Saturday, 28 January 2023

ఆధ్యాత్మిక కధలు 16-01-2023 T0 31-01-2023




16-01-2023,, భార్యాభర్తల అనుబంధం 

అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.
  
నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.

తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే. అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు. అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే.

ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఇదే మధురమైన బంధం. భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకు తున్నామని కాదు అర్థం.బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.

సంసారం అంటే కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.

ఒక మంచి భర్త భార్య కన్నీరు తూడుస్తాడెమో కానీ అర్థం చేసుకునే భర్త
ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

భార్యాభర్తల సంబంధం శాశ్వతం.కొంతమంది మధ్యలో వస్తారు.
మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం. భర్తకు భార్య శాశ్వతం.

ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క!

అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం.
ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది "మాంగల్య బంధం"

బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.

మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది.కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.

కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.

నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే. నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.

ప్రేమ అనేది చాలా విలువైనది.దాన్ని "వివాహం"అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది. సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం"కుటుంబం"

గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం. కలిమి లేములతో.. కలసిన మనసులతో...  కలివిడిగా మసలుకో..  కలకాలం సుఖసంతోషాలు పంచుకో..!

బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు. భర్తకి భార్య బలం కావాలి. బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు. భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి అయోమయం కాకూడదు  .     మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే. పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా,కష్టం- సుఖం గురించి కాదు.
ఇద్దరూ  ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.  ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.

చిరునవ్వులతో కూడిన దంపతులారా అందుకోండి ఇదే నా సలాం!

--(())-- *

17-01-2023,, [🍁మట్టి కుండ🍁

       ఒక తోటమాలి ఒక మట్టి కుండను తలపై పెట్టుకొని వచ్చుచు తనకు గల కష్టములన్నీటిని తలచుకొని ఏడ్చుచుండెను. అప్పుడా కుండ అతనితో' “ఏమయ్యా! చిన్న కష్టానికే ఇంత బెంబేలు పడుతున్నావు?

నేనెన్ని కష్టాలు పడినానో తెలుసా ? ఒక చక్కని గులాబీ మొక్కకు నెలనైన నా గుండెను ఒక కుమ్మరి గునపంతో బ్రద్దలు కొట్టి నన్ను తీసుకుని వచ్చాడు. నన్ను కొన్ని రోజులు నీటిలో నానబెట్టాడు. తరువాత కాళ్ళతో కసాబిసా తొక్కాడు. గిరగిరా తిరిగే సారెపై ఉంచి నన్నొక పాత్రగా మాలిచాడు. నా అడుగు భాగాన్ని కత్తి తో కోసి చెక్క సుత్తితో అనేక సార్లు కొట్టి నన్ను ఎండలో పెట్టాడు.

     అంతటితో నా కష్టాలు తీరలేదు. నన్ను మంటలో కాల్చాడు. నాలాంటి కుండలను అనేకములను తీసుకొని వచ్చి సంతలో అమ్మాడు. కొనుకొన్నేవారు నన్ను పరీక్షించు కొనుటకు అనేక సార్లు నా తలపై మొట్టికాయలు వేశారు.

 👉ఇన్ని కష్టాలు పడిన తరువాత మట్టి ముద్దలా ఉన్న నేను విలువైన వస్తువుగా మారి నీ తలపైకి ఎక్కి కూర్చున్నాను.

👉ఓ తోటమాలీ! కష్టాలను చూసి కృంగిపోవద్దు. నష్టాలకు కుమిలిపోవద్దు. అశాంతిని చేరనీయకు” అని హిత బోధ చేసినది.🍁
--(())--

18-01-2023 ..  🙏 కాస్త ఆలోచిద్దాం....!! 🙏
*********
కురుక్షేత్రంలో కౌరవులందరూ పోయారని తెలిసిన గాంధారి కోపంతో ఊగిపోతూ కృష్ణుడి దగ్గరకెళ్ళి ...

కృష్ణా....
'' ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ''
'' నీ కడుపు మంట చల్లారిందా '' అన్నది.
'' నేనేం చేశాను '' అన్నాడు కృష్ణుడు.
'' చేయాల్సిందంతా  చేసి.... నా కుమారులందరినీ చంపి .....నేనేం చేశానని అమాయకంగా అడుగుతున్నావా ''. అన్నది ఆవేశంతో ఊగిపోతూ.
'' నీ పిల్లలు చనిపోవడానికి కారణం నేను కాదు '' అన్నాడు కృష్ణుడు.
'' అంటే కారణం నేనా '' కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అడిగింది గాంధారి.
'' ముమ్మాటికీ నువ్వే '' అన్నాడు కృష్ణుడు.
'' నేనా? ఎలా?  '' గాంధారి మొహంలో ఆశ్ఛర్యం.
'' ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. నీకు నీ భర్త మీద ఉన్న ప్రేమతో జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుని ఆయనతో కాపురం చేశావు.
వందమంది పిల్లల్ని కన్నావు గానీ ఆ పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు? వాళ్ళేం చేస్తున్నారు?  అని ఒక్కనాడైనా వాళ్ళను పరిశీలించావా?
వాళ్ళు తోటి వారిని ప్రేమిస్తున్నారా?  ద్వేషిస్తున్నారా? అని ఒక్కనాడైనా పరీక్షించావా?
నీ పిల్లల ఆలోచనలు,  అలవాట్లు మంచివా? చెడ్డవా? అని ఒక్కనాడైనా పట్టించుకున్నావా? అన్నాడు కృష్ణుడు.
'' లేదు '' అంది గాంధారి.
'' నీ కళ్ళకు కట్టుకున్న గంతల్ని తీసి ఆనాడే నీ పిల్లలను నువ్వు సరిగ్గా పెంచి ఉంటే ఈ నాడు కురుక్షేత్రం జరిగేదీ కాదు,
కౌరవులందరూ పోయేవారూ కాదు.
ఇది నీ స్వయంకృతాపరాధమే '' అన్నాడు కృష్ణుడు.

నేడు చాలామంది తల్లిదండ్రులు కూడా సరిగ్గా గాంధారి,  దృతరాష్ట్రుల్లా ప్రవర్తిస్తూ
'' చదువులు చంపేస్తుంది '' అంటూ తప్పును చదువుల తల్లిమీద తోసేస్తున్నారు.

'' ప్రైవేటు పాఠశాలలు '' అన్న విత్తనాలను ప్రభుత్వాలు ప్రజల మీద చల్లేస్తే
వాటికి కావాల్సినంత నీరు (విద్యార్థులను చేర్పింది) పోసింది ఎవరు?? మనం కాదా??
వాటికి కావల్సినంత ఎరువులు (ఫీజులు కట్టింది) చల్లింది ఎవరు?? మనం కాదా??
అవి ఎండిపోకుండా,  వాడిపోకుండా పగలనక,  రాత్రనకా దాన్ని  (ట్యాూషన్లు , స్పెషల్ క్లాసులు అంటూ) రక్షిస్తున్నది ఎవరు?? మనం కాదా??

ఏ ప్రైవేటు పాఠశాలైనా
ఏ ప్రైవేటు కళాశాలైనా
ఇంట్లో ఉన్న మన పిల్లల్ని మన అనుమతి లేకుండా బలవంతంగా లాకెళ్ళి చదువు చెప్పిస్తున్నారా??
పరిచయమున్న ప్రతి ఒక్కరినీ ఒకటికి పదిసార్లు ఏ స్కూల్ బావుందని అడిగి, లక్షలకు లక్షలు పోసి మరీ మనమేగా మన పిల్లలను చేర్పిస్తున్నది.
ప్రైవేటు పాఠశాలలు పెట్టే ప్రతి అడ్డమైన కండీషన్లకూ గంగిరెద్దుల్లా తలూపుతున్నది మనం కాదా??

కాస్త చదువుకునే పిల్లలైతే
కుదిరితే ఉదయం ఆరుగంటలకంతా ట్యూషన్ కు పంపుతాం
కుదరకుంటే సాయంత్రం ఆరునుండి రాత్రి తొమ్మదిదాకా ట్యూషన్ లో పడేస్తున్నాం
చదువులో కాస్త వెనకబడిన పిల్లలనైతే ఏకంగా హాస్టల్లలో కుక్కేస్తున్నాం.

పిల్లల పరిస్థితి ఎలా తయారయ్యిందీ అంటే.....
స్కూల్లో ఉన్నా చదవాలి
ఇంట్లో ఉన్నా చదవాలి
ట్యూషన్లో ఉన్నా చదవాలి
చివరికి సెలవురోజుల్లోనూ చదవాలి.
పిల్లల్ని చదువుల యంత్రాలుగా తయారుచేస్తున్నది మనం కాదా??

చేయాల్సిన తప్పంతా మనం చేసి
పెట్టాల్సిన ఒత్తిడంతా పిల్లలపై మనం పెట్టి
పాఠశాలలను ఆడిపోసుకోవడం ఎంత వరకు సమంజసమో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి.

ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం??
పిల్లల భవిష్యత్తు బావుండాలనే కదా అని మనల్ని మనం  సమర్థించుకోవడం అందమైన ఆత్మవంచనే అవుతుంది.
చదువు పేరుతో పిల్లల్ని పిండే కొద్దీ చివరకు మిగిలేది పిప్పే.

చదువుకున్నవాడి అదృష్టం బావుండి ఉద్యోగం వస్తే మనం అనుకున్నట్టు వాళ్ళ భవిష్యత్తుకు ఢోకా లేదు.
పొరపాటున ఏ ఉద్యోగమూ రాకపోతే అడుక్కోవడానికి కూడా పనికిరానివాడిగా తయారు చేసిన వాళ్ళం మనమే అవుతాం..... అవుతున్నాం.....
ఎందుకంటే నేటి విద్యార్థుల్లో నూటికి తొంభైతొమ్మిది మందికి చదువు తప్ప (క్రీడలుగానీ, కళలుగానీ) మరేమీ రాదు.... మనమేమీ నేర్పే ప్రయత్నమూ చెయ్యలేదు..... చెయ్యట్లేదు.

ఇందులోని ఏ ఒక్కమాటైనా
ఏ ఒక్క తల్లి ఆలోచననైనా మార్చగలిగితే
ఏ ఒక్క తండ్రి ప్రవర్తనైనా మార్చగలిగితే
ఏ ఒక్క విద్యార్థి ప్రాణాన్నైనా కాపాడగలిగితే
అంతకన్నా మహాభాగ్యం ఏముంది అది చాలు. 🙏
--(())--
19-01-2023

 పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు .

      మంచి సంతానం కోసం, సంతానం లేని వల్లూ సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలూ చెబుతున్నాయి.చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వాళ్ళ సంతానం కలుగుతుంది అని నమ్మకం.


     పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గుణ శుద్ధ చవితి ప్రత్యేకతగ కనిపిస్తూ వుంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్లు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ‘పుత్రగణపతి వ్రతం’ ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

     వారసుడు కావాలనే కోరిక తమ తరువాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికిగాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ వుంటుంది. ఈ విషయంగా ఎక్కువకాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు, పుత్ర గణపతి వ్రతం జరుపుతుంటారు.

      ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి  గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది  గుమ్మానికి తోరణాలుకట్టి పూజామందిరాన్ని అలంకరించాలి.

       ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను … పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి.

      సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.

       పూర్వం మహారాజులు చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు ‘ఫాల్గుణ శుద్ధ చవితి’ రోజున ‘పుత్ర గణపతి’ వ్రతాన్ని ఆచరించే వాళ్లు.

         అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.

        ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా ‘పుత్రగణపతి వ్రతం’ మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి, పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి.

      పూజా మందిరంలో కలశస్థాపన చేసి శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.

      ఇంచుమించు వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి.

      బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు.

       ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

-----

---
20-01-2023 *ఆత్మ పరమాత్మలో ఏది ముందు?ఆత్మ పరమాత్మలో ఏది ముందు? ఏది వెనుక?

ప్రకృతి, పురుషుడు ఎవరిది ముందడుగు? ఎవరిది వెనకడుగు?
విత్తు, చెట్టు దేనిది తొలి రూపం? దేనిది మలిరూపం?
వ్యక్తమయ్యేదే తొలి అంశనా?! వ్యక్తం కానిది మలి అంశనా?! వ్యక్తమయ్యేది ఎగ్జిస్టెన్స్ అస్తిత్వం, వ్యక్తం కానిది ఎస్సెన్స్-స్తత్వం. అంటే ఎస్సెన్స్ లేనిదే ఎగ్జిస్టెన్స్ లేదు. స్తత్వం కాని అస్తిత్వం లేదు. స్థాయి భావం సాధ్యమైతే తప్ప రససిద్ధి కలగదు.
స్థాయి భావానికి సాంద్రరూపమే రసాస్వాదన అరూప సంపద నుండే రూప సంపద శూన్యం నుండే స్థితి అయితే స్థితి కూడా కాలగమనంలో శూన్యం కావలసిందే! రూపం అరూపం కావలసిందే!! ద్వైతం అద్వైతం కావలసిందే!! కారణం అద్వైతమే ద్వైతంగా పరిణమించింది కాబట్టి నాణెం ఒక్కటే బొమ్మా బొరుసులలో ఒకటి వ్యక్తం, మరొకటి అవ్యక్తం.

మొత్తానికి వ్యక్త అవ్యక్తాల సంయోగమే నాణెం. ఆ ద్వైత అద్వైతమే యోగం ఆత్మయోగం కనిపించని అంతరంగ తత్వం నుండి అగమ్య గోచరమైన ఆకాశ తత్వంలోకి చొచ్చుకుపోవటమే ఆత్మయోగం ఇహం పరంగా పరిణమించటమే ఆత్మయోగం స్థితి నుండి శూన్యాన్ని తొలుచుకుంటూ పోవడమే ఆత్మయోగం. ఈ ఆత్మతత్వానికి సాకార రూపమే భగవద్గీతలోని కృష్ణుడు 'మహాత్మానస్తు మాం దైవీం ప్రకృతి మాశ్రీతాః
భజంత్య నన్య మనసో జ్ఞాత్వా భూతాది మ వ్యయమ్'
అని ఆ కృష్ణుడే స్వయంగా మహాత్ములు నిశ్చల స్వభావంతో దైవీ ప్రకృతితో విలసిల్లే తననే సకల ప్రాణుల స్థితికి మూలంగాను, అక్షర రూపంగాను పరిగణిస్తారంటాడు.
ఇక్కడ ఆది స్థితి అంటే పరా ప్రకృతి పరమాత్మ. ఈ ఆది స్థితికి వ్యక్తరూపమే అపర ప్రకృతి... జీవాత్మ. ఎగ్జిస్టెన్స్ జీవాత్మ అయితే ఎస్సెన్స్ పరమాత్మ
ఇంతకీ ఆత్మ, పరమాత్మలు రెండా? ప్రకృతి పురుషులు రెండా? రెండులా అనిపించే ఒక్కటా? ఏకత్వమే ద్వైతం కావటమా? నిజానికి పురుషత్వం లేని ప్రకృతి తత్వం ఉందా? ప్రకృతిలేని పురుష సాధ్యమా? ద్వైతం అద్వైతమా? అద్వైతం ద్వైతమా?
అసలు ఉండటం, ఉండకపోవటం ద్వైతాలు విరుద్ధాలు కాదు.

 ఓం శ్రీ గురుభ్యో నమః🙏
గురువుల ఆదేశానుసారం ఈ రోజు భక్తితో మనసా వాచా కర్మణా అనగా త్రికరణ శుద్ధి గా ఎవరైతే భగవంతుని అరధిస్తారో లేక సేవిస్తారో లేదా భగవంతుని నామాన్ని జపిస్తారో లేదా ఏదైనా సేవ చేస్తారో అట్టి సేవలు అక్షయమోతాయని తెలియజేసి ఉన్నారు.
కావునా ఆధ్యాత్మిక  బంధువులరా, మిత్రులారా  ఈ రోజు మీరు చేయు పూజ, సేవ, జపము ,హోమము ,తర్పణం అక్షయ ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. మీ వీలును బట్టి ఆధ్యాత్మిక చింతనలో గడిపి సంపూర్ణమైన భగవదనుగ్రహానికి పాత్రులు కాగలందులకు  మనవి చేస్తున్నాను. మీకు తోచిన మంత్రమో ,స్తోత్రం లేక శ్లోకములు ఏదైననూ మీవీలును బట్టి ఎక్కువ సంఖ్యలో చదివి భగవదనుగ్రహానికి పాత్రులు కాగలందులకు సవినయ మనవి .🙏🙏🕉🙏🙏

21-01-2023...మూర్ద జ్యోతిషి సిద్ధ దర్శనమ్

(యోగ సూత్రం - విభూతి పాదం)

భావం : శిరస్సు (సుషుమ్నాంతం) నుండి వెలువడే తేజస్సులో సంయమము చేయుట వలన, సిద్ధ పురుష దర్శనం కలుగుతుంది.

వ్యాఖ్యానం : యోగాభ్యాసం చేస్తున్న వాడికి శిరస్సులో ఉన్న వెలుగు అనుభూతం అవుతుంది. సాధకుడు, యోగిగా పరిణామం చెందే క్రమంలో....రక రకాల రంగుల్లో, రక రకాల రూపాల్లో వెలుగు కనబడుతుంది(అనుభూతం అవుతుంది). అయితే ఇది క్రమంగా జరిగే పరిణామం.

    అయితే,  నూట ఒక్క హృదయ నాడులలో, ఈ సుషుమ్న,  బ్రహ్మ రంధ్రమున బయలు పడును. అది మూర్ధ ద్వారము. అట్టి మూర్ధ ద్వారము నందు గల జ్యోతిపై "సంయమము" చేయుట వలన సిద్ధుల దర్శనం కలుగును.

అయితే ఈ మూర్ధ జ్యోతి అంటే ఏమిటి?

సాధనలో యోగి తన ప్రాణశక్తి ప్రవాహాలను, వెనుబాము అనే పెద్ద నాళం లోనికి, అక్కడ నుండి సూక్ష్మ మేరుదండం లోనికి, అటనుండి మూలాధారం వద్ద గల సుషుమ్న లోనూ, ఆపైన స్వాధిష్ఠానం వద్ద మొదలయ్యే వజ్రా నాడిలోనూ, మణి పూరకం వద్ద గల చిత్రా నాడిలోనూ ప్రసరిస్తూ...చివరికి వాటన్నిటికీ లోతట్టునున్న బ్రహ్మ చైతన్యం కేంద్రీకరించబడిన బ్రహ్మ నాడిలోనికి పంపిస్తాడు. ప్రారంభంలో రక రకాల రంగులు, సాధనలో కనపడతాయి. సాధన తీవ్రమయ్యే కొద్దీ, కొన్ని ప్రత్యేక రంగులు దర్శనం ఇస్తాయి. కొంత కాలానికి, ఇవన్నీ వెళ్ళిపోయి, ఏ రంగు లేని "శుద్ధ స్పటిక సంకాశం", మిగుల్తుంది. దానినే "నిరంజనో జ్యోతిః" అంటారు. రంగు ఉందంటే మనస్సు స్పర్శ ఉందన్న మాట. ఈ రంగులకు అతీతమైన వెలుగే "జ్యోతి". అదియే "మూర్ధ జ్యోతి". అట్టి మూర్ధ జ్యోతి యందు సంయమము చేసినచో, సిద్ధ దర్శనం జరుగును.

SEKARANA ...2016

****


 శ్రీ గురుభ్యోనమః 🙏 22-01-2023 

ఈశ్వరుడనగా  శరీరధారులకు ఆత్మ స్వరూపుడు. ఈశ్వరుడు లేకపోతే మనము లేము. ఈశ్వరుని ప్రతిబింబముగా మనమున్నాము.

ఈశ్వరుడు మనలో ఉండడము చేత పంచభూతములు పనిచేస్తున్నాయి. ఈశ్వరుడు మనలో ఉండడము చేతనే మనలో ఎరుక పనిచేస్తుంది. ఈశ్వరుడు ఉండడము చేతనే మనకు ఆయుర్దాయము ఉంటుంది.

ఈశ్వరుడు మనయందు మనవలె ఉంటే,  మనమే ఉన్నామని అనుకుంటూ ఉంటాము. నిజానికి నేను కాదు ఉన్నది ఈశ్వరుడే అని తెలియడమే జ్ఞానము. అపుడే ఈశ్వరుడు మన యందు పరిపూర్ణముగా అవతరించి మన సమస్తము  అతనే నిర్వర్తిస్తాడు.
బుద్ధ ప్రభోదిత ఆర్య సత్యాలు:-

23-01-2023

*మీరు చదవండి కొత్తగా ఉంటాయి 

ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు - మహాత్మగాంధీ

ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు - నెహ్రు

మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి ఇక్కడ

పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నదని అన్నారు - ఫెడ్రంట్ రసెల్

మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పారు - ఆల్బర్ట్ ఐన్స్టెయిన్

ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరారు -నెల్సన్ మండేలా

తుపాకీ కంటే పెద్ద ఆయుధం పుస్తకం అన్నారు

పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు

పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు  వచ్చి పడ్డాయంటా కానుకగా ఆ  వ్యక్తి - లెనిన్

ఒక్కో చిత్రం నటించక తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలను కొనేవారు -చార్లీ చాప్లిన్

ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే పుస్తకమే అన్నారు - విన్స్టెన్  చర్చిల్

భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు పుస్తకాలని చెప్పారు -మార్టిన్ లుతెర్కింగ్

తనకు ఉరివేసి క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి - భగత్ సింగ్

నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసినవ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు - అబ్రహం లింకన్

వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటె చూపండి అతడే నా మార్గదర్శి అన్నారు -జూలియస్ సీసర్

ప్రపంచపటం లో కనిపించే ప్రతి మూలకు వెళ్లాలని ఆశపడుతున్నావా అయితే గ్రంథాలయానికి వెళ్ళమన్నారు -టెస్కార్డ్స్

జీవితం విరక్తి చెందినప్పుడు లేదాకొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నారు -ఇంగర్సాల్

వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో అలా పుస్తక పఠనం మనసుకు వ్యాయామం ఆరోగ్యం అన్నారు -సిగ్మెంట్ ఫ్రాయిడ్

పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం అంటారు

ప్రముఖుల ఎందరికో వెలుగు పంచింది వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే ముఖపుస్తకం పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము చదవాలి అనే ఆలోచనాఆసక్తి ఉంటె చాలు ఇక్కడా ఎన్నో మంచి పుస్తకాలు వేలల్లో ఉన్నాయి చదవండి

(పూర్తిగా చదివి తెలుసుకోండి.)

సేకరణ 2018 మల్లాప్రగడ రామకృష్ణ 

***

24-01-2023....మన పండుగలు మన సాంప్రదాయం#చిన్న_కథ రెండు జాంకాయలున్నాయి కదా నాన్నమ్మా ..! ఒకటే తీసుకుని నన్నూ చెల్లినీ పంచుకుని తినమంటావేంటి ..! రవి గాడి మాటలకు నవ్వుతూ . అందాకా ఒకటి పంచుకుని తినండిరా . మళ్ళా కాసేపున్నాక రొండోది పంచుకుని తిందురుగాని అంది నాన్నమ్మ నవ్వుతూ . అలాగే నాన్నమ్మా అంటూ చెల్లిని తీసుకుని వరండాలోకి వెళ్ళాడు రవిగాడు . పెద్దింటి నుంచి వచ్చిన కోడలికి ఇది నచ్చలేదు . ఎందుకత్తయ్యగారు ఉన్నాయికదా చెరొకటి ఇచ్చేస్తే సరిపోయే కదా అంది నవ్వుతూనే ఈసడింపుగా . అత్తగారు నవ్వేసి ఊరుకుంది ..! పండక్కి మా ఊరెళదామంటే ఈ పల్లెటూరికి తీసుకొచ్చి పడేశారు . ఇక్కడేమో నాకు బోర్ కొట్టి చచ్చిపోతున్నాను ..! మీరేమో మీ చిన్నప్పటి స్నేహితుల్తోటి కబుర్లాడుకుని వస్తున్నారు . వాళ్లలో ఒక్కడు కూడా చదువుకున్నోడు లేడు , వాళ్ళతో తిరుగుతుంటే మీరు పెద్ద ఆఫీసర్ అన్న సంగతి కూడా మర్చిపోతున్నారు ..! ఇక్కడేమో మాయదారి కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు ..! మీ అమ్మ గారు సరేసరి ఒక్క జాంకాయిచ్చి పిల్లలిద్దర్నీ పంచుకుని తినమంటాది ..! నాకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు ..! చుట్టుపక్కలవాళ్ళ పిల్లలందరూ వీళ్ళని వరసలు పెట్టి పిలిచి ఆడుతుంటే నాకు కంపరం వస్తోంది బాబూ ..! అంటూ ఆవిడ ఏకరువు పెడుతుంటే నవ్వుతూ వింటూ నిద్రపోతున్న మొగుణ్ణి చూసి ఖర్మ అనుకుని అటు తిరిగి పడుకుంది ..! భోగి నాడు చుట్టుపక్కల పిల్లలంతా ఎక్కడెక్కడ్నుంచో తెచ్చిన చెట్ల దుంగలు , పాత కర్ర సామాను తెచ్చి భోగిమంట వేస్తుంటే రవిగాడు , వాడి చెల్లి ఎప్పుడు నిద్ర లేచారో , నాన్నమ్మ ఎప్పుడు తలంటిపోసి కొత్తబట్టలు కట్టి ముస్తాబు చేసిందో ..! భోగిమంట దగ్గరకు వెళ్లి నించుంటే పిల్లలంతా వాళ్ళు తెచ్చుకున్న భోగిపిడకల దండలు వీళ్ళతో భోగి మంటల్లో వేయిస్తుంటే ..! సిటీలో పెరుగుతున్న ఆ పిల్లల ఆనందానికి అంతులేదు ..! ఒరే రవీ ..! నువ్వూ చెల్లీ వెళ్లి ఈ కొత్త బట్టలు మనింట్లో పని చేస్తున్న లక్ష్మి వాళ్ళింటికెళ్లి వాళ్ళ పిల్లలకు ఇచ్చి రండి ..! అంది నాన్నమ్మ ..! రవిగాడు ఆ బట్టలు తీసుకుని చెల్లిని వెంటబెట్టుకుని వెళ్ళాక ..! ఎందుకత్తయ్యా పనివాళ్ల ఇంటికి పిల్లల్ని పంపిస్తున్నారు ..! లక్ష్మి ఎలాగూ వస్తుందిగా ..! దాని చేతిలో ఆ బట్టలేవో పెట్టేస్తే సరిపోతుందిగా అంది కోడలు ..! అత్త గారు నవ్వేసి ఊరుకుంది ..! సంక్రాంతి నాడు ప్రసాదం తయారుజేసి పిల్లలిద్దరితోటి గుడిలో పంచిపెట్టించింది ..! పండగ సెలవులన్నీ సరదాగా గడిచిపోయాయి ఒక్క కోడలికి తప్ప ..! రవిగాడికి కొత్తగా ఏర్పడిన స్నేహితులు,వాళ్ళ నాన్న స్నేహితులు నాన్నమ్మ కట్టిన మూటలన్నీ మోసుకుని రైల్వే స్టేషన్ కు దేబెట్టారు ..! రైలు కదిలేదాకా అక్కడే ఉండి వీడ్కోలు చెప్పి వెనుదిరిగారు ..! సంక్రాంతికి ఊరెళ్ళి వచ్చిన తర్వాత రవిగాడిలో చాలా మార్పు వచ్చిందండి ..! ఇంతకుముందు ఎవరితోను మాట్లాడేవాడు కాడు ..! ఎప్పుడూ ముభావంగా ఉండి తన చదువేదో తన లోకమేదో అన్నట్టుండేవాడు ..! ఇప్పుడందరితో కలివిడిగా ఉంటున్నాడు ..! వాడికేదైనా పెడితే చెల్లికి తీసుకెళ్లి పెడుతున్నాడు ..! నువ్వు తిన్నావా మమ్మీ అని నన్ను కూడా అడుగుతున్నాడు ..! అంది కన్నీళ్లు తుడుచుకుంటూ ..! అతను చిరునవ్వు నవ్వాడు వాళ్ళమ్మను తలుచుకుంటూ ..! #పెద్దవాళ్ల_మాటలు_చేతలు_అన్నీ_కూడాను_చద్దన్నం_మూటలే #మన_పండుగలు_మన_సాంప్రదాయాలు 🙏👌💪 పిల్లలకు కంప్యూటర్ , ఇంటర్నెట్ పరిజ్ఞానంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పడం మన బాధ్యత అండి . శుభసాయంత్రం 😊💐 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధలు ఉపోద్ఘాతం! అనుకోకండి ఒక్కసారి చదవండి ***** 25-01-2023
చాణిక్యుడు తన శిష్యులతో పాటు సంధ్యావందనం కోసం నదికి వెళ్ళేవారు.ఆ దారిలో ఓ చిన్న ముళ్ళచెట్టు ఉండేది. ఓరోజు చాణిక్యుడు ఏదో ధ్యాసలో ఉండి ఆ ముళ్ళచెట్టు త్రొక్కగా కాలికి ముల్లు గుచ్చుకుని రక్తం వచ్చింది. అది చూసి శిష్యులు ఆ ముళ్ళచెట్టు మీద కోపంతో దానికి పీకడానికి ప్రయత్నించారు.. చాణిక్యుడు వారిని వారించి కాస్త బెల్లం తీసుకురమ్మన్నారు.. శిష్యులు తెచ్చిన బెల్లం కు కొంచెం నీటిని కలిపి చిక్కగా చేసి ఆ ముళ్ళచెట్టు మొదట్లో కాండం కు వేసారు.. శిష్యులకు తమ గురువు గారు చేసిన పని అర్ధం కాలేదు.. చాణిక్యుడు వారి- చూసి చిన్నగా నవ్వుతూ ఇక పదండి సంధ్యావందనానికి కాలాతీతమవుతుంది అని నది వైపు కదిలారు.. మరుసటి రోజు చాణిక్యుడు మరలా సంధ్యావందనం కు శిష్యులతో కలసి నదికి బయలుదేరారు..దారిలో ఆ ముళ్ళచెట్టు ను చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు.. ఆ ముళ్ళచెట్టు కాండం ను చీమలు పూర్తిగా కొరికి చెట్టునుండి కాండంను వేరుచేసాయి.. ముళ్ళచెట్టు నిర్జీవంగా పడి ఉంది. అప్పుడు చాణిక్యుడు శిష్యులతో చూసారా అది మనకు మరియు మన వెనక వచ్చే వారికి కూడా నష్టం కలగజేస్తుంది. దాన్ని చంపడానికి మీరు కనీసం గ్రొడ్డలి వాడాలి, అది తీసుకురావడానికి, పని అయిన తరువాత మళ్ళీ దాన్ని యధాస్ధానం లో పట్టడానికి రెండుసార్లు తిరగాలి, దారిలో నిన్ను గ్రొడ్డలి తో ఉండగా అందరూ చూస్తారు, నీ ఉద్దేశం అందరికీ తెలిస్తుంది. చెట్టు కొట్టేటప్పుడు నీకు అక్కడక్కడ ముళ్ళు గ్రుచ్చుకోవచ్చు.. అలాకాకుండా మనకు ఇబ్బంది కలిగించే వాటిని మనమీద అనుమానం రాకుండా, మనకు నష్టం కలగకుండా మట్టుబెట్టే విధానం గురించి మనకు ముందు తెలిసి ఉండాలి. అంతిమంగా అది మంచికై ఉండాలి.. ఇదే చాణక్యనీతి!

pranjali ప్రభ ... 26-01-2023 

              ఇంద్రియాలు అనేక ఆకర్షణలకు లోనవుతాయి. కన్ను అందం వైపు మనసును మళ్ళిస్తుంది. దాంతో పదే పదే దాన్నే చూడాలనిపిస్తుంది. అది మోహంగా మారిపోతుంది. మోహం మనసును కలుషితం చేసే పెద్ద మలినం. మనల్నీ, మన మనసుల్నీ మలినం చేస్తాయి, మనుసులో కోరికలను అదుపులో ఉంచుకుంటేనే ఇది సాధ్యం.

            ఇంద్రియాలను నిగ్రహించుకుంటే మలినాలు మనలోకి ప్రవహించవు. అలాగే వస్తువులను వివేకంగా ఉపయోగించుకోవడం వల్ల మలినాలకు దూరం కాగలం. దుస్తులను కేవలం శీతోష్ణాల నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికీ, ఈగలు, దోమలు, కీటకాలు, పాముల లాంటి పురుగుల నుంచి కాపాడుకోవడానికీ మాత్రమే ఉపయోగించాలి. అందుకోసమే వాటిని ధరించాలి. అలాగే, ఆహారం కూడా... శరీరం శుష్కించిపోకుండా ఉండడానికే. అంతే తప్ప, అతిగా తిని... మత్తును, సోమరితనాన్ని పెంచుకోవడానికి కాదు.పరుషమైన మాటల్ని భరించడం వల్ల  కూడా మన మనసులోకి మలినాలు ప్రవేశించకుండా అడ్డుకట్ట వేయగలం.

              క్రూర జంతువులను, విష సర్పాలను, ఎండి కొనదేలిన మోడులను, ముళ్ళ కంపలను, మురికి గుంటలను, చెత్త కుప్పలను ఎలా దూరం పెడతామో... చెడ్డవారిని కూడా అలాగే దూరం పెట్టాలి.చెడు తలపులను వెంటనే తుడిచివేయాలి, ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం, మోహం... ఇలాంటి దురాలోచలన్నిటినీ పుట్టీ పుట్టక ముందే మనలోనుంచి పంపేయాలి.

*శ్లో𝕝𝕝 ఏక ఏవ పదార్థస్తు* *త్రిధా భవతి వీక్షితః|*

*కుణపం కామినీ మాంసం* *యోగిభిః కామిభిః శ్వభిః||*

*-చాణక్య నీతి-*

*తా𝕝𝕝 మానవ శరీరాన్ని... కనుక పరికించి చూస్తే యోగికి తోలుతిత్తిలా, కాముకుడికి కోరిక తీర్చేదిగా, క్రూర మృగానికి మాంసపు ముద్దగా ఎలా కనిపిస్తుందో, అదే విధముగా పదార్థము ఒక్కటే అయినా, వారి చూపును/ భావనము బట్టి పలురకాలుగా కనిపిస్తుంది/అనిపిస్తుంది .... అనగా అంతా మన చూపులోనే/భావనలోనే ఉంది అని భావము.*

****


*ఒక భక్తుడు ... 27-012023

ఒక భక్తుడు గాయత్రి దేవిని దర్శించాలి అనే పట్టుదలతో ఏకాంతంగా వుండే ప్రదేశనికి వెళ్ళి తపస్సు చేయడం మెదలుపెట్టాడు. అతను నిర్మించుకున్న పర్ణశాల అవి చూసి దారినపోయె ఓ గొల్లవాడు రోజు వచ్చి ఓ చెంబెడు పాలు ఇచ్చి వెళుతుండే వాడు. అతను రోజూ వచ్చి చెంబుతో పాలు గుమ్మం బయట
పెట్టి అయ్యా అని అరిస్తే ధ్యానంలో వుండే స్వామి వచ్చి ఆ చెంబు తీసుకుని లోనికి వెళ్ళి నిన్న తెచ్చిన చెంబుని బయట ఇచ్చే వాడు. రోజూ ఇలా జరుగుతుండేది. స్వామి 24 లక్షల పునశ్చరణ చేసాడు. అయినా అమ్మ దర్శనం కాలా విసుగేత్తిపోయాడు. 

ఇంత చేసినా దర్శనం కాని దేవత ఎందుకూ అని ఆమెనే భస్మం చేస్తానని నిర్ణయించుకుని సమిధల సమీకరణ కోసం పక్కన వున్న అడవికి వెళ్ళాడు.
ఇంతలో గొల్లవాడు వచ్చి పాలచెంబు అక్కడపెట్టి అయ్యా అని అరిచాడు.
అక్కడ జరిగిన విచిత్రం చూసి స్వామి మీద కోపం తెచ్చుకున్నాడు. ఇంతలో స్వామి అక్కడికి వచ్చాడు. అయన్ని చూసి అడిగాడు గొల్లవాడు ఏంస్వామి మీరు వివాహం చేసుకున్నారు అమ్మ వుందని నాకు చెప్పలా? ఆశ్చర్యపోయిన స్వామి నేను వివాహం చేసుకోవడం ఏమిటి ఏంమాట్టాడుతున్నావు? అందుకు గొల్ల వాడు మీరు అబద్దం చెపుతున్నారు ఇప్పుడు నేను పాల చెంబు ఇక్కడ పెట్టి కేకేశా అమ్మ వచ్చి చెంబు తీసుకేళ్ళింది అన్నాడు అదిరిపోయిన స్వామి నువ్వు అమ్మను చూశావా? అని అడిగాడు 

అందుకు గొల్ల వాడు అమ్మ బయటకు రాలా కానీ చేతితో తీసుకుంది నా ఖాళీ చెంబు ఇక్కడ పెట్టింది. అన్నాడు
ఆ చేతి ని వర్ణించ మన్నాడు స్వామి గొల్ల వాడు చేసిన వర్ణన ఆ జగన్మాత ధ్యాన శ్లోకానికి దగ్గరగా వుంది. వళ్ళు పులకరించిన స్వామి లోనికి పరుగేత్తేడు గొల్లవాణ్ణి లోనికి రమ్మన్నాడు లోపల పాలు కాచి నివేదనకు సిద్ధం చూసావా స్వామి మీరు అబద్దం చెపుతున్నారని బయటికి వెళ్ళాడు గొల్ల వాడు. ఏడ్చాడు స్వామి.
ఇంత దయలేదా నామీద మాతా అని, అప్పుడు జగన్మాత మాటలు వినిపించి నువు చేసిన పాప ప్రక్షాళనికే ఇన్నేళ్ళు పట్టింది. అది తీరిపోయింది ఇక నీకు దర్శనమౌతుంది. మరలా చెయి అని అంది అమ్మ. బయట వున్న గొల్ల వాడు ఏ ఇంట్లో అయినా ఇదే గొడవ అనుకుంటూ వెళ్ళి పోయాడు.
*జపతో నాస్తి పాతకం*
--౯())---

28-01-2023

ఈ పాపం ఎవరిది

♦️ఒక రాజ్యంలో   రాజుగారు   చాలా  మంచి వాడు . ఆయన  ప్రతి  రోజూ  తన రాజ్యం గుండా వెళ్లే పేద  బాటసారులకు  ప్రత్యేక సత్రం కట్టించి మద్యాహ్న  భోజనం  వండించి   పెట్టేవాడు  . 

ఒక  రోజు  యధావిధిగా   భోజనం   వండించే  ఏర్పాట్లు  చేస్తున్నాడు  .  అదే  సమయం  లో   ఆకాశం  లో  ఎగురుతున్న  ఒక  గద్ద  కాళ్ళతో  పట్టుకున్న  పాము  నోటినుండి  విషం....  వడ్డించడానికి  సిద్ధంగా  ఉన్న   అన్నం  బేసిన్  లో  పడింది  .  అది  ఎవరూ  గమనించలేదు 

ఆభాగం  ఒక  బాటసారి  తిన్నాడు .  అది   తినడం  వలన    అతడు  చనిపోయాడు .  ఈ  వార్త  రాజుగారికి  చేరింది   .   ఆయన  చాలా   దుఃఖించాడు .   మేలు  చెయ్యబోతే   ఇలా  కీడు  జరిగింది  అని  ఆయన   చింతించాడు .

ఇప్పుడు  బాటసారి  చనిపోవడానికి   కారణం  ఎవరు ?

ఆ రాజా ?   వంటవాడా ?    పామా ?  గద్దా  ? వడ్డించిన  వ్యక్తా ? 

రాజు చేసేది ధర్మ కార్యం

అతనిది తప్పులేదు.

గ్రద్దకు పాము ఆహారం

దాని తప్పు లేదు.

 పాముది మరణ బాధ  

కొట్టుకుంటోంది, దాని తప్పులేదు

వడ్డించే వాడికి విషయం తెలీదు, అతని పని అతను చేస్తున్నాడు ,అతని తప్పూ లేదు. 

 మరి ఈ  పాపాన్ని  ఎవరి  ఖాతాలో  వెయ్యాలి ? 

వీరిలో  ఎవరూ   కావాలని  ఆ  బాటసారి ని   చంపలేదు .

యమ ధర్మరాజును  చిత్ర గుప్తుడు అడిగాడు. 

యమధర్మరాజు కు ఏమి చెప్పాలో అర్థం కాక అది అలా ఉంచు బాగా ఆలోచించి చెపుతాను అన్నాడు.

ఇది  ఇలా  ఉంటే  కొన్ని రోజుల తర్వాత    దారినే  పోతున్న  బాటసారులు  కొందరు   రాజుగారు  బాటసారుల కు అన్నదానం    చేసే సత్రం  ఎక్కడో  చెప్పమని  ఒక  వనితను  చిరునామా  అడిగారు . 

ఆమె  వారికి  దారిని  చూపుతూ  

“  బాబూ !   జాగ్రత్త  మా  రాజు  గారికి బాటసారులు  అంటే   పడదు ,  కొద్ది రోజుల క్రితమే  ఒకాయనను  విషం  పెట్టి  చంపేశారు”     మీ  రోజులు  బాగున్నాయో   లేదో  ?   చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అంది  .

వెంటనే యమధర్మరాజు  

“ చిత్రగుప్తా !    మొత్తం  పాపం  అంతా  ఈమె   ఖాతాలో  వెయ్యి అన్నాడు.

 సదుద్దేశ్యంతో  ధర్మ కార్యాలను చేసేటప్పుడు

యాదృచ్చికంగా    జరిగే   పనులకు , తప్పు ఎవరిదో తెలీకుండా నిందలను ఆపాదిస్తూ,  వ్యక్తులను  నిందించే  వారికే   ఆ  మొత్తం  కర్మ  ఫలం  కలుగుతుంది  అని  ధర్మరాజు .”  అన్నారు.

🚩కాబట్టి  విషయం సవివరంగా తెలియనప్పుడు ఎవరిమీద  మనం  నిందారోపణలు చేస్తే ఆపాపం మనకే వస్తుంది.

తస్మాత్ జాగ్రత్త🚩

➡ బ్రతికున్నాడు అంటే -- వాడు చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయి అని.

➡ మరణించాడు అంటే -- వాడు చేయాల్సిన పనులు పూర్తయిపోయినాయి అని. 

ఈ 'పనుల మూటలు'  వ్యక్తి యొక్క గత జన్మల కర్మ విశేషాలు కావు. ఈ మూటలు ఈశ్వర సంకల్పాలు.

 ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన పని చేస్తుండటమే  నిజంగా 'ఈశ్వర పూజ'.

****
29-01-2023

*దేశ0 సర్వోన్నత కొరకు మీ కృషి ?

మీ విధేయుడు।।మల్లాప్రగడ రామకృష్ణ 

*కారు మేఘాలు కమ్ముతున్నాయి ఏక్షణంలో అయినా।।। వర్షం విపరీతంగా కురుస్తుంది।।।! 

వేసే ముగ్గు।।వర్షంలో కలుస్తుంది !అయినా।।ఆమె ముగ్గువేస్తోంది।।। ! *అదీ।।సంప్రదాయం*

*। నాయకులు ఖర్చు చేసి గుంటలు తవ్వే దప్పుడే, ప్రభుత్వ సొమ్మును దోచే దప్పుడే ।అదీ।। సాంప్రదాయం 

* అంతర్జాతీయ ఖ్యాతినార్జించి అమెరికాలో ఉంటున్న వైద్యుడు। సొంతూరు వచ్చినప్పుడల్లా పాఠాలు చెప్పిన పంతులుకు పాదాభివందనం చేస్తాడు…! అదీ సంస్కారం

* నాయకులు చెప్పినవన్నీ చేసామని మరొక్క సారి గెలిపించమని ఓట్లు అడుగుటయే *అదీ ।। సంస్కారం ! 

* ఖగోళ శాస్త్రాన్ని నమిలి మింగిన నిష్ణాతుడు।  నిష్టగా ఉంటూగ్రహణం విడిస్తేగానీ।।। ఆహారం గ్రహించడు…! అదీ।।నమ్మకం

* ప్రజలకొరకు నిరంతరంగా శ్రమిస్తూ సర్వ విధాలా సహకరిస్తూ గెలుపు ఖాయం అనే నాయకుని ఆశ *అదీ ।। నమ్మకం  !* 

*పరమాణు శాస్త్రాన్ని పిండి పిప్పిచేసిన పండితుడు। మనవడి పుట్టు వెంట్రుకలు పుణ్యక్షేత్రంలో తీయాలని 

పరదేశం నుండి పయనమై వస్తాడు…!  *అదీ ।। ఆచారం !*

*కాలంతో పాటు ప్రజలు నాయకుని కొడుకునే ఆలోచించి గెలిపిస్తారు కానీ కొడుకు లక్షణాలు తెలుసుకోలేరు అదీ।।।ఆచారం

*అంతరిక్ష విజ్ఞానాన్ని అరచేతబట్టిన  అతిరధుడు।  అకుంఠిత నిష్ఠతో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తాడు…!  *అదీ । సనాతన ధర్మం!। ।

*నాయకులైన ప్రజలే దేవుళ్ళు అని భావించటం, తల్లి, తండ్రి, గురువుకు పాదాభివందనం చేయడం అదీ।।సనాతన ధర్మం

*అత్తింటికి వెళ్లేముందు ఇంటి ఆడబడుచు పెద్దలందరికీ పాదాభివందనం చేసి పయనమవుతుంది…! *అదీ ।। పద్ధతి 

*నాయకుడు దండాలు పెట్టుచూ ఓట్లు అడగడం *అదీ।।। పద్ధతి

*పెద్ద చదువులు చదివినా పెద్ద కొలువు చేస్తున్నా పేరు ప్రఖ్యాతులున్నా పెళ్లి పీటలమీద ।। వధువు పొందికగా ఉంటుంది  *అదీ ।। సంస్కృతి!

*నాయకురాలుగా దేశానికి సహకారం అందిస్తూ, భర్తకు గౌరవ సుఖాన్ని స్తుంది। *। అదీ।। సంస్కృతి 

* భార్య పక్షవాతానికి లోనయ్యింది। మంచం దిగలేని పరిస్థితి తనంతట తానుగా।। తనువీడ్చలేని స్థితి। భర్త భరోసాగా నిలచి।।భారమంతా మోస్తాడు-అన్నీతానై ।। అలిని  సాకుతాడు…! *అదీ । దాంపత్యం! 

* నాయకుడుగా ఎంత దుర్మార్గుడైన భర్తగా భార్యను సుఖపెట్టడం *।।ఇదీ।।। దాంపత్యం 

* బ్రతికే అవకాశం తక్కువ వెంటిలేటర్ పై వేచిచూస్తే బ్రతికితే బ్రతకొచ్చు! లక్షల ఖర్చు భరిస్తూ వెంటిలేటర్ పై పెడతారు… *అదీ ।। అనుబంధం!

*నాయకులు చావు బ్రతుకులు యందు సహాయ సహకారాలు నమ్మకం కల్గించడం అదీ।। అనుబంధం 

*ఇవి భారతీయుల తరతరాల ఆచారాలు, సంప్రదాయలు, విలువలు, ఔన్నత్యం మాత్రమే విజ్ఞాన, శ్వాస,విజయ,వినయ సంపదులు దేశ భవిష్యత్తు 

***
30--01-2023 ....ధృతరాష్ట్ర కౌగిలి !
.
పదివేల మదపుటేనుగుల బలముగలవాడు, పుట్టు గ్రుడ్డి, బ్రజ్ఞాచక్షుడు (బుద్ధియే కన్నుగా గలవాడు).
లోకము నందు జనులకు నెల్ల అవయవములలో శిరస్సు ప్రధానము.
అట్టి శిరస్సులో గన్నులే ప్రధానములు. ధృతరాషు్ట్రనికి అట్టి కన్నులే లేవు, గాని గుణములచేత అతడు ఉత్తముడే యని పిల్ల (గాంధారి) నిచ్చి పెండ్లి చేసారని నన్నయ గారు వ్రాసారు.

ఆంధ్రదేశంలో ధృతరాషు్ట్ర కౌగిలి గురించి తెలియని తెలుగువాడుండడు అంటే అతిశయోక్తి కానేకాదు. కౌగిలి వల్ల కలిగే భావన ఏ సామాన్యునకైన ఒకటే, అదే సుఖప్రాప్తి. దీనిని కవులు వివిధ సందర్భాల్లో కవితల్లో, అనేక కావ్యాలలో వర్ణించి ఉన్నారు. ప్రియురాలి కౌగిలిలో కలిగే సుఖం, లేదా తల్లిదండ్రుల కౌగిలిలో కన్నబిడ్డలు పొందే సుఖానుభవం వర్ణనాతీతం.

శకుంతల నిండు సభలో దుష్యంతునకు కుమారుడైన భరతుని చూపిస్తూ, ఈ కుమారుడి కౌగిలి వలన కలిగే సుఖాన్ననుభవింపుము రాజా, ముత్యాలహారాలు, పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారం, మంచి గంధము, వెన్నెలయూ జీవులకు పుత్రుని కౌగిలి వలె మనసుకు సుఖాన్ని, చల్లదనాన్ని కల్గించలేవు అంటుంది.

మరి ఈ ధృతరాషు్ట్ర కౌగిలి ప్రత్యేకత ఏమిటి? ఈ కౌగిలి వల్ల సుఖప్రాప్తి మాటెలా ఉన్నా అవతలివాడు బ్రతికి బట్ట కట్టలేడంటే అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ఈ కౌగిలి బలం ఎంత అని మాత్రమే.

ఈ కౌగిలి రహస్యం, బలం తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి శ్రీకృష్ణుడు అంటే ఆశ్చర్యకరంగా లేదూ?

తుదకు దుర్యోధనుడు తొడలు విరిగి పడుటతో ధృతరాషు్ట్రని ఆశాతంతువు తెగిపోయినది. దుఃఖాతిశయంతో "చావరు నొవ్వరు పాండవు లేవురునని నీవు చెప్ప నిప్పలుకులు దుఃఖావేశకరములై చేతోవృత్తి దహింపజొచ్చె దుర్భరభంగిన్" - పాండవులు అయిదుగురు మరణించలేదు. ఏ విధమైన బాధను పొందలేదు. అని నీవు చెప్పిన మాటలు భరించరాని దుఃఖంతో నా గుండెను మండింపజేస్తున్నాయి.

తన కొడుకులెంత దుర్మార్గులైనను వారందరినీ హతమార్చిన వ్యక్తిని ఏ తండ్రి  క్షమించగలడు? ఎవ్వరెంత ఓదార్చినను తన కొడుకుల తప్పు తనకెంత తెలిసినను రణరంగస్మశానంలో అడుగు పెట్టుసరికి ధృతరాషు్ట్రని హృదయమున పుత్రశోకము, భీముని మీది కోపము పొంగులు వారినది. తన నూరుమంది కుమారులను హతమార్చినది భీముడే!

భీముడి పేరు వినేసరికి ఆ గుడ్డిరాజు మొగంలో భయంకరమైన క్రోధం ప్రకోపించింది. త్రికాలజ్ఞుడైన శ్రీకృష్ణుడు, భీముడిని అతడి వద్దకు పంపకుండా అంతకుముందే అమర్చి ఉన్న ఒక ఇనుప భీమవిగ్రహాన్ని ధృతరాషు్ట్రడి ముందు ఉంచాడు. దాన్ని నిజభీముడని భావించి గుడ్డిరాజు తన వేయి ఏనుగుల బలాన్ని కూడగట్టుకొని కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలి బిగువులో భీముడి ఉక్కు విగ్రహం ముక్కలైంది. రాజు రొమ్ము చిట్లింది. ముఖరంధ్రాలన్నింటి నుండి రక్తం కారనారంభించింది. అతడు మూర్ఛపోయాడు. ఆ మూర్ఛలో, ఈనాటికి భీముడిని చంపగలిగాను, నా కొడుకు దుర్యోధనునికి ఈనాడే మోక్షం కలుగుతుంది - అని పలవరించాడు.
మూర్ఛ తేరిన తర్వాత తాను లోలోన సంతోషిస్తూనే ఎవరేమనుకొంటారో అని భీముడి పేరు ఉచ్ఛరిస్తూ పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు.

శ్రీకృష్ణుడా కపటనాటకాన్ని చూచి నవ్వి, భీముడు బ్రతికి ఉన్నాడని చెప్పి ధృతరాషు్ట్రని దుర్బుద్ధిని బయటపెట్టి, పాండవులను చంపినా, చనిపోయిన కౌరవులు తిరిగి వస్తారా? ఇప్పటి చర్య వలన చెరగని మచ్చవంటి పాపం చేశావని, ఇకనైన పాండవులను సామరస్యంతో చూచి విజ్ఞతను ప్రకటించుమని హెచ్చరించాడు.

శ్రీకృష్ణుడి మాటలు విని, ధృతరాషు్ట్రడు పరితప్తుడై పాండవులను సొంతకొడుకులుగా చూచుకొంటానని మాట ఇచ్చాడు.

మితిమీరిన పుత్రమమకారంతో తగిన తరుణమున తనయుల దండింపక, తరువాత దండింప గలిగినా శక్తి చాలక, సుతుల మరణమునకు, సంఘనాశనమునకు పరోక్షకారకుడై పుత్రశోకములో అపకీర్తి పాలైన తండ్రి తత్త్వమును, మహాభారతము ధ్రుతరాషు్ట్రనిలో చిత్రించింది.


--(())--

31-01-2023.. పంచకోశాలు ఏవి?

పంచకోశాలంటే 5 కోశాలు. అసలు కోశం అంటే ఏమిటి? కత్తి ఆకారంలోనే ఉండి కత్తిని కనిపించకుండా దాచే 'ఒర' అని అర్థం. ఒర ఎలాగైతే కత్తిని కప్పివేస్తున్నదో అలాగే మనలోనే ఉన్న - మన నిజస్వరూపమైన ఆత్మను మనకు తెలియకుండా కప్పివేసి తామే ఆత్మ అయినట్లుగా భ్రాంతిని - తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేవే ఈ పంచకోశాలు. ఈ పంచకోశాలు ఇంతకుముందు చెప్పుకున్న స్థూలసూక్ష్మ కారణశరీరాలకు వేరైనవి కావు. ఆ 3 శరీరాలనే 5 కోశాలుగా విభాగించారు. అవే
1. అన్నమయకోశం.
2. ప్రాణమయకోశం.
3. మనోమయకోశం.
4. విజ్ఞానమయకోశం.
5. ఆనందమయకోశం.

•    అన్నమయ కోశమే స్థూలశరీరం.
•    ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయకోశాలే సూక్ష్మశరీరం.
•    ఆనందమయ కోశమే కారణశరీరం.
ఈ 5 కోశాలు గురించి తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం?


శ్లో || అన్నం ప్రాణో మనోబుద్ధి, రానందశ్చేతి పంచతే|
కోశాః తై రావృతః స్వాత్మా, విస్మృత్యా సంసృతి వ్రజేత్||
(వేదాంత పంచదశి 1-33)

- అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచకోశాల చేత మన నిజస్వరూపమైన ఆత్మ కప్పబడి ఉన్నందున జీవుడు తన నిజస్వరూపమైన ఆత్మను మరచిపోయాడు. అందువల్ల తప్పుడు దారుల్లో పడిపోయి, సంసారాన్ని తగిలించుకొని, దుఃఖాలలో, బాధలలో, కష్టాలలో, నష్టాలలో మునిగిపోయాడు.
అన్నమయకోశం ఏది?

అన్నసారంతో పుట్టి, అన్నసారంతో పెరిగి అన్నరూప భూమిలో కలిసిపోయే స్థూలశరీరమే అన్నమయ కోశం.
అన్నరూప సారంతో పుడుతున్నది: అసలు శరీరం తయారయ్యేది తల్లిగర్భంలో. తల్లిగర్భంలో పిండం ఏర్పడాలంటే తల్లి అండం, తండ్రి బీజం (వీర్యం) ఉండాలి. తండ్రిలో వీర్యం తయారయ్యేది అన్నరసం వల్లనే. కనుక అన్నసారంతోనే దేహం యొక్క పుట్టుక.
అన్నరూపసారంతో పెరిగేది :- తల్లిగర్భంలో పిండం క్రమక్రమంగా పెరుగుతున్నదీ అంటే అది తల్లి తీసుకొనే ఆహరం ద్వారానే. అలాగే పుట్టిన తర్వాత ఆ స్థూలశరీరం క్రమక్రమంగా పెరిగేది కూడా అతడు తీసుకొనే ఆహారం వల్లనే. కనుక అన్నసారంతోనే పెరుగుతుంది.
అన్నసారమైన భూమిలో కలిసిపోయేది :- చనిపోయిన తరువాత ఆ దేహం మట్టిలో కలిసిపోతుంది. మట్టి లేదా భూమి అన్నరూపమే. ఎందుకంటే ఆ భూమి నుండే ఆహారంగా కాయలు, పండ్లు, ఆకుకూరలు, ధాన్యాలు మొ||నవి వస్తున్నవి. అందుకే ఈ దేహం అంతా అన్నమయం. కనుక దీనిని అన్నమయ శరీరం అన్నారు. ఇది స్థూలదేహం.

అన్యోన్య అధ్యాస
అన్నమయకోశం ఆత్మ వేరువేరు అయినప్పటికీ అంతా ఒక్కటిగా - నేనుగా ఎందుకు అనుకుంటున్నాం? ఇదే అన్యోన్య అధ్యాస - అన్నమయకోశమే నేను అనుకోవటం అజ్ఞానం -
నేను స్త్రీని, నేను పురుషుణ్ణీ  అనే అన్నమయకోశ జాతి ధర్మాలను, నేను పుట్టాను, పెరుగుతున్నాను అనే దేహమార్పులను, నేను బాలుడను, యువకుడను, వృద్ధుడను అనే అవస్థలను, నేను బ్రాహ్మణుడను, వైశ్యుడను, శూద్రుడను అనే వర్ణధర్మాలను, నేను బ్రహ్మచారిని, గృహస్థును అనే ఆశ్రమ ధర్మాలను, నేను ఆంధ్రుడను, మలయాళీని, తమిళుణ్ణి అనే దేశ ధర్మాలను, నేను రామారావును, వెంకట్రావును, సీతాదేవిని, అనే నామాలను, మొ||న ఈ అన్నమయ కోశ ధర్మాలను - వికారాలను, ఇవి ఏమీలేని నిరాకార నిర్గుణ, సచ్చిదానందస్వరూపమైన ఆత్మపై (నేను పై) ఆరోపించటం జరుగుతున్నది.
ఇక ఆత్మ ధర్మాలైన సత్ - చిత్ - ఆనందమనే ధర్మాలను శరీరం ఉన్నది అనుకోవటం, తెలివిలేని శరీరాన్ని తెలివిగలదనుకోవటం, దుఃఖాన్ని కలిగించే శరీరాన్ని ఆనందం కలిగించేదిగాను భావిస్తున్నాం. ఈ విధంగా ఆత్మధర్మాలను అన్నమయకోశంపై ఆరోపిస్తున్నాం. అన్నమయకోశానికి - ఆత్మకు అన్యోన్యఅధ్యాస ఉన్నట్లుగా భావిస్తున్నాం.


ప్రాణమయం ఏది?

ప్రాణమయకోశం అంటే పంచప్రాణాలు + పంచకర్మేంద్రియాలు. వీటితో కూడినదే ప్రాణమయకోశం. శరీరం జడం. స్వతంత్రంగా అది కదలలేదు, ఏ పనీ చేయలేదు. అయితే జీవం ఉన్నంతవరకు అది పనిచేస్తూనే ఉంటుంది. చెడిపోకుండా ఉంటుంది. జీవం కాస్తాపోతే అది జడం. త్వరలోనే చెడిపోతుంది వాసనవేస్తుంది. అయితే ఈ శరీరాన్ని నిలబెట్టి, చైతన్యవంతం చేసి, జీవుడికి ఉపయోగపడేటట్లుగా చేసే జీవమే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి అది చేసే పనులను బట్టి 5గా విభాగించారు. అవే ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అనేవి.
 

(i) ప్రాణం :- నోట్లో వేసుకున్న ఆహారాన్ని లోపలికి తీసుకొనేది ప్రాణం. జ్ఞానేంద్రియాల ద్వారా బయటనున్న విషయాలను, అనుభవాలను లోపలకు స్వీకరించేది ప్రాణశక్తియే.
 

(ii) అపానం :- మలకోశం ద్వారా లోపల ఉన్న మలాన్ని బయటకు పంపించే శక్తి ఈ అపానానిదే. అలాగే కర్మేంద్రియాల ద్వారా ప్రతి స్పందనలను బయటకు పంపేది కూడా ఈ అపానమే. ఆ ప్రతిస్పందనలను బట్టే కర్మేంద్రియాలు పనిచేస్తాయి. మాట్లాడటం, పట్టుకోవటం, నడవటం, మలత్యాగం, ఆనందం - అన్నీ ఈ అపానశక్తి వల్లనే. 

(iii) వ్యానం :- మనం తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత జీర్ణకోశంలో ఉన్న ఆ సారాన్ని శరీరంలోని అన్ని భాగాలకు రక్తం ద్వారా సరఫరా చేయించేందుకు గుండెను ఆడించేది, కొట్టుకొనేట్లు చేసేది వ్యానశక్తి. అంటే అన్నసారాన్ని రక్తంలో కలిపేస్తుంది. గుండె కొట్టుకొనేటప్పుడు ఈ రక్తం గుండె నుండి శరీరభాగాలకు సరఫరా అవుతుంది. ఈ పని చేసేది వ్యానశక్తి.
 

(iv) ఉదానం :- శరీరంలోపల ఉన్న అన్ని భాగాలకు వార్తలను పంపేందుకు అనేక నాడులున్నాయి. ఈ నాడులన్నింటిని పని చేయించేది ఉదానశక్తి. అంతేకాదు జీవుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ జీవుణ్ణి అతడి కర్మఫలాలకు అనుగుణంగా అగ్నిదేవతకు అందించాలంటే అగ్నిదేవతకు అందిస్తుంది. లేదా ధూమదేవతకు అందించాలంటే ధూమదేవతకు అందిస్తుంది.
 

(v) సమానం :- మనం తిన్న ఆహారాన్ని అరిగించటానికి జీర్ణకోశాన్ని ఆడించేది ఈ సమానవాయువు. అలా ఆహారాన్ని అరిగిస్తేనే అందులోని సారాన్ని దేహభాగాలకు, పనికిరాని చెత్తను మలద్వారం ద్వారా బయటకు పంపటానికి వీలవుతుంది. కనుక ఈ సమానమే ఆహారాన్ని అరిగించేది.

అన్యోన్య అధ్యాస :-
నేను ఆకలిగా ఉన్నాను. దప్పికతో ఉన్నాను అంటాం. ఆకలి దప్పికలు ప్రాణధర్మాలు. వీటిని ఆత్మపై ఆరోపిస్తున్నాం. అలాగే నేను వక్తను, ఉపన్యాసాలు దంచేస్తాను. దాతను, అంటాం. ఇవి కర్మేంద్రియ ధర్మాలు. వాటిని ఆత్మపై ఆరోపిస్తున్నాం. ఇలా ప్రాణకోశ ధర్మాలను ఆత్మపై ఆత్మధర్మాలైన సచ్చిదానందాలను ప్రాణమయకోశంపై ఆరోపించటం అన్యోన్య అధ్యాస. నాకు ఆకలిగా ఉన్నదీ అన్నప్పుడు నాకు కాదు దీనికి అనే భావన మనలో మెదిలితే ఆత్మకు దగ్గరవుతాం. ఆత్మగా ఉంటాం.

మనోమయమేది?

మనోమయకోశం అంటే మనస్సుకు సంబంధించిన కోశం. ప్రాణమయం అంటే ప్రాణానికి సంబంధించినది. మనస్సు, 5 జ్ఞానేంద్రియాలతో కలిసినప్పుడే దానిని మనోమయకోశం అన్నారు. మనస్సు అంటే ఆలోచనలే. మనస్సు ఆలోచనలెప్పుడు చేయగలుగుతుంది? ప్రపంచ విషయాలు తనలోకి చేరితే ఆలోచనలు చేస్తుంది. అవి చేరాలంటే 5 జ్ఞానేంద్రియాలు ఉండాలి. అవే ప్రపంచ విషయాల జ్ఞానాన్ని మనస్సుకు చేరవేసేది. కనుక మనస్సు + 5 జ్ఞానేంద్రియాలు = ఈ 6 కలసి మనోమయకోశం అన్నారు.
ఇక్కడ కూడా అన్యోన్యఅధ్యాస ఉన్నది - విజ్ఞానమయః కః?

బుద్ధి, 5 జ్ఞానేంద్రియాలు కలిసినది ఏదో అదే విజ్ఞానమయకోశం. బుద్ధిలో కలిగే జ్ఞానం కూడా ప్రాపంచిక  జ్ఞానమే. ఆ ప్రాపంచిక జ్ఞానం బుద్ధిలో కలగాలంటే ప్రపంచం నుండి విషయాలను సేకరించి బుద్ధికి అందించే 5 జ్ఞానేంద్రియాలు ఉండాలి. కనుక ఈ ఆరూ - బుద్ధి, 5 జ్ఞానేంద్రియాలు  విజ్ఞానమయకోశం అవుతుంది. ఇదీ ఆత్మను దాచేదే.

అన్యోన్య అధ్యాస :-
నేను తెలివిగలవాడను, నేను భక్తుడను--- అన్నప్పుడు ఎవరా తెలివిగలవాడు? బుద్ధియే. కాని నేను అని ఆత్మపై ఆరోపిస్తున్నాం. (ఆత్మధర్మాలను బుద్ధిపై ఆరోపిస్తాం.) నేను తెలివిగలవాడను అనుకోగానే ఎవరు? అని ప్రశ్నించుకో - బుద్ధి అని తెలుస్తుంది.

నేను ఆలోచిస్తున్నాను. నాకు చాలా బాధగా ఉన్నది. ఈ రోజు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను - అనే మనస్సు  ధర్మాలను ఆత్మపై - తనపై ఆరోపించుకోవటం - అలాగే ఆత్మధర్మాలైన సత్తు చిత్తు ఆనందాలను మనోమయకోశంపై ఆరోపించటమే అన్యోన్య అధ్యాస. ఇది గ్రహించి నేను ఆలోచిస్తున్నాను అనగానే ఆలోచిస్తున్నది ఆత్మనైన నేను కాదు. ఈ మనస్సు ఆలోచిస్తున్నది అనే భావన రావాలి. 


ఆనందమయకోశం అంటే ఏమిటి?

కారణశరీరం అవిద్య - (అజ్ఞానం). ఈ అవిద్యలో ఉన్నది మలినసత్త్వం. సత్త్వగుణం మంచిదే. కాని ఆ సత్త్వగుణం మలినమైంది. దేనితో? రజోతమోగుణాలతో. సత్త్వగుణం సుఖాన్ని ఆనందాన్నిచ్చేది. కాని మలినసత్త్వం ప్రియ మోద ప్రమోదాలనిస్తుంది. ఏమిటవి?
 

మనం స్థూల సూక్ష్మ శరీరాలతో ప్రపంచంలో తిరుగుతుంటాం గదా! అలా తిరుగుతున్నప్పుడు మనకు ఇష్టమైన వస్తువు కనిపిస్తే దాన్ని చూచి తలచుకొని ఆనందించటం ప్రియం. ఇష్టమైన వస్తువును మనం స్వంతం చేసుకుంటే కలిగే ఆనందం మోదం. ఆ వస్తువును అనుభవిస్తున్నప్పుడు కలిగే ఆనందం ప్రమోదం. ఈ మూడూ మలినసత్త్వం వల్ల కలిగేవే. గాఢనిద్రలో ప్రపంచానికి దూరంగా ఉంటాం. ఏమీ తెలియకుండా ఉంటాం. అప్పుడు ఈ మలినసత్త్వం ఎంతో హాయిని కలిగిస్తుంది. అందుకే దీనిని ఆనందమయకోశం అన్నారు.
 

ఇక్కడి ఆనందం నిజమైన ఆనందం కాదు. నిత్యమైన ఆనందం కూడా కాదు. ఇది దుఃఖం లేని స్థితి. మెలకువ వస్తే మాయమయ్యేది ఈ ఆనందం. కనుక ఇది తాత్కాలికమే.
నిజంగా చెప్పాలంటే ఈ సుషుప్తిలో - కారణ శరీరంలో ఉన్న జీవుడు పొందే ఆనందం అజ్ఞానమే -
పైన చెప్పిన 4 కోశాలు ఎంతో కొంత అర్థమవుతాయి గాని ఆనందం అంటే అజ్ఞానం అని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. అందుకే విచారణ చేయాలి. 


ఆనందమయకోశం ఆనందాన్నిస్తున్నది అనుకుంటాం. అసలు నిజం ఏమిటి? సుషుప్తిలో 'నాకేమీ తెలియదు. నేను హాయిగా నిద్రపొయ్యాను' - అనేది మనస్థితి. ఏమీ తెలియకుండా ఉన్నప్పుడు హాయి, ఆనందం కలిగింది అంటున్నాం. ఇది మన అందరి అనుభవం గనుక నిజమేనని అంగీకరించాలి. కొందరు అడుగుతారు. - "ఏదైనా తెలిస్తే ఆనందంగాని, ఏమీ తెలియకపోతే ఏమి ఆనందం? అని. ఆలోచించండి. జాగ్రదవస్థలో ఎన్నో తెలుసుకుంటుంటాం, సంపాదించుకుంటాం, సుఖాన్ని కోరుకుంటాం. ఇష్టమైన వాటిని సంపాదించుకొని అనుభవించి ఆనందిస్తాం. నిజమే. ఇదే జాగ్రదవస్థలో మనం కోరకపోయినా దుఃఖాలు, బాధలు, అలజడులు ఉన్నాయా? లేవా? ఉన్నాయి. కనుక అన్నీ తెలుస్తుంటే ఆనందమే అనుకోరాదు. దుఃఖం కూడా ఉన్నది.
 

    అలాగే స్వప్నంలో అన్నీ స్వప్న పురుషుడికి తెలుస్తూనే ఉంటాయి. ఆనందం - దుఃఖం రెండూ ఉన్నాయి. అంటే అన్నీ తెలుస్తున్న జాగ్రత్ స్వప్నావస్థలలో ఆనందం ఉందీ, దుఃఖం కూడా ఉన్నది. మరి సుషుప్తిలోనో ఏమీ తెలియనిస్థితి. అయినా ఆనందం ఉంది. దుఃఖం అసలు లేదు. కనుక ఏమీ తెలియని స్థితిలో ఆనందం ఎలా ఉంటుందో మనకు అనుభవమే. అన్నీ తెలిసిన స్థితిలో కొంతసేపు ఆనందం, కొంతసేపు దుఃఖం. ఏమీ తెలియనిస్థితిలో ఆనందం మాత్రమే ఉంది. ఏమీ తెలియని స్థితి అంటే అజ్ఞానమే గదా! అంటే అజ్ఞానంలోనే ఆనందం ఉన్నదని తెలుస్తున్నది గదా! కనుక ఈ ఆనందం అజ్ఞానమే అని అంగీకరించాలి.
 

మరి ఈ అజ్ఞానంలో ఆనందం కలుగుతున్నది గనుకనూ, ఈ అజ్ఞాన ఆనందం మన నిజస్వరూప ఆత్మను కప్పివేస్తున్నది గనుక ఈ అజ్ఞానాన్నే ఆనందమయకోశం అన్నారు.
 

ఈ అజ్ఞాన ఆనందం మన నిజస్వరూపమైన శాశ్వత, అఖండ ఆనందమా? కాదు గదా! ఎందుకంటే ఆత్మానుభూతిలో ఉంటే ఆనందం శాశ్వతం. నిత్యానందం. మరి ఈ సుషుప్తిలో ఉండే ఆనందం తాత్కాలికం. నిద్ర లేవగానే, అన్నీ తెలిస్తూ ఉంటే ఆనందం అదృశ్యం. కనుక శాశ్వతంగా ఆనందాన్ని పొందాలంటే శాశ్వతంగా ఏమీ తెలియని స్థితి ఉండాలి. అంటే నేను ఆత్మను అనే అనుభూతి తప్ప ఇక ఏ ఇతర ఆలోచన ఉండరాదు.
కత్తిని ఒర కప్పినట్లు ఆత్మను ఈ అజ్ఞానానందం కప్పివేస్తుంది గనుక దీనిని ఆనందమయకోశం అన్నారు.

అన్యోన్య అధ్యాస
ఇక్కడ కూడా అన్యోన్య అధ్యాస ఉన్నది. ఏమిటిది?
 

(i) నేను ఏమీ తెలియకుండా ఉన్నాను.
(ii) నేను హాయిగా, ఆనందంగా ఉన్నాను.
 

అనే ఈ భావాలు ఎవరివి? ఇవి ఆనందమయకోశ ధర్మాలు. ఈ ఆనందమయకోశ ధర్మాలను నావిగా (ఆత్మవిగా) చేసుకుంటున్నాను. నావి అని భ్రమపడుతున్నాను. ఆత్మనని మరచిపోతున్నాను.
 

అలాగే నా (ఆత్మ) ధర్మాలైన సచ్చిదానందాలను ఆనందమయకోశం మీద ఆరోపిస్తున్నాను. ఇదే అన్యోన్య అధ్యాస. ఈ అధ్యాస పోవాలంటే ఆత్మను - ఈ పంచకోశాలను బాగా విశ్లేషణ చేసి విడగొట్టాలి. విడగొట్టి కోశ ధర్మాలను కోశాలకు వదలి ఆత్మగా ఉండిపోవాలి
****

--(())--