ, అతను ఏదో వంకన పడకగదిలోకి నా దగ్గిరకి రావడానికి జంకాడు" అన్నది భార్గవి.

"అతను మీ దగ్గిరికి రాకుండా వుండడానికి సమంజసమైన, సమర్ధనీయమైన కారణాలు వున్నాయిగా?" అడిగాడు యుగంధర్.

“అదొక్కటే కాదు... రవిని వాళ్లెవరో ఎత్తుకు పోయిన నాటినించీ, అతను ప్రదర్శిస్తున్న ఆందోళన, దుఃఖం నిజంకావని నాకు అనిపిస్తోంది. అదంతా నటన లాగా
అనిపించింది. అంతేకాదు. మోహన్ వీపు మీద ఎడం వైపు ఒక పెద్ద పుట్టుమచ్చ వుంది. ఆ పుట్టుమచ్చ వున్నదో లేదో నేను చూస్తాననే అతను తన షర్టు కూడా నా ముందు తియ్యకుండా జాగ్రత్తపడ్డాడు.”

"అంతేనా... మీ అనుమానాలకి ఇంకా కారణాలు ఏమైనా వున్నాయా?” అడిగాడు యుగంధర్.
"నిజానికి నాకు అతనిమీద అనుమానం మొదటిసారి కలిగింది రవిని వాళ్ళు ఎత్తుకుపోయిన రోజున. వాళ్ళు రాత్రి ఫోన్ చేస్తారని చెప్పాడు. వాళ్లు ఫోన్ చెయ్యగానే, “నీతోనే మాట్లాడాలిట” అని టెలిఫోన్ నాకు ఇచ్చేశాడు. నా మోహన్ అయితే అలా చెయ్యడు. తనే వాళ్లతో మాట్లాడేవాడు. తనకి చెపితేకాని నాకు టెలిఫోన్ ఇవ్వనని చెప్పేవాడు. ఆనాటి నించి అనుమానం కలిగినప్పటినించీ, జాగ్రత్తగా అతన్ని పరిశీలిస్తున్నాను. చిన్న చిన్న విషయాలు ఒక వంద చెప్పగలను. భర్తని గురించి భార్యకి తెలిసినవి. ఈ మోహన్... నా మోహన్... నా భర్త కాడని నాకు అనుమానం కాదు. నిశ్చయంగా తెలుసు" అన్నది.

యుగంధర్ ఆలోచిస్తున్నాడు.

“యుగంధర్ గారూ! ఇతను నా భర్త మోహన్ కాకపోతే నా భర్త మోహన్ ఏమయ్యాడు ? మోహన్ ని చంపేసి వుంటారా? నా రవిని రక్షించగలమా! ప్లీజ్ చెప్పండి" అడిగింది.

"ఈ మోహన్ మీ భర్తకాడని కేవలం మీ అనుమానం. ఇంకా నిదర్శనాలు ఏమీ లేవు. కనీసం అతని వీపుమీద ఉన్న పుట్టుమచ్చ వుందో లేదో కూడా మీరు చూడలేదు. చూడగలరా?"

"ఊహు! అవకాశం ఇవ్వడు. కాని మోహన్ వేలిముద్రలు పోలీస్ రికార్డులలో వుంటాయనుకుంటాను” అన్నది భార్గవి.

"మోహన్ వేలిముద్రలు పోలీస్ రికార్డుల్లోనా!" ఒక్కసారిగా అడిగాడు ఆశ్చర్యంతో.
👥
*సశేషం*
*అతను అతను కాడు - 9*
👥
"మోహన్ వేలిముద్రలు పోలీస్ రికార్డుల్లోనా!" ఒక్కసారిగా అడిగాడు ఆశ్చర్యంతో.

"ఆరు నెలల క్రితం మా ఇంట్లో దొంగలు పడ్డారు. ఒక ట్రాన్సిస్టర్, రెండు ఎవర్ సిల్వర్ జగ్ లు తీసుకువెళ్ళారు. అప్పుడు పోలీస్ కంప్లయింట్ ఇచ్చాము. ఇంట్లో వాళ్ళందరి వేలిముద్రలు తీసుకున్నారు పోలీసులు” అన్నది ఆమె.

"అయితే ఈ మోహన్, మీ భర్త అవునో కాదో చాలా సులభంగా తేలిపోతుంది. ఎలాగో మీరు ఈ మోహన్ వేలిముద్రలున్న సిగరెట్ కేసో, లైటరో ఆఫీసుకు తీసుకుని వెళ్ళండి. డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ స్వరాజ్య రావు మీ ఆఫీసుకి వస్తారు. ఆయనకి అది ఇవ్వండి. మీరు మీ గదిలోంచి, నాతో మాట్లాడుతున్నప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్ ని టేబిల్ సొరుగులో పెట్టి తాళం వెయ్యండి. అంతేకాక, మరెక్కడయినా మీ వొంటిమీద మైక్రోట్రాన్స్ మీటర్ పెట్టారేమో జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాత్రి వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే, ఒకటి రెండు రోజుల్లో రహస్యం కనుక్కుని చెపుతానని వాళ్ళకి హామీ ఇవ్వండి. కాని ఆ రహస్యం చెప్పడం... రవిని మీకు సురక్షితంగా ఒప్పగించడం ఈ పని మోహన్ కి వదిలి పెట్టలేననీ... అతనికి అసలే గుండెజబ్బనీ, ఆ పనికి వేరే ఇంకొకర్ని పంపిస్తాననీ వాళ్ళకి చెప్పండి. రెండు రోజులు వ్యవధి తీసుకోండి చాలు. ఈలోగా నా శాయశక్తు లా ప్రయత్నించి రవిని కాపాడుతాను. మీ భర్త మోహన్ గురించి తెలుసుకుంటాను. మీ భర్తని చంపేసి వుంటారని అనుకోను. మీరు రహస్యం చెప్పిన తర్వాత మోహన్ని కూడా వదిలేస్తారు. ఒకసారి వాళ్ళ వలలో చిక్కుకున్నాక మీరు జీవితాంతం వాళ్ల సేవలో వుండవలసివస్తుంది. చాలా ముఖ్యమైన పెద్ద ఉద్యోగంలో వున్న మిమ్మల్ని వాళ్ళ బానిస చేసుకోవడంవల్ల, వాళ్ళకి చాలా లాభం. అధైర్యపడకండి" అని యుగంధర్ లేచి నిలబడి "మీరు అవతల గదిలోకి వెళ్లి మళ్ళీ మీ ఆభరణాలు వేసుకొని, హ్యాండ్ బ్యాగ్ తో సహా తిరిగిరండి. నేను మాట్లాడుతాను. ''మీరు మాత్రం 'ఊ' 'ఆ' అని మాత్రం జవాబు చెప్పండి. తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ నేను కలుసుకొంటాను” అన్నాడు యుగంధర్.

పదినిముషాల తర్వాత శ్రీమతి భార్గవి గాజులు, ఉంగరమూ, మెళ్ళో దండ వేసుకొని, హ్యాండ్ బ్యాగ్ తో సహా తిరిగివచ్చింది.

యుగంధర్ తన కంఠస్వరం పూర్తిగా మార్చేశాడు. "డాక్టర్ శ్రీమతి భార్గవీ మోహన్ గారు! వెయ్యి క్షమాపణలు. ఆఫీసులోంచి రహస్యమైన పత్రాలు మీరు తీసుకొని వచ్చారనీ, మీ హ్యాండ్ బ్యాగ్ లో దాచారని ఎవరో ఆకాశరామన్న ఫోన్ చేశాడు. మన దేశక్షేమానికి సంబంధించిన విషయాలలో తాత్సారం పనికికాదని వెంటనే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకొన్నాం. మీ బ్యాగ్ లో ఏ కాయితాలూ లేవు మీ వారి ఫోటో, మీ అబ్బాయి ఫోటో తప్పు. మీరు చెప్పిన విషయాలను బట్టి, మేము పొరబడ్డామని అర్థమైంది. మీ పై ఆఫీసర్ ఫోన్ చేసి మీరు ఎన్నడూ అలాటిపని చెయ్యలేరని చెప్పారు. కనుక మరొకసారి మా క్షమాపణలు. మీరు వెళ్ళవచ్చు. మా పోలీస్ వేన్ లో మిమ్మల్ని ఇంటివద్ద దింపుతాము."
📖

వేలిముద్రల ఫోటోలు రెండు బల్లమీద పెట్టి "ఆమె అనుమానం సరయినదే. ఇప్పుడు శ్రీమతి భార్గవిగారి భర్తగా నటిస్తున్న మనిషి, అసలు హెహన్ కాడు. వేలి ముద్రలు అబద్ధం చెప్పవుగా?" అన్నాడు ఇన్స్ పెక్టర్ స్వరాజ్యరావు.

"మీరే వెళ్ళి తెచ్చారా?” అడిగాడు యుగంధర్.

"లేదు. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గా  సి.బి.ఐ. ఆఫీసర్ ఒకడు అక్కడే పని చేస్తున్నాడు. అతను భార్గవి గదిలోకి వెళ్ళి తెచ్చాడు సిగరెట్ కేసు.”

"పని చాలా సులభంగా జరిగిందన్నమాట!" అన్నాడు రాజు.

డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ స్వరాజ్యరావు చిన్నగా దగ్గాడు.

"ఏమిటి?" అడిగాడు యుగంధర్.

"ఈ కేసు గురించిన వివరాలు ఏవీ నాకు తెలియదు. ఎవరూ చెప్పలేదు. మీకు అభ్యంతరం లేకపోతే అసలు” అంటున్నాడు స్వరాజ్యరావు.

“పెద్ద రహస్యమేమీ కాదు. నిజానికి దినపత్రికలు చదివే ప్రతిమనిషికి  ఈ వివరాలు తెలుసు. చెపుతాను వినండి. తారాపూర్ ఆటమిక్ పవర్ ప్లాంట్ స్థాపించి నప్పుడు మన ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వచ్చింది. తారాపూర్ లోని న్యూక్లియర్ పవర్ ప్లాంటుకి కావలసిన యురేనియం సంవత్సరానికి కావలసినది మనకి ఇచ్చేటట్టు, అంటే ధర్మానికి కాదు. మన ప్రభుత్వం డబ్బు చెల్లించింది. 1974 సరవత్సరంలో మన ప్రభుత్వం మొట్ట మొదటిసారి పరిశోధనా ప్రక్రియగా, రాజస్థాన్ లో ఆటమిక్ బాంబు ని పేల్చింది. అలా పేల్చడంలో న్యూక్లియర్ పవర్స్ అనబడే దేశాలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ తో పాటు ఒకటిగా మన దేశానికి ఒక స్థాయి, గౌరవం చేకూరింది. అంటే మనం అవసరమైన ఆటంబాంబులు చెయ్యగల శక్తి, పరిజ్ఞానమూ, సాంకేతిక నైపుణ్యమూ మన దేశానికి వున్నదని ఋజువుచేశాము. ఇది అమెరికాకి నచ్చలేదు. అలా ఆటమిక్ యుద్ధం వస్తే అమెరికా రక్షణ ఇస్తుందనీ, ఆటంబాంబులు, చెయ్యబోమనీ ఒక ఒప్పందానికి రమ్మని మన ప్రభుత్వాన్ని అమెరికా ప్రభుత్వం చాలాకాలం నించి ఒత్తిడి చేస్తోంది. మన ప్రభుత్వం అణు శక్తిబాంబుని పేల్చి చూసించి, ఒక ఆటమిక్ పవర్ గా స్థానం సంపాదించుకోవడం అమెరికా ప్రభుత్వానికి ఏమీ నచ్చలేదు. అప్పట్నుంచీ ఏదో ఒక మిషమీద తారాపూర్ లో వున్న మన ఆటమిక్ ప్లాంటుకి కావలసిన యురేనియాన్ని సరఫరా చెయ్యడం మానేసింది.

మొదట ఇరుదేశాల మధ్య ఒప్పందం ప్రకారం, 1983 సంవత్సరం వరకూ అమెరికా మనకి యురేనియం సరఫరా చెయ్యాలి.. మనం ఉపయోగించబడిన యురేనియం అమెరికాకి తిరిగి మనం ఇచ్చేయాలి. కాని, ఎప్పుడయితే అమెరికా ఒప్పందం ప్రకారం యురేనియం సరఫరా చెయ్యడం ఆపేసిందో, అప్పట్నుంచీ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించినట్లే పరిగణించాలి. కనుక, మనం ఇక్కడ ఉపయోగించిన యురేనియాన్ని తిరిగి అమెరికాకి ఇవ్వవలసిన అవసరమూ లేదు. ఒకసారి ఉపయోగించిన యురేనియాన్ని శుద్ధిచేసి, మళ్ళీ తిరిగి ఉపయోగించవచ్చు. యురేనియం కొరత వల్ల తారాపూర్ ప్లాంటులో పని ఆగిపోకుండా వుండేందుకు, ఒకసారి ఉపయోగించిన యురేనియాన్ని శుద్ధిచేసి మళ్ళీ వాడడానికి మన ప్రభుత్వం పూనుకున్నది. ఒప్పందం ప్రకారం ఆ హక్కు మన ప్రభుత్వానికి లేదని అన్నది అమెరికా ప్రభుత్వం. ఒప్పందం ప్రకారం యురేనియం సరఫరా చెయ్యకపోవడంవల్ల డబ్బు ఇచ్చి కొనుక్కున్న యురేనియాన్ని తిరిగి వాళ్ళకి ఇవ్వమని అడిగే హక్కు లేదన్నది భారత ప్రభుత్వం. ఇది అసలు కథ" అన్నాడు యుగంధర్.

"శ్రీమతి భార్గవిగారి కేసు గురించి మిమ్మల్ని చెప్పమంటే మీరు ఏవో రాజకీయాలు చెబు తున్నారు" అన్నాడు. ఇన్స్ పెక్టర్ స్వరాజ్యరావు.

యుగంధర్ నవ్వి "చెప్పుతున్నాను. కల్పాకం ఆటమిక్ రీసెర్చి స్టేషన్ లో యురేనియం శుద్దిచేసే ఏర్పాట్లు చేశారు. డాక్టర్ భారవి ఉపయోగించిన యురేనియా న్ని శుద్ధి చెయ్యడం పరిశోధన చేసిన ప్రవీణురాలు. బొంబాయి నించి యురేనియం కల్పాకంకి ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసుకోవాలని విదేశ గూఢచారులు పూనుకొన్నారు.”

“ఎవరా విదేశ గూఢచారులు? తెలుసుకొని ఏం చేస్తారు?" అడిగాడు రాజు.

"అమెరికన్ సి.ఐ.ఏ. వాళ్ళు కావచ్చు. ప్రత్యక్షంగా తాము చెయ్యడం ఇష్టం లేకపోతే పాకిస్తాన్ గూఢచారులని ఈ పని చెయ్యమని అడిగి వుండవచ్చు. లేదా చైనీస్ గూఢచారులు అయ్యుండవచ్చు. అది మనం తెలుసుకోవాలి. యురేనియం ఎప్పుడు ఎలా కల్పాకంకి వస్తుందో తెలుసుకుని వాళ్ళేం చేస్తారు? అదే మనం తెలుసుకోవాలి. యురేనియం తెస్తుండగా ఆ యురేనియాన్ని దోపిడీ చేసే పథకం వేశారేమో! లేదా యురేనియం కల్పాకం చేరుకొన్న తర్వాత కల్పాకం రీసెర్చి సెంటర్ ని నాశనం చేసే పథకం వేశారేమో! ఈ వివరాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇవి దేశరక్షణకి సంబంధించినవి. అసలు మోహన్ ఏమయ్యాడు! శ్రీమతి భార్గవి కొడుకు రవిని ఎక్కడ బంధించిపెట్టారు? రవిని ఎలా విడిపించడం? ఆ తల్లికి ఎలా అప్పచెప్పడం? ఇవి కూడా ముఖ్యమైన అంశాలు ఈ కేసుకి” అన్నాడు యుగంధర్.

"శత్రువులు ఏ దేశ గూఢచారులో కూడా తెలియదు. దర్యాప్తకి అవసరమైన వివరాలు ఏవీ తెలియవు! ఎలా?” అడిగాడు ఇన్స్ పెక్టర్.

"అరటిపండు వొలిచి ఇచ్చినట్లు అన్ని వివరాలూ తెలిస్తే మనం ఇంక చేసే దర్యాప్తు ఏమున్నది?" అన్నాడు యుగంధర్ నవ్వుతూ.

"ఏదయినా పథకం ఆలోచించారా?" అడిగాడు రాజు.

"ఆ!" అని యుగంధర్ అంటూండగా టెలిఫోన్ మోగింది.
📖

డాక్టర్ భారవి ఇంట్లో...

డిటెక్టివ్ యుగంధర్ స్పష్టంగా చెప్పారు. ఈ మోహన్ తన భర్త కాడని సూచనగా నైనా, తను అనుమానిస్తున్నట్టు అతనికి తెలియ కూడదని. కాని, అతన్ని చూస్తోంటే జెర్రులు పాకుతున్నట్టుంది భార్గవికి. ఆ మనిషిని నిలువునా నరికిపారెయ్యాలన్నంత కోపంగా వుంది. బ్రాందీ గ్లాసులో పోసుకొని తాగుతూ, సిగిరెట్టు పీలుస్తూ, ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు. తన కోపాన్ని అణుచుకొని ఏదో పత్రిక చదువుతోంది భార్గవి.

"డార్లింగ్! నువ్వు బొత్తిగా సీరియస్ గా లేవు” అన్నాడు అతను.

"అంటే?" అడిగింది.

"యురేనియం ఎప్పుడు ఎలా వస్తోందో తెలుసుకొని చెప్పకపోతే రవిని చంపేస్తా మని వాళ్ళు పదేపదే బెదిరిస్తున్నారు. నువ్వా... ఆ రహస్యం తెలుసుకొనేందుకు ఎటువంటి ప్రయత్నమూ చెయ్యడంలేదు” అన్నాడు.

"ప్రయత్నం చేస్తున్నాను.. కాని ఇంతవరకూ ఫలితం శూన్యం” అన్నది.

"నువ్వు సీరియస్ గా ప్రయత్నిస్తే అది తెలుసుకోలేవా! నిజంగా చెప్పు! నా ఉద్దేశంలో నువ్వు ఠలాయిస్తున్నావు” అన్నాడు కాస్త కోపంగా.

"వాళ్లకన్నా నీకే ఆ రహస్యం గురించి తెలుసుకోవడం చాలా అవసరంలా మాట్లాడుతున్నావు?" అన్నది ఇంకా కోపంగా భార్గవి.

"అవును! రవి ప్రాణాన్ని బలి ఇవ్వలేను కనుక. దేశాభిమానమో, దేశభక్తో అదేదో నీ అంతఃకరణకి అడ్డు వస్తున్నది. రవి ప్రాణాన్ని బలి ఇస్తున్నావు! జాగ్రత్త!" అన్నాడు.

అంతే... ఆమె అప్పటివరకూ ఎలాగో సహించి, దిగమింగుకున్న కోపం కట్టలు తెంచుకున్నది.

“రవి ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టింది నువ్వు... నువ్వే!" అంటూ అతని మీదపడి అతని గ్లాసు నేలకేసి విరగగొట్టింది.

“భార్గవీ... ఏమిటీ హిస్టీరియా?”

"రాక ఏమవుతుంది! స్కూలు నించి వచ్చేటప్పుడు రవిని వాళ్ళు ఎత్తుకు పోతూంటే నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకొన్నావు? చెప్పు! చెప్పు!" అంటూ అతని మీద పడి, అతన్ని గోళ్ళతో రక్కడం ప్రారంభించింది.

"భార్గవీ... నీకు మతిపోతోంది" అని ఆమెని దూరంగా తోసెయ్యబోయాడు. అతని షర్టు పట్టుకుని లాగింది. బలంగా లాగింది. షర్జు చిరిగిపోయింది. అప్పటికీ కోపం చల్లారక, ఆ షర్టుని పీలికలుగా చింపేసింది. అంతటితో వూరుకోలేదు. వెంటనే అతను వేసుకున్న బలియను పట్టి లాగింది. రెండు చేతులతో పట్టుకొని, పరపరా చింపేసింది.

"ఏమిటిది! భార్గవీ!" అంటున్నాడు. అతని బనియను రెండు ముక్కలై కింద పడింది. అప్పుడు చూసింది... అతని వీపు మీద పుట్టుమచ్చ లేదు. తన అనుమానం నిజం అయింది. తన వీపుని ఆమె చూడడం అతను గమనించాడు. జేబులోంచి పిస్తోలు తీసి ఆమె మీద గురిపెట్టాడు.

“ఇంతవరకూ రాకుండా, నయాన నీనించి ఆ రహస్యం తెలుసుకొందామనుకొన్నాం” అన్నాడు నెమ్మదిగా.

"ఎవరు నువ్వు? నా మోహన్ వి కావూ?" అన్నది నీరసంగా.

"నేను ఎవరయితేనేం! నీ భర్త మోహన్ ని మాత్రం కాను. ఇప్పుడు ఆ విషయం నీకూ తెలుసు. నీకు తెలుసునని నాకూ తెలుసు. పద” అన్నాడు.

"ఎక్కడికి?" అడిగింది భార్గవి. ఏమాత్రం భయంలేదు. చాలాకాలంగా తన భర్త మోహన్ అనే భ్రాంతిలో వుంది కనుక.

"గదిలోకి... పడకగదిలోకి... చాలా రోజుల్నించీ రమ్మంటున్నావుగా, ఇప్పుడు వస్తాను" అన్నాడు వెకిలిగా నవ్వుతూ.

“నేను రాను” అన్నది.

“రాక ఏం చేస్తావు! చస్తావు. పద!నీచేత నిజం కక్కిస్తాను. అయిదు నిముషాల్లో చెపుతావు ఆ యురేనియం ఎప్పుడు వచ్చేదీ...” అంటూ మొరటుగా భార్గవిని ఒక్క తోపు తోశాడు. ఆమె వెళ్ళి పడక గదిలో తివాసీ మీద పడిందో లేదో, అతను తలుపు మూసేశాడు.
👥
*సశేషం*

*అతను అతను కాడు - 10*

👥


రచన: కొమ్మూరి సాంబశివరావు



"హల్లో!" అన్నాడు యుగంధర్.


"హల్లో! నేను ఎవరో చెప్పవలసిన అవసరంలేదు. శ్రీమతి డాక్టర్ భార్గవి ద్వారా మేము తెలుసుకోవలసిన విషయాలు ఏవీ లేవు."


“అలాగా! ఆ విషయం నాకు చెప్పడం దేనికి?" అన్నాడు యుగంధర్.


"తనకి కలిగిన చిక్కేమిటో, ఇబ్బందేమిటో మీకు చెప్పలేదా?”


“చెప్పేదేమో! మీరు అవకాశం ఇవ్వలేదుగా!" అన్నాడు యుగంధర్.


"ఆమెకీ చాలా ప్రియమైన, విలువైన ఆమె ప్రాణంతో సమానమైనదాన్ని పోగొట్టుకు న్నది. దాన్ని మీరు తెచ్చిస్తారని అశించింది. ఆ సందర్భంలో తనకి సహాయం కావలసి వచ్చి, మీ సహాయం కోరింది."


"అలాగా... ఏమిటది?" అడిగాడు యుగంధర్. 


"రేపు రాత్రి వార్ మెమోరియల్ వద్ద అరుగు మీద ఒక పెట్టె వుంటుంది. ఆ పెట్టె తీసుకుని వెళ్ళి ఆమెకి మీరే అందించండి. మీ సహాయం కోరిన వారికి ఏ గతి పడుతుందో ఆమెకే తెలుస్తుంది" రిసీవర్ పెట్టేశాడు.


"ఏమిటి... బ్యాడ్ న్యూసా?" అడిగాడు రాజు.


"అవును" టెలిఫోన్ లో తనకి చెప్పిన విషయాలు చెప్పి, "అందులో నిగూఢమైన రహస్యం ఏదీ లేదు. రవి శవాన్ని అందజేస్తామని, రేవు, రాత్రివరకూ గడువు పెట్టారు. ఎందువల్ల శ్రీమతి భార్గవితో తమకి పనిలేదన్నారు. దానికి కారణం! ఇంకొకరి ద్వారా తెలిసిపోయిందా? అయితే భార్గవి కూడా ప్రమాదంలో వుండి వుండాలి" అని యుగంధర్ కుర్చీలోంచి లేచాడు.

📖


తివాసీమీద పడిన భార్గవి లేచి చీర సర్దుకుంటోంది. తలుపు మూసి ఎదురుగా నిలుచున్న అతన్ని చూస్తోంది భయంతో.


"ఎందుకలా బెదురుతూ చూస్తావు! ఇందాకటి కోపం, బలం అన్నీ ఏమయ్యాయి?" అన్నాడు ఆమె చీరకొంగు పట్టుకుని.


"వెళ్ళు! దూరంగా వెళ్ళు! నన్ను ముట్టుకోకు!" అని అరిచింది.


"నువ్వు ఎంత అరిచినా ఎవరికీ వినపడదు... ఎవరూ నీ సహాయానికి రారు. ఊ! పద! నా రహస్యం బయట పడుతుందని నిన్ను వదిలేశాను ఇన్ని రోజులు, ఇప్పుడు నీకు నిజం - ఎలాగూ తెలిసింది... నాకింక భయమేమిటి?"


"రాస్కెల్! వదులు చెయ్యి..." మళ్ళీ అరిచింది భార్గవి.


అతను ఆమెని గది వైపుకి తోసుకుని వెళుతున్నాడు. "వదలడమా! నిన్నా! నాకేమైనా మతిపోయిందనుకున్నావా!  "ఏం! నా షర్టు, బనియను చింపినట్టు లేదూ!" అంటూ ఆమె పెనుగులాడుతుంటే మంచంమీదికి తోసేశాడు. 


భార్గవి అతని కళ్ళల్లోకి చూస్తోంది. మనిషి కళ్ళలా లేవు. మృగం కళ్ళలా వున్నాయి. అసలే కొంత తాగి వున్నాడేమో! దగ్గిరలో ఏదైనా వస్తువు వుందా! దానితో అతని తలమీద ఒక దెబ్బ వేద్దామని చూసింది. కాని ఏమీలేదు. పైగా తను మంచంమీద పడున్నది. అతనా మంచం పక్కన ఓ కాలు తీసి తన కాలిమీద పెట్టి నిలుచున్నాడు.


"కదిలావా బలంగా కాలు నొక్కుతాను, మడమ దగ్గిర ఎముకలు విరుగుతాయి" అన్నాడు సిగిరెట్ తీసి వెలిగించి పొగ వదులుతూ.


“నోరుముయ్యి...” అన్నది భార్గవి. బూటు కాలితో ఆమె మడమను నొక్కాడు. బాధతో ఒక్క మూలుగు మూలిగింది.


"ఇది శాంపిల్ మాత్రమే. జాగ్రత్త! గింజుకున్నావో పదింతలు నెప్పి" అని వెకిలిగా నవ్వాడు.


"నన్ను ముట్టుకొంటే చంపేస్తాను" అన్నది భార్గవి.


"దేనితో? మాటలతోనా! చూపులతోనా! తర్వాత ఏం చేస్తానో తెలుసా! ఇదిగో ఈ సిగిరెట్.. కాలుతున్న సిగిరెట్ నీ వొంటిమీద కాలుస్తాను. ఆ ఘోరమైన పోరనించి, ఆ చిత్రహింసల నించి తప్పించుకోవాలంటే... చెప్పెయ్యి... నిజం చెప్పెయ్యి. తెలియదని నాటకం ఆడుతున్నావని నాకు తెలుసు" అని అతను అమెమీదకి పడ్డాడు.


తోస్తోంది.. పీకుతోంది...పెనుగులాడుతోంది వీలు దొరికితే అతన్ని పళ్ళతో కొరికి అతన్నించి పారిపోడానికి ప్రయత్నిస్తోంది. రెండు కాళ్ళు తన కాళ్ళతో బిగించాడు ఉక్కుకడ్డీలతో బిగించినట్టు. ఆమె రెండు చేతులు వెనక్కి విరిచిపెట్టాడు.


"ఎందుకలా ఏడుస్తావు!" అన్నాడు హేళనగా. భార్గవి కళ్ళు మూసుకున్నది. భగవంతుడా! ఇంతకన్నా చావు మేలు, తనని ఈ ఆపదలోంచి ఎవరూ తప్పించ లేరా! ఎవరూ లేరా! అని లోలోపల కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది.


అంతలో తలుపు ఫెళఫెళా చప్పుడై విరిగి పడిపోయింది. "చెయ్యి కదిల్చావో కాలుస్తాను. నాకు కనికరం లేదు" అన్నాడు యుగంధర్. అతను బెదురుచూపులు చూస్తున్నాడు. "రా ముందుకి... ఊ!" ఆని గదమాయించాడు యుగంధర్. అతను తలుపు వరకూ వెళ్ళాడు. ఈడ్చి చెంప మీద కొట్టి, బైటకి లాగి తలుపు మూస్తూ "మీరూ బైటికి రండి భార్గవిగారూ!" అన్నాడు యుగంధర్.

📖


రాజు అతని చెయ్యి మెలిపెట్టి కదలకుండా పారిపోకుండా పట్టుకున్నాడు. ఇన్స్ పెక్టర్ స్వరాజ్యరావు బయట తలుపు దగ్గర పిస్తోలుతో నిలుచున్నాడు లోపలికి ఎవరూ రాకుండా కాపలాగా. 


"రాజూ! ఇతన్ని ఇంకో గదిలోకి తీసుకొని వెళ్ళు. మనిషిని ఆపాదమస్తకమూ పరీక్ష చెయ్యి. మైక్రో డివైజ్ ఏదయినా వున్నదేమో!" అన్నాడు యుగంధర్.


"కమ్ ఆన్!" అని రాజు అతన్ని ఒక్క తోపు తోశాడు ముందుకి. అతమ గజగజ వొణికిపోతున్నాడు. "ప్లీజ్! వెంటనే అందరం ఈ ఇంట్లోంచి తక్షణం బయటికి పోదాం. ఆలస్యం చెయ్యకూడదు" అన్నాడు. అతని కంఠస్వరంలో బెదురు, అతని కళ్ళల్లో భయం గమనించాడు యుగంధర్.


"ఎందుకూ?" అడిగాడు యుగంధర్.


"ఎందుకో చెప్పేటందుకు కూడా వ్యవధి లేదు. ప్లీజ్, నా మాట నమ్మండి. లేదా అందరం చస్తాము" అన్నాడు ఆ నకిలీ మోహన్.


అతను అబద్ధం చెప్పడంలేదని అతని కళ్ళే చెబుతున్నాయి.


“భార్గవిగారూ! త్వరగా రండి" అరిచాడు యుగంధర్. అప్పుడే తలుపు తీసింది భార్గవి. 


"కమ్ ఆన్!" అని ఆమె చెయ్యిపట్టుకొని ఆమెని లాక్కుంటూ పరుగెత్తాడు యుగంధర్.


నకిలీ మోహన్ చెయ్యి వదలకుండా, అతన్ని తోసుకుంటూ త్వరత్వరగా మెట్లు దిగాడు రాజు.


"వాట్ ఈజ్ ఇట్?" అడిగాడు ఇన్స్ పెక్టర్ స్వరాజ్యరావు,


"ఇంట్లో నౌఖర్లు ఎవరన్నా వున్నారా?" అడిగాడు యుగంధర్ భార్గవిని. లేరని తలవిదిలించింది భార్గవి. 


"రండి ఇన్స్ పెక్టర్! క్విక్!" అని యుగంధర్ భార్గవితో తోటలోకి పరిగెత్తాడు. వెనకే రాజూ, ఇన్స్ పెక్టర్, వాళ్ళ బందీగా వున్న మోహన్ వెళ్ళారు. గేటు వరకూ వెళ్ళాక-


"ఇక్కడ ఆగుదాం! కమ్ ఆన్ చెప్పు" అన్నాడు యుగంధర్ నకిలీ మోహన్ని. అతను జవాబు చెప్పనవసరం లేకపోయింది. చెవులు చిల్లులుపడే చప్పుడు... పెద్ద పేలుడు... ఆ ఇల్లు ఒక్కసారిగా కూలిపోయింది. పేకముక్కల తో కట్టిన ఇల్లులా.


“డైనమైట్?" అడిగాడు యుగంధర్ అతన్ని చూసి, అతను ఏదో చెప్పబోతున్నాడు. ప్లవ్ మన్న శబ్దం లీలగా వినపడింది. అంతే... ఆ నకిలీ మోహన్ కింద కూలాడు.

"ఏమిటి! ఏమిటి జరిగింది?” అడిగాడు ఇన్స్ పెక్టర్.


"చీకట్లోంచి ఆ ప్రహరీ గోడ మీద నించి ఇతన్ని సైలెన్సర్ పెట్టుకున్న రైఫిల్ తో షూట్ చేశారు. నో! నో! వెళ్ళకండి! ప్రయోజనంలేదు. ఈపాటికి వాళ్ళు వెళ్ళిపోయి వుంటారు" అన్నాడు యుగంధర్ వొంగి నేలమీద పడివున్న నకిలీ మోహన్ని పరీక్ష చేస్తూ. 


"అవును. గుండు సరిగా ఇతని వీపులో దిగబడింది. అంత సూటిగా గురి తప్పకుండా కాల్చాడంటే టెలిస్కోపిక్ లెన్సు కూడా వుండివుండాలి రైఫిల్ కి. త్వరగా ఆస్పత్రిలో చేర్చాలి ఇతన్ని" అన్నాడు యుగంధర్. 


ఎవరు ఫోన్ చేశారో ఫైర్ ఇంజన్సు వచ్చాయి. స్థానిక పోలీస్ ఇన్స్ పెక్టర్ సిబ్బందితో వచ్చేశాడు. ఇన్స్ పెక్టర్ స్వరాజ్యరావుని చూసి సెల్యూట్ చేసి "ఏమి జరిగింది సర్" అడిగాడు. ఏం చెప్పాలో ఇన్స్ పెక్టర్ కి తెలియలేదు.


“ఇంట్లో ఎవరూ లేరు కనుక, ఎవర్నీ రక్షించవలసిన అవసరంలేదు. ఈ ఇల్లు ఎలా కూలిపోయిందో తెలుసుకోవాలంటే ఎక్స్ ప్లోజివ్స్ డిపార్టుమెంట్ సహాయం కోరండి. ఇతన్ని ఆస్పత్రిలో చేర్చండి" అన్నాడు యుగంధర్.

📖


"తెలివి తప్పలేదు. కాని బతకడు ఒక అయిదు పది నిముషాలకన్నా" అన్నాడు ఆస్పత్రిలో డాక్టర్. యుగంధర్ నకిలీ మోహన్ పడుకున్న గదిలోకి వెళ్ళాడు. 


“నీ అసలు పేరేమిటో నాకు తెలియదు. నువ్వు ఇక అట్టేకాలం బతకవు. నిన్ను షూట్ చేసింది ఎవరో తెలుసా?" అడిగాడు యుగంధర్. అతను తల వూపాడు.


"నువ్వు నాకు నిజం చెప్పు. మీ జట్టు రహస్యాలు చెపుతావని నిన్ను నిర్ధాక్షిణ్యం గా షూట్ చేశారు. ఇంకా నీకు వాళ్ళమీద అభిమానం వుందా?" 


అతని కళ్ళల్లో నీళ్ళు.


"నువ్వు చేసిన పాపానికి కొంతవరకయినా పరిహారం చేసుకో! భార్గవి భర్త ఏమయ్యాడు! రవి ఎక్కడున్నాడు? నువ్వు ప్లాస్టిక్ సర్జరీతో మోహన్ లాగా ఎందుకు తయారయ్యావు. అన్ని వివరాలు జాగ్రత్తగా కాపాడుకున్న నువ్వు, వీపుమీద పుట్టుమచ్చ ఎందుకు పెట్టుకోలేదు?" అడిగాడు యుగంధర్.


"అవసరం వస్తే అసలు మోహన్ ఎవరో... నేను ఎవరో రుజువు చేసుకునేందుకు వీపు మీద పుట్టుమచ్చ పెట్టలేదు. మోహన్ ను ఇప్పుడు ఎక్కడ దాచివుంచారో నాకు తెలియదు. మోహన్ని నేను ఒకసారే చూశాను. అతన్ని గురించిన వివరాలన్నీ సినిమా చూపించి నేర్పించారు.


“అసలు మోహన్ ఎవరో, నువ్వు ఎవరో తెలుసుకునేందుకు వేలిముద్రలు వున్నాయిగా!"


“తెలుసుకునేందుకు, వేలిముద్రలు తీసుకునే వ్యవధి లేకపోతే" అని నీరసంగా నవ్వాడు. అంతే... కళ్ళు మూసేశాడు అతను.

👥

*సశేషం*

*****

*అతను అతను కాడు - 11*


రచన: కొమ్మూరి సాంబశివరావు



“అది మీ స్వంత ఇల్లా?” అడిగాడు యుగంధర్ భార్గవిని కూలిన ఇంటి వైపు చూస్తూ.


"కాదు, అద్దె ఇల్లు. కాని ఇంట్లో సామానులన్నీ స్వంతం.” అంది.


"విచారించకండి. ప్రభుత్వం మీకు నష్ట పరిహారం ఇస్తుంది” అన్నాడు యుగంధర్.


“దేనికి నష్టపరిహారం... సోఫాలు, పరుపులు, కుర్చీలు, తివాసీలు, బీరువాలు పోయినందుకా? లేక నా భర్త మోహన్నీ, రవినీ పోగొట్టుకున్నందుకా?" అని దీనంగా నవ్వింది ఆమె.


“అప్పుడే అంత అధైర్యపడకండి” అంటూ పోర్టికోలో కారు ఆపాడు యుగంధర్. యుగంధరూ, రాజు, భార్గవీ, ఇన్స్ పెక్టర్ స్వరాజ్యరావు లోపలికి వెళ్ళారు. తలుపు తాళం తీశాడు రాజు. యుగంధర్ కన్సల్టింగ్ రూంలో దీపం స్విచ్ వేశాడు. బల్ల దగ్గిర ఎవరో కూర్చునుండడం అప్పుడు గమనించాడు.


"ఎవరది?” అడిగాడు జేబులోకి చెయ్యి పోనిస్తూ.


"శత్రువునే కాని ప్రస్తుతం తగాదాకి రాలేదు. మాట్లాడటానికి వచ్చాను" అన్నాడు యుగంధర్ రివాల్వింగ్ కుర్చీలో కూర్చునున్న మనిషి వెనక్కి తిరగకుండా.


“రాజూ” అన్నాడు యుగంధర్. క్షణంలో రాజు కుర్చీలో కూర్చునున్న అతన్ని సమీపించి, అతని జేబులు సోదా చేశాడు.


“చెప్పానుగా... తగాదాకి రాలేదని." అన్నాడు ఆ వచ్చిన మనిషి. యుగంధర్ వెళ్ళి కూర్చుని “ఎవరు మీరు?” అడిగాడు.


"నా పేరా... ఏ పేరయితేనేం? నేను ఎవరో చెప్పేకన్నా, నేను చెప్పబోయే విషయాలు ముఖ్యం. మీరు ఏమీ అనుకోకపోతే మీ అసిస్టెంటు రాజునీ, ఇన్ స్పెక్టర్ స్వరాజ్య రావునీ బైటికి వెళ్లమనండి. మీతో, డాక్టర్ శ్రీమతి భార్గవిగారితో విడిగా మాట్లాడాలి" అన్నాడతను. అతనిలో జంకూ గొంకూ లేదు.


“ఆల్ రైట్!” అని రాజునీ, స్వరాజ్యరావునీ అవతల గదిలోకి వెళ్ళమని చెప్పి బల్లమీద వున్న సిగరెట్ డబ్బా తీస్తున్నట్లు తీస్తూ, బల్ల అంచున కింద వున్న స్విచ్ నొక్కాడు యుగంధర్.


“మన సంభాషణ అవతల గదిలోని వాళ్ళు వినే ఏర్పాటు మీరు చేసివుంటే అది మీ ఇష్టం, మీ బాధ్యత. నే చెప్పే విషయాలు విన్న తర్వాత మీరు ఒక నిర్ణయానికి రావడానికి అది ఆటంకం కావచ్చు" అన్నాడతను.


“చెప్పండి! మీరు వచ్చిన పని?” అడిగాడు యుగంధర్.


బల్లమీద వున్న చిన్న టేప్ రికార్డర్ వైపు చూసి, “అదిగో! దయచేసి ముందు ఆ టేప్ ఆన్ చెయ్యండి." అన్నాడు.


యుగంధర్ స్విచ్ నొక్కాడు. ఒక నిముషం నిశ్శబ్దం. తర్వాత స్పష్టంగా, “ఈరోజు జనవరి 10వ తేదీ 1982. సాయంకాలం ఆరు గంటలు. నా పేరు మోహన్. నేను ఆరోగ్యంగా బతికే వున్నాను" అన్న మాటలు వినిపించాయి. క్షణం నిశ్శబ్దం. "మనం బి.ఎస్సి. చదువుతున్న రోజుల్లో ఒకసారి నువ్వు నా కెమిస్ట్రీ నోట్సు కాపీ చేసుకుంటానని తీసుకెళ్ళి, మళ్ళీ ఆ నోట్సు నాకు ఇవ్వలేదు. బస్ లో పోయింద న్నావు! జ్ఞాపకం వున్నదా? నేను నీ భర్త మోహన్ అని నీకు నిశ్చయంగా తెలిసేందుకే ఈ విషయం చెప్పాను.”


టేప్ రన్ అవుతోంది. రెండు నిముషాలు నిశ్శబ్దం. "ఈరోజు జనవరి 10వ తేదీ 1982. సాయంకాలం ఆరు గంటల ముప్పై నిముషాలు. నా పేరు రవి. మా నాన్న పేరు మోహన్. అమ్మ పేరు భార్గవి. నేను ఆరోగ్యంగానే వున్నాను."


“ఇక రికార్డర్ ఆపు చెయ్యండి" అన్నాడతను. 


యుగంధర్ స్విచ్ నొక్కాడు “మోహన్, రవీ ఇప్పటిదాకా క్షేమంగా సుఖంగా ఉన్నారని మీకు రుజువు చెయ్యడానికే ఈ టేపు తెచ్చాను" అన్నాడు.


“సరే! ఒప్పుకుంటాను. వాళ్ళు బతికే వున్నారు. తర్వాత?" అడిగాడు. యుగంధర్.


"మేము మిమ్మల్ని కానీ, భార్గవిగార్ని కానీ చంపదలచుకుంటే మా మోహన్ ని చంపినప్పుడు అప్పుడే మీ ఇద్దర్ని కూడా షూట్ చేసి ఉండవచ్చు.


తల వూపాడు యుగంధర్.


"తన నిజస్వరూపం బయటపడితే, మరుక్షణం ఆ ఇల్లు పేలేందుకు డైనమైట్ పెట్టామని మోహన్ కి చెప్పాము. శ్రీమతి భార్గవిగారు మోహన్ తన భర్త కాదని గ్రహించడం, ఇద్దరి మధ్య వివాదం, తర్వాత ఘర్షణ అంతా మేము వింటూనే వుంటాము మోహన్ చేతి గడియారానికి మేము ఏర్పాటు చేసిన మైక్రోట్రాన్స్ మీటర్ ద్వారా. అందుకే ఇల్లు కూలిపోతుందని వెంటనే బయటికి రమ్మని మోహన్ మిమ్మల్ని హెచ్చరించాడు. నిజానికి ఇల్లు పేలే డివైజ్, రిమోట్ కంట్రోల్ ద్వారా మా చేతుల్లో వుంది. మీరందరూ క్షేమంగా ఇంట్లోంచి బయటికి వచ్చేటంతవరకూ ఇల్లు పేలనివ్వలేదు. బయటికి వచ్చిన తర్వాత... అప్పటికే ప్రహరీ గోడ దగ్గిర మా మనిషి తయారుగా వున్నాడు. మా మోహన్ ని షూట్ చేశాడు. అతను మీ చేతిలో చిక్కితే అతనిచేత మా రహస్యాలు చెప్పిస్తారని మాకు తెలుసు” అన్నాడతను.


"థాంక్స్! మమ్మల్ని చంపకుండా ఉన్నందుకు!" అన్నాడు యుగంధర్ వ్యంగ్యంగా నవ్వుతూ.


"థాంక్స్ అవసరంలేదు. మీమీద ఆపేక్ష వల్ల కాదు, మీతో అవసరం వుంది కనుక" అన్నాడతను.


"కారణం ఏదయినా ప్రాణదానం చేసినందుకు థాంక్స్! మేమందరం ఇంట్లోంచి వచ్చిన తర్వాత ఆ ఇల్లు డైనమైట్ తో శిథిలం చెయ్యడం వల్ల మీరు సాధించిందేమిటి?" అడిగాడు యుగంధర్.


"ఐ మీన్ బిజినెస్. మీరు కొంచెం సీరియస్ గా పరిస్థితులు పరిశీలిస్తారని” అన్నాడతను..


"అలాగా! పరిస్థితులు చాలా సీరియస్ అని నాకు ముందునించీ తెలుసు. ఇంతకీ మీ రాకకి కారణం?" అడిగాడు యుగంధర్ చాలా మర్యాదగా.


"ముందు ఒక విషయం చెబుతాను. మీరు నన్ను అరెస్టు చెయ్యవచ్చు. హింసించి నా చేత నా ముఠాకి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు. ఎంత ఓర్పూ, దీక్షా, దేశభక్తి వున్నా హింసని భరించే శక్తి కొంత వరకే వుంటుంది. ఆ తర్వాత నిజం 

కక్కేస్తారు ఎవరయినా. అటువంటిదేదైనా చేస్తారనే బాగ్రత్తపడ్డాను. నా అంగిట్లో  సైనయిడ్ మాత్ర పెట్టుకున్నాను. నాలికతో లాగి కొరికానంటే రెండు నిముషాల్లో నా ప్రాణం పోతుంది. నా ప్రాణం పోయిందా... రవీ, మోహన్ మీకు దక్కరు. అది మీరు జ్ఞాపకం వుంచుకోండి" అన్నాడతను.


“ఆల్ రైట్. ఈ విషయం తప్పక జ్ఞాపకం వుంచుకుంటాను. మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి” అడిగాడు యుగంధర్.


"రవిని ఎత్తుకుపోతే, శ్రీమతి భార్గవి కొడుకు ప్రాణాన్ని రక్షించుకునేందుకు మాకు కావలసిన విషయాలు చెప్పేస్తుందని అనుకున్నాము. మీ సహాయం కోరుతుంద ని కానీ, ఎదురు తిరుగుతుందని కానీ ఊహించలేదు.”


"అసలు విషయం చెప్పండి” అని పురమాయించాడు యుగంధర్.


"బొంబాయి నించి యురేనియం కల్పాకంకి ఎప్పుడు? ఎలా వస్తుంది? శుద్ధి చెయ్యడం ఎప్పుడు ప్రారంభిస్తారు? మేము కోరినది చాలా స్వల్పమైన కోర్కె"


"మీకు అది స్వల్పం కావచ్చు” అన్నాడు యుగంధర్.


"ఆ విషయాలు మాకు చెపితే, శ్రీమతి భార్గవిగారి భర్త మోహన్నీ, ఆమె కొడుకు రవినీ క్షేమంగా ఒప్పగిస్తాము.”


"ఆ విషయాలు ఆమెకి తెలియదని చెప్పిందిగా" అన్నాడు యుగంధర్.


"డాక్టర్ శ్రీమతి భార్గవీ మోహన్ గారి గురించి మాకు బాగా తెలుసు. ఆమె కల్పాకం సెంటర్ కి డెప్యూటీ డైరెక్టరే కాదు, ఒకసారి ఉపయోగించిన యురేనియాన్ని శుద్ధిచేసి, మళ్ళీ ఉపయోగించడానికి ఉపయోగకరంగా చెయ్యడంలో చాలా ప్రవీణురాలు. మాకు తెలిసినంతవరకూ, ఆమెకి ఒక్కతెకే వున్నది ఆ సాంకేతిక పరిజ్ఞానం."


"సరే, మీరు అడిగిన ఆ విషయాలు చెప్పుతుంది అనుకుందాం. మోహన్నీ, రవినీ సురక్షితంగా ఒప్పగిస్తారని మాకు నిశ్చయం ఏమిటి?" అడిగాడు యుగంధర్.


"మేము తెలుసుకో కోరిన విషయాలు చెప్పిన తర్వాత వాళ్ళని బంధించీ చంపితే మాకు ప్రయోజనమేమిటి?" ఎదురు ప్రశ్న వేశాడు అతడు.


"వాళ్ళు మీ గురించిన రహస్యాలు తెలుసుకొని వుండవచ్చు. అవి మాకు చెపుతారని మీరిద్దర్నీ చంపెయ్యవచ్చు. ముందు రాజీకి రావాలంటే ఉభయులకి ఆమోదకరంగా వుండే ఏదైనా పద్ధతి ఆలోచించాలి" అన్నాడు యుగంధర్.


అతను నవ్వి “పోనీ మీరు చెప్పండి! ఏ విధంగా చేస్తే శ్రీమతి భార్గవిగారు ఆ రహస్యాలు మాకు చెపుతారు?" అన్నాడతను.


"తక్షణం మోహన్నీ, రవినీ క్షేమంగా తీసుకు వచ్చి ఇక్కడ నా అసిస్టెంట్ కి అందజేసే ఏర్పాటు చెయ్యండి! వీరిద్దరి బదులు నన్ను... మీ బందీగా తీసుకెళ్ళండి" అన్నాడు యుగంధర్.


అతను విరగబడి నవ్వి “నో! నో! సింహాన్ని తీసుకుని వెళ్లి మా మధ్య కూర్చోపెట్టడమే! యుగంధర్! మీ గురించి మాకు బాగా తెలుసు. అంతేకాదు రవీ, మోహన్ లు క్షేమంగా తిరిగివచ్చాక శ్రీమతి భార్గవి ఆ రహస్యం ఎందుకు చెపుతారు? ఆమె భర్త మీద, కొడుకు మీదా ఆమెకున్న ప్రేమాను రాగాలు మీమీద వుంటాయా? ప్లీజ్! వేరే ఏదయినా, ఇంకో పథకం చెప్పండి!" అన్నాడతను.


"సరే, రేపు సాయంకాలం వరకూ వ్యవధి ఇవ్వండి. ఆలోచించి చెపుతాను" అన్నాడు యుగంధర్.


“ఆల్ రైట్! తప్పకుండా రేపు సాయంకాలా నికి ఏదో ఒక నిర్ణయానికి రావాలి. లేదా రేపు రాత్రి వార్ మెమోరియల్ వద్ద..."

అన్నాడు. 


“హెచ్చరించారుగా! జ్ఞాపకం వున్నది. మిమ్మల్ని కలుసుకోవాలన్నా, టెలిఫోన్ లో కంటాక్టు చెయ్యాలన్నా ఎలా?" అడిగాడు యుగంధర్.


"చాలా సింపుల్. హోటల్ రాజ్ కి ఫోన్ చేసి మోహన్ కావాలని అడగండి చాలు. నేను మాట్లాడతాను, ఇక వెళ్ళనా?” అని లేచాడు.


"వెళ్ళండి. ఫోన్ చేస్తాను” అన్నాడు యుగంధర్.

👥


*సశేషం*

*అతను అతను కాడు - 12*

👥


రచన: కొమ్మూరి సాంబశివరావు



"వెళ్ళండి. ఫోన్ చేస్తాను” అన్నాడు యుగంధర్ ఆ కొత్త వ్యక్తితో.


రాజూ, ఇన్స్ పెక్టర్ అవతల గదితలుపు తెరుచుకొని వచ్చారు.


“ఎందుకు వెళ్లనిచ్చారు?" అన్నాడు ఇన్స్ పెక్టర్.


"విన్నారుగా... వెళ్ళనివ్వకపోతే నష్టం మనకే" అంటూ టెలిఫోన్ తీసి ఒక నెంబర్ తిప్పి "హల్లో హోటల్ రాజ్! మీ హోటల్లో మోహన్ అనే ఆయన వున్నారా? ఆయన గదికి కనెక్టు చేస్తారా?” అడిగాడు.


"మీకు ఏ మోహన్ కావాలి?" అడిగింది హోటల్ టెలిఫోన్ ఆపరేటర్.


"ఎంతమంది మోహన్ లు వున్నారు మీ హోటల్లో?” అడిగాడు యుగంధర్.


"ప్రస్తుతం పదిమంది. ఎ.మోహన్, బి.మోహన్ మొదలు వరసగా జె.మోహన్ వరకూ. రూం నెంబర్ 201 నించి రూం నెం. 210 వరకూ వున్నారు.”


"అలాగా! ఐయాయ్ సారీ. నాకు ఇనీషియల్ తెలియదు" అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. క్షణం ఆలోచించి, మళ్ళీ రిసీవర్ తీసి, నెంబర్ తిప్పి, "హల్లో! హోటల్ రాజా! గివ్ మీ రిసెప్షన్ ప్లీజ్. యస్. రూం నెం. 211 ఖాళీగా వుందా? ఆ! నా స్నేహితుడికి కావాలి. అవును. ఆ గదే రిజర్వ్ చెయ్యండి. పేరు, కె. మోహన్” అని రిసీవర్ పెట్టేసి “రాజూ! వేషం మార్చుకో! అవసరమైనవన్నీ తీసుకొని హోటల్ రాజ్ కి వెళ్ళి రూం నెం.211లో కె.మోహన్ గా బస చెయ్యి" అన్నాడు యుగంధర్.


రాజు వెళ్ళిపోయాడు. యుగంధర్ టెలిఫోన్ తీసి వరసగా కొన్ని నెంబర్లు తిప్పి, "హల్లో డిటెక్టివ్ యుగంధర్ హియర్. మద్రాసు నుంచి, పి.ఓ.డి.1949 నెంబర్ 911, 1, 518, 389, 472" ఇలా వరసగా కొన్ని నెంబర్లు చెప్పుకుంటూపోయాడు పక్కనున్న చిన్న డైరీ చూస్తూ. అలా పది నిముషాలు మాట్లాడి రిసీవర్ పెట్టేశాడు.


"మీరు చెప్పిన నెంబర్లు ఏమిటో అడగవచ్చా?" ప్రశ్నించాడు ఇన్స్ పెక్టర్.


"అది కోడ్, చాలా సింపుల్, ప్రతిసారీ ఈ కోడ్ నే వాడను. మారుస్తూ వుంటాను. పి అంటే పాకెట్. ఓ అంటే ఆక్సఫర్డ్, డి అంటే డిక్షనరీ, 1949లో ప్రచురించినది అని, తర్వాత నెంబర్లు ఏ పేజీలో పై అక్షరం మొదలవుతుందో, ఆ పేజీ నెంబర్ చెప్పాను. 911 లో యు అక్షరం ప్రారంభం అవుతుంది. 659 పేజీలో ఆర్ అక్షరం, 1 పేజీలో ఎ' అక్షరం.. అంతే.." అంటున్నాడు యుగంధర్. అంతలో టెలిఫోన్ మళ్ళీ మోగింది. యుగంధర్ రిసీవర్ తీసుకొని, తెల్లకాగితాల పాడ్, బాల్ పెన్ ముందుకి లాక్కుని, అవతలనించి చెపుతున్న నెంబర్లు చకచక వ్రాసుకున్నాడు.


"ఏమిటి యుగంధర్ ఇదంతా?” అడిగాడు స్వరాజ్యరావు.


"ఢిల్లీకి ఫోన్ చేశాను. యురేనియం ఎప్పుడు, ఎలా కల్పాకంకి వచ్చేదీ తెలుసుకున్నాను" అన్నాడు సిగిరెట్ వెలిగిస్తూ.


"తెలుసుకున్నారు బాగానే వుంది. ఈ విషయం శ్రీమతి భార్గవిగారే చెప్పేవారేగా” అడిగాడు ఇన్స్ పెక్టర్.


“శ్రీమతి భార్గవిగారికి ఎప్పుడు వస్తుందో తెలుసు కానీ, ఎలా వస్తుందో తెలియదు. ఆ వివరాలు తెలుసుకున్నాను. అంతే...”


"తెలుసుకొని ఏం చేస్తారు?” అడిగాడు ఇన్స్ పెక్టర్.


"వాళ్ళకి చెప్పి రవినీ, మోహన్ నీ రక్షిస్తాను" అన్నాడు.


"వాట్! శత్రుదేశ గూఢచారులకి, అంతటి రహస్యం చెప్పి...” అంటున్నాడు ఇన్ స్పెక్టర్.


"నా క్లయింట్ల ప్రాణాలు కాపాడడం నా ధర్మం" అన్నాడు యుగంధర్.


"యుగంధర్! మీరు ఇలా దేశద్రోహానికి పూనుకుంటారని అనుకోలేదు. నేను ఐ.జి.కి చెప్పాలి" అన్నాడు.


"ప్లీజ్! మన స్నేహం జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ఐ.జి.కి చెప్పకండి” అన్నాడు యుగంధర్.


"నేను పోలీసు ఉద్యోగిని. ఆ విషయం మర్చిపోకండి యుగంధర్. నా డ్యూటీ నేను చెయ్యాలి" చాలా కటువుగా చెప్పాడు ఇన్ స్పెక్టర్.


"అల్ రైట్. చెప్పండి! కాని మీకు సాక్ష్యం ఏమిటి?" అడిగాడు యుగంధర్.


"సాక్ష్యమా! మీరు చెప్పారుగా..."


"చెప్పలేదని అంటాను. డోంట్, బి... ఎ ఫూల్. ఐ.జి.కి నా మీద రిపోర్టు వస్తే మీరే నవ్వులపాలవుతారు. వెళ్ళండి" అన్నాడు యుగంధర్. 


"వెళ్తున్నాను. కాని, ఇంతటితో వదలను. మిమ్మల్ని ఒకకంట కనిపెడుతూనే వుంటాను యుగంధర్, జాగ్రత్త" అన్నాడు స్వరాజ్యరావు వెనక్కి తిరుగుతూ.


"ఇన్ స్పెక్టర్.... ఒక్కక్షణం" అని పిలిచాడు యుగంధర్.


"ఏమిటి?"


"దయచేసి నాకు ట్రబుల్ ఇవ్వకండి" అని ఒక కాగితం ఇచ్చాడు. ఇన్ స్పెక్టర్ కి.


"శత్రుదేశ గూఢచారి నా టేబిల్ అంచున మైక్రో ట్రాన్స్ మీటర్ పెట్టాడు. అందువల్లే అలా చెప్పాను. తర్వాత కలుసుకుందాం. యుగంధర్" అని వ్రాసి వుంది ఆ కాగితం మీద. 


అది చదివి “సారీ యుగంధర్! నానించి మీరు దయాదాక్షిణ్యాలు కోరవద్దు" అన్నాడు పైకి కటువుగా, మొహం మీద చిరునవ్వుతో.

📖


చేతిలో రేస్ బుక్, రెండు దినపత్రికలు, ఒక బ్రీఫ్ కేసు తీసుకొని ఒకతను హోటల్ రాజ్ కి వెళ్ళాడు. నల్లని పాంటు, తెల్లని షర్టు, హిట్లర్ మీసాలు, పైకి దువ్వుకున్న నల్లని జుట్టు, కళ్ళకి రిబ్రెస్ అద్దాలు. “నా పేరు కె. మోహన్. నా పేర్న రూం రిజర్వ్ చేశారా?” అడిగాడు రిసెప్షన్ లో. అతనే రాజు. 


"యస్ సర్. రూం నెం.211" అని తాళం చెవి ఇచ్చి, "బాయ్ ని పంపనా” అడిగాడు రిసెప్షన్ గుమాస్తా.


"అవసరం లేదు" అని రాజు లిఫ్టు ఎక్కి రూం నెం.211కి వెళ్ళి తలుపు తెరిచాడు. అన్ని హోటల్ గదుల్లానే వుంది ఆ గదీ. 201 గదిలో ఎ.మోహన్, 210 గదిలో జె.మోహన్ ఇందరు మోహన్ లు ఉన్నారు. వీళ్ళందరూ శత్రుదేశ గూఢచారులా, లేక వారి డబ్బు తింటున్న భారతపౌరులా? వీరిలో నాయకుడు ఎవరు? ఇదీ తను తెలుసుకోవలసిన విషయం! తెలుసుకున్న తర్వాత... తర్వాత ఆలోచించాలి. తలుపు మూసి గడియపెట్టి, వెనక్కి తిరిగాడు. 


"చేతులు పైకి ఎత్తిపెట్టు" అన్నమాటలు వినిపించాయి. ఎక్కణ్నించి! గదిలో ఎవరూ వున్నట్టు లేరే!


"నిన్నే! రాజూ! వెంటనే చేతులు పైకి ఎత్తి పెట్టు" మళ్ళీ హెచ్చరిక. ధ్వనిని బట్టి తెలిసింది. నీళ్ళగది వైపునించి ఆ మాటలు వస్తున్నాయి. తలుపుకి ఒక చిల్లిలో నుండి పిస్తోలు కనిపిస్తోంది. ఎదురుతిరగడం సాహసంకాదు,  అవివేకం. చేతులు పైకి ఎత్తిపెట్టాడు. "వెనక్కి తిరిగి తలుపుకి మొహం అనించి పెట్టి నిలుచో!" మరొక ఆజ్ఞ. రాజుకి కోపం వస్తోంది. తనమీదకి గురిపెట్టి వుంది పిస్తోలు. నిజమే కాని పేల్చేలోపున అరక్షణంలో తను కదిలితే... పిస్తోలుబారి నించి తప్పించుకుంటే...? ప్రయోజనం లేదు. తన పిస్తోలు బ్రీఫ్ కేసు లో వుంది. తలుపు తెరుచుకుని వాళ్ళు వస్తారు. వాళ్ళు చెప్పినట్టు చెయ్యక తప్పింది కాదు రాజుకి. తలుపు తీసిన కీచుమని చప్పుడు, బూట్సు అడుగుల సవ్వడి, ఎవరో వస్తున్నారు తన దగ్గిరికి. బాగా దగ్గిరికి వచ్చాక వెనక్కి కాలితో ఒక తన్ను... కాని ఇంకా రాజు ఏదో పథకం ఆలోచిస్తూనే వున్నాడు. అంతలో తలమీద పెద్ద రాయి పడినట్లయింది. అంతే... నేల మీద కుప్పగా కూలిపోయాడు రాజు.

📖


హోటల్ రాజ్ లో గదిలోకి వెళ్ళిన తర్వాత, వెంటనే తనకి ఫోన్ చెయ్యమని చెప్పాడు రాజుకి యుగంధర్. దాదాపు గంట దాటింది రాజు వెళ్ళి. ఇంకా ఎందుకు ఫోన్ చెయ్యలేదు? పోనీ తనే ఫోన్ చేస్తే... రిసీవర్ తీశాడు. “హోటల్ రాజ్. కనెక్ట్ మీ టు రూం నెం.211, మిష్టర్ కె.మోహన్” అడిగాడు యుగంధర్. అరనిముషం తర్వాత "హల్లో! డిటెక్టివ్ యుగంధరా! మోహన్ స్పీకింగ్" అది రాజు కంఠస్వరం కాదు.


"ఏ మోహన్?" అడిగాడు యుగంధర్.


చిన్ననవ్వు, "మీ అసిస్టెంట్ రాజు కాదు. రాజు ప్రస్తుతం అచేతనుడయి, ఒకచోట బందీగా వున్నాడు. నన్ను పట్టుకునేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించాను. నా హెచ్చరిక పాటించలేదు. మళ్ళీ ఫోన్ చేస్తాను" క్లిక్ మన్నది. యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. జాగ్రత్తగా వుండమనీ, వెయ్యి కళ్ళతో కనిపెట్టుకోమనీ తను రాజుకి చెప్పాడే! అయినా ఎలా శత్రువులకి తెలిసిపోతోంది? వాళ్ళు ఎత్తుకి పై ఎత్తు వేస్తున్నారు! శత్రువుల బలాన్నీ, తెలివినీ తను తక్కువ అంచనా వెయ్యకూడదు. ఇప్పుడు రాజు వాళ్ళ బందీ అయ్యాడు. అంటే రాజు, శ్రీమతి భార్గవి కొడుకు రవి, ఆమె భర్త మోహన్, ముగ్గురు... ముగ్గురి ప్రాణం బేరం పెడతాడన్న మాట! శ్రీమతి భార్గవికి ఇచ్చిన మాట తను కాపాడుకోగలడా!


అంతలో టెలిఫోన్ మోగింది. "హల్లో! యుగంధరా! శ్రీమతి భార్గవి గారికి మేము సంప్రదించకుండా మీరు ఆమెకి బస, కల్పాకం ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేశారు. అది వివేకమైన పనో కాదో మీరు నిశ్చయించుకోవాలి. ఎవరయితేనేం... మీ ద్వారా వస్తేనేం, ఆమె ద్వారా వస్తేనేం.. మాకు కావలసిన విషయాలు, రేపు రాత్రి లోపున చెప్పకపోతే ముగ్గురి శవాలు మీకు కానుకగా పంపుతాను. ఇదే ఆఖరి హెచ్చరిక” క్లిక్ మన్నది.

📖


తల కదిపితే, లోపల ఇనుపగుండు కదులుతున్నట్టు విపరీతమైన నెప్పి. గదిలో కొద్దిగా వెలుగు. నెమ్మదిగా రాజు తల తిప్పాడు. అవతల దూరంగా ఒక పెద్ద మంచం. దానిమీద ఇద్దరు కూర్చునున్నా రు. నెమ్మదిగా లేచి కూర్చుని "హల్లో!" అన్నాడు. మంచంమీద కూర్చునున్న అతనూ, పదేళ్ళ కుర్రాడు రాజు మంచం దగ్గిరికి వచ్చారు.


"హల్లో! ఎవరు మీరు?" అడిగాడు అతను.


"మీరు మోహన్. ఈ అబ్బాయి మీ కొడుకు రవి. అవునా?" అడిగాడు రాజు. అతను తలవూపి “మీ పేరు?” అడిగాడు. రాజు చెప్పాడు.


"రవిని ఎలా ఎత్తుకు వచ్చిందీ నాకు తెలుసు. మిమ్మల్ని ఎలా బంధించారు?" అడిగాడు.


"మద్రాసుకి బయలుదేరాను ఊటీనించి హోటల్ దగ్గిర టాక్సీ ఎక్కాను అంతే. టాక్సీ ఎక్కిన అయిదునిముషాలకి నాకు స్పృహ పోయింది. తర్వాత ఈ గదిలో వున్నాను" అన్నాడు మోహన్.


"ఇక్కడ్నించి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చెయ్యలేదా?” అడిగాడు రాజు.


"లేదు. ప్రయత్నం చెయ్యడానికి అవకాశం లేదు."


"భోజనము, ఇత్యాది అవసరాలు అందించడానికి ఎవరూ రారా?" అడిగాడు రాజు.


"వస్తారు కాని వాళ్ళని నేను చూడలేదు. పొద్దున్న నిద్ర లేచేటప్పటికి కాఫీ, టిఫిన్ బల్లమీద వుంటాయి. సరిగా పన్నెండు గంటలకి మత్తు వచ్చినట్టవుతుంది. కళ్ళు మూసుకుంటాను. అరగంట తర్వాత మత్తుపోయి కళ్ళు తెరిస్తే భోజనం బల్ల మీద వుంటుంది” అన్నాడు అతను.


స్పృహ పోయేటట్టు గదిలోకి ఏదో మత్తు మందు పంపుతున్నారు గదిలోకి వచ్చిన వార్ని చూడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా. ఎలా తను తప్పించుకోవడం! శత్రువుల్ని పట్టుకునేందుకు తను, యుగంధర్ కి సహాయపడడం బదులు తనే శత్రువులకి చిక్కి యుగంధర్ని మరింత కష్టమైన స్థితిలో పెట్టాడు. ఏదో ఒక కిటుకు  ఆలోచించాలి. ఎలాగైనా తప్పించుకోవాలి. ఆలోచిస్తున్నాడు రాజు.

📖


రేపు రాత్రి. సరిగా ఇరవైనాలుగు గంటల వ్యవధి వుంది. ఈలోగా శత్రువుని పట్టుకోవాలి. లేదా ముగ్గురి ప్రాణాలు బలి ఇచ్చిన వాడవుతాడు తను. యుగంధర్ గదిలో ఇటూ, అటూ పచార్లు చేస్తున్నాడు. శత్రువులకీ, తనకీ మధ్య సూచనకి ఎవరయినా వున్నారా! డాక్టర్ నటరాజ్ విషయము మర్చిపోయాడు. నకిలీ మోహన్ కి లేని జబ్బు వున్నట్టు అబద్ధం చెప్పి అతనికి సహాయపడ్డ డాక్టర్ నటరాజ్ శత్రువుల మనిషా? అయితే అతన్నించి... ఆ ఆలోచన రాగానే యుగంధర్ టెలిఫోన్ తీసి, ఒక నెంబర్ తిప్పాడు.


"హల్లో! డాక్టర్ శివప్రసాదా? యుగంధర్ స్పీకింగ్. డాక్టర్ నటరాజ్ కార్డియాలజిస్టు. పూనమలై హైరోడ్. ఆయన్ని గురించి ఏమైనా చెప్పగలరా?" అడిగాడు.


"డాక్టర్ నటరాజ్ నాకు ఆప్తమిత్రుడు. జి.హెచ్.లో ప్రొఫెసర్. చాలా తెలివైన డాక్టర్. ఏం?" అడిగాడు.


"ఆయన్ని కలుసుకోవాలి” అన్నాడు యుగంధర్.


"చాలా బిజీ డాక్టర్. సామాన్యంగా ఒక వారం రోజులముందు అప్పాయింట్మెంట్ తీసుకుంటేగానీ చూడరు. మీకు అంతగా అవసరమైతే నేను ఫోన్ చెసి చెపుతాను. ఈరోజు సాయంకాలం వెళతారా?" అడిగాడు డాక్టర్ శివప్రసాద్.


“లేదు. ఇప్పుడే కలుసుకోవాలి. వెంటనే."


“వెంటనే కలుసుకోవాలా? జి.హెచ్.లో వుంటారు.”


"థాంక్స్. అక్కడికి వెళ్ళి కలుసుకుంటాను" అన్నాడు యుగంధర్.

👥

*సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

*అతను అతను కాడు - 13*

👥


రచన: కొమ్మూరి సాంబశివరావు



"యస్... గ్లాడ్ టు మీట్ యు. ప్రస్తుతం నేను చాలా బిజీగా వున్నాను. అయిదు నిముషాలకన్నా..." అంటున్నాడు డాక్టర్ నటరాజ్.


"అయిదు నిముషాలు చాలు. మోహన్ అనే మెడికల్ రిప్రజెంటేటివ్ కి గుండె జబ్బనీ, మీరు ఎక్సరే చూసి, యి.సి.జి. తీసి చెప్పారు. అతనికి అటువంటి జబ్బు లేదు. ఎందుకని అబద్దం చెప్పారు?” అడిగాడు యుగంధర్.


డాక్టర్ నటరాజ్ చాలా కోపంగా చూసి “మిష్టర్ యుగంధర్! నా డయగ్నసిస్ తప్పని అనేందుకు మీకు ఎంత ధైర్యం?" అన్నాడు.


"మీ డయగ్నసిస్ తప్పని అనలేదు. కావలసి అబద్దం చెప్పడానికి కారణం అడిగాను" అన్నాడు యుగంధర్ కటువుగా.


"మీరు నాతో చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారు. నాపై మీకు అటువంటి దురభిప్రాయం వుంటే మెడికల్ కౌన్సిల్ కి రిపోర్ట్ చెయ్యండి” అన్నాడు డాక్టర్ నటరాజ్.


"డాక్టర్ నటరాజ్! మోహన్ కి గుండెజబ్బు లేదనీ, ఆయన భార్య డాక్టర్ భార్గవికి మీరు అబద్ధం చెప్పారనీ దృఢమైన సాక్ష్యం వుంది. మీరు నిజం చెప్పకపోతే మెడికల్ కౌన్సిల్ కి రిపోర్టు చెయ్యడమే కాదు... ఇప్పుడే మిమ్మల్ని అరెస్టు చేయిస్తాను, శత్రుదేశ గూఢచారులతో చెయ్యికలిపి దేశద్రోహం చేసినందుకు. మీరు అలా అబద్ధం చెప్పడానికి సమర్థనీ యమైన కారణాలు వుంటే చెప్పండి. మీకే మంచిది" అన్నాడు యుగంధర్. 


అప్పటివరకూ చాలా గంభీరంగా మాట్లాడిన నటరాజ్, మొహం ఒక్కసారిగా పాలిపోయింది. "శత్రుదేశ గూఢచారులా?" అడిగాడు..


యుగంధర్ తలవూపాడు..


"కూర్చోండి యుగంధర్, ఇంత సీరియస్ అనుకోలేదు. నిజం చెపుతాను. రెండు నెలల క్రితం మిసెస్ ఎడ్మండ్ అనే ఆమె నా వద్దకు పేషెంటుగా వచ్చింది. ఆమెకి పాతికేళ్ళు వుంటాయి. కళ్ళు తిప్పుకోలేని అందం అమెది. ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడుతుంది. గుండెదడ అనీ, బలహీనమనీ పరీక్ష చేయించుకోవడానికి వచ్చింది.”


“జనరల్ ప్రాక్టీషనర్ ఎవరయినా కేసు మీకు రిఫర్ చేశారా?” అడిగాడు యుగంధర్.


"నా పేరు విని తిన్నగా వచ్చానన్నది. గుండె దడకీ, బలహీనతకీ కారణం ఏమీలేదని చెప్పి, జనరల్ టానిక్ వ్రాసియిచ్చాను. రెండు రోజుల తర్వాత ఇంకా తగ్గలేదని మళ్ళీ వచ్చింది. ఎన్ని పరీక్షలు చేసినా, నాకు ఆమె జబ్బు ఏమిటో అర్థంకాలేదు. అబ్జర్వేషన్ కి నా నర్సింగ్ హోమ్ లో రెండు రోజులు వుండమన్నాను. సరేనన్నది. నా కన్సల్టింగ్ అవర్స్ అయిన తర్వాత రాత్రి ఇంటికి వెళుతూ ఆమెని చూడడానికి నర్సింగోమ్ కి వెళ్ళాను. స్పెషల్ గది తీసుకున్నది. తనని నేను సరిగ్గా పరీక్ష చెయ్యలేదనీ, సరిగ్గా పరీక్ష చేసి మందిస్తే తన జబ్బు తగ్గుతుందనీ చెప్పి ఏడ్వడం ప్రారంభించింది. న్యూరాటిక్ పేషెంటు అనుకున్నాను. సరే... పరీక్ష చేస్తానని...” డాక్టర్ నటరాజ్ మాటలు ఆపేశాడు. మొహం ఎర్రనయింది.

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe.

"ప్లీజ్... చెప్పండి.”


“ఎవరికీ చెప్పకూడదు" అన్నాడు డాక్టర్ నటరాజ్.


"ఆ మాట ఇవ్వలేను. తప్పనిసరైతేగానీ చెప్పను" అన్నాడు యుగంధర్.


"పరీక్ష చేస్తున్నప్పుడు ఆమె నన్ను లొంగదీసుకుంది. ఒక పేషెంటుతో... అందు లోనూ నా నర్సింగ్ హోమ్ లో వున్న పేషెంటుతో అక్రమసంబంధం పెట్టుకోవడం వృత్తిరీత్యా తప్పని తెలుసు, అయినా ఆమె అందానికి, ఆమె చిరునవ్వుకి దాసుణ్ణయిపోయాను. వారం రోజుల పాటు నర్సింగ్ హోమ్ లో వుంది. ప్రతి రోజూ, రాత్రి ఆమెతో ఆ గదిలో ఒక గంట గడిపేవాణ్ని. వారంరోజుల తర్వాత ఆమె తనకి ఆరోగ్యం చేకూరిందని తిరిగి వెళ్ళిపోయింది."


"తర్వాత మళ్ళీ కన్పించలేదా?"


“లేదు. ఆమె తన చిరునామా వ్రాసింది నర్సింగ్ హోమ్  రిజిస్టర్ లో. ఆ చిరునామా కు వెళ్ళాను రెండు రోజుల తర్వాత. ఆ ఇంట్లో, అటువంటి స్త్రీ లేదని చెప్పారు. తర్వాత ఆమె విషయమే మర్చిపోయాను. మోహన్ దగ్గిరికి వచ్చే ముందు రోజు రిజిష్టర్ పోస్టులో నాకు ఒక కవర్ వచ్చింది. అందులో నాలుగు ఫోటోలున్నాయి. నేనూ మిసెస్ ఎడ్మండ్... ఆత్మీయంగా...ఉన్న ఫోటోలు అవి. మా మొహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ ఫోటోలలో. ఆ రాత్రి నాకు ఎవరో టెలిఫోన్ చేశారు. మర్నాడు మోహన్ అనే అతను నా వద్దకు వస్తాడనీ

... అతనికి గుండెజబ్బు వున్నదనీ, స్త్రీ జోలికి వెళ్ళటం కూడదనీ చెప్పమన్నారు. అలా చెప్పకపోతే ఆ ఫోటోలు బహిర్గతం చేస్తామని బెదిరించారు. ఆమె భర్త ఎడ్మండ్ చేత నా పైన అడల్టరీ కేసు పెట్టిస్తామన్నారు.”


"వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఆ ఫోటోలు, నెగిటివ్ లు ఇస్తామన్నారా?"


"అదేం చెప్పలేదు. టెలిఫోన్ డిస్కనెక్ట్ చేసేశారు. వాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే నా బతుకే నాశనం అవుతుంది” అని తలవంచుకున్నాడు డాక్టర్ నటరాజ్.


"మీరు చెప్పిన విషయాలు రుజువు చెయ్యగలరా?" అడిగాడు యుగంధర్.


"ఫోటోలు చూపించగలను. ఇదిగో! నా జేబులోనే వున్నాయి. నర్సింగ్ హోమ్  రిజిష్టర్ లో ఆమె పేరు, అడ్మిషన్ తేదీ చూపించగలను. కాని నన్ను బెదిరిస్తూ చేసిన టెలిఫోన్ కాల్ రుజువు చెయ్యలేను" అంటూ కోటుజేబు లోంచి ఫోటోలు తీసి యుగంధర్ కి ఇచ్చాడు డాక్టర్ నటరాజ్. యుగంధర్ ఆ నాలుగు ఫోటోలు చూసి “వీటిని చింపి పారెయ్యకుండా ఎందువల్ల జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు?" అడిగాడు యుగంధర్.


"ఏమో! నాకే స్పష్టంగా తెలియదు. ఆమె మళ్ళీ నాకు కన్పిస్తే ఈ ఫోటోలు చూపించి ఎవరు ఇలా తీశారని బెదిరించి అడిగి తెలుసుకోవాలని అనుకుంటాను" అన్నాడు.


"ఈ ఫోటోలు తియ్యడానికి ఏర్పాట్లు ఆమే చేసివుండాలి. బహుశా మీరు గదిలోకి రాక ముందు మరెవరినో గదిలోకి రప్పించి, ఏ నీళ్ళగది లోనో దాచి వుండవచ్చు లేదా తనే కెమెరా ఏర్పాటు చేసి వుండవచ్చు, తనకై తను అమె మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుందని అనుకోను. ఈ ఫోటోలు నేను తీసుకుని వెళతాను మీ అనుమతితో...." అన్నాడు యుగంధర్.

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

"ఈ విషయం...?" అన్నాడు డాక్టర్ నటరాజ్.


"ఎవరికీ ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు. థాంక్స్! వస్తాను” అన్నాడు యుగంధర్.


కారు డ్రైవ్ చేస్తున్నాడే కాని మెదడు ఆలోచనలతో వేడెక్కుతోంది. 'డెడ్ ఎండ్' అంటారు, ఇదే! దర్యాప్తుకి... శత్రువులు ఉనికి తెలుసుకోవడానికి, ఇంకే సూచనా లేదు. కాని తెలుసుకోవాలి. మర్నాటి రాత్రిలోపున, లేదా...

📖


రాజు గదంతా పరీక్ష చూశాడు. మంచాలు, కుర్చీలు, ఫ్యాన్, ఎలక్ట్రిక్ దీపాలు. బహుశా ఆ గదిలో వాళ్ళు ఏం మాట్లాడు కున్నా వినిపించేందుకు మైక్ ఏర్పాటు చేసి వుంటారు. రాజు వెతుకుతున్నది ఆ మైక్ కోసం కాదు. గదిలోకి మత్తుమందు పంపే గొట్టం.. తర్వాత ఆ మత్తుమందుని పోగొట్టే గొట్టం.... రెండు గొట్టాలూ ఎక్కడో వుండి వుండాలి. ఎక్కడ? గోడలనీ, నేలనీ, కప్పు లనీ ప్రతి అంగుళం పరీక్ష చేస్తున్నాడు. పైన అవేమిటి? నీళ్ళకొళాయి గొట్టంలాంటివి రెండు. ఒక దానిపక్కన ఒకటి... అవేనా? అవే అయితే... ఏది మత్తుమందు పంపే గొట్టం? ఏది మత్తుమందు పోగొట్టే గొట్టం? తెలుసుకోవడం కష్టం. తమకి స్పృహ పోగొట్టిన తర్వాత గదిలోకి భోజనం తీసుకుని వచ్చేవారు ఎంతమంది? వచ్చి ఎంతసేపుంటారు? ముందు ఈ విషయాలు తెలుసుకుంటే తర్వాత పథకం ఆలోచించ వచ్చు. పైకి మాట్లాడడానికి వీలులేదు. గదిలో కాయితం కలం ఎక్కడా లేవు. మోహన్ దగ్గిరికి వెళ్లి చెవిలో చెప్పాడు రాజు, మోహన్ సహాయంతో బల్లని గోడ దగ్గిరికి జరిపాడు. తర్వాత బల్ల పైన కుర్చీ పెట్టి కుర్చీ పైకి ఎక్కి, ఆ రెండు గొట్టాలనీ పరీక్షచేశాడు. మోహన్ ఒక దుప్పటి చింపి ఇచ్చాడు. ఆ పీలికలని ఆ గొట్టాలలోకి దూర్చి, గట్టిగా బిగించాడు. అంతటితో తృప్తిపడలేదు. పొద్దున్న తినగా మిగిలిన బ్రెడ్ ముక్కలుంటే వాటిని ఇవ్వమని సంజ్ఞ చేసి, వాటిని ముద్ద చేసి, ఆ రెండు గొట్టాలలో బిగువుగా పెట్టి కిందికి దిగి కుర్చీని, బల్లనీ యధాస్థానంలో పెట్టేశాడు. తర్వాత ముగ్గురూ పడుకున్నారు. 


కాస్సేపటికి తలుపు తెరుస్తున్న చప్పుడు అయింది. మోహన్, రవీ గోడవైపు మొహం పెట్టి పడుకున్నారు. అలా పడుకోమని చెప్పాడు రాజు, రాజు మాత్రం వెల్లకిలా పడుకున్నాడు. గాఢనిద్రలో ఉన్నట్లు తాపీగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అడుగుల చప్పుడు, తర్వాత కీచుకీచు మంటూ చప్పుడూ. గిన్నెలు, పళ్ళాలు, బల్లమీద పెడుతున్న శబ్దాలు. రాజు కొద్దిగా కళ్ళు తెరిచి చూశాడు. ఒక చిన్న తోపుడు బండి మీద గిన్నెలు, పళ్ళాలు, మంచినీళ్ళ కూజాలు. వాటిని ఇద్దరు బల్లమీద మెల్లిగా పెడుతున్నారు. ఇద్దరూ ఆజానుబాహువు లు, తనవైపన్నా చూడలేదు. అవి పెట్టేసి వెళ్ళిపోయారు. అయిదు నిముషాల తర్వాత రాజు బద్దకంగా ఆవులించి, "హల్లో మిష్టర్ మోహన్! ఇంకా నిద్ర పోతున్నారా?" అని అడిగాడు.


"ఆ! ఆకలేస్తోంది. వెరీగుడ్. భోజనం వచ్చేసిందా?" అంటూ లేచాడు. రవీ కూడా లేచి కూర్చున్నాడు.


"తప్పించుకునేందుకు ఏదైనా మార్గం ఆలోచించారా?" అడిగాడు మోహన్ రాజు చెవిలో.


“అదే ఆలోచిస్తున్నాను” అన్నాడు అతని చెవిలో రాజు.

👥


*సశేషం*


*అతను అతను కాడు - 14*

👥


రచన: కొమ్మూరి సాంబశివరావు



"యుగంధర్ స్పీకింగ్!"


"గుడ్ ఈవినింగ్ యుగంధర్, డాక్టర్ నటరాజ్ ని కలుసుకుని మరొక సందేహం తీర్చుకున్నారు. నన్ను అడిగివుంటే నేనే చెప్పేవాడ్ని. అనవసరంగా చాలా శ్రమపడ్డారు. ఆలోచించి చెపుతామన్నారు! ఆలోచించారా?" అడిగాడు అవతలనించి.


“ఉభయులకీ శ్రేయస్కరమైన పథకం ఇంకా స్ఫురించలేదు, ఒకటి తప్ప..." అన్నాడు యుగంధర్.


"ఏమిటది?"


"ఒక నిర్ణీత ప్రదేశానికి మీరు రాజునీ, మోహన్నీ, రవినీ తీసుకురావాలి. అక్కడికి మీరు ఒక్కరే రావాలి. నేనూ ఒక్కణ్ణి వస్తాను. మీరు కోరిన విషయాలు అక్కడ చెపుతాను. చెప్పగానే వాళ్ళ ముగ్గుర్నీ నాకు ఒప్పచెప్పాలి.”


“నో! నో! అది వీలుకాదు. మీరు చెప్పే విషయం నిజమో అబద్ధమో నాకు ఎలా తెలుస్తుంది? అబద్ధం చెపితే? మీరు చెప్పిన తర్వాత... యురేనియం  ఎలా ఎప్పుడు వచ్చేదీ తెలిసిన తర్వాత... ఆ యురేనియం మాకు అందిన తర్వాత వాళ్ళని వదిలిపెడతాను” అన్నాడు శత్రువు.


"నో! నో! అదెలా అంగీకరిస్తాను? యురేనియం మీకు అందిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టకపోవచ్చు. ఇంకేదైనా బేరం పెట్టవచ్చు. లేదా మీ అసమర్థత వల్ల, యురేనియం మీ వశం చేసుకోలేకపో వచ్చు. యురేనియాన్ని తెస్తున్నప్పుడు తగిన రక్షణ లేకుండా తీసుకురారు” అన్నాడు యుగంధర్.


"మీ అనుమానానికి ఆధారం వుంది. అంగీకరిస్తాను. కాని పరిష్కారం ఏమిటి?" అడిగాడు.


"ఇంక కాస్త వ్యవధి ఇవ్వండి. ఆలోచించి చెపుతాను.”


"ఆల్ రైట్! ఒక గంట తర్వాత ఫోన్ చెయ్యండి హోటల్ రాజ్ కి. మోహన్ కావాలి అని అడగండి”


"ఏ మోహన్?" అడిగాడు యుగంధర్.


"మీ ఇష్టం. ఏ మోహన్ అయినా సరే... తర్వాత కాస్సేపటికి నేను మీకు ఫోన్ చేస్తాను" క్లిక్ మన్నది.

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

యుగంధర్ ఆలోచిస్తున్నాడు. హోటల్ రాజ్ లో వున్న పదిమంది మోహన్ లూ శత్రుదేశ గూఢచారులు అయ్యుండరు. తార్కికంగా ఆలోచిస్తే పదిమంది గూఢచారులని, ఒకచోట అలా చేర్చరు. బహుశా ఒక్కడే శత్రుదేశ గూఢచారి అయ్యుంటాడు. తను ఏ మోహన్ కి ఫోన్  చేసినా ఆ విషయం... ఆ పదిగదుల్లో వుండే ఒక్కో మనిషికీ చెప్పమని మిగతా తొమ్మిదిమందికీ డబ్బు ఇచ్చి తాత్కాలికం గా నియమించి వుంటాడు. ఆ తొమ్మిది మంది మోహన్ లకీ అసలు విషయం తెలిసివుండదు. తను ఫోన్ చేసిన తర్వాత శత్రుదేశ గూఢచారి అయిన మోహన్ పేరు పెట్టుకున్న అతను, హోటల్లోంచో మరి ఎక్కణ్నుంచో తన నాయకుడికి ఫోన్ చేస్తాడు.

📖


హోటల్ రాజ్ రెండవ అంతస్తులో నడవా ఊడుస్తున్నాడు హోటల్ కుర్రాడు. ఒక బకెట్, అందులో ఫినాయిల్ నీళ్ళు, ఒక పాత బట్టా వున్నాయి. కాసేపు వూడ్చి, ఆ తడిబట్టతో నేలని తుడుస్తున్నాడు. రూం నెం. 204 లోంచి ఒక యువకుడు బయటికి వచ్చాడు. చకచకా రూం నెం.206 లోకి వెళ్ళాడు.


రెండునిముషాల తర్వాత ఇద్దరు యువకులూ గదిలోంచి బైటికి వచ్చారు. రూం నెం.204లోంచి వచ్చిన యువకుడు మళ్ళీ తన గదికి వెళ్ళిపోయాడు. రూం నెం.206లోంచి వచ్చిన యువకుడు మెట్ల వైపు వస్తున్నాడు. నేలని తడిబట్టతో తుడుస్తున్న కుర్రాడు ఇదంతా ఒక కంటితో గమనిస్తూనే వున్నాడు. రూం నెం.206 గది లోంచి బయటికి వచ్చిన ఆ యువకుడు తన దగ్గిరికి మెట్ల దగ్గిరికి రాగానే చూసుకో నట్టు, నేలని తుడుస్తున్న బట్ట, అతని కాళ్ళకివేసి లాగాడు. మరుక్షణం ఆ యువకుడు కిందపడ్డాడు. 


"అయ్యయ్యో! క్షమించండి! చూడలేదు మీరు రావడం. తప్పు చేశాను. మేనేజర్ కి చెప్పకండి. ఉద్యోగం పోతుంది" అంటూ ఆ కుర్రాడు పడిపోయిన అతన్ని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు.


"యూ ఫూల్” అన్నాడా యువకుడు.


"మీ ఇష్టం... తిట్టండి... కొట్టండి! మేనేజర్ కి రిపోర్ట్ చెయ్యకండి" ప్రాధేయపడ్డాడు ఆ కుర్రాడు. జవాబు కూడా చెప్పకుండా ఆ యువకుడు మెట్లు దిగి వెళ్ళిపోయాడు.


నేలని తుడుస్తున్న ఆ కుర్రాడు యుగంధర్ అసిస్టెంట్ కాత్యా. ఆమె మారువేషంలో మొగవాడి వేషంలో వుంది. పడిపోయిన అతన్ని లేవదీస్తున్నప్పుడు అతని పాంటు వెనక లూప్ కి, ఒక చిన్న గుండులాటిది తగిలించింది. అది సిగ్నల్స్ ఇచ్చే మినియేచర్ ట్రాన్స్ మీటర్.

📖


బీప్, బీప్ అని స్పీకర్లోంచి వినిపిస్తోంది. ఎదురుగా ఒక బోర్డుకి మద్రాసు సిటీ వీధులు, ఆ వీధుల్లో షాపులూ, ఆ షాపుల్లో ఎక్కడ టెలిఫోన్స్ వున్నదీ గుర్తులు తెలిపే మ్యాపు. ఒక అద్దంమీద గీసివున్నది. అద్దం వెనక దీపం వెలుగుతోంది. బీప్ బీప్ మనే శబ్దంతో పాటు ఆ మ్యాప్ మీద ఒక గుర్తు కదులుతోంది. రెండు వీధులు దాటిన తర్వాత ఆ గుర్తు ఒక చోట ఆగింది. ఆగిన చోట టెలిఫోన్ బూత్ అని మ్యాప్ మీద గుర్తున్నది. వెంటనే యుగంధర్ టెలిఫోన్ తీసి "యుగంధర్ హియర్! టెలిఫోన్ బూత్ నెం. 108 వేపరీ హైరోడ్ ఏ నెంబర్ కి ఫోన్ చేస్తున్నదీ తెలుసుకోండి" అన్నాడు.


కాస్సేపటికి బీప్ బీప్ శబ్దం ఆగిపోయింది. అంటే అందులో బ్యాటరీ అయిపోయింద న్న మాట. బ్యాటరీ అయిపోయిన తర్వాత అది పొడి అయి కిందపడిపోతుంది. తనకి కావలసిందీ అదే. తను అటువంటి ట్రాన్స్ మీటర్ ఏర్పాటు చేసినట్టు శత్రువులకి తెలియకూడదు. అయిదు నిముషాల తర్వాత టెలిఫోన్ మోగింది.


"యుగంధర్ హియర్!" అన్నాడు.


"ఆ టెలిఫోన్ కాల్ నెం. 6666609 నెంబర్ కి చేశారు."


“సంభాషణ విన్నారా?"


"యస్... సర్. యుగంధర్ ఫోన్ చేశారు అని చెప్పాడు అంతే!”


"థాంక్ యు. ఆ టెలిఫోన్ నెంబర్ ఎవరి పేర్న వున్నది? ఎక్కడ వున్నది?"


"యస్ సర్. జస్ట్ ఒన్ సెకండ్. నికాల్స్ రోడ్, నెం. 18/289 వేపరి. సబ్స్క్రయిబర్ పేరు డి. శంకరలింగం.”


"థాంక్ యు” అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు.

📖


యుగంధర్ క్రిజ్లర్ డి.శంకరలింగం, ఫాన్సీ స్టోర్సు ముందు ఆపేటప్పటికి అప్పటికే అక్కడ పోలీసు జీపు ఆగివుంది. షాపు బయట ఇద్దరు పోలీసులు, లోపల ఇన్స్ పెక్టర్ స్వరాజ్యరావు, సార్జంటు శివం వున్నారు.

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

"ఈయనే డి. శంకరలింగం యుగంధర్" అన్నాడు ఇన్స్ పెక్టర్ స్వరాజ్యరావు షాపులో మధ్య నిలుచున్న అతన్ని చూపించి. నల్లగా, లావుగా, పొట్టిగా ఉన్నాడతను. మరొకరిద్దరు కూడా వున్నారు షాపులో. అది చిన్న షాపు కాదు. మరీ పెద్దదీ కాదు. యుగంధర్ శంకర లింగాన్ని పరీక్షగా చూశాడు.


"నాకేమీ తెలియదండీ! పోలీసులు ఎందుకు నా షాపుమీద దాడిచేస్తున్నారో తెలియడంలేదు. ఏ వస్తువు అమ్మినా కంట్రోలు ధరకి అమ్ముతాను. బిల్లు కూడా ఇస్తాను" అన్నాడు శంకరలింగం భయంతో.


"పావుగంట క్రితం మీకు ఒక టెలిఫోన్ కాల్ వచ్చింది.... అవునా?" అడిగాడు యుగంధర్...


"అవును సార్... కాదు సార్... నాకు కాదు... మా షాపుకి కాదు. మేడమీద వాటాలో వున్న మోహన్ అనే ఆయనకి" అన్నాడు శంకరలింగం.


"ఏ మేడమీద?"


“మా మేడమీదే. పక్కనే వున్నాయి మెట్లు...” శంకరలింగం అంటూండగానే ఇన్స్ పెక్టర్ , సార్జంటూ వెళ్ళిపోయారు.


"మీ మేడమీద ఆ మోహన్ అనే అతనికి టెలిఫోన్ కాల్స్ వస్తే మీరు ప్రతిసారీ పిలుస్తుంటారా?" అడిగాడు యుగంధర్.


"అవును సర్. అలా పిలిచినందుకు కాల్ కి అర్థరూపాయి ఇస్తారు ఆయన."


"ఎంతకాలం నించీ ఆ మోహన్ మీ మేడమీద వుంటున్నారు?”


“దాదాపు నెలరోజుల నుంచీ" అంటూండ గానే ఇన్స్ పెక్టర్  తిరిగివచ్చాడు.


“సారీ యుగంధర్! పైన ఒక గది, వసారా, నీళ్ళగది... చాలా చిన్నవాటా. ఏవో సామానులున్నాయి గదిలో. గది తనిఖీ చెయ్యలేదు. సార్జంటుని కాపలా వుంచి వచ్చాను. ఆ మోహన్ అనే అతను లేడు."


"ఆ టెలిఫోన్ కాల్ మోహన్ అనే అతనికే వచ్చిందనీ, మీరు మాట్లాడలేదనీ రుజువు చెయ్యగలరా?" అడిగాడు యుగంధర్.


"షాపులో నా అసిస్టెంట్స్ చెప్పగలరు. అంతేకాదు సర్! అతను మాట్లాడుతున్న ప్పుడు ఎదురింట్లోంచి టీచరమ్మ వచ్చి సోపు, పౌడరు కొనుక్కుని వెళ్ళారు. ఆమెని అడిగినా నిజం తెలుస్తుంది.”


“సరే... ఆ మోహన్ ఎలా వుంటాడు? వర్ణించి చెప్పగలరా?" అడిగాడు యుగంధర్.

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

“మధ్య వయస్సు. లావూ కాదు, సన్నమూ కాదు, పొడుగూ కాదు, పొట్టీ కాదు. చామనఛాయ, నల్లనిపాంటు, తెల్లని స్లాక్..." శంకరలింగం చెపుతుండగా టెలిఫోన్ మోగింది.


యుగంధర్ రిసీవర్ తీసుకున్నాడు.


"యుగంధరా?"


"యస్” అన్నాడు యుగంధర్, కంఠస్వరం గుర్తుపట్టాడు.


"నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించవద్దని చెప్పాను. అలా పట్టుకున్నా ప్రయోజనం వుండదనీ... నా అంగిట్లో వున్న సైనయిడ్ మాత్ర మింగి మరణిస్తానని చెప్పాను. అలా నన్ను పట్టుకోదలిస్తే మీ దగ్గిరికి వచ్చినప్పుడు పట్టుకోవలసింది. మేధావి అయిన డిటెక్టివ్ యుగంధర్ మేధస్సు క్షీణిస్తున్నట్టున్నది. మీ బల్లకింద నేను మినియేచర్ ట్రాన్స్ మీటర్ పెట్టానని తెలిసీ ఆ విషయం మర్చిపోయి, రాజుని హోటల్ రాజ్ కి వెళ్ళమని బిగ్గరగా చెప్పారు” అని నవ్వి "యుగంధర్! ప్లీజ్! ఇక ప్రయత్నించ కండి. మీ మేధస్సును సక్రమంగా ఉపయో గించండి. నేనడిగిన రహస్యం నాకు చెప్పి రాజు, మోహన్, రవి ముగ్గుర్నీ సురక్షితంగా విడిపించుకునేందుకు ప్రయత్నించండి. మళ్ళీ ఫోన్ చేస్తాను రేపు రాత్రిలోపున” క్లిక్ మన్నది రిసీవర్.


విసుగ్గా యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. అవును, తను పొరపాటు చేశాడు. రాజుని హోటల్ రాజ్ కి వెళ్ళమని చెప్పిన తర్వాత తనకి అనుమానం కలిగి చూశాడు... బల్ల కింద. అప్పుడైనా హోటల్ రాజ్ కి ఫోన్ చేసి రాజుని గదిలోకి వెళ్ళవద్దని చెప్పి వుండవలసింది. నిజమేనేమో! తన తెలివి తేటలు వయస్సు వస్తున్నకొద్దీ క్షీణిస్తున్నా యేమో! తన అసమర్ధత వల్లనే రాజుని శత్రువులకి చిక్కించాడు. వాళ్ళ ముగ్గుర్నీ రక్షించగలననే నమ్మకం ఏమిటి?


" ఏమిటి యుగంధర్ ఆలోచిస్తున్నారు?” అడిగాడు స్వరాజ్యరావు.


"ఏమీలేదు. ఇక్కడ నేను చెయ్యగలిగింది ఏమీలేదు. మేడమీద అద్దెకి వున్న మోహన్ సామానులు పరీక్ష చెయ్యండి. ఎప్పుడు అద్దెకు తీసుకున్నదీ మొదలయిన వివరాలు, వేలిముద్రలు సేకరించండి. మీ రొటీన్ ఇన్వెస్టిగేషన్ సాగించండి" అని శంకరలింగం వైపు తిరిగి “సారీ!" అనేసి యుగంధర్ బయటికి వెళ్ళిపోయాడు.


👥

*సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••

*అతను అతను కాడు - 15*

👥


రచన: కొమ్మూరి సాంబశివరావు



అది రాత్రో పగలో తెలియదు కాని, టిఫిన్ తెచ్చి ఇచ్చి దాదాపు రెండు గంటలు దాటి వుండాలి. అంటే చీకటిపడుతూ వుండాలి. రహస్యంగా చెవిలో చెప్పవలసిన విషయాలు మోహన్ కి చెప్పాడు రాజు. మోహన్ రవికి చెప్పాడు. ముగ్గురూ కాచుకున్నారు. పైన గొట్టాలకి అడ్డుపెట్టిన గుడ్డపేలికలు, బ్రెడ్ అలాగే వున్నాయి. అంటే గదిలోకి మత్తు కలిగించే వాయువు రాదు. తమకి స్పృహ పోదు. తలుపు తెరుస్తున్న చప్పుడు వినిపించగానే మోహన్, రవీ  గోడవైపు మొహాలు పెట్టి పడుకున్నారు. రాజు ఎప్పటిలా వెల్లకిలా పడుకున్నాడు. ఒక బండి తీసుకుని ఇద్దరు వచ్చారు. పొద్దున వచ్చినవాళ్ళే ఆ ఇద్దరు.


బల్లమీద గిన్నెలూ, పళ్ళాలు సర్ది పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళ దృష్టి తన మీదు లేదని, చూసి నిశ్చయించుకుని స్ప్రింగ్ లా మంచంమీద నించి లేచి, ఒక్క, ఎగురు ఎగిరి ఒకణ్ని మెడమీద కాలితో తన్నాడు రాజు. అతను శబ్దం చేయకుండా కిందపడిపోయాడు. రెండో మనిషి ఏం జరిగిందో తెలుసుకునేలోపునే, అతన్ని రెండు పిడికళ్ళతో తలమీద కొట్టాడు. రాజు ఊపిరి తీసుకుంటున్నాడు. అంతలో తన కాళ్ళని పట్టి లాగాడు ముందుగా కిందపడిన మనిషి. అతనికి స్పృహపోయి వుంటుందనుకున్నాడు కాని, ఆ దెబ్బకి మనిషికి స్పృహ పోలేదు. సరికదా, మనిషి అసలే బలశాలి. చాలా కోపంతో పదింతల బలంతో రాజుని ఒక్క లాగు లాగాడు. రాజు కిందపడ్డాడు.

"యు రాస్కెల్... మోసం చేస్తావా?" అని ఇంగ్లీషులో తిడుతూ రాజు మెడమీద రెండు చేతులూ వేసి బిగిస్తున్నాడు. రాజుకి ఊపిరి ఆడడంలేదు. కళ్ళు వెళ్ళుకు వస్తున్నాయి. అలా తను కిందపడి వుండకపోతే... ఎంత బలశాలినయినా కిటుకులతో, పట్లతో ఎదుర్కోగలడు. ఏ కిటుకూ ఉపయోగించడానికి వీలులేదు. రెండు చేతులు వీపు వెనక వున్నాయి. ఆ రెండో మనిషికి కూడా స్పృహ వచ్చి లేస్తే... అంతే... మోహన్... మోహన్ రాడేం తన సహాయానికి! అప్పుడు కనుకొలకుల్లోంచి చూశాడు. ఆ రెండో మనిషి లేవబోతుంటే అతన్ని లేవనివ్వకుండా మోహన్ అతని ఛాతీ మీద కూర్చుని అతని జుట్టు పట్టుకు నేలకేసి బాదుతున్నాడు. అంతవరకూ నయం.


గిలగిలలాడితే వున్న కాస్త శక్తీ పోతుంది. అతని రెండుచేతులూ రాజు మెడని నొక్కుతున్నాయి. తన ఛాతీపైన కూర్చుని నొక్కుతున్నాడు. అసలు అంత బరువు మొయ్యడమే కష్టంగా వుంది. దానికి తోడు ఊపిరి ఆడకుండా మెడని పట్టి గట్టిగా నొక్కుతున్నాడు. ఏం చెయ్యాలి! అని తను ఇంకా ఆలోచిస్తూ వుంటే, అసలు ప్రాణమే పోతుంది. రెండు కాళ్ళు పైకి ఎత్తి పూర్తిగా వొంచి, తన ఛాతీమీద కూర్చున్న అతని మెడ చుట్టూ అడకత్తెరలా బిగించి బలంగా వెనక్కి లాగాడు. అమ్మయ్య! మెడ మీద నించి అతని చేతులు సడలుతాయి. ఒక్కసారి గట్టిగా వూపిరి తీసుకుని 'రాజు' లేవబోయాడు. కాని వెనక్కిపడ్డ తన కాళ్ళ మధ్య ఇరుక్కున్న మనిషి అంత సులభంగా లొంగే మనిషి కాడు. అతనూ కాళ్ళతో రాజుని మొహంమీద తన్నాడు. రాజు వెనక్కి పడ్డాడు. అయినా, తన కాళ్ళని అతని మెడమీద నించి అస్సలు తియ్యలేదు. 


ఈసారి లేచి కూర్చుంటు తయారుగా వున్నాడు... అతను తన్నడానికి కాళ్ళు జాపగానే, రాజు అతని రెండు కాళ్ళు రెండు చేతులతో పట్టుకుని పక్కలకి విరిచాడు. బాధతో అతను విలవిల్లాడి మూలుగుతున్నాడు. అదే సమయంలో రాజు ఒక కాలు పక్కకు తీసి కాలి మడమ తో అతని కణతలమీద బలంగా తన్నాడు. ఆ దెబ్బకి అతనికి ప్రాణంపోదు కాని స్పృహ పోతుందని రాజుకి తెలుసు. వెంటనే అతన్నించి దూరమై మోహన్ దగ్గిరికి వెళ్ళాడు. మోహన్, ఆ ఇంకో మనిషి నేలమీద దొర్లుతున్నారు ఒకళ్ళని ఒకళ్ళు గట్టిగా పట్టుకుని.


"మిష్టర్ మోహన్ అతన్ని వదిలెయ్యి!" అన్నాడు రాజు. వెంటనే మోహన్ అతన్ని వదిలెయ్యగానే అతను లేచి నిలబడ్డాడు. వెంటనే రాజు పిడికిలి బిగించి అతన్ని కణత మీద కొట్టాడు. శత్రువులు ఇద్దరూ నేలమీద పడున్నారు.


"కనీసం గంటన్నర వరకూ ఇద్దరూ లేవరు" అన్నాడు రాజు.


“పారిపోదాం” అన్నాడు మోహన్.


“ఈ ఇంట్లో ఎంతమంది వున్నారో, వాళ్ళ దగ్గిర ఏ ఆయుధాలున్నాయో వివరాలు తెలియకుండా వెళ్ళడం అవివేకం. ముందు..." అంటూ స్పృహలేని ఆ ఇద్దరి జేబులనీ పరీక్ష చేశాడు. ఇద్దరి జేబుల్లో రివాల్వర్ లు వున్నాయి. మోహన్ కి ఒకటి ఇచ్చి,


"పేల్చడం తెలుసా?" అని అడిగాడు రాజు.


“తెలియదు” అన్నాడు మోహన్.


“అయితే నా దగ్గిరే వుంచుకుంటాను" అంటూ పిస్తోలు తీసుకుని, “ఆ దుప్పటి చింపి ఇవ్వండి" అని మోహన్ ఇస్తున్న బట్టపేలికలని, మెలివేసి పొడుగ్గా చేసి ఆ ఇద్దరి చేతులనీ వీపుల వెనక్కి పెట్టి గట్టిగా కట్టేశాడు. అలాగే వాళ్ళ కాళ్ళనీ కట్టేశాడు. తర్వాత నోళ్ళల్లో గుడ్డపేలికలు కుక్కేశాడు అరవకుండా, "స్పృహ వచ్చినా ఏం చెయ్యలేరు" అని ఒకసారి ఇటూ అటూ చూసి "ఎందుకయినా మంచిది. మన బట్టలు మార్చుకుందాం" అని స్పృహ లేని ఆ ఇద్దరి బట్టలు తీసేసి రాజూ, మోహన్ వేసుకున్నారు.


"రవీ?" అడిగాడు మోహన్.


“చెబుతాను” అని భోజనం తెచ్చిన చక్రాల బల్లమీద రవిని పడుకోమని పైన రెండు తువ్వాళ్ళు కప్పేశాడు రాజు. ఆ బండిని తోసుకుని గదిలోంచి బయటికి వెళ్ళారు. గది బయటవున్న నడవా చేరుకున్నారో లేదో 'ఢాంగ్' అని పిస్తోలు పేలింది.

📖


డిటెక్టివ్ యుగంధర్ కన్సల్టింగ్ రూంలో కూర్చుని తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. శత్రువు పేరు తనకి తెలియదు. తాత్కాలికంగా ఎక్స్ మోహన్ అని అంటే సరి. శత్రు సమూహానికి ఎక్స్ మోహన్ నాయకుడా లేక ఇంకోడా! మోహన్ని తను పట్టుకున్నా ప్రయోజనం లేదు. అతను నిజమే చెప్పివుండవచ్చు. సైనయిడ్ మాత్ర నమిలి ప్రాణం విడుస్తాడు. రాజునీ, రవినీ, మోహన్నీ ఎక్కడ బంధించిందీ తెలుసు కోవడం దాదాపు అసాధ్యం. ఈ మహా పట్టణంలో ఎక్కడని వెతకడం? పాకిస్తాన్, చైనా, అమెరికా ఈ మూడుదేశాల ఎంబసీ ల టెలిఫోన్ లు టాప్ చేస్తే... చేస్తారని వాళ్ళకి అనుమానం వుండివుంటుంది. ఎంబసీలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్న గూఢచారుల ముఠా ఇది. యురేనియం ఎప్పుడు, ఎలా వస్తున్నదీ తనకి తెలుసునని, తను బిగ్గరగా ఇన్స్ 

పెక్టర్ స్వరాజ్యరావుకి చెప్పడం శత్రువులు వినివుండాలి. తనని పట్టుకోడానికీ, తన చేత నిజం చెప్పించడానికి ఎందుకు ప్రయత్నించలేదు! అవకాశం లేకా? లేక తను ఎంత హింసనైనా భరిస్తాడు కాని, నిజం చెప్పడనే భయంవల్లా! మర్నాటి రాత్రిలోపున తను చెప్పకపోతే ముగ్గుర్నీ కాకపోయినా, ఏ ఒక్కర్నో చంపి ఆ శవాన్ని పంపిస్తారు. అంతటి ఘోరం జరగకుండా ఎలా ఆపడం? తను వేసే ఎత్తే వేస్తున్నారు. తను ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడినా తెలిసిపోతోంది. ప్రతి ఎత్తుకీ తెగించాలా! తన ప్రాణానికి ఆపద వస్తే చిరునవ్వుతో తెగిస్తాడు కాని, ఇంకొకళ్ళ ప్రాణం ప్రమాదానికి గురిచెయ్యడానికి తనకేం అధికారం వుంది? కాని తప్పదు. అడగాలి. ఆడిగి అంగీకరిస్తే.. ఒక నిట్టూర్పు వదిలి యుగంధర్ లేచాడు.

📖


"ఢాం!" పిస్తోలు పేలింది. ఎక్కణ్నించి, ఎవరు పేల్చారు? రాజు కూడా జేబులోంచి పిస్తోలు తీశాడు. ఇప్పుడు అవసరమైతే నిర్ధాక్షిణ్యంగా, అడ్డం వచ్చినవార్ని కాల్చి చంపడానికి రాజు సంసిద్ధుడు. మోహన్ బెదురుగా రాజువైపు చూశాడు. భయపడ వద్దు, నడు అని సంజ్ఞ చేసి, చక్రాలబండి తోసుకుంటూ నడవాలో కుడివైపుకి వెళ్ళాడు. నిజానికి ఎటువెళ్ళాలో తనకి తెలియదు. ఎటు వెళ్ళితే క్షేమమో కూడా తెలియదు. ఢాం! అని ఎడంవైపు నించి పిస్తోలు చప్పుడు వినిపించింది కనుక కుడి వైపుకి వెళ్ళాడు. నడవా చివర వరకూ వెళ్ళిన తర్వాత తెలిసింది. అక్కడ మెట్లు లేవు. తలుపు లేదు. అసలు వెళ్ళేందుకు దారిలేదు. మళ్ళీ వెనక్కి తిరిగాడు. బండి తోసుకుంటూ వెళుతున్నాడు.


"యు ఫూల్స్! త్వరగా రండి! వాళ్ళకి భోజనం ఇచ్చి రావడానికెంతసేపు" ఒక అరుపు. రాజు ఆశ్చర్యపోయాడు. అది స్త్రీ కంఠస్వరం.


"ఇంట్లోకి పాము వచ్చింది. షూట్ చేసి చంపేశాను. త్వరగా రండి!" మళ్ళీ అరిచింది ఆమే. గదిలోకి వచ్చిన ఆ ఇద్దరూ తప్ప ఆ ఇంట్లో మరెవరూ లేరా! ఉంటే వాళ్ళని ఎందుకు రమ్మంటుంది? రాజు చటుక్కున వెనక్కి వెళ్ళి తాము వచ్చిన గది తలుపు మూసి, బయట గడియపెట్టి, మళ్ళీ బండి తోసుకుంటూ వెళ్ళాడు. నడవా చివర్న ఒక పెద్ద హాలు. హాలులో సోఫాలు, టి.వి., ఇంకా ఎన్నో పరికరాలు, సోఫాలో కూర్చుని చేతిలో పిస్తోలు ఆడిస్తోంది ఒక యువతి. బల్ల కీచుమనే శబ్దం వినిపించగానే పక్కకి తిరిగి చూసింది. శత్రువుల బట్టలు తాము వేసుకున్నా, వాళ్ళంత పొడుగూ, లావూ లేకపోవడం వల్ల ఆమె క్షణంలో గ్రహించింది వాళ్ళు తన మనుష్యులు కారని, పిస్తోలు గురిపెట్టింది. రాజు తయారుగా వున్నాడు. తెలుసు... ఆమె పిస్తోలు తనవైపుకి గురి పెట్టగానే తనే ముందు పేల్చాడు. 'ఢాం' ఆమె చేతిలో పిస్తోలు కిందపడింది. ఆమె కింద పడిన పిస్తోలు తీసుకునేలోపున రాజు ఒక్క అంగలో కిందపడున్న పిస్తోలుని తీసుకున్నాడు.


"యూ ఫూల్! నువ్వు యుగంధర్ అసిస్టెంటు రాజువి అయ్యుండాలి. నా పిస్తోలు లాక్కున్నంత మాత్రాన ఈ ఇంట్లోంచి తప్పించుకుని పారిపోగలవని అనుకోకు" అన్నది ఆమె ధైర్యంగా.


"ఏం? ఎందుకు తప్పించుకోలేము! నువ్వు తప్ప ఎవరున్నారు ఈ ఇంట్లో?" అడిగాడు రాజు.


"కిటికీలోంచి చూడు తెలుస్తుంది" అన్నదామె.


"చూద్దాం రా!" అన్నాడు రాజు ఆమె వైపు వీపు తిప్పడం ఇష్టంలేక. ఆమె వద్ద వేరే ఇంకే ఆయుధం వుందో! ఆమె భుజాలని పట్టుకుని తోసుకుంటూ కిటికీ వద్దకు వెళ్ళాడు. అది అద్దాలకిటికీ. బయట చీకటి. ఏమీ కనిపించడం లేదు.

👥

*సశేషం*

꧁☆

*అతను అతను కాడు - 16*

👥


రచన: కొమ్మూరి సాంబశివరావు



బయట చీకటి. ఏమీ కనిపించడం లేదు.


"బుకాయిస్తున్నావు! ఏమీ లేదు. ఎవరూ లేరు!" అన్నాడు రాజు. 


"నీ పక్కన, గోడమీద వున్న రెండో స్విచ్ నొక్కు తెలుస్తుంది” అన్నది. 


రాజు సందేహించాడు. ఆ స్విచ్ నొక్కగానే ఆ ఇంట్లో మరి ఎక్కడయినా అలారం గంట మోగి ఇంకెవరయినా వస్తారా! ఇంట్లో ఇంకెవరూ వున్నట్లు లేరు. సాహసించాలి తప్పదు. స్విచ్ నొక్కాడు. వెంటనే బయట చీకటి మాయమైంది. దేదీప్యమానమైన ఫ్లడ్ లైట్సు వెలిగాయి. విశాలమైన తోట, రకరకాల చెట్లు... ఆ చెట్లమధ్య తోటలో తిరుగుతున్న రాజపాళయం కుక్కలు నాలుగు. ఆల్సేషియన్సు నాలుగు.


"అడుగు బయటపెట్టు! ఆ కుక్కలు ఒంటిమీద కండలేకుండా చీల్చేస్తాయి" అన్నదామె.


"వాటినీ షూట్ చేసి చంపేస్తే?" అడిగాడు రాజు.


"ప్రయత్నించి చూడు. ఒక కుక్కని షూట్ చేశావా మిగతావి కంటికి కనపడకుండా దాక్కుంటాయి. అంతేకాదు. అవి శిక్షణ పొందిన కుక్కలు. తోటలో వున్న ఒక మీట లాగుతాయి. అంతే! వెంటనే మా మనుష్యులు వస్తారు."


"మీ మనుష్యులు ఎక్కడున్నారు?" అడిగాడురాజు.


"నీకు ఆ రహస్యాలన్నీ విడమర్చి చెప్పాలా! ఇప్పటికే చాలా చెప్పాను" అని నవ్వింది ఆమె.


రాజు ఆలోచిస్తున్నాడు. ఈమె తప్ప ఇంట్లో ఇంకెవరూ లేరు. “నీ పేరు?" అడిగాడు రాజు.


"పేరు చెబితే తప్పించుకోగలవా! మిస్ ఎడ్మండ్" అని నవ్వింది. చాలా అందమైన యువతి.


"నువ్వు ఏ దేశస్థురాలివో నాకు తెలియదు. ఏ దేశ గూఢచారులతో చెయ్యి కలిపావో అంతకన్నా తెలియదు. కాని నీ వృత్తికి నీకు చాలా ఉపకరిస్తున్నదీ, అవసరమైనదీ నీ అందం. అవునా?” అడిగాడు రాజు.


ఆమె నవ్వి ఊరుకున్నది.


"ఈ కుక్కల బారినించి, ఏ ప్రమాదమూ లేకుండా మేము ఈ ఇంట్లోంచి తప్పించుకు పోవడానికి మార్గం చెప్పకపోతే...”


“చెప్పకపోతే...” అడిగింది.


"ఇన్నాళ్ళుగా ఎంతో ప్రయాసపడి పెంచుకుని, దిద్దుకుని కాపాడుకుంటున్న నీ అందం నాశనం చేస్తాను. ప్రస్తుతం నాలో దయాదాక్షిణ్యాలు లేవు” అన్నాడు రాజు.


“ప్రయత్నించి చూడు” అని మళ్ళీ నవ్వింది ఆమె. ఏమిటా ధైర్యం? ఈ శత్రువులు ఎలక్ట్రానిక్ డివైజర్ తో కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈపాటికే తను తప్పించుకు న్నట్లు మిస్ ఎడ్మండ్ అపాయంలో ఉన్నట్లు వాళ్ల నాయకుడికి తెలిసిపోయిందా? వాళ్లు వస్తున్నారా? రాజు ఆమె దగ్గిరికి వెళ్ళాడు. ఒక చెయ్యి పైకి ఎత్తాడు. కొట్టాలో... ఏం చెయ్యాలో ఇంకా తను ఆలోచించలేదు. ఎత్తిన ఆ చెయ్యిని ఆమె ఒక చేత్తో పట్టుకుని అతనికి దగ్గిరిగా జరిగి, చెంప మీద కొట్టింది.


"వాట్ ఈజ్ దిస్?" అన్నాడు రాజు.


"అందమైన మొగాళ్ళంటే నాకు ఇష్టం!" అన్నది నవ్వుతూ. ఇందులో ఏదో మోసం వుంది. బహుశా కొంత కాలయాపన కోసం అలా చేస్తోందేమో!"


"మిస్టర్ రాజూ! ఈ ఇంట్లోంచి మీరు తప్పించుకుని పోలేరు. ఆ కుక్కలు మాత్రమే కాదు. ఈ ఇంటిగేటుకీ, ప్రహరీ గోడకీ కరెంటున్న ఎలక్ట్రిక్ తీగెలున్నాయి. స్విచ్ కూడా బయట వుంది. కనుక అనవసరంగా ప్రాణాన్ని బలి ఇవ్వవద్దు!" అన్నది.


రాజు సందేహం తీరిపోయింది.


కుక్కలు నువ్వు చెప్పిన మాట వింటాయా?" అడిగాడు రాజు. 


"అయ్యో! కుక్క అంటే... నాకు చాలా భయం..." అన్నది ఆమె.


“అలాగా! అయితే మరీ మంచిది. తలుపు తెరుస్తాను. చటుక్కున నిన్ను బయటికి తోసేసి, మూసేస్తాను. నువ్వు చెప్పినట్లు ఆ కుక్కలే నిన్ను కరవడానికి వస్తే ఈ కిటికీ లోంచి కాల్చి చంపుతాను. లేదా అవి తోక ఆడించుకుంటూ నీ దగ్గిరికి వస్తే అప్పుడూ కాల్చి చంపుతాను. తెలిసిందా?” అన్నాడు.


ఆ యువతి మొహం పాలిపోయింది. 


“నాకు కుక్కలంటే చాలా ఇష్టం. పాపం! వాటిని చంపవద్దు” అన్నది దీనంగా.


“మనుషులమీద లేకపోయినా కనీసం జంతువుల మీదన్నా నీకు కొంత జాలి వున్నందుకు సంతోషం. కుక్కల్ని కాల్చి చంపవద్దంటే చెప్పు... మేము ఎలా తప్పించుకోవడం?" అడిగాడు రాజు.


"మిమ్మల్ని తప్పిస్తే... నా ప్రాణం...” అని ఏడుస్తోంది ఆమె.

"మిస్ ఎడ్మండ్... భయపడవద్దు. ఇక్కణ్నించి తప్పించుకున్న మరుక్షణం నించి మిమ్మల్ని నా ప్రాణప్రదంగా కాపాడుతాను. ప్రామిస్!" అన్నాడు రాజు.

📖


"డాక్టర్ శ్రీమతి భార్గవిగార్ని అత్యవసరంగా కలుసుకోవాలి" అన్నాడు యుగంధర్  తన వద్ద వున్న స్పెషల్ పాస్ తో కల్పాకం సెంటర్ లోకి వెళ్ళి.


“చూస్తాను. కూర్చోండి” అన్నది రిసెప్షనిస్టు.


అయిదు నిముషాల తర్వాత "సారీ సర్. ఆమె బయటికి వెళ్ళారు" అన్నది.


"ఆమె బయటకు వెళ్ళారా? సరిగా తెలుసా?" అడిగాడు యుగంధర్.


“అరగంట అయిందిట. భార్గవిగారి పర్సనల్ అసిస్టెంట్ చెప్పారు."


"త్వరగా... ఆమె పి.ఎ.తో మాట్లాడాలి.”


"రండి!" అన్నది రిసెప్షనిస్టు.


డాక్టర్ భార్గవి పి.ఎ. ముప్పయి ఏళ్ళ యువకుడు. “ఎక్కడికి వెళుతున్నదీ నాకు చెప్పలేదు. కాస్సేపట్లో వస్తానని వెళ్ళారు. తన కారులో, తనే డ్రైవ్ చేసుకుని వెళ్ళారు" అన్నాడా ఉద్యోగి, వెంటనే డైరెక్టర్ నారాయణ్ ని కలుసుకున్నాడు యుగంధర్.


"అఫ్ కోర్స్! మీరు చెప్పినట్టు ఆమెకి ఇక్కడే క్వార్టర్స్ ఇచ్చాను. ఎందువల్ల బయటికి వెళ్ళారో తెలియదు" అన్నాడాయన.


"శ్రీమతి భార్గవికి టెలిఫోన్ కాల్ ఏదయినా వచ్చిందా? దయచేసి తెలుసుకోండి."


“ఓ!యస్!” అని టెలిఫోన్ మాట్లాడి, యుగంధర్ని చూసి "యు ఆర్ రైట్! ఆమెకి డైరెక్టు లైన్ మీద కాల్ వచ్చిందిట, ఆమె వెళ్ళే అయిదు నిముషాల ముందు."


యుగంధర్ గదంతా పరీక్షగా చూసి బల్ల మీద వున్న కాగితం తీసి “మీతో కొంచెం మాట్లాడాలి. ఈ గదిలో కాదు. అలా బయటికి వస్తారా?" అని వ్రాశాడు. డాక్టర్ నారాయణన్, యుగంధరూ బయట వున్న లాన్ లోకి వెళ్ళారు.


"శత్రువులు మీ గదిలో మైక్రోడివైజ్ ఏర్పాటు చేశారేమోనని ఇలా బయటికి రమ్మన్నాను. మీ ఆఫీసులో సి.బి.ఐ. ఏజెంటు ఒకరు పనిచేస్తున్నారు. ఆయన తెలుసా?" అడిగాడు యుగంధర్.


“తెలియదు” అన్నాడు నారాయణ్.


"యురేనియం ఇక్కడికి ఆరు రోజుల్లో వస్తుందని మీరు డాక్టర్ భార్గవికి చెప్పారు. ఎప్పుడు? ఎలా వస్తుందో చెప్పారా?" అడిగాడు.


నారాయణ్, యుగంధర్ని పరీక్షగా చూసి, క్షణం ఆగి తలవూపాడు.


"మీకు ఆ వివరాలు ఎప్పుడు తెలిశాయి?" అడిగాడు యుగంధర్.


“ఈరోజే. తెలియగానే డాక్టర్ భార్గవిని నా గదికి పిలిపించి చెప్పాను."


“ఈ క్షణంనించీ మీరు, మీ ఆఫీసుకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏవీ, మీ గదిలో ఎవరితోనూ మాట్లాడకండి ఎలక్ట్రానిక్ నిపుణులు వచ్చి మీ ఆఫీసులో గదులన్నీ తనిఖీచేసి వెళ్ళేటంతవరకూ. ఆ ఏర్పాటు నేను చేస్తాను” అన్నాడు యుగంధర్.


"మీరు ఏర్పాటు చెయ్యనవసరంలేదు. మా డిపార్టుమెంటులోనే వున్నారు” అన్నాడు నారాయణ్.


"క్షమించండి! మీ ఆఫీసు సిబ్బందిలో ఎవర్నీ నమ్మడానికి వీలులేదు. ఆర్మీ నిపుణులని పంపుతాను. మరొక విషయం ఒకసారి వాడిన యురేనియంని శుద్ధిచేసి మళ్ళీ వాడడానికి సిద్ధం చెయ్యడంలో శ్రీమతి భార్గవి ప్రవీణురాలు, అవునా?" అడిగాడు యుగంధర్.


"అవును.”


“ఈ రీసెర్చి సెంటర్ లో ఈ పరిజ్ఞానం మరెవరికీ లేదా?" అడిగాడు యుగంధర్.


"వాట్ నాన్సెన్స్! నాకూ, మరొక ఇద్దరు నిపుణులకీ తెలుసు. ఇది టీం వర్క్ ఒకరు చేసే పనికాదు" అన్నాడు నారాయణ్.


“థాంక్స్” అన్నాడు యుగంధర్.

📖


"హల్లో! డాక్టర్ భార్గవీ హియర్!”


"హల్లో! డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంటు రాజుని, మోహన్ గారు, రవీ దొరికారు. మిమ్మల్ని వెంటనే బయలుదేరి రమ్మని యుగంధర్ చెప్పమన్నారు."


"వస్తున్నాను” అన్నది శ్రీమతి భార్గవి. వెంటనే వెళ్ళి కారు ఎక్కింది. చాలా వేగంగా వెళుతోంది కారు. కొంతదూరం వెళ్లాక ఎదురుగా ఒక అంబులెన్స్ వచ్చి భార్గవి కారు ముందుకి పోకుండా ఆగింది. భార్గవి కారు ఆపక తప్పలేదు. అంబులెన్స్

లోంచి ఒక యువకుడు దిగి "డాక్టర్ భార్గవి గారూ! యుగంధర్ మీ భర్తనీ, రవినీ రక్షించేటప్పుడు, శత్రువులతో పోట్లాడు తుండగా రవికి పిస్తోలుగుండు దెబ్బ తగిలింది. మీ అబ్బాయిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. త్వరగా రండి" అన్నాడు. వెంటనే భార్గవి అంబులెన్స్ ఎక్కింది. అంబులెన్స్ కదిలింది.


"రవి ఏ ఆస్పత్రిలో వున్నాడు?" అడిగింది.


ఒక నవ్వు వినిపించింది. ఆ నవ్వుని పట్టి అతనెవరో తెలిసింది. అతను యుగంధర్ కన్సల్టింగ్ రూంకి వచ్చిన గూఢచారి.

📖


కల్పకం ఆటమిక్ రీసెర్చి సెంటర్లో పనిచేస్తున్న సి.బి.ఐ. ఉద్యోగి కన్పించడం లేదని స్థానిక సి.బి.ఐ. అధికారి చెప్పాడు యుగంధర్ కి. ఆటమిక్ రిసెర్చి సెంటర్ లో, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమైనా వుంటే వాటిని తీసెయ్యమనీ.. రిమోట్ కంట్రోల్ ద్వారానో ఇతర మార్గాలవల్లో సెంటర్ నాశనం చేసే ఎక్స్ ప్లోజివ్స్ వుంటే వాటినీ తీసెయ్యమనీ స్థానిక ఆర్మీ ఇంటెలిజెంట్స్ అధికారికి చెప్పాడు యుగంధర్. తర్వాత బొంబాయి కి ఫోన్ చేసి "డిటెక్టివ్ యుగంధర్ హియర్! యస్! అర్జంట్! మీరు అనుకున్నట్లు ఈ రోజు మద్రాసుకి యురేనియం పంపవద్దు” అని చెప్పాడు.


"సారీ యుగంధర్! ఆ యురేనియంతో విమానం బయలుదేరి పది నిముషాలు దాటింది” అన్నాడు అవతలనించి. యుగంధర్ ఒక నిట్టూర్పు వదిలాడు. ఇప్పుడేం చెయ్యాలి! అని తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. యుగంధర్ కి ఒక అనుమానం కలిగి, చటుక్కున మళ్ళీ ఫోన్ తీసి, "యుగంధర్ హియర్, మొత్తం యురేనియం అంతా పంపిస్తున్నారా?" అని అడిగాడు.


"లేదు. కొంత పంపిస్తున్నాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో..." అన్నాడు ఆ అధికారి. అంతలో ఒక యువకుడు లోపలికి వచ్చాడు.


"సర్! నేనే, కల్పాకంలో వున్న సి.బి.ఐ. ఏజంటుని. నా పై అధికారి మిమ్మల్ని కలుసుకోమని చెప్పారు" అని తన ఆనవాలు చూపించి, “శ్రీమతి భార్గవి కారు ఎక్కడం చూశాను. వెంటనే నేను నా కారులో అమె వెనకే బయలుదేరాను. కాని గేటు వరకూ వెళ్ళాక, గేటు జవాను నన్ను వెళ్ళనివ్వలేదు. తన వెనకే ఏ కారు వచ్చినా పోనివ్వవద్దని డాక్టర్ భార్గవి చెప్పారని గేటు జవాను చెప్పాడు. ఆమె పెద్ద ఉద్యోగి, గేటు జవాను ఆమె ఆజ్ఞని తిరస్కరించలేకపోయాడు. నేను జవానుని పిస్తోలుతో బెదిరించి గేటు తెరిపించాను. కాని ఆలస్యం అయిపోయింది. ఆమె కారుకి అడ్డంగా ఒక అంబులెన్స్ రావడం, ఆమెని అందులోకి ఎక్కించుకొని తీసుకు పోవడం దూరంనించి చూశాను. అంబులెన్స్ నెంబర్ కూడా కన్పించలేదు" అన్నాడు అతను.

👥

*సశేషం*


*అతను అతను కాడు - 17*


రచన: కొమ్మూరి సాంబశివరావు



"నేను వసారాలోకి వెళ్ళి నిలుచుంటాను. ఆ పక్కగది తలుపు తెరుస్తాను. కుక్కలని పిలుస్తాను. ఆ కుక్కలన్నీ గదిలోకి వెళ్ళాక తలుపు మూసి గడియ వేస్తాను. తర్వాత..."


"వెరీగుడ్! మోసం చెయ్యడానికి ప్రయత్నించక! పిస్తోలు వీపుమీద గురిపెట్టి ఉంచుతాను" అన్నాడు రాజు.


"నేను మోసం చెయ్యను. మీరు నన్ను మోసం చెయ్యవద్దు. డబ్బుకు ఆశపడి, ఈ ముఠాలో చేరాను. వీళ్ళు దేశద్రోహులని నాకు తెలియదు" అన్నది మిస్ ఎడ్మండ్.


ఆమె వసారాలోకి వెళ్ళింది. ఒక్కొక్క కుక్కనీ పేరు పేరునా పిలిచి అన్నీ వసారా లోకి రాగానే పక్కనున్న గదిలోకి వెళ్ళమని చెయ్యి చూపించింది. కుక్కలన్నీ ఆ గది లోకి వెళ్ళాక తలుపు మూసేసింది.


"రండి! ఇక కుక్కలు ఏం చెయ్యవు!" అన్నదామె. రాజు, వెనకే మోహన్, రవీ వసారాలోకి వెళ్ళారు.


"మనం... అంటే, ఈ ఇల్లు ఏ ప్రాంతాల వున్నది? కారు కాని, మరేదయినా వాహనం కాని ఇక్కడ వున్నదా?” అడిగాడు రాజు.


"ఈ ఇల్లు ఎక్కడున్నదీ నాకు తెలియదు. కళ్ళకు గంతలు కట్టి నన్ను ఇక్కడకు తీసుకువచ్చారు. వాహనం విషయం చూడాలి" అన్నదామె.


"పాపం! కుక్కలకి మంచినీళ్లు, తిండీ?" అడిగాడు రవి.


“ఒక గంటసేపట్లో ఏమీ కావు. మనం ఇక్కణ్నించి బయటికి వెళ్ళగానే పోలీసు లని పంపించి కుక్కలని విడిపిస్తాను" అన్నాడు రాజు ఆ పిల్లాడి భుజం తట్టి.


అంతలో గేటు దగ్గిర ఏదో చప్పుడు వినిపించింది. ఒక అంబులెన్స్ ఆగడం చూశాడు. అంబులెన్స్ లోంచి ఒక మనిషి దిగాడు.


"గుడ్ గాడ్! వాళ్ళు వచ్చేశారు" అన్నది ఎడ్మండ్. పారిపోవడానికి దోవలేదు. మళ్ళీ ఇంట్లోకి వెళితే బందీలుకాక తప్పదు. ఏంచెయ్యాలి?

📖


తాంబరం ఎయిర్ ఫోర్స్ విమానాశ్రయంలో వున్నాడు డిటెక్టివ్ యుగంధర్, "విమానం బొంబాయి నించి బయలుదేరి, నాలుగు గంటలు అయింది. ఈపాటికి రావలసిందే!" అన్నాడు.


"అవును. ఆశ్చర్యంగా వుంది. ఎందుకు ఇంకా రాలేదో! అంతేకాదు. ఫైలట్ ని హైద్రాబాద్ టవర్ కంట్రోల్ ని కాంటాక్టు చెయ్యమన్నాము. అదీ చెయ్యలేదు."


"ఆ పైలట్ గురించి మీకు బాగా తెలుసా?" అడిగాడు యుగంధర్.


"అతని దేశభక్తిని శంకించవలసిన అవసరం లేదు" అన్నాడు వింగ్ కమాండర్.


"అయితే ఆ విమానం ఏమయింది?" అడిగాడు యుగంధర్.


"అదే మాకూ తెలియకుండా వుంది. క్రాస్ అయిందా?" అన్నాడు వింగ్ కమాండర్.


"బొంబాయి నించి మద్రాసుకి వచ్చేదారిలో ఉపయోగంలో లేని విమానాశ్రయాలు వున్నాయా? వుంటే ఎన్ని?" అడిగాడు యుగంధర్.


"దాదాపు ఏడు వున్నాయి. యుద్ధకాలంలో నిర్మించినవి.”


"దరిదాపుల వున్న ఎయిర్ ఫోర్స్ విమానా శ్రయాల నించి మన విమానాలు పంపండి! ఉపయోగంలో లేని ఆయా విమానాశ్రయా లలో ఎక్కడయినా యురేనియం తెస్తున్న విమానం దిగిందేమో!” చెప్పాడు యుగంధర్.


"ఎందుకు మన పైలెట్ దింపుతాడు?"


"కారణం ఏదయినా వుండవచ్చు. దయచేసి...”


"యస్..." అన్నాడు వింగ్ కమాండర్.

📖


"ఎడ్మండ్! కుక్కలు ఏమయ్యాయి?” అరిచాడు.


"మీరు రావడం చూశాను. కొత్తవాళ్ళని ఎవర్నయినా తీసుకుని వస్తున్నారేమో, కుక్కలు గొడవ చేస్తాయేమోనని గదిలోకి తోసి గడియపెట్టాను" అన్నది ఎడ్మండ్. రాజు చెప్పినట్టు కుక్కల్ని వదిలివెయ్య డానికి వ్యవధి లేకపోయింది.


"కుక్కల్ని వెంటనే వదిలెయ్యి" అన్నాడు. అతని కూడా శ్రీమతి భార్గవి వచ్చింది.


"భార్గవిగారు! మీ భర్త మోహన్, మీ కొడుకు రవి ఈ ఇంట్లోనే వున్నారు. మేము కోరిన విషయాలు చెప్పకపోతే వార్ని మీ కళ్ళ ముందు చిత్రహింసలు పెడతాము" అన్నాడు అతను కటువుగా.


"నన్ను హింసించినా, నా భర్తనీ, నా కొడుకునీ నా కళ్ళ ముందు చంపింనా మీకు నేను ఏమీ చెప్పను. భారతదేశ క్షేమంకన్న మా ప్రాణాలు ముఖ్యం కాదు" అన్నది భార్గవి.


"బాగా ఆలోచించే అంటున్నారా?" అడిగాడు.


"నువ్వు బాగా ఆలోచించే నన్ను బెదిరిస్తున్నావా?" ఎదురు ప్రశ్న వేసింది.


భార్గవి దేశభక్తిని లోలోన మెచ్చుకున్నాడు రాజు. శత్రువు ఒక్కడే వున్నాడు. అవసరమైతే, అతన్ని కాల్చి చంపవచ్చు. భార్గవికి మాత్రం ఏ అవ్వ కూడదు. 

📖


"థాంక్ గాడ్ ! వచ్చేసింది విమానం!" అన్నాడు వింగ్ కమాండర్.


"పైలట్ ఏమైనా చెప్పాడా?" అడిగాడు యుగంధర్.


"లాండింగ్ క్లియరెన్స్ అడిగాడు అంతే!"


"గుడ్!” అన్నాడు యుగంధర్, అయిదు నిముషాల తర్వాత ఎయిర్ ఫోర్స్ విమానం దిగింది. వెంటనే యుగంధరూ, ఇతర ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులూ విమానం దగ్గిరికి వెళ్ళారు. అప్పటికే పైలట్ విమానంలోంచి దిగాడు.


"ఎందుకింత ఆలస్యం అయింది?" అడిగాడు వింగ్ కమాండర్. 


"సారీ సర్! విమానం హైజాక్ చేశారు."


“అంటే?” అడిగాడు యుగంధర్.


“నాతో కో పైలట్ గా వచ్చిన అతను నిజంగా కెప్టెన్ శంకర్ కాదు. శంకర్ లా తయారయిన మనిషి, చీకటిగా వుండగా బయలుదేరడం వల్ల నేను కాని, మరెవరూ కాని అతను అసలు శంకర్ కాడని గుర్తించ లేదు. విమానం బయలుదేరిన పదిహేను నిముషాల తర్వాత, అంటే బొంబాయి కంట్రోల్ టవర్ కి దూరం అయ్యాక, పిస్తోలుతో నన్ను బెదిరించి, ఏదో మత్తు మందు నామీద జల్లాడు. నాకు స్పృహ పోయింది. మళ్ళీ స్పృహ వచ్చేసరికి బళ్ళారి వద్ద నిరుపయోగంలో వున్న విమానాశ్రయంలో వున్నాను. కోపైలట్ శంకర్ లేడు. నేను తెస్తున్న ఇనుపపెట్టె కూడా లేదు. ఆ చీకట్లో అక్కడ నేను చెయ్యగలిగింది ఏమీ లేదు కనుక వెంటనే బయలుదేరి వచ్చేశాను" అన్నాడు ఆ పైలట్.


"తగిన సెక్యూరిటీ, కూడా ఇంకో రెండు విమానాలూ లేకుండా ఎందుకు పంపారు?" అడిగాడు యుగంధర్.


"హడావిడి చేస్తే, అసలు విషయం తెలుస్తుందని రొటీన్ ఫ్లైట్ లా వుండేందుకు" అన్నాడు ఆ పైలట్.


"కామ్ ఆన్! వెంటనే మనం బళ్ళారి వద్ద ఎయిర్ ఫోర్ట్ కి వెళ్ళాలి. స్థానిక పోలీస్ ఉద్యోగులని జీపులతో, సిబ్బందితో అక్కడికి రమ్మని మెసేజ్ పంపండి" అన్నాడు యుగంధర్.

📖


“ముందు నా కొడుకునీ, నా భర్తనీ నాకు చూపించు!" అన్నది శ్రీమతి భార్గవి. 


అతను నవ్వాడు. “బెదిరిస్తున్నావు! ఏమిటి నీ ధైర్యం?" అన్నాడు.


"నాకు కానీ, నా వాళ్ళకి కానీ నువ్వు ఏ అపకారం చేసినా మీ పథకం సాగదు. నా మీద ఈగ కూడా వాలకూడదని నాకు తెలుసు. నీ బాస్ నీకు అటువంటి ఆజ్ఞ ఇచ్చి వుండాలి.”


"బుద్ధి లేకుండా మాట్లాడక. నాకు అటువంటి ఆజ్ఞ ఏదీ ఇవ్వలేదు."


"నీకే బుద్ధిలేదు. నీ బాస్ నీకు ఎప్పుడు ఎలా ఆజ్ఞలు ఇస్తాడో నీకే తెలియదు. బహుశా నీ కోటుజేబులో ఒక కవరు వుంటుంది. చూసుకో" అన్నదామె.


అతను కోటుజేబులు వెతికాడు.

👥


*సశేషం*

꧁☆

*అతను అతను కాడు - 18*

👥


రచన: కొమ్మూరి సాంబశివరావు



విమానం లోంచి దిగగానే యుగంధర్ నేలని పరీక్ష చెయ్యడం ప్రారంభించాడు.


"ఇది తాత్కాలికమైన విమానాశ్రయం కనుక రన్ వే కి సిమెంటు చెయ్యలేదు. విమానం దిగినా, కార్లు వచ్చినా నేలమీద గుర్తులుంటాయి” అన్నాడు పక్కనున్న ఉద్యోగులతో, అప్పటికే స్థానిక పోలీస్ ఆఫీసర్లు చాలామంది వచ్చేశారు.


“ఇక్కడ ఒక్క విమానమే దిగింది. అంటే అది మనది. ఒక పక్క జీపు వచ్చినట్లు, టైర్ గుర్తులున్నాయి. ఈ గుర్తులని బట్టి వెంటాడాలి" అన్నాడు యుగంధర్. సాయుధ పోలీసుబలగంతో బైలుదేరాడు. ముందు ఒక కారు ఒక జీపు వెళుతున్నా యి. అప్పుడప్పుడూ ఆగి, టైర్ గుర్తులని చూసుకుంటా ముందుకు వెళుతున్నారు.


“ఈ రోడ్ లో వెళితే ఏ వూరికి వెళతాం?" అడిగాడు యుగంధర్. 


"ఇది కచ్చారోడ్. కాస్త దూరం వెళితే ఒక చిన్న అడవి వుంది. అక్కడితో ఈ రోడ్ ఆగిపోతుంది" అన్నాడు డి.ఐ.జి.


"ఆ కన్పిస్తున్నదేనా అడవి?" అడిగాడు యుగంధర్. డి.ఐ.జి. తలూపాడు. అంతలో ఢాం ఢాం అని చప్పుళ్ళు వినిపించాయి. ముందు వెళుతున్న జీప్ ట్రక్ తునాతునకలయ్యాయి. 


"డామిట్! మైన్స్ ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా ముందుకు సాగాలి" అన్నాడు యుగంధర్.


“ఎవర్నయినా హెడ్ క్వార్టర్స్ కి పంపి ఇంకా కొంతమంది సాయుధు పోలీసులని రప్పిస్తే?" అడిగాడు డి.ఐ.జి.


"నో! నో! అంత వ్యవధి లేదు. శత్రువులు పారిపోతారు. జాగ్రత్తగా చూసుకుంటూ కాలినడకన వెళ్ళాలి. పాపం! ఆ పోలీస్ ఉద్యోగులు ఏమయ్యారో చూడాలి" అన్నాడు యుగంధర్.

📖


రెండు పిస్తోళ్ళు, చెరో చేతిలో చెరొకటి పట్టుకుని, గురిపెడుతున్నాడు రాజు. అంతలో వెనకనించి ఎవరో అతన్ని తోశారు. దొర్లుకుంటూ మెట్లమీద నించి కిందపడ్డాడు రాజు. రాజు లేవబోతూండగా అతని రెండు చేతులమీదా రెండు బూట్సు కాళ్ళు వచ్చి నిలిచాయి.


"తప్పించుకు పారిపోదామనుకున్నావా? అసలు నువ్వు ఎలా తప్పించుకున్నావు? ఎడ్మండ్!" అన్నాడు ఆ బాస్.


“నాకు తెలియదు” అన్నది ఎడ్మండ్.


"ఆల్ రైట్! గెటప్!" అంటూ రాజుచేతిలోని పిస్తోళ్ళు లాక్కున్నాడు. తర్వాత ఉత్తరం చదవడం ముగించి, భార్గవి వైపు తదేకంగా చూసి, "నిన్ను వీళ్ళిద్దరి ముందు కాదు.., విడిగా, వొంటిగా... నీకు బుద్ధి చెప్పాలి. అప్పటికి కాని నిజం కక్కవు" అంటూ భార్గవిని చెయ్యిపట్టుకు చరచర ఈడుస్తూ మేడమీదికి తీసుకుని వెళ్ళాడు ఆ బాస్. మోహన్ ని ఒక బలశాలి గట్టిగా పట్టుకున్నాడు.


తనమీద ఒకడు పిస్తోలు గురిపెట్టి ఉంచాడు. రవి ఏడుస్తున్నాడు. భార్గవికి ఎలా సహాయం చెయ్యడం? అమెని హింసించకుండా ఎలా ఆపడం? అలోచిస్తూ రాజు ఎడ్మండ్ వైపు చూశాడు, ఆమె ఏదైనా సహాయం చేస్తుందేమోనని.

📖



"జీపులో వున్న నలుగురు, ట్రక్ లో వున్న ఆరుగురు పోలీస్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళని వెంటనే ఆస్పత్రికి పంపండి!" అని యుగంధర్ ఒక అడుగు ముందుకు వేసి చూస్తున్నాడు.


“ఏమిటి చూస్తున్నారు?” అడిగాడు డి.ఐ.జి.


"మన వాహనాలు ముందుకి సాగితే అన్నీ పేలిపోతాయి. కాలినడకన వెళుతూ ఈ మైన్స్ తీసెయ్యాలి" అన్నాడు యుగంధర్.


"ఎలా?"


"ఆ పని నేను చేస్తాను. మీరందరూ ఆయుధాలతో నా వెనకే రండి. అడివి లోకి చేరుకున్న తర్వాత, నలుగురేసి చొప్పున జట్లుగా విడిపోయి లోపలికి వెళ్ళి వెతకాలి!"


"ఆల్ రైట్. ఆర్డర్స్ ఇస్తాను” అన్నాడు డి.ఐ.జి.

📖



శ్రీమతి భార్గవిని ఛెళ్ మని చెంపమీద కొట్టాడు.


"ఎంత ధైర్యం నీకు?” అన్నది.


“అవును. ఇంతేకాదు నీ చర్మం ఒలుస్తాను. చెప్పు? మా ముఠాకి సంబంధించిన వివరాలు, మా బాస్ రహస్య గుర్తు నీకు ఎలా తెలిసింది? నువ్వే ఈ కవరు నా కోటు జేబులో పడేసి వుండాలి. ఇంకెవరికీ అవకాశంలేదు" అన్నాడు అతను.


"నీ బాస్ ని కాంటాక్టు చేసి తెలుసుకో! అనవసరంగా నామీద చెయ్యి చేసుకుంటే తర్వాత చింతిస్తావు" అన్నది భార్గవి. ఆమె ధైర్యం, ఆమె మాటల్లో గాంభీర్యం, ఠీవి చూసి అతను సంశయంలో పడ్డాడు.


“సరే! బాస్ ని కలుసుకుంటాను" అని గది తలుపు గడియపెట్టి మెట్లు దిగాడు.

📖


అడవి చిన్నదే. చెట్లు పెద్దవి కావు. కాని చాలా గుబురుగా వున్నా లోపలికి వెళ్లిన కొద్దీ చీకటి ఎక్కువ అవుతోంది. యుగంధరూ, వెనకే వస్తున ముగ్గురు పోలీసులు నెమ్మదిగా ముందుకి కదులు తున్నారు. టార్చిలైట్ కి అరచెయ్యి అడ్డం పెట్టుకుని వేళ్ళసందులోంచి వచ్చే వెలుగు ఆధారంగా డైనమైట్ పేలే తీగెలని నేర్పుగా వెతుకుతూ డిస్కనెక్ట్ చేస్తున్నాడు యుగంధర్. మొత్తం ఆరు జట్లుగా విడివిడి గా అడవిలోకి ప్రవేశించారు. ఎక్కడో ఢాం, ఢాం అని పేల్చులు వినపడ్డాయి. పాపం! ఎందరు ఉద్యోగులు గాయపడ్డారో! ఎందరు మరణించారో! వాళ్ళ సహాయాని కి తను వెళ్ళలేడు. ఆ అడవిలో మిగతా వాళ్ళు ఏ ప్రాంతాల వున్నారో! ఢాం ఢాం పేల్పులు. పేల్పులని బట్టి మిగతా అయిదు జట్లు గాయపడివుండాలి అనుకున్నాడు యుగంధర్. మరికొంత దూరం వెళ్ళాడో లేదో, దేదీప్యమైన వెలుగు మీదపడింది. 


“ఒక్క అడుగు ముందుకి వెయ్యవద్దు. కాలు కదిపావా చస్తావు" అని బెదిరింపు వినపడింది. ఫ్లడ్ లైట్ వేశారు తనమీద. కళ్ళు జిగేలుమన్నాయి. ఆ దీపం వెనక ఎవరు, ఎంతమంది వున్నారో కన్పించడం లేదు.


“మీరు తప్పించుకోలేరు. అన్ని వైపుల నించీ..." అంటున్నాడు యుగంధర్.


"మాకు ఆ భయంలేదు. మీరు కదలకండి" ఢాం అని పేలింది. గుండు యుగంధర్ పక్కగా రివ్వున వెళ్ళింది. అంత వెలుగులో వాళ్ళకి గురి తప్పిందా? లేక తనని కాల్చి చంపడానికి సిద్ధంగా లేరా? గురి తప్పడం వల్ల మళ్ళీ కాలుస్తారా! ఈసారి గురి తప్పదు. తన ప్రాణమే కాదు... తన కూడా వున్న ముగ్గురి ప్రాణాలు కాపాడడం ఎలా? వ్యవధి లేదు. మళ్ళీ 'ఢాం' అని పేలింది.

📖



"యు ఫూల్! ఎందుకు రాజుని తప్పించు కోనిచ్చావు? బుద్ది వుందా లేదా? నీలాటి అసమర్ధుల వల్ల మా పథకం నాశనం అవుతుంది" అని అరిచాడు మెట్లు దిగి వచ్చిన బాస్ మోహన్ ని చూసి.


"నాకు..." అని మోహన్ ఏదో చెప్పబోతున్నాడు. అతని వాక్యం పూర్తి కాకముందే అతన్ని పిస్తోలుతో ఛాతీమీద కాల్చాడు. అంతే! వెంటనే మోహన్ నేల మీద పడ్డాడు. రాజుకి తెలుసు తక్షణం మోహన్ ప్రాణం పోయిందని, అంతా అయోమయంగా వుంది రాజుకి. ఆ బాస్ అన్న మాటల్లో అంతరార్థం ఏమిటి?


"ఈ కుర్రాణ్ని గదిలోపెట్టి తాళం వెయ్యండి" అని అరిచాడు బాస్. చాలా కోపంగా వున్నాడు. తను చిటికెనవేలు కదిపితే తననీ నిర్ధాక్షిణ్యంగా కాలుస్తాడు.


"నువ్వు, యుగంధరూ మాకు చాలా ఇబ్బందులు కల్పించారు. మా జోలికి రావద్దని ప్రారంభంలో హెచ్చరించాను. విన్నారు కాదు. ఈసారి మీకన్న ఘటికులూ, తెలివైన శత్రువుల్ని ఎదుర్కొన్నారు. ఈపాటికి యుగంధర్ ప్రాణం విడిచివుంటాడు" అంటూ అతను రాజు ఛాతీమీదకి పిస్తోలు గురిపెట్టాడు. నొక్కబోతున్నాడు. అరక్షణం కూడా వ్యవధి లేదు. ఏం చెయ్యాలి! రాజు మెదడులో ఆలోచనకీ ఆచరణకీ కూడా అరక్షణం వ్యవధి లేదు.

📖



"ఢాం” అనే సమయానికి యుగంధర్ నేల మీద పడ్డాడు. గుండు తగలలేదు. వాళ్ళు పేల్చడం మానలేదు. ఢాం, ఢాం, ఢాం, అది మెషిన్ గన్ అయ్యుండాలి. తన కూడా వున్న వారి విషయం ఆలోచించే స్థితిలో లేడు యుగంధర్. ఈ శత్రువుని ఎలాగైనా పారిపోనివ్వకూడదు. పాక్కుంటూ వెలుగు లోంచి దాటి, ఒక చెట్టు వెనక్కి వెళ్ళాడు. పిస్తోలు తీసి ఆ ఫ్లడ్ లైట్ ని గురిచూసి కాల్చాడు. అంతే! మరుక్షణం అంతా చీకటి. మూలుగులు వినపడుతున్నాయి. అంతేకాదు, చెట్ల వెనక, దూరాన ఎవరో నడుస్తున్న అలికిడి వినిపిస్తోంది. వాళ్లు పారిపోతున్నారు. యుగంధర్ లేచి నిలుచున్నాడు. కన్ను పొడుచుకున్నా ఏమీ కన్పించని చీకటి. చెవులు రిక్కించుకుని వింటున్నాడు. ఆ అడుగుల చప్పుడు కుడి వైపునించి. టార్చి వెలిగించకూడదు. చీకట్లో తడుముకుంటూ, తనూ కదిలాడు.


“త్వరగా రా! అందరూ అడవిలోకి వచ్చేశారు. మనం వెళ్ళి...”


“వస్తున్నాను” ఇంగ్లీషులో మాట్లాడుకుంటు న్నారు. వాళ్ల వెనకే అడుగులో అడుగు వేస్తూ, చప్పుడు చెయ్యకుండా యుగంధర్ వెళుతున్నాడు. కాస్త వెలుగు. చెట్లు దట్టంగా లేవు. చెట్ల మధ్యనించి నడుస్తున్న ఇద్దరు, ఇద్దరూ కలిసి పట్టుకున్న ఒక పెట్టె చూశాడు యుగంధర్. పిస్తోలు గురికి  అందుబాటులో ఉన్నారని నిశ్చయించుకు న్న తర్వాత "ఆగండి! కదిలారా కాలుస్తాను" అరిచాడు. ఆ హెచ్చరికకి వాళ్ళు బెదరలేదు. ఒకడు వెనక్కి తిరిగి యుగంధర్ ని షూట్ చేశాడు. గుండు కాలిలో దిగబడింది. యుగంధర్ తన పిస్తోలు పేల్చాడు. గురి తప్పలేదు. అతను నేలకూలాడు. వెంటనే రెండో మనిషి ఒక చెట్టు వెనక్కి వెళ్ళిపోయాడు, యుగంధర్ ఇంకో చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు.


అక్కడ గాఢ నిశ్శబ్దం అలముకుంది...

👥


*సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

*కథల ప్రపంచం* 

*అతను అతను కాడు - 19*

👥


రచన: కొమ్మూరి సాంబశివరావు



అక్కడ గాఢ నిశ్శబ్దం అలముకుంది...


"నువ్వు తప్పించుకోలేవు. చేతులు పైకి ఎత్తిపెట్టి రా!" అన్నాడు యుగంధర్. జవాబు ఒక పిస్తోలు గుండు. శత్రువు ఒక్కడే అయినా తన కాలినించి రక్తం కారుతోంది. జేబురుమాలు తీసి, కాలికి గట్టిగా కట్టు కట్టుకున్నాడు. శత్రువు ఒక చెట్టు వెనకనించి ఇంకో చెట్టు వెనక్కీ, ఆ చెట్టు వెనకనించి ఇంకో చెట్టు వెనక్కీ వెళుతూ యుగంధర్ వైపు పిస్తోలు పేలుస్తున్నాడు. అలాగే యుగంధరూ చెట్ల చాటునించి పేలుస్తూ, అతనికి దగ్గర అవుతున్నాడు. శత్రువు కదులుతున్నాడు. యుగంధర్ మళ్ళీ పేల్చాడు. కాని క్లిక్ మన్నది. గుళ్లు అయిపోయాయి. వేరే గుళ్లు లేవు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అతను చెట్టు వెనకనించి తొంగిచూసి ఒక నవ్వు నవ్వి పిస్తోలు మీట నొక్కాడు. ప్లప్ మన్నది. తెలివితేటలూ, బలమూ, సాహసమూ చాలదు. అదృష్టం కలిసి రావాలి అని తనలో తను నవ్వుకున్నాడు యుగంధర్. శత్రువు పిస్తోలులో ఒక తూటా మిగిలివున్నా తప్పించుకునేవాడు. అతను పరుగెత్తుతున్నాడు. ఆ ఇనపపెట్టె బరువే లేకపోతే ఇంకా వేగంగా పరుగెత్తే వాడు. తన కాలికి పిస్తోలు గుండు తగిలి వుండకపోతే, యుగంధర్ ఒక్క అంగలో శత్రువుని పట్టుకునేవాడు. అడవిలోంచి ఇద్దరూ బయటికి వచ్చేశారు. దూరంగా జీపులూ, ట్రక్ లు, కార్లూ వున్నాయి. శత్రువు వాటిని చేరుకోకముందే వాడిని పట్టుకోవాలి. ఒక్కొక్క క్షణం గడిచినకొద్దీ ఒక్కొక్క అడుగు దగ్గర అవుతున్నాడు అతనికి యుగంధర్. అతను చటుక్కున వెనక్కి తిరిగాడు. రెండు చేతుల్లో పెట్టెని పట్టుకుని పైకి ఎత్తాడు యుగంధర్ ని తల మీద కొట్టడానికి. చటుక్కున పక్కకి జరిగాడు యుగంధర్. అయినా ఇనపపెట్టె భుజానికి తగిలింది. తగిలి కిందపడ్డాడు. అయితేనేం! ఆ విసురుకి అతనూ ముందుకి యుగంధర్ మీదకి పడ్డాడు. పడుతూ యుగంధర్ మెడని పట్టుకున్నాడు.


యుగంధర్ బలశాలి. కాని శత్రువుకి ఏవో పట్లు తెలుసు. యుగంధర్ కళ్లు చీకట్లు కమ్ముతున్నాయి. గొంతు నలిపేస్తున్నాడు. ఇక తను తాత్సారం చేస్తే తన ప్రాణం పోతుంది. ముందు శత్రువుని ప్రాణంతో పట్టుకోవాలని అనుకున్నాడు యుగంధర్. ఇప్పుడు ఇక తప్పదు. చెయ్యి పైకి ఎత్తి పిడికిలి బిగించాడు. ఒకే ఒక దెబ్బ అతని మెడమీద కొట్టాడు. తెలుసు... ఆ ఒక్క దెబ్బకీ అతని ప్రాణం పోతుందని. తన మీద పడ్డ అతన్ని పక్కకు తోసి, లేచి నిలుచుని అతన్ని వెల్లకిలా తిప్పిచూశాడు. ఆశ్చర్యం! ఎవరతను? తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. మోహన్. మోహన్ లా తయారయిన ఇంకో శత్రువా! అతన్ని మళ్ళీ బోర్లా తిప్పి షర్టునీ, బనియన్నీ పరపర చింపాడు. వీపుమీద ఒక నల్లని మచ్చ వుంది.


"హెవీ కాజువాలిటీస్" అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన డి.ఐ.జి. పీడకల లోంచి తెప్పరిల్లినట్లు. తల విదిలించి "నన్ను వెంటనే విమానాశ్రయానికి తీసుకెళ్ళి దింపి తర్వాత గాయపడినవార్ని ఆస్పత్రిలో చేర్పించే ఏర్పాటు చెయ్యండి. ఈ ఇనప పెట్టె మీ దగ్గిరే జాగ్రత్తగా వుంచండి" అన్నాడు యుగంధర్.

📖


"అతన్ని చంపడం కన్న బందీగా ఉంచడమే మేలు అనుకుంటాను" అన్నది మిస్ ఎడ్మండ్. ఎందుకు అన్నట్లు చూశాడు బాస్. 


"ఒకవేళ యుగంధర్ తప్పించుకుని వస్తే... ఇతని ప్రాణాన్ని బేరం పెట్టవచ్చు."


"వెరీగుడ్. జాగ్రత్తగా చూస్తూ వుండండి" అని అతను వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు బలశాలురూ పిస్తోళ్ళు తనమీద గురిపెట్టి వుంచారు. ఎలా తప్పించుకోవడం! మోహన్ విషయం ఆలోచిస్తే విచిత్రంగా వుంది. బాస్ మాటలనిబట్టి, అతను శత్రువులలో ఒకడని తెలుస్తోంది. అయితే తను తప్పించుకోవడానికి ఎందుకు సహాయం చేశాడు? అందులో కూడా ఏదో మోసం వున్నదా? ఈ శత్రువుల్ని ఇద్దర్ని ఎలా మోసగించి నిరాయుధుల్ని చేసి తప్పించుకోవడం! ఇంతకన్న పదింతలు క్లిష్టమైన పరిస్థితులలోంచి, ప్రమాదాల లోంచి తను ఎన్నిసార్లు తప్పించుకోలేదు? ఆలోచించాలి, కిటుకులు!


"హల్లో! శ్రీమతి భార్గవీ!” అన్నాడు మెట్ల వైపు చూసి. రాజు అన్న ఈ మాటలు విని ఆ ఇద్దరూ వెనక్కి మెట్ల వైపు చూశారు. అదే ఆశించాడు రాజు, ఒక్క ఎగురు ఎగిరాడు. ఎగురుతూ ఇద్దర్నీ చెరొక కాలితో వీపుమీద తన్నాడు. ఆ ఇద్దరూ ముందుకుపడ్డారు. లేస్తారు... మళ్ళీ లేస్తే... అంతే! వాళ్ళు లేచేలోపున... ఇది ధర్మ యుద్ధానికి సమయం కాదు. పడిపోయిన ఇద్దర్నీ నిర్విరామంగా బూట్సు కాళ్ళతో, తలలమీద, కణతలమీద తన్నడం ప్రారంభించాడు. అంతలో మిస్ ఎడ్మండ్ కిందపడి వున్న రెండు పిస్తోళ్ళను తీసుకున్నది. ఆమెనించి రాజు ఒక పిస్తోలు తీసుకున్నాడు. ఆ ఇద్దరు శత్రువులకీ స్పృహపోయింది. 


"కమ్ ఆన్! భార్గవినీ, రవినీ విడిపిద్దాం!" అన్నాడు రాజు.

📖


యుగంధర్ ఒక పాత ఫోర్డు కారులో కాచుకున్నాడు హోటల్ రాజ్ ముందు. తన ఊహ సరయినదే అయ్యుండాలి. యుగంధర్ డ్రైవర్ యూనిఫారంలో వున్నాడు. ఎవరూ గుర్తుపట్టరని నిశ్చయం గా తెలుసు. గంట తర్వాత ఒక ఫియట్ వచ్చింది. అందులోంచి ఒక మనిషి దిగాడు. గుర్తుపట్టాడు యుగంధర్. అతనే శత్రువు. తన కన్సల్టింగ్ రూంకి వచ్చి బెదిరించిన మనిషి, అతను హోటల్లోకి వెళ్ళి అయిదునిముషాల తర్వాత బైటికి వచ్చాడు. మళ్ళీ ఫియట్ కారు ఎక్కాడు.


యుగంధర్ తన కారులో వున్న టూ వే రేడియో ఆన్ చేసి "యుగంధర్ హియర్..." అని కొన్ని ఆదేశాలు ఇచ్చాడు.


ఫియట్ వేగంగా వెళుతోంది, తనని ఎవరో వెంటాడుతున్నారనే అనుమానమేలేనట్టు, యుగంధర్ తన కారులో కాస్త వెనకగా వెంబడిస్తున్నాడు. రెడ్ హిల్స్ దాటారు. ఒక మైలు తర్వాత కుడివైపుకి ఒక కంకర రోడ్ మీదికి ఫియట్ వెళ్ళిపోయింది. వెంటనే వెనకే వెళ్ళడం వివేకం కాదు. అయిదు నిముషాలు వ్యవధి ఇచ్చి, తనూ అటు తిప్పాడు. అరమైలు వెళ్ళిన తర్వాత ఒకే ఒక ఇల్లు, ఆ ఇంటికి ప్రహరీగోడ, గేటు నించి బాగా దూరంగా లోపల ఒక పెద్ద మేడ, ఫియట్ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది. యుగంధర్ తన కారు ఆ ఇంటికి దూరంగా ఆపి కాలినడకన బయలుదేరాడు. గేటు మూసేసి వున్నది. లోపల తిరుగుతున్న కుక్కల్ని చూశాడు. ప్రహరీ గోడలమీద వున్న తీగెలని చూశాడు. అర్థమైంది. ఆ ఇల్లు అబేధ్యమైన కోటలాటిది. టెలిఫోన్ తీగెలేదు. అంటే ఈ ఇల్లు ఎక్కడ వున్నదో తెలుసుకోవడానికి వీలులేకుండా  వుండేందుకే టెలిఫోన్ కూడా పెట్టుకోలేదు. రాజుని ఈ ఇంట్లోనే బంధించి వుండాలి. ఎలా లోపలికి వెళ్ళడం!

📖


భార్గవిని విడిపించడానికి మేడమీదకి వెళుతుండగా గేటు దగ్గిర చప్పుడు విని రాజు ఆగిపోయాడు. గేటు తెరుచుకోడం ... ఫియట్ కారు లోపలికి రావడం నిముషం లో జరిగింది. రాజు చటుక్కున తలుపు వెనక్కి వెళ్లి "అతను లోపలికి రాగానే తలుపు మూసెయ్యి" అన్నాడు ఎడ్మండ్ తో. ఆమె రెండో తలుపు రెక్క వెనక నిలుచున్నది.


ఎలక్ట్రిక్ కరెంటుషాక్ తగలకుండా లోపలికి వెళ్ళడం యుగంధర్ కి కష్టం కాదు. లోపల తిరుగుతున్న ఆ కుక్కలు? ఆలోచిస్తున్నాడు. ఎవరది? ఎక్కడో చూసిన మొహంలా వున్నది. ఒక యువతి వసారాలోకి వచ్చి కుక్కల్ని పిలుస్తోంది. కుక్కలన్నీ వెళ్ళిపోతున్నాయి. కుక్కలన్నీ ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత బయట గడియపెట్టింది. ఇక ఆలస్యం చెయ్యకూడదు. ఆ ప్రాంతాల వున్న ఒక కర్రని తెచ్చి దాన్ని పట్టుకుని యుగంధర్ గోడకి దూరంగా వెళ్ళి వేగంగా పరిగెత్తి వచ్చి గోడకి అవతల ఇంటి ఆవరణలోకి దూకాడు.

📖


అతను లోపలికి రాగానే “చేతులు పైకి ఎత్తిపెట్టు" అన్నాడు రాజు. అతను చకితుడై "ఏమిటి? ఎవరు?" అన్నాడు.


"నేను రాజుని. కదిలావా కాలుస్తాను. నీ మనుష్యులు నిన్ను రక్షించే స్థితిలో లేరు" అన్నాడు రాజు.


అతను రెండు చేతులూ పైకి ఎత్తక తప్పలేదు. "ఎడ్మండ్! ముందు ఆ కుక్కల్ని గదిలోకి పంపెయ్యి! తర్వాత భార్గవినీ, రవినీ తీసుకుని రా" అన్నాడు.

📖


అతను ఒకడే అయ్యుండడు. ఆ ఇంట్లో శత్రువులు ఇంకా ఎందరు, వున్నారో... అనుకుంటూ చేతిలో పిస్తోలు పట్టుకుని, క్రోటన్స్ వెనక నించి నిశ్శబ్దంగా ముందుకి వెళ్ళాడు యుగంధర్. వసారా వైపు వెళితే గదిలో వున్న కుక్కలు మొరుగుతాయి. అందువల్ల ఇంటికి ఒకపక్కగా వెళ్ళాడు. కిటికీ తలుపులు తెరిచే వున్నాయి. కిటికీ దగ్గిర ఒక పెద్ద క్రోటన్, ఆ క్రోటన్ వెనక్కి వెళ్ళాడు యుగంధర్. చూస్తున్నాడు.

👥

*సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

*

*అతను అతను కాడు - 20*



భార్గవినీ, రవినీ తీసుకుని మెట్లుమీదకి వచ్చింది ఎడ్మండ్.


“థాంక్స్ మిష్టర్ రాజూ!” అని పక్కకి చూసి “మైగాడ్! ఓ! డార్లింగ్!" అని ఏడ్వడం ప్రారంభించింది నేలమీద పడివున్న మోహన్ శవాన్ని చూసి భార్గవి. ఏమని ఆమెని ఓదార్చాలో రాజుకి తెలియలేదు.


"యు రాస్కెల్! యు" స్కౌండ్రల్! యు బ్రూట్! నా భర్తని చంపావా! నిన్ను... నిన్ను... బతకనిస్తానా?" అంటూ చటుక్కున ఎడ్మండ్ చేతిలో వున్న పిస్తోలు లాక్కుని పేల్చింది. రాజుకి అడ్డంగా వున్న శత్రువు నేలకూలాడు.


"మీరు అతన్ని కాల్చి వుండకూడదు!" అన్నాడు రాజు.


“అవును” అంటూ భార్గవి మళ్లీ పిస్తోలు గురిపెట్టింది.


“ఢాం” అని పేలింది. అది భార్గవి చేతిలోని పిస్తోలు కాదు, కిటికీలోంచి, ఆమె చేతిలోని పిస్తోలు కిందపడింది. “భార్గవీ! కదలక!” అన్నాడు కిటికీ అవతలనించి యుగంధర్. భార్గవి నవ్వింది. విరగబడి నవ్వింది. రాజు కళ్ళప్పగించి చూస్తున్నాడు. నవ్వుతూ... నవ్వుతూ... నవ్వు ఆగిపోయి నోరు వంకర తిరిగి, కళ్ళు తేలవేసి, మెట్లమీద నించి కిందకు దొర్లిపడింది భార్గవి. సైనయిడ్ మాత్ర నమిలింది.

📖


డిటెక్టివ్ యుగంధర్ కన్సల్టింగ్ రూం. పోలీసు ఉద్యోగులూ, డాక్టర్ నారాయణన్, ఇంటెలిజెన్స్ ఉద్యోగులూ, రాజు, కాత్యా, ఇన్స్ పెక్టర్ స్వరాజ్యరావు వున్నారు.


“ఒక రకంగా ఈ కేసు పూర్తి అయినా, పరిశోధన పూర్తికాని కేసు అని అనాలి. భార్గవినీ, మోహన్నీ ఏ దేశ గూఢచారులు ఎప్పుడు ఏ ఆకర్షణ, ఏ ఆశ చూపించి వాళ్ళ వశం చేసుకున్నారో మనకి తెలియదు. పరోక్షంగానైనా అమెరికన్ గూఢచారులు ఈ పనిచేసి వుండాలని నేను వూహిస్తున్నాను.


అడవిలోంచి బైటికి వచ్చి యురేనియాన్ని ఎత్తుకుపోతున్న మనిషి అసలు మోహన్ అని గుర్తుపట్టిన తర్వాతే మొదటిసారి భార్గవిమీద అనుమానం కలిగింది. అందువల్లే ఇన్స్ పెక్టర్ స్వరాజ్యరావుకి చెప్పాను, రవి నిజంగా భార్గవి కొడుకో కాడో తెలుసుకోమని. రవిని ఒక అనాధ శరణాలయాన్నించి తెచ్చి పెంచుకున్నదని ఇన్స్ పెక్టర్ తెలుసుకున్నాడు. ఈ శత్రుదేశ గూఢచారుల్లో హోటల్ రాజ్ మేనేజర్ కూడా వున్నాడని, రాజ్ లో అంతమంది మోహన్ లు వున్నారని చెప్పినప్పట్నించీ నాకు అతనిమీద అనుమానం ప్రారంభం అయింది. అతన్ని పట్టుకునేందుకు ఇన్స్ పెక్టర్ వెళితే అతనూ సైనయిడ్ మాత్ర మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్గవే స్థానికంగా ఆ గూఢచారుల ముఠాకి నాయకురాలు. ఆ విషయం ఎవరికీ తెలియకుండా దాచింది. వారిలో ఎవరు పట్టుబడినా, ఎవరు చనిపోయినా, తనకి ఏ ఆపదా రాకుండా వుండడానికి అంతే కాదు తను ఆపదలో వున్నట్లుగా నటించి పరిస్థితులు సృష్టించి తనమీద ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడింది. ఒకేసారి బొంబాయి నించి యురేనియం అంతా రాదని ఆమెకి తెలుసు. అందువల్ల కల్పాకం ఆటమిక్ రీసెర్చి సెంటర్ లో కీలక స్థానంలో తను వుండాలి. అందుకే అంత నాటకం ఆడింది. సమయానికి నేను వెళ్ళి వుండకపోతే రాజునీ, ఎడ్మండ్ ని, రవినీ కూడా కాల్చి చంపి, శత్రువులే వాళ్ళని చంపినట్లు సాక్ష్యం సృష్టించేది. ఆమె చాలా తెలివైన స్త్రీ. సాహసం గల మనిషి, ఇలాటి భారతీయులు విదేశ గూఢచారులతో చేతులు కలపడం మన దురదృష్టమే కాదు... తలవంపులు కూడా" అన్నాడు యుగంధర్.


"ఆ నకిలీ మోహన్ ఆమెని బలాత్కారం చెయ్యడం అంతా నాటకమేనా?” అడిగాడు ఇన్స్ పెక్టర్.


“కాదు. భార్గవే అసలు బాస్ అని ఆ నకిలీ మోహన్ కి కూడా తెలియదు. మైక్రోడివైజ్ ద్వారా తనవాళ్ళు ఆమె సంభాషణ వింటున్నారని, ఏం జరుగుతున్నదీ తెలుసు కనుక... తనకు ముందు ఇచ్చిన ఆదేశానుసారం వాళ్ళు వచ్చి చంపేస్తారనీ తెలుసు. మనం ముందు వెళ్ళడం కాకతాళీయం" అన్నాడు యుగంధర్.


“వాళ్ల ముఠాకే చెందిన ఆ రెండో నకిలీ మోహన్ నేను తప్పించుకోవడానికి ఎందుకు సహాయపడ్డాడు? అసలు ఇద్దరు నకిలీ మోహన్ లు ఎందుకు అవసరమ య్యారు?" అడిగాడు రాజు.


“అవసరమైతే ఇంకొక నకిలీ మోహన్ని ప్రవేశపెట్టి మనల్ని గందరగోళంలో పడెయ్యాలనే ఇద్దరు నకిలీ మోహన్లని ఏర్పాటు చేయించింది.


అసలు మోహన్ ఎలాగూ యురేనియం తీసుకుని వెళ్తాడు కనుక, నిన్ను విడిపించి నకిలీ మోహన్ని రంగంలోకి దింపాలని ఆమె ఉద్దేశం అయ్యుండాలి. అలా నకిలీ మోహన్ నిన్ను, రవినీ, ఎడ్మండ్ ని రక్షించి తీసుకుని వస్తే అసలు మోహన్ని కాని, భార్గవిని కాని మనం అనుమానించే వాళ్ళం కాము. మిస్ ఎడ్మండ్ రాజుకి చాలా సహాయం చేసింది. డబ్బుకి ఆశపడి, తను చేస్తున్నది దేశద్రోహమని తెలియ కుండా చేసింది కనుక ఆమెని క్షమించ వచ్చు. భార్గవే తన తల్లి అనీ, మోహన్ తన తండ్రి అనీ ప్రేమ పెంచుకుని, పెరిగిన రవిని చూస్తే జాలివేస్తోంది. ఆ పిల్లవాణ్ని అనాధ శరణాలయానికి పంపుతున్నాను. అతని తల్లిదండ్రులు దేశద్రోహులని ఆ పసివాడికి చెప్పడం అనవసరం. 


డాక్టర్ నారాయణన్! తారాపూర్ నుండి యురేనియం అంతా వచ్చి శుద్ధి చేసేటంత వరకూ మీరు, ఇంటెలిజెన్స్, సి.బి.ఐ. వారు వెయ్యి కళ్ళతో జాగ్రత్తగా వుండడం మంచిది. మరొకసారి యురేనియం దొంగిలించడానికి ప్రయత్నించక మానరు శత్రువులు" అన్నాడు యుగంధర్.


గది లోని అందరూ అలెర్ట్ అయ్యారు...


*అయిపొయింది*

👥

*సశేషం*