*పిత్రార్జితం. కాస్త పెద్ద కథే...ఓపిగ్గా చదవగలరు.
‘అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’*
వినోద్ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి.
అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది, ఎన్నో సినిమాల్లో చూసింది.
కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదనీ, భర్తకంటే ముందే పునిస్త్రీగా వెళ్ళిపోవాలనీ అందరు దేవుళ్ళనూ కోరుకుంది.
అయితే తన ప్రార్థన ఫలించలేదు.
భర్త గుండెపోటుతో తనకంటే ముందుగా భగవంతుణ్ణి చేరుకున్నాడు.
‘‘అమ్మ మన ఇద్దరిదగ్గరా ఉంటుంది. అలా అని ఏడాదికి ఆరునెలలంటూ మనం పంచుకోవలసిన అవసరంలేదు. ఆమెకు ఇష్టమైనన్ని రోజులు ఎవరి ఇంట్లోనైనా ఉండొచ్చు’’ అన్నాడు విజయ్.
విజయ్ సమాధానం విన్నాక ఆమె మనసు కాస్త స్థిమితపడింది.
‘అయినా తనకెందుకు లేనిపోని భయాలు, అనుమానాలు? తన బిడ్డల గురించి తనకు తెలియదా?’ అనుకుంది.
విజయ్, తండ్రి బీరువా తెరిచి అందులోంచి బ్యాంకు పాస్‌బుక్ తీశాడు.
తండ్రి పోయినరోజు నుంచి వైకుంఠ సమారాధన వరకూ అయిన ఖర్చులు ఇద్దరూ కలసి లెక్కలు వేశారు.
బ్యాంకులో ఉన్న డబ్బు తాము ఖర్చుపెట్టిన మొత్తంకంటే ఎక్కువగానే ఉండటం చూసి సంతోషించారు.
భర్త అకౌంటులో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకులు నిర్ణయాలు తీసుకోవడం సావిత్రిని బాధించింది.
‘అయినా తండ్రి అంతిమయాత్రకూ కార్యాలకూ అయ్యే ఖర్చులు ఆమాత్రం భరించలేరా.. ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు’ అనుకుంది.
తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది.
‘‘మేమిద్దరం ఇళ్ళు కట్టుకున్నాం. అందుకు బ్యాంకు లోనుతోపాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఇల్లు అమ్మితే పదిలక్షలదాకా వస్తుంది. మేము చెరో అయిదు లక్షలు తీసుకుంటాం. ఎటూ నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటి అవసరం ఉండదు’’ అన్నాడు విజయ్ తల్లితో.
‘‘మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లురా ఇది. కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన ఇల్లు కాదు. ఎంతో శ్రమతో, శ్రద్ధతో, ఆయన కష్టార్జితంతో కట్టిన ఇల్లు. ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి. మీ చదువులూ ఆటలూ మీ భార్యల సీమంతాలూ మీ పిల్లల బారసాలలూ... అన్నీ ఈ ఇంట్లోనే జరిగాయి. ఎంతోమంది బంధువులూ స్నేహితులూ ఈ ఇంటికి వచ్చి, మన ఆతిథ్యాన్ని స్వీకరించి, మనసారా దీవించి వెశ్ళారు. మనకెన్నో తీయని అనుభూతుల్నీ మీ నాన్నగారికి తృప్తినీ ఆనందాన్నీ ఇచ్చిన ఈ ఇంటిని అమ్మడం నాకిష్టంలేదురా’’ అంది సావిత్రి.
‘‘మనిషే పోయాక ఇక ఇల్లెందుకమ్మా?
మా ఇళ్ళకీ బంధువులూ మిత్రులూ వస్తారు. అక్కడ కొత్త అనుభూతులకు స్వాగతం పలుకుదాం. పైగా ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం. ఇల్లు అమ్మితే వచ్చే డబ్బుల్తో మా సమస్యలు తీరితే నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుంది’’ అన్నాడు వినోద్.
‘‘లేదురా, ఆయనకు ఈ ఇల్లంటే ప్రాణం. కనీసం నేను ఉన్నంతవరకైనా ఇల్లు అమ్మకండి. కావాలంటే నా నగలన్నీ ఇస్తాను. అవి అమ్ముకుని మీ అప్పులు తీర్చుకోండి’’.
‘‘నీ నగలు ఎన్ని ఉన్నాయమ్మా? అన్నీ అమ్మినా యాభైవేలు రావు’’ అన్నాడు విజయ్ విసుగ్గా.
‘‘అమ్మా, ఇంటి డాక్యుమెంట్లు కనబడటంలేదు. బ్యాంకు లాకర్లో పెట్టారా నాన్న?’’ బీరువా వెతుకుతున్న వినోద్ అడిగాడు.
‘‘లాకర్లో కాదు. నాన్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు. నేనూ ఆ విషయం మరచిపోయాను. ఇప్పుడు నువ్వడిగితే గుర్తొచ్చింది’’.
‘‘తాకట్టు పెట్టారా? అంత అవసరం ఏం వచ్చింది?’’ కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు.
‘‘మీ చదువుల కోసం’’.
‘‘మా చదువుల కోసమా? మా చదువులు పూర్తయి అయిదేళ్ళు కావస్తూంది’’ అన్నాడు విజయ్ అసహనంగా. బ్యాంకులోను వల్ల ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో తన వాటా మరింత తగ్గిపోతుందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అతను.
‘‘కావచ్చు.
ఆయన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసినా జీతం తప్ప మరో ఆదాయం ఆశించలేదు.
మీకు ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోతే లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేటు కాలేజీల్లో మిమ్మల్ని ఇంజినీరింగ్ చదివించారు.
మరి అంత డబ్బు ఆయనకు ఎక్కణ్ణుంచి వచ్చిందనుకున్నారు?
మీకు ఉద్యోగాలొచ్చాక ఆయన అప్పుల గురించి మీరు అడుగుతారనీ మీ వంతు సాయం చేస్తారనీ అనుకున్నాం.
కానీ మీకా ఆలోచన లేకపోయింది.
మీముందు చేయిచాచడానికి ఆయన ఇష్టపడలేదు.
ఆ అప్పు అలాగే నిలిచిపోయింది.
అప్పటికీ తన పెన్షను నుంచి కొంత, పైపోర్షను బాడుగ నుంచి కొంత బ్యాంకు లోనుకు కడుతూనే ఉన్నారు’’.
‘‘ఇంకా ఎంత కట్టాలట?’’
విజయ్ అడిగాడు.
‘‘అయిదు లక్షలు కట్టాలి’’ బీరువా నుంచి తీసిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను టీపాయ్‌మీదకి గిరాటేసి అన్నాడు వినోద్.
‘‘హు, ఏడ్చినట్లే ఉంది. ఈమాత్రం దానికి ప్రపంచంలో తానొక్కడే ఇల్లు కట్టినట్లూ పిల్లల్ని చదివించినట్లూ ఫోజులు’’ అన్నాడు విజయ్.
పిల్లలు భర్తను తేలికచేసి మాట్లాడుతూంటే సావిత్రికి ఎంతో బాధేసింది.
‘‘లోను తీసుకున్న ఆయన ఇప్పుడు లేరు కదరా. అయినా ఆ అప్పు మీరు తీర్చాలా?’’ అని తన అనుమానం వ్యక్తంచేసింది.
‘‘ఆయన లేకపోతేనేం? మేం బతికున్నాం కదా. ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకూ వారసులమే. అయినా అవన్నీ నీకు చెప్పినా అర్థంకాదు. ఇక మమ్మల్ని వదిలెయ్’’ రెండుచేతులూ జోడించి విసుగ్గా అన్నాడు వినోద్.
సావిత్రి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
‘తను చదువుకోలేదు. ఉద్యోగం చెయ్యలేదు. కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేంకాదు. భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు. అర్థంకాకపోతే వివరించేవాడు. వీళ్ళకు అంత ఓపిక లేదు. అందుకే ఇలా విసుక్కుంటున్నారు. వీళ్ళకోసం, వీళ్ళ ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది? ఎన్ని రోజులు ఉపవాసాలుంది? ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది? అవన్నీ వాళ్ళకు ఇప్పుడు గుర్తులేదు. గుర్తుచేసుకోరు కూడా’ అనుకుంది.
ముఖ్యంగా కోడళ్ళముందు కొడుకులు తనను అలా విసుక్కోవడం ఆమెను మరింత బాధించింది.
‘కోడళ్ళను కన్నకూతుళ్ళలా చూసుకున్నారు తనూ భర్తా. వాళ్ళు కల్పించుకుని భర్తల్ని వారించకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూంది. ఆర్థిక అవసరాలు అభిమానాల్ని ఇంతగా చంపేస్తాయా?’ అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.
* * *
ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారం వంక చూసింది.
ఏడు గంటలు చూపిస్తూంది.
‘అబ్బ, ఇంతసేపు ఎలా నిద్రపోయాను?’ అనుకుంటూ పిల్లల గదిలోకి నడవబోయింది.
ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది ఆమెకు.
‘రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ నిద్రపోయేసరికి పన్నెండు దాటింది. తెల్లవారుజామునే పిల్లల ప్రయాణం. నిద్రలేమి వల్ల తల పగిలిపోతూంది. కాఫీ గొంతులోపడితేగానీ అది తగ్గదు’ అనుకుంటూ గేటు దగ్గరకు వెళ్ళి పాలబ్యాగులో చెయ్యిపెట్టి చూసింది. అది ఖాళీగా ఉంది.
తల్లిని తనతో తీసుకెళుతున్నాననీ మరుసటిరోజు నుంచి పాలప్యాకెట్ అవసరంలేదనీ పాలవాడితో విజయ్ ముందురోజు చెప్పడం గుర్తుకొచ్చింది.
‘ఇంటిపై లోను ఉందని తెలిసి, ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకుని వెళ్ళడం మరచిపోయారు ఇద్దరూ’ అనుకుని నవ్వుకుంది.
షాపు నుంచి పాలప్యాకెట్ తెచ్చుకోవడానికి చిల్లరకోసం ఇల్లంతా వెదికింది.
ఎక్కడా చిల్లరగానీ కరెన్సీ నోట్లుగానీ కనిపించలేదు.
తలనొప్పి క్షణక్షణానికి అధికం కాసాగింది.
ఏంచేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకు ఎదురుగా కొక్కేనికి తగిలించి ఉన్న భర్త చొక్కా కనిపించింది.
ఆశగా వెళ్ళి జేబులో చెయ్యి పెట్టింది.
కొన్ని పదిరూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి.
ఆమెకు ప్రాణం లేచివచ్చింది.
‘నీకు నేనున్నాను’ అని భర్త తనతో అన్న భావన కలిగింది ఆమెకు.
‘ఎప్పుడూ వందరూపాయలకు సరిపడా పదిరూపాయల నోట్లు జేబులో ఉంచుకోవడం ఆయనకు అలవాటు. ఆ అలవాటే ఇప్పుడు తన అక్కర తీర్చింది’ అనుకుంది.
కాసేపు భర్త ప్రేమను తలచుకుని ఏడ్చింది.
తర్వాత చెప్పులేసుకుని షాపుకు బయలుదేరబోతూంటే రామయ్య వచ్చాడు.
అతను ఆమె భర్త పనిచేసిన ఆఫీసులో అటెండరు.
అతను చేతిలోని ఫ్లాస్కు ఆమె చేతికిస్తూ ‘‘పిల్లలు ఊళ్ళకు వెళ్ళిపోయారని విన్నాను. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయిగా మరి. మరో నాలుగురోజులు మీరు వంట జోలికి పోకండి. కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ నేను తెచ్చిస్తాను. మంచి శాకాహార హోటల్‌నుంచే తెస్తానులెండి. పదిరోజులుగా మనిషి పోయిన బాధతో, వచ్చేపోయే జనంతో బాగా అలసిపోయి ఉంటారు. నాలుగురోజులు విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ ఎటూ మనుషుల్లో పడిపోవాలి. తప్పదు’’ అన్నాడు.
సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి, అతనికొకటి ఇచ్చి తనొకటి తీసుకుంది.
‘‘అమ్మా, నా కూతురి పెళ్ళికి అయ్యగారిని పదివేలు అప్పడిగాను. ఆయన తన పి.ఎఫ్. నుంచి లోను తీసుకుని నాకిచ్చారు. ప్రతినెలా అయ్యగారి జీతంనుంచి ఆ లోన్‌కు అయ్యే కటింగ్ మొత్తం ఆయనకు నా జీతంనుంచి ఇచ్చేసేవాణ్ణి. ఆయన రిటైర్ అయ్యేలోపు ఆ అప్పు తీర్చేయాలనుకున్నానుగానీ సాధ్యంకాలేదు. ఆయన రిటైర్ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకు ఇవ్వాల్సిన పి.ఎఫ్. నుంచి పట్టుకున్నారు. నేను ఈ నెల రిటైర్ అవుతున్నాను. నాకొచ్చే డబ్బుల్లోంచి మిగిలిన బాకీ మీకిచ్చేస్తాను. అటువంటి గొప్పవ్యక్తి అప్పు ఎగ్గొడ్తే నాకు మంచి జరగదమ్మా. ఆయన దేవుడమ్మా. అటువంటి మనుషుల్ని మళ్ళీ మనం చూడలేం’’ అంటూ రామయ్య ఏడవసాగాడు.
సావిత్రి కళ్ళనిండా నీరు నిండింది.
‘‘అమ్మా, మీ పెన్షన్ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను. ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పి రామయ్య శెలవు తీసుకున్నాడు.
ఆమెకు మళ్ళీ భర్త తనతో ‘నేనున్నాను’ అన్న భావన కలిగింది.
రామయ్య వెళ్ళిపోయాక ‘రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు. కానీ పదివేలు అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలని తపనపడుతున్నాడే.
మరి పాతికేళ్ళు పిల్లల్ని పెంచి, పెద్దచేసి చదివించామే.
వాళ్ళకు తండ్రి బాధ్యత పంచుకోవాలనిగానీ తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచనగానీ ఎందుకు రావడంలేదు?
ఎందుకు పిల్లలు ఇలా మారిపోయారు?
పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికీ తల్లిదండ్రులకీ మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే బంధాలూ ఉండవా?
ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచారు.
మంచితనం, మానవత్వం, నిజాయతీ, క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు.
ఆయన వాటిని పాటించి చూపించారు కూడా.
తన తల్లిదండ్రుల్ని చివరి శ్వాస వదిలేవరకూ తనవద్దనే ఉంచుకుని చూసుకున్నారు.
తన తల్లి చివరి మూడురోజులూ మంచంమీదే ఉండిపోతే విసుగూ అసహ్యం లేకుండా అన్నిరకాల సేవలూ చేశారు.
అవన్నీ పిల్లలు గమనించారు కూడా.
మరి ఈరోజు వాళ్ళు తమ తల్లిపట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అనుకుంది.
వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆమెకు.
‘ఆ కాలంలో టీవీలూ ఫ్రిజ్జులూ లేవు.
సంపాదించిన డబ్బు కుటుంబంకోసం, పిల్లల చదువులకోసం ఖర్చుపెట్టేవారు.
దుబారా ఖర్చులు చేసేవారు కారు.
రాబడి, ఖర్చు దాదాపు సమానం కావడంతో పెద్దగా అప్పులుచేసే అవసరం ఉండేదికాదు.
తృప్తిగా మనశ్శాంతితో బతికేవారు.
కానీ ఈనాటి పరిస్థితి వేరు.
పెళ్ళైన వెంటనే టీవీ, ఫ్రిజ్, ఏసీ, కంప్యూటర్, కారు అన్నీ కొనేయాలి.
వీటిలో చాలా వస్తువులు స్టేటస్ సింబల్‌గా మారిపొయ్యాయి.
అవసరాలకూ విలాసాలకూ తేడా తెలుసుకోలేకపోతున్నారు.
ఇంటికి నిదానంగా ఒక్కొక్కటీ అమర్చుకుందామన్న ఆలోచన, ఓపిక లేదు.
పైగా ఫ్లాట్ల రేట్లు పెరుగుతున్నాయనీ ఇన్‌కమ్‌టాక్స్ తగ్గుతుందనీ చేతిలో డబ్బులు లేకపోయినా ఇళ్ళు కూడా కొనేస్తున్నారు.
కంపెనీలూ బ్యాంకులూ లోన్లు ధారాళంగా ఇస్తూండటంతో అన్ని లోన్లూ తీసుకోవడం, జీతంలో ఇన్‌స్టాల్‌మెంట్లకు పోగా మిగిలింది చాలకపోవడం, దీంతో ఇబ్బందులు, విసుగు, అసహనం మొదలు.
వీటన్నిటితోపాటు ఉద్యోగంలో ఒత్తిడులు, అభద్రతాభావం పెరుగుతున్నాయి.
ఇన్ని ఒత్తిడులమధ్య పాపం తల్లిప్రేమ, ఆమె సేవలు వీళ్ళకు గుర్తురావడంలేదు.
ఉన్నంతలో తృప్తిగా బతకడం వీళ్ళకు ఎప్పుడు అలవాటవుతుందో’ అనుకుని బాధగా నిట్టూర్చింది.
* * *
వారంరోజులు గడచిపోయాయి.
సావిత్రికి పిల్లల నుంచి ఫోన్‌కాల్స్ లేవు.
ఫోన్ మోగితే ‘పిల్లలనుంచేమో’ అని ఆశగా ఫోను దగ్గరికి పరిగెడుతూంది.
ఓరోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి.
‘‘నా పేరు శ్రావణ్. బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ని’’ అంటూ తన వివరాలు చెప్పాడతను.
‘‘రండి, కూర్చోండి’’ అంటూ కుర్చీ చూపించింది.
‘‘రామనాథంగారు నేను క్లర్క్‌గా ఉన్నప్పటినుంచీ నాకు తెలుసు. ఆయన ఇల్లు కట్టడంకోసం, పిల్లల చదువులకోసం, వాళ్ళ పెళ్ళిళ్ళకోసం, ఎన్నోసార్లు లోన్లు తీసుకున్నారు. అయితే ఆయన ఇన్‌స్టాల్‌మెంట్ కట్టకపోవడం అన్నది ఇంతవరకూ జరగలేదు. మొదటిసారిగా ఆయన మార్ట్‌గేజ్ లోన్ ఇన్‌స్టాల్‌మెంట్ బాకీ పడింది. నాకు అనుమానమొచ్చి విచారిస్తే ఆయన చనిపోయారని తెలిసింది. మా బ్యాంకు క్రమశిక్షణ కలిగిన ఓ కస్టమర్‌ను కోల్పోయింది’’ అన్నాడు బాధగా.
‘‘నాకు ఫ్యామిలీ పెన్షన్ మొన్న శాంక్షన్ అయింది. ఈనెల పెన్షన్ తీసుకోగానే బ్యాంకుకు వచ్చి కట్టేస్తాను’’ అంది సావిత్రి నొచ్చుకుంటూ.
‘‘అవసరంలేదమ్మా. ఆయన ఇంటిపై తీసుకున్న లోనుపై దాదాపు ఏడులక్షలు బాకీ ఉంది. అయితే చాలా ఏళ్ళకిందటే మా బ్యాంకు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్సు స్కీములో మీవారి లోను కూడా కవర్ అయ్యేందుకు ఆయనచేత సంతకాలు పెట్టించుకుని ప్రీమియం కట్టించుకున్నాం. రామనాథంగారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. మీరు నయాపైసా కూడా కట్టక్కరలేదు. నేను అప్లికేషన్ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పంపండి. ఉంటానండీ’’ అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.
సావిత్రి భర్త ఫొటో వైపు చూసింది. రామనాథం నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు.
* * *
సావిత్రి కొడుకులకు ఫోన్‌చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ‘ఇల్లు అమ్మకానికి పెట్టాననీ ఎవరైనా వస్తే కబురు చేస్తాననీ వచ్చి మాట్లాడుకొమ్మనీ’ చెప్పింది.
కొడుకులు ఆమె ఊహించినదానికంటే ఎక్కువగానే సంతోషించారు.
ఆ రోజు సాయంత్రం ఊళ్లోఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజరుతో మాట్లాడింది.
త్వరలోనే తను ఆశ్రమంలో చేరతానని చెప్పింది.
సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజరు ‘‘రామనాథంగారు చనిపోయారా? నాకా విషయమే తెలియలేదే’’ అంటూ విచారం వెలిబుచ్చారు.
‘‘ఆయన మీకు తెలుసా?’’ ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.
‘‘తెలియకపోవడం ఏమిటమ్మా? ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంటుకు అర్జీ పెట్టినప్పుడు కలెక్టరాఫీసులో ఆ సీట్లో ఉన్న మీవారిని కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించారు. మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్నెంతో అభినందించారు. కలెక్టరుగారికి చెప్పి ఈ స్థలం మాకిప్పించారు. డిపార్ట్‌మెంట్‌లో ఆయనకున్న మంచిపేరు వల్ల కలెక్టరుగారు వెంటనే ఒప్పుకున్నారు. ఇంతచేసిన ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు. అటువంటి వ్యక్తి భార్య అయిన మీరు ఓ అనాథలా మా ఆశ్రమంలో చేరడం నాకు బాధగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళతాను. మాతోపాటు ఉండిపొండి. మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను’’.
సావిత్రికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
‘భర్త మంచితనం గురించి తెలుసుగానీ అది ఇంతమంది మనసుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు’ అనుకుంది.
‘మరణించి కూడా బతికి ఉండటం’ అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది.
‘‘వద్దండీ. నావల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే పిల్లల్ని కూడా కాదనుకుని ఇక్కడికి వస్తున్నాను. పైగా ఇక్కడ ఉంటే నాకు కాలక్షేపం కూడా అవుతుంది. మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండాలి. నేను ఇల్లు అమ్మకం పనులు పూర్తయ్యాక వస్తాను’’ అంటూ అతని దగ్గర శెలవు తీసుకుంది.
* * *
ఒకరిద్దరు సావిత్రికి ఫోన్‌చేసి ఇల్లు కొనడానికి తమ ఆసక్తిని వెలిబుచ్చారు.
ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటాననీ ఆరోజు వచ్చి మాట్లాడమనీ వాళ్ళతో చెప్పింది సావిత్రి.
మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో వచ్చారు.
ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి ‘‘మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా?’’ అని అడిగాడు వినోద్.
అతను ‘‘అవును. నా పేరు రామారావు’’ అంటూ తన వివరాలు చెప్పసాగాడు.
తర్వాత ‘‘మేము చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాం. ఏడాదిక్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాం. మీ ఇంటి మండువా మా గది కిటికీ నుంచి బాగా కనబడేది. మీ కుటుంబం మమతానురాగాలకూ తీపి అనుభవాలకూ ప్రతీకలా అనిపించేది నాకు.
ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటిముందు ముగ్గులేస్తూంటే మీ తండ్రీకొడుకులు కబుర్లు చెబుతూ కంపెనీ ఇవ్వడం, భోగి పండుగరోజు ప్రాతఃకాలాన మీరు భోగిమంట వేస్తూంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలసి తాగడం, దీపావళిరోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించడం, ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు చదువుకుంటూంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవడం, మీ ఇంటికి తరచుగా బంధువులు, మిత్రులు రావడం, రాత్రిపూట అందరూ మండువాలో కూర్చుని పాటలు పాడటం మాకు కనిపించేది.
ఓసారి విజయ్‌కి ఆటల్లో చేయి విరిగితే ప్రమోషన్ పరీక్ష రాయడానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకెళ్ళి కట్టు కట్టించడం, నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెబుతూ జాగారం చెయ్యడం, తన తల్లి వేసుకోవాల్సిన మాత్రల్ని ఏ పూటకాపూట గుర్తుగా ఆమెకివ్వడం, ఆవిడ మంచానపడితే సేవలు చేయడం నా మనసును కదిలించేది.
ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్లో పది ఇళ్ళు కట్టించి ఉండేవారు.
కానీ ఆయన తీరే వేరు.
‘పైసంపాదన ఆశించని వ్యక్తి’ అని ఊళ్లో మంచిపేరు తెచ్చుకున్నారు.
కళ్ళముందు నోట్లకట్టలు కనబడుతున్నా అవసరాలు ఇబ్బందిపెడుతున్నా చలించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం.
ఇక మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే.
మా నాన్న గెజిటెడ్ ఆఫీసరు.
లంచాలు బాగా తినేవాడు.
ప్రతిరోజూ తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు.
మాకు చదువు తలకెక్కేది కాదు.
ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు.
ఇప్పుడు నా తమ్ముళ్ళతో నాకు మనస్పర్థలు పెరుగుతున్నాయి.
నాన్న ఉద్యోగం నాకొచ్చింది కాబట్టి పెద్ద వాడిగా అన్ని బాధ్యతలు తీసుకోమంటారు బంధువులు.
అలా తీసుకోవడం నాకు సంతోషమే కానీ
ఈ విషయంలో నాకూ నా భార్యకూ మధ్య గొడవలు అవుతా ఉన్నాయి.
మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా ఉన్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చో మీ నాన్నగారిని చూశాక నాకు తెలిసింది.
అందుకే మీ ఇల్లు కొని మా తమ్ముల్లను, మా అమ్మ ను ఇందులో చేర్చితే ఆ అదృష్టం మాకూ తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ.
చదువుకునే రోజుల్నించీ ఈ ఇల్లు నా ‘డ్రీమ్ హౌస్’.
‘ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే’ అని బాధపడేవాణ్ణి.
కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను.
ఆస్తులకంటేరక్తసంబందాలు, ఆప్యాయతలు, మమకారాలే ముఖ్యమని నమ్మేవ్యక్తి ని నేను.
మా నాన్నగారి రుణం కొంత లో కొంత అయినా నెరవేర్చానన్న తృప్తి నాకు మిగులుతుంది " అన్నాడు రామారావు.
* * *
రామారావు వెళ్ళిపోయాక విజయ్, వినోద్‌లు మౌనంగా కూర్చుండిపోయారు.
రామారావు చెప్పిన విషయాలే పదేపదే గుర్తుకు రాసాగాయి.
తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవలసిన జ్ఞాపకాల్ని పరాయివ్యక్తి వచ్చి చెపితే తప్ప గుర్తుచేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డారు.
వాళ్ళ మనసులో తప్పుచేసిన భావన కలిగింది.
పశ్చాత్తాపం మొదలైంది.
రాత్రి భోజనాల సమయంలో సావిత్రి - కొడుకు, కోడళ్ళతో వాళ్ళు ఊరు వదిలివెశ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది.
రామయ్య, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసరు, ఆశ్రమం మేనేజరు అన్న మాటల్ని చెప్పింది.
అది విన్న కొడుకుల మనసుల్లో పశ్చాత్తాపం మరింత పెరిగింది.
వినోద్‌కు తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్ ‘గుడ్‌నెస్ ఈజ్ ద ఓన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్ విచ్ నెవర్ ఫెయిల్స్ టు ఎర్న్ డివిడెండ్స్’ గుర్తొచ్చింది.
‘నిజం నాన్నా, మీ మంచితనం డివిడెండ్లను సంపాదించడమే కాదు, ఎంతోమంది హృదయాల్ని కూడా గెలుచుకుంది. మాలాంటి పాపాత్ముల హృదయాలు తప్ప’ అనుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
విజయ్ తల్లితో ‘‘అమ్మా, మమ్మల్ని క్షమించు. నాన్న మంచితనాన్ని ఇంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండీ గుర్తించలేకపోయాం. గొప్పలకుపోయి ఆర్థిక ఇబ్బందుల్లోపడి, బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాల్ని గుర్తుచేస్తే తప్ప గుర్తుకురాని పరిస్థితిలో ఉండిపోయాం. మనం ఇల్లు అమ్మవద్దు. కింది పోర్షను రామారావుగారికి అద్దెకిద్దాం. పై పోర్షను మాత్రం ఖాళీగా ఉంచుదాం. నువ్వు మాతో వచ్చేసెయ్. ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడకు వచ్చి ఓ వారంరోజులు హాయిగా గడుపుదాం. పాత రోజుల్ని గుర్తుచేసుకుని ఆనందిద్దాం’’ అన్నాడు.
‘‘అవునమ్మా, నిన్ను ఇన్నాళ్ళూ నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం. నువ్వు మాతో వచ్చెయ్. ఈ ఇంటి గురించీ నాన్నగారి మంచితనం, వ్యక్తిత్వం గురించీ మా పిల్లలకు కూడా చెబుదాం. ఈ ఇంటితోపాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్ళకు వారసత్వంగా లభించనీ’’ అన్నాడు.
సావిత్రి భర్త ఫొటోవైపు చూసింది.
ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు.
‘అవును మరి, మానవత్వపు విలువల్ని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారు ఆయన. వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సం తోషిస్తుంది’ అనుకుంది తృప్తిగా.
మిత్రులారా సమాజంలో ఇలాంటి యధార్థ సంఘటనలు కోకొల్లలు. ఈ రోజు మీరు మంచి హోదా లో ఉండవచ్చు గాక . మీరు ఈ భూమి మీద కు రావటానికి జన్మను ఇచ్చింది ఎవరు? మీరు అనుభవిస్తున్న ప్రస్తుత హోదా మీకు రావటానికి కారణం ఎవరు? కేవలం ఆస్తులు మాత్రమే పంచుకుంటాం. వారి బాగోగులు మాకెందుకు అంటూ జన్మనిచ్చి, కష్టపడి పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన కనపడే ఆ దేవుళ్ళ ను మరిస్తే ఎలా?
ఈరోజు మీ తల్లిదండ్రుల ను ఎలా చూస్తున్నారో రేపు భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అలాగే చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కధ చదివిన తర్వాత అయినా సరే కొంతమంది కొడుకుల మనఃస్తత్వం అయినా మారుతుంది అని ఆశిస్తున్నాను.
తమ స్వంతం గురించి పట్టించుకోకుండా పిల్లల భవిష్యత్తే తమ భవిష్యత్తు గా భావించి వారిని మంచి ప్రయోజకులు గా చేసిన ప్రతి ఒక్క తల్లితండ్రి కి ఈ కధ అంకితం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#భార్య
🎲బాత్రూమ్ లో నుండి " ఏమండి" అని పిలిచిందంటే బొద్దింకని కొట్టాలని అర్ధం..
🎲రెస్టారెంట్ లో తిన్నాక " ఏమండీ" అని పిలిచిందంటే బిల్లు కట్టమని అర్ధం
🎲కళ్యాణమండపంలో " ఏమండీ" అని పిలిచిందంటే తెలిసినవారొచ్చారని అర్ధం
🎲బట్టల షాపులో " ఏమండీ" అని పిలిచిందంటే వెతుకుతున్న చీర లభించిందని అర్ధం..
🎲బండిలో వెళ్…
సతీశంకరుల వృత్తాంతం :(1001)
సేకరణ మల్లాప్రగడ శ్రీదేవిరామకృష్ణ
హిమవంతుడు అనే ఒక పర్వతరాజు వుండేవాడు. అతని భార్య మేన. అతనికి ఎంత ప్రయత్నించినా సంతానం కలుగలేదు. ఒకరోజు కశ్యప్రజాపతి వీరికి ఇంటికి చేరుకుంటాడు. రాజు అతనికి మర్యాదలు చేసి ఇలా అంటాడు.. ‘‘ఓ మునీంద్రా! దేనివల్ల అక్షయపుణ్యలోకాలు కలుగుతాయి? దేనివల్ల కీర్తి ప్రాభవాలు కలుగుతాయి? దానికి సంబంధించిన విషయాలుఏంటో వివరించండి...’’ అంటూ కోరుకుంటాడు.
అప్పుడు ఆ కశ్యపుడు.. ‘‘నాకు ఉత్తమ కుమారులు (దేవతలు) జన్మించడం వల్ల నాకు ప్రజాపతిత్వం, గౌరవం కలిగింది. నువ్వు కూడా తపంచేసి సంతానభాగ్యాన్ని పొందు’’ అని చెప్పి వెళ్లిపోతాడు.
అప్పుడు హిమవంతుడు బ్రహ్మకోసం తపం చేయగా.. బ్రహ్మ అతని ముందు ప్రత్యక్షమవుతాడు. ‘‘నీకు ఒక కొడుకు, కుమార్తెలు జన్మిస్తారు. ఆ కూతురివల్ల నువ్వు కీర్తిమంతుడివి అవుతాయి. ఆమె దేవతలతో కూడా నమస్కరింపబడుతుంది’’ అని వరమిస్తాడు.
ఆనాడు యోగాగ్నిలో తన శరీరాన్ని దహించజేసుకున్న శివుడి భార్య అయిన సతీదేవి హిమవంతుడికి కుమార్తెగా జన్మిస్తుంది. ఆమె ‘ఉమ’ అనే పేరుతో పిలువబడుతుండేది. ఆమె మహానుభావురాలు. ఆమె ఆత్మ కూడా మూడు విధాలుగా రూపొందించబడింది. అపర్ణ, ఏకపర్ణి, ఏకపాటలు అని ఆ ఆత్మల పేర్లు. అందులో అపర్ణయే ఉమ.
ఉమ శంకరుని విడిచివుండలేక మహాతపస్సు చేయడానికి బయలుదేరుతుండగా.. తల్లి ఆమెను నివారించి ‘తపము వద్దు’ అని అంటుంది. కాని ఆమె నిశ్చయంగా చేయాల్సిందేనని చెప్పి.. తల్లి అనుమతి తీసుకుని వెళుతుంది. ఆమెతోపాటు ఏకపర్ణి, ఏకపాటలు కూడా తపస్సు చేయడానికి బయలుదేరారు. ఆ ముగ్గురే లోకమాతలు.
ఉమ మహాదేవుడిని ఆశ్రయిస్తుంది. ఆమె తపస్సుకు లోకాలు కూడా హాహాకారం చేశాయి. అప్పుడు బ్రహ్మ ఆమె తపస్సుకు ప్రసన్నుడై.. ‘అమ్మా! నువ్వు జగజ్జననివి. నీవల్ల ఈ లోకాలు నశింపరాదు. దయచేసి నీ తపమును చాలించు’ అనగా... ఆమె ‘‘పితామహా! నేను ఏమికోరి తపము చేస్తున్నానో నీకు తెలియదా?’’ అని సమాధానం ఇస్తుంది.
అప్పుడు బ్రహ్మ...‘అమ్మా! నువ్వు కోరినవాడు వెదుక్కుంటూవచ్చి నిన్ను వరిస్తాడు. ఏ రూపంలో వచ్చి అనుగ్రహిస్తాడో తెలియదు. మేము శివుని చరణసేవలం’’ అని అంటాడు. మునులు ఆమె దగ్గరకు వెళ్లి.. ‘‘నువ్వు కోరుకున్న శంకరుడే నీకు పతిగా వస్తాడు. ఇంక నీ తపమును చాలించు’’ అని కోరుకుంటారు.
ఒకనాడు ఒక వామనుడు అక్కడికి చేరుకుంటాడు. అతని కాళ్లు, చేతులు చాలా పొట్టివి. తల కూడా తుప్ప లాగా వుండేది. ముక్కు వంకరగా తిరిగివుంటుంది. ఏవైపు నుంచి చూసినా.. చాలా అసహ్యంగా వుండేవాడు. అతడు మెల్లగా పార్వతి దగ్గరకు వచ్చి.. ‘ఉమా! నిన్ను వరించడానికి నేను వచ్చాను’’ అని పలుకుతాడు. పార్వతి అతనిని తన యోగమహిమవల్ల పరమశివునిగా గుర్తిస్తుంది.
పార్వతి అతనిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి.. ‘‘స్వామీ! నేను స్వతంత్రురాలిని కాను. నన్ను ఇవ్వడానికి నా తండ్రి వున్నాడు. నా తండ్రి ఆమోదిస్తే.. నేను నీతో వివాహమాడుతాను’’ అని పలుకుతుంది. ఆమె పలికిన మాటలకు సంతోషించి ఆ కపట వేషధారి.. ‘‘అయితే నేను హిమాచలాధీశునే అడుగుతాను’ అని వెళ్లి.. హిమవంతునిచేత పూజితుడై.. తనకు అపర్ణను ఇవ్వమని అడుగుతాడు.
హిమవంతుడు ఆలోచనలో పడతాడు. ‘‘ఇతని రూపం పరమవికారంగా వుంది. ఇతనికి నా కుమార్తెను ఎలా ఇవ్వగలను? కాదన్నా ఇతడు శపించి వెళతాడేమో’ అని తలచుకుని.. ఆ వామనునితో ఇలా అంటాడు.. ‘‘అయ్యా! నువ్వు నా కుమార్తెను ఇవ్వమని అడుగుతున్నావు. నేను నా కుమార్తెకు స్వయంవరం చాటింతమని కోరుతున్నాను. నువ్వు ఆ స్వయంవరానికి రా... అక్కడ నీ అదృష్టాన్ని పరీక్షించుకో’’ అని అంటాడు.
ఈ మాటలు విన్న ఆ కుబ్జుడు, పార్వతీ దగ్గరకు వెళ్లి.. ‘‘అపర్ణా! నీ తండ్రి నీకు స్వయంవరం చాటిస్తున్నాడు. అందులో నువ్వు ఎవరినైతే వరిస్తావో అతడే నీ భర్త అవుతాడట. ఈ సంగతి చెప్పి వెళదామని నీ దగ్గరకు వచ్చాను. మన్మథునిలాంటి వాడినే నువ్వు వరిస్తావుగాని.. నాలాంటి వికృతరూపంగల వాడిని ఎలా వరిస్తావు? సెలవిస్తే నేను బయలుదేరుతాను’’ అని అంటాడు.
ఉమ అతడు చెప్పింది విని.. ‘‘ఓ స్వామీ! నిన్ను నేను శంకరునిగా గుర్తించాను. నాపై నీకున్న అనురాగానికి సంతోషించాను. నేను ఎవ్వరినో ఎందుకు కోరుకుంటాను? నువ్వే నా భర్తవు. నీకు విశ్వాసం కలగాలంటే.. ఇప్పుడే నేను నిన్ను వరించుకుంటాను’’ అంటూ.. ఒక పుష్ఫహారాన్ని ఆ నీలకంఠుని మెడలో వేస్తుంది.
అప్పుడు అతడు.. ‘‘నువ్వు నన్ను ప్రీతితో వరించావు కాబట్టి నీకు ముసలితనం, మరణం లేకుండా వరాన్నిస్తున్నాను. నువ్వు తపస్సు చేసిన ఈ వనం ఇకనుంచి చిత్రకూటమని పిలువబడుతుంది. ఈ వనానికి వచ్చి దేవపూజకోసం ఎవరైతే పుష్పాలను కోస్తాడో.. అతడు అశ్వమేధఫలాలను పొందుతాడు. ఎవడు ఈ గిరిశిఖరమున తపము చేసి ప్రాణాలు విడుస్తాడో.. అతడు ప్రమథగణంలో ముఖ్యుడవుతాడు’’ అని అంటాడు.
పార్వతి ఆ పర్వతశికరం దగ్గరే కూర్చుని పరమేశ్వరుని ధ్యానిస్తుంటుంది. ఆ పర్వత శిఖరానికి సమీపంలో ఒక తామర చెరువు గలదు. ఒకరోజు శివుడు ఒక బాలకుని రూపంలో ఆ చెరువులోదిగి బాలక్రీడలు ఆడుతుండగా.. అందులో వున్న మొసలొకటి అతనిని పట్టుకుంటుంది. ఆ బాలుడు పెద్దగా అరుపులు పెడుతూ ఏడుస్తుంటాడు. అదివిన్న పార్వతి ఆ కొలను దగ్గరకు వెళ్లి చూస్తుంది. ‘‘అయ్యో! ఈ మొసలి నన్ను పట్టుకుంది. ఎవరైనా పుణ్యాత్ములు వచ్చి నన్ను కాపాడండి? నేను నా తల్లిదండ్రుల గురించి విచారిస్తున్నాను. వారికి నేనొక్కడినే పుత్రుడ్ని. నా మరణవార్త విని వాళ్లు కూడా మృతిచెందుతారు. దైవనిర్ణయాన్ని కాదని చెప్పేవాళ్లు ఎవరు? అని విచారిస్తుంటాడు.
అక్కడకు చేరుకున్న పార్వతి ఆ మొసలితో.. ‘‘ఓ నక్రమా! నీవెందుకు ఈ బ్రాహ్మణవటువును మింగుతున్నావు? కనికరించి అతనిని వదిలిపెట్టు’’ అనగా.. మొసలి ‘‘తల్లీ! ఇక్కడికి వచ్చే ఏ ప్రాణినైనా భక్షించి జీవనాన్ని గడుపుమని బ్రహ్మ నాకు చెప్పాడు. ఈరోజు నాకు ఈ బాలుడు దొరికాడు. ఎలా వదలగలను?’’ అని అంటాడు. అప్పుడు పార్వతి.. ‘‘ఓ జలచరమా! నేను హిమవంతుని పుత్రికను. నేను ఇన్నాళ్లూ చేసిన తపము నీకిస్తాను. ఆ బాలుడిని వదిలిపెట్టు’’ అని అంటుంది.
ఆ మాటలు విన్న మొసలి.. ‘‘నువ్వు ఉత్తమంగా భావించే తపము కొంచెమైనా నాకివ్వు’’ అనగా.. పార్వతి ‘‘నేను పుట్టినప్పటినుండి ఏ పుణ్యాలు చేశానో.. ఆ పుణ్యాలు వాటి ఫలాలు నీకిచ్చేస్తున్నాను. ఆ బాలుడిని వదిలిపెట్టు’’ అని కోరుకుంటుంది. అందుకు మొసలి.. ‘‘ఉమాదేవీ! ఇంత కష్టపడి చేసిన తపమును వదులుకుంటున్నావా? పెద్దలు వింటే నిన్ను మెచ్చుకోరు’’ అని అంటాడు.
పార్వతి తిరిగి ఘోరతపస్సు చేయడం ప్రారంభిస్తుంది. పరమేశ్వరుడు అక్కడకు ప్రత్యక్షమై.. ‘‘అపర్ణా! నువ్వు చేసిన తప: ఫలమును ధారపోయగా.. దానిని నేను గ్రహించాను. అది నీకు అక్షయమైన ఫలితాలనిస్తుంది. ఇక ఈ తపము చాలించు’’ అని పలుకగా.. పార్వతి తన తపము ఫలించినందుకు చాలా ఆనందిస్తుంది.
***